నాటకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నాటకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

బుధవారం, ఆగస్టు 27, 2014

నాటకరంగం

తెలుగు నాటకరంగం ఎటు వెళ్తోంది? గడిచిన ఏడాది కాలంగా చూసిన నాటక ప్రదర్శనలని గుర్తు చేసుకున్నప్పుడు అప్రయత్నంగానే ఈ ప్రశ్న వచ్చేసింది. 'నాటకం' అన్న పేరే తప్ప ఎక్కువగా ప్రదర్శనలు జరుపుకుంటున్నవీ, పరిషత్తులు జరుగుతున్నవీ నాటికలే. పౌరాణికాలని పక్కన పెడితే, తెలుగులో ప్రదర్శనా యోగ్యమైన నాటకాలు వేళ్ళమీద లెక్కించదగినన్ని.

మూడు గంటల పాటు నాటకం వెయ్యాలంటే దానికి ఎంతో పరిశ్రమ అవసరం. రసభంగం గానీ అయినట్టయితే, ప్రేక్షకులకి కలిగే శ్రమ వర్ణనాతీతం. కారణాలు ఏమైతేనేం, ఇప్పుడు నాటకం అంటే నలభై నుంచి యాభై నిమిషాల నిడివి ఉండే సాంఘిక నాటిక. ఒకట్రెండు స్త్రీపాత్రలు సహా ఐదారుగురు నటులు, అదే సంఖ్యలో సాంకేతిక నిపుణులు. ఓ రెండు, మూడు నెలల రిహార్సల్స్. అటుపై రాష్ట్రంలో జరిగే అన్ని పరిషత్తులలో వీలైనన్ని చోట్ల పాల్గోవడం. ఆర్నెల్లో, ఏడాదో గడవగానే మరో కొత్త నాటిక పనులు మొదలు.

రెండు దశాబ్దాల క్రితం వృత్తి నాటకాలు దాదాపుగా కనుమరుగై, పరిషత్తులు అంతంత మాత్రంగానే ఉన్న తరుణంలో తెలుగు నాటకం మనుగడ ప్రశార్ధకం అయ్యింది. ఆ సమయంలోనే రాష్ర ప్రభుత్వం 'నంది నాటకోత్సవాలు' మొదలు పెట్టడంతో నిజంగానే నాటకరంగానికి ఊపు వచ్చింది. మూసివేత దశకి వచ్చిన నాటక సంఘాలు కొత్త ఊపిరి పోసుకున్నాయి. కొందరు పాత నాటకాలకి మెరుగు పెడితే, మరికొందరు సరికొత్త నాటకాలతో పోటీకి సిద్ధ పడ్డారు.

ప్రభుత్వం అటు పౌరాణికాలు, ఇటు సాంఘికాలు రెంటినీ  ఆదరించే విధంగా నంది నాటకోత్సవాలని రూపు దిద్దడమే కాక, బహుమతి పొందిన నాటకాలు అన్ని ముఖ్య పట్టణాల్లోనూ ప్రదర్శించే విధంగానూ కార్యక్రమం తయారు చేసింది. కొన్నేళ్ళ పాటు ఉత్సాహంగా జరిగిన నంది నాటకాలు కాలక్రమేణా ప్రభుత్వం నిర్వహించే అనేక తంతుల్లో ఒకానొక తంతుగా మారిపోయాయి. తెరవెనుక రాజకీయ కారణాలూ ఇందుకు దోహదం చేశాయన్న మాటా పైకొచ్చింది.


ఒకప్పుడు హైదరాబాద్ రవీంద్రభారతి లో మాత్రమే జరిగిన నాటకోత్సవాలు తర్వాతి కాలంలో ఒక్కో సంవత్సరం ఒక్కో పట్టణంలో అన్న పద్ధతికి మారాయి. రాన్రానూ నాటకోత్సవాలు జరిగాయో, లేదో తెలియని పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు, రాష్ట్ర  విభజన తర్వాత ప్రశ్నార్ధకంగా ఉన్న అనేకానేక కార్యక్రమాలలో నంది నాటకాలు ఒకటి. సినిమా విషయంలో అయితే కళకి ఎల్లలు లేవు కానీ, నాటకం విషయం వచ్చేసరికి పరిమితులు ఏమన్నా వస్తాయేమో చూడాలి. ప్రతి విషయమూ రాజకీయాలతో ముడి పడుతున్న సందర్భం ఇది.

నాటకాల నాణ్యత విషయానికి వస్తే అటు నాటక రచయితల్లోనూ, పరిషత్తు నిర్వాహకుల్లోనూ శ్రద్ధ సన్నగిల్లుతోందేమో అన్న సందేహం క్రమంగా పెరుగుతోంది. నాటికలు, అయితే ఎనభైల నాటి మెలోడ్రమటిక్ పద్ధతిలో లేదా వర్తమాన విషయాలు అన్నింటినీ కవర్ చేసేయాలన్న ఆత్రుతతో వార్తలని తలపిస్తున్నట్టుగా ఉంటున్నాయి చాలావరకు. రాశి పెరిగినంతగా వాసి పెరగలేదన్నది సత్యం. ఒకవేళ ఎక్కడన్నా ఓ మంచి నాటిక వచ్చినా, దాని ప్రదర్శనా కాలం ఏడాదికన్నా తక్కువే ఉంటోంది.

నటీనటుల విషయానికి వస్తే, రంగస్థలం మీద కెరీర్ మొదలు పెట్టి టీవీల్లో అవకాశాలు సంపాదించుకున్నవాళ్ళు నాటకాన్ని విడిచిపెట్టలేదు. నాటకాల నుంచి సినిమాలకి వెళ్ళిన వాళ్ళతో పోలిస్తే, రంగస్థలంతో వీళ్ళ అనుబంధం ధృడంగా కొనసాగుతోందనే చెప్పాలి. పెరుగుతున్న ఖర్చులకి తగ్గట్టు పారితోషికాలు పెరక్క పోయినా, సినిమాలు, టీవీలు, క్రికెట్ మ్యాచ్ల వంటి కారణాలకి ఆడిటోరియాలు సగం మాత్రమే నిండుతున్నా నిబద్ధతతో నటిస్తున్నారు వీళ్ళు.

కళా మాధ్యమాలు అన్నింటిలోకీ నాటకం ఓ ప్రత్యేకమైన, శక్తివంతమైన మాధ్యమం. కాలానుగుణ మార్పులు ఉంటాయే తప్ప నాటకానికి ఏదో అయిపోతుందన్న భయం అక్కర్లేదు. 'నాటకరంగం మరణశయ్య మీదుంది' లాంటి రాజకీయ ప్రకటనలని నమ్మాల్సిన పనిలేదు. ఏదో జరుగుతుంది.. నాటకరంగానికి ఓ కొత్త వెలుగొస్తుంది.

గురువారం, ఏప్రిల్ 02, 2009

అలరాస పుట్టిళ్ళు

ఓ జమీందారు చెల్లెలు, వాళ్ళ దివాణం లో పనిచేసే ఓ రోజు కూలీ ని ప్రేమించింది. అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంది. చెల్లెలంటే అపరిమిత మైన ప్రేమ ఉన్నా, పరువు మర్యాదలకి ప్రాణం ఇచ్చే ఆ అన్నగారు సహజంగానే ఆ పెళ్ళికి ఒప్పుకోలేదు. ఉన్నట్టుండి ఒకరోజు రాత్రి ఆ అమ్మాయి, ఆమె ప్రేమించిన అబ్బాయి ఊరినుంచి మాయమయ్యారు. ఆశ్చర్యకరంగా అప్పటినుంచి దివాణం ప్రాభవం తగ్గిపోవడం మొదలైంది. ఇంతకీ ఆ రాత్రి ఏం జరిగింది? ఆ అమ్మాయి ఏమైంది?

నిడుమోలు కళ్యాణ సుందరీ జగన్నాధ్ రాసిన 'అలరాస పుట్టిళ్ళు' కథను అదేపేరుతో నాటికగా మలచి ప్రదర్శించారు 'కళా వాణి' ఉభయ గోదావరులు ట్రూప్ వాళ్ళు. ఈ కథ పేరే మకుటంగా శ్రీమతి జగన్నాద్ తన కథా సంపుటాన్ని విడుదల చేశారు. గంట నిడివి గల ఈ నాటిక ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ లో సాగుతుంది. కూలిపోతున్న దివాణంలో వృద్ధుడైన జమీందారు సుబ్బారాయుడు మరణ దశలో ఉండడం నాటిక ప్రారంభం. అతని భార్య, ఓ వృద్ధురాలైన పనిమనిషి సుబ్బారాయుడికి సేవలు చేస్తూ ఉంటారు. సుబ్బారాయుడికి చెల్లెలి వరసయ్యే అక్కమ్మ తన టీనేజ్ మనవరాలితో కలిసి అన్నగారిని చూడడానికి వస్తుంది.

అక్కమ్మ మనవరాలిని చూసిన సుబ్బారాయుడు 'సత్యవతీ.. సత్యవతీ' అని కలవరించడం మొదలు పెడతాడు. 'సత్యవతి' కి కబురు పెట్టమంటాడు. అతన్ని నిద్ర పుచ్చి, అక్కమ్మ, ఆమె వదిన, పనిమనిషి గతాన్ని తలచుకుంటారు. సిరి సంపదలతో తులతూగుతున్న దివాణం లో సత్యవతి ఆడింది ఆట, పాడింది పాట . ఆమె కి పెళ్లి చేయాలని అన్నగారు సుబ్బారాయుడు ప్రయత్నాలు చేస్తుండగానే చెంగల్వ రాయుడు వాళ్ళింట్లో పనికి చేరతాడు.

సత్యవతి, చెంగల్వ రాయుడు ఒకరినొకరు ఇష్టపడతారు. వాళ్ళ పెళ్ళికి ససేమిరా అంటాడు సుబ్బారాయుడు. సత్యవతిని చెంగల్వ రాయుడితో వెళ్లి పొమ్మని సలహా ఇస్తుంది అక్కమ్మ. అక్కమ్మ-సత్యవతి ల సంభాషణ ని రహస్యంగా విన్న సుబ్బారాయుడు, ఆగ్రహంతో అక్కమ్మని ఇంట్లోనుంచి వెళ్ళ గొడతాడు. ఆ రాత్రి నుంచి సత్యవతి, చెంగల్వ రాయుడు కనిపించరు. దివాణం లో అందరూ వాళ్ళిద్దరూ ఎక్కడికో పారిపోయి పెళ్లి చేసుకున్నారు అనుకుంటారు.

'సత్యవతీ' అన్న సుబ్బారాయుడి కలవరింతతో గతం నుంచి బయట పడతారు అక్కమ్మ వాళ్ళు. 'ఈ పాటికి బయలుదేరే ఉంటుంది అన్నయ్యా.. సత్యవతి వచ్చేస్తుంది' అంటుంది అక్కమ్మ. ఎగ శ్వాస తో ఉన్న సుబ్బారాయుడు ఆమెకి 'సత్యవతి ఎప్పటికీ రాదమ్మా' అని చెబుతాడు. ఆ రాత్రి సత్యవతి, చెంగాల్వరాయుడు యేరు దాటి పారిపోబోతుండగా తానె వాళ్ళిద్దరినీ పడవలో నుంచి ఏటిలోకి గెంటేశానని, వాళ్ళ శవాలు నీళ్ళలో కొట్టుకుపోవడం తానూ కళ్ళారా చూశానని చెప్పి ప్రాణం విడుస్తాడు సుబ్బారాయుడు.

క్షణాల్లో సెట్టింగులు మార్చడం ఈ ప్రదర్శన ప్రత్యేకత. పాడుబడ్డ మహల్లో నాటిక ప్రారంభమవుతుంది. గతం లోకి వెళ్ళేటప్పటికి అదే మహల్ వైభవంగా ఉంటుంది. ప్రారంభంలో వృద్ధులుగా ఉన్న సుబ్బారాయుడు, అతని భార్య, పనిమనిషి, అక్కమ్మ ఫ్లాష్ బ్యాక్ లో యవ్వనంలో ఉంటారు. ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యేసరికి మళ్ళీ వృద్ధులుగా కనిపిస్తారు. సత్యవతి గా వేసిన అమ్మాయే అక్కమ్మ మనవరాలిగానూ చేసింది. సుబ్బారాయుడు సత్యవతిని చంపే దృశ్యాన్ని నీడల్లో చూపించారు. 'అలరాస పుట్టిళ్ళు' కథా సంపుటాన్ని గురించి మరోసారి...

శనివారం, మార్చి 14, 2009

మీరా కళాజ్యోత్స్న

తెలుగు పద్య నాటకం అనగానే ఎవరికైనా గుర్తొచ్చేవి సుదీర్ఘమైన రాగాలు. నటన కన్నా, ఒకరిని మించి మరొకరు రాగాలు తీస్తూ పద్యాలు ఆలపించడం లోనే నటీనటులు పోటీ పడతారు. పూర్వం పల్లెల్లో నాటకాలు ప్రదర్శించినపుడు ఈ పద్యాలకి వన్స్ మోర్లు పడేవి. ముఖ్యంగా 'గయోపాఖ్యానం' 'హరిశ్చంద్ర' వంటి నాటకాల ప్రదర్శన అంటే సగం నాటకం కూడా పూర్తి కాకముందే తెల్లవారిపోయేది. కేవలం పద్యాల కోసమే నాటకాలు చూసేవాళ్ళు అప్పటి తరం ప్రేక్షకులు. కాలం తో పాటే ప్రేక్షకుల అభిరుచిలోనూ మార్పు వచ్చింది. పద్యనాటకాలను ఇష్టపడే వాళ్ళు కూడా సుదీర్ఘ రాగాలను ఆమోదించలేకపోతున్నారు.

ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన మార్పును గుర్తించి, అందుకు అనుగుణంగా పద్య నాటక ప్రదర్శన లో గణనీయమైన మార్పులు తెచ్చిన సంస్థ విశాఖపట్టణానికి చెందిన 'మీరా కళాజ్యోత్స్న.' ఈ సంస్థ స్థాపకుడు మీగడ రామలింగ స్వామి. రంగస్థలంపై మూడున్నర దశాబ్దాల అనుభవం ఉన్న నటుడు. కేవలం నటుడు మాత్రమే కాదు రచయిత, దర్శకుడు, సంగీత దర్శకుడు, ఆహార్య నిపుణుడు - ఒక్క మాటలో చెప్పాలంటే నాటకానికి సంబంధిన ప్రతి పనిలోనూ నైపుణ్యం ఉన్నవాడు. వృత్తి రీత్యా తెలుగు అధ్యాపకుడైన రామలింగ స్వామి ప్రవృత్తి పద్య నాటకాలు నిర్మించి ప్రదర్శించడం. తర్వాతి తరానికి రంగస్థల శిక్షణ ఇవ్వడం.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నాటకాలకు నంది బహుమతులు ప్రవేశ పెట్టి, పోటీలు ప్రారంభించాక మొదటి మూడు సంవత్సరాల్లో వివిధ విభాలకు గాను మొత్తం 35 నందులను అందుకున్న సంస్థ 'మీరా కళాజ్యోత్స్న.' మరో విశేషమేమిటంటే స్వామి మినహా మిగిలిన అందరూ రంగస్థలానికి కొత్తవారు. నాయిక పాత్రలు పోషించే రత్న శాస్త్రి ఐతే షష్టిపూర్తి కి చేరువైన ఓ బామ్మ గారు. ఒక స్కూలు ప్రిన్సిపాల్. కొత్త స్క్రిప్టు ని తయారు చేయడం మొదలు, దానికి కావలసిన సంగీతం, నాతీనతులకి ఆహార్యం సమకూర్చడం, రిహార్సల్స్ చేయించడం, పోటీలకి ఎంట్రీ పంపడం ఇలా సమస్తమూ ఒంటి చేతి మీద నిర్వహిస్తారు స్వామి.

అది 'అశ్వద్ధామ' కావొచ్చు, 'గుణనిధి' కావొచ్చు లేదా 'చిరు తొండ నంబి' కావొచ్చు.. ఏ నాటకం లోనైనా ప్రేక్షకుల కోసం ఓ సందేశం అంతర్లీనంగా ఉంటుంది. వర్తమాన అంశాలను పరోక్షంగా స్పృశిస్తారు. పద్యాలు వినసొంపుగా ఉంటాయి. పాత్రధారుల నటన తమ పరిధి మేరకు మాత్రమే ఉంటుంది. భారీ సెట్టింగులకి వీరి ప్రదర్శనలు దూరం. చిన్నపాత్రలను మలచడం లో సైతం ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తుంది. ప్రతి నాటకం చివరికి వచ్చేసరికి ప్రేక్షకులు నాటకంలో లీనమై రసానుభూతిని పొందుతారు. కేవలం నంది నాటకాల్లో మాత్రమే కాదు, ఆంధ్ర దేశం లో జరిగే అని ప్రతిష్ఠాత్మకమైన పోటీల్లోనూ పాల్గొన్న 'మీరా కళాజ్యోత్స్న' కళాకారుల ప్రతిభ అనతి కాలంలోనే విదేశాలకూ పాకింది.

కొత్తతరం సరే.. పాత తరం ప్రేక్షకులు ఈ మార్పులని అంగీకరిస్తారా? అన్న సందేహం సహజం. ప్రదర్శన ముగిశాక వీరిని అభినందించే వారిలో పాత తరం ప్రేక్షకులే ముందుంటారు. పద్యాలను ఆలపించడంలో తనదైన శైలిని ఏర్పరుచుకున్న స్వామి అప్పుడప్పుడు టీవీల్లో కనిపిస్తున్నారు.. పద్యాలు ఆలపిస్తూ. చిన్న పిల్లలకి పద్యాలు నేర్పించడం ఆయనకి ఇష్టమైన పనుల్లో ఒకటి. వరుసగా ప్రతిసంవత్సరం 'మీరా కళాజ్యోత్స్న' కి నందులు రావడం సహజంగానే కొందరికి నచ్చలేదు. రచ్చ, రాజకీయం చేశారు. నాటక ప్రదర్శనకి అవార్డుల కన్నా ప్రేక్షకుల రివార్డులే ముఖ్యం. తమ చప్పట్ల ద్వారా అప్పటికప్పుడే వాటిని ప్రకటిస్తారు ప్రేక్షకులు. ఈ రివార్డులు మాత్రం 'మీరా కళాజ్యోత్స్న' కి అందుతూనే ఉన్నాయి.

మంగళవారం, ఫిబ్రవరి 24, 2009

పరిషత్తులు

నాటకం అంటే ఏమాత్రం ఆసక్తి ఉన్నవారికైనా పరిషత్ నాటకాలు జరుగుతున్నాయంటే పండుగే. నటీనటులు, సాంకేతిక నిపుణుల తో పాటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తారు ఈ పరిషత్తుల కోసం. నాటకాల పోటీలనే పరిషత్తులు అని పిలుస్తారు. ఇప్పుడంటే ప్రభుత్వం ఏటా నంది నాటకోత్సవాలు నిర్వహిస్తోంది కానీ, అంతకు ముందు వరకూ కళాకారుల ప్రతిభా ప్రదర్శనకి పరిషత్తులు మాత్రమే వేదికలుగా నిలిచేవి. నాటక జనం, ప్రేక్షక మహాశయులతో పాటు పరిషత్తుల కోసం ఎదురు చూసే ఎదురు చూసే మరో వర్గం ఉంది. వీళ్ళు సినిమా, టీవీ జనం. అవును, దాసరి నారాయణ రావు నుంచి తేజ వరకు, వంశీ నుంచి కృష్ణవంశీ వరకు మన దర్శకులలో చాలా మంది నటీనటులను నాటక పరిషత్తుల నుంచి ఎంచుకుంటారు. నేను హీరో హీరోయిన్ల గురించి చెప్పడం లేదు, కేవలం నటీనటులను మాత్రమే. నాటక రంగం నేపధ్యంగా సిని రంగంలో రచయితలుగా, దర్శకులుగా నిలదొక్కుకున్న వాళ్లు ఇప్పటి తరంలో కూడా చాలామంది ఉన్నారు.

ఉభయగోదావరి జిల్లాల్లో కాకినాడ, రాజమండ్రి, ద్రాక్షారామం, పాలకొల్లు లతో పాటుగా రాష్ట్రం నలుమూలలో ఎన్నో చోట్ల ప్రతి ఏటా క్రమం తప్పకుండా పరిషత్తు నాటకాలు జరుగుతూ ఉంటాయి. సిని రచయితలైన పరుచూరి సోదరులు 'పరుచూరి రఘుబాబు స్మారక పరిషత్తు' పోటీలని ప్రతియేటా హైదరాబాద్ రవీంద్రభారతి లో నిర్వహిస్తూ ఉంటారు. అక్కినేని నాగేశ్వర రావు పరిషత్తు హైదరాబాద్ లో పోటీలు నిర్వహించే మరో ముఖ్యమైన సంస్థ. సిని గ్లామరు ఉండడంతో ఈ పరిషత్తులలో నాటకాలు ప్రదర్శించడానికి నటీనటులు ఉత్సాహం చూపుతూ ఉంటారు. తిరుపతి లో ఏటా పోటీలు నిర్వహించే శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్ ప్రభుత్వ 'నంది' అవార్డుల మాదిరిగా 'గరుడ' అవార్డులు ప్రకటిస్తుంది. ఈ పోటీలలో చాలా వాటికి సిని రచయితలూ, దర్శకులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తుండగా, నటీనటులు ముఖ్య అతిధులుగా మెరిసి నాటకాల్లో నటించేవారికి తమ భవిష్యత్తు ను గురించి కలల్లో తేలే అవకాశం కల్పిస్తూ ఉంటారు.

సాధారణంగా పరిషత్తు నాటకాలు నాలుగురోజులో, వారం రోజులో జరుగుతాయి. నిర్వాహకుల అభిరుచిని బట్టి సాంఘిక నాటకం, నాటిక, పౌరాణిక నాటకం, జానపద/చారిత్రిక నాటకం విభాగాల్లో పోటీలు జరుగుతూ ఉంటాయి. విజయవాడ 'అభిరుచి' వంటి సంస్థలు కేవలం హాస్య నాటిక పోటీలు మాత్రమే నిర్వహిస్తున్నాయి. ఈ పోటీలు జరిగేది నాలుగు రోజులే అయినా, నిర్వాహకులు, నాటక సంస్థల వాళ్లు తేరా వెనుక మూడు నుంచి నాలుగు నెలలు కష్ట పడతారు. పోటీలు జరుగుతాయని ప్రకటించడం మొదలు, స్క్రిప్టులను ఆహ్వానించడం, వాటిని స్క్రీనింగ్ చేయడం, ఆయా ఊళ్ళకి వెళ్లి ప్రదర్శన రిహార్సల్ చూసి నాటకం/నాటికను ప్రదర్శనకు ఎంపిక చేయడంతో పాటు, నటీ నటులకు, సాంకేతిక నిపుణులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించడం నిర్వాహకుల విధులు.

ఇక నాటక సంస్థల వాళ్ళైతే కొత్త నాటకం/నాటిక ఎంచుకోవడం, నటీనటుల ఎంపిక, రంగాలంకరణ, సంగీతం, ఆహార్యం నిర్ణయించడం, రిహార్సల్ చేయడం..ఇలా ఆ రెండు మూడు నెలలూ బిజీ బిజీ. ఈ పరిషత్తుల కోసం ఉద్యోగాలకి సెలవు పెట్టి కృషి చేసేవాళ్ళూ ఉన్నారు. నాటకం తయారు చేయడానికి అయ్యే ఖర్చూ తక్కువేమీ కాదు. చాలా సంస్థలు ఒకే నాటకాన్ని వేర్వేరు పరిషత్తుల్లో ప్రదర్శించడం ద్వారా ఖర్చును ఆదా చేస్తున్నారు. ఈ మధ్యనే కొన్ని పరిషత్తులు 'నాటకం ఏ ఇతర పరిషత్తు లలోనూ ప్రదర్శింపబడి ఉండకూడదు' అని నిబంధనలు పెడుతున్నాయి. ప్రదర్శనకి ఎంపిక అవడం ఒక ఎత్తు, అయ్యాక బహుమతి కోసం చేసే కృషి మరో ఎత్తు. ప్రదర్శన మొత్తానికి బహుమతి తెచ్చుకోవాలని రచయితా, దర్శకుడు తాపత్రయ పడితే నటీనటులు, ముఖ్యంగా సీనియర్లు, వ్యక్తిగత బహుమతులపై దృష్టి పెడతారు. ఫలితంగా నాటకంలో లేని డైలాగులు, రిహార్సలు లో లేని మలుపులు స్టేజి మీద వినిపిస్తూ/కనిపిస్తూ ఉంటాయి.

వీళ్ళదేం ఉంది కాని, ఖద్దరు ధరించి, గన్మేన్లు వెంట రాగా, నిర్వాహకులతో ఉన్న మొహమాటం కొద్దీ చివరి రోజున చివరి ప్రదర్శన ఓ ఐదు నిమిషాలు చూసి ఉద్వేగభరితంగా ప్రసంగించి కంట తడి పెట్టేస్తారు అసలైన నటులు. నాటక రంగం చనిపోతోందని, మనమందరం బతికించుకోవాలనీ పిలుపు ఇచ్చేస్తూ ఉంటారు. నిజంగా నాటక రంగం చనిపోయే స్థితిలోనే ఉంటే ఇన్ని పరిషత్తులు ఎలా జరుగుతున్నాయో, జనం నుంచి అంత స్పందన ఎలా వస్తోందో వీళ్ళు చెప్పరు.. చెప్పలేరు.

శుక్రవారం, ఫిబ్రవరి 13, 2009

బాలనాగమ్మ

ప్రశ్న: బాలనాగమ్మ నాటకం ప్రదర్శించుటకు కావాల్సిన ముఖ్య పాత్రలేవి? జవాబు: మాయల ఫకీర్, సంగు మరియు కుక్క. 'అదేమిటీ..బాలనాగమ్మ పాత్రధారి వద్దా?' అన్నారంటే వాళ్లెప్పుడూ ఈ నాటకం చూడలేదన్న మాట. నిజానికి 'బాలనాగమ్మ' నాటకం లో కథానాయికది అతిధి పాత్రే. మొదట్లో కనిపిస్తుంది..ఫకీర్ ఆమెని కుక్కగా మార్చేస్తాడు..మళ్ళీ చివర్లో ఫకీర్ చనిపోయాక మళ్ళీ బాలనాగమ్మ కనిపిస్తుంది. నాటక సమాజాలవాళ్ళు పల్లెటూళ్ళు తిరిగి నాటకాలు వేసే రోజుల్లో 'బాలనాగమ్మ' నాటకం వేసే ట్రూప్ వచ్చిందంటే 'కుక్క ఎలా ఉంది?' అని ఎంక్వైరీలు మొదలయ్యేవి. పెద్ద సెట్టింగులతో పాటు, కుక్కనీ తమ వెంట ఊళ్ళు తిప్పుకునేవారు ఆ ట్రూపుల వాళ్లు.

కథేమిటంటే బాలనాగమ్మ ఏడేడు లోకాలకీ అందమైన ఓ రాకుమారి. ఓ రాజుని పెళ్ళాడి 'బాలవర్ధి రాజు' కి జన్మనిస్తుంది. అదిగో అప్పుడే మాయల ఫకీర్ ఆమెను చూసి మోహిస్తాడు. ఇతను కొంచం రావణాసురిడి టైపు. ఓ ముని వేషం లో వచ్చి, వుయ్యాల్లో బిడ్డకి జోల పాట పాడుతున్న బాలనాగామ్మని స్వయంగా భిక్ష తీసుకురమ్మని అడిగి, ఆమెని కుక్కగా మార్చేసి తనవెంట తీసుకుపోతాడు. ఆమె తనకు తానుగా ఇష్టపడేవరకు ఆమెని తాకరాదని నియమం పెట్టుకుంటాడు. ఇతని డెన్ లో ఉండే మనిషి సంగు. ఫకీర్ కి మధుపాత్ర అందివ్వడం, ఆడి పాడి అతన్ని అలరించడం ఆమె విధులు. పెద్దవాడైన బాలవర్ధి రాజు, తన తల్లి ఫకీర్ దగ్గర బందీగా ఉన్నదని, ఫకీర్ ప్రాణాలు చిలుకలో ఉన్నాయని తెలుసుకుని, ఫకీర్ ని చంపి తల్లిని బంధ విముక్తని చేసి తల్లితండ్రులని కలిపాకా తెర పడిపోతుంది.

ఆంద్ర దేశంలో ఎన్నో ట్రూపులు 'బాలనాగమ్మ' నాటకాన్ని ప్రదర్శించినా 'సురభి' వారి ప్రదర్శన తీరే వేరు. వాళ్ల సెట్టింగులు, మ్యాజిక్కులు చూడాల్సిందే. అన్ని నాటకాల మాదిరిగానే ఈ నాటకానికి ఆర్టిస్టుల టైమింగ్ చాలా ముఖ్యం. అంటే యాక్షను, రియాక్షనూ ఆలస్యం లేకుండా జరగాలి. లైటింగ్ వారి సహకారం చాలా అవసరం. సరైన సమయంలో దీపాలు ఆర్పడం, డిం చేయడం వంటివి జరక్కపోతే ప్రేక్షకులకి కథలో లేని హాస్యం కూడా అందుతుంది. మిగిలిన పాత్రధారులతో పాటు కుక్కగారినుంచి నటన రాబట్టుకోవడం పెద్ద పని. ఇదేమీ సినిమా కాదు కదా మరో టేక్ తీసుకోడానికి. అందుకే ట్రూపుల వాళ్లు కుక్క విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. కుక్క పిల్లల్ని చేరదీసి పెంచి వాటికి ట్రైనింగ్ ఇస్తూ తమ వెంట తిప్పుకుంటారు.

'బాలనాగమ్మ' ను తలచుకున్నప్పుడల్లా చాలా ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన గుర్తొస్తుంది. ఓ ట్రూప్ వాళ్ల ప్రదర్శన చాలా సీరియస్ గా జరుగుతోంది. ఫకీర్ బాలనాగమ్మని కుక్కగా మార్చే కీలకమైన సీన్ వచ్చింది. బాలనాగమ్మ తలపై ఫకీర్ మంత్రదండం పెట్టగానే, లైట్ డిం అయి చిన్న బాంబు పేలాలి, బాలనాగమ్మ పాత్రధారి తెరవెనక్కి వెళ్లి, కుక్క స్టేజి మీదకి రావాలి..ఇది సీన్. ఐతే ఓ ఫోటోగ్రాఫర్ చాలా ఉత్సాహంగా నాగమ్మ కుక్కగా మారే సీన్ ఫోటో తీయాలని స్టేజికి దగ్గరగా వెళ్ళాడు. ఫకీర్ దండాన్ని నాగమ్మ తలపై పెట్టాడు, లైట్ డిం కాలేదు, కుక్క స్టేజిమీదకి వచ్చేసింది. నాగమ్మ పాత్రధారి షాకై చూస్తోంది. బాంబు కొంచం ఆలస్యంగా పేలింది. బాంబు విషయం తెలియని ఫోటోగ్రాఫర్ ఉలిక్కిపడి దాదాపుగా స్టేజిమీద పడబోయి నిలదొక్కుకున్నాడు. కుక్క అతనిమీద 'భౌ' మంది తనకి డైలాగులు ఏమీ లేకపోయినా. .

ఈ సందట్లో నాగమ్మ పాత్రధారి తెర వెనక్కి వెళ్ళిపోయింది. ఫకీర్ పాత్రధారి సీనియర్ నటుడు. సమయస్ఫూర్తిగా 'కుక్కగా మార్చినా నీ పౌరుషం చావలేదా బాలనాగూ..' అని వికృతంగా నవ్వాడు. ఆతర్వాత అతను కుక్కని తన డెన్ కి తీసుకెళ్ళినప్పుడు సంగు చిరాగ్గా చూసి 'ఏటీ కుక్కా?' అంటే 'కుక్క కాదే నీ-అక్క బాలనాగుని తెచ్చితినే..' అన్నప్పుడు ఆడిటోరియం మొత్తం చప్పట్లతో మార్మోగింది..అతని డైలాగు లో విరుపుకి. .

మిగిలిన ట్రూపుల కన్నా సురభి వాళ్లు ఈ నాటకం ప్రదర్శించే తీరు ప్రత్యేకంగా ఉంటుంది..ఇది వీరు ప్రదర్శించే ప్రతి నాటకానికీ వర్తిస్తుంది..చిన్నప్పటి బాలనాగమ్మ అక్క చెల్లెళ్ళను చూపించేటపుడు స్టేజి నిండా ఊయలలు, ఫకీర్ డెన్, అతను చేసే మాయలు, సంగు ఆటపాటలు, చివర్లో బాలవర్దిరాజు సాహసం..ఇలా ప్రతి చోటా వారిదైన మార్కు చూపిస్తారు. ఐతే కొంతకాలం క్రితం జరిగిన సురభి వారి ప్రదర్శన చూసి కొంచం నిరాశ పడ్డాను. ప్రదర్శన బాగాలేక కాదు, కుక్క కనిపించక.. కుక్కకు బదులుగా ఓ పెద్ద కుక్క బొమ్మను ఉపయోగించారు. వారికున్న సమస్యలు ఏమిటో తెలియదు కాని, నాకు మాత్రం 'బాలనాగమ్మ' నాటకం అందం పోయిందనిపించింది.

శుక్రవారం, జనవరి 30, 2009

ఎడారి కోయిల

'కథే తానై, తానే కథై తెలుగు కథకు కొత్త వెలుగునిచ్చిన మధురాంతకం రాజారాం గారి దివ్య స్మృతికి మా ఈ ప్రదర్శన అంకితం చేస్తున్నాం..గంగోత్రి..పెదకాకాని వారు సమర్పించు ఎడారి కోయిల నాటిక. రచన వల్లూరు శివ ప్రసాద్..దర్శకత్వం నాయుడు గోపి..ఎడారి కోయిల మరికొద్ది క్షణాల్లో ..' ఈ ప్రకటనతో మొదలయ్యే 'ఎడారి కోయిల' నాటికను నాలుగుసార్లు చూసే అవకాశం దొరికింది నాకు. నచ్చిన పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ చదవడం, సినిమా నచ్చితే రెండు మూడు సార్లు చూడడం నాకు అలవాటు. నాటకం/నాటిక విషయంలో మాత్రం ఈ అవకాశం అరుదుగా దొరుకుతుంది.

ఇది ఏడెనిమిదేళ్ళ క్రితం సంగతి. అప్పటికే దామల్ చెరువు అయ్యోరి (మధురాంతకం రాజారాం) కథలు కొన్ని..'ఎడారి కోయిల' తో సహా.. చదివి ఉన్నాను. ఓ కథనో, నవలనో సినిమాగానో, నాటకంగానో మలచడంలో ఉండే కష్ట నష్టాలపై కొంత అవగాహన ఉంది. మొదటిసారి ఈ నాటికను చూస్తున్నపుడు కథను పూర్తిగా మార్చేస్తున్నారా? అని సందేహం కలిగింది. ఐతే నాటిక పూర్తయ్యేసరికి నాకు కలిగిన అనుభూతి, కథను చదివినప్పటి అనుభూతితో సమంగా ఉండేసరికి మళ్ళీ ఈ నాటిక చూసే అవకాశం ఎప్పటికి వస్తుందా అని ఎదురు చూశా.

మధురాంతకం రాసిన 'ఎడారి కోయిల' కథ తన తాతయ్య, నాయనమ్మలను వెతుక్కుంటూ అమెరికా నుంచి రాయలసీమ లోని ఓ కుగ్రామానికి వచ్చే ఓ టీనేజ్ కుర్రాడి కథ. తన తండ్రికి పాఠాలు చెప్పిన మాష్టారి ద్వారా ఊరి పరిస్థితులు, ఇంటి పరిస్థితులు తెలుసుకోడం తో పాటు, తనమీద కోపంగా ఉన్న తాతయ్య మనసు ఎలా గెలుచుకున్నాడనేది కథాంశం. 'సీతారామయ్య గారి మనవరాలు' సినిమా కథ కి కొంచం దగ్గరగా ఉంటుంది. బహుశా ఆ కథ రాసిన 'మానస' దామల్ చెరువు అయ్యోరి కథ నుంచి స్ఫూర్తి పొంది ఉండొచ్చు.

కథని నాటికగా మార్చడంలో కొన్ని మార్పులు చేశారు. కథలో లేని ఫాక్షనిజం అంశాన్ని నాటికలో చేర్చారు. కథలో ఉండే మేనత్త పాత్రకు బదులుగా బాబాయ్ పాత్రను సృష్టించారు. రాయలసీమ నేటివిటీ కోసం నాటికను ఓ చెక్క భజనతో ప్రారంభించారు. స్టేజి మీద సెట్టింగ్ సింపుల్ గా ఉన్నా, 'సీమ' గ్రామాన్ని ని ప్రతిబింబించింది. తాతయ్య పాత్రని నాయుడు గోపి, నాయనమ్మగా సీనియర్ రంగస్థల నటి రత్న కుమారి (ఈవిడకి నట రత్న కుమారి అని పేరు) మనవడిగా కిరణ్ అనే అబ్బాయి నటించారు.

కథ మొత్తం ఈ మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. నాయనమ్మకి మనవడంటే ఇష్టం, తాతయ్య కి కోపం. పెద్దాయన తన పెద్ద కొడుకుని కష్టపడి మెడిసిన్ చదివిస్తాడు. అతను ఓ కోస్తా జిల్లా అమ్మాయిని పెళ్లి చేసుకుని తల్లితండ్రులని, సీమని వదిలి అమెరికా లో సెటిల్ అవుతాడు. కుటుంబాన్ని పట్టించుకోడు. పెద్దాయన 'ఎందుకొచ్చావని' మనవడి మీద కోప్పడతాడు.. కుర్రాడికి విందు భోజనం పెట్టలేని తమ స్థితి పట్ల వృద్ధ దంపతులు బాధ పడతారు. బాబాయ్ ఫాక్షనిస్టు గా ఎందుకు మారవలసి వచ్చిందో, ఫలితంగా కుటుంబంలో పెరిగిన అశాంతి ఆ అబ్బాయి కళ్ళారా చూస్తాడు.

తమ కొడుకు కోడలు విజయవాడ వచ్చారని, మనవడు తిరుపతి వెళ్తానని వాళ్ళకి చెప్పి తమను చూడడానికి వచాడని తెలుసుకుని ఆ దంపతులిద్దరూ ఎంతో సంతోషిస్తారు. 'ఈ ఊరే తిరుపతి, మీరిద్దరే నా దేవుళ్ళు అనుకుని వచ్చాను తాతయ్యా..' అని అబ్బాయి చెప్పే డైలాగ్, బ్యాక్ గ్రౌండ్ లో 'గోవింద గోవింద' అనే మ్యూజిక్ ప్రేక్షకుల చేత అప్రయత్నంగానే చప్పట్లు కొట్టిస్తాయి. మెడిసిన్ చదువు పూర్తి చేసి అదే ఊళ్ళో హాస్పిటల్ పెడతానని తాతయ్యకి, నాయనమ్మకి హామీ ఇచ్చి మనవడు ప్రయాణం అవ్వడం, చెక్క భజన బృందం దగ్గర భజన నేర్చుకుని బస్ ఎక్కడం నాటిక ముగింపు.

ఓ సినిమా చూసాక అది మనకి నచ్చితే ఆ నటీనటుల్ని వ్యక్తిగతంగా కలిసి అభినందించడం మనకి వీలు కాదు. అదే నాటకం లో ఆ సౌలభ్యం ఉంది. రచన క్రెడిట్ పూర్తిగా మధురాంతకం వారికి ఎందుకు ఇవ్వలేదని నాయుడు గోపి ని అడిగాను. మూల కథని నాటకీకరించడంలో చాల మార్పులు చేశామని చెప్పారు. ప్రదర్శన పూర్తైన ప్రతిసారి కిరణ్ చాలా ఎమోషనల్ అయిపోయేవాడు. పాత్ర నుంచి బయటకి రావడానికి కొంచం టైం పట్టేది. హైస్కూల్ తో చదువు ఆపేసిన ఆ అబ్బాయి స్టేజి మీద అమెరికన్ యక్సేంట్ లో డైలాగులు చెపుతుంటే అబ్బురంగా అనిపించేది. డిగ్రీ అయినా చదవమని సలహా ఇచ్చా.. విన్నాడో లేదో తెలీదు.

చాలా రోజుల తర్వాత ఈ నాటికని ఓ టీవీ చానల్ వాళ్లు స్టూడియో లో షూట్ చేసి ప్రసారం చేశారు. క్వాలిటీ చాల నాసి రకంగా ఉంది..సగం చూసి ఇక చూడలేక చానల్ మార్చేశా..