మంగళవారం, నవంబర్ 30, 2010

వద్దు వద్దంటే డబ్బు

ఈమధ్య మెయిల్ లోకి లాగిన్ అవుతుంటే అంతా లక్ష్మీ ప్రసన్నంగా ఉంటోంది. రోజూ ఒకటి రెండు మెయిళ్ళకి తక్కువ కాకుండా అభినందనలు చెబుతూ వస్తున్నాయి. ఎక్కడో నాకు పేరు కూడా తెలియని దేశంలో జరిగిన లక్కీ డ్రా లో నా మెయిల్ ఐడీ మిలియన్ల కొద్దీ డాలర్లు గెలుచుకుందనో, అలాంటిదే మరో దేశంలో ఎప్పుడూ పేరు వినని స్వచ్చంద సంస్థ మెయిల్ ఐడీలకి నిర్వహించిన డ్రాలో నాకు ప్రధమ బహుమతి వచ్చిందనో, టిక్కట్టే కొనక్కర్లేని లాటరీలో నాకు యూరోలో, పౌండ్లో వచ్చి పడ్డాయనీ.. ఈ తరహాగా ఉంటున్నాయి సందేశాలు.

అంతంత డబ్బు ఏం చేసుకోవాలో తెలియక పోవడంచేత మెయిల్ ఓపెన్ చేయాలంటే కూడా భయంగా ఉంటోంది. అభినందనల సందేశంతో పాటు, నా పూర్తి వివరాలు, బ్యాంక్ అకౌంట్ నంబర్ తో సహా, పంపితే సొమ్ముని నేరుగా బ్యాంకులో వేసేస్తామని హామీలు వచ్చేస్తున్నాయి. అంతలేసి పెద్ద మొత్తాలని వద్దు వద్దని ప్రతిరోజూ చెప్పాలంటే ఎంత కష్టమో కదా. కోట్లు వచ్చి పడుతున్నా వద్దని చెప్పగల స్థిత ప్రజ్ఞత అలవరుచుకోవడం కూసింత కష్టంగానే ఉంది మరి.

నాకు విదేశీ స్నేహితులెవరూ లేరు. ఇంకో మాట చెప్పాలంటే నా స్నేహితులంతా భారతీయులే. మొన్నామధ్య ఓ విదేశీయుడు రాసిన మెయిల్ ఆసాంతం చదివితే నాకు ఆనందభాష్పాలు జలజలా రాలాయి. ఆయన మిలియన్ల కొద్దీ డాలర్లు సంపాదించాడట. వారసులెవరూ లేరుట. ఏదో అలా జీవితాన్ని గడిపేస్తూ ఉండగా, ఉన్నట్టుండి అనారోగ్యం చేసిందిట. హాస్పిటల్ కి వెళ్తే డాక్టర్లు తనకి ప్రాణాంతకమైన జబ్బు చేసిందనీ, ఆ జబ్బుకి ప్రపంచంలో ఏ దేశంలోనూ చికిత్స లేదనీ, మరణం కోసం ఎదురు చూడమనీ చెప్పేశారుట.

"నేను పోయాక నేను సంపాదించిన ఆస్తినంతా ఏం చెయ్యను దేవుడా?" అని దేవుడిని అడిగితే, ఆయన కల్లో కనిపించి నమ్మకస్తుడు ఎవరికైనా రాసిచ్చేయమన్నాట్ట. అతను పాపం ఇంటర్నెట్లో వెతికితే, గూగులమ్మ ఈ ప్రపంచంలో నా అంత నమ్మకస్తుడెవడూ లేడని చెప్పిందిట. (చచ్చి నీ కడుపున పుట్టాలని ఉంది గూగులమ్మా). ఆస్తి తీసేసుకోమనీ, ఓ పాతిక శాతాన్ని చారిటీ కోసం ఉపయోగించమనీ, మిగిలింది నన్ను అనుభవించమనీ బతిమాలుతూ మరణ శయ్య మీద నుంచి మెయిల్ రాశాడాయన.

నేను కఠినమైన హృదయం కలవాడినీ, సిరిదా మోకాలడ్డే వాడినీ కావడం వల్ల, ఆ మెయిల్ ని 'స్పాం' అని మార్క్ చేసేశాను. బొత్తిగా ముక్కూ మోహం తెలియని అతని నుంచి అంత ఆస్తి అయాచితంగా తీసుకోబుద్ధి కాలేదు. లాటరీలో వచ్చిన బహుమతి మొత్తాలు తీసుకోమని మొహమాట పెడుతూ వస్తున్న ఉత్తరాలని కూడా 'స్పాం' లోకే తోసేస్తున్నాను. వారానికోసారి 'స్పాం' ని ఖాళీ చేసేటప్పుడు ఈ ఉత్తరాలన్నీ ఓసారి చదువుకుని నిట్టూర్చడం ఓ అలవాటుగా మారిపోయిందీ మధ్య.

కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే, నా స్నేహితురాలొకావిడకి ఆన్ లైన్ లాటరీలో మొదటి బహుమతి వచ్చిందంటూ ఓ ఉత్తరం వచ్చింది. ఓ రిఫరెన్స్ నెంబరు ఇచ్చి, జవాబులో ఆవిడ వివరాలతో పాటు ఆ నెంబరు కూడా ప్రస్తావించామని సూచించారు ఉత్తరం రాసిన వాళ్ళు. "అసలే డబ్బుకి ఇబ్బందిగా ఉంది..ఇదేదో బానే ఉంది" అనుకుంటూ ఆవిడ సమాధానం ఇవ్వబోతూనే, ఎందుకో సందేహం వచ్చి నాకు చూపించారా మెయిల్ ని. నాకూ డౌట్ వచ్చింది. ఆ నెంబరు కోట్ చేస్తూ నేనో మెయిల్ పంపాను వాళ్లకి. నాక్కూడా అభినందనలు వచ్చేయడంతో అనుమానం బలపడింది.

తెలిసిన విషయాలు ఏమిటంటే, ప్రపంచంలో ఏ లాటరీ సంస్థా కూడా టిక్కెట్ కొనకుండా బహుమతి ఇవ్వదు. ఆన్లైన్ లాటరీల పేరుతో జరుగుతున్న మోసాలు, బ్యాంకు అకౌంట్ నెంబర్లు తీసుకుని వాటి ఆధారంగా చేసే మోసాల గురించి తెలుసుకుని అవాక్కయ్యాం ఇద్దరం. అప్పటి నుంచీ మాకు తెలిసిన వాళ్ళలో ఎవరు ఆన్లైన్ లాటరీలో బహుమతి వచ్చిందని చెప్పినా, ఈ అనుభవాన్ని ఉదహరించడం మొదలు పెట్టాం. అప్పట్లో బాగా తక్కువగానే ఉండేవి కానీ, రాన్రాను ఈ తరహా మెయిల్స్ బాగా పెరిగిపోయాయి. తెలిసిన వాళ్ళే ప్రాణం పోతున్నా పది రూపాయలు ఇవ్వని ఈ రోజుల్లో, ముక్కూ మోహం తెలియని వాళ్ళు వేల డాలర్లు అయాచితంగా ఇచ్చేస్తామంటే నమ్మేయడమే??

ఆదివారం, నవంబర్ 28, 2010

ఉపోషం

"అమ్మా.. రేపు నేనుకూడా మీతోపాటు ఉపోషం ఉంటానమ్మా.. అన్నం తినకూడదు, అంతే కదా.. నేనుండగలనమ్మా.. జొరం వచ్చినప్పుడు అన్నం తినకుండా ఉంటున్నానుకదా.." ఇలా పరిపరివిధాలుగా చెప్పి కార్తీక సోమవారం నాడు నేను ఉపవాసం ఉండడానికి అమ్మని ఒప్పించేశాను నేను. అప్పుడు నేను మూడో తరగతి. పండగలు వచ్చాయంటే కొత్త బట్టలు కుట్టిస్తారనీ, పిండి వంటలు చేస్తారనీ, బోయినాలు ఆలస్యమవుతాయనీ, కార్తీక మాసం వచ్చిందంటే సోమవారాలు "ఉపోషాలు" ఉంటారనీ మాత్రమే తెలిసిన రోజులు.

ఆదివారం రోజంతా బతిమాలగా బతిమాలగా ఎట్టకేలకి సాయంత్రానికి నా ఉపవాస వ్రతానికి అమ్మ అనుమతి దొరికేసింది. "రేపు మళ్ళీ నువ్వు ఉపోషం కదా. అన్నం తినవు కదా.. పొద్దున్నే నీరసం వచ్చేస్తుంది. ఓ రెండు ముద్దలు ఎక్కువ తినాలి మరి.." అని ఆవేళ రాత్రి ఎప్పుడూ తినేదానికి డబుల్ కోటా తినిపించేసిందా.. ఓ పక్క నాకు ఆవులింతలొచ్చేస్తూ కళ్ళు బరువుగా వాలిపోతుంటే అప్పుడింక ఒకటే జాగ్రత్తలు. "ఇదిగో.. నువ్వు ఎప్పుడు ఉండలేకపోతే అప్పుడు నాకు చెప్పెయ్యాలి, తెలిసిందా. మధ్యాహ్నం ఆకలేసినా చెప్పెయ్యి. వంట చేసేస్తాను.." అంటూ.. నేను వింటూ వింటూ నిద్రలోకి జారుకున్నాను.

మర్నాడు పొద్దున్నే చెర్లో కార్తీక స్నానం చేసొచ్చేశామా. ఇంక గుళ్ళోకెళ్ళి అభిషేకం చేయించుకుని రావాలి. ఎప్పుడూ ఖాళీగా ఉండే శివాలయం ఆవేళ ఒకటే హడావిడిగా ఉంది. ఊళ్ళో వాళ్ళందరూ గుళ్ళోనే ఉన్నారు. "గుళ్ళో అభిషేకం ఆలస్యం అయ్యేలా ఉంది కదా బాబూ. నువ్వు పాలు తాగెయ్యి," అంది అమ్మ, తను మాత్రం కాఫీ తాగలేదు. అదే అడిగితే "కాఫీ తాక్కూడదమ్మా.. పాలు పర్వాలేదు.." అని చెప్పిందే కానీ, తను మాత్రం పాలు కూడా తాగలేదు. నాన్న నన్ను బడికి పంపాలనుకున్నారు కానీ, అమ్మ ఒప్పుకోలేదు, "ఉపోషం పూటా ఏం వెళ్తాడు.." అని.

గుళ్ళో అభిషేకం చేయించుకుంటే ప్రసాదం ఇవ్వకుండా ఉండరు కదా. అసలే పూజారిగారు మాకు బాగా తెలుసు కూడాను. కొబ్బరి చెక్కలు, అరటిపళ్ళు పళ్ళెంలో పెట్టి ఇచ్చారు. గుడి బయటకి రావడం ఆలస్యం, అమ్మ కొబ్బరి చెక్క ముక్కలుగా కొట్టీ, అరటి పళ్ళు ఒలిచీ నాకు అందించేసింది.."ప్రసాదం వద్దనకూడదమ్మా, తినాలి" అని కూడా చెప్పింది. నేను భక్తిగా ప్రసాదాన్ని ఆరగిస్తుండగా, "ఇవాళ మావాడు కూడా ఉపోషం" అని మిగిలిన భక్తులకి పుత్రోత్సాహంతో చెప్పింది అమ్మ. వాళ్ళంతా నా భక్తిని ఎంతగానో మెచ్చుకున్నారు. అంత చిన్నపిల్లలెవరూ ఉపోషాలు ఉండరుట.

ఇంటికి రాగానే మళ్ళీ బోల్డన్ని పాలు కాచి వాటిలో పంచదార, అటుకులు వేసి ఇచ్చింది నాకు. "అటుకులు తినొచ్చు, అన్నం తినకూడదు కానీ," అని చెప్పెయ్యడంతో నేను ఆ పాలటుకుల పని పట్టాను. మధ్యాహ్నం అవుతుండగా చాలా ప్రేమగా మళ్ళీ అడిగింది "అన్నం వండేయనా? చిన్న పిల్లలు ఉపోషం ఉండకపోయినా పర్వాలేదు" అని. నేనొప్పుకోలేదు. ఉపోషం ఉండాల్సిందే అనేశాను, కచ్చితంగా. "పిల్లాడు ఉపోషం ఉన్నాడు, ఎవర్నైనా పిలిచి బొండాలు తీయించండి" అని నాన్నకి పురమాయించేసింది.

బొండాలు చెట్టు దిగడం ఆలస్యం, రెండు బొండాల్లో నీళ్ళు నాచేత తాగించడమే కాదు, కొబ్బరి మీగడ అంతా తినిపించేసింది అమ్మ. "ఉపోషాలు ఉండేవాళ్ళు బొండాలు తాగొచ్చు" అనడంతో నేనింకేమీ మాట్లాడలేదు. సాయంత్రం కాఫీల వేళ నాకు పెద్ద గ్లాసుడు పాలిచ్చి, బిస్కట్లైనా, రస్కులైనా ముంచుకుని తినమంది. నేను "బిస్కట్లు తినొచ్చా?" అని సందేహం వెలిబుచ్చితే, "అన్నం తినకూడదు కానీ మిగిలినవి ఏవన్నా తినొచ్చు" అని మళ్ళీ హామీ ఇచ్చేసింది. పాలతో పాటు కాసిన్ని బిస్కట్లు నమిలాను.

దీపాల వేళ అయ్యిందో లేదో, హడావిడి పడుతూ పొయ్యి వెలిగించేసింది వంటకి, "అసలే పిల్లాడు కూడా ఉపోషం" అంటూ. నేనేమో వీధిలో మంచం వాల్చుకుని కూర్చుని, నక్షత్రం కనిపిస్తుందేమో అని కొబ్బరాకుల మధ్యనుంచి కళ్ళు చికిలించుకుని ఆకాశంలోకి చూడడం. అలా చూస్తూ నేను కాసిని పాలు తాగేసరికి అమ్మ వంట అవ్వడం, నక్షత్రం రావడం జరిగిపోయింది. ఇంకేముంది, పప్పు, కూర, పులుసు, పెరుగు వేసుకుని బోయినం చేసేశా. "ఇంతేనా ఉపోషం ఆంటే.. బామ్మెప్పుడూ బోల్డు హడావిడి చేసేస్తుంది. తను రాగానే చెప్పాలి, నేను ఉపోషం ఉన్నానని" అనుకుంటూ నిద్రపోయా.

మర్నాడు స్కూల్లో మేష్టారు అడిగారు, ముందు రోజు ఎందుకు రాలేదని. "కార్తీక సోమవారం కదండీ, ఉపోషం ఉన్నాను" అని చెప్పగానే ఆయన ఎంతగా మెచ్చుకున్నారంటే, నాకు ఫస్టు మార్కులొచ్చినప్పుడు కూడా ఆయనెప్పుడూ అంతగా మెచ్చుకోలేదు. అది మొదలు నేనెప్పుడూ ఉపోషం మిస్సవ్వలేదు.

బుధవారం, నవంబర్ 24, 2010

ఇందిరమ్మ రాజ్యం

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన అత్తగారు ఇందిర గాంధీ అడుగుజాడల్లో నడుస్తున్నారు. రాష్ట్రాల విషయంలో, ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ విషయంలో నాడు ఇందిర అనుసరించిన వైఖరే నేటి సోనియా వైఖరి. లేకపొతే, అన్నీ సక్రమంగానే ఉన్నప్పటికీ రాత్రికి రాత్రే రాయకీయం మారిపోవడం ఏమిటి? కొత్త ముఖ్యమంత్రి ఎంపిక నిర్ణయాన్ని సోనియాకే వదిలేస్తూ పార్టీ ఎమ్మెల్యేలంతా తీర్మానం చేయాల్సిన అగత్యం రావడం ఏమిటి?

రోశయ్య రాజీనామా ఆయన చెప్పినట్టుగా "వయోభారం, అనారోగ్యం" కారణాల వల్ల కాదన్నది రోజూ టీవీలు చూసే చిన్న పిల్లలు కూడా చటుక్కున చెప్పగలిగే సమాధానం. "అధిష్ఠానం నియమిస్తే ముఖ్యమంత్రిని అయ్యాను.. సోనియా నన్నీ బాధ్యత నిర్వహించమన్నంత కాలం ఈ కుర్చీలో ఉంటాను" అని గడిచిన పద్నాలుగు నెలల ఇరవైరెండు రోజుల్లో రోశయ్య లెక్కలేనన్నిసార్లు చెప్పారు. పెద్ద సమస్య వచ్చిన ప్రతిసారీ ఆయన చెప్పిన మొదటి మాట ఇదే.

వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఆరేళ్ళ కాలాన్ని మినహాయిస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మిగిలిన కాలంలో పేరుకి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా పెత్తనం చేసింది అధిష్టానమే అన్నది బహిరంగ రహస్యమే. నిజానికి వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సైతం ఆయన "ఒంటెత్తు పోకడల" పట్ల అధిష్ఠానం అసంతృప్తిని వ్యక్తం చేసిందన్న వార్తలు చాలాసార్లే వెలుగు చూశాయి. ఈ నేపధ్యంలో స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తిని సోనియా ముఖ్యమంత్రిగా నియమిస్తారని ఆశించడం వృధా ప్రయాస.

వ్యక్తి ఎవరైనా పాలన సోనియాదే అయినప్పుడు రోశయ్యని మార్చి మరొకరిని ఆ కుర్చీలో కూర్చోపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ముఖ్యంగా రోశయ్య విధేయత ఏమాత్రం తగ్గనప్పుడు, మంత్రులు ఆయన మాట వినేలా అధిష్ఠానం చేయగలిగినప్పుడు ఈ మార్పు ఎందుకు? జవాబు మనకి ఇందిరమ్మ రాజ్యంలో దొరుకుతుంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్న సందర్భంలో, రాజకీయ వాతావరణం కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్న మెజారిటీ సందర్భాలలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు జరిగిందన్నది గమనించాల్సిన విషయం.

అటు కేంద్రంలో ఆదర్శ్ సొసైటీ, టెలికాం కుంభకోణం ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న సమయంలో, రాష్ట్రంలో తెలంగాణా సమస్య, జగన్మోహన్ రెడ్డి అసమ్మతి, ఇంకా వివిధ వర్గాల ఆందోళనలు ప్రభుత్వానికి కొత్త సవాళ్లు విసురుతున్న నేపధ్యంలో జరుగుతున్న ఈ ముఖ్యమంత్రి మార్పు ప్రజల దృష్టి మరల్చేందుకు మాత్రమే అనిపిస్తోంది. అత్తమ్మ ఎంచుకున్న సీల్డ్ కవర్ సంస్కృతిని కొద్దిగా మార్చి, రాష్ట్రానికి తన ప్రతినిధులని పంపారు కోడలమ్మ. అంతిమంగా ఎంపిక తన చేతిలోనే ఉండేలా జాగ్రత్త పడ్డారు.

అధిక సంఖ్యలో ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రమే అయినా, ఎలాంటి ముఖ్య ప్రాజెక్టులూ కేటాయించక పోవడం, ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు ఇవ్వక పోవడం, నిధుల కేటాయింపులో సైతం చిన్న చూపు చూడడం ఇవన్నీ కూడా రాష్ట్రానికి ఏం చేసినా చేయకున్నాఇక్కడ గెలిచేది తమ పార్టీనే అన్న వైఖరి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి మార్పు తతంగం అందుకు ఊతమిస్తోంది. ఇందిర కాలంలో ఏర్పడ్డ ఇలాంటి వాతావరణమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి, ఎన్టీఆర్ నాయకత్వంలో ఆ పార్టీ అఖండ విజయం సాధించడానికీ తోడ్పడిందన్న సత్యాన్ని సోనియా విస్మరించారా? లేక ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితి పునరావృతం అయ్యే పరిస్థితి కనిపించడం లేదన్న ధీమాతో ఉన్నారా? వేచి చూడాలి...

మంగళవారం, నవంబర్ 23, 2010

చిల్లర దేవుళ్ళు

పోరాటాల చరిత్రలో తెలంగాణా సాయుధ పోరాటానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. యావత్ ప్రపంచపు దృష్టినీ ఆకర్షించిన పోరాటాల్లో ఇదొకటి. మిగిలిన దేశం యావత్తూ పరాయిపాలకులని తరిమికొట్టడం కోసం పోరుని ఉద్ధృతం చేసిన సమయంలో, నిజాం పాలనని అంతమొందించడం కోసం ఆయుధం పట్టారు తెలంగాణా ప్రజ. అమాయకులైన ప్రజలని ఇంత పెద్ద పోరాటం చేసేలా ప్రేరేపించిన పరిస్థితులు ఏమిటి? నిజాం పాలనలో ప్రజల జీవితం ఎలా ఉండేది? లాంటి ఎన్నో ప్రశ్నలకి జవాబిచ్చే పుస్తకం నాలుగున్నర దశాబ్దాల క్రితం దాశరధి రంగాచార్య రాసిన 'చిల్లర దేవుళ్ళు.'

తెలుగు పాఠకులకి దాశరధి రంగాచార్యని పరిచయం చేయాల్సిన పనిలేదు. మూడుతరాల రచయితలు, పాఠకులకి వారధి ఈ బహుభాషా పండితుడు. నిజాం అకృత్యాలకి ప్రత్యక్ష సాక్షి. తెలంగాణా పోరాటం పూర్వాపరాలని అక్షరబద్ధం చేయాలనే ఆకాంక్షతో నవలా రచన ప్రారంభించిన రంగాచార్య ఇందుకోసం 1964 లో 'చిల్లర దేవుళ్ళు' తో శ్రీకారం చుట్టారు. కథాకాలం అంతకు రెండు దశాబ్దాలకి పూర్వం. కథాస్థలం తెలంగాణలోని ఓ కుగ్రామం. సంగీతోపాధ్యాయుడు సారంగపాణి బ్రతుకుతెరువు వెతుక్కుంటూ విజయవాడ నుంచి ఆ ఊరికి చేరుకోడం కథా ప్రారంభం.

ఊరిమద్యలో ఠీవిగా నిలబడి ఉంటుంది దేశముఖ్ రామారెడ్డి 'దొర' గడీ. ఊరిమొత్తానికి అదొక్కటే భవంతి. కరణం వెంకట్రావు తో పాటు మరి కొద్దిమందివి మాత్రమే చెప్పుకోదగ్గ ఇళ్ళు. మిగిలినవన్నీ గుడిసెలే. దొర, కరణం ఆ ఊరిని పాలిస్తూ ఉంటారు. నిజాం ప్రభుత్వం దఖలు పరిచిన అపరిమితమైన అధికారం పుణ్యమా అని వారిద్దరూ చిల్లర దేవుళ్ళుగా వెలిగిపోతూ ఉంటారు ఆ పల్లెలో. సంగీతం పట్ల కొంత ఆసక్తి ఉన్న దొర, పాణి కి తన గడీలో ఆశ్రయమిస్తాడు. రోజూ పాణి పాటని వినడం అలవాటు చేసుకోడంతో పాటు, ఊళ్ళో రెండు మూడు పాఠాలు కూడా ఏర్పాటు చేస్తాడు. పాణి శిష్యురాళ్ళలో కరణం కూతురు తాయారు కూడా ఉంది.

ఊరిమీద దొర పెత్తనం ఎలాంటిదో నెమ్మది నెమ్మదిగా అర్ధమవుతుంది పాణికి. కథలో అతడిది కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే. ఊళ్ళో దొర మాట శిలాశాసనం. అతని కంట పడ్డ ఏ స్త్రీ తప్పించుకోలేదు. అంతే కాదు చిన్న తప్పుకు సైతం దొర విధించే శిక్ష అత్యంత కఠినంగా ఉంటుంది. తన అధికారాన్ని నిలబెట్టుకోడానికి దొర ఎంతకైనా వెనుకాడడని తెలుస్తుంది పాణికి. దొరకీ-కరణానికీ మధ్య వైరం, జనం విషయానికి వచ్చేసరికి ఇద్దరూ ఏకం కావడం చూస్తాడతడు.

గడీ లోపల ఒక్కక్కరిదీ ఒక్కో కథ. 'ఆడబాప' గా పనిచేస్తున్న వనజది వేశ్య కన్నా నికృష్ట జీవితం. ఆమె పాణి మీద మనసు పడుతుంది. మరోపక్క పరదాల చాటున పెరిగే దొర కూతురు మంజరి సైతం 'సంగీతప్పంతులు' మీద మనసు పారేసుకుంటుంది. ఇంకోపక్క కరణం కూతురు తాయారు, తనని పెళ్లి చేసుకుంటే తండ్రి కరణీకం పాణికి ఇప్పిస్తానని ప్రతిపాదించడం మాత్రమే కాదు, తన కోరికని అంగీకరించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తుంది కూడా.

అలా అని ఇదేమీ ముక్కోణపు ప్రేమకథ కాదు. సాయుధ పోరాటానికి పూర్వం తెలంగాణా ప్రజల బతుకు పోరాటాన్ని చిత్రించిన నవల. భూతగాదాలో లంబాడీలను కరణం మోసగిస్తే, న్యాయం చేయాల్సిన పోలీసులు కరణానికి మద్దతుగా లంబాడీలపై కాల్పులు జరుపుతారు. నిజాం మనుషులు రోజు కూలీలని బలవంతంగా ముస్లిం మతంలోకి మారిస్తే, ఆ తర్వాత వాళ్ళు ఇటు హిందువులుగానూ, అటు ముసల్మానులుగానూ చెలామణి కాలేక, రెండు మతాల చేతా వెలివేయబడి పడే బాధలు వర్ణనాతీతం. దొర బండి రోడ్డున వెళ్తుంటే, గడీ గౌరవానికి చిహ్నంగా బండికి ముందు ఒక మనిషి పరుగు పెట్టడం లాంటి సంప్రదాయాలని చిత్రించడం మాత్రమే కాదు, అలా పరుగు పెట్టే మనిషి పడే కష్టాన్నీ కళ్ళకు కట్టారు రచయిత.

నిజాం పాలనలో ఉనికి కోల్పోతున్న తెలుగు భాషా సంస్కృతులని కాపాడడానికి మాడపాటి హనుమంతరావు వంటి తెలుగు వాళ్ళు చేస్తున్న కృషిని తెలుసుకుంటాడు పాణి. తను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మాడపాటి తో మాట్లాడి తన సందేహాలని నివృత్తి చేసుకుంటాడు కూడా. హైదరాబాద్ నుంచి అతను కొని తెచ్చిన కెమెరా, వాటితో అతను తీసిన ఫోటోలు దొరకి నచ్చడంతో ఆ కుటుంబానికి మరింత దగ్గరవుతాడు పాణి. ఊహించని విధంగా పాణి మీద దొర చేయి చేసుకోవడం, ఆ తర్వాత పాణి ఊరు విడిచి వెళ్ళడంతో కథ నాటకీయమైన ముగింపు దిశగా పయనిస్తుంది.

పాణి, మంజరి అనే రెండు పాత్రలు మినహాయిస్తే, మిగిలిన పాత్రలన్నీ నిజ జీవితం నుంచి పుట్టినవే అనడం నిస్సందేహం. కథానాయకుడిది పాసివ్ పాత్ర కావడం వల్ల కావొచ్చు, కథకి సినిమాటిక్ ముగింపు ఇచ్చారు రచయిత. కథని పక్కన పెట్టి, రచయిత పరిశీలనాశక్తి ని దృష్టిలో పెట్టుకుని చదివినప్పుడు ఈనవల మనకెన్నో విషయాలు చెబుతుంది. అనేక వాస్తవాలని కళ్ళముందు ఉంచుతుంది. అందుకే కావొచ్చు రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాలలో (ఉస్మానియా, కాకతీయ, శ్రీవెంకటేశ్వర) ఈ నవలపై అధ్యయనం జరిగింది. రాష్ట్ర సాహిత్య అకాడెమీ 1971 సంవత్సరానికి బహుమతి ప్రకటించింది. (విశాలాంధ్ర ప్రచురణ; పేజీలు 131 వెల రూ.50).

సోమవారం, నవంబర్ 22, 2010

అన్వేషణ

సృష్టిలో క్రూరమైన మృగం పులి అనుకుంటారు చాలామంది. కానీ, మనిషికన్నా క్రూరమైన మృగం మరొకటి లేదంటుంది పాతికేళ్ళ క్రితం వంశీ తీసిన 'అన్వేషణ' సినిమా. ఈ సినిమా ద్వారా మర్డర్ మిస్టరీని తెరకెక్కించడంలో వంశీ చేసిన ప్రయోగాలు తర్వాత ఎంతోమంది దర్శకులకి మార్గదర్శకం అయ్యాయి.. వాళ్ళెవరూ కూడా 'అన్వేషణ' స్థాయి విజయాన్ని సాధించలేకపోయారు. వంశీ తీసిన మంచి సినిమాల జాబితాలో స్థిరమైన చోటు సంపాదించుకున్న ఈ సినిమా అప్పట్లో వంద రోజుల పండుగ జరుపుకుంది.


మద్రాస్ మ్యూజిక్ కాలేజీలో చదివిన హేమ (భానుప్రియ), ఫారెస్ట్ కాంట్రాక్టర్ రావు గారి (కైకాల సత్యనారాయణ) ఆహ్వానం మేరకి ఆయన ఉంటున్న అటవీ ప్రాంతానికి వస్తుంది. సంగీతాన్ని యెంతో ఇష్టపడే రావుగారికి ఉన్నది ఒకటే కోరిక, పక్షుల కిలకిలారావాల నుంచే సంగీతం పుట్టిందని నిరూపిస్తూ ఓ పుస్తకం రాయాలని. ఇందుకోసం ఆయన స్వయంగా పరిశోధన మొదలు పెట్టినప్పటికీ, వృద్ధాప్యం కారణంగా మొదలైన మతిమరుపు ఆయన చేత ఆ పనిని పూర్తి చేయనివ్వదు.

రావుగారి జీప్ డ్రైవర్ (రాళ్ళపల్లి) భార్యే ఆ ఇంట్లో వంట మనిషి కూడా. అక్కడ పనిచేస్తున్న ఫారెస్ట్ రేంజర్ జేమ్స్ (శరత్ బాబు) రావుగారికి మంచి స్నేహితుడు. ఊరి సర్పంచ్ పులిరాజు (మల్లికార్జున రావు), అతని భార్య నాగలక్ష్మి (వై.విజయ), వాళ్ళ కొడుకు చంటోడు (శుభలేఖ సుధాకర్), పులిరాజు బావమరిది (బాలాజీ)... ఇలా రావుగారితో మసిలే ప్రతి ఒక్కరూ చిత్రంగా ప్రవర్తిస్తూ ఉండడం అర్ధం కాదు, రావుగారి స్నేహితుడి కూతురైన హేమకి.

హేమ కన్నా ముందు అదే అంశం మీద పరిశోధన కోసం రావుగారు రప్పించిన సుమతి అనే అమ్మాయిని అడవిలో పులి దారుణంగా చంపేసిందని తెలిసినా ఏమాత్రమూ భయపడని ధైర్యస్తురాలు హేమ. ఎవరి మాటలూ పట్టించుకోకుండా అడవిలో తిరుగుతూ తన పరిశోధన తాను చేసుకుంటూ ఉంటుంది. ఓ ముగ్గురు ముసుగు మనుషులు తనని వెంబడించడం, వాళ్ళని మరో ముసుగు మనిషి వెంబడించడం గమనిస్తుంది హేమ. రావుగారి సహాయకుడు గోఖలేని పులి చంపేయడంతో ఊరి జనంలో మళ్ళీ భయం మొదలవుతుంది.

గోఖలే స్థానంలో పనిచేయడం కోసం పట్నం నుంచి వస్తాడు అమర్ (తర్వాతికాలంలో కార్తిక్ గా మారిన తమిళ నటుడు, 'సీతాకోకచిలక' ఫేం మురళి). ఉద్యోగంలో చేరకుండా పులి ఆనుపానులమీద ఎంక్వయిరీలు చేసే అమర్ ప్రవర్తన కూడా చిత్రంగానే ఉంటుంది. ఇంతలో ఊళ్ళో బండివాడిని (ధమ్) పులి చంపేయడంతో ప్రజల్లో మళ్ళీ భయభ్రాంతులు మొదలవుతాయి. పులిని చంపేయమని కలెక్టర్ నుంచి ఉత్తర్వులు కూడా ఉంటాయి. నిజానికి అప్పటివరకూ పులిని చూసిన వాళ్ళు ఎవరూ లేరు. జనం చూసిందల్లా పులిచేతిలో మరణించిన వాళ్ళ శవాలనే.

హేమకీ అమర్ కీ స్నేహం కలవడం, అమర్ పోలిస్ అధికారి అనీ, పులి చేతిలో మరణించిన వారిగా చెబుతున్న వారంతా నిజానికి మనుషుల చేతిలోనే హతమయ్యారనే దిశగా అతను పరిశోధన సాగిస్తున్నాదనీ తెలియడంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. హేమని వెంటాడుతున్నవాళ్ళు ఎవరు? వాళ్ళని వెంబడిస్తున్న వ్యక్తి ఎవరు? పులి పేరుతో హత్యలు ఎందుకు జరిగాయి? రావుగారి పుస్తక రచన పూర్తయ్యిందా? లాంటి ప్రశ్నలకి సమాధానాలు చెబుతూ సినిమా ముగుస్తుంది.

నిజానికి ఈ 'అన్వేషణ' సాంకేతిక నిపుణుల సినిమా. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన వంశీతో పాటు, చాయాగ్రాహకుడు ఎమ్వీ రఘు, ఎడిటింగ్ చేసిన జి.ఆర్. అనిల్ మర్నాడ్, సంగీతం సమకూర్చిన ఇళయరాజాల ప్రతిభ ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. చిత్తూరు జిల్లా తలకోనలో చిత్రీకరించిన ఈ సినిమా కథ శ్రీకారం నుంచి శుభం కార్డు వరకూ అడవిలోనే జరుగుతుంది. ప్రతి పాత్ర ప్రవర్తనా అనుమానాస్పదంగానే అనిపించడంతో ముగింపు ఊహకందదు. అడవిని ఎంత అందంగా చూపించారో, అంతగానూ కెమేరాతో భయపెట్టేశారు రఘు. ఏ సన్నివేశం నిడివి ఎంత ఉండాలో అంత మాత్రమే ఉండడం ఈ సినిమా ఎడిటింగ్ ప్రత్యేకత.

వాయిద్యాలతో మాత్రమే కాదు, అవసరమైన చోట్ల నిశ్శబ్దంతోనూ అద్భుతమైన మూడ్ క్రియేట్ చేశాడు ఇళయరాజా. 'కీరవాణి' 'ఏకాంతవేళ' 'యెదలో లయ' 'ఇలలో కలిసే..' ప్రతిపాటా దేనికదే ప్రత్యేకమైనది. వేటూరి చక్కని సాహిత్యం అందించారు. పక్షుల గొంతులను సంగీత వాద్యాల మీద ఇళయరాజా ఎంత సహజంగా పలికించాడో, అంటే సహజంగా ఆ గొంతులకి తన గొంతుని పోటీగా నిలిపారు జానకి. 'ఇలలో కలిసే..' ట్యూన్ 'అభినందన' లో 'ఎదుట నీవే..' ట్యూన్ ఒకటే. నిజానికి ఈ ట్యూన్ మాతృక ఇళయరాజా తమిళం లో చేసిన ఒక పాట అని వంశీ ఆ మధ్యనెప్పుడో ఓ టీవీ చానెల్లో చెప్పిన కబురు.

నటీనటుల గురించి చెప్పాలంటే ముందుగా చెప్పాల్సింది హేమ గా నటించిన భానుప్రియ గురించే. గత చిత్రం 'సితార' లో పూర్తి సంప్రదాయ బద్ధంగా కనిపిస్తే, ఈ సినిమాలో ఫ్యాంటు షర్టులు, సల్వార్ కమీజుల్లో కనిపించింది. ధైర్యస్తురాలైన పట్నం అమ్మాయిగానూ, తన చుట్టూ జరుగుతున్న సంఘటనలకి చలించే సన్నివేశాల్లోనూ చక్కని నటనని ప్రదర్శించింది. సత్యనారాయణ, మురళి, శరత్ బాబు, రాళ్ళపల్లి, మల్లికార్జున రావు, వై.విజయ, సుధాకర్.. ఇలా అందరూ తమ పాత్రలకి న్యాయం చేశారు.

వంశీ రాసుకున్న కథకి యండమూరి వీరేంద్ర నాథ్ చేత ఒక వెర్షన్ రాయించారు సినిమాని నిర్మించిన రాంకుమార్ ప్రొడక్షన్స్ వాళ్ళు. ఆ వెర్షన్ వంశీకి నచ్చకపోవడంతో తనే మరో వెర్షన్ రాసుకున్నారు. ఇళయరాజా ట్యూన్స్ ఇచ్చిన తర్వాత, వాటికి అనుగుణంగా కథలో మార్పులు చేశారట. రెండుమూడు ఆంగ్ల సినిమాల స్పూర్తితో ఈ కథ రాసుకున్నారట వంశీ. అప్పట్లో సెన్సార్ బోర్డు 'ఏ' సర్టిఫికేట్ ఇచ్చింది ఈ సినిమాకి. ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా ఆసాంతమూ ఉత్కంఠభరితంగా అనిపించడం 'అన్వేషణ' ప్రత్యేకత.

ఆదివారం, నవంబర్ 21, 2010

ఖాకీ సుమన్

"సంకల్పం గొప్పది" అని మురారి సినిమాలో మహేష్ బాబు చేత ఓ డైలాగ్ చెప్పించాడు కృష్ణవంశీ. నిజమే.. సంకల్పం గొప్పది కాకపొతే తలచినంతనే సుమన్ బాబు ప్రత్యక్షం అవుతాడా? మొన్నామధ్యన కృష్ణాష్టమి నాడు కన్నయ్య కనిపించలేదనే ఆవేదనతో ఓ టపా రాశాను. 'ఎక్కడికి పోతాడు, వచ్చేస్తాడు లెమ్మని' మిత్రులు ఓదార్చారు. కొత్తపాళీ గారైతే తధాస్తు దేవతలు ఉంటారని ఊరడించారు. సంకల్ప బలమో, తధాస్తు దేవతల వరమో తెలీదు కానీ సుమన్ బాబు దర్శన భాగ్యం కలిగింది, ఇవాల్టి ఈనాడు ఆదివారం చివరి పేజిలో.

'నాన్ స్టాప్ కామెడీ' నాటికన్నా కొంచం చిక్కాడు బాబు. ఖాకీ యూనిఫాం వేసుకుని, గంభీరంగా చూడడానికి ప్రయత్నిస్తూనే అప్రయత్నంగా నవ్వు పుట్టించేశాడు. ఎక్కువగా వివరాలేమీ ఇవ్వలేదు. బాబు ఫోటో పెద్దది వెయ్యగా మిగిలిన చోటులో ఆయనకి కుడివైపున నమస్కరిస్తున్న రెండు చేతులు, వాటికింద 'అంకితం' అనీ, ఎడమ వైపున 'ప్రీమియర్ షో త్వరలో ఈటీవీలో...' అని మాత్రమే ఇచ్చారు. ఇక పేజి కింది భాగంలో ఎడమ వైపున దర్శకత్వం ఇంద్రనాగ్ అనీ, నిర్మాత సుమన్ ('బాబు' లేదు, అయినా ఈ విషయంలో ఎలాంటి ప్రకటనా లేదు కాబట్టి నేను సుమన్ బాబు అనే వ్యవహరిస్తున్నా) అనీ వేశారు.

కాస్త పరకాయించి చూస్తే బాబు ధరించింది పోలిస్ యూనిఫాం అని అర్ధమయ్యింది. ఎడమ భుజం మీద 'పోలిస్' లోగో కనబడింది. కుడి జేబు పైన సి. విజయ్ బాబు అన్న పేరు కనిపిస్తోంది. ఇంటి పేరునీ ('సి') బాబునీ మన బాబు వదులుకోక పోవడం తన అసలుపేరు పట్ల ఆయన మమకారాన్ని సూచిస్తోంది. తగు మాత్రంగా ఉన్న బొజ్జని బిగించి పెట్టిన బెల్టు మీద కూడా పోలిస్ లోగో ఉంది. రెండు భుజాలూ నక్షత్రాలు లేకుండా ఖాళీగా ఉన్నాయి కాబట్టి పోలిస్ డిపార్టుమెంటులో నీతినీ, న్యాయాన్నీ కాపాడే కానిస్టేబుల్ పాత్రని బాబు పోషించి ఉండొచ్చని ఊహిస్తున్నాను ప్రస్తుతానికి.


ఈ 'అంకితం' టెలిఫిల్మా లేక సినిమానా అన్న విషయం ఎప్పటిలాగే సస్పెన్స్ గా ఉంచారు సుమన్ బాబు. అలా అని చూస్తూ ఊరుకోలేం కదా. కుంచం కష్టపడి కాసిన్ని విశేషాలు తెలుసుకున్నాను. అందిన సమాచారం మేరకు ఈ 'అంకితం' ఒక టెలిఫిలిం. ఈటీవీలో త్వరలో ప్రసారం కాబోతోంది. థియేటర్ రిలీజ్ బహుశా ఉండకపోవచ్చు. 'నాన్ స్టాప్ కామెడీ' లో నెగిటివ్ ఛాయలున్న అన్నయ్య పాత్ర పోషించిన సుమన్ బాబు 'అంకితం' లో పూర్తి పాజిటివ్ పాత్రని పోషించారు. "కుటుంబ బంధాలకి విలువనిచ్చే" పాత్రలంటే తనకి ఇష్టమని అప్పుడెప్పుడో ఒక ఇంటర్యూ లో చెప్పిన విషయం మనందరికీ గుర్తుంది కదా. ఇది అలాంటి పాత్ర అయి ఉండొచ్చు.

ఇప్పటికే క్రియేటివ్ హెడ్ గా తనని తాను నిరూపించుకున్న ఇంద్రనాగ్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆయనకి కూడా కుటుంబ బంధాలంటే ఇష్టం కాబట్టి ఇలాంటి కథని ఎంచుకుని ఉండొచ్చు. విధి నిర్వహణలో సిన్సియర్ ఉద్యోగిగా పోలిస్ శాఖకీ, అన్నగా ఇంట్లో కుటుంబ సభ్యులకీ పూర్తిగా అంకితమైన విజయ్ బాబు పాత్రలో సుమన్ బాబు బహుశా పూర్తిగా ఒదిగిపోయి ఉండొచ్చు. పాత్రోచితమైన నటనని ప్రదర్శించడం కోసం కొత్త విగ్గుని వాడడం ఆహార్యం పట్ల బాబు శ్రద్ధకి నిదర్శనంగా అనిపిస్తోంది.

నిజం చెప్పాలంటే ఈ 'అంకితం' ప్రకటన నన్ను కొంచం నిరాశ పరిచింది. 'నాన్ స్టాప్ కామెడీ' తర్వాత సుమన్ బాబు ఓ భారీ జానపద చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించడంతో పాటు, అమ్మాయిల కలల రాకుమారుడిగా కథానాయక పాత్ర పోషిస్తారని ఎదురు చూస్తూ వచ్చాను. ఖర్చుకి వెనకాడకుండా సొంత స్టుడియోలో సెట్టింగులు వేయించి, నిర్మాణ విలువల విషయంలో అస్సలు రాజీ పడకుండా సినిమా తీయడం ఆయనకి పెద్ద పనేమీ కాదు. అయితే అస్సలు ఊహించని విధంగా ఫ్యామిలీ సెంటిమెంట్ వైపు మొగ్గు చూపారు. తర్వాత వచ్చేది జానపద చిత్రమే అవుతుందేమో.. ఎదురు చూద్దాం.

శనివారం, నవంబర్ 20, 2010

నూడుల్స్

నాకు ఉప్మా చేయడం వచ్చు. రెండు రకాల నూకలు, సేమియా, సగ్గుబియ్యం, అటుకులు.. ఇలా అన్నింటితోనూ రకరకాల ఉప్మాలు చేయగలను. (ఈ సందర్భంగా ఆంధ్రుల ఆహ్లాద రచయితకి కృతజ్ఞతలు చెప్పుకోవడం అవసరం.. తన ప్రతి నవలలోనూ ఉప్మా తప్పనిసరి కదా). అలాగే ఇనిస్టంట్ మిక్స్ తో పులిహోర కూడా చేయగలను. ఆఫ్కోర్స్, తినేవాళ్ళకి 'దంతసిరి' ఉండాలనుకోండి. ఈ వరుసలో నాకు వచ్చిన మరో వంటకం నూడుల్స్. ఇది మా ఇంట్లో నేను మాత్రమే తినే వంటకం. అందువల్ల దీనితో నేను చేసిన ప్రయోగాలకి లెక్కలేదు.

ఎన్ని రెస్టారెంట్లలో తిన్నా నూడుల్స్ రుచి ఒకేలా ఎందుకు ఉంటోందా? అని ఆలోచిస్తున్న సమయంలో చాన్నాళ్ళ క్రితం ఒక ఫ్రెండ్ ఇంట్లో నూడుల్స్ రుచి చూసే సందర్భం వచ్చింది. వీటిని ఇలా కూడా చేయొచ్చా? అనిపించి చేసినావిడ నుంచి తయారీ విధానం వివరంగా తెలుసుకున్నాను. ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఆవిడ చాలా సంతోషంగానూ మరియు వివరంగా నాక్కావలసిన సంగతులు చెప్పారు.

వాళ్ళింటి నుంచి వస్తూ వస్తూ షాపుకెళ్ళి మేగి పేకెట్లు తెచ్చుకున్నాని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. అప్పటికే నేను ఒకటి రెండు సార్లు స్వతంత్రించి చేసిన ప్రయోగాలు వికటించాయి. నీళ్ళు చాలక బాండీ మాడడం, నీళ్ళు ఎక్కువై నూడుల్స్ సూప్ గా అవతారం మార్చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ నేను అదరక, బెదరక, పట్టుదల విడవక వివరాలు తెలుసుకుని మరీ వచ్చాను కదా. ఆ ఉత్సాహంలో వంటకం మొదలు పెట్టేశా.

సదరు మిత్రురాలు చెప్పిన ప్రకారం, ముందుగా బాండీ వేడి చేసి ఓ రెండు చెంచాల నూనె పోయాలి. నూనె వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కేప్సికం తురుము, కేరట్ తురుము, కేబేజీ (ఇష్టమైతేనే), బీన్స్ (దొరికితేనే) వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కల్ని చివరికి ఉంచి, మిగిలినవన్నీ కొంచం వేగాక బాండీ లో వేయడం ఉత్తమం. నూడుల్స్ లో ఆనియన్ డీప్ ఫ్రై కాకపోతేనే టేస్ట్ బాగుంటుందన్న మాట. (టీవీ వంటల ప్రోగ్రాం భాష).


మన ఇష్టాన్ని బట్టి ఒకటో, రెండో పచ్చి మిర్చి కూడా సన్నగా తరిగి వేయాలి. పచ్చి బఠానీ వేసినట్టయితే వాటిని బాగా వేగనివ్వాలి. ఏమేం వెయ్యాలన్నది ముందుగానే నిర్ణయించుకుంటే, ఒక వరుసలో బాగా వేగాల్సిన వాటిని ముందుగానూ, తక్కువగా వేగాల్సిన ఉల్లి, టమాటా లాంటి వాటిని చివరిగానూ వేసుకోవచ్చు. ఇప్పుడింక కూరగాయ ముక్కలు ఫ్రై అయిపోయాక బాండీలో తగినన్ని నీళ్ళు పోయాలి. ఈ తగినన్ని దగ్గర చాలా సమస్య వస్తుంది. కూరగాయ ముక్కలు ప్లస్ నూడుల్స్ కలిసి ఉడకడానికి సరిపోయే నీళ్ళు పోయ్యాలన్న మాట.

వేసిన కూరగాయ ముక్కల పరిమాణాన్ని బట్టి (పరిమాణమా? పరిణామమా?? ...పరిమాణమే) తగినంత ఉప్పుని మరుగుతున్న నీటిలో వేయాలి. ఓ చిటికెడు సరిపోతుంది. నూడుల్స్ పేకట్ లో ఉండే చిన్న మసాల టేస్టర్ పేకట్ ని కత్తిరించి ఆ మసాలాని కూడా బాండీలోకి వొంపి గరిటతో కలపాలి. నూడుల్స్ అచ్చులని తగుమాత్రం చిన్న ముక్కలుగా విరిచి బాండీలో వేయాలి. సన్నని సెగమీద సరిగ్గా రెండు నిమిషాలు ఉడకనిస్తే చాలు ఘుమఘుమలాడే నూడుల్స్ రెడీ. ఇష్టమైతే గార్నిష్ చేసుకోవచ్చు(మళ్ళీ టీవీ భాష). టమాటా సాస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది.

నేను మేగి, టాప్ రోమన్ పేకట్లు మార్చి మార్చి వాడుతూ ఉంటాను. మేగి కన్నా టాప్ రోమన్ కి తక్కువ నీళ్ళు పడతాయన్నది నా అనుభవం. కొత్త కంపెనీ ఏది కనిపించినా ఓసారి ప్రయత్నిస్తా కానీ, నాకెందుకో ఈ రెండే బాగా నచ్చాయి. వండడానికీ, తినడానికీ కూడా. మసాలా టేస్టర్ ని అస్సలు వాడకుండా, నూడుల్స్ తో సేమియా ఉప్మా పద్ధతిలో చేసిన నూడుల్స్ వంటకాన్ని తినడం ఒకసారి సంభవించింది. అదో అనుభవం. ఎంత జాగ్రత్తగా చేసినా నూడుల్స్ ప్రతిసారీ రుచిగా రావు. అలాంటప్పుడు బాండీ సింకులో పడేసి, ఇంట్లో వాళ్ళతో పాటు ఇడ్లీ తినేయడమే..

గురువారం, నవంబర్ 18, 2010

వరమేనా?

భారీ నీటిపారుదల ప్రాజెక్టులకి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వేత్తలు ఆందోళనలు జరుపుతున్న నేపధ్యంలో, మన రాష్ట్రంలో దశాబ్దాల తరబడి పెండింగులో ఉన్న పోలవరం భారీ నీటిపారుదల ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయాలని అధికార పార్టీలో ఒక వర్గం నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తున్న రాజకీయ నాయకులూ ఉన్నారు కానీ, ఆ వ్యతిరేకత కేవలం రాజకీయ కారణాల వల్ల.

గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు నిర్మించాలన్న ప్రతిపాదన ఈనాటిది కాదు. స్వాతంత్రానికి  పూర్వం నుంచీ ప్రయత్నాలు మొదలైనా అనేకానేక కారణాల వల్ల ఎప్పటికప్పుడు నిర్మాణం వాయిదా పడుతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే అట్టహాసంగా మొదలు పెట్టిన 'జలయజ్ఞం' లో పదహారు వేల కోట్ల రూపాయలు ఖర్చు కాగల ఈ పెండింగు ప్రాజెక్టుని ప్రధానంగా చేర్చారు.

అంతేకాదు, పోలవరం ద్వారా గోదావరి డెల్టాకి నీరందుతుందన్ననమ్మకంతో, ఎగువన గోదావరి నదిపై ఏడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే, తెలంగాణా ప్రాంతంలో బీడు భూములకి నీరంది అవి వ్యవసాయ యోగ్యం అవుతాయి. అయితే, గోదారి దిగువ ప్రాంతానికి ప్రవహించే నీటిని ఎగువ భాగంలోనే లిఫ్ట్ ద్వారా తోడేయడం వల్ల దిగువ ప్రాంతంలో నీటి కటకట ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. ఈ కారణం చేత పోలవరాన్ని త్వరగా పూర్తి చేయాలని ఈ ప్రాజెక్టుని సమర్ధిస్తున్న నాయకులు అంటున్నారు.

ప్రాజెక్టు పూర్తయితే పెరగబోయే సాగు భూమి విస్తీర్ణం, విద్యుత్ ఉత్పత్తి, ఆంధ్ర తో పాటు తెలంగాణా, రాయలసీమ ప్రాంతాలకీ నీరందించే వీలుండడం వల్ల రానున్న కాలంలో మారబోయే రాష్ట్ర ఆర్ధిక ముఖచిత్రం లాంటి అంశాలని ఆకర్షణీయంగా చెబుతున్న ఈ నాయకులు, పర్యావరణ అంశాలని తేలిగ్గా తీసుకుంటున్నారు. "ఒకటి కావాలంటే మరొకటి కోల్పోవాలి" అన్న ధోరణి వీరి వ్యాఖ్యల్లో వినిపిస్తోంది.


ప్రాజెక్టు నిర్మించాక ఏదైనా జల విపత్తు జరిగితే కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రధాన నగరాలు ఆనవాలు లేకుండా పోయే ప్రమాదం ఉందనే కారణంతో కొందరూ, ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులయ్యే వారి హక్కులని కాపాడడం కోసం మరికొందరూ ఈ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తున్నారు. వీరి వ్యతిరేకతలో ప్రధానంగా రాజకీయ కారణాలే వినిపిస్తున్నాయి తప్ప, పర్యావరణాన్ని గురించి మచ్చుకైనా వీరూ మాట్లాడడం లేదు.

రాజశేఖరరెడ్డి మరణం తర్వాత దాదాపుగా ఆగిపోయిన అనేక ప్రాజెక్టుల్లో పోలవరం ఒకటి. ఇన్నాళ్ళూ మౌనం వహించిన నేతలందరూ ఉన్నట్టుండి ఇప్పుడీ ప్రాజెక్టుని గురించి మాట్లాడడం రాష్ట్ర రాజకీయాలని పరిశీలిస్తున్న వారికి బొత్తిగా అంతుపట్టని విషయమేమీ కాదు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడంతో ఈ ప్రాజెక్టుకి జాతీయ హోదా తీసుకొచ్చి, తద్వారా కేంద్ర నిధులతో పనులు పూర్తి చేసేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు తవ్విన కాలువలు పూడిపోక ముందే ప్రాజెక్టు పనులు మొదలవుతాయా? అన్నది అంతు చిక్కని ప్రశ్నలాగే ఉంది.

రాజకీయాలని పక్కన పెడితే, పర్యావరణవేత్తలెవరూ భారీ ప్రాజెక్టులని సమర్ధించడం లేదు. జీవ వైవిధ్యం దెబ్బ తినడం, సమతుల్యత లోపించడం లాంటి అనేక కారణాలు ఉన్నాయి. భారీ ప్రాజెక్టుల కారణంగా కొన్ని అడవులు, జీవజాతులు అంతరించిపోయే ప్రమాదమూ ఉందంటున్నారు వాళ్ళు. ( పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అంతరించిపోయే మొదటి జీవి ఆంధ్రులకి అత్యంత ప్రియమైన పులసచేప). ప్రాజెక్టులు-పర్యావరణానికి సంబంధించిన అనేక కీలక అంశాలు సామాన్యులకి అర్ధమయ్యే భాషలో వివరంగా రాశారు రచయిత్రి చంద్రలత తన నవల 'దృశ్యాదృశ్యం' లో.

పర్యావరణాన్నిసైతం పక్కన పెట్టి ప్రాజెక్టుని స్వాగతిద్దామంటే వెంటాడుతున్న మరో భయం పనుల నాణ్యత. గడిచిన కొన్నేళ్లుగా ఓ పక్క పనులు జరుగుతుండగానే మరోపక్క నుంచి అప్పటివరకూ జరిపిన నిర్మాణాలు వరదల్లో కొట్టుకోపోడాన్నిటీవీల్లో చూశాక, ఈ ప్రాజెక్టులో నాణ్యతా ప్రమాణాలు ఎంతవరకూ పాటించగలరు? అన్నసందేహం కలగక మానదు. గడిచిన ఆరున్నర దశాబ్దాలలో ఎన్నోమార్లు వాయిదా పడ్డ పోలవరం నిర్మాణం ఈసారి ఏమవుతుందో వేచి చూడాలి.

బుధవారం, నవంబర్ 17, 2010

గాళిదేవరు

యాజమాన్యాలు పనివాళ్ళని కష్టపెట్టడం అన్నది సహజ పరిణామంగా తీసుకుంటాం మనం. కానీ, పనివాళ్ళు తమ కొద్దిపాటి తెలివితేటలని, సమయస్పూర్తిని, యజమాని బలహీనతలనీ ఉపయోగించుకుని అతన్ని దేశం విడిచిపెట్టి పోయేలా చేయడం అన్నది వినడానికి కథలా అనిపిస్తుంది. సి. రామచంద్రరావు రాసిన 'గాళిదేవరు' కథ ఇతివృత్తం ఇదే.

కూర్గు కాఫీ తోటల పరిమళాలని, అక్కడి వాతావరణాన్ని, కాఫీ తోటల్లో పనివాళ్ళ జీవితాలనీ, యజమాని-పనివాళ్ళ మధ్య సంబంధాలనీ కళ్ళకు కట్టినట్టు వర్ణించే ఈ కథని చదవడం పూర్తిచేయగానే పఠితలు ఓ చిత్రమైన అనుభూతికి లోనవుతారు. మంగుళూరు రోడ్డులోని పోలిబేటా కాఫీ ఎస్టేటు మేనేజరు సోమయ్య. మేంగిల్స్ బ్రదర్స్ సంస్థ ఆ ఎస్టేటుకి ఒకప్పటి యజమాని. కాఫీ పంటలో లాభాలు బాగా రావడంతో పనివాళ్ళ ఇళ్ళని నివాస యోగ్యంగా మార్చాలనీ, బాత్రూములు ఏర్పాటు చేయించాలనీ తలపెడతాడు సోమయ్య.

పోలిబేటా యాజమాన్యం ఇందుకు అంగీకరించడంతో కిల్లిక్ సన్ అండ్ కంపెనీకి ఆ కాంట్రాక్టు ఇవ్వాలనుకుంటాడు. బాత్రూం ఫిట్టింగ్స్ తయారీలో పేరుపొందిన ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఏంథోనీ చిన్నప్ప యువకుడు, ఉత్సాహవంతుడు. పోలిబేటా పేరు వినగానే "గాళిదేవరు వెలిసింది మీ ఎస్టేట్ లోనే కదూ?" అని అడుగుతాడు సోమయ్యని. అంతేకాదు, 'గాళిదేవరు' ని చూడడానికి తన ఉద్యోగులని వెంట పెట్టుకుని ఎస్టేట్ కి బయలుదేరతాడు కూడా.

ఎస్టేట్ లో ముసలి కార్మికుడు మాంకూ, గాళిదేవరు గుడి బాధ్యతలు చూస్తూ ఉంటాడు. ఏటా జరిగే జాతరలో మాంకూదే హడావిడి అంతా. అప్పుడే కురిసిన వర్షానికి బురదగా ఉన్న బాట వెంట చాలాదూరం నడిచి గుడికి చేరుకుంటారు సోమయ్య, చిన్నప్ప, అతని బృందం. అతి చిన్నగా ఉన్న ఆ గుడినీ, ఆకృతి లేకుండా ఉన్న విగ్రహాన్నీ చూసి చిన్నప్ప మినహా అతని బృందమంతా నిరాశ పడతారు. గుడిని చూడడం అయ్యాక, మేంగిల్స్ దొర కట్టిన బంగాళా చూడాలంటాడు చిన్నప్ప. అతని ఉత్సాహం చూసి మేంగిల్స్ కథని వివరంగా చెబుతాడు మాంకూ.మేంగిల్స్ బ్రదర్స్ సంస్థ ఎస్టేట్ కొన్న కొత్తలో వర్షాభావం వల్ల కాఫీ పంట దిగుబడి ఉండదు. మేంగిల్స్ దొర తన కుటుంబాన్ని తన దేశంలోనే వదిలి, తానొక్కడే ఎస్టేట్లో ఉంటూ పనులు చేయిస్తాడు. ఆ సంవత్సరం లాభాలు బాగా రావడంతో, ఎస్టేట్లోనే సకల సౌకర్యాలతో బంగళా కట్టించి తన కుటుంబాన్ని అక్కడికి తీసుకురావాలని అనుకుంటాడు మేంగిల్స్. బంగళా నిర్మాణం దాదాపు పూర్తవుతుంది. వంట ఇంటి నుంచి వచ్చే నీరు గాళిదేవరు విగ్రహం పక్కగా ప్రవహిస్తుంది కాబట్టి వంటిల్లు మరో చోటికి మార్చమని అడుగుతారు పనివాళ్ళు. గాళిదేవరు పట్ల ఎలాంటి నమ్మకం లేని మేంగిల్స్ ఇందుకు ససేమిరా అంటాడు.

అక్కడినుంచీ మేంగిల్స్ కష్టాలు మొదలవుతాయి. తాగేతాగే విస్కీ గ్లాసు మాయమవడం, భోజనం పళ్ళెంలో ఉన్నట్టుండి రాళ్ళు ప్రత్యక్షం కావడం.. ఇలా జరిగే విచిత్రాలన్నింటికీ కారణం గాళిదేవరుకి కోపం రావడమే అంటారు పనివాళ్ళు. ప్రమాదంలో తన చేయి విరగడం, తాళం వేసిన గ్యారేజీ నుంచి అర్ధ రాత్రివేళ కారు స్టార్టు చేసిన చప్పుడూ హారనూ వినిపించడం వంటి మరికొన్ని సంఘటనలు జరిగాక గాళిదేవరు మీద భయం మొదలవుతుంది మేంగిల్స్ కి.

అయినకాడికి ఎస్టేట్ అమ్ముకుని తనదేశం వెళ్ళిపోడానికి సిద్ధపడతాడు. అభిరుచితో కట్టించుకున్న ఇంటిని అలాగే వదిలి వెళ్ళడానికి మనసొప్పక శానిటరీ ఫిట్టింగ్స్ అన్నీ తనతో తీసుకుని వెళ్ళాలనుకుంటాడు. గాళిదేవరు తన మహిమలు చూపడంతో, ఆ ప్రయత్నం విరమించుకుని, ఆ ఫిట్టింగ్స్ అన్నీ నీళ్ళలో పారేయాల్సిందిగా తన బట్లర్ని ఆదేశిస్తాడు. గాళిదేవరుకి గుడి కట్టడానికి మాంకూకి డబ్బిచ్చి తన దేశానికి బయలుదేరతాడు దొర.

గాళిదేవరు మహిమల వెనుక మాంకూ పాత్ర ఎంత? బెంగుళూరులో వ్యాపారం చేసుకుంటున్నఏంథోనీ చిన్నప్పకి గాళిదేవరు గురించి ఎలా తెలిసింది? అప్పటివరకూ గాళిదేవరు తమ ఎస్టేట్ లో వెలిసినందుకు గర్వపడుతున్న సోమయ్య అసలు కథ తెలిశాక ఎలా స్పందించాడు? తదితర విషయాలన్నీ కథ చదివి తెలుసుకుంటేనే బాగుంటుంది.

నాటి, నేటి రచయితలూ, రచయిత్రుల డెబ్భై ఎనిమిది కథలతో తిరుపతికి చెందిన అధ్యాపకుడు సాకం నాగరాజు ప్రచురించిన 'తెలుగు కథకి జేజే!' సంకలనంలో ఉందీ కథ. ఇదొక్కటే కాదు సంకలనం లో ఉన్న చాలా కథలు మళ్ళీ మళ్ళీ చదివించేవే. ఆరువందల రెండు పేజీల ఈ అందమైన సంకలనం వెల మూడు వందల రూపాయలు. ఈ సంకలనాన్ని నాకు కానుకగా ఇచ్చిన ఫ్రెండ్ ని, ఆ సందర్భాన్నీ మరోమారు ఆప్యాయంగా గుర్తు చేసుకుంటూ...

బుధవారం, నవంబర్ 10, 2010

చిల్లరకొట్టు-సూపర్ బజారు

ఇప్పుడంటే 'షాపింగ్' అని ఒకింత స్టైలుగా చెప్పి బజారుకి బయలుదేరుతున్నాం కానీ, చిన్నప్పుడు ఇంట్లోకి ఏం కావాలన్నా చిల్లర కొట్టుకి పరిగెత్తే వాళ్ళం, కూసింత గర్వంగా. రెండు కొట్లు ఇంచుమించు ఎదురెదురుగా ఉండేవి. ఒకటి కొంచం పెద్దది. జనం ఎక్కువగా ఉంటారు. రెండోది మా సుబ్బమ్మ గారిది. చిన్న కొట్టే అయినా దొరకని వస్తువు దాదాపు ఉండదు. నా మొగ్గెప్పుడూ సుబ్బమ్మగారి కొట్టు వైపే ఉండేది. ఒకే ఒక్క సిగరెట్ కొన్నా (నాక్కాదు, నాన్నకి) నాలుగు బఠాణీలో చిన్న బెల్లంముక్కో 'కొసరు' ఇచ్చేవాళ్ళు. (ఇది మాత్రం అచ్చంగా నాకే, ఎవరికీ వాటా లేదు).

ఇంట్లో ఉన్నంతసేపూ కొట్టుమీదకి వెళ్ళే అవకాశం ఎప్పుడెప్పుడొస్తుందా అని ఆశగా ఎదురు చూసేవాణ్ణి. చిన్న వస్తువు కొనుక్కు రాడానికైనా, కొట్టు దగ్గర మనకి నచ్చినంత సేపు కూర్చోవచ్చు. నలుగురూ చేరతారు కాబట్టి ఊళ్ళో కబుర్లు వినొచ్చు. వస్తూ వస్తూ కొసరు చప్పరించొచ్చు. పైగా, కొట్టు దగ్గర ఉన్నంతసేపూ చదువు బాధ ఉండనే ఉండదు. కానీ ఏం లాభం, తరచుగా కొట్టుమీదకి వెళ్ళే అవకాశం ఉండేది కాదు. ఒకటో తారీఖునో, రెండో తారీఖునో నెల సరుకులన్నీ పొరుగూరి నుంచి బండి మీద వచ్చేసేవి.


అమ్మ రెండు రోజులు శ్రద్ధగా కూర్చుని చీటీ రాసినా, తప్పకుండా కొన్నయినా మర్చిపోతూ ఉండేది. వాటిని తేడానికీ, ఇంకా నాన్నకి సిగరెట్లు, అగ్గిపెట్టెలు తేడానికీ నా కొట్టు యాత్ర సాగుతూ ఉండేది. శ్రీరమణ కథ 'ధనలక్ష్మి' లో కథానాయిక ధనలక్ష్మి కిరాణా వ్యాపారం చేయడంలో సూక్ష్మాలని తన భర్త రామాంజనేయులుకి చెబుతూ అంటుంది కదా "మనం చిన్న వాళ్ళం. సెంటర్ లో పెద్ద షాపుల వాళ్ళతో పోటీ పడాలంటే ఒకటే చిట్కా. మన దగ్గర సమస్తం దొరుకుతాయని పేరు పడాల. పేరొస్తే బేరాలు వాటంతటవే వస్తాయ్.." ఏ ధనలక్ష్మీ వ్యాపార సూత్రం చెప్పకపోయినా మా ఊరి చిల్లరకొట్ల వారు ఈ ఫార్ములాని అమలు చేసేయడంవల్ల దొరకని వస్తువంటూ ఉండేది కాదు.

నగరజీవితంలో మొదట కిరాణా షాపులనీ, మినీ-సూపర్ బజార్లనీ ఆ తర్వాత్తర్వాత బడా సూపర్ బజార్లనీ చూశాన్నేను. చెప్పకపోవడం ఎందుకు, సూపర్ బజార్లో షాపింగ్ అంటే భలే ఇష్టం నాకు. షాపుల్లో పుస్తకాల షాపు తర్వాత నాకు నచ్చే రెండో షాపు సూపర్ బజారే. ఎన్నెన్ని వస్తువులు... ఎంత చక్కని అమరిక.. ఎన్ని రకాల పరిమళాలు. క్రమం తప్పకుండా పుస్తకాల షాపుకి వెళ్తే కొత్త పుస్తకాల గురించి తెలిసినట్టే, రెగ్యులర్గా సూపర్ బజారుకి వెళ్తే కొత్త వస్తువులు ఏం వచ్చాయో తెలిసిపోతుంది కదా. సూదిపిన్ను మొదలు సూపర్రిన్ వరకూ (అబ్బే, ప్రాస కోసం) దొరకని వస్తువంటూ ఉంటుందా? గేటు దాటి లోపలి వెళ్తే అదో కొత్త ప్రపంచం.


రెండుమూడేళ్ళ క్రితం, అప్పటివరకూ నేను రెగ్యులర్గా వెళ్ళిన ఒకానొక సూపర్ మార్కెట్ ఉన్నట్టుండి మూత పడింది. కారణం ఆర్ధిక మాంద్యం అని వినికిడి. ఆ షాపు నాకెంతగా పరిచయం అంటే.. ఏ వస్తువు ఏ రాక్ లో దొరుకుతుందో సేల్స్ వాళ్ళకన్నా నాకే బాగా తెలిసేది. కనిపించిన వాళ్ళందరికీ ఫలానా సూపర్ మార్కెట్లో సరుకులు కొనుక్కోమని చెప్పాను కూడా, అక్కడికి నేనేదో వాళ్ళకి మార్కెటింగ్ చేస్తున్నట్టు. నవ్విన వాళ్ళు నవ్వారు. నవ్విన నాపచేను పండలేదు కానీ, కొన్నాళ్ళకి ఆ సూపర్ మార్కెట్ మూతపడింది. అక్కడ ఆఖరి షాపింగ్ చేసిన రోజు నాకింకా బాగా జ్ఞాపకం. ఇప్పటికీ అక్కడ కొన్న కొన్ని వస్తువులు చూసినప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఆతర్వాత ఏ షాపుతోనూ అంతగా అనుబంధం బలపడలేదు.

సూపర్ బజార్ల వాళ్ళు రకరకాల స్కీములు పెడుతూ ఉంటారు. మిగిలిన షాపులకన్నా తమ దగ్గర ధరలు తక్కువ అని భ్రమ పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆవుని అమ్మడానికి వెళ్ళిన వాళ్ళ చేత గేదెను కొనిపించేందుకు ఏం చేయాలో అన్నీ చేయగలరు వాళ్ళు. మనమేమో అన్నీ కాకపోయినా కొన్ని తెలిసినా, అస్సలు ఏమీ తెలియనట్టు వాళ్ళు చెప్పేవి వింటూ నమ్మినట్టు నటిస్తూ ఉండాలి. తగుమాత్రం జాగ్రత్తలో ఉండకపోతే క్రెడిట్ కార్డు తాలూకూ లిమిట్ కూడా దాటిపోయే ప్రమాదం ఉంది. ఈమధ్య ఒక సూపర్ బజారుకి వెళ్ళినప్పుడు బిల్లుతో పాటు ఒక కార్డు కూడా ఇచ్చాడు కౌంటర్ అబ్బాయి. అక్కడ కొన్నప్పుడల్లా ఆ కార్డు చూపిస్తే భవిష్యత్తులో డిస్కౌంట్లు వస్తాయిట. కార్డు ఉచితమేనట.. నాకు మా సుబ్బమ్మగారు గుర్తొచ్చారు.