బుధవారం, జూన్ 28, 2017

గిరిజా కళ్యాణం

యద్దనపూడి సులోచనారాణి నవలలు డిస్ప్లే లో కనిపిస్తూ ఉంటే కనీసం ఒకటైనా తీసుకోకుండా ఉండడం కష్టం. ఇంటికి తెచ్చాక చదవకుండా ఉండడం అంతకన్నా కష్టం. చదువుతున్నంతసేపూ అప్పుడే మొదటిసారి చదువుతున్న అనుభూతి కలగడంతో పాటు, నిజంగా తొలిసారి చదివిన టీనేజీ రోజుల్ని గుర్తు చేసుకోవడం మాత్రం బోల్డంత ఇష్టం. ఈ జాబితాలో తాజా నవల 'గిరిజా కళ్యాణం.' బోల్డన్ని సినిమాలుగానూ, 'రాధ-మధు' లాంటి పాపులర్ టీవీ సీరియల్ గానూ బాగా తెలిసిన కథే అయినా, ఆసాంతమూ ఆపకుండా చదివించింది మాత్రం యద్దనపూడి మేజిక్ అనడానికి అస్సలు సందేహం లేదు.

కథ కన్నా కథనాన్నీ, పాత్రల వ్యక్తిత్వాలనీ నమ్మి నవలలు రాసే నవలాదేశపు రాణి తన బాణీకి కొనసాగింపుగా రాసిన నవల 'గిరిజా కళ్యాణం'. టైటిల్ లోనే చెప్పేసినట్టుగా ఇది గిరిజ అనే అమ్మాయి పెళ్లి కథ. ఈ గిరిజ 'సెక్రటరీ' లో జయంతి, 'జీవనతరంగాలు' లో రోజా లాగ పేదింటి పిల్ల. వాళ్లలాగే చదువుకున్నది, ఆత్మాభిమానం మెండుగా ఉన్నదీను. వ్యతిరేక పరిస్థితులు ఎదురయినప్పుడు తల ఒగ్గ కూడదనీ, ఎదురు నిలిచి పోరాడాలనీ బలంగా నమ్మే గిరిజ, ఆ నమ్మకంతోనే తమ్ముడి ప్రాణాలని కాపాడుకుంది. తల్లీ, తండ్రీ చనిపోతే, తమ్ముడి మీదే ఆశలు పెట్టుకుని జీవిస్తున్న గిరిజకి ఆ తమ్ముడు హార్ట్ పేషేంట్ అని తెలిసినప్పుడు కలిగిన షాక్ తక్కువది కాదు. ఆపరేషన్ నిమిత్తం విరాళాలు అభ్యర్థిస్తూ పేపర్లో ప్రకటన ఇస్తుంది.

తల్లీ తండ్రీ లేని గొప్పింటి కుర్రాడు చందూ. పూర్తి పేరు చంద్రశేఖర్ అయినా, ఫ్రెండ్స్ అందరూ 'చెందూ' అనే పిలుస్తారు. ఇంట్లో తాతయ్య రాజగోపాలరావు, బయటికి వెళ్తే బోల్డంత మంది ఫ్రెండ్స్.. ఇదే చందూ ప్రపంచం. ఏటా తన తల్లి జయంతి రోజున ఒక మంచి పని చేయడం చందూకి చిన్నప్పుడే తాతయ్య చేసిన అలవాటు. ఇరవై ఎనిమిదో పుట్టినరోజు ఉదయాన్నే పేపరు తిరగేస్తున్న చందూకి గిరిజ ఇచ్చిన ప్రకటన కనిపిస్తుంది. ఆపరేషన్ కి అవసరమయ్యే మొత్తం డబ్బుని నమ్మకస్తుడైన పని వాడి చేత గిరిజకి పోస్ట్ చేయిస్తాడు చందూ. అంతే కాదు, ఫ్రమ్ అడ్రెస్ ఆమెకి తెలియకుండా జాగ్రత్త పడతాడు, థాంక్స్ అందుకోడం 'బోర్' అతనికి. అదొక్కటే కాదు, పెళ్లి చేసుకోడం, సంసార జీవితం ఇవన్నీ కూడా 'బోర్' అనే అంటాడు చందూ.


బోల్డంత ఆస్థి, ఎదిగొచ్చిన మనవడూ ఉన్నా రాజగోపాలరావు గారికి రోజులు భారంగా గడుస్తున్నాయి. చందూ పెళ్లి చేయడం ఎలా అన్నది ఆయన సమస్య. చందూ పెళ్ళికి ససేమిరా అంటున్నాడు. ఫ్రెండ్స్ వల్లే చందూ అలా తయారయ్యాడని ఆయన ఫిర్యాదు, అలాగని మనవడిని చిన్న మాట కూడా అనలేనంత ప్రేమ. సరిగ్గా ఇదే సమయంలో కొన్ని నాటకీయ పరిణామాల మధ్య రాజగోపాలరావు, గిరిజ ఎదురు పడతారు. మరికొన్ని పరిణామాల అనంతరం, ఆపరేషన్ పూర్తయిన తమ్ముడితో సహా రాజగోపాలరావు రాజ ప్రాసాదానికి చేరుతుంది గిరిజ. ఇంకొన్ని పరిణామాల తర్వాత చందూకి గిరిజకి పెళ్లవుతుంది. "తాతయ్య బాధ చూడలేక తాళికట్టాను తప్ప, కాపురం చేసే ఉద్దేశ్యం ఏమాత్రం లేదు" అని మొదటి రాత్రే గిరిజకి తేల్చి చెప్పేసి ఫ్రెండ్స్ తో బెంగుళూరు ట్రిప్ కి వెళ్ళిపోతాడు చందూ.

గిరిజ ఆత్మాభిమానానికి, పట్టుదలకి అసలైన పరీక్ష ఇప్పుడు ఎదురవుతుంది. చందూ అంత అవమానం చేశాక ఇంకా ఆ ఇంట్లో ఉండడానికి ఆమె అంతరాత్మ ఒప్పుకోదు. ఆమె తప్ప చందూని బాగు చెయ్యడం ఇంకెవరి వల్లా కాదని తేల్చి చెప్పేస్తారు అనారోగ్యవంతుడైన రాజగోపాలరావు. అంతే కాదు, గిరిజ చందూని చక్కదిద్దితే, గిరిజ తమ్ముడి భవిష్యత్తుని తాను తీర్చిదిద్దుతానని మాటిచ్చేస్తారు కూడా. ఇప్పుడు గిరిజ తమ్ముడి కోసం, ఆ పెద్దాయన కోసం ఆ ఇంట్లో ఉండాలా? లేక "నేను ఛీత్కరిస్తున్నా, కేవలం ఆస్థి కోసమే తాతయ్యని మంచి చేసుకుని ఇంట్లో ఉన్నావు" అని నిత్యం సాధిస్తున్న చందూకి ఎదురు తిరిగి పెళ్లి నుంచి బయటికి వెళ్లిపోవాలా? ఈ విషమ పరిస్థితుల్లో రాజగోపాలరావు మరణించడంతో గిరిజ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది.

ఇంతకీ, చందూకి పెళ్లి మీద అంతటి విముఖత ఎందుకు? రాజగోపాలరావు గారికి గిరిజ అంతగా నచ్చడానికి కారణాలేమిటి? గిరిజ-చందూల పోరులో గెలుపెవరిది? ఇవన్నీ తెలుసుకోవాలంటే 'గిరిజా కళ్యాణం' చదవాల్సిందే. కథని నాటకీయమైన మలుపులు తిప్పడంలో సులోచనారాణి ప్రతిభ పతాక స్థాయిలో కనిపిస్తుందీ నవలలో. అలాగే 'నాటకీయత' మోతాదు మీద ఆమెకున్న పట్టు మరోసారి ఆశ్చర్య పరుస్తుంది పాఠకులని. ఎమెస్కో తాజా ప్రచురణ మార్కెట్లో ఉంది. పేజీలు 280, వెల రూ. 90. (సులోచనారాణి సమగ్ర సాహిత్యం తీసుకురావాలన్న ఆలోచన ఏ ప్రచురణకర్తా చేయడం లేదెందుకన్న ఆలోచన వచ్చింది ఈ నవల చదువుతూండగా).

మంగళవారం, జూన్ 27, 2017

'ఇది నా జీవితం'

హేమలత లవణం అంతిమయాత్రలో పాల్గొన్న వందలాది మందిలో నేనూ ఒకణ్ణి. అంతకు ముందెన్నడూ ఆమెని కలవలేదు. ఎన్నో ఏళ్లుగా వినడం తప్ప, కలిసి మాట్లాడడం వీలవ్వలేదు ఎందుకో. సుప్రసిద్ధ కవి గుఱ్ఱం జాషువా కుమార్తె అనీ, సంఘసేవకుడు గోపరాజు రామచంద్రరావు (గోరా) కోడలనీ, లవణానికి జీవన సహచరి అనీ తెలుసు. స్టూవర్టుపురంలో దొంగతనాలు వృత్తిగా జీవించిన కుటుంబాలని మంచి మార్గంలో పెట్టిన ఘనత హేమలతదే అనీ, ఆదిలాబాద్ జిల్లాలో జోగినులకి పునరావాసం ఆమె చలవేననీ తెలుసు. ఇంతకుమించి ఆమెని గురించి పెద్దగా వివరాలు తెలియవు.

హేమలత అంతిమయాత్రలో పాల్గొన్న వారి భావోద్వేగాలు చూసిన తర్వాత, మొదటిసారిగా ఆమెని గురించి తెలుసుకోవాలి అనిపించింది. 'ఇది నా జీవితం' పేరుతో ఆమె రాసుకున్న ఆత్మకథకి ఉపశీర్షిక 'మృత్యోర్మా అమృతంగమయ' కావడం కేవలం యాదృచ్చికమేనా? పుస్తకం చదువుతున్నంత సేపూ, చదివిన తర్వాతా కూడా ఈ ప్రశ్న నన్ను వెంటాడుతూనే ఉంది. గుర్రం జాషువా పేరున్న కవి, పైగా స్కూల్ మాస్టర్ ఉద్యోగంలో ఉన్నా హేమలత బాల్యం పేదరికంలోనే గడిచింది. గుంటూరు లోనూ, మద్రాసులోనూ చదువు అనంతరం లవణంతో వివాహం. అటుపై సంఘసేవా కార్యక్రమాలతో పరిచయం ఏర్పడడం, అవే జీవితం కావడం.. క్లుప్తంగా చెప్పాలంటే ఇదే ఆమె జీవితం.

కానీ, జీవితంలో ఎదురైన ఎత్తుపల్లాలు, ఆటుపోట్లు, వాటిని ఎదుర్కొని నిలబడ్డ తీరు, అన్నిటినీ మించి పెద్ద సంఖ్యలో అభిమానించే మనుషుల్ని సంపాదించుకోవడం, వాళ్ళచేత 'అమ్మా' అని పిలిపించుకోవడం.. వీటన్నింటినీ చెబుతుందీ పుస్తకం. గోరా కోడలు కావడం తన జీవితంలో జరిగిన గొప్ప విషయం అంటారు హేమలత. అప్పటివరకు ఇంటి బాధ్యతలు, చదువుకి మాత్రమే పరిమితమైన ఆమె బయటి ప్రపంచాన్ని చూసింది లవణంతో కలిసి చేసిన యాత్రల్లోనే. అయితే, అతి తక్కువ కాలంలోనే సంఘసేవికగా మారిపోగలగడం వెనుక ఆమెకి ఉన్న దయా గుణం, స్పందించే హృదయం గట్టి కారణాలు అయి ఉండాలి.


నిజానికి చిన్న పుస్తకాన్ని మూడు భాగాలుగా చూడాలి. మొదటి భాగం హేమలత బాల్యం. చిన్నతనపు రోజుల్ని ఒకలాంటి పరవశంతో చెప్పారామె. కవితాత్మక ధోరణిలో సాగే వాక్యాల వెనుక చుట్టూ ఉన్న ప్రకృతిని అబ్బురంగా చూస్తున్న ఓ చిన్న పాప కనిపిస్తుంది పాఠకులకి. గృహస్థుగా జాషువాకవి పరిచయమయ్యేది కూడా ఇక్కడే. తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు, ఆటపాటలు, వాటితో పాటే చదువు.. వీటన్నింటి కబుర్లతో సాగుతూ వివాహం నిశ్చయం అవ్వడం వరకూ ఒక ధోరణిలో సాగుతుంది కథనం. అక్కడి నుంచీ అంతకు ముందు కనిపించని గాంభీర్యాన్ని గమనించవచ్చు.

ఏమాత్రం పరిచయం లేని వాతావరణంలో ఇమడడం, నేరస్తుల్లో మార్పు తెచ్చే కార్యక్రమాల నిమిత్తం లవణంతో కలిసి ఉత్తరభారతదేశ సంచారం, ఈ క్రమంలో పరిచయమయ్యే మనుషులు, జీవితాన్ని పునర్నిర్వచించుకునే పరిస్థితులు, చెప్పీ చెప్పకుండా వదిలేసిన కొన్ని సంఘటనలు, మలుపులు.. ఇవన్నీ రెండో భాగం అనుకుంటే, స్వతంత్రంగా సేవాకార్యక్రమాల్లో పాల్గొనడం ఆరంభించి స్టువర్ట్ పురం, ఆదిలాబాద్ లలో చేసిన కార్యక్రమాల వివరాలు చివరి భాగం. అయితే ఈ చివరి భాగం కేవలం ఒక రోజువారీ దినచర్య తాలూకు డాక్యుమెంట్ లాగా తయారవడం కించిత్ బాధ కలిగించిన విషయం. స్పష్టంగా చెప్పాలంటే ఇది ఒక కార్యక్రమ వివరాల పట్టికలాగా ఉంది తప్ప 'ఆత్మ' కనిపించలేదు.

మొత్తం మీద చూసినప్పుడు హేమలతది ప్రత్యేకమైన వ్యక్తిత్వం, జీవితం కూడా. స్టువర్ట్ పురం నుంచీ, ఆదిలాబాద్ నుంచీ ఆమె అంతిమయాత్రకు విజయవాడకి తరలి వచ్చిన వారిలో కొందరు ఊహ తెలిశాక ఆరోజే మొదటిసారి కన్నీరు పెట్టామని చెప్పారు. వాళ్లంతా ఆమెని మాతృస్థానంలో గౌరవించిన వాళ్ళే. ఆమెకూడా వాళ్లందరినీ తన జీవితంలో ముఖ్యమైన భాగంగానే భావించారు.. కానీ, వాళ్ళతో అనుబంధాన్ని గురించి మరికొంచం వివరంగా రాసి ఉంటే ఆత్మకథ కి నిండుదనం వచ్చి ఉండేది అనిపించింది పుస్తకం చదవడం పూర్తి చేశాక. (ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రచురణ, పేజీలు 246, వెల రూ. 140, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

మంగళవారం, జూన్ 13, 2017

అమీ తుమీ

బాగా హిట్టైన సినిమాని ప్రేక్షకులు చాలా రోజులపాటు గుర్తుపెట్టుకుంటారు - సినిమాని మాత్రమే కాదు, సినిమాకి పని చేసిన వాళ్ళని కూడా. తొమ్మిదేళ్ల క్రితం విడుదలైన 'అష్టా చమ్మా' ప్రేక్షకుల అభిమానంతో పాటు, అవార్డులనీ గెలుచుకుంది. ఆ సినిమా దర్శకుడు, అదే పంధాలో తీసిన తాజా చిత్రం 'అమీ తుమీ.' ఇది కూడా మూడు జంటల కథే.. ('అష్టా చమ్మా' లో భరణి-హేమ జంటని మర్చిపోయారా ఏవిటి?). ఇది కూడా కథని కాక, కథనాన్ని, కామెడీని నమ్ముకుని తీసిన సినిమానే. ఇంకా చెప్పాలంటే నలిగిన కథకి, తనకి అలవాటైన ఫార్ములాని జతచేసి, ఇంద్రగంటి మోహనకృష్ణ తనమార్కు సంభాషణలతో ఆసాంతమూ హాయిగా నడిపించేసిన సినిమా.

హైదరాబాద్ లో ఉండే అపర కోటీశ్వరుడు జనార్దనానికి (తనికెళ్ళ భరణి) ఓ కొడుకు (అవసరాల శ్రీనివాస్), కూతురు (ఈషా). తన హోదాని ఏమాత్రం మర్చిపోని జనార్దనానికి కూతురు ఓ సేల్స్ మేనేజర్ తో (అడివి శేష్) తో ప్రేమలో పడడం అస్సలు నచ్చదు. ఇది చాలదన్నట్టు, తన వ్యాపార శత్రువు గంగాధరం కూతురు మాయ (అదితి)తో  తన కొడుకు పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని తెలియడంతో పుండు మీద కారం రాసినట్టు ఉంటుంది. ఇది పని కాదని, కూతురికి విశాఖపట్నం 'చిలిపి' ఫామిలీ కి చెందిన శ్రీ చిలిపి (వెన్నెల కిషోర్) తో పెళ్లి నిశ్చయం చేసేస్తాడు. ఇటు శ్రీ చిలిపి తండ్రి కూడా అమ్మాయి ఎలా ఉన్నా ఓకే చేసేయమని చెప్పి మరీ కొడుకుని హైదరాబాద్ పంపిస్తాడు.

ఇష్టం లేని పెళ్లిని తప్పించుకుని నచ్చిన వాడిని చేసుకోడానికి జనార్దనం కూతురు ఏం చేసింది, నన్ గా మారిపోవాలనుకున్న అన్నగారి గర్ల్ ఫ్రెండు మాయ మనసు మార్చి, వాళ్ళ పెళ్ళికి మార్గం చూపించింది అన్నవాటితో పాటు, శ్రీ చిలిపి కథ ఏ మలుపు తిరిగిందన్నది ఈ చిన్న సినిమా ముగింపు. అవును, బడ్జెట్, నిడివి ప్రకారంగా కూడా ఇది చిన్న సినిమానే. అలవాటైన కన్ఫ్యూజింగ్ కామెడీనే. అయితే, ప్రేక్షకులకి ఎక్కడా విసుగు రాకుండా కథని నడిపించిన ఘనత మాత్రం దర్శకుడిదే. దర్శకుడిగా కన్నా, మాటల రచయితగా మోహనకృష్ణ ఎక్కువ కష్ట పడినట్టు అనిపించింది సినిమా చూస్తున్నంతసేపూ.


అవడానికి అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, ఈషా, అదితి ప్రధాన తారాగణం అయినప్పటికి కథంతా తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్యామలాదేవి (జనార్దనం ఇంట్లో పనమ్మాయి కుమారి) చుట్టూనే తిరుగుతుంది. కథ నడక 'అష్టా చమ్మా' ని గుర్తు చేస్తూ ఉండగానే, మధ్య మధ్యలో ఆ సినిమాని గుర్తు చేసేలా కొన్ని డైలాగులు ('పేరులో వైబ్రేషన్స్' లాంటివి) సన్నివేశాలు (వంకాయ కాల్చడం) చేర్చారు. 'అష్టా చమ్మా' మూలకథ ఓ. హెన్రీ దయితే (క్రెడిట్ ఇచ్చారు), ఈ సినిమా మూల కథ ఎస్వీ కృష్ణారెడ్డిది (క్రెడిట్ ఇవ్వలేదు). జనార్దనం ఇంట్లో శ్రీ చిలిపి ప్రవేశించినప్పటి నుంచీ 'వినోదం' సినిమా వద్దన్నా గుర్తొస్తూనే ఉంటుంది.

ఆంధ్ర ప్రాంత నటులచేత తెలంగాణ మాండలీకం, తెలంగాణ ప్రాంతానికి చెందిన వెన్నెల కిషోర్ తో విశాఖ మాండలీకం మాట్లాడించడం మోహనకృష్ణ చేసిన ప్రయోగం. నటీనటులందరూ సంభాషణలు పలకడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కథలో చిక్కదనం లేకపోవడం అన్న బలహీనతని సంభాషణలతో అధిగమించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే, డైలాగుల్లో చాలా వరకు మల్టిప్లెక్స్ ప్రేక్షకులకి మాత్రమే అర్ధమయ్యేవిగా ఉన్నాయి. పాటలు మంచి అసెట్ అయ్యే అవకాశం ఉన్నా, ఒక డ్యూయెట్ తో కలిపి మొత్తం రెండే పాటలతో సరిపెట్టేశారు. లాజిక్ ల జోలికి వెళ్లకుండా రెండు గంటలపాటు హాయిగా నవ్వుకోడానికి చూడదగ్గ సినిమా ఇది. నేనైతే, మోహనకృష్ణ నుంచి మరికొంచం ఆశించాను.

సోమవారం, జూన్ 05, 2017

ఫ్యాషన్ డిజైనర్

డియర్ వంశీ,

నమస్తే!!

మీ తాజా చిత్రం 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' చూసిన తర్వాత మీకీ ఉత్తరం రాయకుండా ఉండలేక పోతున్నాను. షూటింగ్ మొదలైంది మొదలు మీ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడడం, రాబోయే ఆ సినిమా మీరు తీసిన మంచి సినిమాల జాబితాలో చేరాలని కోరుకోవడం, తీరా సినిమా చూశాక 'తీసింది వంశీయేనా?' అని ఆలోచనలో పడి, బాధపడడం బాగా అలవాటైపోయినవే అయినా, ప్రతిసారీ ఓ ఎదురుచూపు, ఓ నిట్టూర్పు తప్పడం లేదు.

మనమిప్పుడు 2017 లో ఉన్నాం. గతకొన్నేళ్ళుగా ఆడపిల్లలు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ పెళ్లి సంబంధాల కోసం బెంగ పెట్టుకోవడం లేదు. నిజానికి ఇప్పుడా బెంగ మగపిల్లల తల్లిదండ్రులది. అలాంటిది, పారిస్ నుంచి వచ్చే పెళ్ళికొడుకు కోసం తన కూతుర్ని షోకేసులో బొమ్మలా తయారు చేయాలని తాపత్రయ పడతాడు ఓ తండ్రి. కళ్ళతోనే కొలతలు తీసుకునే మీ ఫ్యాషన్ డిజైనర్ గోపాళం ఆమెకి వ్యాంప్ తరహా దుస్తులు కుట్టి, నగలన్నీ దిగేసి, ఇది చాలదన్నట్టు ఓ మేలిముసుగేసి మరీ పెళ్ళికొడుకు ముందు ప్రదర్శనకి నిలబెడతాడు... పెళ్ళికొడుకు చొంగ కార్చుకుని సంబంధం ఒకే చేస్తాడు.. పిల్ల తండ్రి కన్నీళ్లు పెట్టుకుని గోపాళానికి కానుకలిస్తాడు.. 'సితార' నీ 'లాయర్ సుహాసిని' నీ సృష్టించిన వంశీ సినిమాయేనా ఇదీ? అన్న సందేహానికి ప్రారంభం ఇది.

గేదెల రాణితో హీరో గారి ప్రేమాయణం.. ఆమె తడికల గదిలో స్నానం చేస్తుంటే టార్చ్ లైటు వేసి చూసి ఆమెని ప్రేమలో పడేస్తాడు. అటుపై ఆమెనుంచి తప్పించుకోవడం కోసం అతగాడు ఎన్నుకున్న దారులు.. ఆమెని వెనుక వైపు నుంచి బలంగా తన్నడం, బరువైన బస్తాని వెనుకనుంచి ఆమె మీద పడేయడం లాంటి హత్యా ప్రయత్నాలు. అయినా కూడా ఆమె అతన్ని ప్రేమిస్తూనే ఉంటుంది. ఏ పల్లెటూళ్ళో ఉన్నారండీ ఇలాంటి అమ్మాయిలు? ఇక రెండో నాయిక అమ్ములు తొలిచూపు నుంచీ హీరో మీద విరహంతో రగిలిపోతూ ఉంటుంది. కేవలం అతగాడు ఓ కొత్త డిజైన్ డ్రెస్సు కుట్టి ఇచ్చినందుకే! ఇదంతా అమ్మాయిల మీద చిన్నచూపా లేక అమెజాన్ పార్సిళ్లు పల్లెలకు కూడా వెళ్తున్నాయని తెలియకపోవడమా? ఇంకేమన్నా కారణాలు వెతుక్కోవాలా?

ఇక మూడో హీరోయిన్ అమెరికా మహాలక్ష్మి తింగరితనంలో మొదటి ఇద్దరు హీరోయిన్లనీ మించిపోయినట్టు అనిపించింది. మొదటి ఇద్దరూ 'ఏదో పల్లెటూరి పిల్లల్లే' అని సినిమాటిక్ లిబర్టీ తీసేసుకుందాం అనుకున్నా (నిజానికి ఇవాళ్టి పల్లెటూరి అమ్మాయిలు ఎవరికీ ఏ విషయంలోనూ తీసికట్టు కాదు) అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి కూడా ఫ్యాషన్ డిజైనర్ పనితనానికి ఫ్లాట్ అయిపోవడం ఏమిటండి, హీరో పాత్ర మీద మీ అతి ప్రేమ తప్పితే? మరో స్త్రీపాత్ర కౌసల్య.. టీవీ సీరియల్లో లేడీ విలన్లా సినిమా ఆసాంతమూ క్లోజప్ లో గుడ్లు మిటకరించి చూడడమూ, క్లైమాక్స్ లో కథని తేల్చేయడం కోసం విలన్ గుట్టు విప్పడమూ.. ఒకప్పటి మీ సినిమాల్లో సపోర్టింగ్ కేరక్టర్స్ ఎలా ఉండేవండీ అసలు?

ఈ సినిమాని 'లేడీస్ టైలర్' కి సీక్వెల్ అని ప్రచారం చేశారు కానీ, నాకైతే రీమేక్ అనిపించింది. ఇంగ్లీష్ వాళ్ళు 'లూజ్ అడాప్టేషన్' అంటారు బహుశా. 'ఏప్రిల్ ఒకటి విడుదల' లో దివాకరాన్ని  తీసుకొచ్చి పాపారావు అని పేరుపెట్టి హీరోకి మేనమామని చేయడం, విలన్ వెంకటరత్నం పేరుని గవర్రాజుగా మార్చడం, మరీ ముఖ్యంగా ఆ సినిమాలో ఉన్న నేటివిటీని పూర్తిగా నీరుగార్చి మెలోడ్రామా డోసుని విపరీతంగా పెంచడం మినహా మార్పులేవీ కనిపించలేదు. అక్కడ జమజచ్చ అయితే ఇక్కడ మన్మధరేఖ అంతే. 2017 లో కూడా గవర్రాజు మాట ఊళ్ళో శిలాశాసనం కావడం, ముఖంలో ఎలాంటి భావాలూ పలకని అతగాడు నాటు తుపాకీతో జనాన్ని ఇష్టం వఛ్చినట్టు కాల్చి పారేస్తున్నా, సోషల్ మీడియా రోజుల్లో కూడా ఎవరూ అస్సలు పట్టించుకోక పోవడం మీ సినిమాలోనే సాధ్యం.

వంశీ సినిమా అంటే ముందుగా కనిపించేది నేటివిటీ. ఆ నేలమీదే పుట్టి పెరిగిన మనుషుల్లా అనిపించే పాత్రలు. అలాంటిది ఈ సినిమాలో నాయికా నాయకులతో సహా ప్రతి పాత్రా ఆ వేళ పొద్దున్నే హైదరాబాద్ నుంచి ఆ ఊళ్ళో బస్సు దిగినట్టు ఉందంతే. యాస పలికించడానికి హీరో పడ్డ అవస్థ ప్రతి సంభాషణలోనూ వినిపించింది. హీరోయిన్లకి డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్టులు కూడా యాస కోసం అవస్థలు పడడం ఒక ఎత్తైతే, లిప్ సింక్ అన్నది అస్సలు కుదరకపోవడం దారుణమైన విషయం. ఒకప్పటి మీ సినిమాల్లో సంభాషణలు ఇప్పటికీ ఇష్టంగా తల్చుకుంటాం. కానీ ఈ సినిమాలో చాలా సంభాషణలు మొదటిసారి వినడానికే వెగటుగా అనిపించాయి. టీవీ కామెడీ షోలలో కూడా అవుట్ డేటెడ్ అయిపోయిన సీన్లు పట్టుకొచ్చి "ఇదే కామెడీ.. చూడండి" అనేశారు.

అన్నట్టు, ఆ జూనియర్ ఆర్టిస్టులని ఎక్కడినుంచి తీసుకొచ్చారు వంశీ గారూ? రికార్డింగ్ డాన్సర్ల నుంచి కూడా మంచి నటనని రాబట్టగలరని నిరూపించుకున్నారే.. కృష్ణభగవాన్, కొండవలస లాంటి ఎందరికో లైఫ్ ఇచ్చారే... మరి వీళ్ళేమిటండీ, కనీసం టీవీ సీరియల్ స్థాయిలో అయినా చేయకుండా, కెమెరాకి డైలాగులు అప్పజెప్పేశారు. ఆ ఓపెనింగ్ సీన్ చూసి గుండె జారిపోయింది నాకు. సాంకేతిక విభాగాలు కూడా నటులకి తగ్గట్టే ఉన్నాయి. ఎడిటర్ పేరు టైటిల్స్ లో ఉండడం వల్ల ఈ 'ఈసినిమాకు ఎడిటర్ ఉన్నారన్న మాట' అనుకోవాల్సి వచ్చింది తప్ప పనితనం ఎక్కడా కనిపించలేదు. అయితే, వంక పెట్టలేనివి, ఈ సినిమాలో అస్సలు ఫిట్ అవ్వనివీ రెండు విభాగాలు.. సంగీతం, కెమెరా. కేవలం పాటల కోసమే చివరివరకూ హాల్లో ఉన్నానంటే నమ్మాలి మీరు.

చివరగా, మీ నుంచి ఇలాంటి సినిమాలు రావడం ఇదే మొదలు కాదు. కానీ, 'ఇంతకుముందు చూసిందే చివరిదేమో' అన్న ఆశ ప్రతిసారీ మీ సినిమాని చూసేలా చేస్తోంది.. ఇంకా ఎన్నాళ్లండీ? సినిమా చూసి వచ్చినప్పటి నుంచీ ఎందుకిలా తీశారా అని ఆలోచిస్తూ ఉంటే, ఈమధ్యనే చూసిన 'డైలాగ్ విత్ ప్రేమ' ఐడ్రీమ్స్ ఇంటర్యూ గుర్తొచ్చింది. సుదీర్ఘమైన ఆ ఇంటర్యూలో చాలా సంగతులే చెప్పారు మీరు. కానీ, సినిమా చూసొచ్చాక పదేపదే గుర్తొస్తున్న విషయం ఒక్కటే. "నాకు పేపర్ చదివే అలవాటు లేదు.. అసలు పేపరు చదవను, వార్తలు చూడను.." బహుశా అందుకేనేమో, మీరు ముప్ఫయి ఏళ్ళ వెనుకే ఉండిపోయి మమ్మల్ని కూడా మీదగ్గరికి రమ్మంటున్నారు. మేమందరం అంత వెనక్కి రావడం అన్నది కుదరని పనండీ.. మీరు ముందుకి రాగలిగితే మనం ఒక పేస్ లో ప్రయాణించగలుగుతాం.. రావాలన్నది నా (మా) ఆశ, కోరిక..

ఇట్లు

మీ

అభిమాని