గురువారం, జూన్ 14, 2012

సాయంకాలమైంది

"ఆండాళ్ళు వీపు మీద కొన్ని తరాల, యుగాల సత్సంప్రదాయం బరువు గంజీ కావిడి మోస్తోంది. ఆమె పాదాల దగ్గర అన్ని తరాల, యుగాల వ్యత్యాసం యధాప్రకారంగా - మోకాళ్ళు తెగి పడి ఉంది. నిర్దుష్టంగా గిరులు గీసుకుని, సడలడానికి ఏమాత్రం ఆలోచనలోకూడా రానివ్వని రెండు వర్గాల పొలిమేరలో నుంచున్న ఇరవై రెండేళ్ళ పిల్ల ఏం చెయ్యాలి? ఇది అనూచానంగా వస్తున్న చాతుర్వర్ణ వ్యవస్థకి సాయంకాలమా? అన్వయించుకుని, కొత్త అర్ధాల్ని ఆశ్రయించే కొత్త పుంతకి ప్రాతఃకాలమా?" ...గడిచిన ఎనిమిదేళ్ళలో నేను అతి ఎక్కువసార్లు చదివిన తెలుగు నవల గొల్లపూడి మారుతి రావు రాసిన 'సాయంకాలమైంది.' అందులోని ఓ కీలక సన్నివేశం ఇది.

"మార్పు కొందరిని భయపెడుతుంది. కొందరిని జోకొడుతుంది. కొందరిని ఆనందింపజేస్తుంది" ఇవి కూడా నవలలో వాక్యాలే. ఈ మార్పే 'సాయంకాలమైంది' నవలలో కథా వస్తువు. ప్రాణం కన్నా సంప్రదాయాన్ని కొనసాగించడాన్ని మిన్నగా భావించే ఓ శ్రీవైష్ణవ కుటుంబంలో నాలుగు తరాల కాలంలో అనివార్యంగా వచ్చి పడిన మార్పుని వ్యాఖ్యాన సహితంగా చిత్రించిన నవల ఇది. కథాస్థలం విజయనగరం జిల్లాలో, గోస్తనీ నదీ తీరంలో ఉన్న పద్మనాభం అనే పల్లెటూరు. స్వస్థలం సర్పవరం అగ్రహారంలో ఆచారం సాగడంలో జరిగిన చిన్న పొరపాటు, పండితుడైన కుంతీనాధాచార్యుల వారిని కుటుంబ సహితంగా పద్మనాభం తరలి వచ్చేలా చేస్తుంది.

పద్మనాభంలో కుంతీమాధవ స్వామి, కొండమీది అనంతపద్మనాభ స్వామి ఆలయాల్లో అర్చకత్వం మొదలుపెడుతుంది ఆ కుటుంబం. కుంతీనాధా చార్యుల కుమారుడు పెద్ద తిరుమలాచార్యులు తండ్రి ఇష్టానికి విరుద్ధంగా ఆయుర్వేద వైద్యం చేయడం మొదలుపెట్టి, కేవలం సంప్రదాయాన్ని నిలబెట్టడం కోసం అనివార్య పరిస్థితిలో ప్రాణత్యాగం చేస్తారు. పెద్ద తిరుమలాచార్యుల కుమారుడు సుభద్రాచార్యులు నూటికి నూరుపాళ్ళు తాతకి తగ్గ మనవడు. శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని కొనసాగించడాన్ని మించినదేదీ లేదాయనకి. భర్తకి తగిన భార్య వరదమ్మ. పద్మనాభం అనే ఓ చిన్న పల్లెటూరినే తమ ప్రపంచంగా చేసుకున్న ఆ దంపతుల కొడుకు చిన్న తిరుమలాచార్యులు ఉద్యోగం కోసం విదేశాలకి వలస వెళ్ళిపోగా, కాలేజీలో చేరిన కూతురు ఆండాళ్ళు - కుండలు చేసుకుని జీవించే సానయ్య కొడుకు కూర్మయ్యని ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. ఈ విపర్యయాలకి ఆ వృద్ధ దంపతులు ఎలా స్పందించారన్నది తర్వాతి కథ.

కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ 'వేయిపడగలు' నవలతో అనివార్యంగా పోలిక కనిపించే నవల ఈ 'సాయంకాలమైంది.' తరాల అంతరాలు, మార్పుని అంగీకరించలేక, ప్రేక్షక పాత్ర వహించే ప్రధాన పాత్రల కారణంగా 'వేయిపడగలు' గుర్తొచ్చి తీరుతుంది. నాటక, సిని రచయతగా అపార అనుభవం ఉన్న గొల్లపూడి కలం నుంచి వచ్చిన ఈ నవలలో నాటకీయత అక్కడక్కడ శ్రుతిమించింది. నవనీతం అత్యాచారం, ఆండాళ్ళు ప్రేమకథలని చిత్రించిన తీరులో నాటకీయతని చాలావరకూ తగ్గించవచ్చు. విసిగించే మరో అంశం, మితిమీరిన వ్యాఖ్యానం. కథని తన దోవన తను నడవనివ్వకుండా రచయిత పదే పదే అడ్డుపడి, వ్యాఖ్యానాలు చేయడం చాలా సందర్భాలలో పంటికింద రాయిలాగా అనిపిస్తుంది. నిజానికి వ్యాఖ్యానించదల్చుకున్న అభిప్రాయం పాఠకుల్లో కలిగించే విధంగా రాయడం, చేయి తిరిగిన రచయిత గొల్లపూడికి కష్టమేమీ కాదు.


ఇది డైరెక్ట్ నవల కాదు. 'ఆంధ్రప్రభ' వారపత్రికలో సీరియల్ గా వచ్చింది. ఒక్కసారిగా కాక, ఏవారానికి ఆ వారం రాసి ఇవ్వడం వల్ల కాబోలు, చాలాచోట్ల కంటిన్యుటీ దెబ్బతింది. ఉదాహరణకి, ప్రారంభంలో కొడుకు రాకకోసం సుభద్రాచార్యుల వారి దేహం మూడు రోజులు మార్చురీలో ఉందని రాసి, నవల మధ్యలో అంత్యక్రియలు వియ్యంకుడు జరిపినట్టుగా రాశారు. చిన్న తిరుమల, భూపతిరాజు, నవనీతం కొన్ని నెలల తేడాతో పుట్టారని రాసి, తర్వాతి సన్నివేశంలో చిన్న తిరుమలకీ నవనీతానికీ చాలా వయోభేదం ఉన్నట్టు చిత్రించడం, జయవాణిని మొదట ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ లో సూపర్నెంట్ గా పరిచయం చేసి, తర్వాతి అధ్యాయాలలో ఆమెకి చదువు లేదు కాబట్టి నర్సుగా పనికి కుదిరిందని చెప్పడం...ఇవన్నీ సీరియల్ గా రాయడం వల్ల జరిగిన పొరపాట్లే అయినప్పటికీ, నవల ప్రింట్ చేసేటప్పుడు సరిదిద్ది ఉండాల్సింది.

"శ్రీ వైష్ణవ సత్సంప్రదాయ వైభవాన్ని సవివరంగా నాకు తెలియజెప్పిన పూజ్యులు శ్రీ శ్రీభాష్యం అప్పలాచార్యుల వారికీ, శ్రీ సాతులూరి గోపాల కృష్ణమాచార్యుల వారికీ..." కృతజ్ఞతలు చెప్పుకున్న గొల్లపూడి, ఆ సంప్రదాయాన్ని చిత్రించడంలోనూ తడబడ్డారు. ఉదాహరణకి, చిన్నతిరుమల వివాహ సందర్భంలో సుభద్రాచార్యుల వారికి వియ్యంకుడు 'రుద్రాక్షమాల' కానుకగా చదివిస్తాడు. శ్రీవైష్ణవులు ముట్టుకోని వాటిలో మొదటి వరుసలో ఉండేవి రుద్రాక్షలు! అలాగే, శ్రీవైష్ణవ కుటుంబాల్లో స్త్రీలు మట్టి గాజులు ధరించరు, మడికి పనికిరావని. (ఈ వివరం పంచుకున్న మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు). అలాగే శ్రీవైష్ణవులనీ, క్షత్రియులనీ 'వారు' అని సంబోధించిన రచయిత, ఇతర వర్ణాల వారిని గురించి చెప్పేటప్పుడు 'వాడు' 'అది' అని ప్రస్తావించడం పంటి కింద రాయిలాగా అనిపిస్తుంది. వెంకటాచలానికీ, జయవాణికీ పుట్టిన విక్టోరియాని కలుపుమొక్కతో పోల్చడమూ సరికాదు.

ఇన్ని లోపాలున్నా, ఈ నవల అన్నిసార్లు చదవడానికి కారణం? మొదటగా చెప్పాల్సింది చదివించే గుణాన్ని. తర్వాత కథ, కథనాల్లో ఆర్ద్రత. నవనీతం, రేచకుడు లాంటి బలమైన పాత్రలు. ప్రతి పాత్రకీ ఓ ఐడెంటిటీ ఇవ్వడం. చిన్నా పెద్దా కలిపి ముప్ఫైకి పైగా పాత్రలున్నప్పటికీ ప్రతి పాత్రా దేనికదే ప్రత్యేకమైనది. సుభద్రాచార్యులు-వరదమ్మల పాత్ర చిత్రణలో ఆర్ధ్రత..ప్రతిసారీ ఉత్కంఠభరితంగా అనిపించే కొన్ని మలుపులు, తెలియకుండానే కళ్ళు చెమ్మగిల్లేలా చేసే కొన్ని సన్నివేశాలు..వెరసి, మనసు బాగోనప్పుడు అప్రయత్నంగా చేయి వెళ్ళే మొదటి పుస్తకం అయిపోయింది ఈ 'సాయంకాలమైంది.' ఈ నవలకి అభిమానుల సంఖ్య పెద్దదే. పీవీ నరసింహారావు, కొంగర జగ్గయ్య వంటి ప్రముఖులు గొల్లపూడిని వ్యక్తిగతంగా అభినందించగా, ప్రస్తుతం మన మధ్య లేని ఓ ప్రముఖ ఖైదీ ఈ నవల చదివి జైలు నుంచి సుదీర్ఘమైన ఉత్తరం రాయడం విశేషం.

'సాయంకాలమైంది' కి కొనసాగింపు రాసే ఉద్దేశం ఉందని ఆమధ్యన ప్రకటించారు గొల్లపూడి. తర్వాత మళ్ళీ ఏ కబురూ లేదు. అలాగే యువ దర్శకుడు ఒకరు ఆ కథని సినిమాగా తెరకి ఎక్కించే ఆలోచన చేసినట్టు సమాచారం. జ్యేష్ట లిటరరీ ట్రస్టు ప్రచురించిన ఈ నవల కాపీలు కొద్దిగా మాత్రమే ఉన్నాయి మార్కెట్లో. అచ్చు తప్పులని సవరించడంతో పాటు, కథనంలో దొర్లిన పొరపాట్లని రచయితే స్వయంగా సవరించి మరో ప్రింట్ తీసుకొస్తే బాగుంటుంది. లోపాలెన్ని ఉన్నప్పటికీ, పాఠకులని వెంటాడే నవల ఇది. (పేజీలు 179, వెల రూ.100, అన్ని పుస్తకాల షాపులు)

మంగళవారం, జూన్ 12, 2012

హరిణి గెలిచింది...

గోదారమ్మాయ్ ఇవటూరి హరిణి 'పాడుతా తీయగా' తాజా సిరీస్ విజేతగా నిలిచింది. సెమి-ఫైనల్స్ వరకూ ఈ కార్యక్రమ సరళిని గమనించినప్పుడు రోహిత్ లేదా తేజస్విని ప్రధమ బహుమతి అందుకుంటారని ఊహించాన్నేను. వ్యాఖ్యాత మరియు న్యాయనిర్ణేత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆ ఇద్దరి మీదా కొంచం ఎక్కువగా దృష్టి పెట్టడం, ఒకానొక ఎపిసోడ్ లో తేజస్వినికి నూటికి నూరు మార్కులు ఇవ్వడం ఈ అంచనాకి కొంతవరకూ దోహదం చేసింది. ఎప్పటిలాగే, ఈసారి కూడా ఫలితం ఆశ్చర్య పరిచింది నన్ను.

హరిణి (కాకినాడ)ప్రధమస్థానంలో నిలిచి మూడు లక్షల రూపాయల బహుమతి అందుకోగా, తేజస్విని (నల్గొండ) ద్వితీయ స్థానం పొంది లక్ష రూపాయల నగదు బహుమతి అందుకుంది. హైదరాబాద్ అబ్బాయిలు రోహిత్, సాయి చరణ్ లది తృతీయ స్థానం. చేరి యాభైవేల రూపాయల నగదునీ అందుకున్నారు. హరిణి, తేజస్వినిల మార్కుల తేడా కేవలం పాయింట్ మూడు శాతం. అత్యంత క్లిష్టమైన 'నీ లీల పాడెద దేవా' పాటని ఫైనల్స్ కి ఎంచుకోవడం తేజస్వినికి మైనస్ గా మారిందేమో అనిపించింది.

'పాడుతా తీయగా' కార్యక్రమాన్ని ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే మొదటగా గమనింపుకి వచ్చే విషయం తెలుగులో వేలాది సినిమా పాటలు ఉన్నా, కేవలం రెండు మూడొందల పాటలు మాత్రమే పునరావృతమవుతున్నాయి ఈ కార్యక్రమలో. అంటే, ప్రతిసారీ పాడే గాయనీ గాయకులు మారుతున్నా పాటలు అవే ఉంటున్నాయి. ఉదాహరణకి ఫైనల్స్ నే తీసుకుంటే, నాటి ఉష మొదలు నేటి హరిణి వరకూ పాడిన పాట 'సువర్ణ సుందరి' నుంచి 'హాయి హాయిగా...' ...అదే సినిమాలో 'జగదీశ్వరా..' 'పిలువకురా..' లాంటి మంచి పాటలున్నా అవి వినిపించడంలేదు.


కొన్ని పాటలైతే ప్రతి సిరీస్ లోనూ వినిపించి తీరుతున్నాయి. అవి గొప్ప పాటలే.. కాదనలేం. కానీ, ఎప్పుడూ అవే పాటలా? పోను పోను ఏమవుతోందంటే, 'ఫలానా' పాటలు ప్రాక్టిస్ చేసేస్తే 'పాడుతా తీయగా' కి అప్లై చేసేయొచ్చు అనే భావన కలుగుతోంది. ఓ సిరీస్ లో పాడిన పాటలు, తర్వాత వచ్చే కనీసం రెండు సిరీస్ లలో పాడకూడదు లాంటి నిబంధన విధించడం ద్వారా, మనకున్న అనేక మంచి పాటలని ఈ వేదిక నుంచి వినే అవకాశం కలుగుతుంది కదా.

ఈమధ్య కాలంలో ఇబ్బంది పెడుతున్న మరో అంశం అతిధుల ఎంపిక. గతంలో కేవలం సంగీత, సాహిత్య రంగాలకి చెందిన వారిని మాత్రమే ఆహ్వానించి, వారిచేత కూడా మార్కులు వేయించేవారు. బాలూ, వారూ వేసిన మార్కుల సగటు ఆధారంగా విజేతల ఎంపిక జరిగేది. ఎప్పుడైతే మార్కుల బాధ్యత మొత్తం బాలూకి అప్పగించడం జరిగిందో, అప్పటినుంచీ అతిధికి సంగీత సాహిత్యాలు తెలిసి ఉండాలి అన్న నిబంధన మాయమైపోయింది. ఫలితంగా, మంచు లక్ష్మి లాంటివాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి అతిధులైపోయారు. ఫైనల్స్ కి వచ్చే అతిధులు కూడా చిరంజీవి, దాసరి, మోహన్ బాబుగా మార్పు చెందారు.

వచ్చే అతిధులు, ఎస్పీ బాలూల పరస్పర పొగడ్తలు రాన్రానూ పంటికింద రాయిలాగా అనిపిస్తున్నాయి. ఏదీ శృతి మించరాదనే విషయం బాలూకి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. మరి ఏ మోమాటాలు తనని ఇబ్బంది పెడుతున్నాయో తెలియదు మనకి. పాట గురించో, పాడిన విధానం గురించో మాట్లాడితే అందరికీ బాగుంటుంది. కానైతే, వారివారి అభిమానాలు 'ప్రదర్శించుకోడానికి' ఈ వేదికని ఉపయోగించుకోవడం నచ్చడం లేదు. వచ్చే వారం నుంచి మొదలవ్వబోతే కొత్త సిరీస్ లో ఎలాంటి మార్పులు చేస్తున్నారో చూడాలి. (ఫోటో కర్టెసీ: 'కాకినాడ' శంకర్ గారు)

ఆదివారం, జూన్ 10, 2012

పెద్దరికం

అడుసుమిల్లి బసవపున్నమ్మకీ పర్వతనేని పరశురామయ్యకీ ఓ పెళ్ళి పందిట్లో మొదలైన శతృత్వం పెరిగి పెద్దదై వాళ్ళ ఊరి మొత్తానికి సమస్యై కూర్చుంది. విడిపోయిన ఆ రెండు కుటుంబాలూ ఏకమైతే తప్ప ఊళ్ళో ఎవరికీ మనశ్శాంతి దొరకని పరిస్థితి. అలాగని సయోధ్యకి ప్రయత్నించే ధైర్యం ఎవరికీ లేదు. అటు బసవపున్నమ్మన్నా, ఇటు పరశురామయ్యన్నా అందరికీ హడల్ మరి. ఈ సమస్య ఎలా పరిష్కారమయ్యిందన్నదే ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన 'పెద్దరికం' సినిమా కథ.


మలయాళంలో విడుదలై విజయం సాధించిన 'గాడ్ ఫాదర్' సినిమాని తెనిగించారు దర్శక నిర్మాత ఏ.ఎం. రత్నం. నేటివిటీ విషయంలో అక్కడక్కడా కొంచం తడబడినా, దర్శకుడిగా మొదటి సినిమా కాబట్టి మొత్తమీద బాగా తీసినట్టే అనుకోవాలి. బసవపున్నమ్మ, పరశురామయ్య పాత్రలు రెండూ శక్తివంతమైనవి. వీటికి భానుమతి, మళయాళ నటుడు ఎన్.ఎన్. పిళ్ళై లను ఎంచుకున్నాడు దర్శకుడు. బసవపున్నమ్మ మనవరాలు జానకిగా తమిళ నటి సుకన్య, పరశురామయ్య నాలుగో కొడుకు కృష్ణమోహన్ గా జగపతిబాబు నటించారు.

అటు పరశురామయ్యకీ ఇటు బసవపున్నమ్మకీ నలుగురేసి కొడుకులు. పరశురామయ్య పెద్ద కొడుక్కి చేయాలనుకున్న అమ్మాయిని, పెళ్ళి మండపం నుంచి తీసుకొచ్చి తన పెద్ద కొడుక్కిచ్చి పెళ్ళి చేస్తుంది బసవపున్నమ్మ. ఆ తగాదాలో పరశురామయ్య భార్య చనిపోగా, బసవపున్నమ్మ భర్తని నరికి తను జైలుకి వెళ్తాడు పరశురామయ్య. తన ఇంట్లో స్త్రీలకి ప్రవేశం లేదని ప్రకటించిన పరశురామయ్య, ఏ ఒక్క కొడుక్కీ పెళ్ళి చేయడు. చివరి కొడుకు కృష్ణమోహన్, జానకి ఒకే కాలేజీలో లా చదువుతూ ఉంటారు.


రాష్ట్ర హోం మంత్రితో జానకి పెళ్ళి నిశ్చయం చేస్తుంది బసవపున్నమ్మ. అయితే పరశురామయ్య కారణంగా ఆ పెళ్ళి రద్దు కావడంతో రెండు కుటుంబాల మధ్యా విభేదాలు మళ్ళీ భగ్గుమంటాయి. కృష్ణమోహన్ తో ప్రేమ నటించి, అతను ప్రేమలో మునిగాక అతనిద్వారా అతని కుటుంబాన్ని నాశనం చేసి పగ తీర్చుకోమని జానకికి సలహా ఇస్తుంది బసవపున్నమ్మ. అటు, కృష్ణమోహన్ కి కూడా ఇలాంటి సలహానే ఇస్తాడు అతని స్నేహితుడు ప్రసాద్ (సుధాకర్). ఒకరితో ఒకరు ప్రేమ నటించడం మొదలుపెట్టిన కృష్ణమోహన్, జానకి నిజంగానే ప్రేమలో పడిపోతారు. బద్ధ శతృవులైన రెండు కుటుంబాలనీ ఒప్పించి ఎలా పెళ్ళి చేసుకున్నారన్నదే సినిమా ముగింపు.

సినిమా చూడడం పూర్తి చేశాక కూడా బసవపున్నమ్మ, పరశురామయ్య గుర్తొస్తూనే ఉంటారు. బసవపున్నమ్మ పాత్ర నాయకురాలు నాగమ్మని పోలిఉంటుంది. భానుమతి ఆ పాత్రలో ఒదిగిపోయారు. ఇక పరశురామయ్యగా చేసిన పిళ్ళై కి తెలుగులో ఇది తొలి సినిమా(బహుశా ఏకైక సినిమా). భానుమతితో పోటీ పడి నటించారనడానికి అభ్యంతరం లేదు. జగపతిబాబు, సుకన్య ఇద్దరికీ నటించడానికి అవకాశం ఉన్న పాత్రలు. జగపతిబాబుకి వేరే ఆర్టిస్ట్ చేత డబ్బింగ్ చెప్పించారు. ప్రసాద్ పాత్రలో సుధాకర్, జగపతిబాబు అన్నావదినలుగా చంద్రమోహన్, కవిత చక్కని హాస్యం పండించారు. లాయర్ గా కనిపించిన అల్లు రామలింగయ్య నటన క్లైమాక్స్ సన్నివేశాల్లో మెప్పిస్తుంది.


'పెద్దరికం' అని తలచుకోగానే మొదట గుర్తొచ్చే పాట జేసుదాస్ పాడిన 'ఇదేలే తరతరాల చరితం...' వెంటాడే పాట ఇది. జానకి పెళ్ళి సందర్భంలో వచ్చే 'ముద్దుల జానకి పెళ్లికి మబ్బుల పల్లకి తేవలెనే..' పాట అప్పట్లో ప్రతి పెళ్ళి వీడియోలోనూ వినిపించిది. ఈ రెండు పాటలూ నాకు చాలా ఇష్టం. తరచూ వింటూ ఉంటాను. రెండు డ్యూయట్లు 'నీ నవ్వే చాలు చామంతీ మాలతీ..' 'ప్రియతమా.. ప్రియతమా..' వినడంతో పాటు చూడడానికీ బాగుంటాయి. రాజ్-కోటి సంగీతంలో పాటలన్నీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేవే. వీటితో పాటు నేపధ్య సంగీతమూ బాగుంటుంది.

చాలా రోజులపాటు నటి విజయశాంతి దగ్గర హెయిర్ డ్రెస్సర్ గా పనిచేసి, 'కర్తవ్యం' తో నిర్మాతగా మారిన రత్నం రెండో సినిమా ఇది. శ్రీ సూర్య చిత్ర పతాకంపై నిర్మాణంతో పాటు దర్శకత్వ బాధ్యతనూ తీసుకున్నారు. పరశురామయ్య, బసవపున్నమ్మల కొడుకుల చేత తెల్లని పంచెలని ధరింప జేయడం, పోరాట దృశ్యాలు లాంటిచోట్ల మలయాళం వాసనలు తగిలినప్పటికీ సినిమా ఆసాంతమూ కట్టిపడేసే విధంగా తీయడం మెచ్చుకోవాల్సిన విషయం. షూటింగ్ లో సింహభాగం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగింది. సిద్ధిఖీ కథకి పరుచూరి సోదరులు సంభాషణలు అందించారు. ఇప్పటికీ చూడడం మొదలుపెట్టిన ప్రతిసారీ సినిమాలో లీనమైపోయి పూర్తిగా చూసే సినిమా ఇది.

గురువారం, జూన్ 07, 2012

పెద్దాయనా... పెద్దాయనా...

మరో నాలుగు రోజుల్లో జరగబోతున్న ఉప ఎన్నికలకి, గతంలో ఏ ఉప ఎన్నికలకీ జరగనంత భారీగా ప్రచారం జరుగుతోంది. మొత్తం పద్ధెనిమిది  అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాలకి జరుగుతున్న ఉప ఎన్నికలో, ఒక్క తిరుపతి అసెంబ్లీ స్థానం మినహాయించి మిగిలిన అన్ని స్థానాలకీ ఎన్నిక రాడానికి కారణం యువజన, శ్రామిక, రైతు (వైఎస్సార్) కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం. అప్పటివరకూ కాంగ్రెస్ లో ఉన్నప్రజాప్రతినిధులు ఈ కొత్త పార్టీలోకి వచ్చి చేరడం ఈ ఎన్నికలకి ముఖ్య కారణం. ప్రధాన ప్రతిపక్ష పార్టీని (తెలుగుదేశం) మించిన ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న ఈ కొత్త పార్టీకి జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకమైనవి.

అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం కూడా ఈ ఎన్నికలని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అటు ముఖ్యమంత్రి కిరణ్, ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబు కాలికి బలపాలు కట్టుకుని తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఆశ్చర్యకరంగా, వీరిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం లేదు. ఇద్దరూ కలిసి కొత్తగాపుట్టిన పార్టీ మీదా, ఆ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడూ అయిన జగన్మోహన్ రెడ్డి ని టార్గెట్ గా చేసుకున్నారు. కొత్త పార్టీ బలపడడం అన్నది ఇద్దరినీ ఇరుకున పెట్టే విషయమే. గడిచిన వారం పదిరోజుల్లో రాష్ట్రంలో జరిగిన ముఖ్య పరిణామాలు మంత్రి మోపిదేవి వెంకటరమణ మరియు జగన్మోహన్ రెడ్డిల అరెస్టు. నాయకులు, ప్రసార మాధ్యమాలు జగన్ అరెస్టుకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో రాష్ట్రమంత్రి అరెస్టు ఏమంత పెద్ద వార్త కాలేదు.

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ లక్ష కోట్లు ఆర్జించాడన్నది అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. ఈ అక్రమార్జన కేసులోనే సిబిఐ జగన్ ని అరెస్టు చేసి, విచారణ జరుపుతోంది. జగన్ కి స్వంత ప్రచార సాధనాలు ఉన్నప్పటికీ, వాటి ద్వారా కన్నా ప్రభుత్వానికీ, ప్రతిపక్షానికీ అనుకూలమైన మీడియా ద్వారానే అతడికి ఎక్కువ ప్రచారం జరుగుతోన్నట్టుగా అనిపిస్తోంది. ఏమాత్రం ఆశ్చర్యం కలిగించని విధంగా జగన్ మీడియా అతడికి రక్షణ కవచంగా నిలబడేందుకు సర్వ ప్రయత్నాలూ చేస్తోంది. ఇందులో భాగంగా అతడు దివంగత వైఎస్ కి వారసుడన్నవిషయాన్ని పదే పదే జ్ఞాపకం చేయడంతోపాటు, ప్రజలకి వైఎస్ చేసిన మేళ్ళు కొనసాగాలంటే జగన్ కి అధికారం ఇవ్వడం ఒక్కటే మార్గం అని చెవిన ఇల్లు కట్టుకుని మరీ చెబుతోంది.

ప్రస్తుతం, వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు అన్నది ఒక్కటే జగన్మోహన్ రెడ్డికి అనుకూల అంశం కాగా ఆ వారసత్వాన్ని ఉపయోగించుకుని ఆకమార్జన చేశాడన్నది ప్రతికూల అంశం. ఆరేళ్ళ రాజశేఖర రెడ్డి పాలని సామాన్యులు ఇంకా మర్చిపోలేదన్నది నిజం. ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు, వృద్ధాప్య పించన్ల ఫలితాలు అందుకున్న పేదలు దాదాపు ప్రతి ఊరిలోనూ ఉన్నారు. వైఎస్ మాత్రమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎజెండా కావడం, నిన్న మొన్నటివరకూ వైఎస్ మా నాయకుడు అని చెప్పిన అధికార పార్టీ ఇప్పుడు క్రమంగా పక్కన పెట్టడం, విమాన ప్రమాదంలో వైఎస్ మరణించిన తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవే కావడం గమనించాల్సిన అంశాలు.

జగన్ వ్యతిరేక మీడియాలో ప్రాముఖ్యంలో ఉన్న అంశం అవినీతి. ఈ అవినీతి అనే అంశం సామాన్య ఓటర్ని ఎలా ప్రభావితం చేస్తుంది అన్నది ఇప్పుడు చూడాలి. నిజానికి రెండువేల తొమ్మిది ఎన్నికల్లో సైతం తెలుగుదేశం అనుకూల మీడియా ఈ అవినీతి పై విస్తృత ప్రచారం చేసింది. అయినప్పటికీ, గతంకన్నా మెజారిటీ తగ్గినప్పటికీ, కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఈ అవినీతిని గురించి చర్చించుకునే వాళ్ళెవరూ పోలింగ్ బూత్ వెళ్లకపోవడం, క్యూలో నిలబడి ఓటేసే మెజారిటీ ప్రజలకి అవినీతి అనేది అంత ప్రాముఖ్యం ఉన్న విషయం కాకపోవడం బహుశా ఇందుకు కారణం కావొచ్చు. ఈ ఉప ఎన్నికల్లో ఓటర్లు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

సాధారణంగా ఉప ఎన్నికలు అనగానే అధికార పక్షం "ఈ ఎన్నికలు మా పాలనకి రిఫరెండం" అనో, ప్రతిపక్షాలు "ప్రభుత్వ వ్యతిరేకతకి రిఫరెండం" అనో ప్రకటించడం రివాజు. ఆశ్చర్యంగా ఈసారి ఈ రెండూ కూడా జరగలేదు. ఒక టర్మ్ పూర్తి చేసుకుని, రెండో టర్మ్ సగంలో ఉన్న అధికార పార్టీ పై ప్రజా వ్యతిరేకత సహజమే అనుకున్నా, ప్రధాన ప్రతిపక్షం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. అయితే, అటు అధికార పక్షం, ఇటు ప్రధాన ప్రతిపక్షం కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇద్దరి టార్గెట్ జగన్మోహన రెడ్డే అయినప్పటికీ "ఈ ఎన్నికలు అవినీతి వ్యరేకతపై ప్రభాభిప్రాయానికి రిఫరెండం" అనే సాహసాన్ని కూడా చేయలేకపోవడం గమనించాలి. మొత్తంమీద, 'జగన్' నామస్మరణతో జరుగుతున్న ఈ ఉపఎన్నికల ఫలితాలు, రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయన్నది వేచి చూడాల్సిన విషయం.

బుధవారం, జూన్ 06, 2012

రాణీ చెన్నమ్మ

భారత స్వతంత్ర సంగ్రామంలో సిపాయిల తిరుగుబాటు ఓ మరపురాని ఘట్టం. ఆ తిరుగుబాటు జరగడానికి మూడు దశాబ్దాలకి ముందుగా, ఇప్పటి కర్ణాటక రాష్ట్రంలోని కిత్తూరు సంస్థానంలో తొలిసారిగా ఆంగ్లేయులపై తిరుగుబాటు జరిగింది. భారత స్వతంత్ర పోరాటానికి సంబంధించి తొలి తిరుగుబాటు ఇది. తిరుగుబాటుకి నాయకత్వం వహించింది రాజు కాదు. అప్పటి కిత్తూరు సంస్థానాధీశురాలు రాణీ చెన్నమ్మ. ఆ తిరుగుబాటులో చెన్నమ్మ నాయకత్వంలోని కిత్తూరు యోధుల చేతుల్లో వందలాది బ్రిటిష్ జవాన్లు నేలకరవడంతో పాటు అప్పటి కలక్టర్ థాక్రే నరికివేయబడ్డాడు. సంస్థానాలతో వ్యవహరించాల్సిన తీరుపై ఆంగ్లేయ పాలకులకి ఓ పాఠం నేర్పిందీ తిరుగుబాటు. స్థానిక అధికారుల మొదలు, గవర్నర్ వరకూ బ్రిటిష్ పాలకులకి సింహ స్వప్నమయ్యింది రాణీ చెన్నమ్మ. ఇంతకీ ఎవరీవిడ?

బెల్గాం జిల్లాలోని కాకతి అనే చిన్న సంస్థానాన్ని పాలించే ధూళప్పగౌడ దేశాయ్ కుమార్తె చెన్నమ్మ. చూపు తిప్పుకోలేనంత అందంతో పాటు, పెద్దపులిని వేటాడి చంపే సాహసమూ ఆమె సొంతం. కిత్తూరు సంస్థానాధీశుడు మల్లసర్జ దేశాయ్ కి చుట్టూ సమస్యలే! అవడానికి కిత్తూరు సంపన్న సంస్థానమే అయినా, ఓ పక్క పీష్వాలు, మరోపక్క టిప్పు సుల్తాన్, వీరు చాలనట్టు ఫ్రెంచి, డచ్చి పాలకులు.. వీళ్ళంతా కిత్తూరు మీద కన్నేసి, దండెత్తే అవకాశం కోసం పొంచి ఉన్న వాళ్ళే. ఆంగ్లేయులతో ఆపద్ధర్మ స్నేహం నెరపుతూ రోజులు నెట్టుకొస్తున్న మల్లసర్జ, చుట్టూ ఉన్న సంస్థానాధీశులందరినీ కూడగట్టి, ఓ బలమైన శక్తిగా ఎదగడం ద్వారా శత్రువులని ఎదుర్కోవచ్చునన్న ఆలోచన చేసి, ఇందులో భాగంగా కాకతిని సందర్శిస్తాడు.

అనుకోకుండా ఎదురుపడ్డ చెన్నమ్మ-మల్లసర్జ తొలిచూపులోనే ప్రేమలో పడతారు. అప్పటికే రుద్రమ్మని వివాహం చేసుకుని, శివలింగ రుద్రసర్జ కి తండ్రైన మల్లసర్జకి రెండో భార్యగా వెళ్ళడానికి అంగీకరిస్తుంది చెన్నమ్మ. కిత్తూరు కోటలో అడుగుపెట్టిన కొన్నాళ్ళకే సమస్యలు చుట్టుముడతాయి చెన్నమ్మని. రుద్రమ్మతో ఆమెకి ఏ సమస్యా లేదు. సొంత సోదరీమణుల్లా కలిసిపోయారు ఇద్దరూ. చెన్నమ్మకి ఓ కొడుకు పుట్టి, కొంతకాలానికే అనారోగ్యంతో మరణిస్తాడు. ఆ గాయం నుంచి ఆమె కోలుకోక మునుపే, మల్లసర్జ శత్రువులకి చిక్కి, బందీగా మారి, కొంత కాలానికి చిక్కి శల్యమై తిరిగి వచ్చి అనారోగ్యంతో మరణిస్తాడు. పేరుకి శివలింగ రుద్రసర్జ ప్రభువే అయినా, పాలనా వ్యవహారాలన్నీ చెన్నమ్మే నిర్వహిస్తుంది.


ఉన్నసమస్యలు చాలనట్టుగా, అధికారంలోకి వచ్చిన కొన్నాళ్ళకే శివలింగ రుద్రసర్జ అనారోగ్యం పాలవుతాడు. అతనికి సంతానం లేకపోవడంతో, మరణించబోయే ముందు ఓ బాలుడిని దత్తత తీసుకుంటాడు. అయితే, అప్పటి బ్రిటిష్ కలక్టర్ థాక్రే ఈ దత్తతని అంగీకరించడు. దత్తతకి ముందస్తు అనుమతి లేదన్నది అతడి అభ్యంతరం. కిత్తూరు ఆంగ్లేయులతో స్నేహం మాత్రమే నెరపుతోందనీ, వారికి లోబడి లేదన్నది చెన్నమ్మ వాదన. కిత్తూరుని ఆంగ్లేయుల ఏలుబడిలోకి తెచ్చి తీరాలని సంకల్పించిన థాక్రే, ఖజానాకి కావలి వాళ్ళని పంపడం మొదలు, అంతఃపుర స్త్రీల ప్రతి కదలిక మీదా నిఘా పెట్టడం వరకూ అనేక అభ్యంతరకరమైన పనులకి పాల్పడతాడు. మొదట థాక్రే కి చెప్పి చూసిన చెన్నమ్మ, అతని పై అధికారులకీ లేఖలు రాస్తుంది. వారినుంచి స్పందన లేకపోవడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో తిరుగుబాటు చేస్తుంది.

థాక్రే మరణం ఆంగ్లేయుల్లో పట్టుదల పెంచుతుంది. ఎలాగైనా కిత్తూరుని స్వాధీనం చేసుకోవాల్సిందే అని నిర్ణయించుకుని సేనల సమీకరణ మొదలు పెడతారు. ఓ పక్క చెన్నమ్మతో సంధి ప్రతిపాదనలు చేస్తూనే మరోపక్క యుద్ధానికి ఏర్పాట్లు చేసుకుంటారు. తిరుగుబాటుకి పర్యవసానం తీవ్రంగా ఉంటుందని చెన్నమ్మకీ తెలుసు. ఆమెకూడా, పొరుగు సంస్థానాల నుంచి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తుంది. అయితే, అనేక కారణాల వల్ల తనకి కావాల్సిన మద్దతుని పొందలేకపోతుంది చెన్నమ్మ. అయినా, వెనకడుగు వేయకుండా పోరాటానికి సిద్ధ పడుతుంది. తన వాళ్ళే చివరి నిమిషంలో వెన్నుపోటు పొడిచినా వెనుదీయకుండా ఒంటరి పోరాటం చేసిన ధీర చెన్నమ్మ. భారత స్వతంత్ర పోరాటంలో కిత్తూరు తిరుగుబాటు ఓ అధ్యాయం. సదాశివ వడయార్ అక్షరబద్ధం చేశారీ తిరుగుబాటుని.


తిరుగుబాటుకి ఉన్న చారిత్రిక నేపధ్యం, మల్లసర్జ పాలన, చెన్నమ్మ వ్యక్తిత్వం, తిరుగుబాటుకి దారితీసిన పరిస్థితులు, తర్వాతి జరిగిన పరిణామాలని ఎన్నో శ్రమదమాదులకోర్చి ఎంతో పరిశోధన చేసి, చారిత్రిక ఆధారాల సహితంగా గ్రంధస్థం చేశారు వడయార్. వ్యవసాయం, కుటీర పరిశ్రమలకి ఆలవాలమైన, సిరిసంపదలతో తులదూగే కిత్తూరు వైభవాన్ని అక్షరాలా కళ్ళకి కట్టారు. ఇక, చెన్నమ్మ నైతే పాఠకుల కళ్ళముందు నిలబెట్టేశారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఈ 132 పేజీల ఇంగ్లిష్ పుస్తకం వెల రూ. 35. కిత్తూరు తిరుగుబాటుని ఇతివృత్తంగా తీసుకుని 'క్రాంతివీర సంగొల్లి రాయన్న' అనే సినిమా నిర్మితమవుతోంది కన్నడనాట. తెలుగుతార జయప్రద రాణీ చెన్నమ్మ గా నటిస్తున్న ఈ సినిమా విడుదలకి సిద్ధమవుతోంది.

మంగళవారం, జూన్ 05, 2012

సరదాకి

తెలుగు సినిమా వజ్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అది చూసిన రాజకీయ నాయకులకి తాము కూడా అలాంటి వేడుక ఒకటి ఎందుకు జరుపుకోకూడదు అనిపించింది. అనుకున్నదే తడవుగా ముఖ్యమంత్రి వైఎస్ అఖిలపక్ష ఇష్టా గోష్టి ఏర్పాటు చేశారు. తర్జనభర్జనల అనంతరం 'రాజకీయ జీవిత రజతోత్సవం'  పార్టీలకి అతీతంగా  భారీగా జరపడానికి ఏకాభిప్రాయం కుదిరింది. అన్నిపార్టీల నాయకులూ ఒకేలాంటి దుస్తులు ధరించి ధీమ్సాంగ్ కూడా పాడుకున్నారు. హైటెక్స్ లో ఘనంగా జరిగిన వేడుకలో, సన్మానాల దగ్గరికి వచ్చేసరికి వైఎస్ ని 'లెజెండ్' అవార్డుతో సత్కరించి, మిగిలిన అందరినీ 'సెలబ్రిటీస్' జాబితాలో వేశారు కేవీపీ.

ఆవేశం ఆపుకోలేని పి. జనార్ధన్ రెడ్డి వేదిక మీదకి సర్రున దూసుకొచ్చి, మైకందుకుని ప్రసంగం మొదలెట్టారు. "అసలు లెజెండ్ అంటే ఏమిటి? సెలబ్రిటీ అంటే ఏమిటి? ఈ రెండు పదాలకు అర్ధాలతో ఓ పుస్తకం రాశారా? సాధారణ కార్మికుడిగా జీవితం ప్రారంభించి, ఆ కార్మిక శాఖకే మంత్రిగా పని చేసిన నేను లెజెండ్ ని కానా? రాష్ట్రంలోనే అతి పెద్ద నియోజకవర్గం ఖైరతాబాద్ నుంచి వరసగా ఎన్నో సార్లు గెలిచిన నేను లెజెండ్ ని కానా?" అంటూ ఆగ్రహంగా ఊగిపోయారు. "నా మాట సరే.. సాక్షాత్తూ ఇందిరమ్మకే సలహాలిస్తూ ఢిల్లీలో రాజకీయ చక్రం తిప్పిన ఎమ్మెస్ లెజెండ్ కాదా? గల్లీ స్థాయి నాయకుడిగా జీవితం ప్రారంభించి ఢిల్లీ స్థాయికి ఎదిగిన వి. హనుమంతరావు లెజెండ్ కాదా?... దయచేసి నన్నుమన్నించండి... ఈ సెలబ్రిటీ అవార్డుని నేను తిరస్కరిస్తున్నాను."

భయంకరమైన నిశ్శబ్దం ఆవహించిన సభలో, వైఎస్ లేచి మైకందుకుని "నాలుగే నాలుగు ముక్కలు మాట్లాడతా! ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది మన గురించి కాదు. మనల్ని ఈ స్థితికి తీసుకు వచ్చిన రాజకీయ కళామతల్లి గురించి మాట్లాడుకోవాలి..ఏడీ.. పిజేఆర్ ఎక్కడ?.. సరే.. నేను చదివిన డాక్టర్ చదువుకీ, ఇప్పుడు అనుభవిస్తున్న ముఖ్యమంత్రి హోదాకీ.. నా సామాజిక నేపధ్యానికీ ఎక్కడా పొంతన లేదు.. ఈ స్టేటస్, ఈ ప్రశంసలు.. ఈ హోదాలు మనకి ఎవరిచ్చారు? ఆ రాజకీయ కళామతల్లి ఇచ్చింది. ఒరే నాయనా.. ఎదగండ్రా అంది.. ఎదిగిపోయాం.. పత్రికా సోదరులు రాసేవాటికి మనం ఉప్పొంగిపోకూడదు. పేపర్లో ఫోటో వేసి ఇంత ఆర్టికల్ రాసేసరికి ప్రతివారూ పేపర్ కి ఎక్కేస్తున్నారు.." ఆగి అలుపు తీర్చుకుని, ఉదయం హాజరైన పెళ్లిని జ్ఞాపకం చేసుకున్న వైఎస్, చివరికి తన 'లెజెండ్' అవార్డుని కాలనాళికలో వేసేశారు.


కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ కాలనాళిక ని ఎక్కడ ఉంచాలి అన్నది అసలు సమస్య అయికూర్చుంది. సెక్రటేరియట్, పార్టీ ఆఫీసుల్లోనూ కుదరదు. చివరికి ఎమ్మెస్ లేచి ఆ నాళికని ఎక్కడ ఉంచాలో చెప్పడం, 'ఈ వేడుక చాలా హాట్ గురూ' గల్ఫికకి ముగింపు. వైఎస్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన ఏడాదికి మొదలై తర్వాత మూడేళ్ళ పాటు ఆదివారం ఆంధ్రజ్యోతిలో నిరంతరాయంగా కొనసాగిన కాలమ్ 'సరదాకి.' రచయిత మంగు రాజగోపాల్. అప్పట్లో ఈ కాలమ్ కోసం ప్రతివారం ఎదురు చూసిన అనేక మందిలో నేనూ ఒకడిని. ఆ వారంలో జరిగిన ఓ ముఖ్య సంఘటనకి హాస్యాన్నీ, వ్యంగ్యాన్నీ రంగరించి రాజగోపాల్ రాసే గల్ఫికలు నవ్వించేవి, గిలిగింతలు పెట్టేవి... ఆ హాస్యపు చక్కెరపూత కరిగిపోగానే, "వీళ్ళా, మన నాయకులు?" అన్న నిట్టూర్పుని మిగిల్చేవి.

మావోయిస్టులతో చర్చలు జరపడానికి హొంమంత్రి జానారెడ్డి అడవులకి వెళ్ళడంతో మొదలు పెట్టి, సిపిఐ నారాయణ కోడికూర దీక్షకి ముగింపు వరకూ మొత్తం నూట పన్నెండు గల్ఫికలు. ఏవారానికి ఆ వారం అప్పటి పరిస్థితులకి అనుగుణంగా రాసినవే అయినా, వీటిలో చాలావరకూ కాల పరిక్షకి నిలబడేవే. అందుకే వీటిని పుస్తక రూపంలో తీసుకొచ్చారు హైదరాబాద్ కి చెందిన సహజ పబ్లికేషన్స్ వారు. మావోయిస్టులకి మద్దతు పలికే ప్రజాగాయకుడు ఉన్నట్టుండి 'భక్త గద్దరు' గా మారిన వైనం, ఎంతలేదు వచ్చేస్తోంది అంటూనే ఎందరో నాయకులకి, ఆశావహులకి సుదీర్ఘ ఎదురు చూపులు మిగిల్చిన 'చిరుబుకు చిరుబుకు రైలు' కబుర్లూ, అధికారం పోగొట్టుకున్న సుగ్రీవుడు ఏర్పాటు చేసుకున్న 'మహాగోడు' లో సాటి వానరుల ప్రసంగాలు... ఒక్క పార్టీ, ఒక్క నాయకుడూ అని కాదు.. ఏ ఒక్కరినీ వదలలేదు రాజగోపాల్.

నాయకుల రూపు రేఖా విలాసాలనూ, వారి మాటతీరు, అలవాట్లనీ రచయిత ఎంత శ్రద్ధగా పరిశీలించారో సులభంగానే అర్ధమవుతుంది. ఆయా నాయకులని తన అక్షరాలతో పాఠకుల కళ్ళ ఎదుట నిలపడం కేవలం రచయిత ప్రతిభ. శ్రీకాకుళంలో పుట్టి, విశాఖలో పెరిగిన రాజగోపాల్ కి ఉత్తరాంధ్ర నుడికారం మీద మాంచి పట్టు ఉంది. బొత్స సత్యనారాయణ ని చిత్రించడానికే కాదు, పూసల కోటు సవరించుకుంటూ కేయే పాల్ చేసే టీవీ ప్రసంగాలని కట్టెదుట నిలపడానికీ సాయపడింది ఈ పట్టు. అంతేనా? మన్యంలో విష జ్వరాలు ప్రబలినప్పుడు చూడడానికి వెళ్ళిన ఆరోగ్య మంత్రి రోశయ్యతో మన్యం ప్రజల సంభాషణ, రోశయ్యకి వ్యతిరేకంగా విశాఖ మన్యం దోమల మహాసభ, ఆపరేషన్ గజ కి వ్యతిరేకంగా ఒరిస్సా ఏనుగుల ఉద్యమం...వీటన్నింటి లోనూ ఉత్తరాంధ్ర నుడికారాన్ని మెరిపించారు.

చంద్రబాబు ప్రసంగాలలో వినిపించే రాయలసీమ మాండలీకం, కేసీఆర్, నరేంద్రల భాషలో తెలంగాణ మాండలీకం వీటన్నింటినీ బహుచక్కగా పట్టుకోవడంతో గల్ఫికలకి కొత్త సొగసు అమరింది. బాపూ కవర్ పేజీ, ముళ్ళపూడి ముందు మాటా అదనపు అలంకారాలు ఈ పుస్తకానికి. ఆసాంతమూ చదివి పక్కన పెట్టేసి ఊరుకోకుండా, అప్పుడప్పుడూ తిరగేసి చూసుకునే పుస్తకం ఇది. (పేజీలు 388, వెల రూ.150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).