శనివారం, అక్టోబర్ 28, 2023

సూర్యకాంతం ...

గత నెలలో అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఘనంగా జరిగింది. హైదరాబాదులో అక్కినేని నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోలో కుటుంబ సభ్యులు వేడుక జరిపారు. అంతకు నాలుగు నెలల ముందే నందమూరి తారక రామారావు శతజయంతి ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ రంగాల ప్రముఖులకి సన్మానాలు, సత్కారాలు.. ఇలా ఏడాది పొడవునా కార్యక్రమాలు జరిపి, ముగింపు వేడుకని వైభవంగా నిర్వహించాయి ఎన్టీఆర్ కుటుంబం మరియు ఆయన స్థాపించిన రాజకీయ పార్టీ. సినిమా కెరీర్లో అక్కినేనికి తొంభై తొమ్మిదో సినిమా, నందమూరికి వందో సినిమా ఒక్కటే. అయితే ఆ సినిమాకి టైటిల్లో వాళ్ళు పోషించిన పాత్రల పేర్లు కలపలేదు. వాళ్ళిద్దరికీ ఏడాది తర్వాత పుట్టి, వాళ్ళకి అత్తగారిగాగా నటించి మెప్పించిన సూర్యకాంతం పోషించిన 'గుండమ్మ' పేరు పెట్టారు. ఆ సినిమా 'గుండమ్మ కథ'. దటీజ్ సూర్యకాంతం. ఇవాళ్టి నుంచి సూర్యకాంతం శతజయంతి ప్రారంభం. 

కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణరాయపురం సూర్యకాంతం స్వస్థలం. బ్రాహ్మణ కుటుంబ నేపధ్యం. చిన్నప్పటి నుంచీ నాట్యం మీద ఉన్న ఆసక్తి కొంత, కుటుంబ ఆర్ధిక పరిస్థితులు మరికొంత (తండ్రి అకాల మరణం తదితరాలు) ఆమెని మొదట నాటకాల వైపుకీ, అటు నుంచి సినిమాలకీ నడిపించాయి. సినిమా రంగంలోకి అడుగుపెట్టే అందరు నటీమణుల్లాగే సూర్యకాంతానికి కూడా హీరోయిన్ కావాలన్నది కల. గ్రూప్ డాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టినా కథానాయిక అవకాశాల కోసం ప్రయత్నాలు మానలేదు. ఒక అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారినప్పుడు మాత్రం, నాయిక పాత్రల కోసం గిరిగీసుకోకూడదని, వచ్చిన పాత్రల్ని అంగీకరించి మెప్పించాలనీ నిర్ణయించుకుని చిన్న వయసులోనే 'అత్త' పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి, తనకు తానే ఓ బ్రాండ్ గా ఎదిగారు. చిరంజీవి-శ్రీదేవిల 'ఎస్పీ పరశురామ్' సూర్యకాంతం చివరి చిత్రం. ఆ సినిమాలో చిరంజీవి పాత్ర ఆమెని చెంపదెబ్బ కొట్టే సీన్ ఉంది. అది చూస్తూ "ఈవిడ ఇలాంటి పాత్రల్లోనటించాలా?" అనుకున్నాను మనసులో. కొన్నాళ్లకే ఆమె ప్రయాణం ముగిసింది. 

కెరీర్ మొత్తంలో సూర్యకాంతం నటించిన సినిమాల ఏడొందలు అని లెక్క తేల్చారు సినిమా వారు. "ఒకే పాత్రని ఏడొందల సార్లు నటించిన ఆర్టిస్టు ప్రపంచ సినిమా చరిత్రలో సూర్యకాంతం ఒక్కరే" అన్నారు తనికెళ్ళ భరణి. ఆయన ఉద్దేశం 'గయ్యాళి అత్త' పాత్ర అని కావొచ్చు. మూస పాత్ర పోషణలో వైవిధ్యాన్ని చూపేందుకు ఎంతగానో శ్రమించారు సూర్యకాంతం. కాబట్టే ప్రేక్షకులు ఆమెని అన్నాళ్ళు ఆదరించారు. ఏమాత్రం విసుగెత్తినా, 'రొటీన్' అని ఫీలయినా ఎప్పుడో ఇంటికి పంపేసేవారు కదా. ఆహార్యం మొదలు, మేనరిజాల వరకూ ఆమె చేసిన హోమ్ వర్క్ అనితరసాధ్యం. మచ్చుకి రెండు మూడు సినిమాలు వరుసగానో, లేదా ఆమె ఉన్న బిట్లనో పరిశీలనగా చూడండి, తెలుస్తుంది. అయితే, ఎడమ చేయి విసురుగా ఊపడం మాత్రం అన్ని సినిమాల్లోనూ కామన్ గా కనిపిస్తుంది, ఆ పాత్ర హిడింబి అయినా, గుండమ్మ అయినా, మరేదైనా. ఆ మేనరిజం సూర్యకాంతం ట్రేడ్ మార్కు. 

Google Image

లేడీ ఆర్టిస్టులు కొత్త వేషం గురించిన చర్చల్లో ఆ పాత్ర ఎలాంటి చీరలు కడుతుంది, సినిమా మొత్తానికి ఎన్ని చీరలు లాంటి విషయాల్లో ఎక్కువ ఆసక్తి చూపే కాలంలో, సూర్యకాంతం మాత్రం కొత్త వేషం రాగానే ఆ పాత్రకి తగిన కళ్ళజోడుని మొదట ఎంపిక చేసుకునే వారట. ఆవిడ పర్సనల్ కలెక్షన్లో ఉన్న వందలాది కళ్లజోళ్ల నుంచి ఒకటి ఎంపిక చేసుకుంటే మూడొంతుల గెటప్ పూర్తయినట్టే. మెజారిటీ సినిమాల్లో ఆమె కట్టినవి మల్లు పంచెలు, తెల్లచీరలే. ఈ కళ్ళజోడు సంగతితో పాటు సూర్యకాంతం గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు ముళ్ళపూడి వెంకట రమణ తన 'కోతి కొమ్మచ్చి' లో. "రవణా, తోట నుంచి మావిడి పళ్ళు వచ్చాయి" అని సెట్లో సూర్యకాంతం చెప్పారంటే, సినిమా కంపెనీ నుంచి డబ్బు వచ్చిందని, ఇంటికి వచ్చి తీసుకు వెళ్ళమని అర్ధం. బాపూ-రమణలు నిర్మించిన సినిమాలకి సూర్యకాంతం కూడా ఒక రహస్య నిర్మాత. కష్టపడి డబ్బు సంపాదించడమే కాక, దానిని జాగ్రత్త చేశారు కూడా. 

సూర్యకాంతానికి ఉన్న మరో అలవాటు ఇంటి నుంచి స్పెషల్స్ వండి తెచ్చి సెట్లో అందరికీ వడ్డించడం. షూటింగ్ చివరి రోజున అసిస్టెంట్లు, సెట్ బాయ్స్ అందరికీ బహుమతులు ఇవ్వడం. స్వతహాగా భోజన ప్రియురాలు కావడంతో వండి వడ్డించడం ఇష్టం. అంతే కాదు, 'సూర్యకాంతం వంటలు' పేరుతో ఓ వంటల పుస్తకం కూడా రాశారు. యద్దనపూడి సులోచనారాణి 'వెజిటేరియన్ వంటలు' కన్నా ముందు మార్కెట్లోకి వచ్చిన సెలబ్రిటీ కుక్ బుక్ బహుశా సూర్యకాంతం రాసిందే. బహుమతుల విషయంలో ఆమెకి ఉన్న ఓ అలవాటు గురించి మిత్రులు పంచుకున్న సంగతొకటి ఆసక్తిగా అనిపించింది. బంధుమిత్రుల్లో ఎవరింట పెళ్లి జరిగినా స్థాయీ భేదం లేకుండా సూర్యకాంతం పంపిన బహుమతి ఒక్కటే. 'సూట్ కేసు'. ఆమెకి పెళ్లి పత్రిక అందిందీ అంటే, కొత్తజంటకి సూట్ కేసు కానుకగా అందినట్టే. ఇది విన్నప్పుడు, సినిమా వాళ్ళ ఇళ్లల్లో పెళ్ళిళ్ళకి ఆమె ఏ కానుకలు ఇచ్చి ఉంటారో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. ముళ్ళపూడి రమణ ఏమీ చెప్పలేదు మరి. 

సోషల్ మీడియా ప్రబలమయ్యాక పాతవీ, కొత్తవీ అనేక వార్తలు నిత్యం శాఖా చంక్రమణం చేస్తున్నాయి.సూర్యకాంతానికి సంబంధించి ఇలా తరచూ తిరిగే వార్తల్లో ముఖ్యమైనది ఆమె చనిపోయినప్పుడు సినిమా పరిశ్రమ నుంచి పట్టుమని పది మంది కూడా ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించలేదని. అప్పుడే కాదు తర్వాతెప్పుడూ కూడా ఆమెకి సంస్కరణ సభ లాంటివి ఏమీ జరగలేదు. విగ్రహావిష్కరణలు, ఆమె పేరిట అవార్డులు కాదు కదా, ఆమెని గురించిన ఓ సమగ్రమైన పుస్తకం కూడా ఇన్నేళ్లలోనూ రాలేదు. లేడీ ఆర్టిస్టుల పట్ల ఉండే సహజమైన వివక్ష కొంత కారణమైతే, ఆమె వారసులెవరూ సినిమా పరిశ్రమలో లేకపోవడం మరికొంత కారణం అనిపిస్తుంది. సూర్యకాంతం తాలూకు వాళ్ళు సినిమా పరిశ్రమలో చెప్పుకోదగ్గ స్థానంలో వుండుంటే, ఈపాటికి శతజయంతి సంరంభాలకి భూనభోంతరాలు దద్దరిల్లేవి కాదూ. ప్రేక్షక హృదయాల్లో మాత్రం కనీసం మరికొన్ని తరాల పాటు ఆమె చిరంజీవి, 'మీమ్స్' సాక్షిగా.