శుక్రవారం, ఫిబ్రవరి 09, 2024

భారత రత్నం

అవార్డుల బహూకరణలో రాజకీయాలు ప్రవేశించడం ఇవాళ కొత్తగా జరిగింది కాదు. ఎవరికి ఏ అవార్డు వచ్చినా దాని వెనుక ఒక రాజకీయ కారణం ఉంటుందన్నది బహిరంగ రహస్యం. అయినప్పటికీ కూడా నేను ఇష్టపడే ఇద్దరు వ్యక్తులకి 'భారత రత్న' అవార్డు ప్రకటించడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి ఈ అవార్డు ప్రకటించారన్న వార్త తెలియగానే తెలియకుండానే కళ్ళలో నీళ్లు తిరిగాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలకీ, సోనియా, రాహుల్ గాంధీల అభిమానులకీ ఈ ప్రకటన మింగుడు పడక పోవచ్చు. కానీ, 'భారతరత్న' అవార్డుకి విలువ పెంచే నిర్ణయం ఇది. మళ్ళీ చెబుతున్నా, ఇది రాజకీయ నిర్ణయమే అయి ఉండవచ్చు. అయినప్పటికీ, పీవీ అర్హతకి తగిన బహుమతి - అది కూడా చాలా చాలా ఆలస్యంగా. 

అది తాత ముత్తాతల నుంచి తనకి వారసత్వంగా వచ్చిన పార్టీ కాదు. అందులో తాను అప్పటికి ఎంపీ కూడా కాదు. ప్రధాని పదవికి తన అభ్యర్థిత్వం ఒక తాత్కాలిక ప్రకటన. ఆ పదవి కోసం పార్టీలో సీనియర్ల నుంచే విపరీతమైన పోటీ. ప్రతి పూటా ఆ పదవిని రక్షించుకుంటూ ఉండాలి. ఇది చాలదన్నట్టు ఏ క్షణంలో ప్రభుత్వం కూలుతుందో తెలియని రాజకీయ అనిశ్చితి. ఒకరిద్దరు ఎంపీలు గోడ దూకినా ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్ధకమయ్యే పరిస్థితి. మరో నాయకుడైతే కేవలం తన పదవిని నిలబెట్టుకోడానికే పరిమితమై, రోజువారీ కార్యకలాపాలని 'మమ' అనిపించి కుర్చీ దిగి ఉండేవాడు. ఆనాడు ఆ పదవిలో ఉన్నది మరో నాయకుడే అయితే ఇవాళ భారత దేశం మూడో ప్రపంచ దేశాల (థర్డ్ వరల్డ్ కంట్రీస్) సరసన నిలబడి ఆకలి దప్పులతోనూ, అంతర్గత యుద్ధాలతోనూ అలమటిస్తూ ఉండేది. 

ఇవాళ్టిరోజున చాలా మామూలుగా అనిపించే 'నూతన ఆర్ధిక సంస్కరణలు' ఆరోజున చాలా పెద్ద నిర్ణయం. అప్పుడు, అంటే 1991 లో దేశానికి ఇక అప్పు పుట్టని పరిస్థితి ఎదురైనప్పుడు, బంగారం నిలవల్ని విదేశానికి తరలించాల్సి వచ్చింది, కుదువ పెట్టి అప్పు తీసుకు రావడం కోసం. బంగారాన్ని కళ్ళతో చూస్తే తప్ప అప్పు ఇవ్వడానికి నిరాకరించిన వాతావరణం. అంతర్జాతీయంగా ఆనాటి భారతదేశపు పరపతి అది. ఉన్నవి రెండే దారులు. కొత్త కొత్త అప్పులు చేస్తూ, పన్నులు పెంచి వాటిని తీరుస్తూ రోజులు గడపడం మొదటిది. ప్రపంచీకరణ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశించడం రెండవది. స్వపక్షం, విపక్షాలు కూడా మొదటి దారిని కొనసాగించమనలేదు, కానీ రెండో దారిని తీవ్రంగా వ్యతిరేకించాయి. (అలా వ్యతిరేకించిన వారిలో చాలామంది సంతానం ఇవాళ అమెరికా తదితర దేశాల్లో స్థిరపడడానికి కారణం ఆ ప్రపంచీకరణే కావడం ఒక వైచిత్రి). 

తన పదవిని, మైనారిటీ ప్రభుత్వాన్నీ నిలబెట్టుకుంటూనే, వ్యతిరేకిస్తున్న అందరినీ సమన్వయం చేసుకుంటూ, ఒక చారిత్రక నిర్ణయం తీసుకుని భారత దేశాన్ని ప్రపంచ మార్కెట్లో ప్రవేశపెట్టిన ఘనత కచ్చితంగా పీవీ నరసింహారావుకే దక్కుతుంది. మన్మోహన్ సింగ్ ని ఆర్ధిక మంత్రిగా నియమించుకోవడం మొదలు, కీలక నిర్ణయాలు తీసుకోడానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వరకూ అడుగడుగునా పీవీ శక్తియుక్తులు కనిపిస్తాయి. ప్రపంచీకరణ ఫలితంగా విదేశీ పెట్టుబడులు భారతదేశానికి రావడం మొదలయ్యింది. అప్పటి వరకూ ఉద్యోగం అంటే గవర్నమెంట్, బ్యాంక్ లేదా స్థానిక ప్రయివేటు సంస్థల్లో మాత్రమే విపరీతమైన పోటీ మధ్యలో అవకాశాలు దక్కించుకుంటూ వస్తున్న యువతకి కార్పొరేట్ ఉద్యోగాలు దేశ విదేశాల్లో స్వాగతం పలికాయి. స్థానికంగా విద్యావకాశాలు పెరిగాయి. మధ్యతరగతి నిలబడింది. చదువుకునే అవకాశాన్ని వినియోగించుకున్న పేదలు మధ్య తరగతికి, ఆపై తరగతికి చేరగలిగారు. 

ఇంత చేసిన పీవీకి దక్కింది ఏమిటి? సొంత పార్టీ నుంచే ఛీత్కారాలు. ప్రాణం పోయాక, అంతిమ సంస్కారాలకి దేశ రాజధానిలో కనీసం చోటు దొరకలేదు. ఆ జీవుడు వెళ్ళిపోయిన ఇన్నేళ్ల తర్వాత కూడా "అప్పట్లో మా కుటుంబం అధికారంలో ఉండి ఉంటే బాబరీ మసీదు కూలి ఉండేది కాదు" అనే వాళ్ళు ఒకరైతే, "భారత దేశానికి తొలి బీజేపీ ప్రధాని పీవీ నరసింహారావు" అనేవారు మరొకరు. ఇవన్నీ ఒక ఎత్తైతే, జీవితకాలమూ పీడించిన కోర్టు కేసులు మరో ఎత్తు. పోనీ ప్రధాని పదవిని దుర్వినియోగం చేసి వందల కోట్లో, లక్షల కోట్లో వెనకేసుకున్నారా అంటే, ఆ కుటుంబం ఇప్పటికీ దేశంలోనే ఉంది. సాధారణ జీవితాన్నే గడుపుతోంది. గోరంత చేసినా కొండంత ప్రచారం చేసుకునే నాయకులున్న కాలం ఇది. కొండంత చేసి కూడా గోరంతకూడా చెప్పుకోని (చెప్పుకోలేని) పీవీ లాంటి నాయకులు అత్యంత అరుదు. 

ఇప్పుడీ అవార్డు వల్ల విమర్శించే నోళ్లు మూత పడతాయా? అస్సలు పడవు. అవార్డు వెనుక రాజకీయ ప్రయోజనం ఉన్నట్టే, విమర్శ వెనుక కూడా ఉంటుంది. ఏం జరుగుతుందీ అంటే, నూతన ఆర్ధిక సంస్కరణలనాటి రోజుల నెమరువేత జరుగుతుంది. వాటి వల్ల బాగుపడిన కొందరైనా గతాన్ని గుర్తు చేసుకుంటారు. పీవీ కృషికి తగిన గుర్తింపు దొరికిందని సంతోషిస్తారు. విమర్శకులందరూ పాత విమర్శలకి మరో మారు పదును పెడతారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఉన్నతమైన అవార్డు పరువు తీసింది అంటారు. జీవించి ఉన్నప్పుడే విమర్శలకి వెరవని, చలించని నాయకుడు పీవీ. ప్రధాని పదవి వరిస్తే పొంగి పోనట్టే, ఈ అవార్డుకీ పొంగిపోరు. ఎటొచ్చీ ఆయన కృషిని గుర్తు చేసుకునే నా బోంట్లు సంతోషిస్తారు. అంతే.. 

అన్నట్టు, ఎమ్మెస్ స్వామినాథన్ కి 'భారత రత్న' వస్తుందని ఆయన ఉండగానే అనిపించింది నాకు. పీవీ లెక్కలో చూస్తే, స్వామినాథన్ కి త్వరగా వచ్చినట్టే. ఆయనకీ ఈ అవార్డుకి అన్ని అర్హతలూ ఉన్నాయి.