బుధవారం, మే 11, 2022

యమహా నగరి కలకత్తా పురి ...

"రోజంతా సూర్యుడి కింద
రాత్రంతా రజనీ గంధ సాగనీ..." 

బెంగాలీ కవులు వందేమాతరాన్నీ, జనగణమననీ జాతికి కానుకగా ఇచ్చారు. వారి ఋణం తీర్చుకోవడం కోసం కాబోలు, మన తెలుగు సినీ కవి వేటూరి బెంగాలీలు రాష్ట్రగీతంగా పాడుకోదగ్గ పాటని తెలుగులో రాశారు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'చూడాలని వుంది' (1998)లో కథానాయకుడు చిరంజీవి మీద చిత్రీకరించిన ఈ పాటని ఓ బెంగాలీ ఫ్రెండ్ కి వినిపించినప్పుడు అర్ధం చెప్పాల్సిన అవసరం లేకపోయింది. దణ్ణం పెట్టేశారు కవికి. మనకి భాష కూడా వచ్చు కాబట్టి వేటూరి ఉపయోగించిన శ్లేషల్ని, చమక్కుల్ని కూడా ఆస్వాదించ గలుగుతాం. 


యమహా నగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది...

ఏదన్నా 'గొప్పగా ఉంది' అనడానికి 'యమాగా ఉంది' అనడం అప్పటికే వాడుకలోకి వచ్చేసింది. ఇదే వేటూరి, ఇదే చిరంజీవి కోసం 'యమహా నీ యమా యమా అందం' అనే పల్లవితో పాట రాసి ఉన్నారు అప్పటికే. ఆ దృష్టితో చూసినప్పుడు కలకత్తా గొప్ప నగరం అంటున్నారు. కానైతే, ఈ కలకత్తా పురి బెంగాల్ కి రాజధాని. ఆ బెంగాల్ కరువులకి పుట్టిల్లు. దేశానికి స్వతంత్రం రాకపూర్వం సాక్షాత్తూ యమపురే. కలకత్తాలో ప్రవహించే హుగ్లీ నదికి, ప్రసిద్ధ హౌరా బ్రిడ్జీ కి నమస్సులు చెబుతున్నాడు - ఎవరు? - 'చిరు' త్యాగరాజు. శాస్త్రీయ బాణీలో పాడుతున్న వర్ధమాన గాయకుడు అని మాత్రమే కాదు, 'చిరు' అనే ముద్దుపేరున్న చిరంజీవి అని కూడా. 

నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన చోట
పాడనా తెలుగులో
ఆ హంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట సాగనా
పదుగురు పరుగు తీసింది పట్నం
బ్రతుకుతో వెయ్యి పందెం
కడకు చేరాలి గమ్యం కదిలిపోరా
ఒకరితొ ఒకరికి ముఖ పరిచయములు
దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల
గజిబిజి ఉరుకుల పరుగులలో... 

నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టింది బెంగాలీ సీమలోనే. 'గీతాంజలి పూసిన చోట' అని ఎవరనగలరు, వేటూరి తప్ప? రామకృష్ణ పరమహంస హంసగీతం (చివరి సందేశం) ఆనందుడు (వివేకానందుడు) చూపిన బాట అయ్యింది. ఆ బాటలో సాగుతానంటున్నాడు కథానాయకుడు. పదుగురూ పరుగు తీసే పట్నాలన్నీ దాదాపు ఒకలాగే ఉంటాయి కాబట్టి, ఈ వర్ణనంతా ఏ మహానగరానికైనా సరిపోతుంది. 

బెంగాలీ  కోకిల బాల
తెలుగింటి కోడలు పిల్ల మానిని సరోజిని
రోజంతా సూర్యుడి కింద
రాత్రంతా రజనీ గంధ సాగనీ
పద గురు ప్రేమలే లేని లోకం
దేవాదా మార్కు మైకం
శరన్నవలాభిషేకం తెలుసుకోరా
కథలకు నెలవట కళలకు కొలువట
తిథులకు సెలవట అతిధుల గొడవట
కలకట నగరపు కిటకిటలో... 

'భారత కోకిల' బిరుదాంకిత సరోజిని (నాయుడు) హైదరాబాద్ కోడలు. ఆవిడ మెట్టిల్లు 'గోల్డెన్ త్రెషోల్డ్' ని ఇప్పటికీ చూడొచ్చు నాంపల్లిలో. బెంగాల్ వాతావరణంలోనే ఓ అతి ఉంది. అక్కడ అన్నీ ఎక్కువే, ఎండలు కూడా. అలా రోజంతా సూర్యుడి ఎండలో పని చేసినా, రాత్రయ్యేసరికి రజనీగంధ పూలు చక్కని సువాసనతో సేద తీరుస్తాయి. అక్కడ ఇంకా చాలా పూలే పూస్తాయి కానీ, ప్రత్యేకించి రజనీగంధ అనడానికి కారణాలు - ఇది దాదాపు అన్ని కాలాల్లోనూ పూచే పువ్వు అవడం ఒకటైతే, 'రజనీగంధ' అనే అందమైన సినిమా తీసిన బెంగాలీ బాబు బసు ఛటర్జీని ఈ వంకన తల్చుకోడం మరొకటి. ప్రేమరాహిత్యం అనగానే గుర్తొచ్చే దేవదాసు బెంగాలీ వాడే.. 'దేవదాసు' నవల ఒక మైకమైతే, కథానాయకుడి చేతిలో పాపులరైన సీసా మరో మైకం. ఈ 'దేవదాసు' శరత్ చంద్ర చటోపాధ్యాయ పాఠకులకి చేసిన నవలాభిషేకం అంటే కాదనగలమా? కథలకు నెలవు, కళలకు కొలువు సరే. తిథులకి సెలవేమిటి అంటే, 'ప్రోగ్రెసివ్' బెంగాలీలకి తిథి వార నక్షత్రాలతో పెద్దగా పనుండదు అని. నగరాలకి అతిధుల గొడవ తప్పదు, ఈ కథానాయకుడూ అతిధిగా వెళ్లిన వాడే కదా మరి. 

వందేమాతరమే అన్న వంగ భూతలమే మిన్న జాతికే గీతిరా
మాతంగి కాళీ నిలయ చౌరంగి రంగుల దునియా నీదిరా
విను గురు సత్యజిత్ రే సితార
ఎస్ డి బర్మన్ కీ ధారా
థెరిస్సా కి కుమారా కదలి రారా
జనగణమనముల స్వరపద వనముల
హృదయపు లయలను శృతి పరిచిన
ప్రియ శుకపిక ముఖ సుఖ రవళులతో... 

ముందే చెప్పుకున్నట్టుగా వందేమాతరం, జనగణమన పుట్టిన నేల అది. మాతంగి కాళికాలయం, చౌరంగీ చూసి తీరాల్సిన ప్రదేశాలు. సత్యజిత్ రే సినిమాలు, ఆర్డీ బర్మన్ సంగీతం, మదర్ థెరెసా సేవలు.. ఇవన్నీ కలకత్తా అనగానే గుర్తొచ్చే విషయాలు. పైగా, అప్పట్లోనే చిరంజీవి "మదర్ థెరెసా స్పూర్తితో" సేవా కార్యక్రమాలు నిర్వహించడం మొదలైంది కూడా. 

పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ విరచిత 'రఘువంశ సుధాంబుధి' బాణీలోనే ఈ పాటని స్వరపరిచారు సంగీత దర్శకుడు మణిశర్మ. పల్లవి చరణాల బాణీల్లో మార్పులేవీ చేయకుండా, ఇంటర్లూడ్స్ లో మాత్రం సినిమా పాటకి కావాల్సిన 'జోష్' ని అందించారు. చిరంజీవి ఈ పాటకి ఒప్పుకోవడం అప్పుడే కాదు, ఇప్పటికీ ఆశ్చర్యమే. మెగాస్టార్ అయిపోయాక తన పాటల్లో ఇలాంటి సాహిత్యం అరుదు. ఈ పాటని హరిహరన్ చేత పాడించడం అప్పట్లో నచ్చలేదు కానీ (గొంతుకి వంక పెట్టలేం, కాకపోతే ఉచ్చారణ...) వినగా వినగా అలవాటైపోయింది. ఓ పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాలో ఇలాంటి అభిరుచిగల పాట పెట్టిన నిర్మాత అశ్వనీదత్ నీ అభినందించాల్సిందే. 

2 కామెంట్‌లు:

  1. 'చిరు త్యాగరాజు' వెనక ఇంకో కథ ఉంది... ఈ పాట బాణీ 'రఘు వంశ సుదాంబుధి చంద్ర శ్రీ' అనే కృతి ని పోలి ఉంటుంది కదా. చాలా మంది అనుకుంటారు ... ఇది త్యాగరాజ స్వామి రాసినది అని. కానీ కాదు. పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రాశారు. కర్ణాటక సంగీతం తెలిసిన వాళ్ళం నవ్వుకున్నాం కూడా. ఎవరో వేటూరి గారికి ఈ విషయం చెప్తే, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ 'చిరు త్యాగరాజు' లాంటి వారే కదా...  అని నవ్వేశారట.  అది నిజమే. పట్నం స్వయానా త్యాగరాజ స్వామి ప్రశిష్యులు. పైగా వారి బాణీ నే అనుసరించారు కూడా. అలా ఆయన 'చిరు త్యాగరాజు' కి ఇంకో అర్ధం సమకూర్చారు :) నిజంగా చాలా మంచి పాట. Thank you for writing about it. 

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా ఆసక్తికరమైన విశేషమండీ.. వేటూరి బహు చమత్కారి.. పంచుకున్నందుకు ధన్యవాదాలు..

      తొలగించండి