శుక్రవారం, ఫిబ్రవరి 22, 2013

యానాం కథలు

చుట్టూ విస్తరించి ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో కలిసిపోకుండా తనదైన ఆస్థిత్వాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్న చిన్న పట్టణం యానాం. అనేక చారిత్రిక కారణాలు ఇందుకు దోహదం చేశాయి. తూర్పు గోదావరితో సహా చుట్టూ ఉన్న మిగిలిన ప్రాంతాలన్నీ బ్రిటిష్ ఏలుబడిలో ఉన్న కాలంలో యానాం ఫ్రెంచ్ పాలనలో ఉంది. దేశానికి బ్రిటిష్ వారినుంచి స్వాతంత్రం వచ్చిన ఏడేళ్ళ తర్వాత మాత్రమే యానాం కి ఫ్రెంచి వారినుంచి విముక్తి కలిగింది. అయితే, తమిళం అధికార భాషగా ఉన్న పాండిచ్చేరిలో భాగమై, కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించబడింది.

ఎన్నో వైవిధ్యాలకి నెలవైన యానాం నేపధ్యంగా కవీ, కథకుడూ దాట్ల దేవదానం రాజు రాసిన పద్దెనిమిది కథల సంకలనమే 'యానాం కథలు.' ఈ కథల్లో మనకి ఫ్రెంచ్ దొరలూ, దొరసానులూ కనిపిస్తారు. వాళ్ళ అహాలు, బలహీనతలూ కనిపిస్తాయి. వాళ్ళ ఎడల భయ భక్తులతో మసలుతూనే, ఆత్మగౌరవం విషయంలో రాజీ పడడానికి ఇష్టపడని యానాం ప్రజలు కనిపిస్తారు. యానాం అనగానే గుర్తొచ్చే గోదారీ, పచ్చదనంతో పాటు, ఫ్రెంచి మద్యమూ, తన 'పౌరులకి' ఆ ప్రభుత్వం ఇప్పటికీ ఇస్తున్న భారీ పెన్షన్లు, పక్క ఊరి వాళ్ళతో వచ్చే 'అంతర్రాష్ట్ర' తగాదాలూ వీటన్నింటినీ పరామర్శించాయి ఈ కథలు.

పరాయి పాలకుడు అయినప్పుడు వాడు బ్రిటిష్ వాడు అయితేనేం, ఫ్రెంచి వాడు అయితేనేం... దొర ఎవడైనా దొరే. కానీ, ఫ్రెంచి వాళ్ళ ప్రత్యేకత ఏమిటీ అంటే తమ పాలితులకి న్యాయం జరగాలని తాపత్రయ పడ్డారు. దొరల మీద నేరుగా ఫిర్యాదు చేయడానికి భయపడే లక్షణాన్ని దృష్టిలో పెట్టుకుని, వాళ్ళు ఏర్పరిచిన వెసులు బాటు ఏమిటంటే, దొరలవల్ల ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ఓ కరపత్రాన్ని పంచితే చాలు. న్యాయస్థానం దానిని 'సుమోటో' గా తీసుకుని బాధితులకి న్యాయం చేయాల్సిందే. ఈ న్యాయ సూక్ష్మాన్ని ఇతివృత్తంగా తీసుకుని రాసిన కథ 'తీర్పు వెనుక.'


సద్బ్రాహ్మణుడు వెంకటయ్య ని ఈడ్చి తన్నాడు పిథోయిస్ దొర. అతని యజ్ఞోపవీతాన్ని తెంపేసే ప్రయత్నం చేశాడు. వెంకటయ్య చిన్న వాడు ఏమీకాదు, కలిగిన వాడు. నలుగురికీ మంచీ చెడు చెప్పేవాడు. అటువంటి వాడికి ఇంత అవమానం జరగడానికి కారణం చిన్నదే. దొర ఇంటికి వెళ్ళిన వెంకటయ్య, అనుమతి తీసుకోకుండా కుర్చీలో కూర్చున్నాడు. అవమానికి భగ్గుమన్న యానాం ప్రజలు దొర ఇంటిమీద దాడి చేశారు. ఫిర్యాదు లేకుండా పెద్దమనుషులు సద్దుబాటు చేసినప్పటికీ, మర్నాడు తెల్లారేసరికి ఊరంతా కరపత్రాలు. కేసు కోర్టుకి వెళ్ళింది. అక్కడ వెంకటయ్య కి న్యాయం జరిగిందా? అన్నది ఆసక్తికరమైన ముగింపు.

ఈ కథల్లో బాగా ఆకర్షించేవి తెలుగమ్మాయిలతో ఫ్రెంచి దొరల ప్రేమలు. ఎదుర్లంక అమ్మాయి పార్వతిని ప్రేమించిన లారెంట్ ప్రేమకథ ఏమయ్యిందో 'ఔను నిజం' కథ చెబితే, సాంబశివుడితో ప్రేమలో పడ్డ లెలీషియా దొరసాని కథ 'కథోర్ జియ్.' అమీర్ ఖాన్ 'లగాన్' సినిమాలో రేఖామాత్రంగా పోలిక కనిపించే ఈ కథకి ప్రాణం రచయిత ఇచ్చిన ముగింపు. లా 'మూర్' కథ చదివాక, కామాక్షితో ప్రేమలో పడ్డ నీలికళ్ళ రొబేర్ ని ఓ పట్టాన మర్చిపోలేం. పాలన ఫ్రెంచి వాళ్ళది అయితేనేం? ఆ దొరలకి కులమతాల పట్టింపులు పెద్దగా లేకపోతేనేం? యానాం ప్రజలకి ఆ పట్టింపులు బానే ఉన్నాయి. వాటిని చిత్రించిన కథలు 'కొత్త నది,' 'రథం కదలాలి.'

ముందుమాట రాసిన కవి శివారెడ్డి కి బాగా నచ్చిన కథ 'తోడు దీపం,' శ్రీరమణ 'మిథునం' కథని జ్ఞప్తికి తెస్తుంది. అలమండ పతంజలి రాజుగారి 'వీరబొబ్బిలి'ని పోలిన 'చక్రవర్తి' ని ఆ అలమండ నుంచే యానాం తీసుకొచ్చారు 'అవిశ్వాసం' కథ కోసం. ఫ్రెంచి పౌరసత్వం సంపాదించుకున్న వాళ్లకి ఆ ప్రభుత్వం భారీ నజరానాలు పెన్షన్ల రూపంలో ఇప్పటికీ ఇస్తూనే ఉంది. దీనిని ఇతివృత్తంగా తీసుకుని రాసిన కథలు 'బంగరు చూపు' 'ఒప్సియం.' యానాం ని ఆనుకునే ఉండే నీలపల్లి తూర్పు గోదావరి జిల్లాలోకి వస్తుంది. సరిహద్దు ఓ పెద్ద సమస్య, పాండిచ్చేరి, ఆంధ్ర పోలీసు, రెవిన్యూ వారికి. ఈ అంశాన్ని స్పృశిస్తూ రాసిన కథ 'భౌతికం' ఈ సంకలనంలో చివరి కథ.

యానాం వాతావరణం, గోదావరి, పచ్చదనం, గత వైభవం, వైవిధ్యం ఇవన్నీ ఆకర్షిస్తాయి. కవిత్వం నుంచి కథా రచనకి వచ్చిన దేవదానం రాజు కొన్ని కథలని చెప్పిన తీరు కించిత్ నిరాశ పరిచింది. కథావస్తువు చక్కనైనదే అయినా, కథనంలోనూ, సంభాషణలలోనూ దొర్లిన నాటకీయత శ్రుతిమించడం ఇందుకు కారణం. "ఇదే కథని రచయిత తిరగరాస్తే బాగుండేది," అన్న భావన అక్కడక్కడా కలిగింది. ఓ కొత్త వాతావరణంలోకి పాఠకులని అలవోకగా తీసుకు పోయిన రచయిత, కథని ఆసాంతమూ చదివిస్తారు.. చాలాచోట్ల ముగింపు దగ్గర కాసేపు ఆగి ఆలోచించేలా చేస్తారు. పుస్తకం చివరకి వచ్చేసరికి యానాం చిరపరిచితంగా అనిపిస్తుంది.

'యానాం కథలు' రెండోభాగం రాబోతోందన్న కబురుని అందించారు 'సాహితీ చలివేంద్రం లో కథాయానాం' పేరుతొ చివరి మాట రాసిన కవి శిఖామణి. (పాలపిట్ట బుక్స్ ప్రచురణ, పేజీలు 168, వెల రూ.100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

మంగళవారం, ఫిబ్రవరి 19, 2013

దోశాయణం

గుండ్రంగా ఉండే వాటిని గురించి తల్చుకోమంటే కొందరికి భూమాత గుర్తు రావచ్చు కానీ, ఎక్కువమందికి మొదట గుర్తొచ్చేది దోశే అవుతుంది. అవును మరి, ఎన్ని రకాలుగా తినొచ్చు అసలూ... వేడి వేడిగా, చల్ల చల్లగా, మెత్త మెత్తగా, కరకర్లాడుతూ... చట్నీతో, సాంబారుతో, సంబారు కారంతో ఇంకా పంచదారతో. నూనె పోసుకుని కాల్చుకుని, నూనె లేకుండా కాల్చుకునీ... ఎప్పుడు తినొచ్చూ అంటే... ఎప్పుడైనా తినేయచ్చు. ఉదయం బ్రేక్ఫాస్ట్ మొదలుకుని, మధ్యాహ్నం లంచికి బదులు, రాత్రి బోయినానికి బదులుగానూ కూడా ఆరగించగల దక్షిణ భారతదేశపు వంటకం ఇది.

దోశ అసలు పేరు దోసై అట.. దీని వెనుక ఓ కథ కూడా ఉంది. నేను చిన్నప్పుడు విన్న ఆ కథ ఏమిటీ అంటే.. అనగనగా ఓ రాజు గారు. ఆయనకి ఉదయాన్నే ఇడ్డెన్లు ఉంటే చాలు.. ఇంకేమీ అక్కర్లేదు. చట్నీలు, కారప్పొడి, సాంబారు... వీటన్నింటి తోనూ తలో నాలుగూ భోంచేసి బ్రేక్ఫాస్ట్ అయిందీ అనిపిస్తారు. పాపం, వంటవాడికి విసుగ్గా ఉన్నా తినేది రాజు గారు కాబట్టి, రోజూ రుచికరంగా వండి వడ్డించక తప్పదు. ఒకరోజు, ఓ చిన్న పొరపాటు వల్ల ఇడ్లీ పిండిలో నీళ్ళు కలిసిపోయి పల్చగా అయిపోతుంది.

ఓ పక్క రాజు గారు భోజన శాలకి వస్తున్నట్టు కబురు వచ్చేసింది. అప్పటికప్పుడు ఏం చేయడానికీ తోచక, ఓ రేకు కాల్చి దానిమీద ఈ పల్చని పిండి పోయగానే 'సుయ్' మని శబ్దం వస్తుంది.. తిరగేసినప్పుడు మళ్ళీ అదే శబ్దం.. శిరశ్చేధానికి సిద్ధపడిపోయిన వంటవాడు, శిక్ష తగ్గక పోతుందా అన్న ఆశతో, ఆ కొత్త వంటకం రాజుకి వడ్డిస్తాడు. వంటవాడి అదృష్టం బాగుండి రాజుగారికి ఆ వంటకం మహా నచ్చేసి, దాని పేరు ఏమిటని అడుగుతాడు. వంటవాడికి రెండు సార్లు సుయ్ మన్న శబ్దం గుర్తొచ్చి, 'దోసై' అంటాడు. ఆవేల్టి నుంచీ ఆస్థాన టిఫిన్ గా స్థిరపడ్డ దోసై రాన్రానూ దోశ గా పేరు మార్చుకుందన్న మాట.


దోశల్లో రకాలు కేవలం కాల్చడాన్ని బట్టి మాత్రమే కాక, వాడే పిండిని బట్టీ, మధ్యలో చేర్చే 'స్టఫ్' బట్టీ కూడా మారిపోతూ ఉంటాయి. మన అచ్చతెలుగు పెసరట్టుని కాసేపు పక్కన పెట్టి - అవసరమైతే ఈ అట్టుని గురించి ప్రత్యేకం మాట్లాడుకుందాం ఎప్పుడైనా - కేవలం దొశలనే తీసుకున్నా సాదా, ఉల్లి, మసాలా ఇలా ఎన్ని రకాలో. వంట చెయ్యడమే ఒక కళ అనుకుంటే, అందులో దోశలు కాల్చడం మరో ఉప కళ. మంచి పెనాన్ని ఎంచుకుని, మరీ ఎక్కువగానూ తక్కువగానూ కాకుండా వేడెక్క నిచ్చి, ఫ్రిజ్ నుంచి నార్మల్ టెంపరేచర్ కి వచ్చిన పిండి ని గరిట తో తీసి, కళాత్మకంగా తిప్పేసి, తిరగేస్తే దోశ రెడీ.

'మాడిపోయిన మసాలా దోశ' అన్నది ఇప్పుడో మంచి తిట్టుగా చెలామణీ అవుతోంది. దీని నుంచి తెలుసుకోవాల్సింది ఏమిటీ అంటే, దోశ మాడిపోకూడదు. అసలు పొగలు కక్కుతూ, బంగారు వర్ణంలో మెరిసిపోయే దోశని చూడగానే ఆకలి, ఆదిశేషుడి లాగా పడగ విప్పుకోదూ? ఇక, చట్నీల్లోకి వస్తే..దోశ లోకి అన్ని రకాల చట్నీలూ పనికిరావు. ప్రత్యేకంగా, కమ్మగా, కొంచం కారంగా ఉండాలి.. సాంబారు అయితే పొగలు సెగలుగా ఉండాలి. అప్పుడైతేనే దోశ కి రుచి పెరుగుతుంది మరి. పంచదారతో పిల్లలే కాదు, కొందరు పెద్దవాళ్ళూ తింటారు దోశని.

కొన్ని కొన్ని హోటళ్ళు, రెస్టారెంట్లు దోశలకి బాగా ఫేమస్. భాగ్యనగర వాసులలో దోశ ప్రియులు 'చట్నీస్' దోశని రుచి చూసే ఉంటారు. ఇవి మాత్రమేనా... ఉడిపి హోటళ్ళ మొదలు, గోదారొడ్డున రావి చెట్టుకింద ఉండే పుల్లట్ల 'ఒటేళ్ళ' వరకూ ఎవరి దోశ వాళ్ళదే. ఒక్కొక్కరి దోశదీ ఒక్కో ప్రత్యేకత. అన్నట్టు, 'అందాల రాముడు' మొదలు 'గోదావరి' వరకూ చాలా సినిమాల్లో అట్లమ్మిలు తగుమాత్రం పాత్ర పోషించారు. ఇక బీవీఎస్ రామారావు రాసిన 'పుష్కరాల రేవులో పుల్లట్లు' కథ గురించి గతంలో ఒకసారి చెప్పుకున్నాం కదా. ఏతా వాతా చెప్పొచ్చేది ఏమిటంటే... దోశని ఎంతమాత్రం చిన్నచూపు చూడకండి.

ఆదివారం, ఫిబ్రవరి 17, 2013

ఆనాటి వానచినుకులు

ప్రఖ్యాత సినిమా దర్శకుడు పతంజలి ఓ అందమైన డ్రీమర్. తనదంటూ ప్రత్యేకమైన లోకం. కథలు రాసుకోడం, సినిమాలు తీయడం తప్ప వేరే విషయాల్లో జోక్యం చేసుకోడు. సినిమా ఫంక్షన్లకీ, పత్రికల ఇంటర్యూలకీ బహు దూరం.'ప్రపంచంలో మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు?' అంటే, "నేనే" అన్నది పతంజలి సమాధానం. ఒంటరి తనాన్ని ఇష్టపడే పతంజలి అత్యున్నత సాహిత్యం మినహా సాదా సీదా పత్రికలు చదవడు. ఎవరితోనూ మాట్లాడడు. పతంజలి తో కొంచం చనువుగా మాట్లాడ గలిగేది, అతని సెక్రటరీ కృష్ణారావు మాత్రమే.

భావుకత్వాన్ని గురించి నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి పతంజలికి. ప్రతి ఒక్కరూ విన్సెంట్ వేంగో, పికాసో, ఎడ్మండ్ డ్యులాక్, బోరిస్ వెలిజోల లాంటి పాశ్చాత్య కళాకారుల వర్క్స్ ని స్టడీ చేయాలనీ, ఉమర్ ఖయ్యామ్, పిల్లలమఱ్ఱి చినవీరభద్రుడు, ఖలీల్ జిబ్రాన్ లాంటి కవుల్నీ, రేవతీదేవి లాంటి కవయిత్రులు అందించిన ఆహ్లాదాన్నీ జీర్ణం చేసుకోవాలనీ, పాల్ మారియట్, ఇన్నియొ మొర్రికాన్ని, హ్యూగో మాంటిగ్రో లాంటి వెస్ట్రన్ మ్యూజిక్ కంపోజర్స్ కంపోజిషన్స్ ని ఔపోసన పట్టాలనీ, అప్పుడు మాత్రమే భావుకత్వం అలవడుతుందనీ తరచూ చెబుతూ ఉంటాడు కృష్ణారావుకి.

బయటి ప్రపంచంతో నిమిత్తం పెట్టుకోడానికి పతంజలి ఇష్ట పడకపోయినా, అతన్ని అభిమానించే వాళ్ళు అనేకమంది ఉన్నారు. రోజూ ఎన్నో ఉత్తరాలు వస్తూ ఉంటాయి. పతంజలి జవాబులు రాయకపోయినా వాళ్ళు మాత్రం ఉత్తరాలు రాస్తూనే ఉంటారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గంధంవారి పాలెం లో స్కూల్ టీచర్ గా పని చేస్తున్న ఎన్నెస్ నారాయణ రావు అలాంటి అభిమానుల్లో ఒకడు. తన నూట నాలుగో ఉత్తరంలో, పతంజలి చేతి రాతతో నాలుగు లైన్ల ఉత్తరాన్ని కోరుకుంటాడు నారాయణరావు.

కార్తీక పౌర్ణమి రాత్రి నిండు చంద్రుడిని ఆస్వాదిస్తూ, వైట్ రమ్ చప్పరిస్తూ, పింక్ ఫ్లాయిడ్ ట్రాక్ వింటున్న పతంజలి తన తర్వాతి సినిమాకి కథ ఆలోచిస్తున్న సమయంలో వస్తాడు కృష్ణారావు. విషయాన్ని వేమన పద్యమంత క్లుప్తంగా చెప్పి, నారాయణ రావుకి నాలుగు లైన్ల జవాబు ఇమ్మని కోరతాడు. మండిపడ్డ పతంజలి, కృష్ణారావుకి చనువిచ్చి తప్పు చేస్తున్నా అంటాడు. అభిమానులని గౌరవిస్తేనే వారిద్వారా భావుకుల సంఖ్య పెరుగుతుందని వాదించే ప్రయత్నం చేసి ఓడిపోయిన కృష్ణారావు మర్నాడు ఆఫీసుకి రాడు.

కృష్ణారావు ఇల్లు వెతుక్కుంటూ వెళ్లి అతన్ని తీసుకువచ్చిన పతంజలి, నారాయణ రావుకి జవాబు రాయడంతో పాటు తన ఫోటో కూడా పంపానని చెబుతాడు. గంధం వారి పాలెంలో ఉన్న ప్రతి గడప నుంచీ ఉత్తరం వస్తుంది పతంజలికి. పౌర సన్మానానికి ఆమోదించమని. గ్రామీణ వాతావరణం నేపధ్యంగా పతంజలి తీయబోయే తర్వాతి సినిమాకి ఈ ట్రిప్ ఉపయోగ పడుతుంది కాబట్టి ఒప్పుకొమ్మని సలహా ఇస్తాడు కృష్ణారావు. అతను చెప్పింది సబబుగా తోచడంతో సరే అంటాడు పతంజలి.

ఎన్నో ఇబ్బందులు పడుతూ, భావుకత్వాన్ని గురించి కృష్ణారావు కి లెక్చర్లు ఇస్తూ గంధం వారి పాలెం చేరుకున్న పతంజలికి ఊహించని షాక్ తగులుతుంది, రిక్షా అబ్బి గోపాలం రూపంలో. ఒక మనిషి భావుకుడు కావాలంటే ఏమీ చదవక్కర్లేదనీ, ఏదీ వినక్కలేదనీ, ఎవరినీ పరిశీలించనవసరం లేదనీ, భావుకుడు జన్మిస్తాడే తప్ప తయారు కాడనీ పతంజలి ఎలా తెలుసుకో గలిగాడు అన్నదే వంశీ రాసిన 'ఆనాటి వానచినుకులు' కథ. ఇదే పేరుతో ఎమెస్కో విడుదల చేసిన సంకనంలోనూ, వంశీ ఇటీవలి సంకలనం 'ఆకుపచ్చని జ్ఞాపకం' లోనూ ఉందీ కథ. వంశీ కథల్లో నాకు బాగా నచ్చే వాటిలో ఇదీ ఒకటి.

(ఉదయం రోడ్డు మీద వెడుతూ ఉండగా ఓ ఆటో వెనుక రాసిన వాక్యం 'పువ్వు పూజ కోసం...పూజ నీకోసం...నువ్వు నాకోసం'  ఈ కథని గుర్తు చేసింది...బ్లాగ్మిత్రులకీ గుర్తు చేద్దాం అనిపించి...)

గురువారం, ఫిబ్రవరి 14, 2013

అబ్బాయి తండ్రికి...

యువరాజా వారి తండ్రి గారికి,
చిరంజీవి రాజావారి తల్లి వక్కపొడి నములుతూ వ్రాయునది ఏమనగా....

శ్రీవారూ... చిలిపి నవ్వుల శ్రీవారూ,

ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీ అబ్బాయి నన్ను మధ్యాహ్నం పూట కాసేపు నడుం వాల్చనివ్వడం లేదు తెలుసా.. "నువ్వలా పగలు పడుకుంటే, పుట్టేవాడు నిద్ర మొహం వాడు అవుతాడు" అంటూ ఇంట్లో అందరూ కలిసి బెదిరించేశారు. ఇంకేం చేస్తానూ..ఆయనగారి కబుర్లు వింటూ కాలక్షేపం చేస్తున్నాను. మీరిక్కడ ఉంటే నా పొట్టకి తల ఆన్చి వాడి అల్లరి వినే వారు కదూ. నాకూ మిమ్మల్ని విడిచిపెట్టి రావాలని అనిపించలేదు కానీ, 'తొలిచూలు...పుట్టింట్లోనే' అని పెద్దవాళ్ళు అందరూ అంటుంటే ఏమీ మాట్లాడలేకపోయాను, మీలాగే.

ఒక్కో మాట రాస్తున్నప్పుడూ గాజులన్నీ గలగల్లాడుతున్నాయండీ. మోచేతుల వరకూ తొడిగేశారు కదూ మొన్ననే, సీమంతం అనీ. అన్నట్టు మీకు చెప్పలేదు కదూ.. "నువ్వేదో అనుకుంటున్నావ్ కానీ అక్కా.. సీమంతానికి వచ్చిన నా స్నేహితురాళ్ళని బావగారు తదేకంగా చూశారేవ్" అంటూ చెల్లి నన్ను ఆట పట్టించ బోయింది. అసలే మీరు వెళ్లిపోయారన్న చికాకులో ఉన్నానేమో, ఒక్క కసురు కసిరాను దాన్ని. ముఖం చిన్నబుచ్చుకుంది పాపం. ఆవేళ నన్ను చూడ్డానికే మీ రెండు కళ్ళూ చాల్లేదని దానికేం తెలుసూ, వెర్రి మొహంది.

ఏమిటో...నిన్న కాక మొన్ననే ఆషాఢమాసం వెళ్లినట్టు ఉంది.. రోజులెంత తొరగా గడిచిపోతున్నాయో.. అలాగని మిమ్మల్ని వదిలిపెట్టి వచ్చేశాక ఉన్నట్టుండి గడియారం తిరగడం మానేసింది తెలుసా. ఇదిగో, ముందే చెబుతున్నాఇప్పుడు మీ ఉత్తరంలో "అరెరె..గడియారం పాడయిందా..వెంటనే సులేమాన్ షాపుకి పట్టుకెళ్ళి బాగుచేయించమని చెప్పు మీ నాన్నారికి" అని రాస్తే అస్సలు ఊరుకునేది లేదు. ఏం చెబుతున్నానూ? గడియారం గురించి కదూ.. ఉహు..అదేమిటో, చుట్టూ ఇంతమంది ఉన్నా అస్సలు తోచడం లేదండీ.

అక్కడినుంచి తెచ్చుకున్న ఊలు బంతులతో బుజ్జిగాడికి స్వెట్టరూ, మేజోళ్ళూ అల్లానా? తమ్ముడేమో రోజుకోసారైనా ఆ మేజోళ్ళలో వాడి వేళ్ళు పెట్టి చూసి, "ఏమిటక్కా? నా రెండు వేళ్ళంత కూడా ఉండదా వాడి పాదం? ఊలు కావాలంటే నే తెచ్చి పెడతా కానీ, కొంచం పెద్దవి అల్ల"మని విసిగిస్తున్నాడు. బామ్మకి బొంతలు కుట్టడానికే రోజంతా చాలడం లేదు. చేటలంతా, చెదరలంతా బుజ్జి బుజ్జి బొంతలు. మొన్నటికి మొన్న, "పుల్లేటికుర్రు చీరతో కుట్టిన బొంతైతే చంటాడు హాయిగా నిద్దరోతాడే అమ్మా" అంటూ కుట్టడానికి కూర్చుంది. అమ్మా నాన్నా ఏదో పరిక్షకి వెళ్ళే వాళ్ళలాగా దీక్షగా చదివేస్తున్నారు పంచాంగాన్ని. అంతేనా, ఏ ముహూర్తంలో పుడితే మనవడు చక్రవర్తి అవుతాడో లెక్ఖలు వేసేస్తున్నారు.

అష్టకష్టాలూ పడి మీకు అత్తిసరుతో పాటు, వేపుడు ముక్కలు వేయించడం, చారు పెట్టడం నేర్పించాను. ఎన్ని తిప్పలు పెట్టారు నన్నూ.. ఇంతకీ వంటింటి వైపైనా చూస్తున్నారా? కేరియర్ బోయినమేనా? నిలవ పచ్చళ్ళూ, పొడులూ అన్నీ ఉన్నాయ్. చిన్న గిన్నెతో అత్తిసరు పడేసుకున్నా చాలు మీకు. ఇక్కడ నన్నేమో అమ్మా, బామ్మా మొదలు పక్కింటి నరసమ్మమ్మ గారు, వెనక వీధి సుందరత్తయ్య గారివరకూ అందరూ అడగడమే... "పిల్లా... ఏమన్నా తినాలని ఉందా? చేసి పంపమా?" అని..నేను వద్దు అంటుంటే, తమ్ముడూ, చెల్లీ అడ్డు పడి "చెయ్యమను అక్కా...మేం తిని పెడతాం కదా" అని గోల చేస్తున్నారు.

అబ్బా...మీ అబ్బాయి కదులుతున్నాడండీ.. చిట్టి చిట్టి కాళ్ళూ, చేతులూ కదలడం తెలుస్తోంది. చక్కిలిగిలి పెట్టడంలో తండ్రికేమీ తీసిపోడు తెలుసా? వీడు మీ అంతటి వాడు అవ్వాలండీ.. ఆ పాడు సిగరెట్టు మాత్రం అలవాటు అవ్వకుండా కాసుకోవాలి బుజ్జి నాయినకి. మొగుడి సిగరెట్టు ముద్దు - నా కోడలికి నేను ఇవ్వలేను బాబూ.. మరేమో ఇప్పుడు నన్ను చూసి, వాడు ఎలా ఉంటాడో చెప్పేస్తోంది బామ్మ. పనస పండులాగా ఉంటాట్ట, రింగురింగుల జుట్టు ఉంటుందిట. పాపం నాకు మూడు పూటలా దిష్టి తీసేస్తోంది, ఆయాస పడుతూనే.

ఏమిటీ మూతి బిగించారు? పుట్టబోయేది అబ్బాయే అని చెప్పేస్తున్నాననా? నాకు తెలియదు కనుకనా మీ కోరిక.. ఆ వేళ ఆస్పత్రి నుంచి రాగానే, నా ఒళ్లో తలపెట్టుకుని పడుకుని చెప్పారు కారో.. వెండి మువ్వల పట్టీలు పెట్టుకున్న పారాణి పాదాలతో, పట్టు పరికిణీ ని కొంచం పైకి పట్టుకుని నట్టింట్లో ఆడపిల్ల ఘల్లు ఘల్లున తిరిగితే చూడాలని కదూ మీ ఆశ. పుడుతుందండీ.. మన బుల్లి తండ్రికి ఓ చెల్లెలు పుడుతుంది. అసలు మీరు తలచుకుంటే అదెంత పని కనుకా? (ఈ మాట రాశాక, సిగ్గేసింది.. కొట్టేద్దామా అనుకున్నాను కానీ, చదివేది మీరే కదా అనీ..) ఆడపిల్లకి ఓ అన్నయ్య ఉంటే ఆ అందమే వేరు కదండీ.

ఏవండీ... మరీ...చుట్టూ అందరూ ఉన్నా ఒక్కోసారి నాకెందుకో బెంగగానూ, భయంగానూ అనిపిస్తోంది. మీరు గట్టిగానే చెప్పేశారు కదా "ఇంట్లో వద్దు..ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందే" అనీ. డాక్టర్లూ వాళ్ళూ ఉంటారు కానీ, ఆ వేళకి మీరూ నా పక్కన ఉండరూ...  నాకు తెలుసు మీ మనసు ఇక్కడే ఉంటుందని. నాన్నారి టెలిగ్రాం అందగానే వెంటనే వచ్చేయాలి మరి. పైకి బింకంగా ఉన్నారు కానీ, నాన్నారికీ లోపల్లోపల బెంగగానే ఉంది. నేను వినడం లేదనుకుని బామ్మే ధైర్యం చెబుతోంది ఆయనకి. మీరు జాగ్రత్త... ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది మిమ్మల్నీ,  మీ అబ్బాయినీను. చాలా సేపటి నుంచీ కూర్చుని ఉన్నాను కదా, నడుం కొంచం నొప్పిగా అనిపిస్తోంది. నిద్రపోను కానీ, కాసేపు వెన్ను వాలుస్తానండీ...ఉంటానూ. -'యువరాజ' మాత

(బ్లాగ్మిత్రులకు వేలంటైన్స్ డే శుభాకాంక్షలు!!)

మంగళవారం, ఫిబ్రవరి 12, 2013

ఎదురరయని వేళ...

పరిక్షలు రాసేశాం..పాసవుతామని కూడా నమ్మకమే..కానీ అప్పుడే వచ్చిన రిజల్ట్స్ లో మన నెంబర్ కనిపించిన క్షణంలో కించిత్తన్నా ఉద్వేగం కలగకుండా ఉంటుందా? ప్రమోషన్ వచ్చింది అన్న గాలివార్త అందడానికీ, ఆర్డర్ కాగితం చేతికి రాడానికీ మధ్య ఉండే తేడా... ఇది కూడా అంతే కదూ.. ఊహించనివి జరగడం కొన్నిసార్లు బాగుంటుంది...కానీ, ఊహించినవి జరగడం ఇంకా బాగుంటుంది.. ఎప్పుడూ కీడుని మాత్రమే ఎంచే వాళ్లకి మాత్రం, ఈ విషయంలోమినహాయింపు ఇవ్వాల్సిందే.

ఊహలు ఎప్పుడూ అందంగా ఉంటాయి. ఊహలు నిజమవ్వడమూ బాగుంటుంది. కానైతే ఊహలో ఉండే అందం, నిజంలో ఉంటుందా? అంటే... అది తీసుకునే వాళ్ళనీ తీసుకునే తీరునీ బట్టి ఉంటుంది. ఏదో ఒక పెద్ద చదువునో, ఉద్యోగాన్నో లక్ష్యంగా ఎంచుకుని, దాన్ని సాధించడానికి అహరహం శ్రమ పడే వాళ్ళు, ఆ శ్రమని యెంతగానో ఆస్వాదిస్తారు. లక్ష్యాన్ని చేరుకున్నాక కూడా, అదే ఆనందం ఉంటుందా అంటే, జవాబు చెప్పడం కష్టమే. కోరుకున్నది దొరికినప్పుడు తృప్తి కలుగుతుంది. కానీ చాలామందికి కొంతకాలం పోయాక అసంతృప్తి మొదలవుతుంది.

లక్ష్యాన్ని చేరుకున్నాక, విజయాన్ని పూర్తిగా ఆస్వాదించే వాళ్ళతోపాటు, "ఇకమీదట ఏమిటి?" అని ఆలోచించే వాళ్ళూ ఉంటారు. అంతేకాదు, ఒక వృత్తిలోనో, ఉద్యోగంలోనో ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు (డాక్టర్లు, లాయర్లు మినహా) ఎదుగుతున్న తమ పిల్లలు అదే రంగంలోకి రావడాన్ని ఆహ్వానించరు. కెరీర్ పట్ల వాళ్ళలో పేరుకున్న అసంతృప్తిని ఇందుకు కారణంగా చెప్పొచ్చు. "ఇందులో గ్రోత్ ఉండదు అని నేనే వద్దన్నా..." అనే మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది అందుకే. ప్రపంచీకరణ కారణంగా అవకాశాలు పెరగడాన్ని కూడా గమనించాలి ఇక్కడ.

ఓ తరహా జీవితానికి అలవాటు పడి, మార్పుని ఏమాత్రమూ ఆహ్వానించలేని వాళ్లతో పాటు, అనుక్షణం మార్పుని కోరుకునే వాళ్ళూ కనిపిస్తారు మన చుట్టూ. నిజానికి ఇలా కోరుకునే వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతోంది కూడా. మార్పు అనివార్యమనీ, ఆహ్వానించక తప్పదనీ చాలా సంస్థలు తమ ఉద్యోగులకి బోధిస్తున్నాయి. ఇలా బోధించడం కూడా ఓ కార్పోరేట్ స్థాయి వ్యాపారంగా విస్తరించిందీ అంటే, 'మార్పుని ఆహ్వానించడం' అన్నది ఎంతటి ప్రాముఖ్యాన్ని సంతరించుకుందో అర్ధమవుతుంది.

మార్పన్నది ఎప్పుడూ వచ్చి పడిపోతూ ఉంటే ఇక ఎదురు చూపులూ, ఎదురరయని వేళలూ ఉండేది ఎప్పుడు? జీవితాల్లో పెరిగిపోయిన వేగం, ఎదురు చూపుని తగ్గించి వేస్తోందా? ముందు చూపు పెరగడంతో, ఎదురుచూపు అనవసరం అనిపిస్తోందా? ఆలోచించే కొద్దీ ఎన్నో ప్రశ్నలు. కానీ ఒకటి, దేనికోసమైనా సరే... ఎదురు చూపు బాగుంటుంది. మరీ ముఖ్యంగా కావాల్సింది దొరికేసినప్పుడు, వెనక్కి తిరిగి చూసుకుంటే గడిచిపోయిన ఎదురుచూపు అందంగా కనిపిస్తుంది. అసలైతే, ఎదురు చూడడం వల్లే సాధించుకున్నది మరింత ప్రియమైనదిగా అనిపిస్తుంది కూడా.

"బ్రతుకంతా ఎదురు చూచు... పట్టున రానే రావు... ఎదురరయని వేళ వచ్చి ఇట్టే మాయమవుతావు.." అని నాయిక చేత పాడించారు భావకవితా చక్రవర్తి దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి. ఆ నాయికే, "దారిపొడవునా తడిసిన పారిజాతములపై...నీ అడుగుల గురుతులే నిలచినా చాలును" అంటుంది. యెంత అందమైన ఎదురుచూపో కదా అసలు.. ఎంతగానో ఎదురుచూసినా, ఊహించని సమయంలో యిట్టె వచ్చే అట్టే వెళ్ళిపోతాడు అనడంతో పాటు, అతడు వచ్చి వెళ్ళిపోయినా, ఆ పాదముద్రలు చాలు అంటోంది ఆమె. ఎదురరయని వేళల్లో ఎదురయ్యే అనుభవాలు అనేకాలు కదూ మరి..

శుక్రవారం, ఫిబ్రవరి 08, 2013

తప్పని ఖర్చు...

మన రక్షణ శాఖ మరో సారి వార్తల్లోకి వచ్చింది. గత కొద్ది నెలలుగా ఈ శాఖకి సంబంధించి మంచి కన్నా చెడే ఎక్కువగా ప్రచారంలోకి వస్తోంది. అప్పట్లో కొన్ని రోజుల పాటు ఏరోజు ఏ పేపర్ చూసినా డిఫెన్స్ గురించిన సంచలన వార్తలే. సైనికులు తిరుగుబాటు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న కథనం మొదలు, ఆ శాఖ అధికారి పదవీ విరమణ వరకూ ఇవే విషయాలు పేపర్లలోనూ, టీవీ వార్తా చానళ్ళ లోనూ కూడా. తాజా సమస్య ఏమిటీ అంటే, వచ్చే ఆర్ధిక సంవత్సరానికి రక్షణ శాఖకి కేటాయించే బడ్జెట్ తగ్గ బోతోందా? అని.

అనేక ప్రపంచ దేశాల్లాగే భారత దేశానికి కూడా 2012 ఏమంత కలిసిరాని సంవత్సరమే. అంతర్జాతీయంగా వచ్చి పడిన ఆర్ధిక మాంద్యం ప్రభావం భారత దేశం లో బాగానే కనిపించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని, ఈమధ్యనే కేంద్ర ఆర్ధిక శాఖ వచ్చే ఆర్ధిక సంవత్సరానికి తయారు చేసే బడ్జెట్ లో కనీసం పది శాతం కోత విధించుకోమని అన్ని శాఖలకీ 'సూచించింది.' ఈ అన్ని శాఖల్లోకీ రక్షణ శాఖ కూడా వస్తుంది కాబట్టి, చర్చ మొదలయ్యింది. పేపర్లలో వ్యాస పరంపరలూ, జాతీయ వార్తా చానళ్ళలో చర్చోప చర్చలు జోరుగా సాగుతున్నాయి.

గత కొద్ది సంవత్సరాలుగా భారతదేశపు రక్షణ బడ్జెట్లో పెరుగుదల రేటు చెప్పుకోదగ్గదిగా లేదు. మిగిలిన దేశాలు, మరీ ముఖ్యంగా సరిహద్దు దేశాలు అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకుంటూ ఉంటే, మన రక్షణ దళాలు పాతకాలపు ఆయుధాలనే వాడాల్సి వస్తోంది అన్నది తరచూ వినిపిస్తున్న ఫిర్యాదు. ఇది మన సైనికుల స్థైర్యాన్ని దెబ్బతీసే విషయమే కదా. అలాగే, పెరుతుగున్న అవసరాలకి, సైనికుల సంఖ్యకీ సామ్యం కుదరడం లేదు అన్నది మరో ఫిర్యాదు. ఎప్పటికప్పుడు యువకులని రక్షణ దళాల్లోకి తీసుకుని, వాళ్లకి శిక్షణ ఇచ్చి, తయారుగా ఉంచడంలో వెనుకంజ కుదరదు.

దేశంలో అనేక మంది అన్నం, నీళ్ళూ లేక అలమటిస్తూ ఉంటే, చాలా మంది పేవ్ మెంట్ల మీద నిద్రపోతూ ఉంటే, వాళ్ళని గాలికి వదిలేసి ఆయుధాల కొనుగోలు మీద అంతలేసి మొత్తాలు వెచ్చించడం ఏమి న్యాయం? అన్నది రక్షణ వ్యయం మీద తరచుగా వినిపించే విమర్శ.వాళ్ళనీ, వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళనీ కూడా ప్రాణాలతో నిలబెట్టాలి అంటే, స్వేచ్చగా ఊపిరి పీల్చుకోనివ్వాలి అంటే ఈ ఖర్చు తప్పదు. ఓ పక్క పొరుగు దేశాలు వాళ్ళ సరిహద్దుల్ని మార్చేసుకుని, మన ప్రాంతాలని వాళ్ళ మ్యాపులలో కలిపేసుకుంటూ ఉన్నప్పుడు, రక్షణ శాఖని నీరసింప జేయడం ఎలాంటి సంకేతాలు ఇస్తుంది?

సరిగ్గా ఈ నేపధ్యంలో, ఓ ఆసక్తికరమైన వార్తా కథనం కంటపడింది. 2020 నాటికి రక్షణ వ్యయం విషయంలో భారత దేశం ప్రపంచంలో నాలుగో స్థానానికి ఎగ బాకుతుందనీ, రాబోయే రోజుల్లో యుద్ధ పరికరాల అమ్మకాల్ని బహు చక్కని మార్కెట్ కాగలదనీ అంచనా వేస్తూ రిపోర్ట్ తయారు చేసింది ఓ అంతర్జాతీయ సంస్థ. ఇన్ఫర్మేషన్ హ్యాండ్లింగ్ సర్విసెస్ (ఐహెచ్చెస్) సంస్థ ప్రకారం, ఈ దశాబ్ది చివరికి వచ్చేసరికి రక్షణ కొనుగోళ్లలో యునైటెడ్ స్టేట్స్, చైనా, రష్యాల తర్వాత నాలుగో స్థానం భారత దేశానిదే అవుతుంది. ఫ్రాన్స్, జపాన్, యూకెలు భారత్ తర్వాతి స్థానాల్లో ఉంటాయి. ప్రస్తుతం ఆర్ధిక మాంద్యం ప్రభావం ఉన్నప్పటికీ 2015-20 మధ్యలో భారత దేశం రక్షణ మీద పెద్ద మొత్తాలని వెచ్చిస్తుంది అన్నది ఈ సంస్థ అంచనా.

రక్షణ శాఖలో జరుగుతున్న దుబారా వ్యయాన్ని గురించి కూడా ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. అనవసరమైన చోట ఖర్చు చేయడం, అవసరానికి మించి ఖర్చు చేయడం అన్నది ఈ సంస్థ తరచుగా ఎదుర్కొంటున్న విమర్శ. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీతో నిమిత్తం లేకుండా, ఈ ఖర్చు విషయంలో ఈ శాఖ తప్పు పట్టబడుతూనే ఉంటోంది. కొనుగోళ్ళకి వచ్చేసరికి, యుద్ధ విమానాల మొదలు, శవ పేటికల వరకూ ప్రతి ఖర్చూ వివాదాస్పదమే అవుతోంది. కేవలం బడ్జెట్ ని మాత్రమే కాదు, పారదర్శకతని పెంచడమూ అవసరమే. ఇది అన్ని శాఖలకీ వర్తించినా, రక్షణ శాఖకి మరికొంచం ఎక్కువే వర్తిస్తుంది. ఎందుకంటే, సైన్యం అనగానే మొదట గుర్తుకు వచ్చేది క్రమశిక్షణే కదా మరి.

మంగళవారం, ఫిబ్రవరి 05, 2013

కాశ్మీర పట్టమహిషి

కాశ్మీర రాజ్యాన్ని ప్రతాపాదిత్య చక్రవర్తి పాలిస్తున్న కాలం. రాజధాని కాశ్మీర నగరంలో పేరుమోసిన వజ్రాల వర్తకుడు నోణక శ్రేష్ఠి. చక్రవర్తికే అప్పు ఇవ్వగల కుబేరుడు ఆ వ్యాపారి. నోణకశ్రేష్ఠి భార్య నరేంద్ర ప్రభ. చామన ఛాయలో ఉండే ప్రభది చూడగానే ఆకర్షించే సౌందర్యం. పైగా ఆమె వీణా వాదంలోనూ, నృత్యంలోనూ దిట్ట. అతిధి మర్యాదలు ఎవరైనా సరే ఆమె దగ్గర నేర్చుకోవాల్సిందే. వ్యాపారం వినా మిగిలిన విషయాలు శ్రేష్ఠికి ఏమంత ఆసక్తి కలిగించవు. అయితే, భార్య సంగీత, నృత్య సాధనకి అతను అడ్డు చెప్పడు.

పెళ్లై ఏళ్ళు గడుస్తున్నా సంతానం కలగకపోవడంతో చింత మొదలవుతుంది శ్రేష్ఠిలో. "తమకి ఇంకా వయసు అయిపోలేదు కదా" అన్న ధోరణి ప్రభది. అయితే, రాను రానూ శ్రేష్ఠిలో అసంతృప్తి పెరగడం గమనించిన ప్రభ, తన దూరపు బంధువు కమలాలయని ఇచ్చి శ్రేష్ఠికి ద్వితీయ వివాహం దగ్గరుండి జరిపించింది. కమలాలయ కాపురానికి వచ్చినా, ప్రభమీద ఇష్టం తగ్గలేదు శ్రేష్ఠికి. కమలాలయ కూడా ప్రభకి విధేయంగానే ఉంటుంది కొంతకాలం. అయితే, రోజులు గడిచేకొద్దీ శ్రేష్ఠిని తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది.

సరిగ్గా ఇదే సమయంలో, చక్రవర్తి ప్రతాపాదిత్యుడు నోణక శ్రేష్ఠి దగ్గర వజ్రాలు కొనాలని సంకల్పిస్తాడు. శ్రేష్ఠిని తన ఆస్థానానికి పిలిపించడానికి బదులు, తనే ఆ వ్యాపారి ఇంటికి బయలుదేరతాడు. చక్రవర్తే స్వయంగా తన ఇంటికి వస్తున్నాడని తెలిసిన శ్రేష్ఠి ఆనందానికి హద్దులు ఉండవు. పెరగబోయే తన పరపతీ, వ్యాపారం తల్చుకుని తనకి దశ తిరిగిందని సంబరపడతాడు. నరేంద్ర ప్రభ ఆధ్వర్యంలో అతిధి మర్యాదలు ఘనంగా జరుగుతాయి. వచ్చినవాడు చక్రవర్తి కదా మరి. చక్రవర్తి గౌరవార్ధం తన వీణ మీద కచేరీ చేస్తుంది ప్రభ. పరవశుడైన చక్రవర్తి ఆమెకో విలువైన హారాన్ని బహుమతిగా ఇస్తాడు.


అది మొదలు, శ్రేష్ఠి ఇంటికి చక్రవర్తి రాకపోకలు పెరుగుతాయి. చక్రవర్తే స్వయంగా విలువైన వజ్రాలు ఎన్నో కొనడంతో పాటు, ప్రభువు మనసెరిగిన రాజ బంధువులూ నోణక శ్రేష్ఠి దగ్గరే విలువైన ఆభరణాలు కొనుగోలు చేయడం మొదలు పెట్టడంతో, ఊహించిన కన్నా వేగంగా శ్రేష్ఠి వ్యాపారమూ, పరపతీ కూడా పెరుగుతాయి రాజధాని నగరంలో. చక్రవర్తి వచ్చిన ప్రతిసారీ, తనకి ఇష్టం ఉన్నా లేకున్నా కచేరీ ఇవ్వక తప్పదు నరేంద్ర ప్రభకి. చక్రవర్తి, ప్రభపై మనసు పడ్డాడని అనుమానిస్తుంది కమలాలయ. అయితే, పెదవి విప్పి భర్తతో చెప్పదు.

వ్యాపారాన్ని రెట్టింపు చేసుకునే ప్రణాళికలు రచించడంలో శ్రేష్ఠి తలమునకలై ఉండగా, ఉన్నట్టుండి చక్రవర్తి రాకపోకలు నిలిచిపోతాయి. వజ్రాల కొనుగోళ్ళు తగ్గుముఖం పట్టి, రానురానూ లేకుండా పోతాయి. ఏం జరిగిందో శ్రేష్ఠికి అర్ధం కాదు, కానీ ఇదేపరిస్థితి కొనసాగితే మాత్రం తను త్వరలోనే వ్యాపారం మూసేయాల్సి వస్తుందని మాత్రం కచ్చితంగా తెలుస్తుంది. చక్రవర్తి దర్శనానికి ప్రయత్నాలు చేసి భంగపడ్డ శ్రేష్ఠి, ప్రధానమంత్రి శివశర్మ ని కలిసి తన గోడు వెళ్ళబోసుకుంటాడు. మంత్రి ద్వారా తెలిసిన కబురు విని నిశ్చేష్టుడు అవుతాడు శ్రేష్ఠి.

చక్రవర్తి, నరేంద్ర ప్రభతో పూర్తిగా ప్రేమలో మునిగిపోయి ఉన్నాడనీ, కానీ ధర్మం తప్పని వాడు అవ్వడం వల్ల, తనలో తను వేదన పడుతున్నాడనీ, ఆ కారణానికే శ్రేష్ఠిని పూర్తిగా దూరం పెట్టాలని భావించాడనీ, ప్రధానమంత్రి ద్వారా విన్న నోణక శ్రేష్ఠికి గొంతు తడారిపోతుంది. చివరికి తేరుకుని, రాత్రివేళ చక్రవర్తి తన భవంతికి వస్తూ పోతూ ఉండ వచ్చనీ, అలా కాని పక్షంలో నరేంద్ర ప్రభని తను అంతఃపురానికి రహస్యంగా పంపగలననీ మంత్రికి ప్రతిపాదించి, భంగ పడతాడు. నోణక శ్రేష్ఠి, ప్రభకి విడాకులు ఇచ్చి ఆమెని అంతఃపురానికి సమర్పించవచ్చుననీ, అది ధర్మబద్ధమనీ సూచిస్తాడు శివశర్మ.

చక్రవర్తికి తనమీద ఏర్పడిన ప్రేమ కారణంగా, నిశ్చలంగా సాగిపోతున్ననరేంద్ర ప్రభ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, చివరికి ఆమె తీసుకున్న నిర్ణయం, దాని తాలూకు పర్యవసానాలు ఏమిటన్నదే, పిలకా గణపతి శాస్త్రి నలభై ఆరేళ్ళ క్రితం రాసిన 'కాశ్మీర పట్టమహిషి' నవల. పిలకా వారి రచనల్లో 'విశాల నేత్రాలు' తర్వాత అంతగా ఆకట్టుకున్న మరో నవల ఇదే. కల్హణ కాశ్మీర తరంగిణి ని ఆధారం చేసుకుని ఈ నవలతో పాటు, 'చైత్ర పూర్ణిమ' పేరిట శాస్త్రి గారు వెలువరించిన కాశ్మీర కథల సంకలాన్ని కలిపి ప్రచురించింది ఎమెస్కో. నవలతో పాటు, కథలు కూడా పాఠకులని కాశ్మీర వీధుల్లో తిప్పి తీసుకువచ్చేవే.(పేజీలు 288, వెల రూ. 125, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

ఆదివారం, ఫిబ్రవరి 03, 2013

శ్వేత కాష్టం

అలవాట్లని ఇంగ్లీష్ వాడు 'హేబిట్స్' అంటాడు. ఇవి చాలా చిత్రంగా మొదలవుతాయి. మొదలైతే ఓ పట్టాన వదలవు. చదువుకునే రోజుల్లో, ఈ హేబిట్స్ లో చెడ్డవాటికి దూరంగా ఉండాల్సిన అవసరం గురించి మా మేష్టారు క్లాసులో చెప్పారు. నిజానికి అది పాఠం లో లేదు... సిలబస్ లో లేకపోయినా, పనికొచ్చే విషయాలు తన హేబిట్ అని కూడా ఆయన చెప్పారు, హేబిట్స్ లో మంచివి కూడా ఉంటాయి అని చెబుతూ. చెడ్డ వాటికి దూరంగా ఎందుకు ఉండాలీ అన్నదానికి ఆయన చెప్పిన వివరం భలే గుర్తుండి పోయింది.

నల్లబల్ల మీద సుద్దముక్కతో స్పెల్లింగ్ రాసి అప్పుడు మొదలు పెట్టారు. "హేబిట్ అన్నది ఓ పట్టాన వదలదు. ఇదిగో ఇక్కడ రాశాను చూడండి. హెచ్ ఏ బి ఐ టి ...ఇది కదా స్పెల్లింగు. మనం కష్టపడి హేబిట్ ని కొంచం తగ్గించాం అనుకోండి...హెచ్ తీసేద్దాం.. ఇంకా ఏ బిట్ ఉంది. మరి కొంచం కష్టపడి ఏ తీసేసినా బిట్ ఉంది ఇంకా... మరి కొంచం కస్టపడి బీ తీసేసినా ఇట్ ఉండిపోయింది... చూశారా ఎంత కష్టమో, హేబిట్ ని వదుల్చుకోవడం..." హేబిట్ స్పెల్లింగ్ తో పాటు, ఆ వివరమూ మర్చిపోలేని విధంగా గుర్తుండి పోయింది.

మేష్టార్లు ఏం చెప్పినా పిల్లలు కిక్కురుమనకుండా వింటారు కానీ, సాటి పిల్లలు చెబితే అస్సలు వినరన్న జ్ఞానం కలగడానికి కొంచం ఆగాల్సి వచ్చింది. కాలేజీ రోజుల్లో, కాస్త దూరంగా ఉన్న కొబ్బరి తోటలో రహస్యంగా సిగరెట్లు గుప్పుతున్న మిత్రుల దగ్గరకి వెళ్లి మా మేష్టారు చెప్పిన హేబిట్ పాఠం మొదలు పెట్టానో లేదో, అందరూ ముక్త కంఠంతో గయ్యిమన్నారు. కొన్ని కొన్ని హేబిట్లు కొత్తగా మొదలు పెట్టే వాళ్ళ దగ్గర ఇలాంటి పాఠాలు చెప్పకూడదు అని బాగా తెలిసినప్పటికిన్నూ, వాళ్ళతో నాకు శత్రుత్వం ప్రాప్తించింది.


చాలా బోల్డన్ని కారణాల వల్ల నాకు శ్వేత కాష్ట దహనం పట్టుబడలేదు. అప్పటికే కాఫీ టీలతో పీకల్లోతు ప్రేమలో పడిపోయి ఉండడంతో, 'ఇటీజ్ నాట్ మై కపాఫ్ టీ' అనేసుకున్నాను. కృత్యదవస్థ మీద పాసివ్ స్మోకింగ్ అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. తప్పించుకు తిరిగి ధన్యత నొందడం అన్నివేళలా సాధ్య పడదు కదా మరి. కళ్ళు అరమోడ్పులు చేసి కలల్లో తేలిపోతూ తెల్లని పొగ రింగురింగులుగా వదిలే వాళ్ళని చూస్తున్నపుడు నాకు ఏమనిపిస్తుందో ఒక్క ముక్కలో చెప్పడం కష్టం. అది ఆయా సమయ సందర్భాల్ని బట్టి మారిపోతూ ఉంటుంది.

కాస్త పుస్తకాల వాసన ఉన్నవాళ్ళు చనువుగా సిగరెట్ ఆఫర్ చేస్తే "దున్నపోతై పుడతానండీ..." అనడం అలవాటు చేసుకున్నాను నేను. నా పుణ్యమా అని అవతలి వాళ్ళు కూడా సిగరెట్ పీలుస్తూ మధురవాణిని తలచుకుంటూ ఉంటారు. నేను తాగుడు పూర్తిగా మానేసిన వాళ్ళని చూశాను. కానీ సిగరెట్ల విషయానికి వస్తే కేవలం తగ్గించిన వాళ్ళని మాత్రమే చూశాను. ఆ తగ్గించడం కూడా అప్పుడప్పుడూ మాత్రమే జరుగుతూ ఉంటుంది, అది కూడా పరిస్థితుల ప్రభావం వల్ల. డాక్టర్లు కూడా వీళ్ళతో విసిగిపోవాల్సిందే.

మూడేళ్ళుగా చూస్తున్న మిత్రుడు ఒకాయన ఉన్నారు. వయసు డెబ్భై పైనే. బలశాలి అస్సలు కాదు. ఓ పూట భోజనం లేకపోయినా ఉండగలరు కానీ, రోజూ కనీసం ఓ పెట్టి సిగరెట్లు కాల్చనిదే ఆయనకి తోచదు. ఆయనకి వేళకి సిగరెట్టు పడకపోతే, ఇంటిళ్ళపాదీ మనశ్శాంతి మీద ఆశ వదులుకోవాల్సిందే. ఈ సిగరెట్ల పుణ్యమా అని ఆర్నెల్లకోసారి ఆయనకి రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గుతూ ఉంటుంది. ఓ రెండు పేకట్లు ఎక్కిస్తూ ఉండాలి. సిగరెట్లు మానేయడం మాట అటు ఉంచి, తగ్గించడానికి కూడా ఆయన ఒప్పుకోరు. ఆయన్ని చూసినప్పుడల్లా నాకు మా మేష్టారు గుర్తొస్తూనే ఉంటారు.

శుక్రవారం, ఫిబ్రవరి 01, 2013

చిన్నపరిశ్రమలు-పెద్దకథలు

డాక్టర్ సోమరాజు సుశీల పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేవి 'ఇల్లేరమ్మ కతలు'. బాల్య జ్ఞాపకాలని యెంత అందంగా దాచుకోవచ్చో చెప్పే సంకలనం ఇది. అటు తర్వాత తను అడపా దడపా రాసిన కథలో సుశీల వెలువరించిన సంకలనం 'దీపశిఖ' సైతం పాఠకులని మెప్పించింది. అయితే, ఈవిడ రచనా వ్యాసంగం మొదలయ్యింది కథలు కాని కథలతో. ఆ కథలతో వచ్చిన సంకలనమే 'చిన్నపరిశ్రమలు-పెద్దకథలు.' ఈ కథల తర్వాతే 'ఇల్లేరమ్మ కతలు' రాసి, తెలుగు సాహిత్యంలో ఇల్లేరమ్మగా స్థిర పడిపోయారు సుశీల.

వృత్తిరీత్యా ఓ చిన్న తరహా పరిశ్రమకి యజమాని అయిన శ్రీమతి సుశీల, పరిశ్రమ నడపడంలో కష్టసుఖాల్ని- పేరుకే కష్టసుఖాలు కానీ కథల్లో కనిపించేవి అన్నీ కష్టాలే అనుకోండి - వివరిస్తూ రాసిన పన్నెండు కథల సంకలనం ఇది. పెద్దకథలు అన్నది నిడివికి సంబంధించిన విషయం కాదనీ పరిశ్రమల వెనుక ఉన్న శ్రమని సూచిస్తూ ఆ పేరు వాడారనీ 120 పేజీల ఈ చిరు పుస్తకం సైజు చూడగానే సులువుగా అర్ధమవుతుంది. ఆపకుండా చదివించే శైలి కారణంగా, పేజీలు అలవోకగా తిరిగిపోతాయి.

సంకలనంలో తొలి కథ 'మహా శ్రమ,' పుస్తకం ఎలా ఉండబోతోందో చెప్పేస్తుంది. అమెరికాలో ఉండే ఓ కుర్రాడు, రచయిత్రికి బాగా తెలిసిన వాడు, అక్కడి ఉద్యోగం వదులుకుని ఇండియా వచ్చి ఏదన్నా చిన్న పరిశ్రమ పెట్టాలి అని నిర్ణయించుకుని రచయిత్రిని సలహా అడుగుతాడు. పరిశ్రమలకి ప్రోత్సాహం అంటూ ప్రభుత్వం చేసే ప్రచారానికీ, వాస్తవ పరిస్థితులకీ మధ్య ఉన్న భేదాన్ని చిత్రించారు ఈ కథలో. ఇల్లేరమ్మ మార్కు చెణుకులకి ఏమాత్రం లోటు ఉండని కథ. ఆ మాటకొస్తే, ఈ చెణుకులు ప్రతి కథనీ మెరిపించాయి.


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పరిశ్రమకి 'ఆకస్మిక తనిఖీ' కి వచ్చేసరికి, తన చాంబర్లో 'ఋతురాగాలు' సీరియల్ చూస్తూ, ఎవరినీ నిద్రపోనివ్వని సీఎం గారికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతారు రచయిత్రి. తర్వాత ఏం జరిగింది అన్నది 'అయినవాళ్ళం మహాప్రభో' కథ. "ఐదారుగురు వచ్చారమ్మా. ఎవరో చంద్రబాబు గారంట. మిమ్మల్ని పిలవమంటున్నారు," అంటూ నిర్లిప్తంగా చెప్పేసే పని కుర్రాడు రాజు, మిన్ను విరిగి మీద పడ్డా ఏమాత్రం చలించని వ్యాపార మరియు జీవిత భాగస్వామి, వీళ్ళతో తను ఎలా నెగ్గుకు వస్తున్నారో చెప్పారు సుశీల.

"ఇంతమంది మనవల్నెత్తిన ఈవిడ సోనీ బామ్మేమిటీ, తప్పు కదూ. కుక్కముండకి బామ్మలా కనిపిస్తున్నారా?" అంటూ పక్కింటి పిల్ల ఎదుట అత్తగారి పరువు నిలపడం ఎలాగో చెప్పడం మొదలు (మాయాబజార్), "మొన్నామధ్య మా చెల్లెలి కూతురు నేను పెట్టిన ఇడ్లీలు తింటూ చెప్పేదాకా నాకు తెలియదు, ఇడ్లీ పిండిలో ఈనో ఫ్రూట్ సాల్ట్ వేస్తే రాళ్ళలా కాకుండా దూదుల్లా ఉంటాయని. ఆ పిల్లదానికి తెలిసిన విషయం కూడా నాకు తెలియలేదు. దాన్నే మరి, టెక్నాలజీ అంటారు" (నర్సిరెడ్డి చెరుకు తోట) లాంటి వంటింటి రహస్యాల వరకూ ఎన్ని సంగతులు చెప్పేశారో ఈ కథల్లో.

చిన్న పరిశ్రమల వాళ్ళని బ్యాంకుల వాళ్ళు, ఆర్డర్లు ఇచ్చే పెద్ద కంపెనీలు పెట్టే ఇబ్బందులనీ, అక్కడక్కడా జరిగే అవినీతినీ ఘాటుగా కాక, సరదాగా చెప్పారు. అయినప్పటికీ సంబంధీకులు భుజాలు తడుముకోక తప్పదు. చిన్నచేపలని మింగే పెద్ద చేపలు అన్ని చోట్లా ఉన్నట్టే, పరిశ్రమల రంగంలోనూ ఉన్నాయని చెప్పిన కథ 'స్పాన్సర్డ్ చప్పట్లు.' పరిశ్రమ నడపడంలో ఇబ్బందులని బరువుగానో, కోపం గానో కాక సరదాగా చెప్పడం ఈ కథల ప్రత్యేకత. సబ్జక్ట్ మీద ఏమాత్రం ఆసక్తి లేనివాళ్ళని సైతం ఆపకుండా చదివించే ఈ కథలని ఉమా బుక్స్ ప్రచురించింది. (వెల రూ. 60, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).