సోమవారం, అక్టోబర్ 31, 2022

ప్రేమకథలు

సీనియర్ రచయిత్రి సి. మృణాళిని నుంచి వచ్చిన తాజా కథల సంకలనం 'ప్రేమలేఖలు'. టీనేజీ మొదలు, డెబ్భయ్యేళ్ళు పైబడిన వయసు వరకూ ఉన్న జంటల ప్రేమకథలివి. మొత్తం పదమూడు కథలున్న ఈ సంకలనం ప్రత్యేకత ఏమిటంటే వీటిలో ఏ ఒక్క కథా సుఖాంతమూ కాదు, అలాగని విషాదాంతమూ కాదు. మొహాన్ని ప్రేమగా భ్రమించే ప్రేమికుల మొదలు, ఎన్నో ఏళ్లుగా తమని మూగగా ప్రేమిస్తున్న వారికి అవుననీ, కాదనీ చెప్పని ప్రేమికుల వరకూ రకరకాల వ్యక్తులు తారసపడతారీ కథల్లో. యాసిడ్ దాడులూ, పరువు హత్యలూ పెరుగుతున్న రోజుల్లో అసలు ప్రేమంటే ఏమిటో తెలియజెప్పడం కోసమే ఈ కథలు రాశారనిపిస్తుంది రచయిత్రి. తనమార్కు సున్నితమైన వ్యంగ్యంతోనూ, తనకెంతో ఇష్టమైన హిందీపాటల నేపథ్యంలోనూ అందంగా నడిపారు కథలన్నింటినీ. 

వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ ప్రేమ అనూహ్యంగా వాళ్ళిద్దరి కెరీర్ కీ అడ్డంకి అయ్యింది. పరిష్కరించుకో గలిగే సమస్యే, కానైతే ఇగోలు అడ్డొచ్చాయి. ఫలితంగా, అతను తన దారి తాను చూసుకున్నాడు. కథని ఆమె వైపు నుంచి చెప్పడం వల్ల, ఏళ్ళు గడిచాక ఆనాటి నిర్ణయం పట్ల అతని స్పందనేమిటో పాఠకులకి తెలియదు. కానీ, నాయిక సురభి ఆ ప్రేమకి కట్టుబడే ఉందని మాత్రం తెలుస్తుంది మొదటి కథ 'నిరీక్షణ' లో. యూనివర్సిటీ రోజుల్లో తాను ప్రేమించిన అమ్మాయి, వేరే అతన్ని పెళ్లి చేసుకుని, విదేశంలో స్థిరపడి, పిల్లలు కాలేజీ చదువులకి వచ్చాక అతన్ని చూడ్డానికి వస్తోంది. అతనికీ పెళ్లి, పిల్లలు, సమాజంలో హోదా అన్నీ ఏర్పడి పోయాయి. ఆమె రావడం సంతోషమే, కానీ భార్య ఎలా స్పందిస్తుందో అని ఏమూలో దిగులు. మెరుపు ముగింపు ఇచ్చారు 'నిష్కామ ప్రేమ' కథకి. 

అవతలి వెళ్లి అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా, తాము వాళ్ళని ప్రేమిస్తున్నాం కాబట్టి వాళ్ళూ తమని ప్రేమించి తీరాలని డిమాండ్ చేసే వాళ్ళకీ, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి తెగబడే వాళ్ళకీ లోటు లేదు. అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో చెప్పే కథ 'ఇదా ప్రేమంటే?' ఈ కథలో కనిపించే రెండు జంటల్లోనూ పురుషులే బ్లాక్ మెయిలర్లు కావడం కొంచం నిరాశ పరిచింది. ఇలాంటిదే మరో స్త్రీవాద ప్రేమకథ 'అలవాటు'. ప్రేమికుడుగా మంచి మార్కులు కొట్టేసిన వాడు కాస్తా, పెళ్లయ్యేసరికి సగటు స్త్రీవాద భర్త అయిపోతాడు. ఆమె సర్దేసుకుంటుంది, ఏళ్ళ తరబడి. అలా ఎందుకు చేసిందన్నది కథ ముగింపు.సందేశాత్మకమైన ప్రేమకథ 'జీవితం ఎంతో పెద్దది'. ఇందులో నాటకీయత పాళ్ళు కొంచం ఎక్కువే. 

చాలా ప్రాక్టికల్ గా ఆలోచించే అమ్మాయి కథ 'భద్రమైన ప్రేమ'. ఇద్దరబ్బాయిలు తనని ప్రేమిస్తున్నప్పుడు, తనకి ఇద్దరి మీదా ఇష్టం ఉన్నప్పుడు, ఒకరిని ఎంచుకునే విషయంలో ఆ అమ్మాయి పడిన జాగ్రత్త ఈ కథ. సర్రియలిస్టిక్ గా అనిపించే కథనంతో సాగుతుంది 'చీకటి వెలుగులు'. ప్రేమకథే అయినా, స్త్రీవాద కోణమే అయినా, ఈ కథని ప్రత్యేకంగా నిలబెట్టేది కథనం. ప్రాక్టికల్ ముగింపునే ఇచ్చారు రచయిత్రి. డెబ్భయ్యేళ్ళ వయసులో భార్య చనిపోతే, ఆమె జీవించి ఉండగా ఎన్నడూ 'ఐలవ్యూ' చెప్పలేదని వగచే భర్త కథ 'భార్యా ఐలవ్యూ'. మృణాళిని మార్కు వ్యంగ్యం పతాక స్థాయిలో కనిపించే కథ ఇది. కమ్యూనిస్టు కుర్రాడు, భక్తురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అసహజం ఏమీ కాదు (వైస్ వెర్సా కూడా). ఆ పెళ్లి తర్వాత అతని ప్రవర్తన, ఉద్యమ స్నేహితులకి అభ్యంతరం కావడమే 'ప్రేమంటే వదులుకోవడం' కథ. నాయకుడు కాస్త ఉపన్యాస ధోరణిలో మాట్లాడతాడు, మిగిలిన కథలకి భిన్నంగా. 

యాసిడ్ ప్రేమకథ 'ఈతరం ప్రేమ'. యాసిడ్ నిర్ణయానికి తగినంత బలమైన నేపధ్యాన్ని కుదిర్చి ఉంటే మరింత బాగుండేది. ఉపన్యాసల్లేని హాయైన ముగింపు ఈ కథ గుర్తుండిపోయేలా చేస్తుంది. సాఫ్ట్ వేర్ జంట కథ 'విలువల్లేని ప్రేమ'. సగటు స్త్రీవాద కథల్లో లాగే, ఇందులోనూ విలువల్లేనిది అతనికే. చివరి రెండు కథలూ మాత్రం ఇందుకు కొంచం భిన్నంగా నాయికల్లో గ్రే షేడ్ ని చూపిస్తాయి. 'ప్రేమించలేనితనం' కథలో ఆమెక్కొంచం ఎక్కువ కన్ఫ్యూజన్, స్నేహితుడు (ప్రేమికుడు కాదు) స్వచ్ఛమైన వాడు. చివరి కథ 'ఒక వ్యామోహం' లో నాయికా నాయకులు నడివయసు వాళ్ళు. వాళ్ళ ప్రేమని గురించి ఇద్దరూ ఒకేలాంటి నిర్ణయం తీసుకోవడమే ముగింపు. 

పేపర్లు, టీవీ ఛానళ్ల వార్తలతో పాటు చుట్టూ ఉన్న జీవితాలని గమనించి ఈ కథలని రాశారనిపించింది పుస్తకం పూర్తి చేశాక. ఎక్కడా రొమాన్స్ జోలికి వెళ్ళలేదు. "మోహావేశం వేరు, ప్రేమ వేరు. మొదటిది తాత్కాలికం, రెండోది ఉన్నంతలో శాశ్వతం" అన్నారు తన ముందుమాటలో. మరో రచయిత్రి కాత్యాయనీ విద్మహే విశదంగా రాసిన ముందుమాటలో దాదాపు కథలన్నింటి ముగింపులనీ పరామర్శించారు. ఈ ముందుమాటని పుస్తకం పూర్తిచేశాక చదవడం బాగుంటుంది. ప్రతి కథకీ తల్లావఝుల శివాజీ వేసిన రేఖాచిత్రాలు అదనపు ఆకర్షణ. 'అనల్ప' ప్రచురించిన ఈ 122 పేజీల పుసకం క్వాలిటీ బాగుంది, వెల (కొంచం ఎక్కువే) రూ. 150. ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు, ఆన్లైన్ లోనూ కొనుక్కోవచ్చు.  

శనివారం, అక్టోబర్ 15, 2022

కాంతార

"థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనే మాటని మనవాళ్లు ఓ బూతుగా మార్చేశారు. కానీ, ఈ సినిమాని మాత్రం నిజంగానే థియేటర్లోనే చూడాలి" ..అప్పటివరకూ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూసిన నేను, ఓ మిత్రుడు చెప్పిన ఈ మాటలతో 'కాంతార'    సినిమాని థియేటర్లో చూశాను. రెండున్నర గంటల నిడివి ఉన్న సినిమా విషయంలో చివరి అరగంటకి మిత్రుడి మాటలు అక్షర సత్యం. అలాగని, చివరి అరగంట కోసం మొదటి రెండు గంటల్నీ భరించక్కర్లేదు. నేటివిటీని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తే హాయిగా సాగిపోతుంది.  ఇంతకీ 'కాంతార' అంటే మిస్టీరియస్ ఫారెస్ట్ అట.  'అనూహ్యమైన అడవి' అనుకోవచ్చా? కథా స్థలం దక్షిణ కర్ణాటకలోని తుళునాడు అటవీ ప్రాంతం. కథ అటవీ భూముల మీద హక్కులకి సంబంధించిందే. 

ఇన్నాళ్లూ తుళునాడు అనగానే గుర్తొచ్చే సినిమా వాళ్ళ పేర్లు శిల్పాశెట్టి, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, సుమన్ (తల్వార్), ప్రకాష్ రాజ్. ఇక మీదట వీళ్ళతో పాటు తప్పక గుర్తొచ్చే పేరు రిషబ్ శెట్టి. ఈ 'కాంతార' సినిమాకి కథని సమకూర్చి, దర్శకత్వం వహించడమే కాదు, హీరోగానూ గుర్తుండిపోయేలా నటించాడు. కథ చిన్నదే. అది 1847 వ సంవత్సరం. తుళునాడు అటవీ ప్రాంతాన్ని పాలించే రాజుకి అన్నీ ఉన్నాయి, మనశ్శాంతి తప్ప. దానిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లి, గిరిజనుల దేవుడి సమక్షంలో శాంతి లభించడంతో, ఆ దేవుడిని తనతో పంపమని వాళ్ళని కోరతాడు. మొదట ఒప్పుకోరు. అతడు రాజు కావడం, బతిమలాడ్డం, పైగా అడవి మీద హక్కులు వాళ్ళకి దత్తం చేయడంతో అంగీకరిస్తారు. దేవుడితో కలిసి ప్రాసాదానికి తిరిగి వస్తాడు రాజు. 

కాలచక్రం తిరగడంతో 1970 వస్తుంది. రాజు వారసుల్లో ఒకడికి అటవీ భూమి మీద కన్ను పడుతుంది. గిరిజన గూడేనికి వస్తాడు. ఆవేళ వాళ్ళ పండుగ. 'భూత కళ' కి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. గిరిజనులు 'గురువు' గా వ్యవహరించే వ్యక్తి విష్ణువుగా అలంకరించుకుని రంగం మీదకి ప్రవేశించగానే, అతనిని విష్ణువు ఆవహిస్తాడని ప్రజల నమ్మకం. ఆ సమయంలో అతడేం చెప్పినా దేవుడి మాటలుగానే స్వీకరిస్తారు వాళ్ళు. (మా ఊళ్ళో అమ్మవారి జాతరప్పుడు ఆసాదు ఒంటిమీదకి అమ్మవారొచ్చి ఊరి పెద్దలతో మాట్లాడడం, హైదరాబాద్ బోనాల పండుగ లో జరిగే 'రంగం' గుర్తొచ్చాయి). గురువు రంగం మీదకి రావడంతోనే రాజు వారసుడు భూమిని తిరిగి ఇచ్చేయమంటాడు. ఒప్పందాన్ని ఉల్లంఘించరాదంటాడు గురువు. 

Google Image

మాటామాటా పెరిగి, "నువ్వు దేవుడివి కాదు, కేవలం నటుడివి మాత్రమే" అంటాడు వారసుడు. అనూహ్యంగా మంటల్లో మాయమైపోతాడు గురువు. కోర్టు ద్వారా భూమిని స్వాధీనం చేసుకోవాలనుకున్న వారసుడు కొద్దిరోజులకే అంతే  అనూహ్యంగా రక్తం కక్కుకుని మరణిస్తాడు. జరుగుతున్నవాటిని విస్మయంగా చూస్తూ ఉంటాడు ఏడెనిమిదేళ్ల శివ. కాలం గడిచి 1990 వస్తుంది. శివ ఇప్పుడు నవ యువకుడు. దున్నపోతుల క్రీడ 'కంబళ' జరిగిందంటే మెడల్ గెలుచుకోవల్సిందే. అతను భయపడేది రెండింటికే. ఒకటి కళ్ళలో ప్రాణాలు పెట్టుకుని ఉండే తల్లి కమల. బరువులో శివకి ఆరోవంతు ఉండే ఆమె, కొడుకు తప్పు చేశాడనిపిస్తే పదిమందిలోనూ అతగాడి చెంపలు వాయించడానికి ఏమాత్రం వెనుకాడదు. (రిషబ్ శెట్టి తెలుగు సినిమాలు చూడడనుకుంటా, తల్లి చేత దెబ్బలు తినడం హీరో ఇమేజీకి భంగం అని అనుకోలేదు మరి). 

శివని భయపెట్టే రెండో విషయం అప్పుడప్పుడూ కలలో కనిపించే భూతకళ. ఆ కల శివకి ఎంత భయం అంటే, తన పడక మీంచి లేచి వచ్చి తల్లి పక్కన ముడుచుకుని పడుకునేంత.  కొత్తగా వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్ గిరిజన గూడాన్ని రిజర్వ్ ఫారెస్ట్ గా మార్చాలనుకోవడంతో అసలు కథ మొదలవుతుంది. ఆఫీసర్ కి ఎదురు నిలబడతాడు శివ. రాజకీయంగా ఎదగాలనుకుంటున్న రాచ కుటుంబ వారసుడు శివకి మద్దతు ఇస్తూ ఉంటాడు. శివ పోరాటం కనిపిస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్ తోనా, కనిపించని ఇంకో శత్రువుతోనా? మొదటి పావుగంట తర్వాత 1990 కి వచ్చేసే కథ సాఫీగా, సరదాగా సాగుతూ, రెండో సగం మొదలైన కాసేపటికి మలుపు తిరిగి వేగం అందుకుని ప్రేక్షకులు రెప్పవేయకుండా చూసేలా చేస్తుంది. సినిమా పూర్తయిందని రిజిస్టర్ కావడానికి కొన్ని నిముషాలు సమయం పడుతోంది అనడానికి సీట్ల లోంచి లేవని ప్రేక్షకులే సాక్ష్యం. 

మనం ఇష్టంగా మర్చిపోయేదీ, మిగిలిన దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు అంతకు మించిన ఇష్టంతో గుర్తు పెట్టుకునేదీ ఒక్కటే -- గతం. ఒక ప్రాంతపు సంస్కృతిని, నమ్మకాలనీ, సమకాలీన సమస్యతో ముడిపెట్టి కథ రాసుకుని, తనని తాను హీరోగా కాక నటుడిగా మాత్రమే భావించుకుని (అలాగని హీరోయిజానికి లోటు లేదు) సినిమా తీసిన రిషబ్ శెట్టి మీద గౌరవం కలిగింది. ఒక్క డైలాగూ లేని రాజవంశీకుడి భార్య అమ్మక్క తో సహా ప్రతీ పాత్రకీ ఐడెంటిటీ ఉంది. హీరోయిన్ ఈ సినిమాకి అలంకారం కాదు, అదనపు బలం. నటీనటులే కాదు, సాంకేతిక విభాగాలన్నీ చక్కగా పనిచేసిన సినిమా ఇది. మనవైన హరికథ, బుర్రకథ, పగటివేషాలు, తోలుబొమ్మలాట లాంటి వాటిని చివరగా తెలుగు సినిమాలో ఎప్పుడు చూశాను అన్న ప్రశ్న వెంటాడుతోంది.. ఇంకొన్నాళ్ళు వెంటాడుతుంది, బహుశా.