శనివారం, మార్చి 26, 2016

రన్

సెంటిమెంట్లకి పెట్టింది పేరైన తెలుగు సినిమా పరిశ్రమలో అంతబాగా ఆడని సినిమా తాలూకు టైటిల్ తో ఇంకో సినిమా తీయడం విచిత్రమే. పైగా తారాగణం, దర్శకుడూ కూడా సక్సెస్ రేటు అంతంతమాత్రంగా ఉన్న వాళ్ళూ, ఇప్పుడిప్పుడే పైకొస్తున్న వాళ్ళూను. ఈ వారం విడుదలైన ఆ సినిమా పేరు 'రన్.' అప్పుడప్పుడూ తెరమీద చూపించే గడియారంలో తప్ప ఇంకెక్కడా పరుగు కనిపించకపోవడమే ఈ సినిమా ప్రత్యేకత. అనిషా ఆంబ్రోస్-సందీప్ కిషన్ లు నాయికా నాయకులు. అని కన్నెగంటి దర్శకుడు.

మామూలుగా సినిమా అంటే, హీరోకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఓ సమస్య రావడం, హీరో తన శక్తి యుక్తులతో ఆ సమస్యని పరిష్కరించి కథకి శుభం పలకడం. ఈ సినిమాలో మాత్రం హీరోకి సమస్యలు ఎలా వచ్చాయో అలాగే పోతాయి, ప్రేక్షకులతో పాటు హీరో కూడా నిమిత్తమాత్రంగా చూస్తూ ఉండగానే. మలయాళంలో బాగా ఆడిన 'నేరం' సినిమాకి రీమేక్ అట ఈ సినిమా. కట్టి పడేసే విషయాలు ఏమీ లేవు కానీ, కాలక్షేపానికి చూడొచ్చు. నిజానికి కొన్నాళ్ళ క్రితం మన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కొన్ని సంఘటనలు ఈ కథకి కీలకం. ఇబ్బందులు వస్తాయనో ఏమో, దర్శకుడు అటుగా పెద్దగా దృష్టి పెట్టకుండా కథ నడిపించేశాడు.

కథలోకి వస్తే, హీరో సందీప్ కిషన్ కి చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉన్నట్టుండి పోతుంది. అందుకు అతను ఎంతమాత్రం కారణం కాదు. అమెరికాలో జరిగిన ఓ పరిణామం. అప్పటికే అతని అక్కకి పెళ్లి కుదిరిపోయి ఉంటుంది. ఉద్యోగం ఉందన్న ధీమాతో వడ్డీ రాజా (బాబీ సింహా) దగ్గర పెద్ద మొత్తంలో అప్పు చేసి అక్క పెళ్లి జరిపించేస్తాడు. ఎంతకీ ఉద్యోగం రాకపోవడంతో వడ్డీ రాజాకి చెల్లించాల్సిన బాకీ పెరిగిపోతూ ఉంటుంది. మరోపక్క, ఈ ఉద్యోగం రాకపోవడం వల్లే తను ప్రేమించిన అమ్మాయికి వేరే సంబంధాలు చూస్తూ ఉంటాడు ఆమె తండ్రి.


స్నేహితుల సాయంతో వడ్డీ రాజాకి నెలనెలా వడ్డీ చెల్లిస్తున్న హీరోకి రానురానూ వడ్డీ డబ్బు చేబదులు తేవడం కూడా సమస్య అయిపోతుంది. బాకీ చెల్లించడానికి వడ్డీ రాజా హీరోకి డెడ్లైన్ నిర్ణయించడం, అనుకోకుండా అదే విలన్ చేతుల్లో హీరోయిన్ కిడ్నాప్ కావడంతో కథ విశ్రాంతికి చేరుతుంది. డబ్బు సంపాదించడానికి, హీరోయిన్ ని రక్షించడానికి హీరో ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడో అని ఆలోచిస్తూ పాప్ కార్న్ తిన్నంత సేపు కూడా పట్టకుండానే రెండు మూడు ఊహించని మలుపులతో గంటలోపే రెండో సగం పూర్తయిపోయి శుభం కార్డు పడిపోతుంది.

పంచ్ డైలాగుల కామెడీలో థియేటర్ నుంచి బయటికి వచ్చాక గుర్తుండే సన్నివేశం ఒక్కటీ లేదు. అప్పటికప్పడు టైం పాస్ అంతే. రెండో సగంలో సగంసేపు హీరో హోటల్లోనే గడిపేస్తాడు. ఓ పక్క గడియారం తిరిగిపోతూ ఉంటుంది. హీరో ఇంకా ఏమీ చేయడేమిటా అని ప్రేక్షకులకి అసహనం మొదలయ్యే సమయానికి ట్విస్టులు వచ్చి కథని కంచికి పంపుతాయి. 'ప్రస్థానం' తర్వాత సందీప్ కిషన్ ని వెండితెర మీద చూడడం ఇదే. ఈసారి హీరోగా. 'తొలిప్రేమ' లో పవన్ కళ్యాన్ ని అనుకరించే ప్రయత్నాలు చేశాడనిపించింది. అనిషా ఆంబ్రోస్ మాత్రం ఫ్యామిలీ గర్ల్ స్నేహ ని గుర్తు చేసింది చాలాచోట్ల. హీరోకే చేయడానికి ఏమీలేనప్పుడు, హీరోయిన్ కి మాత్రం ఏముంటుంది పాపం?

తొలి సగం కొంచం హుషారుగానే గడిచినా, రెండో సగంలో అక్కడక్కడా విసుగొచ్చింది. రిపీట్ సీన్ల విషయంలో దర్శకులకీ, ఎడిటర్లకీ అంత ఆసక్తి ఏమిటో అర్ధం కావడం లేదు. మొత్తం సన్నివేశాన్ని రెండు సార్లు చూడాల్సి రావడంలో ఉండే విసుగుదలని గుర్తించరెందుకో. మొత్తం నటీనటుల్లో బాబీ సింహాకి మంచి మార్కులు పడతాయి. బ్రహ్మాజీ కామెడీ ట్రాక్ బోల్డన్ని సినిమాల్ని గుర్తుచేస్తుంది. మాధవన్-మీరా జాస్మిన్ జంటగా పుష్కర కాలానికి పూర్వం 'రన్' పేరుతో ఓ సినిమా వచ్చిన విషయం చాలామంది మర్చిపోయి ఉంటారు. ఈ సినిమాని కూడా కొన్నాళ్ళు పోయాక గుర్తు పెట్టుకునే విశేషాలు ఏవీ లేవు.

బుధవారం, మార్చి 23, 2016

రంగులరాట్నం

తూర్పు గోదావరి జిల్లాలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళాలంటే మధ్యలో ఏయే ఊళ్లు దాటాలో, ఆ ఊళ్ళ ప్రత్యేకతలు ఏమిటో వంశీకి బాగా తెలుసు. దీనితో పాటుగా గడిచిన తొంభై ఏళ్ళలో నిత్యావసర ధరల పెరుగుదల, జీవనశైలిలో వచ్చిన మార్పులు.. వీటన్నింటి మీదా అవగాహన ఉంది. రాసే నేర్పుని గురించి ఇప్పుడు ప్రత్యేకం చెప్పనవసరం లేదు కదా. తనకి తెలిసిన/తెలుసుకున్న విషయాలన్నింటినీ వంశపారంపర్యంగా రంగులరాట్నం తిప్పుకునే కుటుంబం కథలో జొప్పించి, బోల్డన్ని సినిమాటిక్ మలుపుల్నీ, తన మార్కు మెలోడ్రామానీ జోడించి వంశీ రాసిన తాజా నవల 'రంగులరాట్నం.'

వర్తమానంలో మొదలై, అనేక ఫ్లాష్ బ్యాకుల్లోకి వెళ్లి, మళ్ళీ వర్తమానంలోకి వచ్చి ముగిసే ఈ నవల బోసిపోయిన కోటిపల్లి తీర్ధంలో మొదలవుతుంది. ఆ తీర్ధంలో రంగులరాట్నం తిప్పుకునే వృద్ధుడైన పట్టాల సోమరాజుని ఓ టీవీ చానల్ బృందం ఇంటర్యూ అడగడంతో, ఆ వృద్ధుడు 1927 లో మొదలు పెట్టి వరసగా జరిగిన అనేక విషయాలని విడతలు విడతలుగా చెప్పుకొచ్చాక, అతడి కథ ఏమైందన్నది ముగింపు. ఈ మధ్యలో అనేక ఉపకథలు. కోటిపల్లి తీర్ధాన్ని గురించీ, చుట్టుపక్కల ఊళ్లు, మనుషుల్ని గురించీ ఎన్నో విశేషాలు, కొన్ని సెంటిమెంట్ సన్నివేశాలు, మరికొంత శ్లాప్ స్టిక్ కామెడీ.

గోదావరి జిల్లాల్లో జరిగే తీర్దాల్లో రంగులరాట్నం తిప్పడం సోమరాజు పూర్వీకుల కులవృత్తి. మగవాళ్ళు రంగులరాట్నం తిప్పితే, షర్బత్లు తయారు చేసి అమ్ముతూ ఉంటారు. అంతే కాదు, ఆడవాళ్ళందరూ వంటలు చేయడంలో - మరీ ముఖ్యంగా మాంసాహార వంటలు చేయడంలో - అందెవేసిన చేతులు. ప్రతి తరంలోనూ ఆ ఇంటికి వచ్చిన కోడలు, అత్తగారి దగ్గర షర్బత్ చేయడం, కూరలు వండడంలో మెళకువలు నేర్చుకుంటుంది మొదట. అలాగే, మగవాళ్ళందరూ అమాయకులు. డబ్బు దాచుకోవాలనే లక్ష్యం లేని వాళ్ళు. రాట్నం తిప్పే పనిలో చేరిన కుర్రాళ్ళని సొంత బిడ్డల్లా చూసుకునే వాళ్ళూను. ఒక్కో తరంలోనూ పేర్లు మారతాయి తప్ప, ప్రవృత్తులు మాత్రం ఇవే.


పేదరికంలో తృప్తిగా జీవిస్తున్న సోమరాజు పూర్వీకుల్లో ఒకరికి, ఒకానొక కోటిపల్లి తీర్ధంలో గోనెపట్టా మాత్రమే కట్టుకున్న ఒరిస్సా సాధువు ఓ వెండి భరిణె ఇచ్చి, రోజూ ఆ భరిణెకి పూజ చేస్తే అదృష్టం పడుతుందని చెప్పి మాయమైపోతాడు. అప్పటినుంచీ, ప్రతి అత్తా తన కోడలు కాపురానికి రాగానే భరిణె అప్పగించి రాబోయే అదృష్టం గురించి చెబుతూ ఉంటుంది. కోడిలిగా ఉన్నన్నాళ్ళూ పూజలు చేసి, అత్త కాగానే తన కోడలికి ఆ భరిణె అప్పగిస్తూ ఉంటుంది. ఆ కుటుంబం అదృష్టం కోసం ఎదురుచూస్తున్న క్రమంలో వాళ్ళ చుట్టూ వచ్చి పడిపోయిన మార్పులు, రంగులరాట్నానికీ, షర్బత్లకీ గిరాకీ తగ్గిపోయి బతుకుతెరువు ప్రశ్నార్ధకమయ్యే పరిస్థితి వచ్చేస్తుంది.

ఈ  ప్రధాన కథలో, బ్రాహ్మణ స్త్రీగా చలామణీ అవుతూ జీవితపు చివరి దశలో తన జన్మ రహస్యం తెలుసుకోవాలని తపించే వేదవతిది ఓ ఉపకథ. ఆమె రహస్యం తెలిసీ, చెప్పి ఆమెని బాధ పెట్టలేని మేడారపు సూరయ్య శాస్త్రిది మరో కథ. రంగులరాట్నం మీద మక్కువతో, ప్రతి ఏడూ కోటిపల్లి తీర్ధంలో రాత్రిపూట మారువేషంలో రహస్యంగా వచ్చి రాట్నం మీద తిరిగే రాణీ గారిది ఇంకో కథ. పొరపాటున చేజారిన భరిణెని వెతుక్కుంటూ సోమరాజు చేసే ప్రయాణంలో ఒక్కో ఊళ్లోనూ ఒక్కో కథ. ఇవన్నీ శ్రద్ధగా, ఆసక్తిగా విని రికార్డు చేసుకున్న టీవీ చానల్ బృందంలో ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. కొన్ని కథలు చక్కగానూ, మరికొన్ని పర్లేదనిపించేలాగా, ఇంకొన్ని 'బాగా చెప్పొచ్చు కదా' అనిపించేలాగా చెప్పారు వంశీ.

గతకాలపు వైభవం, మరీ ముఖ్యంగా కోటిపల్లి తీర్ధంలో ఆభరణాల మొదలు, గుర్రాల విక్రయాల వరకూ సమస్త వ్యాపారాలూ జరిగిన రోజులు, ఎడ్లబళ్ళు మొదలు రైళ్ళు, డీజిల్ బస్సులు, కార్ల వరకూ ప్రయాణ సౌకర్యాలలో వచ్చిన మార్పులు, మారిన జీవన వ్యయం, పెరిగిన సౌకర్యాలు వీటన్నింటినీ కథలో భాగం చేశారు రచయిత. కథ జరిగేది గోదారి ఒడ్డునే కాబట్టి వంశీ మార్కు గోదారి వర్ణనలకి లోటు లేదు. సినిమా కథలు - మరీ ముఖ్యంగా తన దర్శకత్వంలో వచ్చిన సినిమా కథలు- దాటి ఆలోచించి రాస్తే చాలా మంచి నవల అయి ఉండేదనిపించింది, చదవడం పూర్తిచేశాక. నాటకీయత మీద వంశీకి ఉన్న ప్రేమ అడుగడుగునా కనిపించడమే ఇందుకు కారణం. గత కాలాన్నీ, వచ్చిన మార్పుల్ని గురించీ తెలుసుకోడానికి ఓ సాధనం ఈ 'రంగులరాట్నం.' (సాహితి ప్రచురణలు, పేజీలు  192, వెల రూ. 75, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

మంగళవారం, మార్చి 22, 2016

కాల ప్రవాహం

అనువాద సాహిత్యం చదివే వాళ్లకి, మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో తమిళం నుంచి తెలుగులోకి అనువాదమయి వస్తున్న కథలు, నవలలు చదివే వారికి జిల్లేళ్ళ బాలాజీ పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సుప్రసిద్ధ తమిళ రచయిత జయకాంతన్ రాసిన నవలని 'కల్యాణి' పేరుతో తెనిగించి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గెలుచుకున్న రచయిత/అనువాదకుడు. బాలాజీ అనువదించిన ఇరవై ఒక్క కథలతో వచ్చిన సంకలనమే 'కాల ప్రవాహం.'

తమిళ నాడు మాజీ ముఖ్యమంత్రి ఎమ్. కరుణానిధి, ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ వ్యవస్థాపకులు సి. ఎన్. అణ్ణాదురై - వీళ్ళిద్దరూ రాజకీయనాయకులకన్నా ముందు రచయితలన్న సంగతి తక్కువమందికి తెలుసు. వీళ్ళిద్దరిదీ చెరో కథా ఈ సంకలనంలో చోటు చేసుకోవడం విశేషం. బాబ్రీ మసీదు విధ్వసం నేపధ్యంలో తలెత్తిన మత ఘర్షణలు ఇతివృత్తంగా కరుణానిధి రాసిన కథ 'ఉడుత పిల్ల' డీఎంకె సిద్ధాంతాలు తెలిసిన వాళ్లకి ఏమాత్రం ఆశ్చర్యం కలిగించదు. ఇక, అణ్ణాదురై రాసిన 'ఎర్ర అరటి' పేరుకి తగ్గట్టే కాస్త ఎర్రగా ఉంటుంది. చక్కని కథ ముగింపులో వామపక్ష రాజకీయ నినాదం వినిపిస్తుంది.

ఇందిరా పార్థసారథి రాసిన 'కాల ప్రవాహం,' 'స్పష్టం,' ప్రభంజన్ కథ 'నాన్న పంచె,' వణ్ణ నిలవన్ 'వాన,' కందసామి రాసిన 'పాండిచ్చేరి,' ఎస్. రామకృష్ణన్ కథ 'రెండు బుడగలు' చాలాకాలం గుర్తుండిపోతాయి. వీటిలో 'స్పష్టం' 'నాన్నపంచె' కథల నేపధ్యాలు దగ్గరగా అనిపిస్తాయి. 'వాన' 'పాండిచ్చేరి' కథల మెరుపు ముగింపులు ఆ కథల్ని గుర్తు పెట్టుకునేలా చేస్తాయి. 'రెండు బుడగలు' కథని స్త్రీవాద కథ అనొచ్చేమో. దాదాపు ఒకే ఈడు వాళ్ళయిన ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్, దొంగతనం కేసులో నేరస్తురాలు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకి చేసే ప్రయాణమే ఈ కథ.


సుజాత (రంగరాజన్) రాసిన 'కుందేలు,' ఇందిరా పార్ధసారథి కథ 'సుమంగళి ప్రార్ధన' కరుణ రస ప్రధానంగా సాగే కథలు. రోమన్ శాస్త్రవేత్త జియార్డినో బ్రూనో మరణం వెనుక కథకి అక్షరరూపం ఎస్. రామకృష్ణన్ రాసిన 'ఔను బ్రూనో.. వాళ్ళు నేరస్తులే!' కోర్టు కేసు నేపధ్యంగా సాగే కథ ఇది. రామకృష్ణన్ దే మరోకథ 'బుద్ధుడు కావడం సులభం' కథలో కథకుడితో మగ పిల్లల తండ్రులందరూ తమని తాము ఐడెంటిఫై చేసుకుంటారు. సుజాతదే మరో కథ 'నిబంధన,' జీవిదన్ రాసిన 'మౌనమే..' కథలు చదువుతున్నంతసేపూ మామూలు కథల్లాగే అనిపించి, చదవడం పూర్తయ్యాక ఆలోచనల్లో పడేస్తాయి.

మర్డర్ మిస్టరీ నేపధ్యంలో సాగే కథ తిలకవతి 'శిక్ష.' ఈ కథ ముగింపు పాఠకులకి ఓ పజిల్. ఏం జరిగిందో కథలో చెప్పారు తప్ప, అలా ఎందుకు జరిగిందన్నది పాఠకుల ఊహకే వదిలేశారు. మయూరన్ రాసిన 'సవాల్,' వాణది తిరునావుక్కరసు 'మార్గదర్శి,' నల్లతంబి కథ 'కొడుకుని వెతుక్కుంటూ...' పూర్తిగా బాల సాహిత్యం. ఒక్కమాటలో చెప్పాలంటే చిన్నపిల్లలకి ఉద్దేశించిన నీతికథలివి. సుబ్రహ్మణ్యరాజు రాసిన 'నాలుక' కథలాంటిదే తెలుగులో ఉంది. ఎవరి రచనో ఎంత ప్రయత్నించినా గుర్తు రావడంలేదు.

బాలాజీ అనువాదం చాలా సాఫీగా సాగింది. తమిళ ప్రాంతాలు, అక్కడి సంస్కృతులు పరిచయం అవుతాయి ఈ కథల ద్వారా. అనువాదం ప్రచురితమైన తేదీలు ఇచ్చారు కానీ మూలకథల తొలి ప్రచురణ తేదీలు కూడా ఇచ్చి ఉంటే ఆ కథల్ని మరింత బాగా అర్ధం చేసుకోడానికి వీలుండేది. కథల్లో సంభాషణలని బట్టి కథా కాలాన్ని కొంతవరకూ ఊహించే వీలున్నప్పటికీ, ప్రకాశాకులే తేదీలు ఇచ్చేస్తే పాఠకులకి సులువుగా ఉండేది. ప్రింటింగ్ కంటికింపుగా ఉంది. అచ్చుతప్పులు లేవనే చెప్పాలి. అనువాద సాహిత్యాన్ని ఇష్టపడే వాళ్లకి నచ్చే సంకలనమిది. ('కాల ప్రవాహం,' నవచేతన పబ్లిషింగ్ హౌస్ ప్రచురణ, పేజీలు  165, వెల రూ. 110, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

సోమవారం, మార్చి 21, 2016

కవనకుతూహలం మరియు వరదకాలం

సాహిత్య వాతావరణం ఉన్న ఇంట్లో పుట్టి పెరిగి, ఆ తరం సాహితీమూర్తులందరినీ దగ్గరగా చూసి, స్నేహం చేసి, తన తర్వాతి తరానికీ స్నేహ హస్తం అందించి, ఒక్కరోజు కూడా సాహిత్యం నుంచి దూరం జరగకుండా జీవితాన్ని గడిపిన వ్యక్తి తన అనుభవాలని అక్షరీకరిస్తే ఎలా ఉంటుదన్న ప్రశ్నకి జవాబుగా అబ్బూరి వరదరాజేశ్వర రావు రాసిన 'కవనకుతూహలం,' 'వరదకాలం' పుస్తకాలని చూపించవచ్చు. ఆధునిక తెలుగు సాహిత్యానికి మూలస్థంభాలనదగ్గ వారిలో ఒకరైన అబ్బూరి రామకృష్ణా రావు గారబ్బాయి వరద రాజేశ్వర రావు రాసిన ఈ రెండు పుస్తకాలూ ఇప్పుడు ఒకే పుస్తకంగా అందుబాటులోకి వచ్చాయి.

శ్రీరంగం శ్రీనివాసరావు, రాచకొండ విశ్వనాథ శాస్త్రిలతో చిన్నప్పటినుంచీ స్నేహం వరద రాజేశ్వర రావుకి. అడివి బాపిరాజు, గుడిపాటి వెంకటచలం, పురిపండా అప్పలస్వామి, విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్త్రి, మల్లాది రామకృష్ణ శాస్త్రి, జాషువా లాంటి వారందరూ ఆప్యాయంగా దగ్గరికి తీశారు రావుని. అపారమైన జ్ఞాపకశక్తి, మరీ ముఖ్యంగా నచ్చిన పద్యాలని అక్షరం పొల్లుపోకుండా గుర్తుపెట్టుకునే శక్తి ఉండడంతో పాటు, ఆశువుగా పద్యాలల్లే శక్తీ చిన్ననాడే అబ్బింది. పైగా అటు తండ్రీ, ఇటు స్నేహితులూ, ఆత్మీయులూ అందరూ కూడా సాహిత్యాన్ని జీవితంలో విడదీయరాని భాగంగా చేసుకున్న వాళ్ళే.

ఈ సంకలనంలో ఉన్న డెబ్భై ఎనిమిది వ్యాసాలూ తొలుత పత్రికల్లో కాలమ్స్ గా అచ్చయ్యాయి. అందువల్లే కావొచ్చు, క్లుప్తత వీటి ప్రధాన లక్షణం. చదివించే గుణం పుష్కలం. అక్కడక్కడా ఒకట్రెండు పునరుక్తులు మినహా మిగిలిన పుస్తకం ఆపకుండా చదివిస్తుంది. ఆనాటి మేటి సాహిత్యవేత్తలని  గురించి ఇంత సాధికారికంగానూ, ఆత్మీయంగానూ చెప్పగలిగేవాళ్ళు ఎవరుంటారు? కవినుంచి మహాకవిగా శ్రీశ్రీ ఎదుగుదలని గురించి ఎంత సీరియస్ గా చెబుతారో, విజయవాడ రోడ్ల మీద చలం కార్ డ్రైవింగ్ నేర్చుకోడాన్ని గురించి అంత సరదాగానూ చెబుతారు రాజేశ్వర రావు. బాపిరాజు అమాయకత్వాన్నీ, కృష్ణశాస్త్రి గొంతులో తీయదనాన్నీ పాఠకుల కళ్ళకి కట్టేస్తారు.


సహజంగానే తన తండ్రి రామకృష్ణారావుని గురించి ఎక్కువ విశేషాలు చెప్పారు. ఇవన్నీ అప్రయత్నంగా చెప్పినట్టే అనిపిస్తాయి. రామకృష్ణారావు విద్యాభ్యాసం, రచనలు, 'నటాలి' సంస్థ ద్వారా నాటక ప్రదర్శనలు, అటుపై ఆంధ్రా విశ్వవిద్యాలయంలో లైబ్రరీ అధికారిగా విధి నిర్వహణ ఈ విశేషాలు ఒకే దగ్గర కాకుండా సందర్భోచితంగా ప్రస్తావించారు. తెలుగునాట కమ్యూనిస్టు పార్టీ బలపడడానికి కృషి చేసిన వారిలో రామకృష్ణారావూ ఒకరు. అయితే, పార్టీని విడిచిన తొలితరం ప్రముఖుల్లో కూడా ఆయన ఒకరు. కమ్యూనిస్టు నుంచి రాయిస్టు గా మారారు రామ కృష్ణారావు. మరో రాయిస్టు ప్రముఖుడు పాలగుమ్మి పద్మరాజు కబుర్లూ చాలానే ఉన్నాయీ పుస్తకంలో.

'కన్యాశుల్కం' నాటకాన్ని ఉత్తరాంధ్ర నుంచి కోస్తా ప్రాంతానికి తీసుకొచ్చి ప్రదర్శించడం వెనుక పూనిక రామకృష్ణారావుదయితే, కృషి వరద రాజేశ్వర రావు తదితరులది. ప్రదర్శన కబుర్లతో పాటు, 'రాజావారి సింహాచలం' 'మరో మధురవాణి' వ్యాసాలు 'కన్యాశుల్కం' అభిమానులకి విందుభోజనం అనే చెప్పాలి. తనకి నచ్చినవీ, మంచివీ అయిన సంగతులు ఎంత విపులంగా చెప్పారో, నచ్చని వాటిని చెప్పీచెప్పకుండా వదిలేశారు. శ్రీశ్రీ తో ప్రత్యక్ష యుద్ధం చేసిన శిష్ట్లా ఉమామహేశ్వర రావు ('నవమి చిలక' గుర్తొస్తుంది మొదటగా) కబుర్లు ఇందుకు ఉదాహరణ. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కొండా వెంకటప్పయ్య లాంటి స్వతంత్ర పోరాట యోధుల విశేషాలు స్ఫూర్తివంతాలు.

మొత్తం మీద చూసినప్పుడు, నిన్నటి తరం ప్రముఖుల గురించి దగ్గరగానూ, ఆత్మీయంగానూ తెలుసుకోడానికి ఉపకరిస్తుందీ సంకలనం. వరద రాజేశ్వర రావు ఓ పత్రికకిచ్చిన ఇంటర్యూ తో పాటు ఆయన్ని గురించి సమ్మెట నాగ మల్లేశ్వర రావు రాసిన వ్యాసాన్నీ చేర్చడం వల్ల కొత్త తరానికి వరద రాజేశ్వర రావు పరిచయం అవుతారు. క్వాలిటీ విషయంలో రాజీ పడని తెలుగు ప్రింట్ వారు ప్రచురించిన ఈ సంకలనంలో అనేక అచ్చుతప్పులు దొర్లడం విషాదం. కొన్ని శీర్షికల్లోనే ముద్రారాక్షసాలున్నాయి. సాహిత్యాభిమానులు మళ్ళీ మళ్ళీ చదువుకునే పుస్తకం ఇది. ('కవనకుతూహలం మరియు వరదకాలం,' తెలుగు ప్రింట్ ప్రచురణ, పేజీలు  387, వెల రూ. 300, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

ఆదివారం, మార్చి 20, 2016

రాజూ-పేద

మన 'రాముడు-భీముడు' 'గంగ-మంగ' లాంటి డబుల్ ఫోటో సినిమాలెన్నింటికో మూలమైన ఇంగ్లీష్ నవల 'ది ప్రిన్స్ అండ్ ది పాపర్.' సుప్రసిద్ధ వ్యంగ్య రచయిత మార్క్ ట్వేన్ 135 సంవత్సరాల క్రితం రాసిన ఈ నవలని సుమారు 65 ఏళ్ళ క్రితం 'రాజూ-పేద' పేరుతో తెలుగులోకి అనువదించారు నండూరి రామమోహన రావు. ట్వేన్ కల్పించిన ఈ చారిత్రక గాధ ఎనిమిదవ హెన్రీ కాలం నాటిది. (ఎనిమిదవ హెన్రీ 1509-47 మధ్య కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పాలించాడన్నది చరిత్ర).

హెన్రీ గారబ్బాయి ఎడ్వర్డు రాజకుమారుడు, లండన్ నగరపు మురికివాడ ఆఫాల్ కోర్టులో నివాసం ఉండే జాన్ కాంటీ కుమారుడు టాం కాంటీ అచ్చుగుద్దినట్టు ఒకేపోలికల్లో ఉంటారు. ఇద్దరూ ఒకే ఈడువాళ్ళు కూడా. అయితే, వాళ్ళిద్దరికీ ఒకళ్ళ సంగతులు మరొకరికి తెలిసే అవకాశం లేదు. ఎనిమిదవ హెన్రీ అనారోగ్యంతో తీసుకుంటూ ఉండడంతో ఏ క్షణంలో అయినా పాలనా పగ్గాలు అందుకోవలసిన అగత్యం ఎడ్వర్డుది. అందుకు తగ్గట్టే అతడు యుద్ధ విద్యలు మొదలు, రాజనీతి వరకూ అన్నింటిలోనూ శిక్షణ పొందుతూ ఉంటాడు.

ఇందుకు పూర్తిగా భిన్నమైన జీవితం టాం ది. భిక్షాటన చేసి పొట్ట పోసుకోవలసిన పరిస్థితి. పైగా, భిక్షాటన చట్టరీత్యా నేరం కాబట్టి ప్రభుత్వానికి దొరక్కుండా తప్పించుకుంటూ ఉండాలి. ఏ రోజన్నా డబ్బు తీసుకురాకపోతే ఇంట్లో బడితె పూజ తప్పదు. పొరుగునే ఉండే ఓ సన్యాసి దగ్గర రాయనూ, చదవనూ నేర్చుకుని దొరికిన కథల పుస్తకాలు చదివి ఆనందిస్తూ ఉంటాడు టాం. రాజుల కథలంటే ఆ పిల్లాడికి ఎంతో ఇష్టం. తను చదివిన కథలనే చిలువలు పలవలు చేసి తన స్నేహితులకి చెబుతూ ఉంటాడు ఎప్పుడూ. కుర్రాళ్ళు ఇద్దరికీ పదేళ్ళ వయసు వచ్చేవరకూ కథేమీ ఉండదు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది.


తండ్రి తనని కోప్పడడంతో ఓరోజు ఇల్లు వదిలిన టాం ఏదో ఆలోచనల్లో నడుచుకుంటూ నడుచుకుంటూ రాచ నగరుని చేరుకుంటాడు. గేటు దాటి లోపలి పోతోతున్న అతన్ని భటులు ఆపి ఇష్టానుసారంగా కొడుతూ ఉండడం ఎడ్వర్డు చూస్తాడు. తన ఈడు కుర్రవాడు అలా దెబ్బలు తింటూ ఉండడం భరించలేక భటుల్ని అడ్డుకుని, టాంని తన మందిరంలోకి తీసుకెళతాడు. అప్పుడు గ్రహిస్తారా ఇద్దరూ తమ పోలికలు ఒకేలా ఉన్న విషయాన్ని. టాం ని గురించి పూర్తిగా తెలుసుకున్న ఎడ్వర్డు, పోలికల్ని చాలా ముచ్చట పడి తన దుస్తులు టాంకి తొడికి, అతని పీలికలు తను ధరిస్తాడు.

ఆ పీలికలతో ఒకసారి బయటికి వెళ్లి రావాలన్న కోరిక కలుగుతుంది ఎడ్వర్డుకి. లోపలి వెళ్ళిన కుర్రాడు తిరిగి వచ్చాడనుకుని, ఎడ్వర్డుని చితకబాది, అతను చెప్పేది వినిపించుకోకుండా దూరంగా తరిమేస్తారు భటులు. చేసేది లేక టాం ఉండే ఆఫాల్ కోర్టుకి ప్రయాణం అవుతాడు. ఇంట్లో వాళ్ళతో తను ప్రిన్స్ ఎడ్వర్డునని చెబితే, పుస్తకాలు చదివి పిచ్చి ముదిరిపోయి తనే రాకుమారుణ్ణి అన్న భ్రమలో పడిపోయాడని భావిస్తారు కుటుంబ సభ్యులు. తల్లికి మాత్రం కించిత్తు సందేహం కలుగుతుంది. ఇక్కడినుంచి కథ ఉరుకులూ పరుగులూ పెడుతుంది.

చిత్రహింసలు పెట్టే తండ్రీ, బామ్మా.. వాళ్ళ హింసలు భరించలేకా, అలాగని యాచన చేయలేకా ఇబ్బంది పడే ఎడ్వర్డు. మరోపక్క అంతఃపురంలో అక్కడి మర్యాదలూ అవీ తెలియక సతమతమయ్యే టాం. 'నేను ఎడ్వర్డుని కాదు మొర్రో' అని టాం మొత్తుకున్నా ఎవరూ నమ్మరు సరికదా 'రాకుమారుడికి పిచ్చెక్కింది' అన్న వార్త క్షణాల్లో అంతఃపురం అంతా వ్యాపిస్తుంది. రాచరికపు మర్యాదలని చిత్రించడంలో వ్యంగ్యాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళారు మార్క్ ట్వేన్. హెన్రీ ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో ఎడ్వర్డుగా భావిస్తున్న టాంకి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించడంతో కథ పాకాన పడి అనేకానేక మలుపుల తర్వాత ముగింపుకి చేరుతుంది.

నండూరి రామమోహన రావు అనువాదం ఎక్కడా 'అనువాదం' అన్న భావన కలగనీయదు. భాష మీద అనువాదకుడికి ఉన్న పట్టు అడుగడుగునా అనుభవం అవుతూ ఉంటుంది పాఠకులకి. అనువాదంలో కూడా నేటివిటీని ఎలా చూపించవచ్చు అన్నదానికి ఈ నవల ఓ ఉదాహరణ. చదువుతున్నంతసేపూ లండన్ మన పక్క ఊరేనేమో అనిపించక మానదు. చాలామంది దీనిని పిల్లల నవల అంటారు. బహుశా, ట్వేన్ సంధించిన వ్యంగ్యోక్తుల్ని వాళ్ళు హాస్యంగా అపార్ధం చేసుకుని ఉంటారు. పిల్లల్ని ఆనంద పెట్టి, పెద్దవాళ్ళని ఆలోచింపజేసే నవల ఈ 'రాజూ-పేద.' (అభినందన పబ్లిషర్స్ ప్రచురణ, పేజీలు  231, వెల రూ. 75, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

శనివారం, మార్చి 19, 2016

గుంటూర్ టాకీస్

బహుశా ఇదో ప్రయోగాత్మక సినిమా. సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమా అనగానే అది 'ఆర్ట్ సినిమా' నే కానక్కర్లేదనీ, అడల్ట్ కంటెంట్ తో కూడా రొటీన్ కి భిన్నమైన సినిమాలు తీయొచ్చనీ నిరూపించాడు యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారు. జాతీయ బహుమతి గెల్చుకున్న 'చందమామ కథలు' తర్వాత, ఆ వెంటనే అదే దర్శకుడి నుంచి వస్తున్న సినిమా అనగానే ఒక ప్రోటోటైప్ అంచనా సిద్ధంగా ఉంటుంది. దాన్ని బద్దలుకొడుతూ ప్రవీణ్ తీసిన సినిమా 'గుంటూర్ టాకీస్.' ఇది కేవలం పెద్దలకి మాత్రమే.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పురుషులకి మాత్రమే!

బడికెళ్ళే వయసున్న ఇద్దరు పిల్లల్ని వదిలేసి పక్కింటి వాడితో 'లేచిపోయిన' రోజారాణి భర్త గిరి (నరేష్). రోగిష్టి తల్లినీ, పిల్లలిద్దర్నీ పోషించేందుకు ఓ మెడికల్ షాపులో పని చేస్తూ ఉంటాడు. అదే షాపులో అతనితో పాటే పనిచేసే పైలాపచ్చీసు కుర్రాడు హరి (సిద్ధు జొన్నలగడ్డ). తనకి నచ్చిన మగవాణ్ణి కేవలం తన కోర్కె తీర్చే సాధనంగా మాత్రమే చూసే లేడీ రౌడీ (శ్రద్ధా దాస్) నుంచి తప్పించుకుని, అప్పు వంకన ఆమె నుంచి తీసుకున్న డబ్బుతో గుంటూరు పారిపోయి వచ్చాడు హరి. ఖర్చులకి ఏమాత్రమూ చాలని జీతాలు వీళ్ళిద్దరివీ. పార్ట్ టైం గా రాత్రుళ్ళు పోలీసులకి దొరకని చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటారు ఇద్దరూ.

తను అద్దెకుండే ఇంటి పక్క వాటా వాళ్ళ చుట్టాలమ్మాయి సువర్ణ (రేష్మి గౌతం)ని ముగ్గులో దించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు హరి. సువర్ణకి అక్క వరసయ్యే బంధువుతో ఆసరికే అతగాడికి అఫైర్ నడుస్తూ ఉంటుంది. కేవలం చిన్న దొంగతనాలు మాత్రమే చేసే గిరి-హరి అనుకోకుండా చేసిన ఒకానొక దొంగతనంలో వాళ్ళకే తెలియకుండా ఓ పెద్ద మొత్తం, అంతకు పదింతలు విలువైన ఓ వస్తువు కొట్టుకొచ్చేయడంతో ప్రధమార్ధం ముగుస్తుంది. ఇద్దరూ కలిసే దొంగతనం చేసినా, ఎవరేం దొంగిలించారో రెండో వాళ్లకి తెలీదు.


వరస ఛేజుల రెండో సగంలో సొమ్ము యజమానులైన పోలీసులు, సరుకు తాలూకు డాన్ మనుషులు వీళ్ళిద్దరి కోసం వేట మొదలు పెట్టడంతో ఇద్దరు దొంగలు, పోలీసులు, స్మగ్లర్ల మధ్య బోల్డంత కన్ఫ్యూజింగ్ కామెడీ. చివరికి ఎవరిది పైచేయి అయ్యిందన్నది ముగింపు. పిల్లలు, సెన్సిటివ్ ప్రేక్షకులు తన 'ఎ' సర్టిఫికేట్ సినిమాకి దూరంగా ఉండాలని ముందే చెప్పేసిన దర్శకుడు 'బోల్డ్' సన్నివేశాల చిత్రీకరణకీ, నాటు సంభాషణలకీ ఎక్కడా మొహమాట పడలేదు. ఆర్టిస్టులని కాక, ఆయా పాత్రలని చూపించడంలో సఫలమయ్యాడు కూడా. ప్రధాన పాత్రల్లో నరేష్, సిద్ధూ పోటీపడి నటించారు. రేష్మి, శ్రద్ధ ఇద్దరూ గ్లామర్ విషయంలో పోటీ పడ్డారు.

ప్రధమార్ధం ఎంతో ఆసక్తిగా మలిచిన దర్శకుడు, రెండో సగానికి వచ్చేసరికి అదే ఆసక్తిని కొనసాగించ లేకపోయాడు. మరీముఖ్యంగా, చిన్న చిన్న ఫ్లాష్ బ్యాక్లని విప్పి చెప్పడం వల్ల (సీన్ రివైండ్ చేయడం) సినిమా నిడివి పెరగడం, ప్రేక్షకుడికి విసుగు కలగడం మినహా ప్రయోజనం లేకపోయింది. ఎడిటింగ్ మరికొంచం జాగ్రత్తగా చేయించి ఉండాల్సింది. నేపధ్య సంగీతం బాగున్నప్పటికీ పాటలు గుర్తు పెట్టుకునేలా లేకపోవడం మరో మైనస్. సినిమా చూసి బయటికొచ్చాక పాటలు తలచుకుంటే విజువల్స్ గుర్తొస్తాయే తప్ప ట్యూన్ కానీ, లిరిక్స్ గానీ గుర్తురావు. ఫోటోగ్రఫీ మాత్రం చక్కగా కుదిరింది.

'సినిమా అంటే ఇలాగే ఉండాలి' అంటూ రాయని నిబంధనలు ఏమన్నా ఉంటే వాటిని చెరిపేసే సినిమా ఈ 'గుంటూర్ టాకీస్.' సులభంగా కనిపించే క్లిష్టమైన కథాంశాన్ని ఎన్నుకుని, ప్రేక్షకులందరికీ అర్ధమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కథనంలో భాగంగా చూపించిన 'హాట్ సీన్స్' ని దాటి అసలు కథ మీదకి ఎందరి దృష్టి వెళ్లి ఉంటుందన్నది ప్రశ్నార్ధకం. థియేటర్ లో మగవాళ్ళు మాత్రమే ఉండడం మాత్రం కొత్తగా అనిపించింది. మహిళలకి ఈ సినిమా నచ్చుతుందా? నచ్చినా థియేటర్ కి వచ్చి చూడగలరా? అన్నదానికి వాళ్ళే జవాబు చెప్పాలి. 'ఫార్ములా' చట్రంలో ఇరుక్కోనందుకు ప్రవీణ్ సత్తారు కి మరోమారు అభినందనలు!

శుక్రవారం, మార్చి 18, 2016

అనుభవాలూ-జ్ఞాపకాలూను

"ఈ శతాబ్దంలో వచన రచనకు పెట్టినది పేరు, ఒక్క యిద్దరికే..శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారూ, శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారూ! వేంకటశాస్త్రిగారు కబుర్లలో ఎన్నో కథలు చెప్పారు. సుబ్రహ్మణ్యశాస్త్రి గారు కథలుగా ఎన్నెన్నో కబుర్లు చెప్పారు.." ఈ మాటలన్నది మరెవరో కాదు, తెలుగునాట 'వచన రచనకి మేస్త్రి' గా వినుతికెక్కిన మల్లాది రామకృష్ణ శాస్త్రి. పండితుడు మెచ్చిందే కదా పాండిత్యం. విజయనగరంలో పురుడుపోసుకున్న ఆధునిక తెలుగు కథకి గోదారి నీళ్ళు తాగించి పరిపుష్టం చేసిన వారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. వారి ఆత్మకథ 'అనుభవాలూ-జ్ఞాపకాలూను.'

తెలుగులో కథ రాయాలంటే, శ్రీపాద వారి కథలన్నీ కనీసం ఒక్కసారన్నా చదివి ఉండాలి. ఆత్మకథ రాయాలంటే 'అనుభవాలూ-జ్ఞాపకాలూను' పుస్తకాన్ని పదేపదే చదవాల్సిందే. కథకే కాదు, ఆత్మకథకీ ఒరవడి పెట్టిన ఘనత వారిది. మొత్తం ఎనిమిది సంపుటాలుగా ఆత్మకథని వెలువరించాలని శ్రీపాద పథకం వేసుకోగా, మూడో సంపుటం పూర్తికావస్తూ ఉండగానే అనారోగ్యంతో కలిసొచ్చిన మృత్యువు ఆయన్ని జయించడంతో కథ అక్కడితో ఆగిపోయింది. అంతే ప్రాప్తం అనుకోవడం మినహా చేయగలిగేది ఏమీ లేదు. ఇంతకీ ఈ ఆత్మకథలో ఏమేం విశేషాలు ఉంటాయి?

తొలినుంచీ శ్రీపాద వారిది పోరాట జీవితమే. ఇంటా బయటా ఆయన చేసిన యుద్ధాలు అన్నీ ఇన్నీ కాదు. తొలుత తెలుగు నేర్చుకోడానికి, అటుపై తెలుగు జాతీయత కోసం ఆయన జీవితాంతం శ్రమించారు. తూర్పు గోదావరి జిల్లా పొలమూరు గ్రామంలో సంప్రదాయ వైదిక బ్రాహ్మణ కుటుంబంలో సుబ్రహ్మణ్య శాస్త్రి చిన్ననాడు సంస్కృతం చదువుకోవడంతో పాటు కులవిద్య అయిన పంచాంగాల తయారీనీ నేర్చుకున్నారు. అనుకోకుండా ఆయనకి తెలుగు మీద ఆసక్తి కలగడం, తెలుగు చదవొద్దంటూ ఇంట్లో నిర్బంధించడంతో మొదలైన యుద్ధం, జీవిత పర్యంతమూ కొనసాగింది.


సంస్కృతం చదువు పూర్తవ్వొస్తూ ఉండగానే నన్నయ తెనిగించిన భారత భాగాన్ని చదవడం ఆయన తొలి విజయం కాగా, పిఠాపురం జంటకవులు వేంకటరామకృష్ణ కవుల దగ్గర శిష్యరికం చేయడం ఆయన రెండో విజయం. పద్యాల మీదా, అవధానాల మీదా మొదట మక్కువ పెంచుకుని, తదుపరి తుంచుకుని పూర్తిగా వచన రచన వైపుకి మళ్ళిన వైనాన్ని వివరిస్తుందీ ఆత్మకథ. తిరుపతి వేంకట కవులకి, వేంకట రామకృష్ణ కవులకీ ఆసరికే ఉండుకున్న వైరం కారణంగా గురువుల తరపున బరిలోకి దిగి చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రితో యుద్ధం చేసిన వైనాన్ని చదవాల్సిందే.

నిజానికి ఆత్మకథలో తనని గురించిన వివరాలు క్లుప్తంగానూ, ఆనాటి పరిస్థితులని గురించి సవివరంగానూ రాశారు శ్రీపాద. ఫలితంగా, వందేళ్ళ క్రితం నాటి సాంఘిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు, దొరల పాలన, విద్యావిధానం, అనేక రంగాల్లో నెమ్మదిగా వస్తున్న మార్పులు లాంటి విశేషాలెన్నో కళ్ళకి కడతాయి. వారాలు చెప్పుకుంటూ, గురు శుశ్రూష చేసుకుంటూ చదువుకోవడం, ఎక్కడికి వెళ్ళాలన్నా కాలినడకన బయలుదేరడం, హోటల్లో తినడాన్ని తప్పుగా పరిగణించడం.. ఇలాంటివన్నీ ఇప్పుడు మనం నడుస్తున్న నేల మీద ఒకప్పుడు జరిగాయంటే ఆశ్చర్యం కలిగిస్తుంది.

ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది శ్రీపాద వారి శైలి. ఏ విషయాన్ని ఎత్తుకున్నా, 'అనగా అనగా' అంటూ కథ చెబుతున్నట్టుగా మొదలు పెట్టి, అలవోకగా పిట్ట కథల్లోకి వెళ్లి, ఒక్కో కథనీ ముగించుకుంటూ వచ్చి అసలు విషయాన్ని పూర్తి చేయడం అన్నది ఆయనకి మాత్రమే సాధ్యమైన విద్యేమో అనిపిస్తుంది చాలాసార్లు. అలాగే, తనకెదురైన 'మంచి' విశదంగా చెప్పి 'చెడు' ని ఒకట్రెండు మాటల్లో ముగించడం ద్వారా తర్వాత కాలంలో ఆత్మకథ రాసేవారికి మర్గనిర్దేశనం చేశారు. ఒకే పుస్తకంగా లభిస్తున్న మూడు సంకలనాలనీ చదవడం పూర్తి చేయగానే 'మిగిలిన ఐదూ కూడా దొరికేతేనా...' అనిపించక మానదు. ('అనుభవాలూ-జ్ఞాపకాలూను,' పేజీలు 570, వెల రూ. 300, ప్రగతి పబ్లిషర్స్ ప్రచురణ, అన్ని ముఖ్య పుస్తకాల షాపులు).

గురువారం, మార్చి 17, 2016

కీర్తికిరీటాలు

నవలాదేశపు రాణి యద్దనపూడి సులోచనారాణి రాసిన 'సెక్రటరీ' నవల విడుదలై యాభై ఏళ్ళు పూర్తయ్యాయంటూ పేపర్ల వాళ్ళు, టీవీ చానళ్ళ వాళ్ళు మొన్నామధ్య కొంచం హడావిడి చేశారు. సాహిత్యాన్ని తల్చుకోడానికి వాళ్లకి ఏదో ఒక సందర్భం కావాలి కాబట్టి కానీ, పుస్తకాలు చదివే వాళ్ళు ఇప్పటికీ యద్దనపూడి నవలలు కొంటూనే ఉన్నారు, చదువుతూనే ఉన్నారు. తొలి నవల 'సెక్రటరీ' తర్వాత, సులోచనారాణి రాసిన నవలల్లో మొదట చెప్పుకోవాల్సింది 'కీర్తి కిరీటాలు.' "ఆమె రాసేది కాల్పనిక సాహిత్యం" అని చప్పరించే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, ఈ నవల ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకుంది.

రాజ్యలక్ష్మి అనే ఓ శాస్త్రీయ సంగీత గాయని, స్వర్ణలత అనే శాస్త్రీయ నృత్య కళాకారిణిల కథ 'కీర్తికిరీటాలు.' సులోచనారాణి చాలా నవలల్లో లాగానే సగం కథ హైదరాబాదులోనూ మరో సగం విజయవాడ పక్కనున్న ఓ పల్లెటూళ్ళోనూ జరుగుతుంది. స్వర్ణలత కథని చెబుతూ చెబుతూ ఇంటర్ కట్స్ గా ఫ్లాష్ బ్యాక్ లో రాజ్యలక్ష్మి కథని చెబుతారు రచయిత్రి. దవడ కండరం బిగుసుకునే స్పురద్రూపి తేజా కథానాయకుడు. వంకరగా నవ్వే కిషోర్ కథలో ఒకానొక విలన్. అయితే, 'విధి' ని మాత్రమే బలమైన శత్రువుగా చిత్రించారు సులోచనారాణి. అడుగడుగునా ఎదురయ్యే ఊహించని మలుపులు 364 పేజీల నవలనీ ఏకబిగిన చదివించేస్తాయి.

అప్పుడప్పుడే నర్తకిగా బాగా పేరు తెచ్చుకుంటున్న అమ్మాయి స్వర్ణలత. తల్లి ఇందిరాదేవికి స్వర్ణని ప్రఖ్యాత నర్తకిగా చూసుకోవాలనే కోరికతో పాటు, తను రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యే కావాలన్నది కూడా బలమైన కోరిక. ఈ ఇందిరాదేవి, వెనుకటి తరం ప్రముఖ గాయని రాజ్యలక్ష్మి మంచి మిత్రులు. విదేశంలో ఇరవై ఏళ్ళు ఉండి, ఎన్నో ఒడిదుడుకుల తర్వాత పెంపుడు కొడుకు కిషోర్ ని తీసుకుని హైదరాబాద్ వచ్చేస్తుంది రాజ్యలక్ష్మి. స్వర్ణని తన కోడలిగా చేసుకోవాలన్నది రాజ్యలక్ష్మి కోరిక. స్వర్ణ, కిషోర్ తో సన్నిహితంగా మెలగడం, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారన్న గుసగుసలు బయల్దేరడం ఎంతగానో బాధ పెడతాయి రాజ్యలక్ష్మిని.


చిన్నప్పుడే తనకి దూరమైపోయిన కన్నకొడుకు తేజాని స్వర్ణ పెళ్లి చేసుకుంటే, ఆమె ద్వారా తను తేజాని కలుసుకోవచ్చన్నది రాజ్యలక్ష్మికి మిగిలిన ఒకే ఒక్క ఆశ. ఇందిరాదేవికి ఈ విషయం తెలిసినా ఏమాత్రం పట్టించుకోకుండా, కూతురు కిషోర్ తో సన్నిహితంగా మెలగడాన్ని ప్రోత్సహిస్తుంది. చదువు లేకుండా ఎక్కడో పల్లెటూళ్ళో ఉంటున్న తేజాని పెళ్లి చేసుకోవడం స్వర్ణ భవిష్యత్తుకి అడ్డంకి అవుతుందన్నది ఆమె భయం. పైగా, కిషోర్ స్వర్ణ నాట్య ప్రదర్శనలకి ఎంతో సాయం చేస్తూ ఉంటాడు. ఆమెని ప్రముఖ నర్తకిగా చూడాలన్నది అతని కోరిక కూడా.

విజయవాడ పక్కనే ఉన్న పల్లెటూళ్ళో తాతగారు వెంకటాచలంతో ఉంటున్న తేజా ఈ ప్రపంచంలో ద్వేషించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది తల్లి రాజ్యలక్ష్మి ఒక్కర్తే. ఆమె పేరు వినబడడం కూడా ఇష్టం ఉండదు అతనికి. పెద్దగా చదువుకోని తేజా, ఇంటికి దగ్గరలో ఓ చెక్క బొమ్మల పరిశ్రమ పెట్టి ఊళ్ళో వాళ్లకి ఉపాధి కల్పిస్తూ ఉంటాడు. అనుకోకుండా స్వర్ణ నృత్య ప్రదర్శన చూసి, ఆమె ఎవరో తెలిశాక ఆమె మీద ఇష్టాన్ని పెంచుకుని కూడా లోలోపలే దాచుకున్న తేజా స్వర్ణ-కిషోర్ ల నిశ్చితార్ధం తర్వాత ఆమెని పూర్తిగా మర్చిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.

రాజ్యలక్ష్మి గతం, స్వర్ణ భవిష్యత్తు ఏమిటన్నవి నవల ముగింపు. ఎంతోమంది కళాకారిణుల జీవితాలని పరిశీలించి తానీ రచన చేశానన్నారు సులోచనారాణి. "నేను ఆరాధించే కొద్దిమంది వ్యక్తుల్లో లతా మంగేష్కర్ ఒకరు. ఆమె పెళ్లి చేసుకోకపోవడం నాకెందుకో చాలా సంతోషంగా అనిపించేది. లలితకళల్లో గానం, నాట్యం, రచన వీటిలో ఉన్నవాళ్ళు ఈ సంసార బంధాల చిక్కుముడుల్లో ఇరుక్కోకూడదు అని నా అభిప్రాయం" అంటూ రాశారు 'నేను-నా రచనలు - నా పాఠకులు' అన్న ముందుమాటలో. 'తెలుగు సినీతల్లి కీర్తికిరీటంలో కలికితురాయి అయిన శ్రీ అక్కినేని నాగేశ్వర రావు'కి అంకితం ఇచ్చారీ నవలని. (క్వాలిటీ పబ్లిషర్స్ ప్రచురణ, వెల రూ. 120, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

బుధవారం, మార్చి 16, 2016

గేదెమీది పిట్ట

సమాజంలో ఒక పెనుమార్పు సంభవించినప్పుడు తత్కారణంగా జీవితంలో వచ్చిపడే మార్పులని 'నైతికత' కోణం నుంచి మరీ ఎక్కువగా చూసేది మధ్యతరగతి సమాజమే. ఇప్పుడిప్పుడు మధ్యతరగతి కూడా ఎలాంటి మార్పులనైనా హృదయపూర్వకంగా ఆహ్వానించేస్తున్నా, మిగిలిన వర్గాలతో పోల్చినప్పుడు నిన్నమొన్నటి వరకూ విలువల విషయంలో బాగా ఒత్తిడికి గురైంది ఈ సమాజం. విలువలు, డబ్బు ఈ రెంటిలో ఏదో ఒకదాన్నే ఎంచుకోవాల్సిన పరిస్థితులు తరచూ ఎదుర్కొనేది కూడా ఈ మధ్యతరగతే. ఇలాంటి ఓ మధ్యతరగతి జీవి కథే తల్లావఝల పతంజలి శాస్త్రి రాసిన 'గేదెమీది పిట్ట' నవలిక.

సాఫ్ట్వేర్ ఇంజినీర్లకి విపరీతమైన డిమాండ్ ఉన్న కాలంలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి జాబ్ మార్కెట్లో అడుగుపెట్టాడు ఆదినారాయణ మూర్తి. స్థిరమైన ఉద్యోగం రాకమునుపే,  పెద్దవాళ్ళు చూసిన సంబంధం స్కూలు టీచరుగా పనిచేస్తున్న పూర్ణని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకో పాప. తల్లి మరణించింది. బ్యాంకు ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన తండ్రి ఆది దగ్గరే ఉంటున్నాడు. ఓ మల్టిప్లెక్స్ నిర్మాణం దగ్గర సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆదికి, ఆ ప్రాజెక్టు పూర్తవుతూనే మరో ఉద్యోగం చూసుకోవాల్సిన పరిస్థితి. కనీసం ఇప్పుడైనా స్థిరమైన ఉద్యోగం దొరకాలన్నది అతని కోరిక.

ఆదికి ఉద్యోగం దొరకదు సరికదా, తండ్రికి గుండె ఆపరేషన్ చేయించాల్సి వస్తుంది. అందుకు అవసరమైన మొత్తం అటు తండ్రి దగ్గరా, ఇటు పూర్ణ దగ్గరా కూడా ఉందని తెలుసు. కానీ, తన డబ్బు ఖర్చు చేయలేకపోతున్నానన్న బాధ మొదలవుతుంది ఆదికి. మావగారిని అభిమానంగా చూసుకునే పూర్ణ తన డబ్బు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయిస్తుంది. ఈ పరిస్థితుల్లో, మల్టిప్లెక్స్ యజమాని చెల్లెలు నిర్మలతో పరిచయం అవుతుంది ఆదికి. ఆమె నడుపుతున్న బాతిక్ లో చిన్న చిన్న మార్పులు చేయించాల్సి వచ్చి అతని సలహా కోరుతుంది, భర్తనుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్న నిర్మల. రెండు మూడు సార్లు బాతిక్ కి వెళ్లి మార్పులు చేయించిన ఆదికి కన్సల్టేషన్ ఫీజు ముట్టజెపుతుంది నిర్మల.


అలవాటుగా ఆ ఫీజు తెచ్చి పూర్ణ చేతిలో పెట్టిన ఆదికి భార్య కళ్ళలో ఆనందం కనిపిస్తుంది. డబ్బు విషయంలో చాలా ప్లానింగ్ తో వ్యవహరించే పూర్ణ భర్తకి మరిన్ని కన్సల్టెన్సీలు దొరకాలని కోరుకుంటుంది. కొన్నాళ్ళ తర్వాత నిర్మల నుంచి మళ్ళీ పిలుపొస్తుంది ఆదికి. ఈసారి ఆమె అతన్ని తన పడకగదికి తీసుకెళ్తుంది. తిరిగి వెళ్ళేప్పుడు అతని జేబులో కరెన్సీ నోట్లున్న కవరు ఉంచుతుంది. ఇంటికి వచ్చిన ఆది, స్నానం చేసి ఆ కవర్ని పూర్ణకి అందిస్తాడు. అతనేమీ చెప్పక మునుపే 'మరో కన్సల్టెన్సీ దొరికిందా?' అని అడగడమే కాదు, తరచూ దొరకాలని కూడా కోరుకుంటుందామె.

మితభాషి, అంతర్ముఖుడు అయిన ఆది వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని నిశ్చయం అయ్యాక తన స్నేహితురాళ్ళు కొందరిని పరిచయం చేస్తుంది నిర్మల. స్టార్ హోటల్లో రూం బుక్ చేసి అతన్ని ఆహ్వానిస్తూ ఉంటారు వాళ్ళు. వీళ్ళెవరూ అతని విషయాలు అడగరు, వాళ్ళ సంగతులు చెప్పాలనిపిస్తే చెబుతారు. అతనికి ఏమాత్రం ఇబ్బంది కలగని విధంగా డబ్బులున్న కవరు జేబులో పెట్టి పంపిస్తూ ఉంటారు. ఆది తండ్రి మరణించడం, మల్టిప్లెక్స్ నిర్మాణం పూర్తయ్యి, ఆది ఉద్యోగం పోవడం, స్టార్ హోటల్లో పరిచయమైన కుర్రాడు పార్టనర్షిప్ ఆఫర్ ఇవ్వడం ఒకేసారి జరుగుతాయి.

పూర్ణ దృష్టిలో ఆది ఇప్పుడు ఫుల్ టైం కన్సల్టెంట్. అతను ఎంత సంపాదిస్తే ఏమేం కొనుక్కోవచ్చో లెక్కలు చెబుతూ ఉంటుంది. పడకలు వేరవ్వడం కూడా పెద్ద విషయం కాదామెకి. ఆది ప్రకాష్ గా మారతాడు ఆదినారాయణ మూర్తి. ఈ ఆది కథని పూర్తి సంయమనంతో చెబుతారు రచయిత. ఎక్కడా తీర్పులిచ్చే పని పెట్టుకోకుండా, 'ఇలా జరిగింది' అని మాత్రం చెప్పి ఊరుకుంటారు. మొత్తం 119 పేజీల నవలికలో తొలి నలభై పేజీలని పాత్రల్ని పరిచయం చేయడానికి, పాఠకులని కథలోకి తీసుకెళ్ళడానికి కేటాయించారు. అంతేకాదు, ప్రతి పాత్ర దృష్టి కోణం నుంచీ ఆదిని పరిశీలించడానికి అవకాశం ఇచ్చారు. ఆది పాత్ర పాఠకులకి ఎలా అర్ధమయింది అన్నదాన్ని బట్టి ఈ నవలపై వారి అభిప్రాయం ఉంటుంది. ('చినుకు' ప్రచురణ, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

మంగళవారం, మార్చి 15, 2016

ఆకుపచ్చని దేశం

అభివృద్ధి, పునరావాసం అనేవి ఒకే నాణేనికి బొమ్మాబొరుసూ లాంటివి. 'అభివృద్ధి' లో ఉన్న ఆకర్షణ పునరావాసంలో ఉండదు. పైగా, పునరావాసం అంటే ఒక చోట బలంగా వేళ్ళు పాతుకుపోయిన వృక్షాన్ని ఆ పళాన పెకలించి వేరే చోట నాటే ప్రయత్నం చేయడం. ప్రాజెక్టు ఏదైనప్పటికీ, దాని నిర్మాణం కారణంగా నిర్వాసితులు కాబోయేవారిని నయానో, భయానో పునరావాసానికి ఒప్పించక తప్పదు. ప్రభుత్వంతో పాటు, స్వచ్చంద సంస్థలూ ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటూ ఉంటాయి, వాటి వాటి ఆసక్తుల మేరకు.

వెలిగొండ ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులవుతున్నారు నల్లమల అడవులనే శతాబ్దాల తరబడి తమ ఆవాసంగా చేసుకున్న చెంచులు. ప్రాజెక్టు గురించి కానీ, అడవి మునిగిపోబోతుండడం గురించి గానీ వాళ్లకి ఏమాత్రం తెలియదు. పునరావాసం కోసం ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతుండగానే, నిర్వాసితులకి అండగా నిలబడాలనీ, వాళ్లకి సురక్షిత ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేయాలనీ సంకల్పించింది, విదేశీ ఫండ్స్ తో పనిచేసే ఒక స్వచ్చంద సంస్థ. ఆ సంస్థ ప్రతినిధిగా అడవిలోకి అడుగు పెట్టాడు వీర. పూర్తి పేరు వీరనరసింహం.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్ డీ పూర్తి చేసిన వీర అడవికి వెళ్ళడం వెనుక ప్రోత్సాహం అతని భార్య మోహినిది. ఆమె ఓ స్వచ్చంద సంస్థ నిర్వాహకురాలు. చెంచుల ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆమెకి పది లక్షల రూపాయల లాభం. వీరకీ మోహినికీ చాలా చిత్రంగా పరిచయం అయి, అంతకన్నా విచిత్రంగా పెళ్ళికి దారితీసింది. వీర పరిచయం నాటికే మోహిని గర్భవతి. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. చాలా ఏళ్ళపాటు ఎం ఎల్ పార్టీలో పనిచేసి స్వచ్చంద సంస్థని ప్రారంభించింది. యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పరిచయమైన వీర, పెళ్లి ప్రతిపాదన తేవడమే కాదు, వెంటనే అమలు పరిచేశాడు కూడా. పెళ్ళైన కొన్నాళ్ళకే అడవికి ప్రయాణం అయ్యాడు.


నిజానికి ప్రాజెక్టు పనిమీద వీర వెళ్తున్నది తన పుట్టింటికే. నల్లమలలోని ఒకానొక చెంచు గూడెంలో పుట్టి పెరిగాడతడు. బాల్యం లీలగా గుర్తుంది కూడా. బాల్యంతో వెంటాడిన తీవ్రమైన దుర్భిక్షం, ఆకలి, ఒకరోజు తన తల్లే తనని నగరానికి వెళ్ళిపొమ్మని రోడ్డు మీద వదిలేసి అడవికి వెళ్ళిపోవడం ఇవన్నీ బాగానే గుర్తున్నాయి వీరకి. అడవికి వెళ్ళిన వీరకి మొదట పరిచయం అయిన వాడు అలలసుందరం. ఆ అడవిలోనే పుట్టి పెరిగి రాజకీయ నాయకుడిగా ఎదిగినవాడు. చెంచులకి అడవితో ఉన్న అనుబంధాన్ని అర్ధం చేసుకున్న వీర, ప్రాజెక్టు పని చేయలేనని మోహినికి ఉత్తరం రాసి, ఆమె ఇచ్చిన డాక్యుమెంట్స్ వెనక్కి పంపేస్తాడు.

అధికారులు, పోలీసుల సాయంతో చెంచులని అడవి వెలుపలికి లాగే  ప్రయత్నంలో అలలసుందరం, వాళ్లకి అండగా నిలవాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తూ, వాళ్ళలో ఒకడు కాలేకపోతున్న వీర.. ఈ రెండు పరస్పర భిన్న శక్తుల పోరాటం ఏ ముగింపుకి చేరుకుందన్నదే డాక్టర్ వి. చంద్రశేఖర రావు నవల 'ఆకుపచ్చని దేశం.' నిజానికి, 142 పేజీల ఈ పుస్తకం ఒక దీర్ఘ కవితని తలపిస్తుంది. ఏనాడూ అడవిని కళ్ళతో చూడని వాళ్లకి కూడా ఆదివాసీల జీవితాలని కళ్ళకి కడతారు రచయిత. బయట ప్రపంచంతో కలవలేని చెంచులు మనుగడకోసం చేసే మౌన పోరాటం పుస్తకాన్ని ఆసాంతమూ ఆపకుండా చదివిస్తుంది.

అధికారులు, రాజకీయ నాయకులు, పోలీసులు, పత్రికల వాళ్ళు, ఎన్జీవోలు, చెంచులు.. వీళ్ళందరి గురించీ రచయిత చెప్పే ఒక్కో సంగతీ వెన్ను నిటారుగా ఉంచి పుస్తకాన్ని చదివేలా చేస్తుంది. అలలసుందరం తల్లి నవమణి మరణం, వీరా తన తన తల్లిని కలుసుకునే సన్నివేశం చాలా రోజులపాటు వెంటాడతాయి. నవల పూర్తి చేశాక ఏ ప్రాజెక్టు గురించి విన్నా మొదట నిర్వాసితులే గుర్తొస్తారు. అధికార చట్రంలో ఉన్న వాళ్ళలో కొందరన్నా ఈ నవల చదివితే బాగుండును అనిపిస్తుంది. ('ఆకుపచ్చని దేశం,' పేజీలు  142, వెల రూ. 50, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు). 

సోమవారం, మార్చి 14, 2016

మాట్లాడే జ్ఞాపకాలు

"భలే రాశాడు" అనిపిస్తుంది, వంశీ రాసే కబుర్లు చదువుతూ ఉంటే. కథలు, నవలల్లో కొన్ని చాలా బాగుండడం, మరికొన్ని అస్సలు బాగోకపోవడం ఉంటుంది కానీ, వంశీ కబుర్లకి మాత్రం పెద్దగా వంక పెట్టలేం. అందుకే కాబోలు, వంశీ రాసిన కథనం ఎక్కడ కనిపించినా కత్తిరించి దాచుకోడం ఓ అలవాటుగా మారిపోయింది. అదిగో, అలా దాచుకున్న కబుర్లలో కొన్ని ఇప్పుడు పుస్తక రూపంలో వచ్చేశాయి. పుస్తకం పేరు 'మాట్లాడే జ్ఞాపకాలు.'

దశాబ్దాల నాడు ఏదో సినిమా పత్రికలో చదివి దాచుకోడానికి వీలుపడని ఆర్టికల్ 'ఒక హార్మోనియం పెట్టి కథ.' దాచుకోడం కుదరలేదని గుర్తొచ్చినప్పుడల్లా బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే 'మాస్ట్రో' ఇళయరాజా గురించి వంశీ రాసిన కథనం అది. అసలు అదే శీర్షికతో ఇళయరాజా ఆత్మకథ వంశీ అక్షరాల్లో రాబోతోందని కూడా అప్పట్లో ఓ రూమరు వినిపించింది. కానీ, వంశీకి సంబంధించిన అనేకానేక రూమర్లలో అదీ ఒకటని తర్వాత తెలిసింది. ఇంతకీ, ఆ ఆర్టికల్ కి ఈపుస్తకంలో చోటు దొరికింది!

అల్లపుడెప్పుడో ఆదివారం ఆంధ్రజ్యోతి వాళ్ళు ప్రతివారం ప్రముఖుల 'ఫెయిల్యూర్ స్టోరీ' లు ప్రచురిస్తూ ఓ వారం వంశీ చెప్పుకున్న తన వైఫల్యగాధకీ చోటిచ్చారు. 'ఒక వృత్తిని ఎన్నుకున్న తర్వాత, అందులోనే లైఫ్ కంటిన్యూ చేయాలనుకున్న తర్వాత ఒకోసారి వ్యక్తిగతమైన అభిరుచుల్ని ఇష్టాల్నీ పక్కన పెట్టాల్సి ఉంటుంది" అన్నమాటలు ఎంతగా నచ్చేశాయో చెప్పలేను. అదిగో, ఆ 'ఫెయిల్యూర్ స్టోరీ' కూడా ఉందీ పుస్తకంలో. కాకినాడ-కోటిపల్లి రైల్ కార్ ప్రయాణాన్ని గురించి రెండు కథనాలూ, హంపీ-విజయనగరం యాత్రవి ఓ రెండు కథనాలూ వెంటాడతాయి బాగా.


'నా కాస్త బెస్ట్ అనిపించిన సినిమాలు' అంటూ తను ఇప్పటివరకూ తీసిన సినిమాల్లోనుంచి ఐదు సినిమాలని యెంచారు వంశీ. ఇందులో చేర్చిన 'ఏప్రిల్ ఒకటి విడుదల' కి సంబంధించి రెండు ప్రశ్నలు: ఈ సినిమాకి మూలమైన ఎమ్. ఐ. కిషన్ నవల 'హరిశ్చంద్రుడు అబద్దమాడితే' ని అస్సలు ప్రస్తావించకపోవడం. అలాగే సినిమా టైటిల్స్ లో సంభాషణల క్రెడిట్ మొత్తం ఎల్బీ శ్రీరాం కి ఇచ్చి ఈ కథనంలో (ఆ మాటకొస్తే ఈ మధ్య ఇచ్చిన చాలా ఇంటర్యూలలో కూడా) సంభాషణల్లో సింహభాగం కృష్ణ భగవాన్ రాశారని చెప్పడం. మరి టైటిల్స్ లో ఎల్బీ పేరు ఎందుకు వేసినట్టు? 'బెస్ట్ సినిమా ఇంకా నేను తియ్యలేదు. ఎప్పటికైనా తియ్యాలి' అంటూ ముగిసిందీ కథనం.

ఎలిజీలు రాయడంలో వంశీది ఓ ప్రత్యేకమైన శైలి. సంగీత దర్శకుడు చక్రి, గీత రచయిత వేటూరి సుందర రామమూర్తి, రచయిత ముళ్ళపూడి వెంకటరమణ, హాస్యనటుడు మల్లికార్జున రావు భౌతికంగా దూరమైన సందర్భాల్లో రాసిన నివాళి వ్యాసాలు ఆయా ప్రముఖుల వ్యక్తిత్వాలని వంశీ అక్షరాలు ప్రత్యేకంగా చూపుతాయి మనకి. మ్యూజిక్ కంపోజర్ మొజార్ట్, సస్పెన్స్ సినిమాల దర్శకుడు ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్, అభినేత్రి సావిత్రి లని గురించి రాసిన వ్యాసాలూ ఉన్నాయిందులో.

దిండి రిసార్ట్స్ దగ్గర గోదారి మీదా, కేరళలో హౌస్ బోటు మీదా చేసిన ప్రయాణాలు, ఏజెన్సీ ఏరియా వి. రామన్నపాలెం ప్రయాణం ముచ్చట్లు, పసలపూడి కబుర్లు, ఆ ఊరి వాడైన 'జక్కం వీరన్న' కబుర్లు, పుస్తకాలు, సినిమా విశేషాలు, షూటింగుల్లో జరిగే సంగతులు.. ఇలా మొత్తం ముప్ఫై ఆరు కథనాలు. ఏ వ్యాసమూ నాలుగైదు పేజీలు  మించదు. ఎక్కడా విసుగు అనిపించదు. కాసిన్ని కబుర్లు పునరుక్తులయితేనేమి, అవి వంశీ చెప్పిన గోదారి కబుర్లు అయినప్పుడు.. వంశీ రచనలు నచ్చే వారికి నచ్చేసే పుస్తకం ఇది. (సాహితి ప్రచురణలు, పేజీలు  192, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

శుక్రవారం, మార్చి 11, 2016

నెమరేసిన మెమరీస్

పుట్టింట్లో ఇరవై ఏళ్ళు, మెట్టినింట్లో యాభై ఏళ్ళు గడిపిన ఓ స్త్రీ తన జీవిత కథని రాస్తే, సింహభాగం విశేషాలు ఎక్కడివయి ఉంటాయి? జవాబు చెప్పడానికి పెద్దగా ఆలోచించనవసరం లేదు. అత్యంత సహజంగానే అవి పుట్టింటికి సంబంధించినవే అయి ఉంటాయి. ఉదాహరణ కావాలంటే ముళ్ళపూడి శ్రీదేవి రాసిన 'నెమరేసిన మెమరీస్' పుస్తకం తిరగేయచ్చు. పాత్రికేయుడు, కథకుడు, సినిమా రచయిత, నిర్మాత, అన్నింటినీ మించి బాపూకి ప్రాణ స్నేహితుడు.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ముళ్ళపూడి వెంకటరమణ సతీమణి రాసుకున్న తన కథలో సగానికి పైగా పేజీలు  ఆవిడ బాల్యం తాలూకు జ్ఞాపకాలే.

కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని ఆరుగొలను గ్రామ కరణం గారమ్మాయి నండూరు శ్రీదేవి, ముళ్ళపూడి వెంకటరమణతో వివాహం అయ్యాక ముళ్ళపూడి శ్రీదేవిగా మారారు. తండ్రిగారి నుంచి అన్నల తరం వచ్చేసరికి 'నండూరు' కాస్తా 'నండూరి' గా మారిపోయింది. అన్నలందరూ పత్రిక, రచనా రంగాలలో ఉన్నవారే. ఆ ఊళ్ళో ఆరు కొలనులు ఉండేవి కాబట్టి 'ఆరుగొలను' అని పేరొచ్చిందన్న వివరం మొదలు, తన బడిచదువు, పరీక్షలహడావిడి, బంధువులు, స్నేహితులతో ఆటపాటలు.. ఒకటేమిటి, ఎన్నో, ఎన్నెన్నో కబుర్లు పాఠకులని ఒక్కసారిగా వాళ్ళ బాల్యాల్లోకి తీసుకుపోతాయి.

అన్నలు, వదినలు, కసిన్స్, బంధువులు.. ఈ విషయాలన్నీ ఆవిడ వాళ్ళ పిల్లలకి చెబుతున్నంత సహజంగా రాసుకుపోయారు. ఒక్కోచోట ఆ బంధువులు ఎవరెవరో అర్ధం కాక ఒకలాంటి అయోమయం కలుగుతూ ఉంటుంది. అయితే, అక్కడ రచయిత్రి చెప్పదలచుకున్న విషయానికి ఆ బంధుత్వపు వరస ఏమిటన్నది అడ్డంకి అవ్వదు. నచ్చిన విషయం ఏమిటంటే, ఉమ్మడి కుటుంబం అనగానే అదో ఆనందాల హరివిల్లు అని కాక, అందులో ఉండే కష్ట సుఖాలు రెంటినీ సమంగా చెప్పడం. అలాగే, బాల్యంలో దగ్గరి వాళ్ళతో వచ్చే మాట పట్టింపులు, వాటి తాలూకు పరిణామాలు ఇవన్నీ పుస్తకాన్ని అలవోకగా చదివించేస్తాయి.


పెళ్ళికి ముందే రమణ రచనలతో పరిచయం ఉండడం, పెళ్ళిసంబంధం అనుకున్నప్పుడు జరిగిన సంఘటనలూ ఇవన్నీ ఏమాత్రం నాటకీయత లేకుండా చాలా సహజంగా చెప్పారు. పెళ్లి తర్వాత మద్రాసు జీవితం, సినిమా రంగంతో దగ్గరగా మసలడం ఇవన్నీ ఆవిడ పాయింటాఫ్ వ్యూ నుంచి తెలుసుకునే అవకాశం ఇస్తుందీ పుస్తకం. మంచి విషయాలు చెప్పినప్పుడు ఆ తారల పేర్లని ప్రస్తావించిన శ్రీదేవి, తనకి బాధ కలిగించిన సంఘటనల దగ్గరకి వచ్చేసరికి అవతలివారి వివరాలు ఏమాత్రం ఇవ్వకుండా ఆయా సంఘటనలని మాత్రం ప్రస్తావించి ఊరుకున్నారు. రెండో తరహా విషయాలకి పెద్దగా చోటివ్వలేదు కూడా.

"భాగ్యవతితో నా సహజీవనం యాభై ఏళ్ళ నాటిది" అంటూ మొదలు పెట్టి బాపూ భార్య భాగ్యవతిని గురించి ఎన్నో విశేషాలు పంచుకున్నారు శ్రీదేవి. "చాలామంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని ఇద్దరినీ చూసి, బాపు గారు రమణగారు కలిశారు సరే మరి మీరిద్దరూ కూడా కలిసి ఎలా ఉంటున్నారు ఇన్నేళ్ళుగా, పంతాలూ పేచీలూ, పట్టింపులూ రావా, ఎలా సాగుతున్నారు అని. ఇందులో పెద్ద విశేషమేమీ లేదు. మేమూ అందరిలాంటి వాళ్ళమే. మాకూ పంతాలూ, పేచీలూ, పట్టింపులూ వస్తాయి. కాని అంతవరకే. పోట్లాడుకునేంతగా, కలిసి ఉండలేనంతగా అభిప్రాయ భేదాలు ఎప్పుడూ రాలేదు" అంటారు.

ఆరుగొలను నుంచి మద్రాసు వరకూ జరిగిన ప్రయాణంలో ఎదురైన ఎన్నో ఎత్తుపల్లాలు, ఆనంద విషాదాలు, మాట పట్టింపులు, సర్దుబాట్లు, సాయం ఇచ్చి పుచ్చుకోడాలు, కష్టాలు వచ్చినప్పుడు ఓర్చుకుని నిలబడ్డ వైనాలు ఇవన్నీ ఆపకుండా చదివిస్తాయీ పుస్తకాన్ని. చదువుతున్నంతసేపూ బాపూ రమణలు కూడా శ్రీదేవి పాయింటాఫ్ వ్యూ నుంచి పాఠకులకి కనిపించడం ఈ పుస్తకం ప్రత్యేకత. ఓ మామూలు గృహిణి ఆత్మకథ అనిపిస్తుందే తప్ప, సెలబ్రిటీ కుటుంబానికి చెందిన స్త్రీ రాసిన పుస్తకం అని ఎక్కడా అనిపించదు. చివరి పేజీల్లో ఎమోషన్, ఈ పుస్తకాన్ని చాలా రోజులపాటు గుర్తు పెట్టుకునేలా చేస్తుంది. ముళ్ళపూడి వెంకటరమణ చాలా అదృష్టవంతులని మరోమారు అనిపిస్తుంది. (రాజాచంద్ర ఫౌండేషన్ ప్రచురణ, పేజీలు  144, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).