శనివారం, జులై 30, 2022

జానకమ్మ ఇంగ్లండ్ యాత్ర

ఆ మధ్యన చదవడం మొదలుపెట్టిన 'రాజా రవివర్మ' నవలలో జానకమ్మ అనే ఓ స్త్రీ విదేశీ పర్యటనలు చేయమని, లోకం చూసి రావడం ఎంతో అవసరమనీ రవివర్మకి సలహా ఇస్తుంది. నూట యాభై ఏళ్ళ క్రితం ఓ స్త్రీ నుంచి ఇలాంటి సలహా వినడం ఆశ్చర్యం కలిగించింది. ఇంకా ఆ నవల చదవడం పూర్తి చేయకముందే 'జానకమ్మ ఇంగ్లండ్ యాత్ర' పుస్తకం చేతికొచ్చింది. కాళిదాసు పురుషోత్తం అనువదించిన ఈ పుస్తకానికి తెరవెనుగాక కృషి  'రాజా రవివర్మ' నవలా రచయిత పి. మోహన్ ది. నాటి మద్రాసు నగరంలో ఓ ధనిక కుటుంబానికి చెందిన పోతం జానకమ్మ రాఘవయ్య అనే తెలుగు మహిళ 1873 లో లండన్ యాత్ర చేసొచ్చి రాసుకున్న పుస్తకం ఇది. లండన్ వెళ్లిన తొలి భారతీయ మహిళ (హిందూ దేశపు మహిళ) జానకమ్మే!  

జానకమ్మ తన యత్రానుభవాలని మొదట తెలుగులో రాసి, ఆ తర్వాత తన విదేశీ స్నేహితుల సౌకర్యం కోసం ఆంగ్లంలోకి అనువదించారు. తెలుగు ప్రతి ఆనవాలు కూడా ఎక్కడా దొరక్కపోయినా, లండన్ లైబ్రరీ సౌజన్యంతో ఆంగ్ల ప్రతి 'పిక్చర్స్ అఫ్ ఇంగ్లండ్' ఆర్కీవ్స్ లో లభిస్తోంది. నేటి తెలుగు పాఠకుల సౌకర్యార్ధం ఆ ఆంగ్ల రచనని తెనిగించి ప్రచురించారు సొసైటీ ఫర్ సోషల్ చేంజ్, నెల్లూరు, వారు. జానకమ్మకి ఉన్న విశేషమైన పరిశీలనా దృష్టి వల్ల కొంతా, భాష విషయంలోనూ, పదాల ఎంపికలోనూ అనువాదకుడు తీసుకున్న ప్రత్యేకమైన శ్రద్ధ మరికొంతా కలిపి నాటి పుస్తకాన్ని చదివిన అనుభూతినే ఇచ్చింది. అయితే, జానకమ్మ రాసిన తెలుగు ప్రతి లభించక పోవడం పెద్ద లోటే. ఆమె అనుభవాలని ఆమె భాషలోనే తెలుసుకోగలిగే వీలుండేది కదా అని చాలాసార్లే అనిపించింది, ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ.  

హిందూ సమాజం సముద్ర ప్రయాణాలనీ, విదేశీ యానాలనీ అంగీకరించని రోజుల్లో, పురుషులే అనేక ఒత్తిడుల మధ్యనా, శుద్ధి క్రతువులకి ముందస్తు అంగీకారం చెప్పీ అరుదుగా ప్రయాణాలు చేసిన కాలంలో, ఒక మహిళ కేవలం విహార యాత్రకి విదేశం వెళ్లడం కచ్చితంగా పెద్ద విశేషమే. అనేక అభ్యంతరాలు, ఒత్తిడులు, భయ సందేహాల నడుమనే ఆమె ప్రయాణమూ మొదలైంది. ఓడలో మరికొందరు మహిళా ప్రయాణికులున్నా వారంతా విదేశీయులు. చీర ధరించిన ఏకైక మహిళ జానకమ్మే. తొలి నౌకా ప్రయాణమే అయినా, 'సీ సిక్నెస్' లాంటి సమస్యలు ఇతర మహిళా ప్రయాణికుల్ని బాధించినంతగా జానకమ్మని బాధించలేదు. మొత్తం ప్రయాణంలో ఆమె అనారోగ్యం పాలైందీ తక్కువే. ఆమె దగ్గర డబ్బుతో పాటు, మంచి ఆరోగ్యమూ ఉంది.  

ఇప్పుడు విరివిగా ట్రావెలాగ్స్ రాస్తున్న చాలామంది రచయితల రచనల్లో కనిపించని ఓ సంపూర్ణత్వం ఈ 'జానకమ్మ ఇంగ్లండ్ యాత్ర' కనిపిస్తోందంటే అందుకు కారణం ఆమెకి ఉన్న జిజ్ఞాస, గొప్ప పరిశీలనా దృష్టి, తనకి తెలియని విషయాలని గురించి త్వరపడి తీర్పులు చెప్పేయకుండా  ఆచితూచి నిర్ణయం తీసుకోవడమూను. ఇంగ్లండ్, ఫ్రాన్సు యాత్రల్లో వెళ్లిన ప్రతిచోటా, ప్రతిరోజూ ఆమె స్థానిక దినపత్రికలు చదివేది. తాను హై సొసైటీ మనిషే అయినా విదేశంలో అన్ని వర్గాల వాళ్ళతోనూ మాట్లాడి వాళ్ళని గురించి తెలుసుకునే ప్రయత్నం చేసేది. ఆమె ఆసక్తులు కూడా విశేషమైనవి. పూలు, పళ్ళు, వస్త్రాలు, ఆభరణాల మీద ఎంత ఇష్టమో సైన్సు, చరిత్ర, మతం, రాజకీయాలు లాంటి విషయాల మీదా అంతే ఇష్టం. నాటకాలు, సంగీత కచేరీలతో పాటు, మ్యూజియాలు, ఎగ్జిబిషన్లనూ సందర్శించింది. ఉపన్యాసాలకీ హాజరయ్యింది.  

మాంచెస్టర్ బట్టల మిల్లుల చరిత్ర మొదలు, ఫ్రాన్సు రాజకీయాల వరకూ అనేక విషయాలని ఆమె స్వయంగా తెలుసుకుంది తన యాత్రలో. అదే సమయంలో తన అనుభవాల్లాంటి వాటిని రామాయణ, భారత కథల్లో వెతుక్కుంది. నాటి భారతదేశ పాలకులైన బ్రిటిష్ రాజవంశం పట్ల ఆమెకి విశేషమైన గౌరవం ఉంది. దానికి ఎక్కడా దాచుకునే ప్రయత్నం చేయలేదు. అదే సమయంలో లండన్ నగరంలో తాను చూసిన చెడుని గురించి ఉన్నదున్నట్టుగా చెప్పడానికి వెనుకాడనూ లేదు. (ముందుమాట రాసిన కాత్యాయని, జానకమ్మ "గందరగోళంలో పడిపోయారు" అనడం ఆశ్చర్యం కలిగించింది). లండన్ నగరంలో అద్దెకి తీసుకున్న ఇల్లు మొదలు, రకరకాల ప్రయాణ సాధనాలు, రవాణా చార్జీలు, ప్రదర్శన శాలల టిక్కెట్టు రుసుము లాంటి విషయాలని శ్రద్ధగా గ్రంధస్తం చేశారు.  

చాలాచోట్ల "కొద్దిగా షాపింగ్ చేశాను" అని రాశారు తప్ప, ఆ షాపింగ్ లో కొన్నవి ఏవిటో ఎక్కడా చెప్పలేదు. వెళ్లే ప్రయాణంలో నౌకలో సాటి అనారోగ్యంతో  ప్రయాణికుడు మరణించడం, అంత్యక్రియలు, అలాగే తిరుగు ప్రయాణంలో ఓ నావికుడి మరణం, అంత్యక్రియలని గురించి వివరంగా చెప్పడం ద్వారా విదేశీ యాత్ర తనలో తెచ్చిన మార్పుని చెప్పకనే చెప్పారు జానకమ్మ. అనువాదకులు పురుషోత్తం స్వయంగా చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న పరిశోధకులు కావడంతో జానకమ్మని గురించి పుస్తకంలో లేని విషయాలు సేకరించే ప్రయత్నం చేసి, ఆ వివరాలు తన విశదమైన ముందుమాటలో ప్రస్తావించారు. పుస్తకాలని, ప్రయాణాలని ఇష్టపడే వాళ్ళు తప్పక చదివావాల్సిన పుస్తకం. ట్రావెలాగ్ రచయితలకి రిఫరెన్సు గా ఉపయోగపడుతుంది, కచ్చితంగా. (పేజీలు 118, వెల రూ. 100, పుస్తకాల షాపుల్లోనూ, ఆన్లైన్ లోనూ కొనుక్కోవచ్చు). 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి