శుక్రవారం, జనవరి 27, 2023

జమున ...

కొన్నేళ్ళ క్రితం కాకినాడ నుంచి సామర్లకోట వైపు వెళ్తుంటే దారిలో కుడివైపున 'జమున నగర్' అని బోర్డు కనిపించింది. అనుకోకుండా పైకే చదివాను. "హీరోయిన్ జమునా గారున్నారు కదండీ.. ఆరు తోలు బొమ్మలాట ఆడేవోళ్ళందరికీ ఇళ్ళు కట్టిచ్చేరండిక్కడ.. నూటేబై గడప పైగానే ఉంటాదండి.. ఆల్లందరూ ఊరికి ఆవిడ పేరే ఎట్టేరండి" అడక్కపోయినా వివరం చెప్పాడు కారు డ్రైవరు. బహుశా, రాజమండ్రి ఎంపీ గా పనిచేసిన కాలంలో కట్టించి ఉండొచ్చు అనుకున్నాను. కానైతే, ఇలాంటి కథే సూర్యాపేట (తెలంగాణ) దగ్గరా వినిపించింది. అక్కడ కూడా జమున నగరే, నివాసం ఉండేది రంగస్థల కళాకారులు. కనుక్కుంటే తెలిసిందేమిటంటే, సినిమా జీవితం నుంచి విశ్రాంతి తీసుకుని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాడానికి పూర్వం 'రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య' ని ఏర్పాటు చేయడమే కాకుండా, ఆ కళాకారుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేసింది జమున. 

సినిమా వాళ్లలో, మరీ ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన సినిమా వాళ్లలో, కళాకారుల సమస్యలు అనే విషయాన్ని గురించి మాట్లాడని వాళ్ళు అరుదు. అంతే కాదు, నిజంగా వాళ్ళ సమస్యల్ని పట్టించుకుని, చేతనైన తోవ చూపేవాళ్ళూ అరుదే. ఈ రెండో రకానికి చెందిన అరుదైన తార జమున. అందుకేనేమో, ఆమె మరణ వార్త తెలియగానే ముందుగా జమునా నగర్ గుర్తొచ్చింది, ఆ వెనుక మాత్రమే ఆమె పోషించిన వెండితెర పాత్రలు జ్ఞాపకానికి వచ్చాయి. నటిగా తాను తొలిఅడుగులు వేసిన రంగస్థలాన్ని మాత్రమే కాదు, సినిమాయేతర కళారూపాలన్నింటినీ శ్రద్ధగా పట్టించుకుని, వాటినే నమ్ముకున్న కళాకారుల కోసం తాను చేయగలిగింది చేసి చూపించింది జమున. ఇళ్ళు కట్టించడం మాత్రమే కాదు, వాళ్ళకి ప్రదర్శనలు ఇప్పించడానికీ చొరవ చూపిందట!

'జమునాతీరం' పేరిట ఆమె రాసుకున్న ఆత్మకథని చదవడం తటస్థించింది కొన్నాళ్ల కిందట. తన పితామహులది దుగ్గిరాలకి చెందిన వ్యాపార కుటుంబమని, మాతామహులు విజయనగర సంస్థానంలో కళాకారులనీ రాసుకున్నదామె. "ఈమె మాతామహుల కాలానికి ముందే విజయనగర సంస్థానం శిధిలం అయిపోయింది కదా?" అని సందేహం నాకు. బహుశా, మాతామహుల తాలూకు పూర్వులు అయి ఉంటారనుకున్నాను. అలా మాతామహుల ఇంట హంపీ విజయనగరంలో పుట్టి, 'హంపీ సుందరి' అనే సార్ధక నామధేయాన్ని సాధించుకుంది జమునా బాయి (చిన్నప్పటి పేరు).  బాలనటిగా కొంగర జగ్గయ్యతో కలిసి స్టేజి డ్రామా వేయడం, ఆ సందర్భంలో జగ్గయ్యాదులని మూడు చెరువుల నీళ్లు తాగించడం లాంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి ఆ పుస్తకంలో. 

కాంగ్రెస్ టిక్కెట్టు మీద 1989 ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంటు సీటుకి పోటీ చేసినప్పుడు, గోడలమీది ఎన్నికల అభ్యర్ధనల్లో 'మీ సోదరి జమున రమణారావు' అని ప్రస్ఫుటంగా కనిపించేది. రాజకీయాలు ఎంతపని చేస్తాయి!! పార్టీ పెట్టడానికి ముందు రోజు వరకూ మహిళల కలల రాకుమారుడైన ఎంటీఆర్ ఒక్కసారిగా 'అన్నగారు' అయిపోయినట్టుగా, డ్రీం గర్ల్ జమున (సినిమాలు విరమించుకున్న చాలా ఏళ్ళ తర్వాత) సోదరిగా మారిపోయింది. ఆ ఎన్నికల ప్రచార సభల్లో "ఎంటీఆర్ ని నేను కాలితో తన్నాను" అని ఆమె పదేపదే చెప్పుకోడాన్ని అన్నగారి అభిమానులు తప్పట్టుకున్నారు. "ఎంటీఆర్ కాళ్ళకి ఈవిడ ఎన్నిసినిమాల్లో దణ్ణం పెట్టలేదూ?" అన్న ప్రశ్నలూ వచ్చాయి. ఆ ఎన్నికల్లో గెలిచి లోక్ సభ సభ్యురాలు అయినప్పటికీ, తర్వాతి కాలంలో రాజకీయాలు కలిసిరాలేదామెకి. 

కాలితో తన్నడం సినిమా షూటింగ్ లో భాగమే అయినా, ఎంటీఆర్, ఏఎన్నార్ల గర్వాన్ని తన్నిన ఘనత మాత్రం జమునదే. విధేయంగా ఉండదన్న వంక చెప్పి జమున మీద నాటి ఈ అగ్రహీరోలిద్దరూ నిషేధం పెట్టించినప్పుడు, హరనాథ్ లాంటి హీరోలని ప్రోత్సహించి వాళ్లతో సినిమాలు చేసి హిట్లు కొట్టింది తప్ప, వాళ్లిద్దరూ ఊహించినట్టు కాళ్ళ బేరానికి వెళ్ళలేదు. సినిమా నటుల్లో, ముఖ్యంగా నటీమణుల్లో, ఇప్పటికీ అరుదుగా కనిపించే లక్షణం ఈ స్వాభిమానం. ఈ స్వాభిమానమే ఆమె సత్యభామ పాత్రని రక్తి కట్టించడానికి దోహదం చేసిందేమో. చిన్న హీరోలతో చేసినా ఆ సినిమాలు హిట్ అవ్వడం, ఆమె స్టార్డం తగ్గకపోవడంతో ఆ పెద్ద హీరోలే మెట్టు దిగాల్సి వచ్చింది. తెలుగు సినిమా చరిత్రలోనే దీన్నో అరుదైన సంఘటనగా చెప్పుకోవాలి. 

సినిమాలు విరమించుకోడానికి కొంచం ముందుగా ఓ సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో గాయపడింది జమున. త్వరగానే కోలుకున్నా, మెడ వణుకు మిగిలిపోయింది. ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చేనాటికి వయోభారం మీద పడడం వల్ల కాబోలు, ఆ వణుకుని చివరి వరకూ భరించిందామె. ఒకవేళ ఆ సమస్య రాకుండా ఉండి ఉంటే మిగిలిన నటీమణుల్లాగే ఆమె కూడా అమ్మ/అత్త పాత్రలకి ప్రమోటయి ఉండేదా? బహుశా నటనకి దూరంగానే ఉండేదేమో అనిపిస్తుంది నాకు. ప్రేక్షకుల దృష్టిలో కథానాయికగానే ఉండిపోవాలన్నది ఆమె నిర్ణయం అయి ఉండొచ్చు. కేవలం తెరమీద పోషించిన పాత్రలకు మాత్రమే కాదు, జీవించిన విధానం వల్లకూడా జమున అనగానే కథానాయికే గుర్తొస్తుంది. ఆమె ఆత్మకి శాంతి కలగాలి. 

గురువారం, జనవరి 26, 2023

ఆశాకిరణం

"భరించలేని దుఃఖం ఆవహించినప్పుడు మనిషి పిచ్చివాడైనా అవుతాడు, తత్వవేత్త అయినా అవుతాడు" - గొల్లపూడి మారుతిరావు 'సాయంకాలమైంది'. అంతకు మించి కూడా కావొచ్చనునని నిరూపించిన వ్యక్తి డాక్టర్ చంద్రశేఖర్ సంకురాత్రి, సంఘసేవకు గాను భారత ప్రభుత్వం నుంచి 'పద్మశ్రీ' పురస్కారానికి ఎంపికయ్యారు. ఎనభయ్యేళ్ళ చంద్రశేఖర్, తన ఆత్మకథని 'ఆశాకిరణం' పేరిట ప్రచురించారు నాలుగేళ్ల క్రితం. సంకురాత్రి ఫౌండేషన్, శ్రీకిరణ్ కంటి ఆస్పత్రి, శారద విద్యాలయం ద్వారా కోస్తాంధ్ర ప్రజలకి, మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాల వాళ్ళకి  చంద్రశేఖర్ పేరు చిరపరిచితం. అయితే ఏ పరిస్థితులు ఆయనని కెనడాలో సౌకర్యవంతమైన జీవితం వదులుకుని కాకినాడ శివార్లకి వచ్చి సంఘ సేవ మొదలుపెట్టేలా చేశాయో 'ఆశాకిరణం' పుస్తకం వచ్చే వరకూ చాలామందికి తెలియదు. 

రాజమండ్రిలో గోదారి ఒడ్డున పుట్టి పెరిగారు చంద్రశేఖర్. తండ్రి నాటి బ్రిటిష్ రైల్వే లో స్టేషన్ మాస్టర్. పదకొండు మంది సంతానంలో ఈయన చివరివాడు. బాల్యం వైభవంగానే గడిచినా త్వరలోనే కష్టాలు చుట్టుముట్టాయి. తల్లి మరణం, తండ్రి పదవీ విరమణ కారణంగా ఆర్ధిక సమస్యలు.. వీటన్నింటినీ చిన్ననాడే చూడాల్సి వచ్చింది. సోదరుల సహాయంతో ఎమ్మెస్సీ పూర్తి చేశాక పరిశోధన రంగానికి వెళ్లాలన్న అభిలాష పెరిగింది. అయితే, ఎమ్మెస్సీ చదివిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తనకి రావాల్సిన యూనివర్సిటీ ఫస్ట్ మరొకరికి వెళ్లిందని రూఢిగా తెలియడంతో అక్కడ మాత్రం చేరకూడదని బలంగా నిర్ణయించుకోడంతో చంద్రశేఖర్ అడుగులు కెనడా వైపు పడ్డాయి. జీవితంలో అదొక మేలు మలుపు. 

పరిశోధన పూర్తి చేసి, ఉద్యోగంలో కుదురుకున్నాక పెద్దలు కుదిర్చిన మంజరి ని వివాహం చేసుకుని కెనడా తీసుకెళ్లారు. మొదట అబ్బాయి శ్రీకిరణ్, తర్వాత అమ్మాయి శారద జన్మించారు. సాఫీ సాగిపోతున్న వాళ్ళ జీవితంలో పెద్ద కుదుపు విమాన ప్రమాదం రూపంలో వచ్చింది. ఎయిర్ ఇండియా కనిష్క విమానం పై జరిగిన ఉగ్రవాద దాడిలో మంజరి, పిల్లలు మరణించారు. "ఈ సంఘటన జరిగిన తదుపరి నెలల్లో కష్టాల కడలిలో కొట్టుమిట్టాడిన జీవితం గురించి నేను వర్ణించలేను.  ఆ సమయంలో నా జీవిత సరళి ద్విపాత్రాభినయం చేస్తున్నట్టుండేది. ఒకటి బాహ్య ప్రపంచం - అక్కడ మామూలుగానే మాట్లాడుతుండే వాడిని, తింటుండే వాడిని, అందరిలాగే పని చేసుకునే వాడిని. రెండవది లోపలి ప్రపంచం. కన్నీళ్లు, శూన్యం తోడు-నీడగా నిరంతరం నన్ను ఆవహించి ఉండేవి". 

కొన్నాళ్ల తర్వాత కెనడాని వదులుకుని ఇండియాకి తిరిగి వచ్చేశారు చంద్రశేఖర్. తాను పుట్టిపెరిగిన రాజమండ్రి కాకుండా, మంజరి స్వస్థలమైన కాకినాడని కార్యక్షేత్రం చేసుకున్నారు. "కూలు కెళ్తా" అని ఆడుకోడమే తప్ప, కనీసం బడిలో చేరని శారద పేరు మీద శారదా విద్యాలయం స్థాపించారు మొదట. అటుపైన శ్రీకిరణ్ పేరుతో కంటి ఆస్పత్రి. వీటి నిర్వహణ కోసం సంకురాత్రి ఫౌండేషన్ పేరుతో స్వచ్చంద సంస్థ మొదలుపెట్టారు. తొలుత కెనడా స్నేహితుల విరాళాలతో మొదలైన సేవా కార్యక్రమాలు క్రమంగా విస్తరించి, అంతర్జాతీయ ఫండింగ్ సంస్థల దృష్ణిలో పడడంతో నిధుల సమస్య తీరి సేవా కార్యక్రమాల విస్తరణ సాధ్యమైందని రాసుకున్నారు తన ఆత్మకథలో. 

అయితే ఈ ప్రయాణం సులువుగా ఏమీ సాగిపోలేదు. ఇక్కడి బ్యూరోక్రసీ తలపెట్టిన ప్రతి పనికీ మోకాలడ్డింది. ఎదురుపడ్డ కొందరు మనుషులు, "వెనక్కి కెనడా వెళ్ళిపోతే" అనే ఆలోచన వచ్చేలా చేశారు చాలాసార్లు. కానైతే, తన లక్ష్యం మీద స్పష్టత ఉంది చంద్రశేఖర్ కి. విద్య, వైద్య రంగాల్లో చేయాల్సింది చాలా ఉందన్న భావన ఆయన్ని గట్టిగా నిలబడేలా చేసింది. చెడు పక్కనే మంచినీ, స్వార్థపరుల పక్కనే సహాయం చేసే వారిని కూడా చూశారు. బంధు మిత్రుల ప్రోత్సాహంతో, దాతల సహకారంతో విద్య, ఆరోగ్య రంగాల్లో తన సేవలని క్రమంగా విస్తరించారు. ఆలస్యంగానే అయినా, ఈ సేవలని గుర్తించి ప్రభుత్వం 'పద్మశ్రీ ' అవార్డుని ప్రకటించడం హర్షణీయం. 

నిజానికి 'ఆశాకిరణం' తెలుగులో రాసిన పుస్తకం కాదు. చంద్రశేఖర్ 'రే ఆఫ్ హాప్' పేరిట ఇంగ్లిష్ లో రాసిన పుస్తకానికి తెలుగు అనువాదం. పుస్తకం క్లుప్తంగానూ, అనువాదం సరళంగానూ ఉన్నాయి. మొత్తం తొమ్మిది అధ్యాయాల్లో తొలి మూడు అధ్యాయాల్లో వ్యక్తిగత విషయాలని పంచుకున్నారు. నాలుగో అధ్యాయం విమాన ప్రమాదానికి సంబంధించింది కాగా, అటుపైన వచ్చే అధ్యాయాలన్నీ సేవా కార్యక్రమాల స్థాపన, విస్తరణని విపులంగా చెప్పినవే. స్థాపన, విస్తరణకి సంబంధించి ప్రతి దశనీ వివరంగా చెప్పారు. అదే సమయంలో తన భార్యని బిడ్డలనీ పుస్తకం ఆసాంతమూ స్మరిస్తూనే ఉన్నారు. సంకురాత్రి ఫౌండేషన్ ప్రచురించిన ఈ 148 పేజీల పుస్తకం వెల రూ. 100. ప్రతుల కోసం info@srikiran.org ని సంప్రదించవచ్చు. 

మంగళవారం, జనవరి 24, 2023

పద్నాలుగు ...

గట్టి పట్టుదలతో ఏడాదిని మొదలుపెట్టి, కొన్నాళ్ళపాటు ఆ పట్టుదలని కొనసాగించి, నెమ్మది నెమ్మదిగా జారిపోవడం అన్నది బ్లాగింగ్ విషయంలో అనుభవం అయ్యింది గడిచిన ఏడాది కాలంలో. మళ్ళీ ఇప్పుడిప్పుడే 'బ్యాక్ ఆన్ ట్రాక్' అనుకోగలిగే పరిస్థితులు కనిపిస్తూ ఉండడం సంతోషదాయకం. బ్లాగరుగా పద్నాలుగేళ్ళ పూర్తి చేసుకుని పదిహేనో ఏట అడుగు పెట్టబోతున్న సమయంలో చేసుకుంటున్న స్వీయ విశ్లేషణ ఇది. ఎప్పటిలాగే రాయాలనుకున్నవన్నీ రాయలేకపోవడం, చదవల్సినవి చదువకుండా పెండింగ్ పెట్టడమే గడిచిన ఏడాదీ జరిగింది. మునుపటితో పోలిస్తే చాన్నాళ్ల తర్వాత రాశి కాస్త కనిపిస్తూ ఉండడం వల్లనేమో ఈసారి సింహావలోకనంలో హింస పాళ్ళు కనిపించడం లేదు నాకు. 

కరోనా భయాల నుంచి అందరూ నెమ్మది నెమ్మదిగా కోలుకుంటున్నట్టే ఉంది పరిస్థితి. ఇదిగో వేరియంట్ అదిగో వేవ్ అనే వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నా పరిస్థితులు చక్కబడడం తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే ఊళ్లు తిరిగే వాళ్ళకి కాస్త వెసులుబాటుగా ఉంటుంది. ఆందోళనల నుంచి ఉపశమనం దొరికితే వ్యాపకాల వైపుకి దృష్టి మళ్లుతుంది. గతేడాదితో చాలామంది టూర్లు పోస్టుపోన్ చేసుకున్నాం అని చెప్పిన వాళ్ళే. కరోనా వల్ల జరిగిన మెలేమైనా ఉందా అంటే ఓటీటీ ప్లాట్ ఫారాలు మరింత దగ్గరయ్యాయి. పరభాషా సినిమాలని పరికించే వీలు దొరికింది. బాగుంటుంది అనిపిస్తే తప్ప సినిమా కోసం థియేటర్ కి వెళ్లాల్సిన అగత్యమూ తప్పింది. మలయాళం, మరాఠీ భాషల్లో వస్తున్న సినిమాలు మిగిలిన వాటికన్నా ప్రత్యేకంగా ఉండి ఆకర్షిస్తున్నాయి. 

Google Image

గమనించిన సంగతేమిటంటే తెలుగు సినిమా వాళ్ళు నటీనటుల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. అటు మలయాళీలు కానీ ఇటు మరాఠీలు కానీ నటులకు వెచ్చించే దానికి సరిసమానంగా కథ, సంగీతం కోసం వెచ్చిస్తారు. మొత్తంగా చూసినా వాళ్ళ సినిమాల బడ్జెట్ మన వాటిలో నాలుగో వంతు కూడా ఉండదు. ఖర్చు నేలమీద ఉండడం వల్లనేమో కథలూ నేలమీదే నడుస్తాయి. ఫోటోగ్రఫీలో మలయాళీలని (లొకేషన్లు వాళ్ళకి భలే ప్లస్ పాయింట్), నేపధ్య సంగీతంలో మరాఠీలనీ కొట్టేవాళ్ళు లేరు అనిపించింది కొన్ని సినిమాలు చూశాక. అసలు మరాఠీలు ఇంత ప్రోగ్రెసివ్ అని వాళ్ళ సినిమాల వల్లే తెలిసింది.  సినిమాలు చూడ్డం బాగానే ఉంది కానీ, ఇవి కాస్తా చదువు, రాత టైంని తినేస్తున్నాయి. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలని హిందీ సామెత ఉంది కదా. 

థియేటర్ కి వెళ్లి చూసినవి రెండే సినిమాలు. 'సీతారామం' మొదటిది, కన్నడ 'కాంతార' రెండోది. 'కాంతార' ఎక్కువగా నచ్చింది, పల్లెటూరి మట్టివాసన ప్రభావం కాబోలు. పుస్తకాల్లో కూడా కన్నడ నుంచి అనువాదం అయి వస్తున్న కథలు, నవలలు భలే ప్రత్యేకంగా ఉంటున్నాయి. 'తూఫాన్ మెయిల్' సంపుటిలో కథలు చాలారోజులు వెంటాడాయి. అన్నట్టు ఈ బ్లాగు వెయ్యిపోస్టుల మైలు రాయిని దాటింది గతేడాదిలోనే. ఆ సందర్భం కోసం 'వేయిపడగలు' మళ్ళీ చదవడం, అనుకోకుండా ఆ వెంటనే 'వేయిపడగలు నేడు చదివితే' అనే వ్యాసాల సంపుటి చదవడం తటస్థించాయి. విశ్వనాథ నవలల్లో 'ఏకవీర' ఎక్కువ ఇష్టం నాకు. కానీ, 'వేయి పడగలు' ని ప్రస్తావించకుండా తెలుగు సాహిత్యం అసంపూర్ణం అనిపించే స్థాయిని సాధించుకున్నది. ఈసారి చదివినప్పుడు నాకు ధర్మారావు మీద ఫిర్యాదుల సంఖ్య కాస్త తగ్గింది. 

వాళ్ళ సినిమాల ద్వారా మన కుటుంబ సభ్యులుగా మారిపోయిన కృష్ణంరాజు, కృష్ణ, సత్యనారాయణ కొద్దిరోజుల తేడాలో వెళ్లిపోయారు. ముగ్గురూ దాదాపు నిండు జీవితం గడిపిన వాళ్లే. ఫిర్యాదులు లేకుండా (అవార్డులు రాలేదు వగయిరా) బతికేసిన వాళ్ళే. ముగ్గురూ రాజకీయ రంగ ప్రవేశం చేసిన వాళ్ళే అయినా, కృష్ణంరాజుని పెద్దపదవులు వరించాయి - అదికూడా పెద్దగా కృషి లేకుండా. 'ప్రాప్తం' అనేది ఇలాంటి విషయాల్లో పనిచేస్తుందేమో. ఎలాంటి పరిష్కారమూ లేకుండా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. శ్రీలంక ఆర్ధిక సంక్షోభానికి ఇంకా ఇదమిద్ధమైన పరిష్కారం ఏదీ దొరికినట్టు లేదు. ఆ ప్రకారంగా కాలచక్రం గిర్రున తిరిగింది. సగటున వారానికో పోస్టుని ఈ బ్లాగు నమోదు చేసింది. ఈ అంకెని కాస్త పెంచాలని ఎప్పటిలాగే ఇప్పుడూ అనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి. మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన ఈ సందర్భంలో మీ అందరికీ థాంక్స్ చెప్పకుండా ఈ టపాని ముగించేదెలా... 

మంగళవారం, జనవరి 10, 2023

వాళ్ళు పాడిన భూపాలరాగం

ఆధునిక తెలుగు సాహిత్యంలో 'కాలాతీత వ్యక్తులు' నవలది ఓ ప్రత్యేక స్థానం. ఈ నవల రాయడం కోసమే జన్మించారా అనిపించేలా రచయిత్రి డాక్టర్ పి. శ్రీదేవి పిన్నవయసు లోనే మరణించారు. 'కాలాతీత వ్యక్తులు' మినహా ఆమె రచనలు మరేవీ ప్రింట్ లో అందుబాటులో లేకపోవడం వల్ల కావొచ్చు, ఆమె ఆ ఒక్క రచనే చేశారన్న ప్రచారం చాలాకాలంగా సాగుతోంది. ఆ ప్రచారానికి తెరదించుతూ, శ్రీదేవి రాసిన పన్నెండు కథల సంకలనాన్ని 'వాళ్ళు పాడిన భూపాలరాగం' పేరుతో ప్రచురించారు శీలా సుభద్రాదేవి. కథల్ని సేకరించి, సంకలనానికి సంపాదకత్వం వహించడం మాత్రమే కాదు, ఈ పన్నెండుతో పాటు శ్రీదేవి రాసిన కథలు మరో ఎనిమిది వరకూ ఉండవచ్చుననీ, వాటిని సేకరించే ప్రయత్నంలో ఉన్నాననీ చెప్పారు తన ముందుమాటలో. 

ఈ కథలన్నీ 1955-60 మధ్య కాలంలో రాయబడ్డాయి. అప్పటికి రచయిత్రి వయసు 26-31 సంవత్సరాలు. ఒకట్రెండు మినహా మిగిలిన కథలన్నీ చక్కని శిల్పంతో ఆసాంతమూ ఆపకుండా చదివించేలా ఉండడం రచయిత్రి ప్రతిభే. దేశానికి స్వతంత్రం వచ్చిన తొలి దశాబ్దంలో తెలుగుదేశపు మధ్య తరగతి జీవితాల ఆశలు, ఆకాంక్షలు ప్రధానంగా కనిపిస్తాయి ఈ కథల్లో. రచయిత్రి డాక్టరుగా విధులు నిర్వహించి, కేన్సరు బారిన పడి పోరాడి ఓడారు. ఈ ప్రభావం కథలమీద ఉంది. ఆస్పత్రులు, కేన్సరు కథల్లో కనిపించాయి. కొన్ని కథల్లో పాత్రల మీద 'కాలాతీత వ్యక్తులు' నవల్లో పాత్రల ప్రభావమూ కనిపించింది. బలమైన స్త్రీపాత్రలతో పాటు దీటైన పురుష పాత్రల్నీ చిత్రించడం వల్ల ఏ కథా ఏకపక్షంగా అనిపించలేదు. సన్నివేశ కల్పనలో నాటకీయత - ఆ కాలాన్నీ, రచయిత్రి అనుభవాన్నీ దృష్టిలో ఉంచుకున్నప్పుడు సబబే అనిపిస్తుంది. 

సంకలనానికి శీర్షికగా ఉంచిన 'వాళ్ళు పాడిన భూపాలరాగం' కథలో కథానాయకుడు స్కూలు ఫైనలు పాసవ్వగానే, అతని తండ్రికి పై చదువులు చదివించే స్తోమతు ఉన్నా ఉద్యోగానికి పట్నం పంపడాన్ని మరికాస్త జస్టిఫై చేసి ఉండాల్సింది అనిపించే కథ. సజీవ పాత్రలు, సహజ సన్నివేశాలు ఈ కథకి ప్రధాన బలం. ఆ వెంటనే గుర్తుండే మరో కథ 'చక్రనేమి క్రమాన'. ముందుమాటలో సుభద్రాదేవి గారు చెప్పినట్టుగా చిన్న సస్పెన్సుని చివరివరకూ కొనసాగించిన కథ. (అయితే ఆ సస్పెన్సుని సుభద్ర గారు విప్పి చెప్పేశారు, ముందుమాటని చివర్లో చదవడం మంచిది). మానవ మనస్తత్వాన్ని ఆధారంగా చేసుకుని రాసిన 'ఉరుములూ మెరుపులూ' ఆపకుండా చదివించడమే కాదు, పదికాలాలు గుర్తుండి పోతుంది,  ముఖ్యమైన మలుపుని మరికాస్త బలంగా చిత్రించాల్సింది అనిపించినప్పటికీ. 

మధ్యతరగతి ఆదర్శాల సంఘర్షణ 'కళ్యాణ కింకిణి.' కథ నడపడంలో రచయిత్రి చూపిన యుక్తి ఆశ్చర్య పరుస్తుంది. పాత్రలన్నీ మనకి బాగా తెలిసినవేమో అనిపించే కథ 'తిరగేసి తొడుక్కున్న ఆదర్శం' కాగా చతురస్ర ప్రేమకథ 'రేవతి స్వయంవరం'. తర్వాతి కాలంలో ముగ్గురు నలుగురు స్నేహితులు ఒకే అమ్మాయిని ప్రేమించే ఇతివృత్తంతో వచ్చిన సినిమాలకి మూలం బహుశా ఈ కథనేమో అనిపించింది. రాధ అనే బలమైన పాత్ర చుట్టూ అల్లిన కథ 'స్వరూపంలో రూపం'. రాధ ముందు మిగిలిన పాత్రలన్నీ చిన్నబోయాయి. రచయిత్రి స్వానుభవం కావచ్చునని బలంగా అనిపించే కథ 'అర్ధంకాని ఒక అనుభవం'. నాటి గ్రామ రాజకీయాలని పరిచయం చేస్తుందీ కథ. 

ఎండకాసి హఠాత్తుగా వర్షం రావడం కొన్ని కథల్లో కనిపించినా  (రచయిత్రి స్వస్థలం అనకాపల్లి, చదువు సాగింది విశాఖలో) ఆ వాతావరణాన్ని చక్కగా వాడుకుంటూ రాసిన కథ 'వర్షం వెలిసేసరికి...' చివర్లో నాయిక, నాయకుడి పాదాల మీద పడడం సుభద్రాదేవి గారికి నచ్చలేదు. నాకైతే రచయిత్రి మీద అప్పటి సినిమాల ప్రభావమేమో అనిపించింది. శిల్పపరంగా శ్రీదేవి చేసిన మరో ప్రయోగం 'శ్రావణ భాద్రపదాలు'. కథలో ఓ పక్క శ్రావణ మాసపు మబ్బులు, మరోపక్క మల్లెపూలూను. డాక్టరుగా పనిచేస్తున్నప్పుడు విన్న విషయాలని ఆధారంగా చేసుకుని రాసినట్టు అనిపించే కథ 'మెత్తని శిక్ష'. ఇప్పటి డాక్టర్లకి కనీసం ఈ విషయాలు ఆలోచించే తీరుబాటు ఉంటుందని అనుకోలేం. 

సంపుటిలో తొలి కథ 'కల తెచ్చిన రూపాయలు' నిరాశ పరిచింది. పొగచూరిన ఇంట్లో చిరుగుల చొక్కా పరంధామయ్యని చూసి నీరసం వచ్చింది. తర్వాతి కథలన్నీ బాగున్నా, ఈ కథని తొలికథగా ఉంచడం అంత మంచి నిర్ణయం కాదేమో అనిపించింది. 'అనల్ప' ద్వారా మార్కెట్లోకి వచ్చిన ఈ 201 పేజీల పుస్తకం వెల రూ. 250 (ఈ సంస్థ వారి చాలా పుస్తకాల్లాగే, ఈ పుస్తకానికీ వెల ఎక్కువే అనిపించింది, ముఖ్యంగా ముద్రణ నాణ్యత పరంగా చూసినప్పుడు). కథల్ని సంకలనం చేసిన సుభద్రాదేవి గారి కృషిని ప్రత్యేకంగా అభినందించాలి. కథల్ని ఉన్నవి ఉన్నట్టు ప్రచురించారో, 'సంపాదకత్వం' అని వేశారు కాబట్టి ఏమన్నా ఎడిట్ చేశారో తెలియదు. మొత్తంమీద, మిగిలిన ఎనిమిది కథల కోసం ఎదురు చూసేలా చేసిన పుస్తకం ఇది. 

మంగళవారం, జనవరి 03, 2023

"అమ్మ సెల్లియ్యదు..."

రెండు మూడు రోజులుగా న్యూ ఇయర్ గ్రీటింగ్స్ కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియో క్లిప్ ఇది. ఓ ప్రజాప్రతినిధి (?) తన మందీ మార్బలంతో ఓ జనావాసంలో తిరుగుతూ కనిపించినవాళ్ళని పలకరిస్తున్నారు. బొద్దుగా ఉన్న ఓ పిల్లాడిని చూడగానే ఆగి "ఏం చదువుతున్నావమ్మా?" అని అడగ్గానే, కుర్రాడు చేతులు కట్టుకుని "ఎయిత్ క్లాస్" అని బదులిస్తాడు. "ఏదిరా అంత లావై పోయినావు? గేమ్స్ ఆడుకోవా?" అని సదరు ప్రతినిధి ఆశ్చర్యపడుతూ అడగ్గానే, కుర్రాడు ధీర గంభీరంగా "అమ్మ సెల్లియ్యదు" అని జవాబు చెబుతాడు. వింటున్న వాళ్ళకే కాదు, వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా అర్ధం కాడానికి ఓ క్షణం పడుతుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ కుర్రాడి దృష్టిలో గేమ్స్ అంటే సెల్ ఫోన్ లో ఆడుకునేవి మాత్రమే అని అర్ధం కాగానే నా బుర్రని అనేక ప్రశ్నలు తొలచడం మొదలెట్టాయి. 

ఇప్పటి పిల్లలు మనుషులతో కన్నా ఎలెక్ట్రానిక్ గాడ్జెట్స్ తో ఎక్కువ సమయం గడుపుతున్నారన్నది నిజం. కరోనా పుణ్యమా అని పలకా, పుస్తకాలని కూడా స్మార్ట్ ఫోన్లు, ట్యాబులు రీప్లేస్ చేసేయడంతో ఈ గాడ్జెట్స్ తో సావాసం మరింత పెరిగింది. వీడియో గేమ్స్ చూస్తూ పెరిగి పెద్దవుతూ, గాడ్జెట్స్ లోనే చదువుకుంటూ, అన్నీ మొబైల్ లోనే ఉన్నాయని నమ్ముతున్న పిల్లలకి గేమ్స్ అంటే వీడియో గేమ్స్ మాత్రమే అనిపించడంలో ఆశ్చర్యం ఏముంది? అవితప్ప వాళ్లకి తెలిసిన వేరే గేమ్స్ ఏమున్నాయి కనుక? తల్లిదండ్రులిద్దరి దగ్గరా మొబైల్ ఫోన్లు ఉండడం మాత్రమే కాదు, అవి వాళ్ళకి దాదాపుగా శరీర భాగాలుగా కలిసిపోడాన్ని చూస్తూ పెరుగుతున్న పిల్లలు వీళ్ళు. చందమామని కాక, సెల్ఫోనుని చూస్తూ గోరు ముద్దలు తిన్న వాళ్ళూను. ఇలా కాక, ఇంకెలా ఆలోచించగలరు మరి? 

పిల్లవాడి వీడియో చాలాసార్లు చూశాక (చాలామంది మిత్రుల నుంచి ఫార్వార్డ్ అయి వచ్చింది, కొందరైతే రకరకాల జిఫ్ లూ అవీ జోడించారు కూడా) ప్రధానంగా అనిపించినవి రెండు - పిల్లలకి సెల్లు మాత్రమే తెలియడం, సెల్ ఫోన్ తప్ప ఇంకేమీ తెలియక పోవడం. అన్నం కన్నా ముందు సెల్ ఫోన్ పరిచయం అవుతోంది కాబట్టి, పిల్లలు వాటికి అలవాటు పడడంలో ఆశ్చర్యం లేదు. కానీ వాళ్ళని సెల్ ఫోన్ ఆకర్షించినంతగా మిగిలిన ప్రపంచం ఎందుకు ఆకర్షించడం లేదు? టీవీలో సినిమా వస్తున్నా, చివరికి అమ్మానాన్నలతో సినిమా హాలుకి వెళ్లినా ఫోన్ లో తలదూర్చేసే పిల్లల్ని చూసినప్పుడల్లా బహురూపాల్లో వచ్చే ప్రశ్నే ఇది. పిల్లవాడి పుణ్యమా అని ప్రశ్నలో స్పష్టత వచ్చింది. చేత్తో పట్టుకోగలిగి, కంట్రోల్ చేతుల్లో ఉండి, కళ్ళకి సరిగ్గా సరిపోయేంత తెర ఉండడం మాత్రమేనా, ఇంకా ఏమన్నా కారణాలు ఉన్నాయా? 

గమనించిన మరో విషయం ఏమిటంటే పిల్లలు ఇలా సెల్ఫోన్ లోనే ప్రపంచాన్ని చూసుకోడాన్ని మెజారిటీ తల్లిదండ్రులు ఆనందిస్తున్నారు, కొందరైతే గర్వ పడుతున్నారు కూడా. "వీళ్ళ వయసులో మాకు ఫోనే తెలియదు. వీళ్ళకి ఫోన్ వాడకం మొత్తం వచ్చేసిందప్పుడే" అనే గర్వరేఖలకీ లోటులేదు. పిల్లల కళ్ళమీదా, బుర్రమీదా పడే ప్రభావాలని గురించి ఆలోచిస్తున్నవాళ్ళు అరుదు. ఇగ్నోరెన్సు అన్నివేళలా బ్లిస్సేనా? ఇదిగో ఇలాంటి తల్లితండ్రులమధ్య, సెల్లియ్యని ఆ అమ్మ చిన్న ఆశాకిరణంలా కనిపించింది. ఇవ్వకపోడానికి కారణాలు తెలియవు కానీ, ఇవ్వకుండా ఉండడం ద్వారా బిడ్డకి బయటి ప్రపంచం కాస్త పరిచయం అవడానికి సాయం చేస్తోంది. అదే సెల్లు చేతిలో ఉంటే ఆ నాయకుడికి ఈ పిల్లవాడు దొరికి ఉండేవాడు కాదు, ప్రశ్నని అర్ధం చేసుకోగలిగే వాడూ కాదు. 

నిజానికి పిల్లవాడికి కొంచం ప్రపంచం తెలిసి, "గేమ్స్ ఆడడానికి గ్రౌండ్ లేదు" అని చెప్పి ఉంటే సదరు నాయకుడు ఎలా స్పందించి ఉండేవాడన్నది మరో ఆలోచన. ఇప్పుడు ఎన్ని స్కూళ్ళకి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, వ్యాయామ విద్య అనే క్లాసు టైం టేబుల్ లో ఉంది, అసలు బోధించే ఉపాధ్యాయులు ఎందరు ఉన్నారు అన్నవన్నీ జవాబు దొరకని ప్రశ్నలే. లెక్కకు మిక్కిలిగా ఉన్న ప్రయివేటు స్కూళ్లలో వ్యాయామ విద్యని గుర్తించేవి బహుతక్కువ. స్కూలు మొత్తానికి ఒకరో ఇద్దరో పిల్లల్ని - వాళ్ళు కూడా తల్లితండ్రుల పుణ్యమా అని క్రీడల్లోకి వచ్చినవాళ్లు - గుర్తించడం, వాళ్ళకి ఏదైనా పోటీల్లో బహుమతులొస్తే 'మా బడి పిల్లలకి బహుమతులు' అని ప్రచారం చేసుకోవడం మాత్రమే కనిపిస్తోంది. 

సర్కారు బడుల్లో కొన్నింటికి ప్లే గ్రౌండ్లు, మరికొన్ని చోట్ల పీఈటీలు ఉన్నా రెండూ ఉన్నవి తక్కువే అనిపిస్తుంది. నిజానికి వనరులు అన్నీ అందుబాటులోనే ఉన్నా, ఆడేందుకు ఆసక్తి చూపించే పిల్లలెందరు? ప్రోత్సహించే తల్లిదండ్రులెందరు? 'పిల్లల భవిష్యత్తంతా కంప్యూటర్ల లోనే ఉంది. ఫోన్ బాగా వస్తే (?) కంప్యూటరూ బాగా వస్తుంది' అనే ఆలోచనల్ని బద్దలుకొట్టేది ఎవరు, ఎప్పుడు? "గేమ్స్ ఆడుకోవా?" అని అడగడానికి ముందు, గేమ్స్ అంటే ఏమిటో స్పష్టంగా చెప్పి, ఎందుకు ఆడాలో వివరించి ఉంటే ఆ కుర్రాడు ఆడేందుకు ప్రయత్నించి ఉండేవాడేమో. సెల్లులోనే కాకుండా గ్రౌండ్ లో ఆడే గేమ్స్ కూడా ఉంటాయని తెలుసుకుని ఉండేవాడేమో. సెల్ ఫోన్ దాటి బయట ఉన్న ప్రపంచాన్ని పిల్లలకి పరిచయం చేయాల్సిన సమయం వచ్చిందేమో అనిపిస్తోంది. పిల్లలకన్నా ముందు పెద్దలకి అర్ధంకావాలి. పిల్లి మెడలో గంటని కట్టేదెవరు??