శుక్రవారం, ఫిబ్రవరి 27, 2015

రాగం

ఆమె పచ్చని కోనసీమలో కాపురముండే  మధ్యతరగతి ఇల్లాలు. కర్ణాటక సంగీతాన్ని ప్రాణప్రదంగా ప్రేమించే ఆమె గొంతు విప్పిందంటే ఆ గమకాల ముందు అక్కడ ప్రవహించే గోదారి మూగబోవాల్సిందే. కానీ, ఆమె గొంతు విప్పదు. తన సంగీతాన్ని దేశమంతటికీ వినిపించాలని ఒకప్పుడు కలలు కన్న ఆమె, ఉన్నట్టుండి మూగదైపోయింది. తన కళ్ళముందే కన్నకొడుకు, ప్రాణ స్నేహితురాలు ఓ ప్రమాదంలో ప్రాణం విడవడంతో తన స్వర ప్రస్థానాన్ని ఆరంభించకుండానే ఆపేసింది. తన ఇల్లు దాటి బయటికి రాడానికి ఇష్టపడని ఆ నడివయసు స్త్రీ పేరు స్వర్ణలత.

అతను సంగీతమే ఊపిరిగా భావించే కుర్రాడు. సొంత ఊళ్ళో గోదారొడ్డున వందలాది ఎకరాల వ్యవసాయం ఉంది. కానీ చేయడు. వ్యాపారం, ఉద్యోగం.. ఇవేవీ అతనికి నచ్చవు. చరిత్రలో చార్మినార్ కి ఓ ప్రత్యేక స్థానం ఉన్నట్టుగానే తను సృజించే సంగీతానికీ చోటుండాలి అన్నది అతని కల. వాయులీన విద్వాంసురాలైన తల్లిని చిన్నతనంలోనే పోగొట్టుకుని, తనని ఏమాత్రం అర్ధం చేసుకోని తండ్రికి తన మార్గాన్ని వివరించి చెప్పలేక, వచ్చిన కొద్దిపాటి పేరుతో ఆగిపోలేక, సంగీతంలో ఎదిగే దారులు వెతుక్కుంటున్న ఆ కుర్రాడి పేరు అభినయ్.

ఆ అమ్మాయి తండ్రి లేని పిల్ల. తల్లి ఓ ఫ్యాషన్ డిజైనర్. నగరంలో ఆమె నడిపే బోతిక్ కి వచ్చే కస్టమర్స్ అందరూ బాగా డబ్బున్న వాళ్ళే. వ్యాపారం చేయడం వెన్నతో పెట్టిన విద్య ఆమె తల్లికి. కానీ, ఆ అమ్మాయి జీవితంలో ఒంటరితనం. తనని ఎంతగానో ప్రేమించిన తండ్రిని చాలా చిన్నతనంలోనే కోల్పోయింది ఆ అమ్మాయి. ఓ ప్రమాదంలో మరణించిన తండ్రిని గురించి మాట్లాడడం తల్లికి ఇష్టం ఉండదు. తన ఒంటరి తనం నుంచి దూరంగా జరగడం కోసం సంగీతాన్ని ఆశ్రయించింది ఆ అమ్మాయి. పాప్ మ్యూసిక్ నేర్చుకుని పాటలు పాడడంలో ఆనందాన్ని వెతుక్కుంటోంది. ఆమె పేరు ప్రియాంక. ముద్దు పేరు పింకీ.


ఒకప్పుడు సంగీతాన్ని తన శ్వాసగా చేసుకున్న స్వర్ణలత, నగరంలో కచేరీ ఇవ్వడం కోసం బస్సులో ప్రయాణం చేస్తూ ఉండగా గోదారి వంతెన మీద బస్సుకి ప్రమాదం జరిగి కొడుకునీ, స్నేహితురాలినీ కోల్పోయింది. అప్పటినుంచీ, తనా వంతెన మీదకి వెడితే అరిష్టం అని నమ్మకం ఆమెకి. అరిష్టం స్వర్ణలతకి కాదు, ఊరికి. అందుకే తనని తాను ఇంటి నాలుగు గోడలకీ పరిమితం చేసేసుకుంది. అప్పటి వరకూ వ్యాపార ప్రకటనలు తయారు చేస్తున్న వాడల్లా, చేతిలో పని వదిలేసి మ్యూసిక్ ట్రూప్ ఆరంభించడం కోసం ప్రయత్నం చేస్తున్న అభినయ్ కి పింకీ పరిచయమవుతుంది. వీళ్ళిద్దరూ కలిసి ఓ గిటారిస్ట్ నీ, డ్రమ్స్ ప్లేయర్ నీ కూడా ఓ చోటకి చేర్చి రిహార్సల్ ఆరంభిస్తారు.

తనకున్న కాంటాక్ట్స్ ఉపయోగించి ఈ ట్రూప్ కి ఓ కార్యక్రమం ఏర్పాటు చేయిస్తుంది పింకీ తల్లి. ఎంతో నమ్మకంగా ప్రోగ్రాం చేసిన అభినయ్ కి నిరాశ ఎదురవుతుంది. వీళ్ళ ట్రూప్ ఇచ్చిన కచేరీలో ఎలాంటి ప్రత్యేకతా లేదని పెదవి విరుస్తారు నిర్వాహకులు. పాప్, ర్యాప్ సంగీతానికి ప్రత్యేకతని అద్దాలంటే ఫ్యూజన్ ని మించింది ఏముంది? శాస్త్రీయ సంగీతం తెలిసిన గాయని తోడైతే ట్రూప్ కి మరి తిరుగుండదు. అప్పటికే అభి కి స్వర్ణలత పరిచయం. కానీ, ఆమె వంతెన దాటి బయటికి రాదు. ఆమె వంతెన దాటకపోతే అవకాశాలు ఉండవు. తనకంటూ ఓ ప్రత్యేకత నిలుపుకోవాలన్న అభి కోరిక, పదుగురెదుట పాడాలన్న స్వర్ణలత అభిలాష ఎలా సాకారమయ్యాయో చెబుతుంది పదకొండేళ్ళ క్రితం విడుదలైన 'రాగం' సినిమా.


'మార్నింగ్ రాగా' పేరిట ఇంగ్లీష్ లో నిర్మించి, 'రాగం' గా తెలుగులోకి అనువదించిన ఈ సినిమాలో స్వర్ణలత గా షబానా ఆజ్మీ, అభి గా ప్రకాష్ కోవెలమూడి (దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు తనయుడు), పింకీ గా పెరిజాద్ జొరాబియన్ నటించారు. సుధా రఘునాథన్, కల్యాణి మీనన్ పాడిన "మాతే.. మలయధ్వజ పాండ్య సంజాతే" తో ఆరంభమయ్యే ఈ ఎనభై తొమ్మిది నిమిషాల నిడివిగల సినిమా సుధా రఘునాథన్, రంజని రామకృష్ణన్ పాడిన "తాయే యశోదా" తో పూర్తవుతుంది. 2004 అక్టోబర్ లో విడుదలైన ఈ సినిమా కథకి అదే సమయంలో విడుదలైన శేఖర్ కమ్ముల 'ఆనంద్' సినిమా కథతో రేఖామాత్రపు పోలిక ఉండడం కేవలం యాదృచ్చికం.

కథకుడు మహేష్ దత్తాని స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని కె. రాఘవేంద్ర రావు నిర్మించారు. మణిశర్మ, అమిత్ హేరీ సంగీతాన్ని సమకూర్చారు. నటీనటుల్లో అగ్ర తాంబూలం స్వర్ణలతగా చేసిన షబానా ఆజ్మీకే ఇవ్వాలి. ఒక్క నడకని మినహాయించుకుంటే, వెనుకటి తరం కోనసీమ స్త్రీగా ఆమె పాత్రలో ఇమిడిపోయింది. ఇంగ్లీష్ లో తీసి తెలుగుకి అనువదించడం వల్ల కాబోలు ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి వేరే వాళ్ళ చేత డబ్బింగ్ చెప్పించారు. అభి తండ్రిగా జమీందారు పాత్రలో నాజర్ ఒప్పించాడు. రాజీవ్ మీనన్ కెమెరాలో మరింత అందంగా కనిపించింది కోనసీమ. తెలుగు వన్ సమర్పించిన యుట్యూబ్ వీడియోలో మొదటి పది పదిహేను నిమిషాలు ఆడియో క్వాలిటీని భరించాలి. మొత్తం మీద చూసినప్పుడు ఈ సినిమాకి రావల్సినంత పేరు రాలేదేమో అనిపించింది.

బుధవారం, ఫిబ్రవరి 18, 2015

రామానాయుడు ...

తెలుగునాట  చిత్ర నిర్మాణ సంస్థ పేరు చూసి "ఈ సినిమా చూడొచ్చు" అనో "తప్పకుండా చూడాలి" అనే పేరు తెచ్చుకున్న సంస్థలు బహు తక్కువ. ఓ విజయ, ఓ వాహిని.. వరుసలో ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్. సినీరంగంలో ఉండే చాలామందికి సినిమా  వారి జీవితంలో ఓ భాగం. కానీ,  సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ అధినేత డాక్టర్ డి. రామానాయుడికి మాత్రం సినిమానే జీవితం. అందుకే, సురేష్ సంస్థ సినిమా రంగానికి సంబంధించిన అన్ని శాఖలకీ విస్తరించింది. అనేక భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించింది.

సాధారణంగా నిర్మాతలు తెరవెనుక మాత్రమే ఉంటారు. కానీ రామానాయుడు తను నిర్మించిన సినిమాల్లో ఏదో ఒక సన్నివేశంలో తెరమీద తళుక్కున మెరుస్తారు. సరదాగా మొదలైన ఈ 'ప్రత్యేక అతిధి పాత్ర పోషణ' రానురానూ సెంటిమెంట్ గా మారిందేమో అనిపిస్తుంది. అసలైతే సినిమాల్లో హీరో కావాలని కారంచేడు నుంచి మదరాసు వెళ్లారట రామానాయుడు. నటన తన 'కప్ ఆఫ్ టీ' కాదని తొందరగానే గ్రహించి, నిర్మాణం వైపు వెళ్ళారు. అతిధి పాత్రలు కూడా జడ్జి, కలెక్టర్.. ఇలా కథకి కీలకమైనవీ  నాలుగైదు నిమిషాల నిడివి మాత్రమే ఉండేవీను.

"పరిశ్రమకి వచ్చిన కొత్తలో ఓ సినిమాలో డాక్టర్ వేషం వేశాను. హీరోయిన్ కి ఇంజెక్షన్ చెయ్యాలి.. ఎక్కడా, నా చెయ్యి ఒకటే వణికిపోతోంది. టేకులు తిని పూర్తిచేశాను ఆ సీన్," అంటూ ఆయనే గుర్తు చేసుకున్నారు ఓ సందర్భంలో. సినిమా నిర్మాణంలో తలపండిన వ్యక్తి కావడం వల్ల నిర్మాణం వ్యయం మీద పూర్తి అదుపు ఉంది రామానాయుడికి. అంతే కాదు, ఖర్చు పెట్టిన ప్రతి రూపాయినీ తెరమీద చూపించడం ఎలాగో బాగా తెలుసాయనకి. అందుకే, సురేష్ ప్రొడక్షన్స్ సినిమాల్లో భారీ నష్టాలు తెచ్చిన సినిమాలు బాగా తక్కువ.


అందుబాటులో ఉన్న వనరుల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా సంస్థల్ని లాభాల్లో నడిపించవచ్చు అంటారు మానవ వనరుల అభివృద్ధి నిపుణులు. మేనేజ్మెంట్ చదువులు చదవకపోయినా, సినిమా నిర్మాణం విషయంలో ఈ సూత్రాన్ని అమలులో పెట్టి ఫలితాలు రుచి చూశారు రామానాయుడు. అరడజను మంది హీరోలు, డజను మంది హీరోయిన్లు, రెండు డజన్ల మంది దర్శకులు సురేష్ సంస్థ ద్వారా సినిమా రంగానికి పరిచయం కావడం మాత్రమే కాదు, తక్కువ బడ్జెట్ తో సినిమా తీసి ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చని పరిశ్రమకి నిరూపించారు కూడా.

సినిమా రంగంలో సన్నిహితంగా మసిలే మిత్రులు కొందరు రామానాయుడిని "డాడీ రామానాయుడు" అని పిలుచుకుంటారు (డాక్టర్ డి). నిజంగానే ఆయన తెలుగు సినిమా పరిశ్రమకి ఫాదర్లీ ఫిగర్. ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన, తనని చూడ వచ్చిన ప్రతి ఒక్కరికీ కరెన్సీ నోటు ఇచ్చి పంపడం రామానాయుడి అలవాటు. లైట్ బాయ్ మొదలు, హీరోయిన్ వరకూ అందరికీ ఒకే మొత్తం. ఎంత మొత్తం అన్నది కాదు ప్రధానం, ఏడాది మొదటి రోజున ఆయన దగ్గరినుంచి డబ్బు తీసుకుంటే ఆ ఏడాదంతా కెరీర్ 'రైజ్' లో ఉంటుందని చాలామంది నమ్మకం.

దశాబ్దాల పాటు ఓ రంగంలో కొనసాగినప్పుడు కాలానుగుణంగా తనని తాను మార్చుకోడం తప్పనిసరి. మార్పుని అంది పుచ్చుకుంటూనే, రాజీ కి సిద్ధ పడలేదు రామానాయుడు. పదిహేనేళ్ళ క్రితం, నిర్మాణ సంస్థలన్నీ 'యూత్ సినిమాల' వేవ్ లో కొట్టుకుపోతూ బూతు సినిమాలని జనం మీదకి వదిలిన సమయంలో సురేష్ సంస్థ 'ప్రేమించు' 'విజయం' లాంటి సినిమాలు నిర్మించింది. వీటిలో 'ప్రేమించు' జాతీయ స్థాయిలో అవార్డు పొందాల్సిన సినిమా. విజయవంతమైన జీవితాన్ని గడిపిన రామానాయుడి మరణం తెలుగు సినిమా పరిశ్రమకి మాత్రం తీరనిలోటు. ఇలాంటి నిర్మాతని పరిశ్రమ మళ్ళీ చూడగలదా? అన్నది కాలం మాత్రమే జవాబు చెప్పగలిగే ప్రశ్న.

మంగళవారం, ఫిబ్రవరి 17, 2015

ఇద్దరు భక్తులు

తెలుగులో వెలసిన తొలి వీరశైవ పురాణ గ్రంధం పాల్కురికి సోమన విరచిత 'బసవ పురాణం.' క్రీస్తు శకం పన్నెండో శతాబ్దానికి చెందిన ఏడశ్వాసాల ఈ గ్రంధంలో నందీశ్వరుని అవతారమైన బసవని పూర్వ అవతారాలు, వ్యవహార దక్షత, వీరశైవ ధర్మ రక్షా ప్రచారాలు, జంగమ సేవ, లింగైక్యము తదితర పుణ్య చరిత్రలతో పాటు సుమారు డెబ్భై ఐదు మంది శివ భక్తుల కథలు కూర్చబడ్డాయి. 'మహాశివరాత్రి' పర్వదినాన్ని పురస్కరించుకుని, ఈ రచనలో వర్ణించిన ఇద్దరు శివభక్తుల కథలకి రేఖామాత్రపు పరామర్శ.

భగవంతుణ్ణి తండ్రిగానో, స్నేహితుడిగానో చూసిన భక్తుల కథలు మనకి తెలుసు. సాక్షాత్తూ పరమశివుణ్ణి తన కొడుకుగా భావించుకుని ఉపచారాలు చేసిన మహాభక్తురాలు బెజ్జ మహాదేవి. శివుణ్ణి గురించి ఈమె ఆలోచనలు ఎంత దూరం వెళ్ళాయంటే, "శివుడి తల్లి బహుశా మరణించి ఉంటుంది. తల్లే జీవించి ఉంటే కేశాలని అలా జడలు కట్టనిస్తుందా? పులితోలు కట్టుకుని తిరగనిస్తుందా? మామూలు రోజుల్లో ఎలా ఉన్నా, కనీసం పెళ్ళిళ్ళు, పేరంటాల సమయంలో అయినా బిడ్డని అందంగా తయారు చేయకుండా ఉంటుందా?" ఇలాంటి ఆలోచనలు సాగి సాగే, పరమ శివుడికి తానే ఎందుకు తల్లి కాకూడదు? అన్న ప్రశ్న దగ్గర ఆగుతుంది.

శివుడామె భక్తికి మెచ్చి పసిబాలుడిగా ఆమె ఇంట్లో ప్రవేశిస్తాడు. నవజాత శిశువులకి జరిపే అన్ని ఉపచారాలనీ బాల శివుడికి ఎంతో శ్రద్ధగా నిర్వహిస్తుంది బెజ్జ మహాదేవి. తలారా స్నానం చేయించి, మూడు కళ్ళకీ కాటుక దిద్దడం మొదలు, బుగ్గ గిల్లి ఉగ్గుపాలు పోయడం, ఏడుపు మాన్పడానికి ముద్దాడి బుజ్జగించడం, వెన్న తినిపించి నిద్రపుచ్చడం.. ఇలా రోజంతా ఆ పసివాడితోనే గడిపేది. భక్తుడేవిధంగా భావిస్తే శివుడా విధంగా సాక్షాత్కరిస్తాడనడానికి ఉదాహరణగా నిలిచిన సన్నివేశాలవి. ఇంతలో తన భక్తురాలిని పరిక్షించదలిచాడు శివుడు. ఉన్నట్టుండి తిండి ముట్టడం మానేశాడు.


బిడ్డకి జబ్బు చేసిందన్న బెంగ బెజ్జ మహాదేవిని నిలవనివ్వలేదు. ముందుగా ఆమె ఆ బిడ్డని కోపగించుకుంది. అతని అల్లర్ల జాబితా చదివింది. ఊరంతా బలాదూర్ తిరగడాన్నీ, అందరిళ్ళకీ వెళ్లి వాళ్ళు పెట్టింది తిని రావడాన్నీ తప్పు పట్టింది. తనేం తక్కువ చేస్తున్నానంటూ నిష్టూర పడింది. అటుపై ఆ తల్లి కోపం బెంగగా మారింది. బిడ్డ బాధ చూడలేక ప్రాణ త్యాగానికి సిద్ధ పడింది. ఆమె తన తలని పగలగొట్టుకోబోతుండగా శివుడామెకి ప్రత్యక్షమయ్యాడు. ఆమెకి శాశ్వతమైన ముక్తిని ప్రసాదించాడు. బెజ్జ మహాదేవి అమ్మగా మారి శివుణ్ణి సేవించింది కనుక 'అమ్మవ్వ' అని పేరుపొందింది.

తాను నైవేద్యం పెట్టిన పాలని తాగడం లేదెందుకని శివుణ్ణి నిలదీసిన బాల భక్తురాలు 'గొడగూచి.' శివదేవుడనే శివభక్తుడి కడగొట్టు సంతానం ఆ పిల్ల. తల్లీ తండ్రీ యాత్రకి వెడుతూ, నిత్యం శివుడికి కుంచెడు పాలు నైవేద్యంగా సమర్పించడం మర్చిపోవద్దని మరీ మరీ చెప్పి వెళ్ళారా అమ్మాయికి. మొదటి రోజు పాలని శ్రద్ధగా కాచి, చల్లార్చి, ఆలయానికి తీసుకెళ్ళి, శివలింగం ముందుంచింది భక్తిగా. పాల పాత్ర అలాగే ఉంది. ఎంతసేపటికీ శివుడా పాలని ముట్టక పోవడంతో ఆమెకి కోపం వచ్చింది, బాధ కలిగింది.. అటుపై తండ్రి దగ్గర మాట పడాలని భయం మొదలయ్యింది.

పాలు తాగమని ఎంతగానో ప్రార్ధించింది శివుణ్ణి. తండ్రి తెచ్చే చిరుతిళ్ళు, ఆట బొమ్మల్లో వాటా ఇస్తానని ఆశ పెట్టింది. ఉహు, పాలగిన్నె అలాగే ఉంది. శివుడు పాలు తాగకపోతే, తండ్రి చేతిలో తనకి ఎలాగో దండన తప్పదు కాబట్టి, శివలింగానికి శిరస్సు తాటించి ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధ పడిపోతుంది. శివుడు ప్రత్యక్షమై పాలని సేవిస్తాడు. తల్లిదండ్రులు ఊరినుంచి వచ్చేవరకూ ప్రతి రోజూ ఆమె పాలని తీసుకెళ్లడం, శివుడు ఆరగింపు చేయడం జరిగింది. ఊరినుంచి తిరిగొచ్చిన తండ్రి శివుడు పాలు తాగాడంటే నమ్మలేదు. మహా మహా భక్తుల నైవేద్యాలనే ఆరగించని శివుడు, తన కూతురు నైవేద్యం పెట్టిన పాలని తాగడం అతనికి నమ్మశక్యం కాలేదు.

కూతురి మాటలు నమ్మకపోగా, అబద్ధం చెబుతోందంటూ ఆమెని దూషించాడు. పాలు పారబోశావా లేక స్నేహితులని పంచావా చెప్పమని నిలదీశాడు. తన ఎదురుగా శివుడిని వచ్చి పాలు తాగేలా చేయమన్నాడు. రోజూ వచ్చి పాలు తాగిన పరమ శివుడు ఆరోజు రాలేదు. ఆ బాలిక వేదన వర్ణనాతీతం. ఓ పక్క తన నమ్మకానికి తగిలిన దెబ్బ, మరోవంక తండ్రి ఆగ్రహం. శివలింగం దగ్గర ప్రాణ త్యాగానికి సిద్దమయిపోయింది. శివుడు ప్రత్యక్షమై ఆమెని తనలో లీనం చేసుకుంటూ ఉండగా, తండ్రి ఆమె జుట్టు తన చేత పట్టుకున్నాడు. నాటి నుంచీ ఆమె 'గొడగూచి' గా సుప్రసిద్ధమయింది.

శనివారం, ఫిబ్రవరి 14, 2015

గులాబీరంగు వోణీ

సందు మలుపు తిరిగి సరిగ్గా పదకొండు ఇళ్ళు దాటాక కుడివైపు పన్నెండో ఇల్లు జీవీఎస్ మేష్టారిది. ఎడం వైపు ఇళ్ళ మధ్యలో ఖాళీ స్థలాలున్నాయి కానీ, కుడివైపు పొడవు పొడవూ ఇళ్ళే. చలికి కొంకర్లు పోతున్న వేళ్ళని, గుండెలకి అదుముకున్న పుస్తకాల బొత్తి చుట్టూ మరింత గట్టిగా బిగించింది రాధిక.

మంచు వర్షంలా కురుస్తోందేమో రోడ్డు కనిపించడం లేదు. అయితేనేం, మలుపు తిరిగినప్పటినుంచీ ఆమెని అనుసరిస్తున్న అడుగుల చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. సరిగ్గా మరొక్క ఇల్లు దాటితే మేష్టారిల్లనగా ఎప్పటిలాగే ఆగిపోయిందా చప్పుడు.

ఉదయం ఆరు కొట్టిందంటే మేష్టారి ట్యూషన్ మొదలవ్వాల్సిందే. చలీ, వర్షమే కాదు తుపానొచ్చినా ఆగదా క్లాసు. అంతేకాదు, మొదట వచ్చిన వాళ్ళకే ముందు వరసలో చోటు. ఓ వైపు అబ్బాయిలు, మరోవైపు అమ్మాయిలు.

రోజూలాగే ఐదూ యాభై ఐదుకి ముందే క్లాసులో ఉంది రాధిక. మొదటగా వచ్చింది ఆమే. అప్పటికే మేష్టారు ట్యూషన్ గదిలో లైటు వేసి, చాపలు పరిచి లోపలి ఇంట్లోకి వెళ్ళిపోయారు, పూజ చేసుకోడానికి.

వోణీని భుజం చుట్టూ కప్పుకుని ఒద్దికగా  కూర్చుందామె. నోట్సు తిరగేస్తూ ఉండగానే హడావిడిగా లోపలికి అడుగు పెట్టారు జ్ఞానేశ్వరి, భ్రమరాంబ.

"ఒచ్చేసేవా? అయినా క్లవర్లతోటి మేవెక్కడ పోటీ పడగల్దువమ్మా.. ఆ నోట్సు ఓసారిలాగియ్యి," రాధిక పక్కన చొరవగా కూర్చుని ఒళ్లో పుస్తకం లాక్కుంది జ్ఞానేశ్వరి.

"ఇంపార్టెంట్లన్నీ రెడ్డింకుతో బలేగా గుర్తులు పెడతావే నువ్వు.. ఇయి చూస్కుంటే చాలు," ఓ మెచ్చుకోలు విసిరింది.

అబ్బాయిల్లో మొదట వచ్చినతన్ని చూసినా చూడనట్టు నటిస్తూ "అచ్చుత్ కి ఏ షర్టయినా బలేగా ఉంటాదే.. టీషర్టు, ఫుల్ హేండ్సు అచ్చుత్ తొడిగితేనే చూడాలనుకో," ఉత్సాహంగా చెప్పుకుపోతున్న జ్ఞానేశ్వరిని మోచేత్తో పొడిచింది భ్రమరాంబ.

"ఎహె.. నిన్న రాత్రి అంతరంగాలు సీరియల్లో మొత్తం మూడు చొక్కాలు మార్చేడు," నవ్వు దాచుకుంటూ చెప్పింది జ్ఞానేశ్వరి. ఆ కుర్రాడు అచ్యుత్, ఇవేవీ పట్టించుకోకుండా నోట్సులో తల దూర్చేశాడు.

నుదుటిన విభూతి పట్టీలు, వాటి మధ్యలో కుంకుమ బొట్టుతో మేష్టారు క్లాసులోకి రావడంతో గుండు సూది కింద పడితే వినిపించేంత నిశ్శబ్దంగా మారిపోయిందా గది. సరిగ్గా ఏడయ్యేసరికి క్లాసు పూర్తయ్యింది. ఒక్కొక్కరే బయటికి వస్తున్నారు.

"కంగ్రాచ్యులేషన్సోయ్ అచ్యుతా.. నిన్నటి పేపర్లో నీ ఫోటో చూశాను. కలెక్టర్ గారి దగ్గర నుంచి బహుమతి అందుకుంటున్నది. ఈమధ్యెందుకో నీకు చదువు మీద శ్రద్ధ తగ్గిందేమో అనిపిస్తోంది. ఫైనలియరు.. జాగ్రత్త మరి," మేష్టారు నెమ్మదిగానే చెప్పినా, గుమ్మం దగ్గర చెప్పు సరిచేసుకుంటున్న రాధిక చెవిన పడ్డాయా మాటలు.

ఆ ముందు రోజు పేపర్, కాలేజీ లైబ్రరీ నుంచి మాయమైపోయింది.

***

"ఆ అచ్యుత్ ని ఏదో ఒకటి అనకుండా ఉండవెప్పుడూను. ఏటమ్మా స్టోరీ?" లేడీస్ వెయిటింగ్ రూంలో జ్ఞానేశ్వరిని నిలదీసింది భ్రమరాంబ. దీక్షగా 'బ్యాంగిల్ సెల్లర్స్' చదువుకుంటున్న రాధిక ఓసారి తలెత్తి చూసి మళ్ళీ పుస్తకంలో తలదూర్చేసింది.

"క్లవర్లతోటి మాకేం స్టోరీలుంటాయమ్మా..ఏవుండవు.."

అప్రయత్నంగా పళ్ళు బిగించింది రాధిక.

"పోనీ అంత ఇంట్రస్టుంటే మీ ఇంట్లో ఓ మాట చెప్పి చూడవే," వదల్లేదు భ్రమరాంబ.

"మా ఇంట్లో కేస్ట్ ఫీలింగ్ ఎక్కువే బాబూ. అయినా నేను బంగారం నగల షాపోణ్ణి తప్ప చేసుకోనని చెప్పేసేను," పాత విషయాన్ని కొత్తగా చెప్పింది జ్ఞానేశ్వరి.

"మరింకెందుకమ్మా.. చొక్కా బావుంది, చెడ్డీ బావుంది అని ఆ కుర్రోణ్ణి యేడిపించటం.." భ్రమరాంబ మాట పూర్తి కాకుండానే "ఓయ్" అటూ అడ్డు పడింది జ్ఞానేశ్వరి.

"చూడమ్మా బ్రెమరాంబికా దేవీ.. నీకంటే నువ్వు పుడతానే మీ మావయ్యతో పెళ్లి కుదిరిపోయింది. ఇంక నీకెవరికేసీ చూసే చాన్సు లేదు. మాకల్లాక్కాదు. ఎవడో ఒకడు దొరికే వరకూ కనిపించినోణ్ణల్లా ఏదొకటి అనొచ్చు.. కదే రాదికా," అన్న జ్ఞానేశ్వరి, అంతలోనే నాలిక్కరుచుకుని "అంటే ఈ క్లవర్లకి చదూ తప్ప ఇంకేం అక్కర్లేదనుకో.. నగల్షాపోడు దొరికేవరకూ నాకు మాత్రం ఇదే పని" కుండ బద్దలు కొట్టేసింది.

***

సందు మలుపు తిరగ్గానే ఎడమవైపు నుంచి వచ్చిన చలిగాలి నడుముకి తగిలి ఒళ్ళు ఝల్లు మంది రాధికకి. పరిచితమైన అడుగుల చప్పుడు వినిపిస్తోంది వెనుకనుంచి.

"నన్ను చూస్తున్నావని తెలుసు.. వీపుక్కూడా కళ్ళుంటాయి మీ ఆడపిల్లలకి," చలికి వణుకుతున్న గొంతు నుంచి ఆ మాట వినిపించిన కాసేపటికి అడుగుల చప్పుడు ఆగిపోయింది.

క్లాసులో కూర్చున్నాక వీపు మీద మంట తెలిసింది రాధికకి. తడిపొడి జుట్టుని అల్లేసుకుందేమో జడ నుంచి ఒక్కో నీటిబొట్టూ వీపు మీదకి జారినప్పుడల్లా బ్లేడుతో కోసినట్టు అనిపిస్తోంది.

"ఓహోయ్.. ఇవ్వాళ శుక్రారం.. ఇంగ్లీష్ మేడం ఎలాగూ లేటుగానే వస్తాది. పొద్దుపొద్దున్నే తల్తడపా పోతే కేలేజీకొచ్చేముందు చేసి రావొచ్చు కదే?" ప్రశ్నతో పాటు వచ్చింది జ్ఞానేశ్వరి.

"భ్రమర రాలేదా?" అడిగింది రాధిక.

"ఇంటి నిండా చుట్టాలున్నారే.. మూర్తం పెట్టుకుంటారేమో.. అదేవీ చెప్పలేదు మరి.." మేష్టారు రావడంతో సంభాషణ ఆగిపోయింది. కాలేజీలో కూడా కనిపించలేదు భ్రమరాంబ.

"మేలో గానీ జూన్ లో గానీ ఉంటాదంట పెళ్లి. డిగ్రీ ప్రైవేటుగా చదువుతాదంట," సాయంత్రానికి వార్త పట్టుకొచ్చింది జ్ఞానేశ్వరి. మర్నాడు కాలేజీ వెయిటింగ్ రూంలో అదే వార్తని పంచింది భ్రమరాంబ, పెద్ద మైసూర్ పాక్ తో పాటుగా.

"నేనూ నీకోటి తెచ్చేనేవ్ రాదికా," అంటూ పుస్తకంలోంచి గ్రీటింగంతున్న కార్డునొకటి బయటికి తీసింది జ్ఞానేశ్వరి. "ఇది తొమ్మిది సంవస్సరాల కేలండర్. నీలాంటి క్లవర్లకైతే పనికొత్తాది. ఎందుకేనా మంచిది గానీ జిరాక్స్ తీయించుకుని నాది నాకిచ్చెయ్.."

ఏమీ మాట్లాడకుండా కార్డు అందుకుని నోట్సులో పెట్టుకుంది రాధిక.

***

జీవీఎస్ మేష్టారి ట్యూషన్లో మొదటి ప్రి-ఫైనల్ పరిక్ష ఆరోజున. చలి కాస్త తగ్గు ముఖం పట్టినా, పరిక్ష  విషయం తల్చుకుంటే అడుగులు తడబడుతున్నాయి రాధికకి. సందు మలుపు తిరగ్గానే వెనుక నుంచి అడుగుల చప్పుడు.

"గులాబీ రంగు వోణీ నీకెంత బావుంటుందో తెలుసా? నీకిష్టం ఉండదేమో మరి. ఆర్నెల్లలో నాలుగంటే నాలుగుసార్లే వేసుకున్నావ్.. ఎల్లుండి పద్నాలుగో తారీకు. నేనంటే.. నామీద.. ఇష్టం ఉంటే... ఆ వోణీ వేసుకురా.." అడుగుల చప్పుడు ఆగిపోయింది. 

కాస్త ఆలస్యంగా వచ్చిన జ్ఞానేశ్వరి, వెనుక వరుసలో కూర్చుంది. అబ్బాయిలు ఒక్కొక్కరూ వస్తున్నారు. అందరూ పరిక్ష మూడ్ లో ఉండడంతో పుస్తకాల్లో తల దూర్చేశారు.

"క్లవరవ్వాలంటే ఏం చెయ్యాలే రాదికా?" నెమ్మదిగా మాట్లాడుతున్నాననుకుని కాస్త పెద్ద గొంతుతోనే అడిగింది జ్ఞానేశ్వరి. ఇబ్బంది పడింది రాధిక.

"ఎదుటివాళ్ళ గురించి ఆలోచించడం మానెయ్యాలి" మేష్టారి గొంతు విని క్లాసంతా ఉలికిపడింది, రాధికతో సహా.

"ఇదిల్లాగే మనల్ని బుక్ చేసేస్తోందే బాబూ.. ఆ అచ్యుత్ గొడవ దీనికెందుకంట? చెప్తే విన్దు," వెయిటింగ్ రూంలో భ్రమరాంబ రాధికతో చెబుతూ ఉండగానే, "ఒహోహోయ్" అంటూ వచ్చింది జ్ఞానేశ్వరి.

"నగల్షాపోడు దొరికేసేడే.. దీని పెళ్ల ప్పుడే నాదీ ఉంటాదేమో," స్టీలు బాక్సు మూత తీస్తూ శుభవార్త ప్రకటించింది.

"నాతో సెపరేటుగా మాటాడాలన్నాడు. లవ్ స్టోరీలున్నాయా అనడుగుతాడేమో అనుకున్నాను. కానీ, 'చదువు మానెయ్యాల్సి వస్తాదేమో, పర్లేదా?' అని అడిగేడు. మరీ బ్రెమ్మాండం అనుకున్నాను. పన్లోపని నేనూ అడిగేసేను," ఎఫెక్ట్ కోసం ఒక్క క్షణం ఆగింది. చెప్పమన్నట్టుగా చూశారు శ్రోతలిద్దరూ.

"కొత్త నగలేవొచ్చినా ముందర నేను పెట్టుకున్నాకే షాపులో పెట్టాలన్నాను. 'ఓస్.. ఇంతేనా' అనేసేడు,"  బరువు దిగిపోయినంత ఆనందంగా చెప్పింది జ్ఞానేశ్వరి.

"మేవిద్దరం ఇంటర్ తోనే ఆపేస్తన్నాం.. నీ సంగతేటమ్మా రాదికా?  క్లవరువి కదా మరి.. డిగ్రీలు సంపాదిత్తావా?" జవాబు చెప్పకుండా ఆలోచనలో పడింది రాధిక. పెళ్ళిసంబంధం విశేషాలు భ్రమరకి వర్ణించి వర్ణించి చెప్పింది జ్ఞానేశ్వరి.

మర్నాడు ట్యూషన్లో రోజూ కన్నా సీరియస్ గా ఉన్నారు మేష్టారు. దిద్దిన పేపర్లు పంచారు. రాధిక కి క్లాస్ ఫస్ట్.. కానీ నూటికి నూరూ రాలేదు. "నువ్వు క్లవరువని నేన్చెప్పేనుకదా" అంటూ గుసగుసలాడుతున్న జ్ఞానేశ్వరిని గుడ్లురిమి చూశారు మేష్టారు.

"ఇలా అయితే లాభం లేదు అచ్యుతా.. ఇన్నాళ్ళూ బాగా చదివి, పరిక్షల ముందు ఇలా చేస్తే ఎలాగ? వచ్చే టెస్ట్ లో కూడా ఇవే మార్కులొస్తే నేను మీ ఇంట్లో మాట్లాడాల్సి వస్తుంది," మేష్టారు అచ్యుత్ తో చెబుతున్న మాటలు రాధిక చెవిన పడ్డాయి.

ఆవేళ కూడా ఆమె చెప్పు ఇబ్బంది పెట్టేసింది.

***

మంచు తగ్గుముఖం పట్టినా, సూర్యుడింకా మేలుకోక పోవడంతో మసక మసగ్గా ఉందా ఉదయం. ఆమె వోణీ రంగేవిటో స్పష్టంగా తెలియడంలేదు. అయినా అతని అడుగులు ఆమె అడుగుల్లో పడుతున్నాయి అలవాటుగా.

మేష్టారింటికి రెండిళ్ళ ముందు ఆగి, వెనక్కి తిరిగింది రాధిక. తెల్లబోయి చూశాడతను. నోట్సు నుంచి అరిచేయంత ఉన్న తెల్లని కవర్ని బయటికి తీసి అతని చేతిలో పెడుతూ, నిశ్చలంగా అతని కళ్ళలోకి చూసింది. నాలుగు కళ్ళూ కలుసుకున్నాయి కొన్ని క్షణాలపాటు.

చేతి వణుకుని దాచుకుంటూ అతనా కవర్ని జేబులో పెట్టుకోడం ఆలస్యం, గిరుక్కున వెనుతిరిగి మేష్టారింట్లోకి అడుగుపెట్టింది రాధిక.

జడ కొసల్నుంచి రాలి పడుతున్న నీటి బొట్లు ఆమె గులాబీ రంగు వోణీ మీద ఎర్ర చుక్కల్ని సృష్టిస్తున్నాయి.

***

"డిగ్రీ అవ్వగానే సమ్మంధం చూసి పెళ్లి చేసేస్తానంటే ఉద్యోగం చేస్తాన్నాన్నా అన్నావు. బ్యాంకుద్యోగం సంపాదించుకున్నావు.. ఇప్పుడు ఇంకేవిటమ్మా అభ్యంతరం?" తండ్రి మాటకి జవాబు చెప్పలేదు రాధిక.

"ఆ రోజుల్లో మీ నాన్నగారు కూడా ఆడపిల్లలకి ఎస్సెల్సీ చెప్పించారు. కానీ ఇలాగా? వాళ్లకి తల్లి భయం, తండ్రి భయం రెండూ ఉన్నాయి. నోరెత్తకుండా తెచ్చిన సంబంధం చేసుకున్నారు.. భయభక్తుల్లో పెట్టుకోవాలి పిల్లల్ని.. తల్లన్నా చెప్పుకోవద్దూ.." నాయనమ్మ అందుకుంది.

"మీరు దానితో మాట్లాడండి" అన్నట్టుగా భర్తకి కనుసైగ చేసింది రాధిక తల్లి. ఆ సైగ అందుకుంటూనే "మేడ మీదకి టీ పంపించు" అంటూ మెట్ల వైపు నడిచాడాయన. నైటీ కాళ్ళకి అడ్డం పడకుండా ఓ చేత్తో పట్టుకుని, రెండో చేత్తో టీ కప్పు పట్టుకుని రాధిక మేడ మీదకి వెళ్లేసరికి, అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు తండ్రి.

"ఏవిట్రా రాధీ ఇది? నీ మనసులో ఎవరన్నా ఉన్నారా అంటే చెప్పవు. వచ్చిన సంబంధంలో లోపం ఉందా అంటే మాట్లాడవు. కుర్రాడు డిప్యుటీ తాసిల్దార్ చేస్తున్నాడు. కనీసం సబ్-కలక్టర్ గా రిటైర్ అవుతాడు. ఏం కావాలి చెప్పు?  ఇంతకన్నా పెద్ద సమ్మంధం అంటే మన స్తోమతూ చూసుకోవాలి కదమ్మా.." తండ్రికేం చెప్పాలో అర్ధం కాలేదు రాధికకి.

"నాకు.. ఇంకొంచం టైం ఇవ్వండి నాన్నా.. ప్లీజ్" అంది నోరు పెగుల్చుకుని. చలిగా ఉన్న వాతావరణంలో వేడివేడి టీని రెండు గుక్కల్లో తాగడం పూర్తి చేసి, ఖాళీ కప్పు ఆమె చేతిలో పెట్టి, మొదలు పెట్టాడు తండ్రి.

"మాఘ మాసం వెళ్ళిపోతే మళ్ళీ ముహూర్తాలు లేవని తొందర పడుతున్నారు వాళ్ళు. మాకు చిన్న పిల్లవే కానీ, నువ్వు చిన్నదానికి కాదు కదమ్మా," అర్ధం చేసుకోమన్నట్టుగా ఉందా గొంతు.

రెయిలింగ్ కి ఆనుకుని ఆకాశాన్ని చూస్తున్నదల్లా వీధిలో అలికిడికి స్పృహలోకి వచ్చింది రాధిక. తండ్రి హడావిడిగా మెట్లు దిగేస్తున్నాడు అప్పుడే. పైన నీలం లైటు వెలుగుతున్న పెద్ద కారు ఆగింది వీధిలో. డవాలా బంట్రోతు అడ్రెస్ సరిచూస్తున్నాడు. గబగబా మెట్లు దిగుతున్న రాధిక కాలి పట్టీ, నైటీకి పట్టుకోడంతో నేరుగా తన గదిలోకి వెళ్లి తలుపేసేసుకుంది.

"మన మూర్తి గారబ్బాయమ్మా" అంటున్నాడు తండ్రి.

"ఎవరూ? అచ్యుతవల్లి మనవడా? తల్లంటే ఎంత ప్రేమో మూర్తికి.. మగ పిల్లాడికి తల్లిపేరు కలిసొచ్చేలా పెట్టుకున్నాడు.."

వీపుకున్న చెవులతో వింటోంది రాధిక. గుండెలదురుతున్నాయి. శరీరం ఆపాదమస్తకమూ కంపిస్తోంది. ఆనందాన్ని దాచుకోవడం చేతనవ్వడంలేదు.

అద్దంలో తనని తాను ఒక్క క్షణం తేరిపార చూసుకుని బాత్రూంలోకి పరిగెత్తింది. తల్లి వచ్చి తలుపు తట్టేసరికి, జడ అల్లుకుంటోందామె.

"నాన్నగారు పిలుస్తున్నారు," గులాబీ రంగు చీరలో ముస్తాబైన కూతుర్ని చూసి తల్లి కళ్ళు నవ్వాయి. 

మామూలుగా ఉండడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ, హాల్లోకి వచ్చింది రాధిక. నాయనమ్మ జాడ లేదు. తండ్రి ఆచితూచి మాట్లాడుతున్నాడు అతనితో.

"రాధిక.. బ్యాంకులో పనిచేస్తోంది.. అచ్యుత్ అమ్మా.. మూర్తి గారబ్బాయి.. సివిల్ సర్వీస్ కి సెలక్టై, ట్రైనింగ్ కూడా పూర్తిచేశారట.."

నాలుగు కళ్ళూ మళ్ళీ కలుసుకున్నాయి, ఆరేళ్ళ తర్వాత.

*** 

అది రాధిక గది. ఆ రాత్రి మాత్రం వాళ్ళిద్దరిదీను. రెండో వాళ్ళ మాటలు వినడం కోసం ఎదురు చూస్తున్నారు ఇద్దరూ. మంచం కింద ఉన్న సూట్ కేస్ నుంచి ఓ చిన్న పేకెట్ తీసి అచ్యుత్ కి అందించింది రాధిక. మెత్తని పేకెట్ లో గులాబీ రంగు వోణీ. అపురూపంగా అందుకుని తన మెడ చుట్టూ వేసుకున్నాడు, స్ట్రాల్ లాగా.

క్షణమాగి, తన జేబులో ఉన్న చిన్న కవర్ని "మరి నాకూ" అన్నట్టుగా చూస్తున్న రాధికకి అందించాడు.

తెల్లని కవర్  రంగు మారింది. లోపల చిన్న పేపర్ కటింగ్. కేవలం కలక్టర్ ఫోటో మాత్రమే ఉంది అందులో. ఆ వెనుకే జాగ్రత్తగా కత్తిరించిన చిన్న కేలండర్. ఆ ఏడాదిదే. రెండో నెల పద్నాలుగో తేదీ చుట్టూ ఉన్న ఎర్ర సున్నా అస్పష్టంగా కనిపిస్తోంది.

కళ్ళెత్తి చూస్తే కళ్లెగరేస్తూ అచ్యుత్. గర్వం దాగడంలేదతని చూపుల్లో.

తెచ్చిపెట్టుకున్న గాంభీర్యాన్ని వదిలి, ఫక్కున నవ్వేసింది రాధిక.

"ఇది మా జ్ఞానేశ్వరి కేలండర్.. ఇన్నాళ్ళూ ఈ ముక్క లేదని తిరిగివ్వలేదు. ఇప్పుడు అతికేసి ఇచ్చెయ్యనా?" చాలా అమాయకంగా అడుగుతున్నాననుకుంది. మరు క్షణం ఆమె చెవి పట్టుకుని తనకి దగ్గరగా లాగేసుకున్నాడు. 

గులాబీరంగు వోణీ నిలువెల్లా నలిగిపోయింది!!

(మిత్రులందరికీ 'వేలంటైన్స్ డే' శుభాకాంక్షలు!)

మంగళవారం, ఫిబ్రవరి 10, 2015

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు

లోపలెక్కడో ఒకటుంటుంది. మనసో, హృదయమో, ఏదో ఉంటుంది దాని పేరు. ఆకారం ఎలా ఉంటుందో తెలియదు కానీ, కొన్ని తీగెలైతే ఉంటాయి కచ్చితంగా. మన చుట్టూ ఉండే వాళ్ళందరూ ఆ తీగెల్ని శృతి చేయలేరు. అలా చేయగలిగే వాళ్ళు ఏ కొందరో ఉంటారు.. వాళ్ళు అప్పటివరకూ అపరిచితులే కావొచ్చు. ఉన్నట్టుండి మనసుని పట్టుకుంటారు.. తీగెల్ని శృతి చేస్తారు.. మన మనసు పాడే రాగాలని మనం వినేలా చేస్తారు.. ఆ రాగాలు మనల్ని ఈ జన్మ జ్ఞాపకాల్లోకో, గతజన్మ స్మృతుల్లోకో తీసుకెళ్లక మానవు.

అనగనగా ఓ రాజారామ్. సముద్రపుటొడ్డున ఉన్న పాతకాలం ఇంట్లో సంగీతం పాఠాలు చెప్పుకుని పొట్ట పోసుకునే పార్వతమ్మగారి అబ్బాయి. కాలేజీలో చదువుకునే రాజారామ్ కి చదువుతో పాటు పరుగంటే ఎంతో ఇష్టం. అతని ఇష్టాన్ని ప్రోత్సహించే పీయీటీ కాలేజీ లో ఉండడంతో, ఎక్కడ పోటీ జరిగినా అందులో పాల్గొని కప్పు గెలుచుకుని వస్తూ ఉంటాడు. తన కొడుకు జాతీయ స్థాయిలో బంగారు పతకాన్ని గెలవాలన్నది పార్వతమ్మ కోరిక. ఆరువేల రూపాయలు వెచ్చించి స్పైక్ షూస్ కొనుక్కునే స్తోమతు లేదని బాధ పడడు రాజారామ్. బూట్లు లేకుండానే ప్రాక్టీసు కొనసాగిస్తాడు.


అమ్మనీ, పరుగునీ ప్రేమించే రాజారామ్ జీవితంలోకి ఉన్నట్టుండి ప్రవేశించింది నజీరా. పేరే చెబుతోంది కదూ ముస్లిం అమ్మాయని. ఎప్పుడూ నిలువెత్తు బురఖాలో ఉండే నజీరాలో కనిపించేవి పెద్ద కళ్ళు, తేనె రంగు కలిసిన కనుపాపలు. అవిగో, ఆ కళ్ళని చూసే ఆమెతో ప్రేమలో పడిపోయాడు రాజారామ్. పరుగంటే రాజారాం కి ఉన్న ప్రేమని చూసింది నజీరా. అతని పట్టుదలనీ చూసింది. అటుపై తల్లితో అతనికున్న అనుబంధాన్ని గురించీ తెలుసుకుంది. అతన్ని ప్రేమించింది. నజీరా ప్రేమ, రాజారామ్ ని అతని తల్లికీ, పరుగుకీ దూరం చేయకపోగా మరింత దగ్గర చేసింది.

విజయాన్ని కోరుకుంటూ తన వెనుక ఒకరు కాదు, ఇద్దరు స్త్రీలు. జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకాన్ని గెలుచుకు వచ్చాడు రాజారామ్. ప్రపంచాన్ని గెలిచినంత ఆనందం అతనిలో. అయితే, ఆ ఆనందం వెనుకే పెనుఘాతం. ఒకటి కాదు, రెండు. ఊహించని పరిస్థితుల్లో అతను ప్రేమించిన ఇద్దరు స్త్రీలూ అతనికి దూరమైపోయారు. 'నీకోసం ఓ అమ్మాయి ఎక్కడో పుట్టే ఉంటుంది.. ఆమెని పెళ్లి చేసుకో..' అంటూ నజీరా రాసిన ఉత్తరం ఒక్కటే అతని దగ్గర మిగిలిన ఆమె తాలూకు జ్ఞాపకం.

కాలం ఎంతటి గాయాన్నైనా మాన్పుతుంది. కానీ, ప్రేమ ఓ గాయమైనప్పుడు దాన్ని మాన్పగలిగే ఔషధమేది? రాజారామ్ ఇప్పుడు నగరంలో ధనవంతుల్లో ఒకడు. విశాలమైన 'పార్వతమ్మ మేన్షన్' లో జీవితం. డబ్బు, పేరు ప్రఖ్యాతులు. టీనేజ్ కూతురు పార్వతి ఓ పక్క చదువుకుంటూ, మరోపక్క సంగీతం పాఠాలు చెబుతూ, ఇంకోపక్క రేడియో జాకీగా పనిచేస్తోంది. ఔత్సాహిక క్రీడాకారులకి గెలుపు పాఠాలు చెబుతున్నాడు రాజారామ్. "నువ్వు గెలవడం కోసం పరిగెత్తు, మరొకర్ని ఓడించడం కోసం కాదు" అంటాడతను.


మరి, రాజారామ్ ప్రేమించిన నజీరా ఏమయ్యింది? ఉంది, విదేశంలో. టీనేజీ కూతురు మెహెక్ తల్లిగా, నజీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్ పర్సన్ గా ఇంటా, బయటా బాధ్యతల్లో మునిగిపోయి ఉంది. క్షణం తీరికలేని విధంగా తన దినచర్యని ప్లాన్ చేసుకున్నా, ఒకే ఒక్క వ్యక్తి ఆమె జ్ఞాపకాలని ఆవరించుకున్నాడు. అతను రాజారామ్. దారితప్పుతున్న మెహెక్ ని గాడిలో పెట్టాలంటే, ఆమెని పై చదువుల కోసం ఇండియా పంపాలనుకుంటుంది నజీరా. "ఒక్కసారి మాత్రమే నిన్ను చూసిన రాజారామ్, ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తూ ఉంటే, నేను ఇండియాలో చదువుకోడానికి సిద్ధం" అంటుంది మెహెక్. కూతురితో పాటూ తనూ ఇండియా ప్రయాణం అవుతుంది నజీరా.

ఇంతకీ, నజీరా రాజారామ్ ని కలిసిందా? అసలు అంతగా ప్రేమించిన అతన్ని వదిలి ఆమె దూరంగా ఎందుకు వెళ్ళిపోయింది? విడిపోయినా ఒకరినొకరు మరచిపోని ఆ ఇద్దరూ తల్లిదండ్రులు ఎలా కాగలిగారు? ఈ ప్రశ్నలకి జవాబు గతవారం విడుదలైన తెలుగు సినిమా 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు.' అభిరుచి గల చిత్ర నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మించిన ఈ సినిమాకి కె. క్రాంతి మాధవ్ దర్శకుడు. శర్వానంద్ (రాజారామ్), నిత్యా మీనన్ (నజీరా), పవిత్ర లోకేష్ (పార్వతమ్మ) కీలక పాత్రలకి జీవం పోశారు. సాగరతీరాన జరిగే కథలో సముద్రమంత గంభీరమైన పాత్రలని అలవోకగా ఒప్పించారు ముగ్గురూ.


ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నిత్యా మీనన్ గురించి. ఆమెని ఈ పాత్రకి ఎంచుకోవడం, ఒప్పించడం ద్వారా సగం విజయం సాధించాడు దర్శకుడు. 'ప్రస్థానం' సినిమాలో శర్వానంద్ తల్లిగా రెండు మూడు సీన్లకి పరిమితమైన పాత్ర చేసిన పవిత్ర లోకేష్ కి చాలా చక్కని పాత్ర దొరికిందీ సినిమాలో. శర్వానంద్ 'వైవిద్యభరితమైన సినిమాలు ఎంచుకుంటాడు' అన్న నమ్మకాన్ని మరోమారు నిరూపించుకోడమే కాదు, రాజారామ్ పాత్రకి జీవం పోశాడు. పీయీటీగా సూర్య కి మంచి వేషం దొరికింది చాలా రోజుల తర్వాత. సాంకేతిక విభాగాల్లో జ్ఞాన శేఖర్ ఫోటోగ్రఫీ, బుర్రా సాయి మాధవ్ సంభాషణలని ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

లోపాలేవీ లేవా అంటే.. పార్వతమ్మ సంగీతం పాఠాల కోసం ఉపయోగించిన కీర్తలనని తెలుగేతరుల చేత పాడించారు. కనీసం ఒకట్రెండు ఉచ్చారణ దోషాలున్నాయి ప్రతి కీర్తనలోనూ. పాటలకన్నా, నేపధ్య సంగీతం బావుంది. సంభాషణల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ప్రతి డైలాగునీ ఓ కొటేషన్ గా మార్చాలన్న తపన వల్ల కొన్ని సన్నివేశాల్లో (ముఖ్యంగా ప్రధమార్ధం) నాటకీయత పెరిగిపోయింది. ఎడిటర్ కి మరికొంచం పని చెప్పొచ్చు. కానైతే, పుడకలెన్ని ఉన్నా పానకం పానకమే.. తియ్యతియ్యగా, ఘాటుఘాటుగా.. ఆ రుచిని ఓ పట్టాన మర్చిపోలేం.

'అమృత వర్షిణి' అని సంగీతంలో ఒక రాగం. విద్వత్తు ఉన్న వాళ్ళు ఆ రాగాన్ని ఆలపిస్తే మేఘాలు కరిగి వర్షం కురుస్తుందట. జంత్ర గాత్రాలతోనే కాదు ఓ సినిమాతోనూ ఆ రాగాన్ని పలికించ వచ్చని నిరూపించాడు క్రాంతి మాధవ్. మనసో, హృదయమో, ఏదో.. అక్కడి తీగెల్ని తన సినిమాతో శృతి చేశాడు. కొన్ని కొన్ని మబ్బుల ఉనికి, అవి వర్షపు చినుకులుగా మారేవరకూ తెలియదు. అంతేకాదు, తీగెల్లాగే ఆ చినుకులకి కూడా ఆకృతి ఉండదు. వాన కురిసిన జాడైతే తెలుస్తుంది, కచ్చితంగా..

సోమవారం, ఫిబ్రవరి 09, 2015

'అపరిచితుడు' -ఆల్బర్ట్ కామూ

ఆల్బర్ట్ కామూ పేరు చాలా రోజులుగా పరిచయం. తరాలతో నిమిత్తం లేకుండా చాలామంది తెలుగు రచయితల అభిమాన రచయిత కామూ. తెలుగు రచయితల మాటల్లో కామూని గురించి చదివానే తప్ప, ఆయన రచనల్ని నేరుగా చదివింది లేదు. ఈ నేపధ్యంలో, పీకాక్ క్లాసిక్స్ ప్రచురించిన 'అపరిచితుడు' నవల నా కంటపడింది. The Outsider/The Stranger పేర్లతో కామూ రాసిన చిన్న నవలకి జి. లక్ష్మి చేసిన నూటరెండు పేజీల తెలుగు అనువాదం. తేలికగా కనిపించే బరువైన పుస్తకమిది.

ఇది అంతర్ముఖుడైన మెర్ సాల్ట్ కథ. అతని జీవితం ఊహించని మలుపులు తిరిగిన క్రమంలో, మెర్ సాల్ట్ మానసిక స్థితులని నిశితంగా చిత్రించిన నవల. ఒక్కమాటలో చెప్పాలంటే కథకి కర్త, కర్మ, క్రియ మెర్ సాల్ట్ పాత్ర మాత్రమే. తన తల్లిని దూరంగా ఉన్న ఓ వృద్ధాశ్రమంలో ఉంచి, నగరంలో ఓ చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటాడు మెర్ సాల్ట్. వృద్ధాశ్రమం నుంచి అతని తల్లి మరణించినట్టుగా టెలిగ్రాం రావడం నవలా ప్రారంభం. తల్లి మరణ వార్త విని మెర్ సాల్ట్ కుప్ప కూలిపోడు. కనీసం కన్నీళ్లు కూడా పెట్టుకోడు. సెలవు ఇవ్వడానికి పైకి కనిపించకుండా విసుక్కున్న బాస్ కి 'సారీ' చెబుతాడు కూడా.

రెస్టారెంట్ లో భోజనం చేసి, బస్సెక్కి ఓ పూటంతా ప్రయాణం చేసి సాయంత్రానికల్లా వృద్ధాశ్రమం ఉన్న ఊరికి చేరుకున్న మెర్ సాల్ట్, తన తల్లి మృతదేహాన్ని చూడడానికి ఇష్టపడడు. ఆశ్రమం వాచ్మన్ తో కలిసి శవ జాగరణ చేసే సమయంలో సిగరెట్లు కాలుస్తాడు. కాఫీ తాగుతాడు. చెప్పాలంటే, చాలా మామూలుగా ప్రవర్తిస్తాడు. ఆశ్రమం ఆఫీసర్ మొదలు, తల్లి స్నేహితుల వరకూ అందరికీ మెర్ సాల్ట్ ఓ పజిల్. అలాగని అతనికి తన తల్లితో శత్రుత్వం ఏమీ లేదు. ఆమె సౌకర్యం కోసమే ఆమెని ఆశ్రమంలో చేర్చాడు. నగరంలో తనదగ్గర ఉంచుకుని సౌకర్యంగా చూసేంత స్తోమతు లేకపోవడం వల్ల.


తల్లి అంత్యక్రియలు జరిపి, నగరానికి తిరిగి వచ్చిన మెర్ సాల్ట్ అనుకోకుండా తన పాత సహోద్యిగిని మేరీని కలుస్తాడు. ఆ వారాంతం వారిద్దరూ కలిపి ఈత కొడతారు, కామెడీ సినిమా చూస్తారు, అతని ఇంట్లో సన్నిహితంగా గడుపుతారు. మెర్ సాల్ట్ కి స్నేహితులు చాలా తక్కువ. ఉన్న వాళ్ళలో, అదే భవనంలో ఉంటున్న రేమాండ్ కొంచం సన్నిహితుడు. వాళ్ళిద్దరూ కలిసి తరచూ ఆల్కహాల్ సేవిస్తూ ఉంటారు. రేమాండ్ తానో గిడ్డంగుల సంస్థలో పనిచేస్తున్నట్టు చెప్పుకుంటూ ఉన్నా, ఆ చుట్టుపక్కల అతనికేమంత మంచిపేరు లేదు. రేమాండ్ ని గురించి రకరకాల వదంతులు ప్రచారంలో ఉన్నాయి. అయితే, ఇవేమీ మెర్ సాల్ట్ కి పట్టవు.

పారిస్ లో ఆరంభించ బోయే ఆఫీసు శాఖకి వెళ్లి పనిచేయాల్సిందిగా మెర్ సాల్ట్ కి సూచిస్తాడు అతని బాస్. సరిగ్గా అదే సమయంలో మేరీ అతనిముందు పెళ్లి ప్రతిపాదన పెడుతుంది. మేరీని తను ప్రేమించడం లేదు కానీ, పెళ్లి చేసుకోడానికి అభ్యంతరం లేదంటాడు మెర్ సాల్ట్. పెళ్లి చేసుకుని అటుపై పారిస్ వెళ్ళేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు ఆ ఇద్దరూ. అంతా సాఫీగా జరిగిపోతే చెప్పుకోడానికి ఏముంది? ఓ ఆదివారం మేరీ, రేమాండ్ తో కలిసి సముద్రతీరంలో సరదాగా గడపడానికి వెళ్ళిన మెర్ సాల్ట్ ఓ వ్యక్తిని తుపాకీతో కాల్చి హత్య చేస్తాడు. ఈ హత్య యాదృచ్చికంగా జరిగిందన్నది మెర్ సాల్ట్ భావన.

కేసు కోర్టుకి వెడుతుంది. కోర్టు, మెర్ సాల్ట్ గత జీవితాన్ని తవ్వి తీస్తుంది. తల్లి చనిపోయినప్పుడు కనీసం కన్నీళ్లు పెట్టుకోని కఠినాత్ముడిగా మెర్ సాల్ట్  ని చిత్రిస్తుంది ప్రాసిక్యూషన్. తల్లి మరణం  తర్వాత మెర్ సాల్ట్ చేసిన ప్రతి పనీ అతన్ని కఠిన శిక్షకి దగ్గర చేసే ఆయుధంగా మారుతుంది ప్రాసిక్యూషన్ చేతిలో. మెర్ సాల్ట్ కి శిక్ష పడిందా? మేరీ, రేమాండ్ ఏమయ్యారు? అన్నింటినీ మించి జైలు జీవితం మెర్ సాల్ట్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించింది? ఇత్యాది ప్రశ్నలకి జవాబులిస్తూ ముగుస్తుందీ నవల.

పుస్తకం చదవడం పూర్తయినా మెర్ సాల్ట్ వెంటాడుతూనే ఉంటాడు. సీరియస్ సాహిత్యాన్ని ఇష్టపడేవాళ్ళు చదవాల్సిన నవల. అనువాదం సరళంగానూ, సాఫీగానూ ఉంది. అన్నట్టు, యండమూరి వీరేంద్రనాథ్ 'అంతర్ముఖం' రాయడానికి స్పూర్తినిచ్చిన పుస్తకం ఇదే. (పేజీలు  102, వెల రూ. 60, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

శనివారం, ఫిబ్రవరి 07, 2015

గుమ్మడి కూర

ఇది గడిచిన తరం కేరక్టర్ నటుడు, 'గుమ్మడి నాన్న' గా ప్రసిద్ధుడూ అయిన గుమ్మడి వెంకటేశ్వర రావు కి ఇష్టమైన వంటకాన్ని గురించిన పరిచయం ఎంతమాత్రమూ కాదు. నిజం చెప్పాలంటే, కొద్దో గొప్పో ఆయన అభిరుచులు తెలుసంతే, రుచుల సంగతి నాకు బొత్తిగా తెలీదు. కాబట్టి, ఇది నేను తప్పనిసరై చేసిన మరో వంటింటి  ప్రయోగం తప్ప మరొకటి కాదు. ప్రయోగ ఫలితం బావుంది కాబట్టే (నాకైతే బ్రహ్మాండంగా ఉంది) పోస్టు రాస్తున్నానన్నమాట.

ఇంట్లో ఒక్కరూ ఉండాల్సి వస్తే ఆడవాళ్ళైతే వండడానికి బద్దకించి ఏ కాయో, పండో తినేసి పూట గడిపేస్తారు. మగవాళ్ళు, దొరికిన ఆటవిడుపుని సద్వినియోగం చేసుకోడానికి హోటల్ వైపు దారి తీస్తారు. హోటల్ కి వెళ్ళాల్సిన వాడినే, చివరి నిమిషంలో బద్ధకించాను. "కుక్కర్ పెట్టేసి, రెండు బంగాళా దుంపలు వేయించుకుంటే పావుగంటలో బోయినం సిద్ధమయిపోతుంది కదా" అన్న అంతరాత్మ మాటని బుద్ధిగా వినిపించుకుని కిచెన్ వైపు వెళ్లాను. కుక్కర్ పెట్టడం అయిపోయింది. అప్పుడే, అసలు సమస్య మొదలయింది.

బుట్టలో కేవలం ఒకే ఒక్క బంగాళాదుంప, అది కూడా ఓ మోస్తరు నిమ్మకాయ పరిమాణంలో ఉంది.. దానికో చిన్న మొలక కూడా ఉంది. పక్కనే ఓ చుట్టు పెద్దదిగా ఉన్న ఒకే ఒక్క ఉల్లిపాయ. బంగాళా దుంప తినడానికి మానసికంగా సిద్ధ పడిపోయాను కదా. ఫ్రిజ్లో ఏదో ఒక కూరగాయ ఉండకపోదు అనుకున్నాను. కానైతే, ఫ్రిజ్ తెరచి అక్షరాలా హతాశుణ్ణయ్యాను. కేవలం అరచేయంత గుమ్మడికాయ ముక్క తప్ప, కనీసం కొత్తిమీర కూడా లేదక్కడ. నా అంతరాత్మ రాజీ పడద్దని హెచ్చరించడంతో మూడింటినీ ముక్కలుగా తరగడానికి పూనుకున్నాను.

గుమ్మడి ముక్క చిన్నదే అయినా గట్టిగా ఉంది. పళ్ళు బిగించి "జోళ్ళు ఇచ్చుకో.. డబ్బు పుచ్చుకో" హమ్ చేస్తూ బిట్స్ అండ్ పీసెస్ చేసేశాను. తరిగిన మూడు రకాల ముక్కలతో అటు వేపుడు, ఇటు పులుసూ కూడా కుదరవు కాబట్టి కూర చేయాల్సిందే. కూరేదైనా పోపు కామన్ కాబట్టి, బాండీ వేడెక్కగానే రెండు చెంచాల నూనె పోసి వేడెక్కడం కోసం వెయిట్ చేస్తూ పోపుల పెట్టి తెరిస్తే శనగపప్పు మెరుస్తూ కనిపించింది. బామ్మ చేసిన గుమ్మడికాయ, శనగపప్పు కూర రుచి అప్రయత్నంగా నాలిక్కి గుర్తొచ్చింది ఉప్పుప్పగా.


వేడెక్కిన నూనెలో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి, ఓ క్షణం ఆగి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి, ఓ చిన్న గిన్నెలో పెద్ద చింతగింజంత చింతపండుని నానబెట్టాను, "పోటీలో ఓ బావా.. నీ సత్తా చూపిస్తావా" పాడుకుంటూ. ఉల్లి ముక్కలు బంగారు వర్ణంలోకి వచ్చాయనిపించుకుని బంగాళదుంప ముక్కలూ, గుమ్మడి ముక్కలూ బాండీలో వేసి, కాస్త పసుపు జల్లి, కలియబెట్టి, మూత పెట్టేశాను. రెండూ దుంప రకాలే కాబట్టి ఒకే పేస్ లో ఉడుకుతాయని నమ్మకం కలిగింది కానీ, నమ్మకాలన్నీ నిజమవ్వాలని లేదు కదా.

వీధిలో కాకి అరుపు వినిపించడంతో జోళ్ళ పాటాపి, కాకి పాట అందుకున్నా.."అమ్మా అమ్మా మన ముంగిట్లో కూసెను నేడో కాకి.." అంటూ. "చందమామా.. తలపైనా..." దగ్గర రికార్డు అరిగిపోయింది. తర్వాతి లిరిక్ గుర్తు రావడం లేదన్న మాట. బాండీ మూత తీసి, చింతపండు రసం పోసి, ఓసారి కలిపేసి, మళ్ళీ మూత పెట్టాను. ఓ క్షణమాగి చూసినా ముక్కలు ఎడమొహం, పెడమొహంగానే ఉన్నాయి. వీటిని కలిపేదెట్టాగా? మెడని ఆధారంగా చేసుకుని తలనోసారి మూడొందల అరవై డిగ్రీలు తిప్పితే ఐడియా తట్టేసింది.

బెల్లం డబ్బా మూత తీసి, చిన్న ముక్క నోట్లో వేసుకుని, కొంచం రజను ఓ కప్పులో తీసుకుని, నాలుగు చుక్కల నీళ్ళు కలిపి సిరప్ తయారు చేశాను. బాండీలో ఉడుకు పట్టిన ముక్కల మీద ఈ సిరప్ జల్లి, కాసేపు కలిపితే కృష్ణవంశీ సినిమాలో కేరక్టర్ ఆర్టిస్టుల్లా ముక్కలన్నీ కలివిడిగా కనిపించాయి. హమ్మయ్య.. కూరకి ఆకారం వచ్చేసింది. ఇక చూడాల్సింది రుచే. "ఉప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా" అని శతకకారుడు చెప్పగా, చిన్నప్పుడు ఎక్కాల పుస్తకంలో చదూకున్నాం కదా. ఆ విజ్జ వినియోగానికి వచ్చింది.

దగ్గర పడ్డ కూర ముక్కల మీద తగినంత ఉప్పుతో పాటు తగుమాత్రం కూర కారం (ఎండు మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర కలిపి వేయించి కొట్టి, సీసాకెత్తిన నిల్వ పొడి) జల్లి, రెండు తిప్పులు తిప్పేసి, రెండు నిమిషాల తర్వాత స్టవ్ కట్టేశాను. నిజం చెప్పొద్దూ, కూర చూడగానే ఆకలి రెట్టింపయ్యింది. వేడి కూర మరియు ఫ్రిజ్జులో ఉన్న నిల్వ వంటకాలతో లంచ్ పూర్తయ్యింది. అందానికి తగ్గట్టుగానే ఉంది రుచి కూడా. అసలు తియ్య గుమ్మడి కాయతో బామ్మ అంత ఉప్పటి కూర ఎలా వండగలిగేదా అని ఆలోచించాను కానీ, నాకెందుకో జవాబు తట్టలేదు.

శుక్రవారం, ఫిబ్రవరి 06, 2015

ఇస్మత్ చుగ్తాయ్ కథలు

నవాబుల బిడ్డ షమ్మన్ మియాకి పద్దెనిమిదేళ్ళు . చదువు, క్రికెట్ తప్ప మరో ప్రపంచం తెలీదతనికి. కానీ, ఆ మహల్ లో కొన్ని ఆచారాలు ఉన్నాయి. వాటి ప్రకారమే ఆ రాత్రి వేళ అతనికి సేవ చేయడం కోసమని షమ్మన్ మియా తల్లి నవాబ్ బేగం పంపగా అతని గదికి వచ్చింది హలీమా, ఆ ఇంటి దాసీపిల్ల. ఆమె సేవలని తిరస్కరించాడు షమ్మన్ మియా. ఫలితం, ఒకదాసి యజమాని గదికి వెళ్లి చెక్కు చెదరకుండా తిరిగి రావడం అన్నది మొదటిసారిగా జరిగింది ఆ ఇంట్లో. కొడుకు 'ఆరోగ్యాన్ని' గురించి బెంగ పెరిగింది బేగంకి. మరింత చొరవ చూపించాల్సిందిగా హలీమా మీద ఒత్తిడి పెరిగింది.

హకీమ్ సాబ్ చేసిన వైద్యం కన్నా, హలీమా చూపించిన భక్తిపూర్వకమైన ప్రేమ బాగా పనిచేసింది షమ్మన్ మియా మీద. అతనిప్పుడు హలీమా లేకుండా ఉండలేని స్థితికి చేరుకున్నాడు. రోజులు క్షణాల్లో గడిచిపోగా, ఓ ఉదయం హలీమా గర్భవతి అన్న వార్త తెలిసింది మహల్లో. బేగం ఆనందానికి అవధులు లేవు. కొడుక్కిక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయొచ్చు. సంబంధం సిద్ధంగానే ఉంది కూడా. మరి హలీమా? ఆ ఇంటి ఆచారం ప్రకారం, ఆమె పల్లెటూరికి వెళ్లి అక్కడ బిడ్డని కని, తిరిగిరావాలి. పుట్టిన బిడ్డ మగబిడ్డ అయితే సేవకుడిగానూ, ఆడబిడ్డ అయితే సేవికగానూ మహల్లో జీవితాన్ని గడపాలి.

అనూచానంగా వస్తున్న మహల్ ఆచారాన్ని ఎదిరించిన మొట్టమొదటి వ్యక్తి షమ్మన్ మియా. తల్లిదండ్రులు, సోదరుల మాటని లెక్ఖ చేయలేదు. హలీమాని పెళ్లి చేసుకునేనేందుకు మనసా వాచా సిద్ధపడ్డాడు. అదే జరిగితే ఇంకేమన్నా ఉందా? మహల్ పరువు ఏమైపోవాలి?? షమ్మన్ మియా తన నిర్ణయాన్ని అమలు చేయగలిగాడా లేదా అన్నది ఉర్దూ రచయిత్రి ఇస్మత్ చుగ్తాయ్ రాసిన పాతిక పేజీల కథ 'అలముకున్న పరిమళం' కి ఇచ్చిన హృద్యమైన ముగింపు. ఈ కథతో పాటుగా ఇస్మత్ రాసిన మరో పద్నాలుగు కథలని తెనిగించి సంకలనాన్ని తయారు చేశారు స్త్రీవాద రచయిత్రి పి. సత్యవతి. పుస్తకంగా ప్రచురించింది హైదరాబాద్ బుక్ ట్రస్ట్.


అనువాదకురాలి పేరు చూడడంతోనే కథానాయిక ప్రధానంగా సాగే కథలని చదవడానికి సిద్ధ పడిపోయాను మానసికంగా. అయితే, దాసీ పిల్లని మనసారా ప్రేమించిన షమ్మన్ మియా కథతో పాటు, చిన్నప్పుడు తను పని చేసిన ఇంట్లో అమ్మాయినే పెళ్లి చేసుకోగలిగే స్థాయికి ఎదిగిన 'కల్లూ,' తనది కాని బిడ్డని తన బిడ్డగా అంగీకరించగల రామ్ అవతార్ ('చేతులు' కథ), ఇంకా మత మౌడ్యాన్ని ఎదిరించే పడుచు ప్రేమజంట ('పవిత్ర కర్తవ్యం) కథా కనిపించి ఆశ్చర్య పరిచాయి. అయితే, మెజారిటీ కథలు పరదా చాటు జీవితాలని, వాటిలోని సంఘర్షణలనీ చిత్రించినవే.

వృద్ధుడైన నవాబుగారి పడుచు భార్య బేగం జాన్ పరదాల చాటునే తనదైన జీవితాన్ని వెతుక్కోడాన్ని 'లిహాఫ్' కథ వర్ణిస్తే, భర్త ఎదుట తనకితానుగా మేలిముసుగుని పైకెత్తడం అనే సంప్రదాయ విరుద్ధమైన పనిని తన అభీష్టానికి వ్యతిరేకంగా చేయడానికి ఇష్టపడక వృద్ధ కన్యగా ఉండిపోయిన గోరీబీ కథని 'మేలిముసుగు' కథ చిత్రిస్తుంది. పట్టుదల విషయంలో గోరీబీకి ఏమాత్రం తీసిపోని మరో స్త్రీ 'బిచ్చూ అత్తయ్య.' తన భర్త దాసీతో సన్నిహితంగా ఉండడాన్ని చూసిన మరుక్షణం వితంతు వేషం ధరించి, జీవితాంతం అతన్ని'కీర్తిశేషుడు అనే విశేషణం జోడించి మాత్రమే ప్రస్తావించిందామె.

డబ్బులేకపోతే అన్నీ సమస్యలే. పెళ్లి కావడం మరీ సమస్య. పెళ్ళికోసం అలవాటు లేని మేకప్ చేసుకున్న సరళా బెన్ అగచాట్లని 'ఒక ముద్ద' కథ చెబితే, తనవాడవుతాడని నమ్మిన వాడికోసం పడరాని పాట్లు పడ్డ కుబ్రా కరుణరసాత్మక కథ 'చౌతీ కా జోడా.' సంప్రదాయం ఎంత కఠినంగానైనా ఉండొచ్చు గాక. వెతుక్కునే వాళ్లకి గమ్యం చేరుకునే మార్గాలు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయని చెప్పే కథ 'దేవుడి దయ.' భార్యని తనకి అనుకూలంగా మార్చుకునే అన్నయ్యనీ ('శిల') యవ్వనాన్ని కరిగించుకోడం కోసం కష్టపడే రుఖ్సానా యాతనలనీ ('అమృతలత') ఓ పట్టాన మర్చిపోలేం.

'పుట్టుమచ్చ' 'చిన్నక్క' 'గరళం' కథలు వేటికవే ప్రత్యేకమైనవి. వీటికి మెరుపు ముగింపులిచ్చారు రచయిత్రి. వీటిలో చాలా కథలు దేశానికి స్వతంత్రం రాకపూర్వం రాసినవే. 'లిహాఫ్' కథ కోర్టు కేసులని కూడా ఎదుర్కొంది. మనకి ఏమాత్రం తెలియని ప్రపంచంలోకి అలవోకగా తీసుకుపోతారు రచయిత్రి. పదిహేను కథలనీ చదవడం పూర్తిచేశాక కూడా మహళ్ళు, అక్కడి మనుషులు ఓ పట్టాన మన జ్ఞాపకాలని విడిచిపెట్టరు. కథలతో పాటు 'జీవన యాత్రలో ముళ్ళూ, పూలూ' పేరిట చుగ్తాయ్ రాసుకున్న స్వగతం ఉర్దూ కథల్ని ఇంగ్లీష్ లోకి అనువదించిన తాహిరా నఖ్వి రాసిన 'పరిచయం' కథల పూర్వరంగాన్ని గురించి చెబుతాయి. తెనిగింపుని ఇష్టంతో చేశానని చెప్పారు సత్యవతి. (పేజీలు 184, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

బుధవారం, ఫిబ్రవరి 04, 2015

ప్రాచీనాంధ్ర గాథలు

తొట్టతొలి ఆంధ్ర పాలకులుగా చెప్పబడే శాతవాహనుల కాలం వాణిజ్యానికి మాత్రమే కాదు, సాహిత్యానికీ స్వర్ణ యుగమే. ప్రాకృత భాషలో రెండు ప్రసిద్ధ కావ్యాలు 'బృహత్కథ' 'గాథా సప్తశతి' వీరికాలంలో వెలుగు చూసినవే. హాల చక్రవర్తి పేరుమీద చలామణిలో ఉన్న 'గాథా సప్తశతి' సుమారు మూడువందల మంది కవులూ, కవయిత్రులూ రాసిన గాథల సంకలనం అంటున్నారు పరిశోధకులు. తెలుగుతో పాటు, సంస్కృతం, ప్రాకృతం, ఆంగ్లం, హిందీ, కన్నడ, తమిళ భాషలలో పండితులైన మహామహోపాధ్యాయ తిరుమల రామచంద్ర  ఎంపిక చేసిన నూరు గాథలతో రూపొందించిన సంకలనమే 'ప్రాచీనాంధ్ర గాథలు.'

భాషా చరిత్రల అధ్యయనానికి తన జీవితాన్ని అంకితం చేసి, తనని తాను భాషా సేవకునిగా అభివర్ణించుకున్న రామచంద్ర శతజయంతిని పురస్కరించుకుని, రెండేళ్ళ క్రితం ఈ 'ప్రాచీనాంధ్ర గాథలు' పుస్తకాన్ని ప్రచురించింది ఎమెస్కో సంస్థ. అడవి బాపిరాజు 'హిమబిందు' నవలద్వారా పరిచయమైన శాతవాహనుల కాలానికి సంబంధించిన మరో పార్శ్వాన్ని చూపించే గాథలివి. బాపిరాజు నవల రాచరికాన్ని గురించి ఎక్కువగా చెబుతూ సామాన్యులని రేఖామాత్రంగా ప్రస్తావిస్తే, ఈ గాథలు కేవలం జానపదుల జీవితాలని మాత్రమే కళ్ళముందు ఉంచుతాయి. ఎందుకంటే ఈ గాథలకి ఆద్యులైన అజ్ఞాత కవులూ, కవయిత్రులందరూ జానపదులే.

ప్రేమ, విరహం ప్రధానాంశాలుగా కనిపించే ఈ గాథలలో గ్రామీణ జీవితపు అమాయకత్వం, చిలిపిదనం, ఆనాటి సంఘపు కట్టుబాట్లు, ఎవరేం అంటారో అన్న బెరుకూ స్పష్టంగా కనిపిస్తాయి. అధికభాగం గాథలు విరహంతో ఉన్న స్త్రీ, పురుషులు రాసినవే. కలిసి గడిపిన సమయాన్నీ, ఏకాంతపు ఘడియలనీ గుర్తు చేసుకున్నవి కావడంవల్ల శృంగారం పాళ్ళు ఎక్కువ. ప్రేయసీ ప్రియుల మధ్య జరిగే సరస సంభాషణలు, పడకింటి కబుర్లు బాగానే దొర్లాయీ గాథల్లో. దేశాంతరం వెళ్లిన భర్తలు తమ భార్యలని తలచుకొంటూ చేసే తిరుగు ప్రయాణాలు, భర్తల కోసం ఇళ్ళ దగ్గర భార్యల నిరీక్షణ చుట్టూ అల్లుకున్న గాథలివి.


'గాథా సప్తశతి' ని సంకలనం చేసిన హాల చక్రవర్తి కాలమైన క్రీస్తుశకం 25-30 సంవత్సరాల్లోకి పాఠకులని అలవోకగా తీసుకుపోయే ఈ గాథల్లో శ్రీకృష్ణుడు మినహా మిగిలిన పురాణ పాత్రలేవీ కనిపించవు.  చదువుతుంటే ప్రధానంగా ఆకర్షించేవి వర్ణనలు, పోలికలు. 'నిజంగా మగువలు మరువమూ, దవనమూ వంటివారు. ఆపాదమస్తకమూ అందమే. ఏం చేసినా చూడాలనిపిస్తుంది' తో మొదలు పెట్టి, 'ఈ ప్రేమలనేవి దోసతీగ లేత కొడులలాగ చాలా సున్నితమైనవి. పక్కన ఉన్నవాటిని పెనవేసుకుంటాయి. వాటిని గట్టిగా పట్టుకుని లాగామా పుటుక్కున విరిగిపోతాయి' వరకూ ఎన్నెన్నో.

గాథలన్నీ చిట్టిపొట్టివే. నిడివిలో రెండు-మూడు పేజీలకి మించినవి లేవు. శీర్షికలతోనే సగం ఆసక్తిని పెంచేస్తారు తిరుమల రామచంద్ర. 'పత్తికాయ నవ్వింది!' 'బుగ్గమీది మసి' 'ఏడుస్తున్న దుప్పటి' 'గాజుల గలగల' 'వసంత విలాసం' 'కొండమల్లెల అట్టహాసం' ..ఇవి ఒకరకమైతే, 'ముర్రుపాలు తాగిన గేదె దూడ' ''నీకేమిటి ఎరువు?' 'పేదరాలి వేవిళ్ళు' 'వ్యాధ సుందరి' ఇవి మరో రకం. 'జాణ' 'వగలాడి' 'పాపం! ఇంకా పసివాడేనట' ఈ మూడూ శ్రీకృష్ణుడి రాసలీలలకి సంబంధించిన గాథలు. శరత్కాలపు వర్ణనలు చాలాచోట్లే కనిపిస్తాయి.

'గాథాసప్తశతిలో తెలుగుపదాలు' పేరిట పుస్తకాన్ని రాసిన తిరుమల రామచంద్ర ఈ అనువాదాన్ని ఎంతో ఇష్టంగా చేసి ఉంటారు అనిపించింది చదువుతూ ఉంటే. సప్తశతిలో గాథలని తీసుకుని అల్లిన కథలు కావడంచేత కేవలం అనువాదంతో సరిపుచ్చారు అనుకోలేం. మూలం నుంచి భావాన్ని గ్రహించి, పూర్వాపరాలు ఊహించి ఓ పరిపుష్ట రూపాన్ని కల్పించారని చెప్పాలి. సాహిత్యంలో శృంగారం అనేది రానురానూ నిషిద్ధ వస్తువు అయిందే తప్ప, ఆదినుంచీ కాదన్న నిజాన్ని మరోమారు ఋజువు చేసే రచన ఇది. (పేజీలు  152, వెల రూ. 90, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

ఆదివారం, ఫిబ్రవరి 01, 2015

పల్లకీ సేవ...

సరస్వతికి  పట్టాభిషేకం జరిగింది. పురవీధుల్లో భక్తిపూర్వక ఊరేగింపు జరిగింది. 'అయ్యో.. అక్కడ లేకపోయానే' అన్న బాధ ఓపక్కన తొలిచేస్తున్నా, జరిగిన సత్కారాన్ని గురించి తెలిసినప్పుడు నా మనస్సు ఉప్పొంగింది. శరీరం రోమాంచితం అయ్యింది. నోటమాట రాని ఒకానొక స్థితి.. 'ఎవరి ఆలోచనో కానీ,  ఎదురుగా ఉంటే రెండు చేతులూ ఎత్తి నమస్కరించే వాడిని కదా' అని పదేపదే అనిపించింది.. ఇంకా అనిపిస్తూనే ఉంది. తిరుపతి పట్టణ ప్రజలారా, సాహితీ అభిమానులారా.. జోహారు మీకు.. ఎంత గొప్ప కార్యాన్ని నిర్వహించారు మీరు!!

ఇంతకీ ఏం జరిగింది తిరుపతిలో? అన్ని నగరాలు, ముఖ్య పట్టణాలలో జరుగుతున్నట్టే తిరుపతిలో పుస్తక ప్రదర్శన ప్రారంభమయ్యింది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడి సన్నిధిలో, ఆ స్వామికి అత్యంత ప్రీతికరమైనదిగా భావించే శనివారంనాడు జరిగిన ఆ పండుగ ప్రారంభోత్సవ వేడుక అత్యంత ప్రత్యేకంగా జరిగింది. ఉత్సవమూర్తులకి ఊరేగింపు జరిపే పల్లకీలో పుస్తకాలని ఉంచి పురవీధుల్లో వైభవంగా ఊరేగింపు జరిపి.. అదిగో అప్పుడు ఆరంభించారు పుస్తక ప్రదర్శనని. ఎంత గొప్ప ఘట్టమో కదూ.. పల్లకి మోసే భాగ్యానికే కాదు, కనీసం కళ్ళారా చూడగలిగే అదృష్టానికీ నోచుకోలేకపోయాను కదా..

కవీశ్వరులనే కాదు, వారి కావ్య కన్నియలనూ తగురీతిన సత్కరించిన మహారాజుగా శ్రీకృష్ణదేవరాయలు చరిత్రలో నిలిచిపోయాడు. 'మనుచరిత్ర' రాసి తనకి అంకితమిచ్చిన అల్లసాని వారిని రాయలు సత్కరించిన రీతిని సాహితీలోకమంతా వేనోళ్ళ వర్ణించింది. 'అప్పుడు పుట్టి ఉంటే..' అంటూ ఆ వేడుకని తన ఊహల్లో చూసి కడు రమణీయంగా వర్ణించారు దేవులపల్లి కృష్ణశాస్త్రి. సాహిత్యానికి లభించిన ప్రత్యేక గౌరవాల్లో ముందువరుసలో ఉండే వేడుక మరి. మరికొంచం వెనక్కి వెళ్తే, గౌడ డిండిమ భట్టుపై శ్రీనాథ కవిరాజు సాధించిన విజయం, అందుకున్న సత్కారం.. ఇవేవీ మాటలకి దొరికేవి కావు.


రాజులూ, రాజ్యాలూ పోయి పుస్తక ప్రచురణ ఒక పరిశ్రమగా అవతరించాక, సాహిత్యాన్ని సత్కరించిన ఘనత తొలితరం ప్రచురణ సంస్థ 'వావిళ్ళ' కి చెందుతుంది. తాము ప్రచురించిన పుస్తకాలన్నింటినీ మదరాసు మహానగరంలో ఏనుగు అంబారీ పై ఊరేగించి, సాహిత్యాన్ని తామే దృష్టితో చూస్తున్నారో చెప్పకనే చెప్పారు వావిళ్ళ వారు. ఆ తర్వాతి కాలంలో, సాహితికి అంతటి సత్కారం లభించిన దాఖలాలు కనిపించడంలేదు. కారణాలు అనేకం. కాలం తెచ్చిన మార్పులో, స్వయంకృతాలో.. ప్రచురణ సంస్థలు చాలా ఒడిదుడుకులనే ఎదుర్కొన్నాయి. రాన్రానూ, 'బయింగ్ బుక్స్? బార్బేరియస్!!' అనే తరం ఒకటి తోసుకు వచ్చేసింది.

తెలుగు నేలకి సంబంధించి, పాతికేళ్ళుగా క్రమం తప్పకుండా ఏటా పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్న ఘనత విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీది. ఏటా జనవరి నెలలో పదిరోజుల పాటు స్వరాజ్య మైదానంలో జరిగే పుస్తకాల పండుగని, 'పుస్తక ప్రియుల పాదయాత్ర' తో ఆరంభిస్తారు వీరు. పుస్తక ప్రియులతో పాటు, ఉత్సాహవంతులైన చిన్నారులు గడిచిన తరం కవులు, రచయితల వేషాల్లో పాల్గొని పాదయాత్రకి ఓ నిండుదనం తెస్తూ ఉంటారు. ఈ ప్రదర్శనలో పుస్తక ప్రియులు ఉంటారు తప్ప, పుస్తకాలు కనిపించవు.

తిరుపతి పుస్తక ప్రదర్శన విషయానికి వస్తే, శ్రీ వెంకటేశ్వర హైస్కూల్ గ్రౌండ్స్ లో భారతీయ విద్యాభవన్ తిరుపతి శాఖ నిర్వహిస్తున్న ప్రత్యేక పుస్తక ప్రదర్శన ఈనెల ఎనిమిదో తేదీ వరకూ కొనసాగుతుంది. సుమారు వంద స్టాల్స్ లో తెలుగు, ఇంగ్లీష్ సాహిత్యం లభిస్తోంది. సరస్వతీ దేవి పటంతో పాటు, శ్రీమద్ భగవద్గీత, శ్రీ వెంకటేశ్వర మహత్యం, ఇంకా మరికొన్ని పుస్తకాలని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఉంచి మహతి ఆడిటోరియం నుంచి ప్రదర్శన స్థలం వరకూ ఊరేగింపు నిర్వహించి, అటుపై ప్రారంభ సభని జరిపారు నిర్వాహకులు. మాడవీధుల్లో దేవదేవుడికి జరిపే సేవని అంతే భక్తిభావంతో సాహిత్యానికి జరిపిన తిరుపతి పౌరులని ఒక్కనోటితో ఎంతని మెచ్చుకోగలను??

(కబురునీ, ఫోటోనీ  అందించిన 'ది హిందూ' కి కృతజ్ఞతలు)