సోమవారం, జులై 25, 2022

చుక్కల్లో తళుకులా...

మహాశయా నా మన్మథా.. మందార సందెల్లో రారా...  
సఖీ ప్రియా సాగే లయా.. నా ప్రేమ తొందర...

"నాగార్జునకి, రమ్యకృష్ణకీ ఓ డ్యూయెట్ కావాలి..." వేటూరికి రాఘవేంద్రరావు ఇంతకన్నా ఇన్ పుట్స్ ఇచ్చి ఉంటారని అనుకోను, 'ఘరానా బుల్లోడు' (1995) లో 'మబ్బుల్లో జాబిల్లి...' పాట విన్నప్పుడల్లా. సినిమా కథతో పెద్ద సంబంధం లేకుండా ఎక్కడైనా ఇమిడిపోయే ఇలాంటి పాటలు రాయడంలో సిద్ధహస్తుడు వేటూరి. కీరవాణి స్వరకల్పనలో మనో-చిత్ర పాడిన ఈ డ్యూయెట్ పూర్తిగా కె. రాఘవేంద్ర రావు, బీఏ మార్కు చిత్రీకరణ, పూలు-పళ్ళుతో సహా. "నాకు నేను చాలా అందంగా కనిపించే పాట ఇది" అని రమ్యకృష్ణ చేత కితాబు కూడా అందుకుంది. హమ్మింగు, కోరస్సు ఈ పాటకి ప్రాణం పోశాయనిపిస్తూ ఉంటుంది నాకు, వింటున్నప్పుడల్లా. 


చుక్కల్లో తళుకులా... దిక్కుల చలి వెలుగులా... 
నింగి నుంచి తొంగి చూసి నచ్చగానేనిచ్చెనేసి జర్రుమంటు జారింది... 
మబ్బుల్లో జాబిల్లి... జాజుల్లో నా మల్లి... మబ్బుల్లో జాబిల్లి... 
పొద్దుల్లో ఎరుపులా.... మబ్బుల తొలి మెరుపులా...

ఇక్కడ కాస్త ట్రివియా... పాట సాహిత్యంలో రొమాన్సు పాళ్ళు కొంచం ఎక్కువగా ఉండాలని వాళ్ళే అలా అడిగారో, లేక తనకే అలా తోచిందో కానీ వేటూరి మొదట రాసిన పల్లవిలో 'మబ్బుల్లో జాబిల్లి' బదులు 'జాకెట్లో జాబిల్లి' అని ఉంటుంది. రికార్డింగ్ పూర్తయ్యి, కేసెట్లు బయటికి వచ్చేశాయి. తర్వాత సినిమా సెన్సార్ అప్పుడు అభ్యంతరం రావడంతో అప్పటికప్పుడు 'మబ్బుల్లో జాబిల్లి' అని మార్చి పాడించారు. మ్యూజిక్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ ఛానల్ లో మొదటి వెర్షన్ ఇప్పటికీ ఉంది. 

మల్లెపూల చెల్లెలా... నవ్వు పూలజల్లులా...  
మిలమిలా సోకులే...  మీటనివ్వు నన్ను లేతగా... 
కొంగుచాటు ముంతలా... పొంగు పాలపుంతలా... 
గిలగిల గిల్లకా రేతిరైతె రెండు చెంపలా... 
నిబ్బరాల నిమ్మపండు ఒలిచి పెట్టవా... 
కొబ్బరంటి కొత్త ఈడు కొలిచి పెట్టవా... 
ఏకాదశి నా ఊర్వశి శ్రీ రమ్య శృంగార రాశి 
త్రయోదశి జాబిల్లికి ఈనాడే పున్నమి 
సిగ్గమ్మా చీ..చీ..ఛీ..

నాయికని 'మల్లెపూల చెల్లెలా' అనడం, ఏకాదశిని, త్రయోదశినీ రొమాంటిక్ డ్యూయెట్లోకి తీసుకురావడం వేటూరికి మాత్రమే చెల్లింది. నాయిక పేరుని కావాలని ఇరికించినట్టు కాకుండా ఎప్పటిలాగే సందర్భోచితం చేశారు. 

నింగి నేల ఒడ్డున... చందమామ బొడ్డున...  
తళతళ తారలే తాకిపోయె నన్ను మెత్తగా...  
రాజహంస రెక్కల... రాసలీల పక్కల... 
గుసగుసా గువ్వలా గూడు కట్టుకోవె మత్తుగా... 
పిక్కటిల్లిపోతె ఈడు పైట నిలుచునా... 
పిక్కలావు పిల్లదాని నడుము పలచన...  
మహాశయా నా మన్మథా.. మందార సందెల్లో రారా...  
సఖీ ప్రియా సాగే లయా.. నా ప్రేమ తొందర...  
చీకట్లో చిందేసి...️️️️ 

'గుసగుసా గువ్వలా..' మొదట విన్నప్పుడే భలేగా నచ్చేయడమే కాదు, ఇప్పటికీ ఆ ఇష్టం కొనసాగుతోంది. 'పిక్కటిల్లి' 'పిక్కలావు' లాంటి పల్లెటూరి నుడికారాలని అలవోకగా తెచ్చేశారు పాటలోకి. ట్యూనుకి నింపే సాహిత్యం అయితేనేమి, ఇంత సొగసుగా నింపడం మరొకరి వల్ల అవుతుందా? 

2 కామెంట్‌లు:

  1. వేటూరి గారి కాలంలో ఆయనతో పాటు ఆయన సమకాలికులు కూడ వ్రాసిన మాస్ సినిమా పాటల్లో శృంగార వర్ణనలు, రతి క్రీడా వర్ణనలు, ద్వంద్వార్ధ ప్రయోగాలు తప్ప ఇంకేమి ఉన్నాయండి?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంతకన్నా చాలా ముందు కాలం - ముఖ్యంగా ప్రబంధ యుగం - నుంచీ మీరు చెప్పినవే ఎక్కువ కనిపిస్తాయండీ.. కాకపోతే భాష మారింది - సంస్కృతం నుంచి తెలుగుకి. ..ధన్యవాదాలు.. 

      తొలగించండి