బుధవారం, జనవరి 30, 2013

ఒక స్నేహం...

అనుకోకుండా జరిగిన పరిచయం, తక్కువ కాలంలోనే స్నేహంగా మారింది. ఇప్పుడింక ఓ మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోయింది. స్వతంత్ర సమరయోధుడు, కమ్యూనిస్టు కార్యకర్త, పాత్రికేయుడు, రచయితా అయిన పరకాల పట్టాభిరామారావు తన తొంభై మూడో ఏట విజయవాడ లోని తన స్వగృహంలో గతవారం కన్నుమూశారు. ఈ వార్త తెలిసినప్పటి నుంచీ, ఏపని చేస్తున్నా ఏదో ఒక సమయంలో పట్టాభిరామారావు గుర్తొస్తూనే ఉన్నారు. ఇకపై గుర్తొస్తారు కూడా. ఎందుకంటే, ఆయన్ని మర్చిపోవడం అంత సులువు కాదు.

ఓ వేసవి సాయంకాలం విజయవాడ బందరు లాకులు దగ్గర ఉన్న స్వాతంత్ర సమరయోధుల భవనంలో మొదటిసారి కలిశాం ఇద్దరం. మిత్రులెవరో ఆయన్ని పరిచయం చేశారు. సన్నగా, తెల్లగా, చురుగ్గా ఉండే పట్టాభిరామారావు గారితో పరిచయం, స్నేహం వరకూ వెడుతుంది అని అస్సలు అనుకోలేదు నేను. కానీ, ఆయన స్నేహశీలి. ఏవిషయం మీదైనా తన అభిప్రాయాలని సూటిగా చెప్పేవారు. అలాగని ఎవరినీ నొప్పించే వారు కాదు. 'ఇలా ఎలా సాధ్యం?' అన్న ఆలోచన కలిగేది, ఒక శ్రోతగా ఆయన మాటలు వింటున్నప్పుడు.

"సిద్ధార్ధ కాలేజీ ఎదురు సందులో కొంచం ముందుకి వస్తే, ఎడమ వైపు ఉంటుంది మా ఇల్లు. వాకిట్లో అరటి చెట్లు ఉంటాయి. అదీ గుర్తు. వీలు చూసుకుని ఒకసారి రండి.." ఈ ఆహ్వానం వచ్చిన కొన్నాళ్ళకి వెళ్ళగలిగాను. అరటి చెట్లే కాదు, ఇంకా చాలా మొక్కలు కూడా కనిపించాయి. చాలా సింపుల్ గా ఉన్న ముందు గదిలో నాలుగు నిలువెత్తు చెక్క బీరువాలు. వాటి నిండా కిక్కిరిసిన పుస్తకాలు. చూపు తిప్పుకోవడం నా వల్ల కాలేదు. "మీరూ చదువుతారు కదూ?" ఆ పుస్తకాలు చూస్తూ వెనుక నుంచి వచ్చిన ప్రశ్న వినగానే సిగ్గనిపించింది ఒక్క క్షణం.


ఊహించినట్టుగానే, ఎక్కువగా కమ్యూనిస్టు సాహిత్యం. గురజాడ రచనలతో పాటు, వాటిమీద వచ్చిన సాహిత్యం దాదాపు మొత్తమంతా కనిపించింది. అయితే, గురజాడని గురించి ఆయనతో మాట్లాడడానికి మరికొన్నాళ్ళు ఆగాల్సి వచ్చింది. నేనింకా పుస్తకాలు చూడడం పూర్తవ్వక ముందే, "మా పక్కింటి ఆయన్ని పరిచయం చేస్తాను, మై గుడ్ నైబర్," అంటూ నవ్వారు. ఇద్దరం పక్క గేటు తీసుకుని లోపలి వెళ్ళేవరకూ, నా ముఖం మీద ప్రశ్నార్ధకం వేళ్ళాడుతూనే ఉంది. రంగు రంగుల పెయింట్ ముగ్గుల లోగిలి. చాలా అభిరుచితో డిజైన్ చేసినట్టు తెలిసి పోతోంది. గృహస్తు వచ్చారు. "వేగుంట మోహన్ ప్రసాద్ గారు.. 'మో' పేరు వినే ఉంటారు.." అంటూ పరిచయం చేసేశారు పట్టాభిరామారావు గారు.

శ్రీశ్రీ కవిత్వం.. వాళ్ళిద్దరికీ కూడా చాలా ఇష్టమైన విషయం. నేను కేవలం శ్రోతని.. మధ్య మధ్యలో పృచ్ఛకుడిని కూడా. పట్టాభిరామారావు గారు "మీరు" నుంచి "నువ్వు" లోకి రాడానికి మరికొంత సమయం పట్టింది. అప్పుడు వచ్చింది గురజాడని గురించి సుదీర్ఘమైన చర్చ. మధురవాణి, పూర్ణమ్మ, మెటిల్డా ... వీళ్ళంతా అయ్యాక... "అసలు జాతీయ గీతంగా ఉండాల్సింది వందేమాతరం కాదు..జనగణమన కూడా కాదు..'దేశమంటే మట్టికాదోయ్..' ఈ గేయాన్ని అన్ని భాషల్లోకీ అనువదించాలి. స్కూలు పిల్లల చేత రోజూ పాడించాలి. అప్పుడే వాళ్లకి తెలుస్తుంది దేశం అంటే ఏమిటో. కష్ట పడితే మాత్రమే తిండి దొరుకుతుందని పిల్లలకి చెప్పకపోతే ఎలా?" అనడమే కాదు, ఆవైపు ఆయన కొంత కృషి కూడా చేశారు.

 నేను స్థావరాన్ని కాక, జంగమాన్ని కావడంతో ఊరు మారిపోయాను. అయితే ఏం, గ్రాహంబెల్ పుణ్యమా అని ఫోన్ ఉంది కదా. "నేనూ.. పట్టాభిరామారావుని మాట్లాడుతున్నాను. పరవాలేదా? మాట్లాడొచ్చా?" అని ప్రశ్నతో మొదలైన సంభాషణలు గింగురుమంటున్నాయి. 'మహిళాభ్యుదయం' ఆయనకి చాలా ఇష్టమైన విషయం. చాలా రీసెర్చ్ చేశారు కూడా. ఎంతటి విషయాన్నైనా వివాదం వరకూ వెళ్ళకుండా సంభాషణ నడపడం ఆయన ప్రత్యేకత. ఆయనలో ఉత్సాహమే తప్ప, నిరుత్సాహాన్ని చూడలేదు నేను. నాలుగు నెలల క్రితం 'నిర్జన వారధి' చదివినప్పుడు ఆ పుస్తకంలో ఆయన ప్రస్తావన చూడగానే మాట్లాడాలి అనిపించి కాల్ చేశాను. నిద్ర పోతున్నారనీ ఆరోగ్యం బాగుండడం లేదనీ చెప్పారు ఇంట్లో వాళ్ళు. "ఓసారి వెళ్లి చూసి రావాలి," అనుకున్నాను. వీలవ్వలేదు. ఇలాంటివి వెంటనే చేసేస్తే, జీవితాంతం వెంటాడే కొన్ని గిల్ట్ లకి దూరం అయిపోతాం కదూ...

సోమవారం, జనవరి 28, 2013

చందనపు బొమ్మ

వర్తమాన తెలుగు కథ అనగానే అయితే అస్థిత్వ, ప్రాంతీయ వాద కథలు, కాకపొతే నాస్టాల్జియా కథలే కనిపిస్తున్న తరుణం ఇది. ఈ ధోరణికి పూర్తి భిన్నంగా వైవిధ్య భరితమైన పది కథలతో వర్ధమాన రచయిత్రి అరుణ పప్పు  వెలువరించిన సంకలనం 'చందనపు బొమ్మ.' ఆంధ్రజ్యోతి పత్రికలో ఫీచర్స్ రిపోర్టర్ గా పనిచేస్తున్న అరుణ, 'అరుణిమ' బ్లాగర్ గా బ్లాగు ప్రపంచానికి సుపరిచితులు. జనవరి 2009 నుంచి అక్టోబర్ 2011 వరకూ వివిధ పత్రికల్లో అచ్చైన కథలని (ఎక్కువగా ఆంధ్రజ్యోతి లోనే) దాదాపు రాసిన వరుసలోనే సంకలనం చేశారు కడపకి చెందిన రాష్ట్ర కథానిలయం వారు. వీరి తొలి ప్రచురణ ఇది.

ఏకబిగిన కథలన్నీ చదివేసి పుస్తకం పూర్తి చేసేద్దాం అనుకున్న నన్ను, ఆరో కథ 'చందనపు బొమ్మ' ఆపేసింది. చందనపు బొమ్మతో ఆడుకునే ఓ చిన్నపిల్ల కథ. చదవడం పూర్తవ్వగానే ఆలోచన మొదలవ్వడంతో, పుస్తకాన్ని ఎప్పుడు పక్కన పెట్టానో కూడా గమనించ లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే కదిలించే కథనం. చైల్డ్ సైకాలజీ ఆధారంగా అల్లిన ఈ కథ ముగింపు ఊహించ గలిగేదే అయినప్పటికీ, కథ నడిపిన తీరు కట్టి పడేసింది. కొంత విరామం తర్వాత మిగిలిన కథలు పూర్తి చేశాను.

నిజానికి, ఈ సంకలనం గురించి చెప్పేప్పుడు మొదట ప్రస్తావించాల్సిన కథ 'వర్డ్ కేన్సర్.' పేరులాగే, కథ కూడా వైవిధ్య భరితంగా ఉంది. వాక్యాల ప్రవాహం ఈ కథ. క్రమం తప్పకుండా సాహిత్యం చదివే అలవాటు ఉన్న వాళ్ళని బాగా ఆకట్టుకునే కథ.మళ్ళీ మళ్ళీ చదివిస్తుంది కూడా. పుస్తకాలకి సంబంధించిన మరో కథ 'కరిగిపోయిన సైకత శిల్పం.' పుస్తకాలనీ, వాటిని చదివే వాళ్ళనీ కూడా ఎంతగానో ప్రేమించే ఓ పుస్తకాల షాపు యజమాని కథ ఇది. కథ చదువుతున్నంత సేపూ నాకు తెలిసిన పుస్తకాల షాపుల యజమానులు అందరూ వరుసగా గుర్తొచ్చారు. కథలో ప్రధాన పాత్ర 'ఆచార్య' లో వాళ్ళంతా ఎక్కడో అక్కడ కనిపించారు కూడా.


ప్రయాణాలు అంటే నాకు ఉన్న ఇష్టం వల్ల కావొచ్చు, 'భ్రమణ కాంక్ష' కథ బాగా నచ్చేసింది. ప్రదేశాలని కాక, ప్రపంచాన్ని చూడాలని కోరుకునే నవనీత రెడ్డి వెంటాడతాడు పాఠకులని. అంతే కాదు, 'మనసుంటే మార్గం ఉంటుంది' అన్న మాటా గుర్తొస్తుంది. 'ఒక బంధం కావాలి' 'లోపలి ఖాళీలు' కథలు రెండూ మనస్తత్వాన్ని ఆధారం చేసుకున్నవి. మొదటిది మానసికంగా ఎదగని ఓ కుర్రవాడి కారణంగా అతని తండ్రి జీవితంలో వచ్చిన మార్పుని చిత్రిస్తే, రెండోది తలచుకుంటే దేనినైనా సాధించే పట్టుదల ఉన్న విద్యావంతుడికి తన భార్య విషయంలో ఎదురైన సందిగ్ధాన్ని చర్చించింది.

పది కథల్లోనూ ఆరు కథలు జర్నలిజం నేపధ్యంతో నడుస్తాయి. పాత్రికేయ కోణం నుంచి ప్రపంచాన్ని చూసే ప్రయత్నంగా చెప్పొచ్చు వీటిని. తొలికథ 'ఎవరికి తెలియని కథలివిలే' లో ప్రధాన కథతో పాటు, తన వృత్తిలో ఇబ్బందులనీ సందర్భానుసారం ప్రస్తావించారు రచయిత్రి. ఓ రచయితకీ, ఓ మహిళా జర్నలిస్ట్ కీ ఏర్పడ్డ స్నేహం 'ఏకాంతంతో చివరిదాకా' కథ. "అనేకమైన వరాలిమ్మని దేవుణ్ణి కోరుకుంటాం. కానీ దేవుడినే కొరుకోం. ఆయనే వచ్చి అకస్మాత్తుగా ఇలాంటి ఆలోచనుందని చెప్పినా తట్టుకోలేం," లాంటి వెంటాడే వాక్యాలు చాలానే ఉన్నాయి ఈ కథల్లో.

మూడు నాలుగేళ్ల క్రితం వరుసగా జరిగిన కొన్ని సంఘటనలు ఆధారం చేసుకుని రాసిన 'ఈ కానుక నేనివ్వలేను.' మృత్యువు నేపధ్యంగా సాగే కథ అవ్వడంతో ఆకర్షించింది నన్ను. అయితే, కాలపరీక్షకి ఎంతవరకూ నిలబడుతుంది అన్నది చూడాలి. ఈకథలో సంభాషణలు ఉపన్యాస ధోరణిలో ఉండడం కొరుకుడు పడదు. అలాగే, మొత్తం సంకలనం చదివాక, '24/7 క్రైమ్ ఇప్పుడిదే సుప్రీం' కథని రచయిత్రి ఇంకా చాలా బాగా రాయగలరు అనిపించింది. అంతగా ఆకట్టుకోని కథ ఇది. కథల్లో మొదటగా ఆకర్షించేది రచయిత్రి వాడిన భాష. చక్కని తెలుగు, చదివించే వచనం. కొన్ని కొన్ని వాక్యాలయితే ఆగి, వెనక్కి వెళ్లి మళ్ళీ చదువుకునేలా ఉన్నాయి.

రాసిన క్రమంలోనే సంకలనంలో కథలు అచ్చు వేయడం వల్ల, కాలంతో పాటు రచయిత్రి శైలి పదునెక్కడాన్నిగమనించ గలుగుతాం. అయితే, మనస్తత్వ చిత్రణలో రచయిత్రి మరికొంత పట్టు సాధించాల్సి ఉంది. ఉత్తరాంధ్రకి చెందిన రచయిత్రి సంకలనం అనగానే, ఆ మాండలీకంలో ఒక్క కథన్నా ఉంటుందని ఎదురు చూశాను కానీ, కథలన్నీ నగరాల చుట్టూనే తిరిగాయి. ప్రింటింగ్ బాగుంది, అచ్చు తప్పులు తక్కువే. రానున్న రోజుల్లో అరుణ పప్పు నుంచి మంచి కథలని ఆశించ వచ్చు అన్న నమ్మకాన్ని కలిగించిన సంకలనం ఇది. ('చందనపు బొమ్మ,' పేజీలు 104, వెల రూ. 120, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు మరియు కినిగె.కామ్ లో లభ్యం)

ఆదివారం, జనవరి 27, 2013

స్వాతి కిరణం

సరిగమలతో చదరంగమాడగలిగే గాయకుడు అనంతరామ శర్మ. గజారోహణలూ, గండ పెండేర సత్కారాలూ ఆయనకి నిత్య కృత్యాలు. ఆయన తీసిందే రాగం, పాడిందే సంగీతం. ప్రభుత్వం ఇచ్చే అవార్డుని తిరస్కరించే - అహంభావంలాగా అనిపించే - ఆత్మగౌరవం ఆయనకి అలంకారం. అటువంటి సంగీత స్రష్టకి సవాలు విసురుతాడు గంగాధరం. ఓ పల్లెటూళ్ళో పుట్టి పెరుగుతూ, సరదాగా సంగీతం నేర్చుకునే పన్నెండేళ్ళ బాల గాయకుడు. అనంతరామ శర్మలో పేరుకుపోయిన అసూయని ప్రపంచానికి తెలిసేలా చేసి, ఆ విద్వాంసుడు తనని తాను తెలుసుకునేలా చేసిన వాడు. ఇందుకోసం గంగాధరం పణంగా పెట్టింది ఏమిటన్నదే, ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం కళాతపస్వి కె. విశ్వనాథ్ రూపొందించిన 'స్వాతికిరణం' సినిమా.


అనంతరామ శర్మ పాత్రకి మళయాళ నటుడు మమ్ముట్టి ప్రాణ ప్రతిష్ఠ చేయగా, ఆయన భార్య శారదగా రాధిక పోటీ పడి నటించింది. గంగాధరం పాత్రని, అప్పటికే చిన్న తెరమీద 'మాల్గుడి డేస్' హీరోగా అందరికీ పరిచయమైన మాస్టర్ మంజునాథ్ అలవోకగా పోషించాడు. కాఫీ హోటల్ నడుపుకునే 'బాబాయ్' దంపతులకి (ధర్మవరపు సుబ్రహ్మణ్యం, డబ్బింగ్ జానకి) లేక లేక పుట్టిన కొడుకు గంగాధరం. కుర్రాడికి సంగీతం మీద ఉన్న ఆసక్తి చూసి, ఊళ్ళో సంగీతం పాఠాలు చెప్పే పక్షితీర్ధం మామ్మగారి (జయంతి) దగ్గర సరిగమలు నేర్పిస్తూ ఉంటారు. బహుశా, జన్మ సంస్కారం వల్ల కావొచ్చు, సంగీతం అలవోకగా అలవడుతుంది గంగాధరానికి. బాల్య చాపల్యాలు ఇంకా పోనప్పటికీ, 'కొండా కోనల్లో.. లోయల్లో...' అతను గొంతు విప్పాడంటే శ్రోతలు పరిసరాలనే కాదు, ఇహాన్నీ మర్చిపోతారు.

ఆ ఊరి కోవెల్లో జరిగే ఉత్సవాలకి అనంతరామ శర్మగారిని ఆహ్వానిస్తారు ఆలయం వారు. భార్యా సమేతుడై వచ్చిన ఆయన, పక్షితీర్ధం మామ్మగారి ఇంట్లో బస చేస్తారు. శర్మ గారి సమక్షంలో పాడడం కోసం, పక్షితీర్ధం ఆవిడ ప్రత్యేకంగా నేర్పించిన 'తెలిమంచు కరిగింది...' పాటని గంగాధరం పాడుకుంటూ ఉండగా, ఆ పాట వింటూ స్నానం, అర్చనాదికాలు పూర్తిచేసుకున్న శారదకి మొదటి పరిచయంలోనే గంగాధరం మీద పుత్రవాత్సల్యం కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు ఉన్న భర్తా, తరాల పాటు తిన్నా తరగని సంపదా ఉన్నప్పటికీ, పిల్లలు కలగలేదన్న లోటు మిగిలిపోయింది ఆవిడకి.


ఆలయంలో అనంతరామ శర్మ మంత్రపుష్పాన్ని రాగవరస మార్చి పాడడం తట్టుకోలేని గంగాధరం, తనూ అదే పని చేస్తాడు ఆయన ఎదట. గంగాధరాన్ని మాత్రమే కాదు, శిష్యుడిని అలా తయారు చేసినందుకు పక్షితీర్ధం ఆవిడనీ చెరిగి వదిలిపెడతారు శర్మగారు. ఎప్పుడూ పల్లెత్తు మాట అనని తండ్రి కూడా తనని తప్పు పట్టేసరికి, క్షమాపణ అడగడానికి శర్మగారి ఊరికి బయలుదేరతాడు గంగాధరం. శారద సలాహా మేరకు సంగీత అకాడమీ స్కాలర్షిప్ కోసం జరిగే పరిక్షకి వెడతాడు కానీ, అక్కడ విద్యార్ధులని ఎంపిక చేసేది అనంతరామ శర్మే కావడంతో స్కాలర్షిప్ దక్కదు గంగాధరానికి. అయితే, శారద ఆర్ధిక సహకారంతో సంగీతం నేర్చుకుని, కచేరీలు మొదలు పెడతాడు. గంగాధరానికి పేరు రావడం మొదలవ్వడంతో, అసహనం మొదలవుతుంది అనంతరామ శర్మలో.

'గురు పౌర్ణమి' సందర్భంగా, శర్మగారి శిష్యులు ఆయనకి ఏర్పాటు చేసిన సన్మాన సభకి హాజరైన గంగాధరం, శర్మగారి 'ఏకలవ్య' శిష్యుడిగా తనని తాను పరిచయం చేసుకుని 'ఆనతినీయరా...' పాటని చిరుకానుకగా సమర్పిస్తాడు. గంగాధరం ఉపయనయం తన ఇంట్లో ఘనంగా జరిపించిన అనంతరామ శర్మ, అతన్ని తన ఇంట్లోనే ఉండిపొమ్మని చెప్పడంతో, ఎంతగానో సంతోషిస్తుంది శారద. అయితే, గంగాధరానికి పెరుగుతున్న పేరు ప్రతిష్టలు అనంతరామ శర్మకి ఏమాత్రం సంతోషం కలిగించక పోగా, అసూయనీ, ద్వేషాన్నీ పెంచుతాయి. వాటిని ఎక్కువ రోజులు దాచుకోలేక పోతాడు కూడా. ఉన్నట్టుండి ఒక రోజున గంగాధరం మీద విరుచుకు పడి, ఆపై స్పృహ తప్పి పడిపోతాడు. అటు భర్త, ఇటు పుత్ర సమానుడు.. ఇద్దరి మధ్యా నలిగిపోతుంది శారద. ఆమె పసుపు కుంకుమలకి లోటు రానివ్వని మాట ఇచ్చిన గంగాధరం, అందుకోసం ఏం చేశాడు అన్నది కదిలించే ముగింపు.


కేవలం ఈ ముగింపు కారణంగానే ఈ సినిమా ప్రేక్షకులకి చేరువ కాలేక పోయింది అంటారు. (రిలీజైన మూడో రోజు, నాతో కలిపి ఎనిమిది మంది ఉన్నారు మొత్తం థియేటర్లో). ఈ ముగింపుని ఓ పట్టాన అంగీకరించలేము. ముగింపు మార్చిఉంటే, సినిమా బాగుండేదా అన్న ప్రశ్నకి సరైన సమాధానం దొరకదు. విశ్వనాథ్ కథకి, తన మార్కు సంభాషణలు అందించారు జంధ్యాల. ఎప్పటిలాగే, సినిమా ముగింపు సన్నివేశానికి తను మాత్రమే రాయలగలిగే మాటలతో నిండుతనం తెచ్చారు. ఇది సంగీత ప్రధాన చిత్రం. కథే శాస్త్రీయ సంగీత కళాకారుడి అంతర్మధనం కావడంతో మంచి సంగీతానికీ, సాహిత్యానికీ చక్కని అవకాశం దొరికింది. సహాయకుడు పుహళేంది తో కలిసి వినసొంపైన సగీతం అందించారు కెవి మహదేవన్. (ఇది 'మామ' సంగీతం అందించిన చివరి సినిమా) గాయని వాణీ జయరాం ప్రతిభని పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్న సినిమా ఇది. ఒకరకంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కి 'శంకరాభరణం' ఎలాగో, వాణీ జయరాం కి 'స్వాతి కిరణం' అలాగ. ఎప్పటికీ నిలిచిపోయేవే పాటలన్నీ. 'ఆనతినీయరా...' పాటకి జాతీయ అవార్డు అందుకున్నారు వాణీ జయరాం.

నటీనటుల దగ్గరికి వస్తే మొదటగా చెప్పుకోవాల్సింది రాధికని గురించి. భర్తచాటున ఉంటూనే తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునే ఇల్లాలిగా శారద పాత్రలో అనితర సాధ్యమైన నటనని ప్రదర్శించింది రాధిక. 'స్వాతిముత్యం' తర్వాత ఆ స్థాయి నటనని ప్రదర్శించే అవకాశం ఉన్న పాత్ర దొరికింది ఆమెకి. భర్త పాండిత్యాన్నీ, పేరు ప్రతిష్టల్నీ చూసి గర్వ పడే ఇల్లాలిగా, గంగాధరంపై పుత్ర వాత్సల్యం చూపుతూ, అతని ప్రతిభా పాండిత్యాలని నిష్కపటంగా అభినందించే తల్లిగానూ, భర్త ఆవేశం బయట పడ్డ క్షణం నుంచీ వాళ్ళిద్దరి మధ్యా నలిగిపోయే సన్నివేశాల్లోనూ చక్కని నటన ప్రదర్శించింది రాధిక. పరభాషా నటుడైనా పదహారణాల అనంతరామ శర్మ పాత్రలో అచ్చంగా ఒదిగిపోయాడు మమ్ముట్టి. ఆ పాత్ర తాలూకు భావోద్వేగాల్ని కేవలం కనుబొమల కదలికల ద్వారా చూపిన తీరుని మర్చిపోలేం. గంగాధరం పాత్రలో మంజునాథ్ ని కాక మరొకరిని ఊహించలేం.


విశ్వనాథ్ ఈ సినిమాకి దర్శకుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా (పేరు వేసుకోలేదు). షూటింగ్ కొంత భాగం రాజమండ్రి దగ్గరా, ఎక్కువ భాగం శ్రీ కాళహస్తి పరిసర ప్రాంతాల్లోనూ జరిగింది. ఇటు గోదారి అందాలనీ, అటు సీమ సౌందర్యాన్నీ ఒకే ఫ్రేములో చూడగలం. తనకి ఇష్టమైన ఫ్లాష్ బ్యాక్ పద్ధతిలోనే కథ చెప్పారు విశ్వనాథ్. మలయాళ కుర్రహీరోని నడివయసు అనంతరామ శర్మగా మార్చి ఒప్పించేశారు. కొన్ని కాఫీ హోటల్ సన్నివేశాలు కేవలం హాస్యం కోసమే పెట్టినవి. ఎప్పటిలాగానే తెలుగు సినిమాల మీద సెటైర్లు వేయించారు వాటిలో. శాస్త్రీయ సంగీతపు ఔన్నత్యాన్ని చిత్రిస్తూ 'శంకరాభరణం' తీసిన దర్శకుడు, అదే రంగంలో ఉండే ఈర్ష్యాసూయలు కథా వస్తువుగా తీసుకుని సినిమా తీయడంతో సహజంగానే కొంత విమర్శ వచ్చింది. బాహాటంగా ఒప్పుకోకపోయినా, అన్నిరంగాలలోనూ ఉన్నట్టే సంగీత రంగంలోనూ అసూయాద్వేషాలు ఉన్నాయన్నది చాలామంది చెప్పిన మాట. మంచి సినిమాలు ఇష్టపడే వాళ్ళు చూడాల్సిన సినిమా ఇది.

శుక్రవారం, జనవరి 25, 2013

పరిమళించిన 'పద్మం'

పద్మానికి పరిమళం అబ్బింది. నీలి మేఘాలలో, గాలి కెరటాలతో కలిసిన ఆ పరిమళం పద్మానికి కొత్త గౌరవాన్నీ, సౌరభాన్నీ తెచ్చింది. అభిమాన స్వర రాణి ఎస్. జానకి కి కేంద్ర ప్రభ్వుతం కొంచం ఆలస్యంగానే అయినా 'పద్మభూషణ్' అవార్డుని ప్రకటించింది. గడిచిన యాభై ఐదేళ్లుగా సినీ సంగీతాన్ని అభిమానించే భారతీయులందరినీ తన స్వర మాయాజాలంలో కట్టి పడేసిన ఈ నిరాడంబర గాయనికి ఇన్నాళ్ళుగా పద్మ అవార్డు రాకపోవడం అన్నది, ఆ అవార్డుకే ఒక లోటు. ఇవాల్టితో అది తీరింది.

తన పందొమ్మిదో ఏట తమిళ, తెలుగు సినిమాలకి పాటలు పాడడంతో నేపధ్య గాయనిగా కెరీర్ ప్రారంభించిన జానకి వెనుతిరిగి చూసింది లేదు. కేవలం కథా నాయికకి మాత్రమే పాడాలనో, కేవలం ఒక తరహా పాటలు మాత్రమే పాడాలనో ఆమె పరిమితులు విధించుకోలేదు. తనకి వచ్చిన పాటని ఎంతబాగా పాడి మెప్పించ గలను అని మాత్రమే ఆలోచించారు. ఓ పక్క కథా నాయికలకి పాడుతూనే, మరోపక్క వ్యాంప్ పాత్రలకీ పాడారు జానకి.

"ఏం? ఈ పాటలు పాడకపోతే భోజనం దొరకదా?" లాంటి ఘాటైన విమర్శలకి లెక్కలేదు. వాటన్నింటికీ, మాటలతో కాక, పాటలతో మాత్రమే జవాబు చెప్పారు జానకి. అన్ని రకాల పాటలనీ పాడగలగడం, అన్ని రసాలనీ తన గొంతు అలవోకగా పలికించ గలగడం జానకికి దొరికిన వరాలు. వీటి ఫలితమే ఇరవై వేలకి పైగా పాటలు, నాలుగు జాతీయ పురస్కారాలు, లెక్కకు మిక్కిలిగా రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచే పది నంది అవార్డులు అందుకున్నారు జానకి.


ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ... దక్షిణ భారత సినీ సంగీతంలో ఈ త్రయం చేసిన ప్రయోగాలకి లెక్కలేదు. మరీ ముఖ్యంగా శృంగార రస ప్రధానమైన గీతాలకి బాలూ, జానకిల యుగళం పెట్టింది పేరు. దానికి లయరాజు స్వరాలు తోడైతే ఇక చెప్పేదేముంది.. 'మౌనమేలనోయి?' అన్న ప్రశ్న సర్రున దూసుకు వచ్చేయదూ. క్లిష్టమైన గమకాలని పలికించడమే కాదు, చిన్న చిన్న సంగతులతో పాటకి కొత్త అందం తేవడంలోనూ జానకి అందె వేసిన చేయి. ఆమె పాటలు వినేవాళ్ళకి ఈ విషయం ప్రత్యేకం చెప్పాల్సిన పని లేదు.

ఇళయరాజా ఆర్కెస్ట్రాలో ఎక్కువ పాటలు పాడిన రికార్డు జానకిది. అలాగనే ఆమె కేవలం కొందరు స్వరకర్తలకి పాడడానికే పరిమితమై పోలేదు. నాటి చలపతిరావు నుంచి, నేటి రెహ్మాన్ వరకూ ఎందరో సంగీత దర్శకుల స్వరాలకి ఆమె తన గళాన్ని అద్దారు. వర్ధమాన గాయకులకి రిఫరెన్స్ అనదగ్గ పాటలెన్నో జానకి ఖాతాలో ఉన్నాయి. అయితే, జానకిని అనుకరించడమే కాదు, అనుసరించడమూ కష్టమే. ఎందుకటే ఆమెది ఓ ప్రత్యేకమైన బాణీ. అనితర సాధ్యమైన వాణి.

టీవీల పుణ్యమా అని గత కొన్నేళ్లుగా గాయనీగాయకులు 'పాడడాన్ని' చూడగలుగు తున్నాం మనం. పాటకు అనుగుణంగా పాదం కదిపేవారూ, పాటతో సంబంధం లేకుండా విన్యాసాలు చేస్తూ పాడే వాళ్ళూ అనేక మందిని చూస్తున్నాం. తన గొంతులో ఎన్నెన్నో హొయలని ఒలికించే జానకి పాడడం చూసినప్పుడు మాత్రం "అసలీమె పెదాలు కదులుతున్నాయా?" అన్న సందేహం కలిగి తీరుతుంది. అలాగని పాడే పాటల్లో 'ఊపు' కి లోటు ఉండదు. అదో ప్రత్యేకమైన విద్య బహుశా.

పసిపిల్ల, పండు ముదుసలి, తొలి యవ్వనంలో ఉన్న బొంగురు గొంతు కుర్రవాడు... ఇలా ఎవరి గొంతునైనా ఇట్టే పట్టేసి, తనది చేసుకుని పాడడం జానకికి ఉన్న మరో ప్రత్యేకత. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడాన్ని మాటల్లో చెప్పకుండా, ఆచరణలో చూపడం ఆమె వ్యక్తిత్వానికి సూచిక. జానకి ఇంకా ఎన్నో, ఎన్నెన్నో పాటల్ని పాడాలనీ, అత్యున్నత పురస్కారాల్ని అందుకోవాలనీ మనస్పూర్తిగా కోరుకుంటూ, 'పద్మ' అవార్డు సందర్భంలో ఆమెకి హృదయ పూర్వక అభినందనలు.

గురువారం, జనవరి 24, 2013

నాలుగడుగులు...

చూస్తుండగానే మరో పుట్టినరోజు వచ్చేసింది. మనం ఏం చేసినా,చెయ్యకపోయినా 'నేనున్నా' అంటూ వచ్చేసే వాటిలో ఇదిగో ఈ పుట్టినరోజు కూడా ఒకటి. అలా వచ్చేసినందుకైనా మనం మన పనులు కాసేపు పక్కన పెట్టి, గడిచిన ఏడాది కాలాన్ని ఓసారి సింహావలోకనం చేసుకోవాలి. తప్పులూ, ఒప్పులూ, లెక్ఖలూ, పత్రాలూ ఓసారి తిరగేసేయాలి. అప్పుడు, ఆ జరిగిపోయిన వాటినుంచి రేపటి కోసం పనికొచ్చేవి ఏమన్నా ఉన్నాయేమో వెతుక్కోవాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకూ అంటే, 'నెమలికన్ను' కి నాలుగేళ్ళు నిండి ఐదో ఏడు వచ్చేసింది.

మొదటి మూడు సంవత్సరాలతో పోల్చినప్పుడు, అతి తక్కువ బ్లాగు పోస్టుల ద్వారా రికార్డు సృష్టించడం జరిగింది ఈ నాలుగో సంవత్సరంలో. సగటున వారానికి ఒక్క పోస్టు కన్నా తక్కువే. ఏ నెలలోనూ కూడా డబల్ డిజిట్ పోస్టులు రికార్డు అవ్వలేదు. ఒకప్పుడు ఉద్ధృతంగా వచ్చి పడిన టపాలు, ఇప్పుడు ఎందుకిలా మందగించాయీ అంటే గబుక్కున జవాబు చెప్పడం కష్టం. 'ఇన్ని టపాలు ఎందుకు రాశావు?' అన్న ప్రశ్నకి ఇదమిద్దమైన సమాధానం ఉండనట్టే, 'ఎందుకు రాయలేదు?' అన్న ప్రశ్నకీ ఉండదు మరి.

మొదటినుంచీ 'నెమలికన్ను' ని వెన్నంటి ఉన్న అదృష్టం ఒకటి ఉంది. పాఠకుల ఆదరణ. బ్లాగులో వచ్చిన టపాలు చదివి నిర్మొహమాటంగా అభిప్రాయాలు పంచుకోవడమే కాదు, తప్పులని సున్నితంగా ఎత్తి చూపడం, ఎప్పుడన్నా కొంతకాలం పాటు విరామం వచ్చేస్తే ఏమైందంటూ ఆదరంగా ఆరా తీయడం...ఇవన్నీ బ్లాగు పాఠకుల నుంచి అందుతున్న కానుకలు. కొత్తగా ఈ బ్లాగుని కనుగొన్న వాళ్ళు ఉత్తరాల ద్వారా అభిప్రాయాలు చెబుతున్నారు. అలాగే, చదవదగ్గ పుస్తకాలని గురించీ సమాచారం వస్తోంది.


ఈ బ్లాగుకి సంబంధించి గడిచిన సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. వారి వారి పుస్తకాలని గురించి బ్లాగులో వచ్చిన టపాలు చదివిన కొందరు రచయితలు ఉత్తరాల ద్వారా అభినందనలు అందజేశారు. వారి సంస్కారానికి ధన్యవాదాలు. నేను ఎంతగానో ఇష్టపడే రచయిత నుంచి వచ్చిన ఉత్తరమూ వాటిలో ఉంది. కొంచం తరచుగా బ్లాగు రాయాలని మరీ మరీ అనిపించిన సందర్భం అది. పుట్టినరోజుని పురస్కరించుకుని, బ్లాగు మిత్రులతో పంచుకోవాలనిపించిన కబురు ఇది. అలాగే, క్రమం తప్పకుండా బ్లాగు చదివే కొందరు పాఠకులతో కామెంట్ బాక్స్ లో మొదలైన పరిచయం మెయిల్ బాక్స్ కి విస్తరించింది. 'శర్కరి' బ్లాగులో ఎంపిక చేసిన వంద టపాల్లో, 'నెమలికన్ను' కీ చోటిచ్చారు. ధన్యవాదాలు జ్యోతిర్మయి గారూ.

చదువు దగ్గరికి వస్తే, గడిచిన సంవత్సరాల కన్నా ఈ ఏడాది పుస్తక పఠనం తక్కువే. కొని, చదవకుండా ఉంచేసిన పుస్తకాలే ఇందుకు సాక్ష్యం. చదివిన కొన్నింటిలో బాగా నచ్చేసినవి ఆత్మకథలు. కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ 'నిర్జన వారధి' మళ్ళీ మళ్ళీ చదివిన పుస్తకం కాగా, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆత్మకథ లాగా అనిపించే నవల 'లోపలి మనిషి' బాగా ఆలోచింపజేసిన పుస్తకం. ఆత్మకథలని చదవడంలో ఉండే రుచిని పెంచిన పుస్తకాలే ఈ రెండూ కూడా. సినిమా రంగం మీద ఆసక్తి వల్ల కాబోలు, రావూరి భరద్వాజ 'పాకుడు రాళ్ళు' ఆపకుండా చదివాను. అయితే, చూసిన సినిమాలు మాత్రం బహు తక్కువ. చూసిన వాటిలో 'మిథునం' పర్వాలేదు అనిపించింది.

గతాన్ని నెమరు వేసుకోవడం అయ్యాక, నిజానికి చేయాల్సిన మరోపని భవిష్యత్తు ప్రణాళిక రచించడం. కానీ, బ్లాగింగ్ అన్నదే ప్లానింగ్ లేకుండా చేసే పని. ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళడం ఇక్కడ వీలుకాదు కూడా. గడిచిన నాలుగేళ్ల లోనూ రాయడం అన్నది నాకు మరింత ఇష్టమైన వ్యాపకం అయిపోయింది. అలాగే, చదవడం మీద ఆసక్తి తగ్గిపోకుండా ఉండడంలో బ్లాగు పాత్ర ఉందన్నది ఒప్పుకుని తీరాల్సిన విషయం. ఇందుకు కారకులు ఈ బ్లాగు చదువుతున్న మీరందరూను. 'కృతజ్ఞతలు' అన్నది చిన్న మాటే కానీ, అంతకన్నా ఏం చెప్పగలను నేను?

మంగళవారం, జనవరి 22, 2013

రత్తాలు-రాంబాబు

కొన్ని రచనలు చదువుతున్నప్పుడు నవ్వు ఆపుకోడం మన వల్ల కాదు. మరికొన్ని ఇందుకు భిన్నంగా, చదువుతున్నంత సేపూ ఒకలాంటి విషాదంలో ముంచెత్తుతాయి. ఓ తెలుగు రచన చదువుతున్నంత సేపూ పాఠకులకి నవ్వునీ, దుఃఖాన్నీ ఏకకాలంలో అనుభవంలోకి తెచ్చిందీ అంటే నిస్సందేహంగా అది రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచనే అవుతుంది. సాహితీలోకం 'రావిశాస్త్రి' అంటూ ముద్దుగా పిలుచుకునే ఈ ఉత్తరాంధ్ర ప్లీడరు గారు, జీవితాలని చదివి పుస్తకాలు రాశారు. వేశ్యా వృత్తిని ఇతివృత్తంగా తీసుకుని రావిశాస్త్రి రాసిన నవల 'రత్తాలు-రాంబాబు.'

అనగనగా ఓ రత్తాలు. శృంగవరపు కోట పక్కనున్న ఓ పల్లెటూళ్ళో ఉండే పెళ్ళికాని పిల్ల. తల్లీ తండ్రీ చనిపోతే, పెద్దమ్మ జాగ్రత్తగా పెంచుకు వచ్చింది. గురజాడ వారి 'కన్యాశుల్కం' నాటకం లో బుచ్చమ్మ లాగా బొత్తిగా అమాయకురాలు. అందగత్తె రత్తాలు కి ఎన్నో పెళ్లి సంబంధాలు వస్తూ ఉంటాయి. కారణం చెప్పీ, చెప్పకుండానూ వాటిని తిరగ్గొట్టేస్తూ ఉంటుంది పెద్దమ్మ. తన ఈడు వాళ్ళు అప్పుడే పిల్లలని ఎత్తుతూ ఉండడంతో తనకింక పెళ్లి కాదేమో అన్న బెంగ మొదలవుతుంది రత్తాలుకి. అప్పుడు వస్తాడు, పట్నం నుంచి వాళ్ళ దూరపు బంధువు సింహాచలం. మాంచి నిఖార్సైన పూలరంగడు. రత్తాలుని పెళ్లి చేసుకుంటానని అడుగుతాడు. పెద్దమ్మ ఉలకదు పలకదు. కార్యసాధకుడు సింహాచలం. రత్తాలుతో స్నేహం చేసి, పట్నంలో తనెంత గొప్ప ఉద్యోగం చేస్తున్నాడో, పెళ్ళాం పిల్లల్ని ఎంత బాగా చూసుకోగలడో వర్ణించి చెప్పి, ఓ రాత్రి వేళ రత్తాలుని లేవదీసుకు పోతాడు, అచ్చం గిరీశం లాగానే.

అయితే, సింహాచలం గిరీశం అంత మంచివాడు కాదు. అందగత్తె రత్తాలుని పట్నంలో పేరుమోసిన నరసమ్మ కంపెనీకి వెయ్యి రూపాయలకి అమ్మేస్తాడు. తను అమ్ముడుపోయిన విషయం రత్తాలు కి తెలియదు. అది సింహాచలం బంధువుల ఇల్లు అనుకుంటుంది. దానికితోడు, నరసమ్మ కూడా రత్తాలు మీద ఎంతో ఆదరం చూపిస్తుంది. నరసమ్మ కంపెనీలో ఉండే అమ్మాయిల్లో చురుకైనదీ, తెలివైనదీ ముత్యాలు. 'అప్పా' అంటూ మాట కలిపి రత్తాలుకి దగ్గర అవుతుంది. రత్తాలు చెడి నరసమ్మ ఇంటికి రాలేదనీ, మోసపోయి వచ్చిందనీ గ్రహిస్తుంది. 'కన్యాశుల్కం' మధురవాణి లాగానే మంచి మనసు ముత్యాలుది. నరసమ్మకి అనుమానం రాకుండా ఏదో ఒకటి చేసి, రత్తాలుని ఆ రొంపి నుంచి బయటికి పంపాలి అనుకుంటుంది. కానీ అదంత సులువైన పని కాదు. నరసమ్మ ఒకప్పుడు పోలీసుల మనిషి. ఓ ఎస్సై గారి ఇలాకా. ఆ ఎస్సై గారు కాలం చేశాక కూడా పోలీసులతో సంబంధాలు కొనసాగిస్తోంది. 'గంగరాజెడ్డు' (హెడ్ కానిస్టేబుల్ గంగరాజు) కి నరసమ్మ మీద తగని మక్కువ. కౌన్సిలర్లు, ప్లీడర్లు, ఆఫీసర్లు ఇలా అందరితోనూ సత్సంబంధాలు నెరపుతూ కంపెనీని నడుపుకు వస్తూ ఉంటుంది నరసమ్మ.


అనగనగా ఓ రాంబాబు. మాంచి తెలివైన వాడు. అతనికి ఉన్నలోపం అల్లా ఒక్కటే, తండ్రి లేకపోవడం. తండ్రి, తల్లిని మోసం చేశాడు. ఆమె గర్భవతి అయ్యాక తెలియదు పొమ్మన్నాడు. ఆవిడ కోర్టుకెక్కి కేసు ఓడిపోయింది. స్కూల్ మేస్టారు ఉద్యోగం చేస్తూ కొడుకుని పెంచి పెద్ద చేసింది. ఎమ్మే పాసైన రాంబాబుకి ఇన్కంటాక్స్ కమిషనర్ గారబ్బాయి కృష్ణతో స్నేహం. ఐఏఎస్ పరీక్షలకి వెడుతున్న కృష్ణ, రాంబాబు చేత కూడా ఆ పరీక్ష రాయిస్తాడు. రాంబాబుకి తనకన్నా ఎక్కువ మార్కులు వస్తాయని నమ్మకం కృష్ణకి. క్లాస్మేట్ వసంతని ప్రేమించిన రాంబాబు, ఆమెని చూడడం కోసం కృష్ణ ఊరు వస్తాడు. ఆ ఊళ్లోనే నరసమ్మ కంపెనీ ఉంది. రత్తాలు ని పట్నం తీసుకు రాక మునుపే, సింహాచలం ఏం చేశాడంటే - బంగారప్ప కంపెనీ నుంచి ఐదొందలు 'అడ్మాన్సు' తీసేసుకుని, జల్సా చేసేశాడు. ఇప్పుడు, తెచ్చిన 'సరుకు' తనది అన్నది బంగారప్ప వాదన. రత్తాలుకి అనారోగ్యం చేస్తే, ఆమెని రిక్షాలో ఆస్పత్రికి తీసుకెడుతుంది ముత్యాలు. బంగారప్ప రౌడీలు దారికాసి, రత్తాలు ని ఎత్తుకు పోబోతూ ఉండగా రాంబాబు ఆమెని రక్షిస్తాడు. రౌడీలని తప్పించుకుని ఆస్పత్రికి వెడతారు రత్తాలు, ముత్యాలు.

అదే రాత్రి, 'చిన్మా' నుంచి తిరిగి వస్తున్న ముత్యాలు, రత్తాలు ల కంట పడతాడు రాంబాబు. నడిరోడ్డుమీద జ్వరంతో అపస్మారకంలో పడి ఉంటాడు. అతన్ని కంపెనీకి, అక్కడి నుంచి ఆస్పత్రికి తీసుకెళ్ళి సేవలు చేస్తారు ముత్యాలు, రత్తాలు. తనకి తెలియకుండానే రాంబాబు తో ప్రేమలో పడిపోతుంది రత్తాలు. గాలి మేడలు కట్టుకోవద్దని అప్పని హెచ్చరిస్తూ ఉంటుంది ముత్యాలు. కోటీశ్వరుడు 'పిచ్చి' జోగులుకి ముత్యాలు అంటే పిచ్చి. ఆమెకి నెలజీతం ఇస్తూ ఉంటాడు. మరోపక్క, యువకుడైన 'రిక్షా' జోగులు ముత్యాలుని ప్రేమిస్తాడు. ఎప్పటికైనా ఆమె నరసమ్మ చెరనుంచి బయటికి రాగలిగితే, ఆమెని పెళ్లి చేసుకోవాలి అన్నది అతని కల. రిక్షా జోగులు అంటే ముత్యాలుకీ ఇష్టమే. వీళ్ళందరి కథలూ ఏ తీరం చేరాయన్నదే 'రత్తాలు-రాంబాబు' అసంపూర్ణ నవల. నిజానికి 554 పేజీల ఈ నవల అసంపూర్ణం అన్నభావన కలగలేదు నాకు. మార్క్సిజాన్ని అమితంగా ఇష్టపడే రావిశాస్త్రి, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన కాలంలో (1975-77) జైలు జీవితం గడుపుతూ రాశారు ఈ నవలని.

రావిశాస్త్రి ఎప్పుడూ పేదల పక్షమే. పేదవాళ్ళ బతుకులు ఎలా ఉన్నాయో చెప్పి ఆగిపోలేదు, అలా ఉండడానికి కారణం ఏమిటో కూడా విశదంగా చెప్పారు ఈ నవలలో. ఉన్నత, పేద, మధ్యతరగతి మనస్తత్వాలని చిత్రించిన ఒక సన్నివేశాన్ని మర్చిపోలేం. తన ఊరికి వెళ్ళిన రాంబాబు, రత్తాలు పట్ల కృతజ్ఞతగా ఆమెని నరసమ్మ చెర నుంచి విడిపించాలి అనుకుంటాడు. ఇది మధ్యతరగతి మనస్తత్వం. వెయ్యి రూపాయలు అప్పు చేసి, ఆ డబ్బుని కృష్ణకి పంపుతాడు. "మందులకి అయిన ఖర్చు అప్పుడే ఇచ్చేశాడు కదా.. మళ్ళీ ఇది ఎందుకు?" అనుకుంటాడు కృష్ణ, కోటీశ్వరుడు. తనకి డబ్బు వద్దనీ, డబ్బుకోసం తను రాంబాబుకి సేవ చేయలేదనీ తిరస్కరిస్తుంది రత్తాలు, కూటికి మాత్రమే పేద. 'కన్యాశుల్కం' లో ఉన్నట్టే, ఇందులోనూ ఒక 'మంచం' సన్నివేశం ఉంది. గంగరాజెడ్డు మంచం మీద నరసమ్మ తో సరసం నెరుపుతూ ఉండగా, మంచం కింద చిక్కుకున్న సింహాచలం పడ్డ పాట్లని చదవాల్సిందే.

రష్యన్ రచయిత చెహోవ్ కథ 'మిజరీ' ని తెలుగులోకి అనువదించడం ద్వారా తన పద్దెనిమిదో ఏట రెండో కథ రాసిన రావిశాస్త్రి, చెహోవ్ మరో కథ 'ది కెమీలెయన్' ఆధారంగా రాసిన ఓ సన్నివేశం, పోలీసు వ్యవస్థ పనితీరుని కళ్ళముందు ఉంచుతుంది. ఆయన సమాజాన్ని ఎంతగా పరిశీలించి రచనలు చేస్తారు అన్నది, ఈ నవల చదివిన వాళ్లకి సులువుగా బోధ పడుతుంది.రావిశాస్త్రి రచనలేవీ ప్రస్తుతం అందుబాటులో లేవు. 'మనసు' ఫౌండేషన్ ద్వారా త్వరలో మార్కెట్లోకి రాబోతున్నట్టు భోగట్టా.

సోమవారం, జనవరి 21, 2013

పెళ్లి బేరాలు

ఇది నేను హైస్కూల్లో ఏడో, ఎనిమిదో చదువుతున్నప్పుడు జరిగిన సంగతి. ఆడపిల్లల మీద కొంచం ఎక్కువ శ్రద్ధ చూపించే కేవీబీ మేష్టారు హాజరు పట్టీ తీసుకుని ఒక్కో పేరూ చదువుతూ, రాని వాళ్ళు ఎందుకు రాలేదో కనుక్కుంటున్నారు. ఓ అమ్మాయి వంతు వచ్చేసరికి, ఆ ఊరి అమ్మాయిలందరినీ నిలబెట్టి నిలదీయడం మొదలు పెట్టారు. మేష్టారి ప్రశ్నలు తట్టుకోలేక వాళ్ళలో ఓ అమ్మాయి "ఆయమ్మికి పెళ్లి బేరాలండి," అని చెప్పెయ్యగానే, క్షణం ఆలస్యం లేకుండా క్లాసంతా గొల్లుమంది. మేష్టారు కూడా పాఠం పక్కన పెట్టి, పెళ్లి బేరాలని గురించి కొంచం రుచికరమైన ప్రసంగం చేశారు.

ఎందుకో తెలియదు కానీ, ఈ 'పెళ్లి బేరాలు' అనే మాట నాకు బాగా గుర్తుండి పోయింది. కించిత్తు జ్ఞానం కలిగాక, "ఎంత చక్కని మాట!! ఏ ముసుగులూ వేయకుండా, ఉన్నది ఉన్నట్టు చెప్పేసింది కదా ఆ అమ్మాయి" అనుకున్నాను కూడా. ఉన్నట్టుండి ఇది ఎందుకు గుర్తు వచ్చిందీ అంటే, ఆదివారం పూటా నా ఇంట్లో నేను టీవీ చూసుకోడానికీ, పుస్తకం చదువుకోడానికీ, చివరికి ఫోన్ మాట్లాడుకోడానికి కూడా వీలు లేకుండా మా వీధిలో 'వధూ వర పరిచయ వేదిక' ఏర్పాటు చేసేశారు. పేరులో మాత్రమే వధూవరులు కానీ, వచ్చిన వాళ్ళంతా పెద్దలే. తల్లి దండ్రులు, బంధువులు, మధ్యవర్తులు అని ముద్దుగా పిలవబడే 'పెళ్ళిళ్ళ బ్రోకర్లూ'ను.

అరుదైన కంఠ స్వరాలు కొన్నే ఉంటాయి. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వారి సినిమా ప్రకటనలు చదివే స్త్రీమూర్తి కంఠం అలాంటి వాటిలో ఒకటి. మా అదృష్టం ఏమిటంటే, అచ్చం అదేమాదిరి గొంతు కలిగిన ఓ స్త్రీమూర్తి మైకు అందుకుని వధూ వరుల వివరాలు మైకు అక్కర్లేని విధంగా చదవడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల నాలుగు వీధుల్లో ఏ ఇంట్లోనూ కూడా ఒకరి మాటలు ఒకరికి వినిపించి ఉండవు, ఆ కార్యక్రమం అవుతున్నంత సేపూ. మధ్యమధ్యలో నిర్వాహకులు మైక్ అందుకుని ఆవిడకీ మాకూ కూడా విశ్రాంతి ప్రసాదించారు.

సేల్స్ ప్రమోటర్ల మొదలు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ల వరకూ రక రకాల హోదాల్లో, రకరకాల నేపధ్యాలతో, దాదాపు ఒకేలాంటి కోరికలు కోరే వరులు. టీచర్లు, బ్యాంకు ఉద్యోగినులు, అక్కడక్కడా సాఫ్ట్వేర్ నిపుణులూ అయిన వధువులు. దాదాపుగా వరులందరి ఏకైకకోరిక "ఫామిలీ గర్ల్" అయితే, వధువుల కోరికలు "సాఫ్ట్వేర్ ఉద్యోగి అయి ఉండవలెను. నాలుగు సంవత్సరములకి మించి వయోభేదం ఉండరాదు." అదృష్టవ శాత్తూ, తల్లిదండ్రుల కోరికల జాబితా మైకులో చదవలేదు. సాఫ్ట్వేర్ కాక ఇతరత్రా ఉద్యోగాలు చేసే బ్రహ్మచారుల పరిస్థితి ఏమిటా అన్న ఆలోచన కలిగింది కాసేపు. సాఫ్ట్వేర్ రంగం, మిగిలిన మార్కెట్లతో పాటు మేరేజ్ మార్కెట్ మీదా బాగానే ప్రభావాన్ని చూపిస్తోంది అన్నమాట అనుకున్నాను.

నిర్బంధపు శ్రోతల యెడల దయ తలచి, యాంకరీ శిరోమణి గారికి బ్రేకు ఇచ్చిన ప్రతిసారీ నిర్వాహకులు చెప్పిన మాట ఒక్కటే. వాళ్ళందరూ చాలా కష్టపడి (మాలాంటి ఎందరినో కష్టపెట్టి) పరిచయ వేదికలు ఏర్పాటు చేస్తున్నా తగినన్ని పెళ్లి సంబంధాలు కుదరడం లేదట. అటు వరులకీ ఇటు వధువులకీ కూడా ఓ పట్టాన సంబంధాలు నచ్చడం లేదట. ఏళ్ళ తరబడి ఆ తల్లిదండ్రులే అన్ని వేదికలలోనూ కనిపిస్తున్నారుట. 'వీళ్ళ పని ఇలా వేదికలు ఏర్పాటు చేయడం వరకే కదా.. ఈ ఆవేదనలు ఎందుకూ?' అనిపించింది కానీ, వీళ్ళు మైకు వదిలితే ఆవిడ మైకు అందుకుంటారు అని గుర్తొచ్చి వీళ్ళ వేదన వినడమే మంచింది లెమ్మనిపించింది.

ఉమ్మడి కుటుంబాలు వర్ధిల్లినంత కాలం ఇలాంటి పెళ్లి సంతల అవసరం లేకపోయింది. వీలైనంత వరకూ ఆడపిల్ల పుట్టగానే ఉయ్యాలలోనే నిశ్చితార్ధం చేసేవాళ్ళు, మేనమామతోనో మేనబావతోనో. కానిపక్షంలో, వేలువిడిచిన బంధువో, కాలు విడిచిన చుట్టమో ఏదో సంబంధం పట్టుకొస్తే, చూసి ముడి పెట్టేసేవారు. ఉమ్మడి కుటుంబాలు నెమ్మదిగా అంతరించడం, మధ్యతరగతి ఆదాయం లోనూ, జీవిత విధానంలోనూ ఒక్కసారిగా మార్పు తోసుకుని రావడం దాదాపు ఒకేసారి జరిగింది. ఫలితమే, పిల్లల పెళ్ళిళ్ళ కోసం ఏళ్ళ తరబడి తిరగడం. ఈ అవసరాన్ని తీర్చడం కోసం కార్పోరేట్ స్థాయిలో మాట్రిమొనీ సంస్థలు మొలకెత్తి, మొగ్గ తొడిగి పాతుకు పోవడమూను. చూడబోతే భవిష్యత్తు వీళ్ళది లాగే కనిపిస్తోంది.

శనివారం, జనవరి 19, 2013

పొత్తూరి 'ప్రేమలేఖ'

ఉషా కిరణ్ మూవీస్ వారి తొలి సినిమా 'శ్రీవారికి ప్రేమలేఖ' చూడని వాళ్ళు అరుదు. చిన్న కథకి చక్కటి హాస్యాన్నీ, ఇంచక్కటి సంగీతాన్నీ జోడించి తీసిన ఈ సినిమా కథని దర్శకుడు జంధ్యాలే రాశాడు అనుకుంటారు చాలామంది. కథ తను రాసుకోకపోవడమే కాదు, పొత్తూరి విజయలక్ష్మి రాసిన 'ప్రేమలేఖ' నవలని యధాతధంగా తీసుకుని, సినిమాకి అవసరమైన అదనపు సన్నివేశాల్నీ, పాటలనీ మాత్రమే జోడించారన్న విషయం అర్ధం కాడానికి, సదరు నవలని చదవాలి.

ఆమధ్య ఎప్పుడో పుస్తకాల షాపులో డిస్ప్లే లో కనిపించిన 'ప్రేమలేఖ' నవలని కొని పట్టుకొచ్చి, తెలిసిన కథే కదా చదవొచ్చు లెమ్మని, చదవాల్సిన పుస్తకాల్లో జాగ్రత్త చేశాను. "లైట్ రీడింగ్ కోసం ఏదన్నా పుస్తకం" అనుకున్నప్పుడు, చెయ్యి మొదట వెళ్ళింది ఈ పుస్తకం మీదకే. అందరికీ తెలిసిన కథే అయినా, రెండు లైన్లలో చెప్పుకోవాలి అంటే, స్వర్ణలత అనే ఓ అమ్మాయి మనసు పెట్టి ఓ ప్రేమలేఖ రాసి, సోనీ అని సంతకం చేసి,కొంచం ఆకతాయి తనంగా దానిని చేతికొచ్చిన అడ్రస్ రాసి పోస్టు చేసేస్తుంది. ఆ ఉత్తరం చేతులు మారి మారి ఆనందరావు అనే మోస్ట్ ఎలిజిబుల్ బ్రహ్మచారి చేతిలో పడడమూ, ఉత్తరం చదివి అతగాడు సోనీతో పీకల్లోతు ప్రేమలో పడిపోవడమూ మిగిలిన కథ.

ప్రధాన పాత్రలవే కాదు, మిగిలిన ఏ ఒక్క పాత్రకీ కూడా పేరునీ, మేనరిజాన్నీ మార్చలేదు జంధ్యాల. ఆనందరావు తండ్రి పరంధామయ్య ముక్కోపి. తల్లి మాణిక్యాంబ పరమ సాత్వికురాలు. అన్నగారు బాబీగా పిలవబడే భాస్కర రావుకి పేకాట పిచ్చి. అతని భార్య అన్నపూర్ణ కి సినిమాలు చూడడం ఎంత ఇష్టమో, వాటిని శ్రీకారం నుంచి శుభం కార్డువరకూ భర్తకి వర్ణించి వర్ణించి చెప్పడం అంతకన్నా ఇష్టం. ఆనందరావు అక్క కామేశ్వరి, మేనమామ సూర్యంగా పిలవబడే సూర్య నారాయణ మూర్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పుట్టింటి వాళ్ళు తన భర్తకి అల్లుడి మర్యాదలు సరిగ్గా చేయడం లేదన్నది ఆవిడ ఫిర్యాదు.


ఇక, కథానాయిక స్వర్ణలత ని వాళ్ళ నాన్నగారు బాగా చదువు చెప్పించి ఇందిరాగాంధీ అంతటి దాన్ని చేద్దాం అనుకుంటారు. కూతుర్ని కనీసం జిల్లా కలక్టర్ గా అయినా చూడాలి అన్నది ఆయన కోరిక. చదువుకోడం అన్నది స్వర్ణ కి బొత్తిగా సరిపడని వ్యవహారం. సినిమాలన్నా, నవలలన్నా ప్రాణం. కాబోయే వాడికోసం కలలు కంటూ ఉంటుంది. "నాన్నారూ, మీరింక సంబంధాలు చూడ్డం మొదలు పెట్టచ్చండీ! నాకు చదువు మీద ఇంట్రస్టు తగ్గిపోయింది" అని చెబుదాం అనుకుంటుంది కానీ, సిగ్గు మొహమాటం అడ్డొస్తాయి. "అసలు దానికి చదువు మీద దృష్టి లేదు. ఎంతసేపూ నవలలు చదవడం, సినిమాలు చూడ్డం, మంచం మీద బోర్లా పడుకుని గాడిదలాగా కబుర్లు చెప్పడం. ఏమన్నా అంటే నోరు పెట్టుకు పడిపోతుంది. వినయం విధేయత బొత్తిగా లేవు," ఇది వాళ్ళమ్మ గారి గోడు.

సోనీ ప్రేమలో మునిగితేలుతున్న ఆనందరావు పెళ్ళిచూపులకి వెళ్ళడానికి ఇష్ట పడక పోవడంతో, సూర్యం, కామేశ్వరి, బాబీ, అన్నపూర్ణ కలిసి బయలుదేరతారు, స్వర్ణని చూసి రాడానికి. బాబీని చూసిన స్వర్ణ కి 'అగ్ని పరీక్ష' నవలలో విష్ణు వర్ధన్ గుర్తొస్తాడు. సూర్యాన్ని చూసి 'అపస్వరం' నవలలో శ్యామూ లాగా ఉన్నాడని అనుకుంటుంది. ఇక అన్నపూర్ణకైతే, స్వర్ణ 'శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్' లో జయప్రద లాగా కనిపిస్తుంది. తిరుగు ప్రయాణంలో బాబీకి ఆ సినిమా కథ మొత్తం చెప్పేస్తుంది కూడా. బాబీ స్నేహితులు 'మార్గదర్శి', 'హార్మనీ పెట్టె', 'కళ్ళజోడు' ల పేకాట ప్రహసనం సరేసరి.

ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, కథకి కీలకమైన ప్రేమలేఖ గురించి. సినిమా కోసం వేటూరి 'శ్రీమన్మహారాజ...' అంటూ మొదలు పెట్టి అలవోకగా పాట రాసేస్తే, అచ్చంగా పదహారేళ్ళ కన్నె బంగారు లాగా జానకి పాడేస్తే వినేశాం కదా మనం. నవలలో మాత్రం ఏడున్నర పేజీల ఉత్తరం. లేత గులాబీ రంగులో 'కునేగా' పరిమళాలు వెదజల్లే కాగితాల మీద స్వర్ణ పొందికగా రాసిన లేఖ. పెళ్లి కాని కుర్రాళ్ళని ఊహల్లో తిప్పి తిప్పి అక్కడే నిర్దాక్షిణ్యంగా వదిలేసి వచ్చే ఉత్తరం. 'సినిమా చూసేశాం కదా... ఇంకేం చదువుతాం' అని ఏమాత్రం అనుకోనక్కర్లేని నవల ఇది. (శ్రీ రిషిక పబ్లికేషన్స్ ప్రచురణ. పేజీలు 142, వెల రూ.80, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

గురువారం, జనవరి 17, 2013

కాదంబరి

సాధారణంగా రచయితలు 'ఏం చెబుతున్నాం?' అన్న దానితో పాటు 'ఎలా చెబుతున్నాం?' అన్నది కూడా దృష్టిలోపెట్టుకుని కథలు, నవలలు రాస్తారు. అయితే, ఈ రెండో అంశాన్ని బొత్తిగా పట్టించుకోకుండా రావూరి భరద్వాజ రాసిన నవల 'కాదంబరి.' ఎంచుకున్న ఇతివృత్తం మంచిదే అయినప్పటికీ, కథ చెప్పే తీరులోనూ, పాత్రలని రూపు దిద్దడంలోనూ ఆయన గందరగోళ పడి, పాఠకులని గందరగోళ పరిచారు అనిపిస్తుంది, ఈ పుస్తకం చదవడం పూర్తి చేయగానే. ముప్ఫై ఐదేళ్ళ క్రితం తొలిసారి ప్రచురితమైన ఈ నవలలో చర్చించిన కొన్ని విషయాలు ఇవాల్టికీ చర్చనీయమే కావడం ఈ నవల విశేషం.

ఇది రామకృష్ణయ్య కథ. పేదరికాన్ని భరించలేక చిన్నప్పుడే ఇంట్లోనుంచి పారిపోయిన రామకృష్ణయ్య అనేక రకాల ఉద్యోగాలు చేసి, సినిమా హాల్లో బ్లాక్ టిక్కట్లు అమ్ముతూ కోటీశ్వరుడైన చంద్రశేఖరం దృష్టిలో పడతాడు. దానితో అతని జాతకం పూర్తిగా మారిపోతుంది. జీనియస్ ఎక్కడున్నా ఇట్టే పట్టుకునే చంద్రశేఖరం రామక్రిష్ణయ్యని తన దగ్గర పెట్టుకుని తన వ్యాపారాల మెళకువలు నేర్పడం మాత్రమే కాదు, తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు కూడా. పెళ్ళైన కొన్నాళ్ళకే ఆత్మాభిమానం విషయంలో బొత్తిగా రాజీ పడలేని రామకృష్ణయ్య భార్యతో కలిసి వేరు కాపురం పెట్టి, సొంతంగా కలప వ్యాపారం ప్రారంభిస్తాడు.

అంచెలంచెలుగా ఎదిగిన రామకృష్ణయ్య, ఉన్నట్టుండి ఒకరోజు తన వ్యాపారం మొత్తం కొడుక్కి అప్పగించేసి, 'మయూరాక్షి' నది మీద ప్రభుత్వం ఆనకట్ట కట్టాలంటూ పోరాటం మొదలు పెడతాడు. అధికార గణం లో ఎవరితో ఏ పని ఎలా చేయించుకోవాలో బాగా తెలిసిన రామకృష్ణయ్యకి, అన్ని పార్టీల నాయకులూ స్నేహితులే. ఉన్నట్టుండి అతనీ పని ఎందుకు మొదలుపెట్టాడో ఎవరికీ తెలియకపోయినా, అతనితో పనులు ఉన్న వాళ్ళూ, అతను ఏం చేసినా అన్నీ ఆలోచించే చేస్తాడనీ నమ్మిన వాళ్ళూ అతనితో చేతులు కలుపుతారు.


రామకృష్ణయ్యకి ఉన్న బలహీనత అతని కూతురు కౌముది. కూతురికోసం ఏమైనా చేస్తాడు ఆయన. కొడుకు మీద కూడా ఇష్టం ఉన్నా, మెజారిటీ తండ్రుల్లాగే కూతురంటే కొంచం ఎక్కువ ఇష్టం. తన తల్లితండ్రుల నుంచి తను పొందలేకపోయినది ఏమిటో బాగా తెలిసిన రామకృష్ణయ్య, పిల్లలని మాత్రం కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెంచుతాడు. అంతేకాదు, కొడుకు, కూతురితో కలిసి విస్కీ తాగుతూ, సిగరెట్లు కాలుస్తూ తన సాయంత్రాలని ఆనందంగా గడపడం ఎలాగో బాగా తెలుసు. 'మయూరాక్షి' ప్రాజెక్ట్ కోసం రామకృష్ణయ్య చేస్తున్న ఉద్యమానికి పూర్తి మద్దతు ఇస్తుంది కౌముది. అక్షరాలా తండ్రి వెనుక నిలబడుతుంది.

అంత గొప్ప వ్యాపారస్తుడూ, పనులన్నీ పక్కన పెట్టి ప్రభుత్వంతో విరోధం తెచ్చుకునే ఉద్యమం ఎందుకు మొదలు పెట్టాడు, ఇందులో కౌముది కి ఉన్న ఆసక్తి ఏమిటి, చివరకి ఆ తండ్రీ కూతురూ సాధించింది ఏమిటి అన్నదే 'కాదంబరి' నవల. "బాణ మహాకవి రచించిన 'కాదంబరి' సంస్కృతంలో వెలసిన తొలి వచన కావ్యం. ఈ మాటకి నానార్ధాలూ ఉన్నాయి. ఒకానొక కావ్య విశేషం, ఆడు కోయిల, గోరువంక, మద్యం, నవల మొదలైనవి. మీ నవల వచన కావ్యంలాగా ఉన్నది. ఇందులోని ప్రతి పాత్రా ఒక్కో రకమైన మాదకతతో జోగిసలాడి పోతూ ఉన్నది. పుస్తకానికి 'కాదంబరి' అన్న శీర్షిక నుంచండి అని సలహా ఇచ్చిన వారు డాక్టర్ రాఘవాచార్య గారు" అంటూ కృతజ్ఞతలు తెలుపుకున్నారు భరద్వాజ.

కథ మొదలైన తీరు చిత్రంగా ఉంటుంది. జగన్నాధం అనే అతను (ఇతని వృత్తి వ్యాపకాలు ఏమిటో నవలలో ఎక్కడా చెప్పలేదు) పేపర్లో వచ్చిన ఒక వార్త చూసి, అడవి మధ్యలో ఉన్న పాడుబడ్డ భవనం చూడడానికి బయలుదేరతాడు. అతని ప్రయాణం సాగుతూ ఉండగా ఉండగా అతనికి అడవి మధ్యలో ఓ పాడుబడిన కోట దగ్గర కౌముది కనిపిస్తుంది. 'ఈ కౌముది మనిషా? ఏదన్నా ఆత్మా?' అన్న సందేహంతో పేజీలు తిరుగుతూ ఉండగా, దగ్గరలోని గెస్టు హవుసులో రామకృష్ణయ్య ఏర్పాటు చేసిన పార్టీకి కౌముది కి అతిధిగా వెడతాడు జగన్నాధం. అప్పుడే పరిచయం అయిన జగన్నాదాన్ని అత్యంత ఆత్మీయుడిగా భావించిన రామకృష్ణయ్య, తన గతం మొత్తం చెప్పేస్తాడు, తను చేసిన తప్పులతో సహా.

అటు రామకృష్ణయ్య, ఇటు కౌముది జగన్నాధానికి ఎందుకంత ప్రాముఖ్యం ఇస్తారో అర్ధం కాదు. అంతే కాదు, ఎన్నో ఎదురు దెబ్బలు తిని అటు జీవితంలోనూ, ఇటు వ్యాపారం లోనూ పైకి వచ్చిన రామకృష్ణయ్య ఇతరత్రా ప్రణాళికలు ఏమీ లేకుండానే 'మయూరాక్షి' ఉద్యమం మొదలు పెట్టడం, తన చుట్టూ జరిగే వాటిని ముందుగా ఊహించలేక కుంగిపోతూ, జగన్నాధంతో పంచుకోడవం ఇవన్నీ నాటకీయతని పరాకాష్టకి తీసుకెళ్ళాయి. రామకృష్ణయ్య పాత్రని చిత్రించిన తీరు, భరద్వాజ నవల 'పాకుడు రాళ్ళు' లో నాయిక మంజరి పాత్ర చిత్రణని జ్ఞాపకం చేసింది. (విశాలాంధ్ర ప్రచురణ, పేజీలు 164, వెల రూ. 80, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

సోమవారం, జనవరి 14, 2013

మా వెంకన్నబాబు...

దేవుడి గదిలో బియ్యం పోసుకునే జాడీ పక్కనే ఉన్న ఇత్తడి గంగాళం మీద, గంధం అరగదీసుకునే సాన బరువుగా మూత పెట్టి ఉంది. బలమంతా చేతుల్లోకి తెచ్చుకుని, జాగ్రత్తగా ఆ సానని కిందకి దింపేసి, గంగాళంలో చెయ్యి పెడితే లోపల గరుగ్గా తగులుతూ వడ్లు. ఓ చిన్న పళ్ళెంలోకి వాటిని తీసుకుని, గంగాళం మీద మూతని మళ్ళీ జాగ్రత్తగా పెట్టేసి, ఎందుకన్నా మంచిదని ఓ సారి వంటింటి వైపు చూసేసరికి, అమ్మా, బామ్మా పండగ పిండి వంటల హడావిడిలో మునిగిపోయి ఉన్నారు. ఇద్దరూ కూడా నన్ను చూడనేలేదు.

ఆ పళ్ళెం తెచ్చి వీధిలో బూరా ఊదుతున్న తలపాగా అబ్బికి ఇవ్వగానే తను యెంత సంతోషించాడో చెప్పలేను. నేను చూస్తూ ఉండగానే ఆ వడ్లు తనతో తెచ్చుకున్న సంచీలో పోసేసుకున్నాడు. అదేమిటీ? గంగిరెద్దుకి వడ్లు పెడతానని కదా నన్ను అడిగాడూ? "మా ఎంకన్నబాబు ఇప్పుడేవీ తినడు బాబయ్యా. మద్దినాల మేం బోయినం సేసేప్పుడు తవరి పేరు సెప్పి నేను తినిపింతాను సావీ" అని చాలా మర్యాదగా చెప్పాడు పాపం. కూడా వచ్చిన రెండో బూరా అబ్బి అవునవునని తలూపాడు. సర్లే నా పేరు చెప్పి తినిపిస్తాడు కదా... పుణ్యం అంతా నాకే కదా అనుకున్నాను.

ఏటా సంక్రాంతి రోజుల్లో వెంకన్నబాబుని తీసుకుని వస్తారు వాళ్ళు. మామూలుగా మన ఊళ్ళో బండి లాగే ఎడ్లు ఉంటాయి చూడూ, వాటికన్నా ఎత్తుగా ఉంటాడు వెంకన్న బాబు. కాళ్ళకీ, మెడ లోనూ, కొమ్ములకీ, పొట్టకీ కూడా మువ్వల పట్టీలు కట్టేస్తారు కదా... తను ఒక్క అడుగు వేసినా ఘల్లు ఘల్లు మని పోతాడు. కొమ్ములకి పట్టు కుచ్చులు, మూపురం వెనుక మడతలు పెట్టిన పాత పట్టు చీరా, చెమ్కీ దండలూ అవీ వేస్తారేమో భలేగా మెరిసిపోతాడు. మన ఎడ్లు అయితే కొరడా కర్రతో కొడితే తప్ప మాట వినవా? అదే వెంకన్న బాబయితే ఏం చెప్పినా ఇట్టే చేసేస్తాడు. అయినా మామూలు ఎడ్లని కొట్టినట్టు వెంకన్నబాబుని కొట్టకూడదు, తను గంగిరెద్దు కదా మరి.. దేవుడితో సమానం.


బూరా అబ్బిలు ఇద్దరూ వెంకన్న బాబుతో భలే భలే పనులు చేయిస్తారులే అసలు. "అయ్యగారికీ దండం పెట్టూ" అనగానే అంత పెద్ద వెంకన్న బాబూ ఇంచక్కా దండం పెట్టినట్టు నిలబడి పోతాడు. అది చూడగానే గంగాళంలో ఉన్న వడ్లన్నీ తెచ్చి తన ముందు పెట్టెయ్యాలని అనిపించేస్తుంది.. అలా చేస్తే ఇంకేమన్నా ఉందా? బామ్మ బతకనివ్వకపోవడం అలా ఉంచి, అటుకులు కావాలంటే ఎక్కడినుంచి వస్తాయీ? అందుకని ఒక్క పళ్ళెంతో, అది కూడా బామ్మ చూడకుండా చూడకుండా తెచ్చి ఇచ్చెయ్యాలి. చూసిందంటే మాత్రం "వాళ్ళు చెప్పే వెధవ సినేమా కబుర్ల కోసం, వడ్లన్నీ సంతర్పణ చేసేస్తున్నావా నాయనా..ఇలా అయితే ఇల్లు గుల్లైపోతుంది. సుపుత్రా..కొంప పీకరా అనీ..." అంటూ సాధిస్తుంది.

బామ్మ తిట్లు కాదు కానీ, బూరా అబ్బిలు చెప్పే కబుర్లు భలేగా ఉంటాయ్ అసలు. "మొన్నా మజ్జినండీ..ఎన్టీ వోడు కబురెట్టేడు మన ఎంకన్నబాబు కోసం.. కొత్త సినీమా తీత్తన్నారంట.. అట్టాంటిట్టాంటి గంగిరెద్దు పనికిరాదు.. ఎంకన్న బాబైతేనే కరెస్ట్ గా సరిపోతాడు అన్నాడంట. ఆళ్ళ మనిసొచ్చి ఒకిటే బతిమాలేసేడు. మావు ఇనలేదు లెండి.. ఇంకో ఎద్దుని సూసుకోమని సెప్పేసాం.." అయ్యో... ఎందుకలాగా? మన వెంకన్న బాబుని అందరూ చక్కగా సినిమాలో చూసేవాళ్ళు కదా?? అని అడిగామనుకో వెంటనే "సినీమానులో పడితే దిట్టి బాబయ్యా..బాబుకి కల తగ్గిపోద్ది..ఒప్పేసుకో కూడదండి అలాగ..ఆయ్.." అని వివరంగా చెప్పేస్తారు.

అదేమిటో పెద్దవాళ్ళు ఎవరూ కూడా వీళ్ళ మాటలు నమ్మరు. "మెడ్రాసులో గంగిరెద్దులకి కరువు మరీ... వీళ్ళని వెతుక్కుంటూ వచ్చారు సినిమా వాళ్ళు" అనేస్తారు. అయినా నిజం అయితే ఏమిటి, కాకపొతే ఏమిటి... వాళ్ళు సరదాగా చెబుతున్నప్పుడు సరదాగా వినొచ్చు కదా. మనం చూస్తూ ఉండగానే బూరా అబ్బిలు ఇద్దర్లోనూ ఒకతను ముగ్గుకి దూరంగా నేలమీద వెల్లకిల్లా పడుకుంటాడా.. వెంకన్న బాబు మెల్ల మెల్లగా అడుగులు వేసుకుంటూ నడిచి వెళ్లి అతని గుండెల మీద కాళ్ళు పెడతాడు. యెంత భయం వేసేస్తుందో. అప్పుడప్పుడూ మన ఎద్దులు కొమ్ము విసిరినట్టు వెంకన్నబాబు కూడా కోపం వచ్చి ఏమన్నా చేస్తే? వాళ్లకి అస్సలు భయం ఉండదేమో.. అలా తొక్కించేసుకుంటారు.

అబ్బిలిద్దరూ వీధిలో నిలబడి పోటాపోటీగా బూరలు ఊదుతూ ఉంటే అమ్మో, బామ్మో తప్పకుండా బయటికి వస్తారు కదా. అప్పుడు వెంకన్నబాబు కాస్తా మాలచ్మి అయిపోతుంది. "పండగ పూటా మాలచ్చిమి వచ్చింది తల్లే... నాలుగు పాతగుడ్డలు, పలారం ఎట్టించి పంపండమ్మా... జయం కలుగుతాది మీకు" అని ఆపకుండా ఏవేవో అడుగుతూనే ఉంటారు. మనకేమీ భయం అక్కర్లా... "అబ్బాయ్ గారు ఎంకన్న బాబుకి వడ్లు పెట్టారమ్మా" అని వాళ్ళు చెప్పరు గాక చెప్పరు. ఈలోగా నాన్నో, తాతో కనిపిస్తే "ఆట ఆడించాం బాబయ్యా...సదివింపులు గనంగా సదివించుకొవాలి బాబయ్యా..." అంటూ రూపాయో అర్ధో ఇచ్చే వరకూ వదలరు. గొబ్బిళ్ళు, హరిదాసు, ఆ తర్వాత వెంకన్న బాబూ అందం సంక్రాంతి పండక్కి.

మిత్రులందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు!!

గురువారం, జనవరి 10, 2013

ఇలా మిగిలేం

'కమ్యూనిస్టు' ఈ మాట వినిపించగానే ఒక్కసారి తిరిగి చూస్తారు ఎవరైనా. వామపక్ష రాజకీయ సిద్ధాంతంతో అభిప్రాయ భేదాలు ఉన్నవాళ్ళు సైతం ఆ పార్టీ క్రమశిక్షణని మెచ్చుకున్న సందర్భాలు అనేకం. అయితే, ఆ క్రమశిక్షణ లోపించిన కారణం గానే కమ్యూనిస్టు పార్టీ చీలికలు పీలికలు అయ్యిందనీ, ప్రజలకి దూరం అవుతూ వస్తోందనీ విశ్లేషించారు చలసాని ప్రసాదరావు. తనకి ఊహ తెలిసిన నాటినుంచీ కమ్యూనిస్టు వాతావరణంలోనే పెరిగిన ప్రసాదరావు తన అనుభవాలనీ, పరిశీలననీ 'ఇలా మిగిలేం' పేరిట అక్షరబద్ధం చేశారు.

కథారచయిత, పాత్రికేయుడు, చిత్రకారుడూ అయిన చలసాని ప్రసాదరావు, 'ఈనాడు' లో రాసిన 'కబుర్లు' వీక్లీ కాలమ్ ద్వారా ఆ పత్రిక పాఠకులకి సుపరిచితులు. ఇరవయ్యేళ్ళ క్రితం తొలిసారి ముద్రితమై సంచలనం రేపిన 'ఇలా మిగిలేం' పుస్తకాన్ని, చలసాని పదో వర్ధంతి సందర్భంగా గత సంవత్సరం పునర్ముద్రించింది 'పర్ స్పెక్టివ్స్.' ఫలితంగా, చాలా ఏళ్ళ విరామం తర్వాత ఈ పుస్తకాన్ని మళ్ళీ చదవగలిగాను నేను. పుస్తకం రాసిన నాటికన్నా ఇప్పుడు సామాజిక పరిస్థితుల్లో మార్పు మరింత వేగవంతం కావడం, మొన్నటివరకూ తొమ్మిది పార్టీలుగా ఉన్న వామపక్షాలలో తాజాగా పదో చీలిక రావడం ప్రస్తుత నేపధ్యం.

కథలైనా, కబుర్లైనా సూటిగా రాయడం చలసాని శైలి. అదే శైలిని ఆసాంతమూ కొనసాగించిన 'ఇలా మిగిలేం' ని మొత్తం పద్దెనిమిది అధ్యాయాలుగా విభజించారు. సోషలిస్టు సమాజ సాధనని ఆశయంగా ప్రకటించిన నెహ్రూని కమ్యూనిస్టు అగ్రనాయకులు రెండో ఆలోచన లేకుండా నమ్మడం తోనే పార్టీకి శరాఘాతాలు తగలడం మొదలయ్యింది అని చెప్పారు 'కామ్రేడ్ నెహ్రూజీ' అధ్యాయంలో. గజ్జెల మల్లారెడ్డి, కుందుర్తి ఆంజనేయులు వంటి కవులవల్ల పార్టీకి జరిగిన నష్టాన్ని విశదంగా చెప్పారు.


అంతే కాదు, 1955 ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య జరిగిన తీవ్రమైన పోటీ ప్రభావం తెలుగు సాహిత్యం మీద ఎలా పడిందో చెబుతూ, దేవరకొండ బాల గంగాధర తిలక్, ఆరుద్రలు పోషించిన పాత్రని తీవ్రంగా విమర్శించారు. శ్రీశ్రీ కవితకి తిలక్ మారుపేరుతో పేరడీ రాశారనీ, ఆరుద్ర పరోక్షంగా కాంగ్రెస్ కి సహకరించారనీ చెబుతూ, తర్వాతి కాలంలో ఆ ఇద్దరు కవుల పుస్తకాలని విశాలాంధ్ర ప్రచురణాలయం ప్రచురించడాన్ని తప్పు పట్టారు. అంతే కాదు, చివరికి విశ్వనాథ సాహిత్యాన్నీ, క్షుద్ర సాహిత్యాన్నీ అమ్మవలసిన అగత్యం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

అదే ఎన్నికల్లో పత్రికా సంపాదకుడు నార్ల వెంకటేశ్వర రావు పోషించిన పాత్రా, తర్వాతి కాలంలో పురాణం సుబ్రహ్మణ్య శర్మ ద్వారా గురజాడ రచనల పరిష్కారంలో లోపాల పేరిట కమ్యూనిస్టులపై అక్షరాల దాడి జరిపించిన వైనాన్నీ విప్పి చెప్పి, అదే నార్లకి గురజాడ రచనల వ్రాతప్రతులని ఎందుకు అప్పగించారని పార్టీ నాయకులని అడుగుతారు చలసాని. ఒకప్పటి నిబద్ద కమ్యూనిస్టులు తర్వాతి కాలంలో కాంగ్రెస్ వాదులు గానో, దైవ భక్తులు గానో మారిపోడాన్ని సాదోహరణంగా చెప్పి, లోపం ఎక్కడ ఉందని అడిగిన రచయిత, కేపిటలిస్టులు గా ఎదిగిన ఒకప్పటి కమ్యూనిస్టుల గురించి ప్రస్తావించలేదు.

వ్యాసాలతో పాటు, వరవరరావు రాసిన ముందుమాట, హరి (సూరపనేని హరి పురుషోత్తమ రావు) రాసిన 'నేపధ్యం' ఈ పుస్తకాన్ని లోతుగా అర్ధం చేసుకోడానికి ఉపకరిస్తాయి. తొలి ప్రచురణ తర్వాత, పుస్తకం పైనా, రచయిత పైనా వచ్చిన విమర్శలని ప్రస్తావిస్తూ వాసిరెడ్డి నవీన్, చలసాని ప్రసాదరావుని చేసిన ఇంటర్యూ ని జత పరిచారు. భారతదేశంలో, మరీముఖ్యంగా ఆంధ్ర దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉత్థానాన్నిగురించీ, చీలికలకి దారి తీసిన పరిణామాల గురించీ తెలుసుకోడానికి ఉపయోగపడే పుస్తకం ఇది. చదువుతున్నంత సేపూ ఈమధ్య చదివిన 'నిర్జన వారధి' 'లోపలి మనిషి' పుస్తకాలు గుర్తొస్తూనే ఉన్నాయి.('పర్ స్పెక్టివ్స్'ప్రచురణ, పేజీలు 205, వెల రూ. 150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

బుధవారం, జనవరి 09, 2013

త్రిలోక సుందరి

గోదావరిలో పాపికొండల నడుమ లాంచీ ప్రయాణం.. అదికూడా సాయం సంధ్య వేళ.. అన్నీ సవ్యంగా ఉంటే అంతకన్నా అందమైన, ఆహ్లాదమైన ప్రయాణం మరొకటి ఉండదు. కానీ ఏ చిన్న తేడా వచ్చినా ప్రాణాలతో ప్రపంచాన్ని చూడడం అంత సులువు కాదు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా తొంభై ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. వాళ్ళని తీసుకుని ప్రయాణిస్తున్న 'త్రిలోక సుందరి' లాంచీ ఇంజను ఉన్నట్టుండి ప్రయాణం మధ్యలో చెడి పోవడంతో. 

'కొండమొదలు' అనే ఏజెన్సీ గ్రామంలో జనానికి వైద్యం చేస్తూ, రోగాల నుంచి వాళ్ళ ప్రాణాలని కాపాడుతున్న డాక్టర్ అవధాని కూడా ఉన్నాడు ప్రయాణికుల్లో. ఆ తొంభై మంది ప్రయాణికులని కాపాడడం కోసం అవధాని చేసిన ప్రయత్నం ఏమయ్యింది, ఆ లాంచీ ఉన్నట్టుండి ఆగిపోడానికి కారణం అయిన వాళ్ళని అవధాని ఎలా శిక్షించాడు అన్నదే బీవీఎస్ రామారావు ఇప్పటికి ముప్ఫై ఏళ్ళ క్రితం రాసిన 'త్రిలోక సుందరి' కథ. అప్పటి 'ఆంధ్రజ్యోతి' వారపత్రికలో తొలి ప్రచురణ పొందిన ఈ కథ, 'గోదావరి కథలు' సంకలనంలోనూ ఉంది.

నలభై మంది ప్రయాణికుల కెపాసిటీ ఉన్న లాంచీలో, షావుకారు (లాంచీ ఓనరు) కక్కుర్తి కారణంగా తొంభై మందిని ఎక్కించేశాడు గుమస్తా. ప్రయాణికులతో పాటు, బియ్యం, తౌడు బస్తాలు ఓ యాభై టాపుని ఆక్రమించాయి. సంక్రాంతి రోజులు కావడంతో ఎక్కడ లేని రద్దీ ఉంది లాంచీకి. రోగులకి అవసరమైన మందులు కొనుక్కుని, కూనవరం నుంచి గూడెం వెడుతున్న డాక్టర్ అవధానిని ప్రయాణికులు అందరూ పలకరిస్తున్నారు. కేవలం అవధాని చేతి చలవ మీద నమ్మకంతో, పట్నంలో ఉన్న కూతురిని గూడేనికి పురిటికి తీసుకెడుతున్న భూషయ్య కూడా ఉన్నాడు వాళ్ళలో.

పాతకాలం లాంచీ, పైగా ఓవర్ లోడు, గాలివాలుకి ఎదురుగా, సుడిగుండాలు దాటుకుంటూ చేయాల్సిన ప్రయాణం. ఉన్నట్టుండి ఇంజను పనిచేయడం మానేస్తుంది. ఇంజిన్ గదిలోకి వచ్చిన పడుతున్న నీళ్ళు, మరి కాసేపట్లో మొత్తం లాంచీనీ ముంచేస్తాయి. ప్రయాణికులకి ఆ విషయం చెప్పేసి, తన ప్రాణాలు రక్షించుకోడం కోసం గోదాట్లోకి దూకేస్తాడు డ్రైవరు. ఉన్నట్టుండి తెలిసిన కబురుతో మతిపోయి, ప్రాణ భయంతో హాహాకారాలు చేస్తున్న జనాన్ని చూసిన అవధాని, వెంటనే కార్యాచరణ లోకి దిగిపోతాడు. టాపు మీద ఉన్న బస్తాలలో సగం బస్తాలని గోదాట్లోకి విసిరేయమని పురమాయిస్తాడు అవధాని. గుమస్తా ఒప్పుకోకపోతే, అతన్ని బెదిరించి మరీ పని కానిస్తారు జనం.

తౌడు బస్తాలు ఇంజిన్ రూములో కూరేసి, లాంచీలో ఉన్న ఓ వడ్రం మేస్త్రీతో చెక్క కొట్టించేయడంతో నీళ్ళు వచ్చి పడే ప్రమాదం తప్పుతుంది. అయితే మాత్రం... దారి పొడవునా సుడి గుండాలు, క్షణ క్షణానికీ మారిపోయే గాలివాలు. ఆడవాళ్ళు, పిల్లల రోదనలు. ఇవి చాలనట్టు భూషయ్య కూతురికి పురిటి నొప్పులు మొదలవుతాయి. ఈ గండాలన్నింటినీ జనం సాయంతో అవధాని ఎలా గట్టెక్కించ గలిగాడు, ఆ తర్వాత ఎదురు పడ్డ షావుకారు కి ఏ శిక్ష విధించాడు అన్నది తర్వాతి కథ.

మనుషుల మనస్తత్వాలతో పాటు, గోదావరి తత్వాన్ని కూడా బాగా తెలుసుకున్న వాళ్ళు మాత్రమే రాయగలిగే కథ ఇది. లాంచీ కొండ అంచున ఎలా ప్రయాణిస్తుంది, చుక్కాని నావని సుడిగుండాలలో ఎలా నడపాలి, ప్రవాహానికి అడ్డంగా కొండ తగిలినప్పుడు నదీగమనం ఎలా ఉంటుంది, సుడి గుండాన్ని చేదించడం ఎలాగ తదితర విషయాల మీద రామారావు గారికి ఉన్న కమాండ్ ఎంతటిదో కథ పూర్తి చేశాక సులభంగానే అర్ధమవుతుంది. నీటిపారుదల శాఖలో, అది కూడా గోదావరి ప్రాంతంలో సుదీర్ఘ కాలం పనిచేసిన అనుభవం ఆయనది.

కథ చదువుతున్నంత సేపూ వంశీ కథలూ, సినిమాలూ గుర్తొస్తాయి. అన్నట్టు, 'మా దిగువ గోదారి కథలు' కి ముందుమాట రాసింది రామారావు గారే. 'పుష్కరాల రేవులో పుల్లట్లు,' 'ఎసరూ-అత్తిసరూ' కథలు ఈ 'గోదావరి కథలు' సంకలనంలోవే. నవోదయ ప్రచురణలు వారి ద్వారా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉందీ సంకలనం.

ఆదివారం, జనవరి 06, 2013

నగదు బదిలీ

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 'ఆధార్' ప్రాజెక్ట్ తాలూకు ఫలితాలను పొందే కార్యక్రమం మొదలయ్యింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రయోజనాలని నేరుగా లబ్దిదారులకే చేర్చే పథకం (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీం) తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు నుంచి లాంచనంగా ప్రారంభమయ్యింది. తొలిదశలో దేశం మొత్తం ఎంపిక చేసిన యాభై జిల్లాలలో ఎంపిక చేసిన పథకాలని ఆధార్ కి అనుసంధానం చేసి ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. వీలైనంత తొందరలో - మరింత స్పష్టంగా చెప్పాలంటే వచ్చే ఏడాది జరగబోయే సాధారణ ఎన్నికలకి ముందుగానే - ఈ స్కీముని దేశవ్యాప్తంగా అమలు చేయడం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.

దేశంలోని ప్రతి పౌరుడికీ ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యతో కూడిన కార్డు పంపిణీ చేయడం ఆధార్ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. కార్డు దారుడి ఫోటో, చిరునామా, ఆదాయ వివరాలతో పాటు, రెండు చేతుల వేళ్ళ ముద్రలూ కంప్యూటర్ లో నిక్షిప్తం చేస్తారు. ఫలితంగా ఎలక్ట్రానిక్ వేలిముద్రని సేకరించిన క్షణాల్లోనే సదరు వ్యక్తి గుర్తింపు నిర్ధారణ జరిగిపోతుంది. ఆధార్ కార్డులు పొందిన అనంతరం, ప్రతి కుటుంబమూ ఒక బ్యాంక్ అకౌంట్ ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ బ్యాంక్ అకౌంట్ నెంబరు ను ఆధార్ వివరాలతో అనుసంధానం చేస్తారు.

ప్రభుత్వం నుంచి అందే అన్ని ప్రయోజనాలూ - పెన్షన్లు, స్కాలర్షిప్పులు మొదలు పంట భీమా, ఎరువుల సబ్సిడీ వరకూ ప్రతి ఒక్కటీ - నేరుగా లబ్దిదారుడి బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారు. అదే విధంగా, ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రస్తుతం రేషన్ కార్డు ఆధారంగా సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఇకపై, రేషన్ కార్డుతో పాటు ఆధార్ గుర్తింపు సైతం తప్పనిసరి అవుతుంది. రేషన్ షాపుల్లో లబ్దిదారుల ఎలక్ట్రానిక్ వేలిముద్రలు సేకరించి, కార్డు దారులే అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే పంపిణీ జరుగుతుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన జిల్లాలో రేషన్ పంపిణీ, పెన్షన్లు, స్కాలర్షిప్పుల, ఉపాధి హామీ వేతనాల పంపిణీని ఆధార్ సమాచారం ఆధారంగా జరపబోతున్నారు.

ఈ కొత్త విధానం వల్ల జరగబోయే ప్రయోజనం ఏమిటి? ముందుగా ప్రభుత్వానికి ఒనగూడే ప్రయోజనం గురించి చెప్పుకుందాం. స్కీముని ప్రారంభిస్తూ, టీవీ కెమెరాల సాక్షిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే మొత్తం కుటుంబాల సంఖ్య పన్నెండున్నర లక్షలు కాగా, అధికారులు జారీ చేసిన తెలుపు రంగు రేషన్ కార్డుల పదిహేను లక్షలు. తెలుపురంగు కార్డుల కోసం ఇంకా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి!! ఇక రాష్ట్రం మొత్తమీద పరిస్థితి ఏమిటన్నది సులువుగానే ఊహించవచ్చు. ఒక్క రూపాయికి కిలో బియ్యంతో సహా అనేక సబ్సిడీలని పొందేందుకు తెల్ల కార్డే ఆధారం. ఈ తెల్ల కార్డుల్లో బోగస్ కార్డులు అధికంగా ఉన్నాయి అన్నది నిర్వివాదం.

ఇప్పుడు రేషన్ సరుకులు అందజేసేందుకు లబ్దిదారుడి ఎలక్ట్రానిక్ వేలిముద్ర ఆధారంగా జరిగే నిర్ధారణం తప్పనిసరి. కాబట్టి, బోగస్ కార్డులకు పంపిణీ కుదరదు. ఒక్కో వ్యక్తికీ ఒక్కో ఆధార్ సంఖ్య మాత్రమే ఉంటుంది కాబట్టి, ఒకటి కన్నా ఎక్కువ కార్డులు ఉన్నా ఒక్క కార్డు మాత్రమే ఉపయోగించగలరు. (ఇదే విధానాన్ని వంట గ్యాస్ సిలిండర్లకీ ప్రవేశ పెట్టేందుకు కృషి జరుగుతోంది). ఇక, మరణించిన వారి పేరుపై కేన్సిల్ కాకుండా ఉండిపోయిన కార్డులు. లబ్దిదారుడి ఎలక్ట్రానిక్ వేలిముద్ర లేకుండా సరుకుల పంపిణీ సాధ్యం కాదు కాబట్టి, ఈ కార్డులని ఉపయోగించడం ఇకపై కుదరదు. పెన్షన్లు, స్కాలర్షిప్పులు, ఉపాధి హామీ వేతనాల పంపిణీకీ ఇదే విధానం కాబట్టి, బోగస్ చెల్లింపులకి అడ్డుకట్ట పడే వీలుంది.

ప్రభుత్వం నుంచి ప్రజలకి అందే ప్రయోజనాలు నేరుగా వారి బ్యాంకు అకౌంట్లలో క్రెడిట్ అవుతాయి కాబట్టి, లబ్దిదారులు ఎవరికీ లంచాలు ఇవ్వనవసరం లేదన్నది ఏలినవారు చెబుతున్న మరో ప్రయోజనం. అయితే, వ్యవస్థలో వేళ్ళూనుకు పోయిన అవినీతి ఇంత సులువుగా రూపు మాసిపోతుందని అనుకోలేం. ఎవరి మార్గాలని వారు ఈ పాటికే వెతుక్కునే ఉంటారు. ప్రస్తుతానికి వస్తే సామాన్య ప్రజలకన్నా, ప్రభుత్వానికి ఈ విధానం వల్ల ఎక్కువ ప్రయోజనం కనిపిస్తోంది. కార్యక్రమం పూర్తిగా అమలులోకి వచ్చాక పరిస్థితి ఎలా ఉండబోతోంది అన్నది వేచి చూడాల్సిన విషయం.

శనివారం, జనవరి 05, 2013

నరుడు-జాజిమల్లి

అడివి బాపిరాజు రాసిన రెండు మినీ నవలలు నరుడు, జాజిమల్లి. రెంటినీ కలిపి ఓ సంకలనంగా వెలువరించింది విశాలాంధ్ర ప్రచురణాలయం. బాపిరాజు ఇతర సాంఘిక నవలలు నారాయణరావు, తుపాను, కోనంగి లతో పోల్చినప్పుడు ఈ రెండు నవలల్లోనూ స్పుటంగా కనిపించే భేదం ఒక్కటే. ఆ మూడు నవలల్లోనూ కథానాయకులు ఉన్నతాదాయ వర్గాల నుంచి వచ్చిన వారు కాగా, ఈ రెండు నవలల్లోనూ నాయకులు చాతుర్వర్ణ వ్యవస్థలో చివరి వర్గానికి చెందినవారు. అయినప్పటికీ వారు బాపిరాజు మార్కు కథానాయకులు. నల్లని వారైనా అందచందాల వారు, గుణ సంపన్నులు, అన్నింటినీ మించి గాంధీజీ భక్తులు.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని జక్కరం గ్రామంలో ప్రారంభమవుతుంది 'నరుడు' కథ. ఆ ఊరి పురోహితుడు సుబ్రహ్మణ్య అవధానులు గారి ఇంట పాలేరు మాదిగ చంద్రయ్య. అతని కొడుకు ఎల్లమంద. సాటివారిలా కొడుకుని పనులకి పంపకుండా, చదువుకి పంపుతాడు చంద్రయ్య. ఎల్లమంద చదువు ఏ ఆటంకాలూ లేకుండా సాగి కాలేజీకి వస్తుంది. అదే సమయంలో మహాత్ముడి హరిజన ఉద్యమం పల్లెల్లోకి కూడా పాకడంతో, ఆ ఊళ్ళో వదాన్యులు కొందరు పూనుకుని ఎల్లమందని కాలేజీలో చదివించడానికి ముందుకు వస్తారు.

తన పుట్టుక కారణంగా వివక్ష ఎదుర్కొన్న ఎల్లమంద, ఫుట్ బాల్ ఆటలో తనకున్న ప్రావీణ్యం వల్ల కాలేజీ మొత్తంలో ఓ ప్రత్యేకత సాధించుకుని, మిత్రులని సంపాదించుకుంటాడు. (ఈ ఫుట్ బాల్ టోర్నమెంట్ సన్నివేశం మొత్తం - కించిత్ మార్పు చేర్పులతో - యండమూరి 'ఆనందోబ్రహ్మ' నవలలో కనిపిస్తుంది). ఇంజనీరింగ్ చదివిన ఎల్లమంద, ఎల్లమంద మూర్తి గా మారి ఆనకట్టల నిర్మాణం, జలవిద్యుత్ ఉత్పత్తి ల గురించి ఉన్నత చదువు నిమిత్తం విదేశాలకి వెడతాడు. (నీటి పారుదల, ప్రాజెక్టులు అనే అంశాలని స్పృశించిన తొలి తెలుగు నవల బహుశా ఇదే. ఈ మధ్య కాలంలో ఇదే అంశాన్ని విస్తృత కథా వస్తువుగా తీసుకుని 'దృశ్యాదృశ్యం' అనే చక్కని నవలని రాశారు రచయిత్రి చంద్రలత).


చదువు పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన మూర్తికి మహాత్ముడి ఉద్యమంలో పాల్గొనాలా లేక ఉద్యోగంలో చేరాలా అన్న ప్రశ్న మొదలవుతుంది. అదే సమయంలో తన స్నేహితుడి సోదరి, యురేషియన్ జాతి కన్య జెన్నిఫర్ తో మొదలైన పరిచయం ప్రేమగా మారుతుంది. వృత్తిరీత్యా వైద్యురాలు జెన్నిఫర్. యురేషియన్ లకి తెల్లని చర్మం ఉన్నా, వాళ్ళ జీవితాలు భారతీయ హరిజనుల కన్నా దారుణంగా ఉన్నాయని తెలుసు ఆమెకి. మూర్తి తన దేశంకోసం, తనవారి కోసం ఏం చేయగలిగాడు, మూర్తి-జెన్నిఫర్ ల ప్రేమకథ ఏ మలుపు తిరిగింది అన్నది ముగింపు. కేవలం తొంభై పేజీల ఈ మినీ నవల ఆసాంతమూ ఆపకుండా చదివిస్తుంది, ఆలోచనల్లో పడేస్తుంది. 

'గీతాదేవి' గా మారిన పద్మావతి కథ 'జాజిమల్లి.' పువ్వులని అమితంగా ప్రేమించే పద్మావతికి సంగీతం అన్నా ప్రాణం. భర్త బుచ్చి వెంకటరావు ఎండు చేపలు, రొయ్యపప్పు ఎగుమతి చేస్తూ బాగానే గడిస్తున్నాడు. మద్రాసు నగరంలో వారి నివాసం. పద్మావతి, వెంకట్రావుల స్వస్థలం నెల్లూరు జిల్లా. బెస్త కుటుంబం నుంచి వచ్చారు ఇద్దరూ. చిన్నప్పుడే మొగుడూ పెళ్ళాం అని పేరు పెట్టించేసుకున్న పద్దాలు, బుచ్చి వెంకులు ఒకటి కావడానికి మాత్రం కొంచం ఆలస్యం జరిగింది. ఈలోగా సైన్యంలో పని చేసి, ప్రపంచాన్ని చూసి వచ్చిన బుచ్చి వెంకులు బాగా బతకడం ఎలాగో తెలుసుకుంటాడు. పెళ్లి తర్వాత వారి మకాం కావలికి, అటుపై మదరాసు నగరానికీ మారుతుంది.

సంగీతం పట్ల పద్మావతికి ఉన్న ఆసక్తి గమనించిన వెంకటరావు ఆమెకి కర్నాటక సంగీతం నేర్పిస్తాడు. అంతే కాదు, చదువు ద్వారానే అభివృద్ధి సాధ్యం అని నమ్మి ప్రైవేటుగా తను చదువుకుంటూ, పద్మావతినీ చదివిస్తాడు. సంగీతంలో పద్మావతికి యెంత పేరు వస్తుందంటే 'గీతాదేవి' అన్న బిరుదు అందుకుంటుంది ఆమె. సంగీత ప్రయాణం సాగుతూ ఉండగానే, వైవాహిక జీవితం పట్ల చిన్నగా అసంతృప్తి మొదలవుతుంది పద్మావతికి. వెంకటరావు తనకి తగిన వాడు కాదన్న భావన చిన్నగా మొదలై పెరిగి పెద్దది అవుతుంది.

సరిగ్గా అదే సమయంలో సినీ సంగీత దర్శకుడు రాధాకృష్ణ పరిచయం అవుతాడు ఆమెకి. పద్మావతి పాటనీ, అంతకన్నా ఎక్కువగా పద్మావతినీ ఇష్టపడతాడు అతడు. రెండు కుటుంబాల మధ్యా స్నేహం పెరిగాక, రాధాకృష్ణ భార్య సుశీలకి దగ్గరవుతాడు వెంకటరావు. ఆ రెండు జంటల కథా ఏయే మలుపులు తిరిగి ఏ తీరం చేరింది అన్నది నవల ముగింపు. ఎనభై ఏడు పేజీల మినీ నవల ఇది. ఎక్కడా ఆపకుండా చదివిస్తుంది. వెంకటరావు సైతం మహాత్ముడి అభిమాని. వ్యాపారంలో నీతిని పాటించే వాడు. తన కులాన్ని వృద్ధిలోకి తేవాలన్న తపన ఉన్నవాడు. కళా సంస్కృతుల పట్ల రచయిత బాపిరాజుకి ఉన్న మక్కువ రెండు నవలల్లోనూ కనిపిస్తుంది. (విశాలాంధ్ర ప్రచురణ, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

గురువారం, జనవరి 03, 2013

లోపలి మనిషి

అతను బాగా చదువుకున్న వాడు. సమాజాన్ని గురించి -మరీ ముఖ్యంగా అసమానతల గురించి - బాగా తెలిసిన వాడు. వాటిని తొలగించడం అతని కల. అతనో స్వాప్నికుడు. స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కలలుకన్న సోషలిస్టు సమాజమే అతని కల కూడా. ఆ కలని నెరవేర్చుకోడం లో ఉన్న అడ్డంకులు అతనికి తెలుసు. అయినప్పటికీ అతనిదగ్గర ఓ స్పష్టమైన మార్గమూ, లక్ష్య సాధనకు అవసరమైన పట్టుదలా, మొండితనమూ ఉన్నాయి. అలాగని అతని మనసులో ఏముందో పొరబాటున కూడా బయట పడనివ్వడు. ఎందుకంటే అతడు అంతర్ముఖుడు. అతడిపేరు ఆనంద్.

విదేశీ మారక నిల్వలు మొత్తం హరించుకుపోయి, మన బంగారం నిల్వలు సైతం విదేశీ బ్యాంకుల తనఖాలో ఉండిపోయి దేశం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో పడిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు సరైన సమయంలో 'నూతన ఆర్ధిక సంస్కరణలు' ప్రవేశపెట్టే నిర్ణయం తీసుకుని ఇవాల్టి రోజున భారత దేశం అగ్రగామి దేశంగా ఎదగడానికి అవసరమైన ధైర్యాన్ని ఇచ్చిన దార్శనికుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆత్మకథ లాంటి నవల - ఆంగ్ల 'ది ఇన్సైడర్' కి తెలుగు అనువాదం - 'లోపలి మనిషి' లో కథా నాయకుడు ఈ ఆనంద్. ఏడువందల యాభై రెండు పేజీల బరువైన ఈ పుస్తకంలో ఏ కొన్ని పేజీలు తిరగేసినా ఆనంద్ మరెవరో కాదు, పీవీనే అన్న సంగతి సులువుగానే బోధ పడుతుంది.

దేశానికి స్వతంత్రం వచ్చినా ఇంకా పరాయి పాలనలో ఉన్న ఆఫ్రోజాబాద్ సంస్థానంలో ఓ చిన్న ఊరు ఆనంద్ ది. భూములు చాలానే ఉన్నా, నీటి వసతి తక్కువ కావడం వల్ల పెద్దగా ఆదాయం లేని కుటుంబం, మధ్య తరగతి నేపధ్యం. చురుకైన విద్యార్ధి ఆనంద్ కళాశాల విద్య పూర్తయ్యే రోజుల్లోనే ఆఫ్రోజాబాద్ విముక్తి కోసం సాయుధ పోరాటం ప్రారంభమవుతుంది. దేశ భక్తుడైన ఆనంద్ స్వయంగా ఆయుధం పట్టి పోరాటంలో పాల్గొనడమే కాదు, రహస్య జీవితాన్నీ గడుపుతాడు. ప్రధాని నెహ్రూ చొరవతో ఆఫ్రోజాబాద్ కి విముక్తి లభించగానే, ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడతాడు ఆనంద్.

ఎమ్మెల్యే గా గెలిచిన ఆనంద్ ముఖ్యమంత్రి మహేంద్రనాథ్, అసమ్మతినేత చౌదరి లతో సమదూరం పాటిస్తాడు. కొన్ని రాజకీయ పరిణామాల అనంతరం చౌదరి ముఖ్యమంత్రి కావడం, ఆనంద్ ని కేబినేట్ లోకి తీసుకుని వివాదాస్పద భూసంస్కరణల శాఖకి మంత్రిగా నియమించడం జరిగిపోతాయి. ప్రధాని నెహ్రూ కలలుకనే సోషలిజం సాధించడానికి భూసంస్కరణలు ఓ చక్కని మార్గంగా భావించిన ఆనంద్, వాటిని అమలు పరచి తీరాలని స్థిర నిర్ణయం తీసుకుంటాడు. అయితే భూస్వామ్య వర్గాల నుంచి వచ్చిన వత్తిడి, పార్టీ నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో అతని కృషి ముందుకు సాగదు.


రెండుసార్లు అదే శాఖ మంత్రిగా పని చేసిన ఆనంద్, ఇందిరాగాంధీ నామినేట్ చేయడంతో చౌదరి స్థానంలో ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు కూడా అతడి మొగ్గు భూ సంస్కరణల వైపే. శ్రమదమాదులకి ఓర్చి తన లక్ష్యాన్ని చేరుకున్న ఆనంద్, అందుకు గాను ఎలాంటి ప్రతిఫలాన్ని పొందాడు అన్నది పుస్తకం ముగింపు. స్వాతంత్రం తర్వాతి నాలుగు దశాబ్దాలలో దేశంలో జరిగిన అనేక పరిణామాలు, రాష్ట్ర రాజకీయాలని కళ్ళ ముందు నిలిపే రచన ఇది.నెహ్రూ స్వప్నాలు దార్శనికత, ప్రజాభిమానం, పంచశీల సిద్ధాంతం, చైనా యుద్ధం (1962), నెహ్రూ అస్తమయం (1964), పాకిస్తాన్ యుద్ధం (1965), తాష్కెంట్ ఒప్పందం, లాల్ బహదూర్ శాస్త్రి మరణం (1966), ఇందిరా గాంధీ ప్రధాని కావడం, బంగ్లాదేశ్ అవతరణ (1971) లాంటి పరిణామాలని తనదైన కోణంలో వివరించారు పీవీ.

అంతే కాదు, రాజకీయ క్రీడ వికృత రూపం దాల్చడం, అవినీతి వేరు పురుగులాగా వ్యవస్థలొకి జొరబడడం, ఎగువ సభలకి జరిగే ఎన్నికలు డబ్బుమయం గా మారడం, రాష్ట్రంలో అసమ్మతి రాజకీయాలు, పైచేయి కోసం వర్గాల మధ్య పోరాటం...ఇలా ఏ ఒక్క విషయాన్నీ విడిచిపెట్టకుండా నిశితంగా చిత్రించారు. రాష్ట్రం పేరునీ, నాయకుల పేరునీ మార్చిన రచయిత, కేంద్రంలో ముఖ్య నాయకులని మాత్రం వారి పేర్లతోనే పరిచయం చేశారు పాఠకులకి. రాష్ట్ర రాజకీయాలు తెలిసిన వారికి, సదరు రాష్ట్ర నేతలని పోల్చుకోవడం ఏమంత కష్టం కాదు. ఓ మహిళా నాయకురాలితో తనకి గల సాన్నిహిత్యాన్ని గురించి వినిపించిన రకరకాల కథనాలని దాచే ప్రయత్నం చేయలేదు రచయిత. అరుణ పాత్ర ద్వారా విశదంగానే చెప్పారు.

ఓ భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చిన అరుణ, ఓ ఉన్నతోద్యోగి భార్య. వైవాహిక జీవితం సంతృప్తిగా లేకపోవడంతో రాజకీయాల్లో ప్రవేశించి ఎమ్మెల్యే అవుతుంది. అప్పుడే ఆనంద్ కూడా ఎమ్మెల్యే కావడంతో, పార్టీ ఆఫీసులో జరిగిన వారి పరిచయం అసెంబ్లీలో పెరిగి పెద్దదవుతుంది. తన వైవాహిక జీవితం పట్ల అసంతృప్తి తో ఉన్న ఆనంద్, అరుణకి దగ్గర అవుతాడు. వారి సాన్నిహిత్యం, తర్వాతి కాలంలో ఆనంద్ మీద అతని ప్రత్యర్ధులు (సొంత పార్టీ వారే) బురద జల్లడానికి మంచి అవకాశంగా మారుతుంది. ఎన్ని జరిగినా ఆనంద్-అరుణ ల మధ్య బంధం బలపడిందే తప్ప, తెగిపోలేదు.

పీవీ నరసింహా రావు లోతైన ఆలోచనలకి అక్షరరూపం ఈ పుస్తకం. జరుగుతున్న ప్రతి పరిణామాన్నీ లోతుగా విశ్లేషించడం ఆనంద్ అలవాటు. తనపై కుట్రలు జరిపే వారితో ముఖాముఖి తలపడే మనిషి కాదు..కానీ తానేమిటో చేతల్లో చూపిస్తాడు. ఆనంద్ కి మంత్రివర్గంలో చోటిస్తూ, చౌదరి అతనికి పెట్టిన ముద్దుపేరు 'బృహస్పతి.' అతడు నిజంగానే బుద్ధికి బృహస్పతి అని నిరూపితమయ్యే సన్నివేశాలు బోలెడు. స్వతంత్రానంతర పరిణామాలు, దేశ, రాష్ట్ర రాజకీయాలపై అవగాహనా, ఆసక్తి ఉన్నవారిని ఏక బిగిన చదివించే పుస్తకం ఇది. ఓ అంతర్ముఖుడి ఆలోచనా స్రవంతి. నెహ్రూని దైవ స్వరూపుడి గానూ, ఇందిర ను శక్తి స్వరూపిణి గానూ చిత్రించారు రచయిత. ఇందిర హత్య, రాజీవ్ ప్రధాని కావడం, రాజీవ్ హత్యానంతర పరిణామాల్లో ఆనంద్ ప్రధాన మంత్రి పదవీ బాధ్యతలని తన భుజాలకి ఎత్తుకున్నాడన్నపేరాతో పుస్తకం ముగిసిపోవడం కించిత్ నిరాశని మిగిల్చింది. (ఎమెస్కో ప్రచురణ, వెల రూ. 350, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

(బ్లాగ్మిత్రులు ఉమాశంకర్ గారికి కృతజ్ఞతలు)

బుధవారం, జనవరి 02, 2013

నమ్మకం

మనుషుల్లో నమ్మకం తగ్గిపోతూ ఉండడం అన్నది మొదటినుంచీ ఉన్నదేనా లేక ఈమధ్య కాలంలో వేగంగా జరుగుతున్న పరిణామమా అన్నది నన్ను చాలా రోజులుగా వెంటాడుతున్న సందేహం. సాటి మనిషి మీద నమ్మకం - ఆ మనిషి కుటుంబ సభ్యుడు, స్నేహితుడు, పరిచయస్తుడు... ఇలా ఎవరైనప్పటికీ - బలహీన పడింది అనో, మొత్తానికి పోయింది అన్నదో ఈమధ్యన తరచూ వినిపిస్తున్న మాట. అలాగే "ఫలానా వాళ్ళు నన్ను నమ్మడం లేదు" అన్న ఫిర్యాదు కూడా. ఇచ్చిపుచ్చుకోవడం అన్నది నమ్మకానికీ వర్తిస్తుంది కాబట్టి, ఈ ఫిర్యాదు సహజమే.

ఇదివరకటి రోజుల్లో కుటుంబం మొత్తం ఇంటిపెద్ద చెప్పుచేతల్లో ఉండేది. ఆ పెద్ద ఏం చెబితే అదే చేసేవారు ఇంటిళ్ళపాదీ. ఆపూట చేయాల్సిన వంట మొదలు, ఆస్తుల కొనుగోళ్ళు, అమ్మకాలు, పిల్లల చదువులు, ఉద్యోగాలు...ఇలా ఏ విషయమైనా ఒక్క మాట మీద జరిగిపోయేవి. 'పెద్ద వాళ్ళు మన మంచికోసమే ఆలోచిస్తారు' అన్న నమ్మకం బలంగా ఉన్న రోజులు అవి. ఒకవేళ, ఇంటిపెద్ద నిర్ణయం ఎవరికైనా నచ్చకపోయినా వెనుక మరొకరితో ఆ మాట చెప్పుకోవాల్సిందే కానీ, ముఖాముఖీ ఎదిరించడం అన్నది అరుదు.

వెనుకటి తరంలో వచ్చిన సాహిత్యం ఇప్పుడు చదువుతూ ఉంటే కొన్ని కొన్ని సంఘటనలు భలే ఆశ్చర్యంగా అనిపిస్తాయి. నాకు బాగా నచ్చిన పుస్తకం 'కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణ శాస్త్రి స్వీయచరిత్ర' చదువుతుంటే ఆశ్చర్యమే కాదు, చాలా చోట్ల 'ఇది నిజమేనా?' ని కించిత్ అపనమ్మకం కలిగింది కూడా. ముఖ్యంగా శాస్త్రి గారు తన ఉద్యోగానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలన్నీ తన గురువులకే వదిలేసి నిశ్చింతగా ఉండడం.. "ఈరోజుల్లో అయితే ఇది సాధ్యమేనా?" అని చాలాసార్లే అనిపిస్తూ ఉంటుంది.

ఈ నమ్మకం అనేది ఎందుకు తగ్గిపోతోంది? స్వార్ధం పెరిగిపోవడం, బతుకు పరుగు పందెం లో ముందు ఉండాలనో, వెనకబడిపోకూడదు అనో, ఎవరెలా పొతే మనకేమి అనే ధోరణి పెరిగిపోవడం, మనంతటి వాళ్ళం మనం..మన విషయాల్లో మరొకరి జోక్యం ఏమిటి అనో... ఇలా అనేకానేక కారణాలు కనిపిస్తాయి. వ్యక్తీ స్థాయిలో మొదలైన ఆలోచన ప్రభావం కుటుంబం మీద కనిపించడం, కుటుంబ బంధాల్లో వచ్చిన మార్పుల ప్రభావం సమాజం మీద ఉండడం అన్నది అనివార్యం. కుటుంబాలు అన్నీ కలిస్తేనే కదా సమాజం.

"మనుషుల మధ్య దూరం పెరిగిపోడంలో ప్రపంచీకరణ పాత్ర చాలా ఉంది" అంటారు మిత్రులొకరు. కలిసికట్టుగా ఉండే మనుషుల మధ్యన పోటీ మొదలయ్యిందనీ, ఈ పోటీ కారణంగానే మనుషులలో నమ్మకం తగ్గిపోతోందనీ తన వాదన. ఒకప్పుడు పల్లెటూళ్ళకి ఎవరన్నా కొత్తవాళ్ళు వెళ్ళినా చక్కని ఆతిధ్యం దొరికేదనీ, ఇప్పుడు మంచినీళ్ళు పుట్టడం కూడా కష్టం అయిపోతోందనీ చెప్పుకొచ్చారు. ఆలోచిస్తే కొంత నిజం లేకపోలేదు అనిపించింది.

మనుషుల్లో నమ్మకం అన్నది బొత్తిగా తగ్గిపోతే వైట్ కాలర్ నేరాలు ఇంతగా ఎందుకు పెరుగుతాయి? నమ్మితేనే కదా మోసం జరిగేది. నకిలీ బంగారం, మనీ సర్క్యులేషన్ స్కీములు, రాత్రికి రాత్రి బోర్డు తిప్పేసే చిట్టీ కంపెనీలు, ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలు చేసే ఏజన్సీలు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉండడానికి కారణం జనంలో మిగిలిఉన్న నమ్మకమా లేక పెరుగుతున్న అత్యాశా? ఆలోచించాల్సిన విషయమే. ...మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎందరిని మనం మనస్పూర్తిగా నమ్మగలం? ఇది కొంచం కలవరపెట్టేప్రశ్న, హిపోక్రసీ కి తావులేకుండా మనకి మనమే సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేసి చూద్దామా!!

మంగళవారం, జనవరి 01, 2013

ప్రవీణ్ గెలిచాడు...

మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 'పాడుతా తీయగా' సిరీస్ 'గ్రాండ్ ఫినాలే' చూస్తూ రెండువేల పన్నెండుకి వీడ్కోలు పలికి, రెండువేల పదమూడుకి స్వాగతం పలికాం మేము. సెమి-ఫైనల్స్ దశ నుంచీ ఊహిస్తున్నట్టే నెల్లూరుకి చెందిన యువ గాయకుడు ప్రవీణ్ కుమార్ ప్రధమ స్థానంలో నిలిచి మూడు లక్షల రూపాయల నగదు బహుమతి అందుకోగా, విజయవాడ అమ్మాయి చారుమతీ పల్లవి రెండో స్థానంలో నిలబడి లక్షరూపాయల బహుమానం అందుకుంది ఈటీవీ వారి నుంచి.

ఫైనల్స్ వరకూ ప్రవీణ్ కి గట్టి పోటీ ఇచ్చిన శరత్ సంతోష్ (హైదరాబాద్) మూడోస్థానం లోనూ, క్వార్టర్ ఫైనల్స్ నుంచీ తన ప్రతిభకి మెరుగు పెట్టుకుంటూ వచ్చిన విజయవాడ గాయకుడు సూర్య కార్తీక్ నాలుగో స్థానంలోనూ నిలబడ్డారు. గడిచిన సిరీస్ లతో పోల్చినప్పుడు, ఈ సిరీస్ చాలా ఆహ్లాదంగా సాగిందనే చెప్పాలి. ముఖ్యంగా అతిధులందరూ సంగీతానికీ పాట కీ సంబంధించిన వాళ్ళే కావడం వల్ల, సాంతమూ సంగీత ప్రధానంగానే సాగింది. ఇతరత్రా విషయాల ప్రస్తావన బహు తక్కువగా ప్రస్తావనకి వచ్చాయి.

అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు పై చేసిన కార్యక్రమం ఈ సిరీస్ కి హైలైట్ గా చెప్పాలి. అలాగే కార్తీక్, కల్పన లాంటి పరభాషా గాయకులూ అతిధులుగా హాజరయ్యారు. గాయనీ గాయకులు ఎంచుకున్న పాటలు సైతం వైవిధ్య భరితంగా ఉన్నాయి ఈసారి. మరీ ముఖ్యంగా క్వార్టర్ ఫైనల్స్ నుంచీ ప్రతి ఎపిసోడ్ లోనూ కనీసం రెండు మూడు పాటలన్నా అంతగా ప్రాముఖ్యం పొందని మంచి పాటలు వినిపించాయి. ఇది ఆహ్వానించాల్సిన పరిణామం. అలాగే, బాలూ-అతిథుల పరస్పర పొగడ్తలు ఉన్నప్పటికీ, పాటలు పాడిన వారికి ఉపయోగ పడే తగుమాత్రం సూచనలూ ఉన్నాయీసారి.


ప్రాధమిక దశ ఎంపిక ఈసారి కూడా ఆశ్చర్యం కలిగించింది. తొలి ఎపిసోడ్స్ లో నిష్క్రమించేది ఎవరో సులువుగానే అర్ధమైపోయింది. గత కొద్ది సిరీస్ ల నుంచీ ఇలా జరుగుతోంది ఈ కార్యక్రమంలో. అలాగని ఆంద్ర దేశంలో అవుత్సాహిక గాయకులు తగ్గిపోతున్నారని అనుకోలేం కదా. ఫైనల్స్ కి మిగిలిన నలుగురు గాయకుల్లో, శరత్ సంతోష్ బాల గాయకుడిగా జీ టీవీ వారి సంగీత కార్యక్రమం లో పాల్గొని ఫైనల్స్ వరకూ వచ్చాడు. ఆ అనుభవం అతనికి చాలా సార్లే ఉపయోగ పడింది. ఓ దశలో ప్రవీణ్ కి గట్టి పోటీ ఇచ్చిన శరత్, ఫైనల్స్ కి వచ్చేసరికి అనూహ్యంగా వెనుక బడ్డాడు.

శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉన్న ప్రవీణ్ లో చూడగానే ఆకట్టుకునేది పాట పట్ల అతని శ్రద్ధ. పాటలో లీనమై పాడే తీరు. అతను పాడుతున్నప్పుడు, పాటలో భావానికి అనుగుణంగా మారిపోయే శరీర భాష తెచ్చిపెట్టుకున్నది కాదనే చెప్పాలి. గ్రాండ్ ఫినాలే లో "ఈగ ఈగ ఈగ..." పాటని పాడిన తీరు అధ్బుతం అంతే. చారుమతీ పల్లవి ప్రత్యేకత ఆమె గొంతు. శాస్త్రీయ సంగీతమైనా, పాశ్చాత్య ధోరణి లో సాగే పాట అయినా ఆమె గొంతులో చక్కగా ఒదిగిపోతుంది. గ్రాండ్ ఫైనలే కి అతిధులుగా సంగీత దర్శకుడు ఉపద్రష్ట విద్యాసాగర్, 'డ్రమ్స్' శివమణి హాజరయ్యారు. వచ్చే సోమవారం నుంచి బాల గాయనీ గాయకులతో కొత్త సిరీస్.. ఎలా ఉంటుందో చూడాలి..