బుధవారం, జూన్ 22, 2022

యుద్ధ బీభత్సం

యుద్ధం కొనసాగుతోంది. బలమైన రష్యా, చిన్న దేశమైన ఉక్రెయిన్ మీద విజయం సాధించడం పెద్ద విషయమేమీ కాదనుకున్న వాళ్ళందరూ ఆలోచనలో పడ్డారు. రెండు దేశాల బలాబలాలు, వాటి వెనుక ఉన్న శక్తులు, యుద్ధభూమిలో జరగబోయే పరిణామాలు.. వీటన్నింటినీ కాసేపు పక్కన పెట్టి, యుద్ధ బీభత్సాన్ని గురించి మాట్లాడుకోవాల్సిన సమయమిది. మృతులు, క్షతగాత్రులు, కాలిన, కూలిన భవనాలు, ధ్వంసమైన ఆస్తులు.. ఇవన్నీ కనిపించే బీభత్సాలు. చాపకింద నీరులా ప్రపంచాన్ని, మరీ ముఖ్యంగా బీదవైన మూడో ప్రపంచ దేశాలని, చుట్టుముడుతోన్న బీభత్సం ఆకలి. కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో ఆకలి కేకలు మొదలయ్యాయి. మరికొన్ని దేశాలకీ ఇవి విస్తరించబోతున్నాయి. అంత తీవ్రంగా కాకపోయినా మిగిలిన అన్ని దేశాల్లోనూ ఎంతో కొంత ప్రకంపనలు వినిపించని తప్పని పరిస్థితే కనిపిస్తోంది. 

నెలల తరబడీ జరుగుతున్న యుద్ధం కారణంగా, సరిహద్దుల మూసివేత ఫలితంగా, అటు రష్యా నుంచీ, ఇటు ఉక్రెయిన్ నుంచీ మిగిలిన దేశాలకి ఆహారధాన్యాల సరఫరా ఆగిపోయింది. సోమాలియా, సూడాన్, లిబియా లాంటి చిన్న దేశాలు గోధుమలు, వంట నూనెల కోసం ఈ రెండు దేశాల మీదే ఆధార పడ్డాయి. అంతే కాదు, వ్యవసాయం చేయడానికి అవసరమయ్యే రసాయన ఎరువుల తయారీకి రష్యా ప్రధాన కేంద్రం. ఎరువుల సరఫరా కూడా ఆగిపోయింది. కరువు మొదలయ్యింది. గడ్డి మొలవని పరిస్థితుల్లో పాడి పశువులు మరణిస్తున్నాయి. పాలకీ కొరత మొదలయ్యింది. ఉన్న ఆహార నిల్వలు అడుగంటున్నాయి. కొత్త సరఫరాలకి దారులు తెరుచుకోలేదు. దూర దేశాల నుంచి తెప్పించుకోవడం ఖరీదైన వ్యవహారం మాత్రమే కాదు, చాలా సమయం పట్టే ప్రక్రియ కూడా. 

ఇది ఆఫ్రికా దేశాలకి మాత్రమే పరిమితమైన సమస్య కాదు, ఆహారధాన్యాల దిగుమతుల మీదే పూర్తిగా ఆధార పడ్డ ఈజిప్టుది కూడా. కానైతే, ఆఫ్రికన్ దేశాల పేదరికం వాటిని త్వరగా కరువులోకి నెట్టేసింది. యుద్ధకాలంలోనే ప్రకృతి కూడా పగబట్టింది. ధరలు రెట్టింపయ్యాయి, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది. ఫలితంగా, ఆకలి కేకలు మొదలయ్యాయి. నిజానికి ధరల పెరుగుదల యుద్ధానికన్నా ముందే మొదలయ్యింది. కరోనా కారణంగా ధరల పెరుగుదల ఏ ఒక్క దేశానికో పరిమితం కాలేదు. అయితే, అటు ఈజిప్టు, ఇటు ఆఫ్రికన్ దేశాల్లో మాత్రం యుద్ధం కారణంగా పరిస్థితి పుండుమీద కారం జల్లినట్టైంది. ఇప్పుడు ప్రపంచమంతా 'గ్లోబల్ విలేజ్' కాబట్టి ఈ సమస్య మిగిలిన దేశాలకి విస్తరించడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. 

సముద్ర మార్గాలు మూసుకుపోవడం, భూమార్గాల ద్వారా సరుకు రవాణా ఖరీదైన వ్యవహారం కావడం, అన్నింటినీ మించి ఆహారధాన్యాలు యుద్ధంలో ఉన్న రెండు దేశాల సరిహద్దులు దాటి బయటికి వచ్చే మార్గాలు రోజురోజుకీ మూసుకుపోవడంతో కొద్ది నెలల్లోనే ఆహార ధాన్యాల కొరత తీవ్రమయ్యింది.  ఆహార ధాన్యాలు పండించే మిగిలిన దేశాలేవీ ఎగుమతి చేయగలిగే పరిస్థితుల్లో లేవు. స్థానిక అవసరాల మొదలు, రాజకీయ సమస్యల వరకూ కారణాలు అనేకం. ఉదాహరణగా భారత దేశాన్నే తీసుకుంటే, గోధుమలు ఎగుమతి చేస్తామని ప్రకటించి వెనువెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. కారణం, దిగుబడి తగ్గడం, పండిన పంట స్థానిక అవసరాలకి ఎంతవరకూ సరిపోతుందన్న సందేహం రావడం. మార్చి నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో ఈ ఏడు గోధుమ దిగుబడి దారుణంగా పడిపోయింది. 

కరువు అనేది ఓ భయంకరమైన విషయం. గోదావరి ఆనకట్ట కట్టక మునుపు సంభవించిన 'డొక్కల కరువు' గురించి చిన్నప్పుడు కథలు కథలుగా విన్నాం. క్షుద్భాధకి తాళలేక మట్టిలో నీళ్లు కలుపుకు తిన్నవాళ్ళు, ఎవరైనా చనిపోగానే వాళ్ళ దగ్గర ఉన్న కొద్దిపాటి తిండికోసమూ మిగిలిన వాళ్ళు ప్రాణాలకి తెగించి కొట్టుకోడం లాంటివి విన్నప్పుడు ఒళ్ళు జలదరించేది. అవన్నీ సాంకేతికత అభివృద్ధి చెందని నాటి పరిస్థితులు. గడిచిన ముప్ఫయ్యేళ్లలో సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా పెరిగింది. ఎన్నెన్నో సమస్యల్ని కంప్యూటర్లు చిటికెలో పరిష్కరించేస్తున్నాయి. వాతావరణం ఎలా ఉండబోతోందో ముందుగా తెలుస్తోంది. వరదలు, తుపానుల గురించి ముందస్తు అంచనా ఎన్నో ప్రాణాలనీ, పంటల్నీ కాపాడుతోంది. ఇప్పుడు చుట్టుముడుతున్న కరువుని ఎదిరించాలంటే యుద్ధం ఆగాలి. ఆపని చేయగలిగేది టెక్నాలజీ కాదు, దాన్ని వాడే మనుషులే.

7 కామెంట్‌లు:

  1. బలహీనుడు కనపడితే బలవంతుడికి ఏదోవిధంగా ఆడుకోవాలనిపిస్తుంది. దానికి ఏవో సాకులు చెబుతారు. వాటిని నమ్మే వాళ్ళు కూడా ఉంటారు. చివరికి నష్టపోయేది ప్రజలు.

    రిప్లయితొలగించండి
  2. దీనినే తెలుగులో "కబ్జా" అంటారని అనుకుంటా

    రిప్లయితొలగించండి
  3. రావు గారు,
    దేశాన్ని బట్టి బలహీనుడు అని నిర్ధారించినట్లున్నారు. యుద్ధాలు మనుషులు చేసే పని. 5 గురు ఉన్నారని పాండవులను బలహీనులు అనుకున్నారు. బ్రహ్మానందం లాగా కమెడియన్ అనుకున్నారు. ఉక్రెయిన్ దేశాన్ని ఒక మొండివాడు రాజ్యమేలుతున్నారు.

    రిప్లయితొలగించండి
  4. మిలెనియం దాటాక యుద్ధాలు ఇంకా ఉంటాయా అని అనవసరంగా రిలాక్స్ అయిపోయాం అందరం. ఈ యుద్ధం మానవత ఇంకా ఎదగలేదు అనడానికి నిదర్శనం అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  5. నీహారిక గారూ : ఆర్ధికబలం అంగబలంలో రష్యాతో ఉక్రెయిన్ ని పోల్చలేం. తన ఇల్లు తన భూమి ఇంకొకకడు "కబ్జా" చేద్దామనుకుంటే బలహీనుడు కూడా బలవంతుడై పోరాడతాడు.

    రిప్లయితొలగించండి