బుధవారం, ఆగస్టు 29, 2012

వర్ధని

"తెలుగు నవల పట్నాల్లో కాపురం పెట్టి పల్లెల్ని మరిచిపోయిందన్న అభిప్రాయానికి ఈ నవల ఒక మినహాయింపు. రచయిత్రికి పల్లెలలోను, మనుషులలోను గల అత్యంత ఆత్మీయతా బంధాలు అడుగడుగునా స్ఫురిస్తాయి. ఏడేళ్ళ అమ్మాయి వర్ధనిని ముఖ్య పాత్రగా తీసుకుని నవల రాసి మెప్పించడం జీవితం పట్ల ఎంతో శ్రద్ధ, ఆరాధన ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం" ...మెచ్చుకుని ముందుమాట రాసినవారు, తెలుగు కథకి కొత్త వెలుగులద్దిన 'దామల్ చెరువు అయ్యోరు' మధురాంతకం రాజారాం.

'రేగడి విత్తులు' తో తెలుగు సాహితీలోకాన్ని ఆకర్షించి, 'దృశ్యాదృశ్యం' అనే నిరుపమాన నవలని అందించిన రచయిత్రి చంద్రలత తొలి నవల 'వర్ధని.' చతుర మాసపత్రిక మే, 2006, సంచికలో ప్రచురితమైన ఈ నవలకి నేపధ్యంగా, తెలుగు సాహిత్యంలో అతి తక్కువగా ఉపయోగించుకున్న 'చైల్డ్ సైకాలజీ' ని నేపధ్యంగా తీసుకున్నారు రచయిత్రి. ఓ ఏడేళ్ళ అమ్మాయి మనస్తత్వాన్ని పాఠకుల కళ్ళకి కట్టడం మాత్రమే కాదు, పిల్లల పెంపకం అన్నది ఎంత శ్రద్ధగా నిర్వహించాల్సిన బాధ్యతో కొంచం గట్టిగానే చెప్పారు.

మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ పల్లెటూళ్ళో వ్యవసాయం చేసుకునే ఉమ్మడి కుటుంబమే 'వర్ధని' నవలలో కథాస్థలం. ఇద్దరు అన్నదమ్ములు కోటయ్య, ముకుందం. వీరిలో ముకుందం పెద్ద కూతురు వర్ధని. ఆ ఇంట్లో తొలి ఆడపిల్ల. అన్నదమ్ములిద్దరూ ఆ అమ్మాయికి తమ తల్లి వర్ధనమ్మ పేరు పెట్టుకోడమే కాదు, ఎంతో గారాబంగా చూసుకుంటారు కూడా. తల్లిదండ్రుల దగ్గర కన్నా, పెదనాన్న, పెద్దమ్మల దగ్గర చేరిక ఎక్కువ వర్ధనికి. వాళ్ళు చేసే ముద్దు కారణంగా తనని తను ఓ యువరాణీ లాగా భావించుకుంటూ, అలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ ఊళ్ళో, ఆ ఇంట్లో ఆమె ఆడింది ఆట. చెల్లెలు వాణీని కూడా కనీసం మనిషిలాగా గుర్తించదు వర్ధని.


ఉన్నట్టుండి ఒకరోజు తన భార్యాపిల్లలతో కలిసి పట్నం బయలుదేరి అక్కడ కాపురం పెడతాడు ముకుందం. ఈ మార్పు వర్ధని ఆసలు ఊహించనిది, భరించలేనిది. తల్లి, తండ్రి, చెల్లెలితో ఇమడలేని వర్ధనిలో మిగిలి ఉన్న ఆశ ఒక్కటే. ఎప్పటికైనా తను పెద్దమ్మ, పెదనాన్నల దగ్గరికి వెళ్లిపోవచ్చని. పండుగ సెలవులకి ఊరికి వెళ్ళిన వర్ధనికి శరాఘాతం తగులుతుంది. పెద్దమ్మ, పెదనాన్న ఆ ఇంట్లోకి కొత్తగా వచ్చిన తమ మనవరాలిని ముద్దాడుతూ కనిపిస్తారు. ఇన్నాళ్ళూ తనదైన స్థానాన్ని, ఆ పసిపిల్ల దక్కించుకోడాన్ని ఏమాత్రం భరించలేదు వర్ధని. ఆ పసిపిల్లమీద హత్యాప్రయత్నం చేసేంత ఉన్మాదంలోకి వెళ్లి పోతుందామె.

నవల చదువుతుంటే, ఎక్కడా కూడా ఇది రచయిత్రికి తొలి నవల అన్న భావన కలగదు. ముగింపులో వచ్చే సంభాషణల్లో తొంగిచూసే కొద్దిపాటి నాటకీయతని మినహాయించుకుంటే, మిగిలిన కథనంతటినీ అత్యంత సహజంగా కళ్ళకి కట్టారు చంద్రలత. పల్లెవాతావరణం, రైతు కుటుంబాలు, అక్కడి పద్ధతులు, ఉమ్మడి కుటుంబం...వీటన్నింటి మధ్యకీ పాఠకులని తెసుకెళ్ళిపోయారు. నిజానికి ఇదే కేన్వాసుని మరికొంచం విస్తరించి, 'రేగడి విత్తులు' నవలలో ఉపయోగించారు. "ఒక సాధారణమైన విషయాన్ని అసాధారణంగా చెప్పగలిగిన రచయిత్రి, మంచి ఇతివృత్తాన్ని స్వీకరించి - ఆద్యంతం ఉత్కంఠ కొనసాగేటట్లుగా ఒక సీరియల్ నవల రాయవచ్చు," అన్న మధురాంతకం వారి మాటలు స్ఫూర్తి కలిగించి ఉండొచ్చు, బహుశా.

కథలో పాఠకులని ఎంతగా లీనం చేస్తారంటే, వర్ధని తప్పు చేస్తున్నప్పుడల్లా ఆమెకి నచ్చచెప్పాలనీ, ఇంట్లో పెద్దవాళ్ళని మందలించాలనీ అనిపిస్తుంది పాఠకులకి. ఓ ఏడేళ్ళ పిల్ల ఆలోచనలనీ, భయాలనీ, పెరిగిన వాతావరణం కారణంగా ఆమెలో పోటీపడే సుపీరియారిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లనీ అత్యంత సహజత్వంతో చిత్రించిన తీరు ముచ్చట గొలుపుతుంది. అప్పటికే 'రేగడివిత్తులు' 'దృశ్యాదృశ్యం' చదివేసి ఉండడంతో, ఈనవల పూర్తి చేసిన వెంటనే నాకు "పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది" అన్న నానుడి గుర్తొచ్చింది. ('వర్ధని,' పేజీలు 118, వెల రూ.60, ప్రభవ పబ్లికేషన్స్ ప్రచురణ, అన్ని పుస్తకాల షాపులూ)

మంగళవారం, ఆగస్టు 28, 2012

మంగళసూత్రం

కిక్కిరిసిన కళ్యాణ మండపంలో, జూనియర్ ఆర్టిస్టుల సాక్షిగా పెళ్ళికొడుకు హీరోయిన్ మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. ఇంతలో ఉన్నట్టుండి "ఆపండీ పెళ్ళి" అని వినిపిస్తుంది, పెళ్ళికొడుకుతో సహా అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరుగుతారు..ఇలాంటివి కొన్ని వందల సన్నివేశాలు.. హీరోయిన్ మెడలో విలన్ బలవంతంగా తాళి కట్టేయబోతూ ఉంటే, హీరో అదాటున వచ్చి విలన్ చేతిమీద కొట్టి హీరోయిన్ని రక్షించేస్తాడు...ఈ తరహా సీన్లు బోలెడన్ని.

నాయికని అల్లరి పెట్టబోతున్న విలన్ గుంపుని నాయకుడు చెదరగొడుతుంటే, అమ్మవారి విగ్రహం మెడలో మంగళసూత్రం నాయకుడి చేతిమీదుగా నాయిక మెడలో పడుతుంది. అక్కడినుంచీ, దైవసాక్షిగా అతనే ఆమె భర్త...ఇలాంటివీ అనేకానేక సన్నివేశాలు. మన తెలుగు సినిమాలు మంగళసూత్రానికి ఇచ్చిన ప్రాముఖ్యత ఇది. అతగాడు ఆమె మెడలో తాళి కడితే, ఆమె ఇక అతని పాదాల చెంత చోటు వెతుక్కోవలసిందే. శేష జీవితాన్ని అతని సేవలో తరియింప జేయాల్సిందే.

క్లైమాక్స్ కన్నా ముందు తెరమీద పెళ్ళి కనుక జరుగుతున్నట్టాయనా, తాళి సన్నివేశంలో "ఆగండి" అనే డవిలాగు వినడానికి సిద్ధ పడిపోతాం మనం. ఇంతకీ సినిమాలకి సంబంధించి మంగళ సూత్రం అంటే కథని మలుపు తిప్పే ఒకానొక వస్తువు. కానైతే, ఇదంతా నిన్న మొన్నటి విషయం. ఇప్పటి సినిమాల్లో పెళ్ళి సన్నివేశాలు ఎలాగైతే పెద్దగా ఉండడం లేదో, కథలు కూడా అలాగే మంగళసూత్రం చుట్టూ తిరగడం లేదు. మన సిని రచయితలకీ, దర్శకులకీ 'మంగళసూత్రం' అవుట్ డేటెడ్ సబ్జక్ట్ అయిపోయినట్టుంది.

"ఇదివరకు ఆడపిల్లల మెడ చూస్తే పెళ్లయ్యిందో, కాలేదో తెలిసేది. ఇప్పుడా వీలు కుదరడం లేదు," ఈమధ్యన కొంచం తరచూ వినిపిస్తున్న మాట ఇది. ఓ పెద్దాయన ఇదే మాట అంటే ఉండబట్టలేక "ఇప్పటి వాళ్ళవి చంద్రమతీ మాంగల్యాలు అయి ఉంటాయి లెండి," అని గొణిగాను. నా ఉద్దేశం అర్ధమయ్యో, కాకో ఆయన ఓ నవ్వు నవ్వారు. చంద్రమతి మాంగల్యం కేవలం హరిశ్చంద్రుడికి మాత్రమే కనిపించేది కావడం, ఈ కారణానికే కాటికాపరి వేషంలో ఉన్న హరిశ్చంద్రుడిని చంద్రమతి గుర్తించ గలగడం తెలిసిన కథే కదా.

వారం తిరక్కుండానే, మిత్రులొకరితో 'మంగళసూత్రం' అనే విషయం మీద కొంచం సుదీర్ఘమైన సంభాషణ జరిగింది. మంగళసూత్రాన్ని గౌరవించడానికీ, అది కట్టిన వాడిని గౌరవించడానికీ పెద్దగా సంబంధం లేదన్నది అంతిమంగా తేలిన విషయం. కొంచం తీరిక దొరికి, మంగళసూత్రాన్ని గురించి 'తెవికీ' ఏం చెబుతోందా అని వెతికాను. "వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్ధంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో 'మంగళ' అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు కలవు. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు కలవు."

మరికాస్త ముందుకు వెడితే, "మంగళ సూత్రము భార్యా భర్తల శాశ్వత అనుబంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడులనుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం.శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రము ఉన్నంత వరకూ భర్తకు ఆయుషు ఉంటుందని హిందువులు నమ్ముతారు" అని కనిపించింది. 'వైవాహిక జీవితంలోని సమస్త కీడులని తొలగిస్తుంది' అని భావం కావొచ్చు. వెనకటి తరాల్లో, ఈ మంగళ సూత్రాన్ని గురించి చాలా పట్టింపులే ఉండేవి.

కాలంతో పాటు మార్పు సహజం. నమ్మకాల్లో మార్పు రావడం మరింత సహజం. కాబట్టి, మంగళసూత్రాన్ని కేవలం ఓ అలంకారంగా భావించడాన్ని తప్పు పట్టలేం. ఇంకా చెప్పాలంటే ఇది పూర్తిగా వ్యక్తిగత విషయం. ధరించాలా, వద్దా అన్నది వారి వారి ఇష్టాయిష్టాల మీద ఆధార పడి ఉంటుంది. పెళ్లికి కావాల్సింది మొదట మనసు, తర్వాతే మంగళసూత్రం. నిజానికి మంగళసూత్రం లేకుండా పెళ్ళి చేసుకునే పద్ధతులు చాలానే ఉన్నాయి. కానీ, మనసు లేకుండా జరిగే మనువుల్ని కేవలం మాంగల్యం నిలబెట్టగలదా అన్నది బహు చిక్కు ప్రశ్న. "మాకు పుట్టిన ఇద్దరు పిల్లలూ  మా పెళ్లికి సాక్ష్యం. వేరే రుజువులు, సాక్ష్యాలు అవసరమా?" అన్న స్నేహితురాలి ప్రశ్న గుర్తొస్తోంది, ఇది రాస్తుంటే.

సోమవారం, ఆగస్టు 27, 2012

సర్వసంభవామ్

'నాహం కర్తా, హరిః కర్తా' ఇది పీవీఆర్కే ప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానం కార్య నిర్వహణాధికారిగా పనిచేసిన కాలంలో తనకెదురైన వింత అనుభవాల సమాహారానికి ఇవ్వాలనుకున్న శీర్షిక. ఈ శీర్షికకి అర్ధం 'నేను కర్తని కాదు..చేసేది, చేయించేది శ్రీహరి మాత్రమే.' అయితే, 'స్వాతి' సపరివార పత్రికలో ఈ కథనాలని వారం వారం ప్రచురించిన ఆ పత్రిక ఎడిటర్, శీర్షికని 'సర్వసంభవామ్' గా మార్చారు. ప్రసాద్ మరోమారు చిరునవ్వు నవ్వుకుని ఉంటారు, బహుశా. తర్వాతి కాలంలో ఆ అనుభవాలకి పుస్తక రూపం ఇచ్చినప్పుడు, తను మనసుపడ్డ శీర్షికని ఉపశీర్షికగా ఉంచారయన.

పత్రి వెంకట రామకృష్ణ (పీవీఆర్కే) ప్రసాద్ పేరు వినగానే, నాకు మొదట గుర్తొచ్చే రచన 'అసలేం జరిగిందంటే.' ఆయన రచనల్లో నేను చదివిన తొలి రచన అది. చెప్పే విషయంతో పాటు, చెప్పిన విధానం కూడా నచ్చడంతో కేవలం రచయిత పేరు చూసి తీసుకున్న పుస్తకం ఈ 'సర్వసంభవామ్.' ఊహించినట్టుగానే నన్ను ఏమాత్రమూ నిరాశ పరచలేదు. కలియుగ దైవం కొలువై ఉన్న ప్రదేశం అని మాత్రమే కాక, మరికొన్ని వ్యక్తిగత కారణాలకి కూడా తిరుమల-తిరుపతి అంటే ఇష్టం నాకు. ప్రసాద్ రచనా శైలితో పాటు, నాకున్న ఈ ఇష్టం కూడా పేజీలు చకచకా సాగడానికి కారణమయ్యింది.

జీవితంలో మనకి ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని తార్కిక కోణం నుంచి చూడడం వీలుకాదు. హేతువుకీ, తర్కానికీ అందనివెన్నో జరుగుతూ ఉంటాయి. ఇలాంటి అనుభవాలే, ప్రపంచంలో అత్యంత సంపన్నమైన ఆలయాల్లో ఒకదానికి కార్య నిర్వహణాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి జీవితంలో జరిగితే వాటి తాలూకు ఫలితాలు ఎలా ఉంటాయన్నదే 'సర్వసంభవామ్' పుస్తకం. అంతే కాదు, దేవస్థానానికి సంబంధించిన ముఖ్యమైన పదవిలో ఓ దైవ భక్తుడు ఉంటే, దానివల్ల భక్తులకీ, దేవస్థానానికీ ఎటువంటి ప్రయోజనం ఉంటుందన్నది కూడా చెబుతుందీ రచన.


తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం ఇవాళ మనం చూస్తున్న రూపంలో, అనుభవిస్తున్న సౌకర్యాలతో ఉండడం వెనుక ఉన్న అనేకమందిలో ప్రసాద్ ఒకరు. 'మాస్టర్ ప్లాన్' అమలు చేయడం మొదలుపెట్టిన తొలి అధికారి ఆయన. ఆ సందర్భంలో ఎన్నో ఒత్తిడులు ఎదురైనా, తనని ముందుకు నడిపిన శక్తి శ్రీనివాసుడే అంటారాయన. మొత్తం ముప్ఫై అధ్యాయాలున్న ఈ పుస్తకంలో ప్రతి అధ్యాయమూ పాఠకులని ఆశ్చర్యంలో ముంచెత్తేదే.అసలు ఒక వ్యక్తి జీవితంలో ఇన్ని విచిత్రాలు జరిగే అవకాశం ఉందా అన్న ఆశ్చర్యం ఒక్కసారన్నా కలగక మానదు.

తాళ్ళపాక అన్నమాచార్య కీర్తనలని పరిష్కరించిన రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ ను, ఆయన జీవితపు చివరి క్షణాల్లో 'దేవస్థానం ఆస్థాన విద్వాంసుడి' గౌరవంతో సత్కరించడం, ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఎమ్మెస్ సుబ్బులక్ష్మి చేత (నమ్మలేని నిజం ఇది) అన్నమయ్య కీర్తనలు పాడించి, అటు ఆ గాయనికి సాయం చేయడంతో పాటు కీర్తనలని ప్రాచుర్యంలోకి తీసుకురావడం లాంటి సంఘటనలు ఎక్కువమందికి తెలిసే అవకాశం ఉండకపోయేది, ఈ పుస్తకం రానట్టైతే. కుటుంబమంతా ఏళ్ళ తరబడి ఒంటిపూట ఉపవాసాలు చేసి, దాచిన సొమ్ముతో స్వామికి బంగారు హారం చేయించి బహూకరించిన భక్తుల గురించి మాత్రమే కాదు, ఎవరో చెప్పినట్టుగా సరైన సమయానికి నవరత్నాలని కానుకగా తెచ్చి ఓ ముఖ్యమైన 'సేవ' ఆగిపోకుండా సాయపడ్డ భక్తుడి గురించీ ఇంత వివరంగా మరొకరు చెప్పలేరు.

ఒత్తిళ్ళు అనేవి ఏ ఉద్యోగికైనా తప్పవు. ప్రభుత్వోగికి మరీ ఎక్కువ. పైగా, తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ప్రతిష్టాత్మకమైన చోట ఉన్నతోద్యోగం చేసే వారికి ఉండే ఒత్తిళ్ళు ఊహకి కూడా అందవు. ముఖ్యమంత్రి, మంత్రులు, చీఫ్ సెక్రటరీ, ప్రతిపక్షాలు..ఇలా అనేక దిక్కులనుంచి ఎదురయ్యే ఒత్తిడులని సమర్ధవంతంగా ఎదుర్కొని అవుననిపించుకోడం కత్తిమీద సామే. ఆ సాముని సక్రమగా చేయడం వెనుక 'స్వామి' కృప ఉందంటారు ప్రసాద్. ప్రత్యేక కళ్యాణోత్సవం మొదలు పెట్టడం మొదలు, పద్మావతి అతిధి గృహం నిర్మించడం వరకూ ప్రతి పనిలోనూ, ప్రతి దశలోనూ ఎదురైన ఒత్తిడులని వివరంగా అక్షరబద్ధం చేశారాయన.

శ్రీవెంకటేశ్వర స్వామికి వజ్రాల కిరీటం చేయించే మిష మీద, స్వామికి చెందిన వజ్రాలని ప్రసాద్ దొంగిలించారన్నది ఆయనపై వచ్చిన అతిపెద్ద ఆరోపణ. ఈ ఆరోపణని నేరు గా విచారించారు, అప్పుడే ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న ఎన్టీ రామారావు. వజ్రాలతో పాటు, తనపై మరో రెండు ఆరోపణలకి సంబంధించి వివరంగా రాసిన కథనం 'ఎన్టీఆర్ దృష్టిలో మూడు నేరాలు.' కేవలం వృత్తిగత విషయాలే కాకుండా, వ్యక్తిగత అంశాలకీ ఈ పుస్తకంలో చోటిచ్చారు ప్రసాద్. తన బాల్యం, నేపధ్యం, భార్యాపిల్లలకి సంబంధిచిన విషయాలని సందర్భానుసారంగా ప్రస్తావించారు. తిరుమల పై భక్తీ, నమ్మకం ఉన్నవాళ్ళందరినీ ఆకట్టుకునే రచన ఇది. (ఎమెస్కో ప్రచురణ, పేజీలు 271, వెల రూ.100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

ఆదివారం, ఆగస్టు 26, 2012

'కన్యాశుల్కం' కబుర్లు...

తెలుగు నాట సాంఘిక నాటకం అనగానే మొదట గుర్తొచ్చేది 'కన్యాశుల్కం.' గురజాడ అప్పారావు పంతులు గారి అపూర్వ సృష్టి. ఏళ్ళు గడుస్తున్నా కన్యాశుల్కాన్ని తలదన్నే నాటకం తెలుగునాట రాకపోవడం అన్నది, ఈనాటకం గొప్పదనమా లేక తర్వాతి తరాల్లోని రచయితల కృషిలో లోపమా అన్నది ఇప్పటికీ శేష ప్రశ్నే. 'కన్యాశుల్కం' సృష్టికర్త గురజాడ నూట యాభయ్యో జయంతి సందర్భంగా, ఈనాటకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శింప బడుతోంది, ఇప్పటి ప్రేక్షకులకి తగ్గట్టుగా క్లుప్తీకరింపబడి. హైదరాబాద్ కి చెందిన 'రసరంజని' చేస్తున్న ప్రయత్నం ఇది. 

'కన్యాశుల్కం' పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేది గిరీశం. ఆ వెనుక మధురవాణి, రామప్పంతులూ, అగ్నిహోత్రావధాన్లూ, లుబ్దావధాన్లూ, ఇంకా మిగిలిన వాళ్ళందరూను. 'డామిట్! కథ అడ్డం తిరిగింది' (గిరీశం), 'తాంబోళం ఇచ్చేశాను, తన్నుకు చావండి' (అగ్నిహోత్రావధాన్లు), 'విద్య వంటి వస్తువు లేదు' (రామప్పంతులు), 'బుద్ధికి అసాధ్యం ఉందేమో కానీ, డబ్బుకి అసాధ్యం లేదు' (మధురవాణి)...ఇలా ఎన్నో సంభాషణలు ఇప్పటికీ జనం నాలుకమీద ఆడుతూ ఉంటాయి. బహుశా, ఇదే ఈ నాటకం విజయ రహస్యమేమో కూడా.

మొదట్లో ఇది ఎనిమిది గంటల నాటకం. తర్వాత, గురజాడే స్వయంగా పూనుకుని కొంత సంక్షిప్తం చేశారు. అయినప్పటికీ ప్రదర్శన నిడివి ఐదారు గంటలు. ఇప్పటివరకూ ఆరు తరాల నటులు వేలాది ప్రదర్శనలు ఇచ్చిన నాటకం ఇది. 'కన్యాశుల్కం' నాటకంలో వేషం వేసిన ప్రముఖుల జాబితా చాలా పెద్దది. తెలుగు రంగస్థలం అనగానే మొదట గుర్తొచ్చే స్థానం నరసింహారావు మధురవాణిగా అలరించారు. ఇక, 'కవిసామ్రాట్' విశ్వనాథ సత్యనారాయణ ఎంతో మనసుపడి వేసిన వేషం రామప్పంతులు. అదికూడా, యాదృచ్చికంగా దొరికిన అవకాశం.


ఇప్పటి రోజుల్లో ఐదారు గంటల నాటకం అంటే ఆడే వాళ్ళకే కాదు, చూసే వాళ్లకి కూడా ఓపిక చాలని వ్యవహారం. కాలక్రమేణా కుదింపులు జరిగీ, జరిగీ ప్రస్తుతం రెండు గంటల నిడివిలో ప్రదర్శింప బడుతోంది. గిరీశం, బుచ్చమ్మని లేవదీసుకు పోయాడన్నసంగతి తెలిసి, ఆగ్రహంతో ఊగిపోయిన అగ్నిహోత్రావధాన్లు వెంకటేశాన్ని దండించడంతో అయిపోతుంది ప్రదర్శన. మధురవాణి ఇంట్లో పోలిశెట్టి బృందం పేకాట, కంటె కోసం మధురవాణి చేసే హంగామా, సారాయి దుకాణం, బైరాగి తత్వాలు, సౌజన్యారావు పంతుల్ని మధురవాణి కలుసుకోవడం...ఇవన్నీ పుస్తకంలో చదువుకోవాల్సిందే.

'యద్భావం తద్భవతి' అన్నది 'కన్యాశుల్కం' నాటకానికి బహుచక్కగా వర్తిస్తుంది. మనం ఏం చూడాలనుకుంటే అదే దొరుకుంతుంది ఈ నాటకంలో. "గిరీశం ఇచ్చిన లెక్చరు విన్న బండివాడు అడుగుతాడూ, 'సొరాజ్యం వస్తే మా ఊరి కనిస్టీబుకి బదిలీ అవుతుందా బాబయ్యా?'అని. అంటే, పోలీసుల హింస ఈనాటిది కాదు. కన్యాశుల్కం రాసిన రోజులనుంచీ ఉందని తెలుసుకోవాలి మనం," మానవహక్కుల గురించి ఉపన్యాసం ఇస్తూ, ప్రొఫెసర్ హరగోపాల్ వెలిబుచ్చిన అభిప్రాయమిది. ఇక, తెలుగు భాషోద్యమంలో చురుగ్గా ఉన్న ఏబీకే ప్రసాద్ ఓ సందర్భంలో ఏమన్నారంటే :"ఏదీ ఒక పర్యాయం అబ్బీ మీరూ ఇంగిలీషులో మాట్లాడండి నాయనా' అని గిరీశాన్ని అడుగుతుంది వెంకమ్మ. చదువురాని ఆ పల్లెటూరి గృహిణికి కూడా ఇంగ్లిష్ మీద ఎంత మోజు ఉందో అర్ధమవుతుంది!" 

రంగస్థల, సినీ నటుడూ, రచయితా గొల్లపూడి మారుతి రావుకి 'కన్యాశుల్కం' నాటకం అంటే మహా ఇష్టం. ఆమధ్య మాటీవీ కోసం తీసిన సీరియల్లో గిరీశం వేషం వేశారు కూడా. ఈ నాటకంలో మొట్టమొదటి డైలాగు 'సాయంకాలమైంది' ని తన నవలకి శీర్షికగా ఉంచారు గొల్లపూడి. సావిత్రీ, రామారావూ నటించిన 'కన్యాశుల్కం' సినిమా (హీరో పేరు ముందు రాయాలనే సంప్రదాయానికి మినహాయింపున్నకొన్ని సినిమాల్లో ఇదీ ఒకటి), గురజాడ వారి రచనని పెద్ద ఎత్తున తెలుగు వాళ్లకి దగ్గర చేసింది. అయితే, ఈ సినిమా కారణంగా "సినిమా చూసేశాం కదా, ఇక నాటకం చదవడానికి ఏముంది?" అనే ధోరణి ప్రబలడం విషాదం. దూరదర్శన్ లో జేవీ రమణమూర్తి 'గిరీశం,' శృతి 'మధురవాణి'గా పదమూడు వారాల సీరియల్ ప్రసారమయ్యింది, చాన్నాళ్ళ క్రితం.

తెలుగునాట మధురవాణి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పురాణం సుబ్రహ్మణ్య శర్మ అనేకానేకమంది ప్రముఖుల్ని మధురవాణి చేత ఊహాత్మక ఇంటర్యూలు చేయిస్తే, పెన్నేపల్లి గోపాలకృష్ణ ఏకంగా 'మధురవాణి ఊహాత్మక ఆత్మకథ' రాసేశారు. "ఏముందీ కన్యాశుల్కం? కొన్ని ప్రాంతాల్లో, కొన్ని కులాలకి సంబంధించిన విషయం.. ఇప్పుడు ఏమాత్రం సమకాలీనం కాదు. అయినా ఊరికే నెత్తిన పెట్టుకుంటున్నారు," అన్నది 'కన్యాశుల్కం' మీద వినిపించే ప్రధాన విమర్శ. జనాదరణ లేని ఏ కళారూపమూ సుదీర్ఘ కాలం మనజాలదని, ఈ విమర్శకులకి గుర్తు చేయాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఇది కొత్త విషయం ఏమీ కాదు కదా. (ఫోటో కర్టెసీ: The Hindu)

శనివారం, ఆగస్టు 18, 2012

సామి కుంబుడు

పొరుగు రాష్ట్రాల్లో ఉన్న టీ ఎస్టేట్లకీ, తెలుగు పాఠకులకీ మధ్య అందమైన సాహితీ వారధులు, సి. రామచంద్ర రావు కథలు. గడిచిన అరవై ఏళ్ళ కాలంలో కేవలం తొమ్మిది కథలు మాత్రమే రాసి, 'వేలు పిళ్ళై' కథా సంకలనాన్ని మూడు దఫాలుగా వెలువరించిన రామచంద్ర రావు తన ఎనభై ఒకటో ఏట రాసిన తాజా కథ 'సామి కుంబుడు.' సుదీర్ఘ కాలంపాటు టీ ఎస్టేట్ లో ఉన్నతోద్యాగాలు చేసిన ఈ రచయిత రాసిన మెజారిటీ కథల్లో లాగానే, ఈ కథకీ నేపధ్యం టీ ఎస్టేటే.. ఇంకా చెప్పాలంటే, టీ ఎస్టేట్ యాజమాన్యానికీ-పనివాళ్ళకి మధ్యన తగువే ఈ కథ ఇతివృత్తం.

కథాస్థలం సీఫోర్త్ టీ ఎస్టేట్. ప్రతి ఐదేళ్లకీ ఓసారి టీ తోటల్లో తప్పక జరిపించాల్సిన ప్రూనింగ్, ఆ సంవత్సరం గూడలూరు మలై డివిజన్లో జరుగుతోంది. టీ చెట్లని నిర్ణీత ఎత్తుకి మించి పెరగనివ్వకూడదు. అలా పెరగనిస్తే లేత టీ ఆకులు దొరకవు, పైగా ఎత్తైన చెట్ల నుంచి ఆకు తెంపడం కూలీలకి కష్టమవుతుంది. వేసవి ముగిసి, వర్షాలు మొదలు కాగానే ప్రూనింగ్ పని మొదలు పెడతారు నిపుణులైన పనివాళ్ళు. ఎంతో బాధ్యతగా పని చేసే ప్రూనింగ్  పని వాళ్ళమీద పెద్దగా నిఘా కూడా ఉండదు.

కానైతే, ఆ సంవత్సరం ప్రూనింగ్ పనివాళ్ళు 'గోస్లో' మొదలు పెట్టారు. ప్రతిరోజూ, చేయాల్సిన పనిలో నాలుగో వంతు మాత్రమే చేస్తున్నారు. ఈ పరిణామం ఎస్టేట్ మేనేజర్ సంపత్ దొర ముందుగా ఊహించిందే. కానైతే, పరిణామం తాలూకు తీవ్రత మాత్రం అతను ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉంది. నిజానికి, యాజమాన్యానికీ ప్రూనింగ్ పని వాళ్ళకీ మధ్య వచ్చిన తగువు చాలా చిన్నది. పరిష్కారం కూడా సంపత్ చేతిలోనే ఉంది. కానీ, ఆ పరిష్కారం సంపత్ కి ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదు. ఓ మెట్టు దిగి రాడానికి అతను ఎంతమాత్రమూ సిద్ధంగా లేడు.

టీ తోటల్లో కులమతాలకీ, భాషా భేదాలకీ అతీతంగా పనివాళ్ళంతా కలిసి జరుపుకునే సంబరం ఒకటి ఉంది. దానిపేరు 'సామి కుంబుడు.' ప్రూనింగ్ పని మొదలు పెట్టే ముందు ప్రతి ఎస్టేట్ లోనూ జరుపుతారీ పండుగని. ఈ నిమిత్తం అయ్యే ఖర్చుని యాజమాన్యం ఆనందంగా భరిస్తుంది, 'సామి కుంబుడు బక్షిస్' రూపంలో. మొత్తంగా అయ్యే ఖర్చు ఓ రెండొందల రూపాయలు. ఆ సంవత్సరం ప్రూనింగుకి రెండు నెలల ముందే పని వాళ్ళంతా ఆందోళనలు చేసి, యాజమాన్యాలు వేతనాలు పెంచేలా చేసుకున్నారు.

ఇలా పెంచడం ఏమాత్రం ఇష్టం లేదు సంపత్ కి. అయినప్పటికీ ఇది అన్ని టీ ఎస్టేట్లకీ సంబంధించిన విషయం కాబట్టి కొత్త వేతన ఒప్పందాన్ని ఒప్పుకోక తప్పదు అతనికి. ఇందుకు ప్రతిగా, అగ్రిమెంట్ లో లేదనే కారణంతో 'సామి కుంబుడు బక్షిస్' నిలిపివేస్తాడు. యాజమాన్యం 'సామి కుంబుడు' జరపలేదు కాబట్టి, గోస్లో బాట పడతారు పనివాళ్ళు. ప్రూనింగ్ పని జరుగుతున్నట్టే ఉంటుంది, కానీ జరగదు. యజమానికీ పనివారికీ మధ్య నలిగిపోతాడు కండక్టర్ ఆరుళ్ దాస్. ఇంతకీ, పనివాళ్ళు తమ బక్షిస్ ని ఎలా సాధించుకోగలిగారు అన్నదే కథ ముగింపు.

టీ, కాఫీ ఎస్టేట్లు, తాజా గాలి పరిమళాలు, మలుపులు తిరిగే ఘాట్ రోడ్లు, 'దొరల' పట్ల విధేయంగా ఉంటూనే తమకి కావాల్సింది సాధించుకునే ఎస్టేట్ కూలీలు..ఇవన్నీ కాఫీ/టీ తోటలు నేపధ్యంగా రామచంద్రరావు గతంలో రాసిన కథలని గుర్తు చేస్తాయి. పాత్ర చిత్రణ, కథని నడిపే తీరు...ఈ రెండూ రచయిత బలాలు. ఒక్కో పాత్రనీ ఎంత నిశితంగా చిత్రిస్తారంటే, కథ చదువుతుంటే ఆ పాత్రలు కళ్ళముందు నిలబడాల్సిందే. పనివాడు బెల్లా మొదలు (నాకు 'గాళిదేవరు' కథలో మాంకూ గుర్తొచ్చాడు) సంపత్ స్నేహితుడు రాజారాం వరకూ ప్రతిఒక్కరూ పాఠకులకి తెలిసినవాళ్ళు అయిపోతారు.

కథని తాపీగా చెప్పడం రామచంద్రరావు గారి పధ్ధతి. ఎక్కడా ఉరుకులూ, పరుగులూ ఉండవు. అలాగని చదవలేకపోవడమూ ఉండదు. కథ మొదలు పెట్టామంటే ఏకబిగిన ముగించాల్సిందే. 'సామి కుంబుడు' క్లైమాక్స్ కి సంబంధించి ఒకటి రెండు చిన్నపాటి క్లూలని ఇచ్చినప్పటికీ, ఓ.హెన్రీ తరహా మెరుపు ముగింపునే ఇచ్చారు. కనీసం మూడు తరాల తెలుగు పాఠకులని తన కథల కోసం ఎదురుచూసేలా చేసిన రామచంద్ర రావు గారు కొంచం తరచుగా కథలు రాస్తే బాగుండును. (ఆదివారం ఆంధ్రజ్యోతి సెప్టెంబరు 4, 2011 సంచికలో 'సామి కుంబుడు' కథని చదవొచ్చు).

ఆదివారం, ఆగస్టు 12, 2012

మన బంగారం...

బంగారంతో భారతీయుల అనుబంధం ఈనాటిది కాదు. అనాదిగా భారతీయ సంస్కృతిలో బంగారం ఓ భాగం. ఇక్కడి స్త్రీపురుషులు ధరించినన్ని స్వర్ణాభరణాలని మరెక్కడా అలంకరణకి ఉపయోగించరనడంలో అతిశయోక్తి లేదు. కేవలం అలంకారంగా మాత్రమే కాదు, పసిడిని మదుపు గా చూడడమూ మనకి తాత ముత్తాలల కాలం నుంచీ ఉన్నదే. పిల్లలకివ్వడంకోసం వాళ్ళు దాచినవి భూమి, బంగారం. మరికొంచం స్పష్టంగా చెప్పాలంటే  భూమి మగ పిల్లలకి, బంగారం ఆడపిల్లలకీను.

ఇంతగా మన జీవన విధానంతో పెనవేసుకుపోయిన బంగారమే ఇప్పుడు మన ఆర్ధిక వ్యవస్థకి సవాలు విసురుతోంది అంటున్నారు నిపుణులు. రాన్రానూ బంగారం కొనుగోళ్ళు శరవేగంతో పెరుగుతున్నాయి భారతదేశంలో. దేశీయంగా ఉత్పత్తి బహుతక్కువగా ఉన్న ఈ లోహాన్ని విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నాం మనం. ఫలితంగా, పెద్దమొత్తంలో మన మారకద్రవ్యం బంగారం కింద ఖర్చైపోతోంది. దీని ప్రభావం, అత్యవసరమైన ఇతర దిగుమతులమీద పడక తప్పడం లేదు.

అధికారిక లెక్కలనే తీసుకుంటే, 2010-11 సంవత్సరంలో నలభై యూఎస్ బిలియన్ డాలర్లని బంగారం కొనుగోలు కోసం వెచ్చించాం మనం. తర్వాతి సంవత్సరానికి వచ్చేసరికి ఆ మొత్తం అరవై యూఎస్ బిలియన్ డాలర్లకి పెరిగింది, ఒక్కసారిగా. అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) అంచనాల ప్రకారం, 2015 సంవత్సరం నాటికి ఈ మొత్తం వంద యూఎస్ బిలియన్ డాలర్లు దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏ ఇతర దేశంలో పోల్చినా, భారతదేశంలో బంగారానికి డిమాండ్ శరవేగంగా పెరుగుతోంది.


ఈ డిమాండ్ కి కారణం కేవలం ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడం మాత్రమేనా? అర్దికవేత్తలు చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిణామం ఇది. దేశ ఆర్ధిక పరిస్థితిని గురించి అవగాహన ఉన్న వాళ్ళ దృష్టిలో ఇదో 'వేలం వెర్రి.' పసిడికి పెరుగుతున్న డిమాండ్ ద్రవ్య లోటుకి దారి తీస్తోందన్నది, ప్రముఖ ఆర్ధికవేత్త సి. రంగరాజన్ పరిశీలన. ఇక, అసోచామ్ అయితే మరో అడుగు ముందుకు వేసి బంగారం మీద దిగుమతి సుంకాలు మరింత పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ప్రజల కొనుగోలు శక్తి మొత్తం బంగారం మీదే కేంద్రీకృతం అయితే, మిగిలిన రంగాలు దెబ్బ తింటాయన్నది ఈ సంస్థ వాదన.

భారతీయ సమాజంలో మధ్యతరగతి కొనుగోలు శక్తి బాగా పెరగడం అన్నది గడిచిన పది-పదిహేనేళ్ళలో దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామం. నూతన ఆర్ధిక సంస్కరణలు, మరీ ముఖ్యంగా సాఫ్ట్ వేర్ బూం ఇందుకు బాగా దోహదం చేశాయి. పెట్టుబడి అనగానే మనకి మొదట గుర్తొచ్చేది బంగారమే. ఎందుకంటే, ఇది ఇవాళ కొత్తగా వచ్చినది కాదు, మన నరనరాల్లో జీర్ణించుకున్నది. 'తిరుగులేని పెట్టుబడి' అన్నది అందరి మాటానూ. అయితే, కేవలం ఈ ఒక్క కారణానికే మనం బంగారం కొంటున్నామా? దీనికి జవాబు 'కాదు' అనే వస్తుంది.

సంపాదనతో పాటు ప్రజల్లో అభద్రతా పెరిగింది, రేపటిరోజు గురించి చింత పెరిగింది. గడిచిన తరాలతో పోల్చుకుంటే, ఈ అభద్రత ప్రస్తుత తరంలో బాగా ఎక్కువ. కుప్ప కూలుతున్న ఆర్ధిక వ్యవస్థలు, ఫలితంగా దారుణంగా పడిపోతున్న షేర్ మార్కెట్లూ మన పెట్టుబడులకి సరైన ప్రత్యామ్నాయాన్ని చూపించలేక పోతున్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో ఏం జరిగినా, దాని ఫలితం మన షేర్ మార్కెట్ మీద పడుతుంది. ప్రపంచీకరణకి మరో పార్శ్వం ఇది. షేర్ మార్కెట్ ప్రభావం బ్యాంకుల వడ్డీరేట్ల మీద పడుతుంది. ఎలా చూసినా, నగదు, డాక్యుమెంట్ల రూపంలో ఉన్న మన పెట్టుబడి మీద ఏదోరకంగా ప్రభావం ఉండి  తీరుతుంది.

ఈ నేపధ్యంలో, 'బంగారం కోసం ఎగబడుతున్నారు' అంటూ భారతీయులని ఆడిపోసుకోవడం ఎంతవరకూ సబబు? ప్రత్యామ్నాయాలు లేని రోజులనుంచీ బంగారాన్ని నమ్ముతూ వచ్చారు మన ప్రజ. ఇప్పటికీ, బంగారానికి దీటైన ప్రత్యామ్నాయం లేకపోవడంతో అదే ధోరణి సాగిస్తున్నారు. ఒకవేళ, దేశ పరిస్థితులు దృష్టిలో పెట్టుకోకుండా బంగారం వెంట పడడం ప్రజల తప్పే అయితే, ఆ తప్పులో బంగారానికి ప్రత్యామ్నాయం చూపించలేని ప్రభుత్వానికీ వాటా ఉంటుంది. దేశ ఆర్ధిక పరిస్థితుల దృష్టిలో చూసినప్పుడు, ఈ ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టడం తక్షణావసరం.

శుక్రవారం, ఆగస్టు 10, 2012

కాలుతున్న పూలతోట

వేర్వేరు నేపధ్యాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకి ఉన్నట్టుండి మృత్యువు అనివార్యంగా వచ్చి పడబోతోందని తెలిసింది. వాళ్ళిద్దరూ కూడా కేవలం మూడు పదుల వయసు దాటినవాళ్ళు. భవిష్యత్తుని గురించి ఎన్నో ఆశలు, కలలు ఉన్నవాళ్ళు. అయితే, త్వరలోనే చనిపోబోతున్నామని తెలిసిన మరుక్షణం జీవితాన్ని గురించి ఇద్దరి దృక్పధాల్లోనూ ఊహించని మార్పు వచ్చేస్తుంది. పెద్ద చదువులు చదివి, బ్యాంక్ ఆఫీసరుగా ఉద్యోగం చేస్తున్న కుమార్ జీవితాన్ని అంతం చేసుకునే మార్గాల అన్వేషణ మొదలుపెడితే, నిరక్షరాస్యురాలైన నాగమణి మృత్యువుని ఎదుర్కొనే మార్గాలు వెతుకుతుంది.

యవ్వనాన్ని పూలతోటతో పోలుస్తారు మన రచయితలూ కవులూ. అయితే ఆ పూలతోట కాలిపోతోంది అంటున్నారు యువ రచయిత సలీం. అలా కాలుస్తున్న అగ్ని పేరు 'ఎయిడ్స్'. కుమార్, నాగమణి ఇద్దరూ జీవితాన్ని గురించి తమ దృక్పధాలు మార్చుకునేలా చేసింది కూడా ఈ వ్యాధే. ఇంతకీ వీళ్ళిద్దరూ సలీం నవలలో పాత్రలు. సాహిత్య అకాడెమీ బహుమతి (2009) అందుకున్న ఆ నవల పేరు 'కాలుతున్న పూలతోట.' 2005-06 లో సలీం ఈ నవల రాసేనాటికి దేశమంతా చర్చలో ఉన్న సమస్య 'ఎయిడ్స్.' ఈ ఇతివృత్తంతో తెలుగులో వచ్చిన తొలి నవల ఇది.

భార్య మాధురి, ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతున్న కుమార్, అనుకోకుండా కాలేజీ నాటి స్నేహితురాలు సుధీరని కలుస్తాడు. కాలేజీలో సుధీరకి ప్రేమలేఖలు అందించిన అనేకమందిలో కుమార్ కూడా ఒకడు. ఊహించని విధంగా కుమార్ కి దగ్గరవుతుంది సుధీర. ఓ కాన్ఫరెన్స్ కోసం మద్రాస్ వెళ్ళిన కుమార్ అక్కడే మూడు రోజులు గడుపుతాడు సుధీరతో. నెల తిరక్కుండానే, ఆమె నుంచి వర్తమానం వస్తుంది కుమార్ కి. పెళ్ళికి దూరంగా ఉంటూ, తనకి నచ్చిన అందరితోనూ స్వేచ్ఛా జీవితం గడిపిన సుధీరకి ఎయిడ్స్ సోకిందనీ, ఆమె మరణానికి దగ్గరగా ఉందనీ సారాంశం. కుమార్లో మృత్యుభయం మొదలవుతుంది.


ఒంగోలు పట్టణంలో ఓ బస్తీలో ఉండే లారీ క్లీనర్ కోటయ్య. భార్య నాగమణి, కొడుకు శ్రీను. ఉన్నట్టుండి అనారోగ్యం బారిన పడతాడు కోటయ్య. ధర్మాసుపత్రికి తీసుకెళ్ళిన నాగమణి కి తెలిసిన విషయం ఏమంటే, కోటయ్యకి ఎయిడ్స్ సోకి మరణానికి దగ్గరగా ఉన్నాడనీ, తనూ, కొడుకూ కూడా హెచ్ ఐ వీ పాజిటివ్ అనీ. ఉన్న సమస్య చాలదన్నట్టు, ఓ టీవీ ఛానల్ వాళ్ళు కోటయ్యని ఇంటర్యూ చేసి, కనీసం అతని ముఖం దాచకుండా టీవీలో చూపిస్తారు. దీనితో బస్తీ జనం నాగమణి కుటుంబాన్ని అక్షరాలా బయటికి గెంటేస్తారు. మరో బస్తీకి మారితే అక్కడ కూడా టీవీలో చూసిన వాళ్ళు గుర్తు పట్టేయడం, అప్పుడే కోటయ్య మరణించడంతో - భర్త శవంతో రోడ్డున పడుతుంది నాగమణి.

సుధీర ద్వారా అనకి ఎయిడ్స్ సోకిందేమో అన్న భయం నిలువనివ్వదు కుమార్ ని. అలాగని ఆ విషయాన్ని భార్యకి చెప్పలేదు, డాక్టర్ని కలవలేడు, మిత్రుల సలహా తీసుకోలేడు. తనకి ఎయిడ్స్ ఉందని నలుగురికీ తెలిస్తే ఇన్నాళ్ళూ భద్రం దాచుకుంటూ వస్తున్న పరువు ఒక్కసారిగా పోతుందనీ, భార్య బిడ్డలు ఎయిడ్స్ రోగి తాలూకు మనుషులుగా ముద్రపడి దుర్భర జీవితం గడపాల్సి వస్తుందనీ..ఇలా ఎన్నో భయాలు. భార్యా పిల్లలని కనీసం తాకలేడు, తన జబ్బు వారికి అంటుకుంటుందనే భయంతో. తన శరీరంలో ఏ చిన్న మార్పు జరిగినా అది ఎయిడ్స్ సంకేతమే అనుకుంటూ, తను చిత్రవధ అనుభవిస్తూ, చుట్టూ ఉన్నవాళ్ళకి నరకం చూపించడం మొదలుపెడతాడు కుమార్. 

కుమార్, నాగమణిల కథలు ఏ కంచికి చేరాయన్నది 'కాలుతున్న పూలతోట' ముగింపు. నిజానికి కథ, కథనాల మీద కన్నా ఎయిడ్స్ ని గురించి వివరంగా చెప్పడానికే మొగ్గు చూపారు సలీం. ఫలితంగా, అనేక ప్రచార మాధ్యమాల ద్వారా ఇప్పటికే తెలిసిన విషయాలనే మరోసారి చదవాలి పాఠకులు. సంభాషణల్లో నాటకీయత, విషయాన్ని వివరించే తీరు వ్యాసరూపంలో ఉండడం.. ఇవి భాష మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని చెప్పకనే చెప్పాయి. అయితే, ఎయిడ్స్ బాధితుల పట్ల సమాజం వైఖరి మారాల్సిఉందన్న విషయాన్ని గట్టిగా చెబుతుందీ నవల. 

"సాహిత్య అకాడెమీ బహుమతి అందుకున్న పిన్న వయస్కుడిని నేను. అంతే కాదు, నా మాతృ భాష ఉరుదూ. బహుమతి వచ్చింది తెలుగులో నేరాసిన నవలకి. మాతృ భాష కాని భాషలో చేసిన రచనకి ప్రతిష్టాత్మక బహుమతి అందుకున్న తొలి రచయితనీ నేనే," అన్న సలీం మాటలు చాలాసార్లే గుర్తొచ్చాయి, నవల చదువుతుండగా. (పేజీలు 232, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

బుధవారం, ఆగస్టు 08, 2012

ఇంజినీరింగ్ 'మిధ్య'

నూతన ఆర్ధిక సంస్కరణల అనంతరం దేశంలో వేగవంతంగా చోటుచేసుకున్న మార్పుల్లో ఒకటి, ఇంజినీరింగ్ విద్యావకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరగడం. అప్పటివరకూ ప్రభుత్వ కాలేజీల్లో, కొద్దిమంది విద్యార్ధులకి మాత్రమే అందుబాటులో ఉన్న ఇంజినీరింగ్ విద్య, ప్రైవేటు కాలేజీల రాకతో ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చింది. గ్లోబల్ మార్కెట్లో పెరుగుతున్న ఉద్యోగావకాశాల ఫలితంగా, విద్యార్దులకన్నా ఎక్కువగా వారి తల్లిదండ్రులు తమ పిల్లలని ఇంజనీరింగ్ చదివించడానికి ఉత్సాహ పడుతున్నారు.

ప్రవేశం సులభతరం కావడం, మెడిసిన్ తో పోల్చి చూసినప్పుడు ఖర్చు బాగా తక్కువ కావడం, చదువు పూర్తవ్వక మునుపే ఊరించే ఉద్యోగావకాశాల పుణ్యమా అని ఏటా ఈ కోర్సుకి డిమాండ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఫలితంగా, కూతవేటు దూరంలోనే ఇంజినీరింగ్ కాలేజీలు. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్యే ఏడు వందల పైచిలుకు. పొరుగు రాష్ట్రాల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీలేదు.

అయితే రాన్రానూ ఇంజనీరింగ్ వాళ్లకి వెంటనే 'కేంపస్' (కేంపస్ సెలక్షన్స్) రావడం లేదన్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ ఒడిదుడుకులతో పాటుగా, ఇంజనీరింగ్ విద్యలో క్షీణిస్తున్న నాణ్యతని కూడా ఇందుకు కారణంగా చెబుతున్నారు నిపుణులు. 'మళయాళ మనోరమ' గ్రూప్ నుంచి వచ్చే 'ది వీక్' పత్రిక తాజా సంచికలో (జూలై 29) ఇంజనీరింగ్ విద్యపై వచ్చిన ఓ కథనం ఆసక్తికరంగా అనిపించింది. ఆ పత్రిక, ఒక సర్వే సంస్థతో కలిసి పదమూడు రాష్ట్రాల్లో 198 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న ముప్ఫై నాలుగువేల మందిని సర్వే చేసి రిపోర్టు ప్రచురించింది.

సదరు సర్వే ప్రకారం, మన ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో కేవలం పన్నెండు శాతం మంది మాత్రమే వెంటనే ఉద్యోగంలో చేరేందుకు అర్హులు. మరో యాభై రెండు శాతం మంది శిక్షణ తర్వాత ఉద్యోగం చేయగలుగుతారు. ఇక, మిగిలిన ముప్ఫై ఆరు శాతం మందీ కనీసం శిక్షణకి కూడా అర్హులు కారు! కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు, అనలిటికల్ అబిలిటీ, రీజనింగ్ తదితరాల్లోనూ బాగా వెనుకబడి ఉన్నారు మన విద్యార్ధులు. కేవలం పెట్టుబడి, రాజకీయ పలుకుబడీ ఉంటే చాలు, ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభించేయ గలగడం, ఈ కాలేజీలపై నియంత్రణ లేకపోవడం, బోధనా సిబ్బంది కొరత.. ఇలా ఎన్నో కారణాలు.

సరిగ్గా ఇదే సమయంలో, విద్యార్ధుల ఫీ-రీ ఎంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించే విషయంలో రాష్ట్రంలో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రజలకి అనేక "మేళ్ళు" చేయడంలో భాగంగా మొదలైన ఈపథకం, ప్రభుత్వానికి ఓ తెల్ల ఏనుగుగా మారిందిప్పుడు. ఉచిత విద్య ఉచితమా, అనుచితమా అన్న ప్రశ్న అప్పుడు రాలేదు. ఇప్పుడు వస్తోంది. ఒక్కసారిగా ఈ పథకాన్ని తొలగించకుండా, విడతలు విడతలుగా నీరుగార్చే అవకాశం ఉంది. నిజానికి, 'అర్హత' 'ప్రతిభ' తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఉచిత విద్య అందించడం ఎంతవరకూ సబబు? ఉచితంగా వచ్చే చదువు విలువ ఎంతమంది విద్యార్ధులకి తెలుస్తుంది??

కేవలం మన రాష్ట్రం అనే కాదు, ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెంచేందుకు దేశ వ్యాప్తంగా కృషి జరగాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో, ఇండియా బలం మానవ వనరులే. ఈ వనరులని సాధ్యమైనంత బాగా ఉపయోగించుకోవాలంటే తగిన విధంగా శిక్షణ అందించాలి. ఈ శిక్షణ కళాశాలల ద్వారానే జరగాలి. అలా జరగాలంటే, కళాశాల మీద నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ఇప్పటికే సాచ్యురేటెడ్ దశకి చేరుకున్న ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్యని మరింత పెంచకుండా, ఉన్నవాటిలో వనరులు, సౌకర్యాలని మెరుగు పరచడం తక్షణావసరం. కాని పక్షంలో, మన బలంగా చెప్పుకుంటున్న మానవ వనరులే బలహీనతగా మారిపోయే ప్రమాదం కనిపిస్తోంది..

శనివారం, ఆగస్టు 04, 2012

నాయికలు-స్రవంతి

జీవితాన్ని గురించి స్థిరమైన అభిప్రాయాలు ఉన్నవాళ్ళూ, తమకి ఏం కావాలో స్పష్టంగా తెలిసిన వాళ్ళూ కొందరే ఉంటారు. వాళ్ళలో కూడా, కావలసినదాన్ని సాధించుకునే చొరవా, తెగువా ఉన్నవాళ్ళు తక్కువే. ఈ లక్షణాలన్నీ ఓ అమ్మాయికి ఉంటే, ఆమె 'స్రవంతి' అవుతుంది. జీవితం పూలపానుపు కాదు స్రవంతికి. వయసులో బాగా పెద్దవాడూ, తనని నిర్లక్ష్యం చేసినవాడూ అయిన భర్త. ఐదుగురు స్త్రీలతో సంబంధం పెట్టుకున్న అతగాడు, ఓ రాత్రివేళ హత్యకి గురవుతాడు. శవాన్ని గుర్తించడమే కష్టమవుతుంది పోలీసులకి.

భర్త మరణం ఇరవై ఏడేళ్ళ స్రవంతికి స్వేచ్చని ఇస్తుంది. సౌకర్యంగా బతకడానికి అవసరమైన డబ్బునీ ఇస్తుంది. అయితే, ఓ వయసులో ఉన్న స్త్రీకి జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి ఇవి మాత్రమే సరిపోతాయా? తనకి చాలవని స్పష్టంగా తెలుసు స్రవంతికి. కావలసినవి ఏమిటో కూడా తెలుసు. భర్త సంవత్సరీకం రోజున దైవ దర్శనం కోసం తిరుపతి వెళ్ళిన స్రవంతికి కనిపిస్తాడు శ్రీనివాస్. తను ఉంటున్న హైదరాబాద్ లోనే ఉంటూ, అంతకు మునుపే కొద్దిపాటి పరిచయమైన శ్రీనివాస్ తో అనుబంధం పెంచుకోవాలని నిర్ణయించుకుంటుంది ఆమె.

స్వతహాగా తెలివైన అమ్మాయి స్రవంతి. తొందరపడి నిర్ణయం తీసుకోదు. ఒకసారి తీసుకున్నాక, వెనక్కి తగ్గదు. అనుకున్నది సాధించుకోవడం ఎలాగో ఆమెకి తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదు. ఓ ప్రైవేట్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేసే ముప్ఫై నాలుగేళ్ల శ్రీనివాస్ కి భార్య ఇందిర, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇందిరతో సఖ్యంగానే ఉంటున్న శ్రీనివాస్ దృష్టిలో మరో స్త్రీ లేదు. జీవితం సంతోషంగానే ఉంది అతనికి. ఓ మొక్కు తీర్చుకోడానికి ఒంటరిగా తిరుపతి వెళ్ళిన శ్రీనివాస్ పక్క కాటేజీలోనే తనూ గది తీసుకుంటుంది స్రవంతి. ఓ రాత్రివేళ అతనికి దగ్గరవుతుంది. శ్రీనివాస్ దృష్టిలో ఆ పరిచయం ఆ రాత్రికే పరిమితం.. కానీ స్రవంతి ఆలోచన వేరు. ఆమెకి అతను కావాలి.

హైదరాబాద్ తిరిగి వచ్చాక కూడా, స్రవంతితో అనుబంధం కొనసాగుతుంది శ్రీనివాస్ కి. స్రవంతి చొరవే ఇందుకు కారణం. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న స్రవంతి, ఒంటరిగా ఉంటోంది ఓ అపార్ట్ మెంట్లో. ఆ ఇంటి డూప్లికేట్ తాళం చెవి శ్రీనివాస్ కి ఇస్తుంది, అతను ఏ వేళలో అన్నా ఆమె ఇంటికి రాడానికి వీలుగా. అర్ధరాత్రి వచ్చినా తలుపు తట్టనవసరం లేకుండా. తన జీవితంలో అతను తప్ప మరో మగాడు లేడని చెప్పకనే చెబుతుందామె. పూర్తిగా మధ్యతరగతి మనస్తత్వం శ్రీనివాస్ ది. ఏ ఖర్చూ లేకుండా దొరికే శారీరక సౌఖ్యం సంతోష పెడుతుంది అతన్ని. అంతకు మించి, ఇందిరకి అన్యాయం చేస్తున్నానన్న భావన నిలువనివ్వదు. ఇంట్లో ఉన్నంతసేపూ భార్యని ఎక్కువ ప్రేమగా చూసుకుంటూ, ఆ లోటుని భర్తీ చేసుకుంటున్నట్టుగా భావించుకుని తృప్తి పడుతూ ఉంటాడతను.

స్రవంతికి తెలుసు, ఇందిర విషయంలో శ్రీనివాస్ మానసిక సంఘర్షణ. కానీ, ఆమెకి శ్రీనివాస్ కావాలి. శ్రీనివాస్ మాత్రమే కావాలి. ఎందుకంటే, అతన్ని మనస్పూర్తిగా ప్రేమించింది ఆమె. మొదట్లో కేవలం శారీరక సుఖం కోసమే స్రవంతి ఇంటికి వెళ్ళిన శ్రీనివాస్ కి ఆమెతో ప్రేమలో పడడానికి, మానసిక అనుబంధం ధృడ పడడానికీ ఎక్కువ సమయం పట్టదు. పట్టనివ్వదు స్రవంతి. అతని సమక్షంలో అతనికి నచ్చే మాటలే మాట్లాడుతుంది, ఇష్టమైన పనులే చేస్తుంది. అతనిలో ఉన్న బద్ధకాన్నీ, చిన్న చిన్న చెడు అలవాట్లనీ వదిలిస్తుంది. మొత్తంగా, అతని జీవితం మీద తనదైన ముద్ర వేస్తుంది స్రవంతి. అయినప్పటికీ, అతని విషయంలో ఆమెలో ఏదో అభద్రత.

స్రవంతి భయపడినట్టే జరుగుతుంది. ఉన్నట్టుండి, ఆమెకి దూరంగా జరగాలని ప్రయత్నాలు మొదలు పెడతాడు శ్రీనివాస్. దూరం ఊరికి బదిలీ కోరతాడు కూడా. ఆమె ఇంటికి వెళ్ళకుండా ఉండడానికి తీవ్రంగా ప్రయత్నించి, కొంత మేరకు విజయం సాధిస్తాడు. కానీ, అతని మనసుని పూర్తిగా ఆక్రమించుకున్న స్రవంతి, అతన్ని దూరంగా ఉండనివ్వదు. తన నిర్ణయాన్ని ఆమెకి చెప్పేసి, విడిపోవడం కోసం ఆమె ఇంటికి వెళ్ళిన శ్రీనివాస్ ని, ఆ నిర్ణయాన్ని కేవలం రెండు నెలలు వాయిదా వెయ్యమని కోరుతుంది స్రవంతి. అయితే, ఆ రెండు నెలల కన్నా ముందే ఆశ్చర్యకరంగా అతని జీవితం నుంచి తప్పుకుంటుంది ఆమె.

జీవితంలో మనకి ఎదురయ్యే అందరినీ తప్పొప్పుల తూకంలో వేయలేం. ఎందుకంటే ఈ తప్పూ, ఒప్పూ అనేవి పరిస్థితులని బట్టి మారిపోతూ ఉంటాయి. స్రవంతిని కూడా అంతే. తనకి కావల్సిందేమిటో తెలిసిన స్రవంతి, దానిని సాధించుకునే ఓర్పూ, నేర్పూ ఉన్న స్రవంతి... అందుకోసం ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. శ్రీనివాస్ సంఘర్షణని అర్ధం చేసుకుని అతన్ని ఊరడించినది. అతన్ని కేవలం తన అవసరం తీర్చుకునే సాధనంగా కాక, తనవాడిగా ప్రేమించింది. జీవితాన్ని ఎంత బాగా గడపొచ్చో అతనికి నేర్పించింది. అతని ఎదురుగా తను లేకపోయినా, అతని ఆలోచనలలో ఎప్పటికీ ఉండిపోయేలాంటి అనుభవాలనీ, అనుభూతులనీ పంచింది.

"భగవంతుడు వజ్రానికుండే కాఠిన్యాన్ని, పులికుండే క్రూరత్వాన్ని, గుంటనక్కకుండే జిత్తులమారి తనాన్ని, మేఘానికుండే కన్నీటిని, గాలికి ఉండే చలనాన్ని, తేనెకుండే తీయదనాన్ని, ఉదయపుటెండకుండే వెచ్చదనాన్ని, పక్షి ఈకకుండే మృదుత్వాన్ని, లేడిపిల్లకుండే చురుకుదనాన్ని, పురివిప్పి ఆడే నెమలికుండే ఆకర్షణని, కుందేలుకుండే భయాన్ని తీసుకున్నాడు. వాటికి సామర్ధ్యాన్ని కలిపి, ఆ మొత్తాన్ని బాగా రంగరించి, ఆ మిశ్రమం లోంచి ఒక యువతిని తయారు చేశాడు. ఆమెని మగవాడికి బహుమతిగా ఇచ్చాడు." స్రవంతిని గురించి ఆమె సృష్టికర్త, ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి చేసిన పరిచయం ఇది. 'స్రవంతి' నవల చదువుతున్నప్పుడో, లేక చదివి పక్కన పెట్టాకో "ఇలాంటి స్త్రీ పరిచయం అయితే బాగుండు" అని కనీసం ఒక్క క్షమన్నా ప్రతి పాఠకుడూ అనుకుంటాడనడం అతిశయోక్తి కాదు.

('స్రవంతి' నవల ప్రస్తుతం అందుబాటులో లేదు. త్వరలోనే కొత్త ప్రింట్ మార్కెట్లోకి వస్తుందని భోగట్టా.. స్రవంతిని గురించి నాలుగు మాటలు రాయమని సూచించిన మిత్రులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు)