శనివారం, జులై 16, 2022

తలనేత

ఇస్తాంబుల్ అంటే ఇప్పటివరకూ తెలిసింది తెలుగు సినిమాలో ఖరీదైన విలన్ల స్థావరం మరియు నాయికానాయకులు ఒకటో రెండో యుగళగీతాలు పాడుకునే చోటు అని మాత్రమే. అయితే, ఈ టర్కీ దేశపు నగరం బట్టతలపై జుట్టు నేసే (హెయిర్ ట్రాన్స్ ప్లాంట్) పరిశ్రమ(?)కి ప్రపంచ స్థాయి రాజధాని అన్నది కొత్తగా తెలిసిన విశేషం. ప్రపంచం నలుమూలల నుంచీ ఏటా పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మంది (ప్రధానంగా పురుషులు) హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ కోసం ఇస్తాంబుల్ వచ్చి వెళ్తున్నారట! ఇందుకు కారణం, ఇక్కడ దొరికే ట్రీట్మెంటు ప్రపంచంలోనే అత్యుత్తమం అనుకుంటే పొరపాటు. చాలా ధనిక దేశాల కన్నా చాలా చౌక. అమెరికాలో ఇరవైవేల డాలర్ల వరకూ ఖర్చయ్యే జుట్టు నేతని ఇస్తాంబుల్లో రెండువేల డాలర్ల ఖర్చుతో పూర్తి చేసుకోవచ్చు. భలే మంచి చౌక బేరము కదా. 

తల నెరుపునీ, బట్టతలనీ ప్రకృతి సహజాలుగా అంగీకరించేసిన తరాలు తప్పుకున్నాక మొదటగా వర్ధిల్లింది రంగుల పరిశ్రమ. హెయిర్ డై ప్రకటనలు ఒకప్పుడు ఎంతగా తప్పుదోవ పట్టించేవిగా ఉండేవంటే, ఒక డై ని నేను ఔషధం అని పొరబడి, సలహా అడిగిన ఓ మిత్రుడికి సిఫార్సు చేశా. అతని అనుభవం నుంచి తెలిసింది, అది మందు కాదు రంగని. అప్పటి నుంచీ ఇలాంటి సలహాలిచ్చే పని మానుకున్నా. నాటకాలు, సినిమాల వాళ్ళకి మాత్రమే పరిమితమైన విగ్గులు కూడా జనబాహుళ్యానికి అందుబాటులోకి వచ్చేసి మార్కెట్ని దున్నేశాక ఈ హెయిర్ వీవింగ్, ట్రాన్స్ ప్లాంట్ లు రంగ ప్రవేశం చేశాయి. ఈ ట్రాన్స్ ప్లాంట్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది డాక్టర్ల చేత చేయబడుతుంది. ఒక్క సారి నాట్లు పూర్తయ్యాక, కొన్ని వారాలపాటు మొలకల్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు, ఇక ఆ కొత్త జుట్టు ఊడిపోదు. 

వైద్యరంగంలో కొత్త ఆవిష్కరణలతో సమస్య ఏమిటంటే, వచ్చిన కొత్తలో చాలా వైద్య విధానాలు ఖరీదు గానే ఉంటాయి. ఏళ్ళు గడిచిన తర్వాత తప్ప సామాన్యులకి అందుబాటులోకి రావు. బాగా ఖర్చు పెట్టగలిగే వాళ్ళు తొలివరసలో నిలబడి వినియోగించుకుంటారు. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి? ఒకప్పటి సంగతేమో కానీ, ఇప్పుడు ప్రపంచం ఓ కుగ్రామం అయిపోయాక అన్నింటికీ ఏదో రూపంలో ప్రత్యామ్నాయాలు దొరికేస్తున్నాయి. ఇదిగో, ఈ క్రమంలో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ అనే ఖరీదైన ప్రక్రియని అందుబాటు(?) ధరలో అందించే దేశంగా టర్కీ, నగరంగా ఇస్తాంబుల్ వినుతికెక్కాయి. వేగవంతమైన జీవన శైలి వల్ల అయితేనేమి, మారిన ఆహార అలవాట్ల వల్ల అయితేనేమి బాల నెరుపులు, బట్ట తలలు విరివిగా పెరిగాయి. తలసరి ఆదాయాలు, జీవన ప్రమాణాలు కూడా పెరగడంతో వినియోగదారుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. 

Google Image

ప్రపంచంలో ఎన్నో నగరాలు, మహా నగరాలూ ఉండగా ఈ ఇస్తాంబుల్ మాత్రమే తలనేత రాజధానిగా ఎలా పరిణమించ గలిగింది? మొదటిది - అక్కడ తగినంతమంది డాక్టర్లు, ఇతర సిబ్బంది ఉండడం, రెండోది -  అక్కడి ప్రభుత్వం 'హెల్త్ టూరిజం' ని బాగా ప్రమోట్ చేయడం, మూడోదీ బాగా ముఖ్యమైనదీ - టర్కీ ఇంకా 'అభివృద్ధి చెందుతున్న' దేశం కావడం వల్ల తక్కువ ఖర్చులో ట్రీట్మెంట్ అందివ్వ గలగడం. అంతర్జాతీయ హెల్త్ టూరిజం  పర్యాటకులకి ప్రధాన సేవ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ కాగా, అనుబంధంగా దంత వైద్యం, శరీర బరువు తగ్గింపు లాంటి సేవలనీ సరసమైన ధరలకి అందిస్తున్నారు. స్టార్ హోటల్ లో బస, లోకల్ ట్రాన్స్పోర్టు, సదా అందుబాటులో ఉండే అనువాదకులు.. ఇవన్నీ కలిపి పేకేజీ నిర్ణయిస్తారు. పేకేజీ కాకుండా, టిక్కెట్టు ఖర్చులు మాత్రమే అదనం. దీనివల్ల జరగబోయే ఖర్చు గురించి ముందుస్తుగా ఓ అంచనా వచ్చేస్తుంది యాత్రీకులకి. 

చౌక వైద్యం అనగానే ముందుగా వచ్చే సందేహం సేవల్లో నాణ్యత గురించి. ఇస్తాంబుల్ వైద్యాన్ని గురించీ బోల్డన్ని ప్రచారాలున్నాయి. డాక్టర్లు కేవలం పర్యవేక్షణ చేస్తూ, నాట్లు, ఊడుపు లాంటి క్రతువులన్నీ సహాయకుల చేత చేయిస్తారనీ, చాలా సందర్భాల్లో ఈ సహాయకుల అనుభవ లేమి వల్ల యాత్రికులు (రోగులు అనకూడదేమో) ఇబ్బంది పడుతున్నారని వినిపిస్తున్నా, యాత్రికుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. నాట్లు పూర్తి చేయించుకుని స్వదేశానికి తిరిగి వచ్చాక కూడా, ఓ సహాయకుడు హమేషా వాట్సాప్ లో అందుబాటులో ఉంటూ, ఫోటోలు, వీడియోల పరిశీలన ద్వారా మొలకల పెరుగుదలని పర్యవేక్షిస్తూ ఉంటాడట. దీనికి అదనపు రుసుమేమీ లేదు, పేకేజీలో భాగమే. ఆ ప్రకారంగా టర్కీ 'హెల్త్ టూరిజం' ని ప్రమోట్ చేస్తోంది. 

అసలు 'హెల్త్ టూరిజం' అన్నమాట వినగానే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తొచ్చారు. "ఏ ఇజమూ లేదు, టూరిజం ఒక్కటే ఉంది" అన్న ఆయన పాపులర్ స్లోగన్ తో పాటు, అప్పట్లో హైదరాబాద్ ని 'హెల్త్ టూరిజం హబ్' గా డెవలప్ చేస్తానన్న హామీ కూడా.  ఒకవేళ ఆంధ్ర ఓటర్లు ఆయనకి మళ్ళీ ప్రజాసేవ చేసుకునే అవకాశం ఇస్తే అమరావతి హెల్త్ టూరిజానికి కూడా రాజధాని అవుతుందేమో చూడాలి. అసలే విజయవాడ, గుంటూరు చుట్టూ లెక్కలేనన్ని హాస్పిటళ్లు ఉన్నాయి. ఒకవేళ, ప్రస్తుత పాలకులకి ఇస్తాంబుల్ విషయం చెవిన పడితే అన్న ఆలోచన రావడమే కాదు, ఏ 'జుట్టు దీవెన' లాంటి సంక్షేమ పథకమో పురుడు పోసుకుంటుందేమో అన్న సందేహమూ కలిగేసింది. అమంగళం ప్రతిహతమగు గాక!

4 కామెంట్‌లు:

  1. తలనేత అనే పదం నాకు 'కలనేత' అనే పదాన్ని గుర్తుచేసింది. ( సరి కొత్త చీర సాంగ్.. )

    ఒక చిలిపి ఊహ : అధికార పక్షం నిజంగా ఆ పధకం ప్రవేశ పెట్టి చాలా పాపులర్ అయితే, రేపటి ఎలక్షన్ లో ప్రతిపక్షం ఓట్లకోసం ప్రజల దగ్గరకు వెళితే, పధకం కింద తలనేత చేయించుకునేవాళ్ళందరూ " ఎందుకు వేయాలిరా ఓటు మీకు...మా తల మీద నాట్లు పెట్టారా? నీరు పెట్టారా? ఊడుపు చేయించారా..? కుప్పలూడ్చారా? " అని తెల్లదొరలకి నిలదీసినట్టు నిలదీస్తే.... :P :-)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కట్టబొమ్మన గెటప్ లో ఎంటీ వోణ్ణి గుర్తు చేశారండి ('మేజర్ చంద్రకాంత్' లో 'పుణ్యభూమి నాదేశం..' పాట).. నిజవేనండీ 'కలనేత' కి బాగా దగ్గరగా ఉంది (బాపూ గారి పాట గురించి ప్రత్యేకం చెప్పాలా? ఆ ఉయ్యాలా అదీ...) ..ధన్యవాదాలు.. 

      తొలగించండి
  2. తాడి (తాటాకు) ని నేసే వాడు ఉంటే, తలని నేసే వాడు కూడా ఉన్నాడన్న మాట.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మామూలు నేత కాదండీ, దేశానికి ప్రధాన ఆదాయ వనరు!! ..ధన్యవాదాలు..

      తొలగించండి