గురువారం, సెప్టెంబర్ 28, 2023

ఎమ్మెస్ స్వామినాథన్ ...

తమిళ దేశాన్ని తలచుకోగానే గుర్తొచ్చే ఇద్దరు ఎమ్మెస్ లలో రెండోవారు ఎమ్మెస్ స్వామినాథన్ వెళ్లిపోయారు. స్వామినాథన్ అనగానే గుర్తొచ్చే మొదటి/ఏకైక విషయం హరిత విప్లవం. నార్మన్ బొర్లాగ్ తో కలిసి స్వామినాథన్ చేసిన పరిశోధనలు, నాటి ప్రభుత్వ సాయంతో క్షేత్ర స్థాయిలో ఆ పరిశోధనలని అమలు చేసిన తీరు, వాటి ఫలితంగా అప్పటివరకు ఆహార ధాన్యాల కొరతని అనుభవించిన భారత దేశం క్రమంగా మిగులు నిలవలని పెంచుకుంటూ వచ్చే దిశగా ఎదగడం ఇవన్నీ గుర్తొస్తాయి. వీటితో పాటే పీఎల్-480 ఒప్పందం, దాని తాలూకు చీకటి కోణమైన 'కాంగ్రెస్ గడ్డి' లాంటి కలుపు మొక్కలూ జ్ఞాపకం వచ్చి తీరతాయి. స్వామినాథన్ కి నివాళి అర్పించే ముందు ఆ సంగతులన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి.

స్వతంత్రం వచ్చిన తొలి దశాబ్దాలలో భారతదేశం ఎదుర్కొన్న ప్రధానమైన సమస్య ఆహారం. పెరుగుతున్న జనాభాకి, సంప్రదాయబద్ధంగా సాగుతున్న వ్యవసాయం నుంచి వస్తున్న ఫలసాయానికీ మధ్య దూరం అంతకంతకీ పెరిగిపోవడంతో ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది.తక్షణ పరిష్కారంగా అంతర్జాతీయంగా అందే సాయం మీద దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఆ కృషి ఫలించి, అమెరికా తిండి గింజల ఎగుమతికి అంగీకరించింది తన పీఎల్-480 కార్యక్రమంలో భాగంగా. అమెరికా నుంచి దిగుమతులు వచ్చే నాటికి భారత దేశంలో తిండి గింజలు మాత్రమే కాదు, విత్తనాలకీ కొరత వచ్చింది. దిగుమతుల్లో వచ్చిన గింజలనే విత్తనాలుగా నాటింది నాటి రైతాంగం. దీనివల్ల జరిగిన దుష్పరిణామం పేరు 'పార్తీనియం.' స్థానికంగా 'వయ్యారి భామ' అనే అందమైన పేరున్న ఈ కలుపు మొక్కకి తెలుగు రైతులు పెట్టిన మరో పేరు 'కాంగ్రెస్ గడ్డి.'

వేగంగా వ్యాపించే కలుపుమొక్క పార్తీనియం. ఈ మొక్క ఒక్కసారి మొలిచిందంటే మరి చంపేందుకు వీలుండదు. మొదలంటా నరికినా, తగలబెట్టినా కూడా మళ్ళీ మళ్ళీ మొలుస్తూనే ఉంటుంది. ఉబ్బస వ్యాధి గ్రస్తులతో పాటు పాడి పశువులకీ ఈ మొక్క ప్రాణాంతకం. "ఈ కాంగిరేస్సూ పోదు, కాంగిరేసు గడ్డీ పోదు" అని తిట్టుకునే వాళ్ళు రైతులు (బీజేపీ నాయకులు 'కాంగ్రెస్ ముక్త భారత్' అని నినదించినప్పుడల్లా నాకు గుర్తొచ్చే మాట ఇదే). ఈ పార్తీనియం విత్తనాల వెనుక అమెరికా కుట్ర కోణం ఉందని చాలామందే నమ్మారు. ఇది ఒక కారణం అయితే, ఏటా కొత్త దాతలని వెతుక్కోవాల్సి రావడం, సాయం అందుకోడం వల్ల అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠ మసకబారడం లాంటి మరిన్ని కారణాలు భారత ప్రభుత్వాన్ని 'తిండి గింజల స్వయం సమృద్ధి' వైపు గట్టిగా ఆలోచించేలా చేసింది. ఫలితమే హరిత విప్లవం. ఈ హరిత విప్లవ పితామహుల్లో ముఖ్యులు, వ్యవసాయ శాస్త్రవేత్త, డాక్టర్ ఎమ్మెస్ స్వామినాథన్.


సినీ నటుడు శోభన్ బాబు పేరు మీద ప్రచారంలో ఉన్న కొటేషన్ "రానురాను మనుషులు పెరుగుతారు తప్ప భూమి పెరగదు". ఇది రియల్ ఎస్టేట్ కి మాత్రమే కాదు, వ్యవసాయానికి కూడా వర్తిస్తుంది. నిజానికి మొదట వర్తించేది వ్యవసాయానికే . కూడు తర్వాతే కదా గూడు. హరిత విప్లవం లక్ష్యం వ్యవసాయ యోగ్యమైన భూమిలోనే అధిక దిగుబడులు సాధించడం. మేలైన విత్తనాల కోసం పరిశోధనల మొదలు, ఎరువులు, పురుగు మందులు దేశీయంగా తయారు చేసి రైతులకి అందుబాటులో ఉంచడం వరకూ హరిత విప్లవంలో భాగమే. వీటి ఫలితంగా అప్పటివరకూ ఏటా ఒక పంట మాత్రమే పండిన భూముల్లో రెండు మూడు పంటలు పండించడం మొదలయ్యింది. మరో పక్క సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యి మరింత భూమి వ్యవసాయ యోగ్యమయ్యింది. ఫలితంగా తిండి గింజల స్వయం సమృద్ధి సాధ్య పడింది.

'ఆహార ధాన్యాల కోసం ఇప్పటికీ విదేశాల మీద ఆధార పడాల్సిన పరిస్థితి ఉండి ఉంటే?' అన్న ప్రశ్న వేసుకుంటే చాలు హరిత విప్లవం ప్రాముఖ్యత అర్ధమై, అందుకోసం కృషి చేసిన వారి మీద గౌరవం కలుగుతుంది. నిజమే, ఈ విప్లవం కారణంగా వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం గణనీయంగా పెరిగింది. వీటి వల్ల, ఈ రసాయనాలని తయారు చేసే ఫ్యాక్టరీల వల్లా వాతావరణ కాలుష్యం పెరిగింది. అయితే, ఈ కీడు కన్నా జరిగిన పెద్ద మేలు ఏమిటంటే, ఆకలి చావుల బారి నుంచి దేశం రక్షింపబడింది. అంతర్జాతీయంగా తలెత్తుకుని నిలబడ గలిగింది. లోపాలున్నప్పటికీ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇప్పటికీ సబ్సిడీ ధరలకి ఆహార ధాన్యాలని పేదలకి అందించగలుగుతోంది.

శ్వేత విప్లవం వెనుక ఉన్న వర్గీస్ కురియన్ ని, హరిత విప్లవ సారధి మంకొంబు సాంబశివన్ స్వామినాథన్ ని ఒక్కసారైనా కలవాలి అనుకున్న రోజులున్నాయి. కురియన్ విషయంలో ఏమీ కలిసిరాలేదు కానీ, స్వామినాథన్ చెన్నైలో తన పేరుమీదే నడుపుతున్న ఫౌండేషన్ లో రెండు రోజులు గడిపే అవకాశం వచ్చింది, ఎనిమిదేళ్ల క్రితం. నేను అక్కడ ఉన్న సమయంలో ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. స్వామినాథన్ ని కలవలేకపోతేనేం, ఆ సంస్థ పనితీరుని, క్రమశిక్షణనీ చూసిన తర్వాత స్వామినాథన్ వ్యక్తిత్వాన్ని గురించి, క్రమశిక్షణ గురించీ ఓ అంచనా వచ్చింది. 'హరిత విప్లవం' తర్వాత దశగా 'సతత హరిత విప్లవం' (ఎవర్ గ్రీన్ రివల్యూషన్) తీసుకురావాలని, 'అందరికీ ఆహారం' నుంచి 'అందరికీ బలవర్ధకమైన ఆహారం' వైపుగా వ్యవసాయ రంగ ప్రయాణం సాగాలని కోరుకున్నారు స్వామినాథన్. ఆ కోరిక నెరవేరడమే ఆయనకి అసలైన నివాళి.

సోమవారం, సెప్టెంబర్ 11, 2023

నిన్నటి పరిమళాలు

చాలారోజుల తర్వాత పుస్తకాల షాపుకి స్వయంగా వెళ్లి నచ్చిన పుస్తకాల్ని ఎంచుకోవడం. మొదటగా కనిపించిన పుస్తకం 'నిన్నటి పరిమళాలు', రచయిత శ్రీరమణ. ఆయన వెళ్ళిపోయాక వేసిన పుస్తకమా? అని సందేహం కలిగింది. చూస్తే తొలి ప్రచురణ అక్టోబరు 2022 అని ఉంది. పుస్తకం పేరు, దొరికిన సందర్భమూ రెండూ కూడా కలుక్కుమనిపించాయి. ఇంతకీ ఇది శ్రీరమణ రాసిన నివాళి వ్యాసాల సంకలనం. పండుగల గురించి రాసిన నాలుగైదు వ్యాసాలు, రెండు పుస్తకాలకి రాసిన ముందు మాటలు, కాలం నాడు 'కినిగె పత్రిక' కి ఇచ్చిన ఇంటర్యూ అదనపు చేర్పులు. నివాళి వ్యాసాలన్నీ 'సాక్షి' దినపత్రికలో 'అక్షర తూణీరం' కాలమ్ లో భాగంగా రాసినవే. చివర్న వేసిన ఇంటర్యూతో కలుపుకుని మొత్తం యాభై మూడు తూణీరాలు. 

నివాళి వ్యాసానికి ఇంగ్లీష్ సమానార్థకం ఎలిజీ. అది రాయడం కత్తిమీద సాము. ఎందుకంటే, 'చచ్చినవాడి కళ్ళు చారెడంత' అని తెలుగునాట ఓ సామెత. వెళ్ళిపోయిన గొప్పవాళ్లు బతికి ఉన్నన్నాళ్లూ మంచీ, చెడూ రెండు రకాలూ చేసినా, కొండొకచో చెడు మాత్రమే చేసినా పోగానే బహుమంచి వాడు అయిపోతాడు. అభిమాన, అనుచర, భక్త గణాలు ఉండనే ఉంటాయి. అవన్నీ తమ ఆప్తుడిని గురించి మంచి మాటలు మాత్రమే వినాలని అనుకుంటాయి. ఇన్ని ఒత్తుడుల మధ్య ఓ నాలుగు మాటలు ప్రత్యేకంగా రాయడం, వాటిలో ఆ పోయిన వాడి వ్యక్తిత్వాన్ని చూపించడం అసాధ్యం కాదు కానీ కష్ట సాధ్యం. కాలమిస్టులకి ఇలాంటి కష్టాలు ఓ లెక్క కాదన్నట్టుగా తనదైన ఫ్లోతో ఎలిజీలు రాసేశారు శ్రీరమణ. వీటిలో కొన్ని మళ్ళీ మళ్ళీ చదివించేవి ఉన్నాయి, మరికొన్నింటిలో మరెక్కడా దొరకని విశేషాలూ ఉన్నాయి. అందుచేత ఈ పుస్తకం ప్రత్యేకమైనది. 

ఎన్టీఆర్ కి జరిగిన (రెండో) వెన్నుపోటు సందర్భంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఏమీ చేయకుండా మనకెందుకులే అని ఊరుకుంది. ఆ సంక్షోభంలో నుంచి అవకాశాన్ని వెతుక్కునే పథకం ఒకటి ఢిల్లీ లో రచింపబడింది. అమలు చేసే బాధ్యత రాష్ట్రంలో ఓ పెద్దాయనకి ఇవ్వబడింది. ఆ పెద్దాయన జంకడంతో ఆ పథకం అమలు జరగలేదు. అమలు జరిగి ఉంటే తెలుగుదేశం పార్టీ అనేక ముక్క చెక్కలయ్యేది. పథకం వేసింది పీవీ నరసింహారావు అయితే, జంకిన పెద్దాయన కోట్ల విజయభాస్కర రెడ్డి. 'వార్తల కెక్కని పీవీ చాణక్యం' పేరిట శ్రీరమణ వదిలిన తూణీరం రాజకీయాల మీద కొద్దిపాటి ఆసక్తి ఉన్నవాళ్ళకి కూడా ఆఫళాన మతి పోగొడుతుంది. పీవీని గురించి రాసిన రెండు నివాళి వ్యాసాల్లో ఇది మొదటిది. రెండోది పీవీ పూర్తి జీవన రేఖ. 

తెనాలి పక్కన పల్లెటూరు తుమ్మపూడిని తన ప్రపంచంగా చేసుకోడమే కాక, రసజ్ఞులందరికీ దర్శనీయంగా మార్చిన సంజీవ దేవ్ కి నివాళిగా రాసిన రెండు వ్యాసాల్లోనూ, సంజీవ దేవ్ రస దృష్టితో పాటు శ్రీరమణ జిహ్వ చాపల్యమూ కనిపించి మురిపిస్తుంది. ఓ పక్క సంజీవ్ దేవ్ గురించి సీరియస్ గా చెబుతూనే, ఆయన అర్ధాంగి సులోచన గారి చేతి వంట, వడ్డనలు గురించి, వంటకాల రుచులని గురించీ పై సంగతులు వేసి నోరూరించారు. సంజీవ్ దేవ్ చిత్రలేఖన ప్రతిభ కన్నా, సులోచన గారి చేతి గుత్తి వంకాయ కూర, చల్ల పొంగడాలు పాఠకులకి ఎక్కువగా గుర్తుండిపోయేలా చేసేది శ్రీరమణ వాక్య విన్యాసమే. ఈ విన్యాసమే వస్తువుతో (అనగా ఎలిజీకి కారకులతో) సంబంధం లేకుండా ప్రతి వ్యాసాన్నీ ఆపకుండా చదివిస్తుంది. 

"కొత్త కొత్త నాటకాలు చదవడం, తనదైన శైలిలోకి దించడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య" అంటూ గొల్లపూడికి ఎలిజీ రాయాలంటే కూసింత పెంకితనం ఉండాల్సిందే. "రావి కొండలరావు బహుముఖ ప్రజ్ఞాశాలి" అని ఊరుకోవచ్చా, అబ్బే, "అన్నిటికీ మించి ప్రఖ్యాత నటి రాధాకుమారిని కట్టుకున్న భర్త" అనడమే శ్రీరమణ స్టైలు. "కెరీర్ లో లెక్కకి ఐదొందల సినిమాల్లో కనిపించినా ఒక పాతిక వేషాలు ఎన్నదగ్గవి" అనడానికి చాలా నిర్మొహమాటం కావాలి. నేరుగానే, పరోక్షంగానో విశ్వనాథ ప్రస్తావన లేకుండా శ్రీరమణ కథేతర రచనలుండవు. విశ్వనాథుడి దర్శనం ఇక్కడా జరిగింది. ధైర్యం పుంజుకుని "శ్రీశ్రీ గారి మీద మీ అభిప్రాయం?" అని టీనేజీ శ్రీరమణ కాస్త బెరుకుగానే అయినా సూటిగా అడిగిన ప్రశ్నకి చెప్పిన జవాబు 'ఒక్కడు విశ్వనాథ' ఎందుకయ్యాడో చెప్పకనే చెబుతుంది. 

పోయిన మంచోళ్ళు గురించి మాత్రమే కాదు, మిగిలిన తీపి గుర్తులని కూడా ప్రోత్సహిస్తూ రాసిన మంచి మాటలు కొన్ని జతపడ్డాయి ఈ పుస్తకంలో. ఆత్రేయపురం కుర్రాడు బ్నిం గురించీ, చిత్రకారుడు రాయన గిరిధర గౌడ్ గురించీ కొత్తసంగతులెన్నో చెప్పారు. అన్నమయ్య గ్రంధాలయం స్థాపకుడు లంకా సూర్యనారాయణ, 'పాత్రికేయులకు పెద్ద బాలశిక్ష' ఆవటపల్లి నారాయణరావు.. ఇలా పాఠక లోకానికి పెద్దగా తెలియని వారిని కొత్తగా పరిచయం చేశారు. ముందుమాటలందు శ్రీరమణ ముందుమాటలు వేరు. డాక్టర్ సోమరాజు సుశీల 'ఇల్లేరమ్మ కతలు', 'కలైమామణి' దాట్ల దేవదానం రాజు 'కథల గోదారి' పుస్తకాలకి రాసిన ముందు మాటలని చేర్చారు ఈ పుస్తకంలో. 'కథల గోదారికి గొజ్జంగి పూదండ' కాస్త నిడివైన ముందుమాట. ఈ 'నిన్నటి పరిమళాలు' పుస్తకానికి మోదుగుల రవికృష్ణ ముందుమాట రాశారు. వీవీఐటీ ప్రచురించింది. 192 పేజీలు, 180 రూపాయల వెల. సాహితీ ప్రచురణలు ద్వారా లభ్యం.

బుధవారం, సెప్టెంబర్ 06, 2023

శృంగేరి-2

(మొదటి భాగం తర్వాత)

బయట చినుకులు పెరుగుతున్నాయి. వాటిని చీల్చుకుంటూ భక్తులు లోపలికి  వస్తున్నారు. చూస్తుండగానే హాలు నెమ్మదిగా నిండుతోంది. ఇంతలో ఓ కుర్రాడు నా దగ్గరికి వచ్చాడు.రెండంచుల పంచె, ఉత్తరీయం, నుదుటన విభూది పట్టెలు, మధ్యలో కుంకుమ బొట్టు, చేతిలో ఉన్న పళ్లెంలో పళ్ళు, పూజా ద్రవ్యాలు, చంకన బ్యాక్ ప్యాక్.. అతను నన్ను పలకరిస్తే తప్ప 'రూమ్మేట్' గా గుర్తు పట్టలేక పోయాను.  "నేను పాదపూజ టికెట్ తీసుకున్నాను. ఆ క్యూలో స్వామీజీని చూస్తాను.. మీరు ఈ వైపు క్యూలో ఉంటే స్వామిని దర్శనం చేసుకోవచ్చు. స్వామీజీ పూర్వాశ్రమంలో మీ తెలుగువారే. ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు" అనేసి హడావుడిగా పాదపూజ వైపు వెళ్ళిపోయాడు. 'నీ ప్రశ్నలు నీవే.. ఎవరూ బదులివ్వరుగా...' అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడడానికి చాలా ముందు నుంచీ కూడా నా నమ్మకం అదే, కాబట్టి అడగడానికి ఏమీ లేదు. కానైతే స్వామీజీని దగ్గరగా చూడాలనిపించింది. ఆయనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులని కొన్నేళ్ల క్రితం ఓ సందర్భంలో కలిశానని గుర్తొచ్చింది. 

ఎడమవైపు పాదపూజల హడావిడి మొదలైంది. ఇంతకీ పూజ నిజ పాదాలకి కాదు, గురు పాదుకలకి. రూమ్మేట్ చేస్తున్న పూజని చూస్తూ ఉండగానే ఒక్కసారిగా కలకలం, స్వామీజీ వచ్చేశారు. వేగంగా వచ్చి, ఎవరివైపూ చూడకుండా తన స్థానంలో కూర్చున్నారు. హాల్లో అందరూ లేచి నిలబడ్డారు. కొందరు ఉన్నచోటే సాష్టాంగ పడ్డారు. అందరిలోకీ వయసులో పెద్ద అయిన పరిచారకుడు స్వామీజీ దగ్గరకి వెళ్లి తీర్ధం స్వీకరించాక, దర్శనం మొదలైంది. నన్ను రెండో వైపు క్యూలో నిలబడమని రూమ్మేట్ సైగ చేశాడు. అప్పటికే ఐదారు కుటుంబాలు అక్కడ నిలబడి ఉన్నాయి. నేనూ నిలబడ్డా. తొలి దర్శనం పాదపూజల వాళ్లకి. రూమ్మేట్ వంతు వచ్చింది. అతను స్వామీజీకి ఏదో చెప్పడం, ఆయన శ్రద్ధగా వింటూ మధ్యలో ప్రశ్నలు అడగడం, ఇతను జవాబులు చెప్పడం కనిపిస్తోంది. రెండు మూడు నిమిషాలపాటు సంభాషణ సాగింది. రూమ్మేట్, పరిచారకుడు ఇచ్చిన తీర్ధం తీసుకుని, హాల్లోనే ఓ మూల ధ్యానంలో కూర్చున్నాడు. 

క్యూ చాలా నెమ్మదిగా కదులుతోంది. ఎందుకా అని చూస్తే వీఐపీల తాకిడి. వాళ్ళు షార్ట్ కట్ లో దర్శనానికి వెళ్లిపోతున్నారు. ఎక్కువగా తమిళనాడు, కర్ణాటక వాళ్ళు.. అప్పటికప్పుడు రావడం, స్వామీజీతో మాట్లాడి వెళ్లిపోవడం. హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తెలుగు భాషల్లో జరుగుతున్నాయి సంభాషణలు. అక్కడక్కడా తమిళ మాటలూ వినిపిస్తున్నాయి. అన్ని భాషల్నీ స్వామీజీ అనర్గళంగా మాట్లాడుతున్నారు. పక్కనున్న పళ్లాల నుంచి పండో, పువ్వో వాళ్ళ వైపు విసురుతున్నారు. పరిచారకులు ప్రసాదం అందిస్తున్నారు. క్యూలో నా ముందు ఓ కుటుంబం. ఆయన, భార్య, కొడుకు, కోడలు, ఏడాది వయసున్న మనవరాలు - ఉత్తరాది నుంచి వచ్చారు. ఆ పిల్ల అందరి చంకలూ మారుతోంది. భక్తులందరూ పళ్ళ పళ్ళాలు, బుట్టలతో వస్తున్నారు. 'పత్రం, పుష్పం, ఫలం, తోయం..' అన్నాడు గీతాకారుడు. వాటిలో ఏ ఒక్కటీ తేలేదు నేను. 'యోమే భక్త్యా ప్రయచ్ఛతి' అని కూడా అన్నాడు. నా భక్తి నాకెప్పుడూ ప్రశ్నార్ధకమే. 

బయట వర్షం తగ్గింది. రూమ్మేట్ నా దగ్గరికి వచ్చి క్యూ కి ఆవల నిలబడ్డాడు. "నేను రూమ్ కి వెళ్తున్నాను. మీకు దర్శనం అయ్యాక, గుడి ఎంట్రన్స్ దగ్గర అన్న ప్రసాదం ఉంటుంది.. తినేసి రూమ్ కి వచ్చేయండి. ఒకవేళ నేను తలుపు తీయకపోతే కాల్ చెయ్యండి" అని చెప్పి వెనుతిరిగాడు. నాకూ వెనక్కి వెళ్లిపోదామా అనిపించింది. ఎందుకో మరి, ముందుకే వెళ్లాను. మరో విడత పాదపూజ పూర్తవ్వడంతో ఆ భక్తులు అటువైపు క్యూలో చేరారు. ఒక  కుటుంబం, తర్వాత నా ముందున్న ఉత్తరాది వాళ్ళు, ఆ తర్వాత నా వంతు. కొంచం సేపటికి ఉన్నట్టుండి స్వామీజీ దృష్టి నామీద పడింది. నేనూ ఆయన వైపే చూశాను రెప్ప వేయకుండా. అర నిమిషం పైనే గడిచి ఉంటుంది. కేవలం ఆయన కళ్ళని  మాత్రమే చూస్తున్నాన్నేను. పరిచారకుడి పిలుపుతో ఆయన దృష్టి మరలింది. 

చన్నీళ్లతో తలారా స్నానం చేసినట్టు, అడగని ప్రశ్నలు అన్నింటికీ జవాబులు దొరికినట్టూ అనిపించింది. ఉత్తరాది పెద్దాయన స్వామీజీకి ఏదో చెప్పుకుంటున్నాడు. నేను నెమ్మదిగా బయట పడ్డాను. రూమ్ కి తిరిగి వెళ్లడం, "కాసేపు నిద్రపోతాను" అని రూమ్మేట్ కి చెప్పి నా మంచం మీద వాలడం లీలగా మాత్రమే గుర్తున్నాయి. మూడు గంటల పాటు ఒంటి మీద స్పృహ లేదు. ఉన్నట్టుండి మెలకువ వచ్చేసరికి రూమ్మేట్ నన్ను నిద్ర లేపుదామా అని తటపటాయిస్తున్నాడు. నాకు బరువేదో దిగిపోయినట్టు వొళ్ళంతా తేలికగా అనిపించింది. "మీరు భోజనం చేశారో లేదో అని.." అన్నాడు. ఆకలిగా అనిపించలేదని చెప్పాను. పాదపూజ చేశాడు కాబట్టి తను ఉపవాసం ఉంటాడట. "స్వామీజీతో మాట్లాడారా?" అని అడిగాడు. దర్శనం అయిందని చెప్పాను. 

కిటికీలోనుంచి చూస్తే బయట జల్లు పడుతోంది. తన కబుర్లు వింటున్నా. ఓ దేశంలో మాస్టర్స్ లో సీటు, మరో దేశంలో ఇప్పుడు చేస్తున్న కన్నాపెద్ద ఉద్యోగం వచ్చాయట. ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోగలడు. ఏది ఎంచుకోవాలా అని సందేహం. "నాకు ఏ సందేహం వచ్చినా స్వామీజీ దగ్గరకి వస్తాను. ఆయన్ని అడిగినా, అడగక పోయినా మంచి పరిష్కారం అయితే దొరుకుతుంది.." నేనా విషయంలో జోక్యం చేసుకోకుండా, "తరచూ వస్తూ ఉంటారా?" అని అడిగాను. "చాలా తరచుగా వస్తాం.. ఇదే మొదటి సారి నేను ఒక్కడినీ రావడం .. మీరు ఉండడం వల్ల రూమ్ దొరికింది.. లేకపోతే ఏమయ్యేదో.." అన్నాడు. "మీరు లేకపోతే నా పరిస్థితి కూడా అదే కదా" అన్నాను. "నాన్నగారిప్పుడు ఢిల్లీలో ఉన్నారు.. సెంట్రల్ సెక్రటేరియట్లో పోస్టింగ్" ఒక్కడూ రాడానికి కారణం చెప్పాడు. "బ్యూరోక్రాట్?" అడిగాను. "ఐఏఎస్, సెంట్రల్ సర్వీస్" ఏదో కో-ఆపరేటివ్ సొసైటీలో గుమస్తా అన్నంత కాజువల్ గా చెప్పాడు. 

నాకు తగిలింది మామూలు షాక్ కాదు. వాళ్ళ నాన్నారి ఆఫీసు జీపులో ప్రతిరోజూ దర్జాగా కాలేజీకొచ్చిన నా కాలేజ్మేట్ 'తాసీల్దారు గారి అబ్బాయి' గుర్తొచ్చాడు. ఇతనేమో నేను లేకపోతే రూమ్ దొరికేది కాదు అంటున్నాడు. రికమండేషన్ ఆ తండ్రికి ఇష్టం ఉండదా? ఈ కొడుక్కి నచ్చదా? వీఐపీలకి దొరికే ట్రీట్మెంట్ ఏవిటో కొన్ని గంటల ముందే ప్రత్యక్షంగా చూసి ఉన్నాను. "మిమ్మల్ని సివిల్స్ వైపు వెళ్ళమనలేదా?" కుతూహలంగా అడిగాను. "నేను చాలా అదృష్టవంతుడిని. చదువు, ఉద్యోగం, ఇప్పుడు వచ్చిన ఛాన్సులు.. ఏ విషయంలోనూ కలగజేసుకోలేదు.. కాకపోతే, పెళ్లి చేసుకోమని మాత్రం ప్రెషర్ చేస్తున్నారు" కొంచం సిగ్గు పడుతూ చెప్పాడు. "వాళ్ళూ అదృష్టవంతులే, ఇలాంటి కొడుకు ఉన్నందుకు" అప్రయత్నంగా పైకే అనేసి, "మంచి పిల్ల జతపడాలి" అని మనసులో దీవించా, అప్పదాసులా. "మా నాన్నగారి రూట్స్ తెలుగు అని ఈ మధ్యనే తెలిసింది. నాకు తెలుగు నేర్చుకోవాలని ఉంది.. సులువే అంటున్నారు అందరూ.." అన్నాడు. "కన్నడకి దగ్గరగానే ఉంటుంది, సులువే" అన్నాను. చాలా సేపు కబుర్లు నడిచాయి. 

"నా విషయంలో మీరైతే ఏ నిర్ణయం తీసుకుంటారు?" ఉన్నట్టుండి అడిగాడు. ఊహించని ప్రశ్న కాదు. "ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది.. మీ ప్లేసులో, మీ వయసులో  ఉంటే నేనైతే చదువుకి వెళ్తాను" అతని మొహం వెలిగిపోయింది. "నాకూ చదువే ఇష్టం.. కానీ జాబ్ ఆఫర్ బాగా టెంప్ట్ చేస్తోంది. మా ఫ్రెండ్స్ చాలామంది ఎదురు చూసిన ఛాన్స్, అది నాకు వచ్చింది.. అందుకే..." ..."మీరు మంచి నిర్ణయమే తీసుకుంటారు.. ఆల్ ది బెస్ట్" అన్నాను. నేను బయల్దేరాల్సిన వేళవుతోంది. అతని ప్రయాణం రాత్రి హారతి తర్వాతట. "మారుతి టిఫిన్ సెంటర్ సాయంత్రం కూడా ఉంటుంది. ఏదన్నా తినేసి వెళ్ళండి. అదే రోడ్ లో తిన్నగా వెళ్లి ఎడమకి తిరిగితే బస్టాండ్.. వర్షం తగ్గింది కాబట్టి నడిచి వెళ్లిపోవచ్చు.. ఈ ఊళ్ళో మిరియాలు తప్ప షాపింగ్ చేయాల్సింది ఏమీ ఉండదు. కాంపౌండ్ బయట చూడాల్సినవి రెండు మూడు ఆలయాలున్నాయి, కానీ మీకు టైం లేదు, పైగా వర్షం" ఒక్కొక్కటిగా చెప్పాడు. "ఇది నాకు అన్ ప్లాన్డ్ ట్రిప్.. కేవలం మీవల్ల చాలా బాగా జరిగింది అనిపిస్తోంది.. గ్రేట్ మీటింగ్ యు.." అన్నాను బయల్దేరుతూ.. చేయి సాచాడు, తొలి హ్యాండ్ షేక్. "మనం ఈసారి ప్లాన్ చేసుకుని ఏదన్నా ట్రిప్ కి వెళదామా, నేను అబ్రాడ్ వెళ్ళేలోగా?" అడిగాడు. "తప్పకుండా..." ఇది దాదాపు నా ఊతపదం. 

గుడి దగ్గర వాతావరణం ఉదయం ఉన్నట్టే ఉంది. టిఫిన్ సెంటర్ దగ్గర కూడా అంతే. ఈసారి మాత్రం స్నేహితుల ఇంటికి వెళ్లినంత చొరవగా లోపలి వెళ్లి కూర్చున్నా. వండి వడ్డించే వాళ్ళు వాళ్ళే, మెనూ కూడా అదే. ఆశ్చర్యం ఏమిటంటే అందరూ గుర్తు పట్టి పలకరించారు. బిల్లు రాస్తుండగా "ఇంకొక్క కాఫీ తాగుతాను, ఇంకొంచం స్ట్రాంగ్ గా.." అడిగేశాను నిర్మొహమాటంగా. ఆ వేళ్టి మూడో కాఫీ ఘుమఘుమలాడుతూ నా ముందుకు వచ్చింది. బిల్లు చెల్లించి నడక మొదలు పెట్టాను. ఏ క్షణంలో అయినా మళ్ళీ వర్షం పడేలా ఉంది వాతావరణం. పాతకాలపు ఇళ్ళు, వాటి మధ్యలో సరికొత్త మేడలు. జనం తాకిడికి బాగా అలవాటు పడిన మనుషులు. గుడిని మినహాయిస్తే ఓ చిన్న పల్లెటూరు. బస్సు నా కోసం ఎదురు చూస్తోంది. సీట్లో కూర్చుని ఫోన్ తీసి మెసేజ్ టైపు చేశాను "థాంక్స్ ఫర్ మేకింగ్ మై ట్రిప్ మెమరబుల్". కిటికీ లోంచి బయటికి చూస్తుంటే పచ్చని శృంగేరి వెనక్కి వెళ్ళిపోతోంది. గాలితో పాటుగా చినుకులు పలకరిస్తున్నాయి. అద్దం మూసి ఫోన్ చూస్తే, జవాబు ఎదురు చూస్తోంది "హేపీ జర్నీ.. శృంగేరి మళ్ళీ వద్దామా? ఇంకెక్కడికైనా వెళదామా?" ... "ప్లాన్ చేద్దాం.." రిప్లై ఇచ్చి వెనక్కి వాలాను. 

(అయిపోయింది)

సోమవారం, సెప్టెంబర్ 04, 2023

శృంగేరి-1

"ఒక్కొక్కరికి రూములు ఇవ్వం.. కనీసం ఇద్దరుండాలి..." మధ్వ సంప్రదాయపు పంచెకట్టు, బొట్టు, గుండు, పిలకతో కంప్యూటర్ ముందు కూర్చున్న బలమైన రిసెప్షనిస్టు కన్నడ-ఇంగ్లిషుల కలగలుపుతో గద్దిస్తూ ఉంటే, ఓ క్షణం పాటు తక్షణ కర్తవ్యం బోధ పడలేదు నాకు. అప్పటికే ఆ గద్దింపు భరించి, ఏం చెయ్యాలో తోచక నిలబడ్డ కుర్రాడి మీద పడింది నా దృష్టి. "మనం రూమ్ షేర్ చేసుకుందామా?" చొరవగా అడిగాను ఇంగ్లిష్లో. నన్నోసారి పరకాయించి చూసి, సరే అన్నట్టు తలూపాడు. "ఇదివరకే ఫ్రెండ్స్ అయితే సరే.. కానీ ఇక్కడ కలిసి రూమ్ తీసుకున్న వాళ్ళు, తర్వాత వచ్చి ఏ కంప్లైంట్ చేసినా నేను రెస్పాన్సిబుల్ కాదు" అడక్కపోయినా చెప్పేశాడు రిసెప్షనిస్టు. ఇద్దరి వివరాలూ క్షుణ్ణంగా టైపు చేసి, మూడొందలు కట్టమన్నాడు. కుర్రాడు వాలెట్ తెరిచేలోగా, ఐదొందల నోటు తీసి ఇచ్చాను. నేను చిల్లర అందుకునే లోగా, తన నూటేభై నా బ్యాక్ పాక్ లో పెట్టేశాడు బెంగళూరు నుంచి వచ్చిన నా రూమ్మేట్. అలా నా శృంగేరి యాత్రలో రూమ్ తీసుకొనుట అనే తొలిఘట్టం పూర్తయ్యింది. 

ఊరింకా పూర్తిగా తెల్లవారలేదు. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటోంది, మాలాగే. 'యాత్రి నివాస్' లో మా రూముకి చేరాం. రెండు పెద్ద మంచాలు, వాష్ రూములు, ఛేంజింగ్ రూము.. మొత్తం కలిపి ఓ సింగల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అంత ఉంది. "మీరు స్నానం చేసేయండి, నేను తర్వాత చేస్తాను" మంచి ఇంగ్లిష్లో చెప్పి ఫోన్లో తల దూర్చాడు రూమ్మేట్. ఫార్మల్ పరిచయాలు రిసెప్షనిస్టు సమక్షంలోనే అయిపోయాయి కదా. చలిగా, వర్షం వచ్చేలా ఉంది బయట వాతావరణం. హాయిగా వేడినీళ్ల స్నానం. రెడీ అయి బయటికి వచ్చిన నన్ను చూసి ఫోన్ పక్కన పెట్టాడు. "రిసెప్షన్ బిల్డింగు దాటి కొంచం ముందుకు వెళ్తే కుడివైపు మారుతి టిఫిన్ సెంటర్ అని ఉంటుంది, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయండి, బాగుంటుంది" చెప్పాడు. "గుడికి వెళ్లొచ్చాక బ్రేక్ఫాస్ట్ కదా" అన్నాన్నేను.  "ఒకసారి లోపలికి వెళ్తే భోజనం చేసే బయటికి వస్తాం. ఇక్కడ అందరూ బ్రేక్ఫాస్ట్ చేసే గుడికి వెళ్తారు. నేను బహుశా స్వామీజీ దర్శనం దగ్గర మిమ్మల్ని కలుస్తాను" ఈ 'స్వామీజీ దర్శనం' ఏవిటో అర్ధం కాక అయోమయంగా తలూపాను. 

కష్టపడక్కర్లేకుండానే మారుతి టిఫిన్ సెంటర్ అడ్రస్ దొరికేసింది. బయట కొందరు తమవంతు కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు. అక్కడున్న చిన్న ట్యాప్ దగ్గర కాళ్ళు, చేతులు కడుక్కుని నేనూ వరుసలో నిలబడ్డా. లోపలి నుంచి మా అందరికీ పిలుపొచ్చింది. బాగా పాతకాలపు ఇంట్లో ఓ చివరి వాటా. సన్నని, పొడవాటి హాలు. గచ్చు నేల మీద రెండు వైపులా చాపలు పరిచి ఉన్నాయి. తగు చోటు చూసుకుని కూర్చున్నా. ఉత్తరీయాన్ని నడుముకి కట్టుకున్న మధ్వాచార్యులు ఒకాయన వచ్చి అందరి ముందూ అరిటాకులు పరిచి వెళ్లారు. వెనుకే మరో ఆయన మంచి నీళ్ల గ్లాసులతో వచ్చారు. ఆకు శుభ్రం చేసుకునే లోగా, మొదటి ఆయన వేడి వేడి ఇడ్డెన్లతోనూ, రెండో ఆయన చట్నీతోనూ ప్రత్యక్షం. అటు పైన చిక్కటి సాంబారు, వడలు, పూరీలు, కూర ఒకదాని వెంట మరొకటి వచ్చాయి. కావలిస్తే వేయించుకోవడం, వద్దనుకుంటే చేయి అడ్డం పెట్టడం తప్ప మాటలేవీ లేవు. తినడానికి తప్ప నోరు తెరవడం లేదు ఎవ్వరూ. ఏదో నందికేశుడి నోముకి వచ్చినట్టు ఉంది తప్ప, ఎక్కడా హోటల్ లో టిఫిన్ తింటున్నట్టు లేదు. 

వడ్డించిన టిఫిన్ల వేడికి అరిటాకు కమిలి పోయింది. వంటకాల రుచి, నాణ్యత ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. "కాఫీ? టీ?" ఆకులేసిన ఆయన అందరినీ అడిగాడు. మొత్తం మీద ఓ పాతిక మందిమి ఉన్నాం. పూరీ పూర్తి చేసేలోగా పొగలు కక్కే కాఫీ వచ్చింది. తాపీగా తాగుతూ ఉండగా అప్పుడొచ్చాడు మూడో మనిషి, చేతిలో పుస్తకం, పెన్నుతో. ఏమేం తిన్నామో చెబితే బిల్లు వేసి ఇస్తాడన్నమాట. ఏవి ఎన్నేసి తిన్నామో గుర్తు చేసుకోవడం కాస్త కష్టమైన వ్యవహారమే. ఎవర్నీ ఆకులు మడవనివ్వలేదు. ఆకులు వేసినాయనే ఓ బుట్టతో వచ్చి అన్నీ తీశాడు, ఆ వెనుకే రెండో ఆయన తడి బట్టతో గచ్చు తుడిచేశాడు.   బిల్లు అందుకుని నేరుగా ముందుకి వెళ్తే (వన్ వే) కిచెన్ లో ఉన్నాయన డబ్బు తీసుకున్నాడు. అటు నుంచి పెరట్లోకి వెళ్లి చెయ్యి కడుక్కుని, సందు గుండా వీధిలోకి రావాలి. దాదాపు వందేళ్ల నుంచి అదే ఇంట్లో అదే పద్ధతిలో నడుస్తోందిట ఆ చిన్న హోటల్. బయటికి వచ్చేసరికి తర్వాతి బ్యాచి వాళ్ళు వాళ్ళ వంతు కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉన్నారు. 

ఎండ వేడి చురుక్కుమంటూండగా విశాలమైన ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టాను. కుడి వైపున వరుసగా ఆలయాలు, ఎడమవైపున వరుసగా పెద్ద పెద్ద హాళ్లు - ఆధ్యాత్మిక సమావేశాల మొదలు అక్షరాభ్యాసాల వరకూ అనేక కార్యక్రమాలు సామూహికంగా నిర్వహించుకోడానికి వీలుగా. మొదట శారదాంబ ఆలయం. హారతి అవుతోంది. భక్తుల రద్దీ మరీ ఎక్కువగా లేదు. బారికేడ్స్ ఉన్నా, ప్రదక్షిణకి వీలుగా ఉంది ఏర్పాటు. ప్రదక్షిణ పథంలో చిన్న చిన్న ఉపాలయాలున్నాయి. హారతి చాలాసేపు జరగడంతో, కాసేపు సన్నిధిలో నిలబడే వీలు చిక్కింది. బయటికి వచ్చేసరికి ఆకాశంలో మబ్బులు. 'అరే' అనిపించింది. వరుసలో తర్వాత ఉన్నది విద్యా శంకర ఆలయం. హోయసాల, విజయనగర ఆర్కిటెక్చర్ల కలగలుపుగా కనిపించే ఈ ఆలయం ప్రత్యేకత లోపల మహా మండపంలో ఉండే పన్నెండు స్థంభాలు. ఒక్కో స్థంభం ఒక్కో రాశికి ప్రతీక. సూర్యుడు ఏ నెలలో ఏ రాశిలో ఉంటాడో ఆ స్థంభం మీద మాత్రమే సూర్యకిరణాలు పడతాయి. ఆ అద్భుతాన్ని కళ్లారా చూడడానికి వీలు లేకుండా శ్రావణ మాసపు కరిబ్బులు అడ్డం పడ్డాయి. 

దశావతారాల మొదలు యక్షిణులు వరకూ అనేక శిల్పాలను పరిశీలిస్తూ ప్రదక్షిణ చేస్తున్నా. ఫోటోల వాళ్ళతో పాటు, వ్లాగర్లు, రీల్స్ వారు, వాట్సాప్ లైవ్ వారు... ఇలా అందరినీ దాటుకుంటూ, కొందరికి అడ్డు తప్పుకుంటూ, మరికొందరికి అడ్డుపడుతూ ప్రదక్షిణ పూర్తి చేసి లోపలికి అడుగుపెట్టేసరికి అక్కడ ఇంకో కోలాహలం. ఏదో ప్రత్యేక పూజ జరుగుతోంది. భక్తులు చాలామంది ఉండడంతో స్థంభాలని బాగా చూడడం వీలవ్వలేదు. దర్శనం పూర్తి చేసుకుని బయటికి వచ్చి, ఒకరిద్దరికి ఫోటోలు తీసి పెట్టి ముందుకు వెళ్తే మరో రెండు ఉపాలయాలు కనిపించాయి. అవి చూసుకుని తుంగ నది దగ్గరకు చేరేసరికి మబ్బులు మరికాస్త చిక్కబడ్డాయి. స్నానానికి అనుమతించరు కానీ తుంగలో పాద ప్రక్షాళనకి వీలుంది. పెద్ద పెద్ద రాతి మెట్లు జాగ్రత్తగా దిగుతూ ఉంటే మోకాళ్ళు కలుక్కుమన్నాయి. 

తీరా కాళ్ళు కడుక్కునే వేళకి భారీ చేపలు కాళ్ళ మధ్య అడ్డం పడడం  మొదలెట్టాయి. ఆకారానికి మొసలి పిల్లల్లా ఉన్నాయవి. చాలామంది భక్తులు అక్కడే కొన్న మరమరాలు వాటికి ఆహారంగా పెడుతున్నారు. డైట్ లో కార్బ్స్ మరీ ఎక్కువైతే జరిగే పరిణామం ఏవిటో వాటి పరిమాణం చెబుతోంది. పక్కనెవరో భక్తులు ఒక్కో చేపనీ ఎంతమందికి వండి పెట్టొచ్చో అంచనా వేస్తున్నారు (ఆ రేవులో వేట నిషిద్ధం). కాస్త కష్టపడి మెట్లెక్కి పైకి వస్తే తుంగ మీద ఒక వంతెన ఉంది. అవతల పక్క ఏముందో చెప్పే బోర్డు కన్నడలో ఉంది. కొందరు భక్తులు వెళ్తున్నారు. నేనూ బయల్దేరాను. బ్రిడ్జి మధ్యలో నిలబడితే తుంగ అలలతో పాటు, చేపలూ (చేప  పిల్లలు అనలేం) బాగా కనిపిస్తున్నాయి. 'చెలి పయ్యెదలో తుంగ అల పొంగాలీవేళ..' వేటూరి గుర్తొచ్చారు. కేవలం ఏముందో చూసొద్దాం అనే కుతూహలం ముందుకు నడిపించింది. 

అడుగు పెట్టగానే తెలిసింది అది లంక అని. సారవంతమైన నేల, ఆపై వర్ష ఋతువు కావడంతో పచ్చగా హరిత ద్వీపంలా ఉంది. కానైతే, పూలమొక్కలు, పళ్ళ చెట్లు మొదలు పచ్చిక వరకూ అన్నీ క్రమశిక్షణతో పెరుగుతున్నాయక్కడ. ఫెన్స్ కి ఆవల రెండు జింక పిల్లలు ఓ లేగ దూడ పచ్చిక మేస్తూ కనిపించాయి. బొమ్మలేమో అనుకున్నా ఒక్క క్షణం. కదులుతున్నాయి. బలమైన గజరాజు, బక్కపలచటి మావటి ఎదురొచ్చారు. మావటిని చూడగానే 'వేలాయుధం' గుర్తొచ్చేశాడు.  శంకరాచార్యుల సందేశాలని కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో రాసిన బోర్డులున్నాయి అక్కడక్కడా. వాటిని చదువుకుంటూ ముందుకు వెళ్తే 'ప్రయివేట్ సెక్రటరీ'స్ ఆఫీస్' అని బోర్డున్న ఓ చిన్న బిల్డింగు, ఆ వెనుకే గెస్టు హౌసు, కాస్త ముందుకెళ్తే ఓ ఆలయం, యాగశాల, గురు నివాసం కనిపించాయి. ఒక్కొక్కటీ చూసుకుంటూ గురు నివాసం చేరేసరికి చినుకులు మొదలయ్యాయి. అప్రయత్నంగానే గురు నివాసానికి వెళ్లాను. వెళ్లాకే తెలిసింది, అది శృంగేరి పీఠానికి కాబోయే జగద్గురువు విదుశేఖర భారతీ స్వామి భక్తులకి దర్శనం ఇచ్చే చోటు అని. 

విశాలమైన పెద్ద హాలు. ఎదురుగా వేదిక. గుడి కన్నా చిన్నది, పూజా మందిరం కన్నా పెద్దది అయిన దేవుని మండపం. వేదికకి ఎదురుగా హాలు మధ్యలో కూర్చున్నా. నాకు ఎడమవైపున 'పాదపూజ' అని బోర్డు, అక్కడి నుంచి వేదికపై ఓ ప్రత్యేకమైన బారికేడ్ కనిపించాయి. కుడివైపున మరో బారికేడ్ ఉంది. వేదికని ఆనుకుని కుడి వైపున భారీ గాజుపెట్టెలో ఒక వీణ ఉంది. అది ప్రపంచంలోనే అతి పెద్ద వీణ అట. స్వామీజీ అంతేవాసులు, బహుశా పరిచారకులు అంటారనుకుంటా, కొందరు మండపంలో పూజలు చేస్తుంటే మరి కొందరు తీర్ధ ప్రసాదాలు ఏర్పాటు చేస్తూ హడావిడి పడుతున్నారు. ఏక్షణంలో అయినా స్వామీజీ లోపలి నుంచి బయటికి రావచ్చు అన్నట్టుగా ఉంది వాతావరణం. పరిచారకుల హడావిడి చూస్తుంటే 'బంగారు మురుగు' కథలో బామ్మ గుర్తొచ్చింది. బుర్రలో తిరుగుతున్న ఆ ఛానల్ ని బలవంతంగా ఆపి చుట్టూ చూస్తే హాల్లో జనం పలచగా ఉన్నారు. కొందరు ధ్యానం చేసుకుంటున్నారు. నేనూ ప్రయత్నించాను కానీ అంత కుదురెక్కడిది? 

(ఇంకావుంది)