శుక్రవారం, ఫిబ్రవరి 03, 2023

'కళాతపస్వి' విశ్వనాథ్ ...

సుమారు పదేళ్ల క్రితం అనుకోకుండా ఓ అవకాశం వచ్చింది. దర్శకుడు కె. విశ్వనాథ్ తో దాదాపు ఓ గంటసేపు తాపీగా మాట్లాడే అవకాశం వస్తుందని అంతకు ముందెప్పుడూ ఊహించలేదు. అప్పటికి 'శుభప్రదం' సినిమా విడుదలయ్యింది. అంతబాగా ఆడలేదు. అంతకు ముందు వచ్చిన 'స్వరాభిషేకం' సినిమాకి జాతీయ అవార్డు వచ్చినా జనం మెచ్చలేదు. విమర్శకుల ప్రశంసలూ దక్కలేదు. ఈ నిరాశ కొంత, వయోభారం మరికొంత కలిసి అప్పటికే దర్శకత్వానికి, నటనకి దూరం జరిగారు. అయితే ఊహించని కొత్త కెరీర్ అవకాశం ఒకటి ఆయన తలుపు తట్టింది. వాణిజ్య ప్రకటనలకి మోడలింగ్ చేయడం అప్పట్లోనే మొదలు పెట్టారు. నేనేమో 'శుభప్రదం' మీద పెద్దగా అంచనాలు పెట్టుకోకపోడానికి కారణం, 'స్వరాభిషేకం' తీవ్రంగా నిరాశ పరచడమే. పైగా, ఇప్పటికీ చక్కని మ్యూజిక్ ఆల్బమ్ అది. 

"శంకరాభరణం నాటికి మీరు నటులు కాదు కానీ, ఒకవేళ శంకర శాస్త్రి పాత్ర మీరే వేసి ఉంటే ఆ సినిమా ముగింపు మరోలా ఉండేదేమో కదా" అన్న నా ప్రశ్న కారణంగానే 'హలో' తో ఆగిపోవాల్సిన సంభాషణ చాలాసేపు సాగింది. "అంటే మీ ఉద్దేశం, స్వరాభిషేకం క్లైమాక్స్ లో అన్న పాత్రని చంపేసి ఉండాల్సిందనా?" సూటిగానూ, స్పష్టంగానూ అడిగారు విశ్వనాథ్. నేనూ నీళ్లు నమల దలచుకోలేదు. ఫోటోల కోసం తన దగ్గరికి రాబోతున్న వాళ్ళని  ఆగమని చే సైగ చేశారు. ఏయే నిజజీవిత సంఘటలని ఆధారం చేసుకుని ఆ కథ రాసుకున్నారో ఆయన చెబితే, ప్రేక్షకుడిగా నా అభ్యంతరాలని నేను చెప్పాను. ఉన్నట్టుండి, "మీకిష్టమైన నా సినిమా ఏమన్నా ఉందా?" అని అడిగారు. "చాలా ఉన్నాయండి.. మొదటిది సాగర సంగమం" చెప్పాన్నేను. 

ఈ పదేళ్లలోనూ నాటి సంభాషణని చాలాసార్లు గుర్తు చేసుకున్నాను. మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో 'ఫిలిం అప్రిసియేషన్' తక్కువ అన్నది ఆయన ఫిర్యాదు. "మీరు, బాపూ గారు, వంశీ గారు సినిమాలు తీయకపోతే కలర్ సినిమాల్లో మనకి కమర్షియల్ మాత్రమే మిగిలేవేమో " అన్నాను సిన్సియర్ గానే. "వంశీ నాదగ్గర పనిచేశారు, 'శంకరాభరణం' సినిమాకి" అన్నారు. "అవునండి, సినిమా నవల రాశారు కదా" అని, సోమయాజులు కాళ్ళకి కొబ్బరినూనె రాసి నడిపించిన సీన్ గుర్తుచేశాను. సంతోషపడ్డారు. ఒక్క 'స్వరాభిషేకం' టాపిక్ లో అసంతృప్తి తప్ప, మిగిలిన సినిమాల గురించి ఇష్టంగా మాట్లాడారు ('సీతామాలక్ష్మి' మాత్రమే మినహాయింపు). రిలీజుకి నోచుకోని 'సిరిమువ్వల సింహనాదం' గురించి, తీయకుండా ఉండాల్సింది అనిపించే 'జననీ జన్మభూమి' 'చిన్నబ్బాయి' లాంటి సినిమాల గురించీ నేను మాట్లాడినా అభ్యంతర పెట్టలేదు. "కొన్ని అలా జరుగుతూ ఉంటాయి, అంతే" అని మాత్రమే అన్నారు. 

Google Image

సంభాషణ మొదలైన కొంతసేపటికి 'స్వరాభిషేకం' విషయంలో కొంచం కటువుగా మాట్లాడనేమో అనే గిల్ట్ మొదలైంది. బహుశా అందుకే కావొచ్చు, ఆయన సినిమాల్లో నాకు బాగా నచ్చిన సీన్లని ప్రస్తావించాను. 'స్వాతిముత్యం' లో రాధికకి పెళ్లి చేసుకుని వచ్చిన కమల్, నిర్మలమ్మ మరణాన్ని పట్టించుకోకుండా, వరలక్ష్మితో "చిట్టీ, ఆకలేస్తోంది.. అన్నం పెట్టవా" అన్నప్పుడు రాధిక ఇచ్చిన ఎక్స్ప్రెషన్, 'స్వాతికిరణం' లో మమ్ముట్టిలో అసూయ పెరిగే క్రమం.. ఇలాంటివన్నీ శ్రద్ధగానూ, సంతోషంగానూ విన్నారు. చిన్న చిన్న న్యూయాన్సెస్ ని పట్టించుకుని కేప్చర్ చేసే శ్రద్ధ నాకు భలే ముచ్చటగా అనిపిస్తుంది. 'శుభలేఖ' లో సుమలత కళ్ళజోడు, 'సప్తపది' లో డబ్బింగ్ జానకి స్నానం చేసొచ్చి, బొట్టు దిద్దుకున్నాక మాత్రమే సోమయాజులు ప్రశ్నకి జవాబివ్వడం ఇలాంటివన్నీ. వీటిలో చాలా సంగతుల్ని ఆవేళ చెప్పనే లేదు. 

'సిరిసిరిమువ్వ' సినిమా రాకపోయి ఉంటే, విజయం సాధించకపోయి ఉంటే, గత శతాబ్దపు ఎనభయ్యో దశకం నుంచి తెలుగు సినిమా  పూర్తిగా 'కమర్షియల్' బాటలోనే సాగి ఉండేదన్నది నిర్వివాదం. 'సిరిసిరిమువ్వ' విజయం, విశ్వనాథ్ కి ప్రయోగాత్మక సినిమాలు తీసే ధైర్యాన్నిస్తే, ఆయా సినిమాల విజయాలు మిగిలిన దర్శక నిర్మాతలు 'డిఫరెంట్' సినిమాలు తీయడానికి దోహదం చేశాయి. కొన్ని చెప్పుకోదగిన సినిమాలొచ్చాయి. సినిమా రంగానికి వేటూరిని, సిరివెన్నెలని పరిచయం చేసి సినిమా సాహిత్యం పదికాలాల పాటు నిలవడానికి తనవంతు కాంట్రిబ్యూట్ చేశారు విశ్వనాథ్. 'సర్గం' తో జయప్రదని జాతీయ స్థాయి కథానాయికగా మలిచారు. 'శంకరాభరణం' తర్వాత పెరిగిన సంగీతం క్లాసుల గురించీ, 'సాగర సంగమం' తర్వాత మొలిచిన డేన్సు స్కూళ్ల గురించీ ఎంత చెప్పుకున్నా తక్కువే. 

నిండు జీవితాన్ని చూశారు విశ్వనాథ్. వ్యక్తిగా మాత్రమే కాదు, దర్శకుడిగా ఆయన కెరీర్ కీ ఈ మాట వర్తిస్తుంది. ఓ దర్శకుడు తీసిన మొత్తం సినిమాల్లో కాలానికి నిలిచే వాటి శాతం అనే లెక్కవేస్తే, తెలుగు దర్శకుల జాబితాలో విశ్వనాథ్ ముందుంటారు. దర్శకుడిగా స్థిరపడి, ఆపై తనకంటూ ఓ మార్గాన్ని నిర్మించుకుని, చివరికంటా అదే మార్గంలో ప్రయాణం చేశారు. ఆ మార్గంలో ప్రయాణం అంత సులువైనదేమీ కాదనడానికి, ఇంకెవరూ ఆ దారి తొక్కే సాహసం చేయలేకపోడాన్ని మించిన ఉదాహరణ అవసరం లేదేమో. విశ్వనాథ్ కృషికి తగ్గ గౌరవం, గుర్తింపు జీవించి ఉండగానే దొరికాయి. భిన్నమైన సినిమాలు తీసినా వాటికి లభించిన ప్రేక్షకాదరణే నిజానికి అతిపెద్ద పురస్కారం. హిట్, ఫ్లాపు లకి అతీతంగా ఆయనతో సినిమా చేయడమే గౌరవంగా నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రమే కాక నిర్మాతలు కూడా భావించడానికి మించిన అవార్డు ఏదన్నా ఉంటుందా? తెలుగు సినిమా చరిత్రలో ప్రస్తావించి తీరాల్సిన వ్యక్తిగా తనని తాను తీర్చిదిద్దుకున్న కళాతపస్వి ఆత్మకి శాంతి కలగాలి.