మంగళవారం, నవంబర్ 15, 2022

నటశేఖర ...

వెండితెర మీద కృష్ణ అంటే ఓ బాధ్యత కలిగిన అన్నయ్య. విలన్లు మినహా మిగిలిన అందరూ సులభంగా గుర్తుపట్టగలిగే మారువేషాల్లో తిరిగే గూఢచారి. రాకుమారుడు. విప్లవ వీరుడు. త్యాగశీలి. అనురాగమూర్తి. ఇంకా ఎన్నో, ఎన్నెన్నో. వాల్ పోస్టర్లు అతికించే గోడల మీద తరచూ మారే పోస్టర్లలో హీరో కృష్ణే. ఒక్కోసారి రెండేసి సినిమాల పోస్టర్లు పక్కపక్కన కనిపించేవి. ఎంటీ వోడి పోస్టర్లకీ, నాగేసర్రావు పోస్టర్లకీ జరిగే పేడముద్దల సత్కారం నుంచి కృష్ణ పోస్టర్లు చులాగ్గా తప్పించేసుకునేవి. అంతేనా? శోభన్ బాబు సినిమా రాగానే "చివరికి ఏ హీరోయిన్ చచ్చిపోతుంది?" అనే చర్చ బాగా జరిగేది. కాసిని మినహాయింపులు ఉన్నప్పటికీ, వెండితెర మీద కృష్ణ ఏకపత్నీవ్రతుడే. 

తెలుగు సినీ కళామతల్లికి రెండు కళ్ళుగా భుజకీర్తులందుకున్న ఎంటీఆర్, ఏఎన్నార్లు పరిశ్రమని ద్విచత్రాధిపత్యంగా ఏలుతున్న రోజుల్లో సినిమాల్లో ప్రవేశించిన కృష్ణకి సినిమాల్లో నిలదొక్కుడానికి దోహదం చేసినవి కులమూ,  క్రమశిక్షణా. తనకన్నా తనతో పాటు సినిమాలకి పరిచయం అయిన వాళ్ళ నటనకే ఎక్కువ మార్కులే పడినా హీరోగా కృష్ణ మిగలగా, మిగతా వాళ్ళు తెరమరుగయ్యారు. తనో అద్భుతమైన నటుడినని కానీ, తను వేస్తేనే స్టెప్పులని కానీ ఏనాడూ అనుకోకపోగా, తన మీద తానే జోకులేసుకోగల ధీశాలి కృష్ణ. పేరు చక్రపాణిది వేసినా, బాపూ దర్శకత్వం వహించిన సినిమా 'శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్'. తర్వాత చాన్నాళ్ళకి బాపూ దర్శకత్వంలో 'కృష్ణావతారం' సినిమా ('మేలుకోరాదా కృష్ణా' పాట భలేగా ఉంటుంది). 

ఏదో షాట్ రీటేక్ చేద్దామని దర్శకుడు అనుకుంటే, "ఇన్నాళ్లలో ఏమన్నా నటన నేర్చుకున్నానని అనుకుంటున్నారేమో బాపూ గారు, అలాంటిదేమీ లేదని చెప్పండి" అని చమత్కరించినట్టుగా 'కోతికొమ్మచ్చి' కథనం. ఇదొక్కటేనా, అంతటి ఎంటీఆర్ కి వ్యతిరేకంగా సినిమాలు తీసి, బాలూతో విరోధాలొచ్చి రాజ్ సీతారామ్ ని తీసుకొచ్చి పాడించీ కూడా 'అజాత శత్రువు' అనిపించేసుకోగలగడం కేవలం కృష్ణకే చెల్లు. ముక్కీ, మూలిగీ మూడేళ్లకో సినిమా చేస్తున్న ఇప్పటి హీరోలని చూసినప్పుడు, ఏడాదికి ఏకంగా పదిహేడు సినిమాలు చేసేసిన కృష్ణ 'పని రాక్షసుడు' అనిపించక మానడు. చేసిన అన్ని సినిమాలూ హిట్లవ్వవనీ, అప్పుడప్పుడూ ఓ హిట్ అన్నా లేకపోతే నిలబడ్డం కష్టమనీ బాగా తెలిసిన వాడు మరి. 

ఇప్పుడంటే సినిమా వేషాలు కాస్త వెనకబడ్డ నటీనటులందరూ టీవీ వైపు వచ్చేస్తున్నారు కానీ, శాటిలైట్ టీవీల శకం మొదలైన తొలినాళ్లలో సినిమా వాళ్ళకి టీవీ మీద చిన్నచూపు ఉండేది. దాన్ని బద్దలు కొట్టినవాడు కృష్ణే. ఈటీవీ కోసం 'అన్నయ్య' సీరియల్లో టైటిల్ పాత్ర. విజయనిర్మల నాయిక. "ఇంతచిన్న వయసులోనే మీమీద ఇన్ని బాధ్యతలు పడ్డాయి" అని ఆమె గాద్గదికంగా చెప్పిన డైలాగు, డ్రాయింగ్ రూముల్లో నవ్వులు పూయించింది. నా మిత్రులొకరు కృష్ణకి వీరాభిమాని. దూరపు బంధుత్వం కూడా ఉంది. మహేష్ బాబు లాంచింగ్ కి ఈయన్ని పిలిచి, సినిమా షూట్ అవుతుండగా "మనవాడు పర్లేదంటారా?" అని అడిగారట. రమేష్ బాబు విషయంలో ఉన్న అసంతృప్తి నుంచి వచ్చిన ప్రశ్న అని మిత్రుడి ఉవాచ. తర్వాతి కాలంలో ఆ అసంతృప్తిని మహేష్ బాబు సమూలంగా తుడిచేశాడు. 

కృష్ణ లాగే కృష్ణ అభిమానులు కూడా సాధుస్వభావులు. మిగిలిన హీరోల మీద గరిక వాలినా వాళ్ళ అభిమానులు భరించలేరు. అలాంటిది కృష్ణ మీద లెక్కకు మిక్కిలి మిమిక్రీలు, స్పూఫులు వచ్చినా ఒక్క అభిమానీ రచ్చ చెయ్యలేదు. "అవునండీ మావాడికి డేన్స్ రాదు. వచ్చని ఎప్పుడూ చెప్పుకోలేదు కదా? తనకేం వచ్చో అదే చేశాడు, మాకు నచ్చింది" అన్నాడు కృష్ణ వీరాభిమాని ఒకాయన ఆమధ్యన. వాళ్ళబ్బాయికి మహేష్ బాబు వయసుంటుంది. "మావాడి పాటల్లో మీకు వెంటనే గుర్తొచ్చేవి ఓ రెండు చెప్పండి" అని పరీక్ష కూడా పెట్టాడు నాకు. 'ఎక్కడో చూసిన జ్ఞాపకం' 'చుక్కల తోటలో ఎక్కడున్నావు' లని ప్రస్తావించి అగ్ని లంఘనం చేశాను. కాసేపు కృష్ణ పాటల చర్చ జరిగింది. ఏ పాట ఏ సినిమా లోదో, అందులో హీరోయిన్ ఎవరో, ఆ సినిమా ఎన్ని రోజులాడిందో ఇవన్నీ ఆయనకి కరతలామలకం. 'ఇది కదా అభిమానం అంటే' అనిపించేసింది నాకు. 

సినిమాని ప్రేమించిన వాడూ, సినిమా కోసమే చివరికంటా బతికిన వాడు కృష్ణ. తెలుగు సినిమాకి ఎన్నో జిలుగులద్దాడు. తన ఖాతాలో ఎన్ని 'తొలి' లో! 'తెలుగు సినిమాకి కృష్ణ చేసిన అతిపెద్ద కంట్రిబ్యూషన్ మహేష్ బాబు' అన్న చమత్కారాలని పక్కన పెట్టి చూస్తే, సినిమాల నుంచి సంపాదించిన దానిలో ఎక్కువ మొత్తాన్ని తిరిగి సినిమాల మీద ఖర్చు చేసిన వాడు కృష్ణ. విజయ నిర్మల గారి గిన్నిస్ రికార్డే ఇందుకు సాక్ష్యం. 'సినిమా నిర్మాణం జోలికి వెళ్లకుండా ఉండుంటే కృష్ణ దగ్గర హైదరాబాద్ మొత్తాన్ని కొనగలిగేంత ఆస్థి ఉండేది' అన్నమాట చాలామంది నుంచి విన్నాను. కించిత్ అతిశయోక్తి ఉండొచ్చు కానీ, నిర్మాణంలో పోగొట్టుకున్నది తక్కువేమీ కాదు. అందుకు పెద్దగా చింతించినట్టూ లేదు. దటీజ్ కృష్ణ. ఆయన ఆత్మకి శాంతి కలగాలి.