బుధవారం, జనవరి 24, 2024

పదిహేను ...

నిజానికి ఈ పోస్టు రాయడమా, వద్దా అని చాలా ఆలోచించాను. బ్లాగింగ్ మొదలు పెట్టి పదిహేనేళ్ళు పూర్తవ్వడం సంతోషం కలిగించే విషయమే. కానీ, గడిచిన ఏడాది బ్లాగు చరిత్రని తిరిగి చూసుకుంటే ఏమున్నది గర్వకారణం అనిపించింది. వ్యక్తిగత జీవితం తాలూకు ప్రభావం బ్లాగింగ్ మీద ఉండడం అన్నది ఎప్పుడూ నిజమే అయినా, గడించిన సంవత్సర కాలంలో అది మరింతగా రుజువయ్యింది. రాయాలని అనిపించక పోవడం, మొదలు పెట్టబోతూ వాయిదా వెయ్యడం, నెమ్మదిగా రాద్దాం అనుకోవడం...ఇలాంటి అనేక అనుభవాలే గుర్తొస్తున్నాయి నెమరువేతల్లో. ఏమీ సాధించక పోయినా ఏడాది తిరిగేసరికి పుట్టినరోజు వచ్చేసినట్టే, పెద్దగా రాయకపోయినా కేలండర్ మారడంతో బ్లాగుకీ పుట్టినరోజు వచ్చేసింది. ఇదొక సహజ పరిణామ క్రమం అన్నమాట. 

మరీ 'మా రోజుల్లో' అనబోవడం లేదు కానీ, పదిహేనేళ్ళు అయింది కాబట్టి నేను బ్లాగుల్లోకి వచ్చిన తొలినాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలనిపిస్తోంది. అప్పటికే తెలుగులో వందకి పైగా బ్లాగులుండేవి. ప్రతి వారం కొత్త బ్లాగులు జతపడుతూ ఉండేవి. కొందరు ప్రతి రోజూ, చాలామంది కనీసం వారానికి ఒకటి రెండు పోస్టులు రాసేవాళ్ళు. ఆవకాయ మొదలు అమెరికా రాజకీయాల వరకూ ప్రతి విషయం మీదా పోస్టులు, కామెంట్లలో చర్చలూ ఉండేవి. ఆవేశకావేశాలు లేకపోలేదు కానీ, కామెంట్ మోడరేటర్ పుణ్యమా అని అసభ్య కామెంట్లు, వ్యక్తిగత దూషణలు అరుదుగా తప్ప కనిపించేవి కాదు. తెలుగు బ్లాగు అగ్రిగేటర్లకి ట్రాఫిక్ పెరుగుతున్న కాలంలోనే కొన్ని వెబ్ మ్యాగజైన్లు కూడా ప్రారంభం అయ్యాయి. చదివేవాళ్ళు, రాసేవాళ్ళతో మంచి సాహిత్య వాతావరణం ఉండేది. 

Google Image

అప్పటితో పోలిస్తే బ్లాగులు రాసే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. అయితే, బ్లాగుల్ని చదివి, అభిప్రాయాలు పంచుకునే పాఠకులు ఇప్పటికీ కొనసాగుతున్నారు. అప్పట్లో ఆన్లైన్ లో తెలుగు కంటెంట్ అరుదుగా దొరికేది. ఇప్పుడు విస్తృతి పెరిగింది. చదవడానికి, చూసేందుకు కూడా కంటెంట్ కి లోటు లేదు. మోడరేషన్ లేని చర్చలు లైవ్ లో నడుస్తున్నాయి. సభా మర్యాదల్లోనూ మార్పు వచ్చింది. మైక్రో కంటెంట్ వెల్లువెత్తుతోంది. నాలుగైదు లైన్లు/అర నిమిషం వీడియోల్లో విషయాలని కొత్తగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. చదివే/చూసే వాళ్ళ ధోరణిలోనూ మార్పు కనిపిస్తోంది. ఒకప్పటిలా సుదీర్ఘమైన పోస్టులు, అర్ధవంతమైన చర్చలు అరుదుగా కనిపిస్తున్నాయి. మార్పు అనివార్యం. 

విస్తృతి పెరగడం తాలూకు విపర్యయం ఏమిటంటే కంటెంట్ చోరీ. బ్లాగుల్లో రాసుకున్న పోస్టులు లేదా వాటిలో కొన్ని భాగాలూ తెలియకుండానే ఇంకెక్కడో ప్రత్యక్షం కావడం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. కానీ అప్పట్లో ఫలానా చోట వచ్చిందని పట్టుకోడానికి వీలు ఉండేది. ఇప్పుడు ఎక్కడని వెతకాలి? తాజా ఉదాహరణ 'గుంటూరు కారం' సినిమా. ఆ సినిమా విడుదలకి కొన్ని రోజుల ముందు యద్దనపూడి సులోచనా రాణి రాసిన 'కీర్తి కిరీటాలు' నవల ఆధారంగానే సినిమా తయారవుతోందనే గాలి వార్త ఒకటి బయటికి వచ్చింది. ఆ నవలని గురించి నేను రాసిన బ్లాగ్ పోస్టు, అందులో కొన్ని భాగాలూ నాకు తెలిసి నాలుగైదు చోట్ల ఉపయోగించుకో (చోరీ చేయ) బడ్డాయి. తెలియకుండా ఇంకెన్ని చోట్ల వాడారో మరి. సోర్సుకి క్రెడిట్ ఇవ్వడాన్ని అవసరం లేని పనిగానో, పరువు తక్కువగానో భావించే వాళ్ళు ఉన్నత కాలం ఇది జరుగుతూనే ఉంటుంది బహుశా. 

ఈ తరహా చౌర్యాలు తాత్కాలికంగా ఉసూరుమనిపిస్థాయి కానీ, 'ఎందుకొచ్చింది, రాయడం మానేద్దాం' అనిపించవు నాకు. చోరీ చేసిన వాళ్ళ మీద కోపం కన్నా చికాకే ఎక్కువ కలుగుతూ ఉంటుంది. ముందే చెప్పినట్టుగా ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, ఏం చేసినా ఆగేది కూడా కాదు. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, బ్లాగింగ్ ఆపేసే ఉద్దేశమేమీ లేదు. వీలైనంత తరచుగా రాయాలనే ఉంది. అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా మరింత గట్టిగా చేయాలన్నదే సంకల్పం. పదిహేనేళ్ళుగా నా రాతల్ని చదివి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఇక్కడే మరింత తరచుగా మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాను.