శుక్రవారం, ఫిబ్రవరి 27, 2009

అలా జరిగింది..

సుమారు ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిందీ సంఘటన. ఇప్పుడు బ్లాగు లోకంలో కాపీ కవితల గురించి జరుగుతున్న చర్చ చదువుతుంటే గుర్తొచ్చింది. అవి 'నువ్వేకావాలి' సినిమా విడుదలైన కొత్త రోజులు. సొంత సినిమా కావడంతో ఈటీవీ లో ప్రతి అరగంటకీ ఆ సినిమా ప్రకటన వచ్చేది. ప్రకటనలు చూసీ, చూసీ పాటల పల్లవులన్నీ నోటికి వచ్చేశాయి. అదే సమయంలో ఒకతనితో పరిచయం అయ్యింది. ఉద్యోగం కోసం వచ్చి, ఓ మిత్రుడి సూచన మేరకు నా సలహా కోసం వచ్చాడతను. అతనికి సాహిత్యం మీద కొంచం ఆసక్తి ఉండటంతో తొందరలోనే ఇద్దరి మధ్య బాగా మాట్లాడుకునే చనువు ఏర్పడింది. అతను ఉద్యోగంలో చేరాక కూడా అప్పుడప్పుడూ కలుస్తూ ఉండేవాళ్ళం. ఒక రోజు అలా కలిసినప్పుడు సంభాషణ సాహిత్యం వైపు వెళ్ళింది. "చాలా పుస్తకాలు చదువుతారు కదా..మీరు కవిత్వం ఎందుకు రాయకూడదు?" అని అడగాడతను. నాకెందుకో తనతో జోక్ చేయాలనిపించింది. "రాస్తూనే ఉంటా.. పత్రికల్లో వస్తూ ఉంటాయి కూడా.." అన్నాను నమ్మకంగా.

అతను కొంచం ఎక్సైట్ అయినట్టు కనిపించాడు. "అవునా..నేనెప్పుడూ చదవలేదు.. ఏ పేరుతో రాస్తారు? నా కోసం ఒకటి రాసివ్వరూ ప్లీజ్" అని అడిగాడు. అంతేనా.. కాగితం, కలం ఇచ్చాడు. నాకు అప్పుడే 'నువ్వేకావాలి' ప్రకటన గుర్తొచ్చింది. కొంచం ఆలోచించినట్టు నటించి సీరియస్ గా కాగితం మీద రాసేశా.. 'అనగనగా ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది.. మేఘం వెనుక రాగం ఉంది.. రాగం నింగిని కరిగించింది.. కరిగే నింగి చినుకయ్యింది.. చినుకే చిటపట పాటయ్యింది.. చిటపట పాటే తాకిన్నేల చిలకలు వాలే చెట్టయ్యింది.. రాచిలుక నువ్వేకావాలి.. ఆ రాచిలుక నువ్వేకావాలి..' రాయడం పూర్తి చేసి అతని చేతికిచ్చా.. అతను అదంతా చదివి మళ్ళీ ఎక్సైట్ అయ్యి, "ఎంత బాగుందో.. మీరు సినిమాల్లో ఎందుకు ప్రయత్నించకూడదు?" అని అడిగాడు. "నన్ను మించి నటించేస్తున్నాడు" అని మనసులో అనుకుని, "అక్కడ చాలా మంది ఉన్నారు.. నాకంత ఆసక్తి లేదు" అన్నాను, ముఖం చాలా మామూలుగా పెట్టి. కాస్సేపు మాట్లాడి, అతనా కాగితం పట్టుకుని వెళ్ళిపోయాడు. నేనా విషయమే మర్చిపోయాను.

ఓ వారం రోజుల తర్వాత మళ్ళీ కనిపించాడతను. "మిమ్మల్ని ఇంకెప్పుడూ నమ్మను" అన్నాడు సీరియస్ గా. ఏమైందో నాకు అర్ధం కాలేదు. "మీ కవిత మా బాస్ కి చూపించాను" ..ఉహు.. అప్పటికీ నాకు వెలగలేదు. "మా ఫ్రెండ్ రాశాడండి..సినిమాల్లో ట్రై చేస్తే మంచి పాటల రచయిత అవుతాడు..కానీ అతనికి ఇంటరెస్ట్ లేదట..అని చెప్పాను.. నన్ను పిచ్చోడిని చూసినట్టు చూశారు.." అప్పుడు నాకు విషయం కొంచం అర్ధమైంది.. మళ్ళీ అతనే చెప్పడం కొనసాగించాడు. "ఏం బాబూ.. నువ్వు టీవీ కానీ, సినిమాలు కానీ చూడవా? అని అడిగాడాయన. నా ముఖం చూసి, నిజంగానే నాకు విషయం తెలియదని అర్ధం చేసుకుని, అది సినిమా పాటని చెప్పాడు." ఇతనికి తెలిసీ నన్ను ఆట పట్టించడానికి సినిమాల్లో ప్రయత్నించమన్నాడని అనుకున్నాను నేను. అతను కాగితం భద్రంగా తీసుకెళ్ళినప్పుడు కూడా సందేహించలేదు. "ఉద్యోగం వేటలో సినిమాలు చూడడం కుదరలేదు. రూమ్ లో టీవీ కూడా లేదు.. కొత్త ఆఫీస్ లో నా పరువుపోయింది.. మీరు జోక్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు.. పెద్ద ఫూల్ అయ్యాను.." అతను చెబుతూనే ఉన్నాడు. చాల కష్టపడి అతన్ని కూల్ చేశా. ఆ పాట ఎప్పుడు విన్నా అతని ముఖమే గుర్తుకు వస్తుంది.

గురువారం, ఫిబ్రవరి 26, 2009

ఆకుపచ్చని జ్ఞాపకం

ఓ భావుకత్వం నిండిన అమ్మాయికి ఆమె భావాలను ఏమాత్రం అర్ధం చేసుకోని, గౌరవించని వ్యక్తి భర్తగా లభిస్తే ఆమె కాపురం ఎలా ఉంటుంది? ఈ కథాంశంతో తెలుగు సాహిత్యంలో ఎన్నో కథలు, మరెన్నో నవలలు వచ్చాయి. కానీ, ఇందుకు విరుద్ధంగా, భావుకుడైన అబ్బాయికి అతన్ని అర్ధం చేసుకోని,చేసుకోడానికి ప్రయత్నించని అమ్మాయి భార్యగా వస్తే... దీనిని కథాంశంగా తీసుకుని వంశీ రాసిన కథే 'ఆకుపచ్చని జ్ఞాపకం.' పుష్కర కాలం క్రితం ఇండియా టుడే పక్ష పత్రికలో ప్రచురితమైన ఈ కథను చదివినప్పుడు అప్రయత్నంగానే 'అద్భుతమైన కథ' అనుకున్నాను. ఆ తర్వాత ఈ కథను చాలా సార్లు చదివాను..నా అభిప్రాయం ఏమీ మారలేదు. ఆద్యంతం ఊపిరి బిగపట్టి చదివించే ఈ కథ నడక సినిమాను పోలి ఉంటుంది. చకచకా మలుపులు తిరుగుతూ ఎప్పటికీ గుర్తుండిపోయే ముగింపుకి చేరుకుంటుంది.

కథానాయకుడు జయరామారావు నాయనమ్మ పెంపకంలో పెరిగినవాడు. జీవితాన్ని ఆస్వాదించాలి అనుకునే వాడు.అతని పెళ్ళికి ముందే నాయనమ్మ కాలం చేస్తుంది. తండ్రి బలవంతం పై ఆస్తిపరుల కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఝాన్సీ ని పెళ్లి చేసుకుంటాడు.తను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం కోసం 'జీవితం'అనే పత్రిక ప్రారంభించి అందమైన జీవితాన్ని గడపడం ఎలాగో పాఠకులకి సలహాలు ఇస్తూ ఉంటాడు. వ్యక్తిగత జీవితంలో మాత్రం అతనికి నిరాశ, నిస్పృహలే.. అతని ఊహల్లో భార్యకి ఝాన్సి కి ఏమాత్రం పోలికలు ఉండవు. అతనికి తన భార్యని చీరలో చూడడం ఇష్టం.ఝాన్సికి నైటీ సౌకర్యం.అతనికి భార్యని బాపు బొమ్మలా పెద్ద జడతో చూసుకోడం ఇష్టం..ఝాన్సీ కి పోనీటెయిల్ అంటే మక్కువ. భార్య తనకి కుంకుళ్ళతో తల స్నానం చేయించాలని అతను అనుకుంటే, బాత్రూం లో ఉన్న షాంపూ తో తల స్నానం చేసిరమ్మంటుంది ఝాన్సీ.వీళ్ళింట్లో పనిమనిషి కమలమ్మ..ఈమెది జయరామారావు మనస్తత్వమే.. ఆమె భర్త వీర్రజుది అచ్చంగా ఝాన్సీ మనస్తత్వం. ఓ గొడవలో వీర్రాజు ప్రాణం పోగుట్టుకున్న తర్వాత ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది కమలమ్మ.

ఝాన్సీ తో రాజీ పడుతున్న జయరామారావుకి టీవీ చానళ్ళ వల్ల పత్రిక సర్క్యులేషన్ తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఆ విషయంలో ఝాన్సీ సలహా అడగాలనుకుంటాడు. భార్యాభర్తల మధ్య మాటామాటా పెరుగుతుంది. విడాకులు ఇచ్చేస్తానని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోతుంది ఝాన్సీ. బావమరిది ఫోన్ చేసి పత్రికకి కావాల్సిన మూడు లక్షలు తాను ఏర్పాటు చేస్తానని, ఝాన్సీ తో సర్దుకుపోమ్మని కోరతాడు.'ఇక జీవితాంతం రాజీ పడి బ్రతకడమేనా' అన్న నిస్పృహలో ఉన్న జయరామారావుకి కనీసం ఒక్క రోజైనా తన ఊహల్లో భార్యతో జీవితం గడపాలనిపిస్తుంది. అందుకు కమలమ్మే సరైన మనిషి అని నిర్ణయించుకుని తన కోర్కెను ఆమె ముందు వ్యక్త పరుస్తాడు."ఉదయం ఆరు గంటలనుంచి సాయంత్రం ఆరు వరకు నా భార్యగా నటించాలి కమలమ్మా..శరీర సౌఖ్యం తప్ప అన్నీ కావాలి..కాదనకు కమలమ్మా.." అని బతిమాలతాడు. ఏ సమాధానం చెప్పకుండా కోపంగా వెళ్ళిపోతుంది కమలమ్మ.

మర్నాడు చాలా ఆశ్చర్యకరమైన రీతిలో తెల్లవారుతుంది జయరామారావుకి. తలస్నానం చేసి,పట్టు చీర కట్టుకున్న కమలమ్మ కాఫీ కప్పుతో నిద్ర లేపుతుంది అతన్ని. అతనికి ఇష్టమైన వంటకాలతో భోజనం పెట్టి, కపాలేశ్వరుడి గుడికి ప్రయాణం చేస్తుంది. గుడినుంచి తిరిగివచ్చి గాల్లో తేలిపోతున్న జయరామారావుకి 'నేను వెళ్లొస్తాను బాబూ..' అన్నకమలమ్మ గొంతు వినిపిస్తుంది. తెల్లచీరలో,ముఖాన బొట్టు లేకుండా ఉన్న కమలమ్మని చూశాక కాని ఆమె తనకి భార్యగా ఉండేది ఒక్కరోజు మాత్రమే అన్న విషయం గుర్తు రాదు అతనికి. "నన్ను అర్ధం చేసుకునే భార్యతో జీవితం బాగుంటుంది అనుకున్నాను కాని ఇంత మధురంగా ఉంటుందని అనుకోలేదు.. నువ్వు పక్కనుంటే నేను కొండల్ని పిండి చేయగలను, పిండిని కొండ చేయగలను..దయచేసి వెళ్ళిపోకు కమలమ్మా.." అని ఆమె కాళ్ళ మీద పడతాడు. "అమ్మగారు తెచ్చే డబ్బు లేకపొతే మీరు అన్యాయమైపోతారు బాబూ.." అంటుంది కమలమ్మ.."అంతేనా..నాకు ఈ ఆకుపచ్చని జ్ఞాపకాన్ని మాత్రమే మిగులుస్తావా?" అని అడుగుతాడు అతను. "నా జీవితానికి మిగిలింది కూడా ఈ ఒక్క జ్ఞాపకమే బాబూ.." అంటూ వెళ్ళిపోయిన కమలమ్మ అతనికి మళ్ళీ జీవితంలో కనిపించలేదు.

ఎమెస్కో ప్రచురించిన వంశీ కథల సంపుటి 'ఆనాటి వాన చినుకులు' లో ఈ కథను చదవొచ్చు. సంపుటి వెల రూ. 75.

బుధవారం, ఫిబ్రవరి 25, 2009

మన విశ్వనాథం..

"పైకి అలా కనిపిస్తాడు కాని, విశ్వనాథ్ చాలా రొమాంటిక్.." అంటూ ఫోనులో సంభాషణ మొదలుపెట్టాడు నా స్నేహితుడు. సాక్షి దినపత్రిక వాళ్ళు రెండు రోజులపాటు ప్రచురించిన విశ్వనాథ్ 'డబుల్ ధమాకా' చదివాక మా ఇద్దరిమధ్య సుదీర్ఘ సంభాషణ జరిగింది. "ఎప్పుడో టీనేజ్ లో జరిగిన సంఘటన కూడా గుర్తుందంటే..వా.." మళ్ళీ తనే.. "నాకు కనక ఇంటర్యూ చేసే అవకాశం దొరికితే ఒకే ఒక్క ప్రశ్న అడిగేవాడిని.." ఊరించాను నేను. "ఏమిటో.." ఊహించమని ఓ అవకాశం ఇచ్చి, నేనే చెప్పేశా.."అసలు చిన్నబ్బాయి, స్వరాభిషేకం సినిమాలు ఎందుకు తీశారు అని అడిగే వాడిని." తను ఒక్క క్షణం కూడా ఆగలేదు "నా దృష్టిలో ఆ రెండూ విశ్వనాథ్ సినిమాలే కాదు. చిన్నబ్బాయి చూడలేదు కానీ, స్వరాభిషేకానికి బలైపోయా.." తనని పూర్తీ చేయనీయకుండా నేను అందుకున్నాను.."నేను రెండూ చూశా స్వామీ..వంశీ చెత్త సినిమాలు తీస్తే సరిపెట్టుకున్నా..కానీ విశ్వనాథ్ కూడా అదే పని చేయడం మింగుడు పడలేదు.."

"వంశీ కథ వేరు..అయినా విశ్వనాథ్ వి చాలా వరకు అవార్డు సినిమాలే.." నాకెందుకో సరదాగా తననో ప్రశ్న అడగాలని అనిపించింది. "విశ్వనాధ్ సినిమాల్లో ఆస్కార్ కి ఎంట్రీ పంపిన సినిమా ఏమిటి?" క్విజ్ మాస్టర్ లెవెల్లో అడిగా.. "శంకరాభరణమా..సాగర సంగమమా?" తన ఎదురు ప్రశ్న.. "రెండూ కాదు.." ప్రయత్నించ మన్నట్టుగా నేను. "ఉహు..గుర్తు రావడం లేదు.." నేను కమలహాసన్ సినిమా అని చెబుదామనుకునే "స్వాతిముత్యం" అనేశాను. "నిజమే..అందరూ కమల్ ని మెచ్చుకుంటారు కానీ రాధిక కూడా చాలా బాగా చేసింది కదా.." అందులో అభ్యంతరం ఏం ఉంటుంది.. "నిజమే.. నిర్మలమ్మ చనిపోయే సీన్ లో ఒక చిన్న ఎక్స్ ప్రెషన్ ఇస్తుంది..కమల్ అప్పుడే తాళి కడతాడు. వీడితో జీవితమంతా ఎలా అన్న అర్ధం వచ్చే చిన్న ఎక్స్ ప్రెషన్" గుర్తు చేసుకున్నాను నేను. "స్వాతికిరణం లో కూడా అంతే కదా..పిల్లవాడు చనిపోయినప్పుడు కళ్ళతోనే నటిస్తుంది..విశ్వనాధ్ సినిమా కాకపోయినా పల్నాటి పౌరుషం లో కూడా రాధిక నటన చాలా బాగుంటుంది.." నేను అందుకున్నా "అవును తాళి తెంచి చరణ్ రాజ్ మీదకి విసిరే సీన్.."

"విశ్వనాథ్ సినిమాల్లో నాకు బాగా చేయలేదు అనిపించిన హీరోయిన్ సుహాసిని ఒక్కర్తే.. సిరివెన్నెల లో తను ఇంకా బాగా చేసి ఉండొచ్చు అనిపించింది.." తను చెప్పగానే నేను ఆ సినిమా గుర్తుచేసుకున్నా.. "నిజమే బెనర్జీ బాగా డామినేట్ చేసినట్టు అనిపించింది...ఆమని తో సహా అందరూ బాగా చేశారు. శుభసంకల్పం లో చనిపోయే సీన్ లో ఆమని నటన చాలా బాగుంటుంది.." తను కొనసాగిస్తూ "కమల్ పక్కన చేయడం ఓ పరీక్ష.. నటనే కాదు, విశ్వనాథ్ సినిమాల్లో హీరోయిన్లు చాలా అందంగా ఉంటారు.." పక్కన ఎవరూ లేకపోవడంతో నేను ధైర్యం చేసి "అవును.." అంటూ "మౌనమేలనోయి..." హమ్ చేశా.. నా హింస నుంచి తప్పించుకోవడం కోసం అనుకుంటా.. "ఆ పాటలో జయప్రద చాలా బాగుంటుంది కదా.." ఈసారి తనని నేను చెప్పనివ్వలేదు "కానీ మేకప్ చాలా ఎక్కువగా ఉంటుంది. జనరల్ గా విశ్వనాధ్ హీరోయిన్లకి మేకప్ ఉండదు.. కానీ ఈ అమ్మాయి చాలా హెవీ మేకప్ లో ఉంటుంది.." అన్నా..

"మేకప్ లేకపోవడంఅంటే గుర్తొచ్చింది. సుమలత ఎంత సింపుల్ గా ఉంటుంది.. శ్రుతిలయలు ఒక్కటే కదా..విశ్వనాధ్ తో.." నేను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.. "శుభలేఖ లో హీరోయిన్..స్వయంకృషి లో చిన్న రోల్..ఆ అమ్మాయి మాట తీరు వెరైటీ గా ఉంటుంది.." తను ఏమీ మాట్లాడలేదు. బహుశా సుమలత ని గుర్తు చేసుకునే ప్రయత్నం కావొచ్చు. "అసలు స్వాతిముత్యం కథ కమల్ కోసం రాసిందంటే ఆశ్చర్యం వేసింది..కథ రాసుకుని కమల్ ని ఎన్నుకున్నారనుకున్నా.." తను హీరోయిన్ల నుంచి టాపిక్ మారిస్తే, పక్కన ఎవరో (?) ఉండి ఉంటారని అర్ధమైంది. "అవును.. గొబ్బెమ్మల సీన్ గురించి వివరణ బాగుంది కదా.." తను వెంటనే స్పందిస్తూ "నేను ఇది చదివే వరకు, గొబ్బెమ్మ సీన్ కథ చెప్పడం కోసమే అనుకున్నా.. కాజువల్ గా తీసిందంటే నమ్మకం కలగడంలా.." ఇప్పుడు నావంతు.."శంకరాభరణం లో కూడా కొన్ని సీన్ల గురించి ఇలాంటి విశ్లేషనలే చేశారు..అవి అంతే.." నేను తన స్పందన కోసం ఎదురు చూస్తుండగా .."వేరే ఫోన్ వస్తోంది.. మళ్ళీ చేస్తా.." అని వినిపించింది.

'సాక్షి' వ్యాసాల్లో మొదటి భాగం ఇక్కడ రెండో భాగం ఇక్కడ చదవొచ్చు.

మంగళవారం, ఫిబ్రవరి 24, 2009

పరిషత్తులు

నాటకం అంటే ఏమాత్రం ఆసక్తి ఉన్నవారికైనా పరిషత్ నాటకాలు జరుగుతున్నాయంటే పండుగే. నటీనటులు, సాంకేతిక నిపుణుల తో పాటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తారు ఈ పరిషత్తుల కోసం. నాటకాల పోటీలనే పరిషత్తులు అని పిలుస్తారు. ఇప్పుడంటే ప్రభుత్వం ఏటా నంది నాటకోత్సవాలు నిర్వహిస్తోంది కానీ, అంతకు ముందు వరకూ కళాకారుల ప్రతిభా ప్రదర్శనకి పరిషత్తులు మాత్రమే వేదికలుగా నిలిచేవి. నాటక జనం, ప్రేక్షక మహాశయులతో పాటు పరిషత్తుల కోసం ఎదురు చూసే ఎదురు చూసే మరో వర్గం ఉంది. వీళ్ళు సినిమా, టీవీ జనం. అవును, దాసరి నారాయణ రావు నుంచి తేజ వరకు, వంశీ నుంచి కృష్ణవంశీ వరకు మన దర్శకులలో చాలా మంది నటీనటులను నాటక పరిషత్తుల నుంచి ఎంచుకుంటారు. నేను హీరో హీరోయిన్ల గురించి చెప్పడం లేదు, కేవలం నటీనటులను మాత్రమే. నాటక రంగం నేపధ్యంగా సిని రంగంలో రచయితలుగా, దర్శకులుగా నిలదొక్కుకున్న వాళ్లు ఇప్పటి తరంలో కూడా చాలామంది ఉన్నారు.

ఉభయగోదావరి జిల్లాల్లో కాకినాడ, రాజమండ్రి, ద్రాక్షారామం, పాలకొల్లు లతో పాటుగా రాష్ట్రం నలుమూలలో ఎన్నో చోట్ల ప్రతి ఏటా క్రమం తప్పకుండా పరిషత్తు నాటకాలు జరుగుతూ ఉంటాయి. సిని రచయితలైన పరుచూరి సోదరులు 'పరుచూరి రఘుబాబు స్మారక పరిషత్తు' పోటీలని ప్రతియేటా హైదరాబాద్ రవీంద్రభారతి లో నిర్వహిస్తూ ఉంటారు. అక్కినేని నాగేశ్వర రావు పరిషత్తు హైదరాబాద్ లో పోటీలు నిర్వహించే మరో ముఖ్యమైన సంస్థ. సిని గ్లామరు ఉండడంతో ఈ పరిషత్తులలో నాటకాలు ప్రదర్శించడానికి నటీనటులు ఉత్సాహం చూపుతూ ఉంటారు. తిరుపతి లో ఏటా పోటీలు నిర్వహించే శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్ ప్రభుత్వ 'నంది' అవార్డుల మాదిరిగా 'గరుడ' అవార్డులు ప్రకటిస్తుంది. ఈ పోటీలలో చాలా వాటికి సిని రచయితలూ, దర్శకులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తుండగా, నటీనటులు ముఖ్య అతిధులుగా మెరిసి నాటకాల్లో నటించేవారికి తమ భవిష్యత్తు ను గురించి కలల్లో తేలే అవకాశం కల్పిస్తూ ఉంటారు.

సాధారణంగా పరిషత్తు నాటకాలు నాలుగురోజులో, వారం రోజులో జరుగుతాయి. నిర్వాహకుల అభిరుచిని బట్టి సాంఘిక నాటకం, నాటిక, పౌరాణిక నాటకం, జానపద/చారిత్రిక నాటకం విభాగాల్లో పోటీలు జరుగుతూ ఉంటాయి. విజయవాడ 'అభిరుచి' వంటి సంస్థలు కేవలం హాస్య నాటిక పోటీలు మాత్రమే నిర్వహిస్తున్నాయి. ఈ పోటీలు జరిగేది నాలుగు రోజులే అయినా, నిర్వాహకులు, నాటక సంస్థల వాళ్లు తేరా వెనుక మూడు నుంచి నాలుగు నెలలు కష్ట పడతారు. పోటీలు జరుగుతాయని ప్రకటించడం మొదలు, స్క్రిప్టులను ఆహ్వానించడం, వాటిని స్క్రీనింగ్ చేయడం, ఆయా ఊళ్ళకి వెళ్లి ప్రదర్శన రిహార్సల్ చూసి నాటకం/నాటికను ప్రదర్శనకు ఎంపిక చేయడంతో పాటు, నటీ నటులకు, సాంకేతిక నిపుణులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించడం నిర్వాహకుల విధులు.

ఇక నాటక సంస్థల వాళ్ళైతే కొత్త నాటకం/నాటిక ఎంచుకోవడం, నటీనటుల ఎంపిక, రంగాలంకరణ, సంగీతం, ఆహార్యం నిర్ణయించడం, రిహార్సల్ చేయడం..ఇలా ఆ రెండు మూడు నెలలూ బిజీ బిజీ. ఈ పరిషత్తుల కోసం ఉద్యోగాలకి సెలవు పెట్టి కృషి చేసేవాళ్ళూ ఉన్నారు. నాటకం తయారు చేయడానికి అయ్యే ఖర్చూ తక్కువేమీ కాదు. చాలా సంస్థలు ఒకే నాటకాన్ని వేర్వేరు పరిషత్తుల్లో ప్రదర్శించడం ద్వారా ఖర్చును ఆదా చేస్తున్నారు. ఈ మధ్యనే కొన్ని పరిషత్తులు 'నాటకం ఏ ఇతర పరిషత్తు లలోనూ ప్రదర్శింపబడి ఉండకూడదు' అని నిబంధనలు పెడుతున్నాయి. ప్రదర్శనకి ఎంపిక అవడం ఒక ఎత్తు, అయ్యాక బహుమతి కోసం చేసే కృషి మరో ఎత్తు. ప్రదర్శన మొత్తానికి బహుమతి తెచ్చుకోవాలని రచయితా, దర్శకుడు తాపత్రయ పడితే నటీనటులు, ముఖ్యంగా సీనియర్లు, వ్యక్తిగత బహుమతులపై దృష్టి పెడతారు. ఫలితంగా నాటకంలో లేని డైలాగులు, రిహార్సలు లో లేని మలుపులు స్టేజి మీద వినిపిస్తూ/కనిపిస్తూ ఉంటాయి.

వీళ్ళదేం ఉంది కాని, ఖద్దరు ధరించి, గన్మేన్లు వెంట రాగా, నిర్వాహకులతో ఉన్న మొహమాటం కొద్దీ చివరి రోజున చివరి ప్రదర్శన ఓ ఐదు నిమిషాలు చూసి ఉద్వేగభరితంగా ప్రసంగించి కంట తడి పెట్టేస్తారు అసలైన నటులు. నాటక రంగం చనిపోతోందని, మనమందరం బతికించుకోవాలనీ పిలుపు ఇచ్చేస్తూ ఉంటారు. నిజంగా నాటక రంగం చనిపోయే స్థితిలోనే ఉంటే ఇన్ని పరిషత్తులు ఎలా జరుగుతున్నాయో, జనం నుంచి అంత స్పందన ఎలా వస్తోందో వీళ్ళు చెప్పరు.. చెప్పలేరు.

ఆదివారం, ఫిబ్రవరి 22, 2009

మొదటిపరీక్ష

పరీక్ష అంటే ఏమిటో తెలియకుండానే ఒకటో తరగతి పూర్తైపోయింది. రెండో తరగతిలో కూడా పరీక్షలు ఉంటాయని అనుకోలేదు. ఎందుకంటే మా స్కూల్లో మూడో తరగతి నుంచి పరీక్షలు మొదలు అయ్యేవి. ఐతే అనుకోనిది జరగడమే కదా జీవితం..అందుకే రెండో తరగతిలో పరీక్ష రాయాల్సి వచ్చింది. అది ఎలా జరిగిందంటే, మేము రెండో తరగతి మధ్య లో ఉండగా ఇద్దరు మాస్టార్లు మా స్కూలికి కొత్తగా వచ్చారు. సత్యనారాయణ గారి గురించి 'తొలిబెత్తందెబ్బ' లో చెప్పాను కదా.. ఆయన తో పాటు వచ్చిన మరో మాస్టారు సుబ్బరమణ్యం గారు. అసలు పేరు సుబ్రహ్మణ్యం, కానీ మా నోళ్ళలో పడి అలా ఐపోయింది. సుబ్బరమణ్యం గారు ఒకటి, రెండు తరగతులకి, మూడు నాలుగు తరగతులకి సత్యనారాయణ గారు పాఠాలు చెప్పేవారు. ఒక రోజు పాఠం చెబుతూ మధ్యలో 'వచ్చే వారం మీకు పరీక్ష పెడతాను' అని ప్రకటించారు. ముందూ వెనుకా ఆలోచించాలని తెలియని వయసు కావడం వల్ల ఇంటికి వెళ్తూనే ఆ విషయం అమ్మకి చెప్పేశా.

ఇక అప్పుడు మొదలయాయి నా కష్టాలు. 'నీకసలే బళ్ళో పరీక్ష' అనే మాట అమ్మ నోటి చివర నానింది. ఆటలు అటుంచి, ఇంట్లో చిన్న పని కూడా చెయ్యనివ్వకుండా 'చదువుకో' 'చదువుకో' అంటూనే ఉండేది. తెల్లవారు జామున నిద్ర లేపి పాఠాలు చదివించేది. అసలు ఉన్నవే మూడు పాఠాలు - వినాయకచవితి, కొబ్బరిచెట్టు, అమరావతి. ఇప్పటికీ ఆ పాఠాలు మర్చిపోలేదంటే అమ్మ శిక్షణ ఎలా ఉండేదో ఊహించ వచ్చు. 'నాకన్నీ వచ్చేశాయి' అనడం ఆలస్యం..ఓ సుదీర్ఘమైన క్లాసు. 'ఇప్పుడు అలాగే అనిపిస్తాయి..తీరా పరీక్షలో గుర్తు రాకపోతే ఎలా? అందుకే వచ్చినా మళ్ళీ మళ్ళీ చదవాలి' ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే మాట. పోనీ అనుకుందుకు అదేమీ పేపర్ మీద రాసే పరీక్ష కాదు. మాస్టారు నోటితో అడిగే ప్రశ్నలకు పలక మీద జవాబులు రాసి చూపించాలి.

ఇక మర్నాడు పరీక్ష అనగా అమ్మ నాకు పరీక్ష పెట్టింది. అంటే ప్రీ-ఫైనల్ అన్నమాట. ఆ పరీక్ష ఇంచుమించు పదోతరగతి స్థాయి లో ఉంది. 'అమరావతి గూర్చి వ్రాయుము?' అని అడిగారనుకో, ఏం రాస్తావు? అని అడిగింది అమ్మ. 'గూర్చి' అంటే ఏమిటమ్మా? అని అడిగాను. నిజంగానే నాకు అప్పుడు ఆ పదానికి అర్ధం తెలియదు. 'ఏమి రాకుండానే అన్నీ వచ్చునంటావు. ఇప్పుడు చూడు, ప్రశ్న అడిగితే గూర్చి అంటే ఏమిటి అంటున్నావు' అని నా పుస్తకం తెమ్మని ప్రైవేటు చెప్పేసింది. చక్కగా నాన్న బయటికి వెళ్ళారు. ఫ్రెండ్స్ అంతా బయట ఆడుకుంటున్నారు. నేను మాత్రం వినాయకచవితి, కొబ్బరిచెట్టు, అమరావతి మళ్ళీ మళ్ళీ చదువుతున్నా. 'కాసేపు ఆడుకుని వస్తానమ్మా' అని కాకా పట్టినా లాభం లేకపోయింది. 'ఏ దేబ్బో తగిలించుకుని వస్తే రేపు పరీక్ష ఎలా రాస్తావు?' అంది.

ఇలా కఠోర శిక్షణ సాగుతుండగా పరీక్ష రోజు రానే వచ్చింది. రోజూ కన్నా ముందే నిద్రలేచి పాఠాలన్నీమళ్ళీ చదివి బడికి రెడీ అయ్యా. 'కంగారు పడకు, ఆలోచించి జవాబులు రాయి, దేవుడికి దండం పెట్టుకో' లాంటి ఓ వంద జాగ్రత్తలు చెప్పి అమ్మ నన్ను పరీక్షకు సాగనంపింది. శకునం మంచిది రాదేమో అని తనే ఎదురు వచ్చింది. మిగిలిన పిల్లలెవరూ పరీక్ష గురించి అంతగా పట్టించుకున్నట్టు కనిపించలేదు. మేము బడికెళ్ళిపోయి మాస్టారు కోసం ఎదురు చూస్తున్నాం. బెల్లు కొడతారు, అవ్వగానే ప్రార్ధన.. ప్రార్ధన అవ్వగానే పరీక్ష ఉంటుంది అని ఆలోచిస్తున్నా.

బెల్లు లేదు, ప్రార్ధన లేదు. మాస్టార్లు ముగ్గురూ ఏదో మాట్లాడుకున్నారు. మమ్మల్నందర్నీ గొడవ చేయొద్దని చెప్పి హెడ్ మాస్టర్ ముసలయ్య గారు మొదలు పెట్టారు. 'మన పక్క ఊరి స్కూల్లో మాస్టారుగారు చనిపోయారు. అందుకని ఇవాళ బడికి సెలవు. మీరెవరూ గొడవ చేయకూడదు. చప్పుడు చేయకుండా ఇళ్ళకు వెళ్ళిపొండి. మళ్ళీ రేపు ఉదయం రండి' అని చెప్పారు. కొంచం దూరం బుద్ధిమంతుడిలా నడిచి ఆ తర్వాత ఎగురుకుంటూ ఇల్లు చేరుకున్నా. గుమ్మంలోనే ఎదురై అమ్మ అడిగింది 'అప్పుడే పరీక్ష అయిపోయిందా?' అమ్మని ఇంకేమీ అడగనివ్వకుండా బడి సెలవు విషయం చెప్పేశా. తర్వాత రోజు మాష్టారు పరీక్ష పెట్టడం, నాకు క్లాస్ ఫస్ట్ రావడం జరిగింది. ఐతే అది మొదలు ఇంకెప్పుడూ అమ్మ ఆ స్థాయిలో పరీక్షలకు హడావిడి చేయలేదు. అంతేనా.. ఎప్పుడూ శకునం కూడా రాలేదు. తర్వాత ఎప్పుడైనా నాన్న 'ఇవాళ వాడికి పరీక్ష..ఎదురు వెళ్ళు' అన్నా, అమ్మ 'నేను ఎదురు వెడితే వాడి పరీక్షే జరగదు' అంటూ నవ్వేసేది.

శుక్రవారం, ఫిబ్రవరి 20, 2009

నాయికలు-రమ్య

'ఫోన్ లో మీ గొంతు విన్నప్పుడల్లా గుప్పెడు సన్నజాజులు గుండెల మీద జారుతున్న ధ్వని..' ...రమ్యని తలచుకోగానే నాకు మొదట గుర్తొచ్చే వాక్యం ఇది. 'ఆ అమ్మాయి చెప్పిన ఆ అనుభూతి ఎలా ఉంటుంది?' అని కొన్ని వందల సార్లు ఆలోచించి ఉంటాను. ఎందుకంటే తను మామూలు అమ్మాయి కాదు 'వెన్నెలమ్మాయి' రేవంత్ భాషలో.. యండమూరి వీరేంద్రనాథ్ భాషలో ఐతే 'వెన్నెల్లో ఆడపిల్ల'. సిన్సియర్ గా చెప్పాలంటే ఓ అంతర్జాతీయ స్థాయి చదరంగం ఆటగాడితో నెల రోజులపాటు ప్రేమ చదరంగం ఆడిన రమ్య, నేను ప్రేమలో పడ్డ తొలి నవలా నాయిక. మరో మాటలో చెప్పాలంటే రమ్యని ప్రేమించిన వేలాదిమంది తెలుగు పురుషుల్లో ఓ పుణ్య (?) పురుషుడిని నేను.

అందం, తెలివితేటలు, భావుకత్వం, సున్నితత్వం..వీటన్నింటినీ మించిన ఆత్మవిశ్వాసం, సెన్స్ అఫ్ హ్యుమర్ ఉన్న అమ్మాయి రమ్య. చదరంగంలో గెలిచిన రేవంత్ కి ఓ అభిమానిగా ఫోన్ చేసి, తన మీద ఆసక్తి ని రేకెత్తించి, తన పేరు, చిరునామా కనుక్కోమని సవాల్ విసిరినా..అతను కష్టం లో ఉన్నప్పుడు సరైన సలహా ఇచ్చి ఆటలో రేవంత్ కెరీర్ ని తన తెలివితేటలతో కాపాడినా అతనిమీద తనకున్న నిరుపమానమైన ప్రేమతోనే. 'గోదారి ఇసుకతిన్నెల మీద పడుకుని కృష్ణ శాస్త్రి కవిత్వం చదువుకోవాలనుకునే' భావుకత్వం తో పాటు 'చీకటి గదిలో ముద్దు' పజిల్ తో రేవంత్ ముఖం ఎర్రబరిచే కొంటెతనమూ ఆమె సొంతం.

'పేరెందుకూ' అంటుంది రమ్య, రేవంత్ మొదటిసారి ఫోనులో ఆమె పేరు అడిగినప్పుడు. అతని స్నేహితుడు జేమ్స్ తో తను 'టెన్త్ ఫెయిల్డ్ అనీ, స్టాంపు కలెక్షన్, సినిమాలు చూడడం' తన హాబీలనీ చెబుతుంది రెండోసారి ఫోన్ చేసినప్పుడు. మొదటిసారి ఈ నవల చదివినప్పుడు తొలిసారిగా ఈ అమ్మాయి నాకు నచ్చిన సందర్భం మాత్రం ఆమె జేమ్స్ మాటతీరుని బట్టి అతని మనస్తత్వాన్నీ, నేపధ్యాన్నీ, జీవన విధానాన్నీ వివరించడం. (రమ్య తర్వాత ఈ నవల్లో నాకు అంతగా నచ్చిన మరో పాత్ర జేమ్స్) రేవంత్ ని ఇష్టపడి, అతనిగురించి అన్ని వివరాలూ తెలుసుకుని, తనకి సరైన జోడీ అని నిర్ణయించుకుని అతనితో స్నేహం మొదలుపెట్టిన రమ్య చాలా కాలిక్యులేటెడ్ అనిపిస్తుంది. పైగా 'నేను మిమ్మల్ని నిరాశ పరచను రేవంత్ బాబూ..' అని ఊరిస్తూ ఉంటుంది, రేవంత్ నే కాదు, పాఠకులని కూడా.

రమ్య ఇచ్చే పజిల్స్ ని గెలవడంలో రేవంత్ ఫెయిలయిన ప్రతిసారీ ఆమె తెలివితేటల మీద అంచనాలు పెరిగిపోయేవి. రమ్య చేసిన పనుల్లో బాగా నచ్చినది ఆమె రేవంత్ కి రాసిన ఉత్తరాలు. ఓ ఉత్తరాన్ని గ్రాఫాలజిస్ట్ కి ఇచ్చి ఆమె మనస్తత్వం ఎలాంటిదో రేవంత్ కనుక్కుంటాడు. (ఈ సబ్జక్ట్ మీద సేకరించిన సమాచారంతో యండమూరి తర్వాత రాసిన పుస్తకం 'గ్రాఫాలజీ') ఆమె వ్యక్తిత్వం, ఫ్రాంక్ నెస్, దయాగుణం, ఈస్తటిక్ సెన్స్, సెన్స్ అఫ్ ఫ్రాగ్మాటిజం, జీవితం లో ఉన్న ప్రాక్టికాలిటీ...ఇవన్నీ... రేవంత్ ని ఉత్తరం రాయమని ప్రోత్సహించి, అతని ఆఫీస్కి వచ్చి, అతనికి తెలియకుండా చెత్త బుట్టలో పారేసిన ఉత్తరం చిత్తు ప్రతులన్నింటినీ జాగ్రత్తగా ఏరుకెళ్లి అతనికి జవాబు రాస్తుంది రమ్య.

ఈ నవల చదివిన వాళ్ళందరికీ బాగా గుర్తుండిపోయేది ముగింపు. అది ఎలా ఉంటుందంటే అప్పటివరకు చదివిన నవల మొత్తాన్ని మర్చిపోయి ముగింపుని మాత్రమే గుర్తు పెట్టుకునేలా. మొదటి సారి ఈ నవల చదివినప్పుడు వారం రోజులు పట్టింది, రమ్య ఇచ్చిన షాక్ నుంచి కోలుకోడానికి. చాలా రోజులపాటు ఆ పుస్తకం మళ్ళీ చదవాలని అనిపించలేదు. రెండో సారి చదివినప్పుడు నవలంతా కొత్తగా అనిపించింది. ఆ తర్వాత చాలాసార్లు చదివాను. 'నేను చదివేశాను మొర్రో' అంటున్నా వినకుండా ఓ ఫ్రెండ్ చేత రెండు మూడేళ్ళ క్రితం ఈ నవల బలవంతంగా చదివించా.. 'నాకసలు జేమ్స్ పాత్రే గుర్తులేదు..నిజం చెప్పాలంటే రమ్య అల్లరి, ముగింపు తప్ప ఇంకేమీ గుర్తులేవు.. మొత్తం కొత్తగా చదివాను' ఇది అతని స్పందన. తనకి ఏ పుస్తకమూ రెండో సారి చదవడం ఇష్టం ఉండదు. అనవసరం అని అభిప్రాయం. నేనేమో అందుకు పూర్తిగా వ్యతిరేకం.

ఆ ఫ్రెండ్ తర్వాత ఆ పుస్తకాన్ని తన కొలీగ్ చేత చదివించాడు. ఆ కొలీగ్ కి పుస్తకాలు చదివే అలవాటు లేదు (ట). 'రమ్య హాంగోవర్ నుంచి తేరుకోడానికి నాలుగు రోజులు పట్టింది' ఇది అతని ఫీడ్ బ్యాక్. నిర్మాత కె.ఎస్. రామారావు(క్రియేటివ్ కమర్షియల్స్) కి ఈ పుస్తకం అంటే చాలా ఇష్టం అనుకుంటా. 'వెన్నెల్లో ఆడపిల్ల' పేరుతొ దూరదర్శన్ కి ఓ సీరియల్ తీశారాయన. తర్వాత ఇదే కథ తో శ్రీకాంత్ కథానాయకుడిగా 'హలో ఐ లవ్యు' అనే సినిమా తీశారు. అప్పటికే నవల వచ్చి చాలా రోజులు గడిచిపోవడం వల్ల అనుకుంటా ఆ సినిమా అంత బాగా ఆడలేదు. అందులో 'ఝుం తన నన నన' అనే పాట మాత్రం నా ఫేవరేట్. రమ్య తరహా పాత్రలు ఆ తర్వాత చాలా కథల్లోనూ, నవలల్లోనూ కనిపించాయి. కానీ రమ్య రమ్యే.. 'నవసాహితి' ప్రచురించిన 'వెన్నెల్లో ఆడపిల్ల' నవల వెల రూ. 50. అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభిస్తుంది. ఎవరికయినా పుస్తకాలు చదివే అలవాటు చేయడానికి కానుకగా ఇవ్వదగ్గ పుస్తకం.

మంగళవారం, ఫిబ్రవరి 17, 2009

ప్రేమవైద్యులు

'ప్రేమంటే..?' చాలా మంది చాలా సమాధానాలు చెబుతారు. ఓ మధుర భావన, అవతలి వ్యక్తే సర్వస్వం అనిపించడం, అతను/ఆమె లేకపొతే జీవితం వృధా అనిపించడం, అవతలి వ్యక్తి సమక్షంలో చాలా సంతోషంగా ఉండడం..ఇలా రకరకాల సమాధానాలు వస్తాయి. కొందరు 'ఇదో రకం జబ్బు' అనికూడా అంటారు. అందుకేనేమో ఒక్కొక్కరుగా ప్రేమ వైద్యులు పుట్టుకొచ్చేస్తున్నారు. మీరెక్కడా చూడలేదా? ఏదైనా దినపత్రిక తాలూకు సప్లిమెంట్ తిరగేయండి..లేదా ఏదైనా ఎఫ్.ఎం. రేడియో ట్యూన్ చేయండి. మీకు ప్రేమ వైద్యులు కనిపిస్తారు, వినిపిస్తారు. ఎలా ప్రేమించాలో, ప్రేమను ఎలా వ్యక్త పరచాలో, ఎలా ఒప్పించాలో..అవసరమైతే ఒకరిని మర్చిపోయి మరొకరిని మళ్ళీ మొదటినుంచీ ఎలా ప్రేమించాలో వివరంగా నేర్పిస్తారు వీళ్ళు. 'పోరికి సైట్ కొట్టి పటాయించు' అని రేడియో జాకీ కొంచం నాటుగా చెబితే, 'ఆ అమ్మాయి మనసెరిగి ప్రవర్తించాలి.. ఆమె మనసును గెలుచుకోవాలి' అని ప్రేమ వైద్యులు పత్రికా ముఖంగా సెలవిస్తూ ఉంటారు.

ఈ ప్రేమ వైద్యుల తీరు విచిత్రంగా ఉంటుంది..ఒక్కో సమస్య పట్లా వీరి స్పందన ఎలా ఉంటుందన్నది కనీసం ఊహించలేము. ఒక్కోసారి 'నీదసలు సమస్యే కాదు' అన్నవాళ్లు, అలాంటి సమస్యనే మరొకరినుంచి విని 'నా గుండె చెదిరిపోయింది..కష్టాలు మనుషులకి మాత్రమే వస్తాయి' అని చెబుతూ ఉంటారు. ఈ వైద్యుల దృష్టిలో ప్రేమించడం మంచినీళ్ళు తాగినంత సులభమైన వ్యవహారం. జనం ప్రేమిస్తూ ఉండాలి, మర్చిపోతూ ఉండాలి..మళ్ళీ ప్రేమలో పడుతూ ఉండాలి అన్నట్టుగా ఉంటాయి వీరి సలహాలు. పత్రికలకి ఉత్తరాలు రాసే ప్రేమ బాధితుల గురించి పెద్దగా తెలుసుకోలేము కానీ, రేడియోకి ఫోన్ చేసి తమ సమస్యలు చెప్పుకునే ప్రేమికులు మాత్రం 'ప్రేమంటే ఇంతేనా' అనిపిస్తారు. యాంకరమ్మాయి 'గిఫ్టులు కొనిచ్చి అమ్మాయికి ప్రపోస్ చేసేయ్' అని సలహా ఇస్తే 'ఏం కావాలో చెప్పు..నీకే ఇచ్చేస్తా' అని అడుగుతాడో ప్రేమికుడు.

మామూలు జబ్బులకి వైద్యం చేయాలంటే క్వాలిఫికేషన్ ఉండాలి. పైగా ఒక్కో రకం జబ్బుకీ ఒక్కో స్పెషలైజేషన్ చేయాలి. అప్పుడు మాత్రమే వైద్యులకి చికిత్స చేసే అర్హత వస్తుంది. కానీ ఈ ప్రేమ వైద్యానికి ఆ బాదరబందీ ఏదీ ఉండదు. నాకు తెలిసి ప్రేమ వైద్యానికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. మీసాలైనా పూర్తిగా మొలవని రేడియో జాకీ కూడా ప్రేమికులకి చికిత్సలు చేసేస్తున్నప్పుడు ఇంకా క్వాలిఫికేషన్ గురించి ఏం ఆలోచించగలం. వీళ్ళకున్న ఇంకో ప్రత్యేకత ఏమిటంటే సమస్య పూర్తిగా చెప్పే పని ఉండదు.. కొంచం చెప్పగానే మిగిలింది వాళ్ళే ఊహించేసి ఏం చేయాలో చెప్పేస్తూ ఉంటారు. పత్రికల్లోనూ అంతే.. శారీరక, మానసిక సమస్యలకి సలహాలు ఇచ్చే వైద్యుల క్వాలిఫికేషన్లు వాళ్ల ఫోటోల కింద ఇస్తూ ఉంటారు. ఐతే ఈ ప్రేమ వైద్యుల ఫోటోల కింద ఎలాంటి క్వాలిఫికేషన్లు ఉండవు.

మామూలు వైద్యులకీ, ప్రేమ వైద్యులకీ నేను గమనించిన మరో తేడా ఏమిటంటే, మామూలు వైద్యులు సమస్యని గురించి మాత్రమే మాట్లాడతారు. ఈ ప్రేమ వైద్యులు మాత్రం బాధితుల వ్యక్తిగత విషయాల్లో కూడా జోక్యం చేసుకుని సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ల తల్లిదండ్రుల పెంపకాన్ని విమర్శించేస్తూ ఉంటారు. బహుశా ప్రేమ అనేది వ్యక్తిగతమైన విషయం అవ్వడం వల్ల వీళ్ళు ఆమాత్రం చొరవ తీసుకోక తప్పదేమో. మామూలు వైద్యులకి సందేహాలు ఎక్కువ, చికిత్స సూచిస్తూనే 'దగ్గరలో ఉన్న డాక్టరుని కలిసి వారి సలహాపై మందులు వాడండి' అని చెబుతూ ఉంటారు. ప్రేమ వైద్యులకి అలాంటి శషభిషలేమీ ఉండవు. వీళ్ళు చెప్పిందే చికిత్స. అయినా మామూలు వైద్యులంటే ప్రతి వీధి చివరా ఒక్కరో ఇద్దరో ఉంటారు కానీ, ఈ ప్రేమ వైద్యులు చాలా తక్కువ కదా. మొత్తం మీద నేను తెలుసుకున్నది ఏమిటంటే వైద్యులందు ప్రేమ వైద్యులు వేరయా.. అని.

సోమవారం, ఫిబ్రవరి 16, 2009

పెద్దలకు మాత్రమే

అసలు సెన్సార్ బోర్డ్ పనిచేస్తోందా? అన్న ప్రశ్న సెన్సార్ బోర్డ్ అంత పాతది. అసభ్య, అశ్లీల సన్నివేశాలు, భయానక భీభత్స దృశ్యాలు ఉన్నసినిమాలు విడుదలైన ప్రతిసారీ ఈ ప్రశ్న మళ్ళీ మళ్ళీ వినిపిస్తూనే ఉంటుంది. విడుదలవుతున్న సినిమాలను గమనిస్తే గడిచిన పదేళ్ళలో సినిమాలను సెన్సార్ చేసే విషయంలో సదరు బోర్డు మరింత ఉదారంగా, ఉదాసీనంగా వ్యవహరిస్తోందని అనిపిస్తోంది. అంటే అంతకు ముందు కఠినంగా వ్యవహరించిందని కాదు.. ఇప్పుడు మరీ చూసీ చూడనట్టు పోతోందని. సినిమాలను సెన్సార్షిప్ విధించడానికి గల ప్రధాన కారణాల్లో చిన్నపిల్లలను హింస, అశ్లీలం, అసభ్యత ఉన్న సినిమాలకు దూరంగా ఉంచడం ఒకటి. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చిందంటే పన్నెండు సంవత్సరాల లోపు వయసున్న పిల్లలు ఆ సినిమాను తల్లిదండ్రులతో మాత్రమే చూడాలి. అదే A సర్టిఫికేట్ సినిమా ఐతే పద్దెనిమిదేళ్ళ లోపు వాళ్లు ఆ సినిమా చూడడానికి అనర్హులు.

ఈ నిబంధనలు ఎంతవరకు అమలవుతున్నాయి? తెలుసుకోడానికి పరిశోధనలే అవసరం లేదు. ఏదైనా సినిమా హాల్ దగ్గర చూడండి చాలు. ఒకప్పుడు సినిమాకి సెన్సార్ బోర్డు A సర్టిఫికేట్ ఇచ్చిందంటే పోస్టర్ల మీద ఆ సర్టిఫికేట్ ను ప్రముఖంగా ప్రచురించేవారు. పోస్టర్ మీద ఓ పెద్ద సున్నాలో ఉన్న ఎర్రటి A ని రహస్యంగా, కుతూహలంగా చూసిన రోజులు నాకింకా గుర్తున్నాయి. పిల్లలెవరైనా ఆ పోస్టరును చూసినా పెద్దవాళ్ళ నుంచి అక్షింతలు పడేవి. ఇప్పటి పోస్టర్లమీద A ని చూడాలంటే కళ్లు చికిలించి చూడాలి. ఎక్కడో రంగుల్లో కలిసిపోయి ఉంటుంది. దానిగురించి ఎవరికీ పెద్దగా పట్టింపు ఉన్నట్టు కూడా కనిపించదు. థియేటర్ యాజమాన్యాలు సదరు సినిమాల టిక్కెట్లు పిల్లలకి అమ్మకూడదు, పిల్లలని హాలులోకి రానివ్వకూడదు. చట్టంలో ఇందుకు శిక్షలు కూడా ఉన్నాయి. కాని, ఫిర్యాదు చేసేవారెవరు?

సెన్సార్ బోర్డు లోనే కాదు, సినిమాలు తీసే వారి ఆలోచనా ధోరణిలోనూ మార్పు వచ్చింది. మొన్నటిదాకా క్లీన్ U సర్టిఫికేట్ వస్తే ఆయా నిర్మాత, దర్శకులు ఆ విషయాన్ని గర్వంగా ప్రకటించుకునే వాళ్లు. 'సెన్సార్ బోర్డు మమ్మల్ని ప్రశంసించింది' అని ప్రముఖంగా ప్రచారం చేసుకునే వాళ్లు. ఐతే ఇప్పుడు పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. ఈ తరం ప్రముఖ దర్శకుల సినిమాలన్నీ దాదాపుగా A సర్టిఫికేట్ పొందినవే. విపరీతమైన హింస, రక్తపాతాలను తెరకెక్కించడంపై వీరికి ఉన్న మమకారమే ఇందుకు కారణం. పరిస్థితి ఎలా ఉందంటే, వీళ్ళ సినిమాలకి U సర్టిఫికేట్ వచ్చిందంటే అది పెద్ద వార్త అయ్యేలా. విషాదం ఏమిటంటే వీళ్ళ సినిమాలకి పిల్లలు, కాలేజి కుర్రకారే పెద్ద ఫాన్స్. స్కూళ్ళు, కాలేజీలు ఎగ్గొట్టి మరీ క్యూలలో నిలబడి టిక్కెట్టు కొనుక్కుని ఈ సినిమాలు చూస్తున్నారు వాళ్లు.

'పోకిరి' సినిమా విడుదలైనప్పుడు ఈ విషయమై టీవీ చానళ్ళు కొంచం హడావిడి చేశాయి. ఐతే అది సినిమాకి పబ్లిసిటీ గానే ఉపయోగపడింది. ఈ ట్రెండ్ కి తాజా ఉదాహరణ 'అరుంధతి.' ఈ సినిమా పెద్దలకు మాత్రమే. కాని ఎక్కడ చూసినా పిల్లలు కనిపిస్తున్నారు. అక్కడక్కడ తప్పించి థియేటర్ యజమానులు ఇందుకు పెద్దగా అభ్యంతర పెట్టడం లేదు. కేవలం థియేటర్ వాళ్ళనే తప్పుపట్టలేం. తల్లితండ్రులూ చూసీ చూడనట్టే ఉంటున్నారు. కొందరైతే పిల్లలని చూడమని ప్రోత్సహిస్తున్నారు కూడా. పోస్టర్లు చూడడాన్ని తప్పు పట్టిన తరం నుంచి, పిల్లల్ని సినిమా చూడమని ప్రోత్సహించే తరానికి వచ్చాం. క్లీన్ U సర్టిఫికేట్ ని గర్వంగా ఫీలైన రోజులనుంచి, A సర్టిఫికేట్ రావడం చాలా మామూలు విషయం అనుకునేంతగా సినిమా వాళ్ళూ ఎదిగారు. కొంచమైనా నిబంధనలు పాటిద్దాం అన్న స్టేజి నుంచి సర్టిఫికేట్ ఇవ్వడం ఓ మొక్కుబడి అనే స్టేజి కి సెన్సార్ బోర్డూ వచ్చేసినట్టే ఉంది. ఇంకా ఈ సర్టిఫికేట్ల విభజన అవసరమా...?

ఆదివారం, ఫిబ్రవరి 15, 2009

నాలుగు కథలు

తెలుగు కథలు క్రమం తప్పకుండా చదివే వాళ్ళకి కె. ఎ. ముని సురేష్ పిళ్ళె పేరు తెలిసే ఉంటుంది. శ్రీకాళహస్తి కి చెందిన ఈ జర్నలిస్టు సబ్జక్ట్ ను ఎంచుకోవడం నుంచి, కథ నడక, ముగింపు విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. చుట్టూ జరిగే సంఘటనలనే కథావస్తువులుగా తీసుకునే పిళ్ళె, ప్రతి అంశాన్నీ చాలా నిశితంగా పరిశీలించి కథలుగా మలుస్తారనిపిస్తుంది ఆయన కథలు చదివినప్పుడు. పిళ్ళె రాసిన నాలుగు కథల గురించి ఇప్పుడు చెబుతాను. ఈయన పేరు నాకు మొదట తెలిసింది 'అనాది-అనంతం' అనే కథ చదివినప్పుడు. ఐదేళ్ళ క్రితం ఈనాడు ఆదివారం అనుబంధం లో చదివానీ కథ. కథను నడిపించిన తీరు యండమూరి 'వెన్నెల్లో గోదారి' ని గుర్తు చేస్తుంది. అంటే ప్రతి పాత్రా తన కథను తనే చెప్పుకుంటుంది.

'అనాది-అనంతం' కథలో ప్రధాన పాత్రలు మూడు. ఓ భూస్వామి(నరసారెడ్డి), జీతగాడు (చలమయ్య), జీతగాడి కొడుకు (లక్ష్మీనారాయణ). చలమయ్య తన కొడుకుని చాలా కష్టపడి చదివించి ఓ ప్రభుత్వాధికారి ని చేస్తాడు. కొడుకు, కోడలు, మనవలతో ఊరికి వచ్చి ఉంటే జీతగాళ్లుగా, కూలీలుగా బ్రతుకున్న కొందరైనా స్ఫూర్తి పొంది వాళ్ల పిల్లల్ని చదివిస్తారన్నది అతని ఆలోచన. కొడుక్కి ఊరు రావడం ఇష్టం ఉండదు. ఆ మురికిలో తన పిల్లలు ఉండలేరు అంటాడు. పైగా ఊరంతా తనని జీతగాడి కొడుకుగా మాత్రమే చూస్తుందని, ఓ అధికారిగా గుర్తించదనీ అతని ఫిర్యాదు. ముఖ్యంగా భూస్వామి వ్యవహార శైలి అతనికి నచ్చదు. ఇక భూస్వామి, "వాడు ఇవ్వాలంటే ఆఫీసరు అయాడు కానీ, చిన్నప్పటినుంచీ మనకి తెలిసినోడే కదా.. ఆ చనువుతో మాట్లాడితే తప్పా? ఆఫీసరైనంత మాత్రాన జీతగాడి కొడుకు కాకుండా పోతాడా?" అంటాడు. లక్ష్మీనారాయణకి ఇతరులు బాగు పడడం ఇష్టం ఉండదనీ, అది ఒప్పుకోలేక తనని తప్పు పడుతున్నాడనీ నరసారెడ్డి ఫిర్యాదు.

రెండో కథ 'రాతి తయారీ' మీడియా మీద ఎక్కుపెట్టిన బాణం. జనం చావులని సొమ్ము చేసుకునే ఎలక్ట్రానిక్ మీడియాని ఎండగడతారీ కథలో. కథంతా ఓ టీవీ చానల్ రిపోర్టరు, కెమెరామన్ ల మధ్య సంభాషణ రూపంలో ఉంటుంది. ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నప్పుడు, అతని కుటుంబ సభ్యుల ఎమోషన్స్ తో సంబంధం లేకుండా 'షాట్స్' కోసం 'బ్రేకింగ్ న్యూస్' కోసం రిపోర్టర్లు, కెమెరామెన్లు ఎలా ఆరాట పడతారో కళ్ళముందు ఉంచుతుంది ఈ కథ. ఆయా న్యూస్ లు సంపాదించమని వారికి పైనుంచి వచ్చే వత్తిళ్ళు, రాత్రంతా నిద్రమానుకుని పనిచేసినా, ఉదయాన్నే ఫోన్ రాగానే పరిగెట్టడం..ఇలా నాణేనికి ఉన్నా రెండోవైపునీ చూపుతారు. ఆత్మహత్య చేసుకున్న కొడుకు కోసం గుండెలవిసేలా ఏడ్చిన ముసలి తల్లి మరణాన్ని సదరు రిపోర్టరు, కెమెరామెన్ 'ఎక్స్ క్లూసివ్' న్యూస్ గా సంపాదించడం ఈ కథ ముగింపు. ఈ కథని చదివాకా, టీవీ చానళ్ళలో వచ్చే మానవీయ కథనాల తెరవెనుక కథలని గురించి ఆలోచించకుండా ఉండలేము.

రోడ్డు విస్తరణ లాంటి ప్రభుత్వ పథకాలని ఆపడానికి వ్యాపారులు ఎంచుకునే మార్గాలు, అందుకు అవసరమైతే దేవుడిని కూడా ఎలా వాడుకుంటారో చెప్పే కథ 'గార్డు వినాయకం భజే.' కథాస్థలం శ్రీకాళహస్తి. కథంతా హాస్య, వ్యంగ్య ధోరణిలో సాగుతుంది. కోటకు కాపలా గా రాజులు కట్టిన వినాయకుడి గుడిని ఊళ్ళో పెద్దలే కాదు పిల్లలుకూడా పట్టించుకోరు. పరీక్షలప్పుడు మాత్రం ఓ సారి ఆగి దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారు. ఆ గుడి శిధిల దశకి వచ్చేశాక ఉన్నట్టుండి జనంలో కదలిక మొదలవుతుంది. గుడికి మరమ్మతులు చేయించి ఉత్సవాలు జరిపే ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే, రోడ్డు విస్తరణలో భాగంగా గుడిని కూలగొట్టాలని అధికారులు నిర్ణయిస్తారు. గుడిని కొట్టేస్తే, రోడ్డు మార్జిన్ లో ఉండే షాపులనూ కొట్టేస్తారు. దానిని అడ్డుకోడానికి వ్యాపారులు వేసిన ఎత్తుగడే గుడికి మరమ్మతులు. "ఆ వినాయకుడిది ఇప్పుడూ గార్డు బతుకే" అంటారు రచయిత చివర్లో.

నాలుగోదీ, నాకు బాగా నచ్చిందీ 'పూర్ణమూ..నిరంతరమూ..' 'పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే' (మొత్తం లో నుంచి మొత్తాన్ని తీసేస్తే మొత్తం మిగులుతుంది) అన్న వేదవాక్కుని మానవ సంబంధాలకి అన్వయిస్తూ రాసిన కథ. ఎవరైనా చనిపోయినప్పుడు, అంత్యక్రియలకు ఎందుకు వెళ్ళాలి? చనిపోయిన మనిషికి మనం వెళ్ళినట్టు తెలియదు కదా. అప్పటిదాకా ఆమనిషిని పట్టించుకోనివాళ్ళు కూడా చనిపోగానే దండలు వేసి, కాళ్ళకి మొక్కి ఆ శవాన్ని దేవుడిని చేసేస్తారెందుకు? ఇవి ఈ కథ లో రచయిత లేవనెత్తే ప్రశ్నలు.

ఓ తల్లి, తండ్రి, వాళ్ళకో ఇంట్రావర్ట్ కొడుకు. కొడుకు తన స్నేహితురాలి తల్లి చనిపోయినప్పుడు అంత్యక్రియలకు వెళ్లి వస్తాడు. అదే సమయంలో తండ్రి ఓ విల్లు రాస్తాడు. తను చనిపోయాకా తన కళ్లు, శరీరం దానం చేయాలనీ, శవాన్ని చూడడానికి ఎవరూ రాకూడదనీ. ముందుగా ఆ విల్లును తన స్నేహితుడికి చూపిస్తాడు. ఆ స్నేహితుడు తిట్టి వెళ్తాడు. అంత్యక్రియల నుంచి వచ్చాక కొడుక్కి చూపిస్తాడు. చాలా మామూలుగా విల్లును చదివిన కొడుకు, 'ఎవరూ రాకూడదు' అన్న విషయం దగ్గర అభ్యంతరం చెబుతాడు. "ఎవరైనా చనిపోయినప్పుడు మనం వెళ్ళేది, చనిపోయిన వాళ్ల కోసం కాదు నాన్నా. వాళ్ల చుట్టూ ఉన్నవాళ్ళ కోసం. వాళ్లు వైరాగ్యంతో ఉంటారు, మనకి ఎవరూ లేరు అనుకుంటారు, ఎవరికోసం బతకాలి అంకుంటారు. మనం వెళ్ళడం ద్వారా, మీకు మేమంతా ఉన్నాం అని చెప్పడానికి. నువ్వు చనిపోయాక వచ్చేవాళ్ళు నాకోసం వస్తారు. వాళ్లు రావద్దని నువ్వెలా అడుగుతావు?" అంటాడు కొడుకు.

చివరి రెండు కథలూ ఆదివారం ఆంధ్రజ్యోతి లో వచ్చాయి. ఇవి కాకుండా ఇంకేమైనా రాశారేమో తెలియదు. పిళ్ళె తన కథలతో ఓ కథాసంకలనం తెస్తారని ఎదురు చూస్తున్నా..

శనివారం, ఫిబ్రవరి 14, 2009

టమాటాలు

న్యూస్ పేపర్ల వాళ్ళకి ఎరుపు రంగంటే భలే ఇష్టం. ఏదైనా ప్రమాదం జరగడం ఆలస్యం, మర్నాడు పేపర్ రక్తం వోడుతూ ఉంటుంది. ముట్టుకుంటే చేతికి రక్తపు మరకలు అవుతాయేమో అనిపించే లాంటి ఫొటోలతో మొదటి పేజిలను అలంకరించి పంపుతారు. ఇప్పుడు కూడా పేపర్లు ఎరుపెక్కాయి.. ఈ సారి రక్తంతో కాదు..టమాటాలతో.. కష్టపడి పండించిన పంటకి గిట్టుబాటు ధర రాకపోతే, కడుపుమండిన రైతులు పండించిన పంటను పోలీసుల కళ్లు కప్పి అసెంబ్లీ ముందు పారబోసినప్పుడు పేపర్లన్నీ ఎర్రని ఫొటోలతో పాటు తమదైన శైలిలో వ్యాఖ్యానాలనీ ప్రచురించాయి. అక్కడితో వాటి పని ఐపోయింది. కాని రైతులపనే ఎటూ తెలియకుండా ఉంది.

మనదేశంలో ప్రతి ఉత్పత్తి దారుడూ తన ఉత్పత్తికి ధర నిర్ణయించుకుంటాడు, రైతు తప్ప. ఏ పంట అయినా కానివ్వండి, పంట కోతకి వచ్చే సమయానికి ఆకాశాన్నంటే ధరలు, రైతు ఆ పంటను మార్కెట్ కి తెచ్చేసరికి నామమాత్రమైపోతాయి. పండించిన పంట నిల్వ ఉంచగలిగేది ఐతే, నిల్వ ఉంచే స్తోమతు తనకు ఉంటే ఆ రైతు దానిని గోదాములో దాచి మంచి ధర వచ్చినప్పుడు దానిని అమ్ముకో గలుగుతాడు. అలాకాక, ఆ పంట త్వరగా చెడి పోయేది ఐతే..వచ్చిన ధరే మహాప్రసాదం అనుకోవాలి. ఆ ధరకు అమ్ముకోడానికి మనసు ఒప్పుకోకపోతే, అందుకు ప్రత్యక్ష కారణం ఎవరో తెలియకపోతే.. కడుపుమండి ఆ పంటను నాశనం చేయాలి. అంతకన్నా రైతుకి మరో దారి లేదు. అది టమాటా కావొచ్చు లేదా మావిడి పళ్ళు కావొచ్చు..జరుగుతున్నది ఇదే.

రాష్ట్రంలో వెనుకబడ్డ జిల్లాల్లో చిత్తూరు ఒకటి. అక్కడి భౌగోళిక పరిస్తితులు అన్ని పంటలకూ అనుకూలం కాదు. నీటి పారుదల సౌకర్యమూ తక్కువే. అక్కడి రైతులు పండించగలిగే కొద్ది పంటల్లో టమాట ఒకటి. అదేం చిత్రమో, టమాట పిందె దశలో ఉన్నప్పుడు కిలో రూ.25 ఉన్న ధర, పంట చేతికి వచ్చేసరికి కిలో 25 పైసలకు పడిపోతుంది. సీజన్లో మదనపల్లె వైపు వెళ్ళే రోడ్ల పక్కన రాశులు గా పోసిన టమాటాలు వుసూరుమనిపిస్తాయి. యెంత పెట్టుబడి పెట్టి, ఎన్ని కష్టాలు పడితే పంట చేతికి వస్తుందో గ్రామీణ నేపధ్యం నుంచి వచ్చిన వారికి తెలిసిన విషయమే. ఆ పంట కనీసం పెట్టిన పెట్టుబడిని కూడా వెనక్కి ఇవ్వకపోతే రైతు ఎంత క్షోభ అనుభవిస్తాడో ఊహకి అందే విషయమే. అయినా, ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు..ప్రతీ సంవత్సరమూ ఇదే కథ. రైతు పంటను రోడ్డున పోసేది పంట ఎక్కువై కాదు, అది తనని దగా చేసిందన్న కడుపు మంటతో.

ఎయిర్ కండిషన్డ్ గోడౌన్ల నిర్మాణం, ఫుడ్ ప్రోసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు లాంటి జనాకర్షక పథకాలు నాయకుల వాగ్దానాల రూపంలో ఎన్నోసార్లు గాలిలో కలిశాయి. రైతుల సమస్యలు సమస్యలుగానే ఉన్నాయి. ఓ పక్క ఆహార సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలని అంతర్జాతీయ వేదికలమీద చర్చలు జరుగుతోంటే, మరో ప్రత్యామ్నాయం లేక విలువైన పంటను నేల పాలు చేసే పరిస్థితుల్లో మన రైతులు ఉన్నారు. నేలపాలైన పంట national waste కాదా? ఏదైనా ఉత్పత్తికి తగిన ధర లేకపోతె, ఉత్పత్తిదారులు సమ్మె చేస్తారు, అధికారంలో ఉన్నవారితో లాబీయింగ్ చేసి, రకరకాల వత్తిడులు తెచ్చి తమకు కావాల్సింది సాధించుకుంటారు. కాని, రైతులు అలా చేయలేరు. వాళ్లు చదువుకున్న వాళ్లు కాదు..మిగిలిన ఉత్పత్తిదారులకన్నా అమాయకులు. సమ్మె చేయలేరు. పాలకులని ప్రభావితం చేయగలిగే సంఘటిత శక్తి వారిలో లేదు. వారికి తెలిసిందల్లా కడుపు నిండా అన్నం పెట్టడం, కడుపు మండినప్పుడు ఇలా పంటను పారబోసి రాజకీయనాయకులకి ఒక్క రోజుకి సరిపోయే ఆరోపణలనూ పత్రికలకూ కొన్ని కాలాల వార్తలను, ఫోటోలను ఇవ్వడం మాత్రమే.

శుక్రవారం, ఫిబ్రవరి 13, 2009

బాలనాగమ్మ

ప్రశ్న: బాలనాగమ్మ నాటకం ప్రదర్శించుటకు కావాల్సిన ముఖ్య పాత్రలేవి? జవాబు: మాయల ఫకీర్, సంగు మరియు కుక్క. 'అదేమిటీ..బాలనాగమ్మ పాత్రధారి వద్దా?' అన్నారంటే వాళ్లెప్పుడూ ఈ నాటకం చూడలేదన్న మాట. నిజానికి 'బాలనాగమ్మ' నాటకం లో కథానాయికది అతిధి పాత్రే. మొదట్లో కనిపిస్తుంది..ఫకీర్ ఆమెని కుక్కగా మార్చేస్తాడు..మళ్ళీ చివర్లో ఫకీర్ చనిపోయాక మళ్ళీ బాలనాగమ్మ కనిపిస్తుంది. నాటక సమాజాలవాళ్ళు పల్లెటూళ్ళు తిరిగి నాటకాలు వేసే రోజుల్లో 'బాలనాగమ్మ' నాటకం వేసే ట్రూప్ వచ్చిందంటే 'కుక్క ఎలా ఉంది?' అని ఎంక్వైరీలు మొదలయ్యేవి. పెద్ద సెట్టింగులతో పాటు, కుక్కనీ తమ వెంట ఊళ్ళు తిప్పుకునేవారు ఆ ట్రూపుల వాళ్లు.

కథేమిటంటే బాలనాగమ్మ ఏడేడు లోకాలకీ అందమైన ఓ రాకుమారి. ఓ రాజుని పెళ్ళాడి 'బాలవర్ధి రాజు' కి జన్మనిస్తుంది. అదిగో అప్పుడే మాయల ఫకీర్ ఆమెను చూసి మోహిస్తాడు. ఇతను కొంచం రావణాసురిడి టైపు. ఓ ముని వేషం లో వచ్చి, వుయ్యాల్లో బిడ్డకి జోల పాట పాడుతున్న బాలనాగామ్మని స్వయంగా భిక్ష తీసుకురమ్మని అడిగి, ఆమెని కుక్కగా మార్చేసి తనవెంట తీసుకుపోతాడు. ఆమె తనకు తానుగా ఇష్టపడేవరకు ఆమెని తాకరాదని నియమం పెట్టుకుంటాడు. ఇతని డెన్ లో ఉండే మనిషి సంగు. ఫకీర్ కి మధుపాత్ర అందివ్వడం, ఆడి పాడి అతన్ని అలరించడం ఆమె విధులు. పెద్దవాడైన బాలవర్ధి రాజు, తన తల్లి ఫకీర్ దగ్గర బందీగా ఉన్నదని, ఫకీర్ ప్రాణాలు చిలుకలో ఉన్నాయని తెలుసుకుని, ఫకీర్ ని చంపి తల్లిని బంధ విముక్తని చేసి తల్లితండ్రులని కలిపాకా తెర పడిపోతుంది.

ఆంద్ర దేశంలో ఎన్నో ట్రూపులు 'బాలనాగమ్మ' నాటకాన్ని ప్రదర్శించినా 'సురభి' వారి ప్రదర్శన తీరే వేరు. వాళ్ల సెట్టింగులు, మ్యాజిక్కులు చూడాల్సిందే. అన్ని నాటకాల మాదిరిగానే ఈ నాటకానికి ఆర్టిస్టుల టైమింగ్ చాలా ముఖ్యం. అంటే యాక్షను, రియాక్షనూ ఆలస్యం లేకుండా జరగాలి. లైటింగ్ వారి సహకారం చాలా అవసరం. సరైన సమయంలో దీపాలు ఆర్పడం, డిం చేయడం వంటివి జరక్కపోతే ప్రేక్షకులకి కథలో లేని హాస్యం కూడా అందుతుంది. మిగిలిన పాత్రధారులతో పాటు కుక్కగారినుంచి నటన రాబట్టుకోవడం పెద్ద పని. ఇదేమీ సినిమా కాదు కదా మరో టేక్ తీసుకోడానికి. అందుకే ట్రూపుల వాళ్లు కుక్క విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. కుక్క పిల్లల్ని చేరదీసి పెంచి వాటికి ట్రైనింగ్ ఇస్తూ తమ వెంట తిప్పుకుంటారు.

'బాలనాగమ్మ' ను తలచుకున్నప్పుడల్లా చాలా ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన గుర్తొస్తుంది. ఓ ట్రూప్ వాళ్ల ప్రదర్శన చాలా సీరియస్ గా జరుగుతోంది. ఫకీర్ బాలనాగమ్మని కుక్కగా మార్చే కీలకమైన సీన్ వచ్చింది. బాలనాగమ్మ తలపై ఫకీర్ మంత్రదండం పెట్టగానే, లైట్ డిం అయి చిన్న బాంబు పేలాలి, బాలనాగమ్మ పాత్రధారి తెరవెనక్కి వెళ్లి, కుక్క స్టేజి మీదకి రావాలి..ఇది సీన్. ఐతే ఓ ఫోటోగ్రాఫర్ చాలా ఉత్సాహంగా నాగమ్మ కుక్కగా మారే సీన్ ఫోటో తీయాలని స్టేజికి దగ్గరగా వెళ్ళాడు. ఫకీర్ దండాన్ని నాగమ్మ తలపై పెట్టాడు, లైట్ డిం కాలేదు, కుక్క స్టేజిమీదకి వచ్చేసింది. నాగమ్మ పాత్రధారి షాకై చూస్తోంది. బాంబు కొంచం ఆలస్యంగా పేలింది. బాంబు విషయం తెలియని ఫోటోగ్రాఫర్ ఉలిక్కిపడి దాదాపుగా స్టేజిమీద పడబోయి నిలదొక్కుకున్నాడు. కుక్క అతనిమీద 'భౌ' మంది తనకి డైలాగులు ఏమీ లేకపోయినా. .

ఈ సందట్లో నాగమ్మ పాత్రధారి తెర వెనక్కి వెళ్ళిపోయింది. ఫకీర్ పాత్రధారి సీనియర్ నటుడు. సమయస్ఫూర్తిగా 'కుక్కగా మార్చినా నీ పౌరుషం చావలేదా బాలనాగూ..' అని వికృతంగా నవ్వాడు. ఆతర్వాత అతను కుక్కని తన డెన్ కి తీసుకెళ్ళినప్పుడు సంగు చిరాగ్గా చూసి 'ఏటీ కుక్కా?' అంటే 'కుక్క కాదే నీ-అక్క బాలనాగుని తెచ్చితినే..' అన్నప్పుడు ఆడిటోరియం మొత్తం చప్పట్లతో మార్మోగింది..అతని డైలాగు లో విరుపుకి. .

మిగిలిన ట్రూపుల కన్నా సురభి వాళ్లు ఈ నాటకం ప్రదర్శించే తీరు ప్రత్యేకంగా ఉంటుంది..ఇది వీరు ప్రదర్శించే ప్రతి నాటకానికీ వర్తిస్తుంది..చిన్నప్పటి బాలనాగమ్మ అక్క చెల్లెళ్ళను చూపించేటపుడు స్టేజి నిండా ఊయలలు, ఫకీర్ డెన్, అతను చేసే మాయలు, సంగు ఆటపాటలు, చివర్లో బాలవర్దిరాజు సాహసం..ఇలా ప్రతి చోటా వారిదైన మార్కు చూపిస్తారు. ఐతే కొంతకాలం క్రితం జరిగిన సురభి వారి ప్రదర్శన చూసి కొంచం నిరాశ పడ్డాను. ప్రదర్శన బాగాలేక కాదు, కుక్క కనిపించక.. కుక్కకు బదులుగా ఓ పెద్ద కుక్క బొమ్మను ఉపయోగించారు. వారికున్న సమస్యలు ఏమిటో తెలియదు కాని, నాకు మాత్రం 'బాలనాగమ్మ' నాటకం అందం పోయిందనిపించింది.

గురువారం, ఫిబ్రవరి 12, 2009

జీవకారుణ్యం

అప్పుడు నేను రెండో తరగతో, మూడో తరగతో చదువుతున్నా.. ఇల్లు, బడి తప్ప మరో ప్రపంచం ఉండేది కాదు. ఆటలకి వెళ్ళడం మీద ఆంక్షలు ఉండేవి కాబట్టి బడి నుంచి తిన్నగా ఇంటికే. ఇంటి చుట్టుపక్కల చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్లు ఆడుకుంటుంటే నేను కిటికీ లోంచి చూస్తూ ఉండేవాడిని. ఓ రోజు నాన్న ఎక్కడికో బయటకు వెళ్ళారు. గణేష్, మరికొందరు పిల్లలు ఆటలకి మా ఇంటివైపు వచ్చారు. నాన్న లేరని తెలిసి ఇంటికి వచ్చి నన్నుకూడా ఆటలకి పంపమని బతిమాలారు. 'వాళ్ల నాన్నగారొస్తే కోప్పడతారు.. మీరంతా ఇక్కడే ఆడుకోండి' అని షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చింది అమ్మ. మొత్తం ఓ ఏడెనిమిది మంది పిల్లలం పోగయ్యాం. అమ్మ షరతులకి లోబడి ఆడ గలిగే ఆట ఏదీ కనిపించడం లేదు. పైగా ఏ క్షణం లో నాన్న వస్తే ఆ క్షణంలో ఆట కేన్సిల్ అయిపోతుంది. అందరం కలిసి ఆలోచించి దాగుడు మూత దండాకోర్ మొదలుపెట్టాం.

ఈ ఆటలో లీడర్ ఒకరికి కళ్లు మూసి ఓ కర్ర పుల్లతో అందరి చేతులూ తాటిస్తూ ఒక్కొక్కరినీ పారిపొమ్మని చెబుతాడు. అందరూ పారిపోయాక కళ్లు మూసుకున్న అతను/ఆమె పారిపోయి దాక్కున్న వాళ్ళందరినీ పట్టుకోవాలి. మొదట ఎవరు దొరికితే వాళ్ల కళ్లు మూసి మళ్ళీ ఆట మొదలు పెడతారన్న మాట. ఎవరి ఇళ్ళలోనూ దాక్కో కూడదు లాంటి కండిషన్స్ ఉంటాయి. కొంచం పెద్ద పిల్లలు టీం లీడర్ గా ఉంటారు. అమ్మాజీ మా టీం లీడర్. ముందుగా చెల్లాయి (అది అమ్మాయి పేరు) వంతు వచ్చింది. లీడర్ ఆమె కళ్లు మూసి ఒక్కొక్కరినీ పారిపొమ్మని చెబుతోంది. అందరం దాక్కున్నాం. ఇంతలొ చెల్లాయి వాళ్ల అన్నయ్య హనుమాన్ 'తాంబేలు..తాంబేలు' అని అరిచాడు. ఏమిటో అని అందరం ఓ చోట మూగాం. ఓ చిన్న తాబేలు, ఎక్కడినుంచో తప్పిపోఇనట్టు ఉంది.. అందరం చుట్టూ మూగేసరికి డిప్పలోకి ముడుచుకుపోయింది.

ఇక అది మొదలు, అందరూ ఆట విషయం మర్చిపోయి గోల గోలగా మాట్లాడ్డం మొదలుపెట్టారు. ఎవరెవరు, ఎప్పుడెప్పుడు ఎంత పెద్ద తాంబేలుని చూశారో మిగిలినవాళ్ళు వింటున్నారో లేదో పట్టించుకోకుండా చెప్పేస్తున్నారు. కొంతమంది తాంబేలు మాంసం తినేవాళ్ళు ఉంటారట..తాబేటి చిప్పలలో అడుక్కునే వాళ్లు డబ్బులు దాచుకుంటా రట.. ఇలా నాకు అప్పటివరకు తెలియని చాలా విషయాలు తెలిశాయి. పాపం, మా కళ్ళ బడ్డ తాబేలు కదులు మెదులు లేదు. 'సరే..ఇప్పుడు దీన్ని ఏంచేద్దాం?' అమ్మాజీ కి కర్తవ్యం గుర్తొచ్చింది. మళ్ళీ ఎవరికి తోచింది వాళ్లు చెబుతున్నారు. ఎదురుగా ఉన్న చెరువులో వదిలేయాలన్న ప్రతిపాదన వచ్చింది కాని, చాలా మంది ఒప్పుకోలేదు. 'చెరువులో ఐతే మళ్ళీ మనం చూడడానికి ఉండదు' అని కొందరు 'మిగిలిన తాంబేల్లు దీనిని బతకనివ్వవేమో' అని మరికొందరు సందేహాలు వ్యక్తం చేశారు. మొత్తానికి మా కళ్ళ బడ్డ తాబేలుని రక్షించడం మా బాధ్యత అనే విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదిరింది.

ఇంతలొ కొంతమంది పిల్లల కళ్లు మా కాంపౌండ్ లో ఉన్న నూతి మీద పడ్డాయి. 'దీని నూతిలో వదిలేస్తే..' మళ్ళీ చర్చోపచర్చలు. మొత్తానికి ఏకాభిప్రాయం కుదిరింది. అమ్మాజీ వాళ్లు అమ్మతో సంప్రదించారు. అప్పటికి దీపాలు పెట్టె వేళయ్యింది. 'తాంబేలుని నీళ్ళలో వదిలేముందు పూజ చేయాలండి..' అమ్మాజీ చెప్పింది. అసలే దేవుడికి సంబంధించిన విషయాల్లో ఏమాత్రం రాజీ పడని అమ్మ వెంటనే పసుపు, కుంకం, హారతి తెచ్చేసింది. ఇద్దరు ధైర్యస్తులు తాబేలుని చేత్తో పట్టుకుని ఓ పెంకుముక్క మీదకి ఎక్కించారు. నూతి గట్టుమీద పూజ చేసి, మేమందరం దండాలు పెట్టుకున్నాక (ఎప్పటిలాగే బాగా చదువుకోవాలి, నాన్న నన్ను కొట్టకూడదు అని మొక్కేసుకున్నా) పెంకు ముక్కను చేదలో జాగ్రత్తగా దింపి, అటుపై నూతిలో దింపారు. ప్రసాదంగా అమ్మ అందరికీ అటుకులు పంచింది. అందరూ ప్రసాదం తింటుండగా దూరంగా నాన్న సైకిల్ బెల్ వినిపించింది. నా మనసెందుకో కీడు శంకించింది.

ఫ్రెండ్స్ అందర్నీ వీధిలోనే వదిలేసి పుస్తకాల సంచీ దగ్గరికి పరుగు తీశా. అమ్మ వాళ్ళతో కబుర్లు చెబుతుండగానే నాన్న వచ్చేశారు. 'చదువు సంధ్యా లేకుండా ఏం చేస్తున్నారిక్కడ?' అని వాళ్ళని కొంచం ఘాటుగానే పలకరించారు. తిట్టే విషయంలో ఆయనకి తన పిల్లలు, పరాయి పిల్లలు అనే భేదాలు లేవు. ఆటల విషయాన్ని తెలివిగా తప్పించి, ఎంత కష్టపడి తాంబేలుని రక్షించామో కథలు కథలుగా చెప్పారు వాళ్లు. 'నూతిలో ఎందుకు వదిలారు?' అంటూ నూతి దగ్గరకి వెళ్ళారు నాన్న. 'ఇదింకా నీళ్ళలోనే తేలుతోంది' అంటూ చేద వేసి తాబేలుని బయటకి తీశారు. నేల మీదకి దింపగానే కొంచం కదిలి పాకడం మొదలు పెట్టింది. 'ఎవరు దీన్ని నూతిలో దింపింది? ఇది మెట్ట తాబేలు..నీళ్ళలో బతకదు' అన్నారు సీరియస్ గా. ఎవ్వరూ కిక్కురుమనలేదు. 'వాళ్ళంటే పిల్లలు..తెలీదు..నువ్వైనా చెప్పొద్దూ..' ఈసారి గాలి అమ్మ మీదకి మళ్ళింది. పాపం అమ్మ మాత్రం ఏం చెబుతుంది. పూజ హడావిడిలో తనసలు తాబేలుని చూస్తే కదా. ఈ గొడవ జరుగుతుండగానే తాబేలు మెల్లగా పాక్కుంటూ పొదల్లోకి వెళ్ళిపోయింది.

బుధవారం, ఫిబ్రవరి 11, 2009

నాయికలు-నవనీతం

నవనీతం చాలా సాహసం ఉన్న అమ్మాయి. తన పుట్టుకకి కారణమైన వాడు ఎదురుగా కనిపిస్తున్నా అతన్ని 'నాన్నా' అని పిలవలేని తనం.. తనని బలాత్కరించిన వాడిని పొడిచి పొడిచి హత్య చేసే తెగింపు.. తను ప్రేమించిన వాడితో ఆ ప్రేమను వ్యక్తం చేయలేని అసహాయ పరిస్థితి.. తనను పెళ్లి చేసుకున్నవాడికి పూర్తిగా తన ప్రేమను అందించగలుగుతున్నానా అనే సందేహం..వెరసి నవనీతం.

సంప్రదాయ శ్రీవైష్ణవ కుటుంబంలో కాలం తెచ్చే మార్పును కథావస్తువుగా తీసుకుని గొల్లపూడి మారుతిరావు రాసిన 'సాయంకాలమైంది' నవల్లో ఓ పాత్ర నవనీతం. నిజానికి ఈ నవలలో నాయికా నాయకులు ఉండరు.. ఉన్నవి పాత్రలు మాత్రమే.. కథలో కొన్ని కీలకమైన మలుపులకు కారణమైన నవనీతం పాత్ర మాత్రం నాకు నాయికలాగే అనిపిస్తుంది.

కుంతీనాధాచార్యులు, ఆయన కొడుకు పెద్ద తిరుమలాచార్యులు, మనవడు సుభద్రాచార్యులు, ముని మనవడు చిన్న తిరుమలాచార్యులు ల కథే 'సాయంకాలమైంది.' సర్పవరం అగ్రహారం లో నియమ నిష్టలతో భావనారాయణ స్వామి ని సేవించుకునే కుంతీనాధాచార్యులు ఓ వేకువ జామున 'మ్లేచ్చుడు' తనకు ఎదురు పడ్డాడనే కారణంతో ఊరు విడిచిపెట్టి విజయనగరం జిల్లా పద్మనాభం చేరుకుంటాడు. అక్కడికి చేరగానే కుమార్తె హఠాత్తుగా మరణించడం తో ఆయన పక్షవాతం బారిన పడతాడు.

కొడుకు పెద్ద తిరుమలాచార్యులు పద్మనాభంలో కుంతీమాధవ స్వామి ని సేవించుకుంటూనే ఆ ఊరి రాజుగారి కోసం తను నేర్చుకున్న ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకి కూడా అందిస్తూ ఉంటాడు. తాను వైద్యం చేస్తూ ఆచారాన్ని మంట గలుపుతున్నానని బాధ పడుతున్న తండ్రిని సాంత్వన పరచడానికి తన కొడుకు సుభాద్రాచార్యులుని ఆయన సమక్షంలో సంప్రదాయ బద్ధంగా పెంచుతాడు పెద్ద తిరుమలాచార్యులు. రాజుగారి కొడుకు బుల్లిరాజు కీ, సుభద్రాచార్యులుకీ స్నేహం కుదురుతుంది.

పాము కాటు వేసిన తన భర్త పైడిబాబుని ఆచార్యులవారి దగ్గర వైద్యానికి తీసుకొచ్చిన కైకవశి, భర్త మరణించడంతో అనాధ అవుతుంది. మూగదైన కైకవశిని ఆలయంలో పనిచేయమంటారు ఆచార్యులు. బుల్లిరాజుకీ కైకవశికీ ఏర్పడ్డ సంబధం వల్ల నవనీతం జన్మిస్తుంది. చిన్నప్పటినుంచీ తిరుగుబాటు తత్త్వం ఈమెది. తండ్రికి ఇష్టంలేకపోయినా ఇంగ్లీష్ చదువు చదువుతున్న చిన్న తిరుమలాచార్యులంటే ఇష్టం నవనీతానికి.

ఆ విషయం అతనికి చెప్పే లోగానే దర్జీ పొన్నయ్య ఆమెని బలాత్కారం చేస్తాడు. కిరసనాయిలు సీసాతో పొడిచి పొడిచి పొన్నయ్యని హత్య చేసిన నవనీతం జైలు శిక్ష అనుభవిస్తూ, చిన్న తిరుమల ఏర్పాటు చేసిన లాయర్ సంజీవి సమక్షంలో 'ఈ ప్రపంచంలో నేను ప్రేమించే ఏకైక వ్యక్తి తిరుమల' అని చెబుతుంది. ఇంజనీరింగ్ చదివిన తిరుమల ఉద్యోగానికి దొరల దేశం వెళ్ళిపోతాడు. జైలు శిక్ష పూర్తయ్యాక నవనీతాన్ని పెళ్లి చేసుకుంటాడు సంజీవి. తల్లినీ తండ్రినీ కోల్పోయిన ఓ అంధ బాలుడు నారిగాడిని చేరదీసి వాడిని నారాయణ ను చేసి పెంచుతుంది నవనీతం.

'సదువు సెప్పించక సినబాబుని నీలాగా గోచీ పెట్టుకుని తిరగమంటావా పంతులు గారూ?' అని సుభాద్రాచార్యులుని ప్రశ్నించే చిన్నారి మొదలుకుని, 'నారిగాడిని మనం పెంచుకుందామండీ' అని సంజీవిని ఒప్పించే పరిపూర్ణమైన మహిళగా ఎదిగిన నవనీతం పాత్ర చిత్రణ గుర్తుండి పోతుంది. బుల్లిరాజు కొడుకు ని నడిరోడ్డు మీద చెంపదెబ్బ కొట్టే సీన్, జైల్లో తిరుమలని 'శ్రీరామ' దిద్దించమని అడిగినపుడు అతను జైలు గదిలో ఇసుక పోసి ఆమెచేత దిద్దించే సన్నివేశం, అమెరికా వెళ్లేముందు నవనీతాని జైల్లో కలిసిన తిరుమల ఆమెకో ఎరోగ్రాముల కట్ట ఇచ్చి ఉత్తరం రాయించమని చెప్పినప్పడు, అదే రోజు సాయంత్రం అన్ని ఎరోగ్రాముల నిండా 'శ్రీరామ' రాసి సంజీవి చేత రైల్వే స్టేషన్ కి పంపే సీన్.. ఇలా చెప్పుకుంటూ పొతే మొత్తం నవలంతా తిరిగి రాయాల్సి వస్తుందేమో.

నవనీతాన్ని పెళ్ళిచేసుకున్న సంజీవి అదే రోజు ఆమెకి పెళ్ళికానుకగా తిరుమలకి ఫోన్ చేయిస్తాడు.. 'మా ఆయనకి మంచి ఉన్నికోటు పంపు చినబాబూ' అంటుంది నవనీతం. ఈ నవల చదివిన కొన్నాళ్ళకి నేను, నా ఫ్రెండ్ పద్మనాభం వెళ్ళాము. అది కల్పిత కథే అని తెలిసినా ఆ ఊళ్ళో నవల్లో పాత్రలన్నీ వెతుక్కున్నా.. కుంతీ మాధవ స్వామి గుళ్ళో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ 'ఇక్కడే కదా, ఆచార్యులుగారిని ఎదిరించి మాట్లాడిన నవనీతాన్ని బుల్లిరాజు చెంప దెబ్బ కొట్టింది?' అన్నప్పుడు...నాకు ఏమనిపించి ఉంటుందో మీరే ఊహించండి.

మంగళవారం, ఫిబ్రవరి 10, 2009

వెన్నెల్లో వేడిపాలు

చంద్రుడు నడినెత్తికి వచ్చాడు. పున్నమి రాత్రి కావడంతో చాలా ప్రకాశవంతంగా ఉన్నాడు. నగరం అంతా గాఢ సుషుప్తి లో ఉంది. మేడ మెట్ల మీద కుర్చుని ఆకాశంలోకి చూస్తున్నా.. నాకు చంద్రుడికి మధ్య గున్నమావిడి చెట్టు. చైత్రం వచ్చేస్తోందిగా..ఉగాదికి వగరు పిందెలని ఇవ్వడం కోసం ఒళ్ళంతా పూలతో ఆయత్తమైపోతోంది.. లేత మామిడిపూల వాసన వగరుగా.. నిన్న మొన్నటిదాకా విరగబూసిన నిలువెత్తు పారిజాతం చెట్టు ఇప్పుడేదో పూయాలి కదా అన్నట్టు పూస్తోంది. ధనుర్మాసం ఐపోయింది కదా.. మామిడి కొమ్మల్లోనుంచి చంద్రుడు కనిపిస్తున్నాడు. నా చేతిలో ఉన్న గ్లాసులో వేడి వేడి పాలు..చెవుల్లో జానకి జీవన వేణువులలో మోహన పాడుతోంది..

ఒక్కగుక్క పాలు తాగి చంద్రుణ్ణి చూశా..చాలా దూరంగా ఉన్నాడు. చిన్నప్పుడు పెద్దయ్యాక పెద్ద మేడ కట్టుకుంటే చందమామను అందుకోవచ్చు అనుకోవడం గుర్తొచ్చి నవ్వొచ్చింది..అజ్ఞానంలో ఎంత ఆనందం ఉందో కదా.. చంద్రుడిలో ఉన్నది కుందేలా లేక రాధా క్రిష్ణులా? ఎప్పుడూ సందేహమే నాకు.. రాధా బాధితున్నిలే.. అంటున్నాడు బాలు నా చెవిలో.. జారుపైట లాగనేలరా ఆహా ఆరుబయట అల్లరేలరా అంటూ జానకి..మళ్ళీ చిరునవ్వు.. కొంచం కొంచం పాలు తాగుతున్నా.. చలి అనిపించడంలేదు.. అప్పుడే వేసవి వచ్చేస్తోందా.. ఇలా అనుకోవడం ఆలస్యం..నా సందేహం అర్ధం చేసుకున్నట్టుగా చిరుగాలి తాకి వెళ్ళింది నన్ను..

పాలు తాగడం పూర్తయింది..నుదిటిమీద చిరు చెమట..చల్లగాలి తగిలి చాలా ఆహ్లాదంగా ఉంది.. మామిడి కొమ్మలు అడ్డొచ్చి చంద్రుడు సరిగా కనిపించడంలా.. చెవుల్లో జానకి మౌనమేలనోయి అంటూ.. చంద్రుడి కోసం బాల్కనీ లోకి కుర్చీ లాక్కున్నా..ఓ తెల్ల మబ్బు చంద్రుడి దగ్గరకి వెళ్ళే సాహసం చేయలేక దూరంగా జరిగి వదిగి వెళ్ళిపోయింది.. ఇళయరాజా ఫ్లూట్ బిట్ ఎంత బాగుంది..జానకి కి కొంచం విశ్రాంతి ఇచ్చి సునీత అందుకుంది ఈవేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అంటూ.. రెండో ఆట సినిమా వదిలినట్టున్నారు.. ఓ నలుగురైదుగురు సినిమా కబుర్లు చెప్పుకుంటూ రోడ్డు మీద వెళ్తున్నారు. కుర్చీలో వెనక్కి వాలి మళ్ళీ చంద్రాస్వాదన..

పక్కింటాయన బయటికి వచ్చారు..పలకరించబోయి ఇయర్ ఫోన్స్ వైపు చూసి ఆగిపోయారు. పలకరింపుగా నవ్వా.. మసక వెలుతురులో కనిపించిందో లేదో.. ఆయన లోపలికి వెళ్లిపోయారు., చంద్రుడికి నాకు ఏకాంతం కల్పిస్తూ.. చిన్నప్పటినుంచీ చూస్తున్న చంద్రుడే అయినా ప్రతి పున్నమికీ కొత్తగానే ఉంటాడు.. 'సహస్ర చంద్ర దర్శనం' అని ఫంక్షన్స్ చేస్తుంటారు కాని వాళ్లు నిజంగా వెయ్యి సార్లూ పున్నమి చంద్రుడిని 'చూసి' ఉంటారా? నా ఆలోచనలో నేనుండగా మళ్ళీ బాలు, వాణి జయరాం తో కలిసి కురిసేను విరి జల్లులే.. అంటూ.. అమృతవర్షిణి రాగం నిజంగానే చెవుల్లో అమృతం కురిపిస్తోంది.. పూసిన కాసిని పూలనీ నిశ్శబ్దంగా రాలుస్తోంది పారిజాతం..విధి నిర్వహణ... తెల్లారి చేయాల్సిన పనుల జాబితా గుర్తొచ్చింది హఠాత్తుగా.. ఇష్టం లేకపోయినా చంద్రుడికి వీడ్కోలు చెప్పేశా... ప్రతి ఆనందానికీ ఓ ముగింపు ఉంటుంది.

ఆదివారం, ఫిబ్రవరి 08, 2009

ఒక వి'చిత్రం'

మూడు సినిమాలు..వాటిని తీసింది ఆయా కాలాల్లో పెద్ద పేరు తెచ్చుకున్న దర్శకులు..ఆ మూడు సినిమాలూ గొప్ప పేరు తెచ్చుకోడమే కాదు..ఇప్పటికీ ఏదో విధంగా చర్చల్లో ఉంటాయి. మరి విచిత్రం ఏమిటి? ఆ మూడు సినిమాల కథా ఒక్కటే! ఒకే మూల కథని కాల మాన పరిస్థితులకి అనుగుణంగా మార్పులు చేసి, తెరకెక్కించి ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు ఏకంగా మూడు సార్లు విజయాన్ని చవిచూడడం అంటే చిన్న విషయం కాదు కదా.

మొదటి సినిమా వాహిని వారి 'మల్లీశ్వరి.' 1951 లో విడుదలైన ఈ చిత్రానికి బి.ఎన్. రెడ్డి దర్శకుడు. భానుమతి, ఎన్.టి.ఆర్. నాయికా నాయకులు. సాలూరి రాజేశ్వర రావు సంగీతం లో దేవులపల్లి కృష్ణ శాస్త్రి రాసిన పాటలన్నీ ఆణిముత్యాలే. శిల్పి నాగరాజు మరదలు మల్లీశ్వరి అల్లరిపిల్ల. బావ మరదళ్లిద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ. ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అనగా మల్లీశ్వరికి రాణివాసం అవకాశం వస్తుంది. కొంత విరహం తరువాత బావా మరదళ్లిద్దరూ ఏకం కావడం తో సినిమా ముగుస్తుంది. ఈ సినిమా కథ విషయం లో కొంత అయోమయం ఉంది. 'బుచ్చిబాబు' రచన అని కొందరూ, Illustrated Weekly లో వచ్చిన కథ అని కొందరూ, ఆ రెంటినీ కలిపి బి.ఎన్. కథను తయారు చేశారని మరికొందరూ అంటారు. ఏమైనప్పటికీ ఈ సినిమా పెద్ద హిట్. ఇప్పటికీ వంక పెట్టలేని సినిమా.

ఇదే ఇతివృత్తంతో కళాతపస్వి కె. విశ్వనాథ్ తీసిన సినిమా 'సీతామాలక్ష్మి.' 1978 లో విడుదలైన ఈ సినిమాకి విశ్వనాథె కథ సమకూర్చారు. మాటలు జంధ్యాల రాశారు. కె. వి. మహదేవన్ సంగీతం. 'మల్లీశ్వరి' కి పాటలు రాసిన దేవులపల్లి ఈ సినిమాకి కూడా కొన్ని పాటలు రాశారు. తాళ్ళూరి రామేశ్వరి, చంద్రమోహన్ ముఖ్య పాత్రలు పోషించారు. వీళ్ళిద్దరూ ఓ టూరింగ్ టాకీస్ లో పనిచేస్తూ ప్రేమలో పడతారు. పెళ్లి సమయానికి నాయికకి సినిమా హీరోయిన్ గా అవకాశం వస్తుంది. నాయికా నాయకుల మధ్య దూరం పెరుగుతుంది. సిని నటిగా తన కెరీర్ ను నాయకుడి కోసం వదులుకుని నాయిక మళ్ళీ పల్లెటూరి సీతామాలక్ష్మి గా మారిపోవడం ఈ సినిమా కథ. అప్పట్లో ఈ సినిమా పెద్ద హిట్. పాటలు ఇప్పటికీ సిని సంగీత ప్రియుల ఇళ్ళల్లో వినిపిస్తూ ఉంటాయి.

ఇక మూడో సినిమా సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'రంగీలా.' ఈ హిందీ సినిమాని 'రంగేళి' పేరుతో తెలుగులో విడుదల చేశారు. 1995 లో విడుదలైన ఈ సినిమాకి కథ రాంగోపాల్ వర్మ సమకూర్చారు. ఊర్మిళ ప్రధాన పాత్ర పోషించగా, ఆమెని ఆరాధించే పాత్రలో అమీర్ ఖాన్, సిని దర్శకుడిగా జాకీ ష్రాఫ్ కనిపిస్తారు. ఐతే ఇక్కడ నాయకుడు అమీర్ ఖాన్ ది వన్ సైడ్ లవ్. మధ్య తరగతి అమ్మాయి అయిన నాయిక తన చిరకాల స్వప్నమైన సిని నటి కావాలనే కోరిక ఎలా నిజం చేసుకుందన్నదే ఈ సినిమా. రెహమాన్ సంగీతంలో 'యాయిరే' పాట దేశాన్ని ఓ ఊపు ఊపింది. సినిమా కూడా పెద్ద హిట్.

ఇంతకీ ఇలా ఎందుకు జరిగింది? కేవలం యాదృచ్చికమేనా? కథల కొరత ఉండడం వల్లనా? లేక హిట్ సెంటిమెంట్ తోనా? బి.ఎన్. సినిమాను తరువాతి కాలం లో ప్రముఖులైన ఇద్దరు దర్శకులు మళ్ళీ తీయడం ఆ సినిమా మీద వారికిగల ప్రేమను సూచిస్తుందా? ఇదే కథతో గత సంవత్సరం కొత్త తారలతో 'ఇట్లు నీ వెన్నెల' అనే సినిమా వచ్చింది. చిత్రీకరణ లో లోపాలవల్ల ఆ సినిమా హిట్ కాలేదు. గుర్తు పెట్టుకునే పాటలు కూడా అందులో లేవు.

శనివారం, ఫిబ్రవరి 07, 2009

మనసులో వాన

పెళ్ళయి ఇద్దరు పిల్లలున్న ఓ ముప్ఫయ్యారేళ్ళ స్త్రీ, యవ్వనారంభదశలో తాను ప్రేమించిన వాడిని మరచిపోలేక, పెళ్లి చేసుకున్నవాడితో సంతోషంగా ఉండలేక పడే ఇబ్బందిని కథా వస్తువుగా చేసుకుని అజయ్ శాంతి రాసిన కథ 'మనసులో వాన.' ఆసాంతం భావుకత తో నిండి ఉండే ఈ కథ లో ప్రధాన పాత్ర పేరు మహతి. సాహిత్యాన్ని విపరీతంగా ఆరాధించే ఓ మధ్యతరగతి తండ్రికి పెద్ద కూతురు. ఆ తండ్రి నండూరి వారు, కొనకళ్ళ వారు కలం పట్టిన ఊళ్ళో పుట్టడమే అదృష్టమని భావించుకునే వ్యక్తి. 'వేయి పడగలు' పుస్తకం అట్ట చించాడనే కోపంతో కొడుకుని కొట్టి ఆ రోజంతా భోజనం మానేసే సున్నిత స్వభావుడు. కూతురికి సాహిత్యాన్ని పరిచయం చేయడమే కాదు, తన వెంట సాహిత్య సభలకు తీసుకెళ్తూ ఉంటారాయన.

కాలేజి రోజుల్లో ఎన్నో జతల కళ్లు తనని స్పార్క్లింగ్ గా చూస్తున్నా వాటిని పట్టించుకోని మహతి 'రమణ' ని తొలిచూపులో ఇష్టపడుతుంది. బి.ఏ. చదివే రమణ కి కవిత్వం అంటే ప్రాణం. అతనో ఔత్సాహిక కవి. ఓ చిన్న పరిచయం లోనే మహతి తండ్రికి మంచి మిత్రుడైపోతాడు. సరిగ్గా రమణ తన ప్రేమను మహతికి వ్యక్తపరుస్తుండగా, మహతి తండ్రి అనారోగ్యం తో మరణిస్తాడు. ఆపరేషన్ చేసి ఉంటే బ్రతికి ఉండేవాడు..కాని డబ్బు లేదు. రమణ ప్రేమకి మహతి అవుననీ, కాదనీ చెప్పకముందే బంధువులంతా ఆమె పెళ్లి చుట్టాలబ్బాయి కాశ్యప్ తో నిర్ణయిస్తారు. పెళ్లి చేసుకుని కెనడా వెళ్ళిన మహతి అక్కడ ఇద్దరు కొడుకులకి తల్లి అవుతుంది. ఓ యునివర్సిటీ లో ఉద్యోగి అవుతుంది. భర్త లీడింగ్ ఆడియాలజిస్ట్ కావడం తో అందమైన ఇల్లు, కార్లు, విమాన ప్రయాణాలు.. ఇలా కలలో కూడా ఊహించని జీవితం.

ఐతే 'చాలా మంది మగ వాళ్ళకన్నాఎంతో మంచివాడైన' కాశ్యప్ లో భావుకత్వం అస్సలు లేదు. అందరి వినికిడి సమస్యలనీ పరిష్కరించే అతను ఆమె చెప్పేది వినిపించుకోడు. 'నక్షత్రాలు పాడే మార్నింగ్ సాంగ్ విందాం' అని మహతి అంటే 'సైనస్ పెరిగి పిల్లలు అమ్మా అని పిలిచినా వినలేవు' అంటాడు కాశ్యప్. 'నీ కవిత్వం నాకు అర్ధం కాదు మహతీ.. నేను పిన్నా, ఇయర్ డ్రం అంటూ టెక్నికల్ విషయాలు మాట్లాడితే నీకెలా ఉంటుందో, నువ్వు మాట్లాడే పిల్లగాలి, వెన్నెల వాన నాకు అలా ఉంటుంది' అంటాడు అతను. చాలా ఏళ్ళ తర్వాత ఉగాది పండక్కి పుట్టింటికి వచ్చిన మహతి రమణ ని తలచుకోవడంతో కథ ప్రారంభం అవుతుంది. పిన్ని పెట్టిన ఉగాది పచ్చడి తిని, కాశ్యప్ తన స్నేహితుడి ద్వారా ఏర్పాటు చేసిన బెంజ్ కార్లో రమణని చూడడానికి బయలుదేరుతుంది.

రమణ భార్య శారద ని చూసి అసూయ పడుతుంది మహతి..'రమణ ప్రేమకి నేను అవునని చెప్తే ఆమె స్థానం లో నేను ఉండాల్సింది' అనుకుంటుంది. ఆమె అభిప్రాయం ఎంతో సేపు ఉండదు..'కూలిపోబోతున్న' ఆ ఇంట్లో ఉండలేక 'చేదుగా ఉన్న' కాఫీ తాగలేక అక్కడినుంచి ఇంచుమించు పారిపోతుంది. రమణ బయటికి వెళ్ళిన తన కూతురు ఇంటికి వచ్చేవరకు ఆగమన్నా ఆగకుండా. ఇంటికి వచ్చి తన పిన్నితో జరిగిందంతా వివరంగా చెబుతుంది. తనని తాను దూషించుకుంటుంది. 'అక్కడ ఉన్నప్పుడు రమణ గురించి ఆలోచించా..ఇక్కడికి వచ్చాక అతని ఇంట్లో ఉండలేకపోయా.. నాన్నని తీసుకెళ్ళి పోయిన ఆ డబ్బులేని తనంలో నేను, నా పిల్లలు అనే ఊహనే భరించలేక పోయాను పిన్నీ..' అంటుంది మహతి.

అంతా విన్న ఆమె పిన్ని మహతిదేమీ అబ్ నార్మాలిటీ కాదంటుంది. 'కార్తీకం లో మనం చలిని ఎంజాయ్ చేయం..ఎండ కోసం ఎదురు చూస్తాం. అదే చైత్రం లో ఎండను భరించలేం..చలిగా ఉంటే బాగుంతుందనుకుంటాం. నీకు రమణ మీద ప్రేమ లేదు, కాశ్యప్ మీద ద్వేషమూ లేదు. నీకున్నది భావుకత్వం మీద ఇష్టం, బీదరికం మీద అయిష్టం.' అంటుంది. కాశ్యప్ లో భావుకత్వం లేదనుకోడం సరి కాదనీ ఎన్నో వేల మైళ్ళ దూరం లో ఉన్న భార్య ఇబ్బంది పడకూడదని కారు ఏర్పాటు చేయడం అనేది ఒక మనిషి గురించి ఎంతగానో ఆలోచించే వాళ్లు తప్ప చేయలేరనీ చెబుతుంది. 'శారద కూడా అదృష్టవంతురాలే మహతీ.. ఆమె పడిపోబోతుంటే రమణ ఆమెని పట్టుకున్నడన్నావ్ చూడు.. నిధి కన్నా అలాంటి భర్త సన్నిధి గొప్పది..' అంటుంది. తేలికపడ్డ మనసుతో కెనడా ప్రయాణమైన మహతిని 'రమణ కూతురి పేరు తెలుసా?' అని అడిగి తెలియదనడంతో 'ఆ పిల్ల పేరు మహతి' అంటుంది. ఈ జ్ఞాపకాన్ని కాశ్యప్ తో పంచుకోవాలని నిర్ణయించుకున్న మహతి కార్ ఎక్కడం తో కథ ముగుస్తుంది. కథతో పాటు, కవితాత్మకంగా రాసిన విధానమూ ఆకట్టుకుంటుంది.

గురువారం, ఫిబ్రవరి 05, 2009

విలాసినీ నాట్యం

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సంప్రదాయ నృత్య రీతులు ఏవి? ఈ ప్రశ్నకి ఎవ్వరూ తడుముకోకుండా చెప్పే సమాధానం కూచిపూడి. కొంచం ఆలోచించి చెప్పే జవాబు పేరిణి. కొద్ది మాత్రమే 'ఆంధ్ర నాట్యం' అని చెప్పగలరు. విలాసిని నాట్యం, దేవదాసి నాట్యం, ఆలయ నాట్యం అనే పేర్లు కూడా ఉన్న ఈ నాట్య రీతి నిజానికి కూచిపూడి నృత్యరీతి కన్నా పురాతనమైనది. కొన్ని సామాజిక కారణాలవల్ల పతనావస్థకి చేరుకున్నది. కొందరు నాట్యాచార్యులు, సాహితీ పరిశోధకుల కృషి పుణ్యమా అని కొడిగట్టకుండా మిగిలి, ఉత్సాహవంతులైన నర్తకీ నర్తకులచేత ప్రదర్శింపబడుతోంది. రాజాస్థానాల్లో ఎంతో ఉన్నతమైన జీవితం గడిపిన దేవదాసీల జీవితాల్లో కాలక్రమంలో వచ్చిన మార్పులు ఈ నాట్యరీతి పతనానికి దారి తీశాయి.

దైవారాధనలో దేవ నర్తకి చేసే నాట్యం దేవదాసి నాట్యం. ప్రాచీనమైన దేవదాసీ వ్యవస్థలో ఒకపుడు కులంతో నిమిత్తం లేకుండా సముచిత లక్షణాలున్న ఏ బాలిక అయినా దేవదాసి కావచ్చు. చారిత్రక ఆధారాల ప్రకారం చాళుక్య రాజు గుణగ విజయాదిత్యుడి కాలం (క్రీ. శ. 848-92) నాటికే ఆంధ్ర దేశం లో స్త్రీ నాట్య సంప్రదాయం ఉంది. రంభా సంప్రదాయం, మేనకా సంప్రదాయం, ఊర్వశీ సంప్రదాయాలు ఆంధ్ర దేశం లో అమలైన దేవదాసీ సంప్రదాయాలు. రంభా సంప్రదాయం ఆంగికాభినయానికి ప్రాధాన్యం ఇవ్వగా, మేనకా సంప్రదాయం సాము గరిడీల తరహా విన్యాసాలకి, ఊర్వశీ సంప్రదాయం సాత్త్వికాభినయానికీ, నవరస ప్రదర్శనకీ పెద్ద పీట వేసింది.

ఆలయాల్లో వేకువ జామున దేవుడికి మేలుకొలుపులు పాడడం నుంచి, రాత్రివేళ పవ్వళింపు సేవ వరకు నృత్యగానాలు ప్రదర్శించిన దేవదాసీలు రాజులు ఇచ్చిన మాన్యాలతో పొట్ట పోసుకుంటూ నిరాడంబర జీవితం గడిపేవారు. కాలక్రమంలో వీరి నృత్యం ఆలయం నుంచి రాజాస్థానానికి మారింది.. ఫలితంగా వీరి జీవన విధానంలోనూ మార్పు వచ్చింది. విలాసాలకు, సౌఖ్యాలకు అలవాటు పడ్డారు. ఇలా దేవదాసి అన్నది ఓ కులంగా మారిపోయింది. రాజ్యాలు, జమీందారీలు అంతరించడంతో దేవదాసీలు 'మేజువాణీ' ల దారిపట్టారు. ఫలితంగా దేవదాసీ నాట్య రీతి గౌరవం తగ్గింది. రాను రాను ఈ కళని ప్రదర్శించే వారు లేక అంతరించే దశకు చేరింది.

సరిగ్గా ఈ దశలోనే కూచిపూడి నాట్య గురువు నటరాజ రామకృష్ణ, కవి, చారిత్రక పరిశోధకుడు ఆరుద్ర, నర్తకి స్వప్న సుందరి వంటి వారు ఈ నాట్య రీతి పై పరిశోధనలు ప్రారంభించారు. ఆంధ్ర ప్రాంతంలో మిగిలి ఉన్న అతి కొద్ది మంది వృద్ధ కళాకారిణులను కలిసి వారి సాయంతో ఈ నృత్య రీతిని రికార్డు చేశారు. కూచిపూడి, భరతనాట్యం అభ్యసిస్తున్న కొందరు ఔత్సాహికులను ప్రోత్సహించి వారికి ఈ నాట్య రీతిలో శిక్షణ ఇచ్చారు. ప్రదర్శనా పద్ధతిని సిద్ధం చేశారు. రంగాలంకరణ మొదలు, ఆహార్యం వరకు ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశోధించి ప్రదర్శనకు ఓ దారిని ఏర్పరిచారు.

ఈ నాట్యం గురించి తెలియని వారు 'దేవదాసి' అనే పేరు వినగానే రకరకాల ఊహాగానాలు చేశారు, చేస్తున్నారు. నిజానికి ఈ నాట్యరీతిలో భక్తీ, విరహం ఉంటాయి..అశ్లీలత, అసభ్యత ఉండవు. కృష్ణుడి కోసం ఎదురు చూసే సత్యభామ నవరసాలను - కూచిపూడి భామాకలాపానికి పూర్తి భిన్నంగా - ఈ నాట్యరీతిలో చూడొచ్చు. ఇక్కడ నర్తకీ నర్తకులు నాట్యం చేస్తూ పాడతారు. దురదృష్టం ఏమిటంటే సామాన్య ప్రజలతో పాటు, కొందరు నాట్య గురువులు, కళాకారుల్లోనూ ఈ నాట్య రీతి పట్ల చిన్న చూపు ఉంది. పైకి అంగీకరించకపోయినా ఓ తిరస్కార భావం ఏమూలో ఉంది. అది బహుశా కొన్ని తరాలపాటు దేవదాసీలు గడిపిన జీవన విధానం పై వీరికి గల చిన్నచూపు వల్ల కావచ్చు. కళని కళగా మాత్రమే చూసే రోజులు ఎప్పటికి వస్తాయో..

బుధవారం, ఫిబ్రవరి 04, 2009

తొలి బెత్తం దెబ్బ..

ఇంట్లో దెబ్బలు తినడం నాకు చిన్నప్పటి నుంచీ అలవాటే. నాకు ఊహ తెలిశాక నా మూడో ఏట ఓ ఎండవేళ మద్యాహ్నం నాన్ననన్ను చీపురు పుల్లతో కొట్టడం బాగా గుర్తుంది. నా వయసుతో పాటే శిక్షా పద్ధతుల్లో మార్పులు వచ్చాయి. ఎద్దులని కొట్టే కొరడా కర్ర (చెర్నకోలా అనికూడా అంటారు), నాటకాల కోసం తెచ్చిన లెదర్ హంటర్ నా వీపు మీద ఎక్కువగా నాట్యం చేశాయి. ఇంట్లో ఎన్ని దెబ్బలు తిన్నా స్కూల్లో మూడో తరగతి వరకు దెబ్బలు తినలేదు. క్లాస్ లో ఏ ప్రశ్న అడిగినా తడుముకోకుండా సమాధానం చెప్పడమే ఇందుకు కారణం. ఐతే అల్లరి చేసినందుకు అప్పుడప్పుడు చిన్న చిన్న శిక్షలు ఉండేవి. క్లాస్ లో నిలబెట్టడం లాంటివి. నేను స్కూల్లో మొదటి సారి బెత్తం దెబ్బ తిన్నది మూడో తరగతిలో.

సత్యనారాయణ మాస్టారు మా స్కూలికి కొత్తగా వచ్చారు. ఆయనకి అంతకు ముందు సంవత్సరమే కొత్తగా ఉద్యోగం వచ్చింది. మా పక్క ఊరినుంచి రోజూ సైకిల్ మీద వచ్చేవారు. మద్యాహ్నం ఇంటికి భోజనానికి వెళ్లి మళ్ళీ వచ్చేవారు. ఆయన చేతి వేళ్ళకి ఉండే పొడవాటి గోళ్ళని నేను చాలా ఆరాధనా భావంతో చూసే వాడిని. ఎందుకంటే నాకు చిన్నప్పుడు విపరీతంగా గోళ్ళు కొరికే అలవాటు. ఆయన మాకు లెక్కలు చెప్పేవారు. ఇక స్కూలికి ఒంటిపూట సెలవులు మొదలవుతాయనగా ఓ రోజు మధ్యాహ్నం మాష్టారు స్కూలుకి చాలా కోపంగా వచ్చారు. వస్తూనే లెక్కల పాఠమ్ మొదలు పెట్టి అందర్నీ నిలబెట్టి ప్రశ్నలడగడం మొదలెట్టారు. అసలే ఎండలో దూరం నుంచి సైకిల్ మీద వచ్చారేమో ఆయన రూపం భయంకరంగా ఉంది. దానికి తోడు గద్దించి అడుగుతున్నారు.

ముందుగా లక్ష్మి కాంతం అనే అమ్మాయిని అడిగారు. ఆమె చెప్పలేకపోయింది. బెత్తంతో కొట్టారు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తరువాత నా వంతు వచ్చింది. ఆయన ఏం అడుగుతున్నారో అర్ధం కాలేదు. మైండ్ బ్లాంక్ అయిపోవడం అంటారే..అలాంటి పరిస్థితి. నేను తడబడ్డాను. ఆలస్యాన్ని భరించలేక ఆయన బెత్తాన్ని గాలిలో రెండు సార్లు లేపారు. రెండు తొడలమీద మంట తెలుస్తోంది. నాన్న కొట్టే దెబ్బల పుణ్యమా అని దెబ్బ తగిలినా ఏడవకుండా ఉండగలగడం నాకు అలవాటయ్యింది..నా నుంచి స్పందన లేకపోవడంతో దెబ్బ తగలలేదనుకుని మరోసారి బెత్తం పైకి లేపారు మాస్టారు. ఈసారి దెబ్బ ఎడమ మణికట్టు మీద. ఈలోగా హెడ్ మాస్టర్ గారు వచ్చి మాస్టారిని పిలుచుకు వెళ్ళారు. లక్ష్మి కాంతం ఏడుపు మొదలు పెట్టింది.

ఆడ పిల్లలంతా ఆమె చుట్టూ, అబ్బాయిలంతా నా చుట్టూ మూగారు. అప్పుడు చూసుకున్నా దెబ్బలు. రెండు తొడలమీదా ఎర్రని చారికలు. ఎడమ మణికట్టు మీద పైకి లేచిన దద్దురు. మాస్టారి చేత దెబ్బలు తిన్నందుకు ఇంట్లో మరో రౌండ్ ఉంటుంది..నేను దాని గురించి ఆలోచిస్తున్నా.. ఈ లోగా గణేష్ అన్నాడు..'మీ నాన్నగారికి తెలిస్తే నిన్ను కొడతారు. మేం ఎవరం మీ ఇంట్లో చెప్పం..నువ్వు కూడా చెప్పకు' అని.

ఇంటికి వెళ్ళాక బట్టలు మార్చుకోవాలి.. అమ్మ చూడకుండా.. అంతకు ముందే సంక్రాంతి పండక్కి కుట్టించిన కొత్త లాగు తొడుక్కున్నా.. అదైతే కాళ్ళమీద దెబ్బలు ఇంట్లో వాళ్ళకి కనిపించవు. ఎడమచెయ్యిని కవర్ చేయడం కోసం నాకున్న ఫుల్ హాండ్స్ చొక్కా. కొత్తబట్టలు మాపేస్తున్నానని అమ్మ తిట్లు. సాయంత్రం వరకు రహస్యం దాచగాలిగా. దీపాలు పెట్టే వేళ నాన్న ఇంటికి చేరారు. కొరడా కర్రకి కొత్త తోలు ముక్కలు కొనుక్కొచ్చారు. వీధిలో కూర్చుని అవి మారుస్తూ 'ఆ తల అగ్గిపుల్ల వేసినా అంటుకోదు .. ఇదిగో వీడికి కాస్త నూని రాయి' అని అమ్మకి ఆర్డర్ వేశారు. నాకు నూనె రాసుకోవడం చిరాకు. ఇప్పుడు తప్పదు. అమ్మ చేత నూనె రాయించుకోవడం అంటే నూనె డబ్బాలో తల పెట్టడమే. పిండితే బొట్లు బొట్లు గా కారేలా తలకి నూనె పట్టించాక అమ్మ ప్రేమగా నా పాదాలకి, చేతులకి తన నూనె చేతులు రాయడం మొదలుపెట్టింది.

చేతికి నూనె రాస్తుండగా అమ్మ ఆ దెబ్బ చూసి 'ఏమిటిది..ఎవరు కొట్టారు?' అని అరిచింది. మాస్టారు కొట్టారని చెప్పక తప్పలేదు. గుచ్చి గుచ్చి అడిగితే కాళ్ళ మీద దెబ్బలు కూడా చూపించేశా.. కొరడా దెబ్బలు తప్పవని అర్ధమైపోయింది. ఐతే నాన్న కొట్టలేదు 'నీకు తిండి దండుగ..దూడలు కాసుకో..' లాంటి రొటీన్ తిట్లన్నీ తిట్టి చెయ్యలేకపోయిన లెక్క తెమ్మన్నారు. పుస్తకం తెచ్చి చూపించా. చిన్న లెక్కే..కానీ ఇక్కడ నాన్న భయం..చేయలేక పోయా.. తనే చేయించి దానికింద 'ఈ లెక్క చేయలేక పోయినందుకు ఇవాళ మాస్టారు నన్ను కొట్టారు' అని నా చేత రాయించారు. అది చూసి మాస్టారు నన్ను మళ్ళీ ఎక్కడ కొడతారో అని భయం. మర్నాడు లక్ష్మి కాంతం వాళ్ల తాతగారు మాస్టారి మీద యుద్ధానికి వచ్చారు.. నాన్న మాత్రం మాస్టారిని ఏమి అనలేదు.

అమ్మ రాసే వెన్నపూసల పుణ్యమా అని వాతలు వారం రోజుల్లో మానిపోయాయి. స్కూల్లోనూ, ఊళ్ళోనూ సింపతీ భరించడం మాత్రం చాలా కష్టమైంది. ఆ దెబ్బల పుణ్యమా అని రెండు జరిగాయి. ఒకటి నాకు లెక్కల మీద అసహ్యం. రెండోది పెద్దయ్యాక ఏ ఉద్యోగమైనా చేయాలి, మాస్టారి ఉద్యోగం తప్ప అని ఓ గట్టి నిర్ణయం తీసుకోవడం. లెక్కల మీద పెంచుకున్న అసహ్యం ఆ తర్వాత నా జీవితం ఓ మలుపు తిరగడానికి కారణమైంది. మాస్టర్ ఉద్యోగం చేయకూడదు అన్న నిర్ణయాన్ని బలపరిచే సంఘటనలు ఆ తర్వాత మరి కొన్ని జరిగాయి. కాలక్రమం లో కొందరు మంచి ఉపాధ్యాయులు కూడా పరిచయం అయ్యారు. మొత్తం మీద ఆ చిన్న సంఘటన నా మీద చాలా పెద్ద ప్రభావాన్నే చూపింది.

మంగళవారం, ఫిబ్రవరి 03, 2009

నాయికలు-మధురవాణి

గురజాడ అప్పారావు విరచిత 'కన్యాశుల్కం' నాటకాన్ని మొదటిసారి చదివినప్పుడు నన్ను అమితంగా ఆకట్టుకున్న పాత్ర మధురవాణి. అసలు మధురవాణి లేకపొతే కన్యాశుల్కం ఇంతగా రక్తి కట్టేదా? అని అనిపించింది..గత కొన్నేళ్లలో ఆ పుస్తకాన్ని చదివిన ప్రతిసారి ఇదే అభిప్రాయం కలుగుతోంది. అంతే కాదు మధురవాణి మీద అభిమానం పెరుగుతోంది. బాల వితంతువు బుచ్చమ్మ చెల్లెలు సుబ్బి. ఆమెకి ముసలి లుబ్దావధాన్లు తో పెళ్లి నిశ్చయం చేస్తాడు ఆమె తండ్రి అగ్నిహోత్రావధాన్లు. ఆమె తల్లి వెంకమ్మ కి, మేనమామ కరకటశాస్త్రికి ఈ పెళ్లి ఇష్టం ఉండదు. మధురవాణి అనే వేశ్య సహాయంతో శాస్త్రి ఈ పెళ్లి ఎలా చెడగొట్టగలిగాడన్నదే 'కన్యాశుల్కం' కథాంశం.

శూద్రక కవి (ఇది రచయిత పేరు) రాసిన 'మృచ్చకటికం' అనే సంస్కృత నాటకంలో (తెలుగు అర్ధం మట్టిబండి) 'వసంతసేన' అనే వేశ్య పాత్ర 'మధురవాణి' పాత్రను మలచడంలో గురజాడకి స్ఫూర్తినిచ్చిందని సాహితీ పరిశోధకులు అంటారు. నిజానికి వసంతసేన, మధురవాణి పాత్రల్లో సారూప్యతలకన్నా భేదాలే ఎక్కువ. మధురవాణి లో కొంటెతనం, జాణతనం హెచ్చు. నాటకం మొదటి సీన్లో రామప్పంతులుని మంచం కింద దాచి, తర్వాత గిరీశాన్ని అదే మంచం కింద దాచి, గిరీశాన్ని వెతుక్కుంటూ వచ్చిన పూటకూళ్ళమ్మకి కను సైగ తోనే గిరీశం మంచం కింద ఉన్నాడని చెప్పే సీన్లో మధురవాణి పాత్ర స్వభావాన్ని ఎస్టాబ్లిష్ చేశారు రచయిత. అలా కంటికొనతో చూపుతూనే 'మంచం కింద దాచడానికి నేనేమీ మగనాలినీ కాదు..వెధవముండనీ కాదు..' అంటుంది గడుసుగా.

'వృత్తి చేత వేశ్యని కనుక చేయవలసిన చోట ద్రవ్యాకర్షణ చేస్తాను' అని చెబుతూనే 'మీ తోబుట్టువుకి వచ్చిన కష్టం తీర్చడంలో సాయం చేయలేనా పంతులుగారూ?' అంటుంది కరకటశాస్త్రి తో. గిరీశం నుంచి వేరుపడి, రామప్పంతులు ఆశ్రయం లోకి వచ్చాక మధురవాణి-లుబ్దావధాన్లు-రామప్పంతులు మధ్య వచ్చే ఓ సన్నివేశం నాటకం మొత్తానికే హైలెట్. లుబ్ధావదాన్లుకి వరుసకి తమ్ముడైన గిరీశం, అగ్నిహోత్రావధాన్లు ఇంట చేరి అక్కడ జరిగే పెళ్లి పనులగురించి తన అన్నగారికి వ్యంగ్యంగా రాసే ఉత్తరాన్ని మధురవాణి చదివే సన్నివేశం. 'ఏనుగులు..లొట్టి పిట్టలు' అన్నప్పుడు ఆమె నవ్వులు..'పంతులు ఓ జాకాల్' అని చదివినప్పుడు 'నక్కను కూడా తెమ్మంతున్నరషండీ' అని అవధాన్లు అమాయకంగా అడగడం..

నాకైతే 'నువ్వు నాకు నచ్చావ్' లో ప్రకాష్ రాజ్ కి చంద్రమోహన్ రాసే ఉత్తరాన్ని ఆర్తి అగర్వాల్ చదివే సీన్ కి ఇదే ప్రేరణ అని సందేహం. లుబ్దావధాన్లు తలకి వాసన నూనె రాసి చిక్కు తీస్తూ 'సరైన సంరక్షణ లేక ఇలా అయిపోయారు కాని..మీరు వృద్ధులేమిటి బావా?' అని మధురం (రామప్పంతులు ఇలాగే పిలుచుకుంటాడు) అన్నప్పుడు పంతులు ఉడుక్కుంటూ 'నాకు మావ ఐతే నీకు బావ ఎలా అవుతారని?' లాజిక్ లాగితే 'మా కులానికి అందరూ బావలే' అని నోరు మూయిస్తుంది మధురవాణి.

ఆడ వేషం వేసిన కరకట శాస్త్రి శిష్యుడికి తన 'కంటె' (బంగారు నగ) ఎరువిచ్చి, అతని నుంచి దానిని తిరిగి తీసేసుకుని, కంటె తెస్తేకాని ఇంట్లోకి రానివ్వని రామప్పంతులుని వీధిలో నిలబెట్టడం మధురవాణికే చెల్లు. నాకు నచ్చే మరో సన్నివేశం క్లైమాక్స్ లో సౌజన్య రావు పంతులు-మధురవాణి ల మధ్య వచ్చేది. కందుకూరి వీరేశలింగం స్ఫూర్తితో సౌజన్య రావు పాత్రను గురజాడ తీర్చిదిద్దారంటారు. 'మంచివారిని చెరచ వద్దని మా అమ్మ చెప్పింది' అంటూనే సచ్చీలుడైన సౌజన్య రావుని ఓ ముద్దు కోరుతుంది మధురవాణి. గిరీశం ఓ ఆషాఢభూతి అని పంతులుకి చెప్పకనే చెప్పి బుచ్చమ్మని రక్షించడం ఆమెలో మరో కోణాన్ని చూపుతుంది.

నాటకాలు, సినిమా, సీరియళ్ళలో ఎంతో మంది 'మధురవాణి' పాత్ర పోషించినా 'కన్యాశుల్కం' సినిమాలో సావిత్రి పోషించిన పాత్రే ఊహల్లో మధురవాణికి దగ్గరగా ఉంటుంది. కంటికొసలతో ఆమె అభినయం..నడవడం, విరగబడి నవ్వడంలో ఆమె వయ్యారం మరెవరికీ రాలేదు. చివరిసారిగా మధురవాణి పాత్రను తెరపై చూసింది మా టీవీ లో వచ్చిన 'కన్యాశుల్కం' సీరియల్లో. గొల్లపూడి గిరీశం గా వేసిన ఈ సీరియల్ రెండేళ్ళ క్రితం ప్రసారమైంది. నటి జయలలిత (ఏప్రిల్ 1 విడుదల లో భాగ్యం) మధురవాణి పాత్ర పోషించారు. ఆమె నటనకు వంక పెట్టలేకపోయినప్పటికీ, అంత పెద్ద మధురవాణి ని చూడలేక పోయాను. అక్షరాలలో మధురవాణికి తెరపై ఎవరూ సాటిరారు.

ఆదివారం, ఫిబ్రవరి 01, 2009

చదివే అలవాటు..

సాధారణంగా అబ్బాయిలు తండ్రిని అనుకరిస్తారు. కాని చిన్నప్పడు నా మీద అమ్మ ప్రభావం ఎక్కువగా ఉండేది. అమ్మ వెనకాలే తిరగడం, తనతో కబుర్లు చెప్పడం, తను చెప్పేవి వినడం జరుగుతూ ఉండేది. బడిలో జరిగే విషయాలు, దారిలో చూసిన వింతలు, స్నేహితులతో చెప్పిన, విన్న కబుర్లు.. ఇలా అన్నీ అమ్మతో చెప్పడం అలవాటు. అమ్మకి పుస్తకాలు చదవడం బాగా అలవాటు. ఎంతగా అంటే కిరాణా సరుకుల పొట్లాలతో వచ్చిన కాగితాలు కూడా విడవకుండా చదివేది. అమ్మమ్మ వాళ్ళింట్లో తాతగారితో సహా అందరూ పుస్తకాలు చదువుతారు. ఆ అలవాటు అమ్మకి వచ్చింది. అమ్మ దగ్గర ఓ సందుగం పెట్టెడు పుస్తకాలు ఉండేవి. నవలలు మొదలు వార పత్రికల వరకు రకరకాల పుస్తకాలు.

అమ్మ తనకి తీరిక దొరికినప్పుడల్లా పుస్తకాలు చదువుతూ ఉండేది. తన దగ్గర ఉన్నవి పక్కిళ్ళ వాళ్ళకి ఇచ్చి, వాళ్ల దగ్గర ఉన్న పుస్తకాలు నాతో తెప్పించుకుని చదివేది.. ఇదిగో ఇలా అమ్మకి పోస్టుమాన్ ఉద్యోగం చేసిపెట్టే క్రమంలో నాకు పుస్తకాలతో పరిచయం ఏర్పడింది. వాళ్ల ఇళ్ళ దగ్గరినుంచి మా ఇంటికి వచ్చే దారిలో పుస్తకాలు తిరగేయడం..కార్టూనులు చదివి అర్ధం చేసుకోడంతో నా చదివే అలవాటు మొదలైంది. ఇది నేను రెండో తరగతి లో ఉన్నప్పటి సంగతి. కార్టూనులు, బాక్సులలో రాసే జోకులను స్కూల్లో ఫ్రెండ్స్ కి చెప్పడం ద్వారా వాళ్ల దగ్గర 'వీడికి చాలా తెలుసు' అనే ఇంప్రెషన్ కొట్టేసే వాడిని. తెలుగు వాక్యాలు చాలా వేగంగా చదవడం అలవాటు అవ్వడంతో యేడాది తిరిగేసరికల్లా మినీ కథలు చదివేయగలిగాను. ఐతే చిన్న కండిషన్.. అమ్మ చెప్పినవి మాత్రమే చదవాలి.

మామూలు రోజుల్లో కన్నా వేసవి సెలవుల్లో పుస్తకాలు చదవడం ఎక్కువగా ఉండేది. నా ఫ్రెండ్స్ అందరు గూటిబిళ్ళ, కబడ్డీ, బచ్చాలు ఆడుతుంటే నేను ఇంట్లో కూర్చుని యువ, జ్యోతి, ఆంధ్రప్రభ చదివే వాడిని. బయటికి వెళ్లి ఆడుకోడానికి నాన్న ఒప్పుకునే వారు కాదు. అలా అని తనకి నేను పుస్తకాలు చదవడమూ నచ్చేది కాదు. కొంచం రహస్యం గా చదవాల్సి వచ్చేది. ఆరో తరగతి కి వచ్చేసరికి మినీ కథల నుంచి సీరియల్స్ వైపుకి పెరిగింది నా చదువు. అప్పుడే కొత్తగా ఓ అవసరం వచ్చింది నాకు. హైస్కూలు మా పక్క ఊళ్ళో.. ఓ ఏడెనిమిది మంది పిల్లలం కలిసి నడుచుకుంటూ వెళ్లి వచ్చేవాళ్ళం. దారిలో ఎవరో ఒకరు కథ చెప్పాలి. మిగిలినవాళ్ళు సినిమాలు ఎక్కువగా చూసే వాళ్లు కాబట్టి వాళ్ళకి సమస్య ఉండేది కాదు. నేను సినిమాలు చూడడం కూడా తక్కువ అయ్యేసరికి పుస్తకాల్లో చదివే కథలు వాళ్ళకి చెబుతూ ఉండేవాడిని. ఈ కథలు వాళ్ళకి ఇంకెక్కడా దొరక్క పోవడం తో నేను చెప్పే కథలకి డిమాండ్ ఉండేది. అప్పటి మా హెడ్మాస్టర్ శ్రీరామమూర్తి గారు స్కూల్ అసెంబ్లీ లో పుస్తకాల ప్రాముఖ్యత గురించి చేసిన ఉపన్యాసం నన్ను ప్రభావితం చేసింది. 'మీరు పెద్దయ్యి ఉద్యోగాల్లో చేరాక ప్రతి నెల జీతం లో కొంత మొత్తాన్ని పుస్తకాలు కొనడానికి కేటాయించండి. కొన్న ప్రతి పుస్తకం చదవండి..' అని తాను దానిని ఒక నియమంగా ఎలా పాటిస్తున్నారో చెప్పారాయన.

ఆరోతరగతి తర్వాత వేసవిసెలవుల్లో నవలా పఠనం మొదలైంది. మినీ నవలలతో మొదలు. అప్పుడే చిలకమర్తి వారి గణపతి చదివాను. గ్రాంధికం కొంత ఇబ్బంది పెట్టినా ఆ రచన నాకెంతో నచ్చింది. నాన్న నా పుస్తకాలు చదవడం మీద పూర్తీ నిషేధం విధించారు. అమ్మకి వార్నింగ్స్ కూడా అయ్యాయి. తర్వాత పుస్తకం ముట్టుకున్నది ఏడో తరగతి పరీక్షలయ్యాకే. హైస్కూల్ పూర్తయ్యేసరికి యద్దనపూడి సులోచనా రాణి నవలలు దాదాపు పూర్తి చేశాను. చదివిన పుస్తకం గురించి అమ్మతో చర్చలు చేయడం జరిగేది. తను చెప్పిందే కరక్ట్ అని అమ్మ ఎప్పుడూ అనలేదు.

పిన్నికి యండమూరి, మల్లాది అంటే ఇష్టం. తన దగ్గర వాళ్ళిద్దరి కలెక్షన్ ఉండేది. యండమూరి నవలలు చదవనిచ్చేది కాని మల్లాది పుస్తకాలు చదవడం తనకి ఇష్టం ఉండేది కాదు. అలా టీనేజ్ లో యండమూరి పుస్తకాలు. డిగ్రీ కి వచ్చేసరికి ఇవి కాకుండా ఇంకేమైనా చదవాలి అనిపించేది. పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవాళ్ళతో చర్చలు. సరిగా అప్పుడే కన్యాశుల్కం, చివరికిమిగిలేది, అసమర్ధుడి జీవయాత్ర, మహాప్రస్థానం, అమృతంకురిసినరాత్రి లాంటి పుస్తకాలన్నీ పరిచయమయ్యాయి. నాకు నేనుగా పుస్తకాలు కొనుక్కోగలిగే స్తోమతు వచ్చాక నచ్చిన పుస్తకాలు కొని చదవడం మొదలు పెట్టాను.