గురువారం, మే 08, 2014

ది లాస్ట్ బ్రాహ్మిన్

"పార్లమెంటుని హేళన చేసేవాడు పార్లమెంటుని ఎన్నటికీ ఏమీ చెయ్యలేడు. పార్లమెంటు అంటే ఏమిటి అని తెలుసుకోడానికి ప్రయత్నించేవాడు మాత్రమే అందుకు భిన్నమైన పని చేస్తాడు. బ్రాహ్మణ సమూహం భారతదేశంలో కనిపించని పార్లమెంటు. అదీ బ్రాహ్మణత్వమంటే.." సరిగ్గా పుష్కరకాలం క్రితం 'ది లాస్ట్ బ్రాహ్మిన్' పేరుతో రాణి శివశంకర శర్మ రాసిన తెలుగు పుస్తకం మార్కెట్లోకి విడుదల అయినప్పుడు నా చుట్టూ ఉన్న ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా స్పందించారు. వారిలో యజ్ఞోపవీతం తెంపుకుని కమ్యూనిస్టు ఉద్యమంలో తలమునకలుగా పనిచేస్తున్నవారి మొదలు, సంప్రదాయాన్ని విడిచిపెట్టకుండా ఆధునికతని అంది పుచ్చుకున్న వారి వరకూ భిన్న నేపధ్యాలు ఉన్నవాళ్ళు. అప్పట్లో ఎన్నో చర్చలకి కేంద్రబిందువైన ఈ పుస్తకాన్ని పన్నెండేళ్ళ తర్వాత చదవడం తటస్థించింది, అదీ యాదృచ్చికంగా.

సనాతన బ్రాహ్మణ సంప్రదాయానికి చివరితరం ప్రతినిధి అయిన మహామహోపాధ్యాయ రాణి నరసింహ శాస్త్రి జీవితాన్ని గురించి, ఆయన చిన్న కొడుకు, నాస్తికుడు అయిన రాణి శివశంకర శర్మ రాసిన ఈ 241 పేజీల పుస్తకం సనాతన బ్రాహ్మణ జీవితం, హిందూ, క్రైస్తవ, బౌద్ధ ధర్మాలు, కమ్యూనిజం, నాస్తికత్వం లాంటి అనేక అంశాలని స్పృశించింది. తూర్పుగోదావరి జిల్లా ముంగండ సమీపంలోని నరేంద్రపురం అగ్రహారం లో కూలిపోడానికి సిద్ధంగా ఉన్న ఓ పాత ఇంట్లో చివరి రోజులు గడుపుతున్న నరసింహ శాస్త్రి పరిచయంతో మొదలయ్యే కథనం, ఆయన అంతిమ యాత్రతో ముగుస్తుంది.

"మహామహోపాధ్యాయ బిరుదాంకితులు మహా వేదాంత పండితులు అయిన రాణి నరసింహ శాస్త్రి గారికి ఇద్దరు కొడుకులున్నారు. పెద్ద కొడుకు హిందువుగా మారడంతో పతనమయ్యాడు. చిన్న కొడుకు నాస్తికుడయ్యాడు. కొడుకులుండి ఫలితమేమి? మరణాంతరం ఉన్నత లోకాలకి ద్వారాలు తెరుచుకోక ఆకలితో దప్పికతో అల్లాడే ఒక మహానుభావుడి ఆత్మకి దారి ఏది?" ఇది ఆ ఇంటి పురోహితులు కామేశ్వర సోమయాజులు వ్యధ. ఎందుకంటే, హిందూ ధర్మం అనే దాన్ని ప్రచ్చన్న క్రైస్తవంగా తిరస్కరించి, సనాతన వర్ణ ధర్మాన్ని మాత్రమే జీవితాంతమూ ఆచరించారు నరసింహ శాస్త్రి.


వేదాంత శాస్త్రంలో భారత దేశంలోనే  గొప్ప పండితుడిగా భారత రాష్ట్రపతి సన్మానం అందుకున్న నరసింహ శాస్త్రి గృహస్థ జీవితం ఎలా ఉంటుంది? ఆధునికతని ఏ రూపంలోనూ గడప దాటి లోపలి రానివ్వ లేదు. డబ్బుకు ఏ మాత్రం లోటు లేకపోయినా ఆ ఇంట్లో కుర్చీలు లేవు, వాడడం నిషేధం. పిల్లలు పెరిగి పెద్ద వాళ్ళు అయ్యేవరకూ ఆయన భార్యకి రేడియో వినడం అన్నది అతిపెద్ద తీరని కోరిక. ఇక, పిల్లల చదువుల గురించి ఆయన ఏనాడూ పట్టించుకోలేదు. చిన్నకొడుకు పద్నాలుగేళ్ళు వచ్చే వరకూ బడి ముఖం చూడకపోయినా ఆయనకి చింతలేదు. "అదంతే, దాన్ని మార్చలేం.." ఇది ఆయనకి ఇష్టమైన పదబంధం.

బ్రాహ్మణేతరులెవ్వరినీ శిష్యులుగా అంగీకరించని నరసింహ శాస్త్రి, "స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయా వహః" అన్న గీతాకారుడి భాష్యాన్ని మనసా వాచా నమ్మారు. వ్యాప్తి లేని కారణంగానే బ్రాహ్మణ్యం కుంచించుకు పోతోందనీ, త్వరలోనే అంతరించి పోబోతుందన్నది ఆయన పెద్ద కొడుకు రాణి రామకృష్ణ శర్మ వాదన. ఇతర వర్ణాలవారిని బ్రాహ్మణ్యంలో కలపడం ద్వారా బ్రాహ్మణ్యాన్ని బలోపేతం చేయాలన్న వాదనతో హిందువుగా మారిన రామకృష్ణ శర్మ, తర్వాతి కాలంలో పీఠాదిపతిగా మారారు. వీరిద్దరికీ భిన్నమైన మార్గం శివశంకర శర్మది.

కేవలం తరాల అంతరాలని గురించి మాత్రమే కాదు, బ్రాహ్మణుల్లో ఉన్న అనేకానేక శాఖలు, ఉప శాఖలని గురించీ, వాటి మధ్యలో ఉండే అంతరాలని గురించీ వివరంగా రాశారు ఈ పుస్తకంలో. ప్రముఖ కవులు రచయితలు, విప్లవ పార్టీల అభిమానులూ అయిన బ్రాహ్మణుల వివరాలు ఇస్తూ "కమ్యూనిజంలో బ్రాహ్మణులని ఆకర్షించేది ఏదో ఉంది" అంటారు శివశంకర శర్మ. శ్రీశ్రీ కవితా పంక్తుల్ని ఉదాహరిస్తూ "ఇదంతా ప్రభుసమ్మితమైన వైదిక ఉపదేశమే. సోమయాజి చేసిన మంత్రోచ్చాటనే," అంటారు. "అస్పృశ్యతను కఠోరంగా పాటించే నిష్టాపరులైన మా నాన్నగారికి ముస్లింల పట్ల వ్యతిరేకత లేదు. మా ఇంట్లో తిట్లలో శూద్ర శబ్దం దొర్లుతుందేమో కానీ, తురక అనే మాట ఉండదు" అని చెబుతూ 'కన్యాశుల్కం' నాటకంలో గిరీశాన్ని 'తురక' అనిపించడం పొరపాటు అంటారు.

నిజానికి, 'కన్యాశుల్కం' నాటకంలో గిరీశం తనని తాను నవాబు గారికి దగ్గర వాడుగా చెప్పుకుంటూ ఉంటాడు. మొదటి సన్నివేశంలో మధురవాణి తో తనకి వెయ్యి సిక్కా రూపాయల జీతంలో ముసాయిల్ ఉద్యోగం అయ్యిందని చెబుతూ "హమేషా  బాద్షా వారి హుజూర్నై ఉండడం" అని గర్వంగా చెప్పించడం, బుచ్చమ్మ తో అచ్చిక బుచ్చికలాడుతూ "గిరీశం గారి పిల్లలని తీసుకురా అని ఒకప్పుడు నవాబుగారి శలవౌతుంది" అని అనిపించడం ద్వారా గిరీశం మోజు ఎటువైపు ఉందో చెప్పకనే చెప్పారు గురజాడ. శివశంకర శర్మ మాత్రం, ఆనాటి సంస్కరణలన్నీ సనాతన ధర్మాన్ని క్రైస్తవీకరించడం తప్ప మరేమీ కాదని గ్రహించడం వల్లే గురజాడ సంస్కరణలపట్ల అంతగా మక్కువ చూపించలేదు అంటారు.

"తెలుగు సాహిత్యంలో ముస్లిం పాత్రలపై మొగ్గుతో చలం చేసిన రచనలు కూడా పూర్తిగా సనాతన ధార్మికుల ప్రభావంతో ఉన్నవే. గాయత్రీ మంత్రానికి అధమాధికారుల అర్ధం ఒకటీ, ఉత్తమాధికారుల అర్ధం ఒకటీ ఉన్నట్టుగానే చలం రచనలు కూడా లౌకికార్ధం ఒకటి పరమార్ధం ఒకటి - సామాన్యార్ధం ఒకటి, విశేషార్ధం ఒకటి కలిగి ఉంటాయి," అన్నది శివశంకర శర్మ చేసిన మరో ప్రతిపాదన. "చలం మాగ్నమ్ ఒపస్ గా భావించబడే 'మైదానం' నవల సనాతన ధర్మం పరిధులను తు.చ. తప్పకుండా పాటిస్తూ రచింపబడిందే. అందులో వ్యక్తమైన బ్రాహ్మణ స్త్రీజన పక్షపాతం సంపూర్ణంగా ఆనాటి శంకర పీఠాల ధార్మిక ఆగ్రహాన్ని అనుసరించిందే" అంటారు.


ఇంతకీ, మహామహోపాధ్యాయ రాణి నరసింహ శాస్త్రి ఎనభయ్యేళ్ల జీవితం, ఆయన చిన్నకొడుకు రాణి శివశంకర శర్మ మీద ఎలాంటి ప్రభావం చూపించింది? "దశాబ్ద కాలానికి పైగా కుల నిర్మూలన దృక్పధంతో నేను రచనలు సాగించాను. అంబేద్కర్ చెప్పిన కుల నిర్మూలన దృక్పధం గల ప్రజా సంఘాలతో కలిసి తిరిగాను. ఈనాడు కుల నిర్మూలన నినాదం అనేది యెంత భయావహమైనదో కుల నిర్మూలన అనేది ఎంత అగ్రవర్ణ హిందూ వాదమో తెలిశాక నేను ఈ గ్రంధాన్ని రాయడం అనేది నా నైతిక బాధ్యతగా, కర్తవ్యంగా భావిస్తున్నాను." ('న్యూ సిలబస్' ప్రచురణ, వెల రూ. 240).

ఆదివారం, మే 04, 2014

'కుల' సమరం

అధికారికంగా కొత్త రాష్ట్రంగా అవతరరించడానికి కొద్ది రోజులు ముందుగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. పది జిల్లాలు మరో రాష్ట్రంగా వేరు పడ్డాక, మిగిలిన జిల్లాలతో 'రెసిడ్యుయల్ ఆంధ్రప్రదేశ్' గా రూపాంతరం చెందిన తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో పోటీ రెండు ప్రధాన కులాల మధ్య జరుగుతోంది. వీటిలో ఒకటి కోస్తా ప్రాంతంలో బలమైనది కాగా, మరొకటి 'సీమ' ప్రాంతంలో శక్తివంతమైనది. అత్యంత సహజంగానే ఇద్దరి దృష్టీ 'గెలుపు' మీదే ఉంది.

నిజానికి, ఎన్నికల్లో కులాల మధ్య పోటీ కొత్త విషయం కాదు. మన రాష్ట్రంలో, ఆ మాటకొస్తే దేశంలో ఇవాల్టికీ ఓటర్లని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశం ఈ 'కులం.' అయితే, ఇప్పుడు కొత్త రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు మాత్రం పోటీ పడుతున్న ఇద్దరికీ కూడా అత్యంత ముఖ్యమైనవి. నిజం చెప్పాలంటే, ఇద్దరికీ కూడా గెలవడానికి ఇదే మంచి తరుణం. ఇప్పుడు గెలవలేక పొతే ఇద్దరికీ కూడా భవిష్యత్తు అగమ్యగోచరమే.

పోటీ పడుతున్న ఇద్దరూ కూడా అధికారాన్ని అనుభవించిన వారే. ఒకరు ప్రత్యక్షంగా, మరొకరు పరోక్షంగా. ఇద్దరూ కూడా అనునాయిలకి అనేకానేక మేళ్ళు చేసిన వాళ్ళే. ఇద్దరికీ కూడా చట్టాలంటే పెద్దగా గౌరవం ఉన్నట్టు కనిపించదు. కాకపొతే, ఒకరు వ్యవస్థలని 'మేనేజ్' చేయగలరు. మరొకరు అలా చేయాల్సిన అవసరం ఉందని కూడా అనుకోరు. ఇద్దరూ కూడా చెట్టు పేరుని యధేచ్చగా వాడుకుంటున్న వాళ్ళే. అయితే ఆ చెట్లకి ఉన్న తొర్రలు, వేరు పురుగుల గురించిన విషయాలని మాత్రం ఒకరివి మరొకరు బయట పెట్టుకుంటున్నారు.

ఇవి మాత్రమేనా? ఎదుటి వారికి సంబంధించిన ఏ ఒక్క విషయమూ బయట పెట్టకుండా మిగల్చడం లేదు. ఫలితం, ఇద్దరి గోత్రాలూ ఇప్పటికే ఓటర్లందరికీ కరతలామలకం. ఇద్దరికీ చేతిలో ప్రసార సాధనాలు ఉన్నాయి. ఇవి కూడా ఒకరికి పరోక్షం, మరొకరి దగ్గర ప్రత్యక్షం. ఇవి ఇప్పటికే ఇద్దరి చరిత్రలనీ కూలంకుషంగా, ఫోటోలు, వీడియోల సహితంగా చూపించాయి, చూపిస్తూ ఉన్నాయి. మీట నొక్కితే చాలు, సమస్త సమాచారమూ లభ్యం! హామీలు ఇవ్వడంలో కూడా ఇద్దరిలో ఎవ్వరూ తగ్గడం లేదు. పాలనానుభవం పుష్కలంగా ఉన్నవారూ, దాన్ని సంపాదించాలని ఆరాట పడుతున్న వాళ్ళూ.. ఇద్దరిదీ అదే దారి. ఆ హామీలు ఎంతవరకూ ఆచరణ సాధ్యం అన్నది బహిరంగ రహస్యం.

అవసరార్ధం గుమ్మం తొక్కిన వాళ్ళని ఇద్దరూ కూడా కాదనడం లేదు. ఆదరించి అక్కున చేర్చుకుంటున్నారు. ఎప్పుడు ఎవరితో ఎలాంటి అవసరం పడుతుందో తెలియదు కదా. అందునా కీలక సమయం మరి. బరిలో గుర్రాలని మాత్రమే దింపాలన్న శషభిషలు కూడా ఇద్దరిలో ఏ ఒక్కరికీ లేవు. నిలబెట్టినదాన్నే గుర్రమని ప్రచారం చేయగల సాహసం, అందుకు సాయపడే సాధన సామగ్రీ ఇద్దరి దగ్గరా కూడా పుష్కలం మరి. గెలుపు గురించి వాళ్లకి భయం వేసినప్పుడల్లా, అవతలి వాళ్ళని బూచిగా చూపించి ఓటర్లని భయపెట్టే పని పెట్టుకుంటున్నారు ఇద్దరూ కూడా.

ఈ ఎన్నికలే ఎందుకు కీలకం మరి? మరో ఐదేళ్లకి మరింతగా పాతబడిపోతారు అన్నది ఒక కారణం అయితే, ఇప్పుడు గద్దెనెక్కిన వాళ్ళకే కొత్త రాష్ట్రం నిర్మాణ బాధ్యతలు అందుతాయి అన్నది రెండో కారణం. మొదటి కారణం వాళ్లకి ముఖ్యమైనది అయితే, రెండో కారణం వాళ్ళ అనుచరులని చాలా ముఖ్యమైనది. ఎప్పుడో తప్ప వచ్చే అవకాశం కాదు కదా. ఇరు పక్షాల్లోనూ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లూ, వ్యాపారవేత్తలూ ఉన్నారు. వాళ్లకి బోలెడన్ని వ్యాపార అవసరాలు ఉన్నాయి. అవి నాయకుల వల్ల మాత్రమే నెరవేరుతాయి. ఆ నాయకులకి అధికారం దక్కినప్పుడు మాత్రమే నెరవేరతాయి. అదృష్టం ఎవరి పక్షాన ఉన్నది అన్నది కొద్ది రోజుల్లో తేలబోతోంది..