ఆదివారం, డిసెంబర్ 23, 2012

తనికెళ్ళ 'మిథునం'

వెండి తెరమీద 'మిథునం...' అక్షరాల్లో 'మిథునం' శ్రీరమణది అయితే, దృశ్యరూపంలో వచ్చిన ఈ 'మిథునం' దర్శకుడు తనికెళ్ళ భరణిదనే చెప్పాలి. కథని సినిమాగా మార్చడంలో ఉన్న కష్టసుఖాలు తెలిసిన వాడిగానూ, గడిచిన రెండు దశాబ్దాల్లోనూ మన చుట్టూ అనివార్యంగా వచ్చి పడిన మార్పులని ఆకళింపు చేసుకున్న వాడిగానూ 'సినిమాటిక్ లిబర్టీ' తీసుకుని భరణి తీసిన సినిమా ఇది. అందుకే, అక్షరాల్లో అప్పదాసు-బుచ్చిలక్ష్మిలకీ, తెరమీద కనిపించే "ఆది దంపతులు అభిమానించే" జంటకీ భేదాలు కనిపిస్తూనే ఉంటాయి.

శ్రీరమణ కథలో అప్పదాసుకి ఎనభై ఏనాడో దాటేస్తే, సినిమా అప్పదాసు (నేపధ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం) అరవై దాటిన వాడు. మూడు ఎమ్మేలు పాసై, స్కూలు మేష్టారు ఉద్యోగం చేసి పింఛను పుచ్చుకుంటున్న వాడు. కథలో అప్పదాసులాగా నూనెలో ముంచి తీసిన ఏకులా కాకుండా, కొంచం కండపుష్టి గానే ఉంటాడు. అక్షరాల్లో బుచ్చిలక్ష్మికి ప్రపంచాన్ని తెలుసుకునే మరో మార్గం లేదు, భర్త చెప్పే కబుర్లు వినడం ద్వారా తప్ప. కానైతే సినిమా బుచ్చిలక్ష్మి (లక్ష్మి) అలాకాదు. కట్టుకున్న వాడికి తెలియకుండా, అమెరికాలో ఉండే కొడుకులూ, మనవలతో రహస్యంగా సెల్ ఫోన్ మాట్లాడి చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకుంటూ ఉంటుంది.

గ్యాసు పొయ్యి మీద వంటచేసుకునే ఈ బుచ్చిలక్ష్మి, కొత్తని ఆహ్వానించాలనీ, మిక్సీ గ్రైండర్లు మంచివనీ భర్తతో వాదిస్తూ ఉంటుంది కూడా. అలాగని ఈ సినిమా చూడాలంటే శ్రీరమణ రాసిన కథని మర్చిపోవాల్సిన అవసరం లేదు. నిజానికి కథలో ముఖ్య సంభాషణలు, సన్నివేశాలు సినిమాలోనూ ఉన్నాయి. వాటితోపాటు కొన్ని సన్నివేశాలకి మార్పులూ, మరికొన్ని అదనపు సన్నివేశాలూ వచ్చి చేరాయి. పాటలు సరేసరి. కథగా చెప్పుకోవాలంటే, పిల్లలు విదేశాల్లో స్థిరపడిపోతే, వాళ్ళ మీద ఆధార పడడం ఇష్టం లేని ఓ వృద్ధ జంట తమ పల్లెటూరి ఇంట్లో ఒకరికి ఒకరుగా కలిసి బతకడం. ఒకే ప్రాణంగా బతికిన ఆ ఇద్దరిలో, ఒకరు తనువు చాలించినప్పుడు రెండోవారి స్పందన ఏమిటన్నది ముగింపు.

ఇది ముగ్గురి సినిమా. భరణి, బాలు, లక్ష్మి. నాటక రంగం నుంచి సినిమాకి వచ్చి రచయితగా, నటుడిగా స్థిరపడ్డాక,దర్శకుడిగా కొన్ని లఘు చిత్రాల తర్వాత భరణి తీసిన తొలి కమర్షియల్ సినిమా (నిజానికి ఈ మాట వాడకూడదేమో.. కానీ, బడ్జెట్, ప్రచారం, థియేటర్ రిలీజ్ పరంగా చూసినప్పుడు వాడాల్సిందే) ఇది. అత్యంత సహజంగానే తన మార్కుని చూపేందుకు ప్రయత్నం చేశాడు. తను చేస్తున్నది సాహసం అన్న విషయాన్నీ ఎక్కడా మర్చిపోలేదు. ప్రారంభంలో తెరపై సూర్యోదయాన్ని చూపి, ఆ సూర్యబింబాన్ని సినిమా టైటిల్ మధ్య అక్షరానికి పొట్టలో చుక్కగా రూపాంతరం చెందించగానే దర్శకుడి పనితీరు మీద మొదలైన కుతూహలం, సినిమా ఆసాంతమూ కొనసాగింది.


ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ మొదలు, 'కార్మికుల కార్యక్రమం' నుంచి 'మన్ చాహే గీత్' వరకూ అనేక కార్యక్రమాలని కథకి అనుగుణంగా వాడుకున్నాడు దర్శకుడు. ఇంతేనా, "శ్రీ సూర్య నారాయణా" "పూవులేరి తేవే చెలి పోవలె కోవెలకు" లాంటి 'వెనుకటి తరం' పాటలకీ సముచిత స్థానం దొరికింది, సందర్భానుసారంగా. చిన్న కథని - అందునా పెద్దగా మెలికలూ మలుపులూ  లేకుండా సాఫీగా సాగిపోయే కథని - సినిమాగా మలచడంలో కలిగే ఇబ్బంది భరణి కీ తప్పలేదు. ఫలితం, మొదటి సగం నింపాదిగా కదులుతున్నట్టు అనిపించడం, కథ చదవని వాళ్లకి సినిమా ఎటు పోతోందో అర్ధం కాక పోవడం.

కథలో కొన్ని సన్నివేశాలు సినిమాలో లేవు. మరికొన్ని సగం సగం మాత్రమే ఉన్నాయి. అలాగే, కథలో లేని సన్నివేశాలు కొన్ని సినిమాలో ఉన్నాయి. వీటిలో రెండు మూడు సన్నివేశాలు చూసినప్పుడు, "అరె... వీటిని కూడా కథలో చేర్చి ఉండాల్సిందే" అని శ్రీరమణ అనుకుని ఉంటారా అనిపించింది. చూడగానే నచ్చేసేది కెమెరా పనితనం. కొన్ని దృశ్యాలు గ్రీటింగ్ కార్డులని తలపించాయి. నేపధ్య సంగీతం మరికొంచం బాగా చేసి ఉండొచ్చు అనిపించింది. పాటలు బావున్నాయి. ఆడియో విని కించిత్ భయపడ్డ కాఫీ దండకాన్ని, భలే తెలివిగా దృశ్యీకరించారు. ముచ్చటగా అనిపించింది. అయితే పాటల ప్లేస్మెంట్ - మరీ ముఖ్యంగా రెండో సగంలో - విషయంలో కొంచం జాగ్రత్త తీసుకోవాల్సింది. రెండు పాటలూ వరుసగా వచ్చేశాయి.

కథలో అప్పదాసు ఆవుని తన పెరట్లో ఉంచడు, పచ్చని పెరడుకీ పాడి ఆవుకీ పొసగదని. ఆ ఆవు పాలు అందించే మిష తోనే కథకుడు అప్పదాసు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సినిమాలో, ఆవు అప్పదాసు పెరట్లోనే ఉంటుంది, ఓ అందమైన పేరుతో. ఆ ఆవు చుట్టూ అల్లిన సన్నివేశమూ బావుంది. కథలో అప్పదాసుకి చెట్లంటే ప్రాణం. కర్వేపాకు మొదలు కంద వరకూ ఎవరి మీదా ఆధార పడనవసరం లేని విధంగా ఉంటుంది ఆయన పెరడు. అంతే కాదు, "రుణానుబంధ రూపేణా..." లో చెట్టునీ చేర్చాలి అనేంత మమకారం ఆయనది. సినిమాలోనూ పచ్చని పెరడు ఉంది. కానైతే, ఆ పెరడు మధ్యలో ఇల్లు ఉంది అనే విషయం అర్ధమయ్యేలా చిత్రీకరణ ఉంటే బావుండేది. అంతే కాదు, కేవలం కూరగాయల కోసం తోట పెంచుతున్న భావన వచ్చిందే తప్ప, అప్పదాసు అసలు తత్వాన్ని తెరమీద అందరికీ చేరేలా చూపలేదు.

శ్రీరమణ కథని పక్కన పెట్టి, భరణి కథ ప్రకారం చూసినప్పుడు బాలూ, లక్ష్మీ అప్పదాసు-బుచ్చిలక్ష్మీ పాత్రల్లో ఒప్పించారు. కొన్ని కొన్ని సన్నివేశాల్లో వారి నటన నాటకీయత వరకూ వెళ్లి, అంతలోనే వెనక్కి రావడం ప్రేక్షకుల దృష్టిని దాటిపోదు. ఇప్పటి వరకూ వాళ్ళు చేసిన సినిమాలతో పోల్చినప్పుడు చాలావరకూ 'అండర్ ప్లే' చేశారనే చెప్పాలి. భరణి కి నాటక రంగం మీద ఉన్న ప్రేమ వల్ల కావొచ్చు, నాటకీయత అయితే చాలాచోట్లే కనిపించింది - కథ నడకలోనూ, నటనలోనూ కూడా. స్క్రీన్ ప్లే విషయంలో మరికొంత జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది. లోపాలని పక్కన పెడితే, వెంటాడే సినిమా ఇది. పతాక సన్నివేశం తెర మీద కనిపిస్తున్నప్పుడు, థియేటర్లో వెనుక వరుస నుంచి వెక్కిళ్ళు వినిపించాయి. కొందరి కళ్ళు, దాదాపు అందరి హృదయాలూ చెమర్చేలా సినిమా తీసిన భరణికి, నిర్మాత ఆనంద్ మొయిదా రావుకీ అభినందనలు. ఈ తరహా సినిమాలు భవిష్యత్తులో రావడం, రాకపోవడం అన్నది ఈ సినిమా విజయం మీద ఆధారపడి ఉంటుంది, కచ్చితంగా.

మంగళవారం, డిసెంబర్ 18, 2012

సుబ్బారాయుడి షష్ఠి

"హమ్మయ్య... 'పోలిస్వర్గం' అయిపొయింది కదా.. ఇంక రోజూ పొద్దున్నే లేచే పని ఉండదు..." అనుకుంటామో లేదో, సుబ్బారాయుడి షష్ఠి వచ్చేస్తుంది. ఏవిటో ఈ పండగలన్నీ ముందే చెప్పుకున్నట్టు ఒకదాని తర్వాత ఒకటి వరసగా వచ్చేస్తాయి. షష్ఠి అంటే స్నానమూ, తీత్తమూ అన్నమాట. రెండూ కూడా పక్క ఊళ్లోనే. పొద్దు పొద్దున్నే లేచేసరికే గుమ్మంలో వెంకాయమ్మ గారి బండి ఉంటుందా... అది నిండేలా బోల్డంతమంది ఆడవాళ్ళూ, పిల్లలూ ఉంటారు. ఎద్దులకి కూడా పాపం చలే కదా. మెల్లిగా నడిచీ నడిచీ పక్క ఊళ్ళో చెరువు పక్కన ఉన్న గుడికి తీసుకెడతాయి. 

మనం బండి దిగేసరికే బోల్డంత మంది పంతులు గార్లు 'సంకల్పం చెబుతామమ్మా' అంటూ ఎదురు వచ్చేస్తారు. ముందర ఎవరు అడుగుతారో వాళ్ళతో 'అలాగేనండీ' అని చెప్పాలన్న మాట. ఈ మాట కూడా పెద్ద వాళ్ళే చెప్పాలి. పిల్లలు గప్ చుప్ గా ఉండాలి. అసలే చలి చంపేస్తూ ఉంటుందా, మన పాటికి మన్ని స్నానం చేయనీయకుండా పంతులు గారు ఏవేవో మంత్రాలు చెప్పేస్తారు. ఓపక్క వణుకు వచ్చేస్తున్నా సరే, వాటిని తప్పుల్లేకుండా పలకాలి. లేకపోతే ముందర ఆయనకీ, తర్వాత అమ్మకీ కోపాలు వచ్చేస్తాయి. స్నానం గండం గడిచిపోయిందంటే, ఇంక గుళ్ళోకి వెళ్లి ప్రసాదం తెచ్చేసుకోడమే. జనం ఉంటారు కదా.. కొంచం ఆలీసం అవుతుంది.

గుడి నుంచి బయట పడేసరికి వెలుగు వస్తూ వస్తూ ఉంటుందన్న మాట. గుడి బయట అప్పుడే సైకిళ్ళ మీదా, బళ్ళ మీదా వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద మూటలు దింపుకుంటూ ఉంటారు. ఆ మూటల్లో ఏముంటాయంటే తీత్తం లో అమ్మేవి అన్నీను. అన్నట్టు, తీత్తం అంటే ఏమిటో చెప్పలేదు కదూ. బోల్డు బోల్డు జీళ్ళు, కర్జూర పళ్ళూ, బుడగలూ, రంగు కళ్ళ జోళ్ళూ, గాలికి గిరగిరా తిరిగే రంగు కాయితం పువ్వులూ, టిక్కూ టిక్కూ చప్పుడు చేసే కప్పలూ, ఇంకానేమో రంగుల రాట్నం కలర్ సోడాలు, గుండాట (ఇది కొంచం రహస్యం) ఇవన్నీ ఉండే చోటన్న మాట. గుడి ముందు నుంచి చాలా బోల్డంత దూరం ఒకదాని తర్వాత ఒకటి కొట్లు వస్తూనే ఉంటాయి.

మనం బండిలో వెడుతూ వెడుతూ బొమ్మలో అవీ ఏమేం వచ్చాయో చూసి, ఏ కొట్లో బావున్నాయో గుర్తులు పెట్టేసుకోవచ్చు. 'ఇప్పుడే కావాలీ' అని పేచీ పెట్టకూడదు. అలా కానీ పేచీ పెట్టామంటే, బండి దింపేస్తాం అంటారు పెద్ద వాళ్ళందరూ. హమ్మో... బండి దిగిపోతే ఇంకేమన్నా ఉందా? తీత్తంలో మారిపోమూ? అదే గుర్తులు పెట్టేసుకున్నాం అనుకో, మధ్యాహ్నం మళ్ళీ వస్తాం కదా.. అప్పుడు కొనుక్కోవచ్చు. ఇంచక్కా బడి ఉండదు కాబట్టి, ఇంటికి వెళ్ళాక ఆటలు ఆడుకోవచ్చు. మళ్ళీ మధ్యాహ్నం బోయినం అవ్వగానే తీత్తం ప్రయాణం ఉంటుంది కదా. "తీత్తం ఏమిటీ తీత్తం? నీ మొహం... తీర్ధం అనాలి" అని బామ్మ అంటుందనుకో.. అయినా మనకి ఎలా పలికితే అలా అనొచ్చు. చిన్న పిల్లలు అన్ని మాటలూ సరిగ్గా పలకలేరని దేవుడికి మాత్రం తెలీదూ?

తీత్తానికి రెండు రకాలుగా వెళ్ళొచ్చు. అమ్మ, అమ్మ ఫ్రెండ్సులతో అయితే నడిచి, అదే నాన్నతో అయితే సైకిలు మీద. మన ఊరి తీత్తమైతే రోజులో ఆరు సార్లో, పది సార్లో ఇట్టే వెళ్లి అట్టే వచ్చేస్తామా? ఈ తీత్తానికి మాత్రం ఒక్ఖ సారే వెళ్ళగలం. బండిలో చటుక్కున వెళ్లినట్టు అనిపిచేస్తుంది కానీ, నడిచి వెడితే యెంత దూరమో అసలు. వెళ్ళేప్పుడు, మనకి ఎదురు వస్తున్న వాళ్ళ చేతుల్లో ఉండే బూరాలూ, బొమ్మలో చూస్తూ పట్టించుకోము కానీ, ఇంటికి రాగానే మొదలవుతాయి కాళ్ళ నొప్పులు. అదే సైకిలు మీదనుకో, కాళ్ళు చక్రంలో పెట్టేయ్యకుండా జాగ్రత్తగా కూర్చోవాలి. మనం వెడుతూ వెడుతూ ఉండగా తాడుచ్చుకుని కొట్టుకునే వాడు కనిపించాడంటే తీత్తం వచ్చేసినట్టే. వాడిని చూస్తే ఎంత భయం వేస్తుందంటే, తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుంది. అమ్మైతే "కళ్ళు మూసుకుని నా చెయ్యి గట్టిగా పట్టుకో బాబూ" అంటుంది కానీ, అదే నాన్నైతే "మొగ పిల్లాడివి, ఏడుస్తావేంటీ?" అనేస్తారు.

ఎన్నేసి జీళ్ళో... ఎన్నెన్ని ఖర్జూరం పళ్ళో... వాటిని చూస్తూనే కడుపు నిండిపోతుంది అసలు.. కొట్ల వాళ్ళందరూ యెంత మర్యాదగా పిలుస్తారో అసలు.. వాళ్ళ కొట్లోనే కొనుక్కోమని. కానీ అలా ఎక్కడ పడితే అక్కడ కొనేసుకోకూడదు. ఈగలు లేకుండా ఉన్న కొట్టు వెతుక్కోవాలా... జీళ్ళు అప్పటికప్పుడు చేస్తూ అమ్ముతారు చూడూ, అక్కడైతే బావుంటాయి. ఖర్జూరం పళ్ళ మీద బెల్లం నీళ్ళు చిలకరించి అమ్మేస్తూ ఉంటారు. అది పసికట్టుకోవాలి. మనం యెంత జాగ్రత్తగా ఎంచినా బామ్మ ఏదో ఒక పేరు పెట్టకుండా ఉండదనుకో. అయినా, అమ్మ చెప్పినట్టు డబ్బులు పోసి కొంటున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కదా. తీత్తంలో కళ్ళజోళ్ళు యెంత బావుంటాయో అసలు. ఎన్ని రంగులో.. ఎరుపూ, నీలం, ఆకుపచ్చా, పసుప్పచ్చా... మనకైతే అన్నీ తలోటీ కోనేసుకోవాలి అనిపించేస్తుంది కానీ, ఒకటి కన్నా కొనుక్కోడానికి ఉండదు.

పేరుకి బోల్డన్ని కొట్లు ఉంటాయి కానీ అన్నీ చూడ్డానికి ఉండదు. పెద్దవాళ్ళు ఎక్కడికి వెడితే మనమూ అక్కడికే వెళ్ళాలి. లేకపోతే మారిపోతాం కదా. పోలీసులు ఒకళ్ళు తెగ తిరుగుతూ ఉంటారు. నేనెప్పుడూ చూడలేదు కానీ, పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారుట తీత్తంలో. నాన్నైతే బరబరా తీసుకొచ్చేస్తారు, రెండో మూడో బొమ్మలు కొనిపెట్టి. అమ్మతో అయితే తిరగొచ్చు కానీ, ఊరిఖే చూడాలి అంతే. బతిమాలినా ఏమీ కొనిపెట్టదు. "ఎందుకూ.. రేపటికి విరగ్గొట్టేస్తావ్" అంటుంది పైగా. ఏవీ కొనుక్కోక పొతే ఫ్రెండ్సులకి ఏం చూపించాలీ? వాళ్ళందరూ నవ్వరూ?? ఏవిటో..ఇంత పెద్దైనా ఏమీ తెలీదు. ఆ ఏడాది తీత్తానికి నాన్నతో వెళ్లాను కదా... తిరిగొస్తూ "ఎందుకు నాన్నా సుబ్బారాయుడి తీత్తం ఇంత దూరంగా ఉంటుందీ?" అని అడిగా. "ఇదీ ఓ దూరమే? వచ్చే ఏడు నుంచీ నీ బడి ఇక్కడే.. రోజూ రావాలి. మనూళ్ళో హైస్కూలు లేదు కదా మరి" అనేశారు