మంగళవారం, మే 31, 2016

వెదురుపువ్వు

మధురాంతకం నరేంద్ర పేరు చెప్పగానే 'కుంభమేళా' 'రెండేళ్ళ పద్నాలుగు' లాంటి కథా సంకలనాలు, 'భూచక్రం,' 'అమెస్టర్ డాంలో అద్భుతం' లాంటి నవలలూ గుర్తొస్తాయి. మూడున్నర దశాబ్దాలుగా తన ప్రవృత్తి అయిన తెలుగు సాహిత్య వ్యాసంగాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్న ఈ ఇంగ్లీష్ ప్రొఫెసర్ గారు వెలువరించిన తాజా కథా సంకలనం 'వెదురుపువ్వు మరికొన్ని కథలు.' మొత్తం పదహారు కథలున్న ఈ సంకలనంలో మొదటి రెండూ 1985 లో ప్రచురితమైనవి కాగా, మిగిలిన పద్నాలుగు కథలూ గడిచిన పుష్కర కాలంలో తెలుగు వారపత్రికల్లోనూ, దినపత్రికల ఆదివారం అనుబంధాల్లోనూ అచ్చయినవి.

'వెదురుపువ్వు' సంకలనం గురించి ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో కనిపిస్తున్న అన్ని ధోరణులకి చెందిన - ఫెమినిజం మొదలు పోస్ట్-మోడర్నిజం వరకూ - కథలూ ఈ సంకలనంలో కనిపిస్తాయి. వీటన్నింటితో పాటుగా, తాత్విక చింతనా, కళాత్మక అభివ్యక్తీ ప్రతికథలోనూ దర్శనం ఇస్తాయి. సంకలనంలో తొలికథ 'మళ్ళీయెప్పుడో.. యెక్కడో..' మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా ఉనికిలోకి రాని కాలంలో (అసలలాంటి కాలం ఒకటి ఉందా అని ఇప్పటి తరం ఆశ్చర్యపోతుంది బహుశా) పెళ్లి తర్వాత విడిపోయి, మళ్ళీ కలుసుకునే అవకాశాన్ని ఎప్పుడో తప్ప దక్కించుకోలేని 'గడిచిన తరం' స్త్రీల కథ. ముప్ఫయ్యేళ్ళ నాటి తిరుపతిని కళ్ళకి కట్టేస్తారు రచయిత.

రెండో కథ 'అమ్మ అంటే ఏమిటి మమ్మీ?' అప్పట్లో బాగా విస్తరించడం మొదలుపెట్టిన ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూళ్ళ పనితీరు మీద ఓ వ్యంగ్యోక్తి. శీర్షిక చూడగానే అర్ధమయిపోయే కథని, ఒక్క అక్షరం కూడా విడవకుండా చదివించేది కథనమే. నరేంద్ర 2003 లో రాసిన కథ 'రాంషా గారింట్లో రాణి.' తొలిప్రచురణ అప్పుడు చదివినా, ఇప్పుడు మళ్ళీ చదివి అప్పటి ఆలోచనలని జ్ఞాపకం చేసుకోడం బాగుంది. ప్రైవేటు కాలేజీలతో పోటీ పడలేక మూతపడిపోయే స్థితికి చేరుకున్న ఎయిడెడ్ కాలేజీల స్థితిని ఇతివృత్తంగా తీసుకుని రాసిన 'రేపటి చరిత్ర' కథ చరిత్ర మీద ఆసక్తి ఉన్న వాళ్లకి మరీ మరీ నచ్చుతుంది. కథలో రచయిత పెట్టిన క్విజ్ కి ముందుమాటలో జవాబిచ్చేశారు కేతు విశ్వనాథ రెడ్డి!!


ప్రత్యేకంగా చెప్పుకోవల్సిందీ, ఇక మీదట ఎప్పుడు నరేంద్రని తల్చుకున్నా మొదట గుర్తొచ్చేదీ 'సద్గతి' కథ. పదిహేడు పేజీల ఈ కథ అక్షరాలా ఊపిరి బిగపట్టి..మునివేళ్ళ మీద నిలబెట్టి చదివిస్తుంది. మృత్యువు నేపధ్యంగా సాగే కథ అవ్వడం వల్ల మరీ మరీ నచ్చేసింది నాకు. ఈ కథ చదివాక  'మృత్యువు సమవర్తి' అన్న మాట ఎక్కడ వినిపించినా అప్రయత్నంగానే ఓ నవ్వు వచ్చేస్తుంది. ఎక్కడా రచయిత కనిపించకుండా, పాత్రలు మాత్రమే కనిపించడం, బిగువైన అల్లిక, ఊహాతీతమైన ముగింపు కారణంగా ఓ గొప్ప కథని చదివిన అనుభూతిని పాఠకులకి కలిగిస్తుంది. శీర్షికలో వ్యంగ్యోక్తి అర్ధం కావాలంటే కథని పూర్తిగా చదవాల్సిందే. ఇదే ఇతివృత్తాన్ని మరో నేపధ్యం నుంచి రాసిన కథ 'వొక మైనారిటీ కథ.' జీవిత సత్యాలని ఇంత సులువుగా చెప్పొచ్చా అనిపిస్తుందీ కథ ముగించాక.

కార్పొరేట్ చదువుల కారణంగా పిల్లలకన్నా తల్లిదండ్రులు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారన్నది నిజం. ఈ నిజానికి కథా రూపం ఇస్తే అదే 'యుద్ధకాండ.' ఉలికిపాటుకి గురిచేసే ముగింపు ఈ కథని ఓ పట్టాన మర్చిపోనివ్వదు. ఇలాంటిదే మరో కథ 'గాలిపాట.' ఇక, 'రెండురాగాలు ఒకపాట,' 'నేను మొలకెత్తిన నేల' ఈ రెండూ రచయిత డైరీలో పేజీల్లా అనిపిస్తాయి. 'వెదురుపువ్వు' కథ చదివిన ప్రతిసారీ ఒక్కోలా అర్ధమయ్యే కథ, పాఠకుల మనఃస్థితిని అనుసరించి. 'చతుర్భుజం' కథ చదువుతున్నంత సేపూ బుచ్చిబాబు 'నిరంతర త్రయం' గుర్తొస్తూనే ఉంది. కథనంతో కట్టిపడేసే మరో కథ 'పరమపద సోపానం.'  వ్యంగ్య రస ప్రధానంగా సాగే స్త్రీవాద కథ 'చిటికెడు చక్కెర' కాగా సంపద వెంట పరుగులని చిత్రించే కథ 'పచ్చల శంఖం-యేనుగు పగడం.'

సంపుటంలో చివరిదైన 'చివరి ఇల్లు' కథ గతేడాది 'కథ' సంకలంలో చోటు చేసుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే పిల్లలకి దూరంగా ఒంటరి జీవితం గడిపిన వృద్ధ జంట కథ. వాళ్ళ పిల్లలు దూరాన ఉంటే, ఆ ఇంట్లో పనికి కుదిరి ఆ జంటకి పదిహేనేళ్ళ పాటు సేవలు చేసిన అమ్మాయి దృష్టి కోణం నుంచి వినిపించే కథ. గడిచిన నాలుగైదు దశాబ్దాల కాలంలో సమాజంలో వచ్చిన అనేక మార్పులని ప్రస్తావించిన కథ. ఏ కథలోనూ రచయిత ప్రవేశించక పోవడం, భావజాలాల చట్రాల్లో కథల్ని ఇరికించే ప్రయత్నం చేయకపోవడం ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయం. మళ్ళీ మళ్ళీ చదివించే, ఓ పట్టాన మర్చిపోనివ్వని కథలున్న 'వెదురుపువ్వు' కథా సాహిత్యాన్ని ఇష్టపడే వారందరూ తప్పక చదవాల్సిన పుస్తకం. (విశాలాంధ్ర ప్రచురణ, పేజీలు 206, వెల రూ. 150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

శుక్రవారం, మే 27, 2016

సేవాసదన్

నిజాయితీ పరుడైన పోలీస్ అధికారి కృష్ణ చంద్ర, గంగాజలి దంపతులకి ఇద్దరు కూతుళ్ళు సుమన్, శాంత. తండ్రిది ఉన్నతోద్యోగం కావడంతో చాలా గారాబంగా పెరిగి పెద్దయ్యారు ఇద్దరూ. చూస్తుండగానే సుమన్ కి పెళ్లీడు వచ్చేసింది. నెలజీతం తప్ప, కృష్ణచంద్రకి పై సంపాదన అలవాటు లేకపోవడంతో వెనకేసింది ఏమీ లేదు. సుమన్ అందచందాలు చూసి వరుళ్ళు క్యూ కడతారనుకున్న కృష్ణచంద్రకి వాస్తవ పరిస్థితి అర్ధం కాడానికి ఎన్నాళ్ళో పట్టలేదు. అక్రమ మార్గంలో సంపాదిస్తే తప్ప కూతుళ్లిద్దరికీ పెళ్లి చేసి పంపడం అసాధ్యమని తేలిపోవడంతో అక్రమార్జనకి మానసికంగా సిద్ధ పడతాడు. డబ్బు వస్తుందన్న భరోసాతో సుమన్ కి సంబంధం సిద్ధం చేసి ఉంచుతాడు.

కృష్ణచంద్ర తలచినట్టుగానే డబ్బు వచ్చింది. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతలో, అతను లంచం తీసుకున్న విషయం పై అధికారులకి ఫిర్యాదు వెళ్ళడంతో పెళ్లి ముహూర్తానికి ముందే కృష్ణచంద్ర అరెస్టు అవుతాడు. సుమన్ పెళ్లి ఆగిపోతుంది. వచ్చిన డబ్బు కోర్టు కేసుకి ఖర్చైపోయాక అతనికి జైలు శిక్ష పడుతుంది. గంగాజలి తన పిల్లలిద్దరితో అన్న ఉమానాథ్ ఇంటికి చేరుతుంది. అంతంతమాత్రం  సంసారి అయిన ఉమానాథ్ చెల్లెలిమీద ప్రేమతో ఆ కుటుంబం బాధ్యత తీసుకునేందుకు సిద్ధ పడతాడు.

ఓ చిరుద్యోగి గజాధర్ తో సుమన్ పెళ్లి జరిపిస్తాడు. ఒక్కసారిగా తన జీవితం తల్లకిందులైపోవడం తట్టుకోలేకపోతుంది సుమన్. అప్పటివరకూ విశాలమైన భవంతిలో విలాసంగా జీవించిన సుమన్ ఓ మురికి వాడలో చిన్న ఇంటిలో సర్దుకోడానికి  చాలా కష్ట పడుతుంది. భర్త సంపాదనతో నెల గడపడం కష్టమవుతూ ఉంటుంది. ఎదురింట్లో నివాసం ఉండే వేశ్య భోలీ బాయి తోనూ, ప్లీడరు పద్మసింహ భార్య సుభద్రతోనూ స్నేహం కుదురుతుంది సుమన్ కి. ఇద్దరిలోనూ భోలీబాయి ఆమెని ఎంతగానో ఆకర్షిస్తుంది. ఊళ్ళో గౌరవనీయులంతా భోలీ ఇంటికి రావడం, ఆమె పాటని ప్రశంసించడం, ప్రాపకం కోసం పాకులాడడం ఇవన్నీ ఆశ్చర్య పరుస్తాయి సుమన్ ని.


హోలీ పండుగ సందర్భంగా పద్మసింహ తన ఇంట్లో భోలీ బాయి కచేరీ ఏర్పాటు చేయడంతో, తప్పక రమ్మని సుమన్ ని ఆహ్వానిస్తుంది సుభద్ర. గజాధర్ కి మాటమాత్రమైనా చెప్పకుండా ఆ వేడుకకి హాజరవుతుంది సుమన్. వేడుక పూర్తయేసరికి అర్ధరాత్రి అవుతుంది. సాయంత్రం పని నుంచి తిరిగి వచ్చిన గజాధర్ కి సుమన్ ఏమయ్యిందో అర్ధం కాదు. అసహనం కాస్తా అనుమానంగా మారుతుంది. సరిగ్గా అప్పుడే ఇంటికి తిరిగి వచ్చిన సుమన్ ని ఇంట్లోకి రానివ్వనంటాడు. సుమన్ కూడా పట్టుదలకి పోయి సుభద్ర ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ వచ్చిన సమస్య కారణంగా ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్న సుమన్ ని భోలీ బాయి ఆదరిస్తుంది.

సుమన్ సమస్యలన్నీ తీరిపోవాలంటే ఆమె సుమన్ బాయి గా మారిపోవడం ఒక్కటే పరిష్కారం అని చెబుతుంది భోలీ. అంతే కాదు, రూపలావణ్యాలున్న సుమన్ కి ఆటా పాటా నేర్పేందుకు సిద్ధ పడుతుంది. ఓ పక్క గజాధర్, మరో పక్క పద్మసింహ సుమన్ కోసం వెతుకుతూ ఉండగానే ఆమె దాల్ మండీ లో సుమన్ బాయిగా అవతరిస్తుంది. గజాధర్ నగరంనుంచి మాయమైపోతాడు. సుమన్ జీవితం అలా మారడానికి తనే కారణం అన్న చింత పద్మసింహని నిలువనివ్వదు. ఫలితంగా, నగరంలో ఉన్న వేశ్యలందరినీ సంస్కరించే కార్యక్రమానికి నడుం బిగిస్తాడు. ముందుగా దాల్ మండీ ఖాళీ చేయించి వాళ్ళందరినీ నగర శివార్లకి తరలించడం మొదటి కార్యక్రమం. ఆ తర్వాత వాళ్లకి కొత్త జీవితం ప్రారంభించడానికి అవసరమయ్యే కృషి చేయాలన్నది ఆలోచన.

పద్మసింహ ప్రయత్నాలు సాగుతూ ఉండగానే, అతని ఇంట చదువుకోడానికి వచ్చిన అన్న కొడుకు సదన్ సింహ సుమన్ తో పీకలోతు ప్రేమలో మునిగిపోతాడు. సదన్, పద్మసింహ బంధువని పసిగట్టిన సుమన్ అతన్ని దూరంగానే ఉంచుతుంది. పద్మసింహ ప్రయత్నాలు ఫలించాయా? సుమన్ చేసిన పని ఆ కుటుంబంమీద ఎలాంటి ప్రభావాన్ని చూపించింది? గజాధర్ ఏమయ్యాడు? తన జీవితానికి సంబంధించి సుమన్ తీసుకున్న నిర్ణయం ఏమిటి? ఈ ప్రశ్నలకి జవాబు ప్రేమ్ చంద్ రాసిన నవల 'సేవాసదన్.' గంగా నదిని కథలో ఓ పాత్రగా మలిచిన రచయిత చాతుర్యం పాఠకులని ఆశ్చర్య పరుస్తుంది. కుటుంబ బంధాలు, సంఘ మర్యాదలు, సాంఘిక విలువలు, నైతికతకి సంబంధించి లోతైన చర్చ చేశారీ నవలలో. పోలు శేషగిరి రావు తెలుగు అనువాదం సరళంగా ఉంది. (సాహితి ప్రచురణ, పేజీలు  280, వెల రూ. 90, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

బుధవారం, మే 25, 2016

తెలుగువారి ప్రయాణాలు

తెలుగునాట యాత్రా సాహిత్యానికి రెండువందల ఏళ్ళ చరిత్ర ఉందని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలిగింది. గడిచిన రెండు వందల ఏళ్ళలో తెలుగు వారు సృజించిన యాత్రాకథనాలలో ప్రసిద్ధ యాత్రికుడు, యాత్రా కథకుడు ఎం. ఆదినారాయణ ఏర్చి కూర్చిన అరవై నాలుగు కథనాల సమాహారం 'తెలుగువారి ప్రయాణాలు' సంకలనం చదువుతూండగా కలిగిన ఆశ్చర్యాలు ఎన్నో, ఎన్నెన్నో. తీర్ధ యాత్రికులు, కవులు, కళాకారులు, సౌందర్యారాధకులు, పండితులు, రచయితలు, ప్రపంచ యాత్రికులు, ప్రజానాయకులు చేసిన ప్రయాణాల తాలూకు విశేషాలని ఒకే పుస్తకం నుంచి తెలుసుకోగలగడం చాలా సంతోషాన్ని కలిగించింది.

తెలుగులో యాత్రాగ్రంధం అనగానే మొదట గుర్తుకు వచ్చేది ఏనుగుల వీరాస్వామి 'కాశీయాత్ర.' అయితే, వీరాస్వామి కన్నా ఎనిమిదేళ్ళు ముందే వెన్నెలకంటి సుబ్బారావు కాశీయాత్ర చేశారని, ఆ వివరాలు తన ఆత్మకథలో రాసుకున్నారనీ చెబుతుందీ సంకలనం. మొత్తం ఆరు ఖండాల్లో కాలినడక, సైకిలు, మోటారు సైకిలు, కారు, బస్సు, రైలు, విమానంపై ప్రయాణించిన యాత్రికుల అనుభవాలు మనకి చెప్పే విశేషాలకి అంతేలేదు. యాత్రాగ్రంధాలలో నుంచి తీసుకున్న కథనాలు కొన్నయితే, ఆత్మకథల నుంచి స్వీకరించినవి మరికొన్ని. తెలుగువారు ఇంగ్లీష్ లో రాసుకున్న కథనాల తెలుగు అనువాదాలకీ చోటు దొరికిందీ పుస్తకంలో.

చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి కాశీ యాత్ర, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి నేత్రావధానం కోసం చేసిన రైలు ప్రయాణం, దువ్వూరి వెంకట రమణ శాస్త్రి కాకినాడ మీద బాంబులు పడుతున్నాయన్న వదంతుల నేపధ్యంలో ద్రాక్షారామం వరకూ చేసిన బస్సు ప్రయాణం, అడివి బాపిరాజు అజంతా ఎల్లోరా గుహలని దర్శించిన వైనం, బుచ్చిబాబు తన బాల్యంలో కాలువల ఒడ్డున చేసిన ఏకాంత ప్రయాణాలు,  కొల్లేరులో చలం సాగించిన పిట్టల వేట, తిరుమల రామచంద్ర చేసిన మొహంజోదారో-హరప్పా యాత్ర, శ్రీశ్రీ చైనా ప్రయాణం, రావూరి భరద్వాజ రష్యా యాత్ర, కాళోజీ, ఆరుద్ర, దాశరథి చేసిన ప్రయాణాల వివరాలు అచ్చమైన యాత్రా 'కథనా'లే. వీరి రచనాశక్తి కథనాల్లో కనిపిస్తూ ఉంటుంది మనకి.


ట్రావెలాగ్స్ ని తెలుగు కమర్షియల్ సాహిత్యంలో చేర్చిన ఘనత మల్లాది వెంకట కృష్ణమూర్తిది. ఆయన చేసిన ఐరోపా యాత్ర విశేషాలున్నాయీ పుస్తకంలో. ఆధునిక యాత్రా సాహిత్యం అనగానే గుర్తొచ్చే పరవస్తు లోకేశ్వర్, దాసరి అమరేంద్ర, వాడ్రేవు చినవీరభద్రుడుతో పాటు సంపాదకుడు ఆదినారాయణ యాత్రా కథనమూ చేర్చారిందులో. సినీ నటీ నటులు టంగుటూరి సూర్యకుమారి, భానుమతి, పద్మనాభం, అక్కినేని నాగేశ్వరరావు రాసుకున్న ప్రయాణ విశేషాలతో పాటు, ఆసాంతం ఊపిరి బిగపట్టి చదివించే బుర్రకథ కళాకారుడు షేక్ నాజర్ కథనం, కరుణరస ప్రధానంగా సాగే ఆదిభట్ల నారాయణదాసు యాత్ర వాళ్ళని గురించి కొత్త సంగతులెన్నో చెబుతాయి.

'రంగూన్ లో చిత్రాంగి' అంటూ స్థానం నరసింహారావు చెప్పిన కబుర్లని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. తెలుగు నాటక ప్రదర్శన కోసం రంగూన్ వెళ్ళిన తొలి బృందం వీరిదే. స్థానం వారు చిత్రాంగిగా అభినయిస్తే, వారు మేకప్ చేసుకోడాన్ని చూడడం కోసం ప్రత్యేక అనుమతి తీసుకుని గ్రీన్ రూం కి వచ్చారట నాటి రంగూన్ నగర ప్రముఖులు! పిఠాపురం రాజాతో విదేశీ  యాత్రకి వెళ్ళిన కురుమెళ్ళ వెంకటరావు 'స్టీమర్ మీద ఐరోపాకి ప్రయాణం' ముచ్చట్లు పంచుకుంటే, బొబ్బిలి రాజావారితో 'బొబ్బిలి నుండి వెంకటగిరి వరకూ' చేసిన ప్రయాణాన్ని వర్ణించారు మండపాక పార్వతీశ్వర శాస్త్రి. స్వామి ప్రణవానంద కథనం  'గండ శిలల దారిలో గోముఖానికి ప్రయాణం' చాలాకాలంపాటు వెంటాడుతుంది.

ఆచార్య ఎన్. గోపి 'గున్నయ్య ఒత్తు,' ఏడిదము సత్యవతి రాసిన 'ప్రియతముడి ప్రాణాల కోసం' కథనాలు కరుణరస భరితాలు. ఎండ్లూరి సుధాకర్, జె. బాపురెడ్డి తమ యాత్రానుభావాలని దీర్ఘ కవితల రూపంలో అక్షరీకరించారు. ముదిగంటి జగ్గన్న శాస్త్రి 'ఆంధ్రభోజుడి ఆత్మఘోష' చదువుతుంటే వెంటనే హంపీకి ప్రయాణమైపోవాలనిపిస్తుంది. అత్యం నరసింహ మూర్తి, బీఎస్సెన్ మూర్తిల పరిశీలనా శక్తి అబ్బుర పరుస్తుంది. ఎన్టీఆర్ చైతన్య యాత్ర గురించి పర్వతనేని ఉపేంద్ర రాసిన కథనం, వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రను గురించి భూమన కరుణాకర్ రెడ్డి రాసిన కథనం రాజకీయ యాత్రలని గురించి వివరిస్తే, నాటి రాష్ట్రపతి కె. ఆర్. నారాయణన్ తో 'స్వాతి' సంపాదకులు వేమూరి బలరాం చేసిన న్యూయార్క్, పెరూ, బ్రెజిల్ యాత్ర విశేషాలు వీవీఐపీల ప్రయాణాల గురించి లోతుగా చెబుతాయి.

ఈ సంకలనం తీసుకురావడం వెనుక తన ఉద్దేశాలతో పాటు, తీసుకొచ్చేందుకు చేసిన కృషిని సవివరంగా రాశారు ఆదినారాయణ తన ముందుమాటలో. ఆయన ప్రచురించిన మూల గ్రంధాల జాబితా చూసినప్పుడు చదవాల్సినవి ఓ ఐదారు పుస్తకాల వివరాలు కనిపించాయి. కాకినాడ-కోటిపల్లి మధ్య వంశీ చేసిన రైలు ప్రయాణాన్ని కూడా జోడించి ఉంటే బాగుండుడేది అనిపించింది. మొత్తం మీద చూసినప్పుడు, రెండు శతాబ్దాల కాలంలో ప్రపంచంలో వచ్చిన అనేకానేక మార్పులు భిన్న రంగాలకి చెందిన వారి ద్వారా తెలుసుకునే వీలు కల్పిస్తోందీ పుస్తకం. యాత్రల మీద  ఆసక్తి ఉన్నవారిని మాత్రమే కాక, సాహిత్యాభిమానులనీ అలరించే రచన ఇది. ('తెలుగువారి ప్రయాణాలు,' సంపాదకులు ఎమ్. ఆదినారాయణ, ఎమెస్కో ప్రచురణ, పేజీలు  520, వెల రూ. 200, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

మంగళవారం, మే 24, 2016

కుముదిని

ఓ బతికి చెడిన జమీందారీ కుటుంబంలో ఆఖరి ఆడపిల్ల కుముదిని. ఆమెకి సంగీత సాహిత్యాల్లో చక్కని ప్రవేశం ఉంది. అన్నగారితో సమంగా చదరంగం ఆడుతుంది. ఇక గృహ నిర్వహణ విషయం అయితే చెప్పనవసరం లేదు. చటర్జీ వంశ మర్యాదలకి అనుగుణంగా అతిధులని ఆదరించడంలో ఆమె దిట్ట. తల్లిదండ్రులతో పాటు, ఆస్తుల్నీ కోల్పోయిన ఆమె అన్నల ఎదుట ఉన్న పెద్ద సవాలు కుముదిని వివాహం. వంశ మర్యాదకి తగిన విధంగా ఉన్నత వంశానికి చెందిన వరుడితో ఆమెకి వివాహం జరిపించాలి. కానీ, కుటుంబ ఆర్ధిక పరిస్థితి రీత్యా అది జరిగే పనిగా కనిపించడం లేదు.

ఘోష్ ల వంశానికి చెందిన మధుసూదన ఘోషుడు ముప్ఫై మూడేళ్ళ వాడు. చిన్న స్థాయిలో జీవితాన్ని మొదలు పెట్టి గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగిన అవివాహితుడు. నిజానికి ఘోష్ వంశీకులు జమీందారులు. కొన్ని తరాల క్రితం చటర్జీ వంశీకులకీ, ఘోష్ వంశీకులకీ మధ్య వచ్చిన పట్టింపులు పెరిగి పెద్దవై ఘోష్ లు ఊరు విడిచి వెళ్ళేలా చేశాయి. ఊరు విడిచిన తర్వాత ఘోష్ ల ఆర్ధిక పరిస్థితి దిగజారింది. మధుసూదనుడి తరం వచ్చేసరికి కూలి పనితో తప్ప రోజులు గడవని స్థితి వచ్చేసింది. అయితే, అవినాష ఘోషుడు తెలివైన వాడు, కష్టపడే తత్త్వం ఉన్న వాడు అవ్వడంతో నెమ్మదిగా వ్యాపారం ఆరంభించి పట్టణ ప్రముఖుడిగా ఎదుగుతాడు.

మధుసూదనుడి వివాహం ఇప్పుడా కుటుంబాన్ని పీడిస్తున్న సమస్య. ఇన్నాళ్ళూ సంపాదన మీదే దృష్టి పెట్టి వ్యాపారాలు అభివృద్ధి చేసిన మధుసూదనుడు కూడా పెళ్లి  చేసుకోవలసిన అవసరాన్ని గుర్తించాడు. అతడు తలచుకుంటే సంబంధాలకేం కొదవ? గొప్ప గొప్ప వాళ్ళు పిల్లనిస్తామంటూ వచ్చారు. కానీ, పెళ్ళికి సంబంధించి మధుసూదనుడి కోరిక ఒక్కటే.. చటర్జీ వంశపు అమ్మాయిని వివాహం చేసుకోవాలని. మధుసూదనుడి అనుయాయులు కన్య కోసం గాలింపు మొదలు పెట్టారు. కుముదిని వాళ్ళ దృష్టిలో పడడం ఆలస్యం, ఇరువైపులా ఒప్పించి సంబంధం ఖాయం చేశారు. ఈ పెళ్ళితో కుముదిని జీవితం ఏ మలుపులు తిరిగిందన్నదే రవీంద్రనాథ్ ఠాగూర్ నవల 'కుముదిని.'


మధుసూదనుడి ఇంట్లో పెద్దకోడలి హోదా కుముదినిది. భర్త కూడా ఆమెని 'పెద్ద కోడలా' అనే పిలుస్తాడు. తనని భక్తిగా చూసే మరిది, తోడికోడలు, గౌరవ మర్యాదలు చూపే పాటక జనం. అయితే, ఆమెకి దొరకనిదల్లా భర్త ఆదరణ. వ్యాపారంలో ఎత్తుకి పై ఎత్తు వేయడంలో అందెవేసిన చేయి అయిన మధుసూదనుడికి స్త్రీలతో వ్యవహారం బొత్తిగా కొత్త. పైగా, అతడు ప్రేమగా మాట్లాడినా అది వ్యాపార లావాదేవీలాగే ఉంటుంది, మాట్లాడే పధ్ధతి వల్ల. ఆ ఇంట్లో తనకే అధికారమూ, స్వతంత్రమూ లేదని త్వరలోనే అర్ధమవుతుంది కుముదినికి. కానీ, భర్తకి ఎదురు చెప్పడం అన్నది ఆమెకి ఏమాత్రం ఇష్టం లేని పని. తల్లి ప్రవర్తన కారణంగా, తండ్రి అనుభవించిన క్షోభని ఆమె మర్చిపోలేదు.

పెళ్లవుతూనే కుముదిని తన పుట్టింటి వాళ్ళతో సంబంధాలని శాశ్వతంగా తెంచేసుకోవాలని ఆశించాడు మధుసూదనుడు. తన అన్నగారు విప్రదాసు అంటే కుముదినికి చెప్పలేనంత ప్రేమ, గౌరవం. పైగా, ఆమె పెళ్లినాటికి విప్రదాసు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడు. ఏ పని చేస్తున్నా కుముదిని దృష్టి అన్నగారి మీదే ఉండడం మధుసూదనుడికి ఆగ్రహం తెప్పిస్తుంది. ఆమె తననెందుకు ప్రేమించదన్న పట్టుదల పెరుగుతుంది. ఓ పక్క ఆమె తన అన్నకి ఉత్తరం రాసేందుకు కూడా వీలు లేకుండా కట్టడి చేస్తూ, ఆమె ప్రేమని గెలుచుకోడం కోసం విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తూ ఉంటాడు. అయితే, ఆ నగల వైపు కన్నెత్తి చూడదు కుముదిని. దీనితో కుముదిని మీద కన్నా ఆమె పుట్టింటి వాళ్ళ మీద కోపం హెచ్చుతుంది మధుసూదనుడికి.

రాను రాను మధుసూదనుడి సాంగత్యం దుర్భరంగా మారిపోతుంది కుముదినికి. ఆమె తనపై ప్రేమ చూపకపోవడం అశాంతికి గురి చేస్తుంది మధుసూదనుడిని. తమ్ముడి సలహా మేరకి, విప్రదాసుని చూసి వచ్చేందుకు పుట్టింటికి పంపుతాడు కుముదినిని. అనారోగ్యంతో క్షీణించిన విప్రదాసుకి కుముదిని పన్నెత్తి చెప్పకపోయినా ఆమె ఇంటి పరిస్థితులు అర్ధమవుతాయి. అప్పటికే పని వాళ్ళ ద్వారా కొన్ని విషయాలు విని ఉన్నాడతను. ఆధునిక భావాలున్న వాడు, చెల్లెలిని ప్రాణ సమానంగా చూసుకునే వాడూ అయిన విప్రదాసు మధుసూదనుడి ఇంటికి తిరిగి వెళ్ళే విషయాన్ని కుముదిని నిర్ణయానికే వదిలేస్తాడు. జరగబోయే పరిణామాలకి తను జవాబుదారీ అని హామీ ఇస్తాడు. కుముదిని నిర్ణయమే నవలకి ముగింపు.

కమలాసనుడి తెలుగు అనువాదం సాఫీగా సాగిపోయింది. నూరేళ్ళ నాటి బెంగాలీ జమిందారీ వాతావరణంలోకి సులభంగా పాఠకులని ప్రయాణం చేయించేసే నవల ఇది. కొన్ని కొన్ని జమీందారీ పద్ధతులు ఆశ్చర్య పరుస్తాయి. భిన్న ద్రువాలైన కుముదిని, మధుసూదనుడి పాత్రల చిత్రణ ఈ నవలకి ప్రధాన బలం. అక్కడక్కడా కొంత సాగతీత ఉన్నా ఏకబిగిన చదివించే కథనం. తన నవల 'మట్టి మనిషి' లో కొడుకు వెంకటపతి పెళ్లి విషయంలో సాంబయ్య పట్టుదలని చిత్రించడానికి, డాక్టర్ వాసిరెడ్డి సేతాదేవికి స్ఫూర్తి మధుసూదనుడి పాత్రే అయిఉంటుంది అనిపించింది 'కుముదిని' చదువుతూ ఉంటే. (సాహితి ప్రచురణ, పేజీలు  232, వెల రూ. 90, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

సోమవారం, మే 23, 2016

బతుకు పుస్తకం

ఉప్పల లక్ష్మణరావు పేరు వినగానే తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్న వారందరికీ 'అతడు-ఆమె' నవల గుర్తొస్తుంది. స్వాతంత్రోద్యమ నేపధ్యంలో రాసిన ఆ నవల తెలుగులో తప్పక చదవాల్సిన పుస్తకాల్లో ఒకటి. వృక్ష శాస్త్రవేత్త మొదలు, ప్రగతి ప్రచురణాలయం (మాస్కో) లో తెలుగు అనువాదకుడి వరకూ ఎన్నో బాధ్యతలు చేపట్టిన లక్ష్మణ రావు తన ఎనభై మూడో ఏట 1981లో రాసుకున్న ఆత్మకథ 'బతుకు పుస్తకం.' మొదట ఆంధ్రజ్యోతి లో ధారావాహిక గానూ, అటుపై విశాలాంధ్ర ద్వారా పుస్తక రూపంలోనూ వెలువడిన ఈ రచనని గతేడాది పునర్ముద్రించారు విజయవాడ 'సాహితీ మిత్రులు.'

బరంపురంలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన లక్ష్మణరావు బాల్యమంతా మాతామహులు దిగుమర్తి వెంకటరామయ్య పంతులు గారింటనే గడిచింది. వాళ్ళందరూ విద్యావంతులు, రాజకీయ చైతన్యం ఉన్న వాళ్ళు. (మాజీ రాష్ట్రపతి వరాహగిరి వేంకటగిరి లక్ష్మణరావు గారికి వరుస సోదరుడు). తాతగారి తరిఫీదులో చిన్ననాడే నాటి ఆంగ్ల పత్రికలని ఆమూలాగ్రంగా చదవడం అలవాటు చేసుకున్న లక్ష్మణరావుకి, ఇంగ్లీష్ భాషతో పాటు నాటి ప్రపంచ రాజకీయాలూ కరతలామలకమయినాయి. చదువు కోసం చిన్ననాడే ఇల్లు విడిచి కొంతకాలం మద్రాసులోనూ, మరికొంత కాలం విశాఖపట్నం లోనూ అటుపై కలకత్తాలోనూ విద్యాభ్యాసం చేసి పై చదువులకోసం జర్మనీ వెళ్లారు లక్ష్మణరావు.

తనకిష్టమైన శాస్త్రంలో డాక్టరేట్ పూర్తి చేసి భారతదేశానికి తిరిగివచ్చేలోగా మెల్లీ సోలింగర్ అనే స్నేహితురాలి నుంచి పెళ్లి ప్రతిపాదన అందుకున్న లక్ష్మణరావు, చాలా సంయమనంతో తన నిర్ణయం చెప్పారు. ఆమె భారతదేశానికి వచ్చి, కొంత కాలం గడిపిన తర్వాత కూడా ఇదే ప్రతిపాదన చేస్తే తప్పక అంగీకరిస్తాననీ, ఆమె కనుక తన వాతావరణంలో ఇమడ గలదన్న నమ్మకం తనకి కలిగినట్టైతే తానే పెళ్లి ప్రతిపాదన చేస్తాననీ ఒప్పించారు. అన్నమాట ప్రకారం ఆమె భారతదేశానికి రావడం, మరో ఎనిమిదేళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ మాస్కోలో భార్యాభర్తలు కావడం జరిగింది. ఈ దంపతులు సంతానం వద్దనుకోడానికి కారణాన్ని లక్ష్మణరావు గారి మాటల్లో చదవాల్సిందే.


చిన్ననాడు ఏర్పడిన రాజకీయ చైతన్యం వయసుతో పాటు పెరిగి పెద్దదయ్యింది లక్ష్మణరావు గారిలో. మెల్లీతో కలిసి మహాత్మా గాంధీ పిలుపు ఇచ్చిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిజానికి, లక్ష్మణ రావు కన్నా మెల్లీనే ఎక్కువగా ఉద్యమ జీవితం గడిపారు. ఓ విదేశీ వనిత భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొని జైలు జీవితాన్ని అనుభవించడం, జైల్లో ఖైదీల కనీసావసరాలకోసం సత్యాగ్రహం చేయడం ఆశ్చర్య పరిచే విషయాలు. లక్ష్మణరావు ఉద్యోగ, రాజకీయ జీవితాలు కొంత కాలం విడివిడిగానూ మరికొంత కాలం కలివిడిగానూ సాగాయి. కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టు పార్టీ భావజాలానికి ఆకర్షితులైనా, పార్టీ క్రియాశీల సభ్యుడిగా చేరేందుకు ఎన్నో ఏళ్ళ సమయం తీసుకున్నారు.

చదువుకి సంబంధం ఉన్నవీ, లేనివీ కూడా ఎన్నో ఉద్యోగాలు చేసిన లక్ష్మణరావు, ప్రగతి ప్రచురణాలయం లో ఉద్యోగం రాగానే రెండో ఆలోచన లేకుండా చేరిపోయారు. మెల్లీ సంఘ చైతన్య కార్యక్రమాలపై దృష్టి  పెట్టారు. మాస్కో జీవితాన్ని గురించి ఎంతో ఉత్సాహంగా చెప్పిన లక్ష్మణరావు, తనకెదురైన ఓ పెద్ద పరీక్షనూ, దాన్ని తను దాటిన వైనాన్నీ ఆర్ద్రంగా చెప్పారు. వందేళ్ళనాటి బరంపురం, మద్రాసు, విశాఖపట్నం, లండన్, జర్మనీ, మాస్కో నగరాలు, నాటి సామాజిక, రాజకీయ, ఆర్ధిక పరిస్థితులు, ఒక యాభయ్యేళ్ళ కాలంలో వాటిలో వచ్చిన మార్పులు వీటన్నింటినీ తన కథతో పాటు చెప్పుకుంటూ వచ్చారు.

ఓ బృహత్ గ్రంధానికి సరిపడే సాధన సామగ్రి ఉన్నప్పటికీ, తన ఆత్మకథని 208 పేజీల్లో ముగించారు లక్ష్మణరావు. క్లుప్తతకి పెద్ద పీట వేశారని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. సీరియస్ విషయాలు, సరదా సంగతుల కలబోతగా మలిచినందువల్ల తెలియకుండానే పేజీలు  తిరిగిపోతాయి. సగం పేజీల తర్వాత ప్రవేశించే మెల్లీ సోలింగర్ రెండో సగమంతా తనే అయ్యారు. అక్కడక్కడా కొన్ని పేజీల్లో ఆమె ప్రస్తావన లేని చోట్ల, కథలోకి ఆమె ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు పాఠకులు. ఆమె జీవితాన్ని గురించి లక్ష్మణరావు ఓ పూర్తి పుస్తకాన్ని రాసి ఉంటే బాగుండుననిపించింది. ముద్రణ బాగున్నప్పటికీ, ముద్రా రాక్షసాలు చిరాకు పెట్టాయి. చరిత్రనీ, ఆత్మకథలనీ ఇష్టపడే వాళ్లకి నచ్చే పుస్తకం. (సాహితీ మిత్రులు ప్రచురణ, పేజీలు  208, వెల రూ. 150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

శనివారం, మే 21, 2016

కర్మభూమి

సమాజంలో ధనిక, పేద వర్గాల మధ్య  అంతరాలు తగ్గించాలంటే ధనికులు సొంత లాభం కొంత మానుకుని పేదల ఆర్దికాభివృద్ధి కోసం ఉదారంగా పని చేయాలి అని ప్రతిపాదించారు సుప్రసిద్ధ  భారతీయ రచయిత ప్రేమ్ చంద్ సుమారు శతాబ్ద కాలం క్రితం తను రాసిన నవల 'కర్మభూమి' లో. హిందీ, ఉర్దూ, పార్సీ, ఆంగ్ల భాషల్లో ప్రవీణుడైన ఈ రచయిత బ్రిటిష్ పాలనలో భారతదేశ స్థితిగతులని తన నవలల ద్వారా పాఠకుల కళ్ళకి కట్టారు. ఓ ధనవంతుడైన వ్యాపారి కొడుకు అమర్ కాంత్ తన జీవితాన్ని పేదవాళ్ళ సేవకోసం అంకితం చేయడంతో, అతని స్పూర్తితో ఆ కుటుంబం మొత్తం సమాజసేవ వైపు అడుగులు వేయడమే 'కర్మభూమి' నవల ఇతివృత్తం.

లాలా సమర్ కాంత్ చాలా చిన్న స్థాయిలో జీవితాన్ని మొదలు పెట్టిన వ్యక్తి. పూరింటిలో మొదలైన అతని ప్రయాణం వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగి పట్టణ ప్రముఖుడిగా అవతరించే స్థాయికి ఎదిగింది. సమర్ కాంత్ కి ఇద్దరు సంతానం. కొడుకు అమర్ కాంత్, కూతురు నైనా. మొదటినుంచీ అమర్ కాంత్ కి డబ్బన్నా, ఆడంబరాలన్నా కిట్టవు. క్రమశిక్షణ పేరిట  కొడుకుని బాగా కట్టడి చేస్తాడు సమర్ కాంత్. నైనాకి అన్నంటే పంచ ప్రాణాలు. ఆమె చిన్నప్పుడే తల్లిని కోల్పోయినా, అన్నకి తనే తల్లిగా వ్యవహరించేంత పెద్దరికం, పొందికా ఉన్న అమ్మాయి నైనా.

కాలేజీలో చదువుతున్న అమర్ కాంత్ కి గొప్పింటి అమ్మాయి సుఖదాతో వివాహం జరిగింది. ఆమె ఇంకా కాపురానికి రాలేదు. స్నేహితుడు సలీం, గురుతుల్యుడు  శాంతికుమార్, చెల్లెలు నైనా.. వీళ్ళే అతని ప్రపంచం. సాయంత్రాలు సభలు, సమావేశాలు అంటూ తిరుగుతున్న కొడుకు, అందుకు బదులుగా తనకి సాయంగా ఉంటూ వ్యాపారంలో మెళకువలు నేర్చుకోవచ్చు అన్నది సమర్ కాంత్ అభిప్రాయం. అయితే అమర్ ఆలోచనలు పూర్తిగా వేరు. అతనికి వ్యాపారం మీద ఏమాత్రం ఆసక్తి లేదు. నిజానికి బ్రతుకుతెరువు గురించి పెద్దగా ఆలోచన లేదు. తనకి నచ్చిన పనులు చేస్తూ కాలం గడపడమే ఇష్టం. ఇలాంటి పరిస్థితుల్లో సుఖదా కాపురానికి వస్తుంది.


మొదటినుంచీ భోగ భాగ్యాల్లో పెరిగిన సుఖదాకి అమర్ వైఖరి అర్ధం కాదు. నైనా తో ఆమెకి ఇట్టే స్నేహం కలుస్తుంది. తండ్రీ కొడుకుల మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించిన సుఖదా, దానిని పూడ్చవలసిన బాధ్యత తన మీద ఉందని గ్రహించి అమర్ ని 'దారికి తెచ్చే' ప్రయత్నాలు ఆరంభిస్తుంది. అయితే, స్వభావ రీత్యా అమర్ సుఖదాలిద్దరూ భిన్న ధ్రువాలు. తొలుత సుఖదా ఆకర్షణలో పడ్డ అమర్ తర్వాత తామిద్దరి ద్రుక్పధాలలో ఉన్న భేదాన్ని గుర్తిస్తాడు. సుఖదా ఎంత ప్రయత్నించినా వాళ్ళ మధ్య అంతరాలు పెరుగుతాయి.  సకీనా అనే అమ్మాయికి కొంత దగ్గరై, అంతలోనే దూరమైన అమర్ కాంత్ సుఖదాకి కొడుకు పుట్టిన తర్వాత ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు.

భర్త దూరమైన తర్వాత అతని ఆలోచనలని అర్ధం చేసుకోడం ఆరంభిస్తుంది సుఖదా. పట్టణంలో పేదలకి వ్యతిరేకంగా జరుగుతున్న నిర్మాణాలని అడ్డుకునే పోరాటంలో దిగి, పేదలకి మురికివాడల్లో కాక మంచి గాలీ నీరూ దొరికే స్థలంలో ఇళ్ళు ఏర్పాటు చేయాలని ఉద్యమం ఆరంభించి నాయకురాలవుతుంది. మరోపక్క శాంతికుమార్ పేదల కోసం ఒక ట్రస్టుని ఆరంభిస్తాడు. ఉద్యమం ఎంతగా పెరిగి పెద్దదవుతుందంటే, ఒకప్పుడు కొడుకు ఆలోచనల్ని పూర్తిగా వ్యతిరేకించిన సమర్ కాంత్ కోడలు మొదలు పెట్టిన ఉద్యమంలో ముందుండేంత. ధనవంతుడైన మునీరాంతో నైనాకి వివాహం జరుగుతుంది. కానీ, ఆ పెళ్ళిలో ఇమడడం నైనాకి శక్తికి మించిన పని అవుతుంది.

ఇల్లు విడిచిపెట్టిన అమర్ కాంత్ ఓ పల్లెకి చేరుకొని అక్కడి పిల్లల కోసం ఓ పాఠశాలని ఆరంభిస్తాడు. జనంతో కలిసి పని చేసే క్రమంలో వాళ్ళ సమస్యలకి మూలాన్ని తెలుసుకుంటాడు. జమీందారు, ప్రభుత్వం కలిసి భారీ మొత్తంలో శిస్తులు వసూలు చేయడం వల్లే రైతులు శ్రమకి తగ్గ ఫలితం పొందలేకపోతున్నారని గ్రహించిన అమర్, పేదలందరినీ కూడగట్టడం ఆరంభిస్తాడు. చదువు పూర్తి చేసిన సలీం అదే ప్రాంతానికి పోలీసు అధికారిగా రావడంతో, అమర్ కాంత్ ఆరంభించిన ఉద్యమాన్ని అణచివేయాల్సిన బాధ్యత సలీం మీద పడుతుంది. అటు పట్టణంలోనూ, ఇటు పల్లెలోనూ జరుగుతున్న ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తున్న లాలా సమర్ కాంత్ కుటుంబం లక్ష్యాన్ని చేరుకోగలిగిందా? అమర్-సుఖదాల కథ ఏ మలుపు తిరిగిందన్నది ముగింపు. పోలు శేషగిరి రావు అనువాదం సరళంగా ఉంది. ఆపకుండా చదివించే కథనం. (సాహితి ప్రచురణలు, పేజీలు  336, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

శుక్రవారం, మే 20, 2016

సంస్కరణల రథసారథి పి.వి.

గోరంత పని చేసి కొండంత ప్రచారం చేసుకునే రాజకీయ నాయకుల మధ్య, దేశ చరిత్రనే మలుపు తిప్పే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని, సమర్ధవంతంగా అమలుజరిపి కూడా "నేనిది చేశాను" అని ఏమాత్రం చెప్పుకోని నాయకుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. ఇవాళ మనం చూస్తున్న సాఫ్ట్వేర్ బూమ్, విదేశీ పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు, అంది పుచ్చుకుంటున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం.. వీటన్నింటి వెనుకా ఉన్నవి నూతన ఆర్ధిక సంస్కరణలు. పాతికేళ్ళ క్రితం భారతదేశం ఆర్ధిక సంస్కరణలు అమలు చేయాలనే నిర్ణయాన్ని తీసుకుని ఉండనత్తయితే ఇవాల్టి పరిస్థితి మరోవిధంగా ఉండేది.

రాజీవ్ గాంధీ హత్యానంతరం ప్రధాని పదవి చేపెట్టే నాటికి నెహ్రూ కుటుంబానికి చెందని వ్యక్తి, పైగా దక్షిణ భారత దేశానికి చెందిన వ్యక్తిగా పీవీ మీద కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యతిరేకత తక్కువది కాదు. దీనికి తోడు, పూర్తి మెజారిటీ లేని మైనారిటీ ప్రభుత్వం. అదికూడా అనేకానేక చిన్న చిన్న ప్రాంతీయ పార్టీల కలగలుపు. ఆర్ధిక పరిస్థితి పూర్తిగా అస్తవ్యస్తం. రోజువారీ ఖర్చుల కోసం బంగారం నిలవలని విదేశీ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి డబ్బు తేవాల్సిన పరిస్థితి. అంతకు ముందు కొన్నేళ్లుగా సాగిన రాజకీయ అస్థిరత కారణంగా పెట్టుబడులని ఆకర్షించే మార్గాలు ఒక్కొక్కటీ మూసుకు పోవడమే కాదు, ఎన్నారైలు భారతీయ బ్యాంకుల నుంచి డిపాజిట్లు ఉపసంహరించుకున్న సందర్భం అది.

ఈ నేపధ్యంలో, సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఆర్ధిక సంస్కరణలు ప్రవేశ పెట్టడం వినా మరో ప్రత్యామ్నాయం లేదని నమ్మి, రాగల వ్యతిరేకతని ఊహించి, ఎదుర్కోడానికి మానసికంగా సిద్ధపడి కీలక నిర్ణయాన్ని అమలుపరిచిన ప్రధాని పీవీ. నరసింహారావు ప్రధాని పదవి చేపట్టింది మొదలు, ఆర్ధిక సంస్కరణలు అమలుని పట్టాలెక్కించే వరకూ తెరవెనుక జరిగిన కథా, కమామిషు ఏమిటి? తను తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పీవీ తన టీం ని ఎలా సిద్ధం చేశారు? కీలక వ్యక్తులని ఎలా ఒప్పించారు? సంస్కరణల అమలు క్రమంలో ఎలాంటి ఒత్తిడులని ఎదుర్కొన్నారు? ఈ వివరాలన్నింటితో నాటి టీం సభ్యుడు, నేటి మాజీ మంత్రి జైరామ్ రమేష్ రాసిన పుస్తకమే 'సంస్కరణల రథసారథి పి.వి.'


జూన్ 20, 1991 న కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా పీవీ నరసింహారావు ఎన్నికయింది మొదలు, ధరల తగ్గింపు, రూపాయి విలువ తగ్గింపు, వర్తక ప్యాకేజీల ప్రకటన, బంగారం బదిలీలు, విశ్వాస పరీక్ష, నూతన పారిశ్రామిక విధానం పై చర్చ, కీలక ప్రతిపాదనలతో 1991-92 సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదన, ప్రణాళికా సంఘం పునర్వ్యవస్తీకరణ, పన్నుల సంస్కరణల ప్రకటన (ఆగస్టు 31) వరకూ జరిగిన అనేకానేక సంఘటనలని వరసక్రమంగా, వీలైనంత సులభంగా వివరిస్తూ రాసిన ఈ పుస్తకం నాటి పరిస్థితులు తెలిసిన వారికి మరింత లోతైన అవగాహనని ఇవ్వడమే కాదు, అప్పుడేం జరిగిందో ఏమాత్రం తెలియని వాళ్లకి కళ్ళకి కట్టినట్టు చూపుతుంది కూడా. సంస్కరణల ఆవశ్యకత మాత్రమే కాదు, సంస్కరణలు ప్రవేశ పెట్టక తప్పని పరిస్థితులు రాడానికి కారణాలని కూడా సులభంగా అర్ధం చేసుకోడానికి ఉపయోగ పడే పుస్తకం ఇది.

రాజీవ్ హత్య అనంతరం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై సోనియా గాంధీని కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం, ఆమె పదవిని తిరస్కరించడంతో పీవీని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం మొదలు, ఆ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, పీవీ ప్రధాని కావడం, పదవి చేపడుతూనే దిగజారుతున్న ఆర్ధిక పరిస్థితిపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఆర్ధికవేత్త మన్మోహన్ సింగ్ ని పిలిచి ఆర్ధిక మంత్రిని చేయడం వంటి సంఘటనలు మొదలుగా, ఆర్ధిక సంస్కరణలు ప్రవేశ పెట్టడానికి దారితీసిన పరిస్థితులు, ప్రవేశ పెట్టడంలో జరిగిన తడబాట్లు, రాజకీయ పార్టీల స్పందనలు, పారిశ్రామికవేత్తల నుంచి వచ్చిన స్పందన, పత్రికల్లో జరిగిన చర్చలు.. ఇలా ఒక్కో విషయాన్నీ వివరంగా చెప్పుకుంటూ వెళ్ళారు జైరామ్.

అప్పటివరకూ ప్రధాని కార్యాలయం (పీఎంవో) లో పని చేస్తున్న తనని ఉన్నట్టుండి అక్కడి నుంచి తప్పించడం లాంటి విషయాలని చెబుతూ నాటి పీఎంవో నీ పరిచయం చేశారు. పీవీ-మన్మోహన్ ల ఆలోచనల మధ్య అంతరం, మన్మోహన్ కేవలం ఆర్ధిక అంశాలని మాత్రమే దృష్టిలో ఉంచుకుని చేసిన ప్రకటనల వల్ల రాజకీయంగా ఎదురైన ఇబ్బందులు, పార్టీలోనూ, అధికార గణం లోనూ పీవీ వ్యతిరేక శిబిరాలు, తత్ఫలితంగా కలిగిన తలనొప్పులు..ఇవన్నీ జైరామ్ మాత్రమే రాయగలిగిన విషయాలు అనిపిస్తుంది పుస్తకం చదువుతుంటే. మొత్తం పుస్తకాన్ని ఇరవై అధ్యాయాలుగా విభజించడంతో పాటు,  అరుదైన నోట్సునీ నాటి కీలక మీడియా క్లిప్పింగులనీ అనుబంధంగా చేర్చారు. ఎ. కృష్ణారావు అనువాదం సరళంగా ఉంది. అచ్చుతప్పుల విషయంలో జాగ్రత్త పడాల్సింది. రాజకీయ, ఆర్ధిక అంశాలపై ఆసక్తి ఉన్న వాళ్ళు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. (ఎమెస్కో ప్రచురణ, పేజీలు  235, వెల రూ. 150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

మంగళవారం, మే 10, 2016

వాడు -2

(మొదటి భాగం తర్వాత)

వసుధ చెప్పిన కథ:

"ఏ ముహూర్తాన మీ నాన్న వసుధ అని పేరు పెట్టారో కానీ, నిజంగానే భూదేవికున్నంత ఓర్పే తల్లీనీకు.." అమ్మ ఉన్నన్నాళ్ళూ ఈమాట ఎన్నిసార్లు విన్నానో లెక్కేలేదు. నాతో అనడమే కాదు, అందరితోనూ ఇదే మాట చెబుతూ ఉండేది. ఏమాటకామాట, తనకి సహనం బాగా తక్కువ. నాన్న సర్దుకుపోయేవారు.. అలాగే నేనూను. అక్కకి మాత్రం అమ్మ పోలికే. అందుకేనేమో, వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఎందుకో అందుకు గొడవ పడుతూనే ఉండేవారు.

అమ్మ వల్ల కొంత, మొదట్లో తరచూ బావగారితో గొడవలు పడి పుట్టింటికి వచ్చేసే అక్కని చూశాక మరికొంత, భార్య ఎలా ఉండాలి అన్న విషయంలో నాకంటూ కొన్ని ఆలోచనలు స్థిరపడ్డాయి నా పెళ్లి నాటికే. నన్ను కట్టుకున్న వాడికి పిల్లిని పులిగా మార్చే ప్రతిభ పుష్కలంగా ఉందని తెలుసుకోడానికి ఎక్కువ సమయం పట్టలేదు.

అక్క కాపురం ఓ కొలిక్కి వచ్చిందని ఊపిరి పీల్చుకుంటున్న అమ్మా నాన్నలకి నా విషయాలు చెప్పి బాధ పెట్టదలచుకోలేదు. అదీకాక, అప్పటికే వాళ్ళిద్దరి ఆరోగ్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అక్కతో నా సంగతులు పంచుకోవడం ఇష్టంగా అనిపించేదికాదు.

వసంత్ తో నా పెళ్లి నిశ్చయమయినప్పుడు "ఇద్దరి పేర్లూ భలేగా కలిశాయే.." అన్నారు నా స్నేహితురాళ్ళు. పైకి చెప్పకపోయినా మనసులో నేనూ అదే మాట అనుకున్నాను. కాపురం సజావుగా సాగడానికి పేర్లొక్కటీ కలిస్తే చాలదని తెలీదుకదా అప్పట్లో. నన్ను భార్యగా కాదు కదా, కనీసం మనిషిగా కూడా చూడని వాడితో ఎనిమిదేళ్ళు కాపురం చేశాను.

చదువు లేక కాదు.. ఆర్ధిక స్వతంత్రం లేక అంతకన్నా కాదు.. కాపురాన్ని నిలబెట్టుకోవాలన్న పట్టుదల, అమ్మానాన్నలని బాధ పెట్టకూడదన్న ఆలోచన, నా ఇంటి విషయాలు నాలుగ్గోడలు దాటి బయటికి వెళ్ళకూడదన్న తపన.. ఇవన్నీ నన్ను వసంత్ తో కలిసి ఉండేలా చేశాయి.

ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు కూడా అన్నేళ్ళు వసంత్ ని భరించినందుకు నాకెలాంటి పశ్చాత్తాపమూ కలగదు. ఇప్పుడు జరగాల్సిన విడాకులు కూడా వీలైనంత ప్రశాంతంగా జరిగిపోవాలని నా కోరిక. అందుకే, వసంత్ పెట్టే కండిషన్స్ ని వ్యతిరేకించడంలేదు నేను. అక్క, నా లాయర్ ఫ్రెండ్ శాంతి ఇద్దరూ కూడా నన్ను కేకలేస్తున్నారు - స్త్రీగా నా హక్కులని నేను వినియోగించుకోవడం లేదని. కానీ, నా దృష్టిలో ఈ కర్మకాండ హక్కులకి సంబంధించింది కాదు.

పెళ్ళయ్యి ఏడాది తిరక్కుండానే తొలిచూలు. పుట్టింటికి పంపడానికి ససేమిరా అన్నాడు వసంత్. అమ్మకీ, నాన్నకీ నేనే సర్ది చెప్పుకున్నాను. ఏమనుకున్నారో తెలీదు కానీ,  డాక్టర్ ఇచ్చిన డేట్ నాటికి వాళ్ళే నా దగ్గరికి వస్తామని చెప్పారు. నెల ముందుగానే ప్రిమెచ్యూర్ డెలివరీ. పురిట్లోనే మగబిడ్డని పోగొట్టుకున్న దుఃఖం. అంతకు మించి, ఆ సమయంలో వసంత్ ప్రవర్తన నన్నెంత కుంగదీసిందో చెప్పలేను. అతని ధోరణిని సరిపెట్టుకోడానికి ఎప్పటికప్పుడు నాతో నేను పెద్ద యుద్ధమే చెయ్యాల్సి వచ్చింది.

కొంత కాలానికి, ఉన్నట్టుండి నాన్న కన్నుమూశారు. అమ్మకన్నా, అక్క కన్నా నాకు నాన్నే దగ్గర. ఎప్పుడూ గంటల తరబడి ఆయనతో మాట్లాడింది లేదు. కానీ, ఆయన నా చేతిని తన చేతిలోకి తీసుకున్నా, నా భుజం మీద చేయి వేసినా నాతో మాట్లాడుతున్నట్టూ, ధైర్యం ఇస్తున్నట్టూ ఉండేది. అలాంటిది ఆయన దూరమయ్యేసరికి ఏకాకిని అయిపోయిన భావన.

నిజానికి వసంత్ కీ నాకూ మానసికమైన దగ్గరతనం ఏనాడూ లేదు. కానీ, ఆ సమయంలో వసంత్ తో కూడా దూరం పెరుతోన్నట్టు అనిపించింది. చెప్పలేనంత నిస్సత్తువ. అభద్రత తాలూకు నిస్సత్తువ. వసంత్ తో కలిసి మిగిలిన జీవితం గడపాలంటే మా ఇద్దరి మధ్యా ఓ బంధం ఉండాలనిపించింది. బిడ్డని కనడం కోసం సిన్సియర్ గా ప్రయత్నాలు మొదలు పెట్టాను.

ఈసారి ఆరో నెల వస్తూనే అమ్మని నా దగ్గరికి తీసుకొచ్చేశాను, వసంత్ అయిష్టాన్ని పట్టించుకోకుండా. తనూ ఊరుకోలేదు, తనేమిటో అమ్మకి చూపించాడు. ఆడపిల్ల పుట్టేనాటికి నా కాపురం తాలూకు నిజ రూపం అమ్మకి పూర్తిగా అర్ధమయ్యింది. వసంత్ ఇష్టానికి విరుద్ధంగా అమ్మని తీసుకురావడాన్ని నా విజయం అనుకున్నట్టున్నాను, పాపకి విద్య అని పేరు పెడదాం అన్నాను. చిన్నప్పటి నుంచీ ఆ పేరంటే నాకు చాలా ఇష్టం.

"బీ టెక్ సెకండియర్లో నేను లాడ్జికి తీసుకెళ్ళిన గర్ల్ ఫ్రెండ్ పేరు విద్య.. నా కూతురికి ఆ పేరెలా పెడతాను చెప్పు?" అని నవ్వుతూ అడిగి, "పాప పుట్టగానే పేరు పెట్టేశాను.. నవ్య" అన్నాడు, నా జవాబు కోసం చూడకుండా.

అక్కకి యాక్సిడెంట్ అయిందని ఫోన్ రావడంతో, అమ్మని నేనే బలవంతంగా అక్క దగ్గరికి పంపాను, పిల్లలతో బావగారొక్కరూ ఇబ్బంది పడతారని. రోజులు గడిచే కొద్దీ వసంత్ ని భరించడం నా శక్తికి మించిన పని అయిపోయేది. పంటి బిగువున రోజులు లాక్కొచ్చేదాన్ని. ఎందుకో అందుకు నన్ను కవ్వించి, కయ్యానికి కాలు దువ్వాలని ప్రతి పూటా ప్రయత్నాలు చేసేవాడు. ఇల్లు, ఆఫీసు, పిల్ల.. ఈ మూడింటి తర్వాత ఇక నాకు శక్తి మిగిలేది కాదు.

తనని కూర్చోబెట్టి మాట్లాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. నేను చెప్పేదంతా శ్రద్ధగా వినేవాడు. మర్నాటి నుంచీ నా మాటల్ని వ్యంగ్యంగా గుర్తు చేసేవాడు. తెగేదాకా లాగుతున్నాడనీ, తనకి కావాల్సింది తెగడమేననీ అర్ధమయిపోయింది.

ఉన్నట్టుండి అక్క దగ్గర నుంచీ ఫోన్. ఉరుము లేని పిడుగులాంటి వార్త. అమ్మ ఇక లేదని అర్ధం అవ్వడానికి కొంత సమయం పట్టింది నాకు. కార్యక్రమాలన్నీ అయ్యాక అక్క నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని చాలాసేపు మాట్లాడింది. చివర్రోజుల్లో అమ్మ నాకోసమే బెంగ పెట్టుకుందిట. తను ప్రత్యక్షంగా చూసిన సంగతులన్నీ అక్కకి పూస గుచ్చినట్టు చెప్పింది అమ్మ.

"అమ్మానాన్నా లేరని అధైర్య పడకు వసుధా.. నీకు నేనున్నాను.. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సపోర్ట్ చేస్తాను" అని మరీ మరీ చెప్పి పంపింది అక్క. 

అక్కడినుంచి వచ్చిన కొద్ది రోజులకే నేను నిర్ణయం తీసేసుకోవాల్సి వచ్చింది. అక్క తనిచ్చిన మాట తప్పలేదు. లీగల్ సపోర్ట్ కోసం నా ఫ్రెండ్ శాంతిని కలిశాను. గోపాల్ ని మొదటిసారిగా చూసింది అక్కడే. ఒక మగవాడు డైవోర్స్ కేసు ఫైల్ చేయడానికి లేడీ లాయర్ ని ఎంచుకోడం, అందుకు మా శాంతి ఒప్పుకోవడం కొంచం ఆశ్చర్యం అనిపించినా, శాంతితో ఆ విషయం మాట్లాడే సందర్భం కాదది. వసంత్ అనే పెద్ద చిక్కు లోనుంచి బయట పడాలి ముందు.

శాంతి అసిస్టెంట్ చేసిన పొరపాటు వల్ల గోపాల్ ఫైల్ ని ఇంటికి తెచ్చుకున్నాను ఒకరోజు. చదవడం మొదలు పెట్టగానే తెలిసిపోయింది, అది నా కేసుకి సంబంధించింది కాదని. కానీ, ఆసక్తిగా అనిపించడంతో తప్పని తెలిసీ పూర్తిగా చదివేశాను. నాన్ననీ, బావగారినీ చూసిన నేను కేవలం వసంత్ కారణంగా మగవాళ్ళ మీద నమ్మకం కోల్పోయాను అని చెప్పను. కానీ, గోపాల్ కేసు చదివాక అతని లాంటి వాళ్ళు కూడా ఉంటారా అన్న ఆశ్చర్యం కలిగింది.

మర్నాడు శాంతి ఆఫీసులో తెలిసింది, మా ఇద్దరి ఫైల్స్ తారుమారు అయ్యాయని. అంటే, నా కేసు మొత్తం అతనికి తెలుసన్నమాట. నాకన్నా అతనే ఎక్కువ ఇబ్బంది పడ్డాడు. నేనే పలకరించి మాట్లాడాను, మామూలు విషయాలు. తర్వాత ఉండబట్టలేక శాంతిని అడిగేశాను గోపాల్ విషయం. తను మరికొన్ని వివరాలు చెప్పింది. గోపాల్, నేనూ ఒకే పడవలో ప్రయాణిస్తున్నామని అర్ధమయ్యింది. 

గోపాల్ కి సిద్దూ కావాలి, కానీ పొందలేడు. వసంత్ కి నవ్య అక్కర్లేదు. "ఎక్కడున్నా నా కూతురే" అనేశాడు. అలా చూస్తే, గోపాల్ కన్నా నా పరిస్థితే మెరుగ్గా ఉంది. ఓ పక్క మా కేసులు ఓ కొలిక్కి వస్తుండగానే మా పరిచయం స్నేహంగా మారింది. అతను పది మాటలు మాట్లాడితే అందులో కనీసం నాలుగు సిద్దూ గురించి అయి ఉంటాయి.

మొదట్లో అతను సిద్దూ ప్రస్తావన తెచ్చినప్పుడల్లా నేను పోగొట్టుకున్న బిడ్డ జ్ఞాపకం వచ్చి బాధ కలిగేది. మరికొన్నాళ్ళు వసంత్ నవ్యని ఎలా చూసేవాడో గుర్తొచ్చేది. ఇప్పుడిప్పుడు, అతనికి అందని పండైన బిడ్డ సాంగత్యం, నాకు మాత్రం అందుతోంది కదా అన్న ఆలోచన వస్తోంది. మనకిష్టమైన వాళ్ళు ఆకలితో ఉంటూ ఉండగా, మనం పంచ భక్ష్య పరమాన్నపు విస్తరి ముందు కూర్చోడం లాంటి పరిస్థితి ఇది.

అవును, గోపాల్ ని నేను ఇష్ట పడుతున్నాను. అతనితో జీవితాన్ని పంచుకునే అవకాశాన్ని వదులుకోను. అతన్ని సంతోష పెట్టడానికి ఏం చేయడానికైనా నేను సిద్ధమే.. కానీ, అదంత సులభమేనా?

గోపాల్ సంతోషం సిద్దూతో ముడిపడి ఉందని నాకు బాగా తెలుసు. వాడు ఎదురుగా ఉంటే అతనికి ఇంకేమీ అక్కర్లేదు. బహుశా నేను కూడా అవసరం లేదేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి  గోపాల్ ని చూస్తే. వాడిని తెచ్చివ్వడమో, గోపాల్ ని మరిపించడమో నావల్ల అయ్యే పనేనా? బాబూ సిద్దూ..ఎలా సంపాదించనురా నిన్ను? నా కడుపున ఎందుకు పుట్టలేదురా సి..ద్దూ..

(అయిపోయింది)

సోమవారం, మే 09, 2016

వాడు -1

గోపాల్ చెప్పిన కథ:

నాకు జ్ఞానం తెలిసినప్పటి నుంచీ చాలా తరచుగా అనుకున్నది ఒక్కటే.. నేను నాన్ననయ్యాక మా నాన్నలాగా ఉండకూడదు అని. కానీ, ఇవాళ నేనున్న పరిస్థితి నుంచి చూస్తుంటే నాన్న నాకు చాలా ఉన్నతంగా కనిపిస్తున్నాడు. ఆయన నాకు చేసిన మంచిలో కనీసం ఒక వంతన్నా సిద్దూకి చెయ్యగలనా నేను? రేపు పెద్దయ్యాక వాడికి నన్ను హత్య చేయాలన్నంత ద్వేషం కలిగినా ఆశ్చర్యపోను.

జన్మనివ్వడం కాక, వాడికోసం నేనిప్పటివరకూ చేసిన మరో పని వాళ్ళమ్మకి విడాకులు ఇవ్వడం.

అసహ్యించుకునేందుకైనా వాడికి ఒక తండ్రి అంటూ మిగలాలన్న బలమైన ఆలోచన లేకపోతే దివ్యని ఏదో విధంగా భరించేసే వాడినేమో. ఉహు, ఒక్కోసారి ఇలా అనుకుంటూ ఉంటాను కానీ, నా సహనానికి ఆమె ఎంతటి పరిక్షలు పెట్టగలదో గుర్తొచ్చినప్పుడల్లా ఆ బంధానికి విడాకులు తప్ప మరో ముగింపు లేదనే నమ్మకం బలపడుతూ ఉంటుంది. ఎప్పటికైనా జరగాల్సిన దాన్ని ఇప్పుడే చేశాను నేను. అది కూడా సిద్దూ కోసమే..

వాడికి పూర్తిగా ఊహ తెలియక మునుపే మేమిద్దరం ఆ బంధం నుంచి బయట పడడమే మంచిదనిపించింది. ఆ బంధం దివ్యకి బంధనమే అయినా, సవాలక్ష ఆంక్షలు పెట్టి మరీ  సంతకం చేసింది డైవోర్స్ పేపర్ల మీద. మూడేళ్లకి పైబడి జరిగిన అనేకానేక గొడవల తర్వాత పేపర్ల ఫైలింగ్ అయ్యింది. మరో ఆర్నెల్లలో బంధ విముక్తులం అవుతాం నేనూ దివ్యా కూడా.

దివ్య నుంచి దూరం జరగడం కోసం సిద్దూని పణంగా పెట్టాల్సి రావడం ఒక్కటే నేను భరించలేక పోతున్న విషయం. "పిల్లల సంరక్షణ బాధ్యత తల్లికే వెళ్తుంది" అని లాయరూ, "వాణ్ణి మాత్రం నీకివ్వను. నిన్ను సుఖపడనిస్తానని ఎలా అనుకుంటున్నావు?" అని దివ్యా ఒక్క మాటలో సిద్దూ మీద నాకు ఎలాంటి ఆశా లేకుండా చేసేశారు.

నాకు నాలుగేళ్ల వయసప్పుడు ఆడుకోడానికి పక్కింటికి వెళ్లానన్న కారణానికి, ఓ మధ్యాహ్నం వేళ సన్న బెత్తంతో నాన్న నన్ను వాతలు తేలేలా కొట్టడం నాకు బాగా గుర్తుండిపోయిన తొలి బాల్య జ్ఞాపకం. ఎన్నేళ్ళు గడిచినా మనసులో ఆ గాయం పచ్చిగానే ఉంటుంది. సిద్దూకిప్పుడు నాలుగేళ్ళు. వాడేం చేసినా కొట్టడం కాదు కదా, కనీసం కసురుకోను నేను. కానీ, వాడు నాదగ్గర లేడు.. రాడు..

పెళ్ళైన మొదటి ఆరునెలలు నిజంగానే హనీమూన్ పీరియడ్. ఆ రోజులెలా గడిచిపోయాయో తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యమే. దివ్యది తనమాటే నెగ్గాలనే తత్త్వం. పట్టూ, విడుపూ బాగా తక్కువని మొదట్లోనే అర్ధమయ్యింది. 'విజాతి ధ్రువాలు ఆకర్షించుకొనును' అన్న అయస్కాంత సూత్రాన్ని జ్ఞాపకం చేసుకుని, భవిష్యత్తు బాగుంటుందని ఆశ పడ్డాను.

కన్సీవ్ అయినట్టు తెలిసిన తర్వాత తన ప్రవర్తన యు టర్న్ తీసుకుంది. వంటగదిలో ఉన్న గాజు కప్పుల సెట్ నేలకేసి కొట్టి, తను ఏడుస్తూ పడుకున్న రోజున, ఎందుకై ఉంటుందా అని ఆలోచించాను. ఆశ్చర్యం.. తను చెప్పిన కారణం చాలా చిన్నది. ఇలాంటివి మరికొన్ని జరిగాక డాక్టర్ని కలిశాను.

"మొదటిసారి కదా.. కొందరిలో యాంగ్జయిటీ ఉంటుంది.. మీరు కొంచం సర్దుకోవాలి.. అవసరం అయితే కౌన్సిలింగ్ కి రికమెండ్ చేస్తాను.. ఓపిక పట్టండి.." డాక్టర్తో మాట్లాడిన విషయం దివ్యకి చెప్పలేదు. కానీ, ఆమె ప్రవర్తన రోజురోజుకీ ఊహాతీతంగా మారిపోతోంది. ఏ క్షణంలో ఎలా ఉంటుందో బొత్తిగా తెలియడం లేదు.

"కౌన్సిలింగ్ కి వెళ్దాం" అని నేనన్నరోజున ఆమె చేసిన గొడవకి, మా ఫ్లోర్ లో నేను తలెత్తుకుని తిరగడానికి వారం రోజులు పట్టింది. సిద్దూ పుట్టాక మా ఇద్దరి మధ్యా దూరం మరింత పెరిగింది.

"నాకు మొదటినుంచీ నువ్వంటే అసహ్యం.. కేవలం మా వాళ్ళకోసం చేసుకున్నానీ పెళ్లి.." తండ్రయ్యానన్న ఆనందాన్ని ఆవిరి చేసేశాయీ మాటలు. పెద్దవాళ్ళ జోక్యం వల్ల మా బంధం అతుక్కోకపోగా మరింత బలహీన పడింది. తలనెరిసిన ప్రతి 'పెద్దమనిషి' ముందూ తలవంచుకుని వివరణలు ఇచ్చుకోడం ఎంత టార్చర్ అసలు.
ఆమెని పెళ్లి చేసుకోడమే తప్పయితే, అంతకు వెయ్యి రెట్లు మూల్యం చెల్లించాను, మనశ్శాంతి రూపంలో.

ఈ గొడవల్లో నాకు దక్కిన ఒకే ఒక్క ఓదార్పు సిద్దూ ఆటపాటలు. నా జుట్టు, ముక్కు, చెవులు.. ఇవన్నీ ఆటవస్తువులే వాడికి. అచ్చం వాడిలాంటి వాణ్ణి చూసే గుఱ్ఱం జాషువా గారు "బొటవ్రేల ముల్లోకములు చూచి లోలోన నానందపడు నోరు లేని యోగి.." అంటూ 'శిశువు' ఖండిక రాశారేమో అనిపించేది.

రాత్రుళ్ళు నాతో ఆడి ఆడి అలిసిపోయి నన్నతుక్కుని నిద్రపోయేవాడు. ఏ అర్ధరాత్రి వేళో పొట్ట దగ్గర చల్లగా తగలడంతో నాకు మెలకువ వచ్చేది. వాడి డైపర్ మార్చి, పాల సీసా నోటికిస్తే నిద్రలోనే లొట్టలేస్తూ తాగి, నిద్రపోయేవాడు. ప్రశాంతంగా ఉన్న వాడి ముఖం ఎంత సంతోషాన్ని కలిగించేదో, ఆ పక్కనే పడుకున్న దివ్య ముఖంలో అశాంతి అంతకు వందరెట్లు సందేహాలని మిగిల్చేది.

నా రెండు చూపుడు వేళ్ళనీ తన గుప్పెళ్ళలో బిగించి నా పొట్టమీంచి గుండెలవరకూ సిద్దూ అడుగులేసిన రోజు నాకు ప్రపంచాన్ని జయించినట్టనిపించింది. అదే క్షణంలో దివ్య కళ్ళలో కనిపించిన ఎరుపు ఏదో జరగబోతోందన్న సంకేతాన్నిచ్చింది. రానురానూ గొడవలు పెట్టుకోవడం దివ్యకి వెన్నతో పెట్టిన విద్యయిపోయింది. నేనెటూ సమాధానం చెప్పడం లేదు కాబట్టి, గొడవలకి కారణాలు వెతుక్కునే పని కూడా లేదు. నా వాళ్ళంతా ఇంటికి రావడం తగ్గించేశారు. తనవాళ్ళు కొంచం తరచూ వచ్చి వెళ్తున్నారు.

దివ్య అరుపుల్నీ, ఏడుపుల్నీ చూసి సిద్ధూ భయంతో నన్ను కరుచుకుపోయే క్షణాల్లో గుండె నీరయి పోయేది. సిద్దూ మూడో పుట్టినరోజు అవుతూనే వాణ్ణి తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది దివ్య. అప్పటినుంచి విడాకుల కోసం తను, కలిసి ఉండడం కోసం నేనూ ప్రయత్నాలు ముమ్మరం చేశాం.

"నువ్వు నన్ను బలవంతంగా రప్పించుకుంటే, విషం పెట్టి చంపేస్తాన్నిన్ను. అది నాకు పెద్ద పని కాదని నీకు బాగా తెలుసు" ఈ ఫోన్ కాల్ తో దివ్య విజయం సాధించింది.

"డైవోర్స్ వచ్చాక, కోర్ట్ మీకు విజిటింగ్ రైట్స్ ఇస్తుంది. పిల్లవాణ్ణి మీరు చూసి వస్తూ ఉండొచ్చు.." అని లాయర్ చెప్పినా, కోర్టుని దివ్య ఎంత వరకూ గౌరవిస్తుందన్న ప్రశ్న నన్ను వేధిస్తూనే ఉంది. మొదట్లో ఏమీ తెలియకపోయినా దివ్య ప్రవర్తనకి కారణాలు నెమ్మది నెమ్మదిగా నాకు తెలుస్తూ వచ్చాయి. కానీ, వాటిని ఎవరితోనూ పంచుకునే ఆలోచన లేదు నాకు.

ఆమె కారణంగా నాకు మొత్తం ఆడవాళ్ళ మీదే నమ్మకం పోయి ఉండేదేమో, వసుధ పరిచయం అయి ఉండకపోతే. ఏడాది క్రితం లాయర్ ఆఫీసులో మొదటిసారి చూశానామెని. భర్త నుంచి విడాకుల కోసం లాయర్ దగ్గరికి వచ్చింది. విడాకులు ఇవ్వడానికి ఆమె భర్త సిద్ధంగా లేడు. గొడవలేవీ లేకుండా, వీలైనంత నిశ్శబ్దంగా విడాకులు జరిగిపోవాలని ఆమె కోరిక. మా ఇద్దరి లాయర్ అపాయింట్మెంట్లు ఒకే టైంలో వచ్చేవి. తనకో పాప నవ్య, సిద్దూ ఈడుదే. పాపని తీసుకుని ఆమె ఒక్కర్తే వచ్చేది ప్రతిసారీ.

అదే టైం లో లాయర్ ఆఫీసు వాళ్ళు చేసిన ఓ పొరపాటు మేమిద్దరం మరికొంచం దగ్గరవ్వడానికి కారణం అయ్యింది. ముఖ పరిచయం పెరిగి పెద్దదై కలిసి కాఫీకి వెళ్ళడం వరకూ వచ్చింది. నెమ్మదిగా రోజూ ఫోన్ కాల్స్ చేసుకోడం నుంచి అప్పుడప్పుడు కలిసి లంచ్ చేయడం వరకూ వచ్చిందిప్పుడు. మరో ఆరు నెలల్లో తనకి కూడా డైవోర్స్ వచ్చేస్తుంది.

తగిలిన దెబ్బలు మమ్మల్నిద్దర్నీ కూడా బయటికి మాట్లాడనివ్వడం లేదు కానీ, ఇద్దరం కలిసి జీవితం ప్రారంభిస్తే బాగుంటుందన్న ఆలోచన ఇద్దరికీ చాలాసార్లే వచ్చింది. మా జీవితాల్లో ఒకసారి జరిగిన  పొరపాటు ఇద్దరినీ కూడా మరింత జాగ్రత్తపరులుగా చేసినట్టుంది. తెలియకుండానే ఒకరినొకరం బాగా పరిక్షించుకున్నాం ఇన్నాళ్ళుగా.

అయితే, వసుధని నా జీవితంలోకి ఆహ్వానించేందుకు నేను మనస్పూర్తిగా సిద్ధం కాలేకపోతున్నాను. కారణం నా వరకూ చాలా పెద్దదే. నేను చెప్పే కబుర్లన్నీ చాలా శ్రద్ధగా వింటుంది వసుధ. దివ్య ప్రస్తావన ఎప్పుడో తప్ప రాదు. ఇంటి విషయాలు, ఆఫీసు సంగతులు, నా స్నేహితులు, బంధువులు.. ఇలా ఎన్నో కబుర్లు దొర్లుతూ ఉంటాయి. నాతో సమంగా మాట్లాడుతుంది తను కూడా. కానీ, నా నోటినుంచి సిద్దూ పేరు వినపడగానే తను మూగైపోతుంది. మరుక్షణంలో ఏదో అప్రస్తుత విషయాన్ని అత్యవసరంగా చర్చకి పెడుతుంది.

నేను కొంచం ఆలస్యంగా గమనించానీ విషయాన్ని. గమనించాక చాలాసార్లు సిద్దూ ప్రస్తావన తెచ్చి చూశాను. తను ఏమాత్రం స్పందించదు. నవ్య సంగతులేమున్నా నేను చాలా మామూలుగా మాట్లాడతాను. దివ్య విషయాల ప్రస్తావన కూడా తనకేమీ ఇబ్బంది కాదు. కా..నీ, సిద్దూ అంటే ఆమెకి ఎందుకింత అయిష్టత? ఇది చాలా పెద్ద ప్రశ్న అయిపోయింది నాకు.

ఇప్పటికే దివ్య కారణంగా సిద్దూకి దూరమైన నేను, వసుధ వల్ల వాణ్ణి పూర్తిగా నా మనసులోనుంచి తుడిచేయాలా? నేనాపని చేయగలనా? వాడి ప్రస్తావన తెచ్చి వసుధతో కూడా గొడవలు పడాలా? అంత ఓపిక మిగిలి ఉందా నాలో?? ఒకవేళ నేను పొరబడుతున్నానేమో అన్న ఆలోచన ఏమూలో ఉంది నాకు. కానీ, నాది పొరపాటేననీ, ఈ విషయంలో వసుధని అపార్ధం చేసుకున్నాననీ నమ్మకం కలిగే వరకూ అడుగు ముందుకు వెయ్యలేను.

ఒక పెళ్ళికి చెల్లించిన మూల్యం ఎంతో నేను మర్చిపోలేదు. తెలిసి తెలిసీ మరో సారి, మరో మూల్యం.. అది కూడా నాకు ప్రియమైన వాణ్ణి .. సిద్దూ.. సిద్దూ.. నాకు నువ్వు కావాల్రా కన్నా.. నీకూ నాకూ మధ్య ఇప్పటికి ఉన్న అడ్డంకులు చాలు నాన్నా.. ఇంకా కొత్తవి తెచ్చి పెట్టాలని లేదురా  సి..ద్దూ...

(ఇంకా ఉంది)

ఆదివారం, మే 01, 2016

ఓ పుస్తకాల షాపు ...

బెజవాడతో ఎన్నేళ్ళ అనుబంధం ఉందో ఇంచుమించుగా అన్నేళ్ళూ 'నవోదయ' తో అనుబంధం ఉంది నాకు. జంగమాన్నై ఊళ్లు తిరిగే క్రమంలో బెజవాడ చేరగానే మొదట చేసిన పని ఇల్లు వెతుక్కుని చేరడం అయితే, రెండో పని ఏలూరు రోడ్డులో ఉన్న పుస్తకాల షాపులన్నింటినీ పలకరించి రావడం. మిగిలిన షాపులు నాకు కొత్త కానీ, వాటి మధ్యలో ఉన్న 'నవోదయ' మాత్రం చిరపరిచతమే. కళ్ళతో చూడడం అదే మొదటిసారి అయినా, ఆ షాపుని గురించి ఎంతో మంది రచయితల మాటల్లో చదివి ఉన్నాను అప్పటికే.

షాపులోకి అడుగు పెట్టగానే ఎదురుగా కనిపించేవి బాపూ గీసిన బొమ్మలూ, బాపూ రమణల పుస్తకాలూను. వాటి మధ్యలో టేబిల్ వెనుక కుర్చీలో కూర్చున్న గంభీరమైన విగ్రహం - "అసలీయన నవ్వగా ఎవరైనా చూసి ఉంటారా? అని సందేహం కలిగేలా - ఆయనే 'నవోదయ' రామమోహన రావు. రచయితలకి మాత్రమే కాదు, తెలుగు పాఠకులకి కూడా ఆ పేరు ఒక భరోసా. ఎక్కడా దొరకని  పుస్తకం అయినా సరే, రామమోహనరావు గారికో మాట చెబితే ఏదోరకంగా దొరికేస్తుందన్న నమ్మకం.

'నవోదయ' కి అటూ ఇటూ ఉండే పుస్తకాల షాపుల వాళ్ళతో బాగా స్నేహం కుదరడం వల్ల నా కొనుగోళ్ళు 'నవోదయ' లో తక్కువ. నా బుక్ సెల్లర్ స్నేహితులు మాత్రం, నేనడిగిన పుస్తకం వాళ్ళ దగ్గర లేకపోతే కుర్రాడిని నవోదయకి పంపి తెప్పించి ఇచ్చేవాళ్ళు. 'నవోదయ' ప్రచురణలు, శ్రీరమణ పుస్తకాలు మాత్రం నవోదయలోనే తీసుకునే వాణ్ణి. ఆ షాపులో గడిపినంత సేపూ అక్కడికి వచ్చి వెళ్ళిన మహామహులైన రచయితలందరూ గుర్తొచ్చి వాళ్ళు తిరిగిన చోటు అన్న భావన చెప్పలేని సంతోషాన్ని ఇచ్చేది. ఎందుకో తెలీదు కానీ, రామమోహనరావు గారిని పలకరించి మాట్లాడాలని ఎప్పుడూ అనిపించలేదు.


విజయవాడ ప్రచురణ కర్తలు, బుక్ సెల్లర్స్ అందరూ కలిసి 'నవోదయ' రామమోహనరావుగారి షష్టిపూర్తిని పండుగలాగా జరిపారు. బెజవాడ పుస్తక ప్రపంచంలో రామమోహనరావు ఎంత ప్రత్యేకమైన వ్యక్తో ప్రత్యక్షంగా చూసిన సందర్భం అది. ఆ సమయంలోనే రచయిత్రి సి. సుజాత 'ఆంధ్రజ్యోతి' లో ఒక వ్యాసం రాశారు, 'నవోదయ' తో తన అనుబంధాన్ని గురించి. ఆమె తన నవల 'సుప్తభుజంగాలు' రాసిన సందర్భం, దానిని రామమోహనరావు గారు ప్రచురించిన వైనం చదివినప్పుడు ఆ నవల చదవాలనిపించింది. షాపులో రామమోహనరావు గారు లేరు. కుర్రాళ్ళు ఆ పుస్తకం లేదనేశారు.

కొన్నాళ్ళకి విజయవాడ పుస్తకాల పండగ వచ్చింది. 'నవోదయ' స్టాల్లో ఉన్నారాయన. నేను వెళ్లి పుస్తకం అడిగాను కుర్రాడిని. 'సప్తభుజంగాలా? ఆ పేరుతో పుస్తకం లేదండీ' అనేశాడు. రామోహనరావుగారు ఆ కుర్రాడికి అరచెయ్యి చూపించారు. కౌంటర్ నుంచి లేచి వెళ్లి, ర్యాకుల్లో వెతికి వెతికి కొంచం పాతగా ఉన్న పుస్తకం కాపీని నాకు అందిస్తూ 'సుప్తభుజంగాలు' అని చెప్పారు కుర్రాడికి. పుస్తకం మీద ఆయనకున్న ప్రేమని, శ్రద్దనీ ప్రత్యక్షంగా చూసిన సందర్భం అది. బ్లాగుల్లోకి వచ్చాక, అమెరికాలో ఉండే తెలుగు సాహిత్యాభిమానులకోసం ఆయన శ్రమ తీసుకుని పుస్తకాలు పంపిన సంగతులెన్నో తెలిశాయి. అలాంటి వ్యక్తి వ్యాపారాన్ని నిర్వహించలేక షాపుని శాశ్వతంగా మూసేయడమా?

యాభై తొమ్మిదేళ్ళ 'నవోదయ' మూతబడిందన్న వార్త ని నమ్మడానికి సమయం పట్టింది. మిత్రులకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాక, ఆ వార్త అబద్ధమవుతుందన్న ఆశ అడుగంటింది. ఆర్ధిక నిర్వహణలో ఇబ్బందులు, ఈ-బుక్స్ నుంచి వస్తున్న పోటీ, పైరేటెడ్ పీడీఎఫ్ ల పీడ... ఇలా తరచి చూస్తే ఎన్నో కారణాలు. ఎప్పుడన్నా బెజవాడ వెళ్ళినా ఏలూరు రోడ్డులో 'నవోదయ' కనిపించదు అన్న ఊహే కష్టంగా ఉంది. "ఆ పుస్తకం దొరకట్లేదా? నవోదయ లో అడిగి చూడండి" అని నాలుక కరుచుకోడం కనీసం కొన్నాళ్ళ పాటు పుస్తక ప్రియులకి తప్పదు. కాలం కేవలం శక్తివంతమైనది మాత్రమే కాదు, చాలా క్రూరమైనది కూడానని మరోసారి నిరూపితమైన సందర్భం ఇది.. (ఫోటో కర్టెసీ : The Hindu)