బుధవారం, డిసెంబర్ 29, 2021

సమాంతరాలు

వాక్యం ఒడుపు తెలిసిన రచయిత తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి నుంచి తాజాగా వచ్చిన కథాసంపుటి 'సమాంతరాలు.' నూటిరవై పేజీల సంకలనంలో కథల సంఖ్య కేవలం ఐదు. వీటిలో మొదటి కథ నిడివే యాభై పేజీలు. పదాల లెక్కలు, సన్నివేశాల నిడివి లాంటి కొలతలేవీ పెట్టుకోకుండా కథల్ని తాపీగానూ, అదే సమయంలో ఎక్కడా ఆపకుండా చదివించేలానూ రాశారు. కథలు చదివేప్పుడు ముగింపు ఏమై ఉంటుందో అన్న ఆత్రుత కన్నా, పాయసంలో జీడిపప్పు పలుకుల్లా తగిలే వాక్యాలని నెమరువేసుకుంటూ ముందుకుసాగడం బాగుంటుంది పాఠకులకి. కథ చదవడం పూర్తయ్యాక ఆగి ఆలోచించడం ఎటూ జరిగేదే అయినా, చదువుతూ మధ్యమధ్యలో కూడా ఆగి ఆలోచనల్లో పడేలా చేయడం ఈ ఐదు కథల ప్రత్యేకత. జీవిత సత్యాలని - నిలబెట్టి పాఠం చెప్పేస్తున్నట్టుగా కాక, యధాలాపంగా చెప్పినట్టనిపించే వాక్యాల్లో పొదగడం కనిపిస్తుంది కథలన్నింటిలోనూ. మళ్ళీ చదివినప్పుడు కూడా కొత్తగా అనిపించే ఎక్స్ప్రెషన్లకి కొదవే లేదు. ఈ కథల్ని మొదటిసారి చదివినప్పుడు - వెలుగుని చూసి కళ్ళు మిరుమిట్లు గొలిపినట్టుగా - ఏమీ రాయాలనిపించలేదు. మళ్ళీమళ్ళీ చదివించే గుణం ఉన్న కథలే అన్నీను.

హరిదాసుల కుటుంబలో పుట్టిన దాసు గారు ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరయ్యారు. రాజమండ్రిలో బాగా డెవలప్ అయిన లొకాలిటీలో పాతదైన సొంత ఇల్లు ఉంది. భార్య గతించింది. మగపిల్లలిద్దరూ వాళ్ళ కుటుంబాలతో దూరంగా ఉంటున్నారు. ఓ రాత్రి వేళ దాసుగారింట్లో ఓ దొంగ ప్రవేశించాడు. అప్రమత్తంగా ఉన్న దాసుగారు, తాను చీకట్లో దాగి దొంగాడిని కర్రతో మోదారు. ఆ దొంగ పేరు పీటర్. ఇంటర్ ఫెయిలైన కుర్రాడు. దొంగతనం అదే ప్రధమం. దాసుగారే కుర్రాడికి ఫస్ట్ ఎయిడ్ చేశారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్యనా చిత్రమైన స్నేహం అల్లుకుంది. దాసు గారికి గతమే తప్ప భవిష్యత్తు లేదు. పీటర్ గతమంతా దెబ్బల మయం. రంగుల భవిష్యత్తుని నిర్మించుకునే పనిలో ఉన్నాడు. భిన్న ధ్రువాలైన ఆ ఇద్దరి జీవితాల్లో, వాళ్ళు కలిసి గడిపిన కొంత కాలాన్ని చిత్రించారు 'సమాంతరాలు' కథ. సంపుటిలో మొదటి కథ ఇదే. "గోదారి మధ్యనే ఉత్తినే దొరికిన చిన్న పడవలా ఉన్నాడు పీటరు" లాంటి వర్ణనలెన్నో కథనిండా. దాసు గారికి ఇష్టమైన మెత్త పకోడీని మనవూ నవుల్తూన్నట్టే ఉంటుంది కథ చదువుతుంటే. 

పూర్ణ, మార్కండేయులు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. మార్కండేయులు చిత్రమైన వ్యక్తి. అతనికి జ్ఞాపకాలంటూ ఏవీ ఉండవు. పెళ్ళైన మూడేళ్ళకి పూర్ణ అతనికి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. అప్పటినుంచీ మార్కండేయులుకి ఒకటే వ్యాపకం - పూర్ణ ఆనుపానులు తెలుసుకోవడం. అతని ప్రయత్నాల గురించి పూర్ణకీ తెలుసు, అందుకే అతనికి దొరక్కుండా దూరంగా తప్పించుకుంటూ ఉంటుంది. ఆమెకి మార్కండేయులు మీద చెడు అభిప్రాయమేమీ లేదు. కానీ, అతనితో జీవితం తనకి కష్టం అనే విషయాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకుని, బాగా ఆలోచించే విడాకుల నిర్ణయం తీసుకుంది. పూర్ణ తన ఇంట్లో ఉన్నన్నాళ్లూ ఆమెని పట్టించుకోలేదు మార్కండేయులు. కానీ, ఆమె వెళ్ళిపోయినప్పటినుంచీ ఆమె ఆలోచనలే అతని ప్రపంచం అయిపోయాయి. వీళ్ళ కథకి సమాంతరంగా సాగుతుంది చౌదరి గారి నవయుగ హోటల్ నిర్వహణ. నవయుగ ఇడ్లీలు, పల్లీ పచ్చడి దేవతలు చేసినట్టు ఉంటాయి. బహుశా అక్కడి కాఫీనే అమృతం అంటారేమో అనుకుంటారు కస్టమర్లు. ఇంతకీ, మార్కండేయులు, పూర్ణ గురించి వాళ్ళ స్నేహితుడు (కథకుడు) ఏం తెలుసుకున్నాడో చెబుతుంది 'మార్కండేయుడి కాఫీ' కథ ముగింపు. 

మూడో కథ మృత్యువు చుట్టూ తిరిగే 'నీడ వెంట'. ఓ రాజకీయ నాయకుడి మరణం అనంతరం మోపబడిన కర్ఫ్యూతో మొదలై, మూర్తి తండ్రి హఠాన్మరణం నుంచీ వేగం పుంజుకుని, అస్తి సంచయనానికి మూర్తి కాశీలో అడుగు పెట్టే సమయానికి అక్కడ కూడా కర్ఫ్యూ పరిస్థితులు తలెత్తడం అనే మలుపు తీసుకుని ఊహకందని ముగింపుకి చేరుతుంది. "ఏం చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా మూర్తికి తనొక్కడే పెద్ద ఉల్లిపొర కాయితం పొట్లంలో ఉన్నట్టనిపించింది.." "ఉదయం గంగ మామూలుగా ప్రశాంతంగా మురిగ్గా ఉంది" లాంటి వాక్యాల దగ్గర ఆగకుండా ముందుకెళ్లలేం. అపార్ట్మెంట్లో మూర్తి కుటుంబం శవ జాగరంలో ఉండగా, పక్క ఫ్లాట్లలో జీవితాలు యధాతధంగా గడవడం లాంటి పరిశీలనలకీ లోటులేదు. కాశీ చిత్రణ గతంలో చదివిన వాళ్ళకి కూడా, కర్ఫ్యూ నాటి కాశీని గురించి చదవడం కొత్త అనుభవమే అవుతుంది. మూర్తితో పాటు కాశీని చూస్తున్న పాఠకులు ఉలిక్కిపడే లాంటి ముగింపు ఇచ్చారు కథకి. 

జీవితం అల్లకల్లోలం అయిపోడానికి పెద్ద పెద్ద మార్పులే జరగక్కర్లేదు, 'గునపం లాంటి ఒక వాక్యం' చాలు గురుమూర్తి గారి లాంటివాళ్ళకి. అప్పటివరకూ లేని కొత్త చింత, చింతన మొదలవుతాయి గురుమూర్తి గారిలో - ఆ వాక్యం విన్న తర్వాత. అప్పటి వరకూ నింపాదిగా ఉన్నవాడు కాస్తా గతాన్ని పెళ్లలు పెళ్లలుగా తవ్వి పోయడం మొదలెడతాడు. ఆ తవ్వకాల్లో ఎక్కువగా దొరికేవి పగిలిన కాఫీ కప్పులే. గవర్నమెంట్లో పనిచేసి రిటైరైన గురుమూర్తికి ఇటీవలే భార్యా వియోగం సంభవించింది. ఆ తర్వాతే ఆయనలో అశాంతి మొదలయ్యింది. అందుకు కారణం ఆయన భార్య ఆయనతో చివరగా మాట్లాడిన ఒకే ఒక్క వాక్యం. ఆ వాక్యం నుంచి అన్వేషణ మొదలై గతంలోకి సాగింది. ఆలోచనలన్నీ అసంపూర్ర్ణమే అవుతున్నాయి. చూడబోతే తన జీవితమే అసంపూర్ణం అనిపించింది ఆయనకి. 'అతని శీతువు' కథలో వరదాచార్యులు ఈ కథలో అతిధి పాత్రలో మెరుస్తారు. "ఎదురింటి మెట్ల మీద కామాలా పడుకుంది కుక్క" లాంటి వాక్యాలు భలే అందాన్నిచ్చాయీ  'ఇదొక అరసున్నా' కథకి. 

అమెరికా నుంచి తల్లితో పాటు తురకపాలెం వచ్చిన ఎనిమిదేళ్ల క్రిష్-కృష్ణ-కిష్టప్పకి మురికిగా ఉండే ఆ ఊరు మొదట అస్సలు నచ్చనే నచ్చదు. రోడ్డు మీద పేడ వేసే గేదెలు, ఉమ్ములేసే మనుషులూ, బొత్తిగా గతుకుల రోడ్డూ.. ఏవీ ఆకట్టుకోవు. ఇంట్లో మావయ్య, అత్తయ్య, పెద్దమ్మ మాత్రం బాగా నచ్చుతారు. రానురానూ తురకపాలెం ప్రత్యేకతలని గురించి ఇంట్లో వాళ్ళ నుంచీ, బయటి వాళ్ళనుంచీ తెలుసుకున్నాక  - ఏ ఇద్దరు చెప్పే విషయాలకీ పొంతన లేకపోయినా - ఆ ఊరిమీద కుతూహలం మొదలవుతుంది. పున్నమి రాత్రులలో ఆ ఊరి మురికికాల్వలో స్నానం చేయడానికి వచ్చే దేవకన్యలని చూడడానికి అర్ధ రాత్రి ఇంట్లో అందరూ పడుకున్నాక బేటరీలైటు వేసుకుని "తెల్ల పిల్లిలా" వెళ్లిన కృష్ణ తెలుసుకున్నదేవిఁటి? ఆ ఊరిని గురించి అతనిలో స్థిరపడిన అభిప్రాయం ఏమిటన్నది 'తురకపాలెం దేవకన్యలు' కథ ముగింపు. పిల్లల్లో సృజనాత్మకతని ప్రోది చేయాల్సిన అవసరాన్ని అన్యాపదేశంగా చెప్పే కథ ఇది. ఒకప్పుడు చాలా సహజంగా జరిగిన ఈ ప్రక్రియ ఇప్పుడు ఎందుకు ఆగిపోయిందనే ఆలోచన వస్తుంది పాఠకుల్లో. 

"జీవితానుభవం తడిసిన చపాతీ పిండి వంటిది కాదు. ఒక స్థితి దాటింతర్వాత అనుభవం వైయక్తికం కాదనుకుంటున్నాను. పొందడం, పోగొట్టుకోవడం, స్మృతి, ఒక రకమైన మృత్యు స్పృహ - నుభవాలు. అవి చొక్కా పేంట్లతో ఈ కథల్లో కనిపిస్తాయి" అన్నారు రచయిత తన ముందు మాటలో. 'సమాంతరాలు' 'తురకపాలెం దేవకన్యలు' కథలు మొదటిసారి చదివినప్పుడే ఆకట్టుకుంటే, మిగిలిన కథలు పునశ్చరణలో బాగా నచ్చుతాయి. మళ్ళీ చదివినప్పుడు కూడా ఏకబిగిన కథని పూర్తిచేయించే శైలి ఈ కథల ప్రత్యేకత. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారికి అంకితం ఇచ్చిన 'సమాంతరాలు' కథాసంపుటిని 'ఛాయ' ప్రచురించింది. పేజీలు 120, వెల రూ. 120. అన్ని ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు, ఆన్లైన్లోనూ కొనుక్కోవచ్చు. 

శనివారం, డిసెంబర్ 04, 2021

కొణిజేటి రోశయ్య

రాజకీయాల్లో, మరీ ముఖ్యంగా తెలుగు రాజకీయాల్లో, 'వివాద రహితులు' గా ఉన్న నాయకులు బహు తక్కువ. ఆ కొందరిలో మొదటి వరస నాయకుడు కొణిజేటి రోశయ్య ఈ ఉదయం కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘ కాలం ఆర్ధిక మంత్రి, స్వల్పకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రోశయ్య, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నరుగా తన రాజకీయ విశ్రాంతి జీవితం గడిపి, అటుపైన రాజకీయాల వైపు ఏమాత్రం తొంగిచూడలేదు. దీనిని 'తామరాకు మీద నీటిబొట్టు చందం' అనుకుంటే, రాజకీయ జీవితంలో తొలినాళ్ళ నుంచీ అదే ధోరణి అవలంబించిన అరుదైన నాయకుడు రోశయ్య. ఆయనని ప్రత్యేకంగా గమనించడానికి కారణం ఏమిటంటే, నేను కలిసిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు ఆయనే.  

అప్పట్లో నేను పనిచేసే సంస్థ యాజమాన్యానికి ఆయనతో స్నేహం. ఒకసారి అనుకోకుండా నేనూ వాళ్లతో పాటు రోశయ్య ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అప్పట్లో ఆయన ప్రతిపక్షం. అమీర్ పేటలో ఆయన ఇల్లు ఎలాంటి హంగూ, ఆర్భాటమూ  లేకుండా ఉంది. ఆ వేసవి కాలపు మధ్యాహ్నపు వేళ ఆయన నాకు స్వయంగా మంచినీళ్ల గ్లాసు అందించడమే కాదు, నా వివరాలూ కనుక్కున్నారు! అప్పటివరకూ పేపర్లో రోశయ్య గురించి చదవడం, రేడియోలో వినడం, టీవీలో చూడడం మాత్రమే చేసిన నాకు అదో వింత అనుభవం. బహుశా అప్పటినుంచీ ఆయన్ని కొంచం  ప్రత్యేకంగా గమనించాననుకుంటా. నున్నని మెరిసే బట్టతల, మడత నలగని తెల్లని ఖద్దరు దుస్తులు, భుజం మీద కావి రంగు పై పంచ, ఆరడుగుల ఎత్తున్న భారీ విగ్రహమేమో ఓ సారి చూస్తే మళ్ళీ మర్చిపోలేం. 

ఎన్టీఆర్ వెన్నుపోటు తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే 'విజన్-2020' అనీ, 2020 వరకూ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అనీ మీడియా హోరెత్తించడం మొదలు పెట్టింది. అప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షం లో ఉండేది. అది కూడా బలమైన ప్రతిపక్షం కాదు. ఉన్నవాళ్ళలో కూడా కొందరు నాయకులు చంద్రబాబు నాయుడికి అనుకూలమని గాసిప్ వార్తలు వచ్చేవి పేపర్లలో. అదిగో, ఆ కాలంలో క్రమం తప్పకుండా కాంగ్రెస్ గొంతు వినిపించిన కొద్దిమంది నాయకుల్లో రోశయ్య ఒకరు. నిజానికి మొదటివారు అనడం సబబు. అప్పట్లో రోశయ్య పేపర్లలో, టీవీల్లో కనిపించని రోజు ఉండేది కాదు. రోశయ్య మనవడు, తాతని రూపాయి ఇవ్వమని అడిగాడని, నేను పేపర్లోనూ, టీవీలోనూ కనిపించని రోజున రూపాయి ఇస్తానని ఆయన హామీ ఇచ్చారనీ, ఆ మనవడు పాపం రోజూ టీవీ చూసి నిరాశ పడుతున్నాడనే వ్యంగ్య కథనం ఒకటి పేపర్లో వచ్చింది. ('ఆంధ్రభూమి' లో బుద్ధా మురళి రాసిన 'జనాంతికం' వీక్లీ కాలమ్). 

Google Image
రోశయ్య వాగ్ధాటినీ, పనితీరుని ప్రజలంతా ప్రత్యక్షంగా చూసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో. ఆర్ధిక శాఖ రోశయ్యది. పైగా అప్పుడు టీవీ చానళ్ళు విస్తృతంగా వ్యాపించి, ప్రత్యక్ష ప్రసారాలు ఊపందుకున్నాయి. "నేను సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెడదామంటే రోశయ్య గారు బడ్జెట్ ఇవ్వడం లేదు" అని వైఎస్  వేసిన సెటైర్లు జనంలోకి బాగా వెళ్లాయి. చంద్రబాబు నాయుడు-రోశయ్యలది ప్రత్యేక అనుబంధం. ఎవరి మాటలూ పెద్దగా పట్టించుకోని చంద్రబాబు నాయుడు, రోశయ్య మాటల్ని పట్టించుకున్న సందర్భాలున్నాయి. తనపై అలిపిరి దాడి తర్వాత, సింపతీ వేవ్ లో గెలవచ్చన్న ఆలోచనతో ముందస్తు ఎన్నికలు ప్రకటించారు చంద్రబాబు. దాడి జరిగి నెలలు గడిచినా చేతికి కట్టు తియ్యలేదు. దీనిమీద రోశయ్య నుంచి విమర్శ రాగానే, మర్నాటి నుంచీ చేతి కట్టు కనిపించలేదు. 

"నేను తెలివైన వాడిని అని చంద్రబాబు నాయుడు అంటున్నారు అధ్యక్షా. నాకన్ని తెలివితేటలు ఉంటే, వైఎస్ వెనకే వెళ్లి కత్తితో పొడిచేసి ఆ కుర్చీలో కూర్చునే వాడిని కదా అధ్యక్షా.." అన్న రోశయ్య అసెంబ్లీ వీడియో, ఇప్పటికీ అసెంబ్లీ సమావేశాలు జరిగిన ప్రతిసారీ వైరల్ అవుతూ ఉంటుంది. అయితే, చాలా అనూహ్యంగా వైఎస్ అకాల మరణం తర్వాత ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అవకాశం వచ్చింది రోశయ్యకి. పార్టీకి వీర విధేయుడిగా ఉండడం, తనకంటూ వర్గం లేకపోవడం, సొంత బలం లేకపోవడం లాంటివి కలిసొచ్చాయని విశ్లేషణలు వచ్చాయి అప్పట్లో. రెండేళ్ళకి కాస్త తక్కువగా ఆపదవిలో ఉన్నా, అది దినదిన గండంగానే గడిచింది. కాంగ్రెస్ లో ఉన్న కలహాలు, కుమ్ములాటలు ఓ పక్క, యువరాజ పట్టాభిషేకానికి రోశయ్యే అడ్డుపడ్డారనే భావనతో వ్యతిరేకించిన వర్గం మరోపక్క, హైకమాండ్ మితిమీరిన పెత్తనం ఇంకో పక్క ముప్పేట దాడి చేసినా తన అనుభవం, లౌక్యంతో నెగ్గుకొచ్చారు రోశయ్య. 

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో అధినేతతో పాటు గెలిచిన పదిహేడు మంది ఎమ్మెల్యేలలో ఒకరు రోశయ్యకు దగ్గరవారనీ, సదరు ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి దూకేయబోవడమే ప్రజారాజ్యం కాంగ్రెస్లో కలిసిపోడానికి కారణమనీ  విశ్లేషణలు వచ్చాయి అప్పట్లో. ఇలాంటి చారిత్రక సందర్భాలు రోశయ్య రాజకీయ జీవితంలో చాలానే ఉన్నాయి. తను ఆదేశించిన వెంటనే ముఖ్యమంత్రి కుర్చీ దిగిపోయినందుకు బహుమతిగా రోశయ్యని తమిళనాడు గవర్నరుగా చేసింది కాంగ్రెస్ హైకమాండ్. అప్పటికే గవర్నరు గిరీ అంటే విశాలమైన రాజభవన్లో విశ్రాంతి తీసుకోవడం, దగ్గరలో ఉన్న గుళ్ళూ, గోపురాలూ చుట్టి రావడం అన్న భావన జనంలో బలపడడం వల్ల, "పోన్లే, పెద్దాయన రాజ లాంఛనాలతో విశ్రాంతి తీసుకుంటారు" అనుకున్నారందరూ. 

కానీ, రోశయ్యకు అక్కడా సమస్యలే స్వాగతం పలికాయి. సరిగ్గా అప్పుడే ముఖ్యమంత్రి జయలలిత అవినీతి కేసుల్లో జైలుపాలు కావడం, ఆమె భక్తుణ్ణి ముఖ్యమంత్రిని చేయడం, ప్రతిపక్ష నాయకుడు కరుణానిధి పూటకో ఫిర్యాదుతో ముఖ్యమంత్రిని కలవడం లాంటివెన్నో జరిగాయి. ఈ మధ్యలో కర్ణాటక గవర్నరుగా ఓ రెండు నెలలు అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు. అటుపైన తనకి, తన పార్టీకీ కూడా వయోభారం సంభవించడంతో రాజకీయాలకి దూరంగా ఉండిపోయారు. హైదరాబాద్ కి తిరిగి వచ్చేసినా, 'మాజీ ముఖ్యమంత్రి' హోదాని వాడుకోనట్టే ఉంది. ఎన్ జీ రంగా శిష్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించి, సోనియా గాంధీ అంతరంగికుడిగా రాజకీయాల్లోనుంచి విరమించుకోవడం మధ్యలో రోశయ్య చూసినవి, చేసినవి చాలానే ఉన్నాయి. ఎప్పటికీ వివాద రహితుడిగా ఉండడం కోసం కాబోలు, అయన తన ఆత్మకథ రాయలేదు. రోశయ్య ఆత్మకి శాంతి కలగాలి. 

సోమవారం, అక్టోబర్ 25, 2021

దోసిట చినుకులు

నటుడిగా ప్రకాష్ చాలా ఏళ్లుగా తెలుసు. తాను కనిపించకుండా తెరమీద తను ధరించిన పాత్ర మాత్రమే కనిపించేలా చేయడంలో సిద్ధహస్తుడు. చాలాసార్లు బాగా చేస్తాడు కానీ ఒక్కోసారి బాగా చెయ్యడు. తను ఇంటర్యూలు ఇచ్చిందే తక్కువనుకుంటా. నేను చూసినవి బహు తక్కువ. ఈమధ్య 'ఆలీతో సరదాగా' సిరీస్ లో వచ్చిన ఇంటర్యూ చూస్తున్నంత సేపూ ఓ కొత్త ప్రకాష్ రాజ్ కనిపించాడు. ఇంటర్యూ చూడడం పూర్తయిన తర్వాత 'ఒకవేళ ఈ ఇంటర్యూలో కూడా  ప్రకాష్ రాజ్ నటించే ఉంటే అతను మహానటుడు. అలా కానీ పక్షంలో, అలీ చేసిన గొప్ప ఇంటర్యూలలో ఇదొకటి' అనుకున్నాను. ఇదిగో, ఈ ఇంటర్యూ గురించిన చర్చల్లోనే 'దోసిట చినుకులు' పుస్తకం ప్రస్తావన వచ్చింది. పుస్తకం రిలీజయిందని తెలుసు కానీ, కవితా సంకలనమేమో అని భ్రమపడి ఆ జోలికి వెళ్ళలేదు అప్పట్లో. వచనమే అని తెలిసిన తర్వాత చదవకుండా ఉండలేదు. 

ప్రకాష్ రాజ్ నాటకాల నుంచి సినిమాల్లోకి వచ్చినవాడు. దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించిన వాడు. అంతే కాదు, తాను ఏయే భాషల్లో నటిస్తున్నాడో ఆ భాషల్ని క్షుణ్ణంగా, అక్కడి సాహిత్యాన్ని అర్ధం చేసుకునేంతగా చదివిన వాడు. కళాకారుడు అయినందువల్ల సున్నిత మనస్కుడు. జీవితానుభవాల్లో రాటుదేలిన వాడు కాబట్టి ముక్కుసూటి మనిషి. దారిద్య్రాన్ని, వైభవాన్ని, సంతోషాన్ని, దుఃఖాన్ని తీవ్రంగా అనుభవించిన వాడు. కాబట్టి సహజంగానే భావాల్లో తీవ్రత ఉంటుంది. ఆ తీవ్రత ఈ పుస్తకంలోని ఇరవైమూడు వ్యాసాల్లోనూ ప్రతిఫలించింది. ఇది ఏకబిగిన రాసిన పుస్తకం కాదు. ఓ కన్నడ పత్రిక కోసం అప్పుడప్పుడూ రాసిన వ్యాసాలన్నింటినీ మొదట కన్నడంలో పుస్తకంగా తీసుకొచ్చి, ఆపై తెలుగులోకి అనువదించారు. తన అనుభవాలని, ఆలోచనలని పంచుకుంటూనే 'మనిషితనం' గురించి నొక్కి చెప్పారు ప్రకాష్ రాజ్. 

సినిమా వాళ్ళకి ఫామ్ హౌసులు ఉండడం సాధారణమే కానీ, ప్రకాష్ రాజ్ కి నిజంగానే వ్యవసాయం చేసే అలవాటుందని ఈ పుస్తకం చదివాకే అర్ధమయ్యింది. ప్రారంభ వ్యాసాలన్నీ వ్యవసాయాన్ని గురించే. తన గురువు లంకేశ్ ని తల్చుకుంటూ రాసిన మొదటి వ్యాసం 'బావిలోని నాచు', పూర్ణచంద్ర తేజస్వి జ్ఞాపకాలతో రాసిన 'మనిషి ద్వీపం కాకూడదు', వ్యవసాయాన్ని లాభసాటి చేయాల్సిన బాధ్యత సమాజం మీద ఉందని చెబుతూ అందుకు మార్గాలని సూచించే 'వ్యవసాయం జూదమా' వ్యాసాల్లో వ్యవసాయాన్ని గురించి సమగ్రంగానూ, మిగిలిన వ్యాసాల్లో సందర్భోచితంగానూ మట్టిని గురించి, పాడి పంటల్ని గురించీ రాశారు. 'తెగుళ్ళవన్నీ ఒకటే కథ' అర్బనైజేషన్ తాలూకు ప్రతికూలతల్ని చర్చిస్తే, 'నుదుట రూపాయి' లో  మరణాన్ని గురించిన తాత్విక చర్చ కనిపిస్తుంది. 

నిజానికి ఈ వ్యాసాల్ని వర్గీకరించడం కష్టం. ఒక ఇతివృత్తం అనుకుని మొదలు పెట్టి పూర్తిచేసినవి కాకపోవడమే ఇందుకు కారణం. ఒకచోట మొదలు పెట్టి, గుర్తొచ్చిన విషయాలు చెప్పుకుంటూ వెళ్లి, అర్ధవంతంగా ముగిస్తారు. ఏ వ్యాసమో నాలుగైదు పేజీలు మించకపోవడం, చదివించే గుణం పుష్కలంగా ఉండడం వీటి ప్రత్యేకతలు. 'చిక్కిపోతున్న నదులు' వ్యాసం 'సేవ్ కావేరి' ఉద్యమం సందర్భంలో రాసింది. 'మలిసంధ్య' వ్యాసం వయోవృద్ధులని గౌరవించాల్సిన ఆవశ్యకతని చెప్పేందుకు రాసిందే అయినా మరెన్నో విషయాలని, తన అనుభవాలనీ అందులో చేర్చారు రచయిత. బలవంతుడు బలహీనుడి మీద చేసే దౌర్జన్యం ఎలా ఉంటుందో చెప్పే వ్యాసం 'మనం కోతులమా'. యానిమల్ ప్లానెట్ ఛానల్లో చూసిన డాక్యుమెంటరీకి, విమానంలో తనకి ఎదురైన అనుభవాన్ని ముడిపెట్టి తాను చెప్పాలనుకున్న విషయాన్ని చర్చకి పెట్టారిందులో. 

'మౌనం ప్రమాదం' లో తన సినిమా షూటింగ్ అనుభవాన్ని, 'దారితప్పిన మేక' లో తన తల్లి తనపట్ల చూపిన ప్రేమనీ అక్షరబద్ధం చేసిన ప్రకాష్ రాజ్, 'అమాయకత్వం వరమా? శాపమా?' లో ప్రజల బాధ్యతారాహిత్యం పట్ల ధర్మాగ్రహాన్ని ప్రదర్శించారు. 'కళ్ళముందు ఉండే కనపడరు', 'కాసుల హారం', 'పండగ - తలా ఒకరకం' 'మాతృభాష', 'ఈక్షణం మనది'  వ్యాసాలకి ఇతివృత్తం పిల్లల పెంపకం. ఈ తరం పిల్లలు పెరుగుతున్న వాతావరణం గురించి, వాళ్ళ మీద పడుతున్న ప్రభావాలని గురించీ రచయిత ఆందోళన కనిపిస్తుంది వీటిలో. 'అడవి చెప్పే పాఠాలు', 'చంద్రుడు లేని రాత్రులు' వ్యక్తిత్వ వికాస ధోరణిలో సాగితే, 'హిత శత్రువు' మతాన్ని గురించీ, 'దేహమే దేవాలయం' మరణాన్ని గురించీ చర్చిస్తుంది. స్త్రీల మీద జరిగే అత్యాచారాల పట్ల ఆవేదనకి అక్షర రూపం 'ఇలా ఎందుకున్నాము'. 

గిరీష్ కర్నాడ్ 'హయ వదన' నాటికని పరిచయం చేస్తూనే, ప్రకాష్ రాజ్ తన  టీనేజీ ప్రేమకథలను జ్ఞాపకం చేసుకున్న వ్యాసం 'ప్రేమ కర్తవ్యమా?' కాగా తనని తాను వెతుక్కునే ప్రయత్నంలో రాసినది 'ఓరి మానవుడా'. రచయిత ఆలోచనలతో పాఠకులకి లంకె కుదిరితే ఆపకుండా చదివించేసే పుస్తకం ఇది. అక్కడక్కడా 'క్లాసు తీసుకునే' ప్రకాష్ రాజ్ కళ్ళముందు కనిపించే అవకాశమూ ఉంది. 'సృజన్' చేసిన తెలుగు అనువాదం సరళంగా ఉంది. ప్రకాష్ రాజే స్వయంగా తెలుగులో రాసి ఉంటే ఎలా ఉండేదో అన్న ఆలోచన రాకపోలేదు. 'మిసిమి' ప్రచురించిన ఈ 115 పేజీల పుస్తకాన్ని ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. ఒక ఆలోచనాపరుడి రాండమ్ థాట్స్ అనిపించే ఈ పుస్తకాన్ని చదవడానికి నటుడిగా ప్రకాష్ రాజ్ కి అభిమానులు అయి ఉండాల్సిన అవసరం లేదు. 

గురువారం, సెప్టెంబర్ 23, 2021

ప్రియురాలు

 ఓషో రచనల్ని ఇష్టపడే దివ్య ఓ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. జీఆర్యీ కోచింగ్ కోసం వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆమెకి, అదే అపార్ట్మెంట్లో మరో ఫ్లాట్లో ఉండే మాధవతో పరిచయం అవుతుంది. ఓ టీవీ ఛానల్లో పని చేసే మాధవ వివాహితుడే కానీ, ఫ్లాట్ లో ఒంటరిగా ఉంటున్నాడు. మాధవతో పరిచయం ప్రేమగా మారుతుంది దివ్యకి. అతన్ని గురించి తెలిసీ  అతనితో  శారీరక సంబంధం పెట్టుకుంటుంది. ఆమె దృష్టిలో అది ఆమె తన ప్రేమని ప్రకటించే పధ్ధతి. లోకం దృష్టిలో వాళ్ళిద్దరిదీ సహజీవనం. అదే అపార్ట్మెంట్లో వాచ్మన్ గా పని చేసే సత్యం వివాహితుడు. అతని భార్య కూడా అదే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ లో పని చేస్తూ ఉంటుంది. అతని దృష్టి మరో పనిమనిషి సరిత మీద పడుతుంది. ఆమె అవివాహిత. సత్యం, సరితని ఆకర్షించి ఆమెతో సంబంధం పెట్టుకుంటాడు. అతని దృష్టిలో అది మూణ్ణెల్ల ముచ్చట. లోకం దృష్టిలో వాళ్ళది అక్రమ సంబంధం. సమాంతరంగా సాగే ఈ రెండు జంటల కథే రామరాజు దర్శకత్వంలో వచ్చిన 'ప్రియురాలు' సినిమా. 

'మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు' సినిమాతో దర్శకుడిగా పరిచయమై, 'ఒకమనసు' సినిమాతో నీహారిక కొణిదల ని వెండితెరకి పరిచయం చేసిన రామరాజు దర్శకత్వంలో వచ్చిన మూడో సినిమా ఇది. తొలి రెండు సినిమాలనీ తన కథలతో తీసిన రామరాజు, ఈ సినిమాకి మాత్రం శ్రీసౌమ్య రాసిన కథని ఉపయోగించుకున్నారు. దర్శకత్వంతో పాటు, ఎడిటింగ్, నిర్మాణ బాధ్యతలనీ తీసుకున్నారు. ప్రధాన పాత్రలకి కొత్త నటుల్ని, సహాయ పాత్రలకి కొంచం తెలిసిన నటుల్నీ ఎంచుకుని, ఫొటోగ్రఫీ, సంగీతం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి తీసిన ఈ సినిమాలో తన మార్కు కవితాత్మకతతో పాటు, తాను మార్కెట్ అవసరం అని నమ్మిన శృంగారాన్నీ జోడించారు. శృంగార దృశ్యాలని ఒకటి రెండు సన్నివేశాలకి పరిమితం చేయడం కాకుండా, రెండు గంటల నిడివి సినిమాలో దాదాపు మూడో వంతు సమయాన్ని కేటాయించారు. 

మొదటి సినిమాలో తండ్రి-కూతురు (అని విన్నాను), రెండో సినిమాలో తండ్రి-కొడుకు అనుబంధాన్ని చిత్రించిన రామరాజు, ఈ సినిమాలో ముగ్గురు తండ్రులు, ముగ్గురు కూతుళ్ళ కథల్ని చూపించారు. ముగ్గురు తండ్రుల్లోనూ ఓ తండ్రి తీసుకున్న నిర్ణయం కారణంగా కూతురు 'ప్రేమ' ని అన్వేషిస్తుంది. మరో తండ్రి చేసిన పని కారణంగా ఆ కూతురు భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతుంది. ఈ ఇద్దరు తండ్రుల అనుభవాలనుంచీ ఓ జంట నేర్చుకున్న పాఠం, మూడో తండ్రిని తన కూతురికి దగ్గర చేస్తుంది. ఈ కథలతో పాటు, సమకాలీన విషయాల మీద మీడియా - మరీ ముఖ్యంగా టీవీ, యూట్యూబ్ చానళ్ళు స్పందిస్తున్న తీరునీ చర్చకి పెట్టాడు దర్శకుడు. టీవీ ఛానల్ బాస్ "రేప్ కేసా, బంజారా హిల్స్ లో జరిగితే బ్రేకింగ్ వెయ్యి, బస్తీలో జరిగితే స్క్రోలింగ్ చాలు" అంటాడు తన స్టాఫ్ తో. టీవీల్లో వచ్చే వార్తా కథనాలు, చర్చలు ఎలా తయారవుతాయో, వాటి వెనుక పనిచేసే శక్తులేవిటో వివరంగానే చూపించారు. 

రామరాజు తొలి సినిమా చూసే అవకాశం నాకింకా రాలేదు. కానీ, 'ఒక మనసు' తో ఈ సినిమాకి చాలా పోలికలే కనిపించాయి. ముఖ్యంగా, ప్రేమ సన్నివేశాలని  కవితాత్మకంగా చిత్రించే పధ్ధతి. నేపధ్యం, నేపధ్య సంగీతం విషయాల్లో ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం దర్శకుడి మార్కుగా అనిపించింది. ఈ సినిమాలో సంభాషణలూ కొటేషన్ల లాగానే ఉన్నాయి. పాత్రల నేపధ్యాలని బొత్తిగా దృష్టిలో పెట్టుకోకుండా, ప్రతి పాత్ర చేతా కొటేషన్లు చెప్పించడం (మళ్ళీ) మింగుడు పడలేదు. కాసిన్ని అవుట్ డోర్ సన్నివేశాల మినహా, చాలా సినిమా ఇన్ డోర్ లోనే జరిగింది. ఫోటోగ్రఫీకి ఏమాత్రం వంక పెట్టలేం. పాటలతో పాటు, నేపధ్య సంగీతమూ బాగా కుదిరింది, అక్కడక్కడా కాస్త 'లౌడ్' అనిపించినప్పటికీ. కొత్త నటీనటుల నుంచి నటనని రాబట్టుకోడంలోనూ దర్శకుడు కృతకృత్యుడయ్యాడు. 

కథానాయిక దివ్య మొదటి సన్నివేశంలో జరిగే తన పెళ్ళిచూపుల్లో అబ్బాయితో మాట్లాడే విధానం ఆకట్టుకుంటుంది. ఉద్యోగం చేయకుండా ఉండడం తనకి ఇష్టం లేదని చెబుతూ, "ఓ పదిహేనేళ్ల తర్వాత మనం విడిపోతే, నాకు కెరీర్ లేకుండా అయిపోతుంది" అంటుంది. ఇంత స్పష్టత ఉన్న అమ్మాయీ, తర్వాతి  సన్నివేశంలో తనకి ఎదురైన ఈవ్ టీజింగ్ సమస్యని ఎదుర్కోడానికి హీరో సహాయం కోరుతుంది!! ఇలాంటి కాంట్రడిక్షన్లు మరికొన్ని ఉన్నాయి. మాధవని మరీ పాసివ్ గా చూపించడం కొరుకుడు పడని మరోవిషయం. టీవీ ఛానల్ ఆఫీసులో కూడా అతను నోరు తెరిచింది బహుతక్కువ. 'ప్రియురాలు' అనే పేరుతో సినిమా తీయాలన్నది అతని కల. ఓ పోస్టర్ని ఇంట్లో పెట్టుకోడం మినహా, అతని నుంచి ఇంకెలాంటి కృషీ  ఎక్కడా కనిపించదు. సినిమాటిక్ లిబర్టీలు తీసుకున్నప్పటికీ, రొటీన్ సినిమాలకి భిన్నంగానే ఉంది. 'సోనీ లివ్' ఓటీటీ లో స్ట్రీమింగ్ లో ఉందీ సినిమా. 

శుక్రవారం, సెప్టెంబర్ 10, 2021

వందేళ్ల వపా

కళాకారులు అంతర్ముఖులుగా ఉండడం సహజం. వాళ్ళ దృష్టి లౌకిక విషయాల మీద కాక, అంతకు మించిన వాటిమీద ఉంటూ ఉండడం కూడా వాళ్ళ కళాసృష్టికి ఒకానొక కారణం. అయితే, ఈ అంతర్ముఖత్వం కారణంగానే తన కళలో విశేషమైన కృషి చేసి, ఎంతో మంది అభిమానులని సంపాదించుకుని కూడా, తనను గురించి ప్రపంచానికి పెద్దగా తెలియకుండానే వెళ్ళిపోయిన కళాకారులు ఉన్నారు. తెలుగు నేలకి సంబంధించి ఈ వరుసలో ముందు చెప్పుకోవాల్సిన పేరు విఖ్యాత చిత్రకారుడు వడ్డాది పాపయ్య. ఇవాళ ఆయన శతజయంతి. సెప్టెంబర్ 10, 1921న  శ్రీకాకుళంలో జన్మించారని, డిసెంబర్ 30, 1992న కశింకోటలో మరణించారని, ఈ మధ్య గడిపిన జీవితంలో వేలాది వర్ణ చిత్రాలు రచించారనీ మినహా ప్రపంచానికి ఆయన గురించి తెలిసింది బహు తక్కువ. 

ఆయన చిత్రకళ రసజ్ఞులని రంజింపజేయ గలిగిందే కానీ, తగినన్ని కాసుల్ని రాల్చలేకపోయింది. తన చుట్టూ గిరి గీసుకుని బతికిన మనిషిని పిలిచి బిరుదులిచ్చి సన్మానాలు చేసేవారు మాత్రం ఎవరున్నారు? రెండు మూడు రంగాల్లో కాలు పెడితే ఒక చోట కాకపొతే, ఇంకో చోటన్నా పేరు మారుమోగి సౌకర్యవంతమైన జీవితం ఏర్పడి ఉండేదేమో. ఈయనేమో జీవితాంతం చిత్రకళ తప్ప మరోవైపు దృష్టి పెట్టలేదు. నాటి 'చందమామ' మొదలు నేటికీ నడుస్తున్న 'స్వాతి' పత్రిక తొలినాటి సంచికల వరకూ ఏ కొన్ని పత్రికల ముఖచిత్రాలను పరీక్షగా చూసిన వారికైనా 'ఎవరీ బొమ్మ గీసింది?' అన్న ప్రశ్న రాక మానదు. బొమ్మకి కుడివైపు మూలన 'వ.పా' అనే పొడి అక్షరాల్లో, లేక పూరీ జగన్నాధుడిని గుర్తు చేసే 'O|O' సింబలో కనిపిస్తుంది. అది వడ్డాది పాపయ్య సంతకం. 

శారదా నది ఒడ్డున పాతకాలపు చిన్న డాబా ఇంటిని తన ప్రపంచంగా చేసుకుని, ఆ ఇంటి మొదటి అంతస్తులోని కాస్త విశాలమైన గదిని తన స్థూడియోగా చేసుకుని రంగులతో వపా చేసిన ప్రయోగాలు అనితరసాధ్యాలు.  ఆయనకి ఖరీదైన డ్రాయింగ్ పేపర్ అవసరం లేదు, మామూలు కాగితం చాలు. ఆయిల్ కలర్లో, వాటర్ కలర్లో ఉండాలన్న నియమం లేదు. ఇనప సామాన్ల కొట్లలో దొరికే రంగు పొడులు చాలు. అవీ లేని నాడు (కొనడానికి డబ్బు లేనప్పుడు) నీలిమందు, ఆకు పసరు, బొగ్గు పొడులతోనే ప్రపంచస్థాయి చిత్రాలు రచించిన ఘనుడాయన. ఆయన బొమ్మలు చూసి ముగ్ధుడయ్యి చక్రపాణి అంతటి వాడు పిలిచి, 'చందమామ' స్టాఫ్ ఆర్టిస్టుగా ఉద్యోగం ఇచ్చాడు. బహుశా వపా చేసిన ఏకైక ఉద్యోగం అదే. అది కూడా కొన్నేళ్లే. మద్రాసు వాతావరణం సరిపడక, ఉద్యోగం మానేసి కశింకోట తిరిగి వచ్చేశారు. 

శ్రమజీవుల కుటుంబంలో పుట్టారు పాపయ్య. చిత్రకళ తండ్రి శ్రీరామమూర్తి నుంచే వచ్చింది. ఆయన ప్రభుత్వ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ గా పనిచేయడంతో పాటు, చిత్రకళకు సంబంధించి ఇతరత్రా కృషి కూడా చేసేవారు. అలా, తండ్రికి సహాయకుడిగా చిన్ననాడే రంగులతో పరిచయం ఏర్పడింది వపాకి. తొలిబొమ్మ ఆంజనేయుడిది. తొలినాటి కలంపేరు 'పావనం', తర్వాతి కాలంలో తన ఇంటికి పెట్టుకున్న పేరు కూడా అదే. బొమ్మల్లోనే కాదు, రంగుల మిశ్రమంలోనూ తనదైన శైలిని నిర్మించుకున్నారు. కేవలం మేలి ముసుగుకు వేసిన రంగుని చూసి చెప్పొచ్చు అది వపా బొమ్మ అని. పురాణ పురుషులు, కావ్య నాయికలు, ఋతు శోభ మాత్రమే కాదు, జానపదుల జీవితాలూ ఆయనకు వస్తువులే. 

బొమ్మలు వేయడంలోనే కాదు, వాటికి పేర్లు పెట్టడంలోనూ వపాది ప్రత్యేక శైలి. 'చంపకమే భ్రమరీ..' లాంటి ఉదాహరణలు కోకొల్లలు. ఎవరైనా ఇంటర్యూ చేయడానికి వెళ్తే, సున్నితంగా కాక తీవ్రంగా తిరస్కరించేవారట వపా. ఇందువల్లనే కాబోలు ఆయనకి ముక్కోపి, అహంభావి లాంటి బిరుదులొచ్చాయి. దగ్గరనుంచి చూసిన కొద్దిమంది మాత్రం ఆయన సాత్వికుడనీ, కళాకారుడికి కాకుండా కళకి మాత్రమే పేరు రావాలని పైపైకి కాక మనసా వాచా నమ్మినవారనీ చెబుతారు. సాధారణ కాగితం, మామూలు రంగులూ వాడి గీసినా వపా బొమ్మల్లో కనిపించే మెరుపు వెనుక రహస్యం ఏమిటి? 'మిసిమి' పత్రిక కోసం చిత్రకారులు 'బాలి' గతేడాది రాసిన వ్యాసంలో విప్పిచెప్పిన ఆ 'రహస్యం' నన్ను విస్మయ పరిచింది. అంతకు మించి, వపా మీద గౌరవం మరింత పెరిగింది. 

"వపా కొన్ని రంగులు కానీ, చార్కోల్ గీతలు కానీ కొంత కాలానికి చెడిపోతాయని భావించి - తాను స్వంతంగా గంజి మరగపెట్టి, చల్లార్చి, అటు చిక్కగా కాదు, మరీ పల్చగా కాకుండా చూసి, నోటిలో ఇత్తడి పుల్లను పెట్టుకుని ఊదుతూ లైట్ గా స్ప్రే చేసేవాడు - దానికి కొంచం ప్రాక్టీసు కావాలి. నీడలో ఆరబెడితే దాని ఫలితంగా బొమ్మపై సన్నటి గాజు స్ప్రే వంటిది వస్తుంది. బొమ్మ కూడా పాడవదు. (ఆ తర్వాతే పిక్చర్ వార్నిష్ (కేమిక్) వచ్చింది)". వపా చిత్రకారుడు మాత్రమే కాదు, ఫోటోగ్రాఫర్, కార్టూనిస్టు, కథా రచయిత కూడా. 'కథానంద సాగరం' లాంటి కథలున్నాయి ఆయన ఖాతాలో. (ఈ వివరాలూ పూర్తిగా తెలియవు). "ఎన్ని గీసినా, ఎన్ని తీసినా ఆయన చుట్టూ గీసుకున్న గీతను దాటలేదు. కనీసం కొన్నాళ్ళు చెరపలేదు. పెద్ద పెద్ద చిత్రకారుల ముందు నేనెంత అనే వినమ్ర భావన ఉండవచ్చు గాక. దానికీ ఓ పధ్ధతి ఉంటుంది కదా - ఇదే వారి చిన్ననాటి మిత్రులు గజపతి రావు గారి ఆలోచన" ఇవీ బాలి మాటలే. 


చదివే కథలు, చూసే సినిమాల వెనుక ఉండే మనుషుల్ని కలవడం సాధ్యమనే నమ్మకం ఏ మాత్రం లేని రోజుల్లో కూడా వపాని ఎలాగైనా కలవాలనే బలమైన కోరిక ఉండేది. ఆయన మరణించిన రెండు మూడు రోజుల తర్వాత 'ఆంధ్రప్రభ' ఆ మరణ వార్తని ప్రకటించింది. (తన మరణాన్ని గురించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని ఆయన ఇంట్లో వాళ్ళకి ముందుగానే చెప్పారట). ఆవేళ చాలా దుఃఖ పడ్డాను. అప్పట్లోనే ఓ పుస్తక ప్రదర్శనలో కేవలం వపా బొమ్మలతో వచ్చిన ఓ బరువైన పుస్తకం కనిపించింది. అప్పటి నా ఆర్ధిక పరిస్థితి ఆ వెలని అందుకోగలిగేది కాకపోవడంతో ప్రదర్శన జరిగినన్నాళ్ళూ రోజూ వెళ్లి ఆ పుస్తకం పేజీలు తిరగేసి వస్తూ ఉండేవాడిని. తర్వాతి కాలంలో ఆ పుస్తకం ఎక్కడా దొరకలేదు. ఆమధ్య ఓ ప్రచురణకర్తని అడిగితే, బొమ్మల మీద హక్కుల సమస్యతో పాటు, మార్కెట్ ఉంటుందన్న గ్యారంటీ లేకపోవడంతో ఎవరూ అలాంటి పుస్తకం వేయడానికి ముందుకు రావడం లేదన్నారు. ఇంటర్నెట్లో కొన్ని బొమ్మల్నయినా చూడగలగడం పెద్ద ఊరట. 

వపా మీద వచ్చిన నివాళి వ్యాసాలు బహు తక్కువ. వచ్చిన వాటిలోనూ పునరుక్తులే ఎక్కువ. ఆయన అమిత మితభాషి కావడం, చెప్పదల్చుకున్న విషయాలు తప్ప ఇంకేవీ బయటకి చెప్పకపోవడం వల్లనేమో బహుశా. అయితే, ఈ వ్యాసాల వల్ల  'O|O' సంతకానికి అర్ధం తెలిసింది. 'అటూ ఏమీలేదు, ఇటూ ఏమీ లేదు, నేను  మాత్రం వాస్తవం' అనే తాత్విక దృష్టిట అది. ఆరోజుల్లో దూరదర్శన్ వారు డాక్యుమెంటరీ తీయడానికి ప్రయత్నిస్తే ఆయన అవసరం లేదనేశారట. వేసిన వేలాది బొమ్మల్లో ఎన్ని పాడవ్వకుండా ఉన్నాయో, ఎవరెవరి దగ్గర ఉన్నాయో తెలిసే వీలు లేకపోతోంది. అప్పుడెప్పుడో ఘనంగా ప్రకటించిన 'బాపూ మ్యూజియం' కే ఓ రూపు ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం నుంచి వపా మ్యూజియం ఆశించడం అత్యాశే అవుతుంది. బొమ్మల్ని డిజిటైజ్ చేసి వెబ్సైట్ నిర్మించినా బాగుండును. చూడ్డానికి వెల పెట్టినా చెల్లించి చూసే అభిమానులున్నారు.  

(Google Images)

సోమవారం, సెప్టెంబర్ 06, 2021

జ్ఞాపకాల జావళి

ముందుగా మార్క్ ట్వేయిన్ చెప్పిన మాటనొకదాన్ని తల్చుకోవాలి. "Truth is stranger than fiction" అన్నాడా మహానుభావుడు. ఆత్మకథలు చదివేప్పుడు బాగా గుర్తొచ్చే మాట ఇది. అచ్చంగా ఆత్మకథ కాకపోయినా, తన జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలని  'జ్ఞాపకాల జావళి' పేరుతో అక్షరబద్ధం చేసిన పొత్తూరి విజయలక్ష్మి గారి అనుభవాలని  చదువుతూ ఉంటే కూడా మార్క్ గారన్న మాట గుర్తొచ్చింది. 'హాస్య కథలు' ద్వారా మాత్రమే కాదు, 'ప్రేమలేఖ' 'శ్రీరస్తు-శుభమస్తు' లాంటి నవలల ద్వారా కూడా విజయలక్ష్మి తెలుగు పాఠకులకి సుపరిచితురాలు. 'ప్రేమలేఖ' నవల జంధ్యాల చేతిలో 'శ్రీవారికి ప్రేమలేఖ' గా మారిన వైనం సాహిత్యాభిమానులందరికీ  చిరపరిచితమే.  పుస్తకం కవరు పేజీ మీద ఆవిడ పేరు చూడగానే 'హాయిగా చదివేయొచ్చు' అనే భరోసా కలిగేస్తుంది పాఠకులకి. పూర్తిగా ఆవిడ మార్కు పుస్తకమే ఈ 'జ్ఞాపకాల జావళి' కూడా. 

శుభవార్తలు చేరవేయడానికి ఉత్తరాలు, అశుభవార్తల కోసం టెలిగ్రాములూ మాత్రమే కమ్యూనికేషన్ చానెళ్లుగా అందుబాటులో ఉన్న 1970వ సంవత్సరంలో విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ లో బాపట్ల నుంచి రెండు రాష్ట్రాల అవతల ఉన్న చిత్తరంజన్లో అడుగు పెట్టారు, రెండు రోజుల రైలు ప్రయాణం చేసి. అది ఆమెకి అత్తవారిల్లు కాదు కానీ, భర్త గారిల్లు. స్థలం కొత్త, భాష తెలీదు, తెలిసిన వాళ్ళు కాదు కదా, కనీసం భాష తెలిసిన వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. రేడియోలో తెలుగు స్టేషన్లు వినిపించవు. హాళ్లలో తెలుగు సినిమాలు ప్రదర్శింప బడవు. ఫోనూ, టీవీ లాంటివేవీ ఇంకా అందుబాటులోకి రాలేదు. దొరికేవల్లా తెలుగు పత్రికలు మాత్రమే. పుట్టి పెరిగింది ఉమ్మడి కుటుంబంలోనూ, చూసింది గుంటూరు, బాపట్ల చుట్టుపక్కల ఊళ్లు మాత్రమేనేమో, ఒక్కసారిగా వచ్చిపడిన కల్చరల్ షాక్ ని తట్టుకోడం కష్టమే అయిందామెకి. 

ఎంత సీరియస్ విషయాన్నైనా సరదాగా చెప్పే శైలి పుస్తకాన్ని ఆపకుండా చదివిస్తుంది. అదే సమయంలో అప్పటికి నవ్వేసుకున్న విషయాలు కూడా, స్మృతిలో ఉండిపోయి, తర్వాత తల్చుకున్నప్పుడు ఆ నవ్వు వెనుక ఉన్న నొప్పి అనుభవానికి వస్తుంది. ఈ పుస్తకంలో ఉన్న మొత్తం డెబ్బై అనుభవ శకలాల్లో చాలా చోట్ల ఈ అనుభవం కలుగుతుంది. చిత్తరంజన్ లో వినిపించే రేడియో సిలోన్ తెలుగు వ్యాఖ్యాత మీనాక్షి పొన్నుదొరై మొదట్లో అపభ్రంశాల తెలుగు మాట్లాడినా, అతి త్వరలోనే ఆమె తన భాషనీ, ఉచ్ఛారణనీ మెరుగు పరుచుకోవడం విజయలక్ష్మికి హిందీ, బెంగాలీ భాషలు నేర్చుకోడానికి స్ఫూర్తినిచ్చింది. నిజానికిది చేతులకి, కాళ్ళకీ బంధనాలతో నీళ్ళలోకి విసిరేయబడిన వ్యక్తి ఈత నేర్చుకోడం లాంటిది. చదివేప్పుడు తేలికగానూ, తరువాత బరువుగానూ అనిపించే ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో. 

భాషలు నేర్చుకోడం మాత్రమే కాదు, చుట్టుపక్కల అందరితోనూ స్నేహాలు కలిపేసుకోవడం, రైల్వే ఆఫీసర్స్ క్లబ్బులో కీలక బాధ్యతలు నిర్వహించడం వరకూ ఆమె ఆ ప్రకారం ముందుకు పోతూనే ఉన్నారు.  విపరీతమైన చలి, కుంభవృష్టి వర్షాలు, రోళ్ళు పగిలే ఎండలు.. చిత్తరంజన్ వాతావరణంలో అన్ని ఋతువుల్లోనూ అతి తప్పదు. శీతాకాలాన్ని గురించి చెబుతూ, 'పాలు తోడు పెట్టిన గిన్నెకి, దోశల పిండికీ కూడా రగ్గులు కప్పాలి, లేకపొతే పాలు తోడుకోవు, విరగని దోశలు రావు'  అంటారు రచయిత్రి. మరొకరెవరైనా అయితే ఎన్నేసి ఫిర్యాదులు చేసి ఉండేవారో అనిపిస్తుంది ఇలాంటి చమక్కులని చదువుతున్నప్పుడు. వాతారణం ఎలా ఉన్నప్పటికీ చిత్తరంజన్ ఓ అందమైన కాలనీ. ప్రతి ఇంటి ముందూ పళ్ళు, కూరలు, పూల మొక్కలు తప్పనిసరి. సాక్షాత్తూ గాయని వాణీ జయరామే 'ఇంత అందమైన ఊరిని నేనెక్కడా చూడలేదు' అన్నారు మరి. 

ప్రయాణాలు మరీ సులభం కాని క్రితం రైల్వే ఉద్యోగులంటే ఓ గ్లామర్ ఉండేది. వాళ్ళు టిక్కెట్టు కొనక్కర్లేకుండా పాస్ తో ప్రయాణం చేసేస్తారనీ, ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు వెళ్లిపోవచ్చనీను. ఆ పాస్ ల వెనుక ఉండే కష్టాలనీ హాస్యస్ఫోరకంగా చెప్పారు రెండు మూడు చోట్ల. పుట్టింటికి రానూ పోనూ చేసే రెండేసి రోజుల ప్రయాణాల మొదలు, చిత్తరంజన్ లో నిర్వహించిన తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లో నిర్వహించిన దోశ స్టాల్ వరకూ చాలా తలపోతలే ఉన్నాయిందులో. కొత్త భాష, సంస్కృతీ నుంచి పుట్టే హాస్యం సరేసరి. సిగండాల లాంటి చిరుతిళ్ళు మొదలు, చిత్తరంజన్ చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాల వరకూ ఆపకుండా చదివించే కథనాలకి లోటు లేదు. 

తాను రచయిత్రిగా మారిన క్రమాన్ని కనీసం రేఖామాత్రంగా ప్రస్తావించి ఉన్నా బాగుండేది. 'ప్రేమలేఖ' నవలకి ఓ పాఠకుడి నుంచి ప్రేమలేఖ అందుకోడం లాంటి తమాషా సంగతులు చెప్పారు తప్ప, పెన్ను పట్టిన విధానాన్ని గురించి ఎలాంటి హింటూ ఇవ్వలేదు. అలాగే 'ప్రేమలేఖ' నవల 'శ్రీవారికి ప్రేమలేఖ' సినిమాగా మారిన వైనాన్ని చెబుతారని ఎదురు చూశా కానీ ఆ జోలికి వెళ్ళలేదు రచయిత్రి. ఇక, శీర్షికలో ఉపయోగించిన 'జావళి' కి నాకు తెలిసిన అర్ధం శృంగార ప్రధానమైన గీతం అని. స్పష్టంగా చెప్పాలంటే, నాయిక, నాయకుణ్ణి శృంగారానికి ఆహ్వానిస్తూ పాడే పాట (ఉదాహరణ: 'మల్లీశ్వరి' లో 'పిలిచిన బిగువటరా'). ఇంకేదన్నా అర్ధం కూడా ఉందేమో మరి. మొత్తం మీద చూసినప్పుడు నవ్విస్తూనే ఎన్నో జీవిత సత్యాలని గుర్తు చేసే పుస్తకం ఇది. (పేజీలు 196, వెల రూ. 150, ఆన్లైన్లో  కొనుక్కోవచ్చు). 

సోమవారం, ఆగస్టు 23, 2021

నా మాటే తుపాకి తూటా

ప్రపంచ పోరాటాల చరిత్రలోనే ఓ ప్రత్యేక స్థానం ఉన్న తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టుకుని పాల్గొని, అటుపైన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన కమ్యూనిస్టు పార్టీ నేత మల్లు స్వరాజ్యం ఆత్మకథ 'నా మాటే తుపాకి తూటా'. హైదరాబాద్ బుక్  ట్రస్ట్ ప్రచురించిన ఈ పుస్తకం స్వరాజ్యం స్వీయ రచన కాదు. బుక్ ట్రస్ట్ తరపున రచయిత్రులు విమల, కాత్యాయని స్వరాజ్యాన్ని ఇంటర్యూ చేసి, ఆమె చెప్పిన వివరాలన్నింటినీ ఓ క్రమ పద్ధతిలో గ్రంధస్తం చేసి రూపు దిద్దిన పుస్తకం. ఇంటర్యూ చేసే నాటికి స్వరాజ్యం వయసు ఎనభై ఆరేళ్ళు. తన చిన్నప్పటి కబుర్ల మొదలు, రహస్య జీవితపు రోజుల విశేషాల వరకూ ఆవిడ జ్ఞాపకం చేసుకుని వివరంగా చెప్పిన తీరు అబ్బురమనిపిస్తుంది. ఉద్యమం-సంసారం అనే రెండింటినీ ఆవిడ సమన్వయం చేసుకున్న తీరునీ వివరంగా చిత్రించారీ పుస్తకంలో. 

నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో ఓ భూస్వామ్య కుటుంబంలో జన్మించారు స్వరాజ్యం. పుట్టిన సంవత్సరం 1930 లేదా 31. నాటి భూస్వాముల కుటుంబాల్లో ఆడపిల్లలకి ఆత్మరక్షణ పద్ధతుల మొదలు, ఎస్టేట్ నిర్వహణకు అవసరమైన శిక్షణ వరకూ చిన్ననాడే అందించే వారట.  దొరల మధ్య ఉండే స్పర్ధ  ఇందుకు కారణం అంటారామె. పుట్టింది భూస్వామ్య కుటుంబంలోనే అయినా ఇంట్లో వామపక్ష రాజకీయ వాతావరణం ఉండడం, ముఖ్యంగా తన అన్న భీమిరెడ్డి నరసింహా రెడ్డి ప్రభావంతో ఉద్యమంలో అడుగుపెట్టానంటారు స్వరాజ్యం. పదకొండేళ్ల వయసులో ఉద్యమంలో అడుగుపెట్టిన ఆమె, ఎన్నడూ వెనుతిరిగి చూడలేదు. వివాహానంతరం, పిల్లల పెంపకం నిమిత్తం ప్రజా జీవితానికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఉక్కిరిబిక్కిరయ్యారు కూడా. 

మొత్తం పుస్తకంలో అత్యంత ఆసక్తికరంగా అనిపించే అధ్యాయాలు నిజాం కి వ్యతిరేకంగా జరిపిన పోరాటాలని వివరించేవి. స్వరాజ్యం స్వయంగా తుపాకీ పట్టి గెరిల్లా పోరాటంలో పాల్గొనడమే కాకుండా ఒక దళానికి నాయకత్వం వహించారు కూడా. గిరిజనుల నమ్మకాన్ని సంపాదించుకోడం మొదలు, పోలీసుల రాకని ఆనవాలు పట్టి ఎదురు దాడులు చేయడం, పోలీసులు చుట్టుముట్టినప్పుడు నేర్పుగా తప్పించుకోడం లాంటి సన్నివేశాలు ఊపిరి బిగపట్టి చదివిస్తాయి. అటు నిజాం, ఇటు స్థానిక దొరలూ కూడా అత్యంత బలవంతులు కావడంతో పోరాటం ఢీ అంటే ఢీ అన్నట్టుగా సాగింది. ఆయుధాలు సమకూర్చుకోడం మొదలు, రహస్యంగా డెన్ లు ఏర్పాటు చేసుకోడం, ఎప్పటికప్పుడు పరిస్థితులు అంచనా వేస్తూ పోరాటాన్ని సాగించడం.. ఈ వివరాలన్నీ అత్యంత ఆసక్తికరంగా చెప్పారు స్వరాజ్యం. పోరాట విరమణ (1951) అనంతర కాలం స్వరాజ్యం లాంటి గెరిల్లా దళ సభ్యులకి నిజంగా గడ్డు కాలమే. దాదాపు పదేళ్ల పాటు అడవుల్లో తిరుగుతూ ఒక లక్ష్యం కోసం పని చేసిన వాళ్ళకి ఉన్నట్టుండి చేయడానికి ఏపనీ లేకుండా పోవడం అన్నది ఊహకి అందని సమస్య. అయితే స్వరాజ్యానికి కాల్పులు మాత్రమే కాదు, జన రంజకంగా ఉపన్యాసాలు చేయడమూ తెలుసు. పార్టీ సభల్లో ఉపన్యాసాలు ఇస్తూ తనని తాను యాక్టివ్ గా ఉంచుకున్నప్పటికీ, పూర్తి స్థాయిలో పనిచేయలేక పోతున్నానన్న బాధ ఆమెని వేధించింది. ఇదే విషయాన్ని పార్టీ నాయకుడు చండ్ర రాజేశ్వర రావు దృష్టికి అనేకమార్లు తీసుకెళ్లారు కూడా. ఉద్యమ సహచరుడు వీఎన్ (మల్లు వెంకట నరసింహా రెడ్డి) ని వివాహం చేసుకున్నాక కొన్నేళ్ల పాటు పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోవాల్సి వచ్చింది. ఆ రోజులు మరింత దుర్భరం అంటారు స్వరాజ్యం. 

కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలాక సీపీఎం వైపు నిలబడ్డ స్వరాజ్యం, పార్టీ కార్యకలాపాల ద్వారా ప్రజల్లోకి వచ్చారు. మహిళా సమస్యలతో పాటు, రైతు సమస్యలని భుజాన వేసుకున్నారు. ఓ పక్క ముగ్గురు పిల్లల పెంపకం బాధ్యతలు చూస్తూనే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టినప్పుడు, ఈమె వేషధారణ చూసి అక్కడి కావలి వారు ఎమ్మెల్యే అంటే నమ్మకం కలగక, లోపలికి అనుమతించలేదట! అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల సీపీఎం పూర్తి వ్యతిరేక వైఖరి తీసుకోడంతో, ప్రజా ప్రతినిధిగా ఉన్నప్పటికీ ఉద్యమాలు, పోరాటాలు కొనసాగాయి. ఈ విశేషాలతో పాటు సమాంతరంగా, తన పుట్టిల్లు, మెట్టింటి విశేషాలు, ఆస్తుల పంపిణీ తాలూకు గొడవలు, పిల్లల పెంపకం, వాళ్ళ చదువులు ఇత్యాది విషయాలనే సమాంతరంగా చెప్పుకుంటూ వచ్చారు. 

ఈ పుస్తకాన్ని స్వరాజ్యం స్వయంగా రాయలేదన్న లోపం చాలాచోట్ల కనిపిస్తుంది. వివరంగా రాయాల్సిన విషయాలని చెప్పీ చెప్పనట్టు చెప్పడం, కొన్ని విషయాలని పూర్తిగా దాటవేయడం గమనించినప్పుడు ఆమే స్వయంగా రాసి ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. దాటవేత - ప్రశ్న సరిగా లేకపోవడం వల్లనా, ఆమె  మరిచిపోవడం వల్లనా, లేక ఉద్దేశపూర్వకమా అన్న ప్రశ్న రెండుమూడు చోట వచ్చింది. తెలంగాణ సాయుధ పోరాటం పూర్వాపరాలని గురించి అవగాహనా లేని వారికి, 'మలిమాట' పేరుతో ఫెమినిస్టు చరిత్రకారిణి ఉమా చక్రవర్తి రాసిన పద్దెనిమిది పేజీల వ్యాసం అవసరమైన సమాచారాన్ని ఇస్తుంది. ఆత్మకథలో అవసరమైన చోట్ల వ్యక్తులు, సంఘటనలకు సంబంధించిన ఫుట్ నోట్స్ ఇచ్చి ఉంటే పాఠకులకి మరింత ఉపయుక్తంగా ఉండి ఉండేది. హెచ్ బీటీ ప్రచురించిన ఈ 138 పేజీల పుస్తకం వెల రూ. 120. చదువుతుంటే కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ 'నిర్జన వారధి' గుర్తురాక మానదు. 

బుధవారం, ఆగస్టు 04, 2021

ఒక వైపు సముద్రం

కావేరి, కస్తూరి, మాధురి, గోదావరి ఈ  నలుగురూ అక్కాచెల్లెళ్లు. వీళ్ళకి ఒక తమ్ముడు మంజునాథ. కస్తూరి కూతురు రత్న, గోదావరి కూతురు సునంద. కస్తూరి ఆడపడుచు కొడుకు పురందర, ఇతను తన చిన్ననాడే తన తండ్రిని పోగొట్టుకున్నాడు. ప్రధానంగా కస్తూరి కుటుంబం, కొంచంగా కావేరి కుటుంబం పురందర చదువుకి సాయం చేస్తాయి. చదువు పూర్తవుతూనే మంజునాథ సాయంతో ఉద్యోగస్తుడవుతాడు పురందర. రత్నని పురందరకి ఇచ్చి పెళ్లి చేయాలని కస్తూరి సంకల్పం. అటు పురందర తల్లి, ఇటు కావేరి కూడా ఇది చాలా సహజమైన విషయంగానే భావిస్తారు. పురందర కాదంటాడని ఎవరూ అనుకోరు. ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకునే పరిస్థితులు కూడా అతనికి ఉండవు. 

ఇక పెళ్లి జరగడమే తరువాయి అనే సందర్భంలో, "పురందరని సునందకు ఎందుకు చేసుకోకూడదు?" అన్న ఆలోచన వస్తుంది గోదావరికి. వచ్చిన ఆలోచన ఆమెని నిలవనివ్వదు. పురందర సుగుణాలు ఇందుకు ఒక కారణమైతే, కస్తూరి కుటుంబం పట్ల గోదావరికి ఉన్న విముఖత మరో కారణం. కావేరితో కూడా సంప్రదించకుండా రహస్యంగా తన పని ప్రారంభిస్తుంది. అప్పటివరకూ కార్యసాధకురాలిగా పేరు తెచ్చుకున్న గోదావరి ప్రయత్నం ఏమైంది? తదనంతర పరిణామాలు ఆ కుటుంబాల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించాయో వివరించే నవలే 'ఒక వైపు సముద్రం.' వివేక్ శానభాగ కన్నడ నవల  'ఒందు బది కడలు' కి రంగనాథ రామచంద్రరావు తెలుగు అనువాదం. 

కావేరి ఇంటి పొరుగున ఉండే వితంతువులైన అత్తాకోడళ్లు పండరి-యమునల పెరట్లో నింపాదిగా మొదలయ్యే కథనం, ఒక్కో పాత్ర పరిచయంతోనూ వేగం పుంజుకుంటూ సగానికి వచ్చేసరికి పుస్తకం పూర్తి చేసి కానీ పక్కన పెట్టలేని బలహీనతకి లోనుచేస్తుంది పాఠకుల్ని. కథకి కేంద్రం కుటుంబ రాజకీయాలు అయినందువల్ల పాత్రల చిత్రణలో ఎంతో శ్రద్ధ చూపించారు రచయిత. కథలో ప్రధానమైన మలుపులన్నింటికీ కారణాలు చిన్నవే అయి ఉండడం, వాటిని రచయిత ఎంతో నేర్పుగా చెప్పడం నవల ఆసాంతమూ ఆశ్చర్య పరిచే విషయం. ఒక్క పురందర మాత్రమే కాక, చిన్నాపెద్దా పాత్రలన్నీ కూడా పాఠకులకి గుర్తుండిపోతాయి. పాత్రలు తీసుకునే నిర్ణయాలు - క్షణికావేశంలో తీసుకున్నవి కూడా - ఎక్కడా అసహజం అనిపించవు. 

ఉత్తర కర్ణాటక సముద్ర తీరంలోని గ్రామాలు, పట్టణాల్లో సాగే కథ ఇది. కథాకాలం ఇప్పటికి దాదాపు ఓ యాభై ఏళ్ళ క్రితానిది. పండరీబాయి కథా నాయికగా నటించిన కొత్త సినిమా విడుదలవ్వడం మినహా కథా కాలానికి సంబంధించి ఎలాంటి క్లూ ఇవ్వలేదు రచయిత. నిజానికి ఇది ఏ కాలంలో అయినా జరగడానికి అవకాశం ఉన్న కథే. ఒక చోటునుంచి మరో చోటికి వెళ్ళడానికి బస్సుతో పాటు పడవ ప్రయాణమూ తప్పనిసరి. ఒకపక్క కొండలు, మరోపక్క సముద్రం తాలూకు 'ఉక్కపోత' పాఠకులకి అనుభవమవుతుంది. నవల మొదటి సగంలో కథ పురందర చుట్టూ తిరిగినా, రెండో సగంలో ఎక్కువ భాగం అతని స్నేహితుడు యశవంత చుట్టూ తిరుగుతుంది. చదువు తర్వాత నాటకాల్లోకి వెళ్లిన యశవంతకి అక్కడ ఎదురయ్యే అనుభవాలు, నాటి కన్నడ నాటక సమాజాల పనితీరుని కళ్ళముందు ఉంచుతాయి. 

కేవలం పురందర, యశవంతలది మాత్రమే కాదు. నవల్లో ఒక్కో పాత్రదీ ఒక్కో కథ. ప్రతీ కథకీ ఆద్యంతాలు ఉంటాయి. కొన్ని కథల్లో ఇవి విశదంగా ఉంటే, మరికొన్ని కథల్లో క్లుప్తంగా ముగుస్తాయి. కన్నడనాటి సముద్రపు పల్లెటూళ్లలో జరిగే కథ అవ్వడం వల్ల అక్కడక్కడా 'మరల సేద్యానికి' గుర్తొస్తుంది. అయితే, ప్రాంతాలు మినహా, కథల్లో ఎక్కడా పోలిక లేదు. మధ్యతరగతి సమాజం పాటించే కొన్ని విలువలు, స్నేహాలు, బంధుత్వాలు, అంతర్వాహినిగా డబ్బు చూపించే ప్రభావం వీటన్నింటినీ చాలా నిశితంగా చిత్రించారు రచయిత. పురందర విషయానికి వస్తే, కేవలం డబ్బు మాత్రమే కాదు, చిన్నప్పటి నుంచీ పరాయి పంచన, మరొకరి దయా దాక్షిణ్యాలతో పెరిగిన వాడు అవ్వడం వల్ల ఆత్మగౌరవమూ ముఖ్యమైన విషయమే. కష్టపడి ఓ జీవితాన్ని నిర్మించుకున్నాక "ఇంతకీ నేను సాధించింది ఏమిటి?" అన్న విచికిత్సలో పడతాడు. 

అనువాదం చాలావరకు సరళంగానే సాగింది. పాత్రలు. ప్రాంతాల పేర్లు, హాస్య సన్నివేశాలు మినహా మిగిలిన నవలంతా తెలుగు కథ చదువుతున్న భావననే కలిగించింది. "ఈ కథ జరిగేది ఉత్తర కన్నడ జిల్లాలో. కడలి తీరంలోని ఈ జిల్లాలో అనేక నదులు ప్రవహించి సముద్రాన్ని చేరతాయి. సముద్రాన్ని చేరే చోటు దూరం నుంచి శాంతంగా, మనోహరంగా కనిపించినా, ఆ సంగమం మధ్యకు వెళ్లి చూసినప్పుడే నది సాగరాన్ని చేరేటప్పటి కోలాహలం కనిపిస్తుంది. అదేవిధంగా మార్పులతో పోరాడుతున్న ఇక్కడి జీవితాలూ!" అన్నారు వివేక్ శానభాగ తన ముందుమాటలో. ఛాయ రిసోర్స్ సెంటర్ ప్రచురించిన ఈ 253 పేజీల నవల వెల  రూ. 180. ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు ఆన్లైన్ లోనూ కొనుగోలు చేయవచ్చు. 

గురువారం, జులై 29, 2021

ఓం నమః నయన శృతులకు ...

 "జీవన వేణువులలో మోహన పాడగా..."

ఇంకెంతో కాలం బతకమని తెలిసిన ఓ అబ్బాయీ, అమ్మాయీ ప్రేమలో పడ్డప్పుడు పాడుకునే యుగళగీతంలో "ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో" లాంటి మాటల్ని పొదగగలిగే సినీ కవి వేటూరి ఒక్కరేనేమో బహుశా!  మణిరత్నం తెలుగులో తీసిన ఏకైక సినిమా 'గీతాంజలి' (1989) కి సింగిల్ కార్డు గేయ రచయిత వేటూరి. కథకి తగ్గట్టుగానే పాటల్లోనూ భావుకత, ఆర్ద్రత వినిపిస్తాయి. మిగిలిన అన్ని పాటలూ ఒక ఎత్తైతే, రౌండ్ ట్రాలీ వేసి కేవలం చుంబన దృశ్యంతో పాట మొత్తం చిత్రీకరించేసిన 'ఓం నమః' పాట ఒక్కటీ ఓ ఎత్తు - చూడడానికే కాదు, వినడానికి కూడా. 


ఓం నమః నయన శృతులకు
ఓం నమః హృదయ లయలకు ఓం
ఓం నమః అధర జతులకు
ఓం నమః మధుర స్మృతులకు ఓం
నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలో..
ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో

రేగిన కోరికలతో గాలులు వీచగా
జీవన వేణువులలో మోహన పాడగా
దూరము లేనిధై లోకము తోచగా
కాలము 
లేనిదై  గగనము అందగా
సూరేడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళా
ముద్దుల సద్దుకే నిదుర రేగే ప్రణయ గీతికి...

ఒంటరి బాటసారి జంటకు చేరగా 
కంటికి పాపవైతే రెప్పగ మారనా
తూరుపు నీవుగా వేకువ నేనుగా
అల్లిక పాటగా పల్లవి ప్రేమగా
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే
జగతికే అతిథులై  జననమందిన ప్రేమ జంటకు... 

ఇప్పుడంటే ఏబీసీడీ లతో అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి కానీ ఒకప్పుడు మొదటిసారిగా పలకమీద 'ఓం నమః శివాయః' రాసి దిద్దించి, ఆ తర్వాత అఆలు మొదలుపెట్టేవారు. ఈ ఓం నమఃలు క్రమేణా 'ఓనమాలు' అయ్యాయి. ఈ పాటలో జంట ప్రేమకి ఓనమాలు దిద్దుకుంటోంది. నయన శృతులకి, హృదయ లయలకి, ఆధర జతులకి, మధుర స్మృతులకీ ఓం నమఃలు. అలతి అలతి పదాలకి భావుకత అద్ది రాసిన రెండే చరణాలు. గుండె చప్పుడుతో మొదలయ్యే నేపధ్య సంగీతం, జానకి-బాలూల పోటాపోటీ గానం. వెనక్కి తిరిగి చూసుకుంటే గడిచిన మూడు దశాబ్దాలలోనూ ఇలాంటి పాట ఇంకోటి రాలేదేమో అనిపిస్తోంది. ఇకపై వచ్చే అవకాశమూ పెద్దగా కనిపించడం లేదు.

సోమవారం, జులై 26, 2021

జయంతి ...

కొందరు నటీనటుల్ని తలచుకోగానే వారికి సంబంధించిన ఒకటో రెండో విషయాలు ప్రస్ఫుటంగా మొదట గుర్తొస్తాయి. అలా జయంతి అనుకోగానే నాకు మొదట గుర్తొచ్చేది ఆమె గొంతు. జయంతి గొంతుకు నేను ఫ్యాన్ ని. రేడియోతో పాటు పేపర్లు పుస్తకాలూ, అటుపైన టీవీ అలవాటున్న ఇల్లవ్వడం వల్ల మా ఇంట్లో సినిమా కబుర్లతో సహా సకల సంగతులూ దొర్లుతూ ఉండేవి. "ఆ జయంతి గొంతేంటి బాబూ, రేకు మీద మేకుతో గీసినట్టుంటుంది" అంది మా పిన్ని ఓసారి. బహుశా అప్పుడే నేను జయంతి గొంతుని శ్రద్ధగా వినడమూ, అభిమానించడమూ మొదలైనట్టుంది. ఆమె గొంతు మెత్తనా కాదు, అలాగని గరుకూ కాదు. ఒకలాంటి సన్నని జీరతో, కాస్త విషాదాన్ని నింపుకున్నట్టుగా (రొమాంటిక్ డైలాగులు చెబుతున్నా సరే) వినిపిస్తుంది. ఆ జీరే నాకు బాగా నచ్చి ఉంటుంది బహుశా. 

మిగిలిన భాషల్లో హీరోయిన్ గా చాలా సినిమాలు చేసినా, తెలుగులో బాగా పేరు తెచ్చినవి మాత్రం సహాయ పాత్రలే. నాగేశ్వరరావుకి చెల్లెలు,  ఎన్టీఆర్   డబుల్ ఫోటో సినిమాల్లో ముసలి పాత్రకి భార్య.. ఇలా అన్నమాట. నాగేశ్వరరావు-వాణిశ్రీల 'బంగారు బాబు' సినిమా గుర్తుందా? అందులో హీరో చెల్లెలు 'చంద్ర' పాత్రలో జయంతి. చంద్ర అంధురాలు. ఆమెకి కళ్ళు రప్పించడమే హీరో జీవిత ధ్యేయం. మరీ రిక్షాలూ అవీ తొక్కించకుండా రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగం ఏర్పాటు చేశారు. "నీకిష్టమని ఉప్మా చేశానన్నయ్యా" అనే డైలాగు, ఓ చేతిలో ప్లేటు, మరో చేత్తో తడుముకుంటూ జయంతి ఎంట్రీ, నేను మర్చిపోలేని సీన్లలో ఒకటి. దాదాపు అదే టైములో వచ్చిన కృష్ణ 'మాయదారి మల్లిగాడు' లో ఇంకో ఉదాత్తమైన చెల్లెలి లాంటి పాత్ర. పడుపు వృత్తిలో ఉండే అమ్మాయిగా కనిపిస్తుంది. ఆ సినిమాలో సూపర్ హిట్ పాట 'మల్లెపందిరి నీడలోనా జాబిల్లీ..' ఆమె కలే!!

ఎన్టీఆర్-జయంతి కాంబినేషన్ గురించి ఓ పుస్తకం రాయొచ్చు అసలు. చేసినవి తక్కువ సినిమాలే అయినా, వాటిలో సెంటిమెంటు సీన్లకి అస్సలు లోటు లేకపోవడం, ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి నటించడమూను. అటు 'జస్టిస్ చౌదరి' లోనూ, ఇటు 'కొండవీటి సింహం' లోనూ ఒకటికి ఇద్దరు ఎన్టీఆర్లతో ఒకే ఫ్రేమ్లో సెంటిమెంట్ సీన్లు పండించిన నటి జయంతి. అసలు, 'ఊర్వశి' శారదని 'సారో క్వీన్' అంటారు కానీ ('మనుషులు మారాలి' సినిమా నుంచీ) ఆ బిరుదు జయంతికి ఇవ్వాలి. కావాలంటే ' కొండవీటి సింహం' లో 'మా ఇంటిలోన మహలక్ష్మి నీవే' పాటోసారి చూడండి. ఓ పక్క వృద్ధ ఎన్టీఆర్ లౌడ్ గా సెంటిమెంట్ అభినయిస్తూ ఉంటాడు. మధ్యలో చిన్న ఎన్టీఆర్ వచ్చి చేరతాడు (జూనియర్ కాదు). తన పాత్రేమో కుర్చీకే పరిమితం (పెరలైజ్డ్). చక్రాల కుర్చీలోంచి కదలకుండా అభినయించాలి. ఇప్పుడు చూస్తే నవ్వొస్తుంది కానీ, అప్పట్లో ఆ పాట మహిళల చేత కన్నీళ్లు పెట్టించి, కాసులు కురిపించింది. 


వీళ్లిద్దరి కాంబోని తలచుకోగానే అప్రయత్నంగా గుర్తొచ్చే ఇంకో పాట 'జస్టిస్ చౌదరి' లో పెళ్లి పాట. వేటూరి మనసు పెట్టి రాసిన 'శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వే కట్నం..' సాహిత్యంలో నాకు ఇష్టమైన లైన్స్ అన్నీ జయంతి మీదే చిత్రీకరించారు. ముఖ్యంగా 'అడగలేదు అమ్మనైనా' చరణంలో విషాదం సుశీల గొంతులో బాగా పలికినా, నాకెందుకో జయంతి చేతే పాడించే ప్రయత్నం చేయాల్సింది (ఆమె గాయని కూడా) అనిపిస్తూ ఉంటుంది. ఆమె వ్యక్తిగత జీవితపు జోలికి ఎందుకు గానీ, వృత్తిగతంగా వివాదంలో జయంతి పేరు బాగా వినిపించింది మాత్రం 'పెదరాయుడు' షూటింగ్ అప్పుడు. ఓ సీన్లో ఆమె పరిగెత్తాలిట. ఆమె పరిగెత్తలేను అందిట. ఆమె రోజూ ఉదయం వాకింగ్, రన్నింగ్ చేయడం హీరో కమ్ నిర్మాత మోహన్ బాబు చూశాట్ట. పంచాయతీ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళింది. డైలాగుల కేసెట్ చాలాసార్లు వినేయడం వల్ల నేనా సినిమా చూడలేదు. అప్పట్లో 'ఆంధ్రప్రభ' ఈ సంగతులన్నీ పసందుగా రిపోర్టు చేసింది. 

కేసెట్ అనగానే గుర్తొచ్చిన ఇంకో విషయం ప్రయివేటు మిమిక్రీ కేసెట్లు. పందొమ్మిది వందల ఎనభయ్యవ దశకంలో ప్రయివేటు మిమిక్రీ కేసెట్లు విరివిగా వచ్చేవి. సహజంగానే వాటిలో సినిమా వాళ్ళ గొంతులు మిమిక్రీ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు టీవీ చానళ్ళు పండగ స్పెషల్ ప్రోగ్రాం కోసం ఏదో ఒక థీమ్ అనుకుంటున్నట్టుగా, ఈ కేసెట్లకి కూడా ఒక్కో థీమ్ ఉండేది. కేసెట్ ఏదైనా జయంతి పాత్రకి సెంటిమెంట్ డైలాగులే, ముఖ్యంగా 'నాకేం కావాలండీ.. చిటికెడు పసుపు, డబ్బాడు కుంకుమ చాలీ జీవితానికి' అనే డైలాగు తప్పనిసరిగా వినిపించేది. (అప్పట్లో ఇలాంటి కేసెట్లు చేసిన ఒకాయన ఇప్పుడు ప్రముఖ జ్యోతిష్య విద్వాన్ గా పరిణమించడం విశేషం). ఈ మిమిక్రీల వల్ల కూడా జయంతి అంటే సెంటిమెంటు అనే ముద్ర బలపడిపోయింది జనాల్లో. అసలు జయంతి తెరమీద కనిపించగానే ఆ పాత్రకి కథలో రాబోయే కష్టాలని ఊహించేసిన వాళ్ళు నాకు తెలుసు. 

కె. విశ్వనాథ్ 'స్వాతి కిరణం' లో జయంతి పాత్ర పేరు పక్షితీర్థం మామ్మగారు. కథా నాయకుడు గంగాధరానికి సంగీతంలో తొలి గురువు ఈ మామ్మగారే. జయంతి కేవలం సినిమాలే కాదు టీవీలోనూ నటించారని ఎందరికి తెలుసో మరి. ఈటీవీలో వచ్చిన 'అనూహ్య' సీరియల్లో కథానాయిక అనూహ్య (శిల్పా చక్రవర్తి) బామ్మ అనసూయమ్మ పాత్రలో కనిపించారామె. 'అయ్యో రామా అనూహ్య మనసే పారేసుకుందీ' అనే టైటిల్ సాంగ్ తో వచ్చిన ఆ సీరియల్ నేను క్రమం తప్పకుండా చూడడానికి ఒకే ఒక్క కారణం జయంతి. ఆ కథలో బామ్మ పాత్ర కీలకం. భలే గంభీరమైన డైలాగులు ఉండేవి జయంతికి. మనకి సినిమా అంటే హీరోలు. అప్పుడప్పుడూ హీరోయిన్లు కూడా. కథ మొదలు, కెమెరా వరకూ అన్నీ వాళ్ళ చుట్టూనే తిరిగే సినిమాల్లో కొద్దిమంది ఇతర నటీనటులు మాత్రం తమదైన ముద్ర వేస్తారు. అలాంటి కొద్దిమందిలో జయంతి ఒకరు. ఆమె ఆత్మకి శాంతి కలగాలి. 

శనివారం, జులై 10, 2021

నాకు తెలిసిన కత్తి మహేశ్

ఆన్లైన్ ప్రపంచంలోకి నేను అడుగుపెట్టి దాదాపు పదమూడేళ్ళు. తొలినాళ్లనుంచీ నాకు తెలిసిన పేర్లలో ఒకటి కత్తి మహేశ్. ఆన్లైన్ ని ఆధారంగా చేసుకుని అటుపైన ఎత్తులకి ఎదిగిన అతికొద్ది మందిలో తనూ ఒకరు. మహేశ్ ఇక లేరన్న వార్త తెలియగానే అతని  తాలూకు జ్ఞాపకాలన్నీ మనసు లోపలి పొరలనుంచి ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. నాకు తెలిసిన మొదటి ఆన్లైన్ వేదిక 'నవతరంగం' అనే వెబ్ పత్రిక. అక్కడ సినిమా సమీక్షకుడు, విమర్శకుడు పాత్రల్లో మహేశ్ కనిపించారు. అక్కడి నుంచి నా రెండో అడుగు బ్లాగ్ ప్రపంచం. అక్కడ బ్లాగరుగానూ, వ్యాఖ్యాత గానూ మహేశ్ ప్రత్యక్షం. అటు 'నవతరంగం' లోనైనా, ఇటు 'పర్ణశాల'  బ్లాగులోనైనా తను రాసిన పోస్టుల కన్నా చేసిన కామెంట్లే చాలా ఎక్కువ. అవి కూడా ఎక్కువగా వివాదాలకి దారితీసే వ్యాఖ్యలే. 

మహేశ్ ధోరణి చూస్తున్నప్పుడల్లా ఓ రచయిత్రి తరచుగా గుర్తొచ్చే వారు. తొలినాళ్లలో సాధారణ రచనలే చేసిన ఆమె, వివాదాల ద్వారా ఎక్కువ పేరు సంపాదించుకోవచ్చునని తెలుసుకున్న తర్వాత తన ప్రతి రచనలోనూ ఓ వివాదం ఉండేలా చూసుకోవడం అలవాటు చేసుకున్నారు. పేరొచ్చిన ప్రతి వ్యక్తినీ, రచననీ తనదైన ధోరణిలో విమర్శించడం ద్వారా తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చేసుకోగలిగారు. అటుపైన 'మనోభావాల' వైపు దృష్టి సారించారు. పథకం ఫలించింది. ఆ రచనల కారణంగా మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళ తాలూకు ప్రతిస్పందనలతో ఆమెకి మరింత పేరొచ్చేసింది.  ఇంచుమించుగా మహేశ్ కూడా ఇదే స్ట్రాటజీని అమలుచేశారు. ఆయన లక్ష్యం పాపులర్ కావడమే అయి ఉంటే, చాలా తక్కువ కాలంలోనే దానిని సాధించేశారు. 

బ్లాగుల్లోనూ, అంతకన్నా ఎక్కువగా బజ్జులోనూ పేరు తెచ్చుకున్నారు మహేశ్. ఎక్కడ వివాదం ఉన్నా అక్కడ తను ఉండడం, తానున్న ప్రతి చోటా వివాదం ఉండడం ఆన్లైన్ వేదికని పంచుకున్న అందరికీ త్వరలోనే అలవాటైపోయింది. వాదనా పటిమ ద్వారా కన్నా, ఎక్కడ ఏ కార్డు వాడాలో బాగా తెలియడం మహేశ్ కి బాగా కలిసొచ్చిన విషయం. అవతలి వాళ్ళని రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేసేలా చేయడం, వాటి ఆధారంగా వివాదాన్ని మరింత పెంచడం, కొండొకచో వాళ్ళ మీద పోలీసు కేసులు పెట్టడం నిత్యకృత్యంగా ఉండేది. ఎందుకొచ్చిన గొడవ అని కొందరూ, అతని స్ట్రాటజీని అర్ధం చేసుకుని, మనమెందుకు సహకరించాలి?అనే ధోరణిలో మరికొందరు వాదనలకు దిగడం మానేశారు. సరిగ్గా అప్పుడే బ్లాగులు, బజ్జుని మించిన వేదిక దొరికింది మహేశ్ కి. ఫేస్బుక్ మాధ్యమం ద్వారా కొత్త వాదనలు, కొంగొత్త ప్రతివాదులు. 

పాపులారిటీని సంపాదించుకోడమే కాదు, దాన్ని ఛానలైజ్ చేసుకోవడంలోనూ తానే ముందుండి ఒరవడి పెట్టారు మహేశ్. 'క్రౌడ్ ఫండింగ్' ద్వారా సినిమా నిర్మాణం మొదలు పెట్టారు. తానే దర్శకుడు. సినిమా ఆడకపోయినా ఆ రంగంలో ఫుట్ హోల్డ్ దొరికింది. కార్యసాధకులకి అది చాలు. అంతలోనే టీవీ ఛానళ్లలో విమర్శకుడిగా మరో కొత్త అవతారం. సినిమా రంగంలో నిలదొక్కుకోడానికీ తనకి అచ్చొచ్చిన వివాదాలనే నమ్ముకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన సినిమా నటుడు పవన్ కళ్యాణ్ మీద కత్తి కట్టారు. ఫలితంగా, పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కత్తి మహేశ్ చిరపరిచితం అయిపోయారు. నటుడిగా అవకాశాలు రావడం మొదలైంది. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ కూడా పేరు జనంలో నానుతూ ఉండడం అన్నది ముఖ్యం - మంచిగానా, చెడ్డగానా అన్నది తర్వాత. 

నిజానికి మహేశ్ తర్వాతి అడుగు రాజకీయాలవైపే అనిపించింది. కులం, మతం లాంటి కార్డులని వ్యూహాత్మకంగా వాడడం, నిత్యం వివాదాల్లో ఉండేలా జాగ్రత్త పడడం చూసినప్పుడు త్వరలోనే ఇతన్ని ఏదో ఒక రాజకీయ పార్టీలో చూడబోతున్నాం అనుకున్నాను. రోడ్డు ప్రమాదం జరగకపోయి ఉంటే ఆ దిశగా అడుగులు పడి ఉండేవేమో. అతని వైద్య ఖర్చుల నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పదిహేడు లక్షల రూపాయల్ని ఆఘమేఘాల మీద కేటాయించడం చూసినప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జి కాగానే ఇక రాజకీయాలే అనుకున్నాను. ("కత్తి మహేశ్ కోసం ప్రభుత్వం పదహారు ప్రాణాల్ని పణంగా పెట్టింది" అన్నారు మిత్రులొకరు - సహాయనిధి నుంచి సామాన్యులకి విడుదలయ్యే మొత్తం సగటున ఒక్కొక్కరికి లక్ష రూపాయలు). 

చాలా ఏళ్ళ క్రితం సంగతి - బ్లాగు మిత్రులొకరు కథ రాయడానికి ప్రయత్నిస్తూ డ్రాఫ్ట్ మెయిల్ చేశారు. కథ బాగుంది కానీ, కులాల ప్రస్తావన ఉంది. "కులాల గురించి తీసేస్తే కథలో ఫ్లేవర్ ఉండదు. ఉంచితే కత్తి మహేశ్ గారు కత్తి తీసుకుని వస్తారేమో అని అనుమానంగా ఉంది" అన్నది వారి సందేహం. ఆన్లైన్ వేదిక మీద కత్తి మహేశ్ చూపించిన ప్రభావానికి ఇదో చిన్న ఉదాహరణ. తనకేం కావాలో, కావాల్సిన దానిని ఎలా సాధించుకోవాలో చాలా స్పష్టంగా తెలిసిన మనిషి మహేశ్. తన బలాలు, బలహీనతల మీద కూడా మొదటినుంచీ స్పష్టమైన అవగాహన ఉంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ పదమూడేళ్లలో అతను సాధించింది తక్కువేమీ కాదు. తన అడుగులు మాత్రమే కాదు, మరణం కూడా 'సెన్సేషనల్' వార్తే ఇవాళ.  జీవించి ఉంటే మరింత సాధించే వారేమో కూడా. ఎందుకంటే తనకి మార్గం కన్నా, లక్ష్యం ముఖ్యం. 

(ఆత్మల మీద మహేశ్ కి నమ్మకం లేదు, తన కుటుంబానికీ, మిత్రులకీ సానుభూతి). 

సోమవారం, జూన్ 28, 2021

గొల్ల రామవ్వ

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, రచయితా, కవీ కూడా. విశ్వనాథ సత్యనారాయణ 'వేయిపడగలు' నవలని 'సహస్ర ఫణ్' పేరిట హిందీలోకి అనువదించడమే కాదు, తన ఆత్మకథని 'ది ఇన్సైడర్' పేరుతో ఆంగ్ల నవలగా రాశారు కూడా (కల్లూరి భాస్కరం తెలుగు అనువాదం 'లోపలి మనిషి'). 'అయోధ్య 1992' పుస్తకం పీవీ మరణానంతరం ప్రచురణకి నోచుకుంది. ఇవి మాత్రమే కాదు, పీవీ కొన్ని కథలు, కవితలూ కూడా రాశారు. ఎంపిక చేసిన కొన్ని రచనల్ని ఆయన కుమార్తె సురభి వాణీదేవి (మొన్నటి ఎన్నికల్లో టీఆరెస్ నుంచి ఎమ్మెల్సీ గా గెలిచారు) తన సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ తరపున 'గొల్ల రామవ్వ మరికొన్ని రచనలు' పేరిట చిరుపొత్తంగా వెలువరించారు. ఇందులో కథకుడిగా పీవీకి ఎంతో పేరుతెచ్చిన 'గొల్ల రామవ్వ' కథతో పాటు పొలిటికల్ సెటైర్ కథ 'మంగయ్య అదృష్టం,' రెండు కవితలు, మూడు వ్యాసాలు ఉన్నాయి. 

తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో సాగే కథ 'గొల్ల రామవ్వ.' ఈ కథలో నాయకుడు పీవీయే అయ్యే అవకావశాలు ఉన్నాయి. సాయుధుడైన ఓ కాంగ్రెస్ కార్యకర్త పోలీసులకి, నిజం ప్రయివేటు సైన్యం రజాకార్లకీ వ్యతిరేకంగా పోరాటం చేస్తూ, ఓ రాత్రి ఇద్దరు పోలీసుల్ని తుపాకీతో కాల్చి చంపి గొల్ల రామవ్వ గుడిసెలో ఆశ్రయం పొందడం, అతని పట్ల సానుభూతి చూపించిన రామవ్వ ఎంతో ధైర్యాన్ని, యుక్తిని ప్రదర్శించి పోలీసుల బారి నుంచి రక్షించడం ఈ కథ. సాయుధ పోరాటం జరిగే నాటికి పీవీ కాంగ్రెస్ కార్యకర్త, తుపాకీ పట్టి పోరాటంలో పాల్గొన్నారు కూడా. ఈ వివరాలన్నీ 'లోపలి మనిషి' లో ఉన్నాయి. తెల్లవారు జామున గుడిసెలో ప్రవేశించిన వాడు రజాకారో, పోలీసో అని అనుమానించిన రామవ్వ వచ్చింది ఎవరైనా తన ప్రాణం, మనవరాలి మానం పోక తప్పదని నిశ్చయించుకుంటుంది. 

మనవరాలిని కాపాడుకోవడం కోసం వచ్చిన వాడి కాళ్ళమీద పడుతుంది. ఆ వచ్చిన వాడు అటు రజాకార్లకీ, ఇటు పోలీసులకి శత్రువే అని తెలిసినప్పుడు అతన్ని ఆదరిస్తుంది. అతని వొంటిని గుచ్చుకున్న ముళ్ళని తీసి కాపడం పెడుతుంది, తన గుడిసెలో ఉన్న తిండీ పెడుతుంది. కాల్పుల్లో చనిపోయింది పోలీసులు కావడంతో తెల్లారకుండానే ఊరిమీదకి పోలీసుల దండు దిగుతుంది. గుడిసె గుడిసెలోనూ గాలింపు మొదలవుతుంది. పోలీసులు రామవ్వ గుడిసె తలుపులూ తడతారు. ఆ యువకుడిని రక్షించేందుకు అనూహ్యమైన యుక్తి పన్నుతుంది రామవ్వ. పోలీసులకి రామవ్వ మీద అనుమానమే, ఆమె ఒక 'బద్మాష్' అని నిశ్చయం కూడాను. అయినా కూడా వాళ్ళ కళ్ళుకప్పే ప్రయత్నం చేస్తుంది రామవ్వ. కథ చదువుతున్నట్టుగా కాక, ఒక సన్నివేశాన్ని చూస్తున్నట్టుగా పాఠకులకి అనిపించేలా ఈ కథ రాశారు పీవీ. 1949 లో తొలిసారి ప్రచురింపబడిన ఈ కథ నిశ్చయంగా ఎన్నదగినది. 

'మంగయ్య అదృష్టం' కథ ఎప్పుడు రాశారన్న వివరం లేదు కానీ, కథాంశాన్ని బట్టి చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేయవలసి వచ్చిన అనంతర పరిస్థితుల నేపథ్యంలో రాసిన కథ అయి ఉండొచ్చుననిపించింది. బ్రహ్మదేవుడు, సరస్వతిల మధ్య అభిప్రాయం భేదం రావడం, దేవతలందరూ రెండు వర్గాలుగా విడిపోవడంతో మొదలయ్యే ఈ కథ, ఆ రెండు వర్గాలూ మంగయ్య అనే భూలోక వాసి జీవితాన్ని నిర్దేశించే ప్రయత్నాలలో ఎత్తుకి, పై ఎత్తులు వేసుకోవడంతో ఆసక్తిగా సాగుతుంది. ఈ కథ సోషియో ఫాంటసీ ఎంతమాత్రమూ కాదు, పూర్తి పొలిటికల్ సెటైర్. స్మగ్లర్లకి కడునమ్మకస్తుడిగా మారిన మంగయ్య, అనూహ్యంగా రాజకీయాల్లోకి రావడం, చకచకా పైకెదడగం వర్ణిస్తారు రచయిత. నాటి రాజకీయాలని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, 'మంగయ్య' ని పోల్చుకోవడం పెద్ద కష్టం కాదు. ఈ 'మంగయ్య'ని 'లోపలి మనిషి' లోనూ చూడొచ్చు. 

పుస్తకంలో ఉన్న రెండు కవితాల్లోనూ ఒకటి,  భారత స్వతంత్ర రజతోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో శాసన సభలో చదివింది. రెండోది తన ప్రియమిత్రుడు కాళోజీ నారాయణ రావు షష్టిపూర్తి సందర్భంగా అభినందిస్తూ రాసింది. వ్యాసాల్లో మొదటిది చివుకుల పురుషోత్తం తెలుగు నవల 'ఏది పాపం?' కి సూర్యనాథ ఉపాధ్యాయ హిందీ అనువాదానికి పీవీ హిందీలో రాసిన ముందుమాటకి తెలుగు అనువాదం. రెండోది 'వేయిపడగలు - పండిత ప్రశంస'. తన 'సహస్ర ఫణ్' కి రాసుకున్న ముందుమాటకి తెలుగు అనువాదం. మూడోది హిందీ కవయిత్రి మహాదేవి వర్మ షష్టిపూర్తి ప్రత్యేక సంచికకి రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం. సాహిత్యం పట్ల పీవీ 'దృష్టి' ఏమిటో తెలుసుకోవాలనుకునే వారికి ఇవి ఉపకరిస్తాయి. 

పుస్తకం చివర్లో ఇచ్చిన జీవన రేఖల్లో 'ప్రచురించిన రచనలు' జాబితాలో అనేక కథలు, కవితలు, నవలికలు అన్నారు. స్వయానా కూతురే ప్రచురించిన పుస్తకంలో కూడా ఇంతకు మించిన వివరాలు లేకపోవడం విషాదం. కనీసం ఎన్ని కథలు, కవితలు, నవలికలు అనే అంకెలు (సంఖ్యలు) కూడా ఇవ్వలేదు.  పీవీ తొలినాటి రచనలు కలం పేరుతో రాసినవే. 'గొల్ల రామవ్వ' ని 'విజయ' అనే కలం పేరుతో రాశారు. ఆయా రచనల వివరాలని ప్రకటించకపోతే మరుగున పడిపోయే ప్రమాదం ఉంది ఇందుకు కుటుంబ సభ్యులని మించి పూనుకోగలవారెవరు? రెండు ముద్రణలు పొందిన 'గొల్ల రామవ్వ' పుస్తకం 103 పేజీలు, వెల రూ. 100. ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. 

ఆదివారం, జూన్ 13, 2021

స్వాతి చినుకు సందెవేళలో ...

మన సినిమాల్లో పాటలకి, అందునా వాన పాటలకి, ప్రతికించి సందర్భం అంటూ ఉండాల్సిన అవసరం లేదు. నాయికో, నాయకుడో లేక సైడు కేరెక్టర్లో కలగనేస్తే సరిపోతుంది. సినిమా ఆసాంతమూ ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించినా వాన పాట అనేసరికి నాయిక చీర కట్టక తప్పదు. తెలుగుదనమా, మజాకానా? అలాగే గీత రచయితలూనూ.. రెండో మూడో చరణాల్లో వాననీ, నాయికనీ వర్ణించేస్తే సరిపోతుంది. అనాదిగా మన వానపాటల సంప్రదాయం ఇదే. అత్యంత అరుదుగా ఈ సంప్రదాయానికి కాసిన్ని మినహాయింపులు దొరుకుతూ ఉంటాయి. 

'ఆఖరి పోరాటం' (1988) సినిమాలో 'స్వాతి చినుకు సందెవేళలో..' అనే వాన పాటని పూర్తిగా సందర్భోచితం అనలేం కానీ, అలాగని డ్రీమ్ సీక్వెన్సు కూడా కాదు. నాయికానాయకులిద్దరూ కలిసి విలన్ల దృష్టిని మళ్లించి, చిన్నపిల్లల్ని రక్షించడం కోసం చేసిన డైవర్షన్ స్కీములో భాగం. మామూలుగా అయితే ఇది వ్యాంపు గీతానికి అనువైన సందర్భం. కానీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు, శ్రీదేవి-నాగార్జునల మీద ఓ వానపాటని చిత్రీకరించేశాడు. వేటూరి రచన, ఇళయరాజా స్వర రచన, జానకీ-బాలూల యుగళం. (తీరాచేసి కథ ప్రకారం నాయిక మామూలమ్మాయేమీ కాదు, పవర్ఫుల్ ఆఫీసర్. అయినప్పటికీ విలన్ల భరతం పట్టేందుకు స్కిన్ షో తప్ప వేరే దారి దొరక్కపోవడమే విషాదం!). "స్వాతి చినుకు సందెవేళలో... లేలేత వణుకు అందగత్తెలో... 
మబ్బే కన్ను గీటే అరె మతే పైట దాటే
చలే కొరుకుతుంటే చెలే ఒదుగుతుంటే
భలేగుంది పడుచు ముచ్చటా  బలే కదా గాలి ఇచ్చటా"

...అంటూ నాయకుడు పాట అందుకుంటాడు. తగుమాత్రం గాలితో వర్షం మొదలవుతుంది తెరమీద. మబ్బు కన్ను గీటడమూ, మతి పైట దాటడమూ వేటూరి మార్కు చమక్కులు. 'బలే కదా గాలి ఇచ్చటా' అనడంలో నాయికా నాయకుల మధ్యకి వచ్చి చేరిన గాలి బలైపోతోందన్న కొంటెదనం ఉంది. శ్రద్దగా వినకపోతే 'భలే కదా గాలి ఇచ్ఛటా' గా పొరబడే అవకాశమూ ఉంది.  

"స్వాతి చినుకు సందెవేళలో... లేలేత వలపు అందగాడిలో... 
ఈడే ఉరుముతుంటే... నేడే తరుముతుంటే
సరాగాలేతోటే స్వరాలల్లుకుంటే
పదా అంది పడుచు పూపొదా.. ఇదే కదా చిలిపి ఆపదా"

...ఇది నాయిక కొనసాగింపు. సాధారణంగా పాటకి ఒకటే పల్లవి ఉంటుంది కానీ, ఈ పాటకి ఒకేలా వినిపించే రెండు పల్లవులు. వర్షానికి తగ్గ వాతావరణం - చినుకు, వణుకు, మబ్బు, చలి, గాలి, ఉరుము - మొత్తం రెండు పల్లవుల్లోనూ అమరిపోయింది. వీటికి జతగా మరో రెండు చరణాల యుగళం. 

"ఈ గాలితో ఒకే చలీ ఈ దెబ్బతో అదే బలి
ఈ తేమలో ఒకే గిలీ ఈ పట్టుతో సరే సరి
నీ తీగకే గాలాడక.. నా వీణలే అల్లాడగా..
నరాలన్ని వేడి పదాలెన్నొ పాడా
వరాలిచ్చి పోరా వరించాను లేరా
చల్లని జల్లుల సన్నని గిల్లుడు సాగిన వేళా.. కురిసిన... "

సున్నితమైన శృంగారం, వానపాటకి తప్పదు కదా.  "నీ తీగకే గాలాడక.. నా వీణలే అల్లాడగా.." అన్నది పూర్తిగా వేటూరి మార్కు. "నరాలన్ని వేడి పదాలెన్నొ పాడా" లో 'వేడి' పదాలకి సంబంధించింది, వేడిపదాలు.. పాటలో పలికిన విధానం  'వేడుకోలు' అని అర్ధం స్ఫురింపజేస్తోంది. 

"ఈ వానలా కథేమిటో.. నా ఒంటిలో సొదెందుకో
నీకంటిలో కసేమిటో.. నాకంటినీ తడెందుకో
తొలివానలా గిలిగింతలో.. పెనవేసినా కవ్వింతలో
ఎదే మాట రాకా పెదాలందు ఆడా
శృతే మించిపోయి లయే రేగిపోగా
మబ్బుల చాటున ఎండలు సోకిన అల్లరి వేళా మెరిసిన..."

లాకాయిలూకాయి కవులెవరూ "నీకంటిలో కసేమిటో.. నాకంటినీ తడెందుకో" అనలేరు. గుండె గొంతుకలో కొట్టాడడం తెలుసు కానీ, ఇక్కడ కవి ఆ ఎదని పెదాలవరకూ తీసుకొచ్చేశారు. శ్రుతిలయల్ని మాత్రం విడిచిపెట్టారా ఏంటి? 

ఇళయరాజా ఇచ్చిన హుషారైన ట్యూనుకి అంతే హుషారుగా పాడారు గాయనీగాయకులు. నాగేశ్వరరావుతో ఆడిపాడిన డ్యూయెట్లన్నింటికీ చెప్పుల్ని త్యాగం చేసిన శ్రీదేవి, వాళ్ళబ్బాయితో చేసిన ఈ పాటకీ ఒఠి కాళ్లతోనే నర్తించింది పాపం. అంతకు ముందు సంవత్సరం దేశాన్ని ఊపేసిన 'మిస్టర్ ఇండియా' వానపాట ఆమెకి బాగా ఉపయోగించి ఉండాలి, ఈపాట విషయంలో. (నాకైతే, ఆ పాట చూసే ఈ పాటని కథలో ఇరికించి ఉంటారని బలమైన సందేహం). చూడ్డానికే కాదు, వినడానికీ బాగుండే ఈ పాట నా ప్లేలిస్టులో పర్మనెంటు మెంబరు. 

శుక్రవారం, జూన్ 04, 2021

కారా మాస్టారు ...

దాదాపు పదిహేనేళ్ల క్రితం ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకావిడ తన పుస్తకావిష్కరణ సభని హైదరాబాద్ లో ఏర్పాటు చేసుకున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న ఒక హోటల్ టెర్రాస్ మీద చాలా వైభవంగా జరిగిందా సభ. నా వరకు, అంతకు ముందు, ఆ తర్వాత కూడా అంతటి ఖరీదైన సభని చూడలేదు. ముగ్గురు హై-ప్రొఫైల్  ముఖ్య అతిధులు పుస్తకాన్ని చాలా మెచ్చుకుంటూ మాట్లాడారు. ఇద్దరు సాహితీ ప్రముఖులు ఆ సభలో నిశ్శబ్ద ప్రేక్షకులు - ఒకరు అబ్బూరి ఛాయాదేవి, రెండోవారు కాళీపట్నం రామారావు మాష్టారు. సభ పూర్తవ్వగానే మాస్టారు   బయల్దేరబోతూ  రచయిత్రిని పిలిచి ఒకటే మాట చెప్పారు: "వాళ్లంతా పుస్తకం చాలా బాగుందని మెచ్చుకున్నారు కానీ, మెరుగు పరుచుకోవాల్సిన  విషయాలున్నాయి, వాటిమీద దృష్టి పెట్టడం అవసరం" ..నేను మాత్రమే కాదు, ఆ మాటలు విన్న కొద్దిమందీ ఆశ్చర్యపోయారు. కారా మాస్టారిని ప్రత్యక్షంగా చూడడం అదే ప్రధమం. 

మాస్టారితో కొంచంసేపు వివరంగా మాట్లాడింది మాత్రం తర్వాత పదేళ్లకి. ఐదారేళ్ళ క్రితం ఓ ఎండవేళ శ్రీకాకుళంలో పని చూసుకుని విశాఖపట్నం వెళ్ళబోతుండగా ఒక్కసారి కూడా 'కథానిలయం' చూడలేదని గుర్తొచ్చి విశాఖ 'ఎ' కాలనీ వైపు దారి తీసినప్పుడు కూడా ఆయన్ని కలుస్తాననుకోలేదు. కథానిలయం తాళం చెవి మాష్టారింట్లో ఉంటుందని తెలిశాక, ఆ అపరాహ్న వేళ బెల్ కొట్టి ఆయన్ని నిద్రలేపడమా, కథానిలయానికి బయటినుంచే దణ్ణం పెట్టేసుకుని తిరిగి వెళ్లిపోవడమా అనే సందిగ్ధం. ఓ ప్రయత్నం చేద్దామనిపించింది. ఆశ్చర్యం, ఆయన నిద్రపోవడం లేదు సరికదా కుర్చీలో కూర్చుని దీక్షగా చదువుకుంటున్నారు. పక్కనే పెన్సిలు, బుక్ మార్కు కోసం కాబోలు కొన్ని కాగితాలు ఉన్నాయి. తలుపు తీసినవారు మేస్టారిని చూపించి లోపలి తప్పుకున్నారు. ఆయనేమో, మర్నాడే పరీక్షన్నంత శ్రద్ధగా చదువుకుంటూ, మధ్యమధ్యలో పెన్సిల్ తో అండర్లైన్ చేసుకుంటూ, మార్జిన్లో నోట్సు రాసుకుంటున్నారు, (అప్పటికే ఆయనకి తొంభై దాటేశాయి) ఎంత సొగసైన దృశ్యమో!!

కాసేపటికి తలుపు తీసిన వారు తాళంచెవితో  హాల్లోకి  వచ్చి "మీరాయన్ని  పలకరించండి  పర్లేదు. కొంచం గట్టిగా మాట్లాడాలి" అని చెప్పి వెళ్లారు కానీ, మాస్టారిని డిస్టర్బ్ చేయాలనిపించలేదు. ఓ క్షణానికి ఆయనే తలెత్తి చూశారు. కళ్ళకి కళ్ళజోడు, మడిచి కట్టిన తెల్ల పంచ, అనాచ్చాదిత ఛాతీ మీద బరువుగా వేలాడుతున్న జంధ్యం. ఆయన కథలకీ, ఈ ప్రయివేటు రూపానికీ అన్వయం చేసుకునే ప్రయత్నం జరుగుతోంది లోపల్లోపల. "మీరు లెఫ్టిస్టు ఐడియాలజీ తోనే కథలన్నీ రాశారు కదా, మరి ఇదేవిటీ?" అని అడుగుదామా అనుకునే, 'విప్లవానికి జంఝప్పోచే అడ్డవైపోతుందా ఏవిటి?' అనిపించి ఆ ప్రశ్న మానుకున్నా. అసలైతే మాస్టారిని ఎప్పటినుంచో 'కలిస్తే అడగాలి' అనుకుంటున్న ప్రశ్న ఒకటుంది. 'యజ్ఞం' కథ మీద మీద జరిగిన చర్చ, రచ్చలలో మిగిలిన వాళ్ళ సంగతెలా ఉన్నా సొంత లెఫ్ట్ గ్రూపు నుంచి విమర్శలు వచ్చినప్పుడు ఆయనకేమనిపించిందీ అని. కానైతే ఆ ప్రశ్నకది సమయమూ, సందర్భమూ కాదనిపించి ఊరుకున్నా. పస్తాయించి చూస్తే ఆయన చుట్టూ ఉన్నవన్నీ కొత్త పుస్తకాలే. కొత్త రచయిత (త్రి) లు రాసినవే. అవి ఎలా ఉన్నాయని అడిగా. 

"చాలామంది బాగా కృషి చేసి రాస్తున్నారు. కొందరు కృషి లేకుండా రాస్తున్నారు. రాయడం మాత్రం మానడం లేదు, అందుకు సంతోషం" అన్నారాయన. ప్రశ్నలు క్లుప్తంగా ఉండాల్సిన అవసరం అర్ధమై, "మీ కథల్లో నేటివిటీ.." అన్నాను   కొంచం గట్టిగా. "ఆ పాత్రలన్నీ నిజజీవితం నుంచి వచ్చినవే. వాళ్ళ కట్టు, బొట్టు, భాష, యాస అన్నీ నాకు తెలిసినవే. కథలెక్కడినుంచి వస్తాయ్? మనుషుల నుంచే కదా" అన్నారాయన. అప్పుడు 'కథా నిలయం' గురించి అడిగితే ఆయన అక్షరాలా చిన్న పిల్లాడై పోయారు. డిజిటైజేషన్ ప్రాజెక్టు గురించి చాలా వివరంగా చెప్పారు. ఎవరెవరు పనిచేస్తున్నారో, ఫండింగ్ చేశారో  పేరుపేరునా జ్ఞాపకం చేసుకుని చెప్పారు. "కొన్ని పేర్లు, విషయాలు బాగా గుర్తుండడం లేదు" అన్నారు కొంచం విచారంగా. కాసిని కబుర్లయ్యాక 'కథానిలయం' చూడాలన్న కోరిక బయటపెడితే, వాళ్ళ మనవడికి తాళంచెవిచ్చి కూడా పంపారు. రోడ్డుకి ఒకపక్క మాష్టారి ఇల్లయితే, రెండోవైపున్న  భవనమే 'కథానిలయం'.

ఎటుచూసినా కథలే కనిపించే ఆ నిలయంలో గోడలకి రచయితలు, రచయిత్రుల ఫోటోలు వేలాడుతున్నాయి. వాటిని శ్రద్ధగా చూస్తుండగా స్పురించిన విషయం - మాష్టారు రచయితగా ఒక భావజాలానికి కట్టుబడిన కథలు మాత్రమే రాసినా, 'కథానిలయం' లో మాత్రం భావజాలాలతో నిమిత్తం లేకుండా కథలన్నింటికీ  చోటిచ్చారు. కథల్ని ప్రేమించే వాళ్ళు చాలామందే ఉన్నారు కానీ, కథల కోసం తాను ఇష్టంగా కట్టుకున్న ఇంటినే ఇచ్చేసేంత ప్రేమ ఒక్క మాస్టారికి మాత్రమే సొంతం. కథలకి ఓ గూడు ఏర్పాటు చేయడం ఓ ఎత్తైతే, ఊరూరూ కాలికి బలపం కట్టుకుని తిరిగి మరీ అరుదైన కథల్ని సేకరించి, భద్రపరచడం మరో ఎత్తు. ఆయన కథా ప్రయాణాల కథలు బహు గమ్మత్తైనవి. వాటిని ఆయన మిత్రులు రికార్డు చేయడం అవసరం. పాఠకుడిగా, విమర్శకుడిగా కూడా ఆయనెక్కడా భావజాలపు గిరులు గీసుకోలేదు. జీవితమంతా కథల్ని ప్రేమించారు,   కథకుల్ని తన సునిశిత విమర్శతో  ప్రోత్సహించారు. తెలుగు కథ అనగానే వెంటనే గుర్తొచ్చేంతగా శేషకీర్తులయ్యారు. కారా మాస్టారికి నివాళి. 

గురువారం, మే 20, 2021

నవ్వులో శివుడున్నాడురా

జుట్టున్నమ్మ ఏ కొప్పు ముడిచిన అందంగానే ఉంటుంది అన్నట్టుగా విషయపరిజ్ఞానం, రాయడంలో ఒడుపూ తెలిసిన వాళ్ళు ఏం రాసినా చదివించేదిగానే ఉంటుంది. ఇందుకు తాజా ఉదాహరణ శ్రీరమణ నుంచి వచ్చిన 'నవ్వులో శివుడున్నాడురా' అనే 'విశేషాల' సంకలనం. వ్యాసాలు, కబుర్లు, చమక్కులూ.. వీటన్నింటి కలగలుపు ఈ 232 పేజీల పుస్తకం. మొత్తం మూడు అధ్యాయాలుగా విభజింపబడిన ఈ పుస్తకంలో మొదటి అధ్యాయంలో హాస్యాన్ని గురించి పదిహేను వ్యాసాలున్నాయి. ఇవన్నీ హాస్యభరితంగా ఉంటూనే అకడమిక్ విలువని కలిగి ఉన్నాయి. 'తెలుగు సాహిత్యంలో హాస్యం' అనే అంశం మీద పరిశోధన చేయాలనుకునే వారు తప్పక రిఫర్ చేయాల్సిన వ్యాసాలివి. కేవలం లిఖిత సాహిత్యం మాత్రమే కాదు, హరికథలు, అవధానాలు లాంటి అలిఖిత సాహిత్యంలో హాస్యాన్నీ ఈ వ్యాసాల్లో సందర్భోచితంగా చేర్చారు. ఇవన్నీ శ్రీరమణ చేసిన రేడియో ప్రసంగాలు. 

"త్యాగరాజ స్వామి కృతుల్లో కొన్నిచోట్ల చిత్రమైన శబ్దాలు కనిపిస్తాయి. ఒక కీర్తనలో 'నాదుపై ఏల దయరాదూ' అని ఉంటుంది. 'నాదు శబ్దం ఎలా చెల్లుతుంది స్వామీ' అని ఒక శిష్యుడు అడిగాడు. 'చెల్లదు నాయనా! చెల్లదు. అజ్ఞానం వుంది కనకనే ఏల దయరాదూ అని రాముణ్ణి వేడుకోవడం' అన్నారట త్యాగయ్య" ...మచ్చుకి ఇదొక్కటి. ఇలాంటివి ఈ పదిహేను వ్యాసాల నిండా కోకొల్లలు. కవులు, రచయితలు, నాటక కర్తలు, చిత్రకారులు, కార్టూనిస్టులు.. ఇలా ఎందరెందరి కబుర్లో వినిపిస్తాయీ వ్యాసాలలో. ఇలాంటి చోట విశ్వనాథ ప్రస్తావన రాకపోతే అది శ్రీరమణ రచనే కాదు. ఓసారి విశ్వనాథ, రుక్కాయిని (జరుక్ శాస్త్రిగా ప్రసిద్ధుడైన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి - పేరడీలు సృష్టికర్త మాత్రమే కాదు, 'ఒఖ్ఖ దణ్ణం' లాంటి కాలానికి నిలబడే కథలెన్నో రాశారు కూడా) 'ఏం చేస్తున్నావు నాయనా?' అని అడిగారట. 'వేయిపడగల్ని తెలుగులోకి అనువదిస్తున్నా' అన్నారట రుక్కాయి తడుముకోకుండా.  

రెండో భాగం 'బాపూరమణశ్రీరమణ' లో మొత్తం ఎనిమిది వ్యాసాలున్నాయి. పేరులోనే చెప్పినట్టుగా ఇవన్నీ బాపూ-రమణలని గురించే. ఆ ద్వయంతో శ్రీరమణది సుదీర్ఘమైన అనుబంధం. బాపు పుస్తకాలకి ముందుమాటలు రాయడం మొదలు, వాళ్ళ సినిమాలకి పనిచేయడం (ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్) వరకూ వాళ్ళని చాలా దగ్గరగా చూశారు శ్రీరమణ. కొన్ని ప్రత్యేక సందర్భాలలో వాళ్లతో చేసిన ఇంటర్యూలు, రమణ వెళ్ళిపోయాక రాసిన నివాళి వ్యాసమూ ఉన్నాయి భాగంలో. వీటిలో 'దక్షిణ తాంబూలం అను కార్తీక దక్షిణ' అస్సలు మిస్సవకూడనిది. దూరదర్శన్ వారి 'టెలి స్కూల్' కార్యక్రమానికి వీడియో పాఠాలు షూట్ చేయడం కోసం గోదావరి జిల్లాలకు వెళ్ళినప్పుడు ఓ లాకు సూపర్వైజర్ గారింట్లో చేసిన కార్తీక భోజనం కథ ఇది. చదువుతుంటే, ఆ చిన్న ఇంట్లో మనం కూడా ఆ దంపతుల ఆతిధ్యం పొందుతున్నట్టు అనిపిస్తుంది. ఆధరువులన్నీ వాటి రుచులతో సహా ఎంతగా గుర్తు పెట్టుకున్నారో శ్రీరమణ. బహుశా అందుకే 'మిథునం' రాయగలిగారు!

ఇక పుస్తకంలో ముచ్చటైన మూడోభాగం శీర్షిక 'సశేషాలు-విశేషాలు' తొమ్మిది వ్యాసాల సంకలనం. వీటిలో మొదటిది 'నాస్తికానికి ముందుమాట' పేరుతో నరిశెట్టి ఇన్నయ్య ఆత్మకథకి రాసిన ఇరవై పేజీల ముందుమాట. "అర్ధంకాకో, ఎందుకులే అనుకునో ఈ ముందుమాటని ఆ పుస్తకంలో చేర్చుకోలేదు" అన్న చివరిమాట నిజంగానే మాస్టర్ స్ట్రోక్. ఈ ఒక్క వ్యాసం కోసమైనా ఈ పుస్తకాన్ని మన లైబ్రరీలో దాచుకోవాలి.  నాలుగు ఎలిజీలు - ఎస్వీ భుజంగరాయ శర్మ, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, నండూరి రామ్మోహన రావు - మళ్ళీ మళ్ళీ చదివించేవిగా ఉన్నాయి.  మద్రాసులో ఓసారి అనుకోని విధంగా శ్రీరమణ గారబ్బాయి అక్షరాభ్యాసం శ్రీకాంతశర్మ చేతులమీదుగా జరిగింది. "కొన్నాళ్ళు గడిచినాయ్. బళ్ళో మావాడి ప్రోగ్రెస్ కార్డు ఎప్పుడొచ్చినా కాపీ తీయించి శర్మకి పోస్ట్ చేసేవాణ్ణి. 'ఇదేంటండీ? నన్నీవిధంగా హింస పెడుతున్నారు. నేను వద్దు మొర్రో అన్నా వినకుండా నాతో దిద్దబెట్టించారు. నేనెప్పుడూ లెక్కల్లో పూరే. వాడికి లెక్కల్లో తోకలేని తొమ్మిదులు, తల లేని ఆర్లు వస్తుంటే నాదా పూచీ' అంటూ జవాబులు వస్తుండేవి." ..చదువుతూ నవ్వాపుకోవడం మన తరమా? 

వ్యాసాల చివర్లో పేజీల్లో ఖాళీలు మిగిలిపోతే వాటినలా వదిలేయకుండా బాపూ కార్టూన్లు ప్రచురించడం వల్ల పుస్తకానికి అదనపు శోభ చేకూరింది. 'నవ్వులో శివుడున్నాడురా' అన్న మాట మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిదట. ఈ పుస్తకానికి చక్కగా అమిరింది. సరసి గీసిన కైలాసం ముఖచిత్రంలో శ్రీరమణ వేషంలో ఉన్న శివుడు, ఆయన మెడలో ఫణిరాజుతో సహా ఎల్లరూ నవ్వులు చిందిస్తున్నారు. తన మిత్రులు వేలమూరి శ్రీరామ్ ప్రోత్సాహంతో ఈ పుస్తకం తీసుకొచ్చానని చెబుతూ, "దేవుడు మేలు చేస్తే చిలకలపందిరి, సరసం.కామ్ (హాస్య కదంబాలు), విరాట, ఉద్యోగ పర్వాలు, ఇంకా మరికొన్ని పుస్తకాలు రావాల్సి ఉన్నాయి" అని చెప్పేశారు. వీటిలో 'చిలకలపందిరి' కోసం నేను బాగా ఎదురు చూస్తున్నా - శ్రీరమణ రాతకి, మోహన్ గీతకీ మధ్య విపరీతమైన పోటీ ఉంటుందా పందిట్లో. వీవీఐటీ ప్రచురించిన 'నవ్వులో శివుడున్నాడురా' వెల రూ. 180. ఆన్లైన్ లో లభిస్తోంది. 

సోమవారం, మే 17, 2021

ఎటర్నల్ రొమాంటిక్ - మై ఫాదర్, జెమినీ గణేశన్

ఎప్పుడో 'మహానటి' సినిమా రిలీజైన కొత్తలో ప్రారంభించి, కమల్ హాసన్ రాసిన ముందుమాట చదివి పక్కనపెట్టి, అటుపైన దాదాపు మర్చిపోయిన పుస్తకం నారాయణి గణేష్ రాసిన బయోగ్రఫీ 'Eternal Romantic - My Father, Gemini Ganesan'. సగం చదివిన పుస్తకాలని పరామర్శిస్తుంటే కంటపడిన ఈ ఇంగ్లీష్ పుస్తకాన్ని ఏకబిగిన చదవడం పూర్తి చేసేశాను. ఒకట్రెండు చోట్ల కాస్త సాగతీత ఉన్నా, ఏకబిగిన చదివించిన పుస్తకం అనే చెప్పాలి. జెమినీ గణేశన్ కి తన భార్య అలిమేలు (బాబ్జీ అంటారు చిన్నా పెద్దా అందరూ) వల్ల కలిగిన నలుగురు కూతుళ్లతో మూడో అమ్మాయి నారాయణి. అక్కలిద్దరిలాగా డాక్టరు కాకుండా, జర్నలిస్టయింది. 'టైమ్స్ ఆఫ్ ఇండియా' లో ఎడిటర్ గా పనిచేస్తున్న నారాయణి తన తల్లిదండ్రులిద్దరూ మరణించిన కొన్నేళ్ల తర్వాత తన తండ్రి ఆత్మకథ రాయడానికి పూనుకుంది. 

జెమినీ గణేశన్ పుదుక్కోటై లో పుట్టి పెరిగిన తమిళుడే అయినా, తెలుగు నేలకి అల్లుడి వరస. అతని జీవితంలో ఉన్న ఉన్న స్త్రీలలో అధికారికంగా బయటికి తెలిసిన ఇద్దరు స్త్రీలు తెలుగు వాళ్ళు. జెమినీ నటి పుష్పవల్లి ద్వారా రేఖ (బాలీవుడ్ నటి), రాధ (పెళ్ళిచేసుకుని అమెరికాలో స్థిరపడింది) లకు, మహానటి సావిత్రిని పెళ్లి చేసుకుని ఆమె ద్వారా విజయ చాముండేశ్వరి (చెన్నై), సతీష్ (అమెరికా) లకూ తండ్రయ్యాడు. వీళ్ళిద్దరే కాకుండా, మరికొందరు స్త్రీలూ అతని జీవితంలో ఉన్నారు. ఇంటి యజమానిగా, భర్తగా, తండ్రిగా జెమినీ గణేశన్ ఎలా ఉండే వాడు, అతని విస్తృత సంబంధాల తాలూకు ప్రభావం వ్యక్తిగత జీవితం మీద ఎలా ఉండేది అనే విషయాల మీద దృష్టి పెట్టి రాశారీ పుస్తకాన్ని. జెమినీతో సహా ఎవరినీ జడ్జీ చేయకపోవడం ఈ పుస్తకం ప్రత్యేకత. ప్రత్యేకించి తన వ్యక్తిగత జీవితంలో రెండు సార్లు డైవోర్సులు జరిగాయని చెప్పిన  రచయిత్రి, ఆ ప్రభావాన్ని రచనలో ఎక్కడా కనిపించనివ్వలేదు. 

పుదుక్కోటైలో ఓ సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన గణేశన్ ('మహానటి' లో చూపించినట్టు మెడిసిన్ చదువుకోడానికి డబ్బులేని నేపధ్యం కాదు, అసలు మెడిసిన్ చదవాలని సీరియస్ గా అనుకోలేదు కూడా), చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకుని చిన్న తాత పెంపకంలో పెరిగాడు. ఆ చిన్నతాత ఎవరో కాదు, దేవదాసి చంద్రమ్మాళ్ ని రెండో పెళ్లి చేసుకుని ఆమె ద్వారా ముత్తులక్ష్మి రెడ్డికి జన్మనిచ్చిన నారాయణ స్వామి. గణేశన్ యవ్వనారంభంలో ముత్తులక్ష్మి ఇంట్లోనే గడిపాడు. మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలోనే అలిమేలుతో పెళ్లయింది. క్రికెట్టు, టెన్నిస్, పుస్తకాలు, సినిమాలు, నాటకాలు గణేశన్ కి అభిమాన విషయాలు. నాటి డైరీలని ప్రస్తావిస్తూ నారాయణి ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. సెలవులకి పుదుక్కోటై వెళ్లి, మద్రాసుకి తిరిగొచ్చిన రోజున డైరీ ఎంట్రీ 'మిస్సింగ్ పి' అని ఉంది. "ఈ 'పి' పుదుక్కోటై కావొచ్చు, లేదూ ఎవరన్నా లేడీ లవ్ కావొచ్చు, ఎవరికి తెలుసు?" అంటారు రచయిత్రి.


చదువయ్యాక ఒకట్రెండు చిన్న ఉద్యోగాలు, అటుపైన జెమినీలో కాస్టింగ్ అసిస్టెంట్ గా ఉద్యోగం. త్వరలోనే నటించే అవకాశం, అంతకన్నా త్వరగా హీరోగా నిలదొక్కుకోవడం జరిగిపోయాయి. నిజానికి అలిమేలుకి తన భర్త సినిమాల్లో నటించడం ఇష్టం లేదు. పుట్టింటి వాళ్ళు కలిగిన వాళ్ళే. ఆమెకి ఇల్లు, ఆస్థి కూడా ఉన్నాయి. అప్పటికే ఇద్దరు కూతుళ్లు. వాళ్ళని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది కూడా. నెల్లాళ్లకే మనసు మార్చుకుని మద్రాసు వచ్చేసింది. సినిమాల్లో చేరిన తొలినాళ్లలోనే పుష్పవల్లితో అనుబంధం ఏర్పడింది. ఇద్దరమ్మాయిలు కలిగిన తర్వాత జరిగిన బ్రేకప్ కూడా పరస్పరాంగీకారంతోనే జరిగిందంటారు నారాయణి. చివరి వరకూ పుష్పవల్లి ఓ స్నేహితురాలిగానే ఉన్నారట. గణేశన్ టాప్ హీరో అయ్యాక మిగిలిన ఇద్దరు టాప్ హీరోలు శివాజీ, ఎంజీఆర్ ఇతనికి పెట్టిన ముద్దుపేరు 'సాంబార్' (వాళ్లిద్దరూ మాంసాహారులు). "నాన్న ఆ పేరుని సరదాగానే తీసుకున్నారు" అన్నారు రచయిత్రి. 

జెమినీ కుటుంబంలోనూ, అతని వ్యక్తిగత జీవితంలోనూ పెద్ద కుదుపు సావిత్రితో జరిగిన బ్రేకప్. ఆ సంఘటన జెమినీ మీద, ఇంటి వాతావరణం మీదా ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో వివరంగా రాశారు తప్ప, ఎవరినీ సమర్ధించలేదు, నిందించనూ లేదు నారాయణి. అత్తగారు, చిన్నత్తగారు, తాను, నలుగురు కూతుళ్లు మాత్రమే ఉన్న ఇంటికి భర్త ఏ వేళలో వస్తాడో, ఏ స్థితిలో వస్తాడో తెలియని పరిస్థితి అలిమేలుకి. "ఒక్కోసారి నాన్న స్నేహితుల ఇళ్లనుంచి అర్ధరాత్రులు ఫోన్లు వచ్చేవి, వచ్చి తీసుకెళ్లమని. తాగి పడిపోయిన ఆ మనిషిని ఎవరు వెళ్లి తీసుకురావాలి?" ఇలాంటివే మరో రెండుమూడు "క్రైసిస్" లు ఉన్నాయి జెమినీ జీవితంలో. వాటి ప్రభావం కుటుంబం మీద గట్టిగానే పడింది. ఇంతకీ నారాయణి, విజయ చాముండేశ్వరి చిన్నప్పుడు ఒకే బడిలో చదువుకున్నారు, స్నేహితులు కూడా. జెమిని ఇంటినుంచి, సావిత్రి ఇంటికి తరచుగా వెళ్లిన రెండో వ్యక్తి  నారాయణే. ఆ విశేషాలు వివరంగానే రాశారు. 

ఒకరోజు స్కూల్ అయిపోయాక నారాయణి తన కారు కోసం ఎదురు చూస్తుంటే క్లాస్ టీచర్ హడావిడిగా వచ్చారు. వస్తూనే "నీకు తెలుసా, మీ నాన్న ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నారు" అన్నారు. "అవును, ప్రతి సినిమా చివర్లోనూ మా నాన్న హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటారు" అన్నారు బాల నారాయణి ప్రివ్యూ షోలు చూసిన అనుభవంతో. ఇలాంటి సరదా విషయాలూ చాలానే ఉన్నాయి పుస్తకంలో. నిజానికి ఇవే పుస్తకాన్ని చివరికంటా ఆసక్తిగా చదివించాయి. అరుదైన ఫోటోలు ఈ పుస్తకాన్ని అదనపు ఆకర్షణ. అయితే, పుస్తకం రెండో సగంలో ఫోటోలో మరీ ఫ్యామిలీ ఆల్బమ్ ని తలపించాయి. "This is by no means a faithful documentation of Gemini Ganesan as a film actor; neither do I claim to offer a critical appraisal of his films. This is the story of growing up with a star as a father, adored and respected by many, and perhaps disliked by a few" అన్న మాటలకి పుస్తకం ఆసాంతమూ కట్టుబడే ఉన్నారు రచయిత్రి. నూటనలభై పేజీల ఈ కాఫీ టేబుల్ పుస్తకం వెల ఎంతో ముద్రించలేదు. ఒక్కో ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద ఒక్కో వెలకి లభిస్తోంది. 

గురువారం, మే 13, 2021

కామోత్సవ్

చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎంతగానో అభిమానించే కవి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన నవల 'కామోత్సవ్'. ఆంధ్రజ్యోతి వారపత్రికలో 1987 లో సీరియల్ గా ప్రచురితమైన ఈ నవల అశ్లీల రచనగా ముద్రపడి, కోర్టు కేసుల్ని ఎదుర్కొంది. సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు కేసుని కొట్టేసింది. ఇంతలోనే ఇదే పేరుతో, ఇదే రచయిత పేరుతో మరో రచన అచ్చులోకి వచ్చింది. సాహిత్యంలోనే అరుదైన సంగతి ఇది. ఇన్నేళ్ల తర్వాత శేషేంద్ర ప్రతిని నవలగా అచ్చొత్తించారు ఆయన చిన్న కొడుకు సాత్యకి. అంతే కాదు, శేషేంద్ర తల్లితండ్రులు, భార్యాబిడ్డల విశేషాలను, ఛాయాచిత్రాలతో సహా ప్రచురించారు. శేషేంద్ర రెండో భార్యగా ప్రచారంలో ఉన్న ఇందిరా ధన్రాజ్ గిర్, శేషేంద్రకి ఏరకంగానూ వారసురాలు కాదంటున్నారు సాత్యకి. 

అంతేకాదు, 'కామోత్సవ్' ని "ఈ నవల ఇ.ధ. జీవిత చరిత్ర. ఇ.ధ. అంతరాత్మ కథ" అన్నారు 'వాస్తవాలు' పేరిట రాసిన ముందుమాటలో. (ఆమె పూర్తిపేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడలేదు). ఇందిరే తన అనుచరులచేత ఈ నవలని తిరగరాయించి ప్రచురించిందని ఆరోపించారు కూడా. శేషేంద్ర మరణం తర్వాత వారసత్వపు కోర్టు కేసుల తీర్పు తనకి అనుకూలంగా వచ్చిన సందర్భంలో పత్రికలకు ఇచ్చిన ఇంటర్యూలలో తన తండ్రికి సంబంధించిన చాలా విషయాలని ప్రస్తావించిన సాత్యకి, శేషేంద్ర తనని 'కామోత్సవ్' మీద అభిప్రాయం అడిగినప్పుడు "ఈ రచనకి నవల లక్షణాలేవీ లేవు" అని చెప్పానని జ్ఞాపకం చేసుకున్నారు. కుటుంబం తరపున ప్రారంభించిన గుంటూరు శేషేంద్ర శర్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా శేషేంద్ర రచనలన్నీ పునర్ముద్రిస్తున్న క్రమంలో ఈ ఏడాది మొదట్లో తీసుకొచ్చిన పుస్తకం ఈ 'కామోత్సవ్'. 

'పేజ్ త్రీ పీపుల్' గా వాడుకలో ఉన్న సినిమా నటీనటులు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, ఉన్నతాధికారుల  వాతావరణంలో సాగే కథ ఇది. డబ్బుని నీళ్లలా ఖర్చుపెడుతూ, పార్టీలివ్వడానికి కారణాలు వెతుక్కునే బాపతు జనమే అంతా. ఈ మందికి కాస్త భిన్నమైన వాడు జ్ఞాన్, ఈ నవలలో కథా నాయకుడు. జ్ఞాన్ చిత్రకారుడు, చదువరి, తాంత్రిక విద్యల్లో ప్రవేశం ఉన్నవాడూను. అతని భార్య కీర్తి ఓ రాజకీయ ప్రముఖుడి పెద్ద కూతురు, హైదరాబాద్ వాసి. జ్ఞాన్ ఓ చిన్న సమస్యలో చిక్కుకోడంతో అతన్ని బొంబాయికి ప్రయాణం చేస్తుంది కీర్తి. అక్కడ వాళ్ళు గడిపే వారం రోజుల జీవితమే ఈ నవల. వాళ్ళు అటెండయ్యే మొదటి పార్టీ వహీదా రహ్మాన్ ఇంట్లో. అది మొదలు ప్రతిరోజూ వాళ్ళకే విసుగొచ్చే అన్ని పార్టీలు. ఆ పార్టీలకి వచ్చే ప్రముఖులందరూ జ్ఞాన్ తో చిత్రకళ గురించీ, కవిత్వం గురించీ చేసే లోతైన చర్చలతో కథ సా...గుతుంది. 

రెండోరోజు ఓ సినీ తార ఇచ్చే పార్టీకి వెళ్తారు జ్ఞాన్, కీర్తి. అవివాహిత అయిన ఆ తార తాంత్రిక ఆరాధన చేస్తుంది. జ్ఞాన్ కి అందులో ప్రవేశం ఉందని తెలియడంతో అతనితో సుదీర్ఘమైన చర్చ చేయడమే కాక, అతనితో కలిసి ఏకాంతంగా తాంత్రిక పూజలో పాల్గొంటుంది. (ఈ రచన మీద 'అశ్లీల' ముద్ర పడడానికి, కోర్టులో కేసు ఫైల్ అవడానికి ఈ సన్నివేశ చిత్రణదే మేజర్ కంట్రిబ్యూషన్). అన్ని వయసుల స్త్రీలకీ జ్ఞాన్ ఇష్టుడు కావడం, వాళ్ళు అతని వెనక పడుతూ ఉండడం కీర్తికి నచ్చదు. అలాగని ఆమె అతన్ని ఏమీ అనలేదు. "నాకున్న ఒకేఒక్క బలహీనత జ్ఞాన్" అంటుందామె. కీర్తి చెల్లెలు తృష్ణ, ఆమె భర్త కుబేర్ తో కలిసి బొంబాయిలోనే ఉంటోంది. కానీ కీర్తి-జ్ఞాన్ లు హోటల్లో దిగుతారు. క్రికెటర్ పటౌడీని ప్రేమించి,  బ్రేకప్ అయిన తృష్ణని ఓదార్చి, కుబేర్ తో పెళ్లి చేసింది కీర్తే. అవ్వడానికి అక్కే కానీ, ఒక తల్లిలా చూసుకుంటుంది తృష్ణని. 

కుబేర్ ఆహ్వానం మేరకు ఒకరోజు తృష్ణ ఇంటికి వెళ్లారు  కీర్తి-జ్ఞాన్. అక్కడ అనుకోని సంఘటనలో జ్ఞాన్ కి దగ్గరవుతుంది తృష్ణ. అటుపైని తృష్ణ తీసుకునే నిర్ణయం, దాని తాలూకు పర్యవసానాలే నవల ముగింపు. జ్ఞాన్ పుట్టుపూర్వోత్తరాల గురించి రచయిత ఎక్కడైనా చెబుతారేమో అని చివరికంటా ఎదురుచూశాను కానీ, ఎక్కడా ఆ ప్రస్తావన తేలేదు. మొత్తం అరిస్ట్రోకటిక్ సెటప్ లో అడుగడుగునా మిస్ఫిట్ గా అనిపించేది జ్ఞాన్ ఒక్కడే. డబ్బు ద్వారా వచ్చే సౌకర్యాలని అనుభవిస్తూనే, వాటి పట్ల వ్యతిరేకత కనబరుస్తూ ఉంటాడతను. పార్టీలని ఒకింత అడ్మిరేషన్ తోనూ, మరికొంత ఉదాసీనత తోనూ పరిశీలిస్తూ గడుపుతాడనిపిస్తుంది. కొన్ని చోట్ల జ్ఞాన్ బహుశా శేషేంద్ర 'ఆల్టర్ ఇగో' అయి ఉండొచ్చు అనిపించింది కూడా. సాత్యకి ముందుమాటని దృష్టిలో పెట్టుకున్నప్పుడు 'ఇ.ధ' కీర్తా, తృష్ణా అన్న ప్రశ్నకి జవాబు దొరకలేదు. 

వృత్తి ప్రవృత్తులతో సంబంధం లేకుండా కథలో ప్రవేశించే ప్రతి పాత్రా కవితాత్మకంగా మాట్లాతుతూ ఉండడంతో చదువుతున్నది నవలో, కవిత్వమో అర్ధం కానీ పరిస్థితి చాలాసార్లే ఎదురైంది.  కవితా పంక్తులన్నీ వేరు చేస్తే ఓ చిన్న సైజు కవిత్వం పుస్తకం వేయొచ్చు. అలాగే జ్ఞాన్ ని నక్సల్ సానుభూతిపరుడిగా చూపడం వల్ల కథకి ఒనగూరిన అదనపు ప్రయోజనం ఏమిటో కూడా అర్ధం కాలేదు. మొత్తం మీద  చూసినప్పుడు 'కామోత్సవ్' ని ఒక నవల అనడం కన్నా, మధ్యతరగతి దృష్టికోణం నుంచి ధనవంతుల జీవితాలలో కొన్ని పార్శ్వాలని వర్ణించే ర్యాండమ్ రైటింగ్స్ అనొచ్చు. అక్కడక్కడా కొంచం విసిగించినా, మొత్తంమీద పూర్తిగా చదివిస్తుంది. మొత్తం 200 పేజీల ఈ పుస్తకం వెల రూ. 200. హైదరాబాద్ నవోదయ ద్వారా ఆన్లైన్ లో లభిస్తోంది. 

సోమవారం, మే 10, 2021

సింహాచలం సంపెంగలు 

మా చిన్నప్పుడు ఇంటి వెనుక కొబ్బరితోట సరిహద్దులో పాముపుట్టకి అటూ ఇటూ మొగలిపొదా, ఆకుసంపెంగ చెట్టూ ఉండేవి. పుట్టలో వృద్ధ నాగరాజు నివాసం ఉంటూ ఉండడంతో పిల్లలకి 'అధికారికంగా' అటువైపు వెళ్లే అవకాశం ఉండేది కాదు. మొగలిపొత్తులు, సంపెంగల వాసన ఆకర్షించకుండా ఉంటుందా? ఆకుసంపెంగలతో పరిచయం అప్పుడు మొదలైంది. సన్నని, దళసరి, ఆకుపచ్చ రేకులు, కాసింత మత్తు కలగలిసిన గాఢమైన వాసనతో ఉండే ఆ పూవులు ఎండిపోయినా కూడా సువాసన నిచ్చేవి, పుస్తకాల పేజీలలో. కాలారా తిరగడం మొదలయ్యాక పరిచయమైనవి సింహాచలం సంపెంగలు. పసుపచ్చని పల్చని రేకలతో ముట్టుకుంటే నలిగిపోయే సుకుమారం, తీయని వాసనా వీటి ప్రత్యేకతలు. నాకీ రెండు రకాల సంపెంగలూ ఇష్టమే కానీ, శ్రీరమణకి సింహాచలం సంపెంగలంటేనే ఇష్టమట అందుకే తన తాజా కథల సంపుటికి 'సింహాచలం సంపెంగలు' అని పేరు పెట్టుకున్నారు. 

కథల్లాంటి అనుభవాలు, అనుభవాల్లాంటి కథలూ మొత్తం కలిపి పదమూడు. అసలు నాస్టాల్జియా అనేసరికి శ్రీరమణ కలం పరవళ్లు తొక్కుతుంది కదా, 'షోడా నాయుడు' సాక్షిగా. కథలన్నింటిలోనూ ఎక్కడో అక్కడ రచయిత తొంగిచూస్తూ ఉంటారు. అసలు పుస్తకానికి శీర్షికగా ఉంచిన 'సింహాచలం సంపెంగలు' కథ శ్రీరమణ స్వానుభవమేనేమో అని అనుమానం వచ్చేస్తుంది కూడా. ఇదో కొత్తపెళ్ళికొడుకు కథ. బరువుగా ఆషాఢం పూర్తయ్యి, బిరబిరా శ్రావణం రాగానే, బొగ్గుల రైలెక్కి అత్తారింటికి బయల్దేరిన కొత్త పెళ్ళికొడుకు, దార్లో సింహాచలం సంపెంగలు పొట్లం కట్టిస్తాడు, భార్యకోసం. ఆ సంపెంగలు, వాటి నిమిత్తం అతగాడాడిన ఓ అబద్ధమూ కథని కొత్త మలుపులు తిప్పేస్తాయి. హాస్యమే కాదు, బోల్డంత వ్యంగ్యం కూడా ఉందీ కథలో. ఈ ఒక్క కథే కాదు, మొత్తం కథలన్నింటిలోనూ హాస్యమూ వ్యంగ్యమూ చీరంచులో జరీపోగుల్లా (ఈ పోలిక రచయితదే, వేరే సందర్భానికి) తళుక్కుమంటాయి. 

అసలు మొదటి కథ 'బైపాస్ సాములోరు' పేరు చూస్తూనే 'అరటిపువ్వు సాములోరు' గుర్తొచ్చేస్తారు. కాకపోతే ఈ బైపాసాయన బహు పాతకాలం వాడు. అప్పుడే ఫోటో కెమెరాలు కొత్తగా ఊళ్లలోకి వచ్చిన రోజుల నాటివాడు. 'ఉత్తమజాతి ఉడుముక్కూడా పట్టు దొరకనంత నున్నగా ఉంది గురువుగారి గుండు' లాంటి చమక్కులకి లోటే లేదు. 'చివ్వరి చరణం' కథ బ్లాగు మిత్రులందరికీ తెలిసిందే. బ్లాగుల స్వర్ణయుగంలో పొడిచిన 'పొద్దు' పత్రికలో చదివిందే కూడా. 'బేడమ్మ' లాంటి కథలు రాయడం, 'అలా మొదలైన నీళ్ల మోత సాగి సాగి, బేడమ్మ తలమీంచి కొసలనుంచి జారిన నీటిచుక్కలతో రోడ్డు వారగా పడిన నీళ్లచార వీధికి అంచుదిద్దినట్టు అయ్యేది' లాంటి వర్ణనలు చేయడం శ్రీరమణకి 'పీచ్మిఠా' తో పెట్టిన విద్య. ఒకప్పుడు ఇలాంటి బేడమ్మలు లేని వీధులూ, ఊళ్ళూ ఉండేవి కాదు. అగ్రహారపు కథల్లో తప్పక కనిపించే పాత్ర ఇది. 

చదువుతూండగానే ఆకట్టేసుకునేదీ, పుస్తకం పక్కన పెట్టాక కూడా ఓ పట్టాన విడిచిపెట్టనిదీ 'గుర్రాల మామయ్య' కథ. ఒక్కమాటలో చెప్పాలంటే మాంచి రుచికరమైన కథ. అసల్నా అనుమానం ఏవిటంటే, ఈ కథలో మావయ్యా అత్తయ్యలు వాళ్లకి ముసలితనం వచ్చాక అప్పదాసు, బుచ్చిలక్ష్మిలుగా పరిణామం చెంది మనందరికీ 'మిథునం' అందించారేమో అని. కాకపోతే ఈకథలో అత్తయ్యకి పలుకే బంగారం, బుచ్చిలక్ష్మేమో నోరు తెరిచినందంటే అప్పదాసుకి పాపం మరి మాట్లాడే అవకాశం ఉండదు. చిన్నప్పటి సర్కస్ జ్ఞాపకాలని కళ్ళముందుకి తెచ్చే కథ 'సింహం చెట్టు'. కథలా కాక, నిజంగా జరిగిన సంఘటనని రికార్డు చేసినట్టుగా ఉంటుంది. అలాగని కథలో పడాల్సిన దినుసులకి లోటు రానివ్వలేదు ఇలాంటిదే ఇంకో కథ 'తాడిచెట్లు పీకే వస్తాద్'. నాకు 'తేనెలో చీమ' లీలగా గుర్తొచ్చింది, పోలికేమీ లేకపోయినా. 

రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఒక పాత్రగా ఉన్న కథలు రెండు. నిజానికి ఇవి నిజ సంఘటనలే. కర్ణాకర్ణిగా విన్నవాటికి కథారూపం ఇచ్చారు రచయిత. 'వెండిగొట్టంలో దానపత్రం అను వరహాపురం అగ్రహారం' కథ శ్రీరమణకి ఏడుతరాల పూర్వుడైన జ్యోతిష్యవేత్త వంకమామిడి దక్షిణామూర్తి శాస్త్రులది కాగా, 'మనిషి పక్షిలా ఎగిరినందుకు..' కథేమో ఊరూరూ తిరుగుతూ సర్కస్ ఫీట్లు చేసే జక్కులకి సంబంధించింది. అడుగడుగునా మలుపులు తిరుగుతూ, ఓ పక్క నవ్విస్తూనే మరోపక్క తర్వాత ఏమవుతుందో అని ఆత్రుతని కలిగించే కథ 'అస్తికలు'. ఈ కథ చదువుతుంటే 'గడించే వాడొకడు, గుడించే వాడొకడు' అనే పాత సామెత గుర్తొచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే దీన్నో రియలెస్టేట్ కథ అనేయొచ్చు. 

బాపూ, రమణ, శ్రీరమణ, గోదారి - కలిపితే 'గోదారి పిలిచింది..' ఇది కథ కేటగిరీలోకి రాదు కానీ, కథలాగే చదివిస్తుంది. చదువుతున్నంతసేపూ నోరూరిస్తుంది. గోదారి మీద లాంచీ మాట్లాడుకుని కథా చర్చలు చేసుకోవడం బాపూ-రమణల అలవాటని 'కోతికొమ్మచ్చి' లో తెలిసింది కదా. అలాంటి కొన్ని కథా చర్చలకు ప్రత్యక్ష సాక్షి అయిన శ్రీరమణ నాటి అనుభవాలని, పెసరప్పడం, దప్పళం, కందట్టు, పుల్లట్టు తదాది రుచుల్నీ తన్మయంగా జ్ఞాపకం చేసుకున్నారు. భోజనానికి ముందు ఈ కథ చదవకండి. 'ఆ చేతులెవరివో' ని కూడా కథ అనలేం, అలాగని అనకుండా ఉండలేం. పుస్తకంలో చివరిదైన 'సర్వనామం' మాత్రం కథ కాదు. ఓ చిన్న వ్యాసం. వీవీఐటీ, నంబూరు, ప్రచురించిన ఈ 109 పేజీల పుస్తకం వెల రూ. 90. నవోదయ బుక్ హౌస్ లో దొరుకుతోంది. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ 'సింహాచలం సంపెంగలు' తో పాటు 'నవ్వులో శివుడున్నాడురా' అనే కబుర్ల సంపుటి కూడా  విడుదలయ్యింది. 

సోమవారం, మే 03, 2021

అదే కథ ...

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుని తన రాజకీయ గురువుగా చెప్పుకుంటూ ఉంటారు. ఎన్ఠీఆర్ మీద అభిమానంతోనే తన కొడుక్కి తారకరామారావు అని పేరు పెట్టుకున్నారు కూడా. అయితే, ఆచరణకి వచ్చేసరికి కొన్ని విషయాల్లో ఆయన తెలుగు దేశం పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పద్ధతుల్ని అనుసరిస్తున్నారేమో అనిపిస్తోంది. రాజకీయాలలో కూరిమి విరసంబైనప్పుడు ఇదే కేసీఆర్ ఇదే చంద్రబాబుని 'డర్టీయెస్ట్ పొలిటిషన్ ఇన్ ఇండియా' అని అని ఉండొచ్చు గాక, రాజకీయ చాణక్యంలో - కనీసం కొన్ని విషయాల్లో అయినా - చంద్రబాబు నాయుణ్ణి అనుసరిస్తున్నారన్న భావన రోజురోజుకీ బలపడుతోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ని పదవీచ్యుతుణ్ణి చేసిన ప్రస్తుత సందర్భంలో. 

కారణాంతరాల వల్ల తనకి ఇష్టం లేని నాయకుల్ని పదవి నుంచి తొలగించడానికి, అధికారులని ఉన్నత పదవులలోకి రాకుండా చేయడానికీ చంద్రబాబు నాయుడు దాదాపు రెండు దశాబ్దాల క్రితమే అమలు చేసిన వ్యూహాలనే ఇప్పుడు కేసీఆర్ రాజేందర్ విషయంలో అమలు చేస్తున్నారనిపిస్తోంది. పందొమ్మిదేళ్ళ క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాటి కేబినెట్లో నేటి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి పంచాయతీ రాజ్ శాఖా మంత్రిగా ఉన్నారు. కారణాలు పైకి రాలేదు కానీ, ముఖ్యమంత్రికి-మంత్రికి కుదరాల్సినంతగా సఖ్యత కుదరలేదు. ఫలితంగా ఒకరోజు ముఖ్యమంత్రి ఒద్దికలో ఉండే ఓ పత్రికలో పంచాయతీ రాజ్ శాఖలో పెద్దఎత్తున అవినీతి జరిగిందంటూ ముఖ్యవార్త. పంచాయతీ ఆఫీసులకి అవసరమైన స్టేషనరీ కొనుగోలులో నిధుల గోల్ మాల్ జరిగిందన్నది కథనం. 

క్రమశిక్షణకు మారుపేరుగా పేరుతెచ్చుకునే ప్రయత్నంలో ఉన్న ప్రభుత్వం ముందుగా మంత్రి రాజీనామాకి, అటుపైన జరిగిన అవినీతిపై విచారణకి ఆదేశాలిచ్చింది. ఒక్క వార్తాకథనంతో మంత్రిగారి పదవి పోయింది. అటుపై చాలారోజుల పాటు విచారణ సా...గి, రిపోర్టులో తేల్చిందేమిటంటే అవినీతిలో మంత్రి పాత్ర లేదని!! కొంచం అటూ ఇటూగా ఇదే సమయంలోనే ఇలాంటి అనుభవమే ఓ ఉన్నతాధికారికీ ఎదురయ్యింది. తెల్లారి లేస్తే ప్రభుత్వంలో ముఖ్యమైన పోస్టుకు ప్రమోషన్ ఉత్తర్వులు అందుకోవాలి. కానీ ఎక్కడో ఏదో ఈక్వేషన్ తేడా కొట్టింది. ఫలితం, ఉత్తర్వులు అందుకోడానికి కొన్ని గంటల ముందుగా  - మళ్ళీ ఒద్దికలో ఉన్న పత్రికే - ఓ భారీ భూ కుంభకోణాన్ని బద్దలు కొట్టింది. ఆ కుంభకోణపు తీగని ఈ అధికారికి ముడిపెట్టింది. క్రమశిక్షణకి మారుపేరైన ప్రభుత్వం ప్రమోషన్ ఆపేసింది!! ఆ ఆరోపణల మీద విచారణ ఇంకా కొనసాగుతోందో, మధ్యలో అటకెక్కిందో మరి. 

కాలం మారింది. రెండు దశాబ్దాల కాలం చాలా మార్పుల్ని తోడు తెచ్చుకుంది. చంద్రబాబు నాయుడికి ఒద్దికలో ఉన్న పత్రికలు సాయం చేసిపెడితే, కేసీఆర్ చేతుల్లో సొంత మీడియానే ఉంది. సొంత చానళ్ళు పేపర్లతో పాటు, అనుకూల చానళ్ళు, పత్రికలూ మూకుమ్మడిగా రాజేందర్ వ్యతిరేక కథనాలు కూడబలుక్కున్నట్టు ఒకేసారి ప్రసారం చేశాయి. కథనాలు రావడమే తరువాయిగా విచారణ, వెంటనే మంత్రిత్వ శాఖ ఉపసంహరణ, ఆ వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్. పరిణామాలన్నీ శరవేగంతో జరిగిపోయాయి. రాత్రికి రాత్రే రాజేందర్ 'మాజీ మంత్రి' అయిపోయారు. ఈసారి ఆరోపణ భూ ఆక్రమణ. నిజానికి ఇది చాలా మందిమీద వచ్చిన చాలా పాత ఆరోపణ. తెలంగాణ రాష్ట్రం రాగానే ముందుగా దృష్టిపెడతామని ఉద్యమకాలంలో కేసీఆర్ హెచ్చరించిన ఆరోపణ. 'లక్ష నాగళ్ళ' తో ఆక్రమణల్ని దున్నే కార్యక్రమాన్ని సొంత మంత్రివర్గ సహచరుడితో మొదలు పెట్టారనుకోవాలా? 

రాజేందర్ పై తీసుకున్న 'క్రమశిక్షణ చర్య' గడిచిన రెండు దశాబ్దాల్లో మన చుట్టూ వచ్చిన అనేక మార్పులని పరిశీలించే అవకాశం ఇస్తోంది మనకి. నాటితో పోలిస్తే నేడు ప్రత్యామ్నాయ మీడియా, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా బలపడ్డాయి. ప్రసార సాధనాలు వర్గాలుగా విడిపోవడం వల్ల ప్రతి విషయం తాలూకు బొమ్మనీ, బొరుసునీ తెలుసుకోగలుగుతున్నాం. ఇరుపక్షాల వాదనలనీ వినగలుగుతున్నాం. సోషల్ మీడియా ద్వారా మన అభిప్రాయాలనూ చెప్పగలుగుతున్నాం. వీటి ఫలితమే రాజేందర్ కి దొరుకుతున్న మద్దతు. జరిగింది కేవలం క్రమశిక్షణ చర్య మాత్రమే కాదన్న సంగతి జనబాహుళ్యం అర్ధం చేసుకోగలిగింది. కేవలం పత్రికలు, టీవీల్లో వచ్చింది మాత్రమే నమ్మేసి, అభిప్రాయాలు ఏర్పరుచుకోకుండా, విషయాన్ని మొత్తంగా తెలుసుకుని, విశ్లేషించుకుని ఓ అభిప్రాయానికి రావడానికి వీలవుతుంది. చంద్రబాబు నాయుడు రాజకీయపుటెత్తుగడల్లో కేసీఆర్ ఇంకా ఏమేమి వాటిని అనుసరిస్తారో రాబోయే రోజుల్లో చూడాలి.