అప్పు తీసుకోవడం నామర్దాగా భావించే రోజుల్నించి, అప్పులేకుండా బతకలేని రోజుల్లోకి మనకి తెలియకుండానే వచ్చేశాం. ఇది ఎంతవరకూ వచ్చిందంటే, అప్పిస్తాం తీసుకోమంటూ రోజూ వెంట పడేవాళ్ల నుంచి తప్పించుకోడానికి దారులు వెతికే దాకా. బ్యాంకుల మొదలు, ఫైనాన్సు కంపెనీల వరకూ మన ఫోన్ నెంబరు దొరకని వాళ్ళది పాపం, మీకు ఇంత మొత్తం ఋణం తీసుకునేందుకు అర్హత ఉంది (ఈ అర్హతని ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారో తెలీదు, ఒకరు చెప్పే మొత్తానికీ, మరొకరు ఇస్తామని ఊరించే అప్పుకీ పొంతన ఉండదు మరి), పెద్దగా డాక్యుమెంటేషన్ కూడా అక్కర్లేదు, మీరు ఊ అనండి చాలు, అప్పు మీ బ్యాంకు అకౌంట్లో పడుతుంది అంటూ ఊదరగొట్టేస్తారు. "అబ్బే, దేవుడి దయవల్ల రోజులు బానే గడిచిపోతున్నాయి.. ఇప్పుడు అప్పులూ గట్రా అవసరం లేదు," అని చెబుతామా, "రేపెప్పుడన్నా అవసరం రావొచ్చు, ఈ నెంబరు సేవ్ చేసుకోండి.. అవసరం వచ్చిన వెంటనే ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వండి చాలు" అన్నది రొటీన్ సమాధానం. రోజూ ఎన్ని నెంబర్లని సేవ్ చేసుకోవాలి?
మొదట్లో నేను చాలా ఆశ్చర్యపడిపోతూ ఉండే వాడిని, ఫోన్లు చేసి ఇంతలేసి అప్పులు ఎలా ఇచ్చేస్తారు? తీరుస్తామన్న వీళ్ళ ధైర్యం ఏమిటీ? అని. అయితే, ఒకానొక అనుభవం తర్వాత తత్త్వం బోధపడింది. అప్పులు ఇచ్చే బ్యాచీ వేరు, వసూలు చేసుకునే బ్యాచీ వేరు. ఎవరి పద్ధతులు, మర్యాదలు వారివి. నాకు పరిచయం ఉన్న ఒకాయన ఓ ప్రయివేటు ఫైనాన్సులో అప్పు తీసుకున్నాడు. అప్పుడు, వాళ్ళకి నన్ను తన స్నేహితుడిగా పరిచయం చేసి నా ఫోన్ నెంబరు ఇచ్చేశాడు. వాళ్ళు అప్పు ఇచ్చేశారు. ఇవేవీ నాకు తెలీదు. గడువు తీరినా బాకీ తీరక పోవడంతో, అతగాడి ఫోన్ స్విచ్చాఫ్ ఉండడంతో వాళ్ళు నాకు ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. మొదట్లో మర్యాదగానే మాట్లాడినా, రాన్రానూ వాళ్ళ స్వరం మారడం తెలుస్తోంది. ఇతగాడు ఫోనుకి దొరకడు. ఇలా దొరికిపోయానేవిటా అని నేను చింతిస్తూ ఉండగా, ఫైనాన్సు వాళ్ళు బెదిరింపు ధోరణిలోకి దిగారు.
ఓ రోజు నేను మహా చిరాగ్గా ఉండగా వాళ్ళ ఫోన్ వచ్చింది. ఎప్పటిలాగే తీయగా మొదలెట్టి, కటువుగా మారుతుండగా నాకు చిర్రెత్తుకొచ్చింది. "మీరు అతనికి అప్పు ఇచ్చే ముందు నాకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు?" అని అడిగా. వాళ్ళ దగ్గర జవాబు లేదు. నాకు దారి దొరికింది. "అప్పిచ్చే ముందు నాకు ఫోన్ చేసి ఇలా చేస్తున్నాం అంటే నేను ఇవ్వమనో, వద్దనో చెప్పేవాడిని. ఇవ్వమని పూచీ పడితే ఇప్పుడు నాకు బాధ్యత ఉండి ఉండేది. అప్పుడు నా నెంబరు తీసుకుని ఊరుకుని ఇప్పుడు ఫోన్లు చేస్తే నాకేం సంబంధం?" అని గట్టిగా అడిగా. అవతలి వాళ్ళు వాళ్ళ మేనేజర్ని లైన్లోకి తెచ్చారు. ఆ అప్పుతో నాకు ఎలాంటి సంబంధం లేదనీ, ఇంకెప్పుడూ ఫోన్లు చేయద్దనీ, చేస్తే మర్యాదగా ఉండదనీ గట్టిగా చెప్పా. అలా ఆ పీడ విరగడయ్యింది. అప్పుల వసూళ్లు ఏ పద్ధతిలో జరుగుతాయో తగుమాత్రం అర్ధమయింది నాకు.
ఇది జరిగిన కొన్నాళ్లకే 'వాట్సాప్ అప్పులు' అంటూ వార్తలు రావడం మొదలైంది. ప్రయివేటు ఫైనాన్సు కంపెనీల వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి, ఎలాంటి హామీలూ లేకుండా అప్పులిచ్చేశారు. ఒకే ఒక్క మెలిక ఏమిటంటే, అప్పు తీసుకునే వాళ్ళు వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్ అన్నీ సదరు సంస్థ వాళ్ళకి సమర్పించాలి. వాళ్ళు, సదరు కాంటాక్ట్స్ అందరినీ పీడించి బాకీ వసూలు చేసుకుంటారన్నమాట. అప్పు తీసుకుని తీర్చలేకపోయిన ఒకరిద్దరు సున్నిత మనస్కులు ఆత్మహత్యా ప్రయత్నాలు చేయడంతో, పోలీసులు రంగంలోకి దిగి సదరు సంస్థల్ని మూసేయించారు. ఇంతలేసి మంది అప్పులివ్వడానికి ఎందుకు పోటీ పడుతున్నారో అంటే, తాకట్టో వాకట్టో పెట్టుకుని ఇచ్చే అప్పుల మీద కన్నా ఇలాంటి హామీ లేని రుణాల మీద రెండింతలు వడ్డీ వసూలు చేయచ్చు. రిస్కు ఉన్నప్పటికీ లాభం ఎక్కువ.
ఇక అప్పు తీసుకునే వాళ్లలో నూటికి పది మందికి నిజమైన అవసరం అయితే, మిగిలిన వాళ్ళు అప్పు దొరుకుంటోంది కదా తీసేసుకున్న బాపతు. వీళ్ళకి వడ్డీ గురించి ఆలోచన కానీ, ఎలా తీర్చాలో అన్న చింత కానీ లేవు. వాట్సాప్ అప్పులు తీసుకుని, హెడ్సెట్ వగయిరా గాడ్జెట్లు కొనుక్కున్న కుర్రాళ్ళున్నారు. అప్పుల వాళ్ళు ఇళ్ల మీదకి వస్తే, పెద్దవాళ్ళు ఏడ్చుకుంటూ బాకీలు తీర్చారు. అయితే, ఈ పరిస్థితి ఇండియాలో మాత్రమే కాదనీ, ప్రపంచానికి అప్పులిచ్చే అమెరికాలో కూడా ఇంతేననీ ఈ మధ్యనే తెలిసింది. 'ఇప్పుడు కొనుక్కోండి-తర్వాత చెల్లించండి' అనే ఆన్లైన్ స్కీంలో అప్పులు తీసుకున్న వాళ్ళు ఏకంగా నాలుగు రెట్ల మొత్తాన్ని తిరిగి చెల్లిస్తున్నారట. వీళ్ళలో మెజారిటీ యువతే. అప్పు చేసి వాళ్ళు కొంటున్నవి ఫ్యాషన్ దుస్తులు, మేకప్ సామాగ్రి, గాడ్జెట్లు వగయిరాలు తప్ప ప్రాణం మీదకి వస్తే చేసిన అప్పులు కావు.
కొనుగోలు చేసే వస్తువు వెలని నాలుగు నుంచి ఐదు సమ భాగాలు చేసి, మొదటి భాగం చెల్లించగానే వస్తువు డెలివరీ చేస్తున్నారు. మిగిలిన మొత్తం నాలుగుకు మించని వాయిదాల్లో చెల్లించాలి. నాలుగే ఎందుకు? ఐదు వాయిదాల నుంచీ మొదలయ్యే రుణాలన్నీ వినియోగదారుల చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ విషయం అప్పు ఇచ్చే వాళ్ళకి తెలుసు, తీసుకునే వాళ్ళకి తెలీదు. వాళ్ళకింకా చాలా విషయాలే తెలీదు. అప్పు చేసి కొనే ఫ్యాషన్ దుస్తులు, ఆ అప్పు తీరే లోగానే అవుటాఫ్ ఫాషన్ అయిపోతున్నాయి. మళ్ళీ కొత్త ఫ్యాషన్, కొత్త అప్పు.. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. పైగా అప్పులు చేయించడం కోసం టిక్ టాక్ ఇంఫ్లుయెన్షర్లు, వాళ్ళకి కంపెనీల నుంచి ఉచిత బహుమతులూ.. ఇదో పెద్ద వలయం. ఇందులో చిక్కుకున్న వాళ్ళు చివరికి గాస్ (పెట్రోల్) కొనడానికి కూడా ఈ నాలుగు వాయిదాల అప్పు చేయాల్సిన పరిస్థితి. ఈ అప్పులు ఇంకా ఎన్నేసి రూపాలు మార్చుకుంటాయో చూడాలి.
ఇక్కడ అమెరికాలో బ్యాంక్లో అప్పుతీసుకోటానికి సులభంగా ఉండటానికి ఇంటికి చెక్కులు పంపిస్తారు. శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు. ఈ సామెత సరిపోతుందో లేదో తెలియదు. కానీ అటువంటిదే ఈ పరిస్థితి.
రిప్లయితొలగించండిbagundi....naku ardam kanidi ide enduku ventabadi teesukomani satayistaro
తొలగించండిఅప్పు తీసుకున్నవాళ్ళు త్వరగా తీర్చ లేరని ముందరే తెలిసి అప్పులిఛ్చి పైగా నెలకి ఇంత కడితే చాలు అని చెబుతారు (you will be in good standing). అల్లా కడుతూ పోతుంటే జీవితాంతం అప్పు తీర్చటం ఉండదు. అప్పు ఇచ్చిన వాళ్లకి పంటే పంట.
తొలగించండి@రావు ఎస్ లక్కరాజు: అడక్కుండానే ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చేస్తారన్న మాట, బాగుందండీ ఏర్పాటు.. పాపం వాళ్ళు బతికేది వడ్డీ మీదే కదా.. ధన్యవాదాలు..
తొలగించండి@హిమబిందు: ఒక్కసారి మీకు సేవింగ్స్ అకౌంట్, ఫిక్సుడ్ డిపాజిట్ మీద వస్తున్న వడ్డీని, అప్పు తీసుకుంటే కట్టాల్సిన వడ్డీని పోల్చి చూడండి, సూక్ష్మం బోధపడుతుంది.. ధన్యవాదాలు..
రుణానికి ఫోను కాంటాక్టులు ? ఇది చాలా విచిత్రంగా ఉందే .
రిప్లయితొలగించండినలుగురిలో చిన్నతనంగా ఉంటుందని అప్పు తీసుకున్నవాళ్లు కిందా మీదా పడైనా సరే తిరిగి చెల్లిస్తారనేది దీనివెనకున్న వ్యూహమేమో మరి.
వాళ్ళ ఉద్దేశం అదే కానీ, ఇక్కడ అప్పులు తీసుకున్న వాళ్ళు తెలివి తేటల్లో వాళ్ళకి తాతలండీ.. పైన రావు గారు చెప్పిన సామెత ఇక్కడ కూడా సరిగ్గా సరిపోతుంది.. ధన్యవాదాలు..
తొలగించండిమురళి గారు,
రిప్లయితొలగించండివడ్డీయే బ్యాంకులకు ముఖ్యాదాయం అన్నది తెలిసిన విషయమే. ఋుణాల మీద తీసుకునే వడ్డీకి, డిపాజిట్ల మీద చెల్లించే వడ్డీకి మధ్య గల తేడాయే ప్రధాన ఆదాయం. దీన్నే బ్యాంకుల పరిభాషలో Net Interest Margin (NIM) అంటారు. ఈ మార్జిన్ ఎంత ఎక్కువైతే అంత లాభసాటి అని ప్రత్యేకం చెప్పనక్కరలేదుగా. అంతకన్నా దేవరహస్యం ఏమీ లేదు.
ఇంకా ఇతర సేవలకు తీసుకునే కమీషన్, ఆ మధ్య మొదలైన ఇన్సూరెన్స్ పాలసీలు (బ్యాంకుల సాంప్రదాయ వ్యాపారం కాకపోయినా కూడా) బ్యాంకు వారు అమ్మడం అనే మార్గం ద్వారా వచ్చే కమీషన్ …. వగైరాలు ఇతర ఆదాయం / వడ్డీయేతర ఆదాయం అవుతుంది (Non-Interest Income / Other Income / Misc Income అని వివిధ పేర్లు).
సమస్య ఏమిటంటే డిపాజిట్ల మీద వడ్డీ సకాలంలో చెల్లించెయ్యాలి, కానీ ఋుణాల మీద వడ్డీ సకాలానికి వసూలు అవుతుందని భరోసా ఉండకపోవచ్చు - వసూలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి లెండి బ్యాంకులు. ఇక జీతాలు, overheads (అద్దెలు, కరెంటు బిల్లులు, ఫోన్లు, వాహనాల ఖర్చు వగైరా వగైరా) తప్పనిసరి. కాబట్టి పరిమితులకు లోబడి అధిక ఋుణాలు ఇచ్చి వడ్డీ ఆదాయం పెంచుకోవడం ఒకవైపు, వడ్డీయేతర ఆదాయాన్ని కూడా పెంచుకోవడానికి ప్రయత్నాలు మరొకవైపు కొనసాగుతుంటాయి. ఇవన్నీ పద్ధతిగాను. చట్టానికి లోబడీన్నూ జరుగుతుంటాయి.
సరే, ఇంతకూ అసలు విషయం ఈ ప్రైవేట్ లోన్లు ఇస్తున్నవారి అరాచకాలు పెరిగిపోతున్నాయి (కొన్ని ప్రాంతాల్లో “కాల్ మనీ” వ్యాపారం అని పేరు). ఇంటర్ నెట్ వచ్చిన తరువాత ఈ “లోన్ ఆప్” లకు విచ్చలవిడిగా తయారైంది.
డబ్బు అవసరం ఉన్నవారికి సరళ ఋుణాలిచ్చి ఆ తరువాత వసూలుకు సంస్కారవంతంగా ప్రవర్తించడం లాంటి పనులేమీ చెయ్యడం లేదు ఈ లోనాప్లు / “కాల్ మనీ” వారూనూ. మనకి తెలివితేటలు ఎక్కువని మీరన్నారు గానీ జనం వీళ్ళను ఎదుర్కోలేకుండా ఉన్నారు. వెంటపడి వేధించి ఋుణగ్రస్తులు అఘాయిత్యం చేసుకునే వరకు తరుముతున్నారు ఈ లోనాప్లు. వ్యభిచారం చేసయినా లోన్ తీర్చాలని వత్తిడి పెట్టిన “కాల్ మనీ” నిర్వాహకుల సంగతి కూడా వార్తల్లో వచ్చింది ఆ మధ్య.
ఇవాళ్టి (19-05-2022) “ఆంధ్రజ్యోతి” దినపత్రికలో వచ్చిన అటువంటి ఓ మహిళ ఆత్మహత్య వార్త ఈ క్రింది లింకులో చూడండి, నిన్న టీవీలో కూడా వచ్చింది. ఆత్మహత్య చేసుకుంది అని చెబితే ఆ శవం ఫొటో పంపించాలని అడిగారన్న వార్త కూడా వచ్చింది, అటువంటి నీచులు.
ఇటువంటి షైలాక్ లోన్లు (ఆమాటకొస్తే షైలాక్కే కాస్త నయం) తీర్చలేక, ఈ రాక్షస మూకల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు గతంలో కూడా జరిగాయి. ఇటువంటి వ్యాపారాల వెనక రాజకీయ నాయకుల చెయ్యి ఉన్నా ఆశ్చర్యం లేదు.
నా అభిప్రాయంలో వీటన్నిటికీ ప్రధాన కారణం సరళీకరణ పేరుతో దేశంలో ఇష్టారాజ్యాన్ని అనుమతిస్తున్న ప్రభుత్వం అంటాను. ప్రతిదీ ప్రభుత్వం చూడాలా అంటే … చూడాలి అనే అంటాను నేను. సరళీకరణ / ప్రైవెటైజేషన్ అంటే విచ్చలవిడితనాన్ని చూసీచూడకుండా వదిలెయ్యడం కాదు. సరళీకరణకు కావలసిన మానసిక పరిపక్వత, సంస్కారం, సామాజిక బాధ్యత, నిజొయితీ మనదేశ ప్రజలకు ఇంకా అలవడలేదని నా అభిప్రాయం (కార్పొ”రెట్ట”లతో సహా). కాబట్టి అవి మెరుగయ్యేంత వరకు ప్రభుత్వ నియంత్రణ కొంచెమైనా ఉండాలి.
అసలు అరాచకం సృష్టిస్తున్న ఈ online లోనాప్పుల ఆచూకీ, “కాల్ మనీ” వారి ఆచూకీనూ కనిపెట్టి, అరెస్టు చేసి, మూయించెయ్యడం అంత కష్టమా ప్రభుత్వానికి?
చనిపోయినా సరే లోన్ కట్టాల్సిందే
నేనూ కొంచం వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తానండి. బ్యాంకుల వ్యాపారమే తక్కువ వడ్డీకి డిపాజిట్లు తీసుకుని, ఎక్కువ వడ్డీకి అప్పులివ్వడం. రాన్రానూ ఏం జరుగుతుందంటే పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్న వాళ్ళు రాజకీయ అండతో బాకీ చెల్లు చేయించుకోడమో, దేశం వదిలి పోవడమో చేస్తున్నారు. ఫలితంగా చిన్న మదుపర్లకి డిపాజిట్ చేయబోతే తక్కువ వడ్డీ, ఋణం తీసుకోవాలంటే బహు ఎక్కువ వడ్డీ (ఈ గ్యాప్ బాగా పెరిగింది ఈ మధ్య కాలంలో, గమనించండి). నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి అప్పులివ్వడానికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది, కానీ నెల జీతాల వాళ్ళకి ఫోన్లు చేసి అప్పు తీసుకోమని ఊరిస్తున్నాయి బ్యాంకులు. తీరుస్తారన్న భరోసా ఉండబట్టే కదా. 'కాల్ మనీ' ఏమాత్రం ఎంకరేజ్ చేయాల్సిన విషయం కాదు, కానైతే విజయవాడలో వరుసగా కేసులు బయట పడినప్పుడు నిందితులందరూ (అప్పటి) అధికార పార్టీ వారే అని వినిపించింది. ఆ కేసులు ఎటు పోయాయో తెలీదు. "తెలివి తేటల్లో తాతలు" అన్నది ఎందుకంటే, అంత లావు వాట్సాప్ లోన్ల వాళ్లనే బురిడీ కొట్టించిన కేసులు రెండు తెలుసు నాకు. ఏ లూప్ హొల్స్ ఉపయోగించి బాకీ ఎగేశారో తెలీదు కానీ, ఎగవేత నిజం. ఐదేళ్లకోసారి టంచన్ గా ఎన్నికలు పెట్టడం తప్ప, మిగిలిన బాధ్యతల నుంచి ప్రభుత్వం క్రమంగా తప్పుకుంటోంది కదండీ మరి (ఇది వేరే పెద్ద చర్చ)..
తొలగించండి