శనివారం, ఆగస్టు 06, 2022

సీతారామం

అది 1964వ సంవత్సరం. అనాధ అయిన రామ్ (దుల్కర్ సల్మాన్) భారతీయ సైన్యంలో పనిచేస్తున్నాడు. సరిహద్దులో రామ్ ఆధ్వర్యంలో సైన్యం జరిపిన ఓ సాహస కృత్యం అనంతరం, ఆ బృందాన్ని ఇంటర్యూ చేయడానికి ఆకాశవాణి తరపున వెళ్లిన విజయలక్ష్మి రామ్ ని ఇంకెప్పుడూ అనాధ అనుకోవద్దని చెబుతుంది. అంతే కాదు, అదే విషయాన్ని రేడియోలో ప్రకటించి, రామ్ కి మేమున్నామంటూ ఉత్తరాలు రాయాల్సిందిగా శ్రోతల్ని ప్రోత్సహిస్తుంది. అది మొదలు రామ్ కి గుట్టలు గుట్టలుగా ఉత్తరాలు రావడం మొదలవుతాయి. అన్న, తమ్ముడు, పిన్ని, బాబాయ్, అక్క, చెల్లి.. ఇలా ఎంతోమంది కొత్త బంధువుల నుంచి వచ్చే ఉత్తరాలవి. ఒక్క ఉత్తరాలు మాత్రమే కాదు, అరిసెల్లాంటి తినుబండారాలు, కష్టసుఖాల కలబోతలూ కూడా పోస్టులో వెల్లువెత్తుతూ ఉంటాయి. 

వాళ్ళందరి ప్రేమలోనూ తడిసి ముద్దవుతున్న రామ్ కి ఆ గుట్టలో కనిపించిన ఓ ఉత్తరం మొదట ఉలికిపాటుకి గురిచేస్తుంది, అటుపైన ఫ్రమ్ అడ్రస్ ఉండని ఆ ఉత్తరాల కోసం ఎదురు చూసేలా చేస్తుంది. ప్రతి ఉత్తరం చివరా ఉండే 'ఇట్లు మీ భార్య సీతామహాలక్ష్మి' అనే సంతకం సీతతో (మృణాల్ ఠాకూర్) ప్రేమలో పడేలా చేస్తుంది. సీతామహాలక్ష్మి ఉత్తరాల ప్రకారం, రామ్ ఆమెని పెళ్లి చేసుకుని, చాలా కొద్దిసమయం మాత్రమే ఆమెతో గడుపుతూ, ఎక్కువ సమయం ఉద్యోగంలోనే గడుపుతున్నాడు. అతను చేసిన చిలిపి పనుల మొదలు, అలకలు, కోపాల మీదుగా, నెరవేర్చాల్సిన బాధ్యతల్ని గుర్తు చేయడం వరకూ ఆ ఉత్తరాలు చెప్పని కబురు ఉండదు. రాను రానూ, మిగిలిన ఉత్తరాలు తగ్గుముఖం పట్టినా, సీత నుంచి మాత్రం క్రమం తప్పకుండా ఉత్తరాలు వస్తూనే ఉంటాయి. 

ఊహల్లో మెరిసే, ఉత్తరాల్లో మాత్రమే కనిపించే సీతకి ఎప్పటికప్పుడు జవాబులు రాస్తూ ఉంటాడు రామ్. కానీ, వాటిని సీతకి పంపే వీలేది? అందుకే ఆ ఉత్తరాలన్నీ తన దగ్గరే జాగ్రత్తగా దాచుకుంటాడు. ఎలాగైనా సీతని కలవాలన్న పట్టుదల హెచ్చుతుంది రామ్ లో. సైనికుడు కదా, బుద్ధికి పదును పెడతాడు. ఆమె ఉత్తరాల ఆధారంగానే ఆమె జాడ కనిపెడతాడు. తాను రాసిన జవాబులన్నీ ఆమె ముందు కుప్పపోస్తాడు. రామ్ సీతని మనస్ఫూర్తిగా ప్రేమించాడు. మరి సీత? ఎక్కడో కాశ్మీర్ లో ఉద్యోగం చేస్తున్న రామ్ కి భార్యనంటూ ఉత్తరాలు రాయడం వెనుక కారణం ఏమిటి? ఆకతాయి తనమా లేక నిజమైన ప్రేమేనా? ఉత్తరాలతో మొదలైన వాళ్ళ కథ ఏ తీరం చేరింది? ఈ ప్రశ్నలకి జవాబు, హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన 'సీతారామం' సినిమా. 

కాశ్మీర్ నేపధ్యంగా ప్రేమకథ అనగానే మణిరత్నం 'రోజా' గుర్తు రావడం సహజం. అసలే, హను మొదటి సినిమా 'అందాల రాక్షసి' మీద మణిరత్నం ముద్ర అపారం. 'రోజా,' 'చెలియా' మొదలు క్రిష్ 'కంచె' వరకూ చాలా సినిమాలూ, పుస్తకాలు చదివే వాళ్ళకి యండమూరి 'వెన్నెల్లో ఆడపిల్ల' మల్లాది 'నివాళి' మొదలుకొని అనేక నవలలూ, కథలూ గుర్తొస్తూనే ఉంటాయి, సినిమా చూస్తున్నంతసేపూ. అలాగని, నిడివిలో మూడు గంటలకి పావు గంట మాత్రమే తక్కువున్న ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. ఎక్కడా భారీ బిల్డప్పులు, ఎలివేషన్ల జోలికి పోకుండా, ఆసాంతమూ తగుమాత్రం నాటకీయతతో నడిపారు కథనాన్ని. భారీ తారాగణం, అందరికీ తగిన పాత్రలూ ఉన్నప్పటికీ, సినిమా పూర్తయ్యేసరికి గుర్తుండేది నాయికా నాయకులిద్దరే  - స్పష్టంగా చెప్పాలంటే నాయిక మాత్రమే. అలాగని ఇదేమీ హీరోయిన్-ఓరియెంటెడ్ కథ కాదు. 

టైటిల్స్ తర్వాత, లండన్ లో 1985 లో రష్మిక మందన్న విస్కీ బాటిల్ కొనడం తో మొదలయ్యే సినిమా అనేక ఫ్లాష్ బ్యాకులతో సాగి ఢిల్లీ లో ముగుస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాకులన్నీ ఎక్కడా కన్ఫ్యూజన్ కి వీలు లేకుండా, కథలో సస్పెన్స్ పోని విధంగా గుదిగుచ్చినందుకు దర్శకుడితో పాటు ఎడిటర్ (కోటగిరి వెంకటేశ్వర రావు) నీ అభినందించాల్సిందే. సీత పాత్రని ప్రవేశపెట్టడానికి ముందు ఆమె పట్ల ప్రేక్షకుల్లో కుతూహలాన్ని కలిగించడం, ఆమెకి సంబంధించిన ఒక్కో విషయాన్నీ ఒక్కో ఫ్లాష్ బ్యాక్లో చెప్పుకుంటూ వెళ్లి, రామ్ ఉత్తరం సీతకి చేరేసరికి సీతతో పాటు, ప్రేక్షకులు కూడా ఉత్కంఠగా ఎదురు చూసేలా చేయడం బాగా నచ్చిన విషయాలు.  నేపధ్య సంగీతం బాగుంది కానీ, పాటలు గుర్తుండిపోయేలా లేవు. చిత్రీకరణ కి మాత్రం వంక పెట్టలేం. బిట్ సాంగ్స్ చేసి ఉంటే సినిమా నిడివి కొంత తగ్గేదేమో. 

అనాధగా ఎస్టాబ్లిష్ అయిన హీరోకి అవసరార్ధం వెన్నెల కిషోర్ రూపంలో బాల్య స్నేహితుడిని సృష్టించడం లాంటివి సరిపెట్టేసుకోవచ్చు. ప్రధానమైన లాజిక్ ని మిస్సవ్వడాన్ని మాత్రం సరిపెట్టుకోలేం. రామ్ పాత్రకి దుల్కర్ ని, బాలాజీ పాత్రకి తరుణ్ భాస్కర్ ('పెళ్లిచూపులు' దర్శకుడు)నీ ఎంచుకోడం మొదలు, సుమంత్ పాత్రకి 'విష్ణు శర్మ' అనే పేరు పెట్టడం వరకూ అన్నీ వ్యూహాత్మకంగానే జరిగాయనిపించింది. దాదాపు మూడేళ్ళ విరామం తర్వాత థియేటర్ లో కూర్చుని సినిమా చూడగలనా అని సందేహిస్తూ వెళ్ళాను కానీ, మూడు గంటలు తెలియకుండా గడిచిపోయాయి. కథనం 'మహానటి' ని గుర్తు చేసింది. అశ్వినీదత్ కన్నా వాళ్ళమ్మాయిలే అభిరుచి ఉన్న సినిమాలు తీస్తున్నారనిపించింది. అవసరమైన మేరకు బాగా ఖర్చు చేయడమే కాదు, ఆ ఖర్చు తెరమీద కనిపించేలా చేశారు కూడా. రొటీన్ ని భిన్నమైన సినిమాలు ఇష్టపడే వాళ్లకు నచ్చే సినిమా ఇది.