శుక్రవారం, ఏప్రిల్ 23, 2010

సినిమా నష్టాలు

తెలుగు సినిమా నిర్మాతలకి నష్టాలు వస్తున్నాయిట. మొన్నటివరకూ ఈ నష్టాలకి పైరసీ మాత్రమే కారణం అనున్నారు కానీ, ఇప్పుడు పైరసీ తో పాటు మరో కారణం కూడా ఉందని తెలిసిపోయిందిట వాళ్లకి. నటీనటుల పారితోషికాలు, నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోవడం వల్ల కూడా నిర్మాతలు నష్టపోతున్నారుట. ఏదో ఒకటి చేసి ఆ నష్టాలని తగ్గించుకోడం కోసం మేధోమధనం జరుగుతోందిట. అవసరమైతే కొన్ని రోజుల పాటు భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణాన్ని ఆపేసే విషయాన్నీ పరిశీలిస్తున్నారుట.

ఏ వస్తువుని తయారు చేసే వాడైనా దాని అమ్మకం విలువ ఆధారంగా ఉత్పత్తి ఖర్చు నిర్ణయించుకుంటాడు, కనీస ఖర్చులనీ, కనీస అమ్మకం ధరనీ దృష్టిలో పెట్టుకుని. సినిమా విషయానికి వచ్చేసరికి వాస్తవ వ్యాపారం కన్నా, ఊహాత్మక వ్యాపారమే ఎక్కువ. ఇంత ఖర్చు కావొచ్చు, ఇంత డబ్బు రావొచ్చు అన్న అంచనాలతో సినిమా తీయడం మొదలు పెడితే ఖర్చు రెండింతలు కావడం, ఆదాయం సగమే రావడం చాలా మంది నిర్మాతలకి అనుభవంలోకి వచ్చింది, కాబట్టే ఈ మేధో మధనం.

ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే, ఈ నిర్మాణ వ్యయం పెరిగిపోడానికి కారణం మరెవ్వరో కాదు, సాక్షాత్తూ నిర్మాతే. దర్శకుడో, పెద్ద హీరోనో ఏది చెబితే అది గుడ్డిగా వినేసి, తనకంటూ ఒక ఆలోచన లేకుండా డబ్బుని నీళ్ళలా ఖర్చు పెడుతున్నది నిర్మాత కాక మరెవరు? ఇవాళ ఎంతమంది నిర్మాతలకి సినిమా నిర్మాణం మీద పూర్తి స్థాయి అవగాహన ఉంది? ఎక్కడ ఎంత ఖర్చు పెట్టొచ్చు, ఏ ఖర్చుని నియంత్రించ వచ్చు? అని తెలిసిన వాళ్ళు ఎంతమంది?


డబ్బు మూటలతో రావడం, వాటిని తక్కువ కాలంలోనే రెట్టింపు చేసుకోవాలన్న ఒకేఒక్క ఆలోచనతో సినిమా మొదలు పెట్టడం. కర్ణుడి చావుకి ఉన్నన్ని కారణాల వల్ల నష్టాలు రుచి చూడాల్సి రావడం. నిర్మాతలు స్టేట్మెంట్ల లో చెప్పుకుంటున్నట్టుగా కళాసేవ కోసమే సినిమాలు తీస్తున్నట్టయితే మనకిన్ని నాసిరకం సినిమాలు ఎందుకు వస్తాయి? ఫార్ములా కథల, మూస సినిమాల బారిన పడాల్సిన అగత్యం మనకి ఎందుకు కలుగుతుంది?

పారితోషికాలు ఎందుకు పెరిగాయి? నిర్మాతలు కొందరు హీరోల చుట్టూ మూగి, వాళ్ళ డేట్లే మహా ప్రసాదంగా భావించి 'బాబు' ఒప్పుకోగానే భారీ ఖర్చుతో సినిమాలు తీసేయడం వల్లనే కదా. విమాన చార్జీ మొదలు, కారు ఖర్చు వరకూ ఇచ్చి ఎక్కడినుంచో హీరొయిన్లని తేవడం ఎందుకు? వాళ్ళ ఖర్చులతో పాటు, వాళ్లకి తెలుగు భాష రాని కారణంగా వేరొకరితో డబ్బింగ్ చెప్పించాల్సిన ఖర్చు అదనం. అలా అని ఆ వచ్చే అమ్మాయిలు అద్భుతమైన నటన ప్రదర్శించేస్తున్నారా? వరుసగా మూడో సినిమాలో కనిపించే వాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అయినా ఈ వేలం వెర్రి ఆగదు.

జీవ పరిణామ క్రమం ఒకడుగు వెనక్కి వేసిందేమో అని అనుమానం వచ్చే జీవ జాతులని తీసుకొచ్చి, రకరకాల సర్జరీలతో వాళ్లకి మానవ రూపం తెప్పించి, వాళ్ళని హీరోలుగాపెట్టి కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసి ఆపై 'చెట్టు' పేరు చెప్పి వాళ్ళని చెట్టెక్కిస్తున్నది ఈ నిర్మాతలే కదా? రెండో సినిమా నుంచే వాళ్ళు తమ రేంజి ల గురించి ఇమేజిల గురించీ మాట్లాడుతున్నారంటే ఆ పాపం వాళ్ళని చెట్టుమీద కూర్చోపెట్టిన వాళ్ళది కాదూ? ఫలానా నటులు పారితోషికాన్ని ఎంతంత పెంచేసినా వాళ్ళ చుట్టూనే తిరుగుతూ వాళ్ళతోనే సినిమాలు తీయడం ఎందుకు?
ఇప్పుడు అగ్ర తారలుగా వెలుగు వెలుగుతున్న వాళ్ళంతా ఒకప్పుడు మామూలు నటులే. వైవిధ్యమైన కథలు, పాత్రలు వాళ్లకి ఆ హోదా తెచ్చాయి. అంతే తప్ప వాళ్ళలో ఏదో మహత్తు ఉండి కాదు. సరైన కథ, కథనం లేకుండా వచ్చే సినిమాల్లో తారలు వాళ్ళే అయినా ఆ సినిమాలు మర్నాటికే తిరిగి వస్తున్నాయంటే కీలకం ఎక్కడ ఉందో అర్ధం కావడం లేదూ? మరి అలాంటి సినిమా కథ కి ఇవాళ ఉన్న గౌరవం ఏపాటిది? కథ మీద నిర్మాతలు ఎలాంటి శ్రద్ధ పెడుతున్నారు?

ప్రపంచంలో ఉన్నవి రెండే కథలనీ అవి రామాయణ మహాభారతాలనీ తరచూ చెప్పే 'అగ్ర' రచయితలు అవే కథలని తిప్పి తిప్పి రాస్తుంటే, ప్రతి ఫ్రేం నీ రిచ్ గా తీసే దర్శకులు రీళ్ళు చుట్టేస్తున్నారు. బోల్డంత పబ్లిసిటీ ఇచ్చి, వీలైనన్ని ఎక్కువ ధియేటర్లలో సినిమా రిలీజ్ చేసి వీలయితే మొదటి రోజునే పెట్టిన డబ్బంతా వెనక్కి లాగేసుకుని, రెండో రోజునుంచే లాభాలు గడించాలన్నది నిర్మాతల ఆలోచన. టిక్కెట్ కొని సినిమా చూసే ప్రేక్షకుడిని వినియోగ దారుడు అనుకుంటే అతనికి దొరుకుతున్నది ఏమిటి?

టిక్కెట్ రేటు మొదలు, పార్కింగ్ ఫీజు వరకూ అన్నీ భారీ మొత్తాలే. చూడ బోతున్నది భారీ సినిమా కదా మరి. నాసిరకం సినిమా హాల్లో, చిరుగులు పడ్డ సీట్లో ఉంటుందో, ఆగిపోతుందో తెలియని ఏసీలో బోల్డన్ని సార్లు చూసేసిన కథనే మళ్ళీ చూడాలి. హీరో గారి వంశం డైలాగులు, తొడ చప్పుళ్ళు, హీరొయిన్ పలికే వచ్చీ రాని ముద్దు మాటల తెలుగు పలుకులు, ఇప్పటికీ చాలా సార్లు చూసేసిన ఫారిన్ లొకేషన్లో పాటలు, ఏళ్ళ తరబడి పాతుకుపోయిన కమెడియన్లు పరమ రొటీన్ గా నటించేసే హాస్య సన్నివేశాలు.

నిర్మాత నష్టపోకూడదు అంటే వీటన్నింటినీ భరిస్తూ, చూసిన సినిమానే మళ్ళీ మళ్ళీ చూస్తూ ప్రేక్షకులంతా మళ్ళీ మళ్ళీ నష్ట పోవాలి. వాళ్ళ నష్టాల గురించి సమాలోచనలు జరుపుతున్న నిర్మాతలు ప్రేక్షకులకి కలుగుతున్న నష్టాల గురించి కూడా ఆలోచిస్తే బాగుండును. అటు నిర్మాతలకీ, ఇటు ప్రేక్షకులకీ లాభదాయకమైన విధంగా వైవిధ్య భరితమైన సినిమాలు తీయాలని నిర్ణయించుకుంటే ఉభయ తారకంగా ఉంటుంది కదా. చుక్కలనంటే పారితోషికాలు చెల్లించి భారీ తారలతో సినిమా తీసే బదులు, పదునైన కథలతో కొత్త వారితో సినిమాలు తీస్తే, జనమే ఆ కొత్త వాళ్ళని స్టార్లని చేస్తారు కదా. అప్పుడు పారితోషికాలు తగ్గకుండా ఉంటాయా.. ఇలా జరిగే అవకాశం ఉందని ఆశ పడొచ్చా???

19 కామెంట్‌లు:

  1. మొగుడు చస్తేకాని ముండకి బుద్ధిరాదు అని ఓ ముతక సామెత ఉంది.(ఈ పదాన్ని సెన్సారు చేసినా మీ ఇష్టమే చెయ్యకపోయినా మీ ఇష్టమే,మీ బ్లాగులో ఇలా రాస్తున్నందుకు మన్నించండి).
    కోరి తెచ్చుకున్న లంపటాలే అన్నీనూ,ఇప్పుడు వొళ్ళూ ఇల్లూ కాలాయని ఏడిస్తే ప్రయోజనం ఏముంటుంది.నాకయితే ఈ పరిస్థితి హిరోషిమా లాగ అయి మళ్ళీ ఆ బూడిదల్లోంచి కొత్త "చిత్రసీమ" పుట్టుకురావాలని ఉంది.
    ఇక్కడ వినియోగదారులం మనమే అయినా నిత్యావసరం కాదు,అందువల్ల మనకి వచ్చిన నష్టం ఏమీ లేదు,అందువల్లే వాళ్ళలో ఆ పరివర్తన మొదలయ్యింది.అదేదో మనకి నిత్యావసరం అయ్యుంటే వాళ్ళు ఇలా ఆలోచించేవారు కాదు కదా?(మన నిత్యావసర వస్తువుల ధరలు ఎప్పటికీ దిగిరాకపోడానికి కారణం కూడా ఇది ఒకటి,చాలా కారణాలు వేరే ఉన్నా)

    రిప్లయితొలగించండి
  2. హాట్సాఫ్ గురూ.ముక్కు మీద గుద్దినట్లు చక్కగా చెప్పావు.గబ్బులేసిపోయింది తెలుగు సినిమా పరిశ్రమ.

    రిప్లయితొలగించండి
  3. తెలుగు బాష లో దీనినే వేలం వెర్రి అంటారు. సినిమా నిర్మాణము మీద ఆవగాహన లేకపోవటం, అత్యాస, సెల్ఫ్ decipline లేకపోవటం ఇప్పటి తెలుగు సినిమా కి పట్టిన దరిద్రం. అంత ఎందుకు మన దిల్ రాజ్ నే తీసుకోండి.. మొన్నటి వరుకు ఆయన కళ్ళు నెత్తిన పెట్టుకుని నడిచాడు. మూడు సినిమాలు dom అవ్వటము thoaa గురుడు దిగి వచ్చాడు. Plastic surgery గురుంచి నేను కామెంట్ చెయ్యను గాని (నేను ఆ ఫ్యామిలీ అభిమాని ని అయితే కాదు)..వంశము గురుంచి..మా నాన్న గారు..మా బాబాయ్..మీ మేన మామ ...ఈ dialogues కి మాత్రం వొళ్ళంతా కంపరము పుడుతుంది. మంచి ఆర్టికల్ రాసినందుకు మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. చాలా బాగా చెప్పేరు. చస్తున్నాము చూడలేక ఈ అబ్బాయిలను అమ్మాయిలని. దానికి తోడూ ఈ వెధవ టీవీ గోల, చూపించిన కమర్షియలే మళ్ళీ మళ్ళీ చూపించి ఒక పెద్ద హీరో లా ఇమేజ్ ఇస్తారు.

    రిప్లయితొలగించండి
  5. murali garu cinima nashtala gurinchi chala baga rasaru.nijamga ippati cinimalu chudaleka chastunnamante nammandi.ika mida ayina manchi cinimalu ravalani aashistunnanu,thank you.

    రిప్లయితొలగించండి
  6. సుతిమెత్తగా మొహం మీద కొట్టారండీ బాబూ.ఇంత బాగా ఎలా రాయగలరు మీరు?
    1)......ఏ వస్తువుని తయారు చేసే వాడైనా దాని అమ్మకం విలువ ఆధారంగా ఉత్పత్తి ఖర్చు నిర్ణయించుకుంటాడు, కనీస ఖర్చులనీ, కనీస అమ్మకం ధరనీ దృష్టిలో పెట్టుకుని. సినిమా విషయానికి వచ్చేసరికి వాస్తవ వ్యాపారం కన్నా, ఊహాత్మక వ్యాపారమే ఎక్కువ. ఇంత ఖర్చు కావొచ్చు, ఇంత డబ్బు రావొచ్చు అన్న అంచనాలతో సినిమా తీయడం మొదలు పెడితే ఖర్చు రెండింతలు కావడం, ఆదాయం సగమే రావడం చాలా మంది నిర్మాతలకి అనుభవంలోకి వచ్చింది, కాబట్టే ఈ మేధో మధనం.
    ఇది సూపర్ విశ్లేషణ.

    2)-----డబ్బు మూటలతో రావడం, వాటిని తక్కువ కాలంలోనే రెట్టింపు చేసుకోవాలన్న ఒకేఒక్క ఆలోచనతో సినిమా మొదలు పెట్టడం.
    భేషుగ్గా చేప్పారు.ఒక బడ్డీ కొట్టు పెట్టినంత ఈజీ గా ఇక్కడ పెట్టుబడులు పెట్టెయ్యడం కనీస అవగాహన లేని ప్రతీ మనిషి కూడా.


    3)---పారితోషికాలు ఎందుకు పెరిగాయి? నిర్మాతలు కొందరు హీరోల చుట్టూ మూగి, వాళ్ళ డేట్లే మహా ప్రసాదంగా భావించి 'బాబు' ఒప్పుకోగానే భారీ ఖర్చుతో సినిమాలు తీసేయడం వల్లనే కదా.

    అవును,ఆ "బాబు" లు కూడా ప్రజల నాడి తెలుసుకోకుండా,తలా తోకా లేని సినిమాలు,మూస డైలాగులతో మంచి కామెడీ వస్తువు అయిపోయారు.ఇలా అంటే హార్డ్ కోర్ ఫ్యాన్లు,ఏసీలకి బోలేడు కోపం కూడానండోయ్.

    4)---జీవ పరిణామ క్రమం ఒకడుగు వెనక్కి వేసిందేమో అని అనుమానం వచ్చే జీవ జాతులని తీసుకొచ్చి, రకరకాల సర్జరీలతో వాళ్లకి మానవ రూపం తెప్పించి, వాళ్ళని హీరోలుగాపెట్టి కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసి ఆపై 'చెట్టు' పేరు చెప్పి .....
    నవ్వలేక చచానండీ బాబూ,ఈ లైను చదివి.
    5)---ఇప్పుడు అగ్ర తారలుగా వెలుగు వెలుగుతున్న వాళ్ళంతా ఒకప్పుడు మామూలు నటులే. వైవిధ్యమైన కథలు, పాత్రలు వాళ్లకి ఆ హోదా తెచ్చాయి. అంతే తప్ప వాళ్ళలో ఏదో మహత్తు ఉండి కాదు.
    ఇది 100 % కరెక్ట్.నిన్న రాత్రి "హై హై నాయక" చూస్తోంటే పై లైను గుర్తొచ్చింది.

    6)---నిర్మాత నష్టపోకూడదు అంటే వీటన్నింటినీ భరిస్తూ, చూసిన సినిమానే మళ్ళీ మళ్ళీ చూస్తూ ప్రేక్షకులంతా మళ్ళీ మళ్ళీ నష్ట పోవాలి. వాళ్ళ నష్టాల గురించి సమాలోచనలు జరుపుతున్న నిర్మాతలు ప్రేక్షకులకి కలుగుతున్న నష్టాల గురించి కూడా ఆలోచిస్తే బాగుండును.
    నిజం గా ఇలా ఆలోచించిన రోజు మనకి "ఆనంద"మే.
    సో,హోలు మొత్తంగా మీ పోస్టు ఎప్పటి లాగే అదుర్స్.
    కాస్త ఎక్కువ ఫ్రీక్వెంట్ గా రాయండి మాలాంటి వారి కోసం.

    రిప్లయితొలగించండి
  7. చాలా చక్కగా చెప్పారండీ...రాసిన ప్రతీ వాక్యం అక్షర సత్యం...సూటిగా అడిగిన కొన్ని ప్రశ్నలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి...

    >>>జీవ పరిణామ క్రమం ఒకడుగు వెనక్కి వేసిందేమో అని అనుమానం వచ్చే జీవ జాతులని తీసుకొచ్చి, రకరకాల సర్జరీలతో వాళ్లకి మానవ రూపం తెప్పించి, వాళ్ళని హీరోలుగాపెట్టి కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు...

    :-):-) భలే చెప్పారు...ఈ వాక్యం మన హీరోలు గానీ చదివితే చెమ్చాడు నీటిలో దూకి ఆత్మ హత్యా ప్రయత్నం చేస్తారేమోనండీ...

    రిప్లయితొలగించండి
  8. చాలా చక్కగా చెప్పారండీ, రాసిన ప్రతీ వాక్యం అక్షర సత్యం.

    రిప్లయితొలగించండి
  9. @శ్రీనివాస్ పప్పు: మీ స్పందనలో తీవ్రతకి కారణం అర్ధమయ్యిందండీ.. చెత్త సినిమా చూసిన ప్రతిసారీ ఈ నిర్మాత మీద కేసు వేసి నష్టపరిహారం రాబట్టుకునే అవకాశం ఉంటె ఎంత బాగుండును అనిపిస్తూ ఉంటుంది నాకు.. నిజమేనండీ మనకి ఛాయస్ లేకపోతె ఇంకెలాంటి సినిమాలు చూడాల్సి వచ్చేదో.. ధన్యవాదాలు.
    @భవదీయుడు: ధన్యవాదాలు.
    @Anjaas: ఒక్కరని కాదండీ, దాదాపు ప్రతి నిర్మాత అలాగే చేస్తున్నాడు.. ఇప్పటికైనా ఆలోచన మొదలయ్యింది కదా, చూద్దాం, ఏదన్నా మార్పు ఉంటుందేమో.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. @భావన: ఈ టీవీల గోల ఒక ప్రత్యేకమైన టాపిక్ అండీ.. వాళ్ళు సృష్టిస్తున్న కాలుష్యం అంతా ఇంతా కాదు.. కొత్త సినిమా వస్తోందంటే పాపం.. అందరూ ఒకటే భజన.. ధన్యవాదాలు.
    @స్వాతి: ధన్యవాదాలండీ..
    @భారతి మాచెర్ల: అందరి ఆశ అదేనండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @రిషి: నేను మరీ తరచుగా రాసేస్తున్నానని కొందరు మిత్రుల ఉవాచ.. మీరేమో కొంచం తరచూ అంటున్నారు :-) :-) ..ధన్యవాదాలు..
    @శేఖర్ పెద్దగోపు: మన వాళ్ళు మరీ అంట సున్నిత మనస్కులు కాదులెండి.. కాబట్టి ఆ ప్రమాదం లేదు :-) ..ధన్యవాదాలు.
    @హరే కృష్ణ: ధన్యవాదాలండీ..
    @ప్రేరణ: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  12. చాల చక్కటి విశ్లేషణ మురళి గారు!

    నాకు తెలిసి చక్కటి కథలతో కొత్త నటీనటులతో కూడిన సినిమాలు చెప్పోకోదగ్గ సంఖ్యలో రాకపోవడానికి సినిమా పరిశ్రమకి కాస్త కుళ్ళు రాజకీయ లక్షణాలు కలిగి ఉండటం కూడా కారణమేమో అనిపిస్తుంది.

    కొత్తవాళ్ళను ఎదగడానికి అవకాశం ఇవ్వకపోవడం, అవకాశం రావాలంటే సదరు వ్యక్తులకు గులాంగిరి చేయడం, కథలను దొంగలించి వాటిని వారికి తగినట్టుగా మార్పు చేసుకోవడం, పోనీ కళాపోషణ ఉన్న నిర్మాత, దర్శకుడు అష్టకష్టాలు పడి సినిమా తీస్తే, అవి ఆడటానికి సినిమా థియేటర్లు దొరక్కపోవడం (దొరక్కుండా చేయడం అని చదవండి) .. ఈ రకమైన కుళ్ళు రాజకీయలుంటే ఎప్పటికి పరిశ్రమ బాగుపడే అవకాశమే లేదు.

    - మహేష్

    రిప్లయితొలగించండి
  13. @Mahesh Telkar: నిజమేనండీ.. రాను రాను ఇదో విష వలయంగా తయారవుతోంది.. కొన్ని సినిమాలకి జనం దగ్గరికి వచ్చే అవకాశం కూడా దొరకడం లేదు.. చూద్దాం, ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయేమో.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. మీకు తెలియని టాపిక్ ఉంటుందా..అని నాకెప్పుడూ ఆశ్చర్యమే..!!!

    రిప్లయితొలగించండి
  15. @ప్రణీత స్వాతి: అయ్యబాబోయ్.. యెంత మాట అనేశారండీ.. ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. మురళిగారు! ఎంతబాగా చెప్పారండీ .."చెత్త సినిమా చూసిన ప్రతిసారీ ఈ నిర్మాత మీద కేసు వేసి నష్టపరిహారం రాబట్టుకునే అవకాశం ఉంటె ఎంత బాగుండును అనిపిస్తూ ఉంటుంది నాకు.."
    పైరసీని అరికట్టండీ అభిమానులంతా కట్టకట్టుకొని ...అనేవాళ్ళంతా ముందు బ్లాక్ టిక్కట్లని అదుపు చెయ్యరేం ? సరదాగా సినిమా చూద్దామని థియేటర్ కు వెళితే టిక్కట్లు థియేటర్ వాళ్ళే బ్లాక్ లో అమ్మిస్తుంటే ఉసూరుమని ఇంటికి వచ్చే సగటు ప్రేక్షకుడికి రెండువందలు పెట్టి టిక్కెట్టు కొనుక్కోవడమెందుకు ఇరవై రూపాయలతో ఇంటిల్లిపాదీ చూడొచ్చు అనిపిస్తే అది వాళ్ళ తప్పు కానేకాదు .పైరసీని అరికట్టమనే సార్లెవ్వరూ దీన్ని కంట్రోల్ చెయ్యరు . పైగా ఎవరెక్కువ భారీ బడ్జెట్ తీసారో పోటీ ....ఎ సినిమా ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసిందో ఎవరు ఎవరి రికార్డులు బ్రేక్ చేశారో ....ఈ మధ్య మీడియా వాళ్ళు అభిమానులమధ్య తగవులు పెట్టేవిధంగా సర్వేలూ .....ఛీ ఛీ ...అనిపిస్తుంది .

    రిప్లయితొలగించండి
  17. మీ పోస్టులన్నీ మల్ల్య్ చదువుతుంటే, ఈ పోస్ట్ బాగా నచ్చిందండీ.

    రిప్లయితొలగించండి