మంగళవారం, ఆగస్టు 30, 2011

కుసుమాలు తాకగనే...

వర్షం భలే బాగుంటుంది. ఈ వాక్యం రాస్తుంటే నాకు తెలియకుండానే నవ్వొచ్చేసింది. అవును, 'కాఫీ రుచిగా ఉంటుంది' 'జయప్రద అందంగా ఉంటుంది' లాంటి సార్వజనీన సత్యాలని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడం అంటే నవ్వురాకుండా ఎలా ఉంటుంది? వర్షం అంటే పగ పట్టినట్టుగా కుంభవృష్టిగా కురిసేది కాదు, చక్కగా చిన్నగా సన్నగా కురుస్తూ, ఆగుతూ, మళ్ళీ కురుస్తూ అలా కురిసీ కురవనట్టుగా కురిసేదన్నమాట.

పెద్ద వానైతే అస్సలు బయటికి కదలకుండా కిటికీ పక్కన కూర్చుని చూడాలనిపిస్తుంది. అదే చిరుజల్లైతే ఏదో వంకన తడిసి తీరాలనిపిస్తుంది.. చల్లటి నీటిఆవిరిలా అనిపించే చినుకులు తాకీ తాకనట్టుగా తాకుతూ ఉంటే పారిజాతం చెట్టు ప్రేమగా తన పూలని జారవిడుస్తున్న అనుభూతి. పూల పరిమళానికి మల్లేనే ఈ చినుకులకీ ఇదీ అని వర్ణించలేని పరిమళం.. అనుభూతికే తప్ప అక్షరాలకి అందదు.

అసలీ చిరుజల్లు 'నేనొస్తున్నా'నంటూ పంపే సంకేతం కూడా ఎంత సున్నితంగా ఉంటుందో. జడివానైతే లుంగలు చుట్టుకుపోయే సుడిగాలితో కబురెడుతుంది కదా.. ఈ చిన్నవాన తనకన్నా ముందుగా పిల్ల తెమ్మెరలని పంపుతుంది. పల్చటి మేఘాల్ని పనికట్టుకుని మరీ తీసుకొచ్చే ఈ తెమ్మెరలు, మనకన్నా ముందుగా మట్టికి అందిస్తాయి వాన పంపే కబురుని. మరుక్షణంలో మట్టి, గాలితో కలిసొచ్చి మనల్సి పలకరిస్తుంది.

ఏ దేశంలో తయారైన ఏ సుగంధమూ కూడా, ఆక్షణంలో మట్టి విరజిమ్మే సువాసన అంతటి ఆహ్లాదకరమైన పరిమళాన్ని అందించలేదని నాకో గట్టి నమ్మకం. అసలా గాలిని గుండెలనిండా పీల్చుకుని కనీసం కొన్నాళ్ళ పాటు నిరాహారంగా బతికేయెచ్చేమో అనిపిస్తూ ఉంటుంది. మేఘాలన్నీ మందగమనంతో సాగి, మొహమాటంగా ఓ చోటికి చేరాక మొదట ఓ పెద్ద చినుకు.. తర్వాత రెండో మూడో చిన్న చినుకులు.. ఆ తర్వాత అన్నీ కంటికి కనిపించని బుల్లి బుల్లి తుంపరలు.

ఓ విశాలమైన పచ్చికబయలు.. కనుచూపు మేరంతా పచ్చని పచ్చిక.. ఆ పచ్చదనానికి అంచుగానా అన్నట్టుగా దూరంగా ముదురాకుపచ్చ రంగులో కనిపించే చెట్లు.. ఆకాశంలో చిన్న చిన్న గుంపులుగా నింపాదిగా ప్రయాణం చేసే మేఘాలు. అప్పుడు ప్రారంభమైన బుల్లి బుల్లి తుంపరలు.. ఎవరూ లేని ఏకాంతంలో ఆ చిరుజల్లులని ఆస్వాదిస్తూ మనం...జల్లు పడుతూనే ఉంటుంది.. తాకి వెళ్తూనే ఉంటుంది.. కానీ పూర్తిగా తడపదు.. వర్షానికి సంబంధించి ఒకానొక అందమైన ఊహ ఇది.

తను పలకరించినప్పుడు, వర్షపు చినుకులు తడుపుతున్నట్టుగా కాక, పూలేవో తాకి వెళ్తున్నట్టుగా అనిపించడం చిరుజల్లు ప్రత్యేకత. చిరుచలిలో పలకరించే చినుకు వెచ్చగా అనిపిస్తుందదేమిటో.. ఇలాంటి జల్లులు పడేటప్పుడే ఏ క్షణంలో అయినా ఇంద్రధనుస్సు సాక్షాత్కరించేసే వీలుంది. చిరు చినుకుల పరవశంలో పడి పట్టించుకోకపోతే, ఓ అపురూపమైన ఆనందాన్ని అందుకోలేకపోయినట్టే.. శ్రావణం సెలవు తీసుకున్నాక వచ్చే వర్షాల్లో చిరుజల్లులు అరుదే అయినా, ఎదురు చూసే వాళ్ళని నిరాశ పరచవవి...

ఆదివారం, ఆగస్టు 28, 2011

కూర్మావతారం

చూడ్డానికే గట్టిగా అనిపిస్తూ, మిలమిలా మెరిసే రక్షణ కవచం, అందులోనుంచి అప్పుడప్పుడూ బయటికి కనిపించే నాలుగు బుల్లి బుల్లి కాళ్ళూ మరియూ వాటి కన్నా కూసింత పెద్దదైన తల. నీళ్ళలో ఈదుతున్నా, నేలపై నడుస్తున్నా రెప్పవెయ్యకుండా చూడాల్సిందే ఆ జీవిని. అదే తాబేలు. మెట్ట తాబేలు కథ చెప్పేసుకున్నాం కాబట్టి, ఇప్పుడు నీటి తాబేళ్ల గురించి. అమ్మమ్మా వాళ్ళ పెరట్లో ఉండే నిండా నాచు పట్టిన, సగానికి పైగా వరలూడిపోయిన పేద్ద దిగుడు బావిలో సర్వకాల సర్వావస్తల్లోనూ డజనుకి తక్కువ కాకుండా దర్శనమిచ్చేవి నీటి తాబేళ్లు. వీటి పుణ్యమాని సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్తే, మధ్యాహ్నాలు తోచకపోవడం అనే సమస్య ఉండేదే కాదు.

నూతికి ఓ పక్క పెద్ద పెద్ద నేరేడు, వేప చెట్లు ఉండేవి. వాటుకి వేప చెట్టుకి కూసింత చరిత్ర ఉంది. ఇక, నేరేడు చెట్టయితే మేం అడక్కుండానే పళ్ళు రాల్చేసేది. నల్లగా నిగనిగలాడుతూ, అక్కడక్కడా చిన్న చిన్న గుంటలతో చూడగానే నోరూరేలా ఉండేవి నేరేడు పళ్ళు. నేరేడు చెట్టుకి వెనగ్గా కొంచం దూరంలో ఓ మడుగు ఉండేది. ఆ మడుగులో తామర మొగ్గలు ఉండేవి. అయితే ఆ మడుగు దొంగూబి. పొరపాటున ఎవరన్నా దిగారంటే పైకి రావడం కష్టం. ఇటు చూస్తే దిగుడు బావికి వరల్లేకపోవడం వల్ల పిల్లలు పడిపోతారన్న భయం ఉండేది పెద్ద వాళ్లకి.

దాంతో మేం పెరట్లో ఆడుతున్నామంటే, హమేషా ఎవరో ఒకళ్ళు మాకు కాపలా ఉండాల్సిందే. ఎంత వేసంకాలం మధ్యాహ్నమైనా నూతి దగ్గర మహా చల్లగా ఉండేది. పిల్లలే కాదు, పెద్దాళ్ళు కూడా అక్కడకి చేరిపోయేవాళ్ళు. పెద్దాళ్ళు వాళ్ళ కబుర్లలో వాళ్ళు ఉండేవాళ్ళు కానీ, పిల్లలకి అలా కుదరదు కదా. ఎప్పటికప్పుడు కొత్త ఆటలు కనిపెడుతూ ఉండాలి. ఘటోత్కచుడు చెప్పినట్టు ఎవరూ కనిపెట్టకపోతే ఆటలెలా వస్తాయి? (అంటే అచ్చంగా ఇలాగే చెప్పలేదు కానీ, ఈమాత్రం అన్వయించుకోకపోతే ఇంక 'మాయాబజార్' చూడడం ఎందుకూ, దండగ). మేం అనగా, నాతో కలిపి ఓ అరడజనుమంది పిల్లలం ఎప్పుడూ అలా కొత్త ఆటలు కనిపెట్టే పనిలో ఉండేవాళ్ళం.

అలా ఓ మధ్యాహ్నం మేం కనిపెట్టిన ఆటని చాలా రోజులే ఆడుకున్నాం. అసలు నూతి దగ్గరకి వెళ్ళగానే ముందర నేరేడు పళ్ళు ఏరేసుకుంటాం కదా. ఆ నూతి నీళ్ళు ఉప్పగా తాగడానికి పనికి రాకపోయినా, ఇళ్ళలో వాడుకోడానికి ఎవరో ఒకళ్ళు వచ్చి పట్టికెడుతూనే ఉంటారు. అలా పట్టికెళ్ళే వాళ్ళు ఓ చేదడు నీళ్ళు అక్కడ పెట్టి వెళ్ళాలి. అది రూలు. ఏరి తెచ్చుకున్న నేరేడు పళ్ళని ఆ చేదలో వేసేసి బాగా కడిగేస్తామా, ఇప్పుడాపక్కనే చూడ్డానికి పనసాకుల్లా ఇంకొంచం పెద్దగానూ, పల్చగానూ ఉండే ఆకులు కోసుకుని శంఖంలా చుట్టేసి కడిగిన పళ్ళని అందులో వేసేసుకోవడం.

ఒక్కొక్కళ్ళం ఒక్కో పండు తీసుకుని తినడం. గింజ తీసి చేదలో కడగడం -- ఈ కడగడం ఎందుకంటే నూతిలో ఎంగిళ్ళు వెయ్యకూడదు కదా అందుకు -- దానిని సూటిగా చూస్తూ నూతిలో ఉన్న తాబేళ్ళలో మిగిలిన ఫ్రెండ్సులు చూపించినదానికి కొట్టడం. మనం నెగ్గామనుకో, ఇంకో పండు తిని, మళ్ళీ తాబేలుని కొట్టొచ్చు. ఓడిపోతే మన తర్వాత వాళ్లకి వెళ్తుంది ఆట. తాబేళ్లు ఎంతంత ఉంటాయంటే, మన దోసిలి మొదలు, అమ్మ దోసిలి, ఇంకా అమ్మదీ పిన్నిదీ కలిపితే ఎంత దోసిలవుతుందో అంతంత పెద్దవికూడా ఉంటాయి నూతిలో.

మనకి పెద్ద తాబేలు వస్తే సుళువుగానే నెగ్గేస్తాం కానీ, చిన్న తాబేలు కానీ వచ్చిందా, ఇంక అంతే. ఎందుకంటే, చిన్న చిన్న తాబేళ్లు చకచకా కదిలిపోతాయి, నూతిలో. ఒక్కోసారి వాటిల్లో అవి ఆడుకుంటూ పెద్ద తాబేళ్ల కిందకి కూడా వెళ్ళిపోతాయి. అప్పుడేమో మనం కొట్టే నేరేడు గింజ చిన్న తాబేలుకి కాకుండా, పెద్ద తాబేలుకి తగిలి మనం ఓడిపోతాం. చెట్టు మీద నుంచి నేరేడు పళ్ళు ఎప్పుడూ రాలుతూనే ఉంటాయి కాబట్టి, పళ్ళు అయిపోడం అనే సమస్యే ఉండదు. పైగా ఉప్పు నీళ్ళలో కడిగితే బోల్డంత రుచి వస్తుంది కూడాను.

అసలీ పెద్దోల్లున్నారే.. (!!) వీళ్ళు పిల్లల్ని వాళ్ళ పాటికి వాళ్ళని ఆడుకోనివ్వరు. పైగా ఏం ఆడుకున్నా అందులో తప్పులే కనిపిస్తాయి కూడాను. మేమందరం బుద్ధిగా తాబేళ్ళని కొట్టే ఆట ఆడుకుంటున్నామా? ఎలా గమనించిందో కానీ, ఓరోజు పిన్ని గమనించేసింది. ఇంకేవుందీ? "తాబేలంటే సాక్షాత్తూ విష్ణుమూర్తి అవతారం. అలా కొట్టకూడదూ, దండం పెట్టుకోవాలీ" అంటూ పాఠం చెప్పేసింది. పైగా, అంతగా అయితే ఆరబోసిన పిండిల దగ్గరకి వచ్చేస్తున్న కాకుల్ని కొట్టే ఆట ఆడుకోండీ అంటూ సలహాలు. తాబేళ్ళయితే దొరుకుతాయి కానీ, కాకులు మన దెబ్బకి దొరుకుతాయా? ఏంటో, పిన్నికి ఈ చిన్న విషయం కూడా తెలీదు. ఏం చేస్తాం మరి.. తాబేళ్ళకి దండం పెట్టుకుంటూ కొత్త ఆటలు ఆలోచించుకున్నాం.

శనివారం, ఆగస్టు 27, 2011

శతదినోత్సవం

"ఇవాళ కూడా మీరో టపా రాసి పోస్టు చేస్తే వరుసగా వందరోజులు నిర్విరామంగా బ్లాగు రాసినట్టవుతుంది. అభినందనలు" ఉదయాన్నే మెయిల్ చెక్ చేస్తుండగా, బ్లాగ్మిత్రులొకరు రాసిన మెయిల్, పంపిన కార్డ్ నన్ను మొదట ఆశ్చర్య పరిచాయి. తర్వాత ఆనంద పరిచాయి. ఓసారి బ్లాగులోకి వెళ్లి చూసుకుంటే, వారు రాసింది నిజమేనని అర్ధమయ్యింది. నాపాటికి నేను రాసుకుపోవడమే తప్ప ఎక్కడా ఆగి లెక్క పెట్టలేదు మరి.

వెనక్కి తిరిగి చూస్తే, మే ఇరవయ్యో తేదీన ప్రచురించిన 'తెగిన పేగు' టపా నుంచి ప్రతిరోజూ టపాలున్నాయి నా బ్లాగులో. నిజానికిదేదో పెద్ద అచీవ్మెంట్ అని నేను అనుకోవడంలేదు. అగ్రిగేటర్ తెరిచి చూస్తే రోజూ రెండు మూడు టపాలు రాసే బ్లాగ్మిత్రులు కనిపిస్తారు. అలాగే, ఇది ముందుగా అనుకుని చేసిందీ కాదు. నిజానికి అలా ఓ లక్ష్యం నిర్ణయించుకుని రాయడం అన్నది బ్లాగుల్లో సాధ్యపడదన్నది బ్లాగర్లందరికీ తెలిసిన విషయమే.

ఈ యాదృచ్చిక పరిణామాన్ని పునస్సమీక్ష కోసం ఉపయోగించుకోవాలని అనిపించిది. గత మూడు నెలల కాలంగా నాకు రోజూ బ్లాగు రాసే కోరిక, రాయగలిగే ఓపికా, తీరికా దొరకడం వల్ల నాకు రాయాలనిపించినవన్నీ బ్లాగులో రాశాను. బ్లాగు రాయడం కేవలం ఓ కాలక్షేపంగా కాక, ముఖ్యమైన పనిగానే భావిస్తాను నేను. ఎటూ నేను రాసింది చదవాలన్నకోరిక, ఓపిక, తీరిక ఉన్నవాళ్ళే వచ్చి చదువుతారు కదా.

"ఈమధ్య మీ బ్లాగులో తరచుగా టపాలు కనిపించడం బాగుంది" "రోజూ ఏదో ఒకటి భలే రాస్తున్నారు" మొదలుకొని "క్వాలిటి తక్కువై, క్వాంటిటీ బరువుతో మీ బ్లాగు మీకేమైనా బాగుందేమో, రోజు రోజుకీ విసుగ్గా ఉంటుంది. వ్రాయాలి కాబట్టి వ్రాయొద్దు. వ్రాయాలని అనిపించినపుడే వ్రాయండి" వరకూ రకరకాల స్పందనలు, "తినగా తినగా గారెలు చేదుగా అనిపిస్తే, గారెలు చేదుగా ఉన్నట్టు కాదుగా! అవకాశం, సమయం, రాసే వ్యాపకంలో మీకు సంతోషం ఉన్నన్నాళ్ళు ఎంచక్కా రాసుకోండి. అందరికీ దక్కే అదృష్టం కాదది," లాంటి ఆత్మీయ ప్రోత్సాహం, ఇవీ మిత్రుల నుంచి అందుకున్నవి.

చాలా అరుదుగా మాత్రమే ముందస్తు ప్లానింగ్ తో టపాలు రాస్తాను నేను. మెజారిటీ టపాలు అప్పటికప్పుడు అనుకుని రాసినవే. ఆక్షణంలో ఏ విషయాన్ని గురించి రాయాలనిపిస్తే, ఆ విషయాన్ని గురించి వాక్యం పక్కన వాక్యం పేర్చుకుంటూ వెళ్ళడమే. తీరా పబ్లిష్ చేసే సమయానికి మిషిన్ మొరాయించడం, అచ్చుతప్పులని మిత్రులు సున్నితంగా ఎత్తిచూపడం చాలా సార్లే జరిగింది. రాయాలి కాబట్టి రాయడం అన్నది జరగలేదు. అసలు ఎందుకలా? రాయకపోతే ఎవరేమంటారు? అసలిక్కడ ఎవరి బ్లాగుకి వారే శ్రీ సుమన్ బాబు కదా!

ఒకరోజు 'ఇవాళ బ్లాగింగుకి సెలవు' అనుకుని, టీవీ ముందు కూర్చున్నాను. 'శంకరాభరణం' బృందంతో చేసిన 'వావ్' కార్యక్రమం ఎంతగా ఆకట్టుకుందంటే, వెంటనే ఓ టపా రాసేయాలనిపించింది. చేతిలో బ్లాగుంది, రాసేశాను. ఆ టపాకి వ్యాఖ్య రాస్తూ రెండు రోజుల్లో రాబోయే వాణీ జయరాం కార్యక్రమాన్ని గురించి కూడా టపా రాయమని సూచించారు బ్లాగ్మిత్రులు ఇంగ్లిష్ సుజాత గారు. మరోరోజు మిత్రులు బోనగిరి గారు 'కుట్ర' కథ గురించి రాయమన్నారు. ఇంకోరోజు కొత్తావకాయ గారి పోస్టు చదువుతూ, ఏమాత్రం ముందస్తు ప్లాన్ లేకుండా రాసిన టపా 'కొత్తావకాయా అన్నం,' ఆసాయంత్రం ఓ అరగంట సమయంలో జరిగింది జరిగినట్టుగా రాశానది.

అయితే, ఆబ్లాగు గురించి రాసే అర్హత నాకు లేదన్న విమర్శ వచ్చింది. "...కొత్తావకాయ గురించి. ఆవిడకున్న భాష మీద పట్టు, ఆ ఒరవడి గమనించారా? జ్ఞాపకాలే మైమరపు, ఓదార్పు అని సిని కవి ముక్కలు రెండు అతికించుకున్న మీకు ఆవిడ భుజం తట్టే అర్హత ఉందా?" అని అడిగారు బ్లాగ్మిత్రులొకరు. ఇప్పుడు నా సందేహం, అమృతం కురిసిన రాత్రి ఎంత బావుందో చెప్పాలంటే మనమూ తిలక్ అంత గొప్పకవి అయి ఉండాలా? అలా అయితే, నా బ్లాగులో ముప్పాతిక మూడొంతుల టపాలు రాయడానికి నాకు ఎలాంటి అర్హతా లేనట్టే మరి.

బ్లాగు మొదలు పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకూ బ్లాగింగు గురించీ, నా బ్లాగుని గురించీ నా అభిప్రాయం ఒకటే. "ఇది నా డైరీ, కాకపొతే మరికొందరు చదవడానికి అందుబాటులో ఉంచుతున్నాను. అలా చదివే వారి మనోభావాలు గాయపరచకుండా ఉంటే చాలు." అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన చర్చలో పాల్గొనడానికి నేనెప్పుడూ సిద్ధమే. కాకపొతే, నా బ్లాగుని గురించి జరిగే చర్చ మరెక్కడో కాక ఇక్కడే జరగాలి. సద్విమర్శలకెపుడూ తలుపులు తెరిచే ఉంటాయి. ఎప్పటికప్పుడు వ్యాఖ్యలు, ఉత్తరాల రూపంలో అభిప్రాయాలు పంచుకుంటున్న మిత్రులందరికీ పేరు పేరునా మరోమారు కృతజ్ఞతలు. మెయిల్ రాసి, కార్డు పంపిన మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు.

శుక్రవారం, ఆగస్టు 26, 2011

గవర్నర్ రోశయ్య

మన దేశంలో ప్రభుత్వ సర్వీసులో చేరేందుకు -- అయ్యేయెస్ మొదలు అటెండర్ వరకూ అన్నింటికీ -- కొన్ని కనీసార్హతలు ఉన్నాయి. ఉద్యోగంలో చేరాక పదవీ కాలానికీ, పదవీ విరమణకీ పరిమితులున్నాయి. ఉద్యోగ కాలంలో ఏదన్నా తప్పు చేస్తే దండనగా క్రమశిక్షణ చర్యలున్నాయి. సందర్భాన్ని బట్టి ఇవి ఉద్యోగిని శాశ్వితంగా ఉద్యోగం నుంచి తొలగించేవిగా కూడా ఉంటాయి. కా.....నీ, ఈ ఉద్యోగులందరిమీదా కర్రపెత్తనం చేసే నేతలకి మాత్రం ఎలాంటి నియమ నిబంధనలూ లేవు.

ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరి, తంటాలు పడి కొంచం గుర్తింపు తెచ్చుకుంటే చాలు. తర్వాత పార్టీలు మారినా, కేసుల్లో ఉన్నా, జైలుకెళ్ళినా, ఇంకా ఏమేం చేసినా కూడా పార్టీలో పైవారి కరుణ సంపాదించుకోగలిగితే ఇక జీవితాంతమూ పదవులని అనుభవించవచ్చు. మన రాజకీయ నాయకులకి ఏమాత్రమూ కిట్టని ఒకే ఒక్క పదం రిటైర్మెంట్. ప్రభుత్వ సర్వీసులో చేరిన ఉద్యోగికి నిర్దేశించిన పదవీ విరమణ వయసు దాటిన ఇరవై సంవత్సరాలకి తమిళనాడు గవర్నరుగా పదవిని అలంకరించబోతున్న మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఇందుకు తాజా ఉదాహరణ.

అసలు గవర్నర్ అంటేనే 'రబ్బర్ స్టాంప్' అని ముద్దు పేరు. విశాలమైన రాజభవన్లో విశ్రాంతిగా కాలం గడిపే ఉద్యోగం. రాష్ట్రాల్లో రాజ్యాంగ సంక్షోభం తలెత్తినప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో పెద్దగా బరువు బాధ్యతలేవీ ఉండవు. అయితే, గవర్నర్లని నియమించేది కేంద్రం కాబట్టి, సదరు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం రాజకీయంగా కేంద్రానికి అనుకూలం కానప్పుడు, కేంద్రం తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని కనిపించని విధంగా ఇబ్బందులు పెట్టాల్సిన రహస్య బాధ్యత గవర్నర్ల మీద ఉంటుంది.

మర్రి చెన్నారెడ్డి, పీఎస్ రామ్మోహనరావుల తర్వాత తమిళనాడుకి మూడవ తెలుగు గవర్నర్ కాబోతున్న రోశయ్యకి ఇప్పటికైతే ఎలాంటి సమస్యలూ కనిపించడం లేదు. గతంలో చెన్నారెడ్డి గవర్నరుగా ఉన్న కాలంలో అప్పటి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యంగా లేని కారణానికి ఇబ్బందులు పడ్డ జయలలిత ఇప్పుడక్కడ ముఖ్యమంత్రి. అయితే ఇప్పుడావిడ కేంద్రంతో పొత్తుకి తహతహలాడుతోంది. ఇటు కేంద్రమూ, కరుణానిధి వారి డీఎంకే ఎంపీలు ఒక్కొక్కరుగా కుంభకోణాల్లో ఇరుక్కుని జైలుకి వెళ్ళడంతో, ఏ క్షణంలో అయినా కరుణకి వీడ్కోలిచ్చి, జయకి స్నేహహస్తం సాచడానికి సిద్ధంగా ఉంది.

రోగీ-వైద్యుడూ కూడా (ఇక్కడ రెండు పక్షాలూ రోగులే, వైద్యులే.. పొత్తుకి ఎవరి కారణాలు వాళ్లకి ఉన్నాయి మరి) పాలే కోరుతున్నారు కాబట్టి, రోశయ్య గారికి మరింత నిశ్చింత. ఆయన వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఎవరిచేతా వ్యతిరేకి అనిపించుకోడానికి ఏమాత్రం ఇష్టపడని ఈ లౌక్య రాజకీయుడికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కనుచూపు మేరలో ఎలాంటి ఇబ్బందులూ కనిపించడం లేదు. కాబట్టి, నొప్పించక తానొవ్వక, తప్పించుకోనవసరం ఏమాత్రమూ లేకుండానే పదవీ కాలాన్ని హాయిగా ఆస్వాదించవచ్చు మన రోశయ్య గారు.

ఇప్పుడు గవర్నరుగా రోశయ్య ఏం చెయ్యాలి? ఓ తమిళుడు తెలుగు రాష్ట్ర గవర్నరుగా ఏం చేస్తున్నాడో, ఈ తెలుగాయన కూడా తమిళ దేశపు గవర్నరుగా అదే పని చేయవచ్చు. ఓ స్నేహితురాలి మాటల్లో చెప్పాలంటే: "ఇంతకీ అదృష్టం అంటే శివాలక్ష్మి గారిది. గవర్నరు గారి భార్య హోదాలో అరవ దేశంలో వీధి కొకటిగా ఉన్న గుళ్లనీ గోపురాల్నీ పూటకొకటి చొప్పున భర్తతో కలిసి తిరిగి రావొచ్చు. పుణ్యం, పురుషార్ధం కూడా.." రోశయ్య తరానికి చెందిన చాలామంది తెలుగు సినిమావారు ఎటూ చెన్నైలోనే ఉన్నారు. కాబట్టి ఏవిధంగా చూసినా హాయైన జీవితమే. అడిగిన వెంటనే ముఖ్యమంత్రి కుర్చీని కిమ్మనకుండా వదిలేసినందుకు 'అమ్మ' పెట్టిన తాయిలం ఎంత బాగుందో కదా!

గురువారం, ఆగస్టు 25, 2011

గోన గన్నారెడ్డి

"నాన్నగారూ! నేను నా పితృ పాదులకూ, నా చక్రవర్తికీ, సర్వదేవతల సాక్షిగా నేను నా తండ్రిగారికి వారసులుగా చక్రవర్తిని అవుతాననీ, నేను వివాహం చేసుకున్న పురుషుడు చక్రవర్తి కాడనీ, నా కుమారుడు కానీ, నేను దత్తు చేసుకున్న బాలుడు కానీ కాకతీయ వంశజుడు అవుతాడనీ, నేనూ కాకతీయ వంశగానే ఉంటాననీ మాట ఇస్తున్నాను. ఇది నేను ఆడి తప్పితే ఏడేడు కాలాలు నరకంలో ఉండగల దాన్ని, కాశీలో గోవును చంపిన దాన్ని, గురు హత్య చేసిన దాన్ని, బ్రాహ్మణ ధనం దోచినదాన్ని" అంటూ వృద్ధుడైన తన తండ్రి గణపతి దేవ చక్రవర్తి ఎదుట ప్రమాణం చేసింది రుద్రమదేవి. ఆ ప్రమాణం ఆమెని కాకతీయ సామ్రాజ్యానికి ఎనిమిదో చక్రవర్తిని చేసింది.

పుత్ర సంతానం లేని గణపతి దేవుడు తన ప్రధమ పుత్రిక రుద్రమదేవిని రుద్రదేవుడనే పేరుతో బాలుడిగానే పెంచాడు. యుద్ధ విద్యలు నేర్పించాడు. శత్రువులకీ, సామంతులకీ సందేహం రాకుండా ఉండేందుకు రుద్రమదేవి మరదలు ముమ్ముడమ్మతో వివాహమూ జరిపించాడు. రుద్రదేవ చక్రవర్తికి యువరాజ పట్టాభిషేకం జరిగిపోయింది. కానైతే, రుద్రదేవుడు పురుషుడు కాదు స్త్రీ అన్న పరమ రహస్యం నెమ్మది నెమ్మదిగా రాజ్యం నలుమూలలా, ఆపై దేశం నలుపక్కలకీ వ్యాపించింది. అంతే కాదు, అప్పటివరకూ తనని తనను బాలుడిగా భావించుకున్న రుద్రమకీ తనలోని స్త్రీత్వం బోధపడింది. సామంత రాజు చాళుక్య వీరభద్రుడితో ప్రేమలో పడిందామె.

ఓ పక్క వృద్ధుడైన గణపతి దేవుడు, మరోపక్క పాలనానుభావం లేని రుద్రదేవుడు - పైగా ఆమె యువరాజు కాదు యువరాణి అన్నరహస్యం తెలిసిపోయిన సామంతులు 'ఒక ఆడది రాజ్యం చేయడమా?' అని ఈసడిస్తూ, ఓరుగల్లు కోటని ఆక్రమించేందుకు ఆరంభించిన కుయుక్తులు. ఎటుచూసినా సమస్యలే కనిపించిన ఆ తరుణంలో రుద్రమదేవికి కొండంత అండగా సహాయం అందించిన వారు ఇద్దరు. వృద్ధుడైన మంత్రి శివదేవయ్య దేశికులు - అపార పాలనానుభవం, కాకతీయ వంశం పై అపరిమితమైన గౌరవం, రుద్రమపై ఎంతో నమ్మకం ఉన్న మహా మంత్రి. రెండో వ్యక్తి గజదొంగ గోన గన్నారెడ్డి. ఇతడే అడివి బాపిరాజు చారిత్రాత్మక నవల 'గోన గన్నారెడ్డి' లో కథానాయకుడు.


అడివి బాపిరాజు కథానాయకులందరూ ఉదాత్త చరితులు, ఆరడుగుల ఆజానుబాహులు, సర్వ సులక్షణ శోభితులు, ధర్మ నిరతిని విడిచి పెట్టనివారూ. తను సృష్టించే కథానాయక పాత్రలమీద అపరిమితమైన అనురాగాన్ని ఏమాత్రమూ దాచుకోని బాపిరాజు నవలలో కథానాయకుడు ఓ గజదొంగ!! వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా, చదివినప్పుడు ఏమాత్రమూ ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే అవడానికి దొంగే అయినా, గన్నారెడ్డి అచ్చమైన అడివి బాపిరాజు మార్కు కథానాయకుడు. దొంగకైనా నీతీ, న్యాయం ఉండాలనే వాడు. తనకు చెందాల్సిన సామంత రాజ్యాన్ని పినతండ్రి గోన లకుమయారెడ్డి ఆక్రమిస్తే, తమ్ముడు విఠల ధరణీశుడితో కలిసి అడవిబాట పట్టిన గన్నారెడ్డి, కొందరు యువకులని చేరదీసి, యుద్ధ విద్యలని నేర్పించి, దొంగతనాలు మొదలు పెడతాడు.

కాకతీయ సామ్రాజ్యాన్ని ఎదిరించే సామంత రాజులపైనే దృష్టి పెట్టిన గన్నారెడ్డి, తన చిన్నాన్న కొడుకు వరదారెడ్డికీ, ఆదవోని రాజ్య పాలకుడు కోటారెడ్డి కుమార్తె అన్నాంబికకీ మరికొద్ది సేపట్లో వివాహం జరగబోతున్నదనగా అదాటున వచ్చి, పెళ్ళికొడుకుని ఎత్తుకుపోవడం నవలా ప్రారంభం. అప్పటికే వివాహ వేదికకి చేరుకున్న అన్నాంబిక, పల్లకి తెరల మాటునుండి కేవలం ఒకే ఒక్క క్షణం గన్నారెడ్డిని చూసి, మరుక్షణం అతనితో ప్రేమలో పడిపోతుంది. వివాహ విచ్చిన్నం మాత్రమే తన లక్ష్యం కనుక, వరదారెడ్డిని విడిచిపెట్టేస్తాడు గన్నారెడ్డి. వియ్యమందాలని బలంగా నిర్ణయించుకున్న లకుమయారెడ్డి -కొండారెడ్డి లు వివాహానికి మరోమారు ముహూర్తం నిర్ణయిస్తారు. వాళ్ళిద్దరూ ఏకమైతేనే, మరికొందరిని కలుపుకుని ఓరుగల్లుపై దండెత్తగలరు మరి.

తప్పని సరి పరిస్థితుల్లో, అన్నాంబికని ఎత్తుకుపోడానికి రంగం సిద్ధం చేస్తాడు గన్నారెడ్డి. ఆశ్చర్యకరంగా, తనకి ఆ వివాహం ఇష్టం లేదనీ, తనని ఎత్తుకుపోని పక్షంలో ఆత్మహత్య తప్ప తనకి మరోమార్గం లేదనీ, ఎత్తుకెళ్లడానికి అనుమతి కోరిన గన్నారెడ్డితో చెబుతుందామె . తన సోదరి సాయంతో అన్నాంబికని ఎత్తుకెళ్ళిన గన్నారెడ్డి, ఆమెని ఓరుగల్లు చేర్చి రుద్రమ ఆశ్రయంలో ఉంచుతాడు. ఇంతలోనే, ముమ్ముడమ్మకి తను వివాహం చేసుకున్నది ఒక స్త్రీనన్న రహస్యం తెలియడం, రుద్రమ, ముమ్మడమ్మ, అన్నాంబిక మంచి స్నేహితులు కావడం జరిగిపోతుంది. రాజకుటుంబాలలో స్త్రీల జీవితాలని గురించి వీరిమధ్య జరిగే సంభాషణలు చదవాల్సిందే. "దాన శాసనాలు రాయించుకోవడం తప్ప మనం చేయగలిగేది ఏముంది? మన వాళ్ళ వీర మరణ వార్తలు ఎప్పుడు వినాల్సి వస్తుందో తెలీదు. మనకన్నా వ్యవసాయం చేసుకునే కాపస్త్రీలు అదృష్టవంతులు కాదూ.." ఇలా సాగుతాయవి.

గణపతిదేవ చక్రవర్తి మరణం, ఒక్కసారిగా రాజ్యంపైకి పెరిగిన దండయాత్రలు, అడివిలో సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న గన్నారెడ్డి కాకతీయ రాజ్యానికి రక్షణ కవచంలాగా నిలబడడం.. యుద్ధాలూ, ఒప్పందాలూ, మధ్య మధ్యలో ప్రేమకథలూ .. ఇలా చకచకా సాగిపోతుంది కథ. కాకతీయుల పాలనా వైభవాన్ని కళ్ళకి కట్టారు బాపిరాజు. ముఖ్యంగా శిల్పం, చిత్రలేఖనం, నాట్యం తో పాటుగా వ్యవసాయానికి ఇచ్చిన ప్రాముఖ్యత..ఇవన్నీ చదవొచ్చు. ఆంధ్రపాలకుల్లో ఉంపుడుగత్తెలని ఎక్కువగా ఆదరించి, వారి పేరిట చెరువులూ, దొరువులూ ఏర్పాటు చేసిన వారు కాకతీయ సామంతులే. సదరు స్త్రీజనం కూడా, కేవలం ఆట పాటలకే పరిమితం కాకుండా రాచరిక వ్యవహారాల్లోనూ ముఖ్య పాత్రనే పోషించారని చెబుతుంది 'మధుసాని.' చరిత్ర మీద, మరీ ముఖ్యంగా ఆంధ్ర చరిత్ర మీద ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పకుండా చదవాల్సిన నవల ఇది. చారిత్రక నవల కావడం వల్ల కావొచ్చు, 'హిమబిందు' ని గుర్తు చేసింది చాలా చోట్ల. (విశాలాంధ్ర ప్రచురణ. పేజీలు 260, వెల రూ 125, అన్ని పుస్తకాల షాపులు.)

బుధవారం, ఆగస్టు 24, 2011

అరుంధతొచ్చింది...

అన్నా హజారే ప్రతిపాదించిన 'జన లోక్ పాల్' బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎవరూ ఊహించని వైపునుంచి మద్దతు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసిన కోరల్లేని లోక్ పాల్ బిల్లుని 'జోక్ పాల్' బిల్లుగా ఎద్దేవా చేస్తూ, ప్రధానిని కూడా బిల్లు పరిధిలోకి తెస్తూ తయారు చేసిన జన లోక్ పాల్ బిల్లుని ఆమోదించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఢిల్లీ రాంలీలా మైదానంలో నిరాహార దీక్ష మొదలు పెట్టిన అన్నా హజారేకి అన్ని రాజకీయ పక్షాల నుంచీ మద్దతు వచ్చింది.

అత్యంత అరుదుగా ఏకాభిప్రాయానికి వచ్చే వామపక్షాలు, బీజేపీ ఈవిషయంలో మాత్రం ఒకే నిర్ణయం తీసుకుని అన్నా దీక్షని సమర్ధించాయి. యూపీఏ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో దాదాపు ఏకాకిగా మారి, విమర్శలని ఎదుర్కొంటున్న తరుణంలో రంగ ప్రవేశం చేసింది వామపక్ష మేధావి అరుంధతీ రాయ్. బుకర్ ప్రైజ్ గెల్చుకున్న 'గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్' రచయిత్రిగా కన్నా, దళితులు, ఆదివాసీల సమస్యలపై ప్రభుత్వంతో పోరాడే సామాజిక ఉద్యమకారిణిగానే ఎక్కువమందికి తెలిసిన అరుంధతి అన్నా హజారే మీద తీవ్రమైన విమర్శలు చేయడం ద్వారా మళ్ళీ వార్తల్లోకి వచ్చారు.

అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేస్తున్న ఉద్యమాన్ని బీజేపీ-ఆరెస్సెస్ వంటి 'హిందూత్వ' సంస్థలూ, ఫోర్డ్ లాంటి బహుళ జాతి కంపెనీలూ స్పాన్సర్ చేస్తున్నాయన్నది అరుంధతి మొదటి ఆరోపణ. మరి, ఈ హిందూత్వ శక్తులు చేస్తున్న ఉద్యమానికి సెక్యులర్ పార్టీలైన వామపక్షాలు ఎందుకు మద్దతు ఇస్తున్నాయన్నది ఆవిడ చెప్పలేదు. వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, గనుల కేటాయింపు, భూసేకరణ కారణంగా నిర్వాసితులవుతున్న పేదల పక్షాన అన్నా హజారే ఎందుకు పోరాడడం లేదని సూటిగా ప్రశ్నించిన అరుంధతి, ఆ సమస్యలన్నీ పరోక్షంగా అవినీతితో సంబంధం ఉన్నవే అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోయారో మరి.

కార్పొరేట్ సంస్థలు, స్వచ్చంద సేవాసంస్థలని కూడా జన లోక్ పాల్ పరిధిలోకి తేవాలన్న చిత్రమైన ప్రతిపాదనని ముందుకు తెచ్చిన అరుంధతికి, ఈ సంస్థలమీద అజమాయిషీ చేయాల్సింది ప్రభుత్వమేననీ, ఆ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోడాన్ని ప్రశ్నిస్తూనే ఉద్యమం సాగుతోందనీ తెలియదని అనుకోలేం. అన్నా ఉద్యమంలో హడావిడి మాత్రమే కనిపిస్తోందనీ, దళితులు, ఆదివాసీలకి ఆ ఉద్యమం వల్ల ఒరిగేది శూన్యమనీ అభిప్రాయ పడ్డ ఈ రచయిత్రి, ఆయా వర్గాల ప్రయోజనాలని కాపాడే విధంగా ఉండేందుకు ఉద్యమంలో చేయాల్సిన మార్పులని సూచించి ఉన్నా బాగుండేది.

నిజానికి అన్నా ఉద్యమం సర్వ రోగ నివారిణి కానే కాదు. అలాగే, జన లోక్ పాల్ బిల్లు అన్ని సమస్యలకీ పరిష్కారమూ కాదు. కానైతే, ప్రభుత్వం ప్రతిపాదించిన లోక్ పాల్ బిల్లుకన్నా శక్తివంతమైన జన లోక్ పాల్ బిల్లు వల్ల అనేక రెట్లు ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నది నిర్వివాదం. ఆ బిల్లుని స్వీకరించి, దేశ వ్యాప్త చర్చ జరపడం అవసరం. ఎందుకటే, ప్రభుత్వం లోక్ పాల్ బిల్లుని ప్రవేశ పెట్టే ముందు ఏ రాజకీయ పక్షంతోనూ చర్చించలేదు. ఎవరి అభిప్రాయాలూ తీసుకోలేదు. కొరియా, జపాన్ లాంటి దేశాల్లో అధ్యక్షులు అంబుడ్స్ మన్ పరిధిలోనే పనిచేస్తున్నారు. మరి, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో ప్రధానిని లోక్ పాల్ పరిధిలోకి తేడానికి అభ్యంతరాలు ఏమిటన్నవి అర్ధం కాదు.

అన్నా హజారే దీక్షపై అరుంధతీ రాయ్ సంధించిన విమర్శనాస్త్రాలు కాంగ్రెస్ పార్టీకి కొంత ఊరట ఇస్తాయనడంలో సందేహం లేదు. అనేకానేక రాజకీయ కారణాలతోనూ, సిద్ధాంత పరంగానూ అరుంధతి కాంగ్రెస్ తో విభేదించవచ్చునేమో కానీ, జన లోక్ పాల్ బిల్లు విషయంలో ఏకాకిగా మారిన కాంగ్రెస్ కి ఆమె పరోక్షంగా మద్దతు ఇచ్చినట్టే అయింది. అన్నా శిబిరం అప్పుడే అరుంధతికి జవాబులివ్వడం మొదలు పెట్టింది. వామపక్షాలు ఏమంటాయో చూడాలి. బహుశా అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం అనొచ్చు. వామపక్ష రాజకీయ పరిభాషలో చెప్పాలంటే, అరుంధతి చేసింది 'చారిత్రిక తప్పిదం' అవుతుందా? ...కాలమే జవాబు చెప్పాలి.

మంగళవారం, ఆగస్టు 23, 2011

గతజన్మ జ్ఞాపకం...

ఒక్కోసారి.. ఏదన్నా ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడో, పాట విన్నప్పుడో, పుస్తకం చదివినప్పుడో లేదా కొత్తవారిని ఎవరినో కలిసినప్పుడు...గతజన్మ జ్ఞాపకమేమో అనిపించే లాంటి స్మృతి ఒకటి చుట్టుముట్టి వెళ్తూ ఉంటుంది నన్ను. ఈ చుట్టుముట్టడం అన్నది సుడిగాలిలా తీవ్రంగా కాక, పిల్లతెమ్మెరలాగా సున్నితంగా ఉండడం వల్ల ఇదీ అని ఇదమిద్దంగా చెప్పలేని ఓ చిత్రమైన అనుభూతి కలుగుతూ ఉంటుంది. అది పరిచితమైన అనుభూతి. నన్ను నేను వెతుక్కునే అనుభూతి.. కొందరు స్నేహితులతో దీనిని పంచుకున్నప్పుడు ఇదేమీ అబ్నార్మాలిటీ కాదనీ వాళ్ళకీ అప్పుడప్పుడూ ఇలా అనిపిస్తూ ఉంటుందనీ తెలిసింది.

అందరికీ హైదరాబాద్ అనగానే ఏవేవో గుర్తొస్తాయి. నాకు మాత్రం మొదట గుర్తొచ్చేది గోల్కొండ కోట. ఎప్పుడు అక్కడికి వెళ్ళినా, ఆ కోటతో నాకు వందల ఏళ్ళ అనుబంధం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. రాళ్ళు, చెట్లు, చేమలు, కట్టడాలు.. ఒకటేమిటి.. అన్నీ కూడా చిరపరిచితంగా అనిపిస్తాయి. ఓరుగల్లు కోట, వెయ్యి స్థంభాల గుడితోనూ ఇదే అనుభవం. మొదటి సారి అక్కడికి వెళ్ళినప్పుడు "ఇది నాకు చాలా బాగా తెలిసున్న ప్రాంతమే" అనిపించింది.. నిజానికి ఏరకంగానూ నాకు తెలియడానికి ఆస్కారం లేదు.

కొన్ని పాతకాలపు దేవాలయాలు, బంగళాలు, కొన్ని పట్టణాలు...ఇవన్నీ కూడా నాక్కలిగించే అనుభూతి ఒక్కటే.. నాకు చిర పరిచయం ఉన్న ప్రాంతాలని. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళూరు వెళ్తే అక్కడి చెరువు గట్టున పెద్ద పెద్ద స్థంభాలతో ఉన్న కరణంగారిల్లు, ఆ లోగిలిలో కాడమల్లి చెట్లు అవన్నీ ఎంతో ఆకర్షించేవి. జనసంచారం లేకపోయినా, ఒక్కడినీ అక్కడ తిరగడానికి ఇష్టపడేవాడిని. పురుగూ పుట్రా ఉంటాయ్ అని ఇంట్లో వాళ్ళు కేకలేసినా నా కాళ్ళు మాత్రం అక్కడికే పరిగెత్తేవి. ఆ లోగిట్లో నాకు ఏదో తెలియని ఆకర్షణ. అదేమిటో ఎంతకీ తెలిసేది కాదు.

ఒకప్పుడు బాగా వినేసి, చాలా రోజులపాటు వినడం మానేసి, మళ్ళీ కొత్తగా అవే పాటలు విన్న సందర్భంలో కలిగే అనుభూతి.. ఇదిగో ఈ శిధిల భవంతులని చూసినప్పుడు కలిగే అనుభూతికి దగ్గరగా అనిపిస్తోంది. "యమునా తీరాన.. రాధ ఒడిలోన.. కృష్ణుడి ప్రేమ కథ..." ఒకప్పుడు నేను దాదాపు ప్రతిరోజూ విన్న పాట. ఎలా వచ్చిందో తెలియదు కానీ, ఏళ్ళ తరబడి గ్యాప్ వచ్చేసింది.. మొన్నామధ్య మిత్రులొకరు తనకి నచ్చిన రాధాకృష్ణుల పాటలు పంపుతూ, ఈ పాటనీ వినమన్నారు. గతజన్మ జ్ఞాపకం లాగే అనిపించింది తప్ప, కేవలం కొన్ని దశాబ్దాల క్రితం విన్న పాటలా అనిపించలేదు.

"మనం ఎప్పుడో ఎక్కడో కలిశామనిపిస్తోంది" నేను చాలా తరచుగా కాకపోయినా, కొంచం ఎక్కువసార్లే వాడిన మాట ఇది. కొందర్ని చూడడం మొదటిసారే అయినా, ఎక్కడో, ఎప్పుడో చూసినట్టుగా అనిపించడం నాకు కొత్త కాదు. ఎక్కడా వాళ్ళని చూడడానికి అవకాశం ఉండదు. అయినప్పటికీ, అదే మనుష్యులు, అవే మాటలు.. "బహుశా ఇలాంటి వాళ్ళనే కలిసి ఉంటాను" అని సరిపెట్టుకుంటూ ఉంటాను. అయితే, ఒక్కోసారి అవతలి వారినుంచి కూడా అదే స్పందన వస్తూ ఉంటుంది, ఆశ్చర్యంగా. "మేబీ యువర్ బ్రదర్?" అంటారు కొందరు, విడిచిపెట్టకుండా. "నో చాన్స్" అనేస్తాను నేను.

పుస్తకాలతో, మరీ ముఖ్యంగా కథలతో, ఇలాంటి అనుభవాలు కోకొల్లలు. వర్షం, ముసురు నేపధ్యంగా వచ్చే ఏ కథని చదవడం మొదలు పెట్టినా, ఆ కథ నాకు తెలుసనో, నా కళ్ళెదురుగా జరిగిందనో అనిపిస్తూ ఉంటుంది. కొన్ని కథలు ఊహించిన ముగింపుకే చేరిన సందర్భంలో ఈ భావన మరింతగా బలపడుతూ ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటంటే, ఎప్పుడో విన్న పాట మళ్ళీ విన్నప్పుడు కలిగే అనుభూతి, ఎప్పుడో చదివిన పుస్తకం మళ్ళీ చదివినప్పుడు కలిగే అనుభూతీ ఒక్కటి కాదు. పాట ఓ అనుభూతిగా చుట్టుముడితే, పుస్తకం ఓ జ్ఞాపకంలా పలకరించి వెళ్తుంది.

"పొరపాటు.. కథ కాదు.. గతజన్మలోని జాజిపూల సువాసనేమో.." అంటాడు వంశీ, తను తీసిన 'అనుమానాస్పదం' సినిమా కోసం తనే రాసిన 'ప్రతిదినం నీ దర్శనం' పాటలో. గత జన్మలూ, మరుజన్మలూ శాస్త్రానికీ, హేతువాదానికీ అందవు. అలాగే మనక్కలిగే అనుభవాలూ, అనుభూతులూ అన్నీ శాస్త్ర సమ్మతంగానూ, శాస్త్రం పరిధిలోనూ ఉండవు. మనతో సహా ఎవరికీ చెడు చేయనంత వరకూ, వీటిని శాస్త్రపు తూకం రాళ్ళతో తూచకుండా కేవలం అనుభూతులుగానే ఆస్వాదించడం మంచిదనిపిస్తూ ఉంటుంది. కొన్నికొన్ని సార్లు లాజిక్కులు వెతకడం కన్నా, నిశ్శబ్దంగా ఊరుకోవడమే ఉత్తమం కదా.. తరచి చూస్తే, ఏ శాస్త్రానికీ అందనివి చాలానే ఉంటాయి మన జీవితంలో...

సోమవారం, ఆగస్టు 22, 2011

సీరియల్ వార్తలు

'నేటితో పూర్తయిన పంచాయితీ సర్పంచుల పదవీకాలం.. ప్రత్యేక అధికారులని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు' ..ఎమ్మెల్యేల రాజీనామాల వార్తలు టీవీలో సీరియస్గా చూస్తుండగా కింద ఈ స్క్రోలింగ్ కనిపించింది. సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. అటువైపు నుంచి మిత్రుడు "ఏంటీ విశేషాలు? ఎనీ న్యూస్?" అని రెండు భాషల్లో. తను ఎదురుచూస్తున్న న్యూస్ ఇంకా తెలియలేదు. అందుకని నేను చదువుతున్న స్క్రోలింగ్ పైకి చదివి వినిపించి, చూస్తున్న దృశ్యం తాలూకు రాజీనామాల సంగతులు కూడా గడగడా చెప్పేశాను.

"ముప్పాతిక మూడొంతులు ఆఫీసర్ల రాజ్యమే అన్నమాట! అసెంబ్లీని సస్పెండెడ్ యానిమేషన్లో పెట్టేస్తే ఆ మిగిలింది కూడా ఆఫీసర్లే చూసుకుంటారు కదా హేపీగా" నాయకులకన్నా ఆఫీసర్లు నయమని తన అభిప్రాయం. నేను పూర్తిగా విభేదించను కానీ "ఏ రాయి అయితేనేం.." అన్న వైరాగ్యం కొంతా, ఏదీ కూడా అతి కూడదన్న భావన మరికొంతా.. అంటే అటు పూర్తిగా నాయకులకీ, ఇటు అధికారులకీ వదలరాదని. రాజకీయాలు, ఎన్నికల గురించి కాసేపు చర్చ జరిగింది.

ఇప్పటికే మండల పరిషత్, జిల్లా పరిషత్, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో ప్రజా ప్రతినిధుల పదవీ కాలాలు పూర్తయ్యాయి, ఇప్పుడు పంచాయితీలు కూడా ఖాళీ అయిపోయాయి. వీటన్నింటికీ ఎన్నికలు జరపాలి. ఇప్పటికే తెలంగాణా కోసం రాజీనామాలు చేసిన వాళ్ళు చెయ్యగా, మిగిలిన వాళ్ళు మహానేత మరియు యువనేత కోసం రాజీనామాలు చేసేశామని ప్రకటించేశారు. అయినప్పటికీ కూడా చట్టం తన పని తాను చేసుకుపోతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే గ్రామస్థాయి మొదలు, రాష్ట్ర స్థాయివరకూ ఎక్కడ చూసినా అధికారులు మాత్రమే కనిపిస్తున్నారు.

"సస్పెండెడ్ యానిమేషన్ అంటే మరి ప్రజాస్వామ్యం?" కొంచం ఆందోళనగా అడిగాన్నేను. రాష్ట్రపతి పాలన అన్నది చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే విధిస్తారు కదా మరి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నవి అరుదైన పరిస్థితులే అని తను వాదించాక, "పోనీ ఆర్నెల్లు ఊరుకుంటే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయా? ఆఫీసర్లు ఇవన్నీ సాల్వ్ చేసేస్తారా?" అని అడిగాను. ప్రభుత్వాన్ని రద్దు చేసేసి, మళ్ళీ ఎన్నికలు పెట్టేసినా సమస్యలు యధాతధంగానే ఉంటాయన్నది నా వాదన.

"ప్రజాస్వామ్యానికొచ్చే లోటేమీ ఉండదు. కాకపొతే ఇప్పుడే ఎన్నికలు ఉండవు. పెట్టాల్సిన ఎలక్షన్లకోటి దిక్కు లేదు.. ఇంక కొత్తవేం పెడతారు? అన్నా హజారే దీక్ష పుణ్యమా అని టెస్ట్ క్రికెట్ విషయం వెనక్కెళ్ళి పోయినట్టు, రాష్ట్రపతి పాలన అనగానే కనీసం కొన్ని ఇష్యూస్ అయినా సాల్వ్ కాకుండా ఉంటాయా?" తన లాజిక్కైతే బాగానే ఉంది కానీ, సోనియా లేకుండా ఇంతలేసి నిర్ణయాలు తీసుకోగలిగే మగదూర్ ఎవరికుందీ దేశంలో? "అయినా రిజిగ్నేషన్లు వెంటనే యాక్సెప్ట్ చేయరు కదా.. లాలింపులూ, బుజ్జగింపులూ లాంటివన్నీ అయ్యాక అప్పుడు కదా నెక్స్ట్ స్టెప్.." ఇది నా పాయింట్.

"నిజమే కానీ, చావుకి పెడితే లంఖణానికి వస్తుందని సామెతొకటి ఉంది కదా.. అలా మొత్తానికి ప్రభుత్వాన్ని రద్దు చేసేస్తాం అంటే ఈ రాజీనామాలు కంచికెళ్ళక పోతాయా అని? రాన్రాను చిన్న పిల్లలు కూడా రాజీనామా ఆటాడుకునేలా అయిపోతోంది పరిస్థితి.." తన పాయింట్ అర్ధమయ్యింది కానీ, ఎంత వరకూ ఆచరణ సాధ్యం అన్నది ప్రశ్న. "ఇప్పటికిప్పుడు అంత అవసరం ఏమొచ్చింది. అపోజిషన్ కూడా గవర్నమెంట్ కి చాలా అనుకూలంగానే ఉంది కదా.. ఆఫ్ కోర్స్ వాళ్ళ సమస్యలు వాళ్ళవి.. సోనియా వచ్చేవరకూ కథ నడుస్తూ ఉంటుంది" అన్నాన్నేను.

"అప్పటివరకూ వార్తలు కూడా డైలీ సీరియల్లాగే ఉంటాయింక.. ప్రభుత్వం కూడా డైలీ సీరియల్లాగే పనిచేస్తుంది," తన డిస్కవరీ. నేను అదేదో సినిమాలో శ్రీలక్ష్మి 'నాన్నా..చిట్టీ...' అన్నట్టుగా "ప్రభుత్వమా? పని చేయడమా? ఏదీ, మళ్ళీ ఓసారి...." అంటుండగానే తన నవ్వు గట్టిగా వినిపించింది. నవ్వయ్యాక నేనే అందుకుని "ప్రభుత్వం పని చేస్తోంది.. కానీ చేస్తున్నాను అని చెప్పుకోలేక పోతోంది.. ఎందుకంటే చేయాల్సినవి చాలా ఉన్నా చెయ్యలేకపోతోంది.. పాపం, ప్రతిపక్షాలదీ అదే పరిస్థితి.. ఎవరి గోల వాళ్ళది," అంటుండగానే "మన గోల మనది" అంటూ ఫోన్ కట్ చేశాడు తను..

ఆదివారం, ఆగస్టు 21, 2011

చద్దన్నం

నాకు మూడేళ్ళ వయసున్నప్పుడు అప్పటివరకూ మేం ఉన్న ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టించారు తాతయ్య. పాతింట్లో ఉండి, కొత్తింట్లో లేని అనేక సౌకర్యాలలో 'చద్దన్నాల గది' ఒకటి. కొత్త ఇల్లు పూర్తవ్వడం, నేను మేతపట్టడం రెండూ ఇంచుమించు ఒకేసారి జరిగాయి. "పాతింట్లో అయితే చక్కగా చద్దన్నాల గదిలో పిల్లల్ని వరసాగ్గా కూర్చోపెట్టి చద్దన్నాలు పెట్టేసేవాళ్ళం. ఇక్కడ అన్నిగదులూ ఒకటే.. చెప్పినా వింటారా," రోజూ చద్దన్నం పెట్టేటప్పుడు మర్చిపోకుండా తల్చుకుని, ఎదురుగా లేకపోయినా సరే, తాతయ్యని ఆడిపోసుకునేది బామ్మ.

అసలు చద్దన్నం తినడం ఒక కళ. వేడన్నం కన్నా కొంచం బిరుసుగా ఉండే ఈ చద్దన్నాన్ని సాధ్యమైనంత ఎక్కువ సేపు పెరుగులో కలపాలి. ఈ కలపడంలో పెరుగు మీగడ వేళ్ళకి అంటుకుని వెన్నగా మారుతుంది. ముందుగా ఆ వెన్న పని పడితే, ఈలోగా పెరుగులో నానిన అన్నం తినడానికి అనువుగా ఉంటుంది. అందులోకి ఏ మాగాయ టెంకో, ఆవకాయ పెచ్చో నంజుకుని తాపీగా తింటూ ఉంటే, చివరి ముద్దకి వచ్చేసరికి ఆవులింత వచ్చి, కళ్ళు మూతలు పడాలి. అయినా బడికెళ్లడం తప్పదనుకో.

చద్దన్నాన్ని పెరుగుతో తింటే భలే బాగుంటుంది కానీ, ఒక్కోసారి ఇంట్లో పెరుగు తక్కువగా ఉంటుంది. అంటే ఒక్కోసారి కొమ్ముల గేది పాలివ్వకుండా కొమ్ము విసురుతుంది చూడూ, అలాంటప్పుడన్న మాట. అప్పుడేమో బామ్మ, పెరుగులేదని చెప్పకుండా, "రాచ్చిప్పలో ముక్కల పులుసు మరుగుతోంది. నీకిష్టమని గుమ్మడి ముక్కలు ఎక్కువేశాను కూడానూ.. ఈపూటకి వేడివేడిగా పులుసోసుకుని తినేసెళ్ళు బాబూ" అని ప్రేమగా చెబుతుందన్నమాట. అప్పటికలా బామ్మ మాట వినేస్తే, మధ్యాహ్నం అన్నంలోకి పెరుగేసి పెడుతుంది.

కాదని "ఇప్పుడే పెరుక్కావాలీ" అని గొడవ చేస్తే మాత్రం, వీపు విమానం మోత మోగిపోతుంది. అందుకని గప్ చుప్ గా పులుసూ అన్నం తినేయడమే. రాత్తిళ్ళు చెప్పాపెట్టకుండా ఎవరన్నా చుట్టాలొచ్చారనుకో. ఆ మర్నాడు అసలు చద్దన్నవే ఉండదు. మరి, రాత్రప్పుడు అప్పటికప్పుడు వంట చేయడం కుదరదు కదా. అందుకని చద్దన్నం కోసం ఉంచిన అన్నాన్ని వాళ్లకి పెట్టేస్తారన్న మాట. పెరుగు లేకపొతే పులుసూ అన్నమైనా తినొచ్చు కానీ, అసలు చద్దన్నవే లేకపొతే బళ్ళో మేష్టారు ఏం చెప్పినా ఒక్క ముక్కా అర్ధమవ్వదు.

మామూలు భోజనం కంచంలో తింటామా? అదే చద్దన్నానికైతే మాత్రం గిన్ని ఉంటుంది. ఆ గిన్నిలో కలుపుకుని తినేయడమే. ఒక్కోసారి అమ్మే కలిపిచ్చేస్తుందనుకో. శీతాకాలంలో గడ్డ పెరుగు భలేగా ఉంటుంది కానీ, వేసంకాలం వచ్చేసరికి కొంచం పులుపు తగులుతుంది. ఉప్పేసుకున్నా బాగోదు. అందుకని అమ్మో ఉపాయం చేసింది. వేసంకాలంలో ముందురోజు రాత్రే మిగిలిన అన్నంలో పాలుపోసి, తోడు పెట్టేయడం. అస్సలు పులుపు లేకుండా కమ్మగా ఉంటుంది. అందులో కూడా మామూలుగానే మాగాయో, మరోటో నంజుకోవచ్చు. అభ్యంతరం ఉండదు.

ఓసారి వేసంకాలానికి బామ్మ ఊరెళ్ళింది. అప్పుడు మా ఇంటికొచ్చిన ఓ చుట్టాలావిడ వాళ్ళింట్లో పిల్లలకి చద్దన్నం కన్నా తరవాణీ ఎక్కువిష్టమని చెప్పింది. నాకు తరవాణీ అంటే ఏంటో అర్ధం కాలేదు. ఆవిణ్ణి అడగబోతోంటే అమ్మ "నే చెబుతాలే" అనేసింది. ఆవిడ వెళ్ళిపోయాక, చద్దన్నాన్నే కుండలో వేసి, గంజీ ఉప్పూ వేసి ఊరబెట్టి తరవాణీ చేస్తారని చెప్పగానే, "మనవూ చేసుకుందావమ్మా" అని టక్కున అడిగేశాను, అమ్మకి నేను ముద్దొచ్చి ఉంటాననుకుని. అబ్బే ఒప్పుకోలా. ఏవిటేవిటో చెప్పి చివరికి తరవాణీ కన్నా చద్దన్నవే మంచిదని తేల్చేసింది.

వేసంకాలం చద్దన్నాల స్పెషలు మావిడిపళ్ళు. పళ్ళు ఎక్కడ ముగ్గేస్తారో తెలుసు కదా.. మనవే కావలసినవి ఏరుకుని తెచ్చుకోడం, చద్దన్నంతో పాటు తినేయడం. ఇంక, అమ్మ నోరు నొప్పెట్టేలా పిల్చే వరకూ మధ్యాహ్నం భోజనానికి వెళ్ళలేం. ఆకలనిపించదు కదా. మిగిలిన రోజుల్లో చక్రకేళి అరిటిపళ్ళూ అవీ ఉంటాయి కానీ, మావిడిపండు రుచి దేనికీ రాదు మరి. అందులోనూ చద్దన్నంతో అయితే ఒకటి తిందామనుకుని రెండు తినేస్తాం. పైగా ఇంట్లో వాళ్ళు కూడా, "ఇప్పుడు కాకపొతే, ఇంకో నెలపోయాకా తిందావన్నా దొరకవూ" అంజెప్పేసి, తినగలిగినన్ని తినెయ్యమంటారు.

చద్దన్నాలు తినే పిల్లలందరిలోనూ శ్రీకృష్ణుడు ఉంటాడని బామ్మ చెప్పింది. కృష్ణుడికి కూడా చద్దన్నం అంటే బోల్డంత ఇష్టంట. "మీగడ పెరుగుతో మేళవించిన చలిది" అని పద్యం కూడా నేర్పేసింది అమ్మ. ఇప్పుడు చద్దన్నం తినడం మర్చిపోయినట్టే, ఆ పద్యమూ మర్చిపోయాను. కృష్ణుడి విషయంలో మాత్రం, "పోతన ఎంత గొప్ప రచయితో కదా.. ఉత్తరాది కృష్ణుడిని దక్షిణాదికి తేవడంలో మీగడ పెరుగులు తినిపించి మరీ తెలుగు నేటివిటీకి తీసుకొచ్చేశాడు" అంటూ చాన్నాళ్ళ క్రితం ఓ మిత్రుడు చెప్పిన మాటలు చద్దన్నాన్ని తలచుకున్నప్పుడల్లా గుర్తొస్తూనే ఉంటాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

శనివారం, ఆగస్టు 20, 2011

ఎలా చూడాలంటే...

రెండేళ్ళ క్రితం.. మే ఇరవై ఎనిమిదో తారీఖున, తెలుగు వాళ్ళంతా ఒకప్పుడు వెండితెరనేలిన నందమూరి తారకరాముడి జయంతి జరుపుకుంటూ ఉండగా 'అభినవ మాయాబజార్' గా బహుళ ప్రచారం జరుపుకున్న చలన చిత్రరాజమొకటి ఆంధ్ర రాష్ట్రం నలుమూలలా థియేటర్లలో విడుదలయ్యింది. మరీ రిలీజ్ షో కాదు కానీ, రిలీజ్ రోజున రెండో ఆట చూశాను, కష్టార్జితం ఓ వందరూపాయలు ఖర్చు పెట్టీ, ఆమాత్రం విలువైనా చేస్తుందో చెయ్యదో అని అప్పుడప్పుడూ వైరాగ్యంగా అనుకునే నా ప్రాణాన్ని పణంగా పెట్టీ.. ఆ సినిమాకి కథ, మాటలు, పాటలు, పద్యాలు, స్క్రీన్ ప్లే, బొమ్మలు, సంగీతం, నేపధ్య గానం, ఆభరణాల డిజైనింగ్, నిర్మాత, దర్శకుడు మరియు కథానాయకుడు శ్రీ సుమన్. సినిమా పేరు 'ఉషా పరిణయం.'

ఇదే సినిమా రేపు అనగా, శ్రావణ బహుళ అష్టమి ఆదివారం ('సఖులారా చేరరే.. శ్రావణ బహుళాష్టమి...' అని గోపికలు భక్తిగా పాడుకునే రోజు) సాయంత్రం ఐదుగంటలకి ఈటీవీలో ప్రసారం కాబోతోంది. పౌరాణికాలు, అందునా.. ఆద్యంతమూ హాస్యరసంతో నిండిన భక్తి, జ్ఞాన, వైరాగ్య చిత్రాలు బొత్తిగా నల్లపూసలై పోతున్న ఈ రోజుల్లో రాబోతున్న ఈ సినిమాలో వింతలూ విశేషాలని సుమనాభిమానులతో పంచుకోడానికే ఈ టపా. ఈ సినిమా మీకు ఈటీవీలో తప్ప ఎక్కడా రాదు కనకా, ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు కనకా, పనులన్నీ పక్కన పెట్టి ముందుగానే టైం కేటాయించుకుని చూడాల్సిందే.

ముందుగా మీదగ్గర అలనాటి విజయావారి 'మాయాబజార్' జ్ఞాపకాలేవైనా ఉంటే వాటిని సమూలంగా తుడిచేసి, అప్పుడు ఈ సినిమా చూడడానికి సిద్ధం అవ్వండి. 'ఈతరం మాయాబజార్' గా అనేకమంది ప్రముఖుల ప్రశంశలు అందుకున్న ఈ సినిమా (నిజంగా నిజం.. ఈటీవీలోనే చెప్పారు దర్శకుడు యస్వీ - యశస్వి అని కూడా అభిమానులు అంటూ ఉంటారు - కృష్ణారెడ్డి తదితరులు) చూస్తున్నప్పుడు ఆ సినిమా గుర్తు రావడం అంత బాగోదు. అలాగే, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన "చేసెడి వాడనూ, చేయించెడి వాడనూ అంతా నేనే" అనే గీతాసారాన్ని వంటబట్టించుకోండి. ఎందుకంటే ఈ సినిమాలో కూడా చేసే వాడూ, చేయించే వాడూ ఒక్క శ్రీకృష్ణుడే. అనగా అవసరానికి మించి కుంచం ఎక్కువ నీలిరంగు పూసుకున్న శ్రీ సుమన్ బాబే.


ప్రారంభ సన్నివేశంలో బారెడు పొద్దెక్కినా బంగారు శేష పాన్పుమీద, పట్టు బట్టలు మరియు నిలువెల్లా ఆభరణాలతో నిద్ర నటించే శ్రీకృష్ణుడి అర్ధ నిమీలిత నేత్రాలతో మొదలు పెడితే చివర్లో బాణాసురుడితో యుద్ధం సన్నివేశంలో అదే కళ్ళతో కృత్యదవస్థ మీద కురిపించిన క్రోధం వరకూ ఆసాంతమూ ఎన్నెన్ని భావాలో. ఎన్టీఆర్ కిరీటం బరువు రికార్డుని బద్దలు కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుని డిజైన్ చేసుకున్నారో ఏమో తెలియదు కానీ, శ్రీకృష్ణుడు ధరించే కిరీటం బరువుని ప్రేక్షకులు కూడా అంచనా వేసేయగలరు. ఆ కిరీటం జారిపోకుండా బ్యాలన్స్ చేసుకుంటూనే, సందర్భానుసారంగా అభినయించగలిగినన్ని కళలు అభినయించారు సుమన్ బాబు. ముఖ్యంగా నునుసిగ్గు, చిలిపిదనం, అమాయకత్వం లాంటివి అభినయించడాన్ని చూడాలంతే.

శ్రీకృష్ణుడికి పదహారువేలమంది గోపికలున్నా, ఈ సినిమాలో శ్రీ సుమన్ కి ఒక్క నాయికా లేదు. అయితేనేం? చెలికాడు వసంతకుడితో జరిపే సంభాషణని చూసినప్పుడు, సదరు వసంతకుడు మారురూపంలో ఉన్న అష్టవిధ నాయికల్లో ఒకరేమో అనిపించక మానదు. కృష్ణ పాత్రలో అంతగా లీనమై నటించారు సుమన్. మామూలుగా పౌరాణిక సినిమా అంటే సంభాషణలు గ్రాంధికంలో ఉంటాయి. ఫలితంగా ఈతరం ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు ఇంకా ఇంగ్లిష్ మీడియంలో చదివిన వాళ్ళూ వాటిని అర్ధం చేసుకోలేరు. స్వయంగా రచయిత అయిన సుమన్, కొంచం గ్రాంధికంలో కొంచం వ్యావహారికం కలిపి రచించిన సంభాషణలనీ, మరీముఖ్యంగా ఆయన స్వయంగా వాటిని పలికిన తీరునీ వినాలే తప్ప చెప్పలేం.

మళ్ళీ ఓసారి నందమూరిని తల్చుకుందాం. 'మాయాబజార్' లో కృష్ణుడిగానూ, 'నర్తనశాల' లో బృహన్నలగానూ కనిపించాడు. మహాభారతం ప్రకారం బృహన్నలగా మారింది అర్జునుడు. కానీ, శ్రీ సుమన్ స్వయంగా ఎన్నో పాత్రలకి సృష్టికర్త కాబట్టి, ఈ సినిమాలో శ్రీకృష్ణుడే బృహన్నలగా కనిపిస్తాడు కొన్ని సన్నివేశాలలో. బృహన్నలగా సుమన్ బాబు నటన (?) చూడాలంటే సినిమా రెండో సగం వరకూ ఓపిక పట్టాలి. ఈ సినిమాలో మాయలూ, మంత్రాలకి లోటే లేదు. సుదీర్ఘంగా సాగే వసంతకుడి పెళ్ళి చూపుల ప్రహసనంలో ఎవరికి వారు చక్కిలిగిలి పెట్టుకుని నవ్వుకోవాలి కానీ, శ్రీకృష్ణుడే అన్నీ అయిన సన్నివేశాల్లో నవ్వులకి లోటుండదు. అలాగే ఘటోత్కచుడి మీద ఓ కార్య భారం మోపినా, దానిని అతగాడు సరిగా నిర్వహించగలడో లేదో అని పరిశీలనకి తనే సాయంగా వెంట వెళ్తారు స్వామి.

ఇతర నటీనటులు మరీ ముఖ్యంగా బలరాముడిగా ఈశ్వరరావు, రేవతిగా నాగమణి శక్తికి మించి నటించడానికి చేసిన ప్రయత్నాలని గమనించవచ్చు. ప్రతిపాత్రా కృష్ణుడి యెడల భయం కనబరచడం అన్నది తప్పక గమనించాల్సిన మరో విషయం. కథ ప్రకారం అనిరుద్ధుడు అందగాడే అయినప్పటికీ, శ్రీకృష్ణుడిని మించి అందంగా ఉండని విధంగా తీసుకున్న శ్రద్ధ, అలాగే ఉష-చిత్రరేఖ మధ్యనా, బాణాసురుడికీ, కృష్ణుడికీ మధ్యన జరిగిన సంభాషణలు ఇవేవీ మిస్సవ్వాల్సినవి కాదు. అప్పట్లో నాకు తెల్సిన ఓ అమ్మాయి -అప్పటికి అమ్మ అయ్యింది- "'ఉషా పరిణయం' డీవీడీ దొరికితే బాగుండును, వెయ్యి రూపాయలైనా కొనేస్తాను" అంది నాతో. వాళ్ళబ్బాయి, రెండేళ్ళ వాడు, అన్నం తినడానికి పూటా మారాం చేస్తున్నాట్ట. "ఓ డీవీడీ ఇంట్లో పెట్టుకుంటే, తింటావా? సినిమా పెట్టనా? అని వాడిని బెదిరించడానికి బాగుంటుంది కదా" అని తనే రహస్యం విప్పింది. కాబట్టి, కావాల్సిన వాళ్ళు రికార్డు చేసుకోండి బహుళార్ధ సాధకమైన ఈ నిరుపమాన పౌరాణిక చిత్ర రాజాన్ని.

శుక్రవారం, ఆగస్టు 19, 2011

కుట్ర

పైకి చూడ్డానికి అంతా బాగుందనిపిస్తూనే, చాపకింద నీరులా చెడు చుట్టుముట్టేస్తే? ముట్టేసి నెమ్మది నెమ్మదిగా ముంచేస్తే? అది కుట్ర.. బలవంతుడు బలహీనుడి మీద నేరుగా చేసేది దౌర్జన్యం అయితే, కనిపించకుండా చేసేది కుట్ర. దౌర్జన్యం జరిగిందన్న విషయం వెంటనే తెలుస్తుంది కానీ కుట్ర జరిగిందన్నసంగతి, అది జరిగిపోయిన ఎన్నాళ్ళకో కానీ తెలీదు. తెలిసినా, అప్పటికింక తిరిగి ఏంచెయ్యడానికీ ఉండదు. అలాంటి కుట్రే దేశ ప్రజల మీద రాజ్యాంగం రూపంలోనూ, పంచ వర్ష ప్రణాళికల రూపంలోనూ జరిగిందంటారు తెలుగు సాహిత్యంలో కారామేష్టారిగా సుప్రసిద్ధులైన కాళీపట్నం రామారావు, తన 'కుట్ర' కథలో.

ఓ సిద్ధాంతాన్ని - అది ఏ సిద్ధాంతం అయినప్పటికీ - బలంగా నమ్మి, జీర్ణం చేసుకున్న వ్యక్తి తన చుట్టూ జరిగే వాటిని ఆ సిద్ధాంతపు దృష్టి కోణం నుంచి చూడడం సహజం. వామపక్ష రాజకీయాల పట్ల మొదటినుంచీ ఆసక్తి ఉన్న, విప్లవ రచయితల సంఘం స్థాపన విస్తరణలో కీలక పాత్ర పోషించిన కారా మేష్టారు, స్వాతంత్రానంతరం దేశంలో జరిగిన కొన్ని పరిణామాలని, ముఖ్యంగా తొలి రెండు పంచవర్ష ప్రణాళికలనీ, 'మిక్సుడ్ ఎకానమీ' అమలులో సామాన్యులకి జరిగిన అన్యాయాలనీ తనదైన దృష్టికోణంలో పరిశీలించి, కొందరు ప్రజలు ప్రభుత్వానికి ఎదురుతిరిగి తీవ్రవాదులుగా మారడానికి ప్రభుత్వం వారిపై చేసిన కుట్రే కారణమని చెబుతూ రాసిన కథ ఇది.

"రామారావుగారు రచయితగా తన కథల్లో తరచూ కనిపించరు. ఆయన తన కథా వివరణ కోసం ఒక వక్తని వేరేగా తయారు చేస్తారు. కథలో సంఘటనలనీ, ఇతర సమాచారాన్నీ మనకి వ్యాఖ్యానించే ఈ వక్తకీ, కథలో ఇతర పాత్రలకీ వెనకాతల రచయిత రామారావుగారుంటారు," కారా మాష్టారి కథన శైలి గురించి వేల్చేరు నారాయణరావు గారు వెలిబుచ్చిన అభిప్రాయమిది. 'కుట్ర' కథని కూడా ఒక వక్తే చెబుతాడు. అతడెవరన్న వివరం పాఠకులకి తెలీదు. ఓ మామూలు మనిషి. ప్రపంచ జ్ఞానం ఉన్న మనిషి. చట్టాల వెనుక ఉన్న ఉద్దేశాలని అర్ధం చేసుకోగల మనిషి. అతగాడు పట్నం కోర్టులో జరుగుతున్న కాన్స్పిరసీ కేసుని గురించి చెప్పడం మొదలు పెట్టి, నెమ్మది నెమ్మదిగా చట్టాలు, రాజ్యాంగం, పంచ వర్ష ప్రణాళికల దగ్గరికి తీసుకెళతాడు.

"వరల్డు ప్రిమిటివ్ ఎకానమీల్లో ప్రిమిటివెస్ట్ ఎకానమీ - బియ్యవిచ్చి కరేపాకు కొనుక్కొనే పధ్ధతి ఇప్పటికీ - అమల్లో ఉన్న దేశం, మన దేశం" అంటూ మొదలు పెట్టి, "గాంధీగారూ తమ కేడర్నీ ఖద్దరొడకమన్నారు. ఎల్తే జైలు కెళ్ళమన్నాడు. అంతేగాని ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ లాటి సమస్యల మీద పుస్తకాలేనా తిరగెయ్యమన్నాడా? యంత్రాంగంలో దూరి పాలానానుభవం సంపాదించమన్నాడా? సైన్యంలో దూరి వార్ లోనూ పీస్ లోనూ దేశాన్ని డిఫెండ్ చేయడం నేర్చుకోమన్నాడా? ...నాకు తెలిసినంతవరకూ మన స్వతంత్ర యోధులందరూ ఈ తంత్రం సంగతొదిలేసి తక్కిన విద్దెలు నేర్చుకున్నారు" అంటూ కుట్ర జరిగిన నేపధ్యాన్ని అరటిపండు ఒలిచినట్టుగా వివరిస్తాడు వక్త.

కారా మేష్టారి కథా శిల్పంలో ఉండే సొగసదే. కథలో పాత్రలు నేరుగా మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపించడం, చెప్పదలచుకున్న విషయాన్ని ఒక్కొక్కటిగా అర్ధం కాకపోవడం అనే సమస్యే లేనివిధంగా ఉత్తరాంధ్ర నుడికారంలో వివరించడం. ఒకానొక ఎకనామిస్టు - ఏలినవారికి నిజంగా తెలియకుండానో లేక వారు తెలియనట్టు నటించిన సందర్భంలోనో - మిక్సుడ్ ఎకానమీ పేరుతో మొదటి రెండు పంచవర్ష ప్రణాళికలకీ రాజముద్ర వేయించేశాడు. "ఆడు మొదటి ప్లాను ఎత్తుకోవడవే అగ్రికల్చర్ కి ఫస్టు ప్రిఫరెన్సు అంటూ ఎత్తుకున్నాడనా? ఎందుకెత్తుకున్నాడూ? వ్యావసాయిక ఉత్పత్తులు పెరిగితేగాని ఒక టైపాఫ్ ఇండస్ట్రీకి పునాదుండదు," అంటూ మొదలు పెట్టి అసలు కుట్రలోకి వచ్చేస్తాడు. అది పరిశ్రమలకి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా చెప్పబడ్డ రెండో పంచవర్ష ప్రణాళిక (1956-61).

మొత్తం పెట్టుబడిని రెండు సెక్టార్ల కింద విభజించి, ప్రజల పెట్టుబడితో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం నడిపే పరిశ్రమలన్నీ పబ్లిక్ సెక్టారు గానూ, పెట్టుబడి ఉన్న ప్రైవేటు వ్యక్తుల షేర్లతో నడిచే ప్రైవేటు సెక్టారు గానూ విభజించారు. ఈ రెండు సెక్టార్లకీ క్లాష్ రాకుండా ఉండడం కోసం, హెవీ ఇండస్ట్రీస్ గా చెప్పబడే భార పరిశ్రమలు పబ్లిక్ సెక్టారుకీ, నిత్యావసర వస్తువులు తయారు చేసే చిన్న పరిశ్రమలని ప్రైవేట్ సెక్టార్ కీ కేటాయించడంలోనే అతిపెద్ద కుట్ర దాగి ఉందన్నది వక్త అభిప్రాయం. కాలక్రమంలో హెవీ ఇండస్ట్రీస్ నష్టాల్లోపడి అమ్మకాలకి రావడం, ప్రభుత్వ సాయంతోనే ప్రైవేటు సెక్టారు వాటిని సొంతం చేసుకోవడం, ఈ మొత్తం వ్యవహారంలో అధికార ప్రతిపక్ష పార్టీల, సేవాసంస్థల పేరుతో నడిచే చైన్ క్లబ్బుల, పత్రికల పాత్ర ఇవన్నీ వరసగా చెప్పుకుంటూ వచ్చి "నమ్మిన జన సామాన్యాన్ని నాయకుల్లో, పవర్లో ఉన్న పార్టీయో, పార్టీలో మనుషులో దగా చేస్తే అది దేశ ద్రోహం కాదా? ఆళ్లెవరేనా కానీ ఆ చేసీ దగాని బైటపెట్టడం, ఎదుర్కోమనడం, ఎదుర్కోవడం - ఇదా దేశ ద్రోహం?" అని ప్రశ్నిస్తాడు వక్త.

తనకెంతో పేరు తెచ్చిన 'యజ్ఞం' కథని రాసిన ఆరేళ్ళ తర్వాత ఈ 'కుట్ర' కథని 1972 లో 'విరసం' ప్రత్యేక సంచిక కోసం రాశారు కారా మేష్టారు. మనసు ఫౌండేషన్ ప్రచురించిన 'కాళీపట్నం రామారావు రచనలు' సంకలనం లో ఉందీ కథ. (పేజీలు 548, వెల రూ. 180, విశాలాంధ్ర, నవోదయ పుస్తక కేంద్రాలలో లభ్యం). అల్లం శేషగిరి రావు కథ 'చీకటి' ని గురించి నేరాసిన టపా చదివి తన అభిప్రాయం చెబుతూ, 'కుట్ర' కథ గురించి టపా రాయమని సూచించడం ద్వారా ఈ కథని మరోసారి చదివేలా చేసిన బ్లాగ్మిత్రులు బోనగిరి గారికి కృతజ్ఞతలు.

గురువారం, ఆగస్టు 18, 2011

నర్తనశాల

తన నట సామర్ధ్యం మీద నమ్మకం ఉన్న నటుడు ఎలాంటి పాత్రని చేసి మెప్పించినా, ఇమేజితో సంబంధం లేకుండా అభిమానులు ఆదరిస్తారని యాభయ్యేళ్ళ క్రితమే నిరూపించిన తెలుగు నటుడు నందమూరి తారకరామారావు. అప్పటికే వందకి పైగా సినిమాల్లో నటించి, అటు పౌరాణికాలు, ఇటు సాంఘికాలు మధ్యే మధ్యే జానపదాలు ఇలా అది ఇది ఏమని అన్నిరకాల సినిమాలూ చేస్తూ ఆంధ్రదేశాన్ని ఊపేస్తున్న వేళ, అటూ ఇటూ కాని బృహన్నల పాత్ర పోషించడమంటే ఏ నటుడికైనా అదో పెద్ద సాహసమే..

పైగా ఆ పాత్రలో కనిపిచాల్సింది ఏ ఐదు పది నిమిషాలో కాదు, మూడుగంటల పాటు సాగే సినిమాలో దాదాపు రెండున్నర గంటల పాటు!! అయినప్పటికీ సాహసానికి సై అన్నాడు తారకరాముడు. ఫలితమే రాజ్యం పిక్చర్స్ నిర్మించిన 'నర్తనశాల' అనే విరాటపర్వం. మరో రెండేళ్లలో యాభయ్యేళ్లు పూర్తి చేసుకోబోతున్న ఈ పౌరాణిక చిత్రానికి దర్శకుడు 'పౌరాణిక బ్రహ్మ' గా పేరుపొందిన కమలాకర కామేశ్వర రావు. కథ, మాటలు, పద్యాలతో పాటు కొన్ని పాటలని రాసింది సముద్రాల సీనియర్ గా పిలవబడే సముద్రాల రాఘవాచార్యులు కాగా సుస్వరాలని అందించింది సుసర్ల దక్షిణామూర్తి.

ఈ సినిమాకి సాంకేతిక వర్గమంతా కలిపి ఒక స్థంభమైతే, అర్జునుడిగానూ, బృహన్నలగానూ నటించిన ఎన్టీఆర్, సైరంధ్రి పాత్రలో సావిత్రి, కీచకుడిగా కనిపించిన ఎస్వీరంగారావు మిగిలిన మూడు స్థంభాలూ అనడానికి సందేహం లేదు. కథ కొత్తదేమీ కాదు. అనాది కాలం నుంచీ, నిన్న మొన్నటివరకూ - అంటే కేబుల్ టీవీలో ప్రవేశించనంత వరకూ - వర్షాల కోసం పల్లెటూళ్ళ చెరువుగట్ల మీద భక్తితో చదివించిన విరాటపర్వమే. మహాభారత కథ. అరణ్య వాసం పూర్తి చేసుకున్న పాండవులు ఒక ఏడాది అజ్ఞాత వాసం పూర్తి చేయడం కోసం విరాటరాజు కొలువులో మారువేషాల్లో చేరడం, గడువు పూర్తయ్యాక ఉత్తర గోగ్రహణంలో కౌరవులపై విజయం సాధించి హస్తినకి తిరిగి వెళ్ళడం.

సినిమా ప్రారంభమే ఇంద్రసభకి అతిధిగా వెళ్ళిన అర్జునుడికి స్వాగతం పలుకుతూ ఆస్థాన నర్తకి ఊర్వశి 'నరవరా..' పాట పాడుతూ చేసే మెరుపు నృత్యంతో. అటుపై ఊర్వశి అర్జునుడిపై మనసు పడడం, మాతృ సమానురాలవంటూ అర్జునుడామెని తిరస్కరించడం, అవమానభారంతో ఊర్వశి పేడిగా జీవించమని అర్జునుడికి శాపం ఇవ్వడం, ఇంతలో అక్కడికి వచ్చిన ఇంద్రుడు ఆ శాపాన్ని అజ్ఞాతవాస కాలంలో వరంగా మార్చుకొమ్మని అర్జునుడికి సలహా ఇవ్వడం చకచకా సాగిపోతాయి. ధర్మరాజు విరాటరాజు సలహాదారుగానూ, భీముడు వంటవాడుగానూ, నకుల సహదేవులు గుర్రాల శాల, గోశాలల్లోనూ పనులకి కుదరగా, ద్రౌపది అంతఃపురంలో పూలమాలలల్లే సైరంధ్రిగా చేరుతుంది.

రాకుమారి ఉత్తరకి నాట్యం నేర్పే గురువుగా బృహన్నల అవతారం ఎత్తుతాడు అర్జునుడు. ఓపక్క పాండవుల అజ్ఞాతవాసాన్ని భగ్నం చేసేందుకు కౌరవులు చేసే కుటిల యత్నాలు, వాటిని తిప్పి కొడుతూనే అజ్ఞాతంలో వచ్చే సమస్యలని పాండవులు ఎదుర్కొంటూ ఉండగా ప్రవేశిస్తాడు కీచకుడు, మహారాణి సుధేష్ణ సోదరుడు. అత్యంత శక్తివంతుడు. తొలిచూపులోనే సైరంద్రిని మోహిస్తాడు. అంతే కాదు, సైరంద్రిని తన బసకి పంపకపోతే రాజ్యం సర్వ నాశనం చేస్తానని సుధేష్ణని బెదిరిస్తాడు కూడా. మరోపక్క తన తండ్రులని వెతుకుతూ వచ్చిన అర్జునకుమారుడు అభిమన్యుడు ఉత్తరతో ప్రేమలో పడిపోతాడు. భీముడి చేతిలో కీచకుడు మరణించడం, ఇంతలోనే సుశర్మ, కౌరవులు దక్షిణ, ఉత్తర గోగ్రహణాలకి పాల్పడడం, పాండవుల అజ్ఞాతవాసం ముగియరావడం దాదాపు ఒకేసారి జరుగుతాయి.

యుద్ధం గెలిచి, విరాటరాజుకు తమ నిజరూప దర్శనం ఇచ్చి, ఉత్తరాభిమన్యుల పెళ్ళి జరిపించడంతో 'శుభం' కార్డు పడుతుంది సినిమాకి. తెలిసిన కథే అయినా, ఎన్నిసార్లు చూసినా, ఎప్పుడూ ఎక్కడా విసుగు రాకపోడానికి కారణం బలమైన స్క్రీన్ ప్లే, సంభాషణలు, నటీనటుల నటన మరియు నిర్మాణ విలువలు. చిన్న చిన్న సంభాషణల ద్వారా జీవిత సత్యా లెన్నింటినో పలికించడం సముద్రాల వారికి పెన్నుతో పెట్టిన విద్య. ముందే చెప్పినట్టుగా ఎన్టీఆర్, ఎస్వీఆర్, సావిత్రి నువ్వా-నేనా అన్నట్టుగా నటించారు. ఎక్కడా 'అతి' పోకడలు కనిపించవు. ఆవిధంగా నటన రాబట్టుకున్న ఘనత దర్శకుడు కమలాకరదే. మరీ ముఖ్యంగా ఎస్వీఆర్-సావిత్రి కాంబినేషన్ సన్నివేశాల్లో క్లిష్ట సమాసాలతో నిండిన డైలాగుల్ని ఎస్వీఆర్ సమోసాలు తిన్నంత సులువుగా చెప్పేస్తుంటే, సావిత్రి కాబట్టి పోటీగా నిలబడింది అనిపించక మానదు. జకార్తాలో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమనటుడు అవార్డు అందుకున్నారు ఎస్వీఆర్.

సైరంద్రికి పెద్దగా డైలాగులు లేవు. సావిత్రిని ఆ పాత్రకి అనుకున్నాక, ఇక డైలాగులు అనవసరం అనుకుని ఉంటారు. "ప్రభువుల వెంటే నేనూ" అని చెప్పేటప్పుడు ఆత్మాభిమానం, ఆర్జునుడిని బృహన్నలగా చూసినప్పుడు ఆశ్చర్యం, "జననీ శివ కామినీ" అని పాడేటప్పుడు ఆర్తి, కీచకుడి చేతిలో అవమానానికి గురైనప్పుడు ఆవేశం, ఆక్రోశం ఇవన్నీ కనుపాప కదలికలతో అభినయించింది సావిత్రి. బృహన్నల పాత్ర మీద ఏ ఇతర పాత్రల ప్రభావాన్నీ పడనివ్వలేదు ఎన్టీఆర్. కేవలం ఈ పాత్ర పోషణ కోసమే శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకున్న కమిట్మెంట్ ని అభినందించి తీరాలి. అభిమన్యుడిగా శోభన్ బాబు, కృష్ణుడిగా కాంతారావు చిన్న పాత్రల్లో మెరిశారు. శోభన్ లో కనిపించే కొద్దిపాటి బెరుకుని సులువుగానే పట్టుకోవచ్చు.

దాదాపు అన్ని పాటలూ ఇవాల్టికీ జనం నాలుకల మీద ఆడేవే కావడం 'నర్తనశాల' కి సంబంధించిన మరో విశేషం. 'నరవరా..' వినగానే జానకి గుర్తొచ్చి తీరుతుంది. ఈ సినిమా పేరు చెప్పగానే అప్రయత్నంగానే గుర్తొచ్చేసే పాట 'సలలిత రాగ సుధారస సారం..' మంగళంపల్లి వారిచేత పాడించడం సరైన ఎంపిక. 'జననీ శివకామినీ..' 'సఖియా వివరింపవే..' 'దరికి రాబోకు రాజా' ఈ మూడూ సుశీల మార్కు పాటలు. దేనికదే ప్రత్యేకం. ఇక డ్యూయెట్ ఎలా ఉండాలో చెప్పే పాట "ఎవ్వరికోసం ఈ మందహాసం.." ఉత్తరకుమారుడిని హాస్యానికి వాడుకున్నారు. 'మాయాబజార్' ఛాయలు పడని విధంగా ఈ పాత్రని పోషించారు రేలంగి. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎన్టీఆర్ కాంబినేషన్ సన్నివేశాల్లో రేలంగి నటన మర్చిపోలేం.

భీముడిగా నటించిన దండమూడి రాజగోపాల్ నిజజీవితంలోనూ మల్లయోదుడే! ధూళిపాల దుర్యోధనుడు కాగా, కైకాల దుశ్శాసనుడు, ప్రభాకర రెడ్డి కర్ణుడు. వీళ్ళందరివీ అతిధి పాత్రలే. 1964 సంవత్సరానికి గానూ జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్రం అవార్డుని అందుకున్న 'నర్తనశాల' ని రంగుల్లోకి మారుస్తారన్న వార్తలు వచ్చాయి, రంగుల 'మాయాబజార్' విడుదలైన సమయంలో. ఇప్పటివరకూ అందుకు సంబంధించిన వివరాలేవీ లేవు. స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, మరీ ముఖ్యంగా నటన ఎలా ఉండాలో చెప్పే రిఫరెన్స్ సినిమాల్లో ఒకటైన 'నర్తనశాల' ని మళ్ళీ చూసైనా, "ఫ్యాన్స్ ఒప్పుకోరు" లాంటి శషభిషలు విడిచిపెట్టి ఇప్పటి కథానాయకులు వైవిధ్యభరితమైన పాత్రలు ఎంచుకుంటే బాగుండును..

బుధవారం, ఆగస్టు 17, 2011

కొత్తావకాయా అన్నం

ఆకలి దంచేస్తోంది. ఫ్రిజ్ తీసి చూస్తే అచ్చం అయ్యవారి నట్టిల్లులాగా ఉంది. "మర్చిపోకుండా కూరలు తెచ్చుకోండి" ఇల్లాలి మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఏం చేస్తాం, టూ లేట్. మామూలుగా అయితే రాత్రి భోజనం పెద్ద సమస్య కాదు. ఉపద్రవాలేవీ రావు కాబట్టి ఏదో ఒక ద్రవం తాగి నిద్రపోవచ్చు. కానైతే ఇవాళ ఉదయం నుంచీ భోజనం లేదు. రాత్రైనా నాలుగు మెతుకులు నోట్లో వేసుకోక పోతే కష్టం. ఆకలి వేసే కేకలకి, నాలో నిద్రపోతున్న నలుడు నిద్ర లేచాడు. పట్టు వదలకుండా ఫ్రిజ్ వెతికితే, నాలుగే నాలుగు బీన్స్, ఒకే ఒక్కొక్క కేరట్, టమాటా కనబడ్డాయి. ఉల్లిపాయల బుట్టలో ఓ ఉల్లిపాయతో పాటు, ఓ బంగాళా దుంప కూడా దర్శనమిచ్చింది. పచ్చిమిర్చీ, కొత్తిమీరా మాత్రం బుట్టెడు బుట్టెడు ఉన్నాయి.

ఓ స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి, రెండో స్టవ్ మీద బాండీ పెట్టాను. వంట ముందుగా ప్లాన్ చేయకుండా అప్పటికప్పుడు చేసేయడం నా అలవాటు. బాండీ లో కొంచం నూనె పోసి, ఉల్లిపాయ, కేరట్, బంగాళాదుంప, బీన్స్ లతో పాటు రెండు పచ్చి మిరపకాయలని చకచకా తరిగేశాను. ఉప్మా పోపులాంటి పోపు వేసేసి, తరిగిన కూర ముక్కల్ని ఒక్కొక్కటిగా దించేసి, మూత పెట్టేసి వచ్చి కంప్యూటర్ ముందు కూర్చున్నాను. 'కొత్తావకాయ..ఘాటుగా' బ్లాగులో 'ప్రేమలో నేను-అరడజను సార్లు' టపా కనిపించగానే కూరలు తరిగినట్టే, చకచకా చదవడం మొదలు పెట్టేశాను. ఎనభైల్లో వచ్చిన యండమూరి నవలల భాషలో చెప్పాలంటే నేనెంత తప్పు చేస్తున్నానో ఆ క్షణంలో నాకు తెలీదు.

ఇంతకుముందోసారి రాధాకృష్ణుల ప్రేమ గురించి మాంచి టపా రాశారు కదా, అలాగే ప్రేమ గురించి అయి ఉంటుందని అపార్ధం చేసుకుంటూ చదవడం మొదలెట్టగానే తెలిసిపోయింది, ఇది ఇంకో రకం ప్రేమని. ఈవిడ టపాలతో సమస్య ఏమిటంటే, ఓ సారి చదవడం మొదలు పెట్టాక, మళ్ళీ ఇంకోసారొచ్చి చదువుదాంలే అనిపించదు, వెంటనే పూర్తి చేసేయాల్సిందే. "పెనం మీద నుంచి నూనె పూసుకొని పొంగి ఆవిరి వదులుతూ ఘుమఘుమలాడే చపాతీ సరాసరి ప్లేట్లోకి దూకు"తున్న సమయంలోనే ఆవిడకి ఏమాత్రం ఇష్టం లేని వంటింట్లోనుంచి ఏదో వాసన తగిలింది. ఆ వాసన నా వంటింట్లోనుంచి అని అర్ధమైన మరుక్షణం, ఒక్క పరుగందుకున్నాను.

బాండీలో కూర మాడుదామా అనుకుంటోంది. కదిపి, కాసిన్ని నీళ్ళు పోసి మూతపెట్టి, మళ్ళీ బ్లాగులోకి వచ్చా. అసలు కొత్తావకాయ పేరేమిటో అనుకుంటూ ఉండగానే 'గంగాబొండం' కూడా ఉందిగా అని గుర్తొచ్చి, నవ్వొచ్చేసింది. ఇన్నాళ్ళూ నోబెల్ శాంతి బహుమతికి అన్ని అర్హతలూ ఉన్న వాళ్ళ నాన్నగారినే మనసులో మెచ్చుకుంటూ ఉన్నాను కానీ, పనసపొట్టు కూర చేయడంలో రాజగోపాల్ మావయ్య ప్రతిభ చదువుతూ ఉండగా ఆయనక్కూడా వీరతాడు వేసేయాల్సిందే అని నిర్ణయించేసుకున్నాను. "తింటున్నంత సేపు ప్రపంచం ఇంద్రధనుస్సు మీద ఊయలలూగడం" దగ్గరికి వచ్చేసరికి వంటగది మళ్ళీ పిల్చింది. అబ్బా.. మల్టీ టాస్కింగ్. మిగిలిన ముక్కలు ఉడికినట్టే ఉన్నాయి కానీ, బీన్సూ, బంగాళాదుంపా కొత్తల్లుళ్ళలా బెట్టు చేస్తున్నాయి.

'అబ్బా.. నాలుగు వంకాయలున్నా బాగుండేది.. సులువుగా కూరో, వేపుడో అయిపోయేది' అనుకుంటూ బాండీలో మరి కాసిని నీళ్ళు పోసి, బ్లాగు దగ్గరికి వచ్చేశా.. విజీనారం ఆడపడుచూ, పసలపూడి కోడలూ అయినటువంటి శ్రీమతి కొత్తావకాయగారు ఏ టాపిక్కైనా ఎంత అలవోకగా రాసేస్తారో కదా అనుకుంటూ. అసలే బ్లాగురాసే విషయంలో మా ఇద్దరి అభిప్రాయాలూ అచ్చంగా ఒకటే కూడాను. ఇటాలియన్ పీజా గురించి కూడా చదివేసి, వ్యాఖ్య రాసి పోస్ట్ చేయగానే మళ్ళీ నా కూర గుర్తొచ్చింది. ఓ సారి కదిపి, కొంచం ఖోపంగా ఉప్పేశా. రుచి చూడబోతే కళ్ళు తడయ్యాయి. ఈ టపా చదివినప్పుడు అయిన తడి లాంటిది కాదు, కూర వేడి మరియు కొంచం ఖారం ఎక్కువ అవ్వడం వల్ల కలిగిన చెమ్మ.

'ఈ వంట అనవసరంగా పెట్టుకున్నా. కొంచం కాఫీ తాగి పడుకుంటే సరిపోయేది' అనుకున్నాను, గరం మసాలా పొడి, పంచదార లాంటివి ఎన్ని కలిపినా కూర రుచి బాగు పడక పోగా మరికొంచం క్షీణించినప్పుడు. కుక్కర్లో మల్లెపువ్వులా తెల్లగా ఉడికిన అన్నాన్ని విడిచిపెట్ట బుద్ధి కాక, ఇల్లాలికి ఫోన్ చేసి "కొత్తావకాయ ఎక్కడుందీ?" అని హడావిడిగా అడిగాను, అటు నుంచి మరి ప్రశ్నలకి తావు లేకుండా. అడ్రస్ దొరగ్గానే టక్కున ఫోన్ పెట్టేసి, బుజ్జి జాడీని పట్టేశా. నేనొండుకున్న కూర నాకేసి జాలిగా చూస్తుండగా, వేడన్నంలో నేను కలుపుకున్న కొత్తావకాయని చూసీ చూడగానే మళ్ళీ నాక్కలిగిన ఆశ్చర్యార్ధకం ఒక్కటే.. "ఈ అక్షరాలు నా చెలికత్తెలు" అని ఎంత చక్కగా చెప్పుకోగలిగారో కదా! అని.

మంగళవారం, ఆగస్టు 16, 2011

సత్యాగ్రహం

గాంధీ మహాత్ముడి కాలంలో కాబట్టి, తెల్ల దొరలతో వ్యవహారం అయినందువల్లా డెబ్భయ్యేళ్ళ క్రితం సత్యాగ్రహం సత్ఫలితాలని ఇచ్చింది కానీ, ప్రస్తుతకాలం మాత్రం సత్యాగ్రహాలకి ఏమాత్రం అనుకూలం కాదన్నది సాదోహరణంగా తెలిసిపోతోంది, ప్రస్తుతం దేశంలోనూ, రాష్ట్రంలోనూ జరుగుతున్న రెండు సత్యాగ్రహాల పుణ్యమాని. విదేశీ పాలకులు చూపినపాటి సంయమనాన్ని స్వదేశీ ప్రభువులు ఎందుకు చూపలేక పోతున్నారన్నది అన్నా హజారే అరెస్టు వార్త టీవీలో చూసిన వాళ్ళందరికీ కలిగే ఉంటుంది, నిస్సందేహంగా. ఉద్యమానికన్నా ముందు అణచివేత మొదలయ్యిందిప్పుడు.

అవినీతికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం, ప్రధానిని కూడా పరిధిలోకి తెస్తూ జనలోక్ పాల్ చట్టం... ఈ రెండూ మొదట విన్నప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించాయి. అవినీతిమీద అన్నివర్గాల ప్రజల్లోనూ వ్యతిరేకత ఉంది. కానైతే, ప్రస్తుత బిజీ కాలంలో బయటికి వచ్చి ఉద్యమం చేసే రాజకీయేతరులు ఎవరన్నా ఉంటారా అని సందేహం వచ్చింది. చూస్తుండగానే ఉద్యమం ఊపందుకుంది. దేశవ్యాప్తంగా జనం ముందుకు వచ్చారు. ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. అత్యంత సహజంగానే ప్రభుత్వంలో ఉన్న వాళ్లకి ఇది రుచించని పరిణామం.

అప్పటికేదో జోకొట్టినా, ప్రభుత్వం వాళ్ళని పాపం ఆ సమస్య విడిచిపెట్టడం లేదు.. చేసిన పాపంలాగా వెంటాడుతోంది. ఉద్యమం అనే మాట వినబడగానే, మన పోలీసులు పఠించే మొదటి మంత్రం అణచివేత. ఈసారీ అదే జరిగింది. అది సత్యాగ్రహమా, ధర్మాగ్రహమా అన్నది వారికి అనవసరం. ఆగ్రహం అనే మాట వినబడకూడదు అంతే. అరెస్టు ఎందుకు చేయాల్సి వచ్చిందో ప్రభుత్వం చాలా చిత్రమైన వివరణ ఇచ్చింది. పైగా, సత్యాగ్రహానికి దిగిన వాళ్లకి ప్రభుత్వం మీద గౌరవం లేదంటూ ఎదురు దాడికి దిగింది. ప్రజలకి హక్కులతో పాటు బాధ్యతలూ ఉంటాయని గుర్తు చేసింది. ప్రభుత్వం తన బాధ్యతని మర్చిపోయినప్పుడే కదా, ప్రజలకి వాళ్ళ హక్కులు గుర్తొచ్చింది?

గతంతో పోల్చినప్పుడు ఈసారి ఉద్యమం ఊపందుకుంది. రాజకీయ కారణాలే కావొచ్చు, చాలా చోట్ల నుంచి మద్దతు వస్తోంది. ఇప్పుడు చూడాల్సింది మద్దతిస్తున్న వ్యక్తుల, సంస్థల, రాజకీయ పార్టీల చేతులకంటిన అవినీతి బురదని కాదు, సామాన్య ప్రజల్లో కనిపిస్తున్న పోరాట స్పూర్తినీ, ఐకమత్యాన్నీ. ఇవాళ ఏ రాజకీయ పార్టీలతోనూ సంబంధం లేని వాళ్ళకీ, 'వాళ్లకి కెరీర్ తప్ప ఇంకేమీ పట్టదు' అని ముద్ర వేయించుకున్న వాళ్ళకీ కూడా జన లోక్ పాల్ బిల్లు అంతే ఏమిటో, ప్రధానిని అందులో ఎందుకు చేర్చాలో తెలిసిందీ అంటే అది ఈ ఉద్యమం సాధించిన విజయమే. ఉద్యమాన్ని మొగ్గలోనే తుంచేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, పడుతున్న పాట్లూ కూడా అందరికీ స్పష్టంగానే కనిపిస్తున్నాయి.

రాష్ట్రానికి వస్తే, మా కోనసీమ రైతులు మొదలుపెట్టిన 'పంట విరామం' సత్యాగ్రహాన్ని, ఖమ్మం జిల్లా బయ్యారం రైతులు అంది పుచ్చుకున్నారన్నది టీవీ చానళ్ళు చెప్పిన వార్త. రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాలకీ ఇది విస్తరించే అవకాశాలు లేకపోలేదు. దురదృష్టవశాత్తూ ఇదేమీ సంతోషించాల్సిన వార్త కాదు. రాష్ట్రంలో రైతాంగాన్ని చుట్టుముట్టిన సమస్యలు, వాటి పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం ఈ సత్యాగ్రహం. కోనసీమ రైతులకి కూడా మొదట అవహేళనలు ఎదురయ్యాయి. ముందుగా 'ఇదంతా నాలుగు రోజుల హడావిడి' అన్నారు, ఆ తర్వాత 'రాజకీయ కుట్ర' అన్నారు, ఇంకొన్నాళ్ళకి ఇంకేమనాలో తెలియక 'డబ్బులెక్కువై వ్యవసాయం మానేస్తున్నారు' అన్నారు... ప్రభుత్వంలో వాళ్ళే.

ఈ పంట విరామాన్ని గురించి జాతీయ స్థాయిలో ప్రచారం జరిగితే తప్ప జిల్లా అధికారులు ఆ ఊళ్ళకి వెళ్లి రైతులతో మాట్లాడ లేకపోయారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులదీ అదే తీరు. ఇన్నాళ్ళకి ప్రభుత్వం 'పంట విరామం' మీద ఓ ఉన్నత స్థాయి కమిటీ వేసింది. వ్యవసాయం మీద పట్టున్న, రాష్ట్ర ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ మోహన్ కందా నేతృత్వంలో ఈ కమిటీ పంట విరామం ప్రకటించిన గ్రామాలు తిరిగి, సంబంధితులందరితోనూ మాట్లాడి నాలుగు వారాల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. ఆపై, ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పర్వాలేదు, ఇన్నాళ్ళకైనా మన రైతులు ప్రభుత్వంలో కదలిక తెప్పించ గలిగారు. ఇలా అనడం కన్నా, వారి పరిస్థితులు వాళ్ళ చేత అలా చేయించాయి అనడం సబబు.

"మీ జిల్లా రైతులు మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. క్రాప్ హాలిడే ప్రభావం, తర్వాత చాలా ఉంటుంది. భూసారం తగ్గిపోతుంది. ఓ పక్క ఫుడ్ సెక్యూరిటీ గురించి ఐక్యరాజ్య సమితి స్థాయిలో చర్చలు జరుగుతుంటే మీ వాళ్ళు ఇంత ఫూలిష్ గానా ప్రవర్తించడం?" మిత్రులొకరు కొంచం ఘాటుగానే అడిగారు. భూసారం సమస్య రైతులకి తెలియనిది కాదు. వాళ్ళ భాషలో వాళ్ళు "భూవి సౌడు తేలిపోతాదండి" అని టీవీల్లో చెబుతున్నారు కూడా. ఇక ఫుడ్ సెక్యూరిటీని పట్టించుకోవలసింది ప్రభుత్వం. భవిష్యత్తులో దేశం ఆకలి తీర్చడం కోసం, ఇప్పుడు వాళ్ళు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకోలేరు కదా? ఐకమత్యం ద్వారా ఏ కొంచమన్నా సాధించవచ్చునన్న పాఠాన్ని రైతులు ఈ అనుభవం నుంచి నేర్చుకుంటే వ్యవసాయానికి మంచిరోజులు దగ్గరలో ఉన్నట్టే.

సోమవారం, ఆగస్టు 15, 2011

గృహిణి

కొన్ని నవలలు కథలో వచ్చే ఊహించని మలుపుల కారణంగా చివరికంటా ఆసక్తిగా చదివిస్తే, మరికొన్నింటిలో కథ ఊహించగలిగినదే అయినప్పటికీ కేవలం రాసిన విధానం వల్ల ఆసాంతమూ విడవకుండా చదివిస్తాయి. ఈ రెండో కోవకి చెందిన నవల పిలకా గణపతి శాస్త్రి రాసిన 'గృహిణి.' తెలుగు నవలా సాహిత్యంలో ప్రత్యేక స్థానం పొందిన 'విశాల నేత్రాలు' తర్వాత రాసిన ఈ నవలని 1972 లో తొలిసారి ముద్రించింది ఎమెస్కో. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఎమెస్కో ద్వారానే కొత్త ప్రింట్ మార్కెట్లోకి వచ్చింది గత సంవత్సరం.

సీత, సావిత్రి, అనసూయ లాంటి మహాపతివ్రతల కథలెన్నో పుట్టిన భూమి మనది. వాళ్ళ దారిలోనే, భర్తని అమితంగా ప్రేమించిన గృహిణి విజయలక్ష్మి కథే ఈ 'గృహిణి' నవల. విజయలక్ష్మి ఓ మధ్య తరగతి అమ్మాయి. పెద్ద కుటుంబం. తండ్రి వెంకటేశ్వర రావు, స్కూలు మేష్టరుగా ఉద్యోగం ప్రారంభించి, డీయీవో కావాలనే కోరికతో సిన్సియర్గా పనిచేస్తూ, సీనియర్ డిప్యుటీ డీయీవోగా ఆగిపోయాడు. పెద్ద కూతురు విజయలక్ష్మిని తన మేనల్లుడు కృష్ణమూర్తికిచ్చి పెళ్లి చేయాలన్నది ఆయన కోరిక. కృష్ణమూర్తిది పేద కుటుంబం అవ్వడం వల్ల ఆయనే దగ్గర పెట్టుకుని చదివించారు. అతడు యోగ్యుడని ఆయన నమ్మకం.

కృష్ణమూర్తి రూపసి కాదు. ఉద్యోగమూ ఇంకా రాలేదు. పైగా విజయలక్ష్మి తల్లి రుక్మిణికి కృష్ణమూర్తన్నా అతని తల్లన్నా అస్సలు పడదు. ఈకారణానికి ఆ సంబంధం వద్దనేస్తుంది. వీళ్ళింట్లోనే ఉంటున్న రుక్మిణి తల్లి వర్ధనమ్మ గారికి విజయలక్ష్మి అంటే తగని ప్రేమ. కృష్ణమూర్తి అంటే ఆవిడకీ పడదు. తను దాచుకున్న డబ్బుతో విజయలక్ష్మి పెళ్లి చేయడానికి ఆవిడ సిద్ధపడడంతో, పార్థసారధి సంబంధం వస్తుంది. అతను అందగాడు. బస్తీ వాడు. అతని తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్లో డిప్యుటీ సూపర్నెంట్ గా పనిచేసి బాగా గడించాడు కూడా.

కానీ, పార్థసారధికి చదువంటలేదు. అందగాడూ, ఆస్తి పరుడూ కావడంతో ఆడవాళ్ళకి అదేమీ పెద్ద ఎంచదగ్గ విషయంగా అనిపించలేదు. విజయలక్ష్మికి పెళ్ళిచూపుల్లోనే సారధి నచ్చేశాడు. ఆ సంబంధం పట్ల మనవరాలు మొగ్గు చూపడంతో, మనవరాలికి సారధితో పెళ్లి జరిపించేసింది వర్ధనమ్మగారు. ఇద్దరు పిల్లలు పుట్టే వరకూ జీవితం ఎంతో సాఫీగా సాగిపోయింది విజయలక్ష్మికి. ఎప్పుడూ కంటికి ఎదురుగా ఉంటూ, కోరింది క్షణాల్లో తెచ్చిచ్చే భర్తని చూసుకుని చాలా గర్వ పడేది ఆమె. అయితే, తన తల్లిదండ్రులు కాలం చేసిన తర్వాత నాటకాల్లో నటించడం అలవాటవుతుంది సారధికి. ఆ క్రమంలోనే నాటకాల్లో నటించే సరోజతో పరిచయం అవుతుంది.

అప్పటినుంచి మొదలవుతాయి విజయలక్ష్మి కష్టాలు. ఇంటి నుంచి బయటికి వెళ్ళిన భర్త ఎప్పుడు వస్తాడో, అసలు వస్తాడో రాడో తెలీదు. ఏ క్షణంలో అతని మూడ్ ఎలా ఉంటుందో ఊహకి అందదు. ఉన్నట్టుండి ఆమె ఏం మాట్లాడినా తప్పే అయిపోతూ ఉంటుంది. పిల్లలతో ఒక్కర్తీ ఇంట్లో ఉండలేక వర్ధనమ్మని తోడు తెచ్చుకుంటుంది. సంసారమన్నాక ఇలాంటివి మామూలేననీ, ఓపికతో సద్దుకుంటే మంచి రోజులు రాకమానవనీ మనవరాలికి బోధిస్తుంది వర్ధనమ్మ. చూస్తుండగానే సరోజతో పరిచయం చాలా దూరం వెళ్ళిపోతుంది సారధికి. పొలం తాకట్టు పెట్టి, తనుంటున్న మేడ కాక మిగిలిన రెండు పెంకుటిళ్ళూ అమ్మేసీ నాటకాలు వేయడం మొదలు పెడతాడు సారధి.

'పారిజాతాపహరణం' నాటకానికి మంచి పేరొస్తుంది. స్త్రీలు నాటకాల్లో నటించడం కొత్త కావడం, సారధి కృష్ణుడిగా వేసే ఆ నాటకంలో సరోజ సత్యభామ పాత్ర పోషిస్తూ ఉండడంతో తక్కువ కాలంలోనే వాళ్ళ నాటకానికి ఆంధ్ర దేశంలో మంచి పేరు వస్తుంది. శ్రీకృష్ణుడి పట్ల సత్యభామ, రుక్మిణుల ప్రేమకి సందర్భోచితంగా కథాగమనానికి వాడుకున్నారు రచయిత. నాటకంలో లాభాలు వస్తూన్నా, సారధికి ఖర్చులు పెరిగిపోతూ ఉండడంతో, మరికొంత ఆస్తి కరిగిపోతుంది. ఇటు అతడు ఇంటి పట్టున ఉండేది తగ్గిపోవడంతో విజయలక్ష్మి బాధలు మరీ పెరుగుతాయి. ఇది చాలదన్నట్టు కృష్ణమూర్తికి ఆ ఊరిలోనే ఉద్యోగం రావడం, ఎంతో అనుకూలవతి అయిన సావిత్రితో పెళ్ళి జరిగి వీళ్ళ వెనుక వీధిలోనే కాపురానికి రావడం జరిగిపోతుంది. కృష్ణమూర్తి పట్ల ఎంతో ఆదరం చూపుతుంది విజయలక్ష్మి. తన భర్త విషయాలు పెదవి దాటనివ్వదు.

అటు తండ్రికి భారం కాలేకా, ఇటు పిల్లల భవిష్యత్తు పాడు చేయలేకా మంచి రోజులు వస్తాయనే ఆశతో రోజులు గడుపుతూ ఉంటుంది. మరోపక్క నాటక సమాజంలో, రాఘవ అనే మరో నటుడు సరోజతో చనువుగా మెలుగుతూ ఉంటాడు. ఉన్నట్టుండి సరోజ, రాఘవ నాటక సమాజాన్ని వదిలేసి మద్రాసెళ్లి సినిమాల్లో చేరిపోవడం, కొన్ని మలుపుల తర్వాత సారథి తన తప్పు తెలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది. చివరి పేజీల్లో కొంత నాటకీయమైన సాగతీతని మినహాయిస్తే పేజీలు చకచకా సాగిపోతాయి. తెలుగులో పద్య నాటకాల తోలిరోజులకి సంబంధించ అనేక ఆసక్తికరమైన విషయాలని సందర్భోచితంగా ప్రస్తావించారు శాస్త్రిగారు. ఈ సంగతులు మరియు ఆపకుండా చదివించే కథనం కోసం చదవాల్సిన నవల. బ్లాకండ్ వైట్ సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. పేజీలు 248, వెల రూ. 75. అన్ని ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు ఏవీకెఎఫ్ లోనూ అందుబాటులో ఉంది.

ఆదివారం, ఆగస్టు 14, 2011

సుస్వర 'వాణి'

నేను అభిమానించే సిని నేపధ్య గాయనులలో ఒకరైన వాణి జయరాం కచేరీలు నాలుగైదింటికి హాజరవ్వగలిగే అవకాశం దొరికింది నాకు. గతంతో పోలిస్తే ఈమధ్య కాలంలో కొంచం తరచుగానే కచేరీలు చేస్తున్న వాణి జయరాం, సినిమా రంగంలోకి అడుగుపెట్టి నలభయ్యేళ్ళు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈటీవీ నిర్వహించి, ప్రసారం చేసిన సుస్వర 'వాణి' కార్యక్రమం చూస్తున్నంత సేపూ నేను చూసిన కచేరీలన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి.

అనుకోకుండా బయటికెళ్ళి ఇరుక్కుపోయి, తొందర పడుతూ ఇంటికి వచ్చి టీవీ ముందు సెటిలయేసరికి కార్యక్రమం మొదలయిపోయింది. చిన్న ఆడిటోరియంలో, పరిమిత సంఖ్యలో ఆహ్వానించిన అతిధుల మధ్యన నిర్వహించిన కార్యక్రమం. లైవ్ కానప్పటికీ, ప్రకటనలు మినహా నిరంతరాయంగా మూడు గంటలపాటు ప్రసారం చేసారు కాబట్టి టీవీలో లైవ్ కార్యక్రమం చూసిన అనుభూతి కలిగింది. వాణి జయరాం లో నన్ను అమితంగా ఆకట్టుకునేది ఇప్పటికీ మాధుర్యం తగ్గని ఆమె గొంతు. ఇదే విషయాన్ని ప్రస్తావించారు మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, కార్యక్రమం చివర్లో ఆమెని సన్మానిస్తూ.

స్టేజి మీద పాడేటప్పుడు, కో-సింగర్లు భయానికో మరో కారణానికో తప్పులు పాడినప్పుడు, వాళ్ళని చూసి అస్సలు విసుక్కోక పోగా దయగా నవ్వడం వాణి ప్రత్యేకత. ఈ కార్యక్రమంలోనూ అదే చేశారు, 'సీతాకోక చిలుక' సినిమాలో 'మిన్నేటి సూరీడు' పాటకి కోరస్ పాడిన గాయనీ గాయకుల విషయంలో. కోరస్ వల్ల పాట అందం ఇనుమడించే పాటల్లో అదీ ఒకటి. మొత్తంగా చూసినప్పుడు సహ గాయకులు బాగానే పాడారు. మరీ ముఖ్యంగా 'శంకరాభరణం' లో 'దొరకునా ఇటువంటి సేవ..' పాడేటప్పుడు కో-సింగర్ దగ్గలేక అవస్థ పడడం, ఈవిడ చిరునవ్వు దాచుకుంటూ పాటందుకోడం జరగలేదీసారి.

నేను గమనించిన, నాకు నచ్చే మరో విషయం ట్యూన్ని ఏమాత్రం మార్చకుండా యధాతధంగా పాడడం. బాలూలాంటి కొందరు స్టేజి మీద పాడేటప్పుడు చాలా చోట్ల ట్యూన్ని మార్చేస్తూ ఉంటారు. ఇవాల్టి కచేరీ విషయానికి వస్తే, 'మరో చరిత్ర' సినిమాలో 'విధి చేయు వింతలన్నీ' పాట పాడుతూ కొన్ని కొత్త సంగతుల్ని జత చేసేశారు వాణి. దాదాపుగా షో అంతా గంభీరంగా నిలబడి పాడేసే ఈ గాయని, 'వయసు పిలిచింది' లో 'నువ్వడిగింది ఏనాడైనా...' పాటనీ, 'గుప్పెడు మనసు' లో 'నేనా.. పాడనా పాట..' పాటనీ పాడేటప్పుడు తనకి తెలియకుండానే కొంచం హుషారుగా కదులుతారు. గతంలో నేను చూసిన కచేరీలలో కన్నా, ఇవాళ 'నేనా.. పాడనా పాట...' పాడిన తీరు చాలా బాగుంది.

గతంలో ఏ స్టేజి షోలోనూ పాడగా చూడని పాట 'స్వాతికిరణం' లో 'ఆనతినీయరా..' ఈ పాట గురించి ఓ విషయం చెప్పాలి. నా మరణ సమయం నాకు ముందుగా తెలిసే అవకాశం ఉంటే, చివరి ఘడియల్లో వింటూ తనువు చాలించాలని కోరుకునే అతి కొద్ది పాటల్లో ఇదీ ఒకటి. అసలు కొన్నికొన్ని సార్లు ఒక్కడినీ ఈపాట వింటూ ఉంటే 'ఈ క్షణంలో మృత్యువు వచ్చేస్తే ఎంత బాగుండును' అనిపిస్తుంది. ఇవాల్టి కచేరీలో ఈ పాటని పాడారు వాణి జయరాం. దాదాపుగా సినిమాలో పాడినట్టే పాడారు కానీ, పాడించిన విధానమే నాకు నచ్చలేదు. చక్కగా ఓ తివాచీ మీద కూర్చుని ఈ పాట పాడి ఉంటే ఆమెకీ, చూసేవారికీ కూడా బాగుండేది. కానీ, మిగిలిన అన్ని పాటల్లాగే మైకు ముందు నిలబడి పాడేశారు.

మరో విశేషం ఏమిటంటే, ఇంత కష్టమైన పాట పాడిన వెంటనే, బ్రేక్ తీసుకోకుండా మరో పాట అందుకోవడం. కార్యక్రమం చివర్లో తన చిరు ప్రసంగంలో గాయని సునీత ప్రస్తావించింది ఈ విషయాన్ని. ఎప్పటిలాగే తనని సిని రంగానికి పరిచయం చేసిన వసంత్ దేశాయ్ ని భక్తితో తలుచుకుని, 'గుడ్డీ' నుంచి 'బోల్ రే పప్పీ..' 'హం కో మన్కి శక్తి దేనా' పాటలని పాడారు. డిసెంబర్లో జరగబోయే వసంత్ దేశాయ్ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన పేరిట నెలకొల్పిన అవార్డుని అందుకోబోతున్నానని కించిత్ గర్వంగా ప్రకటించారు. ఎప్పుడూ పట్టు చీరల్లోనే కనిపించే వాణి ఈ షో లో గులాబీ రంగు వర్క్ చీరలో ప్రత్యక్షమై కొత్తగా అనిపించారు.

అలాగే, ఎప్పుడూ మొదటి వరుసలో కూర్చుని కచేరీ ఆసాంతమూ శ్రద్ధగా విని, చివర్లో వాణి కోరిక మేరకు స్టేజీ ఎక్కి ఆమె పాద నమస్కారం అందుకునే భర్త జయరాం ఈ షోలో కనిపించలేదు. ఈటీవీ వాళ్ళు ముందుగా రికార్డు చేసేసిన ఈ కార్యక్రమానికి, వర్ధమాన గాయని ప్రణవి చేత యాంకరింగ్ చేయించి మిక్స్ చేశారు. ఆమె ప్రతిసారీ 'శ్రీ వాణీజయరాం' అనడం పంటికింద రాయిలా అనిపించింది. 'శ్రీమతి' అని వినడం అలవాటు కదా. ఏమైనప్పటికీ, అవకాశాలు వస్తే ఇప్పటి గాయనులకి దీటుగా వాణిజయరాం పాడగలరని మరోమారు నిరూపితమయింది. ఆమె మాత్రం "నేను అవకాశాలు వెతుక్కుంటూ వెళ్ళను. నన్ను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలకి నావంతు న్యాయం చేస్తాను" అని వినమ్రంగా చెప్పారు.

శనివారం, ఆగస్టు 13, 2011

చీకటి

వెలుతురు జ్ఞానానికి ప్రతీక అయితే, చీకటి అజ్ఞానానికి ప్రతీక. వెతికి చూడగలిగితే అజ్ఞానంగా అనుకునే దానిలోనూ ఏదో జ్ఞానం కనిపించక మానదు. చదువూ సంధ్యా లేని సంచార జీవి డిబిరిగాడిలో అలాంటి జ్ఞానమే కనిపించింది కెప్టెన్ వర్మకి. ఆర్మీలో పనిచేసి రిటైరైన వర్మకీ, తిరిగిన ఊరు తిరగకుండా తిరిగే 'నక్కలోడు' డిబిరిగాడికీ ఉన్న ఒకే ఒక్క పోలిక 'వేట.' అవును, వర్మకి వేట సరదా అయితే, డిబిరిగాడికి మాత్రం అదే బతుకు తెరువు. వర్మ వాడేది డబుల్ బారెల్ గన్నయితే, డిబిరిగాడిది ఎంతో చరిత్ర ఉన్న నాటు తుపాకీ.

వాళ్ళిద్దరి పరిచయమూ అతి స్వల్పమే అయినా, ఒకసారి చదివాక మర్చిపోలేం. డిబిరిగాడికీ-కెప్టెన్ వర్మకీ జరిగిన సంభాషణ ద్వారా డిబిరి జీవితంలో 'చీకటి' ని పాఠకుల కళ్ళకి కట్టారు ప్రముఖ కథా రచయిత అల్లం శేషగిరి రావు. 'చీకటి' కథ ప్రారంభమే కెప్టెన్ వర్మ, తన రిట్రీవర్ డాగ్ సీజర్ సాయంతో ఓ శీతాకాలపు తెల్లవారుజామున, వలస వచ్చే బాతుల వేటకి ప్రయాణం కావడం. చలికి తట్టుకోలేక వర్మ కాల్చిన సిగరెట్టూ, ఓ పక్షి గుంపు కనిపించగానే యధాలాపంగా పేల్చినా తుపాకీ డిబిరిగాడి వేటకి అడ్డంకిగా మారి, ఆరోజుకి మరి వాడికి వేటకేమీ లేకుండా చేస్తాయి.

అరవయ్యేళ్ళ డిబిరికి ఒంటిమీద గోచీ తప్ప మరేమీ లేదు. ముడి వేసిన జుట్టూ, చెవులకి మెరిసే చెవి పోగులూ. పోలీసు దెబ్బలకి కదుములు కట్టిన బక్క పల్చని శరీరం. వాడికి సాయం ఓ పెంపుడు కొంగ, అది కూడా గుడ్డిది. చలిమంట వేసుకుని, సారా తాగుతూ, వేట నుంచి తిరిగి వెళ్ళిపోతున్న వర్మని చలి కాగడానికి రమ్మని ఆహ్వానిస్తాడు డిబిరిగాడు. వర్మ వేషం చూసి అతనేమీ భయపడ్డు. సాటి వేటగాడిగా ఆహ్వానిస్తాడు, అంతే. వర్మ ఇచ్చిన సిగరెట్ కాల్చుకుంటూ తన కథ చెప్పుకొస్తాడు డిబిరి.

తనని ఉంచుకున్న ఆడమనిషి మరణంతో మొదలు పెట్టి, తన బాల్యం, పోలీసుల చేతిలో తండ్రి పడ్డ చిత్రహింసలు, నిష్కారణంగా తనని హింసించిన పోలీసుల మీద ప్రతీకారం తీర్చుకుంటూ, నాటు తుపాకీతో తండ్రి ఓ పోలీసుని హతమార్చడం, తండ్రికి ఉరిశిక్ష పడడం..ఇలా జీవితంలో ఒక్కో సంఘటననీ నిర్వికారంగా చెప్పుకుంటూ పోతాడు డిబిరి గాడు. తన కథ చెబుతూనే, మధ్య మధ్యలో పక్షుల వేటలో కిటుకులని ఒక్కొక్కటిగా విప్పి చెబుతాడు వర్మకి. తుపాకి నింపడం మొదలు, ఎర వేయడం వరకూ ప్రతి విషయంలోనూ డిబిరి కి ఉన్న నిశిత పరిశీలనా దృష్టి అబ్బుర పరుస్తుంది కెప్టెన్ వర్మని.

"డిబిరిగాడిది, వాడి జీవితంలాగే భాష కూడా వేరు. సంచార జాతి. అన్ని యాసలూ కలగాపులగం. అరవం, ఉరుదూ ముక్కలు, అక్కడక్కడా ఇంగ్లిష్ చమక్కులు వాడి జీవిత దర్పణంలా ప్రతిబింబిస్తున్నాయి. ఆ నిశ్శబ్దంలో డిబిరిగాడి మాటల్ని తనకి అర్ధమయ్యే భాషలో అనువదించుకుని మనస్సుతో అర్ధం చేసుకుంటున్నాడు వర్మ. భాషా సంకెళ్ళని తెంచుకుని రెండు మనస్సులు మాట్లాడుకొంటున్నాయి. కెప్టెన్ వర్మకి కళ్ళు చెమరుస్తున్నాయి." అంటారు రచయిత ఒక చోట. ఇక, సంచార జీవితాన్ని గురించీ, మరీ ముఖ్యంగా వాళ్ళ వేట పద్ధతులని గురించీ డిబిరి చేత చెప్పించింది చదివినప్పుడు రచయిత పరిశీలనా దృష్టిని అభినందించకుండా ఉండలేం.

"ఏ జాతి పిట్టల్ని పట్టుకోవాలనుకుంటే ఆ జాతి పిట్టనే మచ్చిక చేసుకోవాలి. ముందుగా దానికి చూపు లేకుండా చేసేయాలి. వలేసి దాని మీద పెట్టాల. దాన్ని చూసి ఆ జాతి పిట్టలన్నీ భయం లేకుండా దాని దగ్గర దిగిపోయి వలలో తగులుకొని చిక్కడిపోతాయి. మచ్చిక చేసిన పెంపుడు పిట్ట వెలుతురు చూడకూడదు. చూస్తే ఎగిరిపోయి దాని జాతి మందలో కలిసిపోద్ది. చూపులేని పిట్టతో చూపున్న పిట్టల్ని వలేసి పట్టుకోవడం. అదే ఈ వేటలో తమాషా.." అని డిబిరి చేత చెప్పిస్తూనే, తాను చెప్పదల్చుకున్నది కూడా చెప్పేశారు రచయిత.

డిబిరి తండ్రి ఉరిశిక్ష సన్నివేశంతో పాటుగా, కథలో ముగింపు సన్నివేశం కూడా చాలా రోజుల పాటు విడవకుండా వెంటాడుతుంది. మరీ ముఖ్యంగా కథని కళ్ళకి కట్టినట్టుగా రాయడంలో రచయిత చూపిన ప్రతిభ కారణంగా చదివిన కథంతా మళ్ళీ మళ్ళీ కళ్ళ ముందు తిరుగుతుంది. కథా స్థలం, వాతావరణం, పాత్రల రూపు రేఖలు అన్నీ అప్రయత్నంగానే పాఠకుల ఊహలోకి వచ్చేస్తాయి. "ఒక్క మాటలో చెపితే సోమర్ సెట్ మాం కథల్లో లాంటి నిశిత పరిశీలన ఈ కథలో నన్ను ఆకట్టుకున్న ప్రధానాంశం" అన్నారు వంశీ, తన సంకలనం 'వంశీకి నచ్చిన కథలు' లో 'చీకటి' కథని చేర్చడానికి కారణాన్ని వివరిస్తూ.

శుక్రవారం, ఆగస్టు 12, 2011

శంకరాభరణానికి 'వావ్'

ఈటీవీలో వచ్చే కార్యక్రమాలలో కొంచం వైవిధ్యంగా ఉండి కనీసం అప్పుడప్పుడూ అయినా చూసే కార్యక్రమాలలో ఒకటి 'వావ్.' సీనియర్ నటుడు సాయికుమార్ వ్యాఖ్యానం ఈ కార్యక్రమానికి పెద్ద అసెట్. వినోదాన్నీ, విజ్ఞానాన్నీ మేళవించి, ప్రశ్నలు సంధించి, విజేతలకి నగదు బహుమతి అందించే ఈ కార్యక్రమానికి అతిధుల ఎంపిక కూడా వైవిధ్య భరితంగానే సాగుతోంది. సిని నటుల్ని, ముఖ్యంతా కొత్తగా విడుదలవుతున్న సినిమాల టీములని పిలవడం ద్వారా, ఆయా సినిమాలనీ ప్రమోట్ చేస్తూ, ఉభయతారకంగా మలుస్తున్నారు ఈమధ్యన.

ఈ కొత్త సినిమాల ట్రెండ్ కి భిన్నంగా, ముప్ఫయ్యేళ్ళ క్రితం విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న కె. విశ్వనాథ్ అపూర్వ సృష్టి 'శంకరాభరణం' లో నటించిన నటీనటుల్ని అతిధులుగా ఆహ్వానించి ఇవాళ ప్రసారం చేసిన ఎపిసోడ్ ఆద్యంతమూ ఆసక్తికరంగా సాగింది. చంద్రమోహన్, రాజ్యలక్ష్మి, మంజుభార్గవి, తులసిలని కార్యక్రమంలో పాల్గొనడానికీ, కళాతపస్వి విశ్వనాథ్ ని ప్రత్యేక అతిధిగానూ ఆహ్వానించిన ఈ ఎపిసోడ్ లో 'శంకరాభరణం' సినిమాకి సంబంధించిన ఎన్నో విశేషాలని గుర్తు చేసుకుందీ బృందం. కొన్ని తెలియనివీ, మరికొన్ని తెలిసినా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేవీ..

కె. విశ్వనాథ్ తనకి స్వయానా పెదనాన్న కొడుకన్న సంగతిని చంద్రమోహన్ అధికారికంగా చెప్పిన తొలి సందర్భం బహుశా ఇదే. అలాగే, గాయకుడు బాలూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పాడేలా చూడమని తను బాలూ తండ్రి సాంబమూర్తిని అడిగాననీ, బాలూ చూపిన ప్రత్యేక శ్రద్ధ కారణంగానే టైటిల్స్ లో ప్రత్యేకమైన కార్డ్ ఇవ్వడం జరిగిందనీ చెప్పారు విశ్వనాథ్. విమర్శకులు మెచ్చిన కొన్ని సన్నివేశాల్నీ, వాటి వెనుక జరిగిన సంఘటనలనీ సరదాగా చెప్పారు. "మజుభార్గవి పాత్రకి ఒకే ఒక్క డైలాగుంది.. ఆ ఒక్కటీ పెట్టకపోతే ఇంకా బాగుండేది కదా అనుకున్నాను చాలాసార్లు" అన్నారు.

మంజుభార్గవినీ, తులసి నీ పక్కపక్కన చూసినప్పుడు "తల్లీ కొడుకులుగా చేసింది వీళ్ళిద్దరేనా!" అని ఆశ్చర్యం కలిగింది. కేరళ జడ్జి, తులసిని చూసి శంకరం వేషం వేసింది ఈమెనంటే నమ్మకపోవడాన్ని విశ్వనాథ్ చెబుతుండగా, తులసి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ గమ్మత్తుగా అనిపించింది. అన్నింటికీ మించి, విశ్వనాథ్ సమక్షంలో జరిగిన మొదటి రౌండ్లో - ఒక్కొక్కరికీ ఒక్కో సినిమా కథ చెప్పి ఆ సినిమా గురించి ప్రశ్నలు అడిగే రౌండ్ - సాయికుమార్ విశ్వనాథ్ సినిమాల గురించే అడుగుతుంటే, నటీనటులు నలుగురూ తెలిసిన విషయాలే చెప్పడానికి తడబడడం, మరీ ముఖ్యంగా మంజుభార్గవి 'సిరిసిరిమువ్వ' సినిమాకి దర్శకుడు ఏడిద నాగేశ్వర రావు అని టక్కున చెప్పినప్పుడు విశ్వనాథ్ ముఖంలో ఎక్స్ ప్రెషన్ ఇవన్నీ సరదాగా ఉన్నాయి.

రెండుగంటల పాటు సాగిన ఎపిసోడ్ ఎక్కడా బోర్ కొట్టలేదు. మరీ ముఖ్యంగా 'శంకరాభరణం' ఫీల్ ని ఆసాంతమూ కొనసాగించడం బాగుంది. చంద్రమోహన్ కొంచం అనారోగ్యంగా ఉన్నట్టు కనిపించాడు. మొత్తం అరవై ఒక్క మంది హీరోయిన్లు తనతో నటించారని కొంచం గర్వంగా చెప్పినప్పుడు -- చెప్పొద్దూ కొంచం అసూయలాంటిది కలిగింది. పెద్ద పెద్ద హీరోలక్కూడా ఇంత పెద్ద అవకాశం వచ్చి ఉండదు. మంజుభార్గవి "ఈ ఒక్క సినిమా చాలు" అని కొంచం ఉద్వేగంగా చెప్పింది. రాజ్యలక్ష్మి తన తొలి సినిమా 'శంకరాభరణం' అనీ, అదే తన ఇంటి పేరుగా మారిపోయిందనీ జ్ఞాపకం చేసుకుంది. ఇక తులసి చేసిన అల్లరి చూస్తే ఆమె ఇంకా 'శంకరం' గానే ఉండిపోయిందేమో అనిపించింది.

సాయికుమార్ తో సహా మొత్తం ఐదుగురూ విశ్వనాథ్ ని సన్మానించారు. 'శంకరాభరణం' ని మళ్ళీ తీసే అవకాశం ఉందా? అని సాయికుమార్ అడిగితే, వీలుపడదని చెప్పేశారు విశ్వనాథ్. "ఓ మాయాబజార్, ఓ మల్లీశ్వరి, ఓ శంకరాభరణం.. వీటిని మళ్ళీ తీయలేం" అంటూనే "మరో సినిమా గురించి ఇప్పుడు కమిట్ చేయించొద్దు" అంటూ తను
తప్పించేసుకున్నారు. మొత్తం ఐదు రౌండ్ల గేం షో లో చంద్రమోహన్ విజేతగా నిలిచాడు. 'శంకరాభరణం' గొప్పదనాన్ని గురించిన ముగింపు వాక్యాలు చెబుతూ, సాయికుమార్ "కొత్తని స్వాగతించాలి. అదే సమయంలో మనదైన సంస్కృతిని భద్ర పరుచుకోవాలి. మన సంస్కృతిలో ఒక భాగం ఈ శంకరాభరణం" అనడం నచ్చింది నాకు.

గురువారం, ఆగస్టు 11, 2011

చదువు కష్టం

నాకు తెలిసిన వాళ్లకి ఒక సమస్య వచ్చింది. అది కూడా వాళ్ళబ్బాయి వల్ల. కుర్రాడు బుద్ధిమంతుడు, తెలివైన వాడూ అయినప్పటికీ సమస్య రాడానికి కారణం 'కాలం కలిసి రాకపోవడం' అని తల్లిదండ్రుల ప్రగాఢ నమ్మకం. సరే, నమ్మకాలనీ, విశ్వాసాలనీ మార్చడానికి మనమెవరం? సమస్య ఆ కుర్రాడి చదువు. ఎటూ కాకుండా అయిపోయింది కదా అని బాధనిపించింది జరిగింది విన్నప్పుడు. ఇప్పుడు ఎవరిని తప్పు పట్టినా ఉపయోగం లేదు కూడా.

ఆ కుర్రాడు మూడేళ్ళ క్రితం ఇంటర్ పాసై, ఎంసెట్ రాశాడు. మంచి ర్యాంకు రాలేదు. ఎంసెట్ మళ్ళీ రాయాలా? డిగ్రీలో చేరాలా? ఇంకేదన్నా ప్రత్యామ్నాయం ఆలోచించాలా? అన్న ఆలోచనలో అతను, అతని కుటుంబం ఉన్నప్పుడు, 'ఎంసెట్ లో ర్యాంకు రాలేదా? బాధ పడకండి. మీ పిల్లల్ని సీఏలుగా తీర్చి దిద్దే బాధ్యత మాది' అంటూ ఓ ప్రముఖ విద్యా సంస్థ మొదలు పెట్టిన ప్రచారం వీళ్ళ దృష్టికి వచ్చింది. ఆ సంస్థ ఆఫీసుకి కుర్రాడిని తీసుకుని వెళ్ళారు అతని తల్లిదండ్రులు.

చార్టర్డ్ అకౌంటన్సీ ఎంత గొప్ప కోర్సో, ఇంజనీరింగ్, మెడిసిన్లతో ఏవిధంగా సమానమో - కొండొకచో అంతకన్నా ఎక్కువో - ఆ కోర్సు పూర్తి చేస్తే కుర్రాడి జాతకం ఏవిధంగా మారిపోతోందో గ్రాఫిక్స్ లో చూపించేయడంతో పాటుగా, కుర్రాడిని తమకి అప్పగిస్తే తగు మాత్రం ఫీజు తీసుకుని సీఏగా తిరిగి అప్పగిస్తామని హామీలిచ్చేసి, అప్పటికప్పుడే అడ్మిషన్ తీసుకోడానికి ఒప్పించేశారు ఆ సంస్థ వాళ్ళు. మార్కెటింగా మజాకానా మరి? శుభమో, ఆశుభమో తెలియని ఒకానొక ముహూర్తంలో కోచింగులో చేరిపోయాడు.

వాళ్ళబ్బాయిని సీఏని చేయబోతున్నందుకు తల్లితండ్రులు చాలా గర్వపడ్డారు అప్పట్లో. ఇంజినీరింగుకి తొందర్లోనే డిమాండ్ పడిపోతుందనీ, సీఏనే బెస్టనీ చుట్టూ ఉన్నవాళ్ళకి చెప్పారు కూడా. గడిచిన మూడేళ్ళలోనూ దాదాపుగా ఇంజనీరింగ్ చదువుకి పెట్టినంత ఖర్చూ సీఏ చదువుమీద పెట్టారు. సమస్య ఇప్పుడు వచ్చింది. ఆ కుర్రాడికి క్లాసులో ఉన్నంతసేపూ బాగానే ఉంటోంది కానీ, చదవడానికి వచ్చేసరికి అంతా బ్లాంక్ గా ఉంటోంది. ఇక పరిక్షలైతే చెప్పక్కర్లేదు. సీఏ నేను చదవను అంటాడు. సదరు సంస్థ వాళ్ళు విజయవంతంగా చదువుకుంటున్న స్టూడెంట్స్ ని చూపిస్తూ లోపం కుర్రాడిలో ఉంది తప్ప కోచింగులో లేదనేస్తున్నారు.

కుర్రాడి పరిస్థితి త్రిశంకు స్వర్గంలో పడ్డట్టయ్యింది. అటు చూస్తే తన తోటివాళ్ళందరూ ఇంజనీరింగ్ పూర్తి చేసేయ బోతున్నారు. చదువు పూర్తి చేసి ముందుకి వెళ్ళలేడు. అలాగని వెనక్కీ వెళ్ళలేడు. తల్లితండ్రులు సీనియర్ చార్టర్డ్ అకౌంటంట్లని కలవడం మొదలు పెట్టారు. "కోచింగ్ లో చేరిస్తేనే సీఏ అయిపోరు. చదివే వాళ్లకి ఆసక్తి ఉండాలి. బాగా కష్టపడి చదవడం, చదివింది అర్ధం చేసుకుని సొంతంగా రాయడం అవసరం. మీరు కోర్సులో చేర్చేముందే కుర్రాడిని మా దగ్గరకి తీసుకురావాల్సింది" అన్నది అటునుంచి వచ్చిన సమాధానం. సీఏలో పాస్ పర్సంటేజ్ పదిహేను నుంచి ముప్ఫై శాతం లోపేనని చల్లగా చెప్పారు వాళ్ళు.

"సీఏ అంటే మాటలేంటీ.. ఎవడు పడితే వాడు సీఏ అయిపోడమే" అంటూ దొరికిందే చాన్సని కొందరు బంధువులు మొటికలు విరుస్తున్నారు . కుర్రాడికి ఏడుపొక్కటే తక్కువ. తల్లిదండ్రుల పరిస్థితీ ఇంచుమించి అదే. సీఏ మధ్యలో వదిలేసిన వాళ్లకి ఒక సర్టిఫికేట్ ఇస్తారనీ, దానితో సీఏగా పనిచేసే వాళ్ళదగ్గర అసిస్టంట్ ఉద్యోగం దొరుకుతుందనీ తెలిశాక, ఆ ఉద్యోగంలో చేరిపోతానని కుర్రాడి పట్టు. ఇప్పటికీ సమయమూ, డబ్బూ చాలా ఖర్చయ్యింది కాబట్టి ఇకపై ఆ రెంటినీ వేస్ట్ చేయనంటాడు. ఎటూ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు తల్లిదండ్రులు. నన్ను సలహా అడిగినప్పుడు "కేవలం మూడేళ్ళ కోసం నలభయ్యేళ్ళ కెరీర్ ని పణంగా పెట్టొద్దు. ఇంటర్ క్వాలిఫికేషన్ తో చేయదగ్గ కోర్సుల్లో నీకు నచ్చిన దానిలో చేరు.. జరిగినదాన్నే తల్చుకుని బాధ పడొద్దు" అని చెప్పాను.. చూడాలి, ఏం చేస్తారో..

బుధవారం, ఆగస్టు 10, 2011

అసలేం జరిగిందంటే...

'చరిత్రాత్మక పరిణామాలలో ఓ ఐ.ఏ.ఎస్. అనుభవాలు... గుండె లోతుల్లోంచి' అనే ఉప శీర్షికతో ఎమెస్కో ప్రచురించిన పుస్తకం 'అసలేం జరిగిందంటే...' సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పీవీఆర్కే ప్రసాద్ అనుభవాల సమాహారం ఇది. స్వాతి వారపత్రికలో సీరియల్ గా వచ్చిన కథనాలన్నింటినీ గుదిగుచ్చి ప్రచురించిన ఈ సంకలనాన్ని చదవడం మొదలుపెట్టాక, మొత్తం పూర్తి చేసి కానీ పక్కన పెట్టలేం. ఇవన్నీ కేవలం ఓ ఐఏఎస్ ఆఫీసర్ అనుభవాలు మాత్రమే కాదు, గడిచిన నలభయ్యేళ్ళ కాలంలో రాష్ట్రంలోనూ, దేశంలోనూ జరిగిన అనేక పరిణామాలకి తెర వెనుక జరిగిన సంగతులు కూడా.

ఐఏఎస్ మన దేశంలో అత్యుత్తమ సర్వీసు. ఏటా లక్షలాదిమంది కలలు కని, వేలాది మంది అహోరాత్రాలు కృషిచేస్తే, వారిలో కేవలం కొన్ని వందల మంది మాత్రమే గెలుచుకునే సర్వీసు. అలాంటి సర్వీసులో చేరిన వ్యక్తి ఉద్యోగ జీవితం ఎలా మొదలవుతుంది? ఏసీ ఆఫీసు, ఏసీ కారు, వెనుక నలుగురు అటెండర్లు, ఎస్ బాస్ అనే ఉద్యోగులు అన్నది సామాన్య భావన. కానైతే పశ్చిమ గోదావరి జిల్లాలో ట్రైనీ కలక్టర్ గా ప్రసాద్ ఉద్యోగ జీవితం మొదలైన క్రమం మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. అప్పటి కలక్టర్ సుబ్రహ్మణ్యం, తన బంగ్లా వెనుక ఉన్న సర్వెంట్ క్వార్టర్ కేటాయించారు ప్రసాద్ కి. ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్ లో ప్రయాణం. చాలా సార్లు అటెండర్లు కూడా వచ్చేవాళ్ళు కాదు.

ఆరునెలలు గడిస్తే కానీ అర్ధం కాలేదు, శిక్షణ అలా ఎందుకు ఉందో. ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా, అటుపై జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన సొంత జిల్లా ఖమ్మం కి కలక్టర్ గా, ఈమధ్యలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకి అత్యంత ఇష్టమైన సమాచార శాఖ కమిషనర్ గా, అటుపై విశాఖ పోర్ట్ చైర్మన్గా, ఆతర్వాత ప్రధాని బాధ్యతలు చేపట్టిన పీవీకి అంతరంగిక కార్యదర్శిగా, తిరిగి రాష్ట్రానికి వచ్చి చంద్రబాబు పాలనలో కొన్ని కీలక బాధ్యతలనీ నిర్వహించిన ప్రసాద్ ఉద్యోగ జీవితంలో ఉత్కంఠభరితమైన సంఘటనలు ఎన్నో..ఎన్నెన్నో..

ఆర్ధిక సంస్కరణల వంటి కీలకమైన నిర్ణయాన్ని తీసుకుని దేశ భవిష్యత్తుని మలుపు తిప్పిన పీవీ నరసింహారావు అంటే తనకున్న ప్రత్యేకమైన అభిమానాన్ని ఎక్కడా దాచుకోలేదు రచయిత. అదే సమయంలో, పీవీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఆయన అత్యంత అభిమానించే తేళ్ళ లక్ష్మీకాంతమ్మ కారణంగా సీఎం పేషీలో పవర్ సెంటర్ ఏర్పడడం తదితర విషయాలనీ దాచలేదు. "ఈ అనుభవాల వ్యాసాల్లో నాకు తెలిసిన నిజమంతా రాశానో లేదో కానీ, రాసినవన్నీ మాత్రం నిజాలే" అంటూ రాసిన ముందుమాట ద్వారా, తను రాయకుండా వదిలేసిన విషయాలని పాఠకులు ఊహించుకునేందుకు బోలెడంత అవకాశం ఇచ్చారు. ఎవ్వరినీ దగ్గరికి చేర్చని, దూరం పెట్టని పీవీ వైఖరిని గురించి వివరిస్తూ, కేవలం ఆ వైఖరివల్లే ఆయన తన చివరి రోజుల్లో ప్లీడర్లకి ఫీజు చెల్లించడం కోసం తన ఇల్లమ్మడానికి ప్రయత్నించారని ప్రసాద్ రాసింది చదివినప్పుడు కలుక్కుమనిపించింది.

తను ముఖ్యమంత్రిగా ఉండగా సొంత జిల్లాని అభివృద్ధి చేయాలన్న జలగం కోరిక, అందుకోసం కలక్టర్ కి అపరిమితమైన అధికారాలు ఇచ్చి కేడర్ కోపానికి గురవ్వడం లాంటివి ఆసక్తిగా అనిపిస్తాయి. "ఇది కేవలం మా ఇమేజ్ వల్ల ఏర్పడ్డ పార్టీ బ్రదర్. మా ఇమేజ్ ని మేం కాపాడుకోవాలి" అంటూ తన ఇమేజ్ నిలబెట్టుకోవడం కోసం ఎన్టీఆర్ చేసిన ప్రయత్నాలు, వాటికారణంగా చుట్టూ ఉన్నవాళ్ళకి ఎదురైన ఇబ్బందులూ చదవాల్సిందే. మరీ ముఖ్యంగా కిలో రెండు రూపాయల బియ్యం పధకం కోసం 'వారుణి వాహిని' మొదలు పెట్టి, లిక్కర్ అమ్మకాలు పెంచడం లాంటివి. "అకస్మాత్తుగా ముఖ్యమంత్రి దగ్గరనుంచి కబురొచ్చింది. నాకు తెలిసిన ఒకరిద్దరు పండితుల్ని పిలవమన్నారు. సారా అమ్మకాలకి ఒక పేరు పెట్టాలని వాళ్లతో చర్చించారు. ఒక పథకం కోసం నిశితంగా సాహితీవేత్తలతో చర్చించిన ముఖ్యమంత్రిని నేను చూడలేదు," అని రాశారు 'వారుణితో రొమాన్స్' అనే చాప్టర్లో.

కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న విశాఖ పోర్ట్ ట్రస్ట్ అభివృద్ధికి అన్నీ ఆటంకాలే. కానైతే, ఒక ఉన్నత స్థాయి అధికారి తలచుకుంటే నిబంధనలని తనకి అనుకూలంగా మార్చుకుని ఏరకంగా అభివృద్ధి చేసి చూపించవచ్చో పోర్ట్ చైర్మన్ గా చేసి చూపించారు ప్రసాద్. పోర్ట్ కోసం ఏకంగా రైలింజన్నే కొనుగోలు చేసేశారు. పోర్ట్ కోసం ఇదొక్కటే కాదు ఇంకా చాలా సాహసోపేతమైన నిర్ణయాలనే తీసుకున్నారు. ఇక ప్రధాని పీవీ అంతరంగిక కార్యదర్శిగా ప్రసాద్ అనుభవాలు చదువుతుంటే ప్రతి పేజీకీ కనుబొమలు పైకి లేవడం, ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవవ్వడం తప్పదు. అంబానీలు, అమితాబ్ బచ్చన్ ప్రసాద్ ఇల్లు వెతుక్కుంటూ రావడం మొదలు, పీవీని తన వైఖరి మార్చుకొమ్మని చంద్రస్వామి ప్రసాద్ తో చెప్పించడం వరకూ అన్నీ ఆశ్చర్యార్ధకాలే. పీవీ వ్యక్తిత్వంతో పాటు కాంగ్రెస్ సంస్కృతిని మరింత బాగా అర్ధం చేసుకోడానికి ఉపయోగపడే అధ్యాయాలివి.

ఇమేజ్ బిల్డింగ్ లో ఎన్టీఆర్ ది ఒక శైలి అయితే చంద్రబాబుది మరో పధ్ధతి. తను ముఖ్యమంత్రిగా ఉండగా ఇంటర్ పేపర్లు లీకైనప్పుడు, ప్రభుత్వ ప్రతిష్టని ఇనుమడింప జేయడం కోసం ఓ ఐఏఎస్ ఆఫీసర్ మీద చర్య తీసుకోమని (అతడు బాధ్యుడు కానప్పటికీ) ఉన్నతాధికారుల మీద ఒత్తిడి తేవడం ఒక ఉదాహరణ మాత్రమే. అలాగే మీడియా మేనేజ్మెంట్ విషయంలో పీవీ-చంద్రబాబు ఉత్తర దక్షిణ ధ్రువాలన్న విషయం కూడా సులువుగానే అర్ధమవుతుంది. ఎక్కువగా వృత్తి జీవితాన్ని గురించే రాసినా, అక్కడక్కడా తన వ్యక్తిగత జీవితాన్ని గురించీ ప్రస్తావించారు ప్రసాద్. అయితే ఆవివరాలు కేవలం కథనానికి అవసరమైనవి మాత్రమే. ఉన్నత స్థానంలో ఉండే అధికారులకి మెదడుతో పాటు హృదయం కూడా ఉంటే వారిద్వారా ఎన్ని మంచి పనులు జరగడానికి అవకాశం ఉందో చెబుతుందీ పుస్తకం.

'నిప్పులాంటి నిజం' పుస్తకాన్ని తెనిగించిన జి.వల్లీశ్వర్ ఎడిట్ చేయడం వల్ల కాబోలు, ఈ పుస్తకంలో చాలా అధ్యాయాల్లో కథనం ఆ పుస్తకాన్ని గుర్తు చేసింది. పుస్తకం చదవడం పూర్తి చేశాక, ఓ మిత్రుడికి ఫోన్ చేసి పుస్తకాన్ని గురించి చెప్పాను. "నేను చదివాను. చాలా బాగుంటుంది పుస్తకం. రాసిన విషయాలే కాకుండా, రాయకుండా వదిలేసిన బిట్వీన్ ది లైన్స్ అర్ధం చేసుకుంటే ఇంకా బాగుంటుంది" అన్న స్పందన వినగానే, "అవునౌను" అనేశాను టక్కున. నా అనుభవం కూడా అదేమరి. ప్రతి అధ్యాయాన్నీ మొదటి నుంచి చివరి వరకూ ఊపిరి బిగపట్టి చదివించే కథనం వల్ల ఎక్కడా బోర్ కొట్టడం అన్న ప్రశ్న ఉండదు. ఇంత పెద్ద పుస్తకాన్నీ అప్పుడే చదివేశామా అనిపిస్తుంది. మొత్తం పుస్తకాన్ని యాభైయేడు అధ్యాయాలుగా విభజించారు. పేజీలు 424, వెల రూ.150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు.