శుక్రవారం, ఆగస్టు 05, 2011

నందులొచ్చాయి...

లోకనాధం నాయుడు పాత్రకి వెండితెర మీద జీవం పోసిన నటుడు సాయికుమార్ కి 2010 సంవత్సరానికి గాను 'బెస్ట్ క్యారక్టర్ ఆర్టిస్ట్' గా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు లభించింది. ఇవాళ ప్రకటించిన నంది అవార్డుల్లో నాకు ఎక్కువ సంతోషాన్ని కలిగించిన రెండో అవార్డు ఇది. నిజానికి 'ప్రస్థానం' సినిమా చూశాక సాయికుమార్ కి ఉత్తమనటుడు అవార్డు వచ్చే అవకాశంతో పాటు, ఆ సినిమాకి 'ఉత్తమ చిత్రం' కేటగిరిలో అవార్డు వచ్చే అవకాశాలు ఉన్నాయనిపించింది.

ఎందుకంటే సినిమా చూస్తున్నంత సేపూ లోకనాధం పాత్రలో సాయికుమార్ ఎక్కడా నటించినట్టుగా అనిపించలేదు. అంత సహజంగా జరిగింది ఆ పాత్ర పోషణ. సాయికుమార్ మార్కు లౌడ్ నటనకి భిన్నంగా ఉంది. 'ప్రస్థానం' కి మొదటి ఉత్తమ చిత్రం, 'వేదం' సినిమాకి ద్వితీయ లేదా తృతీయ ఉత్తమ చిత్రం అవార్డులు వస్తాయనుకున్నాను కానీ, నా అంచనా తారుమారయింది. అలాగే 'వేదం' లో రాములు తాత పాత్ర వేసిన నటుడికీ లేదా కర్పూరం పాత్రదారికీ ఉత్తమ సహాయ నటుడు అవార్డు వచ్చే అవకాశం ఉందనిపించింది. కానీ అలా జరగలేదు.

'గంగ పుత్రులు' 'సింహా' మినహా, ప్రధాన విభాగాల్లో అవార్డులందుకున్నసినిమాలన్నీ చూశాను నేను. 'గంగ పుత్రులు' చూడనందుకు విచారంగా ఉంది. తక్కువ థియేటర్లలో విడుదలవ్వడం, తక్కువ సమయం మాత్రమే ఆడడం, ఆ సమయంలో నేను బాగా బిజీగా ఉండడంతో వీలుకాలేదు. గత సంవత్సరం 'సొంతవూరు' సినిమాకి ఉత్తమ చిత్రంగా నంది గెలుచుకున్న సునీల్ కుమార్ రెడ్డి, వరుసగా రెండో సంవత్సరం మరో నంది గెలుచుకున్నారు. ఈ సారి ద్వితీయ ఉత్తమ చిత్రం అవార్డు, 'గంగ పుత్రులు' సినిమాకి. సామాజిక సమస్యలని ఇతివృత్తాలుగా తీసుకుని ఈయన సినిమాలు తీస్తుండడం మెచ్చుకోవాల్సిన విషయం. డిస్క్ రాగానే ఈసినిమా చూడాలి.


ఉత్తమ తొలి చిత్ర దర్శకురాలిగా 'అలా మొదలైంది' సినిమాకి నందిని రెడ్డికి అవార్డు రావడం అభినందనీయం. ఇది పూర్తిగా దర్శకురాలి సినిమా. కానైతే, ఇదే సినిమాకి గాను నిత్య మీనన్ కి ఉత్తమ నటి అవార్డు ఇవ్వడం బాగా ఆశ్చర్య పరిచింది. పోటీ తక్కువగా ఉండడమో, లేక సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నందుకు జ్యూరీ ఈమెకి ఎక్కువ మార్కులు ఇవ్వడమో జరిగి ఉండాలి. వేణూ శ్రీకాంత్ గారిలాంటి 'నిత్యా'భిమానులకి అభినందనలు!! స్క్రీన్ ప్లే, టేకింగ్ లోపాల కారణంగా విజయం సాధించలేకపోయిన సినిమా 'అందరి బంధువయ' కి 'ఉత్తమ కుటుంబ కథా చిత్రం' అవార్డూ, దర్శకుడు చంద్ర సిద్ధార్థకి స్పెషల్ జ్యూరీ అవార్డూ వచ్చాయి.

'తెలుగమ్మాయీ..' పాట పాడిన సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఉత్తమ గాయకుడు అవార్డూ, 'బ్రోకర్' సినిమాకి కథ అందించిన మరో సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఉత్తమ కథా రచయిత అవార్డూ గెలుచుకున్నారు. ' సినిమా పాటతో ఏమాత్రం సంబంధం లేని కవి నందిని సిధారెడ్డి ఉత్తమ గీత రచయితగా అవార్డు గెలుచుకోవడం మరో విశేషం. 'మర్యాద రామన్న'కి గాను నాగినీడు కి 'ఉత్తమ విలన్' అస్సలు ఊహించలేదు. సునీల్ కి 'స్పెషల్ జ్యూరీ' ఇవ్వాల్సిందే. నటనతో పాటుగా డేన్సులు కూడా బాగా చేశాడు.

నా వరకు కొన్ని కొన్ని పూర్తి స్థాయి ఆశ్చర్యాలు కలిగిస్తూ, కొన్ని అంచనాలని తారుమారు చేస్తూ మరికొన్ని అంచనాలని నిజం చేస్తూ ప్రకటించిన నంది అవార్డులు, గత సంవత్సరంతో పోల్చినప్పుడు పెద్దగా వివాదాస్పదం కాలేదనే చెప్పాలి. మొత్తం మీద, అందరినీ సంతృప్తి పరచడంతో జ్యూరీ విజయం సాధించినట్టే. గతంతో పోల్చినప్పుడు ఈసారి పెద్ద సంఖ్యలో ఎంట్రీలు వచ్చినప్పటికీ, శ్రద్ధగా స్క్రూటినీ చేసి విజేతలని ఎంపిక చేసిన జ్యూరీకీ, అవార్డు విజేతలకీ అభినందనలు. రెండు మూడేళ్ళపాటు అవార్డులని పెండింగ్ పెట్టి, జనమంతా ఆ సినిమాలని మర్చిపోయాక అప్పుడు తీరికగా అవార్డులు ప్రకటించకుండా, సమయానికే అవార్డులు ఇచ్చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కూడా జేజేలు చెప్పాలిందే.

12 కామెంట్‌లు:

 1. అవునండీ..ప్రస్థానం కి.. నంది అవార్డ్ రాక పోవడం.. విచారకరం.మీలాగానే..నేను ..ఊహించాను.

  రిప్లయితొలగించు
 2. ప్రస్థానం సినిమా అవార్డు ఇచ్చిన ఇవ్వకపోయినా గత సంవత్సరం లో వచ్చిన బెస్ట్ సినిమా. నాకు ఈ నంది అవార్డ్లు లో పాలిటిక్స్ లేకపోతే ఆర్ట్ సినిమాలకి ఇస్తారు. పెద్ద నమ్మకం లేదు. లోబ్బ్యింగ్ కూడా ఎక్కువ ఉంటుంది

  రిప్లయితొలగించు
 3. దేనిమీదైనా.. మీ విశ్లేషణ చాలా బాగుంటుందండీ.

  ప్రస్థానం చూసినప్పుడు సాయికుమార్‌కి అవార్డు రావచ్చు అనుకున్నాను నేనూ. అయితే నన్ను ఎక్కువ మెప్పించింది మాత్రం ఆ సినిమా డైలాగ్సే.

  ఇక 'గంగపుత్రులు','సింహా' ల మీద మీ రివ్యూలకోసం చూస్తుంటాను. అవి నేనూ చూడలేదు.

  రిప్లయితొలగించు
 4. అలా మొదలయింది హీరోయిన్ నిత్య మీనన్ కి నంది రావడం కి జస్టిఫికేషన్ ఎమిటొ అంతు చిక్కడం లేదు.

  రిప్లయితొలగించు
 5. పరమ బోరు చక్ర లాంటి సినిమా తీసి కూడా దాసరి ఓ అవార్డు కొట్టేసినట్లున్నాడుగా :-)

  రిప్లయితొలగించు
 6. @వనజ వనమాలి: ధన్యవాదాలండీ..
  @వాసు: నిజమేనండీ.. కానీ శంఖంలో పోస్తే ఆ అందం వేరు కదా :)) ధన్యవాదాలు.
  @గీతిక: గంగపుత్రులు చూస్తానండీ, తప్పక.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 7. @సుమ: బహుశా పోటీ లేదనుకుంటానండీ.. ధన్యవాదాలు.
  @ఇనగంటి రవిచంద్ర: నేను చూడలేదండీ ఆ సినిమా.. జాతీయ సమైక్యతా చిత్రం అవార్డు వచ్చింది.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 8. చక్రికి,ఝాన్సీకి అవార్డు ఇవ్వటం మాత్రం హాస్యాస్పదం

  రిప్లయితొలగించు
 9. కిరణ్ గారికి బాలకృష్ణ గారు స్నేహితుడని ఎక్కడో చదివాను.
  స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆ రెండు సినిమాలకీ అవార్డులిచ్చారేమో?

  రిప్లయితొలగించు
 10. @రంగరాజు; మరికొన్ని కూడా హాస్యాస్పదాలు ఉన్నాయండీ!! ..ధన్యవాదాలు.

  @బోనగిరి: నేనూ విన్నానండీ.. నిజం నందికి ఎరుక !! ..ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 11. హహ మురళి గారు ధన్యవాదాలండీ.. నన్ను నిత్యాభిమానిగా గుర్తించాక నేనేం చెప్పినా వినాలనిపించకపోవచ్చు :-P ఐనా చెప్పడం నాధర్మం కాబట్టి చెప్తున్నాను :-) నిత్యకి అవార్డ్ రావడానికి మీరన్నట్లు సొంత గొంతుతో నటించే హీరోయిన్స్ లో పోటీ ఆట్టేలేకపోవడం ఒక కారణమై ఉండచ్చు. తనకు లాబీయింగ్ చేసే వాళ్లు కూడా ఎవరూ ఉండి ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం అందుకనే తను గెలుచుకోడానికి ఇతర కారణాలు కనపడటంలేదు.

  ఇక చాలా మందికి విస్మయం కలిగించడానికి కారణం.. మనమంతా అవార్డ్ విన్నింగ్ యాక్షన్ అంటే ఏడుపులూ అరుపులూ పెడబొబ్బలు.. లేదంటే సహజత్వం పేరుతో అన్యాయానికి గురై అసలు మాట్లాడకుండా నిర్వికారంగా ఎటో చూస్తూ ధీనంగా కూర్చోవడం ఇలాంటి పాత్రలు మాత్రమే అని ట్యూన్ చేయబడి ఉన్నాం. ఈ అమ్మాయి నవ్వుతూ తుళ్ళుతూ ఇచ్చిన పాత్రకి నూటికి నూరుపాళ్ళు న్యాయం చేసి అవార్డ్ తెచ్చుకోవడం జీర్ణించుకోలేకపోతున్నామేమో అని నా అనుకోలు. (ఇదంతా మీ అభిమానం అంటే నేనేం చెప్పలేను :-)

  ప్రస్థానం, సాయికుమార్ ల అవార్డ్ విషయంలో మీతే ఏకీభవిస్తాను.. హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని విభజించి చూసినా కూడా ఆ సినిమా లో ప్రథానపాత్ర లోకనాథం సినిమా అంతా అతని చుట్టూనే తిరుగుతుంది కనుక ఆ సినిమాకి అతనే హీరో అని నా ఉద్దేశ్యం.

  రిప్లయితొలగించు
 12. @వేణూ శ్రీకాంత్: నాకైతే విస్మయం ఏమీ కలగలేదండీ.. 'అష్టా చమ్మా' కి కలర్స్ స్వాతి కి ఇచ్చారు కదా 'నంది'.. కానైతే, నిత్య నంది రేసులో ఉంటుందని కూడా ఊహించక పోవడం వల్ల కలిగిన ఆశ్చర్యం అంతే.. ఇక సాయికుమార్ విషయంలో వాళ్ళ లెక్కలు వాళ్లకి ఉంటాయి కదండీ.. మొత్తానికి పక్కన పెట్టేయకుండా ఓ అవార్డు ఇచ్చారు కదా అని సంతోషించేయడమే.. ధన్యవాదాలు..

  రిప్లయితొలగించు