బుధవారం, ఆగస్టు 24, 2011

అరుంధతొచ్చింది...

అన్నా హజారే ప్రతిపాదించిన 'జన లోక్ పాల్' బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎవరూ ఊహించని వైపునుంచి మద్దతు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసిన కోరల్లేని లోక్ పాల్ బిల్లుని 'జోక్ పాల్' బిల్లుగా ఎద్దేవా చేస్తూ, ప్రధానిని కూడా బిల్లు పరిధిలోకి తెస్తూ తయారు చేసిన జన లోక్ పాల్ బిల్లుని ఆమోదించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఢిల్లీ రాంలీలా మైదానంలో నిరాహార దీక్ష మొదలు పెట్టిన అన్నా హజారేకి అన్ని రాజకీయ పక్షాల నుంచీ మద్దతు వచ్చింది.

అత్యంత అరుదుగా ఏకాభిప్రాయానికి వచ్చే వామపక్షాలు, బీజేపీ ఈవిషయంలో మాత్రం ఒకే నిర్ణయం తీసుకుని అన్నా దీక్షని సమర్ధించాయి. యూపీఏ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో దాదాపు ఏకాకిగా మారి, విమర్శలని ఎదుర్కొంటున్న తరుణంలో రంగ ప్రవేశం చేసింది వామపక్ష మేధావి అరుంధతీ రాయ్. బుకర్ ప్రైజ్ గెల్చుకున్న 'గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్' రచయిత్రిగా కన్నా, దళితులు, ఆదివాసీల సమస్యలపై ప్రభుత్వంతో పోరాడే సామాజిక ఉద్యమకారిణిగానే ఎక్కువమందికి తెలిసిన అరుంధతి అన్నా హజారే మీద తీవ్రమైన విమర్శలు చేయడం ద్వారా మళ్ళీ వార్తల్లోకి వచ్చారు.

అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేస్తున్న ఉద్యమాన్ని బీజేపీ-ఆరెస్సెస్ వంటి 'హిందూత్వ' సంస్థలూ, ఫోర్డ్ లాంటి బహుళ జాతి కంపెనీలూ స్పాన్సర్ చేస్తున్నాయన్నది అరుంధతి మొదటి ఆరోపణ. మరి, ఈ హిందూత్వ శక్తులు చేస్తున్న ఉద్యమానికి సెక్యులర్ పార్టీలైన వామపక్షాలు ఎందుకు మద్దతు ఇస్తున్నాయన్నది ఆవిడ చెప్పలేదు. వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, గనుల కేటాయింపు, భూసేకరణ కారణంగా నిర్వాసితులవుతున్న పేదల పక్షాన అన్నా హజారే ఎందుకు పోరాడడం లేదని సూటిగా ప్రశ్నించిన అరుంధతి, ఆ సమస్యలన్నీ పరోక్షంగా అవినీతితో సంబంధం ఉన్నవే అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోయారో మరి.

కార్పొరేట్ సంస్థలు, స్వచ్చంద సేవాసంస్థలని కూడా జన లోక్ పాల్ పరిధిలోకి తేవాలన్న చిత్రమైన ప్రతిపాదనని ముందుకు తెచ్చిన అరుంధతికి, ఈ సంస్థలమీద అజమాయిషీ చేయాల్సింది ప్రభుత్వమేననీ, ఆ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోడాన్ని ప్రశ్నిస్తూనే ఉద్యమం సాగుతోందనీ తెలియదని అనుకోలేం. అన్నా ఉద్యమంలో హడావిడి మాత్రమే కనిపిస్తోందనీ, దళితులు, ఆదివాసీలకి ఆ ఉద్యమం వల్ల ఒరిగేది శూన్యమనీ అభిప్రాయ పడ్డ ఈ రచయిత్రి, ఆయా వర్గాల ప్రయోజనాలని కాపాడే విధంగా ఉండేందుకు ఉద్యమంలో చేయాల్సిన మార్పులని సూచించి ఉన్నా బాగుండేది.

నిజానికి అన్నా ఉద్యమం సర్వ రోగ నివారిణి కానే కాదు. అలాగే, జన లోక్ పాల్ బిల్లు అన్ని సమస్యలకీ పరిష్కారమూ కాదు. కానైతే, ప్రభుత్వం ప్రతిపాదించిన లోక్ పాల్ బిల్లుకన్నా శక్తివంతమైన జన లోక్ పాల్ బిల్లు వల్ల అనేక రెట్లు ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నది నిర్వివాదం. ఆ బిల్లుని స్వీకరించి, దేశ వ్యాప్త చర్చ జరపడం అవసరం. ఎందుకటే, ప్రభుత్వం లోక్ పాల్ బిల్లుని ప్రవేశ పెట్టే ముందు ఏ రాజకీయ పక్షంతోనూ చర్చించలేదు. ఎవరి అభిప్రాయాలూ తీసుకోలేదు. కొరియా, జపాన్ లాంటి దేశాల్లో అధ్యక్షులు అంబుడ్స్ మన్ పరిధిలోనే పనిచేస్తున్నారు. మరి, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో ప్రధానిని లోక్ పాల్ పరిధిలోకి తేడానికి అభ్యంతరాలు ఏమిటన్నవి అర్ధం కాదు.

అన్నా హజారే దీక్షపై అరుంధతీ రాయ్ సంధించిన విమర్శనాస్త్రాలు కాంగ్రెస్ పార్టీకి కొంత ఊరట ఇస్తాయనడంలో సందేహం లేదు. అనేకానేక రాజకీయ కారణాలతోనూ, సిద్ధాంత పరంగానూ అరుంధతి కాంగ్రెస్ తో విభేదించవచ్చునేమో కానీ, జన లోక్ పాల్ బిల్లు విషయంలో ఏకాకిగా మారిన కాంగ్రెస్ కి ఆమె పరోక్షంగా మద్దతు ఇచ్చినట్టే అయింది. అన్నా శిబిరం అప్పుడే అరుంధతికి జవాబులివ్వడం మొదలు పెట్టింది. వామపక్షాలు ఏమంటాయో చూడాలి. బహుశా అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం అనొచ్చు. వామపక్ష రాజకీయ పరిభాషలో చెప్పాలంటే, అరుంధతి చేసింది 'చారిత్రిక తప్పిదం' అవుతుందా? ...కాలమే జవాబు చెప్పాలి.

25 కామెంట్‌లు:

  1. అవనీతి గురించి..చర్చించాలంటే అదొక పెద్ద చాట భారతమే అవుతుంది..! అదొక గొలుసుకట్టులాంటిది..ఒకదానికి మరొకటి అనుసరణ వుంటుంది..! ఇలాంటి సమయంలో మోకాలో బుర్ర ఉన్నవారిలా వ్యాక్యలు చేసారు అరుంధతి..ప్చ్

    రిప్లయితొలగించండి
  2. మురళిగారు, మీ ఊరికి ఏనుగు వచ్చిందనుకోండి..మీరు ఏనుగును చూస్తారా లేక దాని వెనుక పడ్డ వాటిని చూస్తారా? ఇదే అంతే.

    వార్తల్లో నిలవాలంటేనో, కొత్తగా రాసిన పుస్తకాలు అమ్ముకోవాలంటేనో ఇలా మీడియా ముందు ఏదోకటి చెప్పాలి మరి. రచయితల/రచయిత్రిల మాటలు అస్సలు నమ్మకూడదు, వాళ్ళు నాయకులు లేదా ప్రతినాయకులు ఎవ్వరినయినా హైలైట్ చెయ్యగలరు.

    నా వ్యాఖ్య ఘాటుగా ఉంటే ఉపసంహరించగలరు.

    రిప్లయితొలగించండి
  3. ఈ అరుంధతీని యూపీఏ/కాంగ్రేస్ స్పాన్సర్ చేస్తున్నాదేమో?!

    రిప్లయితొలగించండి
  4. అసలు అన్నా హాజారే మీద విమర్శలు చేయటానికి అరుంధతి రాయ్ నైతిక హక్కు లేదు (ఇది నా అభిప్రాయం మాత్రమే) . అరుంధతి రాయ్ ఇప్పటి వరకు చేసిన పనల్లా దళితులు, ఆదివాసీలకి కేవలం "లిప్ సింపతి" చూపించటం మాత్రమే . పైగా ఏ కార్పోరేట్ రాజకీయాలు అంటూ ఆవిడ విమర్శలు చేస్తుందో అదే మనుషుల డబ్బుతో ఆవిడ అనుభవించే సౌకర్యాలు , విదేశీ పర్యటనలు ముందు మానేసి తరవాత విమర్శ చేస్తే బావుంటుంది .

    ఇక అన్నా మీద విమర్శలు చేసే వారందరూ గుర్తు చేసుకోవాల్సిన విషయం , ఇక్కడ అవినీతి కి అతీతులు ఎవరూ లేరు, అలాగే ఏ బిల్లుతో వెంటనే భారతదేశం స్వర్గం లాగ మారిపోదు , కాని ఈ వయస్సులో జవ చచ్చి , మనకి వెన్నుముక ఉంది మర్చిపోయిన మనుషుల్లో ఆయన తెచ్చిన చైతన్యం తప్పక గుర్తించాల్సిన విషయం . అలాగే మనం మనుషులం మనికి ఆలోచించే శక్తి ఉంది , మెషిన్ల మాదిరి గుడ్డి గా ప్రభుత్వానికి వ్యతిరేకం గా ఉన్న pressure groups అన్నిటిని ఒక గాటిన కట్టటం మానెయ్యాలి .

    రిప్లయితొలగించండి
  5. అవినీతి అంతం అవుతుందా లేదా అనేది తర్వాతి సంగతి అన్నా ఉద్యమం సమాజానికి చేసిన మేలు చాలా విస్తృతమైనది. మా ఫ్రెండ్స్ లో బిల్లుకీ, చట్టానికీ తేడా కానీ, పార్లమెటుకీ, ప్రభుత్వానికీ తేడా కానీ తెలియని వారు నాకు తెలుసు. వాళ్ళు ఈ రోజు ఈ బిల్లు చట్టమైతే ఏర్పడే రాజ్యాంగ శక్తి గురించి మాట్లాడుకుంటున్నారు. తమ నెత్తిన రుద్దుతున్న చట్టాలూ, జీవోల గురించి ఏ అవగాహనా పెంచుకోకుండా సినిమాల గురించి, క్రికెట్ గురించి మాత్రమే చర్చిస్తున్న తరాన్ని మేల్కొలిపాడు హజారే. కొన్నాళ్లకి చట్టసభల్లో ప్రవేశపెడుతున్న బిల్లుల గురించీ, ప్రభుత్వ పాలసీల గురించీ యువత విస్తృతంగా చర్చించుకుంటూంటే ప్రజా ప్రతినిధులు జడవరా? ఇంత మంచి కార్యక్రమానికి ఏ బహుళజాతి సంస్థో, రాజకీయ పార్టీనో పెట్టుబడి పెట్టి జనాన్ని జాగృతం చేసి నెత్తిమీదకి తెచ్చుకుంటుందనుకోను.
    ఇక అరుంధతీరాయ్ ఈ స్థాయిలో కార్యాచరణ ఏం చేశారని హజారేని గురించి మాట్లాడుతున్నారు.

    రిప్లయితొలగించండి
  6. u r 1000% correct,

    v(all including arundati)
    dnt ve d moral right
    2
    comment
    anna hazare...
    he is fighting fr right cause...
    it is our basic rspnsblty 2 support him,
    not 2 comment......

    రిప్లయితొలగించండి
  7. అన్నా హజారే ని సపోర్ట్ చేసే ప్రజలందరికీ ఒక చిన్న ప్రశ్న.
    బిల్లు పాస్ ఐందా లేదా తర్వాత చూద్దాం. మిమ్మల్ని పోలీస్ పట్టుకున్నాడు రోడ్డు మీద డ్రైవ్ చేస్తూంటే. లంచం ఇచ్చేసి పది నిముషాల్లో వెళ్ళిపోవచ్చు. ఇవ్వకుండా కోర్టు చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ రోజుల తరబడి తిరగొచ్చు. అన్నా హజారే ని సమర్ధిస్తున్న ఓ ప్రజలారా మీరు లంచం ఇవ్వకుండా పోరాటం సాగిస్తారా? గుండెలమీద చెయ్యేస్కుని చెప్పండి. సపోజ్ బిల్లు వచ్చిందనుకోండి. అప్పుడు మీరు లంచం ఇవ్వడం మానేస్తారా (ఉదాహరణకి, తిరుపతి కొండ మీద లంచం ఇవ్వకుండా పెద్ద కళ్యాణం టికెట్ సంపాదించండి చూద్దాం).

    మనుషులు మారనంతవరకూ ఏ చట్టాలొచ్చినా ఆఖరికి గాంధీ బాబు దిగొచ్చినా అవనీతి ఇలాగే ఉంటుంది. పెద్దమనుషులు (జై ప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు) చెప్తూ ఉంటారు - ఈ దేశాన్ని మామూలు మనుషులు మార్చవచ్చు. నిజమే అందరికీ ఆయనలాంటి డబ్బూ దస్కం ఉంటే ఉద్యోగాలు మానేసి దేశాన్ని ఉద్ధరించొచ్చు. ఉత్సాహంతో అందరితోటి జై జై అని నినాదాలు కొట్టడం వేరు, జీవితం వేరు.

    ఉపవాసాలు చేసేవాళ్ళకీ, చేయించేవాళ్ళకీ, కుర్చీల్లో కూర్చున్నవాళ్ళకీ ఇవన్నీ తెల్సు. మనం జనం అంతా పిచ్చి వెధవలం కాబట్టి మనందరం డాన్స్ చేస్తూంటే వాళ్ళకో ఆనందం.

    రిప్లయితొలగించండి
  8. 'కార్పొరేట్ సంస్థలు, స్వచ్చంద సేవాసంస్థలని కూడా జన లోక్ పాల్ పరిధిలోకి తేవాలన్న చిత్రమైన ప్రతిపాదనని ముందుకు తెచ్చిన అరుంధతికి'.....వీటిల్లో ఇసుమంత అయినా అవినీతి లేదా?ప్రజలతో సంబంధం ఉన్న ప్రతీ సంస్థ లో ఎంతో కొంత అవినీతి లేదా?"సత్యం" కార్పోరేట్ కాదా?

    రిప్లయితొలగించండి
  9. /మనుషులు మారనంతవరకూ ఏ చట్టాలొచ్చినా ఆఖరికి గాంధీ బాబు దిగొచ్చినా అవనీతి ఇలాగే ఉంటుంది. ..ఉత్సాహంతో అందరితోటి జై జై అని నినాదాలు కొట్టడం వేరు, జీవితం వేరు./

    ఆహా.. జీవితం కాచి వడపోసి డికాషన్ చేసిన అర్ధనగ్న సత్యం చెప్పారండి! 10రోజులుగా కంటికలక వున్న ఎడమకంటిని తెరిపించారు!
    / అన్నా హజారే ని సమర్ధిస్తున్న ఓ ప్రజలారా మీరు లంచం ఇవ్వకుండా పోరాటం సాగిస్తారా? గుండెలమీద చెయ్యేస్కుని చెప్పండి./
    మరీ ఇంత తెలివైన ప్రశ్న, సూటిగా అడిగేస్తే ఎలాగండి?! హమ్మ్.. లంచం ఇచ్చి బయట పడతా, కాని రహస్యంగా వీడియో తీస్తా, లేదా ఎవరో TV9 వాళ్ళు తీస్తారు. కోర్టులో కేసేసి 10ఏళ్ళు కోర్టులచుట్టూ తిరుగుతా. ఓ 50వేలు ఖర్చవుతుంది, హైకోర్ట్ పోతా, పోలీసుకు వారం శిక్ష, 50రూ జరిమానా పడుతుంది. లోక్పాల్ చట్టం రాకుండా అడ్డుపడిన శిఖండులందరికీ పోలీసు జేజేలు చెప్పి, ఈసారి నన్నే పట్టుకుని 10వేలు లాగుతాడు. మళ్ళీ కోర్టెక్కుతా...
    నా సమాధానం మీకు 'సంతృప్తి' ఇచ్చిందనుకుంటా...

    రిప్లయితొలగించండి
  10. @హరే కృష్ణ: ధన్యవాదాలండీ..
    @కమల్: నిజం.. ధన్యవాదాలండీ..
    @శ్రీ: ఘాటేమీ లేదండీ, విషయమే ఘాటుగా ఉంది కదా! ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @నాగేస్రావ్: మిత్రులొకరు ఇదే సందేహం వెలిబుచ్చారండీ!! ధన్యవాదాలు.
    @శ్రావ్య వట్టికూటి: మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.. ఫలితం ఏమైనప్పటికీ, అన్నా ఉద్యమం 'కెరీర్ ఓరియంటడ్' గా ముద్ర పడ్డ ఇప్పటి యువత, అవసరమైతే ప్రభుత్వంతో పోరాడగలరన్న సంకేతాన్ని పంపింది.. ధన్యవాదాలు.
    @పక్కింటబ్బాయి: బిల్లుకీ, చట్టానికీ భేదం....నిజమండీ.. ఇలాంటివి జరిగినప్పుడే పెద్దగా అవగాహనా, ఆసక్తీ లేనివారికి కూడా కొన్ని తప్పక తెలుసుకోవలసిన విషయాలు అర్ధమవుతాయి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. @భూపతిరాజు విహంగ్: ధన్యవాదాలండీ..

    @డీజీ: తిరుపతి కొండ మీద లంచం ఇవ్వకుండా కల్యాణం టిక్కెట్ సంపాదించ వచ్చండీ.. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఆ టిక్కెట్లో మన టర్న్ వచ్చే వరకూ ఆగకుండా, నేను ఇవాలే కల్యాణం చేయించేసుకోవాలి అనుకుంటాం చూడండి, అక్కడ. అన్నా ఉద్యమం సర్వ రోగ నివారిణి అన్న భ్రమలేవీ లేవు. కాకపొతే ప్రజల్ని 'టేకిట్ ఫర్ గ్రాంటెడ్' గా తీసుకునే వాళ్లకి, అదంత సులువు కాదన్న సంకేతాలు వెళ్ళడం అన్నది మొదటి ప్రయోజనం. అలాగే, అవినీతి మీద, లంచం ఇవ్వక తప్పని పరిస్థితుల మీదా జనం ఎంతగా విసిగిపోయారన్నది కూడా ప్రపంచానికి తెలిసింది ఈ ఉద్యమం వల్లనే. ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. @సుభాషిని పోరెడ్డి: లేదు అని నేను అనడం లేదండీ.. వాటిని చెక్ చేయాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా? చేయకుండా అవినీతి జరుగుతున్నా ఎందుకు ఊరుకుంది? అవినీతి వల్లెనే కదా? సమస్యకి మూలకారణం మీద పోరాటం జరుగుతున్నప్పుడు, అందులో అంతర్భాగమైన విషయాలని ప్రత్యేకంగా ప్రస్తావించలేదనడం ఎలా ఉందో చెప్పండి? ...ధన్యవాదాలు.

    @Snkr: మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  14. /పెద్దమనుషులు (జై ప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు) చెప్తూ ఉంటారు - ఈ దేశాన్ని మామూలు మనుషులు మార్చవచ్చు. నిజమే అందరికీ ఆయనలాంటి డబ్బూ దస్కం ఉంటే ఉద్యోగాలు మానేసి దేశాన్ని ఉద్ధరించొచ్చు/

    అంత కంటే వంద రెంటు డబ్బూ దస్కం ఉన్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు. మరి ఎందుకు ఉద్ధరించట్లేదో. మీ ధోరణి చూస్తే ఎంత కావస్తే అంట సంపాదించే అవకాసం ఉన్నా అవన్నీ వదులుకుని దేశానికి ఏదో చెయ్యాలనుకోవడం కూడా తప్పల్లె ఉంది. అన్నీ ఇంతే, ఇవి మారావ్ అన్న నిరాశావాదం నిన్నటి సంగతి. ఆశావాదం ఈ తరం ఆయుధం. మీరు ఇలా చూస్తూ ఉండండి. వచ్చే పదేల్లల్లో ఎన్ని మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయో దేశం లో లోక్ సత్తా వల్ల కానీ, ఇతరత్రా మేల్కొన్న యువత వల్ల కానీ.

    ఇక మీ లంచం ప్రశ్న - అలా ఇవ్వని వాళ్ళు బోలెడు మంది ఉన్నారు అన్నా హజారే ని సపోర్ట్ చేసే వాళ్ళల్లో. ఆ లక్షణం మెల్ల మెల్లాగా వ్యాపిస్తోంది.
    అసలా అలా లంచం ఇవ్వాల్సిన అవసరం లేని వ్యవస్థని కోరుకుంటున్నారు ప్రజలు. ఇలా మారినవి మన కళ్ళ ముందే బోలెడు ఉన్నాయి - ఈ సేవ, టెలిఫోన్ కనెక్షన్ లు, రైల్వే టికెట్ లు (చాలా మతుక్కు తగ్గాయి) .

    రిప్లయితొలగించండి
  15. ఇక అరుంధతి రాయ్ ఆర్టికల్ అబద్దాల పుట్ట ఎంత విష ప్రచారం చేసిందో ఈ కింద లంకె లో చూడచ్చు.

    ఈ విధంగా అయినా పొపులర్ అవుదామని చూస్తోందేమో. ఆవిడా రాసిన పుస్తకాలు బొత్తిగా అమ్ముడు అవ్వట్లేదేమో పాపం.

    http://clearvisor.wordpress.com/2011/08/23/why-i%E2%80%99d-rather-be-anna-than-arundhati/

    రిప్లయితొలగించండి
  16. అందులో ఉన్న విషయాన్ని మళ్లీ ప్రత్యేకంగా ప్రస్తావించమని తను అంటే....అది ...అయితే అజ్ఞానం అవుతుంది గానీ.."చిత్రమైన ప్రతిపాదన" ఎలా అవుతుంది?

    రిప్లయితొలగించండి
  17. పుస్తకాలలోని రాతల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చెయ్యగలిగే రోజులు కావు ఇవి. ఈ ఉద్యమాల వలన సామాన్య మానవుడికి ఒనగూరేది శూన్యం. దాని కన్నా నిజంగా ప్రజలకు సేవ చెయ్యాలను కునేవారు వారి వారి వూరి అభివ్రుద్ధ్హి కోసం ఉద్యమాలు చేపట్టాలి, అక్కడ కనీసం ఒక్క కుటుంబాన్ని అయినా దత్తత తీసుకోవాలి. ప్రజలను చైతన్య వంతులను చెయ్యాలి.ఈ అవినీతి నిర్మూలన మన నుంచే మొదలవ్వాలి. గ్రామ స్థాయిలో ఒక్క అన్నా లాంటి వ్యక్తి అయిన వుంటే చాలు.

    రిప్లయితొలగించండి
  18. @వాసు: మంచి లంకెని పంచుకున్నందుకు ధన్యవాదాలండీ.. కొంచం ఘాటుగానే రాశారు ఎవరో....
    @సుభాషిని పోరెడ్డి: ఆమెది అజ్ఞానం అయి ఉండొచ్చన్న భావన కలగక పోవడం వల్లనేమోనండీ, ఆ ప్రతిపాదన చిత్రంగా అనిపించింది నాకు..
    @తొలకరి: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  19. అరు౦ధతి రాయ్ ఏమ౦దో కాని , ఇక్కడ మీ వ్యాఖ్య ప్రకారం, అ౦దరినీ వదిలేసి 'ప్రధాన మ౦త్రి' ఒక్కడిని లోక్పాల్ పరిధిలో తెస్తే సరిపోతు౦దేమొ .అ౦దరిపై అజమాయిషీ చేసేదీ ప్రధానమ౦త్రేగా, ఆయనకీ అజమాయిషీ లేనివేమన్న ఉ౦టే అవి మాత్ర౦ చేరిస్తే సరిపోతు౦ది కదా :)

    /కార్పొరేట్ సంస్థలు, స్వచ్చంద సేవాసంస్థలని కూడా జన లోక్ పాల్ పరిధిలోకి తేవాలన్న చిత్రమైన ప్రతిపాదనని ముందుకు తెచ్చిన అరుంధతికి, ఈ సంస్థలమీద అజమాయిషీ చేయాల్సింది ప్రభుత్వమేననీ/.

    రిప్లయితొలగించండి
  20. అ౦దరిపై అజమాయిషీ చేసేదీ ప్రధానమ౦త్రేగా
    ------------------------------------
    అబ్బో ఇక్కడ పార్లమెంటరీ తరహ ప్రభుత్వ విధులు వగైరా వగైరా గురించి ఎవరన్నా కొంచెం చెప్పే వాళ్ళు కావాలనుకుంటా !

    రిప్లయితొలగించండి
  21. @Mauli: మీ వ్యంగ్యం అర్ధమయ్యిందండీ.. ఇప్పుడు వెలుగులోకి వస్తున్నా అనేక స్కాముల్లో నిందితులుగా ఉన్నవాళ్ళని ప్రధాని రక్షించడానికి ప్రయత్నించారన్నది ఒక ముఖ్య ఆరోపణ. ఈ సందర్భంలో, ప్రధానిని బిల్లు పరిధిలో చేర్చడానికి ఒప్పుకోక పోవడం సహజంగానే చాలా అనుమానాలు కలిగిస్తుంది కదా.. కేవలం ప్రధానిని బిల్లు పరిధిలోకి తేవడం వల్ల అవినీతి సమూలంగా రూపు మాసిపోతుందన్న భ్రమలైతే లేవు లెండి.. ధన్యవాదాలు.
    @శ్రావ్య వట్టికూటి: నాకైతే వ్యంగ్యం వినిపించిందండీ..

    రిప్లయితొలగించండి
  22. మురళి గారు ఆ కామెంట్లో వ్యంగం అర్ధం అయ్యింది , చెప్పేది తప్పు మళ్ళీ దాన్లో వ్యంగం కూడానా అని నా ఉద్దేశ్యం !

    రిప్లయితొలగించండి
  23. అలాగే ఇప్పుడు ఉన్న లోక్పాల్ చట్ట౦ ద్వారా, సత్యం కంప్యూటర్స్ లా౦టి స్కాములు బయటపెట్టగలరా. (రామలింగారాజులా తనకు తానూ బయటపడే పరిస్థితి రాక ము౦దే ). ఇక్కడ ప్రభుత్వానికి స౦బ౦ధమ్ లేకపోవచ్చు , కాని ఆడిటింగ్, బా౦కి౦గ్ స౦స్థలు ఉన్నాయి, ఇ౦కా చాల స౦బ౦ధిత లిస్టెడ్ క౦పెనీలు ఉన్నాయి. మీరు చర్చి౦చారు కాబట్టి నా ప్రశ్న, అరు౦ధతి రాయ్ వ్యాఖ్యలు నేను చూడలేదు.

    అలాగే అన్నా హజారే సూచి౦చినవి మాత్రమె ఆమోదయోగ్యమైన అంశములు కాకపోవచ్చు. అ౦దరినీ మాట్లాడనివ్వాలి.

    రిప్లయితొలగించండి
  24. @శ్రావ్య వట్టికూటి: విషయం ఒకటే అయిన చెప్పే విధాలు వేనవేలు కదండీ..

    @Mauli: "నిజానికి అన్నా ఉద్యమం సర్వ రోగ నివారిణి కానే కాదు. అలాగే, జన లోక్ పాల్ బిల్లు అన్ని సమస్యలకీ పరిష్కారమూ కాదు. కానైతే, ప్రభుత్వం ప్రతిపాదించిన లోక్ పాల్ బిల్లుకన్నా శక్తివంతమైన జన లోక్ పాల్ బిల్లు వల్ల అనేక రెట్లు ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నది నిర్వివాదం. ఆ బిల్లుని స్వీకరించి, దేశ వ్యాప్త చర్చ జరపడం అవసరం. "

    ఇదండీ నేను రాసింది...

    రిప్లయితొలగించండి