గురువారం, ఫిబ్రవరి 12, 2009

జీవకారుణ్యం

అప్పుడు నేను రెండో తరగతో, మూడో తరగతో చదువుతున్నా.. ఇల్లు, బడి తప్ప మరో ప్రపంచం ఉండేది కాదు. ఆటలకి వెళ్ళడం మీద ఆంక్షలు ఉండేవి కాబట్టి బడి నుంచి తిన్నగా ఇంటికే. ఇంటి చుట్టుపక్కల చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్లు ఆడుకుంటుంటే నేను కిటికీ లోంచి చూస్తూ ఉండేవాడిని. ఓ రోజు నాన్న ఎక్కడికో బయటకు వెళ్ళారు. గణేష్, మరికొందరు పిల్లలు ఆటలకి మా ఇంటివైపు వచ్చారు. నాన్న లేరని తెలిసి ఇంటికి వచ్చి నన్నుకూడా ఆటలకి పంపమని బతిమాలారు. 'వాళ్ల నాన్నగారొస్తే కోప్పడతారు.. మీరంతా ఇక్కడే ఆడుకోండి' అని షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చింది అమ్మ. మొత్తం ఓ ఏడెనిమిది మంది పిల్లలం పోగయ్యాం. అమ్మ షరతులకి లోబడి ఆడ గలిగే ఆట ఏదీ కనిపించడం లేదు. పైగా ఏ క్షణం లో నాన్న వస్తే ఆ క్షణంలో ఆట కేన్సిల్ అయిపోతుంది. అందరం కలిసి ఆలోచించి దాగుడు మూత దండాకోర్ మొదలుపెట్టాం.

ఈ ఆటలో లీడర్ ఒకరికి కళ్లు మూసి ఓ కర్ర పుల్లతో అందరి చేతులూ తాటిస్తూ ఒక్కొక్కరినీ పారిపొమ్మని చెబుతాడు. అందరూ పారిపోయాక కళ్లు మూసుకున్న అతను/ఆమె పారిపోయి దాక్కున్న వాళ్ళందరినీ పట్టుకోవాలి. మొదట ఎవరు దొరికితే వాళ్ల కళ్లు మూసి మళ్ళీ ఆట మొదలు పెడతారన్న మాట. ఎవరి ఇళ్ళలోనూ దాక్కో కూడదు లాంటి కండిషన్స్ ఉంటాయి. కొంచం పెద్ద పిల్లలు టీం లీడర్ గా ఉంటారు. అమ్మాజీ మా టీం లీడర్. ముందుగా చెల్లాయి (అది అమ్మాయి పేరు) వంతు వచ్చింది. లీడర్ ఆమె కళ్లు మూసి ఒక్కొక్కరినీ పారిపొమ్మని చెబుతోంది. అందరం దాక్కున్నాం. ఇంతలొ చెల్లాయి వాళ్ల అన్నయ్య హనుమాన్ 'తాంబేలు..తాంబేలు' అని అరిచాడు. ఏమిటో అని అందరం ఓ చోట మూగాం. ఓ చిన్న తాబేలు, ఎక్కడినుంచో తప్పిపోఇనట్టు ఉంది.. అందరం చుట్టూ మూగేసరికి డిప్పలోకి ముడుచుకుపోయింది.

ఇక అది మొదలు, అందరూ ఆట విషయం మర్చిపోయి గోల గోలగా మాట్లాడ్డం మొదలుపెట్టారు. ఎవరెవరు, ఎప్పుడెప్పుడు ఎంత పెద్ద తాంబేలుని చూశారో మిగిలినవాళ్ళు వింటున్నారో లేదో పట్టించుకోకుండా చెప్పేస్తున్నారు. కొంతమంది తాంబేలు మాంసం తినేవాళ్ళు ఉంటారట..తాబేటి చిప్పలలో అడుక్కునే వాళ్లు డబ్బులు దాచుకుంటా రట.. ఇలా నాకు అప్పటివరకు తెలియని చాలా విషయాలు తెలిశాయి. పాపం, మా కళ్ళ బడ్డ తాబేలు కదులు మెదులు లేదు. 'సరే..ఇప్పుడు దీన్ని ఏంచేద్దాం?' అమ్మాజీ కి కర్తవ్యం గుర్తొచ్చింది. మళ్ళీ ఎవరికి తోచింది వాళ్లు చెబుతున్నారు. ఎదురుగా ఉన్న చెరువులో వదిలేయాలన్న ప్రతిపాదన వచ్చింది కాని, చాలా మంది ఒప్పుకోలేదు. 'చెరువులో ఐతే మళ్ళీ మనం చూడడానికి ఉండదు' అని కొందరు 'మిగిలిన తాంబేల్లు దీనిని బతకనివ్వవేమో' అని మరికొందరు సందేహాలు వ్యక్తం చేశారు. మొత్తానికి మా కళ్ళ బడ్డ తాబేలుని రక్షించడం మా బాధ్యత అనే విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదిరింది.

ఇంతలొ కొంతమంది పిల్లల కళ్లు మా కాంపౌండ్ లో ఉన్న నూతి మీద పడ్డాయి. 'దీని నూతిలో వదిలేస్తే..' మళ్ళీ చర్చోపచర్చలు. మొత్తానికి ఏకాభిప్రాయం కుదిరింది. అమ్మాజీ వాళ్లు అమ్మతో సంప్రదించారు. అప్పటికి దీపాలు పెట్టె వేళయ్యింది. 'తాంబేలుని నీళ్ళలో వదిలేముందు పూజ చేయాలండి..' అమ్మాజీ చెప్పింది. అసలే దేవుడికి సంబంధించిన విషయాల్లో ఏమాత్రం రాజీ పడని అమ్మ వెంటనే పసుపు, కుంకం, హారతి తెచ్చేసింది. ఇద్దరు ధైర్యస్తులు తాబేలుని చేత్తో పట్టుకుని ఓ పెంకుముక్క మీదకి ఎక్కించారు. నూతి గట్టుమీద పూజ చేసి, మేమందరం దండాలు పెట్టుకున్నాక (ఎప్పటిలాగే బాగా చదువుకోవాలి, నాన్న నన్ను కొట్టకూడదు అని మొక్కేసుకున్నా) పెంకు ముక్కను చేదలో జాగ్రత్తగా దింపి, అటుపై నూతిలో దింపారు. ప్రసాదంగా అమ్మ అందరికీ అటుకులు పంచింది. అందరూ ప్రసాదం తింటుండగా దూరంగా నాన్న సైకిల్ బెల్ వినిపించింది. నా మనసెందుకో కీడు శంకించింది.

ఫ్రెండ్స్ అందర్నీ వీధిలోనే వదిలేసి పుస్తకాల సంచీ దగ్గరికి పరుగు తీశా. అమ్మ వాళ్ళతో కబుర్లు చెబుతుండగానే నాన్న వచ్చేశారు. 'చదువు సంధ్యా లేకుండా ఏం చేస్తున్నారిక్కడ?' అని వాళ్ళని కొంచం ఘాటుగానే పలకరించారు. తిట్టే విషయంలో ఆయనకి తన పిల్లలు, పరాయి పిల్లలు అనే భేదాలు లేవు. ఆటల విషయాన్ని తెలివిగా తప్పించి, ఎంత కష్టపడి తాంబేలుని రక్షించామో కథలు కథలుగా చెప్పారు వాళ్లు. 'నూతిలో ఎందుకు వదిలారు?' అంటూ నూతి దగ్గరకి వెళ్ళారు నాన్న. 'ఇదింకా నీళ్ళలోనే తేలుతోంది' అంటూ చేద వేసి తాబేలుని బయటకి తీశారు. నేల మీదకి దింపగానే కొంచం కదిలి పాకడం మొదలు పెట్టింది. 'ఎవరు దీన్ని నూతిలో దింపింది? ఇది మెట్ట తాబేలు..నీళ్ళలో బతకదు' అన్నారు సీరియస్ గా. ఎవ్వరూ కిక్కురుమనలేదు. 'వాళ్ళంటే పిల్లలు..తెలీదు..నువ్వైనా చెప్పొద్దూ..' ఈసారి గాలి అమ్మ మీదకి మళ్ళింది. పాపం అమ్మ మాత్రం ఏం చెబుతుంది. పూజ హడావిడిలో తనసలు తాబేలుని చూస్తే కదా. ఈ గొడవ జరుగుతుండగానే తాబేలు మెల్లగా పాక్కుంటూ పొదల్లోకి వెళ్ళిపోయింది.

7 కామెంట్‌లు:

  1. ఏం చెప్పమంటారు చెప్పండి? చిన్నప్పటి ఆటలు గుర్తుకు తెచ్చారు...

    అన్నిరకాల తాబేళ్ళూ నీళ్ళలో మనగలవనుకునేవాడిని..

    మెట్టతాబేలు .ఓకె.. ఇంకొకవిషయమూ తెలిసింది..

    రిప్లయితొలగించండి
  2. @ఉమాశంకర్: నాకూ అప్పుడే తెలిసిందండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. నీళ్ళలో బతకని తాబేళ్ళు కూడా ఉంటాయా!!!!!!!!

    రిప్లయితొలగించండి
  4. 'తాంబేలు ' :)) చిన్నప్పుడెందుకో చాలా మంది ఇలానే పిలిచేవాళ్ళం! నేను చాలా పెద్దయ్యాక కూడా మా పిన్ని పిల్లలకి తాంబేలనే నేర్పిస్తుంటే మా నాన్న కోప్పడ్డారు..

    రిప్లయితొలగించండి
  5. @పిచ్చోడు: ధన్యవాదాలు
    @నిషిగంధ: ఎంత నిశితంగా చదువుతున్నారు..! ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. ఆహా.. మురళి గారూ..
    భలే ఉందండీ మీ తాంబేలు కథ.. మేము కూడా అలానే అనేవాళ్ళం. నాకిప్పటికి కూడా తాంబేలు అంటే బావుంటుందని అనిపిస్తుంది. కాకపోతే బాగోదేమో అని అనననుకొండీ ;)
    చిన్నప్పుడు తాబేలు నీళ్ళల్లోనూ, బయట ఉంటుందని తెలుసు గానీ.. నీళ్ళల్లో ఉండలేనివి ఉంటాయని తెలీదు నాకు. తరవాత పెద్దయ్యాక సైన్సు చదువుల వల్ల తెలిసిందనుకొండీ :)
    మేము కూడా ఆటల మధ్యలో ఒకోసారి మా ఇంటి ముందున్న బావి చుట్టూ చేరి.. తాబేలు కనిపిస్తుంది చూసారా..అదిగో అక్కడ.. ఇక్కడ అంటూ.. ఒక గంటసేపు బావి చుటూ తిరిగే వాళ్ళం.. ఆ రోజులు గుర్తుకొచ్చాయి మీ పోస్టు వల్ల ఇవ్వాళ :)

    రిప్లయితొలగించండి
  7. @మధురవాణి: వచ్చేశారా..ఈసారి కొంచం లేట్ అయినట్టున్నారు కదా.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి