ఆదివారం, ఆగస్టు 14, 2011

సుస్వర 'వాణి'

నేను అభిమానించే సిని నేపధ్య గాయనులలో ఒకరైన వాణి జయరాం కచేరీలు నాలుగైదింటికి హాజరవ్వగలిగే అవకాశం దొరికింది నాకు. గతంతో పోలిస్తే ఈమధ్య కాలంలో కొంచం తరచుగానే కచేరీలు చేస్తున్న వాణి జయరాం, సినిమా రంగంలోకి అడుగుపెట్టి నలభయ్యేళ్ళు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈటీవీ నిర్వహించి, ప్రసారం చేసిన సుస్వర 'వాణి' కార్యక్రమం చూస్తున్నంత సేపూ నేను చూసిన కచేరీలన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి.

అనుకోకుండా బయటికెళ్ళి ఇరుక్కుపోయి, తొందర పడుతూ ఇంటికి వచ్చి టీవీ ముందు సెటిలయేసరికి కార్యక్రమం మొదలయిపోయింది. చిన్న ఆడిటోరియంలో, పరిమిత సంఖ్యలో ఆహ్వానించిన అతిధుల మధ్యన నిర్వహించిన కార్యక్రమం. లైవ్ కానప్పటికీ, ప్రకటనలు మినహా నిరంతరాయంగా మూడు గంటలపాటు ప్రసారం చేసారు కాబట్టి టీవీలో లైవ్ కార్యక్రమం చూసిన అనుభూతి కలిగింది. వాణి జయరాం లో నన్ను అమితంగా ఆకట్టుకునేది ఇప్పటికీ మాధుర్యం తగ్గని ఆమె గొంతు. ఇదే విషయాన్ని ప్రస్తావించారు మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, కార్యక్రమం చివర్లో ఆమెని సన్మానిస్తూ.

స్టేజి మీద పాడేటప్పుడు, కో-సింగర్లు భయానికో మరో కారణానికో తప్పులు పాడినప్పుడు, వాళ్ళని చూసి అస్సలు విసుక్కోక పోగా దయగా నవ్వడం వాణి ప్రత్యేకత. ఈ కార్యక్రమంలోనూ అదే చేశారు, 'సీతాకోక చిలుక' సినిమాలో 'మిన్నేటి సూరీడు' పాటకి కోరస్ పాడిన గాయనీ గాయకుల విషయంలో. కోరస్ వల్ల పాట అందం ఇనుమడించే పాటల్లో అదీ ఒకటి. మొత్తంగా చూసినప్పుడు సహ గాయకులు బాగానే పాడారు. మరీ ముఖ్యంగా 'శంకరాభరణం' లో 'దొరకునా ఇటువంటి సేవ..' పాడేటప్పుడు కో-సింగర్ దగ్గలేక అవస్థ పడడం, ఈవిడ చిరునవ్వు దాచుకుంటూ పాటందుకోడం జరగలేదీసారి.

నేను గమనించిన, నాకు నచ్చే మరో విషయం ట్యూన్ని ఏమాత్రం మార్చకుండా యధాతధంగా పాడడం. బాలూలాంటి కొందరు స్టేజి మీద పాడేటప్పుడు చాలా చోట్ల ట్యూన్ని మార్చేస్తూ ఉంటారు. ఇవాల్టి కచేరీ విషయానికి వస్తే, 'మరో చరిత్ర' సినిమాలో 'విధి చేయు వింతలన్నీ' పాట పాడుతూ కొన్ని కొత్త సంగతుల్ని జత చేసేశారు వాణి. దాదాపుగా షో అంతా గంభీరంగా నిలబడి పాడేసే ఈ గాయని, 'వయసు పిలిచింది' లో 'నువ్వడిగింది ఏనాడైనా...' పాటనీ, 'గుప్పెడు మనసు' లో 'నేనా.. పాడనా పాట..' పాటనీ పాడేటప్పుడు తనకి తెలియకుండానే కొంచం హుషారుగా కదులుతారు. గతంలో నేను చూసిన కచేరీలలో కన్నా, ఇవాళ 'నేనా.. పాడనా పాట...' పాడిన తీరు చాలా బాగుంది.


గతంలో ఏ స్టేజి షోలోనూ పాడగా చూడని పాట 'స్వాతికిరణం' లో 'ఆనతినీయరా..' ఈ పాట గురించి ఓ విషయం చెప్పాలి. నా మరణ సమయం నాకు ముందుగా తెలిసే అవకాశం ఉంటే, చివరి ఘడియల్లో వింటూ తనువు చాలించాలని కోరుకునే అతి కొద్ది పాటల్లో ఇదీ ఒకటి. అసలు కొన్నికొన్ని సార్లు ఒక్కడినీ ఈపాట వింటూ ఉంటే 'ఈ క్షణంలో మృత్యువు వచ్చేస్తే ఎంత బాగుండును' అనిపిస్తుంది. ఇవాల్టి కచేరీలో ఈ పాటని పాడారు వాణి జయరాం. దాదాపుగా సినిమాలో పాడినట్టే పాడారు కానీ, పాడించిన విధానమే నాకు నచ్చలేదు. చక్కగా ఓ తివాచీ మీద కూర్చుని ఈ పాట పాడి ఉంటే ఆమెకీ, చూసేవారికీ కూడా బాగుండేది. కానీ, మిగిలిన అన్ని పాటల్లాగే మైకు ముందు నిలబడి పాడేశారు.

మరో విశేషం ఏమిటంటే, ఇంత కష్టమైన పాట పాడిన వెంటనే, బ్రేక్ తీసుకోకుండా మరో పాట అందుకోవడం. కార్యక్రమం చివర్లో తన చిరు ప్రసంగంలో గాయని సునీత ప్రస్తావించింది ఈ విషయాన్ని. ఎప్పటిలాగే తనని సిని రంగానికి పరిచయం చేసిన వసంత్ దేశాయ్ ని భక్తితో తలుచుకుని, 'గుడ్డీ' నుంచి 'బోల్ రే పప్పీ..' 'హం కో మన్కి శక్తి దేనా' పాటలని పాడారు. డిసెంబర్లో జరగబోయే వసంత్ దేశాయ్ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన పేరిట నెలకొల్పిన అవార్డుని అందుకోబోతున్నానని కించిత్ గర్వంగా ప్రకటించారు. ఎప్పుడూ పట్టు చీరల్లోనే కనిపించే వాణి ఈ షో లో గులాబీ రంగు వర్క్ చీరలో ప్రత్యక్షమై కొత్తగా అనిపించారు.

అలాగే, ఎప్పుడూ మొదటి వరుసలో కూర్చుని కచేరీ ఆసాంతమూ శ్రద్ధగా విని, చివర్లో వాణి కోరిక మేరకు స్టేజీ ఎక్కి ఆమె పాద నమస్కారం అందుకునే భర్త జయరాం ఈ షోలో కనిపించలేదు. ఈటీవీ వాళ్ళు ముందుగా రికార్డు చేసేసిన ఈ కార్యక్రమానికి, వర్ధమాన గాయని ప్రణవి చేత యాంకరింగ్ చేయించి మిక్స్ చేశారు. ఆమె ప్రతిసారీ 'శ్రీ వాణీజయరాం' అనడం పంటికింద రాయిలా అనిపించింది. 'శ్రీమతి' అని వినడం అలవాటు కదా. ఏమైనప్పటికీ, అవకాశాలు వస్తే ఇప్పటి గాయనులకి దీటుగా వాణిజయరాం పాడగలరని మరోమారు నిరూపితమయింది. ఆమె మాత్రం "నేను అవకాశాలు వెతుక్కుంటూ వెళ్ళను. నన్ను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలకి నావంతు న్యాయం చేస్తాను" అని వినమ్రంగా చెప్పారు.

20 వ్యాఖ్యలు:

సిరిసిరిమువ్వ చెప్పారు...

ఎంత తొందరగా వ్రాసేసారో!నాకూ వాణీ జయరాం బాగా ఇష్టం. ఈ వయస్సులో కూడా ఆవిడ గొంతు ఎంత తీయగా ఉంటుందో!

ప్చ్..నేను అలా ఈ కార్యక్రమం పెట్టుకుని కూర్చున్నానో లేదో ఇంటికి అతిధులు వచ్చారు. వాళ్ళు వెళ్ళేటప్పటికి కార్యక్రమం చివరికి వచ్చేసింది.

కృష్ణప్రియ చెప్పారు...

అరే! అప్పుడే రాసేసారే! చాలా బాగా సమరైజ్ చేశారు. నేను చాలా వరకు చూశాను ఈరోజు.. ఆఖర్న ఎవరో వచ్చారని వెళ్లవలసి వచ్చింది.

వనజ వనమాలి చెప్పారు...

విద్యుత్ అంతరాయం వల్ల చూడలేకపోయాను .. ఇప్పుడు చూసినట్లే ఉంది.. మురళీ గారు ధన్యవాదములు

అజ్ఞాత చెప్పారు...

'స్వాతికిరణం' లో 'ఆనతినీయరా..' ఈ పాట గురించి ఓ విషయం చెప్పాలి. నా మరణ సమయం నాకు ముందుగా తెలిసే అవకాశం ఉంటే, చివరి ఘడియల్లో వింటూ తనువు చాలించాలని కోరుకునే అతి కొద్ది పాటల్లో ఇదీ ఒకటి. అసలు కొన్నికొన్ని సార్లు ఒక్కడినీ ఈపాట వింటూ ఉంటే 'ఈ క్షణంలో మృత్యువు వచ్చేస్తే ఎంత బాగుండును' అనిపిస్తుంది.
what an expression. no words

Vasu చెప్పారు...

"వాణి జయరాం లో నన్ను అమితంగా ఆకట్టుకునేది ఇప్పటికీ మాధుర్యం తగ్గని ఆమె గొంతు"
తగ్గడం కాదు మాధుర్యం పెరిగింది ఏమో అనిపిస్తుంది


పాడుతా తీయగా లో ఈవిడ పాడిన "విధి చేయు వింతలన్నీ" విన్నప్పుడు ఒరిజినల్ కంటే బావుందని పించింది. ఎన్నో రోజులు నన్ను హాంట్ చేసింది ఈ పాట.

"ఆనతి నీయరా" నాకు చాలా ఇష్టమైన పాట . విన్నప్పుడల్లా వర్ణించలేని పరమానందం కలుగుతుంది


నాకు ఆవిడ లైవ్ కాన్సర్ట్ చూసే అదృష్టం కలగలేదు ఇంకా.

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

వాణీజయరాం అనగానే నాకు గుర్తొచ్చేది "మిన్నేటీ సూరీడు" పాటే,మిగతవన్నీ ఆ తర్వాతే.మనకి ఉన్న సుస్వరవాణిల్లో ఈ వాణి కూడా ఒకరు.

ఇకపోతే ఆ యాంకర్ శ్రీ వాణీజయరాం అనడం బహుశా ఎప్పుడూ ఎదురుగా ఉండే ఆయన ఇప్పుడెదురుగా లేరు కదా అని "మతి"లేకుండా అన్నదేమో అలా.

అజ్ఞాత చెప్పారు...

ఈ కార్యక్రమం పూర్తిగా చూడలేకపోయాను.
"ఆనతి నీయరా" నాకు కూడా చాలా ఇష్టమైన పాట.
మహదేవన్ చేసిన చివరి అద్భుతం అనుకుంటాను.

మాలా కుమార్ చెప్పారు...

వాణీజయరాం నాకు ఇష్టమైన గాయని . ఆవిడ పాటలు చాలా నచ్చుతాయి .

శిశిర చెప్పారు...

మిస్సయ్యానండీ ఈ కార్యక్రమం. చూడడం కుదరలేదు.

The Chanakya చెప్పారు...

వాణీజయరామ్ గారి గాత్రవిన్యాసాన్ని చూడాలాంటే(వినాలంటే) స్వాతికిరణం సినిమావేనండి. ముఖ్యంగా ఆ సినిమాలోని ఆనతినీయరా దొర పాటలో ఆవిడ విశ్వరూపసందర్శనమే. చాలా మంది కొత్త పాటలని ఫుల్ వాల్యూంలో, పాత పాటలను తక్కువ వాల్యూంలో వినడానికి ఇష్టపడతారు. కానీ వాణీజయరామ్ పాటలను ఫుల్‌గా వాల్యూం పెట్టుకుని వినండి. ఆ అనుభవం మాటల్లో చెప్పలేము.

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

"ఆనతినీయరా" పాట గురించి చాలా కరెక్ట్ గా చెప్పారు.. నాదీ సేం ఫీలింగ్... తెలిసీ తెలియని వయసులో ఈ పాట పాడాలని కొన్ని సార్లు ప్రయత్నించి, ఈ పాటకు నేనివ్వగలిగిన అత్యున్నత గౌరవం నేను పాడే ప్రయత్నం చేయకపోవడమే అని గ్రహించి ఆపేశాను...

mayukha చెప్పారు...

I was expecting a post from you on this program and here it is. I missed the beginning but enjoyed till end. Vani Jayaram is one of my favorite singers too.

మురళి చెప్పారు...

@సిరిసిరిమువ్వ: అవునండీ.. కార్యక్రమం అవ్వగానే రాసేశాను.. యూ ట్యూబ్ లో దొరుకుతుందేమో లెండి.. ధన్యవాదాలు.
@కృష్ణప్రియ: నేను ప్రారంభం కొంచం మిస్సయ్యానండీ.. బాగుంది మొత్తమ్మీద.. ధన్యవాదాలు.
@వనజ వనమాలి: యూ ట్యూబ్ లో దొరకచ్చండీ.. లేదా పునః ప్రసారం అయినా కావొచ్చు.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@పక్కింటబ్బాయి: ధన్యవాదాలండీ..
@వాసు: నిజం చెప్పారు!! కొన్ని పాటలు అప్పటికన్నా ఇప్పుడు ఇంకా బాగా పాడుతున్నట్టుగా అనిపిస్తోంది.. ధన్యవాదాలు.
@శ్రీనివాస్ పప్పు: కానీ, ఆ కోరస్ సరిగ్గా పాడలేక పోయారండీ వాళ్ళు :( ..ఇక యాంకరింగ్ పార్ట్ స్టూడియో లో రికార్డు చేసి మిక్స్ చేశారండీ.. స్క్రిప్ట్ లో లోపమే అనుకుంటా.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@బోనగిరి: ఓసారెప్పుడో 'పాడుతా తీయగా' లోనే అనుకుంటా, బాలూ చెప్పడం 'స్వాతికిరణం' పాటలన్నీ పుహళేంది ట్యూన్ చేసి, మామ మీద గౌరవంతో ఆయనకి క్రెడిట్ ఇచ్చారని.. అదే నిజమైతే మాత్రం సంగీత ప్రపంచంలో అతి గొప్ప గురుదక్షిణ అవుతుందండీ.. ధన్యవాదాలు.
@మాలాకుమార్: ధన్యవాదాలండీ..
@శిశిర: మళ్ళీ వస్తుందని ఆశిద్దామండీ.. నాకు మరోసారి చూడాలని ఉంది.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@చాణక్య: అవునండీ.. హై పిచ్ లో కూడా చాలా బాగుంటుంది ఆవిడ గొంతు.. ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: ఎలా స్పందించాలో అర్ధం కావడం లేదండీ.. ఒకటి నిజం, ఎన్నో పాటల పోటీల్లో చాలా మంది ఈ పాట పాడారు కానీ, ఎవ్వరు పాడిందీ నచ్చలేదు నాకు.. 'ఈపాట కేవలం వాణీ జయరాం మాత్రమే పాడాలి' అని నాకు బాగా బలంగా అనిపించడం వల్లనేమో మరి.. ధన్యవాదాలు.
@మయూఖ: ధన్యవాదాలండీ..

కొత్తావకాయ చెప్పారు...

బాగా రాసారు. వెతికి చూడాలి ఈ ప్రోగ్రాం.

"..మిగిలిన అన్ని పాటల్లాగే నిలబడి పాడేసారు." ఈ మాట ఇంచుమించు నేను చాలా మంది గాయకులు కొన్ని పాటలు నిలబడి పాడినప్పుడు అనుకుంటూ ఉంటాను. ఇలాంటివి నిర్వాహకులకు, గాయకులకూ కూడా అనిపించవెందుకో!

"ఆనతినీయరా.."వింటే కలిగే అనుభూతిని ఇంతకంటే చక్కటిమాటల్లో ఇంకెవ్వరూ చెప్పలేరు. మురళి గారూ! జోహార్లు.

మురళి చెప్పారు...

@కొత్తావకాయ: నిజమండీ.. కొన్ని పాటలు నిలబడి పాడితే, పాడే వాళ్లకి ఎలా ఉంటుందో తెలీదు కానీ, చూడ్డానికి మాత్రం మహా ఇబ్బందిగా ఉంటుంది.. ధన్యవాదాలు.

సుభద్ర చెప్పారు...

నాకు చాలా చాలా నచ్చే గాయని వాణి గారు..చాలా చాలా బాగా రాసారు..ఆవిడ ప్రతిభకి అసలు ఎవ్వరు సాటి రారు..వినయవిధేయతలు ఆవిడకి ఆభరణాలు..ఎప్పటిలానే మంచి పోస్ట్ మురళిగారు..

మురళి చెప్పారు...

@సుభద్ర: చాన్నాళ్ళ తర్వాత.... ....ధన్యవాదాలండీ.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి