మంగళవారం, ఆగస్టు 16, 2011

సత్యాగ్రహం

గాంధీ మహాత్ముడి కాలంలో కాబట్టి, తెల్ల దొరలతో వ్యవహారం అయినందువల్లా డెబ్భయ్యేళ్ళ క్రితం సత్యాగ్రహం సత్ఫలితాలని ఇచ్చింది కానీ, ప్రస్తుతకాలం మాత్రం సత్యాగ్రహాలకి ఏమాత్రం అనుకూలం కాదన్నది సాదోహరణంగా తెలిసిపోతోంది, ప్రస్తుతం దేశంలోనూ, రాష్ట్రంలోనూ జరుగుతున్న రెండు సత్యాగ్రహాల పుణ్యమాని. విదేశీ పాలకులు చూపినపాటి సంయమనాన్ని స్వదేశీ ప్రభువులు ఎందుకు చూపలేక పోతున్నారన్నది అన్నా హజారే అరెస్టు వార్త టీవీలో చూసిన వాళ్ళందరికీ కలిగే ఉంటుంది, నిస్సందేహంగా. ఉద్యమానికన్నా ముందు అణచివేత మొదలయ్యిందిప్పుడు.

అవినీతికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం, ప్రధానిని కూడా పరిధిలోకి తెస్తూ జనలోక్ పాల్ చట్టం... ఈ రెండూ మొదట విన్నప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించాయి. అవినీతిమీద అన్నివర్గాల ప్రజల్లోనూ వ్యతిరేకత ఉంది. కానైతే, ప్రస్తుత బిజీ కాలంలో బయటికి వచ్చి ఉద్యమం చేసే రాజకీయేతరులు ఎవరన్నా ఉంటారా అని సందేహం వచ్చింది. చూస్తుండగానే ఉద్యమం ఊపందుకుంది. దేశవ్యాప్తంగా జనం ముందుకు వచ్చారు. ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. అత్యంత సహజంగానే ప్రభుత్వంలో ఉన్న వాళ్లకి ఇది రుచించని పరిణామం.

అప్పటికేదో జోకొట్టినా, ప్రభుత్వం వాళ్ళని పాపం ఆ సమస్య విడిచిపెట్టడం లేదు.. చేసిన పాపంలాగా వెంటాడుతోంది. ఉద్యమం అనే మాట వినబడగానే, మన పోలీసులు పఠించే మొదటి మంత్రం అణచివేత. ఈసారీ అదే జరిగింది. అది సత్యాగ్రహమా, ధర్మాగ్రహమా అన్నది వారికి అనవసరం. ఆగ్రహం అనే మాట వినబడకూడదు అంతే. అరెస్టు ఎందుకు చేయాల్సి వచ్చిందో ప్రభుత్వం చాలా చిత్రమైన వివరణ ఇచ్చింది. పైగా, సత్యాగ్రహానికి దిగిన వాళ్లకి ప్రభుత్వం మీద గౌరవం లేదంటూ ఎదురు దాడికి దిగింది. ప్రజలకి హక్కులతో పాటు బాధ్యతలూ ఉంటాయని గుర్తు చేసింది. ప్రభుత్వం తన బాధ్యతని మర్చిపోయినప్పుడే కదా, ప్రజలకి వాళ్ళ హక్కులు గుర్తొచ్చింది?

గతంతో పోల్చినప్పుడు ఈసారి ఉద్యమం ఊపందుకుంది. రాజకీయ కారణాలే కావొచ్చు, చాలా చోట్ల నుంచి మద్దతు వస్తోంది. ఇప్పుడు చూడాల్సింది మద్దతిస్తున్న వ్యక్తుల, సంస్థల, రాజకీయ పార్టీల చేతులకంటిన అవినీతి బురదని కాదు, సామాన్య ప్రజల్లో కనిపిస్తున్న పోరాట స్పూర్తినీ, ఐకమత్యాన్నీ. ఇవాళ ఏ రాజకీయ పార్టీలతోనూ సంబంధం లేని వాళ్ళకీ, 'వాళ్లకి కెరీర్ తప్ప ఇంకేమీ పట్టదు' అని ముద్ర వేయించుకున్న వాళ్ళకీ కూడా జన లోక్ పాల్ బిల్లు అంతే ఏమిటో, ప్రధానిని అందులో ఎందుకు చేర్చాలో తెలిసిందీ అంటే అది ఈ ఉద్యమం సాధించిన విజయమే. ఉద్యమాన్ని మొగ్గలోనే తుంచేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, పడుతున్న పాట్లూ కూడా అందరికీ స్పష్టంగానే కనిపిస్తున్నాయి.

రాష్ట్రానికి వస్తే, మా కోనసీమ రైతులు మొదలుపెట్టిన 'పంట విరామం' సత్యాగ్రహాన్ని, ఖమ్మం జిల్లా బయ్యారం రైతులు అంది పుచ్చుకున్నారన్నది టీవీ చానళ్ళు చెప్పిన వార్త. రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాలకీ ఇది విస్తరించే అవకాశాలు లేకపోలేదు. దురదృష్టవశాత్తూ ఇదేమీ సంతోషించాల్సిన వార్త కాదు. రాష్ట్రంలో రైతాంగాన్ని చుట్టుముట్టిన సమస్యలు, వాటి పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం ఈ సత్యాగ్రహం. కోనసీమ రైతులకి కూడా మొదట అవహేళనలు ఎదురయ్యాయి. ముందుగా 'ఇదంతా నాలుగు రోజుల హడావిడి' అన్నారు, ఆ తర్వాత 'రాజకీయ కుట్ర' అన్నారు, ఇంకొన్నాళ్ళకి ఇంకేమనాలో తెలియక 'డబ్బులెక్కువై వ్యవసాయం మానేస్తున్నారు' అన్నారు... ప్రభుత్వంలో వాళ్ళే.

ఈ పంట విరామాన్ని గురించి జాతీయ స్థాయిలో ప్రచారం జరిగితే తప్ప జిల్లా అధికారులు ఆ ఊళ్ళకి వెళ్లి రైతులతో మాట్లాడ లేకపోయారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులదీ అదే తీరు. ఇన్నాళ్ళకి ప్రభుత్వం 'పంట విరామం' మీద ఓ ఉన్నత స్థాయి కమిటీ వేసింది. వ్యవసాయం మీద పట్టున్న, రాష్ట్ర ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ మోహన్ కందా నేతృత్వంలో ఈ కమిటీ పంట విరామం ప్రకటించిన గ్రామాలు తిరిగి, సంబంధితులందరితోనూ మాట్లాడి నాలుగు వారాల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. ఆపై, ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పర్వాలేదు, ఇన్నాళ్ళకైనా మన రైతులు ప్రభుత్వంలో కదలిక తెప్పించ గలిగారు. ఇలా అనడం కన్నా, వారి పరిస్థితులు వాళ్ళ చేత అలా చేయించాయి అనడం సబబు.

"మీ జిల్లా రైతులు మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. క్రాప్ హాలిడే ప్రభావం, తర్వాత చాలా ఉంటుంది. భూసారం తగ్గిపోతుంది. ఓ పక్క ఫుడ్ సెక్యూరిటీ గురించి ఐక్యరాజ్య సమితి స్థాయిలో చర్చలు జరుగుతుంటే మీ వాళ్ళు ఇంత ఫూలిష్ గానా ప్రవర్తించడం?" మిత్రులొకరు కొంచం ఘాటుగానే అడిగారు. భూసారం సమస్య రైతులకి తెలియనిది కాదు. వాళ్ళ భాషలో వాళ్ళు "భూవి సౌడు తేలిపోతాదండి" అని టీవీల్లో చెబుతున్నారు కూడా. ఇక ఫుడ్ సెక్యూరిటీని పట్టించుకోవలసింది ప్రభుత్వం. భవిష్యత్తులో దేశం ఆకలి తీర్చడం కోసం, ఇప్పుడు వాళ్ళు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకోలేరు కదా? ఐకమత్యం ద్వారా ఏ కొంచమన్నా సాధించవచ్చునన్న పాఠాన్ని రైతులు ఈ అనుభవం నుంచి నేర్చుకుంటే వ్యవసాయానికి మంచిరోజులు దగ్గరలో ఉన్నట్టే.

8 కామెంట్‌లు:

 1. ఉద్యమాలని అణచివేసే ప్రభుత్వానికి.. ప్రజల పోరాట పథమే.. ఒక సవాల్. ఉద్యమాల తీరుతెన్నులను..సామాన్య ప్రజానీకం కూడా .. గమనిస్తుందని ప్రభుత్వాలకి..తెలియనట్టుంది..పాపం. . రైతులు సంఘటితముగా నిలబడి..తమ..సమస్యలని..ప్రభుత్వం ముందు ఉంచాలి.. ఇప్పుడు.. గళం..కలిపి.. బలం ఇవాల్సిన భాద్యత అందరిది

  రిప్లయితొలగించు
 2. ఐకమత్యం ద్వారా ఏ కొంచమన్నా సాధించవచ్చునన్న పాఠాన్ని రైతులు ఈ అనుభవం నుంచి నేర్చుకుంటే వ్యవసాయానికి మంచిరోజులు దగ్గరలో ఉన్నట్టే.
  బాగా చెప్పారు మురళీ గారు

  కలకత్తా లో మూడేళ్ళ క్రితం మమతా బెనెర్జీ Silguri ప్రొటెస్ట్ చేసినప్పుడు ప్రభుత్వం ఏమీ అనలేదు
  తన దాకా వచ్చేసరికి కొరడా ఝులిపించడం హేమిటో :(

  రిప్లయితొలగించు
 3. Renditiki sambandhamunna rendu vishayaalu vidi vidiga vipuleekarinchi raayalsindi

  Anna hazare gurinchi marikonni vishayaalu vidamarchi raasunte baagundedi ani naa abhiprayam.

  Positive criticism ga teeskondi :)

  రిప్లయితొలగించు
 4. @వనజ వనమాలి: అవునండీ.. చూస్తుండగానే ఉద్యమం బలపడుతోంది.. ధన్యవాదాలు.
  @హరే కృష్ణ: అది పవర్ మహిమండీ.. అంతే.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 5. @హరిచందన: ధన్యవాదాలండీ..
  @Phanikris: మీరన్నది నిజం.. కానీ చర్విత చర్వణం అవుతుందేమో అనిపించిందండీ.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 6. మళ్ళి కమిటి ఎందుకంట???ము౦దేసిన స్వామినాధన్ కమిటి రీపోర్ట్ ఉండగా!!!చర్చలు ఎందుకో???వాళ్లకి ఉన్నది ఒకే ఒక్క డిమాండ్ మద్దతు ధర....యం.పి గారైతే ఇప్పటి కి సీన్ లోకే రాలేదు..చాలా బెదిరింపులు జరుగుతున్నాయి..కేసులు పెట్టారు..రైతుసంఘల్ని విభజించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు..ఎన్ని జరిగిన అంతిమ విజయం ప్రజుద్యమానిదే!!!

  రిప్లయితొలగించు
 7. @సుభద్ర: మళ్ళీ కమిటీ ఎందుకంటే మరికొంచం కాలయాపనకండీ.. గ్రామస్థాయి రాజకీయాలని పక్కన పెట్టేసి ఇప్పటివరకూ ఒకే మాటమీద ఉన్న రైతులని చూస్తే మాత్రం మంచి రోజులోస్తాయన్న ఆశ కలుగుతోందండీ.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు