గురువారం, ఆగస్టు 04, 2011

పేపర్లు రాని రోజు...

రోజూ ఉదయాన్నే వచ్చి పలకరించే పేపర్ రాకపోతే ఏమనిపిస్తుంది? నాకైతే రోజూ వచ్చి పలకరించే స్నేహితుడు రావడం మానేసినట్టుగా అనిపిస్తుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు స్నేహితులు అది కూడా వరుసగా మూడురోజులు నుంచీ పత్తాలేరు. సుత్తిలేకుండా సూటిగా చెప్పాలంటే, రోజూ వచ్చే నాలుగు పేపర్లలోనూ మూడు పేపర్లు రావడం మానేసి మూడు రోజులయ్యింది. ఉదయాలు అసంపూర్ణంగానూ, అసంతృప్తిగానూ గడిచిపోతున్న భావన.

వాతావరణం అనుకూలంగా లేకపోవడం, ముఖ్యంగా ఉదయాన్నే పెద్ద వానలుకురవడం, ఒక పేపర్ బాయ్ హఠాత్తుగా మానేయడం, ఒక పేపరేమో వేరొకరు తీసేసుకుని ఇవ్వడం మర్చిపోతూ ఉండడం... ఇవన్నీ కారణాలని ఇవాళే చేసిన పరిశోధనలో తేలింది. పేపర్ రాకపోతేనేం, టీవీలో వార్తలు చూడచ్చు, నెట్లో చదువుకోవచ్చు అంటారు చాలామంది. ప్చ్.. నాకేమో పేపరు అలవాటు. పేద్ద గ్లాసుడు కాఫీని గుటకలేస్తూ తాగుతూ ఒక్కో పేపర్నీ అలా అలా చదువుతూ, అప్పుడప్పుడూ అభిప్రాయాలని మెసేజీల రూపంలో మిత్రులతో పంచుకుంటూ.. ఇలా జరిగే ఉదయాలకి పెద్దలోటే వచ్చిపడింది మరి.

ఏదో ఒక పేపర్ మాత్రమే చదివి చుట్టూ ఏం జరుగుతోందో పూర్తిగా తెలుసుకోగలిగే రోజులు పోయి చాలా రోజులే అయిపోవడం, కొన్ని ఇష్టాలు మరియు కొంత కాలక్షేపం తదితర కారణాల వల్ల పేపర్ల సంఖ్య నెమ్మదిగా పెరిగింది. వస్తున్న ఏకైక పేపరు ఓ రాజకీయ వారసుడిది. పేపర్లో కంటెంట్ మాట ఎలా ఉన్నా, కుంభవృష్టిగా కురుస్తున్న వర్షంలోనూ ఆగకుండా వచ్చిన ఏకైక పేపర్ అవడం వల్ల పూర్తిగా చదవాల్సి వచ్చింది. చదివింది నాణేనికి ఒక వైపే అయినప్పటికీ ఈ పత్రిక భాషలో 'పచ్చ పత్రిక'లైన వాటితో ఈ పత్రిక్కి మళ్ళీ ఏదో గొడవ జరిగిందని అర్ధమయ్యింది.

నిన్నైతే వారసుడి సక్రమాలు మరియు అవతలి వాళ్ళ అక్రమాల (ఈ పత్రిక దృష్టిలో) జాబితాతో ఓ నాలుగు పేజీల ప్రత్యేక అనుబంధం కూడా ఇచ్చారు. ఆ ప్రకారంగా గొప్పవాళ్ళ గోత్రాలు మరోసారి తెలిశాయన్న మాట. వరుసగా మూడు రోజులుగా ఏక పక్షంగా సాగుతున్న వార్తలే చదువుతున్నప్పటికీ, జవాబులిచ్చే క్రమంలో అసలు విషయాన్నీ ప్రస్తావించడం వల్ల ఈ పరస్పర నిందారోపణలకి కారణాలు కొంతవరకూ అర్ధమయ్యాయి. ఎప్పటిలాగే, మిగిలిన అందరూ కూడా తప్పులు చేస్తున్నారు కాబట్టి మేం చేస్తే తప్పేంటి తరహా వాదనలు వినిపించాయి.

మొత్తంమీద, వాళ్ళు చేశారని వీళ్ళు చెబుతున్న కుంభకోణాలు, అలాగే వీళ్ళు చేశారని వాళ్ళు చెబుతున్న కుంభకోణాల జాబితాలు చూస్తుంటే ప్రజాస్వామ్యంలో పాలకులకీ, పత్రికలకీ ఎంతలేసి సౌలభ్యాలు ఉన్నాయో పూర్తిగా అర్ధమయినట్టుగా అనిపించింది. అలాగే అటు రాజకీయులూ, ఇటు పత్రికా సంపాదకులూ కూడా మా తప్పులు మీరు బయట పెడితే మీ తప్పులు మేము బయట పెడతాం అని బెదిరింపులూ, సవాళ్ళూ విసురుకోడాలూ, ఈ మొత్తం కుంభకోణాల్లో చేతులు మారిన ప్రజల డబ్బు లెక్కలూ ఇవన్నీ కొంచం ఎక్కువగానే వెంటాడాయి.

రెండువర్గాల మీద ఉన్న ఆరోపణలూ నిజమని తేలితే, బాధ్యులందరికీ శిక్షలు పడితే రాష్ట్రానికి కొన్ని తరాలపాటు నాయకులంటూ ఎవరూ ఉండరేమో అని బెంగ కలిగింది కూడా. ఏమైనప్పటికీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది కదా. పేపర్ల సంగతి ఇలా ఉండగా, ఎంటర్టైన్మెంట్ కోసమని టీవీ పెడితే మంచు లక్ష్మి టాక్ షో, చిరంజీవితో. "మీ పార్టీలో ఢభ్లు తీస్కున్నారని అందరూ ఆంట్ నారు.. ఎంధుకంకల్ అలాగా?' అని హోస్టు అమాయకంగా కళ్ళార్పుతూ ప్రశ్నిస్తే, రాజకీయాల్లో పడిపోతున్న విలువల గురించి గెస్టు చాలా ఆవేదన చెందారు.

ఉద్దేశ్య పూర్వకంగా బురద జల్లడం రాజకీయాల్లో మామూలేననీ, నిజానిజాలు ప్రజలకి తెలుసనీ ఆయన ఆవేశంగా చెప్పినప్పుడు, ఆ ప్రజల్లో నేను ఉన్నానో లేదో అని సందేహం వచ్చేసింది. తన ఐడియాలజీస్ ప్రజలకి కమ్యూనికేట్ కాలేదనీ, పార్టీ నుంచి బయటికి వెళ్ళే వాళ్ళంతా ఏదో ఒక కారణం చెప్పాలి కాబట్టి పార్టీ మీద నిందలు వేశారనీ కొన్ని కొత్తవిషయాలు చెప్పారు చిరంజీవి. కొన్నాళ్ళపాటు పేపర్లతోపాటు, టీవీకీ పూర్తిగా దూరంగా ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచన క్షణకాలం వచ్చింది కానీ, అది ఆచరణలో అంత సులభం కాదన్న సత్యం అంతలోనే గుర్తొచ్చింది. రేపు నా నాలుగు పేపర్లూ వచ్చేస్తే బాగుండును.

18 కామెంట్‌లు:

 1. బ్లాగుల్లో తిరిగి నా లిస్టు నన్ను తయారు చేసుకోమంటారే కానీ, మీ కాఫీ కప్పు, దినపత్రికా మిత్ర సమాఖ్యని వదిలి షాపింగ్ కి సాయం రానంటారు. హ్మ్.. ఏం చేస్తాం!

  ఊరికూరికే నాస్టాల్జియా లోకి వెళ్ళిపోతూంటాను నేను. మన్నించండి కానీ, మా ఊళ్ళో గుంచీ అని ఓ కూడలి భవనం ఉండేది. (అది హనుమంతుడి ఆలయం కూడా లెండి.)ఆ గుంచీ అరుగుల మీద ఉదయాన్నే చేరి ఊరి మగాళ్ళందరూ నిశబ్దంగా పేపర్లు చదివేసుకుంటూ ఉండేవారు. మిన్ను విరిగి మీదపడ్డా ఒక్క మాట వినిపించేది కాదు. ఆనక బోలెడు చర్చలు, రచ్చలు ఉండేవి లెండి. అది గుర్తొచ్చింది. మీ పేపర్ ప్రహసనం వింటే.

  మంచు లక్ష్మి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేస్తుంది ఇది వింటే, చూసుకోండి. "నెమ్మలి ఖన్న్ ముర్లీ అంకల్" అయిపోతారు మీరు కూడా! జాగ్రత్త. :D

  రిప్లయితొలగించండి
 2. మీకు ఇంత ఓపికా, సహనమూ, ఇంకా ఇలాంటి లక్షణాలన్నీ ఎలా వచ్చాయో ఇప్పుడర్ధమయింది. పొద్దున్నే నాలుగు పేపర్లు చదువుతారా? హమ్మో?

  రిప్లయితొలగించండి
 3. //కొన్నాళ్ళపాటు పేపర్లతోపాటు, టీవీకీ పూర్తిగా దూరంగా ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచన క్షణకాలం వచ్చింది కానీ, అది ఆచరణలో అంత సులభం కాదన్న సత్యం అంతలోనే గుర్తొచ్చింది//

  ఆచరణ కష్టమే. ఒకవేళ అతికష్టం మీద అలవర్చుకుంటే... మళ్ళీ పేపరంటూ ముట్టుకోరు జీవితంలో...!

  రిప్లయితొలగించండి
 4. :) బాగుంది. నాకు పడేసిన వెంటనే వేడి చాయ్ తో మడత నలగని పేపర్ తెరిచి చదవటం ఇష్టం. ఇంకోళ్ళు చదివిన పేపర్ చూడాలంటే 'అయ్యో ' అనిపించి ఒక్కోసారి మానేసిన సందర్భాలు ఉన్నాయి.

  ఇప్పుడు పిల్లలు స్కూల్ కి వెళ్లాక అందరూ నలిపేసి విసిరేసిన పేజీలని కలుపుకుని.. చల్లటి టీ మందు తాగుతున్నట్టు తాగుతూ.. గోడ గడియారం కంగారు గా చూస్తూ.. :-(

  రిప్లయితొలగించండి
 5. నాక్కూడా ప్రొద్దున్నే లేవగానే పేపర్ చదవకపోతే, ఏదో మిస్స్ అవుతున్న ఫీలింగ్.. పండగల మరుసటి రోజు పేపర్ రాదు కదా, అప్పుడైతే అబ్బా! అసలు ఆ రోజు గడిచినట్లు ఉండదు. ఎన్ని టి.వి ఛానెల్స్, రేడియోలు ఉన్నా పేపర్ ని ఎవరూ రీప్లేస్ చేయలేరు (నావరకూ)

  రిప్లయితొలగించండి
 6. కృష్ణప్రియ గారు
  "మహిళా కాలం" మాత్రమే కాకుండా మిగతా పేపర్ కూడా చదివే ఆడవారంటే నాకు ప్రత్యేక అభిమానం...

  రిప్లయితొలగించండి
 7. మంచు లక్ష్మి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేస్తుంది ఇది వింటే, చూసుకోండి. "నెమ్మలి ఖన్న్ ముర్లీ అంకల్" అయిపోతారు మీరు కూడా! జాగ్రత్త. :D

  ఇది అద్భుతం..ఆ రోజు త్వరలోనే వస్తుందేమో?

  లక్ష్మి: నెమ్మలి ఖన్న్ ముర్లీ అంకల్ మీకు బ్లాగు రాయాలని ఎందుకనిపించింది?
  మురళి: నా జ్ఞాపకా... //మధ్యలోనే మాట కట్చేసూ..
  లక్ష్మి: నాక్తెల్సంకుల్..మీ ఘ్నాపకాల్ నల్గురితో షేర్ చేస్కున్దామనే కదా..

  లక్ష్మి: ఇది షెప్పండంకుల్..మీరు తెల్గులోనే రాస్తారుటకదా బ్లాగు. అంట ష్పష్టంగా తెల్గు ఎలా నేరుచుకున్నారు?
  ఒక బ్రేక్ తర్వాత...

  రిప్లయితొలగించండి
 8. అమ్మో నాలుగు వార్తాపత్రికలు చదువుతారా? మీకు ఓపిక చాలా ఎక్కువ.. మనకి పొద్దున్న లేవడమే గండం...దానికి తోడు తెప్పించుకుంటున్న రెండు న్యూస్ పేపర్లు చూడడమే గగనం అయిపోతున్నాది. మీరు నాలుగంటే...అమ్మో!

  అసలు టీవీ, పేపరు చూడకుండా ఉంటే జీవితం ప్రశాంతంగా ఉంటుందందీ...నాకా అనుభవం ఉంది. కానీ ఎవరైనా ఎప్పుడైనా ఇది విన్నావా, ఇలా జరిగింది తెలుసా అని అడిగితే "తెలీదే" అని చెప్పడానికి సిగ్గుగా ఉంటుంది :)

  రిప్లయితొలగించండి
 9. పొద్దున్నే పేపర్ చదవటానికి కుదరకపోయినా దాన్నొకసారి చూసి ఆ..వచ్చావా అనుకోకపోతే నాకూ తోచదులెండి .
  పూర్వం గుడి అరుగుమీద గుంపు మధ్యలో కూర్చొని పేపర్ చదివి వినిపిస్తూ మధ్య మధ్య వార్తలని చర్చిస్తూ వుండేవారు కదా ! అదే అలవాటు మా తతయ్యకి ఇంకా పోలేదు . నలుగుర్ని చూడగానే పైకి చదవటం మొదలుపెడతారు . మేవంతా మెల్లిగా ఒక్కొక్కరం అక్కడినుంచి తప్పుకుంటాం . అపుడాయన మళ్ళీ సైలెంట్ గా చదువుకోటంలో మునిగిపోతారు .

  రిప్లయితొలగించండి
 10. మంచు లక్ష్మి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేస్తుంది ఇది వింటే, చూసుకోండి. "నెమ్మలి ఖన్న్ ముర్లీ అంకల్" అయిపోతారు మీరు కూడా! జాగ్రత్త. :D

  ఇది అద్భుతం..ఆ రోజు త్వరలోనే వస్తుందేమో?

  లక్ష్మి: నెమ్మలి ఖన్న్ ముర్లీ అంకల్ మీకు బ్లాగు రాయాలని ఎందుకనిపించింది?
  మురళి: నా జ్ఞాపకా... //మధ్యలోనే మాట కట్చేసూ..
  లక్ష్మి: నాక్తెల్సంకుల్..మీ ఘ్నాపకాల్ నల్గురితో షేర్ చేస్కున్దామనే కదా..

  లక్ష్మి: ఇది షెప్పండంకుల్..మీరు తెల్గులోనే రాస్తారుటకదా బ్లాగు. అంట ష్పష్టంగా తెల్గు ఎలా నేరుచుకున్నారు?
  ఒక బ్రేక్ తర్వాత...

  SOOOOOOOOOOOPR:-) UNCLE...haha..

  రిప్లయితొలగించండి
 11. "మంచు లక్ష్మి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేస్తుంది ఇది వింటే, చూసుకోండి. "నెమ్మలి ఖన్న్ ముర్లీ అంకల్" అయిపోతారు మీరు కూడా! జాగ్రత్త."
  అమ్మో - ఇంతకంటే పెద్ద శాపం ఇంకోటి ఉండదేమో?

  రిప్లయితొలగించండి
 12. అబ్బ..నా ఆలొచనలన్ని మీరు చెప్పెస్తె ఇక నెనెమి
  చెప్పాలి.మొత్తానికి పెపర్ మీద విరక్తి కలుగుతుంది.
  అందరు చదవక పొతె వాళ్ళు యెమయిపొతారు
  పాపం ఆనుకొని చదువుతుంటాను.

  రిప్లయితొలగించండి
 13. @కొత్తావకాయ: అబ్బెబ్బే.. పుస్తకాల గురించి నాకు తెలిసింది చాలా తక్కువ అని చెప్పానండీ.. ఇంతకీ, నా బ్లాగే నాస్టాల్జియా.. కాబట్టి మీరు నాస్తాల్జియాలోకి వెళ్లడాన్ని స్వాగతిస్తున్నా.. నిజం కదూ.. ఇలాంటి దృశ్యం నా చిన్నప్పుడు మా కాంగ్రెస్ అరుగు మీద చూసినా, సమయానికి గుర్తు రాలేదు :( "ముర్లీ అంకల్" ఎలాగూ అయిపోయాను కానండీ, "నెమ్మలిఖన్న్" చదవడానికే అదోమాదిరిగా ఉంది.. అయినా ఏమీ భయం లేదండీ. నేనేమీ లెజెండ్ నీ, సెలబ్రిటీని కాదు కాబట్టి ఇటువైపు రాదు.. ధన్యవాదాలు.
  @కొత్తపాళీ: ఏమిటోనండీ, అలా అలవాటై పోయింది.. ధన్యవాదాలు.
  @గీతిక: నిజమేనండీ కష్టమే.. ఎప్పుడన్నా పనుండి చదవలేక పోతేనే ఏదోగా ఉంటుంది.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 14. @కృష్ణప్రియ: మడత నలగని పేపర్ విషయంలో నేనూ డిట్టో అండీ.. కాకపొతే, నేను చదవగలుగుతున్నాను.. ధన్యవాదాలు.
  @మేధ: నేనైతే అలాంటప్పుడు ముందు రోజు పేపర్ మళ్ళీ చదువుతానండీ :)) ..ధన్యవాదాలు.
  @cenima :వ్యాఖ్యకి ధన్యవాదాలండీ

  రిప్లయితొలగించండి
 15. @శ్రీ: మీ క్రియేటివిటీ చాలా బాగుందండీ.. నేను లెజెండ్ నో సెలబ్రిటీనో కాకపోవడం వల్ల యెంత మంచి జరుగుతోందో కళ్ళకి కట్టినట్టు చూపించారు :)) .ధన్యవాదాలు.
  @ఆ.సౌమ్య: ఒక్కోసారి ఆలోచిస్తే అనిపిస్తుందండీ, చూడకుండా ఉండలేమా అని.. కానీ కాఫీలాగే ఇదీను :)) ..ధన్యవాదాలు.
  @లలిత: ఆయన స్వంతంత్ర సమరయోధులు అయి ఉంటారు అయితే.. వాళ్లకి ఈ అలవాటు బాగా ఎక్కువండీ, నేను గమనించినంతలో.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 16. @చిన్ని: వద్దండీ బాబూ.. అలా శాపాలు పెట్టకండి.. ధన్యవాదాలు.
  @కొత్తపాళీ: నిజం చెప్పారు..
  @శశి: :)) :)) ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 17. 1993 నుండి ప్రవాసాంధ్రుడిగా ఉంటున్న నాకు అప్పట్లో ఒక డ్రీం ఉండేది.
  పొద్దున్నే నాకిష్టమైన నెస్కెఫే తాగుతూ తెలుగు పేపర్ చదవాలని.
  2004 లో ఢిల్లీలో ఈ కోరిక తీరింది, ఈనాడు ఢిల్లీ ఎడిషన్ తో. కానీ రెగ్యులర్ గా వచ్చేది కాదు.
  ఈనాడు ని పేపర్ వాడు ఈనాయుడు అనేవాడు ఎందుకనో.
  ఇప్పుడు బెంగుళూరులో రోజూ వస్తున్నా, గత రెండేళ్ళుగా జరుగుతున్న పరిణామాల్తో పేపర్ మీద ఆసక్తి పోయింది.

  రిప్లయితొలగించండి
 18. @బోనగిరి; ఢిల్లీ పేపర్ బాయ్ తెలియకే అలా అన్నాడంటారా? :)) బాగున్నాయండీ మీ అనుభవాలు.. నిజమే ఒక్కోరోజు అనిపిస్తుంది, ఈ పేపర్లు చూడడం అవసరమా అని.. మర్నాడు మళ్ళీ మామూలే!! ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి