మంగళవారం, ఆగస్టు 02, 2011

మెలిక 'శ'

"ఏరా బాబూ.. మెలిక శ కీ, కుంటి స కీ తేడా తెలియకపోతే ఎలాగరా నీకూ?" చెవి మెలేస్తూ తాతయ్య అడిగిన ప్రశ్న ఇది. నా బాలశిక్ష చదువు సాగుతున్న రోజులు. తాతయ్య ప్రశ్న నోటితో అడుగుతారు. జవాబు నేను పలక మీద రాయాలి. "శ్రీరాముడి భార్య పేరు ఏమిటి?" నేను 'శీత' అని రాశాను, హుషారుగా. "వర్షాకాలం తర్వాత ఏ కాలం వస్తుంది?" తెలిసిన ప్రశ్నే కావడంతో నాలో హుషారు ద్విగుణీకృతం అయ్యింది. 'సీతాకాలం' అని రాసేశా. నేను రాసిన పది జవాబుల్లోనూ ఈ రెండే తప్పులు.

అదిగో అప్పుడు విన్నాను ఈ మెలిక శ, కుంటి స గురించి. 'మెలిక శ' అనే మాట వినగానే భలేగా నచ్చేసింది. ఎందుకో కానీ, 'కుంటి స' అస్సలు నచ్చలేదు. 'కుంటేమిటీ?' అనుకున్నాను కానీ, పైకనలేదు. మొత్తానికి ఈరెండు అక్షరాలతో వచ్చే పదాలు మళ్ళీ మళ్ళీ రాయించీ రాయించీ ఏ అక్షరం ఎక్కడ వాడాలో బాగా అర్ధమయ్యేలా చేసేశారు తాతయ్య. ఎంత గట్టి పునాది అంటే, ఇంక మళ్ళీ వెనక్కి తిరిగే పని లేకపోయింది దాదాపుగా.

చాలామంది పిల్లలు హైస్కూలుకి వచ్చేసినా ఈ 'శ' 'స' లతో కుస్తీలు పడుతూనే ఉంటారన్న సంగతి నేను హైస్కూల్లో ప్రవేశిస్తేనే కానీ తెలియలేదు. అక్కడ మా మేష్టారు మెలిక, కుంటి అనకుండా 'సీత స' 'శకుంతల శ' అని చెప్పారు. ఇదేదో చాలా బాగుందనిపించింది నాకు. చక్కగా సీతనీ, శకుంతలనీ గుర్తు పెట్టుకుంటే చాలు. పైగా అవేమీ మరిచిపోగలిగే పేర్లు కాదు, రామాయణం, శాకుంతలం అప్పటికే చాలాసార్లు విని ఉండడం వల్ల.

కాకపొతే ఒక కొత్త సమస్య వచ్చింది. కొందరు మేష్టర్లు మెలిక శ - అదే శకుంతల శ - ని 'ష' అని పలికేవాళ్ళు. ఉదాహరణకి, శాంతి ని షాంతి అని. (మొన్నామధ్య జానారెడ్డి హోం మంత్రిగా ఉండగా ఆయన ఒక్కసారి కూడా శాంతిభద్రతలు అనలేదు, ఎప్పుడూ షాంతిభద్రతలే! ఉచ్చారణ దోషాల గురించి యధాశక్తి ఉపన్యసించే ఎస్పీ బాలూ కూడా చాలాసార్లు శ,ష ల భేదం పాటించకపోవడం విషాదం) ఇలాంటి గండాలన్నీ దాటుకుని కొంచం పెద్ద క్లాసుల్లోకి వెళ్లి నోట్సులు విస్తారంగా రాయడం మొదలు పెట్టాక కొన్ని కొన్ని అక్షరాలు బాగా అందంగా కనిపించడం మొదలు పెట్టాయి.

అప్పటికే ఖాళీ ఉన్నప్పుడల్లా కాసిని గీతలు గీసి, వాటికి బొమ్మలని పేరు పెట్టుకుని ఆనందించే అలవాటు ఉండడం వల్ల, కొన్నిఅక్షరాలని చూస్తుంటే బొమ్మలే జ్ఞాపకం వచ్చేవి. కొన్నాళ్ళకి నాకు తెలిసిందేమిటంటే, శకుంతల శ తో సహా మెలికలున్న అక్షరాలంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం అని. చాలామంది త రాయాలంటే, ల రాసి పైన కొమ్మిచ్చి, మళ్ళీ వచ్చి పొట్టలో సున్నా పెడతారు. నేనేమో సున్నాతో మొదలుపెట్టి, రెండో సున్నా అలవోకగా చుట్టేసి, తలకట్టు పెట్టేసే వాడిని.

రాయగా రాయగా, పొట్టలో పెట్టే సున్నాని సన్నగా చేసేయడం అలవడింది. ఇలాగే మరి కొన్ని అక్షరాలు రాయడంలో కూడా కాసిన్ని సుళువులు పట్టుబడడంతో మేష్టారు నోట్సు చెప్పేటప్పుడు అదే వాక్యాన్ని రెండోసారి చెప్పేవరకూ ఆగకుండా, మొదటిసారే రాయడం పూర్తి చేసేసేవాడిని. కొందరు మిత్రులకి ఇది చాలా ఆశ్చర్యం కలిగించి, ఖాళీ పీరియడ్లో నాకు రాత పరీక్ష పెట్టి, సదరు సుళువులు నేర్చుకునే ప్రయత్నాలు చేసేవాళ్ళు. తలకట్లు పెద్దవిగా ఇవ్వడం, అక్షరాలు వాల్చి రాయడం, పెన్ను నొక్కి పట్టి రాయడం, తేలిక చేసి రాయడం.. అబ్బో ఎన్ని ప్రయోగాలో.

కాలేజీలో కూడా ఈ శ, స లు వదలలేదు. ఓసారి అనుకోకుండా, ఒక మిత్రుడి నోట్సు చూసి, ఈ శ, స లని సరిచేయడం కోసం "ఇక్కడ సీత స కాదు, శకుంతల శ ఉండాలి" అన్నాను. సంభాషణ భాష గురించి కాక, కాలేజీలో సీత గురించీ, శకుంతల గురించీ జరిగిందని ప్రత్యేకంగా చెప్పాలా? మెలికలున్న అక్షరాల మీద నా ఇష్టం మాత్రం కొనసాగింది. అ, ల, త లాంటి అక్షరాలని సున్నాతోనే మొదలు పెట్టక్కర్లేదని కనిపెట్టా. ఇప్పుడిప్పుడు సంతకం చేయడం తప్ప, కాగితం మీద రాసే పని ఉండడం లేదు. అందులోనూ తెలుగు రాసే పని అసలే లేదు. నా చేతిరాత ఎలా ఉందో ఏమిటో...

38 కామెంట్‌లు:

 1. interesting
  శాభాష్
  సెహబాస్
  శాభాస్

  రిప్లయితొలగించు
 2. నిజమే...కొన్నేళ్ళయిపోతే...తెలుగునే...ఇంగ్లీషులో రాసేస్తామేమో!!

  నా తెలుగు రైటింగ్లో ఒకే ఒక లోపం...తలకట్లు చిన్నవిగా ఇవ్వడం.నేను రాయడంలో(మాట్లడడంలొ కూడాలేండి ;) ) సూపర్ ఫాస్ట్.ఆ స్పీడుకి ఈ తలకట్లు బలయిపోయేవి పాపం :)) ఎంత మార్చుకుందాం అనుకున్నా కుదరలేదు. ఇక ఇంటరుకొచ్చాక తెలుగుతో పనిలేకుండా పోయింది ఒక్క డైరి విషయంలో తప్ప :) ఇప్పుడు అవీ పోయి బ్లాగులొచ్చేసాయి...ఇక నెక్స్ట్ స్టేజ్ ఏంటో!!

  రిప్లయితొలగించు
 3. … అందువల్లనైనా, ఇప్పుడు మీరు వ్రాయాల్సిందే, మీ చేతి రాతని మాకు చూపించాల్సిందే! :)

  దాదాపు ఐదేళ్ళ క్రితం చేతిరాతల్ని బ్లాగుల్లో ప్రదర్శిద్దామని ఒక memeలా చేసాం. దానికి నలుగురైదుగురు కంటే స్పందించినట్టు లేరు. (అప్పుడు మొత్తం తెలుగు బ్లాగర్లే తక్కువనుకోండి.) దొరికిన రెండు లంకెలూ:

  * నా చేతిరాత — వీవెన్
  * నా చెత్త రాతశోధన సుధాకర్

  రిప్లయితొలగించు
 4. ఉప్పు,పప్పు, అక్షరాలు దేని మీద ఐనా టపా అందం గా రాయడం మీకే చెల్లు


  >>అ, ల, త లాంటి అక్షరాలని సున్నాతోనే

  ఇదెలా సాధ్యమండీ?

  ఇక ఈ షాంతి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దోశ అని అనగలిగినప్పుడు శాంతి అని ఎందుకు పలకలేరో మరి.

  మా అక్క మీడియా లో పని చేసే రోజుల్లో వాళ్ళ కొలీగ్స్ అడిగారుట నీకు "ష" పలకదా ఏమిటి, "శాంతి" అంటావు అని.

  దీని మీద నా పోస్టు
  http://myfeelings-rishi.blogspot.com/2010/03/saradaaki-19.html

  రిప్లయితొలగించు
 5. నిజమే అండి చాలా చక్కగా చెప్పారు. నాకు వీటిలితో చిన్నప్పటినుండీ ఎప్పుడూ ఇబ్బంది లేదు కానీ ణ, ఱ రాయాలంటే అబ్బో చాలా కష్ట పడే దానిని రెండవ తరగతికి వచ్చే దాకా రాలేదు నాకు. మేలికలున్న అక్షరాలు అంత చిన్న వయసులో తప్పులు లేకుండా రాయడం చాలా కష్టమే. నా పేరుని తెలుగులో రాయడానికి మాత్రమే ఇష్టపడతాను నేను అలా మా స్నేహితులు కొంత మంది తమిళమ్మాయిలు, మలయాళీలు నా పేరుని తెలుగులో చూసి జిలేబీ చుట్టల్లా ఉన్నాయి అనే వారు!!! వాళ్ళకి తెలుగులో ఏది కనిపించినా జిలేబీనే గుర్తుకొస్తుంది పాపం!!!

  రిప్లయితొలగించు
 6. బాల సుబ్రహ్మణ్యం పలికే 'శ' సరియైనది, శంకరాభరణము పాటల్లో సరిగ్గా పలికారు, కొందరు పలికినట్టు 'శ' ను 'స్య' అది సరికాదు 'శకుంతల' 'శంకరాభరణము', బాలు ఈ ఉచ్చారణ వేటూరి లాంటి వారి దగ్గర నేర్చుకున్నారు, అదే సరియైనది, 'స్యకుంతల' అనేది తప్పు

  రిప్లయితొలగించు
 7. మెలికలు ఎక్కువున్న అక్షరాలే అందంగా ఉంటాయి కదూ!
  "ళ, శ, ణ,ఱ, ట,భ,ష,క్ష"
  శ, ష పలకటానికి ఇబ్బంది పడతారు, కొందరు ళ, శ రాయటంలో తికమక పడతారు.
  భ అయితే నగలతో అలంకరించుకున్న పెళ్ళికూతురులా కనిపిస్తుంది.
  ష ని కాలు పట్టి ఈడ్చే ష అనేవాళ్ళం. శనివారం శ, సోమవారం స అంటాం.

  రిప్లయితొలగించు
 8. బాలూ గారి విషయంలో నా పరిశీలన కరక్టే అన్నమాట. శంకరాభరణము అని కరెక్ట్ గా పలికిన ఆయన ఈ మధ్య ఆ భేదం ఎందుకు పాటించంట్లేదో

  రిప్లయితొలగించు
 9. నాలాంటి గొప్ప వాళ్ళ చేతిరాతలు అస్సలు అర్ధంకావు తెలుసా?
  ఉచ్చారణ లోపాలు అందరిలోనూ ఉంటాయి, రెడ్డిగారు గాని, బాలు గారు గాని, ఆ మాటకొస్తే నందమూరి తారక రామారావు గారు, 'కృతఙ్ఞతలు' అనే పదాన్ని చాల పౌరాణిక సినిమాల్లోనే సరిగా పలకలేదు. కొన్నిసార్లు ఉచ్చారణదోషం సరిచేసుకోలేనిది గా ఉండవచ్చు. ఇక్కడ టపా ముఖ్య విషయం 'లిపి' కాని 'ఉచ్చారణ' కాదు అనుకుంటున్నాను.

  రిప్లయితొలగించు
 10. మీరు మరీ శషభిషం గా ఉన్నారు సుమండీ

  జిలేబి

  రిప్లయితొలగించు
 11. మాకు తెలిసిన వారమ్మాయి భర్త హైదరాబాద్ లో పుట్టి పెరిగాడు. భార్య అతనిని వెక్కిరిస్తూ.. మీ హైదరాబాద్ వారికి శ,ష,స లకి తేడా తెలియదు.. అంది.

  దానికి అతను తమాషాకి 'ఏంటి మా హైదరాబాదీ లకి ష, ష, ష కి తేడా తెలియదంటావా? నేనొప్పుకోను ' అన్నాడు. ఆ సంఘటన గుర్తొచ్చింది.

  ల, ళ కి, గ్న, జ్ఞ కి తేడా పలకలేని వాళ్లు, ఒత్తులు పలకలేని వారు వాక్యం లో ౯౦% ఆంగ్ల పదాలు మాట్లాడే వారి మధ్య ఉండటం వల్ల ఏదో ఒకటి లే.. కనీసం తెలుగు లో మాట్లాడుతున్నారు అని తృప్తి పడే రోజులు వచ్చేసాయేమో :-( అనిపిస్తుంది.

  అన్నట్టు 'చేసారు /చేశారు' ఏది కరెక్టు?

  రిప్లయితొలగించు
 12. మేము శ ని కత్తెర శ అనేవాళ్ళం. నేను తెలుగు అమ్మగారి కూతురవడం వల్లనో ఏమో మరి, చదవడం, రాయడం అన్నీ చాలా వేగంగా చెసేదాన్ని. చిన్నప్పుడు ఎవరైనా ఫ్రెండుతో కలిసి చందమామో ఈనాడు ఆదివారం బుక్కో చదువుతున్నప్పుడు, నేను త్వరగా పేజి ముగించేసి, అవతలవాళ్ళు చదివేవరకు వేచివుండటం చాలా విసుగనిపించేది.
  హ హ... కాని, నా చేతిరాత మాత్రం, బ్రహ్మ రాతే. ఇక్కడ తెలుగు అమ్మగారి వారసత్వం పనిచేయలేదు :( !!!

  రిప్లయితొలగించు
 13. మురళి గారు,
  మంచి పోస్ట్. నా స్నేహితుడొకాయన తెలుగు అదరగొడదామనే అత్యుత్సాహంతో ' స ' బదులుగా ' శ ' నే వాడుతుంటాడు. అతని ద్రుష్టిలో ' శ ' ప్రక్రుతి. ' స ' విక్రుతి. కచటతపలని పచ్చడిబద్దలుగా చేసేసి.. మన జానారెడ్డి గారి లాగే తికమక పెడతుంటాడు. మీరిలా స, శ ల పంచాయితీ పెడితే.. నా లాంటివాడు బుజాలు తడుమకోవలసి వస్తుంది.

  రిప్లయితొలగించు
 14. దోసకాయ ని తినడానికి అభ్యంతరం లేదు కానీ దోస తినాలా దోశ తినాలా అని అనుమానం వస్తుంది అప్పుడప్పుడు. స, శ లలో ఇప్పటికీ కొన్ని కొరుకుడు పడనవి ఉన్నాయి. ర, ఱ లలూ ఇంకా తికమక పెడుతూనే ఉంటాయి. తెలుగు ఆట్టే చదవక పోవడం వల్ల వచ్చే సందేహాలు, లేక ఈ నాటి తెలుగు చదవడం వల్ల అని కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇలాంటివి కొంచెం వివరించి పుణ్యం కట్టుకోండి మురళి గారూ... ద.హా

  నా చేతివ్రాత చాలా బాగుంటుంది. నేను వ్రాసింది అప్పుడప్పుడు నేనే చదవలేను... చి.న

  @కృష్ణప్రియ గారు .. గూగుల్ వాడిని పలకరిస్తే చూశారా అని ఎక్కువగా అడుగుతాడు. అదే మా తెలుగు మాష్టారయితే చూసారా అనకపోతే బహుశా (ఇక్కడ సా కాదుకదా) చెవికి కీ ఇస్తారు... మ.హా

  రిప్లయితొలగించు
 15. నాకు చాలా ఇష్టమైన టాపిక్ మీద రాసారు.


  ..ఉచ్చారణ దోషాల గురించి యధాశక్తి ఉపన్యసించే ఎస్పీ బాలూ కూడా చాలాసార్లు శ,ష ల భేదం పాటించకపోవడం విషాదం ....

  ఈ విషయం నేను చాలా చోట్ల అన్నా, కానీ ఎవరూ ఒప్పుకోరు . అయన కరేష్టుగా పలుకుతారు అంటారు. ఏమిటో...

  రిప్లయితొలగించు
 16. స, శ విషయంలోనూ ...ఉ, వు విషయంలోనూ నాకెప్పుడూ గందరగోళమేనండీ . ఇప్పటికే చాలా సార్లు మొట్టికాయలు వేయించుకున్నాను కూడా .

  రిప్లయితొలగించు
 17. నాకు కూడా "ష,ష,ష" (స,శ,ష) ల మీద సమానమైన ప్రేమ చూపించేవారు బాగానే తగులుతూ ఉంటారు. :)

  రిప్లయితొలగించు
 18. మీకు కాలుబట్టి గుంజే ష ప్రాబ్లెం లేనట్టుంది. బాగుంది, నా కష్టాలు గుర్తొచ్చాయి:) 'ళ' రాస్తే సిగ్గుపడితే తిరిగే మెలికలన్నీ కనిపించేవి. 'ణ' రాస్తే ఒక పెద్ద అందమైన చామంతి పువ్వు లాగా వంకలు తిరిగిపొయ్యేది. అందుకని వీలైనంత వరకు ఆ అక్షరాలు రాకుండా ఇంకో విధంగా కళాత్మకంగా వ్రాసేదాన్ని.

  రిప్లయితొలగించు
 19. మేము వీటిని కత్తెర శ, మామూలు స అంటాం. అంటే చూడడానికి కత్తెర ఆకారంలో ఉంటుందిగా అందుకని. ఈ మెలిక శ అని వినడం ఇదే మొదటిసారి.
  మీరన్నట్టు ఈమధ్యకాలంలో ష వినలేక చచ్చిపోతున్నామనుకోండి.

  నాకు ఈ స, శ లతో బాధలేదుగానీ మ, య లతో పెద్ద బాధ...దేనికి చిన్నా సున్నా, దేనికి పెద్ద సున్న తెలీక తికమకపడేదాన్ని చిన్నప్పుడు. "మయధర్మరాజు" "ముద్ధం(యుద్ధం)" "యుద్దు (ముద్దు)"అని రాసేదాన్ని. య కి పెద్ద సున్నా ఉండాలే అని మా అమ్మ చెప్పి చెప్పి విసిగిపోయేది....అప్పుడప్పుడూ చెవులు మెలేసేది కూడా. :)

  రిప్లయితొలగించు
 20. వీవెన్ గారూ
  అప్పుడంటే ఎక్కువమంది బ్లాగర్లు లేరు కాబట్టి ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు అలాంటి కార్యక్రమం పెట్టండి.మేమంతా రాస్తాం. నా చేతి రాత కచ్చితంగా చూపిస్తా :)

  రిప్లయితొలగించు
 21. శ..ష..విషయంలో చాలామందికి తికమకే! నా స్నేహితురాలి పేరు శైలజ..తను ఎప్పుడూ తన పేరు షైలజ అనేది..నాకు ఒళ్ళు మండేది....సైలజ అనాలి..షైలజ కాదు అని వాదన పెట్టుకునేదాన్ని..తను ఫాషను కోసం అలా అనేదని నాకు అనుమానం.

  జయ గారూ నేనూ "ణ" మీ లాగానే చామంతి పువ్వు లాగా..జిలేబి చక్రం లాగా గుండ్రంగా చుట్తేస్తా! పట్టి పట్టి ఒకటికి రెండుసార్లు మనస్సులో వ్రాసుకుని వ్రాస్తా!

  రిప్లయితొలగించు
 22. వీవెన్ గారూ చాలా బావుందండీ మీ ఆలోచన నేను రేపు స్వదస్తూరి టపా కొట్టబోతున్నానోచ్

  రిప్లయితొలగించు
 23. @వనజ వనమాలి: ధన్యవాదాలండీ..
  @పక్కింటబ్బాయి: అయితే మీ చేతి రాత చూడబోతున్నా/చదవబోతున్నామన్న మాట!! ధన్యవాదాలండీ..
  @ఇందు: ఈ తలకట్ల సమస్య నన్నూ కొన్నాళ్ళు వేధించిందండీ.. నేను మొత్తానికి అధిగమించా :)) ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 24. @వీవెన్: మీ ప్రయోగం చాలా బాగుందండీ.. మళ్ళీ చేయచ్చేమో.. మిత్రులనుంచి స్పందన కూడా మొదలయ్యింది కదా.. నేను ముందుగా చేతి రాత ప్రాక్టీస్ చేయాలి అయితే :)) ..ధన్యవాదాలు.
  @రిషి: అ, ల, లాంటి వాటి విషయంలో అక్షరం రాయడం మొదలు పెట్టేటప్పుడు పెన్ను గట్టిగా ఒత్తి, వెంటనే తేలిక చేసి మిగిలిన అక్షరం రాసేస్తే ఆ సున్నా వచ్చినట్టుగా కనిపిస్తుందండీ రాతలో.. టైం కలిసొస్తుంది కూడా.. కొంచం ప్రాక్టీస్ చేయాలి.. రాన్రాను సున్నాలు మానేశాను లెండి :)) బాగుంది మీ టపా, అప్పుడు ఎలా మిస్సయ్యానో :( ..బాలూ ఈ మధ్య శ, ష లు మార్చేస్తున్నారన్నది నా పెద్ద ఫిర్యాదు అండీ.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 25. @రసజ్ఞ : భలే! నేను మొదట్లో 'ణ' ని ల ఒత్తులా రాసే వాడినండీ.. నెమ్మదిగా ఆ మెలికలు నేర్చుకున్నాను :)) మీ పేరు గూగుల్ లో సరిగా రావడం లేదు.. మీర్రాసిందే కాపీ చేస్తున్నా :)) ..ధన్యవాదాలు.
  @ dnc : ఈమధ్య 'పాడుతా తీయగా' లో శ ని ష లా ఉచ్చరిస్తున్నారండీ చాలా సార్లు. ముఖ్యంగా గత సిరీస్లో ఒకమ్మాయి చక్కగా ఉచ్చరిస్తే, అలాకాదు 'ష' అని పలకాలి అంటుంటే బాధ కలిగింది.. ధన్యవాదాలండీ.
  @మందాకిని : నగలతో అలంకరించుకున్న పెళ్ళికూతురు.. పోలిక బహు చక్కగా ఉందండీ.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 26. @శ్రీ: నేను గొప్ప వాడిని ఎందుకు కాలేక పోయానో ఇప్పుడు బాగా అర్ధమయ్యిందండీ, టూ లేట్ కదా :)) ..ధన్యవాదాలు.
  @జిలేబి: :-) :-) ధన్యవాదాలండీ..
  @కృష్ణప్రియ: 'చేసి' 'చేశారు' నేను నేర్చుకున్నది ఇలాగండీ.. బులుసుగారేమో 'చేసారు' అంటున్నారు.. నిజం.. ఉన్నంతలో తృప్తి పడిపోవడమే మనం.. ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు
 27. చాలా బావుంది. చేతిరాతగురించి ఇంతచెప్పాక మరి మీ చేతిరాత చూపించవలసిందే.
  చేతిరాతని దస్తూరి అనేవాళ్ళు.
  మా అమ్మ చేతిరాత తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ కూడా ముత్యాల్లాగా ఉండేది. మాకెవరికీ అంతచక్కటి రాత అలవాటు కాలేదు, ఎన్ని కాపీబుక్కులు రాసినా. కథలు రాయడం మొదలుపెట్టిన కొత్తల్లో ఆలోచన సాగడం కోసం మొదట చేత్తోనే రాసుకునేవాణ్ణి. తరవాత రాసినదాన్ని కంప్యూటర్లో కెక్కించేటప్పుడు నారాత నాకే అర్ధం కాక తికమక పడుతుండేవాణ్ణి.

  రిప్లయితొలగించు
 28. @రూత్: కత్తెర.. ఇదేదో బాగుందండీ.. ఇప్పుడే వినడం.. తెలుగమ్మగారికి పుడితే యెంత ఉపయోగమో కదా..!! కేవలం మీరు చెప్పిన కారణానికే నేను పుస్తకాలు ఎవరితోనూ కలిసి చదవడానికి ఇష్ట పడే వాడిని కాదు :)) ధన్యవాదాలండీ..
  @yaramana: అంటే శరిగమలు, శరస్సు, శఖి, శముద్రం... ఇలా ఉంటుందా అండీ ఆ భాష? :)) ..ధన్యవాదాలు
  @బులుసు సుబ్రహ్మణ్యం: దోస, దోశ రెండూ రుచికరంగానే ఉంటాయి కాబట్టి దొరికింది తినేయడమేనండీ.. దోషం ఉండదు.. (ఇక్కడ ద.హా.. లేదా వి.హా, మీ ఇష్టం) ..అబ్బెబ్బే.. చదువుకీ, సందేహాలకీ అస్సలు సంబంధం లేదండీ.. అన్నిచోట్లా ఉన్నట్టే భాషకి సంబంధించీ బోల్డన్ని వాదాలూ, వివాదాలూ.... మీకేమో ధన్యవాదాలు. (ఇక్కడ కూడా ఏ హా అన్నది పూర్తిగా మీ ఇష్టం!!)

  రిప్లయితొలగించు
 29. @సునీత: ధన్యవాదాలండీ..
  @వాసు: లేదండీ.. మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.. ఈమధ్యన దాదాపుగా రెగ్యులర్గా చూస్తున్నాను కదా.. ధన్యవాదాలు.
  @లలిత: మనలో ఏ మొట్టికాయలూ వేయించుకోనిది ఎవరో చెప్పండి?? :-) :-) ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 30. @రవికిరణ్: అవునండీ, నాక్కూడా... ధన్యవాదాలు.
  @జయ; అంటే మురళి అని రాయాల్సి వస్తే పిల్లనగ్రోవి అనో పిల్లికర్ర అనో రాసేవారన్న మాట!! :)) ధన్యవాదాలండీ..
  @ఆ.సౌమ్య: 'య కి పెద్ద సున్నా..మ కి చిన్న సున్నా' ఇలా ఒక పూటంతా న చేత అనిపించడం ద్వారా, ఆ సమస్య పరిష్కరించారండీ తాతయ్య.. ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తోంది.. ఎన్ని సులువులు చెప్పారో కదా అని!! మీర్రాసేయండి, మేం చదివేస్తాం :)) ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 31. @సిరిసిరిమువ్వ: మీరు కూడా శైలజ అనబోయి సైలజ అనేశారండీ!! చూశారా ఈ శ, స యెంత పని చేయిస్తున్నాయో :-) టైపో అర్ధమయ్యింది లెండి, ఊరికే సరదాగా.. మీ 'ణ' కష్టాలు బాగున్నాయ్.. ధన్యవాదాలండీ..
  @కొత్తపాళీ: చెప్పాను కదండీ.. కూసింత ప్రాక్టీస్ చేయాలి.. అయ్యబాబోయ్.. కాపీలు, అదో పెద్ద ప్రహసనం. ఎందుకు గుర్తు చేస్తారులెండి.... బ్లాగడం మొదలు పెట్టిన కొత్తలో కంప్యూటర్లో రాయడం చాలా కొత్తగా, కొంచం ఇబ్బందిగా ఉండి, 'ఎందుకొచ్చిన తిప్పలు, హాయిగా పుస్తకంలో రాసుకుని దాచుకుందాం' అనిపించక పోలేదు కానీ అంతలోనే 'సాధనమున పనులు సమకూరు ధరలోన' గుర్తొచ్చిందండీ.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 32. మెలిక శ' అనే మాట వినగానే భలేగా నచ్చేసింది. ఎందుకో కానీ, 'కుంటి స' అస్సలు నచ్చలేదు. 'కుంటేమిటీ?' అనుకున్నాను

  నిజమేనండి. చిన్నప్పుడు అందరి ఇళ్ళల్లో దాదాపుగా ఈ విషయం మీద ఇలాగే చెప్పేవారు. సముద్రం లో స అని చెప్పేవారు.శకుంతల కాకుండా సకుంతల రాస్తే మెలిక శ రాయాలి అనేవారు. మా తాతగారు అలా చెప్తుంటే ఆ చెప్పే విధానానికి నేను మళ్ళి మళ్ళి అదే తప్పు చేసేదాన్ని.మీ పోస్ట్ చాల బాగా నచ్చింది నాకు.

  రిప్లయితొలగించు
 33. @కల్లూరి శైలబాల: మీక్కూడా మెలిక శ ఇష్టమా?!! ..ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు
 34. @వాసవ్య యాగాటి: ధన్యవాదాలండీ..
  @వంశీకృష్ణ: భలే ఆలోచన!! ఇంకెవ్వరూ మర్చిపోరండీ :) ధన్యవాదాలు

  రిప్లయితొలగించు