సోమవారం, ఆగస్టు 01, 2011

స్వరకల్పన

కొన్ని కొన్ని సినిమాల్లో విడివిడిగా చూసినప్పుడు చాలా డిపార్ట్మెంట్ల పని తీరు చాలా బాగుంటుంది.. కానీ మొత్తం సినిమాని చూసినప్పుడు ఏదో కొరత కనిపిస్తుంది. ఆశించిన స్థాయిలో మెప్పించదు. అలా మెప్పించ లేకపోయిన ఒకానొక సినిమా 'స్వరకల్పన.' కళాత్మక చిత్రాల నిర్మాణానికి పెట్టింది పేరైన పూర్ణోదయా సంస్థ నిర్మించిన సినిమాల్లో పరాజయం పొందిన అతి కొద్ది సినిమాల్లో ఒకటి. నిర్మాత ఏడిద నాగేశ్వర రావుకి నిర్మాణ విలువల పరంగా అసంతృప్తిని మిగిల్చిన ఏకైక సినిమా. అలాగే దర్శకుడు వంశీ ఖాతాలో ఉన్న ఫ్లాపుల్లో ఒకానొకటి.

ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ ('అమర్' పేరుతో) సంగీతం అందించిన ఈ సినిమాలో పాటలు ఇవాల్టికీ ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉంటాయి.. ముఖ్యంగా 'వసంతం పల్లకీ' పాట. జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రాసిన 'సరిగమపదని' పాట సాహిత్య పరంగా ఓ ప్రయోగం. ఈ యుగళగీతం మొత్తంలో కేవలం సప్తస్వరాలు మాత్రమే అంటే 'స రి గ మ ప ద ని' అనే అక్షరాలు మాత్రమే ఉంటాయి. వినసొంపుగా ఉండి, మళ్ళీమళ్ళీ వినాలనిపించే పాట ఇదికూడా.

పాతికేళ్ళ క్రితం పల్లెటూళ్ళు, ముఖ్యంగా గోదారొడ్డున పల్లెటూళ్ళు ఎలా ఉండేవనడానికి ఉదాహరణగా ఈ సినిమాలో లోకేషన్లని చూపించవచ్చు. కోట శ్రీనివాసరావు పోషించిన పాత్ర అమాయకపు రాజుగారు లాంటి మనుషులు దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో సందర్భంలో తారసపడే ఉంటారు. ఆయన ఆస్తిమీద కన్నేసిన సొంత బావమరిది చంటి (తనికెళ్ళ భరణి) లాంటి మనుషులు ఏ దివాణం కథని కదిపినా కనిపిస్తారు.

వంశీ కథానాయిక వాయిల్ చీర కట్టినా అందంగానే ఉంటుందనడానికి ఉదాహరణ ఈ సినిమా హీరోయిన్ సీత. వంశీ మార్కు వాలుజడా, పావలాకాసంత నల్ల బొట్టూ, కళ్ళకి తీర్చిదిద్దిన కాటుకా, కొంత ముగ్ధత్వం, మరికొంచం చిలిపితనం.. ఎవరో మనకి బాగా తెలిసిన అమ్మాయే అనిపిస్తుంది తప్ప, ఎక్కడినుంచో ఊడిపడ్డట్టు కనిపించదు. ఇక హీరో ఏడిద శ్రీరామ్ (నిర్మాతగారబ్బాయి) అస్సలు హీరోలాగే అనిపించడు. నాయిక పాత్ర బలమైనది కావడం వల్ల అతనిది కేవలం సపోర్టింగ్ రోల్ అనిపిస్తుందే తప్ప, కథానాయక పాత్ర అనిపించదు.

కథ చెప్పాలంటే, తెలుగు వాళ్లకి అత్యంత ఇష్టమైన కథ. నలుపు-తెలుపు రోజుల్లోనే 'మిస్సమ్మ' గా వచ్చి బాక్సాఫీసుని కొల్లగొట్టేసిన కథ. కాకపొతే ట్రీట్మెంట్ లో కొంచం తేడా అంతే. రాజుగారమ్మాయి హైమ తన ఐదో ఏట అంతర్వేది తీర్ధంలో తప్పిపోతుంది. రాజుగారి భార్య (అన్నపూర్ణ) కి మతి స్థిమితం తప్పి, హైమ ఆడుకునే బొమ్మనే హైమగా అనుకుంటూ ఉంటుంది. ఆ బొమ్మ తోడిదే లోకం ఆవిడకి. లోకజ్ఞానం ఏమాత్రం లేని రాజుగారికి స్నేహితుడూ, గురువూ, సలహాదారూ అన్నీ ఎదురింటి జేవీ సోమయాజులే. ఆయనకి పిల్లల్లేరు. భార్య డబ్బింగ్ జానకి మతిమరుపు మనిషి.

ఆ ఊళ్లోకి కొత్తగా ఓ ఆరెంపీ డాక్టర్ వచ్చి యాజులుగారింట్లో ఆశ్రయం పొందడం, ఆస్తి కొట్టేయాలనే పన్నాగంతో చంటి ఓ డ్రామా అమ్మాయి సావిత్రి (సీత) ని రాజుగారింట్లో హైమగా ప్రవేశ పెట్టడం దాదాపు ఒకేసారి జరుగుతాయి. చంటికి సాయం చేసి, ఆస్తి కొట్టేసేలా చేయాల్సిన సావిత్రి అందుకు విరుద్ధంగా ఆరెంపీ డాక్టర్తో ప్రేమలో పడి, దానిని పెళ్లి వరకూ తీసుకెళ్తుంది. ఇంతలోనే, రాజుగారికీ యాజులుగారికీ అభిప్రాయ భేదాలు రావడం, మాట్లాడుకోవడం మానేయడం, ఈ పెళ్లి ఆగిపోయే పరిస్థితి రావడం చకచకా జరిగిపోతుంది.

చివరికి రాజుగారు దంపతులు తమ అసలు కూతురిని అత్యంత నాటకీయమైన పరిస్థితిలో కలుసుకోవడంతో సినిమా ముగుస్తుంది. రాళ్ళపల్లి పోషించిన పోస్ట్ మ్యాన్ పాత్ర కథలో కీలకమైనది. అవసరానికి మించి ప్రవేశ పెట్టిన నాటకీయత కథా గమనాన్ని దెబ్బ తీసింది. ఒక ముఖ్యమైన పాయింట్ ని ముందుగానే చెప్పేయడం వల్ల, ఆ తర్వాత సినిమా కేవలం 'సా...గుతున్న' భావన కలుగుతుంది. చంటి పాత్ర మీద దర్శకుడు (రచన కూడా వంశీనే) పెద్దగా దృష్టి పెట్టనట్టుగా అనిపిస్తుంది.

సంభాషణలు చాలావరకు 'శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్' సంభాషణల్ని గుర్తు చేస్తాయి. రెంటికీ సంభాషణల రచయిత తనికెళ్ళ భరణే. సీత పాత్రోచితంగానే చేసినప్పటికీ, ఆమె పక్కన శ్రీరామ్ నటన తేలిపోయింది. చాలాచోట్ల అతను రాజేంద్ర ప్రసాద్ ని అనుకరించేందుకు ప్రయత్నించడం కనిపిస్తుంది. సీతతో పాటుగా కోట, జెవి, అన్నపూర్ణ, డబ్బింగ్ జానకి, రాళ్ళపల్లి, భరణి.. ఇలా అందరూ పోటా పోటీగా నటించే వాళ్ళు కావడంతో చాలా చోట్ల అతని నటన తేలిపోయింది.

శ్రీకాంత్ హీరోగా ఏడేళ్ళ క్రితం వచ్చిన 'కాంచనమాల కేబుల్ టీవీ' కి స్ఫూర్తి ఈ సినిమానే అనిపిస్తుంది. తల్లి పాత్ర రెంటిలోనూ ఒకటే కావడం, పోషించింది కూడా ఒక్కరే (అన్నపూర్ణ) కావడం వల్ల 'కాంచనమాల..' చూస్తుండగా 'స్వరకల్పన' గుర్తొచ్చింది. 'ఆలాపన' అనే అతి పెద్ద ఫ్లాప్ తో సహా అప్పటికే పది సినిమాలు తీసిన వంశీ, టేకింగ్ లో మరికొంచం శ్రద్ధ తీసుకుని ఉంటే మంచి సినిమా అయ్యి, విజయవంతమై ఉండేది ఈ 'స్వరకల్పన' (1989). ఇప్పుడు కూడా, మరీ అంత తీసిపారేయల్సిన సినిమా అయితే కాదు.. మిగిలినవన్నీ పక్కన పెట్టినా కనీసం పాటలు, నేపధ్య సంగీతం విషయంలో.

8 కామెంట్‌లు:

 1. నాటకీయత ఎక్కువైందండీ నిజమే. కాంచనమాల కేబుల్ టీవీ దర్శకుడు వంశీ దగ్గర సహాయదర్శకుడిగా పనిచేశారు. ఆ సినిమా కథ మాత్రమే కాదు, పాటల పోకడ కూడా వంశీ అనుకరణే.
  ఇక ఈ సినిమాలో స, రి, గ, మ, ప, ద, ని అన్న స్వరాల్ని కనీసం గుణింతాల మార్పుకూడా లేకుండా అచ్చం లా రాయడం కత్తిమీద సామే. వంశీ ఆ జొన్నవిత్తులతో చాలా ప్రయోగాలు చేయించుకున్నాడు. సంస్కృత రాక్ సాంగ్, అంత్యాను ప్రాసాలంకారంతో మాటరాని మౌనమిది లాంటివి రాయించుకున్నాడు.

  రిప్లయితొలగించు
 2. ఈ సినిమాకు మొదట రాజశేఖర్ ను హీరోగా తీసుకున్నారు. అయితే ఆయనగారిని భరించలేక, ఏడిద నాగేశ్వరరావు, కోపంతో తనకొడుకునే హీరోగా పెట్టి లాగించేశారు. రాజశేఖర్ నటించిఉంటే ఔట్ పుట్ బాగా వచ్చేదేమో. నేను సినిమా చూడలేదుగానీ మీరు రాసిన టపానుబట్టి అనిపించింది.

  రిప్లయితొలగించు
 3. నేనూ చూసానండీ ఈ సినిమా మొన్న. నాకు కూడా సాగుతున్నాట్తు అనిపించింది. పాటల కోసం సినిమా చూసాను...మంచి పాటలు అన్నీ. మీ అభిప్రాయాలే దాదాపుగా నావి కూడా. సీత మాత్రం బలే ముద్దుగా, అందంగా ఉంది.

  రిప్లయితొలగించు
 4. ఒక్క శ్రీ రామ్ నటన పేలవంగా ఉండటం తప్ప సినిమా మిగతా హంగులన్నీ బాగుంటాయి.
  ఏది ఏమైనా వంశీ కి బలమైన అభిమానిగా ఆయనేది చేసినా నాకు నచ్చుతుంది.
  ( స్టొరీ సిట్టింగ్ లో వంశీ మందేసి, తుపాకీ తో ఎదురుగా ఉన్న ప్రొడ్యూసర్ని పేల్చేసినా సరే నాకు ఆయనే రైటు)

  రిప్లయితొలగించు
 5. @పక్కింటబ్బాయి: పార్ధసారధి వంశీ దగ్గర పనిచేశారా!! నిజమే అయి ఉండొచ్చు, టేకింగ్ లో పోలికలున్నాయి.. ఏకలవ్య శిష్యుడేమో అనుకున్నాను నేను.. నిజమేనండీ, జొన్నవిత్తుల మంచి పాటలు రాశారు వంశీకి.. ధన్యవాదాలు.
  @తేజస్వి: వంశీ-రాజశేఖర్ కాంబినేషన్ ఊహించడానికే ఏదోలా ఉందండీ.. చివరినిమిషంలో నటీనటులు మారడం వంశీ సినిమాల్లో కొత్తేమీ కాదులెండి :)) స్క్రిప్ట్ లో కొన్ని లోపాలున్నాయి కాబట్టి కేవలం హీరో ఖాతాలో వేయలేం.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 6. @ఆ.సౌమ్య: అవునండీ, మెలోడ్రామా శృతిమించింది చాలా చోట్ల.. సీత చాలా బాగుంది.. తనే ప్లస్ ఈ సినిమాకి :)) ..ధన్యవాదాలు.
  @ఆత్రేయ: మీ అభిమానం నాకు చాలా ముచ్చటగా అనిపిస్తోందండీ.. కాకపొతే హీరో ఒక్కడినే బాద్యుడిని చేయలేం. దర్శకత్వ లోపాలున్నాయి కదా.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 7. ee cinema seetha kalla kosam , music kosam enni sarlu chusano lekka ledu.. thanks for reminding

  రిప్లయితొలగించు
 8. @ప్రసూన: అవునండీ.. నేనైతే లొకేషన్ల కోసం కూడా చూస్తాను.. నోస్టాల్జియా.. ..ధన్యవాదాలు..

  రిప్లయితొలగించు