మంగళవారం, ఆగస్టు 23, 2011

గతజన్మ జ్ఞాపకం...

ఒక్కోసారి.. ఏదన్నా ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడో, పాట విన్నప్పుడో, పుస్తకం చదివినప్పుడో లేదా కొత్తవారిని ఎవరినో కలిసినప్పుడు...గతజన్మ జ్ఞాపకమేమో అనిపించే లాంటి స్మృతి ఒకటి చుట్టుముట్టి వెళ్తూ ఉంటుంది నన్ను. ఈ చుట్టుముట్టడం అన్నది సుడిగాలిలా తీవ్రంగా కాక, పిల్లతెమ్మెరలాగా సున్నితంగా ఉండడం వల్ల ఇదీ అని ఇదమిద్దంగా చెప్పలేని ఓ చిత్రమైన అనుభూతి కలుగుతూ ఉంటుంది. అది పరిచితమైన అనుభూతి. నన్ను నేను వెతుక్కునే అనుభూతి.. కొందరు స్నేహితులతో దీనిని పంచుకున్నప్పుడు ఇదేమీ అబ్నార్మాలిటీ కాదనీ వాళ్ళకీ అప్పుడప్పుడూ ఇలా అనిపిస్తూ ఉంటుందనీ తెలిసింది.

అందరికీ హైదరాబాద్ అనగానే ఏవేవో గుర్తొస్తాయి. నాకు మాత్రం మొదట గుర్తొచ్చేది గోల్కొండ కోట. ఎప్పుడు అక్కడికి వెళ్ళినా, ఆ కోటతో నాకు వందల ఏళ్ళ అనుబంధం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. రాళ్ళు, చెట్లు, చేమలు, కట్టడాలు.. ఒకటేమిటి.. అన్నీ కూడా చిరపరిచితంగా అనిపిస్తాయి. ఓరుగల్లు కోట, వెయ్యి స్థంభాల గుడితోనూ ఇదే అనుభవం. మొదటి సారి అక్కడికి వెళ్ళినప్పుడు "ఇది నాకు చాలా బాగా తెలిసున్న ప్రాంతమే" అనిపించింది.. నిజానికి ఏరకంగానూ నాకు తెలియడానికి ఆస్కారం లేదు.

కొన్ని పాతకాలపు దేవాలయాలు, బంగళాలు, కొన్ని పట్టణాలు...ఇవన్నీ కూడా నాక్కలిగించే అనుభూతి ఒక్కటే.. నాకు చిర పరిచయం ఉన్న ప్రాంతాలని. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళూరు వెళ్తే అక్కడి చెరువు గట్టున పెద్ద పెద్ద స్థంభాలతో ఉన్న కరణంగారిల్లు, ఆ లోగిలిలో కాడమల్లి చెట్లు అవన్నీ ఎంతో ఆకర్షించేవి. జనసంచారం లేకపోయినా, ఒక్కడినీ అక్కడ తిరగడానికి ఇష్టపడేవాడిని. పురుగూ పుట్రా ఉంటాయ్ అని ఇంట్లో వాళ్ళు కేకలేసినా నా కాళ్ళు మాత్రం అక్కడికే పరిగెత్తేవి. ఆ లోగిట్లో నాకు ఏదో తెలియని ఆకర్షణ. అదేమిటో ఎంతకీ తెలిసేది కాదు.

ఒకప్పుడు బాగా వినేసి, చాలా రోజులపాటు వినడం మానేసి, మళ్ళీ కొత్తగా అవే పాటలు విన్న సందర్భంలో కలిగే అనుభూతి.. ఇదిగో ఈ శిధిల భవంతులని చూసినప్పుడు కలిగే అనుభూతికి దగ్గరగా అనిపిస్తోంది. "యమునా తీరాన.. రాధ ఒడిలోన.. కృష్ణుడి ప్రేమ కథ..." ఒకప్పుడు నేను దాదాపు ప్రతిరోజూ విన్న పాట. ఎలా వచ్చిందో తెలియదు కానీ, ఏళ్ళ తరబడి గ్యాప్ వచ్చేసింది.. మొన్నామధ్య మిత్రులొకరు తనకి నచ్చిన రాధాకృష్ణుల పాటలు పంపుతూ, ఈ పాటనీ వినమన్నారు. గతజన్మ జ్ఞాపకం లాగే అనిపించింది తప్ప, కేవలం కొన్ని దశాబ్దాల క్రితం విన్న పాటలా అనిపించలేదు.

"మనం ఎప్పుడో ఎక్కడో కలిశామనిపిస్తోంది" నేను చాలా తరచుగా కాకపోయినా, కొంచం ఎక్కువసార్లే వాడిన మాట ఇది. కొందర్ని చూడడం మొదటిసారే అయినా, ఎక్కడో, ఎప్పుడో చూసినట్టుగా అనిపించడం నాకు కొత్త కాదు. ఎక్కడా వాళ్ళని చూడడానికి అవకాశం ఉండదు. అయినప్పటికీ, అదే మనుష్యులు, అవే మాటలు.. "బహుశా ఇలాంటి వాళ్ళనే కలిసి ఉంటాను" అని సరిపెట్టుకుంటూ ఉంటాను. అయితే, ఒక్కోసారి అవతలి వారినుంచి కూడా అదే స్పందన వస్తూ ఉంటుంది, ఆశ్చర్యంగా. "మేబీ యువర్ బ్రదర్?" అంటారు కొందరు, విడిచిపెట్టకుండా. "నో చాన్స్" అనేస్తాను నేను.

పుస్తకాలతో, మరీ ముఖ్యంగా కథలతో, ఇలాంటి అనుభవాలు కోకొల్లలు. వర్షం, ముసురు నేపధ్యంగా వచ్చే ఏ కథని చదవడం మొదలు పెట్టినా, ఆ కథ నాకు తెలుసనో, నా కళ్ళెదురుగా జరిగిందనో అనిపిస్తూ ఉంటుంది. కొన్ని కథలు ఊహించిన ముగింపుకే చేరిన సందర్భంలో ఈ భావన మరింతగా బలపడుతూ ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటంటే, ఎప్పుడో విన్న పాట మళ్ళీ విన్నప్పుడు కలిగే అనుభూతి, ఎప్పుడో చదివిన పుస్తకం మళ్ళీ చదివినప్పుడు కలిగే అనుభూతీ ఒక్కటి కాదు. పాట ఓ అనుభూతిగా చుట్టుముడితే, పుస్తకం ఓ జ్ఞాపకంలా పలకరించి వెళ్తుంది.

"పొరపాటు.. కథ కాదు.. గతజన్మలోని జాజిపూల సువాసనేమో.." అంటాడు వంశీ, తను తీసిన 'అనుమానాస్పదం' సినిమా కోసం తనే రాసిన 'ప్రతిదినం నీ దర్శనం' పాటలో. గత జన్మలూ, మరుజన్మలూ శాస్త్రానికీ, హేతువాదానికీ అందవు. అలాగే మనక్కలిగే అనుభవాలూ, అనుభూతులూ అన్నీ శాస్త్ర సమ్మతంగానూ, శాస్త్రం పరిధిలోనూ ఉండవు. మనతో సహా ఎవరికీ చెడు చేయనంత వరకూ, వీటిని శాస్త్రపు తూకం రాళ్ళతో తూచకుండా కేవలం అనుభూతులుగానే ఆస్వాదించడం మంచిదనిపిస్తూ ఉంటుంది. కొన్నికొన్ని సార్లు లాజిక్కులు వెతకడం కన్నా, నిశ్శబ్దంగా ఊరుకోవడమే ఉత్తమం కదా.. తరచి చూస్తే, ఏ శాస్త్రానికీ అందనివి చాలానే ఉంటాయి మన జీవితంలో...

18 కామెంట్‌లు:

 1. నిజం.. బాగా స్పందిన్పజేసారు. మనసు లోపలి పొరలలో..ఓ.. కదలిక.. మస్తిష్కంలో..ఓ..ముద్ర.. జన్మ జన్మాల బంధమంటారే అలాటిదన్నమాట.

  రిప్లయితొలగించు
 2. మురళి మీరు ప్రస్తావించిన రెండు పాటలు నాకు చాల యిష్టం ,
  అలా గే మీరు వెలి బుచ్చిన అనుభవాలతో నేను ఎకిభవిస్తా
  స్వీయ అనుభవాలని యిల రాస్తే పిచ్చి అనుకునే ప్రమాదం వుంది .
  కాని కొంత మందిని మొదటి సారి చూసినప్పుడే
  ఎప్పటి నుంచో తెలుసన్న భావం కలుగుతుంది , .
  కొంతమందిని చూడ గానీ అకారణమైన కోపం వస్తుంది .
  ఏదో తెలియని భంద మిది అని పాడుకుంటూ ముందుకు సాగి పోవడమే .

  రిప్లయితొలగించు
 3. ఫ్రెంచ్ వాళ్ళయితే ఒకే ఒక ముక్కలో Déjà vu అని అందంగా చెప్పేసి చేతులు దులిపేసుకుంటారేమో కానీ, తెలుగులో మా చెడ్డ చిక్కే! ఇలాంటి భావనలకి పేరు పెట్టలేం, మీరు చెప్పినట్టు ఎవరికీ ఇబ్బంది లేనంతవరకూ తర్కించకుండా అనుభూతులను మూటకట్టుకోవడం మినహాయించి. Déjà vu (2006, Sci-fi)అని సినిమా కూడా వచ్చిందండోయ్. బాగుంటుంది.

  యమునా తీరాన పాట విన్నానో, లేదో తెలియడం లేదు. " .. జాజిపూల సువాసనేమో" సరిగ్గా ఈ వాక్యం వినగానే "ఎవర్రాసారూ.." అని వెతికి వంశీ అని తెలియగానే రవంత ఆశ్చర్యపోయాను కూడా! వంశీ రాయలేడని కాదు. అదంతే.

  రిప్లయితొలగించు
 4. "మొదటి సారి అక్కడికి వెళ్ళినప్పుడు "ఇది నాకు చాలా బాగా తెలిసున్న ప్రాంతమే" అనిపించింది.. నిజానికి ఏరకంగానూ నాకు తెలియడానికి ఆస్కారం లేదు"నాకు అచ్చం ఇలాటి ఫీలింగ్సే కలుగుతుంటాయి .టపా చాలా బాగుంది .

  రిప్లయితొలగించు
 5. నాకూ ఇది సురపరిచితమే! :)
  అన్నింటి కంటే ఆశ్చర్యమేమిటో చెప్పమంటారా, మాలికలో టపా పేరు చూసి 'నెమలి కన్ను ' లోకి తొలిసారి తొంగి చూసి చదవడం మొదలెట్టిన క్షణం నుండీ , నాలో నేను అసంకల్పితంగా "పొరపాటు, కథ కాదు..గత జన్మలోని జాజిపూలా సువాసనేమో.." అనే పాడుకుంటున్నా. టపా చివరికి వస్తూండగానే మీ నుండీ అదే పాట.!

  భలే బాగుంది. బహుశా ఈ ఆశ్చర్యమే, కొన్ని క్షణాల పాటు నన్ను కమ్మేసిన జ్ఞాపకాల జాజిపూల సుగంధమే, మీకో అభినందనను అందించమంటూ నన్ను ఆపేసింది.
  అక్షరాల వెంట పరుగులు తీయించిన శైలికి జోహార్లు. :)

  రిప్లయితొలగించు
 6. >> ఎప్పుడో విన్న పాట మళ్ళీ విన్నప్పుడు కలిగే అనుభూతి, ఎప్పుడో చదివిన పుస్తకం మళ్ళీ చదివినప్పుడు కలిగే అనుభూతీ ఒక్కటి కాదు.
  ఈ మాట తో నెను కూడా 100% ఎకీభవిస్తాను.
  మీరు గోల్కొండ, గత జన్మ అంటూ ఉంటే, నాకు సలొమీ నటించిన కొకిల సినిమా రాగింగ్ కామెడీ సీన్లు గుర్తుకు వస్తున్నాయి. ;) ఆ సినిమా నుంచే నేను సలొమీ ఫాన్ ని. ;)

  రిప్లయితొలగించు
 7. Déjà vu :)))
  ఇది మీరు చెప్పినంత తరుచూ కాకపోయినా ప్రతి ఒక్కరికి అనుభవం అవుతుంది అనుకుంటానండి .మీరు చెప్పినట్లు ఆ జ్ఞాపకాలు పిల్లతెమ్మెరలాగా సున్నితంగా ఒక మంచి అనుభూతిని ఇస్తాయండి .

  నాకు కొన్ని వాసనలు కూడా ఎప్పటివో జ్ఞాపకాలు గుర్తుకు తెస్తాయండి ఒక్కొక్కసారి :)))

  రిప్లయితొలగించు
 8. >>తరచి చూస్తే, ఏ శాస్త్రానికీ అందనివి చాలానే ఉంటాయి మన జీవితంలో...
  True..

  రిప్లయితొలగించు
 9. సాయి కుమార్ కార్యక్రమం అనుకున్నా మొదట హెడ్డింగ్ చూసి :). మీరు దేని గురించి రాసినా అందంగా రాయగల సమర్ధులండీ. అస్సలు బోరు కొట్టదు

  రిప్లయితొలగించు
 10. ఒక కవితలో
  "నే జయించిన క్షణం యుగాల నిర్నిరీక్షణం
  నేడు కుసుమించిన రస వనం శిశిర మధన తపో ఫలం"
  అని నేను చాలా చిన్న వయసులో రాశాను. చిత్రమేమిటంటే నేను "రాసిన" కవితలో నిర్నిరీక్షణం అంటే అర్ధం ఏంటని పెద్దల్ని అడిగి తెలుసుకోవడం. ఇక రెండో లైన్ లో రాసిన భావ వైచిత్రి ఇక ఊహకే అందని వయసు. మా గురువు గారిని ఇదేంటని అడిగితే జన్మజన్మల సంస్కారాల సంచికగా చిత్తం ఉంటుంది(పుట్టిన నాటి నుండి రికార్డు చేసేది మనసు) దానిలో ఏనాటి భావనలో ఇలా ప్రచోదితమయ్యుంటుందన్నారు.

  రిప్లయితొలగించు
 11. పక్కింటబ్బాయి గారు,

  "భావ స్థిరాణి జననాంతర సౌహృదాని" అంటారు కదండీ! అతి చిన్న వయసులో ఎవరో నేర్పినట్టు విచిత్రాలు చేసేవారిని చూస్తే పూర్వజన్మ గంధం అనక ఇంకేం అనగలం? మీరూ అలాగే రాసిఉంటారేమో! హేతువేదేనా తర్కానికి అందని అనుభూతుల మాలికే జీవితం. పూర్వజన్మ వాసనలు,సంస్కారం వద్దంటే పోయేవి కావు, రమ్మంటే వచ్చేవీ కావు.

  విశ్వనాథ వారి మాటలు గుర్తొస్తున్నాయ్..

  చిన్ని కిన్నెరా సన్నని యెలుగులు
  పిన్నగాలి కెరటాల చొచ్చును
  ఎన్నడొ వెనుకటి బ్రతుకున మిక్కిలి
  విన్నవాటివలె విరవిరబోవును !!

  ఆయనకీ Déjà vu గురించి తెలుసునే! :)

  రిప్లయితొలగించు
 12. @వనజ వనమాలి: అవునండీ.. ధన్యవాదాలు.
  @రవిగారు: ధన్యవాదాలండీ..
  @కొత్తావకాయ: డెజావూ గురించి రాద్దామా అనుకునే ట్రాక్ తప్పే ప్రమాదం ఉందనిపించి ఆగానండీ.. నేనూ మొదట 'ప్రతిదినం' రాసింది వేటూరి అనే అనుకున్నాలెండి!! ..ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 13. @చిన్ని: పర్లేదైతే.. నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు :)) ..ధన్యవాదాలండీ..

  @మానస చామర్తి: ఆ జాజిపూల సుగంధాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలండీ..

  @చాతకం: భలే యాదృచ్చికం!! నాక్కూడా 'కోకిల' సినిమా నచ్చుతుంది, కాకపొతే సెకండాఫ్ లో కన్ఫ్యూజ్ అయ్యి మనల్ని కన్ఫ్యూజ్ చేశాడు దర్శకుడు.. ఆ గోల్కొండ సీన్, పాట చూసి 'అరె.. నా ఆలోచనలే' అనుకున్నాను కానీ, చివరికది ర్యాగింగ్ గా తేల్చేశారు :( ..ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు
 14. @శ్రావ్య వట్టికూటి: అబ్బే.. నాకేమీ తరచుగా కాదండీ.. కాకపొతే అలాంటి అనుభూతులన్నీ ఒక చోట పోగేశాను కాబట్టి మీకలా అనిపించిందేమో.. వాసనల విషయంలో నేనూ మీతో ఏకీభవిస్తా.. సెం పించ్ మరి, కాకపొతే అరుదుగా!! ధన్యవాదాలండీ..

  @రిషి: సాయికుమార్ ప్రోగ్రాం 'గత జన్మ రహస్యం' కదండీ? ఒకటో, రెండో ఎపిసోడ్స్ చూసి, ఆసక్తి లేక మానేశా.. ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు
 15. @పక్కింటబ్బాయి: గత జన్మ సంస్కారం అనే మాట నేను చాలా సార్లు విన్నానండీ.. నిజం ఉండొచ్చు.. మరీ ముఖ్యంగా సంగీతం, సాహిత్యం, నృత్యం లాంటి కళలు అలవోకగా పట్టుపడిపోయే వాళ్ళ విషయంలో వాడతారు.. మీ కవితా పంక్తి చాలా బాగుంది.. చిన్న వయసులో, అర్ధం తెలియకుండా అంటే.. తప్పకుండా అలాంటి సంస్కారమేదో పనిచేసిందనే... ...ధన్యవాదాలు.

  @కొత్తావకాయ: అసలు విశ్వనాథ వారికి తెలియని విషయం ఉందా? అని సందేహం కలుగుతూ ఉంటుందండీ నాకు.. అన్ని నవలలూ చదవలేదు నేను :(

  రిప్లయితొలగించు
 16. అవునండీ. చివరి పేరాతో పూర్తిగా ఏకీభవిస్తాను.

  రిప్లయితొలగించు
 17. మీలాగె నాకు వర్షం కాన్సెప్ట్తో కథలూలాగే సముద్రంతో అనుబంధం ఉన్న కథలూ ఎందుకో బాగా నచ్చుతాయ్... ఇంకా అవన్నీ నిజంగానె జరిగాయని అనిపిస్తుంటుంది కూడా! నాకైతే వైజాగ్ ఎందుకో చాలా ఇష్టం. నేనిప్పటికి ఓక్ రెండు,మూడు సార్లు మాత్రమే వెళ్ళా! కాని ఎందుకో అది నా డెస్టినేషన్ లాగా అనిపిస్తుంది. అక్కడ రైల్ దిగుతంటే...ఏదో పులకింత....చెప్పలేను :) పొయిన జన్మలో నేనేమన్న వైజాగ్ సముద్రంలో చేపనేమో ;)

  భలే ఉంది ఈ టపా!

  రిప్లయితొలగించు