గురువారం, ఆగస్టు 18, 2011

నర్తనశాల

తన నట సామర్ధ్యం మీద నమ్మకం ఉన్న నటుడు ఎలాంటి పాత్రని చేసి మెప్పించినా, ఇమేజితో సంబంధం లేకుండా అభిమానులు ఆదరిస్తారని యాభయ్యేళ్ళ క్రితమే నిరూపించిన తెలుగు నటుడు నందమూరి తారకరామారావు. అప్పటికే వందకి పైగా సినిమాల్లో నటించి, అటు పౌరాణికాలు, ఇటు సాంఘికాలు మధ్యే మధ్యే జానపదాలు ఇలా అది ఇది ఏమని అన్నిరకాల సినిమాలూ చేస్తూ ఆంధ్రదేశాన్ని ఊపేస్తున్న వేళ, అటూ ఇటూ కాని బృహన్నల పాత్ర పోషించడమంటే ఏ నటుడికైనా అదో పెద్ద సాహసమే..

పైగా ఆ పాత్రలో కనిపిచాల్సింది ఏ ఐదు పది నిమిషాలో కాదు, మూడుగంటల పాటు సాగే సినిమాలో దాదాపు రెండున్నర గంటల పాటు!! అయినప్పటికీ సాహసానికి సై అన్నాడు తారకరాముడు. ఫలితమే రాజ్యం పిక్చర్స్ నిర్మించిన 'నర్తనశాల' అనే విరాటపర్వం. మరో రెండేళ్లలో యాభయ్యేళ్లు పూర్తి చేసుకోబోతున్న ఈ పౌరాణిక చిత్రానికి దర్శకుడు 'పౌరాణిక బ్రహ్మ' గా పేరుపొందిన కమలాకర కామేశ్వర రావు. కథ, మాటలు, పద్యాలతో పాటు కొన్ని పాటలని రాసింది సముద్రాల సీనియర్ గా పిలవబడే సముద్రాల రాఘవాచార్యులు కాగా సుస్వరాలని అందించింది సుసర్ల దక్షిణామూర్తి.

ఈ సినిమాకి సాంకేతిక వర్గమంతా కలిపి ఒక స్థంభమైతే, అర్జునుడిగానూ, బృహన్నలగానూ నటించిన ఎన్టీఆర్, సైరంధ్రి పాత్రలో సావిత్రి, కీచకుడిగా కనిపించిన ఎస్వీరంగారావు మిగిలిన మూడు స్థంభాలూ అనడానికి సందేహం లేదు. కథ కొత్తదేమీ కాదు. అనాది కాలం నుంచీ, నిన్న మొన్నటివరకూ - అంటే కేబుల్ టీవీలో ప్రవేశించనంత వరకూ - వర్షాల కోసం పల్లెటూళ్ళ చెరువుగట్ల మీద భక్తితో చదివించిన విరాటపర్వమే. మహాభారత కథ. అరణ్య వాసం పూర్తి చేసుకున్న పాండవులు ఒక ఏడాది అజ్ఞాత వాసం పూర్తి చేయడం కోసం విరాటరాజు కొలువులో మారువేషాల్లో చేరడం, గడువు పూర్తయ్యాక ఉత్తర గోగ్రహణంలో కౌరవులపై విజయం సాధించి హస్తినకి తిరిగి వెళ్ళడం.

సినిమా ప్రారంభమే ఇంద్రసభకి అతిధిగా వెళ్ళిన అర్జునుడికి స్వాగతం పలుకుతూ ఆస్థాన నర్తకి ఊర్వశి 'నరవరా..' పాట పాడుతూ చేసే మెరుపు నృత్యంతో. అటుపై ఊర్వశి అర్జునుడిపై మనసు పడడం, మాతృ సమానురాలవంటూ అర్జునుడామెని తిరస్కరించడం, అవమానభారంతో ఊర్వశి పేడిగా జీవించమని అర్జునుడికి శాపం ఇవ్వడం, ఇంతలో అక్కడికి వచ్చిన ఇంద్రుడు ఆ శాపాన్ని అజ్ఞాతవాస కాలంలో వరంగా మార్చుకొమ్మని అర్జునుడికి సలహా ఇవ్వడం చకచకా సాగిపోతాయి. ధర్మరాజు విరాటరాజు సలహాదారుగానూ, భీముడు వంటవాడుగానూ, నకుల సహదేవులు గుర్రాల శాల, గోశాలల్లోనూ పనులకి కుదరగా, ద్రౌపది అంతఃపురంలో పూలమాలలల్లే సైరంధ్రిగా చేరుతుంది.

రాకుమారి ఉత్తరకి నాట్యం నేర్పే గురువుగా బృహన్నల అవతారం ఎత్తుతాడు అర్జునుడు. ఓపక్క పాండవుల అజ్ఞాతవాసాన్ని భగ్నం చేసేందుకు కౌరవులు చేసే కుటిల యత్నాలు, వాటిని తిప్పి కొడుతూనే అజ్ఞాతంలో వచ్చే సమస్యలని పాండవులు ఎదుర్కొంటూ ఉండగా ప్రవేశిస్తాడు కీచకుడు, మహారాణి సుధేష్ణ సోదరుడు. అత్యంత శక్తివంతుడు. తొలిచూపులోనే సైరంద్రిని మోహిస్తాడు. అంతే కాదు, సైరంద్రిని తన బసకి పంపకపోతే రాజ్యం సర్వ నాశనం చేస్తానని సుధేష్ణని బెదిరిస్తాడు కూడా. మరోపక్క తన తండ్రులని వెతుకుతూ వచ్చిన అర్జునకుమారుడు అభిమన్యుడు ఉత్తరతో ప్రేమలో పడిపోతాడు. భీముడి చేతిలో కీచకుడు మరణించడం, ఇంతలోనే సుశర్మ, కౌరవులు దక్షిణ, ఉత్తర గోగ్రహణాలకి పాల్పడడం, పాండవుల అజ్ఞాతవాసం ముగియరావడం దాదాపు ఒకేసారి జరుగుతాయి.

యుద్ధం గెలిచి, విరాటరాజుకు తమ నిజరూప దర్శనం ఇచ్చి, ఉత్తరాభిమన్యుల పెళ్ళి జరిపించడంతో 'శుభం' కార్డు పడుతుంది సినిమాకి. తెలిసిన కథే అయినా, ఎన్నిసార్లు చూసినా, ఎప్పుడూ ఎక్కడా విసుగు రాకపోడానికి కారణం బలమైన స్క్రీన్ ప్లే, సంభాషణలు, నటీనటుల నటన మరియు నిర్మాణ విలువలు. చిన్న చిన్న సంభాషణల ద్వారా జీవిత సత్యా లెన్నింటినో పలికించడం సముద్రాల వారికి పెన్నుతో పెట్టిన విద్య. ముందే చెప్పినట్టుగా ఎన్టీఆర్, ఎస్వీఆర్, సావిత్రి నువ్వా-నేనా అన్నట్టుగా నటించారు. ఎక్కడా 'అతి' పోకడలు కనిపించవు. ఆవిధంగా నటన రాబట్టుకున్న ఘనత దర్శకుడు కమలాకరదే. మరీ ముఖ్యంగా ఎస్వీఆర్-సావిత్రి కాంబినేషన్ సన్నివేశాల్లో క్లిష్ట సమాసాలతో నిండిన డైలాగుల్ని ఎస్వీఆర్ సమోసాలు తిన్నంత సులువుగా చెప్పేస్తుంటే, సావిత్రి కాబట్టి పోటీగా నిలబడింది అనిపించక మానదు. జకార్తాలో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమనటుడు అవార్డు అందుకున్నారు ఎస్వీఆర్.

సైరంద్రికి పెద్దగా డైలాగులు లేవు. సావిత్రిని ఆ పాత్రకి అనుకున్నాక, ఇక డైలాగులు అనవసరం అనుకుని ఉంటారు. "ప్రభువుల వెంటే నేనూ" అని చెప్పేటప్పుడు ఆత్మాభిమానం, ఆర్జునుడిని బృహన్నలగా చూసినప్పుడు ఆశ్చర్యం, "జననీ శివ కామినీ" అని పాడేటప్పుడు ఆర్తి, కీచకుడి చేతిలో అవమానానికి గురైనప్పుడు ఆవేశం, ఆక్రోశం ఇవన్నీ కనుపాప కదలికలతో అభినయించింది సావిత్రి. బృహన్నల పాత్ర మీద ఏ ఇతర పాత్రల ప్రభావాన్నీ పడనివ్వలేదు ఎన్టీఆర్. కేవలం ఈ పాత్ర పోషణ కోసమే శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకున్న కమిట్మెంట్ ని అభినందించి తీరాలి. అభిమన్యుడిగా శోభన్ బాబు, కృష్ణుడిగా కాంతారావు చిన్న పాత్రల్లో మెరిశారు. శోభన్ లో కనిపించే కొద్దిపాటి బెరుకుని సులువుగానే పట్టుకోవచ్చు.

దాదాపు అన్ని పాటలూ ఇవాల్టికీ జనం నాలుకల మీద ఆడేవే కావడం 'నర్తనశాల' కి సంబంధించిన మరో విశేషం. 'నరవరా..' వినగానే జానకి గుర్తొచ్చి తీరుతుంది. ఈ సినిమా పేరు చెప్పగానే అప్రయత్నంగానే గుర్తొచ్చేసే పాట 'సలలిత రాగ సుధారస సారం..' మంగళంపల్లి వారిచేత పాడించడం సరైన ఎంపిక. 'జననీ శివకామినీ..' 'సఖియా వివరింపవే..' 'దరికి రాబోకు రాజా' ఈ మూడూ సుశీల మార్కు పాటలు. దేనికదే ప్రత్యేకం. ఇక డ్యూయెట్ ఎలా ఉండాలో చెప్పే పాట "ఎవ్వరికోసం ఈ మందహాసం.." ఉత్తరకుమారుడిని హాస్యానికి వాడుకున్నారు. 'మాయాబజార్' ఛాయలు పడని విధంగా ఈ పాత్రని పోషించారు రేలంగి. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎన్టీఆర్ కాంబినేషన్ సన్నివేశాల్లో రేలంగి నటన మర్చిపోలేం.

భీముడిగా నటించిన దండమూడి రాజగోపాల్ నిజజీవితంలోనూ మల్లయోదుడే! ధూళిపాల దుర్యోధనుడు కాగా, కైకాల దుశ్శాసనుడు, ప్రభాకర రెడ్డి కర్ణుడు. వీళ్ళందరివీ అతిధి పాత్రలే. 1964 సంవత్సరానికి గానూ జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్రం అవార్డుని అందుకున్న 'నర్తనశాల' ని రంగుల్లోకి మారుస్తారన్న వార్తలు వచ్చాయి, రంగుల 'మాయాబజార్' విడుదలైన సమయంలో. ఇప్పటివరకూ అందుకు సంబంధించిన వివరాలేవీ లేవు. స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, మరీ ముఖ్యంగా నటన ఎలా ఉండాలో చెప్పే రిఫరెన్స్ సినిమాల్లో ఒకటైన 'నర్తనశాల' ని మళ్ళీ చూసైనా, "ఫ్యాన్స్ ఒప్పుకోరు" లాంటి శషభిషలు విడిచిపెట్టి ఇప్పటి కథానాయకులు వైవిధ్యభరితమైన పాత్రలు ఎంచుకుంటే బాగుండును..

24 కామెంట్‌లు:

  1. క్షమించండి... ఫ్యాన్స్ ఒప్పుకోరు... :)

    కాని, హీరోల సంగతి పక్కన పెడితే...నేటి తరం ప్రేక్షకుల తప్పే ఎక్కువుందేమో అనిపిస్తుంది...
    ఈమధ్య, కొంతమంది హీరోలు తమ ఇమేజ్ ను పక్కన పెట్టి తీసిన సినిమాలను ప్రేక్షకులు ఫ్లాపు సినిమాలు గా మార్చారు... పాపం ఇక ఎవరు మాత్రం ధైర్యం చేస్తారు... :(

    రిప్లయితొలగించండి
  2. సినిమాలు ఎక్కువగా చూసే అలవాటులేక మిస్సయినా... ఈయనవల్ల ఈ మధ్యనే చూశాను.

    చాలా మంచి సినిమా.

    రిప్లయితొలగించండి
  3. వర్షాల కోసం చెరువు గట్లపై చదివిన విరాటపర్వమే! ఎంత బాగా గుర్తు చేసారు. మరిచేపోయాను ఈ సంగతి నేనయితే. వర్షాల కోసం విరాటపర్వం, పెళ్ళి కాని అమ్మాయిల చేత రుక్మిణీ కల్యాణం, గర్భవతుల చేత రామాయణంలో బాల కాండ, పిల్లలచేత భాగవతంలో దశమ స్కంధము చదివించడం వెనుక ఫలాపేక్ష సంగతి పక్కన పెడితే ఎంత చక్కటి పద్యాలు, ఎంత అందమైన సంస్కృతి తరువాతి తరాలకు అందించడమో కదా పెద్దల ఆశయం అనిపిస్తుంది.

    సినిమా సంగతి కొస్తే మాట్లాడడానికేమీ లేదు. మీ టపాలో వాక్యాలే సంగ్రహించి వ్యాఖ్యలో చర్వితచర్వణం చేసుకోవడం తప్ప.

    "సఖియా వివరించవే" పాటకంటే రసపుష్టి గల ప్రోషిత పతిక మనసుని తెలిపే గీతం ఇంకొకటి లేదు, రాదు. ఆ పాటలో సావిత్రి రక్తి కట్టించిన మోహాన్ని గురించిన కూడా 7వ పేరాలో చెప్పి ఉంటే ఇంకా సంబరపడిపోయేదాన్ని. సముద్రాల వారు పదే పది వాక్యాల్లో ఎంత సొగసు నింపేసారో !

    మహ చక్కటి టపా. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. *****!five stars!mangalam palli paaTalloe naaku nachchina okaeokka paaTa "salalita raaga". migilinavaalhlha gurinchi meeru cheppaesaaru.

    రిప్లయితొలగించండి
  5. బాగా రాశారు. నర్తనశాలంటే గుర్తొచ్చేవి మొదట SVR తరువాత భీష్మ, ద్రోణాదులను ఉత్తరకుమారునికి చేయబడే పరిచయం, 'ఏనుంగు నెక్కి', పద్యం.
    'ఆడినదీ గిరి రాజ సుతా
    నటరాజు మది రంజిలగా'
    (ఘంటసాల, జానకి) అనే పాట ఇందులోదే అని చదివాను, కాని సినిమాలో లేదనుకుంటా.

    రిప్లయితొలగించండి
  6. ఓహ్ ఏంటి మురళీ గారూ ఇది కలా నిజమా?ఇప్పుడే నేను చూసి చాలా రోజులయిందిలే అనుకుంటూ ఈ సినిమా చూసి మెయిలేదో వచ్చిందని చూసుకుంటే మీ పోస్ట్. అంతా యాద్ యాద్ యాదురుచ్చికం అన్నమాట.(మీదీ గోదారి,నాదీ గోదారే,మనిద్దరిదీ గోదారే...హ్హహ్హహ్హ).

    "కామెంటు రాసి అచ్చేసే లోపు కరంట్ పోయింది,అందుకే కొంచం ఆలస్యంగా..."

    ఇంక రాయడానికేముంది అంతా మీరే రాసేసాక.అందుకే నా వంతుగా ఓ చిన్న నూలుపోగు.
    జై సింహబలాయనమహా,జై సైరంధ్రాయనమహా,జై బృహన్నలార్జునాయనమహా.

    ఊర్వశికి అర్జునుడికి మధ్య సంభాషణ....
    ఊర్వశి:
    "అన్న ఇల్లాలు తమ్మునికి అమ్మగాదే,
    ఎటుల పాంచాలి పొందు ఇచ్చగించితీవు,
    తాళి ఎరుగని నేనెట్టి తల్లినయ్యా,
    వావివరసలు తలపగా వలదు విజయా...విజయా"

    అర్జుండు: చాలించు నీ పాండిత్యం.ద్రౌపదికి మాకూ గల అనుబంధం నీకు అర్ధం కాదు,అది...

    "ఆడి తప్పని మాయమ్మ అభిమతాన,
    సత్యమెరిగిన వ్యాసుని శాసనాన,
    పడతికి ఈశ్వరుడొసగిన వరబలాన,
    నడచుచున్నట్టి ధర్మబంధమది వనితా..ఆ.ఆ..ఆ"

    • మామయ్యకు "మ"కారాల మీద మమకారమెక్కువ వలలా,మకారాలంటే మాంసం, మదిర, మగువ.
    • •భయము లేదులే వలలా గంధర్వులే కాదు గగనసీమంతా కలిసివచ్చినా చిటికెలో వారిని ఓడించి ఈ సింహబలుడు ఆ సింగారిని చేపట్టే తీరుతాడు హ్హహ్హహ్హహ్హ.
    • బెదిరిస్తున్నావా మదిరాక్షీ,నన్నెదిరించి నిలబడగడవాడీ మత్స్యదేశంలోనే లేడు.ఈ సింహబలుడంటే ఎవరనుకున్నావు వైరివీరకుంజరయూధంబులకు సింహస్వప్నం, నారీజనమంజుల హృదయాలకు మధురస్వప్నం.మాలినీ వీడు పట్టినపట్టు వీడడు,నిన్ను చేపట్టక మానడు.
    • మాలినీ రసికచక్రవర్తినని మురిసిపోయిన నా "గర్వము సర్వమూ ఖర్వము" చేసావు.

    ఇలా ఎన్నని,రాసుకుంటూ పోతే ఓ మాహాభారతమే అవుతుంది.

    ఇంక మరి ఆ చివరి సీన్లో పద్యం ఘంటసాల మాష్టారి గొంతులో ఖంగు ఖంగు మంటూ అలా అలా సమ్మోహనాస్త్రంలా దూసుకొస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచిపోదూ,రోమాలు నిక్కబొడుచుకోవూ? ఏమంటారు? ఆ ఆ ఆ

    కాంచనమయవేది కాకనత్కేతనో
    జ్జ్వల విభ్రమము వాడు కలశజుండు
    సింహలాంగూల భూషిత నభోభాగకే
    తుప్రేంఖణము వాడు ద్రోణసుతుండు
    కనక గోవృషసాంద్ర క్రాంతి పరిస్ఫుట
    ధ్వజసముల్లాసంబు వాడు కృపుడు
    లలితకంబుప్రభాకలిత పతాకావి
    హారంబు వాడు రాథాత్మజుండు
    మణిమయోరగ రుచిజాల మహితమైన
    పడగవాడు కురుక్షితిపతి మహోగ్ర
    శిఖర ఘనతాళ తరుహారు సిడమువాడు
    నురనదీసూనుడేర్పడ జూచికొనుము….

    ఈ పద్యంలో కురువీరులందర్నీ గురించి ఉత్తరకుమారుడికి చెబుతూ వర్ణిస్తున్నప్పుడు అన్నగారి హావభావాలు అమోఘం,ప్రత్యేకించి ఆ "కనక గోవృషసాంద్ర క్రాంతి పరిస్ఫుట ధ్వజసముల్లాసంబు వాడు కృపుడు" అన్నప్పుడు భలే ఉంటుంది

    చివరగా ఓ చిన్న పంటికింద రాయి:
    "దరికి రాబోకు రాబోకు రాజా" అన్న పాటని చిన్నప్పుడు కొంచం చిలిపిగా "దరికి రాబోకురా బోకు రాజా" అని పాడేవాళ్ళం.

    రిప్లయితొలగించండి
  7. అద్భుతమైన సినిమా. ఎస్వీఆర్ విశ్వరూపం, సావిత్రి సమ్మోహన నటన, ఎన్టీఆర్ అంకితభావం వెరసి నర్తనశాల. ఎప్పటిలాగే ఏకబిగిన చదివించే మీ పరిచయం. బాగుంది.

    రిప్లయితొలగించండి
  8. పండుగపూట మధ్యాహ్నం పంచభక్ష్యపరమాన్నాలు ఐపోయాకా బూరెలు తింటూంటే ఈటీవీలో(మిగతా టీవీల్లో కొత్తసినిమాలు వేస్తారు) వేస్తూంటే ఈ సినిమా సకుటుంబసపరివార సమేతంగా చూడడం గుర్తొచ్చింది మీ టపాచూసి
    ఎస్వీఆర్ డైలాగులతో దడదడ లాడిస్తూంటే, సావిత్రి మౌనంగా మాటాడుతుంది ఈ సినిమాలో. ఎన్నిసార్లు ఆ నర్తనశాలలో సైరంధ్రి అనుకుని కీచకుడు భీముడితో మాట్లాడుతున్న సీన్ చూసినా విసుగుండదు నాకు. భీముడు నిజస్వరూపం చూపగానే "మంచి పని చేశాడు భీముడు. రాజు గారి బావమరిది ఐతేమాత్రం ఆడపిల్లని అల్లరి చేస్తాడా లేకపోతే." అంటూ ఇంట్లో అమ్మమ్మ వ్యాఖ్యానం ప్రతీ ఏడాదీ జరిగేదే.

    రిప్లయితొలగించండి
  9. నర్తనశాల సావిత్రి అంటే నాకెంతిష్టమంటే బొమ్మ వేసి చూపించుకున్నాను అభిమానాన్ని.
    http://vivaha-bhojanambu.blogspot.com/2010/01/blog-post_31.html

    ఈ సినిమాలో బృహన్నలగా NTR అదరహో.

    కీచకుడు అంటే ఎవరు అని అడిగితే SVR అని ఠక్కున చెప్పొచ్చు.

    విరాటపర్వంలో పద్యాలన్నీ దాదాపు కంఠతా పెట్టాను ఒక పద్యాల పోటీకి. అవన్నీ ఈ సినిమాలో ఘంటసాల గొంతులో వింటున్నప్పుడు...ఆహా చెవుల్లో అమృతం పోసుకున్నట్టే ఉంటుంది.

    నాకు ఇందులో సలలిత రాగ సుధారససారం, సఖియా వివరించవే పాటలు చాలా ఇష్టం.

    రిప్లయితొలగించండి
  10. SV Ranga Rao ki ee cinema ke 1964 lo jargina Indonesian Film Festival ki best actor award vachindi.. Oka Indian actor ki international award raavatam ade modati saari

    Nartanasaala ani choodagaane modhata ee vishayame gurtostundi naaku :)

    రిప్లయితొలగించండి
  11. His compatriot Gummadi Venkateswara Rao once exclaimed "Fortunate are we, to have SVR born in India but SVR is unfortunate to have been born here... If he had the fortune of being born in the West he might have been one of the top actors of all time in the world".

    రిప్లయితొలగించండి
  12. బాగా రాసార్సార్. మాయాబజారు ఎవర్ గ్రీన్ సినిమా. నటులంతా ఎవరికివారు బ్రహ్మాండంగా నటించారు.

    రిప్లయితొలగించండి
  13. 
 మీ బ్లాగులో టివి తో బాటు సినిమా కూడా చూస్తాను. సినిమా బాగుంది.
    Thanks

    రిప్లయితొలగించండి
  14. @రాజేష్ మారం: ఇమేజిని పక్కన పెట్టినంత మాత్రాన సినిమా హిట్టై పోవాలంటే ఎలా చెప్పండి? మిగిలినవన్నీ కూడా బాగుండాలి కదా.. నిజమేలెండి, ధైర్యం విషయంలో మనవాళ్ళు కొంచం వెనకబడే ఉన్నారు.. ధన్యవాదాలు.
    @గీతిక: ధన్యవాదాలండీ..
    @కొత్తావకాయ: నిజమేనండీ, రాసి ఉండాల్సింది. ఏడో పేరాలో లోటుని మీరు పూరించేశారు కదా.. ఇప్పుడింక సంపూర్ణం.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. @సునీత: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు తారలు.. అది కూడా మీరు!! ధన్యోస్మి..ధన్యోస్మి..
    @Snkr : నాకైతే 'వచ్చేది వాడు ఫల్గుణుడు' కూడానండీ.. ధన్యవాదాలు.
    @శ్రీనివాస్ పప్పు: సినిమా అంతా మరోసారి చూపించేశారు కదా!! మీ జ్ఞాపకశక్తికి జోహార్లు.. ఆమాత్రం రాళ్ళూ అందరం వేసిన వాళ్ళమే లెండి :)) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. @శిశిర: మూడు ముక్కలో చెప్పేశారుగా!! ధన్యవాదాలు.
    @పక్కింటబ్బాయి: ఈ వెనుకనుంచి వచ్చే వ్యాఖ్యానాలు భలేగా ఉంటాయండీ.. కొన్ని కొన్ని సార్లు అసలు సినిమా కన్నా ఇవే బాగుంటాయి కూడాను.. మొత్తం మీద ఉమ్మడి కుటుంబం పండుగ మధ్యాహ్నం టీవీ ముందు సెటిలైన దృశ్యాన్ని కళ్ళ ముందు ఉంచారు! ధన్యవాదాలు.
    @ఆ.సౌమ్య: చూశానండీ మీరు గీసిన బొమ్మలు.. నేనూ గీసే వాడిని కానీ, కింద పేర్రాయక పోతే (నా పేరు కాదు, బొమ్మ ఎవరిదో వాళ్ళ పేరు) ఎవరూ చెప్పుకోలేక పోయేవాళ్ళు :(( నిజమే, కీచకుడు అంటే ఎస్వీఆర్, అంతే! ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. @కాకికన్ను: మీరు మీ వ్యాఖ్యని తొలగించడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. బ్లాగు కి కూడా పరిమితులు ఉంటాయనీ, ఫలానీ విషయాలు మాత్రమె రాయాలన్నది కొత్త విషయం నాకు.. ఇక మీరు నా బ్లాగు చదివి వ్యాఖ్య రాసినట్టే, నేనూ కొన్ని బ్లాగుల గురించి టపాలు రాశాను, అదే నా అర్హత. ఇక 'అహంభావం' 'పేరుకోసం' ఇవన్నీ మీ ద్వారా తెలుసుకున్నాను.. మీ విలువైన సమయాన్ని వెచ్చించి, నా టపాలన్నీ చదివి మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.
    @phanikris : అవునండీ, జకార్తా విషయం రాశాను నేను కూడా.. గుమ్మడి వ్యాఖ్యని మీరిక్కడ గుర్తు చేయడం బాగుంది, సమయోచితంగా.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. @చదువరి: సారూ, మీరు పొరబడ్డారా లేక నేను పొరబడ్డానా? 'నర్తనశాల' కూడా 'మాయాబజారు' లాగే ఎవర్ గ్రీన్ సినిమా అని చదువుకుంటున్నాను ప్రస్తుతానికి.. ధన్యవాదాలు.
    @చందు ఎస్: అది కూడా టికెట్ లేకుండా :-) :-) ..ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  19. ఓహ్.. పేరు పొరపాటున రాసానండి.

    రిప్లయితొలగించండి
  20. ఈ సినిమాకి సంబంధించి నాకొక అనుమానం.వీసీడీ నుంచి ఆడియో గ్రాబ్ చేసి పెట్టా,చాలా నాణ్యంగా ఉంది ఆడియో మాత్రం.రాజ్యం పిక్చర్స్ నుంచి చివర శుభం వరకూ(దీనిలాగే మరికొన్ని ఆత్మబంధువు,లవకుశ వగైరాలు)అయితే ఆ ఆడియోని యేం చెయ్యాలన్నది ప్రశ్న.అప్ లోడ్ చెయ్యటానికి చాల మార్గాలున్నాయి.కానీ కాపీ రైటు వగైరాల గొడవయేమన్న వుందా అన్నది చెప్పగలరు.

    రిప్లయితొలగించండి
  21. ఇంద్రుడి సభలో సత్కారం అందుకోటానికి వస్తాడు అర్జునుడు.అర్థసింహాసనం ఇంద్రుడితోపాటు అధిష్టించాక పాట.అందులోఅర్జునుడి రసికత్వం గురించిన చరణంలో ఒక్క పావు క్షణం పురుషత్వం మూర్తీభవించినట్లు ఈ పాత్రలో ఉన్న రామారావు సిగ్గుతో కనురెప్పలు దించి మళ్ళీ మామూలుగా చూస్తాడు,ఆ పావుక్షణం చాలు అసలతను అంత మంచినటుడెందుకయ్యాడొ తెలుసుకోవటానికి.మరొక్కమాట,ఇందులో ఇలాంటి సూక్షమైన అంశాలు చాలా ఉన్నాయి.అయితే అవి మురళీ గారే రాయగలరు .రాస్తున్నారు కూడా.

    రిప్లయితొలగించండి
  22. మనకున్న గొప్ప సినిమాల్లో ఇదొకటి.
    "సైరంద్రికి పెద్దగా డైలాగులు లేవు."
    కావచ్చు. కానీ అవతల ఉన్న నటుడు ఎంతటివాడైనా చెరిగేసి పడేసే రంగారావుముందు నిలదొక్కుకుని తృణీకరించి నిప్పులుకురిపించే సైరంధ్రిగా సావిత్రి నటన అపూర్వం. దుర్వారోద్యమ .. పద్యం, అలాగే రాజసభలోకి పరిగెత్తుకి వచ్చినప్పుడు కంకుభట్టు మందలిస్తే - నా పతులు నటులు జూదరులు అని చెప్పే డయలాగ్ .. దరికి రాబోకు అంటూ కురిపించే హొయలు ..
    మరికొన్ని విశేషాలు -
    టైటిల్సు పడేప్పుడు వినబడే వాద్య సంగీతం "నాద తనుమనిశం" అనే త్యాగరాజకృతి.
    సినిమాలో అనేక సందర్భాలలో వాడిన పద్యాలు తిక్కన భారతంలో ఆయా సందర్భాల్లో ఆయా పాత్రలు పలికినట్టు చెప్పిన పద్యాలు కావడంతో బాగా రక్తికట్టినాయి.
    ధర్మరాజు గొప్పతనాన్ని చెప్పే పద్యం ఎవ్వాని వాకిట - భారతంలో ద్రౌపది భీమునికి చెబుతుంది. ఘంటసాల గొంతులో పలికించడానికి కాబోలు ఇక్కడ బృహన్నల చెప్పినట్టుగా చిత్రీకరించారు.
    రామారావు మరికొన్ని సినిమాల్లో నృత్యం చేశారు, ఈ సినిమాలో చేసినదానికంటే ఎక్కువగానే - దక్షయజ్ఞం, ఉమాచండీ గౌరీశంకరుల కథ, ఇత్యాది.
    మంచి సినిమాని గుర్తు చేశారు.

    రిప్లయితొలగించండి
  23. @రాజేంద్రకుమార్ దేవరపల్లి: వీడియో హక్కులు మనీషా వారిదగ్గర ఉన్నాయండీ.. 'ఇదేమిటీ పొంతన లేని సమాధానం' అనకండి :-) కాపీరైటు గొడవల గురించి నాకు తెలిసింది ఇంతే మరి.. అన్నట్టు మీరు చెప్పిన ఒకే ఒక్క క్లోజప్ షాట్, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే వాటిలో అదీ ఒకటి.. నేను రాయలేక పోతున్నవి ఇంకా చాలా ఉన్నాయండీ.. ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: సావిత్రిని ఆ పాత్రకి అనుకున్నాక ఇక డైలాగులు లేకపోయినా పర్లేదని రాసి ఉండరని నా ఊహ అండీ. మొత్తంగా మరీ ముఖ్యంగా ఎస్వీఆర్ కాంబినేషన్ సీన్లలో సావిత్రిని తప్ప మరొకరిని కనీసం ఊహించలేం సైరంధ్రి పాత్రలో.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి