"నాన్నగారూ! నేను నా పితృ పాదులకూ, నా చక్రవర్తికీ, సర్వదేవతల సాక్షిగా నేను నా తండ్రిగారికి వారసులుగా చక్రవర్తిని అవుతాననీ, నేను వివాహం చేసుకున్న పురుషుడు చక్రవర్తి కాడనీ, నా కుమారుడు కానీ, నేను దత్తు చేసుకున్న బాలుడు కానీ కాకతీయ వంశజుడు అవుతాడనీ, నేనూ కాకతీయ వంశగానే ఉంటాననీ మాట ఇస్తున్నాను. ఇది నేను ఆడి తప్పితే ఏడేడు కాలాలు నరకంలో ఉండగల దాన్ని, కాశీలో గోవును చంపిన దాన్ని, గురు హత్య చేసిన దాన్ని, బ్రాహ్మణ ధనం దోచినదాన్ని" అంటూ వృద్ధుడైన తన తండ్రి గణపతి దేవ చక్రవర్తి ఎదుట ప్రమాణం చేసింది రుద్రమదేవి. ఆ ప్రమాణం ఆమెని కాకతీయ సామ్రాజ్యానికి ఎనిమిదో చక్రవర్తిని చేసింది.
పుత్ర సంతానం లేని గణపతి దేవుడు తన ప్రధమ పుత్రిక రుద్రమదేవిని రుద్రదేవుడనే పేరుతో బాలుడిగానే పెంచాడు. యుద్ధ విద్యలు నేర్పించాడు. శత్రువులకీ, సామంతులకీ సందేహం రాకుండా ఉండేందుకు రుద్రమదేవి మరదలు ముమ్ముడమ్మతో వివాహమూ జరిపించాడు. రుద్రదేవ చక్రవర్తికి యువరాజ పట్టాభిషేకం జరిగిపోయింది. కానైతే, రుద్రదేవుడు పురుషుడు కాదు స్త్రీ అన్న పరమ రహస్యం నెమ్మది నెమ్మదిగా రాజ్యం నలుమూలలా, ఆపై దేశం నలుపక్కలకీ వ్యాపించింది. అంతే కాదు, అప్పటివరకూ తనని తనను బాలుడిగా భావించుకున్న రుద్రమకీ తనలోని స్త్రీత్వం బోధపడింది. సామంత రాజు చాళుక్య వీరభద్రుడితో ప్రేమలో పడిందామె.
ఓ పక్క వృద్ధుడైన గణపతి దేవుడు, మరోపక్క పాలనానుభావం లేని రుద్రదేవుడు - పైగా ఆమె యువరాజు కాదు యువరాణి అన్నరహస్యం తెలిసిపోయిన సామంతులు 'ఒక ఆడది రాజ్యం చేయడమా?' అని ఈసడిస్తూ, ఓరుగల్లు కోటని ఆక్రమించేందుకు ఆరంభించిన కుయుక్తులు. ఎటుచూసినా సమస్యలే కనిపించిన ఆ తరుణంలో రుద్రమదేవికి కొండంత అండగా సహాయం అందించిన వారు ఇద్దరు. వృద్ధుడైన మంత్రి శివదేవయ్య దేశికులు - అపార పాలనానుభవం, కాకతీయ వంశం పై అపరిమితమైన గౌరవం, రుద్రమపై ఎంతో నమ్మకం ఉన్న మహా మంత్రి. రెండో వ్యక్తి గజదొంగ గోన గన్నారెడ్డి. ఇతడే అడివి బాపిరాజు చారిత్రాత్మక నవల 'గోన గన్నారెడ్డి' లో కథానాయకుడు.
అడివి బాపిరాజు కథానాయకులందరూ ఉదాత్త చరితులు, ఆరడుగుల ఆజానుబాహులు, సర్వ సులక్షణ శోభితులు, ధర్మ నిరతిని విడిచి పెట్టనివారూ. తను సృష్టించే కథానాయక పాత్రలమీద అపరిమితమైన అనురాగాన్ని ఏమాత్రమూ దాచుకోని బాపిరాజు నవలలో కథానాయకుడు ఓ గజదొంగ!! వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా, చదివినప్పుడు ఏమాత్రమూ ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే అవడానికి దొంగే అయినా, గన్నారెడ్డి అచ్చమైన అడివి బాపిరాజు మార్కు కథానాయకుడు. దొంగకైనా నీతీ, న్యాయం ఉండాలనే వాడు. తనకు చెందాల్సిన సామంత రాజ్యాన్ని పినతండ్రి గోన లకుమయారెడ్డి ఆక్రమిస్తే, తమ్ముడు విఠల ధరణీశుడితో కలిసి అడవిబాట పట్టిన గన్నారెడ్డి, కొందరు యువకులని చేరదీసి, యుద్ధ విద్యలని నేర్పించి, దొంగతనాలు మొదలు పెడతాడు.
కాకతీయ సామ్రాజ్యాన్ని ఎదిరించే సామంత రాజులపైనే దృష్టి పెట్టిన గన్నారెడ్డి, తన చిన్నాన్న కొడుకు వరదారెడ్డికీ, ఆదవోని రాజ్య పాలకుడు కోటారెడ్డి కుమార్తె అన్నాంబికకీ మరికొద్ది సేపట్లో వివాహం జరగబోతున్నదనగా అదాటున వచ్చి, పెళ్ళికొడుకుని ఎత్తుకుపోవడం నవలా ప్రారంభం. అప్పటికే వివాహ వేదికకి చేరుకున్న అన్నాంబిక, పల్లకి తెరల మాటునుండి కేవలం ఒకే ఒక్క క్షణం గన్నారెడ్డిని చూసి, మరుక్షణం అతనితో ప్రేమలో పడిపోతుంది. వివాహ విచ్చిన్నం మాత్రమే తన లక్ష్యం కనుక, వరదారెడ్డిని విడిచిపెట్టేస్తాడు గన్నారెడ్డి. వియ్యమందాలని బలంగా నిర్ణయించుకున్న లకుమయారెడ్డి -కొండారెడ్డి లు వివాహానికి మరోమారు ముహూర్తం నిర్ణయిస్తారు. వాళ్ళిద్దరూ ఏకమైతేనే, మరికొందరిని కలుపుకుని ఓరుగల్లుపై దండెత్తగలరు మరి.
తప్పని సరి పరిస్థితుల్లో, అన్నాంబికని ఎత్తుకుపోడానికి రంగం సిద్ధం చేస్తాడు గన్నారెడ్డి. ఆశ్చర్యకరంగా, తనకి ఆ వివాహం ఇష్టం లేదనీ, తనని ఎత్తుకుపోని పక్షంలో ఆత్మహత్య తప్ప తనకి మరోమార్గం లేదనీ, ఎత్తుకెళ్లడానికి అనుమతి కోరిన గన్నారెడ్డితో చెబుతుందామె . తన సోదరి సాయంతో అన్నాంబికని ఎత్తుకెళ్ళిన గన్నారెడ్డి, ఆమెని ఓరుగల్లు చేర్చి రుద్రమ ఆశ్రయంలో ఉంచుతాడు. ఇంతలోనే, ముమ్ముడమ్మకి తను వివాహం చేసుకున్నది ఒక స్త్రీనన్న రహస్యం తెలియడం, రుద్రమ, ముమ్మడమ్మ, అన్నాంబిక మంచి స్నేహితులు కావడం జరిగిపోతుంది. రాజకుటుంబాలలో స్త్రీల జీవితాలని గురించి వీరిమధ్య జరిగే సంభాషణలు చదవాల్సిందే. "దాన శాసనాలు రాయించుకోవడం తప్ప మనం చేయగలిగేది ఏముంది? మన వాళ్ళ వీర మరణ వార్తలు ఎప్పుడు వినాల్సి వస్తుందో తెలీదు. మనకన్నా వ్యవసాయం చేసుకునే కాపస్త్రీలు అదృష్టవంతులు కాదూ.." ఇలా సాగుతాయవి.
గణపతిదేవ చక్రవర్తి మరణం, ఒక్కసారిగా రాజ్యంపైకి పెరిగిన దండయాత్రలు, అడివిలో సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న గన్నారెడ్డి కాకతీయ రాజ్యానికి రక్షణ కవచంలాగా నిలబడడం.. యుద్ధాలూ, ఒప్పందాలూ, మధ్య మధ్యలో ప్రేమకథలూ .. ఇలా చకచకా సాగిపోతుంది కథ. కాకతీయుల పాలనా వైభవాన్ని కళ్ళకి కట్టారు బాపిరాజు. ముఖ్యంగా శిల్పం, చిత్రలేఖనం, నాట్యం తో పాటుగా వ్యవసాయానికి ఇచ్చిన ప్రాముఖ్యత..ఇవన్నీ చదవొచ్చు. ఆంధ్రపాలకుల్లో ఉంపుడుగత్తెలని ఎక్కువగా ఆదరించి, వారి పేరిట చెరువులూ, దొరువులూ ఏర్పాటు చేసిన వారు కాకతీయ సామంతులే. సదరు స్త్రీజనం కూడా, కేవలం ఆట పాటలకే పరిమితం కాకుండా రాచరిక వ్యవహారాల్లోనూ ముఖ్య పాత్రనే పోషించారని చెబుతుంది 'మధుసాని.' చరిత్ర మీద, మరీ ముఖ్యంగా ఆంధ్ర చరిత్ర మీద ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పకుండా చదవాల్సిన నవల ఇది. చారిత్రక నవల కావడం వల్ల కావొచ్చు, 'హిమబిందు' ని గుర్తు చేసింది చాలా చోట్ల. (విశాలాంధ్ర ప్రచురణ. పేజీలు 260, వెల రూ 125, అన్ని పుస్తకాల షాపులు.)
ee vaaramloenae doraka buchchukunae prayatnam chaestaanu!
రిప్లయితొలగించండినేను చదివిన మొదటి అడివి బాపిరాజు పుస్తకం గోన గన్నారెడ్డి. హైస్కూల్లో ఉండగా చాటపర్రు లైబ్రరీలో చదివాను. ఆ వయస్సులో నన్ను బలంగా ఆకర్షించిన పుస్తకం. చాలా థ్రిల్లింగ్‌గా అద్భుతంగా, ఉత్త్తేజభరితంగా ఉన్న గోన గన్నారెడ్డిని చదువుతుంటే కలిగిన గగుర్పాటు, పులకింత ఇప్పటికీ గుర్తే. చదివాక, ఇంట్లో చెప్తే తెలిసింది, అది మా అమ్మకూ, పెద్దమ్మకూ అభిమానమైన పుస్తకమని. ఆ వరుసలోనే మిగతా బాపిరాజు పుస్తకాలు.
రిప్లయితొలగించండిగన్నారెడ్డిని సినిమాగా తీస్తే బాగుంటుంది; ఎవరు ఏ పాత్రలు వెయ్యాలి అన్నది మిత్రుల మధ్య చర్చగా నడిచేది. ఏడేళ్ళుగా గుణశేఖర్ ఊరిస్తున్నాడు గన్నారెడ్డిని తీస్తా అంటూ. నాకైతే నమ్మకం లేదు.
-- జంపాల చౌదరి
చరిత్ర మీద మంచి ఆసక్తిని పెంచి అందునా ఆంధ్ర దేశ చరిత్ర గురించి తెలుసుకునేందుకు మంచి పుస్తకాన్ని పరిచయం చేసారు.
రిప్లయితొలగించండిరుద్రమ దేవి గురించి మీరు చెప్పిన విషయం నాకు ఇప్పుడే తెలిసింది. మీ బ్లాగు తో మంచి విషయాలు తెలుస్తున్నాయి ప్రతి రోజు. ధన్యవాదాలు.
చాలా బాగా రాశారాండీ ఈ నవల గురించి. ఈ నవలని ఎన్.టీ.ఆర్, కృష్ణం రాజు నుంచి జూనియర్ ఎన్.టీ.ఆర్ వరకూ చాలామంది సినిమాగా తీస్తామని ఎందుకో తీయలేదు. కాస్త సరిగ్గా తీస్తే తెలుగు సినిమా వాసూళ్లలో మరో చరిత్ర సృష్టించగల కథ ఇది. అసలు గోన గన్నారెడ్డి పాత్ర ఎంట్రీ, హీరోయిన్ తో ప్రేమ వ్యవహారం, కథ ప్లాటు ఇలా ఎలా చూసుకున్న సినిమాగా మారి తీరవలసిన నవల అనిపిస్తూంటుంది.
రిప్లయితొలగించండిస్వాతి లో వస్తున్న వీరభద్రారెడ్డి సీరియల్ లో కూడా ఈ గన్నారెడ్డి పాత్ర ఉంది..
రిప్లయితొలగించండి@సునీత: తప్పక దొరకబుచ్చుకోండి.. తర్వాత మీరు వదులుదామన్నా వదల్లేరు!! ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@జంపాల చౌదరి: సినిమాగా.. ఇప్పటి వాళ్ళెవరూ న్యాయం చేయలేరేమో అనిపిస్తోందండీ నాకు.. సిన్సియర్ తీసేవారుంటే, 'హిమబిందు' కూడా మంచి సినిమా అవుతుంది.. ధన్యవాదాలు.
@వెన్నెల్లో ఆడపిల్ల: ధన్యవాదాలండీ..
@పక్కింటబ్బాయి: ఇప్పటివారిలో గన్నారెడ్డి పాత్రకి ప్రభాస్ బాగుంటాడని నా అభిప్రాయమండీ.. కాకపొతే డబ్బింగ్ ఎవరిచేతైనా చెప్పించాలి.. సరైన టీం ఉండాలి... ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@Tollywood Spice : స్వాతి చదివి చాలా రోజులయ్యిందండీ.. చూడాలి అయితే.. ధన్యవాదాలు.