సోమవారం, ఫిబ్రవరి 14, 2011

మరోచరిత్ర

తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో 'క్లాసిక్స్' గా స్థానం సంపాదించుకున్న అతికొద్ది విషాదాంత ప్రేమకథా చిత్రాలలో ఒకటి 'మరోచరిత్ర.' ముప్ఫైమూడేళ్ళ క్రితం నలుపు తెలుపుల్లో కే.బాలచందర్ సృష్టించిన ఈ అపూర్వ ప్రేమకావ్యం ప్రేక్షకుల మీద ఎంతటి ప్రభావాన్ని చూపించిందంటే, తమ ప్రేమ విఫలమవుతుందేమో అని భయపడ్డ కొందరు పిరికి ప్రేమికులు ఆత్మహత్యకి పాల్పడేంతగా. బాలచందర్ పుణ్యమా అని బాలు, స్వప్న అనే పేర్లు ప్రేమికులకి పర్యాయపదాలైపోయాయి తెలుగునాట.

కమలహాసన్, సరిత, మాధవిల అపూర్వ నటనా పటిమకి, బాలచందర్ దర్శకత్వ ప్రతిభ, ఎమ్మెస్ విశ్వనాథన్ అందించిన స్వరాలు తోడవ్వడంతో తెలుగు, తమిళనాట సినిమా చరిత్రలో మరోచరిత్ర సృష్టించిందీ సినిమా. విశాఖ అందాలని ఇంతగా ఒడిసిపట్టిన సినిమా మరొకటి లేదనడం అతిశయోక్తి లేదు. బలమైన కథ, దానిని ఓర్పుగా తెరకెక్కించగల సాంకేతిక వర్గం, నేర్పుగా నటించగల నటీనటులు ఉంటే చిన్న బడ్జెట్ తోనే భారీ విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అనడానికి ఉదాహరణ ఈ సినిమా.


బాలు (కమలహాసన్) ఓ తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. విశాఖలో వాళ్ళ పొరుగింట్లో ఉండే బ్రాహ్మణేతర కుటుంబానికి చెందిన అమ్మాయి స్వప్న (సరిత). చేస్తున్న ఉద్యోగం నచ్చక దాన్నివదిలేసి వచ్చిన బాలూ, కాలేజీలో చదువుతున్న స్వప్నతో ప్రేమలో పడతాడు. ఇద్దరి తల్లిదండ్రులకీ తెల్లారింది మొదలు రాత్రి వరకూ ప్రతి విషయంలోనూ తగువే. అమ్మాయికీ అబ్బాయికీ ఒకరి భాష మరొకరికి రాదు. అయినా ఇవేవీ వాళ్ళ ప్రేమకి ఆటంకాలు కాలేకపోయాయి.

చురుకైనదీ, తెలివైనదీ పైగా ఆధునికంగా ఉండేదీ అయిన స్వప్నని అభిమానించే వాళ్లకి కొదవ లేదు. ఆమె తరచూ వెళ్ళే పుస్తకాల షాపు ఓనరు ఆమెని ఆరాధించే వాళ్ళలో ఒకడు. అతని కారణంగా బాలు, స్వప్నల ప్రేమ విషయం వాళ్ళ పెద్దవాళ్ళకి తెలిసిపోతుంది. అప్పటికీ వాళ్ళిద్దరూ కలిసి వైజాగ్ మొత్తాన్ని చుట్టేసి పాటలు పాడేసుకోవడమే కాక కనిపించిన ప్రతి చెట్టుమీదా, పుట్టమీదా, రాయీ రప్పలమీదా వాళ్ళ పేర్లు రాసేసుకుంటారు.


ఇరుగుపొరుగులుగానే ఏమంత సఖ్యంగా ఉందని పెద్దవాళ్ళు పిల్లల ప్రేమకి ససేమిరా అంటారు. అయితే పిల్లల పట్టుదల కారణంగా ఓ మెట్టు దిగి వచ్చి, వీళ్ళ ప్రేమకి పరిక్ష పెడతారు. ఏడాది పాటు దూరంగా ఉంది ప్రేమని నిరూపించుకోమంటారు. వాదోపవాదాల అనంతరం ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ వెళ్ళడానికి అంగీకరిస్తాడు బాలూ. వీళ్ళ ప్రేమ మీద ఏమాత్రం నమ్మకం లేని స్వప్న తల్లిదండ్రులు ఆమెకి పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు.

కలిసి ఉన్నప్పటికన్నా విడిపోయాక ఒకరిమీద ఒకరికి ప్రేమ బలపడుతుంది బాలూ స్వప్నలకి. ఆవేశపరుడైన బాలూకి పరిచయమైన బాలవితంతువు సంధ్య (మాధవి) తనకి వచ్చిన నృత్యాన్ని నేర్పడం ద్వారా అతని ఆవేశాన్ని సక్రమమైన మార్గంలో పెడుతుంది. అంతేకాదు అతనికి స్వచ్చమైన తెలుగు నేర్పుతుంది కూడా. మరోపక్క తన పెళ్లి ప్రయత్నాలని తీవ్రంగా వ్యతిరేకించే స్వప్న, బాలూమీద తనకున్న ప్రేమని వ్యక్తం చేయడానికి ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోదు. గోడల నిండా అతని పేరు రాయడం, తల్లి కాల్చేసిన బాలూ ఫోటో బూడిదని కాఫీలో కలుపుకుని తాగేయడం...ఇవన్నీ సామాన్య విషయాలు స్వప్నకి.


అయితే ఓ చిన్న అపార్ధం కారణంగా మానసికంగా స్వప్నకి దూరమైన బాలూ, సంధ్యకి దగ్గరవుతాడు. స్వప్న ప్రేమలో సిన్సియారిటీని అర్ధం చేసుకున్న సంధ్య బాలూ స్వప్నలని దగ్గర చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తుంది. ఇక కథ సుఖాంతమే అనుకుంటున్న తరుణంలో సినిమాని ఓ కర్కశమైన మలుపు తిప్పుతాడు దర్శకుడు. ఫలితం, వాళ్ళ ప్రేమ మొగ్గ తొడిగిన బీచ్ లోనే బాలూ స్వప్నల విషాదాంతం.

నిజానికిది నాయికల కథ. బాలూ పాత్ర కన్నా స్వప్న, సంధ్య పాత్రలు బలమైనవి. అందం, ఆవేశం మినహాయిస్తే బాలూలో మరో చెప్పుకోదగ్గ లక్షణం కనిపించదు. బాలూమీద పిచ్చి ప్రేమ స్వప్నకి. ఎంతగా అంటే 'నిన్ను ప్రేమిస్తున్నాను ఒక పిచ్చిది' అని అతని వీపు మీద రాసేంత. ఇప్పుడిప్పుడు బాలీవుడ్ ఖాన్ లని చూసి మన కుర్ర హీరోలు చేస్తున్న కండల ప్రదర్శనని మూడు దశాబ్దాల క్రితమే కమల్ చేసి చూపించాడు ఈ సినిమాలో. విధి తనకి పరిక్షలు పెట్టినా ఎదురొడ్డి నిలిచే స్థైర్యం సంధ్య సొంతం. కష్టాలకి కుంగిపోదు ఆమె.


ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీత సారధ్యంలో పాటలన్నీ ఈనాటికీ మారుమోగుతున్నాయి. బాలూతో కలిసి సుశీల, జానకి, రమోల, ఎల్లారీశ్వరి, వాణీ జయరాం ఒక్కొక్క పాట పాడారు ఈ సినిమాకి. ఇది విశ్వనాథన్ స్టైల్ అనుకోవాలి. అందరూ చెప్పే పాట 'ఏ తీగ పూవునో' అయినా, నాకు మాత్రం 'పదహారేళ్ళకి..' 'విధి చేయు వింతలన్నీ..' బాగా ఇష్టం. 'కలిసి ఉంటే..' పాట సాహిత్యం, చిత్రీకరణ కూడా తమాషాగానే ఉంటాయి. మోడర్న్ దుస్తుల్లో సరిత కుర్రకారుని ఒక ఊపు ఊపింది అప్పట్లో.

హిందీలో 'ఏక్ దూజే కేలియే' పేరిట రీమేక్ చేసిన ఈ సినిమా అక్కడ కూడా ఘన విజయం సాధించింది. హిందీ చిత్రానికి కూడా బాలచందరే దర్శకుడు. వరుణ్ సందేశ్, అనితలతో నూతన దర్శకుడు రవి యాదవ్ నిర్దేశకత్వంలో ఈ సినిమాని గతేడాది తెలుగులోనే రీమేక్ చేశారు నిర్మాత దిల్ రాజు. రీమేక్ ఎలా ఉండకూడదు అనడానికి ఉదాహరణగా నిలబడిందీ సినిమా. అయితే బాలచందర్ 'మరోచరిత్ర' మాత్రం నిస్సందేహంగా తెలుగు సిని చరిత్రలో నిలిచిపోయే సినిమా.

17 వ్యాఖ్యలు:

Vasu చెప్పారు...

బాలచందర్ ట్రాజెడీ కింగ్. కొన్ని సినమాలకి అక్కర్లేకుండా కూడా విషాదాంతం చేసేస్తాడు. ఇది ప్రేమ కథ కనక, చరిత్ర లో ఎక్కువగా ప్రేమ కథలు విషాదాంతాలు కనక, అప్పట్లో అవి ఎక్కువగా జనాలు ఒప్పుకునేవారు కనక, బాల చందర్ అద్భుత దర్సకత్వం కనక అప్పుడు అంత హిట్ చేసారేమో ప్రేక్షకులు .

నాకూ "పదహారేళ్ళకు .." పాట చాలా ఇష్టం. పాటలు ఈ సినిమాకి ఆయువు పట్టు. ఇప్పటికి కూడా చాలా మోడరన్ సినిమాలా అనిపిస్తుంది నాకు ఇది. అప్పట్లోనే ఇది తియ్యడం బాలచందర్ కే చెల్లు.

జయ చెప్పారు...

నాకు నచ్చే చాలా మంచి సినిమాని పరిచయం చేసారండి. ఏక్ దుజేకేలియే కూడా నాకంతే ఇష్టం. అవును, మీరు చెప్పే పాటలు ఇంకా ప్రత్యేకంగా ఎప్పుడూ వినాలనిపిస్తుంది. ప్రేమకి నిర్వచనం ఇచ్చే సినిమా. నచ్చని వారెవరూ ఉండరు.ఈ సినిమాలో కొన్ని సీన్లు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. చివరిలో కమల్ హాసన్ డాన్స్ నాకెప్పుడూ కళ్ళల్లో మెదులుతూనే ఉంటుంది.

చిన్ని చెప్పారు...

మా స్కూల్ రోజులలో వచ్చిన ఈ సినిమాని అదేదో చూడకూడని సినిమా అంటూ మా పెద్దనాన్న ఒకరు పిల్లలం ముచ్చట పడుతున్న వెళ్లనీయలేదు.ఆ తరువాత ఎప్పుడో చూసమనుకొండీ .అప్పుడు ఇప్పుడు ఎప్పటికి ఎవ్వర్ గ్రీన్ 'మరోచరిత్ర 'పాటలు చాలా బాగుంటాయి .మంచి సినిమా ఎంచుకున్నారు :-)

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

మరోచరిత్ర సృష్టించిన మరోచరిత్ర గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే.ఏ పాత్రా తక్కువ కాదు ఎవరూ ఎవరికీ తీసిపోరు అన్నట్టుగా తీర్చాడు బాలచందర్.తెరవెనుక బాలచందర్ ఆస్థానవిద్వాంసులు ఎమ్మెస్ విశ్వనాధన్,గణేష్‌పాత్రో,ఆత్రేయ,గాయకబృందం అందరూ మూలస్థంభాలే.

తెలుగుతెరకి ఒక మంచి నటినీ,గాత్రధారినీ(డబ్బింగ్)సరిత రూపంలో పరిచయం చేసిన ఘనత బాలచందర్ దే ఖచ్చితంగా.

ఈ సినిమాలో ఎప్పటికీ నవ్వొచ్చే డైలాగు ఇదొకటి:
"అరవ వాళ్ళే,అరవం అరవం అంటూనే అరుస్తారు"(జయహో గణేష్‌పాత్రో)

సుబ్రహ్మణ్య ఛైతన్య చెప్పారు...

ఏదో మిస్సయ్యిందే ఏదో మిస్సయ్యిందే అని సాయంత్రం నుంచి ఐదారు సార్లు చూశాక అర్థం అయ్యింది...భలేభలే మగాడివోయ్ ఎక్కడండీ? ఇది తొండి. బాలుకి ( తెరమీదహీరో కాదు. తెరవెనక హీరో) ఎంతోపేరు తెచ్చిపెట్టి జీవితాన్నిచ్చినసినిమాల్లోఒకటి ఇది. మూడురోజులక్రితమే ఈసినిమా చూశాను. అంతలో రాశారు మీరు.

Ennela చెప్పారు...

ఎవర్ గ్రీన్ కదా ఆ పాటలు

karthik చెప్పారు...

undoubtedly its a gr8 classic.. I like all the songs very much..
nice article Murali garu,
thanks for sharing with us!!

ప్రణీత స్వాతి చెప్పారు...

ఈ సినిమా నేనింత వరకూ పూర్తిగా చూడలేదండీ. పాటలు మాత్రం సూపర్బ్.

ప్రణీత స్వాతి చెప్పారు...

ఇక ముందు చూడలేను కూడా. దుఃఖాంతం కదండీ..అందుకనేమో మరి..

అజ్ఞాత చెప్పారు...

తెలుగులో కొత్తతరపు ప్రేమకథలు మొదలైంది బహుశా ఈ సినిమాతోనేనేమో?

నాకు ఈ సినిమాలో లిఫ్టు ఆటల పాట చాలా ఇష్టం.

'Padmarpita' చెప్పారు...

ప్రేమచరిత్రలోనే మరోచరిత్రని సృష్టించిన చిత్రం...'మరోచరిత్ర"

మురళి చెప్పారు...

@వాసు: నిజమేనండీ..ఈసినిమా ఇప్పటికీ మోడరన్ అనే అనిపిస్తుంది.. ధన్యవాదాలు.
@జయ: నాకు కమల్ కన్నా, సరిత, మాధవిల నటన బాగా నచ్చిందండీ.. ధన్యవాదాలు.
@చిన్ని: అప్పట్లో ఈ చూడనివ్వక పోవడాలు మామూలేకదండీ.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@శ్రీనివాస్ పప్పు: నిజమేనండీ.. చాలా డైలాగులు సింపుల్ గా వినిపిస్తూనే చాలా లోతుగా ఉంటాయి.. ధన్యవాదాలు.
@సుబ్రహ్మణ్య చైతన్య: మిస్సయ్యానండీ :( .. మీరు పట్టేసుకున్నారు కదా.. బాలు విషయంలో మీతో ఏకీభవించేస్తున్నా.. ధన్యవాదాలు.
@ఎన్నెల: అవునండీ.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@కార్తీక్: పాటలతో పాటు సినిమా కూడా చాలా బాగుంటుంది కదండీ.. ధన్యవాదాలు.
@ప్రణీత స్వాతి: క్లైమాక్స్ మాత్రమె ట్రాజెడీ అండీ.. సినిమా అంతా బాగుంటుంది.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@బోనగిరి: అవునండీ.. కొత్త ట్రెండ్ పరిచయం చేశాడు బాలచందర్.. ధన్యవాదాలు.
@పద్మార్పిత: నిజం.. ధన్యవాదాలండీ..

పరిమళం చెప్పారు...

ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా క్లైమాక్స్ లో ఏడ్చేస్తాను.బాలచందర్ అంటే చాలా కోపంనాకు :)

మురళి చెప్పారు...

@పరిమళం: అవునండీ.. 'అంతులేని కథ' కి కూడా మీ స్పందన ఇంచుమించు ఇదే.. అర్ధం చేసుకోగలను.. ధన్యవాదాలు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి