శనివారం, ఆగస్టు 27, 2011

శతదినోత్సవం

"ఇవాళ కూడా మీరో టపా రాసి పోస్టు చేస్తే వరుసగా వందరోజులు నిర్విరామంగా బ్లాగు రాసినట్టవుతుంది. అభినందనలు" ఉదయాన్నే మెయిల్ చెక్ చేస్తుండగా, బ్లాగ్మిత్రులొకరు రాసిన మెయిల్, పంపిన కార్డ్ నన్ను మొదట ఆశ్చర్య పరిచాయి. తర్వాత ఆనంద పరిచాయి. ఓసారి బ్లాగులోకి వెళ్లి చూసుకుంటే, వారు రాసింది నిజమేనని అర్ధమయ్యింది. నాపాటికి నేను రాసుకుపోవడమే తప్ప ఎక్కడా ఆగి లెక్క పెట్టలేదు మరి.

వెనక్కి తిరిగి చూస్తే, మే ఇరవయ్యో తేదీన ప్రచురించిన 'తెగిన పేగు' టపా నుంచి ప్రతిరోజూ టపాలున్నాయి నా బ్లాగులో. నిజానికిదేదో పెద్ద అచీవ్మెంట్ అని నేను అనుకోవడంలేదు. అగ్రిగేటర్ తెరిచి చూస్తే రోజూ రెండు మూడు టపాలు రాసే బ్లాగ్మిత్రులు కనిపిస్తారు. అలాగే, ఇది ముందుగా అనుకుని చేసిందీ కాదు. నిజానికి అలా ఓ లక్ష్యం నిర్ణయించుకుని రాయడం అన్నది బ్లాగుల్లో సాధ్యపడదన్నది బ్లాగర్లందరికీ తెలిసిన విషయమే.

ఈ యాదృచ్చిక పరిణామాన్ని పునస్సమీక్ష కోసం ఉపయోగించుకోవాలని అనిపించిది. గత మూడు నెలల కాలంగా నాకు రోజూ బ్లాగు రాసే కోరిక, రాయగలిగే ఓపికా, తీరికా దొరకడం వల్ల నాకు రాయాలనిపించినవన్నీ బ్లాగులో రాశాను. బ్లాగు రాయడం కేవలం ఓ కాలక్షేపంగా కాక, ముఖ్యమైన పనిగానే భావిస్తాను నేను. ఎటూ నేను రాసింది చదవాలన్నకోరిక, ఓపిక, తీరిక ఉన్నవాళ్ళే వచ్చి చదువుతారు కదా.

"ఈమధ్య మీ బ్లాగులో తరచుగా టపాలు కనిపించడం బాగుంది" "రోజూ ఏదో ఒకటి భలే రాస్తున్నారు" మొదలుకొని "క్వాలిటి తక్కువై, క్వాంటిటీ బరువుతో మీ బ్లాగు మీకేమైనా బాగుందేమో, రోజు రోజుకీ విసుగ్గా ఉంటుంది. వ్రాయాలి కాబట్టి వ్రాయొద్దు. వ్రాయాలని అనిపించినపుడే వ్రాయండి" వరకూ రకరకాల స్పందనలు, "తినగా తినగా గారెలు చేదుగా అనిపిస్తే, గారెలు చేదుగా ఉన్నట్టు కాదుగా! అవకాశం, సమయం, రాసే వ్యాపకంలో మీకు సంతోషం ఉన్నన్నాళ్ళు ఎంచక్కా రాసుకోండి. అందరికీ దక్కే అదృష్టం కాదది," లాంటి ఆత్మీయ ప్రోత్సాహం, ఇవీ మిత్రుల నుంచి అందుకున్నవి.

చాలా అరుదుగా మాత్రమే ముందస్తు ప్లానింగ్ తో టపాలు రాస్తాను నేను. మెజారిటీ టపాలు అప్పటికప్పుడు అనుకుని రాసినవే. ఆక్షణంలో ఏ విషయాన్ని గురించి రాయాలనిపిస్తే, ఆ విషయాన్ని గురించి వాక్యం పక్కన వాక్యం పేర్చుకుంటూ వెళ్ళడమే. తీరా పబ్లిష్ చేసే సమయానికి మిషిన్ మొరాయించడం, అచ్చుతప్పులని మిత్రులు సున్నితంగా ఎత్తిచూపడం చాలా సార్లే జరిగింది. రాయాలి కాబట్టి రాయడం అన్నది జరగలేదు. అసలు ఎందుకలా? రాయకపోతే ఎవరేమంటారు? అసలిక్కడ ఎవరి బ్లాగుకి వారే శ్రీ సుమన్ బాబు కదా!

ఒకరోజు 'ఇవాళ బ్లాగింగుకి సెలవు' అనుకుని, టీవీ ముందు కూర్చున్నాను. 'శంకరాభరణం' బృందంతో చేసిన 'వావ్' కార్యక్రమం ఎంతగా ఆకట్టుకుందంటే, వెంటనే ఓ టపా రాసేయాలనిపించింది. చేతిలో బ్లాగుంది, రాసేశాను. ఆ టపాకి వ్యాఖ్య రాస్తూ రెండు రోజుల్లో రాబోయే వాణీ జయరాం కార్యక్రమాన్ని గురించి కూడా టపా రాయమని సూచించారు బ్లాగ్మిత్రులు ఇంగ్లిష్ సుజాత గారు. మరోరోజు మిత్రులు బోనగిరి గారు 'కుట్ర' కథ గురించి రాయమన్నారు. ఇంకోరోజు కొత్తావకాయ గారి పోస్టు చదువుతూ, ఏమాత్రం ముందస్తు ప్లాన్ లేకుండా రాసిన టపా 'కొత్తావకాయా అన్నం,' ఆసాయంత్రం ఓ అరగంట సమయంలో జరిగింది జరిగినట్టుగా రాశానది.

అయితే, ఆబ్లాగు గురించి రాసే అర్హత నాకు లేదన్న విమర్శ వచ్చింది. "...కొత్తావకాయ గురించి. ఆవిడకున్న భాష మీద పట్టు, ఆ ఒరవడి గమనించారా? జ్ఞాపకాలే మైమరపు, ఓదార్పు అని సిని కవి ముక్కలు రెండు అతికించుకున్న మీకు ఆవిడ భుజం తట్టే అర్హత ఉందా?" అని అడిగారు బ్లాగ్మిత్రులొకరు. ఇప్పుడు నా సందేహం, అమృతం కురిసిన రాత్రి ఎంత బావుందో చెప్పాలంటే మనమూ తిలక్ అంత గొప్పకవి అయి ఉండాలా? అలా అయితే, నా బ్లాగులో ముప్పాతిక మూడొంతుల టపాలు రాయడానికి నాకు ఎలాంటి అర్హతా లేనట్టే మరి.

బ్లాగు మొదలు పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకూ బ్లాగింగు గురించీ, నా బ్లాగుని గురించీ నా అభిప్రాయం ఒకటే. "ఇది నా డైరీ, కాకపొతే మరికొందరు చదవడానికి అందుబాటులో ఉంచుతున్నాను. అలా చదివే వారి మనోభావాలు గాయపరచకుండా ఉంటే చాలు." అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన చర్చలో పాల్గొనడానికి నేనెప్పుడూ సిద్ధమే. కాకపొతే, నా బ్లాగుని గురించి జరిగే చర్చ మరెక్కడో కాక ఇక్కడే జరగాలి. సద్విమర్శలకెపుడూ తలుపులు తెరిచే ఉంటాయి. ఎప్పటికప్పుడు వ్యాఖ్యలు, ఉత్తరాల రూపంలో అభిప్రాయాలు పంచుకుంటున్న మిత్రులందరికీ పేరు పేరునా మరోమారు కృతజ్ఞతలు. మెయిల్ రాసి, కార్డు పంపిన మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు.

37 కామెంట్‌లు:

 1. అభినందనలు,మీ కలం అలా అలా అప్రతిహతంగా సాగిపోవాలాని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ(మాకు ఇంతకన్నా కోరుకోడానికేమీ ఉండదు మురళి గారూ)

  రిప్లయితొలగించు
 2. ఏంటో కొంచెం అర్ధం కాలేదు :( మీ బ్లాగు మీ ఇష్టం , అది ఎవరిని వ్యక్తిగతం గా బాధ పెట్టనంతవరకు , వేరే వాళ్ళ బాధ ఏమిటి మీరేమి రాస్తే .

  సున్నితం గా ఏ విషయానైనా చెప్పే బ్లాగుల్లో మీది ఒకటి . సద్విమర్శ అయితే అలోచించాల్సిందే కాని పనికట్టుకు చేసే ఇలాంటి ప్రేలాపలనకి విలువివ్వకండి . ఇలాగే మీ బ్లాగు ప్రయాణం కొనసాగాలి అని కోరుకుంటున్నాను .

  రిప్లయితొలగించు
 3. మోయనంగా ఉండే మీ టపాల నిడివి, (సంభ్రమ)ఆశ్చర్య పరిచే వాటి విరివి, భేషజం లేని మీ సరలి, మరి ముఖ్యంగా మీ సహనం, నాకు నచ్చే అంశాలండి.

  తరచుగా టపాలు వ్రాస్తున్నందుకు కృతజ్ఞతలు. వ్రాస్తూనే వుండండి(దయచేసి).

  రిప్లయితొలగించు
 4. well done, my friend.
  I sincerely wish and hope you continue to write, informing and entertaining us for a long time to come! Thank you!!

  రిప్లయితొలగించు
 5. "...కొత్తావకాయ గురించి. ఆవిడకున్న భాష మీద పట్టు, ఆ ఒరవడి గమనించారా? జ్ఞాపకాలే మైమరపు, ఓదార్పు అని సిని కవి ముక్కలు రెండు అతికించుకున్న మీకు ఆవిడ భుజం తట్టే అర్హత ఉందా?"
  అన్నారా మిమ్మల్ని. చాలా అనవసర వ్యాఖ్యానమది. నిజానికి మీ వేగం, నాణ్యత చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి.. కొత్తావకాయ గారు రాసే పద్ధతి వేరు, మీ శైలి వేరు. మిమ్మల్ని అలా పోల్చడం అనవసరం.
  విషయానికి వస్తే శతదినోత్సవ శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించు
 6. murali gaaru,
  This is not an easy task. You did a big thing.. You deserve congrats.

  http://www.123greetings.com/congratulations/for_everyone/everyone55.html

  రిప్లయితొలగించు
 7. మనం విన్నవి,కన్నవి,చదివినవి చెప్పడానికి..స్పందించే హృదయం,మనదైన రీతిలోభావప్రకటనతో.. ఉంటే చాలు. హృదయానుభూతి తో..వ్రాయడం అన్నది అన్ని సమయాలలో సాధ్యం కాకపోయినా..చదువరులను కట్టిపడేసే..శైలి..మీ బ్లాగ్లో..పుష్కలంగా ఉంది.. ఏ రోజుకారోజు..నవ్యతతో..మీరు పంచిన విషయాలని..ఎంతో మంది..చదువుతున్నారు.ఆలోచిమ్పజేస్తారు. అంతకన్నా ఏం కావాలి? మీకు..హృదయపూర్వక అభినందనలు. ఇలాగే వ్రాస్తూ ఉండండి

  రిప్లయితొలగించు
 8. నాక్కూడా చప్పట్లు.... మీ వంద టపాలు నేను చదివాను :)

  రిప్లయితొలగించు
 9. ముందుగా అభినందన మందారమాల అందుకోండి. ఎవరికి లెక్క ఉన్నా లేకపోయినా, కాకతాళీయంగా మాత్రమే జరిగినా, ఇదేం సామాన్యమైన విజయమేం కాదు. మీరు ఒప్పుకు తీరాల్సిన నిజమిది.

  రోజుకో బ్లాగు రాస్తున్నారన్న విషయం మీరు గమనించేలోపే ఆ పరంపర సాగిపోతోందంటే, అంతకంటే సంతోషకరమైనదేముంటుంది. ఈ నెల గురించి మాత్రమే మాట్లాడుకుందాం. సుమన్ బాబుకి వందిమాగధులై జేజేలు పలికి, శంకరాభరణం గురించి చెప్పి, వాణి సరిగమలని భేషని, చద్దన్నం కమ్మగా తినిపించి, సాటి బ్లాగరు భుజం తట్టి, పెంకుటిల్లు నవలని జ్ఞాపకాల పొరల్లోంచి వెలికితెచ్చి, పంచాయితీ సర్పంచుల రాజీనామాల వైనం చర్చించి, అరుంధతి మాటల మర్మం తెలిపి, గోన గన్నారెడ్డి ని కళ్ళముందు ఇంకో సారి నిలపి.. హాహ్.. చెప్తూంటేనే అలుపొస్తోందే! అలవోకగా శాఖాచంక్రమణం చేసేందుకు మీకెంత తపన, విషయం, ఆసక్తి ఉండాలి! ఏ కాకికన్ను వక్రదృష్టికీ అవగతమవని మహత్తరమైన శైలి మీది. ముచ్చటేసేంత ప్రేమ మీ బ్లాగుపై మీకు. దానికి అభినందనలు చెప్పాలి మురళి గారూ!

  సాహిత్యానికి మీకు కుదిరిన మాధ్యమంలో మీరు చేస్తున్న సేవకి ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మీ దిష్టి, మా దిష్టి.. ముక్కలవ్వాలి.. ఏడు చెక్కలవ్వాలి. కాళ్ళు కడుక్కొచ్చి మాకు టపాలవిందు కొనసాగించడి.

  రిప్లయితొలగించు
 10. అభినందనలు.అజాతశతృవులు అలగకూడదు,నొచ్చుకోకూడదు!

  రిప్లయితొలగించు
 11. మీరు మరిన్ని శతదినోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ శతదినోత్సవ శుభాకాంక్షలు .

  రిప్లయితొలగించు
 12. లెస్స పలికితిరి సునీత గారూ! I second you.

  రిప్లయితొలగించు
 13. మీ బ్లాగుని వంక పెట్టడం వెక్కిరించడం అనే విషయానికి ప్రాధాన్యత ఇవ్వకండి . మీరెంత బాగా రాస్తారో అందరికి తెలుసు.ఇలా అలా రాయాలి అనే రూల్స్ ఏవి లేవుకదా ?చదవాలి అనిపిస్తే చదువుతారులేకపోతె లేదు .ఇలా అనుకుంటే మనం బ్లాగాలేము :)
  అవసరం లేకపోయినా విమర్శించేవారిని పట్టించుకోకండి .నా రాతల్ని వెక్కిరించిన నా ప్రతి పోస్ట్ కి పనిగట్టుకుని పారడీలు సృష్టించిన నాకు తోచినట్లు నేను రాసుకుంటూ పోయాను .ప్రాధాన్యత ఇస్తే నా బ్లాగ్ ఏనాడో మూత పడేది.సో మన ఎంటిటీ ని మనం వదులుకోకూడదు :)

  రిప్లయితొలగించు
 14. మీ బ్లాగు చదువుతుంటే, చదువుతున్నట్లుండదు. మీరు ఎదురుగా ఉండి మాట్లాడితే వింటున్నట్లుగా ఉంటుంది. శత టపోత్సవ సందర్భంగా అభినందనలు.

  రిప్లయితొలగించు
 15. అయ్యో! ఈ టపా మిస్ అయ్యా మురళీగారు :( లేట్ విషెస్! మీ వందటపాలు చదవలేకపోయినా కనీసం రోజుకోసారైనా మీ బ్లాగుకి వచ్చేలా చేసాయి :) అందర్ చెప్పినట్టు ఇది అంత తేలికైన విషయమెమీ కాదు :) నరంలేని నాలుక ఎన్ని మెలికెలు తిరగమన్నా తిరుగుతుంది.... దానికి విలువిస్తే ఎలా? వేణు చెప్పినట్టు వారి శైలి వేరు...మీరి వేరు.అయినా మీరు రోజు పది టపాలు వేసినా చదివే మేమందరం ఉండగా మీకేంటండీ :) రాసేయండీ...మనసుకి ఏదనిపిస్తే అది :) ఇంకోసారి అభినందనలు మీకు :)

  రిప్లయితొలగించు
 16. రోజుకొక టపా వ్రాయటం చిన్న విషయం ఏం కాదు మురళి గార్రూ, మన అలోచనల్ని, ఆనందాల్ని, అనుభూతుల్ని నొప్పించక తానొవ్వక అందరికీ అర్థమయ్యే రీతిలో అక్షరరూపంలో పెట్టటం ఓ విద్య..అది అందరికీ రాదు.

  నెలకి ఒకటీ రెండూ టపాలు వ్రాయటానికే ఇక్కడ కళ్ళు తేలేస్తున్నాం :)

  మీరు వ్రాసేవి చదివేవాళ్లం చాలామందిమి ఉన్నాం..ఆ చాలా మంది కోసం ఓ కొద్ది మంది మాటలు పట్టించుకోకుండా మీరిలానే వ్రాస్తుండండి.

  అభినందనలతో

  రిప్లయితొలగించు
 17. చిన్ని గారు, మీరు చెప్పింది బానే వుందనుకోండి, కానీ... మరీ తోలుమందం అని అంటారేమో! అలాంటి కొంతమంది రైనో బ్లాగర్లు వున్నారులేండి, కాదనట్లేదు. తాము ఎవరికోసం, ఎందుకోసం రాస్తున్నామో ఖచ్చితంగా తెలిసిన బ్లాగర్లలో స్పందనలు వుండటం సహజం.
  నాకైతే మురళి గారి స్పందనలు నచ్చాయి. బ్లాగరంటే అలా వుండాలి, మరీ చెప్పిందే చెపుతూ, తాము చెప్పిందే వేదమనే తోలు మందం మూర్ఖిస్ట్ బ్లాగర్ల ధోరణి అంత మంచిది కాదు.

  రిప్లయితొలగించు
 18. ilanti anvasara vyakylu pattinchu kovadddu
  meeru chala baga rastaru
  naku telugu blog lu parichyam ayendi mee blog to ne
  congrats and meeru ilanti tapalu inkenno rayalani koru kontunnanu

  రిప్లయితొలగించు
 19. శతదినోత్సవ శుభాకాంక్షలు .. మీరు మరిన్ని శతదినోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను..

  అలాగే కొన్ని వ్యాఖ్యలు మిగతా బ్లాగ్మితృల దగ్గరనించి అప్పుతీసుకుంటూ(అందుకు వారికి కృతఙతలు తెలుపుకుంటూ..).. "అజాతశతృవులు అలగకూడదు,నొచ్చుకోకూడదు! " "నాక్కూడా చప్పట్లు.... మీ వంద టపాలు నేను చదివాను :) "

  రిప్లయితొలగించు
 20. ముందుగా శతదినోత్సవ శుభాకాంక్షలు. శుభాభినందనలు. మీరు నాలాంటి వారికి చాలామందికి ఆనందం, ఆహ్లాదం కలిగిస్తున్నారు. మీ టపాల ద్వారా చాలా నేర్చుకుంటున్నాము.

  ఎవరేమన్నా లక్ష్యపెట్టకుండా, మీరు ఇల్లాగే ఎన్నో మరెన్నో టపాలు వ్రాసి మీ అనుభవాలు, అనుభూతులు పంచుకుంటారని ఆశిస్తున్నాను.

  రిప్లయితొలగించు
 21. అర్రెర్రె నేను మిస్ అయ్యాను ఈ టపా. ముందుగా అందుకోండి శుభాభినందనలు.
  రోజూ మీరు టపా రాయడం చూసి కళ్ళు పెద్దవి చేసుకుని ఎంత ఎంత ఆశ్చర్యపోయేదాన్నో. మీ ఓపికకి, మీ అభిలాషకి ముచ్చటపడుతూ ఉంటాను. ఎప్పటికైనా మీ అంత బాగా, ఎక్కువగా బ్లాగు రాయగలగాలి అనుకుంటూ ఉంటా రోజూ. కామెంట్లు పెట్టినా, పెట్టకపోయినా చదువుతూ ఉంటాను రెగ్యులర్ గా.

  ఇంక అనవసరపు వ్యాఖ్యల గురించీ...పైన చెప్పిన మితృలందరి మాటే నాదీను.

  రిప్లయితొలగించు
 22. Congratulations Murali garu..

  Roju meeru ila tapalu raastu undandi..naku entala alavaatu ayindante..roju..office ki raagane..email tho paatu blog kuda mee open chesestanu..

  Thank you again..

  రిప్లయితొలగించు
 23. నేను ఈ టపా మిస్ అయ్యాను మురళీగారు. మీకు అభినందనలు. మీ టపాలతో పోటీ పడి చదవలేక వెనుకబడిపోయాను. :-(

  రిప్లయితొలగించు
 24. @శ్రీనివాస్ పప్పు; ............ధన్యవాదాలండీ..
  @శ్రావ్య వట్టికూటి: 'వినదగునెవ్వరు చెప్పిన..' అన్నారని ఒక ప్రయత్నమండీ. యెంత ఆలోచించినా నా దోషం ఏమిటో అర్ధంకాక మీతో పంచుకున్నా.. ధన్యవాదాలు.
  @రమేష్: తప్పకుండానండీ.. రాయడాన్ని నేనూ ఆస్వాదిస్తున్నాను.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 25. @కొత్తపాళీ: Thank you very much for your support.. thanks a lot..
  @పక్కింటబ్బాయి: ధన్యవాదాలండీ..
  @తృష్ణ: కార్డ్ అనగానే మొదట మీరే గుర్తొస్తారు.. మీ ప్రశంశకీ, చక్కని కార్డుకీ ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు
 26. @వనజ వనమాలి: "మనం విన్నవి,కన్నవి,చదివినవి చెప్పడానికి..స్పందించే హృదయం,మనదైన రీతిలోభావప్రకటనతో.. ఉంటే చాలు." నా ఆలోచన కూడా అచ్చంగా ఇదేనండీ.. ధన్యవాదాలు.
  @శ్రీ: వినపడ్డాయండీ మీ చప్పట్లు.. ధన్యవాదాలు.
  @కొత్తావకాయ: 'సేవ' అన్నది చాలా చాలా పెద్ద మాటండీ.. నేను చదివిన వాటి గురించి నాకు తోచిన నాలుగు ముక్కలు, నాకు తెలిసిన భాషలో.. అంతే.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 27. @సునీత: అలగడమూ కాదు, నొచ్చుకోవడమూ కాదండీ.. ఆలోచనలో పడడం.. అంతే.. ధన్యవాదాలు.
  @మాలాకుమార్: ధన్యవాదాలండీ..
  @చిన్ని: లేదండీ.. రాయడం మానేసే ఉద్దేశ్యం లేదు.. కానైతే చిన్న ఆలోచన.. ...ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 28. @సీబీ రావు: ధన్యవాదాలండీ..
  @ఇందు: లేట్ ఏమీ లేదండీ.. ధన్యవాదాలు.
  @సిరిసిరిమువ్వ: కొంచం ఆలోచించాల్సిన విషయాలుగా అనిపించాయండీ.. నా ఆలోచనలు తెగక మీతో పంచుకున్నాను.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 29. @Snkr : ధన్యవాదాలండీ..
  @శిశిర: ధన్యవాదాలండీ..
  @శ్రావ్య: ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు
 30. @రవికిరణ్: ధన్యవాదాలండీ..

  @బులుసు సుబ్రహ్మణ్యం: తప్పకుండానండీ.. ధన్యవాదాలు.

  @ఆ.సౌమ్య: పెద్ద ప్రశంశ!! ..ధన్యవాదాలండీ.

  రిప్లయితొలగించు
 31. @స్వాతి: ధన్యవాదాలండీ..

  @పద్మవల్లి: :-) :-) ..ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు
 32. మురళి గారూ, నేను రెగ్యులర్ గా చదివే బ్లాగుల్లో మీదే నంబర్ ఒన్.
  ఎందుకంటే నేను పండితుడినీ కాదు, అలాగని పామరుడిని కాదు.
  మీ టపాలు చాలావరకు నాలాంటివాళ్ళకు సరిపోతాయి.
  నాకు తెలిసి బ్లాగరుల్లో నాలాంటి వాళ్ళే ఎక్కువ.

  అన్నట్టు శతటపోత్సవ శుభాకాంక్షలు. (ఈ మాట అంటుంటే చిన్నప్పుడు చూసిన తెప్పోత్సవం గుర్తొస్తోంది)

  రిప్లయితొలగించు
 33. @బోనగిరి: ఏం రాయాలో తెలియడం లేదండీ.. ఏం రాసినా తక్కువే అవుతుంది.. చిన్నదే అయినా, తెలిసిన మాట..'ధన్యవాదాలు..'

  రిప్లయితొలగించు
 34. మురళి గారు, మీరు వరసగా ముప్పై టపాలు రాసినప్పుడే, నేను మిమ్మల్ని గిన్నిస్ బుక్ కి ఎక్కించేసాను. ఇప్పుడైతే శతాధిక శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించు
 35. @జయ: టపా రాస్తూ మిమ్మల్ని తల్చుకున్నానండీ.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 36. Congratulations!!

  నేను రోజూ ఈనాడు చూడను కానీ మీ బ్లాగ్ మాత్రం తప్పకుండా చూస్తాను.

  రిప్లయితొలగించు