శుక్రవారం, జులై 22, 2011

సులోచనాలు

రెండు రెళ్ళు నాలుగు. అంటే మనకున్న రెండు కళ్ళకి రెండు అద్దాలు జత పడితే మొత్తం నాలుగు కళ్ళన్న మాట. ఈ చతురాక్షులంటే (నాలుగు కన్నులు కలవారు -- కలది, కలవాడు బహువ్రీహి సమాసము) నాకు చిన్నప్పుడు భలే ఎడ్మిరేషన్. ఎందుకో తెలీదు కానీ, స్కూల్ రోజుల్లో కళ్ళజోడుతో ఉండే పిల్లలని చూస్తే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళన్న అభిప్రాయం కలిగేది. దాదాపుగా మేష్టర్లందరికీ కళ్ళజోడు ఉన్నప్పటికీ, వాళ్ళ విషయంలో ఇలాంటి భావన కలగక పోవడం ఏమిటో ఇప్పటికీ అర్ధం కాని విషయం నాకు.

హైస్కూల్లో లెక్కకు మిక్కిలిగా కళ్ళజోడు పిల్లలు కనిపించే వాళ్ళు. దానికి తోడు, మేష్టర్లు కూడా కొత్తగా కళ్ళజోడు వచ్చిన పిల్లలని ప్రత్యేకంగా పలకరిస్తూ "తలనొప్పా? సైటా? ఎన్నాళ్ళ నుంచీ? ఎన్ని పాయింట్లూ?" లాంటి ప్రశ్నలు అడుగుతూ ఉండేవాళ్ళు. గాంధీజీ గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా ఆయన కళ్ళజోడు గురించి తప్పకుండానూ, ప్రత్యేకంగానూ చెబుతూ ఉండేవాళ్ళు. 'నాక్కూడా కళ్ళజోడు వస్తే బాగుండు' అని నేను కోరుకోడంలో అసహజం ఏమీ లేదు కదా. ఓ బలహీన క్షణంలో ఈ కోరికను ఇంట్లో ప్రకటించడం "రోగం కోరుకోవడం ఏమిటీ దరిద్రం" అని అక్షింతలు వేయించుకోవడం కూడా జరిగిపోయిందే తప్ప నాకు సులోచనాధారణ భాగ్యం మాత్రం కలగలేదు.

కళ్ళజోళ్ళ వాళ్ళ మీద నాకున్న ప్రత్యేకమైన అభిమానం కారణంగా, నెమ్మదిగా వాళ్ళతో స్నేహం చేసి, కళ్ళజోడు సంగతులు అప్పుడప్పుడూ కనుక్కుంటూ ఉండేవాడిని. ఆశ్చర్యం ఏమిటంటే వాళ్ళలో చాలామంది కళ్ళజోడుని ఓ అపురూపమైన ఆస్థిలా కాక, అనవసరమైన బరువుగా చూసేవాళ్ళు. దళసరి కళ్ళద్దాలు, లావుపాటి ఫ్రేములు చాలా బరువనీ, చాలా జాగ్రత్తగా చూసుకోవాలనీ కొంచం నేరంగా చెప్పేవాళ్ళు. నేను కనిపెట్టిన ఇంకో విషయం ఏమిటంటే కళ్ళ జోడు ఉన్నవాళ్ళందరూ ఎక్కువ మార్కులు తెచ్చుకునే వాళ్ళు కాదు. వాళ్ళలో చాలామంది కన్నా నాకే ఎక్కువ మార్కులు వచ్చేవి. అయినప్పటికీ కూడా నాకు కళ్ళజోడు మీద ప్రేమ తగ్గలేదు.

కాలేజీ మిత్రుల్లో కూడా కొందరికి కళ్ళజోళ్ళు ఉండేవి. వాళ్ళు ఎప్పుడైనా కళ్ళజోడు కళ్ళ మీద నుంచి నుదిటి మీదకో, తల పైకో జరుపుకుంటే "కళ్ళు నెత్తి కెక్కాయ్, ఏంటబ్బాయ్?" అంటూ సెటైర్లు వేసేవాడిని. కళ్ళజోడు ఉన్న అమ్మాయిలని గుర్తు పెట్టుకోవడం మరింత సులభం అన్నది ఆరోజుల్లో చేసిన ఒకానొక డిస్కవరీ. చూస్తుండగానే ఇంట్లో అందరికీ కళ్ళజోళ్ళు వచ్చేశాయి, నాకు తప్ప. ఉద్యోగం వస్తే తప్ప కళ్ళజోడు రాదేమో అనేసుకున్నాను. అదేదో పెళ్లి కాదేమో అన్నట్టుగా. కళ్ళజోడు కేవలం తలనొప్పో, సైటో ఉన్నవాళ్ళకి మాత్రమే కాదనీ, మామూలు వాళ్లకి కూడా గ్లాసెస్ ఉంటాయనీ తెలిసిన క్షణం నా ఆనందం వర్ణనాతీతం.

చూస్తుండగానే అన్ని చోట్లకి మల్లేనే కళ్ళజోళ్ళ విషయంలోనూ విప్లవాత్మకమైన మార్పులు వచ్చేశాయి. ఒకప్పటి సోడాబుడ్డి కళ్ళద్దాలు మచ్చుకైనా కనిపించడం లేదు. తేలికపాటి, అందమైన అద్దాలే. చిన్న చిన్న సమస్యలకి మైనర్ సర్జరీలు వచ్చేశాయి. సైటు ఉన్నవాళ్ళు కూడా లెన్సుల్లోకి మారిపోతున్నారు. ఇక ఫేషన్ కళ్ళజోళ్ళు సరేసరి. మల్టినేషనల్ కంపెనీలు కళ్ళజోళ్ళ మార్కెట్లోకి వచ్చేశాయంటే వీటి మార్కెట్ ఎంత పెరిగిందో సులభంగానే అంచనా వెయ్యొచ్చు. పెద్ద పెద్ద తారలు ఈ కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్లు. ప్రతి రోజూ వందల కొద్దీ మోడళ్ళు మార్కెట్ ని ముంచెత్తుతున్నాయి.

చాలామందికి కళ్ళజోళ్ళు సేకరించడం ఒక హాబీ. చాలా మంది సిని తారలు కూసింత గర్వంగా ఈ హాబీని గురించి చెప్పుకుంటూ ఉంటారు. వెండితెర గయ్యాళి అత్తగారు సూర్యకాంతం దగ్గర వందల సంఖ్యలో కళ్ళజోళ్ళు ఉండేవిట. కొత్త వేషం అనగానే ఆవిడ మొదట ఎలాంటి కళ్ళజోడు బాగుటుందో అని ఆలోచించేవారంటే సులోచనాల మీద ఆవిడ ప్రేమని అర్ధం చేసుకోవచ్చు. అసలు సులోచనాలు అంటే కళ్ళు అని అర్ధం కానీ, ఎలా అయిందో ఇది కళ్ళద్దాలకి సమానార్ధకమైపోయింది. నవలాదేశపు రాణి యద్దనపూడి సులోచనారాణి నవలలు చదివే రోజుల్లో ఈవిడ ఒక్కో నవలకీ ఒక్కో కళ్ళజోడు మారుస్తుందేమో అనుకునే వాడిని. కానైతే నేను చూసిన మొట్ట మొదటి ఫోటోలో ఆవిడకి కళ్ళజోడు లేనేలేదు. ఇంతకీ నాదగ్గర ఎన్ని కళ్ళజోళ్ళు ఉన్నాయో చెబుతానని అనుకుంటున్నారు కదూ? అబ్బే, నా ఆస్థులు నేనెందుకు వెల్లడిస్తాను??

12 కామెంట్‌లు:

 1. కాదేదీ బ్లాగుటకనర్హం,
  దేనిగురించి బ్లాగినా నెమలికన్నుకే(మురళీ గారికే)చెల్లు.

  రిప్లయితొలగించు
 2. సో, నాకే కాదన్నమాట ఈ కళ్ళజోళ్ళ పిచ్చి. ఇప్పుడర్ధమయ్యింది నా లాంటి ఎందరో మహానుభావులున్నారని. సేంపించ్:)

  రిప్లయితొలగించు
 3. మురళీగారు.....మీరు సులోచలాలు ఎన్ని ఉన్నాయో చెప్పలేదంటే!!
  ఇప్పటికీ చలువ కళ్ళద్దాలే వాడుతున్నారన్నమాట:-)

  రిప్లయితొలగించు
 4. మా ఇంట్లో పిల్లలూ రోజూ గోలపెడతారు హెరీపాటర్ కళ్ళద్దాలు కావాలని :)

  రిప్లయితొలగించు
 5. హ హ బాగా రాసారు సులోచనాల మీద మీ ప్రేమ గురించి . నాకు స్కూల్ లో ఉన్నప్పడు ఈ కళ్ళద్దాలు అంటే మహా ఇష్టం ఉండేది , ఇప్పుడు అవి పెట్టుకోవ్వాల్సిన అవసరం వచ్చాక మాత్రం మహ కష్టం గా ఉంది :)))

  రిప్లయితొలగించు
 6. నా చిన్నప్పటి జ్ఞాపకాల్ని కళ్ళ ముందు ఉంచారు. మా వూళ్ళో 'కళ్ళ జోడు కృష్ణా రెడ్డి' గారు అని ఓ పెద్దాయన ఉండేవారు. రెడ్డి గారి పేరు ముందు కళ్ళ జోడు ఎందుకు వచ్చిందో ఎవరూ చెప్పేవారు కాదు. ఆయన ఇంటి పేరుతో చెబితే ఎవరూ గుర్తు పట్టేవారు కారు. మీ రచన చదవగానే 'కళ్ళ జోడు కృష్ణా రెడ్డి' గారు గుర్తుకొచ్చారు.

  రిప్లయితొలగించు
 7. మూడో తరగతి నుండి నా శరీరంలో అంతర్భాగమైపోయిన నా కళ్ళజోడంటే మొదట్లో చాలా చిరాకు కోపం ఉండేవి రాను రాను గేలి చేస్తున్న తోటి పిల్లల ఆటకట్టించడానికి కళ్ళజోడుతో మాత్రమే చేయగలిగిన కొన్ని ప్రత్యేకమైన స్టైల్ మ్యానరిజమ్స్ అలవాటు చేసుకున్నాక అందరూ వాటితోపాటు నన్ను గొప్పగా చూట్టం మొదలెట్టాక మెల్లగా ఇష్టం పెరిగింది :-) ఇప్పుడు అసలు కళ్ళజోడు ఉందన్న స్పృహే ఉండదు. అంతగా అలవాటుపడిపోయాను.. మీ టపా చాలా బాగుంది.

  రిప్లయితొలగించు
 8. నెమలి'కన్ను'కి కూడా కళ్ళజోడా

  రిప్లయితొలగించు
 9. నాది కూడా అదే కోరిక చిన్నప్పటినుంచి కళ్ళజోడు అంటే ప్రాణం .కాని ఇప్పుడు కళ్ళజోడు వచ్చిన తర్వాత దాన్ని సర్దుకోలేక ప్రాణం పోతున్నది. కాని కళ్ళజోడు మీద మీరు చేసిన రీసెర్చి అద్భుతం

  రిప్లయితొలగించు
 10. @శ్రీనివాస్ పప్పు: ధన్యోస్మి!!
  @జయ: హమ్మయ్య.. మీరు కూడా ఉన్నారు కదా... ధన్యవాదాలండీ..
  @పద్మార్పిత: యెంత చక్కని ప్రశంశ!! ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు
 11. @మాలాకుమార్: అవునండీ, ఇప్పుడు ఇదో ట్రెండు కదూ.. ధన్యవాదాలు.
  @శ్రావ్య వట్టికూటి: చూడ్డానికి బాగుంటుంది కానీ, భరించడం అంత సులువు కాదండీ.. ధన్యవాదాలు.
  @చక్రవర్తి: మీ వ్యాఖ్య చూడగానే నాకు నామిని సుబ్రహ్మణ్యం నాయుడు 'మునికన్నడి సేద్యం' నవలలో 'అద్దాలామె' గుర్తొచ్చిందండీ.. నవలలో ముఖ్యమైన పాత్ర.. అసలు పేరేమిటో తెలీదు!! ఊళ్లలో ఇలాంటి మారు పేర్లు భలే ఫేమస్ అయిపోతాయండీ.. మూలాలలోకి వెళ్తే ఆసక్తి కరమైన కథలు బయటికి వస్తాయేమో.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 12. @వేణూ శ్రీకాంత్: చిన్నప్పుడే అద్దాలు పెట్టుకున్న అదృష్టవంతులు!! ఎవరండీ ఆ గేలి చేసింది? నా దగ్గరికి పంపండి, గాట్టిగా ప్రైవేటు చెప్పేస్తాను :)) ..ధన్యవాదాలండీ..
  @పక్కింటబ్బాయి: :)) :)) బాగుందండీ వ్యాఖ్య.. ధన్యవాదాలు.
  @రాజశేఖర్: రీసెర్చ్ అని కాదు కానండీ, మనకి ఇష్టమైన వాటిగురించి తెలుసుకుంటూ ఉంటాం కదా.. నిజమేనండీ,, చూడ్డానికి యెంత బాగున్నా ధరించేటప్పుడు చికాకులూ లేకపోలేదు.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు