ఆదివారం, జులై 17, 2011

షోడా నాయుడు

వర్తమానం బరువుగా సాగుతున్నట్టుగా అనిపిస్తే మనం చేయగలిగేవి రెండు పనులు. భవిష్యత్తుని గురించి అందమైన కలలు కనడం లేదా గడిచిపోయిన జీవితాన్ని, ముఖ్యంగా అందులో అత్యంత మధురమైన బాల్యాన్ని గుర్తు చేసుకోవడం. ఈ రెండో పనిని ఏమంత కష్ట పడకుండా అదాటున చేసేయాలంటే మాత్రం ఒక్కటే మార్గం.. శ్రీరమణ రాసిన 'షోడా నాయుడు' కథని ఒక్కసారి చదివితే చాలు. ఆకాశంలో చందమామని అద్దంలో చూపించినట్టుగా, మన బాల్యాన్నంతా తెచ్చి మన కళ్ళముందుంచే కథ ఇది.

కథకుడు ఏడెనిమిదేళ్ళ పిల్లవాడిగా ఉన్నప్పుడు మొదలవుతుందీ కథ. వేసవి సెలవుల్లో అందరిలాగా హాయిగా ఆడుకోకుండా, అమ్మిచ్చిన డబ్బులతో ఏ జీళ్ళో, ఐస్ ఫ్రూటో కొనుక్కోకుండా మన హీరో చేసే పనేమిటంటే, పొద్దస్తమానం వాళ్ళూరి షోడా నాయుడి బండి వెనక తిరగడం. అప్పుడప్పుడూ షోడాలు కొనుక్కుని తాగడం. కనీసం ఒక్కటి, ఓకే ఒక్క షోడా గోళీని సంపాదించడమే మనవాడి ఆశయం మరి. గోపిగాడి దగ్గరా, శీనాయ్ దగ్గరా ఉన్న షోడా గోళీ తన దగ్గర లేకపొతే ఎలా? అక్కడికీ నాయుణ్ణి ఎంతో మర్యాదగా అడిగాడు, గోళీ కావాలని. నాయుడేమో కసిరి కొట్టాడు. షోడా పగిలిపోతేనే కదా గోళీ వచ్చేది. షోడా పగిలితే నష్టం కన్నా ప్రమాదం ఎక్కువ.

ఊరంతటికీ షోడాలు సప్లయ్ చేసేది నాయుడు ఒక్కడే. అందుకే పాలకోసం నల్లరాయి మోసినట్టుగా, ఎద్దు వెనుక నక్క తిరిగినట్టుగా, నాయుడి వెంట ఆశగా తిరగడం. షోడాలు తాగుతూ, తేన్చుకుంటూ, తన మీద తనే జాలిపడుతూ తిరగడం. నాయుడేమీ కోపిష్టి మనిషి కాదు. బోళా మనిషి, లౌక్యం కూడా బాగానే తెలుసు. షోడాలే అతని ప్రపంచం. ఇంకో మాటలో చెప్పాలంటే మొత్తం ప్రపంచంలో షోడా వంటి వస్తువు మరొకటి లేదతనికి. మూడు కాయల మిషన్ ని తనంత బాగా తిప్పే వాడు ఆ చుట్టుపక్కల ఎవడూ లేదని గాట్టి నమ్మకం కూడాను.

షోడా కోసం మన బుల్లి హీరో చేసే ప్రయత్నాలన్నీ పాఠకులని బాల్యంలోకి తీసుకెళ్ళిపోయేవే. గుళ్ళో పురాణం చెప్పేటప్పుడైతేనేం, ఊళ్లో వాళ్ళంతా కలిసి పౌరాణిక నాటకం వేసినప్పుడైతేనేం.. ఏదోలా నాయుడు చూడకుండా ఓ షోడా నొక్కేసి, గోళీ తీసేసుకోవాలన్న తాపత్రయాన్ని కేవలం చదివి తీరాలి. పనిలో పనిగా షోడా కనిపెట్టినవాడి చవటాయితనాన్ని తిట్టేస్తాడు కూడా, సీసాలో గోళీ అలా బయటకి రాని విధంగా అమర్చినందుకు. (నా చిన్నప్పుడు నేను కూడా షోడా తాగిన ప్రతిసారీ, గోళీ తీసేసుకోవాలని విఫల ప్రయత్నాలు చేసి అచ్చం ఇలాగే తిట్టేసుకున్నాను.)

కాలం ఎవరికోసమూ ఆగదు కదా.. మన వాడు గోళీకోసం ప్రయత్నిస్తూ ఉండగానే హైస్కూలు చదువుకి వచ్చేస్తాడు. పైగా అమ్మనీ, ఊరినీ విడిచిపెట్టి మావయ్య ఊరికి ప్రయాణం. తన దగ్గరున్న గోళీలన్నీ లెక్కపెట్టి, లెక్క రాసి పెట్టుకుని, ఓ కవర్లో భద్రంగా మూటకట్టి, నేరేడు చెట్టు మొదట్లో జాగ్రత్తగా పాతి పెట్టి, మావయ్య ఇంటికి బయలుదేరితే ఏముంది? పందికొక్కులు ఆ మూటని తవ్వేసినట్టుగా రోజూ పీడకలలు. పెరిగి పెద్దయిన హీరోని వెతుక్కుంటూ షోడా నాయుడు వస్తాడొక రోజు. వయసు మీద పడింది తప్ప, అతని ధోరణిలో ఎలాంటి మార్పూలేదు. తర్వాత వచ్చే హృద్యమైన సన్నివేశమే ఈ కథకి ప్రాణం. అక్షరాలా కొన్ని వందల సార్లు చదివినా, ఇప్పటికీ చదివే ప్రతిసారీ చివరి వాక్యాలు నా కంటికి మసక మసగ్గానే కనిపిస్తాయి. అది కథలో ఉన్న తడి.

రెండున్నరేళ్ళ క్రితం నేనో బ్లాగు మొదలు పెట్టాలనుకున్నప్పుడు, 'ఏం పేరు పెట్టాలి?' అన్న ఆలోచనకి ఈ కథే సమాధానం చెప్పింది. నెమలికన్నుల విసనకర్రలతో అందరినీ దీవించి పొట్టపోసుకునే సంచార జాతివాళ్ళ దగ్గర నుంచి ఒకే ఒక్క 'నెమలికన్ను' సంపాదించడం కోసం నేను పడ్డ తిప్పలన్నీ కళ్ళముందు మెదిలాయి. ఓ నెమలికన్ను సంపాదించుకోగలిగి ఉంటే నా (బ్లాగు) కథ వేరే విధంగా ఉండేదేమో. అంతే కాదు, ఈ కథ స్కాన్ కాపీని కొందరు బ్లాగర్లకి పంపి వాళ్ళని మిత్రులని చేసేసుకున్నాను కూడా. చదివి తీరవలసిన ఈ 'షోడా నాయుడు' కథ శ్రీరమణ 'మిధునం' కథ సంకలనం లోది. నవోదయ నుంచి మొన్ననే తాజా ప్రచురణ వచ్చింది. 'ధనలక్ష్మి' 'బంగారు మురుగు' తో సహా మొత్తం ఎనిమిది కథలున్న ఈ సంకలనం వెల రూ. 60. అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభ్యం.

10 కామెంట్‌లు:

 1. అందరూ మిథునం మిథునం అంటారు కానీ నాకు ఈ కథే చాలా ఇష్టమండీ. మొన్నెవరో పుస్తకంలో రాస్తూ, కథ ముగింపు నాటకీయంగా ఉందని విమర్శిస్తే నాకు చాలా బాధేసింది. మీరు కూడా ఆ ముగింపు గురించి నాలా ఆలోచించడంతో రిలీఫ్ గా చాలా హాపీగా అనిపించింది. బాల్యాన్ని షోడా గోళీతో సింబలైజ్ చేశారు శ్రీరమణ. ముఖ్యంగా చివర్లో నాయుణ్ణి రససిద్ధుడంటారు చూడండీ ఆ వాక్యం మాత్రం మరువలేను.
  నేను శ్రీరమణ గారితో ఫోన్లో మాట్లాడాను ఈ కథ చదివి పరవశించి. షోడా గోళీ బాల్యమే కదండీ ఆ బాల్యపు మాధుర్యాన్నేగా నాయుడు చివర్లో ఇచ్చింది అంటే అవును కానీ వాచ్యంగా ఆ కథలో చెప్తే అందం పోతుందని చెప్పలేదన్నారాయన.

  రిప్లయితొలగించు
 2. బావుంది మురళిగారూ.. ఎప్పటికీ బావుండే కధలలో ఇది కూడా ఒకటి.. ఐతే మీ బ్లాగ్ పేరు వెనక ఉన్న కధ ఇది అన్నమాట..

  రిప్లయితొలగించు
 3. మంచికథ గుర్తు చేశారు. షోడానాయుడు స్ఫూర్తితో చాలాకాలం క్రిందట నా చిన్నతనం సంఘటన కథగా రాశాను, మా మాండలికంలో.

  రిప్లయితొలగించు
 4. బాగుందండి మురళి గారు ఆంధ్రజ్యోతి డైలీ లో ఆయన రాసిని రాజకీయ వ్యంగ్యం అద్భుతంగా ఉండేది. ఆయనకు ఎందుకో గాని రావలసినంత పేరు రాలేదు అనిపిస్తోంది ( రాయడం వస్తే సరిపోదు మార్కెటింగ్ తెలివితేటలూ కూడా ఉండాలేమో )

  రిప్లయితొలగించు
 5. @పక్కింటబ్బాయి: భలే కో-ఇన్సిడెన్స్!! శ్రీరమణ గారిని మొదటిసారి కలిసినప్పుడు నేను కూడా మొదట మాట్లాడింది 'షోడా నాయుడు' గురించే.. ఆయన పక్కనున్న వారెవరో "అదేంటండీ, అందరూ మిధునం గురించి అడుగుతారు" అన్నారు కూడా. మగ్గాలు ఆగిపోయి కాలం స్థంభించి పోయినట్టు ఉండడాన్ని గురించి అడిగాను మొదట. అంటే ఆ ఆలోచన ఎలా వచ్చిందని.. వాళ్ళ తెనాలి కబుర్లు చెప్పారు ఓపిగ్గా... ఇంకా చాలానే ఉన్నాయి లెండి.. అన్నట్టు కొన్ని కొన్ని వాచ్యంగా చెప్పడం కన్నా, చెప్పీ చెప్పనట్టుగా చెప్పడమే బాగుంటుందనిపిస్తుంది నాకు.. ధన్యవాదాలు.
  @ప్రసీద: అవునండీ.. నా మొట్ట మొదటి టపాలో రాశాను :)) ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 6. @రవి: చదివానండీ మీ కథ!! బాగుంది. ముఖ్యంగా ముగింపు... ...ధన్యవాదాలు.
  @బుద్దా మురళి: అవునండీ.. ముఖ్యంగా చంద్రబాబు మీద.. 'శ్రీ కాలమ్' అని పుస్తకం కూడా వచ్చింది.. ఆయన అటు సినిమాలు, ఇటు దిన పత్రికలూ, మధ్యలో వార పత్రికలూ, ఇంతలో టీవీ.. ఇలా అనేక రంగాల్లోకి వెళ్ళడం వల్ల ఎక్కడా రావల్సినంత పేరు రాలేదేమో అని నా అభిప్రాయం అండీ.. ఈమధ్యన కథలు కూడా ఏమీ రాసినట్టు లేరు.. మార్కెటింగ్.. నిజమేనేమో... ధన్యవాదాలు..

  రిప్లయితొలగించు
 7. చాలాకాలం క్రితం మిధునం పుస్తకం కొంటే అందులో షోడానాయుడు, బంగారు మురుగు కథల్లోనే చెరినాలుగు పేజీలు మిస్ అయ్యాయండి.. దానితో చదవాలనిపించక చదవలేదు. ప్రస్తుతం కొత్త ఎడిషన్ వచ్చిందంటున్నారు ఇంకా మా గుంటూరు విజయవాడల్లో రాలేదు ఎదురు చూస్తున్నాను.. వీరి ఆంధ్రజ్యోతి కాలమ్స్ “రంగులరాట్నం” పుస్తకమ్ చదివాను వ్యంగ్యం బాగా రాసారు వాటిల్లో.

  రిప్లయితొలగించు
 8. @వేణూ శ్రీకాంత్: అయ్యో.. చాలా బాగుండే కథలండీ అవి.. పేజీలు మిస్సవ్వడం బాధాకరం.. కొత్త ఎడిషన్ తప్పక తీసుకోండి.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 9. నాకు ఈ పుస్తకంలో బాగా నచ్చిన కథ షోడానాయుడే...ఇంకా చెప్పాలంటే మిధునం కంటే కూడా గొప్ప కథ ఇది. కథ చివరి సన్నివేశం చదివినప్పుడు కంట తడి పెట్టాను. మీరూ నాలగే ఆలోచిస్తున్నారన్నమాట :)

  రిప్లయితొలగించు
 10. @ఆ.సౌమ్య: షోడా నాయుడు, ధనలక్ష్మి, బంగారుమురుగు, మిధునం... వీటిలో ఏ రెండు కథలనీ పోల్చలేమండీ.. దేనికదే ప్రత్యేకమైనది.. నాకు ఈక్షణంలో చదివినా చివరి వాక్యాల దగ్గర కళ్ళు మసక బారతాయి.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు