సోమవారం, జులై 11, 2011

ఏడు తరాలు

పుస్తకాలు కేవలం విజ్ఞానాన్నీ, వినోదాన్నీ పంచి ఊరుకోవు. అవి మనల్ని ప్రభావితం చేస్తాయి కూడా. అలా నన్ను ప్రభావితం చేసిన ఒకానొక పుస్తకం 'ఏడు తరాలు.' ఎలెక్స్ హెలీ ఆంగ్ల నవల 'రూట్స్' కి సహవాసి చేసిన సరళమైన తెలుగు అనువాదం. విజేతలే చరిత్రలు రాశారు, రాస్తారు. ఇది సామాన్యంగా జరిగే విషయం. ఎందుకంటే పరాజయాలు చెప్పుకోగలిగే విషయాలుగా అటు పరాజితులకీ, ఇటు సమాజానికే కూడా అనిపించవు కాబట్టి. కానీ, ఈ ఆనవాయితీని బద్దలు కొట్టిన వాడు హెలీ.

'ఏడు తరాలు' బానిసల కథ. కేవలం తమ అమాయకత్వం కారణంగా, చీకటి ఖండం ఆఫ్రికా నుంచి అమెరికాకి బానిసలుగా తీసుకురాబడ్డ దురదృష్టవంతుల కథ. పచ్చటి ఆఫ్రికా పల్లెల్లో, తమవైన సంస్కృతీ సంప్రదాయాల మధ్యన, ఆటపాటలతో జీవితం గడుపుతున్న ఆఫ్రికా వాసులని, వలవేసి పట్టుకుని, బంధించి, రోజుల తరబడి గాలైనా సోకని ఓడలలో తమ దేశానికి రవాణా చేసి, నడిబజార్లో వాళ్ళని వేలం వేసిన అమెరికన్ల కథ.

క్రీస్తుశకం 1750 లో పడమటి ఆఫ్రికా లో గాంబియా సమీపంలోని జపూరు అనే పల్లెటూళ్ళో ఉమరో-బింటా దంపతులకి నేరేడు పండులా నిగనిగలాడే 'కుంటా' అనే కొడుకు పుట్టడం కథా ప్రారంభం. ఆఫ్రికా పల్లెల సౌందర్యాన్నీ, సమస్యలనీ, ప్రకృతి వైపరీత్యాలనీ పరిచయం చేస్తూనే, అక్కడి జీవన విధానాన్నీ కళ్ళ ముందుంచుతారు రచయిత. ముఖ్యంగా పిల్లల పెంపకం, పనిపాటలతో పాటు రాయడం, చదవడం నేర్పించడం, మగ పిల్లలని ప్రత్యేకమైన 'పురుష' శిక్షణ కోసం పంపించడం ఇవన్నీ పాఠకులని ఆశ్చర్య పరుస్తాయి.

కుంటా తమ పల్లె దగ్గరలో ఉన్న అడవిలో పురుష శిక్షణ పూర్తి చేసుకుని యువకుడి గ్రామానికి తిరిగి వచ్చాక, అతనికి వేరే ఇల్లు కట్టించి అక్కడికి పంపేస్తారు తల్లిదండ్రులు. అడవుల్లో తిరిగేటప్పుడు 'తెల్లోడి' బారిన పడకుండా ఎలా తప్పించుకోవాలో కొడుక్కి వివరంగా చెబుతాడు ఉమరో. తడిసిన కోడి మాంసం వాసన వచ్చిందంటే దగ్గరలో తెల్లోడు ఉన్నట్టేననీ, వాడి అడుగులు బరువుగా పడతాయనీ, ఆకుల్ని తుంపుతూ పోతాడనీ.. ఇలా ఎన్నో ఆనుపానులు విశదంగా చెబుతాడు.

మంచెమీద కూర్చుని రాత్రంతా పొలం కావలి కాస్తూ, యవ్వన సహజమైన కోర్కెలతో భావి సంసారజీవితాన్ని గురించి మేల్కొనే కలలు కంటూ నిద్రకు దూరమైన కుంటా, మర్నాడు ఉదయాన్నే తమ్ముడికి మృదంగం చేసి ఇవ్వడం కోసం నాణ్యమైన దుంగ కోసం అడవికి వెళ్లి ఏమరుపాటున తెల్లోడికి చిక్కుతాడు. అక్కడినుంచి అతని కష్టాలు ప్రారంభం. దెబ్బలతో స్పృహ తప్పించి తీసుకెళ్ళిన తెల్లోళ్ళు, కుంటాని ఒక ఓడలో గొలుసుతో బంధిస్తారు. ఆ ఓడ నిండా వందలాది ఆఫ్రికావాసులే.

దుర్భరమైన ప్రయాణం తర్వాత తీరం చేరుతుంది ఓడ. వేలంలో కుంటాని కొనుక్కున్న యజమాని అతనికి 'టోబీ' అని పేరు పెట్టి తనతో తీసుకెళ్ళి పోతాడు. చేతులుమారిన కుంటా వర్జీనియాలో 'నిగ్గరు' (బానిస) గా స్థిరపడతాడు. పారిపోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అవన్నీ విఫలమవుతాయి. తన ప్రయత్నానికి శిక్షగా కాలు కోల్పోతాడు. నలభయ్యేళ్ళ వయసులో తోటి నిగ్గరు బెల్ ని పెళ్లి చేసుకుని 'కిజ్జీ' కి తండ్రవుతాడు. కూతురికి జ్ఞానం రాగానే, దగ్గర కూర్చోబెట్టుకుని జపూరు గురించీ, తన బాల్యాన్ని గురించీ, తను బానిసగా వచ్చిన వైనాన్ని గురించీ వివరంగా చెప్పడంతో పాటు తన భాషనీ నేర్పుతాడు.

ఈ కథ పరంపరాగతంగా ప్రతీ తరమూ తన తర్వాతి తరానికి చెప్పడం ద్వారా, ఎనిమిదో తరం వాడైన ఎలెక్స్ హెలీకి చేరడం, అతడు చాలా పరిశోధన చేసి 688 పేజీల ఆంగ్ల నవలగా తీసుకురావడం తర్వాతి కథ. ఈ ఆంగ్ల నవల సారాన్ని క్లుప్తంగా, సరళంగా తెనిగీకరించారు 'సహవాసి' గా పేరొందిన జంపాల ఉమామహేశ్వర రావు. (నాకు కొద్దిపాటి పరిచయం ఉంది అని చెప్పుకోడానికి గర్వ పడే వ్యక్తుల్లో ఒకరీయన). తనకి మరికొంచం వివరంగా రాయాలని ఉన్నా, ప్రకాశకుల కోరిక మేరకే బాగా క్లుప్తీకరించాల్సి వచ్చిందని ఆదివారం ఆంధ్రజ్యోతి 'ఫెయిల్యూర్ స్టోరీ' కి ఇచ్చిన ఇంటర్యూ (బహుశా ఆయన చివరి ఇంటర్యూ) లో చెప్పారు.

జపూరు నాగరికత, తరాల పాటు కొనసాగిన అంచె డప్పుల వ్యవస్థ మొదలుకొని, విముక్తి కోసం కుంటా పడే తపన, తన సంస్కృతీ సంప్రదాయాలని నిలబెట్టుకోవడం కోసం పడే తాపత్రయం వెంటాడతాయి. అంతేనా? నిగ్గర్ల కష్టాలు, యజమానుల కారణంగా వాళ్ళు పడే హింస, ఒకరితో ఒకరు కనీసం మాట్లాడుకోలేని అసహాయత, యజమానుల మెప్పు కోసం చేసే వృధా ప్రయత్నాలు ఇవన్నీ కలుక్కుమనిపిస్తాయి. ఒక్క క్షణం ఏమరుపాటు కారణంగా తమ జీవితాలనే మూల్యంగా చెల్లించిన వాళ్ళు వాళ్ళంతా. అంతే కాదు, ప్రపంచానికి నాగరికత నేర్పానని నిస్సిగ్గుగా చెప్పుకునే దేశం చేసిన అనాగరిక పనికి ప్రత్యక్ష సాక్ష్యాలు కూడా.

తరచి చదవగలిగితే ఎన్నో జీవిత సత్యాలని విప్పి చెబుతుందీ నవల. ఒక్కో పాత్రనుంచీ నేర్చుకోగలిగింది ఎంతైనా ఉంది. సహవాసి రాసిన ఎన్నో చిన్న వాక్యాలు పదే పదే వెంటాడతాయి. ఆలోచనల్లో పడేస్తాయి. ప్రతి ఒక్కరూ చదవాల్సిన, చదివించాల్సిన ఈ నవలని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది.

21 కామెంట్‌లు:

 1. మురళి గారూ
  ఏడు తరాలు పుస్తకం పై మీ సమీక్ష బాగుంది.
  రికార్డు కోసం మా బ్లాగులో యధా తధంగా
  పొందుపరచుకునెందుకు అనుమతించ గోరుతున్నాం
  ధన్యవాదాలు

  రిప్లయితొలగించు
 2. మురళి గారు.. ఈ పుస్తకం నేను చదివాను. నా ధగ్గర పధిలంగా కూడా ఉంది.. యెవరికైనా మూలాలు అవసరమని..మూలాలు మరువకూడదని చెప్పె ఓ..మంచి.పుస్తకం. మీ పుస్తక పరిచయం బాగుంది. ధన్యవాదములు.

  రిప్లయితొలగించు
 3. ఇది నేను చదివిన మొదటి నవల. అప్పుడెప్పుడో ఆంధ్ర భూమిలో ఇంగ్లీషు నవలలను పరిచయం చేస్తూ దీన్నే మొదటగా పరిచయం చేశారు. ఇది చదివిన తరువాత ఇందులోనే వినిపించిన Sojourner of Truth గురించీ కూడా చదివాను. పుస్తకం చాలా బాగా నచ్చింది. చివర్లో తన వాళ్ళని కలుసుకొని తాను వాళ్లంత నల్లగా లేనని, తాను వేర్పడిపోయానని సిగ్గుపడతాడు చూడండి అది... wow.. it moved me like anything.

  రిప్లయితొలగించు
 4. @హైదరాబాద్ బుక్ ట్రస్ట్: తప్పకుండానండీ.. ధన్యవాదాలు.
  @వనజ వనమాలి: అవునండీ.. ధన్యవాదాలు.
  @ఇండియన్ మినర్వా: నాకైతే కిజ్జీ తను గర్భవతి అయినప్పుడు పుట్టబోయే బిడ్డకి పూర్తీ నల్లరంగు రాదనీ బాధపడే సన్నివేశం -- తన తనని అమ్మేసినందుకన్నా ఎక్కువగా బాధ పాడడం -- పురిటి సమయంలో తల్లీ తండ్రీ దగ్గర లేకపోవడమే మంచిదైందని అనుకోవడం (రంగు విషయంలో తండ్రి పట్టుదల తెలుసు కాబట్టి) బాగా కదిలించాయండీ.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 5. ఆంగ్ల మూలం అయిన రూట్స్ చదువుతూ చాలా బాధ గా అనిపించి మధ్యలోనే మానేసాను. మీ పరిచయం బాగుంది.

  రిప్లయితొలగించు
 6. మురళిగారు, మీరు చాలా చాల మంచి పుస్తకాల సమీక్షలు ఇస్తున్నారు, పుస్తకం, సమయం దొరికితే తప్పక చదవాలి అనుకుంటున్నాను.

  రిప్లయితొలగించు
 7. నేను చదువుతూ చదువుతూ ఒక లాంటి ట్రాన్స్ లోకి వెళ్లిపోయాను. చివర్లో ఆఫ్రికాలో వంశక్రమాన్ని పాడే గాయకులు ఇతను ఫలానా కుంటాకింటే వంశస్థుడు అని బిగ్గర ప్రకటీంచడంతో నేను శరీరం పులకాంకురమై సంతోషం, బాధ లాంటి వాటికి అతీతమైన కన్నీరు కార్చాను. తరతరాల పాటు దారితప్పిన వ్యక్తి అన్వేషణలో తమవారిని చేరుకుంటే కలిగిన అనుభూతిలో నేను కరిగిపోయాను.
  తురుష్క దండయాత్రలో ఆంధ్ర చక్రవర్తిని చంపి ఓరుగల్లును సుల్తాంపూర్ చేసిన తర్వాత... మూకలుగా త్రిలింగ దేశంపై పడినప్పుడు. దౌర్జన్యం చేసే డిల్లీ సుల్తానుల సైన్యాన్ని ఎదుర్కొని, ఆ ఘోరకలిలో అస్తిత్వం నిలబెట్టుకుని..."ఆత్రేయస గోత్రస్య ఆత్రేయస అర్చనాంస శ్యావాస్య త్రయార్షయ ప్రవరాన్విత ఆపస్తంభసూత్రః యజుశ్శాఖాధ్యాయీ " అన్న ఋషి ప్రవరని నాకు అందించిన నా పూర్వీకులు ఙ్ఞప్తికి వచ్చారు. ఇలా ఎన్నో రకాలుగా కదిలిపోయాను ఆ నవల చదివి.
  కుంటాకింటే తమ భాషని, సంప్రదాయాన్ని తరాలకి అందించినట్టే... ఇలా కాస్తైనా మనకి మిగలాలని మన పూర్వీకులు ఎంత తపించి ఉంటారో కదా. అతనిలో నాకు నా పదో తరం ముత్తాత స్ఫూర్తి కనిపించింది.

  రిప్లయితొలగించు
 8. అబ్బ నేను ఈ పుస్తకం అట్త్ట (మీరు పెట్టిన బొమ్మ) చూసి ఎక్కడికో వెళ్ళిపోయాను. నా చిన్నప్పుడు చదివిన పుస్తకం...ఆ జ్ఞాపకం మధురం! నాకు చాలా చాలా ఇష్టమైన పుస్తకం ఇప్పటికీ ఎప్పటికీ. ఎన్నిసార్లు చదివుంటానో లెక్కలేదు. మంచి పరిచయం!

  ఒకమాట: ఏడుతరాలు చదివాక ఇంగ్లీషు మూలం రూట్స్ చదవబుద్దేయ్యలేదు నాకు. సహవాసిగారు ఎంత బాగా తెలుగులో అనువదించారంటే మరి మూలం జోలికి వెళ్ళబుద్ధెయ్యదు.
  అయినా రూట్శ్ చదివాననుకోండి :)

  రిప్లయితొలగించు
 9. ఈ పుస్తకం గురించి చాలా సార్లు విన్నాను. కానీ చదివే అవకాసం రాలేదు. మీ సమీక్ష చూసాకా వెంటనే చదవాలనిపిస్తుంది

  రిప్లయితొలగించు
 10. ఎనభయ్యో దశకంలో ఎలెక్స్ హేలీ ' రూట్స్ ' చదవని పాఠకులు అరుదు . అంతగా పాపులర్ అయింది ఈ నవల . నేను ఆంగ్ల మూలం చదివాను . తెలుగు చదవలేదు . ' సహవాసి ' అనువాదం బాగుందని అనుకునేవాళ్ళు . యండమూరి వీరేంద్రనాథ్ , మల్లాది వెంకట క్రిష్ణమూర్తిని చదివే పాఠకులతో కూడా ' ఏడుతరాలు ' చదివించాడంటేనే ( ఉదాహరణ మా అక్క ) ' సహవాసి ' ప్రతిభ మనకి అర్ధమవుతుంది .
  మన ఆనందం చెడగొట్టటం నా ఉద్దేశ్యం కాదు . ఎలక్స్ హేలీ ' ది ఆఫ్రికన్ ' అన్న నవలని కాపీ కొట్టి రూట్స్ రాశాడు . ఈ విషయం ఆయన కూడా ఒప్పుకుని డబ్బు కట్టి కోర్టు కేసులోంచి బయటపడ్డాడు . వివరాలు వికిపీడియా లో చదువుకోవచ్చు . మన తెలుగు వారి ద్రుష్టికి ఈ సమాచారాన్ని తీసుకురావాలనే ఉద్దేశ్యమే తప్ప .. ' రూట్స్ ' నవల స్థాయిని తగ్గించే ప్రయత్నంగా భావించరాదని విజ్ణప్తి .
  మురళిగారు ,
  హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు జాక్ లండన్ ' ఐరన్ హీల్ ' అనువాదాన్ని కూడా ప్రచురించారని విన్నాను . అయ్యా ! ' ఐరన్ హీల్ ' గూర్చి కూడా మన తెలుగువాళ్ళకి ఓ నాలుగు ముక్కలు రాసి ఇంకొంచెం పుణ్యం మూట కట్టుకోండి సార్ .

  రిప్లయితొలగించు
 11. ఏనాడో చదివి మూలన పెట్టిన ఆ పుస్తకం మీ మూలంగా ఇవాళ మళ్ళీ గుర్తొచ్చింది. కానీ, ఏనాటికీ మరచిపోలేని జీవితాలవి. చాలా చక్కటి రివ్యూ. మీకు అభినందనలు కూడా.

  రిప్లయితొలగించు
 12. @కృష్ణప్రియ: నేను చదువుతూ మధ్యలో ఆపేసిన ఇంగ్లీష్ పుస్తకాల్లో 'రూట్స్' ఒకటండీ.. ఈ పుస్తకం చదివాక రూట్స్ చదవాలనిపించి మొదలు పెట్టాను, కానీ పూర్తీ చేయలేక పోయాను.. ధన్యవాదాలు.
  @శ్రీ: తప్పకుండా చదవండి.. సమయం అన్నది మన చేతిలో పని కదా.. ధన్యవాదాలు.
  @పక్కింటబ్బాయి: అవునండీ.. చదివిన ప్రతిసారీ కళ్ళు చెమ్మగిల్లక మానవు.. ముఖ్యంగా తన ఉనికిని నిలబెట్టుకోడం కోసం కుంటా చేసే పోరాటం.. అన్నట్టు మీరు గొల్లపూడి మారుతిరావు రాసిన 'సాయంకాలమైంది' నవల చదివారా? ...ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 13. @ఆ.సౌమ్య: నేను పూర్తిగా వ్యతిరేకమండీ.. 'ఏడు తరాలు' చదివాకే 'రూట్స్' చదవాలని బలమైన కోరిక కలిగింది.. ఇంకా పూర్తి చేయలేదు :( ..ధన్యవాదాలండీ..
  @లలిత: తప్పక చదవాల్సిన పుస్తకమండీ.. చాలామంది రచయితలని, రచయిత్రులని ప్రభావితం చేసిన పుస్తకం కూడా.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 14. @yaramana: అవునండీ.. అనువాదం చాలా బాగుంది.. అన్నట్టు మీరు చెప్పింది పూర్తిగా కొత్త విషయం.. మొత్తానికి ఈ పుస్తకం కూడా వివాదాలకి అతీతం కాదన్న మాట!! 'ఐరన్ హీల్' ..తప్పకుండా ప్రయత్నిస్తానండీ.. ధన్యవాదాలు.
  @జయ: నేను మళ్ళీ మళ్ళీ చదువుకునే పుస్తకాల్లో ఒకటండీ.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 15. జాక్ లండన్ రాసిన ఐరన్ హీల్ ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు " ఉక్కు పాదం " పేరున తెలుగులో ప్రచురించారట . ఈ అనువాదాన్ని కూడా ' సహవాసి ' చేసి ఉంటారని అనుమానం .

  రిప్లయితొలగించు
 16. ఈ పుస్తకం కోసం చాలా ట్రై చేసానండీ...ఆంగ్లంలో 'రూట్స్ ' చదువుదామంటే...దానిలో కూడా ఏవేవో వెర్షన్స్ ఉన్నాయి! సరేలెమ్మని ఊరుకున్నా! మీ పరిచయం బాగుంది :) మళ్ళీ ఈ పుస్తకం మీదకి గాలి మళ్ళింది :))

  రిప్లయితొలగించు
 17. @yaramana: వారి సైట్లో వెతికాను.. వివరాలేవీ కనిపించలేదండీ.. పుస్తకం కోసం ప్రయత్నిస్తాను.. ధన్యవాదాలు.
  @ఇందు: తెలుగు లో చాలా క్లుప్తంగా, ఎంతో హృద్యంగా అనువదించారండీ.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 18. ఈ పుస్తకం గురించి మీ స్నేహితుడు ఒకసారి నాకు చెప్పాడు. మీ సమీక్ష చూసాక ఆ పుస్తకం చదవాలనిపిస్తుంది.

  రిప్లయితొలగించు
 19. జాక్ లండన్ "ఉక్కు పాదం" (ఐరన్ హీల్) ను సహవాసి గారే తెలుగులోకి అనువదించారు.
  హైదరాబాద్ బుక్ ట్రస్ట్ బ్లాగులో List of books published since 1980" లేబుల్ కింద (1986) ఈ పుస్తక ప్రస్తావనను చూడవచ్చు. 1986 లొ హెచ్ బీ టీ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.
  ఆ తరువాత ఈ పుస్తక ప్రచురణ హక్కులను "ప్రజాశక్తి" వారికి ఇవ్వడం జరిగింది.
  వారి వద్ద మీకు "ఉక్కుపాదం" ప్రతులు లభించవచ్చు. ప్రయంత్నిచగలరు.

  రిప్లయితొలగించు
 20. ఇది చదివి తీరాల్సిన పుస్తకాల్లో ఒకటనీ, తప్పనిసరిగా చదవమనీ కొన్నేళ్ళ క్రితం నాన్న చెప్పారు. ఇప్పటి వరకూ కూడా చదవలేదు. ఇదిగో, ఇపుడు చదివితీరాలని మళ్ళీ గట్టి నిర్ణయం తీసుకున్నాను. :)

  రిప్లయితొలగించు
 21. @శ్రీ: తప్పక చదవండి.. చదవాల్సిన పుస్తకం. ధన్యవాదాలు.
  @హైదరాబాద్ బుక్ ట్రస్ట్: ప్రజాశక్తి లో ప్రయత్నిస్తానండీ.. ధన్యవాదాలు.
  @శిశిర: ఇంకా ఆలస్యం చేయకండి మరి.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు