శనివారం, జులై 16, 2011

ఇక్కడ సాధ్యమేనా?

టీవీలో వార్తలు చూస్తూ ఉన్నట్టుండి ఆలోచనలో పడ్డాను. రూపర్ట్ మర్దోక్ జాతికి క్షమాపణలు చెప్పాడన్న వార్తే నా ఆలోచనలకి కారణం. మర్దోక్ చిన్నవాడేమీ కాదు. ఎనభయ్యేళ్ల వయసు వాడు, అంతర్జాతీయ మీడియా మీద తనదైన ముద్రవేసి, వివిధ దేశాల్లో లెక్కకు మిక్కిలి దినపత్రికలు, మాగజైన్లు, టీవీ చానళ్ళు, స్టూడియోలకి అధిపతి. తన మీడియా బలంతో అగ్ర రాజ్యాలనే గడగడలాడించి, తన కనుసన్నల్లో ఉండేలా చేసుకున్న 'మీడియా మొగల్.'

చాలామంది భారతీయుల్లాగే నాక్కూడా ఇరవయ్యేళ్ళ క్రితం వరకూ మర్దోక్ ని గురించి పెద్దగా ఏమీ తెలీదు. టీవీ అంటే కేవలం దూరదర్శన్ మాత్రమే అని, ఇంట్లో కూర్చుని చూడగలిగే వార్తలంటే 'ప్రసారభారతి' ఆమోదించినవి మాత్రమే అని ఎవరికి వారే సమాధానపడిపోయిన కాలంలో, పీవీ నరసింహారావు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన ఆర్ధిక సంస్కరణల ఫలితంగా విదేశీ చానళ్ళు దేశంలోకి అడుగుపెట్టాయి. అయితే ఇవి వినోద కార్యక్రమాలకి మాత్రమే పరిమితం.

సరిగ్గా అదే సమయంలో రంగ ప్రవేశం చేసింది స్టార్ టీవీ. ఈ ఛానల్ పెద్ద ఎత్తున వార్తా ప్రసారాలకి ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే, విదేశీ వార్తా చానళ్ళని ఆమోదించే విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొన్ని రాజకీయ పార్టీలు పూర్తిగా వ్యతిరేకించాయి. వార్తా ప్రసారాలు విదేశీయుల చేతుల్లోకి వెళ్ళడం వల్ల జరగబోయే పరిణామాల గురించి ఎన్నో వాదోపవాదాలు జరిగాయి. స్టార్ టీవీకి అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అది 'మర్దోకిజం' కి దారితీస్తుందని సంపాదకీయాలు రాశాయి కొన్ని పత్రికలు.

అదిగో అప్పుడు విన్నాను రూపర్ట్ మర్దోక్ పేరు. దాదాపుగా ప్రతి రోజూ చర్చల్లో ఉండేది. అప్పుడే ఈ ఆస్ట్రేలియన్-అమెరికన్ జర్నలిజం రంగంలో సాధించిన విజయాలూ, వివిధ దేశాల్లో తన పత్రికా సామ్రాజ్యాన్ని స్థాపించి, విస్తరించిన వైనం, నష్టాల్లో ఉన్న స్థానిక పత్రికలని కొని తనదైన మార్కెటింగ్ విధానంతో ఆయా పత్రికలని అగ్ర భాగంలో నిలబెట్టడం లాంటి సంగతులెన్నో తెలిశాయి. సదరు మర్దోక్ స్టార్ టీవీ పేరిట భారత దేశంలోకి అడుగు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడనీ, అతన్ని రానివ్వడం దేశానికీ ప్రమాదమనీ కథనాలు రాశాయి మెజారిటీ పత్రికలు. తర్వాతి కథ టీవీ చూసే ప్రతి ఒక్కరికీ తెలిసిందే.

ప్రస్తుతానికి వస్తే, అంత గొప్పవాడైన రూపర్ట్ మర్దోక్ బ్రిటన్ జాతికి క్షమాపణలు చెప్పాడంటే అదేమన్నా మామూలు విషయమా? బ్రిటన్ పత్రిక 'న్యూస్ ఆఫ్ ది వరల్డ్' చాన్నాళ్ళ క్రితమే మర్దోక్ కొనుగోలు చేశాడు. మార్కెట్లో మంచి స్థాయికి వచ్చేలా చేశాడు. ఈ పత్రికలో వచ్చిన సంచలనాత్మక కథనాలు ఇందుకు దోహద పడ్డాయి. అయితే, ఈ కథనాలు రాయడానికి ఈ పత్రికలో పని చేసే సిబ్బంది ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్దవాళ్ళ ఫోన్లని ట్యాప్ చేశారనీ, ఆ విధంగా అనైతిక పద్ధతుల్లో సేకరించిన సమాచారంతో సంచనల కథనాలు వండి వార్చారనీ పెద్ద ఎత్తున దుమారం రేగింది.

ఈ గొడవ ఎంత పెద్దదయ్యిందంటే, అంత గొప్ప 'న్యూస్ ఆఫ్ ది వరల్డ్' పత్రికా, గత వారం తన నూట అరవై ఎనిమిదో ఏట శాశ్వితంగా మూతపడింది. తన పత్రిక జరిపిన అనైతిక కార్యకలాపాలకి గాను మర్దోక్ క్షమాపణలు చెబుతూ, బ్రిటిష్ పత్రికల్లో ప్రకటనలు విడుదల చేశాడు. ఈ వార్త టీవీలో చూడగానే నాకు వచ్చిన మొదటి ఆలోచన 'అదే మనదగ్గరైతే?' ...అవును, ఇలా క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితే వస్తే మన పత్రికల వాళ్ళూ, టీవీల వాళ్ళూ ఎన్నింటికని, ఎన్నిసార్లని క్షమాపణలు చెప్పగలరు?

ఏ ఒక్క పక్షం పట్లా పక్షపాతం లేకుండా వార్తలూ, వ్యాఖ్యలూ ఉండాలి, ప్రచురించే/ప్రసారం చేసే కథనాలు ప్రజలకి ఉపయోగ పడాలి.. లాంటి నియమాలని అది ఇది అని లేకుండా ఏ ఒక్క పత్రికా/చానలూ కూడా అమలు చేయడం లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. నైతికం కాని వీటి పనితీరు అనైతికం గానే సాగుతోందనడానికి ఉదాహరణలని కష్టపడి వెతకాల్సిన పని లేదు. ఒక పార్టీనో, నాయకుడినో సమర్ధిస్తూ కథనాలు వెలువరిస్తున్నందుకూ, తమకి అనుకూలం కానివారిని పనిగట్టుకుని టార్గెట్ చేసి వారికి వ్యతిరేక కథనాలతో పత్రికలూ, చానళ్ళూ నింపుతున్నందుకూ క్షమాపణలు చెప్పాల్సిన పత్రికలనీ, చానళ్ళనీ లెక్క పెట్టడానికి మన వేళ్లు సరిపోవు కదూ..

12 కామెంట్‌లు:

 1. ఆంజనీయులు సినిమాలో బ్రహ్మానందం అన్నట్టు... మనదేశంలో జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చెయ్యడమే.

  "సాధ్యమేనా?" అని అడిగారు....జవాబు, "కాదేమోండి".

  రిప్లయితొలగించు
 2. మురళి గారు ఇక్కడ జరగదు ఇది ఖచ్చితం గా చెప్పగలను .

  ఎందుకో జరగదో కూడా ఇంకా ఖచ్చితం గా చెప్పగలను . ఎందుకంటే మనకి నిజాయితీ కి గౌరవం , విలువ ఇచ్చే అలవాటు లేదు కాబట్టి (ఇక్కడ మనం అంటే మెజారిటీ అని) . ఎక్కడైతే నిజాయితీ కి గౌరవం ఉంటుందో అక్కడ సహజం గానే ఆ గౌరవం కోసం ప్రయత్నం చేస్తారు . అలా అని మిగలిన దేశాలలో జనాలు అందరూ మంచి వాళ్ళు అని కాదు కనీసం నిజాయితీ ఉన్న వాడికి బురద పూసే ప్రయత్నాలు మన దగ్గర కంటే తక్కువే అని నా అభిప్రాయం :)))))

  రిప్లయితొలగించు
 3. ఏ భాషలోనయినా సరే నాకు నచ్చని పదాలు నిజాయితీ,క్షమాపణ,అందువల్ల కలలో కూడా అవి నాకు అర్ధం కావు,వాటిగురించి నేను ఆలోచించను.....నేనింతే.

  రిప్లయితొలగించు
 4. సాధ్యమైతే ఈ పాటికే చాలా చూసుండేవారము

  రిప్లయితొలగించు
 5. >>>'అదే మనదగ్గరైతే?'

  మురళి గారూ అసలు ఈ సందేహం మీకు ఎందుకు వచ్చింది? ఈ మధ్య కాలం లో ఒక్క పత్రిక కానీ చానల్ కానీ నిజాయితీగా, నిష్పక్షపాతం గా వ్యవహరించిందా? అలా వ్యవహరించే సూచనలు మీకేమైనా కనిపించాయా?

  రిప్లయితొలగించు
 6. మీడియా ఉండడమే మనల్ని తప్పు దోవ పట్టించేందుకే అన్నట్లు తయారయ్యాయి. ఒక సమస్యను లేక విషయాన్ని ఎలా తమకు అనుకూలంగా లేక తస్మదీయులకు ప్రతికూలంగా విస్లేశించాలో మన తెలుగు మీడియా ముర్దోక్ లకు బాగా తెలుసు. క్షమాపణలు చెప్పుకుంటూ పోతే టెలిఫోన్ డైరెక్టరీ లోని నంబర్లు ఎన్నో, ఉత్తర ప్రదేశ్లో రేప్ కేసులు నమోదైనవి ఎన్నో, మన్మోహన్ సింగ్ పాకిస్తాన్ను 'బెదిరించిన' సందర్బాలు ఎన్నో అన్ని సార్లు చెప్పాల్సి ఉంటుంది.

  రిప్లయితొలగించు
 7. 'అదే మనదగ్గరైతే?.. ఏమీ జరగదు. పాశ్చాత్య దేశాల నుండి నేర్చుకోవాల్సిన విషయాల్లో ఇదొకటి. వాళ్ళ తప్పు అన్ని ఋజువులతోనూ బయటపడినపుడు క్షమాపణ చెప్పి తీరతారు. వ్యవస్థే వాళ్ళకి ఆ పరిస్థితి కల్పిస్తుంది అక్కడ. మీ ఈ టపా వల్ల 20 యేళ్ళ క్రిందటి కొన్ని కొత్త(పాత)విషయాలు తెలిశాయి. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 8. @శ్రీ: కేవలం ఎంటర్టైన్మెంట్ గా మారిపోవడం దురదృష్టకరం అండీ.. ఒక్కో వ్యవస్థ మీదా నమ్మకం పోతూ ఉంటే రానున్న రోజులు ఎలా ఉండబోతాయో అనిపిస్తోంది ఒక్కోసారి.. ధన్యవాదాలు.
  @శ్రావ్య వట్టికూటి: సరిగ్గా నా ఆలోచన కూడా ఇదేనండీ.. అక్కడ జనం స్పందించి ఉద్యమాలు చేశాక మాత్రమే క్షమాపణలు వచ్చాయి మరి.. ధన్యవాదాలు.
  @శ్రీనివాస్ పప్పు: బ్రహ్మాండం అండీ.. మీకింక తిరుగు లేదు.. ఆ ప్రకారం ప్రొసీడయిపొండంతే !! :)) ..ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 9. @పక్కింటబ్బాయి: ఇకపై అన్నా మొదలయ్యే అవకాశం ఉందంటారా? అలా జరుతుగుందని ఆశించ వచ్చా? ..ధన్యవాదాలు.
  @బులుసు సుబ్రహ్మణ్యం: లేదు కాబట్టేనండీ.. ఎక్కడో అక్కడ అడ్డుకట్ట పడాలి కదండీ మరి.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 10. @రంగరాజన్: 'తెలుగు మీడియా ముర్దోక్ లు' !! భలే చెప్పారండీ.. పోనీ ఇక మీదటనన్నా మొదలు పెడితే బాగుండును.. అలాగన్నా కొంచం అకవుంటబిలిటీ రావచ్చు.. ధన్యవాదాలు.
  @శిశిర: నేర్చుకోవడం ఎక్కడో అక్కడ మొదలవ్వాలి కదండీ.. మొదలవుతుందనే నాకేమూలో ఆశ కలుగుతూ ఉంటుంది, ఇలాంటివి చూసినప్పుడు.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 11. :) అతను నైతికత, నిబద్దతా చి౦త ప౦డూ ని గౌరవి౦చి క్షమార్పణ చెప్పాడా? మిగిలిన వ్యాపారాలన్న నిలబెట్టుకోటానికి అ౦తే. మొత్తానికి అతనిపై పడ్డ మచ్చ ఈ క్షమార్పణ అడ్వర్టైజ్ మె౦ట్ తో పోదు.

  @ ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్దవాళ్ళ ఫోన్లని ట్యాప్ చేశారనీ

  కేవలం పెద్దవాళ్ళ వి మాత్రమె ఫోన్ లు ట్యాప్ చేస్తే క౦పేనీ మూత పెట్టుకోవాల్సిన ఖర్మ పట్టేది కాదు. సామన్యులు పడిన క్షోభ అ౦త ఇ౦తా కాదు. అ౦దుకే ఒక అమ్మాయి కేసు విష్యం లో కడుపు మ౦డి పాత ఉద్యోగి ఒకరు బయటపెట్టారు ఈ నిజం. ఈ వార౦ లో అతను కుడా చ౦పబడ్డాడనుకో౦డి. కాబట్టి పోల్చుకొని స౦బరపడాల్సినదేమి లేదని నా అభిప్రాయం మరి :)

  రిప్లయితొలగించు