బుధవారం, జులై 27, 2011

స్థానికం

స్థానిక సంస్థలకి జరగాల్సిన ఎన్నికలు ఏదో ఒక కారణానికి అలా అలా వాయిదా పడుతూ వస్తున్నాయి. మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తుల మొదలు, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ల వరకూ చాలా చోట్ల ప్రజలెన్నుకున్న ప్రజా ప్రతినిధులు అధికారంలో లేరు. వాళ్ళ వాళ్ళ ఐదేళ్ళ పదవీకాలం ముగియడంతో, తాజా మాజీలుగా మారి తదుపరి ఎన్నికలకి సిద్ధం అవుతుండగా, ఇన్నాళ్ళూ వాళ్ళు పోషించిన బాధ్యతలని కూడా అధికారులే ఆనందంగా భరిస్తున్నారు.

ఈ ఎన్నికలు జరగకపోవడం అన్నది సామాన్య ప్రజలని పెద్దగా ఇబ్బంది పెడుతున్న దాఖలాలేవీ కనిపించడం లేదు. బహుశా స్థానిక నేతలు (స్థానిక ప్రభుత్వాలు అనాలేమో?!) ఉండడానికీ, లేకపోవడానికీ మధ్య భేదం వాళ్ళకి పెద్దగా తెలియడం లేదేమో. ఆమాటకొస్తే ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రం లోనూ ప్రభుత్వం అన్నది పనిచేస్తోందేమో అన్న సందేహం ఏమాత్రం కలగని విధంగా జన జీవనం సాగిపోవడం లేదూ?

తమ సత్తా చూపించుకోడానికి ఉత్సాహ పడుతున్న ప్రతిపక్ష పార్టీలు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ ఎన్నికలు వచ్చి పడతాయా అన్న ఎదురు చూపులు పెరిగే కొద్దీ అలా అలా వెనక్కి వెళ్ళిపోతూ మరీ మరీ ఊరిస్తున్నాయీ ఎన్నికలు. రాజకీయ పరిస్థితులు అధికార పక్షానికి అననుకూలంగా ఉండి, తమ వాళ్ళే తమకి శత్రువులయ్యే విధంగా వాతావరణం ఉండడంతో, ఇది ప్రతిపక్షానికి అనుకూలంగా మారుతుందేమో అన్న సందేహం ఏలిన వారిలో కలగడం అత్యంత సహజం.

రాజకీయ విశ్లేషకులు స్థానిక సంస్థల ఎన్నికలని అధికార పక్షానికి లిట్మస్ టెస్ట్ గా అభివర్ణిస్తూ ఉంటారు. అమ్లాలనీ, క్షారాలనీ పరీక్షించడానికి అవి నీలి లిట్మస్ ని ఎర్రగా మారుస్తాయా లేక ఎర్ర లిట్మస్ని నీలం రంగులోకి మారుస్తాయా అనే పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చని చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా. అలా, ఈ స్థానిక ఎన్నికల్లో అధికార పక్షం గెలిస్తే, ప్రజల్లో ఆ పక్షం పట్ల విశ్వాసం కొనసాగుతున్నట్టు, అలా కానిపక్షంలో ప్రజల్లో వ్యతిరేకత మొదలై పరిస్థితులు ప్రతిపక్షానికి అనుకూలంగా ఉన్నట్టూ ప్రజలు తీర్పు ఇచ్చారని అంచనా వేస్తారన్న మాట.

రాజకీయాల్లో చాలావరకూ బహిరంగ రహస్యాలే కాబట్టి, ఇక్కడ కూడా అలాంటి రహస్యం ఒకటి ఉంది. ఈ స్థానిక ఎన్నికలనేవి ఎప్పుడూ ఓ పార్టీ అధికారంలోకి వచ్చి, ఐదేళ్ళ పాలనా కాలంలో దాదాపు సగం పూర్తయ్యాక వస్తాయి. అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదైనప్పటికీ ప్రజలకి ఆసరికి కొత్త మోజు తీరి మార్పు కోసం ఎదురు చూడడం మొదలవుతుంది. అటు అధికార పక్షంలోనూ పదవులు ఆశించి భంగపడ్డ వాళ్లకి శిఖండి పాత్ర పోషించడం ద్వారా ఏలిన వారి ఎదుట తమ సత్తా ప్రదర్శించాలనే కోరిక మొదలవుతుంది.

ఈ కారణాలన్నింటి దృష్ట్యా, ఏ పక్షం అధికారంలో ఉన్నప్పటికీ, ఈ స్థానిక ఎన్నికలని తమకి సమయం అనుకూలంగా ఉన్నప్పుడు జరిపించుకోవాలనీ, రాజకీయ వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు వాయిదా వేయాలనీ మనసారా కోరుకోవడం, అధికారాన్ని ఆ నిమిత్తం ఉపయోగించడం, అటు ప్రతిపక్షం కూడా వాతావరణం తమకి అనుకూలంగా (అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా) ఉన్నప్పుడే ఈ ఎన్నికలు జరగాలని ఆశించడం జరుగుతూ వస్తోంది. అయితే, మరీ ఎక్కువ కాలం ఎన్నికలు వాయిదా వేసినా, స్థానిక ప్రతినిధులు లేకపోయినా తమకి వచ్చిన లోటేమీ లేదని జనసామాన్యం కనిపెట్టేస్తారేమో అన్న భయం రెండు పక్షాల్లోనూ ఉండకపోదు. కాబట్టి స్థానిక ఎన్నికలు ఎక్కువకాలం వాయిదా పడకపోవచ్చు..

4 కామెంట్‌లు:

 1. ఓకే.. మళ్ళి ఓటుచుక్క వేయించుకోవచ్చు అన్నమాట :)

  ఈ సారయినా నా పేరు ఓటర్ల లిస్ట్లు లో ఉండేటట్టు చెయ్యి భగవంతుడా!.

  రిప్లయితొలగించు
 2. సారీ శ్రీనుగారు నా పేరు లిస్టులో ఉంది , కాబట్టి నా ప్రార్ధన ... ఈ సారైనా నా ఓటు నేనే వేసేటట్లు చెయ్యి దేముడా !!!!

  రిప్లయితొలగించు
 3. " తాజా మాజీలుగా మారి తదుపరి ఎన్నికలకి సిద్ధం అవుతుండగా, ఇన్నాళ్ళూ వాళ్ళు పోషించిన బాధ్యతలని కూడా అధికారులే ఆనందంగా భరిస్తున్నారు."....హ్మ్మం ఆనందం !...ఎప్పుడెప్పుడు నెత్తిన వున్నా బరువు ని వదుల్చుకోవాల అని ఎడురుచుస్తున్నారండీ .

  రిప్లయితొలగించు
 4. @శ్రీ: అవునండీ, అవును.. మీరు నాయకుల దృష్టిలో పడితే, మీ వోటే కానవసరం లేదు, ఎవరో ఒకరి వోటు మీచేత వేయించేస్తారు!! ధన్యవాదాలు.
  @రాజశేఖర్: దేవుడు మీ మొర ఆలకించాలని కోరుకుంటూ :)) ..ధన్యవాదాలు.
  @చిన్ని: అవునా!! మీరు చెప్పారంటే నమ్మాల్సిందే.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు