మంగళవారం, జులై 26, 2011

సెందామరై

"సెందామరైని కథ మొదట్లోనే చంపేసి, పాఠకుల మనస్సులో మాత్రం ఆమెని చిరంజీవిని చేసేశారు రచయిత.." సి. రామచంద్రరావు కథా సంపుటం 'వేలుపిళ్ళై' చదివాక, ఒక్కో కథని గురించీ తన అభిప్రాయం చెబుతూ, 'వేలు పిళ్ళై' కథని గురించి మిత్రులొకరు చెప్పిన మాట ఇది. నిజం, సెందామరైని మర్చిపోవడం అంత సులువేమీ కాదు. వద్దనుకున్నా గుర్తొస్తూనే ఉంటుంది తను. కథానాయకుడు వేలు పిళ్ళై జీవితంలో రెండో భార్యగా అడుగుపెట్టి అతని కథని మార్చేసిన నాయిక సెందామరై.

ప్రోస్పెక్ట్ టీ ఎస్టేట్ లో పనిచేసే వేలుపిళ్ళై కి చాలా చిత్రంగా పరిచయమయ్యింది సెందామరై. ఎస్టేట్ కండక్టర్ తో గొడవపడ్డ వేలుపిళ్ళై ఉద్యోగం మానేసి, ఓ చిన్న కొట్టు మొదలు పెట్టాడు. కింద ఉన్న పొల్లాచ్చి సంతలో మిగిలిన సరుకు తెచ్చి ఎస్టేట్ కూలీలకి అమ్మే వ్యాపారం. అయితేనేం? అది బాగా కలిసొచ్చింది. భార్య పవనాళ్ ఒంటినిండా బంగారు నగలు అమర్చాడు. ఎంత సంపాదించినా గంప గయ్యాళి పవనాళ్ వల్ల ఏ సుఖమూ లేదు అతనికి. ఉన్నట్టుండి ఏదన్నా మంచిపని చేసి పేరు సంపాదించుకోవాలన్న కోరిక పుట్టింది వేలుపిళ్ళైకి.

ఎస్టేట్ కూలీలని అడిగితే, 'వినాయకుడి గుడి కట్టించ' మన్నారు. అలాగేనని మాటిచ్చాడు వాళ్లకి. కానైతే, పైసా సొమ్మివ్వని పవనాళ్ అడ్డం తిరిగి కూర్చుంది. చూస్తూ చూస్తూ దైవకార్యం కాదనడానికి మనసొప్పలేదు వేలుపిళ్ళైకి. పవనాళ్ కి తెలియకుండా దాచిన సొమ్ముతో చిన్న గుడి కట్టించాడు కానీ, విగ్రహ ప్రతిష్టకి డబ్బు లేదు. ప్రతిష్టకీ, శాంతులకీ కలిపి ఐదారు వేలవుతుందన్నారు పూజారులు. చిన్న సుళువు ఏమిటంటే, ఎక్కడైనా అనాదరంగా ఉన్న విగ్రహాన్ని దొంగిలించి తెస్తే శాంతులూ అవీ అవసరం లేదు.

అదిగో, అలా విగ్రహం దొంగతనానికి వెళ్ళినప్పుడు పరిచయమయ్యింది సెందామరై. వేలుపిళ్ళై-సెందామరై ల మధ్య మొదలైన సంబంధం చాలాకాలం రహస్యంగానే కొనసాగింది. కానైతే వినాయకుడి గుడి విషయం, ఆ నిమిత్తం వేలుపిళ్ళై ఆడిన అబద్ధాలు పవనాళ్ కి తెలిసిపోవడంతో, ఆమె ఇంట్లో ఉన్న సమస్తమూ తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. ధైర్యం చేసి, సెందామరైని ఇంటికి తీసుకొచ్చేశాడు వేలుపిళ్ళై. రోడ్డున పడ్డ వేలుపిళ్ళైని తన మాట మంచితనంతో నిలబెట్టింది సెందామరై.

వస్తూనే, ఎస్టేట్ కూలీలందరినీ మంచి చేసుకుంది. సరిగ్గా అప్పుడే పరిచయమైన చెట్టియార్ మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టడానికి సహాయం చేశాడు. సెందామరై సాయంతో పిళ్ళై మళ్ళీ నిలదొక్కుకుంటూ ఉండగా, తిరిగి వచ్చి పంచాయితీ పెట్టించింది పవనాళ్. అయితేనేం, పంచాయితీ తీర్పు సెందామరై పక్షానే వచ్చింది. ఆసరికే పంచాయితీ పెద్దలందరినీ మంచి చేసేసుకుంది సెందామరై. వేలుపిళ్ళై కి పవనాళ్ వల్ల ఏవైతే దొరకలేదో, వాటన్నింటినీ అందించింది సెందామరై.

అలాంటి సెందామరై హఠాత్తుగా మరణిస్తే, చుట్టూ ఉన్నవాళ్ళంతా ఎలా స్పందించారు, అందుకు వేలుపిళ్ళై ప్రతిస్పందన ఏమిటన్నదే ఈ కథ. రచయిత వర్ణించిన కథా స్థలం తెలుగు ప్రాంతం కాదు, పొరుగు రాష్ట్రంలో ఉన్న టీ ఎస్టేట్. ఏ ఒక్క పాత్రా కూడా తెలుగు కాదు. అయినప్పటికీ ఇది అచ్చ తెలుగు కథ. పాఠకులని కథా స్థలంలోకి తీసుకెళ్ళి పోయె శైలీ, ఆపకుండా చదివించే కథనమూ ఈ కథ ప్రత్యేకత. పుస్తకం మూసి పక్కన పెట్టాక కూడా సెందామరై నేనున్నానంటూనే ఉంటుంది.

3 కామెంట్‌లు:

  1. సి. రామచంద్రరావు కథా సంపుటం 'వేలుపిళ్ళై' వెదికి చదివే వరకు సేందామరై ఏమైందో అని.. దిగాలుగా ఉండాలని .. మీరు ..ఇలా చెప్పేసాక వెదకాలి కదా .. మురళి గారు.. మీరు సస్పెన్స్ ధ్రిల్లర్ .. రైటర్ అవ్వాల్సింది....సేందామరై..వేలుపిళ్ళై ని పవనాళ్ కి..అప్పజెప్పి.. ఆత్మా హత్య చేసుకుని ఉంటుందని..నా ఆలోచన.

    రిప్లయితొలగించు
  2. @గీతిక: ధన్యవాదాలండీ..
    @వనజ వనమాలి: మీరు ఊహించినట్టుగా ఉండక పోవడమే ఈ కథ ప్రత్యేకత అండీ!! ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించు